Sunday, November 28, 2021

సప్త మరుత్తుల జననం ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-83 : వనం జ్వాలా నరసింహారావు

 సప్త మరుత్తుల జననం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-83

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-11-2021)

"తన గర్భం ఇలా ఏడు తునకలై పోవడంతో, దానికి కారకుడైన అజేయుడు-ఇంద్రుడిని చూసి, అతడిని ఓదార్చింది దితి. దోషం ఇంద్రుడిది కాదని, తనదని-తనది కాబట్టే ఇంద్రుడు గర్భాన్ని ఏడు తునకలు చేయగలిగాడని, ఎలాగూ పిండం ఏడు తునకలైనందున కోపం వదిలి ఇంద్రుడు, ఆ ఏడుగురు మరుత్తులు పాలించే ప్రదేశాలలో వారి పాలన ప్రజా రంజకంగా వుండేట్లు చేయమని ఇంద్రుడిని కోరింది దితి. తన ఏడుగురు కొడుకులను దేవతల ఆకారాలు ధరించేట్లు చేసి, అతని ద్వారా వారు ’మారుతులు’ అనే ప్రఖ్యాత పేర్లతో పిలవబడి-వాయు స్వరూపులై, ఆకాశంలో నివసించే వీలు కలిగించమని అడుగుతుంది. ఏడుగురిలో ఒకరు బ్రహ్మ లోకంలోను, ఒకరు ఇంద్రలోకంలోను, మరొకరు ఆకాశంలోను, తక్కిన నలుగురు ఇంద్రుడి ఆజ్ఞానుసారం నలుదిక్కుల్లోను వుంటారని చెప్తుంది దితి. తల్లి కోరిక నెరవేరుతుందని, ఆమె చెప్పినట్లే జరుగుతుందని, ఇంద్రుడు చేతులు జోడించి దితి సంశయం తీరుస్తాడు. ఈ విధంగా తల్లీ-కొడుకుల మధ్య తపోవనంలో అంగీకారం కుదిరిన పిమ్మట, ఇద్దరు సంతోషంతో స్వర్గానికి పోయారు" అని తను ఈ విషయాన్ని పెద్దలు చెప్పగా విన్నానని విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరిస్తాడు.

("ఆవహుడు, ప్రవహుడు, సంవహుడు, ఉద్వహుడు, వివహుడు, పరివహుడు, వరావహుడు" అని సప్త మరుత్తులను పిలుస్తారు. వీరుండే స్కందాలను "మారుత స్కంథాలు" అని అంటారు. "ఆవహం" అంటే గాలి-ఆవహుడు అనేవాడు, మేఘాలలో-పిడుగుల్లో-వర్షంలో-ఆకాశంలో వూడిపడే కొరవుల్లో, తిరుగుతుంటాడు. "ప్రవాహం" అనే వాయువు సూర్య మండలంలో, "సంవహం" అనే వాయువు చంద్ర మండలంలో, "ఉద్వహం" అనే వాయువు నక్షత్ర మండలంలో, "వివహం" అనే వాయువు గ్రహ మండలంలో, "పరివహం" అనే వాయువు సప్తర్షి మండలం-స్వర్గం-భూమి లో, "వరావహం" అనే వాయవు ధృవ మండలంలో చరిస్తుంటాయి. "గగనం, స్పర్శనం, వాయువు, అనిలుడు, ప్రాణం, ప్రాణేశ్వరుడు, జీవుడు" అని సప్త మారుతులకు పేర్లున్నాయి).

విశాల దేశ వృత్తాంతాన్ని శ్రీరాముడికి తెలిపిన విశ్వామిత్రుడు

"పూర్వం ఇంద్రుడు దితికి సేవ చేసిన దేశం ఇదే. ఇక్కడే, ఇక్ష్వాకుడు అనే రాజు, అలంబుస అనే భార్యవల్ల, మిక్కిలి ధర్మాత్ముడని కీర్తిగాంచిన విశాలుడనే వాడిని కన్నాడు. అతడే తన పేరుమీద విశాల అనే ఈ నగరాన్ని కట్టించాడు. విశాలుడి కుమారుడు హేమచంద్రుడు-అతడి కొడుకు సుచంద్రుడు-అతడి కొడుకు ధూమ్రాశ్వుడు-అతడి కొడుకు సృంజయుడు-అతడి కుమారుడు సహదేవుడు-అతడి కుమారుడు కుశాశ్వుడు-అతడి కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుడి కుమారుడు శూరుడైన కాకుత్థ్సుడు. ప్రస్తుతం ఈ నగరాన్ని, కాకుత్థ్సుడి కొడుకైన సుమతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఇక్ష్వాకుడి దయవల్ల ఆ వంశంలో పుట్టిన రాజులందరూ పరిశుద్ధమైన మనస్సున్నవారే-ధర్మమంటే ప్రీతిగలవారే-దీర్ఘాయువుగలవారే". అని విశాల నగరం గురించి చెప్పిన విశ్వామిత్రుడు, ఆ రాత్రి ఆ నగరంలో వుండి, మర్నాడు తెల్లవారగానే లేచి, జనక రాజును చూసేందుకు పోదామని శ్రీరాముడితో అంటుండగానే, వీరొచ్చిన విషయం తెలుసుకున్న విశాల రాజు సుమతి వారి దగ్గరకొచ్చాడు. శాస్త్రోక్తంగా, అర్ఘ్యపాద్యాదులతో విశ్వామిత్రుడిని పూజించిన సుమతి, ఆయన తన దేశానికి రావడంవల్ల సామాన్యంగా లభించని ఆయన దర్శనం తనకు లభించిందని, తద్వారా తాను ధన్యుడనయ్యానని అంటాడు. (మహాత్ములెవరైనా తమ గ్రామానికి వచ్చినట్లు తెలిస్తే, గ్రామం లోని పెద్దలు, వారి దర్శనానికి వెళ్లాలని దీనివలన బోధపడుతుంది).

