Showing posts with label రాష్ట్రపతి పాలన. Show all posts
Showing posts with label రాష్ట్రపతి పాలన. Show all posts

Monday, July 4, 2011

రాజీనామాలతో వేగం కానున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ : వనం జ్వాలా నరసింహారావు

రాజీనామాలతో వేగం కానున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ

రాజీనామాలతో ఏం జరుగబోతోంది ?

సూర్య దిన పత్రిక (05-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఊపందుకున్న ఉద్యమం, రాజీనామాలతో రాజకీయ సంక్షోభం, ఇరు ప్రాతాల నేతల్ని కించపరచే వ్యాఖ్యలు, రాజీనామా రాజకీయాల్లో తెదేపా పోటీ, మీమాంసలో పడ్డ కాంగ్రెస్‌ అధిష్ఠానం…..

అనుకున్నంతా అయింది. అందరు కాకపోయినా, కొందరైనా, ఇప్పటికైనా, చెప్పింది చేసి చూపిస్తున్నారు. ఏ వుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు జానారెడ్డి ఇంటికి వెళ్లారో, ఏ వుద్దేశంతో వై ఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తాను కూల్చకుండా పడి పోవాలని కోరుకున్నాడో, ఏ వుద్దేశంతో తెలుగు దేశం అధినేత తన పార్టీలోని తెలంగాణ వాదుల నిర్ణయాన్ని ఆప దల్చుకోలేదో, ఏ వుద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా-బింకంగా-మొండి ధైర్యంతో గమనిస్తోందో కాని, రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రావు కూడా రాజీనామా ఇచ్చారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. ఎవరు ముందు-ఎవరు వెనుక అనేది పక్కన పెడితే, మొత్తం మీద రాజీనామా చేసిన వారిలో, పార్టీల కతీతంగా-లాయల్టీలకు అతీతంగా, ప్రాంతాభిమానంతో, కాంగ్రెస్-టిడిపి-వై ఎస్ ఆర్ టీంకు చెందిన వారున్నారు. కాంగ్రెస్ వారిలో, అందరి కంటే ముందే రాజీనామా చేసింది జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ కావడం గమనార్హం. అలానే అటూ-ఇటూ తిరుగుతున్న పలువురు కూడా వున్నారు. ప్రత్యక్షంగానో-పరోక్షంగా నో, రాజకీయ-రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే దిశగా, వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కేవలం ఎమ్మెల్యే పదవులకే కాకుండా మంత్రి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నామని పదకొండు మంది మంత్రులు ప్రకటించారు. జూపల్లి కృష్ణారావు యాత్రను అడ్డుకున్న డికె అరుణ, సందిగ్ధంగా వున్న సబితా ఇంద్రా రెడ్డి, కూడా రాజీనామా చేసిన వారిలో వుండడం విశేషం. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల, వాటి ఆమోదం అంత కష్టం కాకూడదు. వాస్తవానికి స్పీకర్ లేదని వాటి ఆమోదం ఆపాల్సిన అవసరం కూడా లేదు. స్పీకర్ కు సమాచారం అందించి, డిప్యూటీ స్పీకర్ కూడా ఆమోదించ వచ్చు. సమస్య ఇంతటితో ఆగి పోలేదు. రాజీనామా చేయని వారి సంగతి తేల్చు కుంటాం అన్న దాకా వ్యవహారం పోతోంది. రాజీనామా చేసిన కొందరు, రాష్ట్రపతి పాలన విధించినా సమ్మతమే అన్నట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిలో, తమ రాజీనామాలతో ఢిల్లీ దిగి రావాలని కొందరు, తెలంగాణ సాధనకు అనుకూలంగా రాజీనామా చేసిన తాము ఇక ముందు సామాన్య కార్యకర్తలుగా మిగిలి పోతామని ఇంకొందరు, తమది ధిక్కార ధోరణి కానే కాదని మరి కొందరు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడమే రాజీనామాలకు కారణమని ఇతరులు ప్రకటనలు చేస్తున్నారు. తమ వాహనాలకు ఎమ్మెల్యే అన్న స్టిక్కర్ తీసేసి "రాజీనామా చేసిన ఎమ్మెల్యే" అని పెట్టుకుంటామని అంటున్నారు పలువురు.

