Showing posts with label సీపీఎం. Show all posts
Showing posts with label సీపీఎం. Show all posts

Friday, December 16, 2011

నక్సల్ ఉద్యమం: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 11
నక్సల్ ఉద్యమం
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పన్నెండవ అధ్యాయం ఇది).
నక్సల్బీరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో కూడా, కొందరు ఉత్సాహవంతులైన యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ముఖ్యుల పేర్లను గుర్తు చేసుకున్నారు డాక్టర్గా రు. వారు: బత్తుల వెంకటేశ్వరరావు(సత్తుపల్లి), విజయ కుమార్(ఎం. వెంకటాయపాలెం), రాయల సుభాస్ చంద్రబోస్(పిండిప్రోలు), చీకటి రోశయ్య(లెక్చరర్, ఖమ్మం), జీవన్(రచయిత, ఖమ్మం), వడ్డెల్లి కృష్ణమూర్తి(అడ్వకేట్, ఖమ్మం), వాసిరెడ్డి కోటేశ్వరరావు(మధిర), డాక్టర్ వాసిరెడ్డి రామనాధం(మధిర) ప్రభృతులు.
రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖుల పేర్లనూ చెప్పారు డాక్టర్గా్రు. వారిలో, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ఎ.బి.కె. ప్రసాద్, సనకా బుచ్చికోటయ్యలు సీపీఎం పాలకొల్లు రాష్ట్ర ప్లీనరీ జరిగిన తరువాత, పార్టీని వీడి నక్సల్ ఉద్యమం వెళ్ళిన ముఖ్యులు.
రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో. పలువురు విద్యార్థి నాయకులు, గ్రామ-పట్టణ నాయకులు, ఆ ఉద్యమంలోకి వెళ్లకుండా వుండడానికి కారణం డాక్టర్గారరి పైనున్న గౌరవం. బత్తుల వెంకటేశ్వరరావు లాంటి చురుకైన సీపీఎం కార్యకర్తలు వెళ్లినప్పటికీ, వెళ్దామనుకున్న గండ్లూరి కిషన్రావవు, వనం నరసింగరావు లాంటి వారిని ఆయన ఆపు చేశారు. ఆ తర్వాత వారిలో ఒకరు ఖమ్మం సమితి ఉపాధ్యక్ష స్థాయికి, మరొకరు పాలేరు సహకార చక్కెర కర్మాగారం చైర్మన్ స్థాయికి ఎదిగారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించారు. కిషన్రాహవు హత్యకు గురికాగా, నరసింగరావును పార్టీ సస్పెండ్ చేసింది. డాక్టర్ వై.ఆర్.కె కృషి వల్ల, అప్పట్లో, ఖమ్మంలో పార్టీకి ప్రమాదం తప్పిందనాలి. 1964 చీలిక-సీపీఎం నాయకుల అరెస్ట్ దరిమిలా రూపు దిద్దుకున్న పౌరహక్కుల ఉద్యమ ఆద్యులలో, మేధావిత్రయంలో ఒకరైన అడ్వకేట్ కె. వి సుబ్బారావు తీవ్రవాదం వైపు తొలుత ఆకర్షితులైనప్పటికి, మైదానంలో ఉద్యమానికి పోలేదు.

Friday, June 10, 2011

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం: వనం జ్వాలా నరసింహారావు

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (10-06-2011)

అటకెక్కనున్న రాజీవ్‌ ఆరోగ్య శ్రీ?, నాలుగోవంతు వ్యయంతోనే జనరిక్‌ మందులు, ప్రభుత్వ రంగానికి అవకాశాలు, అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్‌, ఆసుపత్రులలో ఉచిత ఔషధాలకు అవకాశం….

ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణలంటే, ఇల్లు పీకి పందిరి వేయడమనే ఆలోచన తప్ప మరోటి కాదనే రీతిలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కడప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికే అన్నట్లు, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, అశేష జనాదరణ పొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను అటకెక్కించే దిశగా చర్యలు చేపట్టారు. కాకపోతే తద్వారా రాబోయే అపవాదునుంచి బయట పడేందుకు, మరో ఆచరణ సాధ్యం కాని ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి ముఖ్య మంత్రి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మందు చీటీలు ఇవ్వడం కాకుండా, అన్ని రకాల మందులను ఉచితంగా అక్కడికక్కడే అందచేయడం దాని లక్ష్యం. ఇక ముందు, రోగులు మందులను బయట మార్కెట్ కు వెళ్ళి కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇలా ఉచితంగా ఇవ్వాల్సిన మందులను, ఆసుపత్రులే కంపెనీల ద్వారా కొనుగోలు చేసి, రోగులకు ఇవ్వనున్నదన్న మాట. దీని కొరకు మందుల కొనుగోలు బడ్జెట్ ను రు. 400 కోట్లకు పెంచారు. ఇంతవరకు బాగానే వుంది కాని, నాలుగు వందల కోట్ల రూపాయలను వ్యయం చేసి, "బ్రాండెడ్" మందులను కొనుగోలు చేసే బదులు, దానిలో నాలుగో వంతు వ్యయం చేస్తే, "జనరిక్" మందులను కొనగలమని, తద్వారా, ప్రభుత్వానికి ఖర్చు తగ్గించవచ్చని ఆలోచన చేసి వుండాల్సింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా "జనరిక్" మందుల అమ్మకం చేసే పథకం అమలు చేయగలిగితే, ఆసుపత్రులలో మందులు నిల్వ వున్నా లేకపోయినా, సరసమైన ధరలకు అవి లభ్యమయ్యే సదుపాయం కలిగించినట్లవుతుంది. బీద-సాద, ఆర్థికంగా వెసులుబాటు లేనివారికి ఇదెంతో ప్రయోజనకారి అవుతుంది.

భారతదేశంలోని అలోపతి ఔషధ ఉత్పత్తుల పరిశ్రమ, ప్రపంచంలోని ఐదు పెద్ద పరిశ్రమలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ పరిశ్రమలో వున్న సంస్థలన్నీ వారు ఉత్పత్తిచేసే మందులకు, ఆకర్షణీయమైన పేర్లను పెట్టి, మార్కెటింగ్ విధానాలను చేపట్టి, అమ్మకాల ద్వారా లాభాలు చేసుకుంటారు. ఒకే రకమైన రసాయన మిశ్రమానికి సంబంధించి, అనేక పేర్లతో మందులు మార్కెట్లో వుండడం, ఒకే రకమైన శరీర రుగ్మతకు, ఒక్కో డాక్టర్, ఒక్కో మందు పేరును సూచించడం, రోగులు కూడా మందును "బ్రాండెడ్" పేరుతోనే (ఉదాహరణకు క్రోసిన్, కాంబీ ఫ్లాం) గా గుర్తుంచుకోవడం ఆనవాయితీ. అలాగే ధరల నిర్ణయం కూడా ఉత్పత్తిదారుల ఇష్టా ఇష్టాల మీదే ఆధారపడి వుండేది. భారత దేశంలో అనుసరిస్తున్న ఆ విధానం, అలా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ప్రపంచ ఔషధ ఉత్పత్తుల పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించింది. విదేశీ బహుళజాతి సంస్థలు భారత దేశంలో ఉత్పత్తులు చేసి లాభాలను ఆర్జించడం మొదలెట్టారు. 1979 లో ప్రభుత్వం ఔషధ విధానం రూపొందించింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఓ) గా పిలువబడే ఆ విధాన నిర్ణయం దరిమిలా, వివిధ రకాల మందుల ధరలను ఒక పద్ధతి ప్రకారం నియంత్రించింది ప్రభుత్వం. ఆ విధానానికి అడపాదడపా మార్పులు-చేర్పులు కూడా చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. అలోపతి ఔషధ విషయకమైన మందుల పరిధిలోని కీలక అంశాలపై అధ్యయనం చేసి, విచారణ జరిపి, దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించడానికి, 1974 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సభ్యుడు జైసుఖ్ లాల్ హాతి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. హాతీ కమిటీలోని అరవై మంది నిపుణులు, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి రూపొందించిన సమగ్రమైన నివేదిక వాస్తవానికి వెలుగు చూడలేదనే అనాలి.

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, సీపీఎం పక్షాన రాజ్యసభ సభ్యుడుగా వున్న రోజుల్లో, పదిమందితో కూడిన పార్లమెంటరీ హెల్త్ కన్సల్టేటివ్ కమిటీలో ఆరేళ్ల పాటు సభ్యుడుగా చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ సభ్యుడుగా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాలలో ఐదుగురు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులతో సంప్రదింపులు చేసే అవకాశం కలిగింది.

