Showing posts with label సిబిఐ. Show all posts
Showing posts with label సిబిఐ. Show all posts

Friday, May 18, 2012

జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?: వనం జ్వాలా నరసింహారావు


జగన్ ఆస్తులకు ఏం జరుగబోతోంది?
సూర్య దినపత్రిక (19-05-2012)
వనం జ్వాలా నరసింహారావు
అక్రమ మార్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడగట్టుకున్నారంటూ, హైకోర్టు ఆదేశాల మీదకు దర్యాప్తు చేపట్టి కొనసాగిస్తున్న సిబిఐ ఒకటి వెంట మరొక చార్జ్ షీట్ వేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. మొదటి చార్జ్ షీట్ కు సంబంధించిన కేసు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు వేసి, కోర్టు ద్వారా నిందితులకు సమన్లు జారీ కూడా చేయించింది. సమన్లు అందుకున్న వారిలో సాక్షాత్తు మొదటి ముద్దాయిగా నమోదైన జగన్మోహన్ రెడ్డి కూడా వున్నారు. గత తొమ్మిది నెలలుగా కాశీ-రామేశ్వరం మజిలీ కథలలాగా అంచలంచలుగా మలుపులు తిరుగుతున్న సిబిఐ దర్యాప్తులో కీలకమైన అంశం జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లను నడుపుతున్న ఆర్థిక సంస్థల అకౌంట్‌లను స్థంబింప చేయడం. సుమారు వారం రోజుల క్రితం సిబిఐ తీసుకున్న ఈ నిర్ణయానికి అనేకులు మద్దతు తెలిపితే, కొందరు మాత్రం ఇదేదో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించుకుని పోయే చర్య అని పబ్లిక్ గానే వాపోయారు. ధర్నాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. ఐనా అంతగా స్పందన రాలేదు. సిబిఐ మరో అడుగు ముందుకు వేసింది. సంబంధిత జగన్ ఆస్తుల జప్తుకు అనుమతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాసింది. ఇదిలా వుండగా, సిబిఐ కోర్టులో అకౌంట్ల స్థంభనకు వ్యతిరేకంగా జగన్ దాఖలు చేసిన పిటీషన్‌కు చుక్కెదురవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
సాక్షి గ్రూపు సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. బ్యాంక్ ఖాతాలు (కరెంట్ అకౌంట్స్) స్తంభింప చేయడంవల్ల సంస్థ రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని, సంస్థల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి నెలసరి వేతనాల కోసం రూ.8కోట్లు, న్యూస్ ప్రింట్ కోసం రూ.20 కోట్లు, పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) కోసం రూ.7కోట్లు కలిపి మొత్తం నెలకు రూ. 35కోట్లు వ్యయం అవుతోందని, ప్రకటనలు, పత్రిక అమ్మకాల ద్వారా ఆమేరకు ఆదాయం కూడా ఉందని సాక్షి మీడియా సంస్థల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైకోర్టులో విచారణలో భాగంగా, సాక్షి పత్రిక, సాక్షి టీవీల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో చెప్పాలని, ఇతర ఆదాయ, వ్యయాల వివరాలను తమ ముందు ఉంచాలని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది. సీబీఐ తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. సాక్షి పత్రికలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని  కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కింది కోర్టు విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే తమ పిటిషన్లను తోసిపుచ్చిందని సాక్షి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఐతే, సాక్షిలో 20 వేల మంది ఉద్యోగులు లేరని, కేవలం 4,457 మంది మాత్రమే ఉన్నారని, ఇందుకు సంబంధించిన వివరాలను కార్మిక శాఖ నుంచి తీసుకున్నామని సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్లు స్తంభింప చేయడం వల్ల సంస్థలకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీలేదు. నెల మధ్యలోనే ఉంది. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులకు ఇంకా చాలా రోజుల సమయం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఎందుకు స్తంభింప చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కౌంటర్ వేస్తాం. అందుకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను న్యాయమూర్తి ఆదేశిస్తూ, తదుపరి విచారణను నెల 22కి వాయిదా వేశారు.
ఇదిలా వుండగా, సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్లకు ప్రభుత్వ ప్రకటనలను నిలుపుదల చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ప్రకటనలు ఆపేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. మేరకు న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటనల నిలుపుదల మార్గదర్శకాలకు విరుద్ధంగా జీవో ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఒకవైపు హైకోర్టులో ఖాతాల స్తంభన వ్యవహారం నడుస్త్రుండగానే, ఖాతాల స్తంభనతో ఈ పాటికే అదరగొట్టిన సిబిఐ మరో అడుగు వేసింది. జగన్ మీడియా ఆస్తులను జప్తు చేసే దిశగా పావులు కదిపింది. ఆ విధంగా ప్రభుత్వాన్ని సిబిఐ కోరడం, దానికి దాదాపుగా అనుమతి లభించడం చకచకా జరిగిపోయింది. తరువాయి భాగం, న్యాయస్థానాల అనుమతి లభించడమే. ఇలా గత రెండు-మూడు రోజులుగా కాశీ మజిలీ కథలో మరికొన్ని కీలక  పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ అక్రమాస్తుల, ఎమ్మార్ కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ లేఖ పంపింది. కేసులతో సంబంధమున్న ఆస్తుల జాబితాను కూడా లేఖతో పాటు జత చేసింది. లేఖ తన దృష్టికి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి స్పందించారని, నిశితంగా పరిశీలించారని, చట్టపరమైన చర్యలకు అనుమతించారని మీడియా కధనాలొచ్చాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు హో మంత్రి కూడా సంబంధిత ఫైలును పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేసారని కూడా వార్తలొచ్చాయి. హోంమంత్రి, సీఎం సంతకాలు పూర్తి కావడంతో, అధికారిక కసరత్తు పూర్తయిందని, న్యాయశాఖ నుంచి కొన్ని వివరణలు తీసుకున్నారని, సిబిఐ కోరిన విధంగానే, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్‌ఫ్రా కంపెనీల ఆస్తుల అటాచ్‌ మెంట్‌కు అనుమతి లభించిందని పత్రికలు రాశాయి.  