తెలంగాణా కాంగ్రెస్‌ నేతల రాజీనామా ప్రకటన, తదనంతర పరిణామాలు, నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వారంటుంటే, ఆమె ఆంతరంగాన్ని తమకు పరోక్షంగా ఆవిష్కరించిన రీతిలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అదే నిజమేనేమో అనిపిస్తుందిప్పుడు. ఇంత కాలం ఓపిక పట్టిన సదరు తెలంగాణ నాయకులు, గతంలో అధిష్టానం దూతలు ఎన్ని వాయిదాలు వేసినా నిశ్శబ్దం పాటించిన వారందరూ, ఇంత ధైర్యంగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధ పడ్డారంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఏదో ఒక తిరకాసు వుందేమో అనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను అధికారికంగా చూసేది తడవకొకరైతే (ఇప్పటి ఆజాద్ లాగా), అనధికారికంగా, అర డజన్ మందికి పైగా (గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ఆంటోనీ.. వగైరా...వగైరా) ఎల్లప్పుడూ చూస్తూనే వుంటారు. అందుకేనేమో, రాష్ట్ర వ్యవహారాల మీద మరింత నిశితంగా దృష్టి పెట్టిన అధినేత్రి, ఎవరిని ఎంతవరకు నమ్మాలో అర్థం కాని స్థితిలో, తన ఆంతరంగిక రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ ని నేరుగా రంగంలోకి దింపింది. ఈ యోధాను యోధులందరూ, కలివిడిగా-విడి విడిగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తమ శక్తివంచన లేకుండా, జటిలం చేయడంతో పాటు, తరతరాలుగా కలిసిమెలిసి వుంటున్న తెలుగు జాతిని-తెలుగు ప్రజలను, భౌగోళికంగా విడిపోయినా-పోక పోయినా, శాశ్వతంగా ఒకరికొకరు దూరమయ్యే స్థితికి చేరుస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో, హైదరాబాద్ నగరంలో రాచ కార్యాలు చక్కదిద్దేందుకొచ్చిన గులాం నబీ ఆజాద్, అర గంట వ్యవధిలో, ఒక వైపు తెలంగాణ వారిని-మరో వైపు సీమాంధ్ర నాయకులను కించ పరిచే విధంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా సోనియా హస్తముండొచ్చని కొందరు విశ్లేషకులంటున్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై కేశవరావు తీవ్రస్థాయిలో మండిపడి, ఆగ్రహం వ్యక్తం చేశారు. "ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు చనిపోతే అసెంబ్లీలో ఏనాడూ మాట్లాడలేదు. ఆయన ఏం మనిషి?'' అని కూడా కిరణ్ కుమార్ రెడ్డినుద్దేశించి కేకే వ్యాఖ్యానించారు. ఆజాద్ చెప్పిందంతా నాన్‌సెన్స్ అని, ఒక్క రోజులో తెలంగాణను ఇవ్వాలని తాము అడగలేదని, ప్రక్రియను ప్రారంభించాలనే అడుగుతున్నామని స్పష్టం చేశారు. మాటల తూటాలు వాడి-వేడిగా బయటికొస్తున్నాయి.

రాజీనామాల నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా వర్ణించిన ఆజాద్, అధిష్ఠానం పరిశీలనలో ఈ అంశం వుండగానే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సమస్య పరిష్కారానికి దోహద పడదన్న రీతిలో మాట్లాడడం తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులను కించపరిచినట్లు మాట్లాడడమే. ఆ సమయం ఇంకా రాలేదా? అని ప్రశ్నించిన విలేకరులతో, తెలంగాణపై నిర్ణయం అనేది ఒక్క నిమిషంలోనో... ఒక్క రోజులోనో తీసుకునే ది కాదనడం, సమస్యను మరి కొంతకాలం లాగడానికే తప్ప మరేమీ కాదు. ఆ తర్వాత కలిసిన సీమాంధ్ర ప్రతినిధులను ఢిల్లీకి రావద్దని ఆజాద్ సూచించినట్లు వార్తలొచ్చాయి. అంతవరకూ బాగానే వుంది...ఢిల్లీకి తిరగడానికి ధనం వృధా చేసే కన్నా, ఆ మొత్తాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి విరాళంగా ఇవ్వమని సూచించినట్లు కూడా వార్తలొచ్చాయి. అంటే, సీమాంధ్రులను కూడా ఒక విధంగా కించపరచడమే.

