Showing posts with label నేలకొండపల్లి. Show all posts
Showing posts with label నేలకొండపల్లి. Show all posts

Wednesday, July 17, 2013

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు-కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

          డబ్బై దశకంలో మా చుట్టు పక్కల గ్రామ పంచాయితీలున్న పాలేరు సమితి, ఖమ్మం పంచాయితీ సమితిగా మారడం, మా గ్రామాలన్నీ అందులోకి రావడం జరిగింది. సమితి సభ్యులలో గణనీయమైన సంఖ్య కలిగి వున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) బలమైన ప్రతి పక్షంగా వ్యవహరిస్తుండేది. జిల్లా రాజకీయాలకు సంబంధించినంతవరకు, కాంగ్రెస్ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయి, ఒక వర్గం శీలం సిద్దారెడ్డి నాయకత్వంలో, మరో వర్గం జలగం వెంగళ్ రావు నాయకత్వంలో పని చేయసాగాయి. ఇద్దరూ కొంతకాలం మంత్రులే. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా వెంగళ్ రావు ముఠాకు చెందిన వ్యక్తి వుండేవాడు. ఖమ్మం సమితికి ఆయన అనుంగు శిష్యుడు సామినేని ఉపేంద్రయ్య అధ్యక్షుడు. సమితి అధ్యక్షుడుగా వుంటూ, ఆ అధికార దర్పంతో, గ్రామాలలో ముఠా తగాదాలను ప్రోత్సహించేవాడని ఆయనకు పేరుంది. ఖానా పురం, ముదిగొండ, వల్లభి గ్రామాలలో కక్షలు ప్రబలిపోవడానికి ఆయనే కారణం. కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తుండే, ఖానా పురం గ్రామ వాసి వేదాద్రి హత్యలో అతడి పాత్ర వుందనేవారు.

          కాంగ్రెస్ పార్టీ ముఠా తగాదాలు, చివరకు సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్యపై, సిద్దారెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దారి తీశాయి. నాడు సిపిఎం పార్టీ పక్షాన ఖమ్మం ఎమ్మెల్యేగా వున్న రజబ్ అలీ సహాయంతో, సమితిలోని ఆ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని, తన పదవిని నిలబెట్టుకున్నాడు ఉపేంద్రయ్య. తనకు సహాయం చేసిన పార్టీ అన్న విశ్వాసం కూడా లేకుండా, అదే పార్టీ కార్యకర్తలపై, మా చుట్టుపక్కల గ్రామాల కమ్యూనిస్టులపై దాడులు ప్రారంభించాడు ఉపేంద్రయ్య. బాణాపురం గ్రామంలో గండ్లూరి కిషన్ రావు నాయకత్వాన సాగుతున్న వ్యవసాయ కార్మిక రైతు కూలీ పోరాటాన్ని అణచివేయాలని పథకాలు పన్నుతున్న భూస్వాములను చేరదీశాడు. మా నాన్న పట్వారీగా పనిచేస్తున్న అమ్మపేట గ్రామ సర్పంచ్, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడైన కోయ వెంకట్రావును, కాంట్రాక్టుల ప్రలోభం చూపించి తనవైపు తిప్పుకున్నాడు. కోయ వెంకట్రావు సహాయంతో గంధ సిరి గ్రామం మీద దాడి చేయించాడు. ఆ దాడిని గ్రామ ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టారు. నాటి నుంచి వెంకట్రావు, ఉపేంద్రయ్యకు కుడి భుజంగా వ్యవహరించసాగాడు. బాణా పురంలో వుంటుండే వెంకట్రావు తమ్ముడు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని కోయ సత్యంను తన వైపు తిప్పుకున్నాడు అన్న. భవిష్యత్‍లో బాణా పురంతో సహా పరిసర గ్రామాలలో జరిగిన అనేక దాడులలో అన్నదమ్ములిద్దరు ముందుండేవారు. వారిద్దరితో పాటు మా మరో సరిహద్దు గ్రామం పమ్మికి చెందిన చిన కోటయ్య, పెద కోటయ్యలను కూడా చేరదీశాడు ఉపేంద్రయ్య. మిగిలిన గ్రామాల విషయం ఏమైనప్పటికీ, బాణా పురంలో మాత్రం కిషన్ రావు నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేయసాగాడు ఉపేంద్రయ్య. ఆ గ్రామ భూస్వాములను చేరదీసి, డబ్బు పోగు చేశాడు. దెబ్బ తీయడానికి కాచుక్కూర్చున్నాడు. వారి పథకంలో భాగంగా, వారి పంచన పడి వున్న భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించేందుకు, బాణా పురం, పమ్మి, పెద మండవ, అమ్మ పేట లాంటి కీలక గ్రామాలలో పోలీసు క్యాంపులు వెలిశాయి.


1970 జనవరి నెల రెండో వారంలో, ఉపేంద్రయ్య కుట్రలను వివరించడానికి, కమ్యూనిస్ట్ పార్టీ గ్రామగ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఒకనాటి రాత్రి పమ్మి గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో గండ్లూరి కిషన్ రావు ప్రసంగిస్తున్న సమయంలోనే, అంతకు ముందే సిద్ధం చేసుకున్న ఒక పథకం ప్రకారం, బాణా పురంలో కోయ సత్యం నాయకత్వాన భూస్వాములు-వారి అనుయాయులు, స్థానిక పోలీసు క్యాంపు సహకారంతో, గ్రామంలో వున్న కమ్యూనిస్టులపై కవ్వింపు చర్యలకు దిగారు. ఎదురు తిరిగిన వారిని అమానుషంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, గ్రామంలో లేని కిషన్ రావుపైన పోలీసు కేసులు పెట్టించారు మర్నాడు. అలనాటి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దుర్గా ప్రసాద రావు తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని బహిరంగంగానే అనుకుండేవారు. పమ్మిలో మీటింగు ముగించుకుని గ్రామం చేరుకున్న కిషన్ రావును, ఆయన వెంట వచ్చిన జిల్లా సిపిఎం నాయకుడు రావెళ్ల సత్యం గారిని పోలీసులు విచారణ పేరుతో క్యాంపుకు పిలిపించారు. గ్రామంలోని సుమారు వంద మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను కూడా క్యాంపుకు పిలిపించారు. ఒక విధంగా అందరినీ అక్కడ బంధించారనాలి. ఆ తరువాత గుండాలు, పోలీసుల సహాయంతో దాడులు చేశారు. ఇదేం అన్యాయమని నిలదీసిన రావెళ్ల సత్యం గారిని గ్రామం విడిచి వెళ్లమని హుకుం జారీ చేశారు. ఎదురు తిరిగిన సత్యం గారిని ఏమీ చేయలేక పోయారు. గ్రామంలోనే వుండి పోయిన సత్యం గారు, చిత్ర హింసలకు గురైన గ్రామస్తులకు అండగా నిలిచారు. పోలీసు క్యాంపులో వున్న గండ్లూరి కిషన్ రావును, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులైన ముక్కా చిన నర్సయ్యను, అప్పి రెడ్డిని హింసించారు పోలీసులు. ఇదంతా సరిపోదన్నట్లు, అందరినీ తాళ్లతో బంధించి, నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

