Showing posts with label ఎన్ టీ రామారావు. Show all posts
Showing posts with label ఎన్ టీ రామారావు. Show all posts

Thursday, September 1, 2011

వైఎస్‌ ఫోటో పుస్తకం - కథ కమామీషు ఎందుకీ అనాయాస ప్రయాస ?: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (2-09-2011)

మనది వారసత్వ రాజకీయ భారతం, పార్టీ ఏర్పాటుకు అందరూ మీన మేషాలు లెక్కించిన వారే, నిముషాల్లో ఏర్పాటైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, అడ్డుకునేందుకే వైఎస్సార్‌ పుస్తకావిష్కరణ, జగన్‌కు చెక్‌ పెట్టే వ్యూహమేనా?-ఎడిటర్ సూర్య

రాజకీయాలతో పోటీపడగల (సరదా) క్రీడ బహుశా మరేదీలేదేమో! రాణించడం సంగతి పక్కన పెడితే, నేర్చుకోవడం కూడా అంతగా కష్టం కాని ఆట కూడా అదేనేమో! సాధారణంగా ఏ ఆట నేర్చుకోవాలన్నా, చిన్నతనంలోనే మొదలెట్టి తీరాలంటారు. మనిషి పెరిగి పెద్దయినాకొద్ది, నేర్చుకోవడానికి పిన్న వయసులో వుండే చురుకుదనం, తగ్గిపోతుందనేది నిపుణుల అభిప్రాయం. కొందరి విషయంలో-నేర్చుకోవడానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసుకునే పుట్టు బంగారు బాతు కూనలకు, అంతో-ఇంతో జన్యుపరమైన నైపుణ్యం వున్న వారికి-మాత్రం, మరీ చిన్నతనంలో కాకపోయినా, ఏ వయసులోనైనా, అనుకున్నదే తడవుగా-కోరుకున్న ఆటలో ప్రావీణ్యం పొందడానికి అవసరమైన శిక్షణను పొందవచ్చు. అలా పొందినవారు మిగతా వారికంటే ఎక్కువగా రాణించవచ్చు కూడా. రాణించి, ఇతరుల అవకాశాలకు గండికొట్టవచ్చు. జాతీయ-అంతర్జాతీయ క్రీడల్లో వారి స్థానం పదిలం చేసుకోనూవచ్చు. మిగతా ఆటలకన్నా రాజకీయం ఆటలో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజం. వారసత్వ రాజకీయాలకు నిలయమైన భారతావనిలో, అందునా ఆంధ్రా వనిలో, అది నూటికి వేయిపాళ్లు నిజం.