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో, జులై ఒకటో తేదీన, తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల భేటీ జరుగుతున్న సందర్భంలో-ఆ భేటీ కొన సాగుతుండగానే,... ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు-రాజ్య సభ సభ్యుడు, మేధావి కె.కేశవరావు సమావేశం మధ్యలో బయటికి వెళ్లి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు కోదండ రామ్, తెలంగాణ ఎన్ జీవో సంఘం నాయకుడు స్వామి గౌడ్, తెలంగాణ న్యాయవాదుల సంఘం నేతలతో భేటీ కావడం, తిరిగి సమావేశానికి వచ్చిన ఇరవై నిమిషాల్లోనే... రాజీనామాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా మతలబున్నదా అని కొందరు ఆలోచనలో పడ్డారు. ఆ మాటకొస్తే, రాజీనామా ప్రకటన నాటికి రెండు రోజుల ముందరే, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రి-తెలంగాణ వాది జానారెడ్డిని కలవడం వెనుక కూడా కొంత పకడ్బందీ వ్యూహం వుందని కూడా అంటున్నారు. ఇవేమీ కాదు...వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడా-ఎప్పుడా అని ఎదురు చూసిన సందర్భం, ఆయన పరోక్ష ప్రమేయంతోనే ఆసన్నమైందని మరి కొందరంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వారి రాజీనామా నిర్ణయం వెనుక పావులు వ్యూహాత్మకంగా కదిపిన కేశవరావు, జానారెడ్డిలు ఎటువంటి పరిస్థితుల్లోను వెనుకంజ వేయనీయకుండా చక్రం తిప్పుతున్న వ్యక్తులను ఎవరికి వారే తమకు తోచినవారిని వూహించుకుంటున్నారు.

కాంగ్రెస్ నాయకుల రాజీనామా ప్రకటన తెలుగుదేశంలోని తెలంగాణ వాదులలో కూడా వేడి పుట్టించింది. తామూ రాజీనామాలకు సిద్ధం అన్నారు. రాజీనామా రాజకీయాలు రాజ్యాంగ సంక్షోభం కలిగించవని-కేవలం, ఎక్కువలో ఎక్కువగా "రాష్ట్రపతి పాలనకు" దారితీయవచ్చునేమో నని వెటకారం చేస్తున్నవారూ లేకపోలేదు. రాష్ట్రపతి పాలన అంటే రాజ్యాంగ సంక్షోభం కాక మరేమవుతుందో ఆ వెటకారాలకే తెలియాలి! మరో వైపు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న అధినాయకుల్లో కూడా తెలంగాణ నాయకుల రాజీనామా అంశం విభజనకు దోహదపడవచ్చని మరి కొందరి భావన. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులలో ముఖ్యులైన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు రాజీనామాలు చేయబోమని చెబుతున్నారు. ఇలా సాగింది తొలి రెండు రోజుల డ్రామా. ఇక అక్కడినుంచి ఎంపీల సీను ఢిల్లీకి మారితే, ఎమ్మెల్యేల సీను హైదరాబాద్ కు పరిమితమైంది. రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు, కాంగ్రెస్ అధిష్టానం నుంచి, హైదరాబాద్ లో వున్న కొందరు కీలక నాయకులకు ఢిల్లీకి రమ్మని పిలుపొచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి.