ఎమర్జెన్సీ అమల్లో వున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను తొక్కి పట్టింది ప్రభుత్వం. బడా పారిశ్రామిక వేత్తలకు లాభాలను ఆర్జించి పెట్టే పద్దతికి స్వస్తి చెప్పే రీతిలో నివేదిక వుందని వారంతా పసి గట్టారు. భారతీయ పద్దతులను అనుసరించి మందులను ఉత్పత్తి చేసే ఇతర పారిశ్రామిక వేత్తలకు సిఫార్సుల వల్ల మేలే జరుగుతుంది. హాతీ కమిటీ నివేదిక అమలవుతే, ఔషధాల ఉత్పత్తిలో నాణ్యత మెరుగయ్యే అవకాశాలతో పాటు, ధరల నియంత్రణకు మార్గం సుగమం అవుతుంది. ప్రయివేట్ రంగం వెనక్కు తగ్గి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలొచ్చే వీలు కూడా కలిగేది. భారతదేశ ప్రజల అవసరాలకు తగ్గట్లు ఔషధ ఉత్పత్తులు జరిగుండేవి. పటిష్టమైన ఔషధ నాణ్యతా పద్దతులను పాటించాలని, "బ్రాండ్ నేమ్" మిషతో రోగులను లూటీ చేసే విధానానికి స్వస్తి పలకాలని నివేదికలో సిఫార్సు చేసింది కమిటీ. ఎమర్జెన్సీ ఎత్తి వేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తల పక్షమే వహించి, నివేదికను కనుమరుగు చేసింది. నివేదిక ప్రతులను కొందరు స్వప్రయోజన పరులు తగుల బెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. బహుశా ఆ నివేదిక ప్రతులు, ఒకటి-రెండే మైనా మిగిలి వుంటే, ఏదైనా మెడికల్ గ్రంథాలయంలో వుండొచ్చు.

హాతీ కమిటీ నివేదికలోని ఒక ప్రాముఖ్యతాంశం, ఆసుపత్రులలో వుంచాల్సిన "అత్యవసర ఔషధాల జాబితా" లో ఏమేమి వుండాలనేది. అదే విధంగా కెమికల్ ఫార్ములాతో కాకుండా, జనరిక్-బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మందుల విడుదలకు సంబంధించిన అంశం. మార్కెట్లో ఇరవై ఐదు వేల రకాల మందులుండేవి. ఒక్క "బీ-కాంప్లెక్స్" ఫార్ములా మందు, వంద పేర్లతో లభ్యమవుతుంది. అలానే యాస్ప్రిన్, పారాసిటమాల్, యాంటీ బయాటిక్, ఇతర మందులు. ఏ విధమైన ఉపయోగం లేని మందులనేకం మార్కెట్లో వుంటాయి. టానికులు, మల్టీ విటమిన్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్ ముందుంటుంది. అలాంటి లోపాలను అధిగమించే పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ప్రాధమిక ఆరోగ్య రంగానికి సుమారు వందకు పైగా, ఆ పైన మరి కొన్ని అదనంగా, మొత్తం మీద వందల సంఖ్యలో మందులు సరిపోగా, మార్కెట్లో వేల సంఖ్యలో ఎందుకుండాలని కూడా నివేదిక ప్రశ్నించింది.

ఎప్పుడైతే ఆ నివేదికను-నివేదికలోని ముఖ్యమైన అంశాలను బుట్ట దాఖలా చేశారో, "ఢిల్లీ సైన్స్ ఫోరం", "మెడికో ఫ్రెండ్స్ సర్కిల్", ఫిజీషియన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్", సౌత్ ఇంటర్నెట్" లాంటి సంస్థలు, నివేదిక అమలుకు ఆందోళన చేయసాగాయి. ఆ సంస్థలన్నీ, నివేదిక సిఫార్సులు సమాజానికి అత్యంత లాభదాయకమైన వని విశ్వసించాయి. సీపీఎం వైద్య విభాగం, నెల్లూరుకు చెందిన డాక్టర్ జె. శేషా రెడ్డి, రాధాకృష్ణమూర్తి ప్రభృతులు ఆందోళనలో అగ్ర భాగాన నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీపీఎం శాఖను సంప్రదించి వాళ్లనూ ఆందోళనలో దింపారు. నెల్లూరులో ఒక సమావేశాన్ని నిర్వహించి, పలువురు వైద్యులను ఆహ్వానించారు. వచ్చినవారిలో, పశ్చిమ బెంగాల్ నుంచి-కేరళ నుంచి ఇద్దరు డాక్టర్లు, ఒక అడ్వకేట్-డాక్టర్ బాంబే నుంచి వున్నారు. బాంబేకు చెందిన "శ్రీమతి డాక్టర్ అశోక్ ధవే అడ్వకేట్" ఎంబిబిఎస్ చేసి, ఎల్ ఎల్ డి పట్టా పుచ్చుకున్న అరుదైన వ్యక్తి.