బాణా పురం గ్రామంలో జరిగిన దాడులకు నిరసనగా, వేలాది మంది చుట్టు పక్కల గ్రామాల వారు, వూరేగింపుగా వెళ్లి, ఖమ్మంలో బస చేస్తున్న నాటి హోం మంత్రి వెంగళ్ రావుకు మెమొరాండం ఇచ్చారు. ఆ నాడు జరిగిన బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోటూరు హనుమంత రావు హాజరై, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హోం మంత్రిగారు ఉత్తుత్తి వాగ్దానాలు చేశారు కూడా. బాణా పురంలో అలనాడు జరిగిన హింసా కాండలో ముక్కా చిన నర్సయ్య, పెరుమాళ్ల చంద్రయ్య లతో సహా కిషన్ రావు కూడా శారీరకంగా బాధలకు గురయ్యారు చాలా రోజుల వరకు. గుండాల దాడులు, కవ్వింపు చర్యలు, పోలీసులు బనాయించే దొంగ కేసులు నిత్య కృత్యమయ్యాయి. ఈ నేపధ్యంలో, కమ్యూనిస్ట్ కార్యకర్తలిచ్చిన మెమొరాండాన్ని విచారించాల్సిన హోం మంత్రి జలగం వెంగళ్ రావు, అది చేయకపోగా, బాణా పురం గ్రామానికి స్వయంగా వచ్చి, భూస్వాములతో సమావేశమై, "మీకు నేను అండగా వుంటా" నని హామీ ఇచ్చి వెళ్లాడు! కాకపోతే, సుమారు రెండు వందల మంది పోలీసు బలగంతో మాత్రమే ఆయన ఆ రోజు బాణా పురం రాగలిగాడు! ఇది జరిగిన కొన్నాళ్లకు, మా గ్రామ సరిహద్దు గ్రామైన పమ్మిలో కమ్యూనిస్ట్ వ్యవసాయ కూలి సంఘ కార్యకర్త పెరుమాళ్ల చంద్రయ్యను పట్ట పగలే బండ రాళ్లతో కొట్టి చంపారు. ఆ వూళ్లో పోలీసు క్యాంపు కూడా వుండేదప్పుడు. కాకపోతే, క్యాంపులోని పోలీసులు గుండాలకే మద్దతిచ్చేవారు. కోర్టులో ఆ కేసు నీరు కారి పోయింది. చంద్రయ్యను చంపిన కొన్నాళ్లకు, మందా నారాయణ అనే మరో వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు అదే పమ్మి గ్రామంలో.

పమ్మి హత్యాకాండ, పోలీసు కాల్పులు, హంతకులకు సహాయ పడుతున్న పోలీసు వ్యవహార శైలి.....ఇవన్నీ...బాణా పురం భూస్వాములలో ఉత్సాహాన్ని నింపింది. ఒక పథకం ప్రకారం, గండ్లూరి కిషన్ రావు కుడి భుజంలా పని చేస్తున్న ముక్కా చిన నర్సయ్యను హత్య చేశారు. 1970 వ సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో అనుకుంటా, చిన నర్సయ్య కోర్టు కేసుమీద ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లే దారిలో, భూస్వాముల గుండాలు కాపు కాచి, గండ్ర గొడ్డళ్లు, బరిశెలతో ఆయనపై దాడి చేశారు. తప్పించుకునే వీలు లేకుండా దెబ్బ తీశారు. హత్య చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను ఖమ్మంలో వున్నాను. బాబాయి నర్సింగ రావుకు ఈ వార్త తెలిసింది. వెంటనే నేలకొండపల్లి వెళ్దామన్నాడు. తోడల్లుడు జూపూడి ప్రసాద్ కారు తీసుకుని నేలకొండపల్లి వెళ్లి నర్సింగ రావును అక్కడ దింపి వచ్చినట్లు గుర్తుంది. బహుశా అది అప్పటికి మూడో హత్య అనుకుంటా. ఇంతలో పంచాయితీ ఎన్నికలొచ్చాయి. ఏమైనా సరే.... సాధ్యమై నన్ని గ్రామ పంచాయితీలను గెలిచి, సమితిని, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని జలగం ముఠా, ఆయన అనుయాయుడు ఉపేంద్రయ్య పథకం రూపొందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా బాణా పురం గ్రామ పంచాయితీని గెలవాలని పంతం పూనారు. కమలాపురం, గంధ సిరి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) లకు దక్కాయి. మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో, మొట్టమొదటి సారిగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి, పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంది. పమ్మిలో పోటీ తీవ్రంగా వుండేది. అయినా కమ్యూనిస్టులే గెలిచారు. నాచే పల్లిలోనూ అంతే. తొలుత బాణా పురం ఎన్నికలు జరగకుండా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు భూస్వాములు. ఎన్నికలు జరిగిన గ్రామాలలో చాలా భాగం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు, లేదా, సిద్దా రెడ్డి వర్గం అభ్యర్థులు గెలిచారు. ఉపేంద్రయ్య వర్గానికి అతి తక్కువ సీట్లొచ్చాయి మా ప్రాంతంలో. బాణా పురంలో స్టే ఎత్తి వేసింది కోర్టు. ఎవరెన్ని ఎత్తులు వేసినా, ఒక్క వార్డు (భూస్వాముల ఇళ్లున్న వార్డు) మినహా అన్నీ సిపిఎం పార్టీ గెలుచుకుంది. గండ్లూరి కిషన్ రావు మళ్లీ సర్పంచ్ అయ్యాడు. ఎన్నికల సమయంలో భూస్వాములు చేయని అరాచకం లేదు. ఐనా, ఓటమి తప్పలేదు.