అశేష ప్రజాదరణ, లక్షలాది మంది అభిమానుల అండదండలున్న ఎన్ టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలలో దిగడానికి చాలాకాలం ఆలోచించాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ స్థాపించడానికి బహుశా ఎంతో తర్జన-భర్జన జరిగే వుంటుంది. సరే పెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఆ మహానుభావుడికి సైతం గెలుపు-ఓటములు తప్పలేదు. ఆయనంత కాకపోయినా, దాదాపు అంతే మోతాదులో అభిమానుల బలం అపారంగా వున్న, చిరంజీవి కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ఎంత వూగిసలాడిందీ అందరికీ తెలిసిందే. ఓటమి (స్వయంగా ఆయనే ఒక నియోజక వర్గంలో, ఆయన పార్టీ రాష్ట్రంలో) రుచితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో విలీనం వరకు సాగిందిప్పటివరకు. ఇరవై సంవత్సరాల పాటు ఉన్నత పదవులను చేపట్టి, ఒక ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేసి మంచి పేరు గడించి, పదవీ విరమణ చేసి, ప్రభుత్వేతర సంస్థ గొడుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు రాజకీయ పార్టీ పెట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఆలోచన చేయాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన కొందరు నాయకులైనా, ఇతర పార్టీల నుంచి బయట కొచ్చిన మరికొందరైనా, వేరు కుంపటి పెట్టుకోవడానికి, మీన-మేషాలు లెక్కించే వారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ సంగతై తే, మిగిలిన రాష్ట్రాలలోనూ అంతే. అతిరథ-మహారథులనుకునే కురువృద్ధ రాజకీయ నాయకులు సహితం ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి చాలా సమయం తీసుకునే వారు. అలాంటిది, ఆంధ్ర ప్రదేశ్ లో, తనను కాదన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా, అర నిమిషమైనా ఆలోచించకుండా, దానికి ధీటుగా "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" ని స్థాపించి, అతి కొద్ది సమయంలోనే, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు అఖండ మెజారిటీతో ఎన్నికై, అదే పార్టీ నుంచి అంతే భారీ మెజారిటీతో తన తల్లిని శాసనసభకు కూడా ఎన్నిక చేయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, కాంగ్రెస్ అధిష్టానానికి భయం లేకుండా వుంటుందా? భయాన్ని కప్పి పుచ్చుకుని, ఆయనను దెబ్బతీయడానికి, ఆ పార్టీ తన సర్వ శక్తులను ఫణంగా పెట్టకుండా వుంటుందా? అలా చేయడానికి, ధీటైన నాయకులను వెతుక్కోకుండా వుంటుందా? ఆ కోణంలో జరిగిన ఆలోచన పర్యవసానమే మొన్న ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ సంరంభం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి, ఎప్పుడైతే సొంత కుంపటి పెట్టారో, ఆ మరుక్షణమే, వైఎస్ బతికున్నప్పుడు ఆయన దూరంగా పెట్టిన-ఆయనకు దూరంగా వున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయక మహాశయులు కొందరు, జగన్ బలం లేనివాడుగా చిత్రీకరించేందుకు "అధిష్టానం వందిమాగధుల" పంచన చేరారు. వారి ద్వారా సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని కూడా ముందుకు తోసారు. రాజకీయ క్రీడ ప్రారంభమైంది. "అధిష్టానం ఆదేశిస్తే" జగన్మోహన్ రెడ్డిని "ఢీ" కొంటానని డీఎల్ రవీంద్రారెడ్డి ముందుకొచ్చారు. అఖండ విజయం తనదేనని-జగన్ కు డిపాజిట్ కూడా రాదని తొలుత మాట్లాడిన డీఎల్, ఆ తర్వాత తన మెజారిటీని తానే తగ్గించుకుంటూ, చివరకు తన డిపాజిట్ కోల్పాయారు. పాపం వివేకాకు అదే గతి పట్టించారు. నైతిక విలువలంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన వివేకా రెంటికి చెడ్డ... సామెతకు గురయ్యారు. అధిష్టానానికి ఎవరేంటో తెలిసొచ్చింది. ఎవరి బలం ఎంతో అవగాహన కొచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరో నిర్ణయానికొచ్చింది. పావులు కదపడం మొదలెట్టింది. కలిసొచ్చే రోజున...