అసలేం జరుగుతుంది? ఇదింతటితో ఆగుతుందా? ఇంకా ముందుకు సాగుతుందా? ఇంతటితో ఆగితే ఇంత గొడవెందుకు? ఖాతాల స్తంభన నాటినుంచి నేటిదాకా తీసుకుంటే, కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్‍లో జగన్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించబోతోందో దాఖలాలతో సహా కనిపిస్తోంది. ఖాతాల స్తంభనతో సిబిఐ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన సంకేతం, ఇక జగన్‌ను ఏ మాత్రం సహించేది లేదని. పార్టీని, చివరకు సోనియాను దూషించినా మౌనం వహించిన అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదంటే దానికి కారణాలు అనేకం వుండవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అతి ప్రధానమైన ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ పేరిట ఒక అసంతృప్తి జ్వాల ఆకాశమంత ఎత్తుకు ఎదిగి, చివరకు, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, యావత్ కాంగ్రెస్ పార్టీనే కబళించి వేసే స్థాయికి ఎదుగుతుంటే చూసి సహించే స్థితిలో అధిష్టానం లేదని నిరూపించాలనుకుందేమో చక చకా ఒకటి వెంట మరొకటి జరిగిపోసాగాయి. మొదట్లో ఒక చిన్న సమిధ అనుకున్న జగన్, పక్కలో బల్లెం అయిపోయాడు. ఇక లాభం లేదనుకున్న అధిష్టానం, ముఖ్యమంత్రిని, బొత్స సత్యనారాయణను, చిరంజీవిని ఉమ్మడిగా-కలిసి కట్టుగా రంగంలోకి దింపింది రాజకీయ పరంగా. ఒకవైపు వారి ముప్పేట రాజకీయ దాడి సాగుతుండగానే, మరొక వైపు ఆర్థిక మూలాలపై సిబిఐ దాడిని పురికొల్పింది అనుకోవాలి. ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజన్సీ అని సర్ది చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగేదే కదా సిబిఐ!
జగన్‌కు ఎన్ని ఆస్తులున్నా తరగని ఆస్తి-ఆయన తండ్రి ఆలోచించి ఈయన చేతికిచ్చిన అపురూపమైన ఆస్తి "సాక్షి" పత్రిక, "సాక్షి" చానల్. జగన్ ఎప్పుడు, ఎక్కడ, ఏం చేసినా, ఏం చేయదల్చుకున్నా, అతనికి అనుకూలంగా ప్రచారం చేసే ఏకైక సాధనం ఆ రెండూను. జగన్ మీద ఎక్కడ ఈగ వాలినా, ఆ ఈగ వివరాలను తుచ తప్పకుండా అఖిలాంధ్ర ప్రేక్షకులకు, శ్రోతలకు, పాఠకులకు తెలియచెప్పే పదునైన ఆయుధం అది. ఆ రెండింటినీ ఎంతో ఆలోచించి మరీ జగన్‌కు సమకూర్చాడు రాజశేఖరరెడ్డి. జగన్ మిగిలిన ఆస్తుల వ్యవహారంలో, ప్రభుత్వం ఏ విధమైన జోక్యం చేసుకున్నా గొంతు చించుకుని అరిచే ఈ ఆయుధాలను నిరుపయోగం చేయకపోతే, ప్రయోజనం లేదనుకుంది కేంద్ర ప్రభుత్వం-దాని కనుసన్నలలో నడిచే సిబిఐ. అది తప్పా-ఒప్పా అంటే యుద్ధం మొదలైతే, ధర్మం-అధర్మం అనేవి రెండూ సమానమే అన్న నానుడి ఇక్కడ వర్తింప చేసుకోవాలి. అందుకే, గురిచూసి మరీ దెబ్బ కొట్టింది సిబిఐ. మూడింటి లో చార్జ్ షీట్లు, ఒక చార్జి షీట్లో సమన్లు, మరో వ్యవహారంలో ఖాతాల స్తంభన, ఈ లోపుగా మరో చార్జ్ షీట్. వెంట-వెంట మరికొన్ని చార్జ్ షీట్లు. ఇదే వ్యూహం. ముప్పేట దాడి. ఊపిరి సల్పుకోకుండా దాడి. దెబ్బమీద దెబ్బ. కోలుకునే లోపుగా మరో దెబ్బ. దెబ్బ తెలియకుండా మరో దెబ్బ. దిమ్మ తిరిగి పడిపోయీ-పడిపోకుండా దెబ్బ. ఇదీ పరిస్థితి.
ఖాతాల స్తంభనతో, తన వెంట జర్నలిస్టు సంఘాలను చేర్చుకుంది జగన్ మీడియా. పత్రికా స్వాతంత్ర్యానికి ముప్పు వాటిల్లిందని వారితో ప్రచారం చేయించింది. పాత్రికేయులు రోడ్డున పడ్డారని వారితో గగ్గోలు పెట్టించింది. వాస్తవానికి పత్రికా స్వాతంత్ర్యానికి ఖాతాల స్తంభనకు సంబంధమే లేదు. జగన్ అక్రమంగా ఆస్తులను సమకూర్చుకున్నారని, అలా సమకూర్చుకున్న ఆస్తులతో పత్రికను, ఛానల్‌ను పెట్టారన్న ఆరోపణతో ఖాతాల స్తంభన జరిగింది. పత్రికలో ఫలానాది రాయాలనో-రాయొద్దనో ఆంక్షలు విధించితే అది పత్రికా స్వాతంత్ర్యానికి భంగం వాటిల్లినట్లవుతుంది కాని ఖాతాల స్తంభన ఎలా అవుతుంది? సమాధానం ఇవ్వకపోగా ఎదురుదాడికి దిగారు మద్దతు దార్లు. దెబ్బకు ఎదురుదెబ్బ అంటారు. అలాగే జరిగింది ఇప్పుడు. ఖాతాల స్తంభనతో ఆగకుండా, ఎదురుతిరిగిన నేరానికి, ఆస్తుల జప్తుదాకా వెళ్లింది వ్యవహారం ఇప్పుడు. అంతటితో ఆగకుండా, పెట్టుబడులు పెట్టిన వారి గుట్టు రట్టు చేయడం కూడా వేగంగా జరగ సాగింది. ఎనిమిదివందల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‍ను, ఆయనకు సహకరించిన బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసింది సిబిఐ. ఒక బడా పారిశ్రామిక వేత్తను అరెస్టు చేయడమంటే, దాని వెనుక ఎంతో పకడ్బందీ వ్యూహం వుండి తీరాలి. తీగ కదిలితే డొంక కదిలినట్లుగా, ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్‍తోనే ఆగకుందా, జగన్ కంపెనీలలో పెట్టుబడులు (అక్రమంగా) పెట్టిన ఇతరుల బండారం కూడా సిబిఐ బయటపెట్టే పనిలో పడింది. ఇక ముందుంది ముసళ్ల పండుగ!
ఇదంతా ఒక రాజకీయ-ఆర్థిక వ్యూహం. తనను దెబ్బ తీయాలనుకునే వారిని ఎదురు దెబ్బ తీయకుండా ఎవరూ వుండరు. అదే జరుగుతుందిప్పుడు. కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్మోహన్ రెడ్డి, తన మానాన తానున్నట్లయితే, అది వేరే సంగతి. అనవసరంగా పుట్టలో వేలు పెట్టాడు. "నా బంగారు పుట్టలో వేలు పెట్టితే నేను కుట్టనా" అంటోంది సోనియాగాంధీ! కుట్టించుకుంటాడా? కుడతాడా జగన్?End 