రెండు రోజుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, పలు రాష్ట్రాలలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మరికొందరు వీరితో కలిశారు. కర్నూలుకు చెందిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, నెల్లూరుకు చెందిన డాక్టర్ విజయకుమార్, విజయవాడకు చెందిన డాక్టర్ ఎం రామారావు, గుంటూరుకు చెందిన అధ్యాపకుడు లక్ష్మారెడ్డి లాంటివారిని కలుపుకుని, మరో మారు 1986 లో సమావేశమైన డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రభృతులు, బుట్ట దాఖలు చేసిన హాతీ కమిటీ నివేదికను వెలుగులోకి తెచ్చే ఉద్యమ్నాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి, పలు ప్రదేశాలలో తిరిగి, డాక్టర్లను ఉద్యమంలోకి దింపేందుకు ప్రోత్సహించి, వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఆ సంవత్సరాంతానికి కలకత్తాలో అఖిల భారత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆందోళనను తీసుకెళ్లారు.

కలకత్తాలో జరిగిన రెండు రోజుల సమావేశానికి ఎంపిక చేసిన సుమారు వంద మంది డాక్టర్లు హాజరయ్యారు. సీపీఎం నాయకుడు స్వర్గీయ ఇఎంఎస్ నంబూద్రిపాద్, పశ్చిమ బెంగాల్ శాఖ కార్యదర్శి చౌదరి కూడా వున్నారు. సమావేశంలో పార్టీ సహాయం-సలహా అడిగారు డాక్టర్లు. హాతీ కమిటీ నివేదికలోని "ఔషధ విధానం" తో పాటు, వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఆందోళన చేపట్టమని పార్టీ సూచించింది. అయితే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కలుపుకుని పోతే మంచిదని, నంబూద్రిపాద్ అభిప్రాయ పడ్డారు. వీలైనంత మందిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేసి, వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యలు కూడా చేపట్టి తే మంచిదని సూచించారాయన. సీపీఎం అనుబంధ సంస్థగా వుండే కన్నా, విస్తృత సంస్థగా, అందరినీ కలుపుకొని పోతే మంచిదన్న నిర్ణయం తీసుకున్నారు. అలా డాక్టర్ల విశాల వేదిక మొదలైంది. డాక్టర్ రాధాకృష్ణమూర్తి తన వంతుగా ఖమ్మం జిల్లాలో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జిల్లాలో జరిగిన ప్రతి ఐఎంఏ సమావేశంలో వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి చర్చకు పెట్టేవారు. అయితే, ఐఎంఏ సభ్యుల్లో అతి కొద్దిమంది మాత్రమే ప్రజాస్వామ్య భావాలున్న వారని, స్వలాభం చూసుకునేవారు ఎక్కువ మందని, నైతిక విలువలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలువురు వ్యతిరేకంగా మాట్లాడేవారని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి.

హాతీ కమిటీ ముఖ్యాంశాలు సజీవంగా వున్నప్పటికీ, బుట్ట దాఖలా మాత్రం అయ్యాయి. నివేదికలోని అంశాలు కనీసం కొంతవరకైనా వెలుగు చూసినట్లైతే బాగుండేదేమో. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఉచితంగా ఆసుపత్రులలో మందుల పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని, హాతీ కమిటీ సూచనలకు అనుగుణంగా చేసే ప్రయత్నం చేస్తే, అటు ప్రభుత్వానికీ లాభం-ఇటు ప్రజలకూ మేలు. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి వైద్య పట్టా పుచ్చుకున్న వ్యక్తులై నందువల్ల ఈ విషయాలపై దృష్టి సారిస్తే మంచిదే మో! ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్న పథకం పది కాలాల పాటు అమలు కావాలంటే, ప్రభుత్వ నిధులు అనవసరంగా దుర్వినియోగం కాకుండా వుండాలంటే, జైసుఖ్ లాల్ హాతి కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాలి.

Thursday, August 26, 2010

సహస్ర చంద్రుడు రాధాకృష్ణ : వనం జ్వాలా నరసింహారావు


గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగని వాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కల వాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించిన "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి. "సహస్ర చంద్ర దర్శనం" చేసుకుంటున్న సందర్భంగా ఆయనను గురించి తెలిసిన వారు-తెలియని వారు, తెలుసుకోవాల్సిన విషయాలెన్నో... ఎన్నెన్నో! "వైఆర్కెన" గా, "డాక్టర్ గారు" గా అందరూ పిలిచే ఈ మనిషి చిన్నతనం ‍నుండే నిరీశ్వరవాది. గోరా ప్రభావంతో హేతువాదం కూడా జోడైంది ఆయనలో. సహధర్మచారిణి కూడా, ఆయన బాటలోనే, వివాహమైన కొద్ది కాలంలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. ముగ్గురు పిల్లలకూ ఆయన అలవాట్లే అబ్బాయి. ఇంటికొకరు అన్నట్లు, పెద్ద కోడలు మాత్రం మంచి భక్తురాలైంది. అయితే, సాహిత్యాభిలాషైన వైఆర్కె్ పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.