(సుమతి తండ్రి కకుత్థ్సుడు, శ్రీరాముడి తాత-సూర్య వంశపు రాజు కకుత్థ్సుడు ఒకరు కాదు. ఇద్దరు వేరే. సుమతి వంశం, భాగవతంలో-నవమ స్కంధంలో కూడా చెప్పబడింది. ఆ వంశ క్రమం ఇలా వుంది: మనువుకు ఇక్ష్వాకుడు-నృగుడు-శర్యాతి-దిష్టుడు-ధృష్ణుడు-కరూశకుడు-అరిష్యంతుడు-పృషధృడు-నభగుడు-కవి అనే పదిమంది కొడుకులు పుట్టారు. ఆ పదిమంది కొడుకుల్లోని దిష్టుడికి, నాభాగుడు-అతడికి హలందనుండు-అతడికి వత్స ప్రీతి-అతడికి బ్రాంశువు-అతడికి బ్రమితి-అతడికి ఖమిత్రుడు-అతడికి జాక్షుషుడు-అతడికి వివింశతి-అతడికి రంభుడు-అతడికి ఖనేత్రుడు-అతడికి గరంధనుడు-అతడికి నవిక్షిత్తు-అతడికి మరుత్తుడు-అతడికి దముడు-అతడికి రాజవర్థనుడు-అతడికి సుధృతి-అతడికి సౌధృతేయుడు-అతడికి గేవలుడు-అతడికి బంధుమంతుడు-అతడికి వేదవంతుడు-అతడికి బంధుడు-అతడికి తృణబిందుడు, అనే కొడుకులు వంశ క్రమంలో పుట్టారు. తృణబిందుడికి, అలంబనకు పుట్టిన కూతురు పేరు "ఇలబిల". ఈమెకు "విశ్రవసుడు" కి పుట్టినవాడే "కుబేరుడు". తృణబిందుడికి విశాలడు అనే కొడుకు కూడా కలిగాడు. అతడే వైశాలి అనే నగరాన్ని కట్టించాడని భాగవతంలో వుంది. వైశాలినే విశాలి అని రామాయణంలో చెప్పడం జరిగింది. ఆ విశాలి వంశంలోని సుమతినే శ్రీరామ లక్ష్మణ విశ్వామిత్రులు చూసింది. సుమతి కొడుకు జనమేజయుడు. తృణబిందుడి అనుగ్రహంవల్ల వైశాలి రాజులందరూ దీర్ఘాయుష్మంతులు-మహావీరులు-వీర్యవంతులు-అతి ధార్మికులు గా అయ్యారు).

Saturday, November 27, 2021

రాయబారిగా ద్రుపదుడి పురోహితుడు, శ్రీకృష్ణుడి సాయం కోరిన దుర్యోధనార్జునులు ...... ఆస్వాదన-48 : వనం జ్వాలా నరసింహారావు

 రాయబారిగా ద్రుపదుడి పురోహితుడు,

శ్రీకృష్ణుడి సాయం కోరిన దుర్యోధనార్జునులు

ఆస్వాదన-48

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-11-2021)

ఉత్తరాభిమన్యుల వివాహానంతరం, నాలుగు రోజులు గడిచిన తరువాత, ఉపప్లావ్యంలోనే వున్న పాండవులు ఒకనాడు, విరాటరాజు సభాభవనంలో విరాటుడు, ద్రుపదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైనవారు వున్న సందర్భంలో పాండవుల భావికార్యం ప్రస్తావన తెచ్చాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా తదపరి కార్యక్రమం గురించి చర్చ పెడతాడు శ్రీకృష్ణుడు. మాయాద్యూతం, పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అపహరించడం, పాండవుల అరణ్య-అజ్ఞాతవాసాలు, వారు ఎదుర్కొన్న ఆపదలు, పడ్డ కష్టాల గురించి మాట్లాడాడు కృష్ణుడు. పాండవులు ద్యూత నియమాన్ని శాంతంగా పాటించారని, తమ భుజబలాన్ని నిగ్రహించారని, ఇక తమ పరాక్రమాన్ని కౌరవులకు చూపాలనుకొంటున్నారని అన్నాడు. దుర్యోధనుడు కూడా మిత్ర బృందాన్ని సమకూర్చుకుంటున్నాడు కాబట్టి పాండవుల పక్షంలోని రాజసమూహం కూడా సమీకృతం కావాలని అంటూ కౌరవుల అభిప్రాయం తెలుసుకోవడానికి తగినవాడిని కౌరవ సభకు పంపాలని, దుర్యోధనుడు పాండవులకు రాజ్యభాగం ఇస్తే మంచిదేనని, ఇవ్వకపోతే ఏంచేయాల్నో ఆలోచించాలని అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు చెప్పినదానికి సమ్మతించిన బలరాముడు, పాండవులు పంపిన మనిషి వినయంతోనే రాయబారపు కార్యం సాధించుకొని రావాలి అన్నాడు. కాకపోతే ఆయన మాటల్లో దుర్యోధనుడి పట్ల కొంత శిష్య వాత్సల్యం కనపర్చాడు. బలరాముడి వాదన సాత్యకికి పూర్తిగా నచ్చలేదు. ధర్మరాజును బలవంతంగా జూదం ఆడించారని అన్నాడు. తాను, భీమార్జునులు యుద్ధం చేస్తుంటే ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదని, అలాగే నకుల సహదేవులని, ఇతర పాండవ పక్ష రాజులని అంటూ, తన అభిప్రాయం ప్రకారం యుద్ధం చేయడమే కర్తవ్యం అని స్పష్టం చేశాడు. ఒకవేళ దూతనే పంపుతే, న్యాయం చొప్పున తగినట్లుగా, సగౌరవంగా దుర్యోధనుడు ఇస్తే తీసుకుందాం అని చెప్పాలన్నాడు.

బలరాముడి మాట సమ్మతం కాదని, సాత్యకి మాట సముచితంగా వున్నదని ద్రుపదుడు అన్నాడు. దుష్టస్వభావుడు, దుర్మార్గుడైన దుర్యోధనుడు ప్రీతిపూర్వక మాటలకు రాజ్యభాగం ఇవ్వడానికి ఇష్టపడడని, యుద్ధం వల్ల కాని అతడు సరిపడడని ద్రుపదు అన్నాడు. తన ప్రధాన పురోహితుడిని ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపమని, అతడు రాజనీతిలో సమర్థుడని ద్రుపదుడు అనగా శ్రీకృష్ణుడితో సహా అంతా అంగీకరించారు.  