రాజీనామాల విషయంపై వెనక్కి తగ్గ లేనంతగా ముందుకు వెళ్లిన ఎంపీలు సాధ్యమైనంత ఎక్కువ మందితో ఆ పని చేయించాలన్న భావనతో ఢిల్లీకి చేరుకున్న వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలిశారు. ఆయనను ఆ క్షణంలో, రాజీనామాకు ఒప్పించ లేకపోయినా, తమకు అనుకూలంగా సంఘీభావం ప్రకటించే దాకా ఆయనలో కదలిక తేగలిగారు. వారక్కడున్న సమయంలోనే-ఎంపీల సమక్షంలోనే, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌లు జైపాల్ రెడ్డితో వేర్వేరుగా మాట్లాడినట్లు సమాచారం. రాజీనామాల నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలని అడిగారు వారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఎంపీలు రాజీనామాలపై నిర్ణయం మార్చుకునే పరిస్థితి లేదని వారితో జైపాల్ స్పష్టం చేశారట. కాంగ్రెస్-టిడిపి సభ్యుల రాజీనామా లింకా కాగితం మీదకు రాక ముందే, ఒక అడుగు ముందుకు వేశారు బహిష్కృత-అసమ్మతి తెలుగు దేశం ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా..తమ శాసనసభ్యత్వాలకు నాగం జనార్దనరెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న రాజీనామా చేశారు. నాగం చేపట్టిన 'తెలంగాణ ఐక్యత దీక్ష' వేదిక నుంచే ఆదివారం వీరు రాజీనామాలు చేశారు.

తెలుగు దేశం పార్టీకి చెందిన వారు తమ నాయకుడి ఆదేశం మేరకే రాజీనామా చేశామని చెప్పడం విశేషమా? లేక, కాంగ్రెస్ వారు, తమ నాయకురాలి ఆదేశం లేకుండానే రాజీనామా చేశామని చెప్పడం గొప్పా? ప్రజలే తేల్చాలి. ఇక ముందెలాంటి పరిణామాలు జరుగనున్న యో కాని, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తన కోర్టులో పడిన బంతిని ఎలా బయట పడెయ్యాలా అన్న మీమాంసలో పడిపోయింది. నిమిషం కూడ ఆలశ్యం చేయకుండా కీలకమైన వ్యక్తులను ఢిల్లీకి పిలిపించే ప్రయత్నంలో మునిగింది. ఏదేమైనా, రాజీనామాలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తాయా? లేక, మరింత వెనుకబడే ట్లు చేస్తాయా? ఇవేమీ కాకుండా, ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు మరింత పెరగడానికి నాంది పలుకుతాయా? ఇప్పుడిప్పుడే చెప్పడం కష్ట మేమో!

Wednesday, October 20, 2010

అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు?: వనం జ్వాలా నరసింహారావు

అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు
ఆద్యులెవరు? బాధ్యులెవరు?
వనం జ్వాలా నరసింహారావు

కర్నాటక సంక్షోభం నేపధ్యంలో, రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలొచ్చాయి. నిర్ణయం తీసుకోవాల్సిన యూపీఏ కేంద్ర ప్రభుత్వం, దానికి సారధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, కారణాలేవైనప్పటికీ, తాత్సారం చేయడంతో, ఈ లోగా మరో సారి బల పరీక్షకు యడియూరప్పకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో, ఆయనందులో గెలవడంతో, ప్రభుత్వం మరికొంతకాలం మనుగడ సాగించే వీలు కలిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంతో-ఇంతో అపహాస్యం పాలైనప్పటికీ, రాష్ట్రపతి పాలన వాయిదా పడింది. గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన విధించినట్లయితే, దేశవ్యాప్తంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నిరసన ధ్వనులు వినిపించేవి. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలం పదవిలో కొనసాగనీయకుండా, అప్రజాస్వామికంగా కూల దోయడం ఆరంభించింది కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ, ఆ సాంప్రదాయాన్ని తొలి కాంగ్రేసేతర జనతా సంకీర్ణ ప్రభుత్వం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. అధికారంలో వున్నప్పుడొక నీతి, ప్రతిపక్షంలో వున్నప్పుడు మరొక నీతి పాటించడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే బాటలో నడవడంతో, మెరుగైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సిన సత్ సంప్రదాయాలకు పునాదులు పడలేదు.

దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన మొదటి బీజేపీ ప్రభుత్వం కర్నాటకలోనే. పూర్తి మెజారిటీకి కావాల్సినంతమంది మద్దతు లేకపోయినా, అచిర కాలంలోనే అతి చాకచక్యంగా మెజారిటీ పొందగలిగారు. స్వతంత్ర సభ్యులను ఏదో విధంగా తమ పక్షం తిప్పుకోగలిగారు యడియూరప్ప. గాలి సోదరుల మద్దతు-తిరుగు బాటుల మధ్య ఆయన ప్రభుత్వం మనుగడ సాగించినప్పటికీ, సంక్షోభంలో పడక తప్పలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే అంకెల గారడీ అని సోదాహరణంగా నిరూపించారు యడియూరప్ప. ఆయన పార్టీకి చెందిన సభాపతి, బీజేపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన పదకొండు మంది పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు ఇండిపెండెంటు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుచేసి, గవర్నర్ ఆదేశం మీద జరిగిన బల పరీక్షలో యడియూరప్పకు విజయం చేకూర్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడానికి, రాజ్యాంగం ప్రకారం అధికారాలున్న సభాపతి, గవర్నర్ తమ వంతు పాత్రను పోషించారు. ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికైన వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం తప్పే. అంతకు ముందు ఇండిపెండెంట్లుగా ఎన్నికై, బీజేపీ తీర్థం పుచ్చుకుని, తర్వాత క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడడం కూడా తప్పే. మెజారిటీ కొరకు వారిని బీజేపీ లో చేర్చుకోవడమూ తప్పే. సాధారణంగా, ఫిరాయింపుల చట్టం కింద, పార్టీ విప్ ధిక్కరించి ఓటేసిన తర్వాత సభ్యత్వం రద్దు చేయడం ఆనవాయితీ. కర్నాటకలో స్పీకర్ ఒకడుగు ముందుకు వేసి, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండానే బీజేపీ-ఇండిపెండెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేశారు. బంతిని కోర్టులో విసిరారు అంతా కలిసి.

శాసన నిర్మాణ, న్యాయ నిర్ణయ, కార్య నిర్వహణ వ్యవస్థల మధ్య "అదుపులూ, అన్వయాలూ" అనే రాజ్యాంగ స్ఫూర్తి, సమన్వయం-సమ న్యాయం వుండేలా వ్యవహరించడం వల్లే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ సాగించే వీలు కలుగుతోంది. కర్నాటక వ్యవహారంలో, శాసన సభ స్పీకర్కు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేసే తిరుగులేని రాజ్యాంగాధికారం వున్నప్పటికీ, దాన్నెవరూ ప్రశ్నించ లేనప్పటికీ, న్యాయ నిర్ణయ వ్యవస్థ విచారణ చేసే వీలు కలిగింది. ఇక న్యాయ నిర్ణయ వ్యవస్థ విషయానికొస్తే, అంచెలంచల ఏర్పాటుతో పనిచేసే ఆ వ్యవస్థలో ఒక స్థాయిలో న్యాయం జరగలేదని భావించినప్పుడు, పై స్థాయిలో న్యాయం కొరకు ప్రయత్నం చేసే వీలుంది. కాకపోతే, ఈ వ్యవస్థలన్నీ కేవలం రాజ్యాంగ ప్రకరణాలకు లోనై మాత్రమే పనిచేసేకంటే, సత్ సంప్రదాయాలను నెలకొల్పుకుంటూ పనిచేయడం మంచిది. అలా జరుగుతుండడం వల్లే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ దేశంలో, కాగితంపై రాసుకున్న రాజ్యాంగం లేకపోయినా, సాంప్రదాయాల ప్రాతిపదికపై, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోంది. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మనం, వారి వారసత్వంగా చెడును స్వీకరించ గలిగినప్పుడు, మంచినెందుకు అలవర్చుకోలేకపోతున్నామో?