1985 లో పార్టీ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ వైఆర్కెా, గత పాతికేళ్లలో, సీపీఎం రాష్ట్ర కమిటీలో, కార్యదర్శి వర్గంలో వున్నప్పటికీ, ఎన్నడూ ఆర్థిక పరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండు సార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. 1996 ఫిబ్రవరి నెలలో హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు, మోటూరు హనుమంతరావు విజయవాడ నుంచి ఫోన్ చేశారు రాధాకృష్ణమూర్తికి. తెలుగు దేశం పార్టీతో అప్పట్లో వున్న అవగాహన ప్రకారం సీపీఎం కు కేటాయించే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రతిపాదించనున్నందున, దానికి ఆయన అంగీకారం తెలపాల్సిందిగా కోరారు మోటూరి. తనకెందుకన్న వైఆర్కెప తో, "రాజ్యసభకు పంపుతామంటే వద్దంటారేంటి" అని ప్రశ్నించారాయన. చివరకు భార్యా పిల్లలను సంప్రదించి, సంకోచంగానే సమ్మతి తెలియ చేశారు డాక్టర్.

రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడం తో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 1985 కు పూర్వం, అదీ సభ్యత్వం తీసుకోక ముందు, డాక్టర్ గారు సంపాదించిన ఆస్తిని ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరు కుమారులకు బదిలీ చేసి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారాయన. పిల్లలు సమకూర్చిన పైకంతో ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడుపుతున్న ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే.

Tuesday, August 24, 2010

ఓనమాలు దిద్దుకోండి! : వనం జ్వాలా నరసింహా రావు


వనం జ్వాలా నరసింహా రావు

కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థ" కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందని-ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని జోస్యం చెప్పాడు. సోవియట్, చైనా దేశాల్లో శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేంతవరకు చాలావరకు ఆయన చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాత కారణాలే వైనా, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ సిద్ధాంత పరమైన అధికారానికి దూరమైంది. చైనాలో కొనసాగుతున్న కమ్యూనిజం, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు అదనంగా మావో ఆలోచనా విధానం చేర్చింది.

భారత దేశంలోని (ఉమ్మడి) కమ్యూనిస్టులు సోవియట్-చైనా భావాలకు అనుకూల-ప్రతికూల-మధ్యేవాద మార్గంలో ప్రస్థానం మొదలెట్టి, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా పయనించడం జరిగింది. సిద్ధాంత పరంగా ఉమ్మడి పార్టీలో మొదలైన చీలిక, దరిమిలా, పేరుకే సిద్ధాంత పరంగా మారి, మితవాద-అతివాద-తీవ్రవాద-భావాలలో ముక్క చెక్కలైంది. పార్లమెంటరీ పంథా కోరుకున్న వర్గాలు ఏదో ఒక జాతీయ-ప్రాంతీయ పార్టీతో ఎన్నికల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని, అర-కొర స్థానాలను చట్ట సభల్లో సంపాదించుకోవడంతో సరిపుచ్చుకుంటున్నాయి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజల సమస్యలకు దూరమై, ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి దిగిపోయారు. చివరకు పరిస్థితి ఎలా మారిందో అంచనా వేయడానికి ఉదాహరణలుగా సీపీఐ నాయకుల దైవ దర్శనాలు, సీపీఎం నాయకుల దిద్దుబాటు చర్యల చొరవలు, చెప్పుకోవాల్సి వచ్చింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది సీపీఎం.

దిద్దుబాటు ప్రక్రియను పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంతో ఆరంభించి, జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో సిపిఎం కేంద్ర కమిటీ తీర్మానించింది. ఆ నిర్ణయం అమలుకు సంబంధించిన సమాచారం లేదు. సీపీఎం పార్టీలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.

కార్ల్ మార్క్స్ లాంటి మహా-మహానుభావులు, కారణజన్ములు, ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒక వైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.

ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరి తో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన, వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తోంది.

ఈ నేపధ్యంలో, ఇప్పటికీ, అల నాడు మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, గత పాతికేళ్లగా పార్టీకి సేవ చేస్తూ, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను నెరవేరుస్తున్న ఎనభై రెండేళ్ల కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ తలపెట్టిన "దిద్దుబాటు" కార్యక్రమంలో భాగంగా స్పందించని "కామ్రేడ్లు" తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే!

సహస్ర చంద్రుడు డాక్టర్ యలమంచిలి... (దీని రెండో భాగం.. తరువాత)