భారతంలో ద్రుపదుడి పాత్ర చాలా విలక్షణ మైనది. అతడికి‌ ముందు చూపుతో కూడిన రాజనీతిజ్ఞత వున్నదని విరాటరాజు కొలువులో చెప్పిన మాటలు రుజువు పరుస్తాయి. సాత్యకి లేచి యుద్దము అభిలషణీయము కాదు, కాని రాయబారమన్నది దయా ధర్మ బిక్షంగా ఉండకూడదని అన్నప్పుడు, ద్రుపదుడు ఈ విధంగా మాట్లాడుతాడు.

"సుయోధనుడు మంచి మాటలతో వినకపోతే యుద్ధమే శరణ్యం. ఆ పరిస్థితులలో దుర్యోధనుడి ఆశ్రయం లో వున్మ భీష్ముడు దుర్యోధనుడి పక్షమే. అశ్వత్థామకు సుయోధనుడికి మైత్రి మెండు. కాబట్టి అతడు కూడా వారి పక్షమే. పుత్రప్రేమకు లోనైన ద్రోణుడూ వారి పక్షమే. బందుత్వాన్ని విడచిపెట్టలేని కృపాచార్యుడూ వారి పక్షమే. ఇక ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు బందీ కాబట్టి రారాజుకి వ్యతిరేకంగా పాండవుల రాజ్యభాగాన్ని ఇప్పించలేడు. శకుని ఎలాగూ మేనల్లుడైన దుర్యోధనుడిని ప్రోత్సహిస్తాడు. కర్ణుడు యుద్ధోన్మాది. ఎప్పుడు యుద్ధం వస్తుందా, అర్జునుడిని ఎప్పుడు ఓడించాలా అని అర్రులు చాస్తున్నాడు. అందుకని అతడు దుర్యోధనుడిని యుద్ధానికే ప్రోత్సహిస్తాడు. రారాజు సోదరులూ ఎలాగూ అన్న ఆజ్ఞ మీరరు. ఈ నేపధ్యంలో దుర్యోధనుడు సంధికి అంగీకరించే అవకాశాలు మృగ్యం. అతడు ఈ పాటికే యుద్ధసన్నాహాలు మొదలు పెట్టే వుంటాడు. మనం కూడా సంధి ప్రయత్నాలు చేస్తూనే, మనకి హితులైన మిత్రరాజుల సహాయ సహకారాలకు ప్రయత్నించడం మంచిదని" నా అభిప్రాయం అని చెబుతాడు.

ఆ తరువాత శ్రీకృష్ణుడు ప్రయాణ సన్నద్ధుడై ద్వారకానగరానికి వెళ్లాడు. వివాహ మహోత్సవానికి వచ్చిన రాజులంతా యుద్ధ ప్రయత్నాలు చేసుకోవడానికి తమతమ నగరాలకు వెళ్లిపోయారు. పాండవులు కూడా యుద్ధ ప్రయత్నంలో నిమగ్నులయ్యారు. విరాటుడూ యుద్ధ సన్నద్ధుడయ్యాడు. ద్రుపదరాజు కూడా యుద్ధ సన్నద్ధుడయ్యాడు. దుర్యోధనుడు కూడా పాండవుల ప్రయత్నాలను తెలుసుకుని తాను కూడా యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాడు. నలుదిక్కుల నుండి రాజాలు, వారి సమూహాలు ఉభయుల శిబిరాలకు లోకభీకరంగా రావడం మొదలైంది.

అనుకున్న ప్రకారం ద్రుపదుడు ధర్మరాజు ఆజ్ఞతీసుకుని తన పురోహితుడిని ధృతరాష్ట్రుడి దగ్గరికి పొమ్మన్నాడు. పురోహితుడు చేయాల్సిన కార్యాన్ని వివరించాడు ద్రుపదుడు. పాండవులకు భూభాగం ఇమ్మని అడగడానికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లమని అంటూ, అక్కడి వారితో మాట్లాడి పాండవులకు బలం చేకూర్చడం ఆయన చేయాల్సిన పని అని చెప్పాడు. హస్తినాపురంలో వుండి, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారిదగ్గరికి వెళ్లి, వారి మనోభిప్రాయాలు తెలుసుకుని ప్రవర్తించమన్నాడు. ఆయన మాట ప్రకారం సంతోషంగా పురోహితుడు రాయబారానికి వెళ్లాడు.

ఇదిలా వుండగా దుర్యోధనుడు అందరి రాజులను సహాయం అడిగినట్లే, స్వయంగా తానే శ్రీకృష్ణుడి వద్దకు పోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లే ద్వారకకు వెళ్లాడు. యాధృచ్చికంగా అదే రోజున అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని చూడడానికి, సహాయం కోరడానికి వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రపోతుంటే, దుర్యోధనుడు ముందుగా వెళ్లి, తలాపి దిక్కున వున్న ఉన్నతాసనం మీద కూచున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు మెల్లగా వచ్చి కాళ్ల దిగ్గర వినయంగా నిలబడ్డాడు. కృష్ణుడు మేల్కొని ముందుగా ఆర్జునుడిని చూసి, తరువాత దుర్యోధనుడిని చూసి ఇద్దరినీ ఆదరించి ప్రీతిగా మాట్లాడాడు. వారిద్దరూ వచ్చిన పని తెలియచేయమని అడిగాడు. జవాబుగా దుర్యోధనుడు, అర్జునుడి పక్షాన కూడా మాట్లాడుతున్నవాడిలాగా, యుద్ధం చేసే తలంపుతో శ్రీకృష్ణుడి తోడ్పాటును కోరి వచ్చామని అన్నాడు. పాండవులకూ, కౌరవులకూ కృష్ణుడు దగ్గరి చుట్టమని కూడా అన్నాడు.