Monday, February 6, 2012

పాలనా రథంలో సరిగమలు-పదనిసలు: వనం జ్వాలా నరసింహారావు


పాలనా రథంలో సరిగమలు-పదనిసలు
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వంపై ప్రత్యక్ష-పరోక్ష యుద్ధం ప్రకటించారు. సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వ్యవహార ప్రక్రియ కేంద్రంగా మొదలెట్టిన ఐఏఎస్‌ల సమరం దరిమిలా నేరుగా సర్కారుపైనే గురిపెట్టే వరకు పోయింది. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో "సెక్షన్ ఆఫీసర్" స్థాయి నుంచి సెక్రటరీమంత్రుల-ముఖ్యమంత్రి(?) వరకు అంతో-ఇంతో అందరూ దంచుకుంటారన్న అర్థం స్ఫురించే రీతిలో మీడియా ముందు ఐఏఎస్‌ల యూనియన్ నాయకులు అక్కసు వెళ్లబుచ్చారు. పైగా ఈ విషయం మీడియాతో సహా అందరికీ తెల్సిందే అన్నట్లు మాట్లాడారు! వారి మాటలను బట్టి, తమలో (అధికారుల) కొందరితో సహా కొందరు అనధికారులు(మంత్రులు) భారీ మొత్తంలో అవినీతికి కారణమై వుండవచ్చనీ, అందరినీ సమ న్యాయంతో శిక్షించాలనీ అర్థం చేసుకోవచ్చు. తప్పు జరిగిన విషయం, పరోక్షంగానైనా నేరంలో పాలు పంచుకున్న విషయం ఒప్పుకున్నందుకు వారిని అభినందించాల్సిందే!