          ఖమ్మం సమితికి సిపిఎం అభ్యర్థి రాయల వీరయ్య అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సిద్దారెడ్డి వర్గానికి దక్కింది. సిపిఎం అభ్యర్థి టి. వి. ఆర్ చంద్రం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడయ్యారు.

          ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది!

ఇదిలా వుండగా....మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో కూడా పోలీసు క్యాంపు వుండేది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు (అతడు 1970 పంచాయితీ ఎన్నికలలో వార్డు మెంబరుగా లాటరీలో గెలిచాడు. సర్పంచ్ గా మా పెదనాన్న గారి కుమారుడు వనం వరదా రావు ఎన్నికయ్యాడు) పోలీసుల అండతో గ్రామంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య పూర్వాపరాలు నాకింకా గుర్తున్నాయి. బహుశా సంక్రాంతి ముందు రోజనుకుంటా....నేను, మా ఆవిడ, మా ఇంటి నుంచి దగ్గర లోనే వున్న మా తోడల్లుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే కనిపించాడు వెంకట్రావు. ఒకరినొకరు పలకరించుకున్నాం. అప్పట్లో గ్రామంలో అతడికి పూర్తి వ్యతిరేకత వున్న కారణాన భయంతో ఖమ్మంలోనే వుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. ఎందుకో ఆ నాడు బాగా తాగి మా వూరు వెళ్లే ప్రయివేటు బస్సు ఎక్కి వాళ్ల వూరుకు బయల్దేరాడు. అప్పుడు మా పెద్దమ్మాయి బుంటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు. భోగి పండ్లు పోయడానికి మా అమ్మ ఖమ్మంలో ఆగింది. ఆ కార్యక్రమం అయిపోయింతర్వాత అమ్మను మా వూళ్లో దింపడానికి తోడల్లుడి కారులో రాత్రి పొద్దు పోయిన తరువాత బయల్దేరాం. వూళ్లోదాకా కారు పోయే వీలు లేనందున వూరి బయటే ఆపి అమ్మను ఇంటిదగ్గర దింపడానికి నడుచుకుంటూ పోయి దింపి వెనక్కు వచ్చాం. తిరిగి ప్రయాణమై ఖమ్మం చేరుకున్నాం. ఆ మర్నాడు మాకు తెలిసిన వార్త....కోయ వెంకట్రావును, మా గ్రామంలో బస్సు దిగగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకు పోయారని, అమ్మపేట తీసుకు పోయి హత్య చేసారని. సరిగ్గా అతడిని మా వూరి నుంచి తీసుకుపోయే సమయానికే నేను మా అమ్మను కారులో మా వూరికి వెళ్లడం యాధృఛ్చికం అయినప్పటికీ, నాకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండడం వల్ల, నాపై కూడా అనుమానం వచ్చింది కాని దానిని మా గ్రామ పటేల్ తుల్లూరి రామయ్య ఖండించాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, ఉపేంద్రయ్య, కమ్యూనిస్ట్ పార్టీపై ధ్వజ మెత్తాడు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును(శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రా రెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రా రెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గంధ సిరి గుండాలు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అరాచకం చేశారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అయితే, గంధ సిరి గుండాలు బాణా పురంపైన మాత్రం దాడి చేయలేకపోయారు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. తిరిగి ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు.


దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట" ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల అధీనంలో లేదు. అలాంటి నాయకులూ లేరు. 

Monday, May 27, 2013

బయ్యారం గనుల వ్యవహారంలో తెలియని కోణాలు: వనం జ్వాలా నరసింహారావు


బయ్యారం గనుల వ్యవహారంలో తెలియని కోణాలు
వనం జ్వాలా నరసింహారావు

          వైఎస్ హయాంలో రక్షణ స్టీల్స్ కు కేటాయించిన బయ్యారం గనులను, రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసి, విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడంతో వివాదం చెలరేగింది. "బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు" అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు, వారితో సహా పలువురు ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడమే కాకుండా, ఎట్టి పరిస్థితుల్లోను అక్కడి నుంచి ముడిసరుకు తరలి పోకుండా అడ్డుకుంటామని సవాలు విసిరారు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లా వాసిగా, బయ్యారం గనుల గురించి చిన్నతనం నుంచే వింటున్న వ్యక్తిగా, ఎప్పుడో 60 ఏళ్ల కిందే అక్కడ గనుల నుంచి ముడిసరుకు వెలికి తీసి విదేశాలకు రవాణా చేశారని ఆ నోటా ఆనోటా తెలుసుకున్న వాడిగా కొన్ని విషయాలు పాఠకులతో పంచుకునే ప్రయత్నమే ఇది.

          ఖమ్మం జిల్లాలో స్వర్గీయ మూల్పూరి అక్కయ్య చౌదరి గురించి వినని వారు లేరు. ఆయనో వ్యాపార వేత్త. ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లితో సహా జిల్లాలోని పలు ప్రదేశాలలో రకరకాల వ్యాపారాలు చేసేవారు. కవి, రచయిత కూడా. ఆయనగారికి మైనింగ్ మీద అమితమైన మక్కువ. ఖమ్మం జిల్లాలో అనేక ప్రదేశాలలో రకరకాల గనులున్నాయని, అపారమైన ఆ ఖనిజ సంపదను వెలికి తీసి వ్యాపారం చేయాలని అనుకునే వ్యక్తుల్లో ఆయన ప్రథముడు. 1909 జులై నెలలో జన్మించిన ఆయన తన 80 వ ఏట 1989 నవంబర్‌లో మరణించారు.  నిజానికి "బయ్యారం అంటే అక్కయ్య చౌదరి అని, అక్కయ్య చౌదరి అంటే బయ్యారం అని" ఆ ప్రాంతంలో అనుకునే వారు ఆ రోజుల్లో. ఆయన నేపధ్యం, అభిలాష తెలుసుకున్న బయ్యారం చుట్టుపక్కల గ్రామస్థులు కొందరు, వాళ్ల వూళ్లో కాకి రాయి, ఎర్ర రాయి వుందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు 1953 ప్రాంతంలో. అక్కయ్య చౌదరి వెంటనే తనకు తెలిసిన కొందరు శాస్త్రవేత్తలతో ఆ పరిసరాలను అధ్యయనం చేయించి, అక్కడ లభించే ముడిసరుకుని విశ్లేషణ చేయించారు. అక్కడ రాయిలో 62%-64% వరకు ఫెర్రిక్ కన్టెన్ట్ వుందని తేలడంతో, నాటి హైదరాబాద్ ప్రభుత్వానికి చెందిన గనుల శాఖాధికారులను కలిశారు. బయ్యారం గ్రామంలోని 1500 ఎకరాలను, పక్కనే వున్న ఇర్సలాపురం గ్రామంలో 986 ఎకరాలను ఖనిజం తవ్వేందుకు లీజుకు తీసుకున్నాడాయన. అంటే ఎప్పుడో 60 ఏళ్ల కిందే అక్కడ గనులను ప్రభుత్వం లీజుకిచ్చింది అన్న మాట. అక్కయ్య చౌదరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేంతవరకు బయ్యారంలో ఉక్కు ఖనిజం వుందన్న సంగతే ఎవరికీ తెలియదు. ఆ తరువాత సుమారు పదేళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖకు చెందిన భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎస్సార్ శర్మ, అప్పావధానులు అక్కడ అధ్యయనం చేసి సుమారు నూట పది లక్షల టన్నుల ఇనుప ఖనిజం అక్కడ లభ్య్యమవుతుందని అంచనా వేశారు. ఈ నాటికీ అదే శాస్త్రీయ అధ్యయనం. కాకపోతే  అందులో సగం మాత్రమే 62%-64% ఫెర్రిక్ కన్టెన్ట్ వుంటుందని అంచనా వేశారు వాళ్లు.