అయితే ముందుగా వచ్చింది మాత్రం తానన్నాడు దుర్యోధనుడు. లోకంలో వున్న న్యాయం ప్రకారం తనకు సహాయం చేయాలని అన్నాడు. జవాబుగా శ్రీకృష్ణుడు, ముందుగా దుర్యోధనుడు వచ్చినప్పటికీ, తాను ముందుగా అర్జునుడిని చూశానని, కాబట్టి ఇద్దరికీ సమానంగా, సగౌరవంగా సహాయం చేయడం మంచిదని అన్నాడు. తన దగ్గర పదివేల మంది యుద్ధం చేసే వీరులు, నారాయణ నామధేయులైన గోపాలురు వున్నారని, ఆయుధాల జోలికి పోకుండా, యుద్ధం చేయకుండా వుండే తానున్నానని, ఈ రెంటిలో ఒకటి కోరుకొమ్మని, మొదలు చిన్నవాడైన అర్జునుడికి అవకాశం ఇస్తున్నానని చెప్పాడు. అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడికి కోరుకున్నాడు.

అర్జునుడు అలా కోరుకున్నందుకు సంతోషించిన దుర్యోధనుడు ఆ గోపకులను తన పక్షాన వేసుకుని అక్కడి నుండి సహాయానికి బలరాముడి దగ్గరికి పోయాడు. జయాపజయాలు ఎవరివైనా తాను తటస్థంగా వుంటానని, ఎవరికీ సహాయం చెయ్యనని చెప్పాడు బలరాముడు. దుర్యోధనుడు దానికి వినయపూర్వకంగా అంగీకరించాడు.

తనను ఎందుకు కోరుకున్నావని శ్రీకృష్ణుడు అడిగాడు ఆర్జునుడిని. తాను యుద్ధానికి తోడ్పాటు కోరనని, ప్రతిపక్షంలో ఆయన వుంటే ఆయన్ను గెలవడం ఆశక్యమని, అందువల్ల విజయానికి ప్రధాన కారణమైన ఆయన్ను కోరుకున్నానని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అసమానమైన యుద్ధకేళిలో తాను అర్జునుడికి సారథ్యం వహిస్తానని చెప్పాడు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, November 21, 2021

ఇంద్రుడిని చంపగల కొడుకుకొరకు వ్రతం చేసిన దితి ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-82 : వనం జ్వాలా నరసింహారావు

 ఇంద్రుడిని చంపగల కొడుకుకొరకు వ్రతం చేసిన దితి

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-82

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (22-11-2021)

"తన కొడుకులకు పట్టిన దురవస్థను చూసి, దిగులుపడిన దితి, దుఃఖాతిశయంతో భర్త కశ్యపుడి దగ్గరకు పోయి, ఆయన కొడుకులే తన కడుపు కొట్టారని, తన పగ తీర్చగల కొడుకొక్కడైనా పుట్టకపోతే తానెట్లా పుత్రశోకాన్ని భరిస్తానని అడుగుతుంది. ఇంద్రుడిని చంపగలిగే కొడుకు తన కడుపున పుడితే, తన పగ తీరుతుందని, అలాంటి కొడుకు పుట్టేటట్లు తనను అనుగ్రహించమనీ, దానికొరకు భర్త చెప్పినట్లే తపస్సు చేస్తాననీ అంటుంది దితి కశ్యపుడితో. అలా దుఃఖిస్తున్న దితితో, వెయ్యేళ్లు తను చెప్పిన రీతిలో పూర్ణంగా-విఘ్నం లేకుండా తపస్సు చేస్తే, ఇంద్రుడిని చంపగలిగి-ముల్లోకాలను ఏల గలిగే కొడుకు పుట్తాడని చెప్తాడు కశ్యపుడు. అలా చెప్పిన కశ్యపుడు, దితి కడుపును తనచేత్తో తాకి, ఆమెకు ప్రియం కలగాలని కోరుకుంటూ, తపస్సు చేయడానికి వెళ్ళాడు. సంతోషించిన దితి, కుశప్లవం అనే క్షేత్రంలో, దీర్ఘకాలం తీవ్రంగా తపస్సు చేసింది. ఆ సమయంలో ఆమెకు సపర్యలు చేసేందుకొరకు స్వయంగా ఇంద్రుడొచ్చాడు. వచ్చిన ఇంద్రుడు, నీతి మార్గాన్ని కొంచెం కూడా వదిలిపెట్టకుండా, వినయంతో, గొప్ప భక్తితో, దితికి సేవలు చేశాడు. సమయానికి మంచి పళ్లు, దర్భలు, సమిధలు, ఇతర వస్తువులు సమకూరుస్తుండేవాడు. తపస్సు చేసి అలసిపోతే విసన కర్రతో శ్రమ పోయేందుకు విసిరేవాడు. బదలిక చెందినప్పుడు కాళ్లు పిసికే వాడు. ఆమె ఏ పని చెప్పినా ఆలస్యం చేయకుండా-విసుగు పడకుండా, వెంటనే చేసేవాడు. ఇలా ఇంద్రుడి శుశ్రూషలో ఆమె తపస్సు వెయ్యేళ్లకు పది సంవత్సరాలు తక్కువగా పూర్తి కావచ్చింది".