ఐతే, అసలు విషయం ఇంకొంత లోతుగా ఆలోచించాలి. అధికారుల-అనధికారుల మధ్య వుండాల్సిన సంబంధాలు, మంత్రివర్గ సమిష్టి బాధ్యత, కార్యదర్శి మంత్రికి ఫైలు పంపే విధానం, రొటీనా-ప్రత్యేకత సంతరించుకున్నదా? అన్న అంశాలను కూడా వారు ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. సిబిఐ జాయింటు డైరెక్టర్ వ్యవహార శైలినీ తప్పుబట్టారు. పాలనాపరమైన అంశాలలో ఆయనకు అవగాహన లేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. జీవో ఇచ్చిన వాళ్లు దోషా? ఇప్పించిన వాళ్లు దోషా? అన్న మీమాంసలనూ లేవనెత్తారు. తెర వెనుక (ఏం జరిగిందో బయటపెట్టడానికి సిద్ధపడకపోయినా) ఎంతో తతంగం జరిగే ఆస్కారం గురించీ మాట్లాడారు ఐఏఎస్‌లు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాము ఎలాంటి పరిస్థితులలో "తప్పు" చేశారో చెప్పకనే చెప్పారు పాపం! మంత్రులు తీసుకునే "నిర్ణయాలను" తాము అమలు పరిచే వారమేనని "భాష్యం" చెప్పారు. స్వతంత్రంగా ఏ ఒక్క ఐఏఎస్ అధికారి నిర్ణయం తీసుకోలేరని మరో కొత్త సంగతిని బయట పెట్టారు. బిజినెస్ రూల్స్ ను, కోడ్ ఆఫ్ కండక్టును, బాధ్యతలను, మంత్రులు-కార్యదర్శులు-ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలనే విషయాన్ని పూస గుచ్చినట్లు వివరించారు. ఇంతకూ తమదేమీ తప్పు లేదని, అంతా మంత్రులదే అన్న చందాన మాట్లాడారు. ఎవరు-ఎవరిని-ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ వ్యవహారమంతా అర్థం చేసుకోవడానికి ఐఏఎస్‌ల-మంత్రుల మధ్య ఎలాంటి అవగాహన వుండాలి, ఎవరు-ఎవరికి-ఎంత మేరకు జవాబుదారులు, నిర్ణయాల బాధ్యత సమిష్టి దా? కేవలం జీవోలను జారీ చేసినవారి దేనా? లేదా చివరగా "అప్రూవ్డ్‌" అని సంతకం పెట్టిన మంత్రి-ముఖ్యమంత్రిదా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐఏఎస్ అధికారులలో ధిక్కారణ ధోరణి కొంత కనిపించింది. ఐతే, అది ఆయన మీద కాదు. ఆయన మంత్రివర్గ సభ్యులమీద మాత్రమే. అప్పట్లో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులు తాము కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే జవాబుదారీ అన్న చందాన పనిచేయడం జరిగింది. దాని ఫలితమే ఇప్పుడు వారి ఆవేదనకు కారణమనొచ్చు. ఒకానొక సందర్భంలో, శాసనసభ ఆవరణలో, పలువురి సమక్షంలో, ఒక అమాత్యుడు, తన శాఖ కార్యదర్శి-శాఖాధిపతి (ఇద్దరూ ఐఏఎస్ అధికారులే) కుమ్మక్కై తనతో తప్పు చేయించారని బాహాటంగా విమర్శించారు. మరో మంత్రి, తన శాఖలో జరిగిన తప్పంతా అధికారుల మీద తోసేశాడు. ఇలా మంత్రులకు-అధికారులకు సంబంధాలు బెడిసికొట్టడం ఇప్పుడేమీ కొత్త కాదు. అనాదిగా జరుగుతున్నదే.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-అమాత్యులకు మధ్య ఎలాంటి సంబంధాలుండాలనే చర్చ ఏనాడో మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఐనందున, చాలావరకు బ్రిటీషు సాంప్రదాయాలనే పాటిస్తున్నాం, అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. కాకపోతే ఆచరణలోకి వచ్చేటప్పటికి, మనదైన శైలిలో భాష్యం చెప్పుకుంటున్నాం. వారి మధ్య సంబంధాలంటే, ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటించడం కాదు. తమదే సరైందన్న వాదన వినిపించడమూ కాదు. "సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలు" అన్న అంశంపై బ్రిటన్‌లో, 1985 లో, "ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" రూపొందించి, వారి మధ్య వుండాల్సిన సంబంధాలను అందులో పొందుపరిచారు. మరో పదేళ్ల తరువాత ఆ మెమొరాండంకు 1995 లో కొన్ని సవరణలు చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను సమీక్షించడం సబబేమో! మెమొరాండంలో పేర్కొన్నట్లు, మంత్రులు చట్టసభలకు ఎలా జవాబుదారీ అవుతారో, అలానే, సివిల్ సర్వెంట్లు (ఐఏఎస్ అధికారులు) మంత్రులకు జవాబుదారీగా వుండాలి. అంటే, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వుండడం అని అర్థం. ఏ రాజకీయ పార్టీ అధికారంలో వున్నా, తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం అధికారి ప్రధమ కర్తవ్యం. సంబంధిత మంత్రికి అవసరమైన తగు సూచనలిస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాలలో సహకరిస్తూండాలి. తమ ఇష్టా-అయిష్టాలకు అతీతంగా, విధానాల రూపకల్పనలో-నిర్ణయాల అమలులో తోడ్పడుతూ, ఎన్నికలలో చేసిన వాగ్దానాలను వాస్తవం చేయాలి. మంత్రులందరూ విద్యావంతులు కానక్కరలేదు. కేవలం విద్యావంతులు మాత్రమే మంత్రులు కావాలని అనుకోవడమంటే, మంత్రి మండలి మరో "బ్యూరోక్రసీ" అవుతుంది కాని "డెమొక్రసీ" వ్యవస్థ కాదు. మంత్రుల నిర్ణయం కార్యదర్శుల-శాఖాధిపతుల సలహా-సూచనల మేరకే అన్నది అక్షర సత్యం.