          అక్కయ్య చౌదరి 1954 లో గనులను లీజుకు తీసుకుని, మైనింగ్ చేసి, ముడిసరుకును సరాసరి జపాన్ కు ఎగుమతి చేసేవారు. అప్పట్లో చౌదరి మైనింగ్ కంపెనీ పేరుతో సగటున ఏడాదికి 20,000 టన్నుల ముడిసరుకును ఎగుమతి చేసేవారట. బయ్యారం నుంచి విజయవాడ వరకు లారీలలో, అక్కడినుంచి బందర్ (మచిలీపట్నం), కాకినాడలకు పడవలలో తీసుకెళ్లి, బందర్-కాకినాడలనుంచి జపాన్ కు పంపేవారు. అక్కయ్య చౌదరికి చెందిన చౌదరి మైనింగ్ కంపెనీకి 50%  వాటా, మిగిలిన 50% వాటా గూడూరు మైకా మైనింగ్ కంపెనీకి చెందిన గోగినేని వెంకటేశ్వర రావుకు వుండేది. ఇంతలో 1958 లో "మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్" (ఎం.ఎం.టి.సి) స్థాపించింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ మైనింగ్ విధానం మారింది. మైనింగ్ కంపెనీలు సరాసరి ముడిసరుకును విదేశాలకు ఎగుమతి చేయరాదన్న నిబంధన విధించింది ప్రభుత్వం. ఎం.ఎం.టి.సి ద్వారానే ఎగుమతి జరగాలని స్పష్టం చేయడం జరిగింది. దానికి తోడు అనేక ఇతర నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందున్న ధర కంటే తగ్గించి, టన్నుకు రు. 21 లుగా విధించారు. ఆ ధర కూడా బయ్యారం సమీపంలోని గుండ్రాతిమర్గు రైల్వే స్టేషన్‌కు చేర్చిన తరువాతే నని చెప్పారు. అంతే కాకుండా ఏడాదికి 10, 000 టన్నుల కంటే ఎక్కువగా ఎగుమతి చేయరాదని మరో నిబంధన విధించారు. ఆ విధంగా టన్ను ధర తగ్గించడం, లేబర్ ధరలు పెరిగి పోవడం, డీజిల్ ధర పెరగడం, అప్పుడప్పుడే పుట్టుకొచ్చిన నక్సలైట్ సమస్య తలెత్తడం లాంటి అడ్డంకులు కలగడంతో 1969 లో, దాదాపు 15 సంవత్సరాల పాటు చేసిన మైనింగ్‌ను వదులుకున్నారు అక్కయ్య చౌదరి. వాస్తవానికి నక్సలైట్ సమస్యను అధిగమించడానికి పోలీస్ రక్షణ కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. ప్రభుత్వానికి లేఖ రాసి మైనింగ్ నుంచి విరమించుకున్నారు. ఇక నాటి నుంచి రక్షణ స్టీల్స్ కు లీజుకు ఇచ్చేవరకు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే వుంది. ఇది జగమెరిగిన సత్యం.