"ఇంద్రుడి సేవకు తృప్తి చెందిన దితి, వ్రతం పూర్తికావచ్చింది కనుక, విఘ్న భయం లేదని భావించింది. తనెందుకు తపస్సుచేస్తుందోనన్న రహస్యాన్ని ఇంద్రుడికి ధైర్యంగా చెప్పింది. ఇంద్రుడి తండ్రిని తను ఒక వరం కోరాననీ-ఆయన తనను అనుగ్రహించి వేయి సంవత్సరాలు తపస్సు చేయమన్నాడనీ-ఆ అఖండ తపస్సువలన తనకొక కొడుకు పుడుతాడనీ-ఆయన వర బలంతో, ముల్లోకాలలో ఇంద్రుడితో సహా ఎవరూ ఎదిరించలేని బలవంతుడైన కొడుకు తన గర్భంలో కలిగాడని-మరో పదేళ్ల తర్వాత బలవంతుడుగా పుట్టనున్న తమ్ముడిని ఇంద్రుడు చూస్తాడనీ, అంటుంది దితి ఇంద్రుడితో. తనను గెలవగలవాడు పుడుతున్నాడని ఇంద్రుడు భయ పడవద్దని, తన కొడుకుతో మాట్లాడి ఇంద్రుడికి ఏ కొరత లేకుండా వాడిని చక్కదిద్దుతానని, ఇద్దరు కలిసిమెలిసి లోకాలను రక్షించాలని చెప్తుంది. అలా చెప్పి, మధ్యాహ్నపు ఎండకు అలిసిపోయిన దితి, దేహాన్ని మరిచి, తల వెంట్రుకలు కాళ్లమీద జారుతుంటే, మోకాళ్ల మీద తలనుంచి, సుఖంగా నిద్రిస్తుండగా చూసి తనలో తానే నవ్వుకున్నాడు ఇంద్రుడు. తనను జయించేవాడు ఆమెకెలా కలుగుతాడో చూద్దామనుకుని, గర్భ పిండాన్ని నాశనం చేద్దామనుకుంటాడు".

దితి గర్భంలో వున్న పిండాన్ని ఖండించిన ఇంద్రుడు

"అలసటతో నిద్రిస్తున్న దితి గర్భంలోకి ప్రవేశించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో, ఆ గర్భ పిండాన్ని ఏడు తునకలుగా ఖండించాడు. అలా చేస్తున్నప్పుడు ఏడ్చిన పిండంతో ఏడ్వవద్దని అంటూ, మరింత ఖండించసాగాడు. ఇంతలో మేల్కొన్న దితి, పిండాన్నేం చేయొద్దని అంటుంది ఇంద్రుడితో. తల్లిమీదున్న గౌరవంతో, చంపకుండా, వజ్రాయుధంతో సహా బయటికొచ్చి, తల్లి పాదాలపై పడతాడు. తాను నిజంగా అపరాధం చేశాననీ-అయినా క్షమించాలనీ-శపించకుండా మన్నించాలనీ-తల్లి అశుచిగా, తల వెంట్రుకలు కాళ్లపై పడుతుంటే నిదురిస్తున్నప్పుడు, తనను తాను రక్షించుకోవాలన్న కోరికతో-తన్ను చంపేందుకు పుట్టనున్న వాడిని తునకలు చేశాననీ అంటాడు. తనను చంపదల్చిన బ్రాహ్మణుడినైనా-స్త్రీనైనా-గోవునైనా, చంపవచ్చని శాస్త్రం చెప్తుందని, కాబట్టి తాను చేసింది దోషం కాదని అంటాడు ఇంద్రుడు దితితో".

Saturday, November 20, 2021

గెలిచింది బృహన్నల, తాను కాదని చెప్పిన ఉత్తరుడు ...... ఉత్తరాభిమన్యుల వివాహం ..... ఆస్వాదన-47 : వనం జ్వాలా నరసింహారావు

 గెలిచింది బృహన్నల, తాను కాదని చెప్పిన ఉత్తరుడు

ఉత్తరాభిమన్యుల వివాహం

ఆస్వాదన-47

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (21-11-2021)

ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించి తండ్రిని చూడడానికి వచ్చిన ఉత్తరుడికి కంకుడి ముఖం మీద వున్న గాయం కనిపించింది. ఇదేమిటని తండ్రిని అడిగాడు. సమాధానంగా విరాటుడు, తాను ఉత్తరుడి విజయాన్ని పొగడుతూంటే కంకుడు ఆ విజయం పేడి బృహన్నలదని అన్నాడని, దానితో కోపం వచ్చి సహించలేక వెనుకా-ముందూ చూడకుండా తాను పాచికతో కొట్టానని చెప్పాడు. తండ్రి తప్పు చేశాడని, పెద్దల మాట వినాలి కాని కోపగించుకోవడం తగదని అన్నాడు ఉత్తరుడు. దాంతో విరాటుడు ధర్మరాజును క్షమాపణ కోరాడు. తనకసలు కోపమే రాలేదని చెప్పాడు ధర్మరాజు. అదే సమయంలో అంతదాకా బయటే వేచి వున్న బృహన్నల లోపటికి వచ్చాడు. విరాటుడు అతడిని ఆదరించాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ మొదలైన కౌరవ మహావీరులను ఒక్కడే ఎదిరించి ఎలా గెలిచాడని, ఆవులను ఎలా మళ్లించగలిగాడని ప్రశ్నించాడు ఉత్తరుడిని విరాటుడు.

కౌరవ సేనలను గెలిచింది తాను కాదని, ఆవులను మరల్చింది కూడా తాను కాదని, దైవబలం ఉన్నందున ఒక మహానుభావుడు, దేవాంశ సంభూతుడు వచ్చి యుద్ధంలో తనను కాపాడి, కౌరవులను ఓడించి, ఆవులను మరలించాడని జవాబిచ్చాడు ఉత్తరుడు. కౌరవ సేనలు ఆ దివ్యపురుషుడిని చుట్టుముట్టాయని, దుర్యోధనుడు సేనతో సహా ఎదురు తిరిగాడని, యుద్ధం ఘోరంగా జరిగిందని, శత్రువులంతా దివ్యపురుషుడు వేసిన బాణాలకు యుద్ధభూమిలో పడిపోయారని, ఎదిరించిన కర్ణుడిని ఓడించాడని, ద్రోణుడిని కూడా దివ్యపురుషుడు గెలిచాడని, భీష్ముడు కూడా వశం తప్పాడని, చివరకు దివ్యపురుషుడి ధాటికి కౌరవ సేనలు వెనుతిరిగాయని చెప్పాడు ఉత్తరుడు. ఎవరా దివ్యపురుషుడని అడిగాడు విరాటుడు. అతడు అదృశ్యమయ్యాడని మళ్లీ వస్తాడని అన్నాడు ఉత్తరుడు.