ప్రభుత్వమంటే, సమిష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రి మండలి, దాని అధినేత ముఖ్యమంత్రి. ఏ ఒక్క మంత్రి పొరపాటు చేసినా, బాధ్యత అందరిది అన్న విషయాన్ని మరిచిపోయిన నేటి కాలం మంత్రులు, బాహాటంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రినీ తప్పుపట్టుతున్నారు. పాలనాపరమైన విధాన నిర్ణయాలలో మంత్రికి రాజ్యాంగపరంగా ఎంత బాధ్యత వుందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యత వుంది. సంబంధిత శాఖ మంత్రికి సివిల్ సర్వెంటు తోడ్పడడమంటే, తనకు తెలిసిన సమస్త సమాచారంతో పాటు, తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా-నిష్పక్షపాతంగా-రాగద్వేషాలకు అతీతంగా, సలహాలు-సూచనలు ఇవ్వాలి. వారిచ్చే సలహా మంత్రి ఆలోచనా ధోరణికి భిన్నమైనదైనా, అనువైన-శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాల్సిందే! సివిల్ సర్వెంట్లు ఉద్దేశపూర్వకంగానో, మరే ఇతర కారణాలవల్లనో, అలా చేయకుండా, వేరే విధంగా చేసి మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసినా, తప్పుదోవపట్టించినా, అది అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇంతా జరిగిన తరువాత, ఇదంతా రికార్డు అయిన తరువాత, మంత్రి తీసుకునే నిర్ణయంపై అధికారికి ఎటువంటి అభిప్రాయభేదాలున్నా, అరమరికలు లేకుండా, చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో , ఆ నిర్ణయాన్ని అమలు చేసితీరాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం స్పష్టంగా చెపుతోంది. ఎమ్మార్ కుంభకోణంలోగాని, జగన్ అక్రమాస్తుల సంపాదన ఆరోపణల విషయంలోగాని, ఓబులాపురం గనుల వ్యవహారంలో కాని, ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ చేపట్టి దర్యాప్తు చేస్తున్న మరే అంశం విషయంలో కాని, అధికారుల-మంత్రుల మధ్య ఇదంతా ఎంతవరకు చోటుచేసుకున్నదనేది బహిర్గతం కావాల్సిన సమయం వచ్చింది. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే, ప్రభుత్వ పనితీరు, పాలనలో సమర్ధత, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి.

అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహాను ఇచ్చినా, మంత్రులను మభ్య పెట్టినా, మంత్రులకు తెలియకుండా అత్యంత రహస్య సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేసినా, దాని దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వ పాలనా రధం పైనా, పడుతుంది. పర్యవసానం ఏదైనా తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంట్ల (ఐఏఎస్ అధికారుల) పై రాజకీయ ఒత్తిడుల ప్రభావం కూడా పడవచ్చు. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా ధోరణికి అనుగుణంగా వుండే సలహాను మాత్రమే ఇవ్వాలని-అలాంటిదే పొందాలని, సివిల్ సర్వెంట్లపైనా ఒత్తిడులు వచ్చే అవకాశాలు చాలా సార్లు వస్తాయి. బ్రిటన్ లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలలో ఇది అరుదుగా జరగొచ్చు. మన దేశంలో ఇలాంటివి చాలానే. వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా-విరుద్ధంగా, ఐఏఎస్ అధికారులతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు వుంటుందనేది ప్రశ్నార్థకం. మంత్రి ప్రోద్బలం లేకపోయినా అలాంటి తప్పులు అధికారులు చేసే అవకాశాలు లేవా?

ఏదేమైనా ఇటీవలకాలంలో, అఖిల భారత సర్వీసులకు చెందిన "ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" అధికారులు కొందరు వివాదాలలో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడడం, బెడిసికొట్టినప్పుడు మంత్రులదే తప్పని వాదించడం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం, అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. ఒక ఎస్. ఆర్. శంకరన్ లాగా పిలిపించుకునే వారిని వేళ్లమీద లెక్కించాల్సి వస్తోంది. కారణం: అత్యంత బాధ్యతతో కూడిన పదవులు అతి పిన్న వయసులోనే చేపట్టి నందువల్ల కావచ్చు. మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. సంప్రదాయాలను పాటించకపోవడం కావచ్చు. సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు కాకపోవడం వల్ల కావచ్చు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.

"ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్" (ఐఏఎస్) ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి "ఉక్కు వ్యవస్థ" గా అభివర్ణించారు. స్వాతంత్ర్యానంతరం, ప్రభుత్వ విధి-విధానాల రూపకల్పనలో సహాయపడేందుకు, నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలనా యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో "ఐఏఎస్" ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో ఆ పనిచేస్తూ వచ్చిన, "ఇండియన్ సివిల్ సర్వీస్" కు విప్లవాత్మకమైన మార్పులు-చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించింది ప్రభుత్వం. ఈ సర్వీసుకు ఎంపికైన అభ్యర్థులు పౌర పరిపాలనలోను, విధానాల రూపకల్పనలోను-నిర్ణయాలలోను, ఆంతరంగిక-విదేశీ సంఘర్షణలను చాకచక్యంగా  అంచనావేసి నివారించడంలోను, కీలక పాత్ర పోషించ దగ్గ వ్యక్తులై వుంటారు. సాహిత్యం నుండి వైద్య శాస్త్రం వరకు విభిన్న రకాల విద్యలలో తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన అభ్యర్ధులను ఒక క్రమ పద్ధతి ప్రకారం, విస్తృతమైన-కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. ఇలా ఎంపికైన వారి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత వుంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కూడా లేదు. దేశ సమగ్రత-సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు ఈ వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని సర్దార్ పటేల్ అనేవారు.