          ఈ విషయాలను, బయ్యారం గనులకు సంబంధించిన మరిన్ని విషయాలను, అక్కయ్య చౌదరి కుమారుడు 75 సంవత్సరాల ఆచార్య ఎం. వెంకటేశ్వర రావు వివరిస్తూ ఇనుప ఖనిజం గురించి ఆసక్తికరమైన సంగతులు చెప్పారు. అక్కయ్య చౌదరికి గనులన్నా, మైనింగ్ అన్నా ఎంత ఇష్టమంటే, తన కుమారుడిని, ఇంజనీర్-డాక్టర్ చేయకుండా జియాలజిస్ట్ చేయాలనుకున్నాడు. డిగ్రీ జియాలజీతో, ఫీజి జియాలజీతో చేశారు వెంకటేశ్వర రావు.  పీజీ తరువాత, బయ్యారం గనులపైనే పిహెచ్. డి చేశారాయన. ఆ తరువాత కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కొంతకాలం కొత్తగూడెం పీజీ కేంద్రంలో గనుల విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారాయన. ఆయన చెప్పినదాన్ని బట్టి, భారత దేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజం జార్ఖండ్‌లోను, ఛత్తీస్‌ఘడ్ లోను, ఒరిస్సా రాష్ట్రంలోను లభ్యమవుతుందన్నారు. జగ్దల్‍పూర్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సరఫరా అవుతున్న ఖనిజం కూడా మంచిదే అన్నారు. బయ్యారంలో లభ్యమయ్యే ఖనిజం అటు వైజాగ్ ఉక్కు కర్మాగారానికి కాని, ఆ ప్రాంతంలోనే నెలకొల్పే కర్మాగారానికి కాని అంతగా పని కొచ్చే నాణ్యమైన సరుకు కాదని ఆయన అభిప్రాయం. పరిమాణం కోణంలో ఆలోచించినా తనకు తెలిసినంతవరకు దీర్ఘకాలం సరిపోయేది కాదంటారాయన. తక్కువ నాణ్యత నుంచి ఎక్కువ నాణ్యతకు పెంచడానికి పని కొచ్చే పెల్లిటైజేషన్ ప్లాంట్ బయ్యారంలో నెలకొల్పితే మంచిదని వెంకటేశ్వర రావు అంటారు. వాస్తవానికి 1969 లోనే పాల్వంచలో పెల్లిటైజేషన్ ప్లాంట్ పెట్టడానికి అక్కయ్య చౌదరి ప్రయత్నం చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా చేశారు. అప్పట్లో, ఐక్య రాజ్య సమితి అభివృద్ధి సంస్థ కార్యక్రమం కింద దానిని చేపట్టే ఉద్దేశంతో, ఆ సంస్థ అధ్యయన బృందం బయ్యారం పర్యటించింది కూడా. నాటి ఖమ్మం కలెక్టర్ ఆర్. పార్థసారథి, నాటి రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ రంగ సాయి బయ్యారం వచ్చిన బృందంలో వున్నారు కూడా. దురదృష్టవశాత్తు ఆ బృందం కేవలం బయ్యారం గ్రామం వరకే పోగలిగింది కాని, ఖనిజం లభ్యమయ్యే స్పాట్‌కు వెళ్లలేక పోయింది. దానికి కారణం ఆ ప్రాంతంలో ఆనాడు చోటుచేసుకున్న నక్సలైట్ సమస్యే. అప్పట్లో జిల్లా ఎస్. పీ గా ఆర్. కె. రాగాల వుండేవారు. ఏదేమైనా పెల్లిటైజేషన్ ప్లాంట్ మాత్రం స్థాపించడం జరగలేదు. కాకపోతే స్టీల్ ప్లాంట్ లాంటిది ఒకటి పాల్వంచలో 1970 ప్రాంతంలో నెలకొల్పబడినప్పటికీ తొందరలోనే పనిచేయకుండా పోయింది.

          బయ్యారం గనులపై శాస్త్రీయ అధ్యయనం చేసిన వారిలో ఏ. ఎం. హేరాన్ ఒకరు. ఆయన ఐదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ జియలాజికల్ సర్వే శాఖలో సూపరింటెండెంట్ గా పని చేసేవారు. ఆయన బయ్యారం గనులపై ఓ పుస్తకం రాశారు కూడా. అలానే ఎస్సార్ శర్మ, అప్పావధానులు కూడా అధ్యయనం చేశారు. వాస్తవానికి ఖమ్మం పరిసరాలలో అన్ని రకాల ఖనిజ నిల్వలున్నాయి. కాకపోతే అందులో చాలా భాగం రెండో రకానికి చెందినవే. తవ్వగా-తవ్వగా ఏదో ఒక చోట ఒక చిన్న ముక్క నాణ్యమైంది దొరుకుతుంది అంటారు వెంకటేశ్వర రావు. ఆయన పి. హెచ్. డి అధ్యయనం కూడా ఆసక్తికరంగానే వుంటుంది.

          వేంకటేశ్వర రావు గారి మాటలను అర్థం చేసుకుంటే, ఒక విషయం స్పష్టమవుతుంది. నాణ్యత దృష్ట్యా, లభ్యమయ్యే మోతాదు దృష్ట్యా, స్థానిక అవసరాల దృష్ట్యా, రవాణా-ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే, బయ్యారం సమీపంలోనే ఉక్కు కర్మాగారాన్ని కాని, శుద్ధి కర్మాగారాన్ని కాని ఏర్పాటు చేయడం మంచిది. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు ఇక్కడ నుంచి రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయ్యారం పరిసరాలలోనే కర్మాగారం నెలకొల్పి "బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు" అన్న నినాదాన్ని కార్యరూపంలో తేవడం ప్రభుత్వ కనీస బాధ్యత.
        

Sunday, November 20, 2011

"వృత్తిలో" డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 5

"వృత్తిలో" డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఐదవ అధ్యాయం ఇది).

ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి, డాక్టర్‍గా ప్రాక్టీస్ ప్రారంభించిన రోజుల్లో, వృత్తి పరంగా ఆయనకు పోటీ అంతగా లేదు. అప్పట్లో పేరున్న డాక్టర్లు ఇద్దరు-ముగ్గురు కంటే ఎక్కువ లేరు. డాక్టర్ మజీద్, డాక్టర్ అశ్వత్థామ, డాక్టర్ సీతారామరావులతో పాటు మరో ఇద్దరు-ముగ్గురు ఎంబిబిఎస్ పట్టాలేని డాక్టర్లుండే వారు. యలమంచిలి గారి పరిచయస్తులు, దగ్గర బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు ఆయన దగ్గరకు రావడంతో, త్వరగానే ప్రాక్టీస్ పెరగసాగింది. దీనికి తోడు, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా పేరుండడంతో, అది కూడా ప్రాక్టీస్ పెరగడానికి దోహద పడింది. వచ్చిన మొదట్లో పార్టీతో నేరుగా సంబంధాలు పెట్టుకోక పోయినప్పటికీ, ఆయన క్లినిక్ నడుపుతున్న గాంధీ చౌక్లో వున్న బంగళా పై భాగంలో పార్టీ కార్యాలయం వుండడంతో ఆయన పరిచయాలు పెరగడానికి తోడ్పడింది. ఆయన ఖమ్మం రావడానికి కారణం కూడా వుంది. సమీపంలోని నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లో ఆయన పిన తండ్రి, మరికొందరు బంధువులు అంతకు పది సంవత్సరాల క్రితం వచ్చి, చౌకగా దొరికితే భూములు కొనడం, స్థిరపడడం జరిగింది. ఖమ్మంలో డాక్టర్లు ఎక్కువగా లేరని, వస్తే ప్రాక్టీసు బాగా సాగుతుందని వాళ్లు ప్రోత్సహించడం వల్ల రావాలన్న కోరిక బలపడింది.