ఆ తరువాత బృహన్నల నాట్యశాలకు వెళ్లి యుద్ధ రంగం నుండి తాము తెచ్చిన కౌరవుల బొమ్మపొత్తికలు ఉత్తరకు ఇచ్చాడు. ఆ తరువాత పాండవులు, ద్రౌపదీదేవి ఒక రహస్య స్థలంలో కలుసుకుని ఉత్తర గోగ్రహణం విషయాలను ముచ్చటించుకున్నారు. విరాటుడు తనను పాచికతో కొట్టిన విషయాన్ని చెప్పాడు ధర్మరాజు అర్జునుడికి. అర్జునుడికి కోపం వచ్చినప్పటికీ ధర్మరాజు సర్ది చెప్పాడు. తమ్ములంతా శాంతించారు. తామొచ్చిన పని అయిపోయింది కాబట్టి ఏవిధంగా విరాటుడి కొలువు కూటం నుండి బయటపడాలని ఆలోచన చేశారు. ఇంతలో రాత్రి గడిచింది. తెల్లవారుజామునే లేచారు. స్నానాది కార్యక్రమాలు ముగించుకున్నారు. గౌరవప్రదమైన వేషాలతో రాచనగరికి సంతోషంగా వెళ్లారు.

వెళ్లిన తరువాత ధర్మరాజు సింహాసనం మీద కూచున్నాడు. తమ్ములంతా వారికి తగ్గ ఆసనాలమీద కూచున్నారు. కొలువుకు వచ్చిన విరాటుడు వారిని ఆ విధంగా చూసి ఆశ్చర్యపడ్డాడు. సాధువృత్తికల ధర్మరాజు ఎందుకలా తన సింహాసనం మీద కూచున్నాడని ప్రశ్నించాడు. దానికి జవాబుగా అర్జునుడు, సింహాసనం మీద కూచున్నది రాజసూయ యాగం చేసి అందరినీ గెలిచిన అజాతశత్రువు ధర్మరాజని చెప్పాడు. అతడు భూమండలం అంతా దిగ్విజయం చేసిన మహానీయుడన్నాడు. ఆయన ధర్మారజైతే భీమార్జున నకుల సహదేవులేరీ అని అడిగాడు విరాటుడు. వలలుడు భీముడని, దామగ్రంథి నకులుడని, తంత్రీపాలుడు సహదేవుడని, సైరంధ్రి వేషంలో మాలిని అన్న పేరుతో సుదేష్ణ  దగరున్నది ద్రౌపదీదేవని జవాబిచ్చాడు అర్జునుడు. అప్పుడు భీముడు కలిగించుకుని పేడి రూపంలో బృహన్నల అన్న పేరుతో విరాటుడి కూతురుకు నాట్యం నేర్పుతున్నది అర్జునుడని అన్నాడు.

అప్పుడు అక్కడే వున్న ఉత్తరుడు ఆర్జునుడిని చూపిస్తూ, తాను చెప్పిన దివ్యపురుషుడు అతడే అని అన్నాడు. అతడొక్కడే కౌరవ సేనను ఓడించాడని చెప్పాడు. ఇదంతా విన్న విరాటుడికి భయం, గౌరవం, సంతోషం ఒక్కసారే మనస్సులో వ్యాపించాయి. గౌరవంతో ఆర్జునుడిని కౌగలించుకున్నాడు. ధర్మరాజుకు సాగిలపడి మొక్కాడు. భీమ, నకుల, సహదేవులను కౌగలించుకున్నాడు. విరాటుడు తన పరివారాన్నంతా పిలిచి పాండవులను పరిచయం చేశాడు. రాణీవాసానికి కబురు చేసి ద్రౌపదీదేని తగిన విధంగా గౌరవించాలని సుదేష్ణను ఆదేశించాడు. అర్జునుడు తామిన్నాళ్లు విరాటరాజు దగ్గర వున్నందుకు ధన్యవాదాలు చెప్పాడు. అదంతా తన పుణ్యం అన్నాడు విరాటుడు. ఇక తన రాజ్యం అంతా ధర్మరాజుదేనని అన్నాడు.

ఉత్తరను తీసుకురమ్మని మంత్రులను ఆదేశించాడు విరాటుడు. ఆమెను సింగారించి ధర్మారాజు ఎదుటికి తెచ్చారు మంత్రులు. ఆ కన్యను అర్జునుడికి చేసుకొమ్మని అన్నాడు విరాటుడు. తాను ఉత్తరకు తండ్రి సమానుడినని, అందుకే ఆమెను తాను భార్యగా కాకుండా కోడలుగా స్వీకరిస్తానని చెప్పాడు అర్జునుడు. ఆమెను అభిమన్యుడు వివాహమాడుతాడని అన్నాడు. ఆ తరువాత దైవజ్ఞులను పిలిచి లగ్న నిశ్చయం చేయించారు.

ఇంతలో దుర్యోధనుడు పంపిన దూత వచ్చి ధర్మారాజాదుల అజ్ఞాతవాసం పూర్తికాక ముందే అర్జునుడు బయటపడ్డాడని రాజు మాటలుగా చెప్పాడు. తాము శపథం చేసినట్లుగా పదమూడేళ్లు అరణ్య, అజ్ఞాతవాసాలు ముమ్మాటికీ నిండాయని చెప్పమన్నాడు ధర్మరాజు. దూత అవే మాటలను దుర్యోధనుడికి చెప్పాడు. ధర్మారాజు చెప్పినదాన్ని భీష్ముడు ధృవపరచాడు.

ఆ తరువాత పాండవులు జమ్మిచెట్టుమీద దాచిన తమ సమస్త ఆయుధాలను తెచ్చుకుని ఉపప్లావ్యంలో నివసించారు. ఒకానాడు శ్రీకృష్ణ బలరామాదులు, ద్రుపద మహారాజు వచ్చారు వారిని చూడడానికి. పాండవులు వారికి తగిన మర్యాదలు చేశారు. శ్రీకృష్ణుడు, ద్రుపద మహారాజు అనేక బహుమానాలను తెచ్చారు పాండవులకు ఇవ్వడానికి. అదే విధంగా అనేకమంది రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి వచ్చారు. విరాటరాజు నగరంలో వివాహ మహోత్సవం చాటింపు వేయించారు. ఊరంతా అందంగా అలంకరించారు.