ఐఏఎస్‌కు ఎంపికైన వారికి సబ్ కలెక్టర్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు, పనిచేసే అవకాశం వుంది. ఇవన్నీ వారి-వారి సమర్ధతను బట్టి లభించాలి. కాని, ఇటీవల కాలంలో, పలు సందర్భాలలో అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల అండతో, వారితో వీరికున్న చనువు ఆధారంగా పదవులు పొందుతున్నారన్న ఆరోపణలు అనేకం వస్తున్నాయి. "సమర్ధత" కన్నా, "చొరవ", "పలుకుబడి" ప్రాతిపదికలుగా, ప్రాధాన్యతల పోస్టులు దక్కించుకుంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, మంత్రుల ఆదేశాలకు అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గణనీయంగా పెరిగింది. దాని ఫలితం ఇప్పుడు తెలుస్తోంది. ఏదైనా పాలనాపరమైన నిర్ణయం ప్రజోపయోగం కొరకు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అధికారులు, మంత్రుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం "ఒత్తిడి" కిందకు రాదు. అది సరైన సమయంలో సరైన స్పందన అనాలి. అలా కాకుండా మంత్రుల వ్యక్తిగత ప్రయోజనాలకొరకు తల ఊపితే దాని ఫలితం అనుభవించక తప్పదు. "ఆన్ రికార్డ్" అభ్యంతరం చెప్పాలి. అలా జరిగిందో, లేదో, తెలుసుకునే ప్రయత్నమే సిబిఐ దర్యాప్తు అని భావించాలి. కాకపోతే, సిబిఐ ఎందుకు రాజకీయ నాయకులను విచారించడం లేదో అనేదే అంతుచిక్కని ప్రశ్నదోషులైన వారు రాజకీయ నాయకులైతే తప్పకుండా విచారణ జరగాలు. శిక్షార్హులు కావాలి.

ఐఏఎస్ అధికారులు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజం ఎత్తడం ఇదే మొదటి సారి కాదు. లోగడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, దాదాపు ఇంతే మోతాదులో, రాష్ట్రం వేధింపులనుండి రక్షించమని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి, జనవరి 1989 లో అలనాటి ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి, హెచ్ కే బాబు  ఫిర్యాదు చేశారు. కాకపోతే, అప్పట్లో ఫిర్యాదుకు కారణం, ఇప్పటి లాగా సిబిఐ వేధింపులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుండే ఏసిబి సంస్థ సుమారు నలభైమంది ఐఏఎస్‍లపై దర్యాప్తు చేపట్టడమే. అప్పట్లో ఐఏఎస్ అధికారులతో కొందరి ఐపిఎస్ అధికారులు కూడా జతగా తమ గోడు మీడియా ముందు వెళ్లబుచ్చుకోవడం విశేషం. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం 1989 లో చేసిన ఫిర్యాదుకు స్పందించిన అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి కల్యాణ కృష్ణన్ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. ఆర్. నాయర్‌ను ఢిల్లీకి పిలిపించారు కూడా . ఇప్పుడు కూడా రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగును కలిసి సిబిఐ మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో వుంది. ఏం జరుగనున్న దో వేచి చూడాలి. 