నడిచొచ్చే...అన్న చందాన, శంకర్ రావు కోర్టులో వేసిన కేసుతో సిబిఐ రంగంలోకి దిగడంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత వెసులుబాటు వచ్చింది. దెబ్బమీద దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధమైంది. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం, క్రియాశీలక రాజకీయాలకు కొంత "బ్రేక్" ఇచ్చిన ఆయన సన్నిహితుడు-హితుడు కేవీపీ రామచంద్రరావు అధిష్టానం వేసిన "అంజనం" లో పెద్దలకు కనిపించారు. ఆయన కూడా అవకాశం కొరకు ఎదురు చూస్తుండడంతో, కార్యాచరణ ప్రణాళిక అమలు మొదలైంది. తొలి అంకం "పుస్తకావిష్కరణ" తో ప్రారంభమైంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ చేసిన తప్పిదాలను చట్టపరంగా వాడుకుంటున్న కాంగ్రెస్ ఆయన "రాజకీయ క్రీడ" కట్టడికి మరో దిక్కునుంచి ఈ విధంగా అడుగులు వేయ సాగింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై రూపొందించిన "వైఎస్ ఆర్-మాన్ ఆఫ్ పీపుల్" అనే ఛాయాచిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా మారడానికి ప్రధాన కారణం, వైఎస్ రాజకీయ వారసత్వం ఎట్టి పరిస్థితుల్లోను జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పడానికే! జగన్ కేవలం రాజశేఖర రెడ్డి "ఆస్తులకు" మాత్రమే వారసుడని ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు, ఆ వారసత్వం ఆయనకు ఆపాదించడానికి వెనుకనున్న కారణం, అదే ఆరోపణపై జగన్ ను ఇబ్బందుల పాలు చేయడమే. వ్యతిరేకుల వైఖరికి భిన్నంగా వైఎస్ అనుయాయులమని చెపుకుంటున్న వారి వ్యూహం మరో విధంగా వుంది. వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని ఆయన కుమారుడుగా జగన్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ అభిమానులను- సన్నిహితులను, ఏదో ఒక కారణాన ఒకే వేదికపై తెచ్చి, సంఘటితం చేయడంతో పాటు, మరుగున పడిపోతున్న తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనకు తెలియకుండానే, ఆయనతో ఈ కార్యక్రమం, ఆయనొక్కడే ఒంటి చేత్తో చేస్తున్నానన్న భావన కలిగించింది అధిష్టానం. ఫలితంగా భారీ స్థాయిలో పుస్తకావిష్కరణ తంతు నడిచింది. స్వయంగా కేవీపి పలువురిని ఆహ్వానించారు. సోనియాగాంధి కార్యక్రమంలో పాల్గొంటుందన్న ప్రచారమూ జరిగింది. వైఎస్ మరో దగ్గరి స్నేహితుడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా, సోనియా సభకు రాలేకపోయిన విషయాన్ని బహిర్గతం చేశారు. యావత్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యోధానయోధులు, కేంద్ర మంత్రి మండలిలోని ఉద్దండులు, రాష్టంలోని వైఎస్ అభిమాన భజన మండలి, వారు-వీరు అనే తేడా లేకుండా, సభలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ రాజకీయ వారసులం తామే అంటూ ఉపన్యాసాలిచ్చారు. అవును మరి! వైఎస్ వల్ల అంతో-ఇంతో లబ్ది పొందిన వీరంతా ఆయన వారసులమని చెప్పుకోకుండా వుండే ధైర్యం వుందా? సోనియా గాంధీ ఢిల్లీలో వుండి వున్నట్లయితే ఆమె ఆ సభకు హాజరై వుండేదా? అనుమానమే! సోనియా కోరుకుంటున్నది తన సారధ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పార్టీలోని అందరినీ కూడగట్టుకుని జగన్ కు చెక్ పెట్టాలని తప్ప, వైఎస్ వారసులుగా మాత్రం కానే కాదు. ఒకవేళ ఆమె వైఎస్ వారసత్వంతో పటిష్టమయ్యే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనుకుంటే, ఏనాడో ఒకనాడు జగన్మోహన్ రెడ్డినే ఆహ్వానింస్తుందికాని పరోక్షంగా ఇలా మాత్రం చేయదు. జగన్ ను, ఆయన ఎవరి వారసుడుగా చెప్పుకుంటున్నడో ఆ రాజశేఖర రెడ్డిని ఓడించడమే సోనియా లక్ష్యం అయ్యుండాలి.