శాస్త్రోక్తంగా జరగాల్సిన వివాహ పూర్వరంగంలోని పనులన్నీ జరిగాక, జ్యోతిష్కుడు దగ్గరుండి గుణించి శుభలగ్న సమయాన్ని సరిగ్గా తెలపగా మంగళ వాద్యాలు మోగుతుంటే ఉత్తరాభిమన్యుల మధ్యనున్న తెర ఎత్తారు. వధూవరులు ఒకరినొకరు చూసుకున్నారు. తలంబ్రాలు ఒకరి దోసిలి నుండి ఇంకొకరి దోసిలిలో పోసి పరస్పరం తలమీద పోసుకున్నారు. అభిమన్యుడు ఉత్తర మృదువైన హస్తాన్ని మృదువుగా గ్రహించాడు. ఈ విధంగా పాణిగ్రహణం జరిగింది. ఈ విధంగా విరాటరాజు ఉత్తరాభిమన్యుల వివాహం నిర్వహించాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

        

 

 

Sunday, November 14, 2021

విశ్వామిత్రుడిని విశాల నగర వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-81 : వనం జ్వాలా నరసింహారావు

 విశ్వామిత్రుడిని విశాల నగర వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-81

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-11-2021)

ఇంద్ర సమానుడైన విశ్వామిత్రుడు చెప్పిన కథలను వినగా-వినగా, తమ ఇరువురికీ, చాలా ఆశ్చర్యం కలిగిందని, సంతోషంగా మృధువైన మాటలతో ఆయనకు చెప్పి, రామ లక్ష్మణులు ఆ రాత్రంతా విశ్వామిత్రుడు చెప్పిన కథలను స్మరించుకున్నారు. సగర చక్రవర్తి సంపద, వైభవం-తన కొడుకని కూడా చూడకుండా భార్యతో సహా అసమంజుడిని అడవులకు పంపిన ఆయన ధర్మాభిమానం-అంశుమంతుడి సౌజన్యం, సంపత్తి-సాగరులు పితృవాక్య పాలన కొరకు చేసిన మహా కార్యం, పితృభక్తి-భగీరథ ప్రయత్నం, ఆయన కార్య సాధకత్వం-గంగా పతనం, మొదలైన సంఘటనలకు సంబంధించిన వ్యక్తుల గుణగణాలను మెచ్చుకుంటూ వారిరువురు సూర్యోదయం వేళ దాకా గడిపారు. సూర్యుడు తూరుపు కొండమీద కి రాగానే, ప్రాతః కాల కృత్యాలను తీర్చుకొని, విశ్వామిత్రుడి వద్దకు పోయి, ఆయనకు నిర్మలమైన భక్తితో నమస్కరించారు. రాత్రంతా విశ్వామిత్రుడు చెప్పిన కథలను గురించే తామిద్దరం ముచ్చటించుకున్నామని, తమందరం ఇక్కడ వున్న విషయం తెలుసుకున్న అక్కడి మునులు-మహా పుణ్యాత్ములు, సుఖాసనాలతో కూడిన ఓడను తమకొరకై పంపారని, దాంట్లో గంగను దాటిపోదామా? అని ఆయన్ను అడిగారు రామ లక్ష్మణులు. వారు చెప్పినట్లే, గారాబంతో వారి మాటలను విన్న విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా మునీంద్రుడు ఆ కథనంతా చెప్పాడీవిధంగా:

"రామచంద్రా, పూర్వం కృతయుగంలో, వీరులైన దైత్యులు-శౌర్యంలోను, విస్తారంగా ధర్మ కార్యాలు నిర్వహించడంలోను ప్రీతిగలిగిన దేవతలు, తమకు ముసలితనం-మరణం-వ్యాధులు లేకుండా, హాయిగా వుండేందుకు మార్గమేంటని ఉమ్మడిగా ఆలోచించారు. పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే, తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని చిలకడం మొదలెట్టారు. అలా వారు వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని హరించేందుకు, వారందరూ, పాహి-పాహి అంటూ శివుడిని ప్రార్థించారు. మిక్కిలి భక్తితో ప్రార్థించిన వారికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో శంక చక్రాలను ధరించిన విష్ణుమూర్తి అక్కడ కొచ్చి, చిరునవ్వుతో, దేవతలు చిలికినప్పుడు మొట్టమొదటగా పుట్టిన సహించలేని విషాన్ని, దేవతల్లో పెద్దవాడైన శివుడు-ప్రధమంగా గౌరవించాల్సిన శివుడు, అందరికంటే ముందుగా మంచి మనస్సుతో తీసుకొమ్మని చెప్పాడు".

హాలాహలాన్ని మింగిన శివుడు

"విష్ణుమూర్తి అలా చెప్పి వెళ్లగానే, భయపడుతున్న దేవతలను చూసిన శివుడు, విష్ణువు చెప్పినట్లే, విషాన్ని కంఠంలో ధరించాడు. వెంటనే దేవతలు, తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా, వాళ్లు కవ్వంగా వాడుతున్న మందర పర్వతం పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను కాపాడమని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను విన్న విష్ణుమూర్తి, ప్రపంచ శరీరానికి ఆత్మగా వుండే దేవాదిదేవుడు, తానూ దేవతల్లో ఒకడై, ఒక చేయి కొండ కొనలో నిలిపి, కొండకింద తాబేలు ఆకారంలో మందరాన్ని మోస్తూ, స్వయంగా అమృతం కొరకు చిలక సాగాడు".