గవర్నర్ గా నియమించబడిన, కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీకి అనుకూలురైన వ్యక్తికి, ఆ వ్యక్తి ద్వారా రాష్ట్రపతికి (అదే రాజకీయ పార్టీ అభ్యర్థిగా పదవిలోకి వచ్చిన వ్యక్తి), కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వున్న పార్టీకి, 356 రాజ్యాంగ ప్రకరణ "రక్షక కవచం" లాంటిది. ఆఖరు ప్రయత్నంగా ఉపయోగించాల్సిన అధికారాన్ని, మొదటి అస్త్రంలాగా-అదీ బ్రహ్మాస్త్రంలాగా వాడుకునే ప్రకరణైంది. దాన్ని ప్రయోగించే ముందు జరగబోయే పరిణామం సత్ సంప్రదాయానికి దారి తీస్తోందా, దుష్ట సంప్రదాయమౌతుందా అని ఒక్క క్షణం ఆలోచించి చేస్తే బాగుంటుంది. దురదృష్ట వశాత్తు అలా జరగక పోవడం వల్ల, కర్నాటక గవర్నర్ తొందర పడ్డాడని భావించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని అనాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోవటానికి ప్రధాన కారణం 356 రాజ్యాంగ ప్రకరణమంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాలలో అధికారంలో వున్న పార్టీ స్థానంలో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీని తెచ్చే ప్రక్రియగా ఆ ప్రకరణంను ఉపయోగించుకునే సంప్రదాయం మొదలైంది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రెండు సంవత్సరాలకే, పంజాబ్‌లో, "రాజ్యాంగ యంత్రాంగం" భగ్నం కావడం, జూన్ 1951 లో రాష్ట్రపతి పాలన విధించడం, ఆ సంప్రదాయం ఎన్నో పర్యాయాలు అదే రాష్ట్రంలో నెలకొనడం జరిగింది. అసలు సిసలైన ప్రజాస్వామ్య ఖూనీ కేరళ రాష్ట్రంలో ఆ తర్వాత జరిగింది. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనలో గడపని రాష్ట్రాలు దాదాపు లేనట్లే. కనీసం వంద సార్లకు పైనే రాష్ట్రపతి పాలన వివిధ రాష్ట్రాల్లో విధించడం జరిగింది. 1957 లో ప్రపంచ చరిత్రలోనే మొదటి సారి బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రెండేళ్లకే 1959 లో రద్దుచేసి, కేరళలో రాష్ట్రపతి పాలన విధించింది అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. అలా అప్రజాస్వామిక సంప్రదాయం నెలకొల్పింది ఎవరో కాదు-ప్రపంచంలో ప్రజాస్వామ్య వాదిగా ప్రసిద్ధికెక్కిన జవహర్లాల్ నెహ్రూ. ఆ చర్యకు ప్రేరణ ఇచ్చిన అలనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎవరో కాదు-ప్రజాస్వామ్య నియంతగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధి. అప్పట్లో ఆ చర్యకు బలైంది కమ్యూనిస్టులు కాబట్టి, కాంగ్రెస్ లోని ప్రజాస్వామ్య వాదులు కాని, కమ్యూనిస్టేతర ప్రతిపక్ష నాయకులు కాని నిరసన తెలియచేయలేదు. అచిర కాలంలోనే, తమ వంతు కూడా వస్తుందని కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు అప్పుడే అనుకుంటే బాగుండేది. అప్పట్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఇంకా రాష్ట్రాలలో అధికారంలోకి రావడం మొదలు కాలేదు. వచ్చిన ఒకే ఒక్కటి కమ్యూనిస్టు పార్టీకి చెందింది కావడం, దాన్నీ అధికారంలో కొనసాగనీయక పోవడం భవిష్యత్ లో జరగబోయే పరిణామాలకు సంకేతమని కాంగ్రేసేతర పార్టీలు పసిగట్టలేక పోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా, అదే అస్త్రం తమపై ప్రయోగించే అవకాశం వుందని భావించలేదు.