వైద్య వృత్తిలో నైతిక విలువలకు, మానవత్వానికి కట్టుబడి వున్న ప్రతి డాక్టర్‍కు ప్రజల అభిమానం లభిస్తుందని నమ్మిన యలమంచిలి, తన వైద్య శాల ద్వారా ఆ మార్గంలోనే ప్రాక్టీస్ చేయడంతో, అచిర కాలంలోనే ఆయన వద్దకు చికిత్సకొరకు వచ్చే వారి సంఖ్య పెరగ సాగింది. అదనంగా ఆయనకున్న వృత్తిపరమైన నైపుణ్యం వై.ఆర్.కెకు వైద్యుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది. అరవై సంవత్సరాల పూర్వం ఆయన ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, "స్పెషలిస్టు" డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. ఎంబిబిఎస్ ఉత్తీర్ణులైన వారే, తాము చదువుకున్న రోజుల్లో నేర్చుకొనేటప్పుడే, వైద్యం చేయడానికి అవసరమైన ప్రతి విషయంలోను అంతో-ఇంతో నైపుణ్యం అలవరచుకునే వారు. అలానే సాధ్యమైనంత వరకు, అప్పటి మెడికల్ ప్రొఫెసర్లు, వీరికి జనరల్ ప్రాక్టీషనర్లకు కావాల్సిన నైపుణ్యం, కష్టపడడం, ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా విజ్ఞానాన్ని పెంపొందించి కోవడం లాంటివి బోధించేవారు. రాధాకృష్ణమూర్తి స్వతహాగా తెలివైన విద్యార్థి కావడంతో ను, తోటి విద్యార్థులు కూడా అలాంటి వారే కావడంతోను, భవిష్యత్‍లో సేవా దృక్ఫదంతో వుండాలన్న కోరిక బలంగా ఆయనలో నాటుకు పోవడంతోను, ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకునేవారు.

ఆయన సహాధ్యాయులు, రూమ్మేట్లు అయిన డాక్టర్ బాల పరమేశ్వరరావు (భీమవరం), డాక్టర్ సత్యనారాయణ(విజయవాడ), మరొక విద్యార్థి సుబ్బారాయుడు(పాలకొల్లు), జి. సోమరాజు(తణుకు), రాజరత్నం(చిలకలూరిపేట), కృపాదానం(గుంటూరు జిల్లా), జి. రామచంద్రరావు(మైలవరం), మిక్కిలినేని వెంకటేశ్వరరావు(చిల్లపల్లి), .ఏ శర్మ(తరువాత కాలంలో ఎర్రగడ్డ టి.బి ఆసుపత్రి సూపరింటెండెంట్ అయ్యారు), కొడాలి వీరయ్య, రాఘవయ్య(తెనాలి), సజ్జా చంద్రమౌళి(చీరాల)-వీరయ్య, చంద్రమౌళిగార్లు టిడిపి పక్షాన ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు-, ఉప్పలపాటి వెంకట రత్నం(ఎం.డి చేసి విజయవాడలో ప్రాక్టీస్ చేశారు), కుప్పాబ్బి కృష్ణమూర్తి (మెడిసిన్ ప్రొఫెసర్‍గా పనిచేశారు), సీతారాం(ఆర్మీలో చేరి అకాల మరణం పొందారు), వారి-వారి కులాలు వేరైనా, వాటన్నిటికీ అతీతంగా కలిసిమెలిసి, కొత్త విషయాలను నేర్చుకునేవారు. జీవనయానంలో ఎవరి దారి వారిదైనప్పటికి, వారి మధ్య స్నేహం కొనసాగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో రాధాకృష్ణమూర్తిగారు చురుగ్గా పాల్గొనే రోజుల్లో ఆ స్నేహం మరింత బలపడింది. కాలేజీ రోజులు తలచుకుంటూ, రచయిత ఆరుద్రతో పరిచయం జ్ఞాపకం చేసుకున్నారు. రాధాకృష్ణమూర్తిగారు విశాఖపట్నంలో మెడిసిన్ చదువుకునే రోజుల్లో, ఆరుద్ర "లైకోగ్రాఫ్"లో నైపుణ్యం పొందేందుకు, స్థానికంగా ఒక ఫొటో స్టూడియోలో పనిచేసేవారు. స్నేహితుడు తాజుద్దీన్, వై.ఆర్.కెను ఫొటో తీయించుకోవడానికి అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశాడు (తాజుద్దీన్ మెడికల్ కాలేజీ "బ్యూటీ" సుగుణను పెళ్లి చేసుకుని, కొంతకాలం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో పని చేసి, అమెరికా వెళ్ళి ఫ్లోరిడాలో స్థిర పడ్డాడు. డాక్టర్‍గారికి ఫోన్ చేస్తుంటాడు). ఆరుద్ర తనదైన శైలిలో ఫొటో తీసినట్లు, ఆ సమయంలో మంచి పోజు ఇవ్వమని సూచించినట్లు జ్ఞాపకం చేసుకున్నారు డాక్టర్ యలమంచిలి. అప్పటికీ-ఇప్పటికీ కొన్ని వృత్తి పరమైన సామాజిక విషయాల్లో చాలా తేడా వుందని ఆయన భావన.

మానవత్వం, మానవ విలువల పట్ల గౌరవం డాక్టర్‍గారికి కలగడానికి ఆయన కుటుంబ నేపధ్యం ప్రధాన కారణం. తోటివారిని మర్యాదగా చూడడం, దయా దాక్షిణ్యాలు వారిపట్ల కలిగివుండడం, చిన్నతనంలో దత్తత తండ్రిగారి నుంచి అలవరచుకున్నారాయన. కళాశాల చదువు, వివిధ రంగాలకు సంబంధించి పెంపొందించుకున్న అభిలాష, స్వయం శిక్షణ, క్రమశిక్షణ లాంటివి ఆయన అభివృద్ధికి దోహదపడ్డాయి. ఆయన ఖమ్మంలో వైద్య వృత్తి ఆరంభించిన నాటి రోజులకు-ఇప్పటికి, చికిత్సా విధానంలోను, రోగ నిర్ధారణలోను, నివారణలోను, శస్త్ర చికిత్సా పద్దతులలోను గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ, అప్పుడు నేర్చుకుని ఆచరించిన పద్దతుల ద్వారా కూడా మెరుగైన చికిత్సను అందించగలిగా మన్న తృప్తి వుండేదని ఆయన భావన-నమ్మకం. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి స్వర్గీయ నల్లమల గిరిప్రసాద్‍తో సహా, పలువురికి, ఆయన, అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా అదే ఖమ్మంలో మొదటి ఆపరేషనేమో! సాధారణ ఆపరేషన్‍కు అప్పట్లో అయ్యే ఖర్చు కేవలం రు. 25 మాత్రమే.