క్షీర సముద్రంలో ఉదయించిన ధన్వంతరి-తదితరములు

"స్థిరంగా-విఘ్నాలు లేకుండా, వేయి సంవత్సరాలు అలా చిలకగా, పాల సముద్రంలో తొలుత, యాగదండం-కమండలువు ధరించి, వైద్యుడైన ధన్వంతరి పుట్టాడు. పాల సముద్రంలోని జల వికారమైన పాలను చిలుకగా-చిలుకగా, సారం పుట్టింది. ఆ రసంలోంచి అందగత్తెలైన అరవైకోట్ల అప్సరసలు పుట్టారు. వారికెందరో పరిచారికలుండడంతో-వారిని లెక్కించడానికి ఎవరి తరం కాకపోవడంతో, ఆ స్త్రీలను దేవతలుగాని, రాక్షసులుగాని స్వీకరించలేదు. అప్సరసల పరిచారికలను ఎవరూ, కామంతో గ్రహించనందున, మగవారందరితోనూ సమాన పతి భావంతో ప్రవర్తించే వేశ్యలుగా-వార కాంతలుగా వారు పిలువబడ్డారు. తననెవరు స్వీకరించనున్నారోనని అనుకుంటూ బయట కొచ్చిన వరుణుడి కూతురు సురను, అసురులు వద్దనడంతో, దేవతలు ఇష్టంగా పరిగ్రహించారు. సురను దైత్యులు గ్రహించనందునే "అసురులు" గా పేరు తెచ్చుకున్నారు. స్వీకరించిన దేవతలు సురలై, దేహమంతా గగ్గురుపాటుగలిగే విధంగా సంతోషించారు. మరికొంత చిలుకగా, ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. తర్వాత కౌస్తుభం అనే రత్నం కలిగింది. అప్పుడు అమృతం పుట్టింది. చివరకు అమృతమే అసురుల వంశాన్ని నాశనం చేసింది".

"అమృతం ఎలా వారి వంశాన్ని నాశనం చేసిందని సందేహం కలగొచ్చు. అమృతం పుట్టగానే, అది దేవతలకు దక్కకుండా, తామే హరించాలని భావించిన రాక్షసులు-అసురులు, కలిసి కట్టుగా ఒక్కటై దేవతలతో యుద్ధానికి దిగారు. ఇరు పక్షాలనుండి అనేకమంది చనిపోయారా యుద్ధంలో. విష్ణువప్పుడు దేవతల పక్షం వహించి అమృతాన్ని హరించాడు. మోహిని వేషంలో రాక్షసులను మోహించినట్లు చేసి, విరోధించిన రాక్షసులను వధించి, దేవతల పట్ల స్నేహభావంతో, వారు సంతోష పడే విధంగా, అమృతాన్ని వారికిచ్చాడు విష్ణువు. ఇలా అమృతం తాగి-మరణం లేనివారైన దేవతలను చేర్చుకొని, ఇంద్రుడు, భయంకరమైన యుద్ధ భూమిలో, రాక్షసులను వధించి, దేవతలు-చారణులు-ఋషులు సంతోషించే విధంగా తన రాజ్యాన్ని మళ్లీ పొంది ఏలాడు".

(ఇంద్రుడు ఒకనాడు ఐరావతాన్నెక్కి విహారానికి వెళుతుంటే దుర్వాసుడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఒక పుష్ప హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తను ధరించకుండా, ఐరావతం కుంభాలకు చుట్టాడు. అది తొండంతో దాన్ని తీసేసి, నేలపై పడవేసి కాల రాసింది. సగౌరవంగా తానిచ్చిన పూల దండను, ఐశ్వర్యమదంతో అగౌరవ పర్చి-అవమానించిన ఇంద్రుడి ఐశ్వర్యమంతా సముద్రం పాలై పోవాలని దుర్వాసుడు శపించాడు. వెంటనే ఇంద్రుడి ఏనుగులు, గుర్రాలు, మణులు, ఇతర భోగ పదార్థాలన్నీ మాయమై సముద్రంలో పడ్డాయి. ఇంద్రుడు దరిద్రుడై-బుద్ధిమంతుడై, మరల విష్ణువును ప్రార్థించాడు. మున్ముందు పెద్దలను అవమానించ వద్దని ఇంద్రుడికి హితవు పలికి-బుద్ధిచెప్పి, మందరంతో పాల సముద్రాన్ని చిలకమని, అందులోంచి ఆయన మునుపటి ఐశ్వర్యమంతా లభిస్తుందని చెప్పాడు విష్ణుమూర్తి. అలా, ఆ మహా విష్ణువు సహాయంతో, ఇంద్రుడు మరల లబ్దైశ్వర్యుడు అయ్యాడు.

పాల సముద్రంలో అమృతం పుట్టడం కూడా యోగశాస్త్రాన్ననుసరించే వుంది. మూలాధారమందుండే త్రికోణం మందరం. దాన్ని చుట్టి వున్న వాసుకి కుండలి. దాన్ని మథించిన సురాసురులు ఇడాపింగళనాడులందుండే ప్రాణశక్తి వాయువులు. దీనంతటికి ఆధార భూతుడు విష్ణువు. కుండలి మొదలు మేల్కొన్నప్పుడు, దేహంలో శక్తి ప్రసారమైన కారణాన, వికారాలు పుట్తాయి. అప్పుడు, ఆ యోగవిద్య తెలిసిన గురువు, దాన్నుండి అపాయం కలగకుండా చేయాలి. ఆ గురువే, వాసుకి భూషణుడైన శివుడు. శివుడు వాసుకి కంకణుడు కాబట్టి, విషం ఆయనను భాదించదు. భగవంతుడైన విష్ణుమూర్తే, గురువైన శివుడిని, అపాయాన్నుండి కాపాడమని ప్రేరేపించాడు. ఆ తర్వాత, తానే ఆధారంగా నిలుచుండి, యోగి అభీష్ఠాన్ని నెరవేర్చాడు. అమృతం పుట్టినప్పటికీ, ఆ దశలో, హరి భక్తిలేని సాధకులు, అందగత్తెలను చూసి చెడిపోతారు. భగవంతుడిని ఆశ్రయించి వున్నవారు చెడరు. అందువల్ల ఆయనే విఘ్నాలను అణచివేసి, అమృతాన్ని దేవతలకిచ్చాడు).