1967 కు పూర్వం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలలోను, కేంద్రంలోను తిరుగులేని మెజారిటీ వుండేది. ఆడింది ఆట-పాడింది పాట. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి (పదవి కొరకు)ఫిరాయింపులుండేవి కాని, కాంగ్రెస్ నుంచి బయటకు పోవడం వుండకపోయేది. నాలుగో సాధారణ ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలింది. కిచిడీ సంకీర్ణ ప్రభుత్వాలనేకం రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ఆయారామ్-గయారామ్లె ఫిరాయింపు పర్వాలు మొదలయ్యాయి. సుమారు పది సంవత్సరాల కాలంలో, పదమూడు రాష్ట్రాలలో పాతిక పర్యాయాలకు పైగా "రక్షక కవచం" ఉపయోగించి, గవర్నర్ల సహకారంతో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. "రాజకీయ ప్రతిష్టంభన" సాకు చూపి, శాసన సభలను రద్ధుచేసి, పరోక్షంగా కాంగ్రెస్ పాలన సాగిందా రోజుల్లో. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ పనిచేయడానికి రాజకీయ జోక్యం కావాలి కాని, ఆ జోక్యం రాజ్యాంగాన్ని-సంప్రదాయాలను అపహాస్యం చేసే స్థితికి పోకూడదు. ఉదాహరణకు, "శాంతి భద్రతల ప్రతిష్టంభన" ఏర్పడిందన్న సాకుతో, 1967 సాధారణ ఎన్నికల్లో గెలిచి అధికారంలొకొచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని 1968 లో రద్దుచేసి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రధాన మంత్రి కాగానే, ఆయన ధర్మ సంస్థాపన, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల దోయడంతో ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో వున్న అర డజన్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో జనతా పార్టీ లోక్ సభ సభ్యులు గెలిచి నందువల్ల, ఆ ప్రభుత్వాలకు ప్రజల మద్దతు లేదన్న సాకుతో మొరార్జీ వాటిని రద్దుచేయడం మరో దుష్ట సంప్రదాయం. శాసన సభ్యులుగా ఓటర్లు ఐదేళ్ల కాలపరిమితికి ఎన్నుకున్నారన్న ప్రజాస్వామ్య ప్రాధమిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారాయన.

ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినవైనప్పటికీ, ఆ చర్యలు ఏ పార్టీకి వ్యతిరేకంగా జరిగినవైనప్పటికీ, పార్టీలకతీతంగా ఖండించక పోవడం వల్ల, దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు, ఎంతో కొంత అన్యాయం జరుగుతూనే వుంది. అదే విధంగా నియంతృత్వ ధోరణులు అనుకరిస్తున్న ప్రభుత్వం లోని పార్టీ ఏదైనా, ఆ ధోరణి వల్ల నష్టపోయింది ఎవరైనా, తీవ్రంగా ఖండించకపోతే, వాటికి ఎవరైనా బలికావొచ్చు. ఉదాహరణకు, 1962 లో, చైనాతో యుద్ధం జరిగిన నేపధ్యంలో, పీడీ చట్టం కింద సీపీఎం కు చెందిన వేయి మందికి పైగా పార్టీ కార్యకర్తలను దేశవ్యాప్తంగా నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. నిర్బంధంలో తీసుకుంది కమ్యూనిస్టులనే కదా అన్న ధోరణిలో, ప్రభుత్వ చర్యను ఖండించిన కాంగ్రెస్-కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు లేనే లేవు. ఆ తర్వాత ఏమైంది? చరిత్ర పునరావృతమైంది. ఇందిరా గాంధీ, ఎమర్జెన్సీ రోజుల్లో, దేశవ్యాప్తంగా వారూ-వీరూ అనే భేదం లేకుండా, తనను వ్యతిరేకించిన స్వపక్షీయులతో సహా, అన్ని రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధించింది. 1959 లో, 1962 లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను అన్ని రాజకీయ పార్టీలు ఖండించినట్లయితే, నూరు పర్యాయాలు రాష్ట్రపతి పాలనలు విధించడం కాని, వేలాది మంది ప్రజాస్వామ్య వాదులను నిర్బంధించడం కాని జరిగుండేది కానేకాదు. అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? అన్ని రాజకీయ పార్టీల వారు ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిదే మో! అంకెల గారడీ తో గండం గట్టెక్కిన యడియూరప్ప, తనకు మద్దతు లభించింది 106 మంది శాసన సభ్యులదే కాని, 113 మందిది కాదని, తనకు ప్రభుత్వం నడిపే నైతిక హక్కు లేదని భావించాలి. చట్ట ప్రకారం బలాన్ని నిరూపించుకున్నందున, శాసన సభను రద్దు చేయమని, తిరిగి ఎన్నికలు నిర్వహించమని గవర్నర్‌ను కోరి, సత్ సంప్రదాయాన్ని నెలకొల్పితే మంచిది. ఆ విధంగానన్నా, గవర్నర్‌కు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఇవ్వకుండా చూడాలి.