డాక్టర్ వై.ఆర్.కె చేసిన ఆపరేషన్లలో హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఏ ఆపరేషన్ చేసినా, ఆయనకు ఎప్పుడూ, ఏ విధమైన క్లిష్ట సమస్యలు ఎదురు పడలేదు. కేవలం రొటీన్ ఆపరేషన్లు, ప్రమాదం లేదనుకునే ఆపరేషన్లు మాత్రమే చేసేవారప్పట్లో. మెడికల్ పరమైన చికిత్సలనే ఎక్కువగా చేపట్టేవారు. కంట్లో నలకపడితే తీసే విధానం వుండేదప్పట్లో. సులభమైన మౌలిక సూత్రాలకు అనుగుణంగా చికిత్సా విధానం వుండేది. అనుభవం ప్రాతిపదికగా రోగ నిర్ధారణ నైపుణ్యం అలవరచుకునే వారు వైద్యులు. నిపుణుల ద్వారా చికిత్స చేయించాల్సిన అవసరముంటే, విజయవాడకో-హైదరాబాద్‍కో రోగులను పంపాల్సి వచ్చేది. ఎక్స్-రే కావాలన్నా విజయవాడకు పోవాల్సి వచ్చేది. రోగ నిర్ధారణ కొరకు ఇప్పటి మాదిరిగా రక్త-మల-మూత్ర పరీక్షలు లేవప్పుడు. సీబిపి కాని, మైక్రోస్కోపిక్ పరీక్షలు , ఎక్స్-రే సౌకర్యం ఖమ్మంలో లేవు. డాక్టర్ కోటయ్య గారు వచ్చిన తర్వాతే ఖమ్మంలో ఎక్స్-రే సౌకర్యం వచ్చింది.

ఇప్పటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా-బాలికల పాఠశాల వున్న ఆవరణలో-16 పడకల జిల్లా ఆసుపత్రి వుండేది. ఇద్దరు డాక్టర్లు (ఒక్కోసారి ఒక్కరే) మాత్రమే వుండేవారు. ఎప్పుడైతే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచారో అప్పుడే స్పెషలిస్టుల రాక మొదలైంది. ఖమ్మం వచ్చిన మొదటి స్పెషలిస్ట్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ అని, మొదటి ఎక్స్-రే పెట్టింది డాక్టర్ కోటయ్య అని, మొదటి అనస్థటిస్టు ఎల్ వీ ఎస్ కోటేశ్వర రావు అని, ఆ తర్వాత డాక్టర్ జయచంద్రారెడ్డి, డాక్టర్ జే.ఆర్. ప్రసాద్ లాంటి స్పెషలిస్టులు వచ్చారని గుర్తు చేసుకున్నారు రాధాకృష్ణమూర్తిగారు. 1961లో నర్సింగ్ హోంలు ఆరంభం కావడంతో వారి సంఖ్య లెక్కకు మించి పోయిందిప్పుడు.

రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వసతి లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేయడం అంత తేలికైన విషయం కాకపోయినా చేయక తప్పని పరిస్థితులుండేవి అప్పట్లో. ధనుర్వాతంలాంటి జబ్బులొస్తే, ఆ రోగికి చికిత్స చేయడానికి, డాక్టర్లెవరు ముందుకు రాని రోజులవి. అలా చేయడం సాహసంతో కూడుకున్న పని. డాక్టర్ వై ఆర్ కె రిస్క్ తీసుకో తలిచి ధైర్యంగా అలాంటి కేసులను చేపట్టి, విజయవంతంగా నయం చేసిన సందర్భాలెన్నో వున్నాయి. అలానే క్షయ వ్యాధికి సంబంధించిన కేసులను డాక్టర్లు అంత తేలిగ్గా చికిత్స చేయడానికి ఆసక్తి చూపక పోయేవారు. స్ట్రెప్టోమైసిన్ మందులివ్వడమే టీబీ చికిత్సకు అప్పట్లో వున్న ఒకే ఒక చికిత్సా విధానం. ఇప్పుడైతే రకరకాల మందులొచ్చాయి. అలాంటి మల్టీ డ్రగ్స్ చికిత్సా విధానంతో పాటు, అవి వాడినందువల్ల రోగ నిరోధక శక్తికూడా శరీరానికి తగ్గసాగింది. క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించామని రాధాకృష్ణమూర్తి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే "ఆర్టిఫిషల్ న్యూమో థొరాక్స్" అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను "కొలాప్స్" చేసే పద్ధతి పాటించేవారు. ఒక ఊపిరి తిత్తి చుట్టూ వుండే (స్పేస్) ప్రదేశంలోకి గాలిని పంపి, "కొలాప్స్" చేసి, దానికి విశ్రాంతినిచ్చి, మరో దాన్ని నయం చేసేవారు. ఊపిరితిత్తి మచ్చ వుంటే, గాలిని పొట్టలో నింపి, పైకి తన్ని "న్యూమో పెరిటోనియం" చికిత్స చేసేవారు. తన దగ్గర కొచ్చే ఎందరో క్షయ రోగులను ఈ విధానం ద్వారానే నయం చేశానని, అప్పట్లో సరైన ఆ విధానాన్ని ఇప్పుడు ఎవరూ ఉపయోగించడం లేదని కూడా అన్నారాయన.

విరిగిన ఎముకలను బాగు చేయించుకోవడానికి ఆయన దగ్గరకు అనేక మంది వచ్చే వారు. జనరల్ మెడికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఆ కేసులను సాధారణంగా ఒప్పుకోరు. అలాంటి వారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ వై.ఆర్.కె గారు ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నిర్వహించే మెడికల్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరై తన వృత్తి నైపుణ్యాన్ని ఆధునీకరించుకునేవారు. అలా చేస్తూ, ఒంటి చేత్తో ఎన్నో కేసులను నయం చేసేవారు. అదనంగా తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వివిధ మెడికల్ జర్నల్స్ లో ప్రచురించబడే వ్యాసాలను అధ్యయనం చేసేవారు.