Saturday, February 4, 2012

ఎమ్మార్లోు రాజకీయ హస్తం లేదా?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దినపత్రిక (04-02-2012)
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర రాజకీయాలకన్నా రంజుగా, పసందుగా, రసకందాయంలో సాగుతోంది సిబిఐ దర్యాప్తు. ఇలా రాయడమంటే సిబిఐని తప్పుపడుతున్నట్లు అర్థం తీస్తే అది వేరే సంగతి. గాలి జనార్దనరెడ్డి ఓబులాపురం గనుల అక్రమాలతో, ఎమ్మార్ కుంభకోణంతో, జగన్ అక్రమాస్తుల ఆర్జన నేరారోపణతో, వైఎస్ విజయమ్మ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుపై వేసిన పిటీషన్‌తో, సిబిఐకి చేతి నిండా పని దొరికిందనాలి. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోవడంతో, న్యాయస్థానాల జోక్యంతో ఈ మూడు కేసులు సిబిఐ చేపట్టాల్సి వచ్చింది. దర్యాప్తు కొనసాగుతున్న విధానం, ముద్దాయిలుగా ఇంతవరకు నిర్ధారించిన వారిని విచారించిన తీరు, అరెస్టుల తతంగం, సాక్షులుగా కొందరిని పిలిచి విచారించిన వైనం, వారిలో ఒకరిద్దరిని నిందితులుగా దరిమిలా పేర్కొన్న వ్యవహారం, ఒక కేసుతో సంబంధం వుందనుకున్నవారిని మరో కేసులో సాక్షిగానో-భవిష్యత్ ముద్దాయిగానో విచారించిన తీరు నిశితంగా పరిశీలించిన వారికి కొంత గందరగోళంగా కనిపించినా, విషయం మాత్రం అంతో-ఇంతో అవగతమవుతోందనే అనుకోవాలి. ఒక కేసుతో మరో దానికి "ముందు-వెనుకల అనుబంధాన్ని" అన్ని కేసుల పరిపూర్ణ దర్యాప్తు చివరలో నిర్ధారించే దిశగా విచారణ సాగుతోందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గాలి కేసులో సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. ఎమ్మార్ కేసులో ముద్దాయిగానో-సాక్షిగానో పిలిచిన వారిలో జగన్ సన్నిహితుడు సునీల్ కుమార్ రెడ్డి వున్నారు. ఎమ్మార్‍లో సాక్షిగా పిలిచిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముద్దాయిని చేశారు. స్టయిలిష్ హోం అధినేతను అప్రూవర్‌గా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎమ్మార్ కేసులో చంద్రబాబును ఎందుకు ముద్దాయిని చేయడం లేదని ప్రశ్నిస్తున్న నేపధ్యంలో ఆయనపైనే మరో ఫిర్యాదు చోటుచేసుకుంది. చివరకు కనీసం కొందరన్నా ఒకదానికంటే ఎక్కువ కేసులలో ముద్దాయిలు కాక తప్పదేమో!.
ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన ఒకటి-రెండు సంఘటనలు ప్రసార-మాధ్యమాలలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్ విజయమ్మ ఫలానా న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు నాయుడుపై ఆమె వేసిన పిటీషన్ విచారణకు రాకుండా కోరిన వ్యవహారం. అలానే ప్రధాన మంత్రికి ఆమె రాసిన లేఖ. ఇంకోటి ఎమ్మార్ చార్జ్ షీట్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ముద్దాయిలుగా పేర్కొనడం. మరో అంశం, ఒక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా, పలువురు మాజీ-తాజా ఐఏఎస్ అధికారులను ఏదో ఒక కేసులో సాక్షులుగా (ప్రస్తుతానికి) విచారణకు పిలవడం. ఇదంతా చూస్తున్న కొందరు అధికారులు, తాము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తప్పు చేశామా? ఒత్తిడులకు లొంగి చేయరాని పని చేశామా? తప్పు చేయకపోయినా తమను ఇరికించే ప్రయత్నం జరుగుతోందా? ఇలా సాగితే తమ పరువు-ప్రతిష్టలు ఏం కావాలి? అన్న మీమాంసలో పడిపోయారు. ఎమ్మార్ కేసులో ఇరికిన (పోనీ ఇరికించిన) ఎల్వీ సుబ్రహ్మణ్యం తానే తప్పు చేయలేదనీ, ఏదన్నా అర-కొర జరుగుతే ఆ చిన్న తప్పును భూతద్దంలో చూపే ప్రయత్నం సిబిఐ చేస్తోందనీ, సాక్షిగా తనను పిలిచి ముద్దాయిగా చేసారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వాస్తవానికి నీతి-నిజాయితీ పరుడైన అధికారిగా, ఏ ఫైలునైనా క్షుణ్ణంగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోని అధికారిగా, సమర్ధత-దక్షత గల అధికారిగా, ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పేరుంది. ఆయన చేసింది నేరమే అయితే, ఆ నేరం వెనుకనున్న వ్యక్తుల సంగతేంటి? అన్న ప్రశ్నలనూ వేస్తున్నారు చాలామంది. కనీసం ఒక్కరన్నా-ఒక్కరు రాజకీయ నాయకుల పేర్లు ముద్దాయిల జాబితాలో లేకుండా ఎమ్మార్ కుంభకోణం కేసులో చార్జ్ షీట్ దాఖలైందంటే వింతగానే వుంది. ముద్దాయిలుగా పేర్కొన్న వారందరికీ శిక్షలు పడాలని లేదు. కాకపోతే, న్యాయస్థానంలో శిక్ష పడాలంటే, ముద్దాయిల జాబితాలో పేరుండి తీరాల్సిందే కదా! ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు ఇంతవరకు లేదంటే, ఎమ్మార్ కేసులో శిక్షార్హుడైన రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా లేదనేగా అర్థం? ఇదెక్కడి న్యాయం? ఇది ముద్దాయిలతో దోబూచులాటకాదా?
ఈ నేపధ్యంలో జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటీషన్‌పై విచారించిన సుప్ర్రేం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. టు. జి స్పెక్ట్రం కేసులో లైసెన్సులను రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇది ఒక విధంగా కార్పొరేట్ ప్రపంచాన్ని ఖంగు తినిపించిందనవచ్చు. లైసెన్సుల జారీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సిపిఐ ఎల్‌ అనే స్వచ్ఛంద సంస్థ, జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కేసులో హోం మంత్రి చిదంబరంను కూడా సహ నిందితుడిని చేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్‌ పై నిర్ణయాన్ని సుప్రీం కోర్టు గురువారం ట్రయల్‌ కోర్టుకే వదిలేస్తూ, విషయంపై ట్రయల్‌ కోర్టు రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా వుండగా, తీర్పు ప్రధానిని లేదా 2008లో లైసెన్సుల జారీ జరిగినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఇప్పటి హోమ్‌ శాఖ మంత్రి పి చిదంబరాన్ని అభిశంసించడమే అవుతుందన్న వాదనను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. ఇంత పెద్ద కుంభకోణంలో అధికారులను, ప్రత్యక్షంగా ఒకరిద్దరు మంత్రులను, పరోక్షంగా ప్రధానమంత్రిని తప్పుబట్టగా లేంది, మన రాష్ట్రంలో జరుగుతున్న అలాంటి వ్యవహారాలలో, కనీసం ఒక్క రాజకీయ నాయకుడినైనా తప్పుబట్టక పోవడం హాస్యాస్పదం.