వృత్తిలో కొన్ని నియమాలను పాటించేవాడినని చెప్పారు. మొదట్లో అసలు కన్సల్టేషన్ ఫీజు వుండేది కాదు. సంఖ్య పెరిగి, తట్టుకోవడం కష్టం కావడంతో, తలకు రు. 2 /- వసూలు చేసేవారు. అనవసరమైన పరీక్షలు చేయించక పోవడం, తన వల్ల కాని జబ్బు అనిపిస్తే, వెంటనే స్పెషలిస్టుల దగ్గరకు పంపడం, విద్యార్థులకు, పార్టీ పూర్తికాలం కార్యకర్తలకు - వారి కుటుంబాలకు ఉచితంగా చేయడం, ఇన్ పేషంట్లకు - సర్జరీలకు బిల్లు వేస్తే ఇచ్చుకోలేమనే వారికి, వారికి చేతనైనంతే ఇవ్వమనడం, ఎన్నాళ్లు సేవలందించినా సరే చనిపోయిన వారికి బిల్లు వేయకపోవడం పాటించేవారు. ఆస్తిపరులు స్వచ్చందంగానే ఏదో ఒక మొత్తం ఇచ్చి వెళ్లేవారు. ఎంత ఇచ్చారనేది చూసుకునేవారు కాదు. కొందరు వార్షికంగా ఇచ్చే వారు. వుండడానికి అవసరమైన అన్ని ప్రమాణాలను, నైతిక విలువలను తప్పక పాటించేవారాయన.

Monday, January 18, 2010

జ్వాలా మ్యూజింగ్స్-10 (వనం వారి కృష్ణా పురం)


"వనం వారి కృష్ణా పురం-సమీపంలోని నేలకొండపల్లి"

వనం జ్వాలా నరసింహారావు

వ్యవసాయం, కరిణీకం వృత్తిగా పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యంకూడా లేని కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 లో పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజులవి. ఒక పేద పెరికవారి ఇంట్లో పుట్టాను. కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రంకూడా భారత దేశంలో విలీనం కావడంతో మా కుటుంబం సొంత గ్రామానికి తిరిగొచ్చింది. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. అయిదో తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నాను.

మా వూరిపేరు వనం వారి కృష్ణా పురం. మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. మా వూరు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. అత్యధిక సంఖ్యలో గిరిజనులున్న జిల్లా మాది. షెడ్యూల్డ్ ప్రాంతంకూడా అత్యధికంగా వున్న జిల్లా మాదే. దండకారణ్యంలో, దేశంలో ప్రసిద్ధికెక్కిన భద్రాచల రామాలయం మా జిల్లాలోనే వుంది. రామాలయం కట్టించిన కంచర్ల గోపన్న-భక్త రామదాసు మా సమీప గ్రామం నేలకొండపల్లి వాస్తవ్యుడు. అది మా మేనమాముండే వూరు. నేలకొండపల్లిలో ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా ఇప్పటికీ పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన నాలుగొందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెప్పబడుతున్న వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాల స్వామి , ఉత్తరేశ్వర ఆలయాలున్నాయి ఇక్కడే.

భక్త రామదాసుగా సుప్రసిద్ధమైన కంచర్ల గోపన్న తెలుగునాట జన్మించిన భక్త మహాశయులతో మహనీయుడు. ఆయన అచంచల రామ భక్తి జగత్‌ విఖ్యాతం. నేలకొండపల్లి గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించి, చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న గోపన్న మేనమామలైన అక్కన్న, మాదన్న వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. ఆనాడు గోల్కొండను ఏలిన తానీషా వద్ద మంత్రులుగా వుండిన అక్కన్న, మాదన్న సాయంతో గోపన్న గోదావరి తీరంలోని భద్రాచలం పరగణాల తాహసీల్దారుగా నియమితుడయ్యాడు. మహా రామ భక్తుడైన గోపన్న పన్నుల రూపంలో వసూలు చేసిన ఆరులక్షలు వరహాలను వెచ్చించి భద్రాచలంలో శ్రీరాముడికి ఆలయం నిర్మించి, నవరత్న ఖచిత ఆభరణాలెన్నో చేయించాడు. విషయం తెలిసిన తానీషా గోపన్నకు 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో బందీ అయిన గోపన్న శ్రీరాముడిని భజిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, దెప్పుతూ, బెదిరిస్తూ, నిష్టూర మాడుతూ రోజు కొ కీర్తన చొప్పున కొన్ని వేల కీర్తనలు రచించాడు. గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వచ్చి తానీషాకు గోపన్న చెల్లించవలసిన ఆరు లక్షల వరహాలు చెల్లించి గోపన్నను బంధ విముక్తుడిని చేశాడు. నాటి నుండి గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధు డయ్యాడు. కారాగారవాసంలో రామదాసు రచించిన కీర్తనలే భద్రాచల రామదాసు కీర్తనలుగా ఖ్యాతి గడించాయి.

నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. మహాభారతంలో పాండవుల అజ్ఞాత కాలం నాటి విరాట నగరం నేలకొండపల్లి సమీపంలో వుంది. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో మహాభారత కథతో సంబంధం కలిగిన-విరాటరాజు కొలువుగా ఆ ప్రాంతం వాళ్లు భావిస్తున్న-పురా తత్వ శాస్త్రజ్ఞులు అంగీకరించిన, విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలున్నాయి. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వున్న విరాటరాజు దిబ్బ ప్రస్తుతం పురావస్తు శాఖ వారి అధీనంలో వుంది. సమీప గ్రామస్థులు కొన్నేళ్లకింద ఆ గడ్డను తవ్వగా అలనాటి నాణాలు దొరికాయని చెప్పుకుంటారిప్పటికీ. పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేశాడు. ఆ విరాట నగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు ఇక్కడ దొరకడం విశేషం.

బౌద్ధమతానికి సంబంధించిన పలు అధారాలు నేలకొండపల్లి పరిసరాల్లో, పురా తత్వ శాఖ వారు కొనసాగిస్తున్న తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ప్రపంచంలో కల్లా అతి పెద్ద దిగా భావించబడుతున్న, సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణమున్న బౌద్ధ రామం, ఈ ప్రాంతంలోని భూగర్భంలో వుందంటున్నారు పరిశోధకులు. 1977లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధమతం విలసిల్లిందని రూఢి పరిచారు పరిశోధకులు. అమరావతి, నాగార్జునకొండ, నేలకొండపల్లి ప్రాంతాలలో చెక్కిన బుద్ధ విగ్రహాలు ఇండోనేషియా, జావా, సుమిత్ర మొదలైన దేశాలకు ఎగుమతి అవుతుండేవట ఒకప్పుడు.