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సిబిఐ-ఆవిర్భావం, 1941లో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన "స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్" తో ఆరంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి కొనుగోళ్ల లావాదేవీలలో జరగడానికి ఆస్కారమున్న అవినీతి కేసుల దర్యాప్తుకే స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బాధ్యతలను పరిమితం చేసింది ప్రభుత్వం. దరిమిలా, యుద్ధం ముగిసిన తరువాత, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల దర్యాప్తుకు మాత్రమే పరిమితం చేస్తూ, 1946 లో, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. క్రమేపీ, దాని పరిధిని యూనియన్ టెరిటరీలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సంబంధిత రాష్ట్రాలకు విస్తరింపచేయడం జరిగింది. ఏప్రిల్ 1963 లో, హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో, దాని పేరును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చడం జరిగింది. అలా పేరు మార్పిడి జరిగిన తొలిరోజులలో, కేవలం, కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రమే విచారించడం దానికి అప్పజెప్పిన బాధ్యత. క్రమేపీ, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని, బాంకుల జాతీయ కరణ తరువాత ఆ సిబ్బందినీ సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం.
సిబిఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కొహిలి, దాని ఆవిర్భావపు రోజులలోనే, అదొక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. ఆయన సుదీర్ఘ నేతృత్వంలో, ఇంతింతై-వటుడింతై అన్న చందాన, నేటి ఈ స్థితికి చేరడానికి అన్ని విధాల పటిష్టమైన పునాదులు వేశారాయన. సిబిఐ నుంచి అత్యున్నత ప్రమాణాల సమర్ధతను-దక్షతను, సత్యనిష్ఠను భవిష్యత్‍లో పౌరులు సిబిఐ నుంచి ఆశిస్తారని, వారి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత దానిపై వుందని కొహిలి అనేవారు. చిత్తశుద్ధితో, రాగద్వేషాలకు అతీతంగా, కష్టపడి పనిచేయాల్సిన విద్యుక్త ధర్మం కూడా అందులో పనిచేసే అధికారులపైనుందని ఆయన అభిప్రాయపడ్డారు. "లాయల్టీ టు డ్యూటీ" ని ఆయన ప్రబోధించారు. ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయనేది వేరే సంగతి. కాకపోతే, దీనిని మించిన చిత్తశుద్ధి గల దర్యాప్తు సంస్థలు మరేవీ లేవని ఘంటాపథంగా చెప్పొచ్చు. సిబిఐ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయరామారావు ఒకరు. 
1965 నుంచి ఆర్థికపరమైన నేరాల పరిశోధన అంశాన్ని కూడా సిబిఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. సిబిఐ వ్యవహరిస్తున్న నిష్పాక్షిక ధోరణిని, నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిని మరింత విస్తరించ సాగింది. హత్యా నేరాలు, కిడ్నాపులు, తీవ్రవాద కార్యకలాపాల లాంటి విషయాలలో కూడా సిబిఐతో దర్యాప్తు జరగాలన్న డిమాండు రాసాగింది. వ్యక్తులు, వ్యవస్థలు తమకు జరిగిందని భావిస్తున్న అన్యాయాల విషయంలో న్యాయం కలిగించమని కోర్టులను ఆశ్రయించినప్పుడు, కోర్టులు కూడా సిబిఐకి దర్యాప్తు అప్పచెప్తే స్థాయికి దాని పనితీరుకు గుర్తింపు వచ్చింది. ఈ నేపధ్యంలో 1987 లో సిబిఐ లో రెండు విభాగాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఒకటి: అవినీతి నిరోధక విభాగం, మరొకటి: ప్రత్యేక కేటగిరీ నేరాల విభాగం. అలా పరిధి మరింత విస్తరించసాగింది. కాకపోతే, ఏ రాష్ట్రంలోనైనా, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా వుండాలి. సుప్రీం కోర్టులకు, హైకోర్టులకు ఆ నిబంధన వర్తించదు, ఏ రాష్ట్రంలోనైనా, ఏ విషయంలోనైనా సిబిఐతో దర్యాప్తుకు కోర్టులు ఆదేశించవచ్చు. ఇప్పుడదే జరిగింది.
ఇదీ సిబిఐ నేపధ్యం. ఇలాంటి నేపధ్యం వున్న సంస్థ ఎవరికీ , ఏ విషయంలోనూ అన్యాయం చేయదన్న నమ్మకం, అటు ప్రభుత్వాలకూ, ఇటు పౌరులకూ ఇంతవరకూ కలిగిస్తూ వస్తుంది. మరి అలాంటప్పుడు, వైఎస్ విజయమ్మ ఎందుకలా ప్రధానికి వుత్తరం రాయాలి? రాసినందుకు తప్పు ఆమెదా? ఆ అవకాశం ఇచ్చిన సిబిఐ దా? జగన్మోహన్ రెడ్డిపై జరుగుతున్న దర్యాప్తును ఆమె తన వుత్తరంలో ఒక "రాజకీయ క్రీడ" గా పోల్చారు. తన తనయుడిని ఏదో ఒక తీరుగా అభాసుపాలు చేయడానికి, కేసుల్లో ఇరికించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించిందామె. అవన్నీ ఉద్దేశపూర్వకంగానే సిబిఐ చేస్తోందంటున్నారు. జగన్ కేంద్రంలోనూ-రాష్ట్రంలోనూ ఎన్నడూ మంత్రిగా పనిచేయకపోయినా ఆయనను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును ఎందుకు విచారించడం లేదన్న వాదనలనూ ఆమె లేవనెత్తారు. మరోవైపు రాష్ట్ర ఐఏఎస్ అధికారులలో అలజడి మొదలైంది. తమను అధికారులు పావులుగా వాడుకొని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిలో కొందరు కలిసి చర్చించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఏదేమైనా, ఇంతవరకు నిష్పాక్షిక దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకున్న సిబిఐ తన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవాలి. అది చేస్తున్న దర్యాప్తు ఏ ఒక్కరికో, ఏ ఒక్క సంస్థకో వ్యతిరేకంగా కాదని, బహుళ ప్రయోజనాలను, ప్రజాహితాన్ని కోరి మాత్రమే అది దర్యాప్తు చేస్తుందని, దోషులు ఎంత పెద్ద వారైనా పట్టించి కోర్టు బోనులో నిలబెట్టుతామని నమ్మకం కలిగించాలి.