అనుకున్నట్లే-ఆహ్వానించింది ఎవరైనా-పరోక్షంగా అధిష్టానం ఆశీస్సులున్నా లేకపోయినా-పిలుపు అందుకున్న వారు, అందుకోనివారు-వై ఎస్ రాజశేఖర రెడ్డి మీద నిజమైన ప్రేమ వున్న వారు, లేనివారు, అందరూ పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. ఒకరిని మించి (మనసులో వుద్దేశం ఏదైనప్పటికీ) మరొకరు వై ఎస్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా రాజశేఖర రెడ్డి విజయాల వెనుక కెవిపి రామచంద్ర రావు వున్నారన్న భావన కూడా వచ్చే ట్లు మాట్లాడారు వారంతా. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి-కేవీపీ రామచంద్ర రావులేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నొక్కి వక్కాణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కోశాధికారి, సీనియర్ నేత మోతీలాల్ వోరా తదితరులంతా వైఎస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ వాది అని, సోనియాకు అత్యంత విధేయుడని కూడా పొగిడారు.

ఇంతకూ కెవిపి రామచంద్రరావు మనసులో ఏముంది? పుస్తకావిష్కరణ ఆలోచన ఆయనదేనా? రెండేళ్లు పనికిరాని ఆయన హఠాత్తుగా అధిష్టానానికి ఇప్పుదెందుకు అవసర మయ్యాడు? కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ "విభజించి పాలించు" అన్నదే వ్యూహం. జగన్ నుంచి వివేకాను విడదీసి లబ్ది పొందుదాం అనుకుంటే, అది బెడిసి కొట్టింది. రోశయ్యకు మొదలు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే ఆశించిన ఫలితాలు రావడం లేదు. శంకరరావు లాంటి వారి పాత్ర పరిమితమైనదే. రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి పరిపూర్ణంగా తెలిసిన ఏకైక వ్యక్తి కెవిపి రామచంద్ర రావు మాత్రమే. జగన్ ఎలాగూ ఎదురు తిరిగాడు. ఆయనను సరాసరి యుద్ధంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదనే ది అధిష్టానం పసికట్టింది. ఏ ఎత్తులు-జిత్తులతోనైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కెవిపి తెలివితేటలు తోడ్పడ్డాయో, వాటితోనే ఆయన కుమారుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే, ఈ పుస్తకావిష్కరణ తతంగం సాగింది. ఎలాగూ కేవిపికి "చంద్రగుప్తుడు"లాంటి పదవిపై కోరిక-కాంక్ష లేదు. ఆయన కోరుకునే "చాణక్యుడి పాత్ర" ఎందుకు ఆయనకే ఇవ్వకూడదనేది అధిష్టానం ఆలోచన. చాణక్య నీతిలో విజయం సాధిస్తే జగన్ ను కట్టడి చేయగలమనే ఆశతోనే ఇదంతా. ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు!

Saturday, April 30, 2011

ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం:వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం

వనం జ్వాలా నరసింహారావు

ఇటీవలి కాలంలో, "అపనమ్మకం" అనే ఆయుధం అలవోకగా వాడకంలో కొచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంత కంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరి లోను, ప్రత్యేకించి రాజకీయ నాయకులలోను బలంగా నాటుకుని పోయింది. అకార క్రమంలో అగ్రభాగాన వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఆది మానవుడు చేతికి దొరికిన దాన్నే తనకు రక్షణగా ఉపయోగించుకుంటే, పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారడంతో, అలా రక్షణకు వాడిన వాటినే, ఇతరులపై దాడికి ఉపయోగించుకో సాగారు. మరి కొంతకాలం గడిచాక, వాటినే పదునైన ఆయుధాలుగా మలచుకోవడం మొదలైంది. ఇలా ఆరంభమైన ఆయుధాల వాడకం, పరిణామ క్రమంలో, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో, తుపాకులుగాను-ఫిరంగులగాను, దరిమిలా రసాయన-అణ్వాయుధాల వాడకం వరకూ పోయింది. ఆ తర్వాత ఆంత్రాక్స్...అలాంటి మరి కొన్ని మాధవ మేధస్సులోంచి బయటకొచ్చాయి.

ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి తన రక్షణకోసం-ఎదుటివారిని దెబ్బతీయడానికి ఆది మానవుల కాలం నుంచి మొదలైన ఆయుధాల వాడకం, నాగరికత పెరిగే కొద్దీ, దేశ దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే దాకా పోయింది. ఇవన్నీ ఒక వైపు ఇలా కొన సాగుతూంటే, ఆధిపత్య పోరులో భాగంగా, అధికారం కొరకు, వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి వాడే ఆయుధాలు, వ్యూహాత్మకమైన ఆయుధాలు కా సాగాయి. వాటి రూపకర్తలు ప్రజాస్వామ్యం ముసుగులో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ నాయకులు. మొదట్లో ఆ వ్యూహాలు, ప్రజలకు తామేం మంచి చేయదల్చు కున్నామో తెలియచేసే "వాగ్దానాలు" మాత్రమే. అలా చెప్పే వారిలో నిజాయితీ ప్రతి బింబించేది మొదట్లో. క్రమేపీ, చేస్తామని మభ్య పెట్టే వాగ్దానాలు మొదలయ్యాయి. సమాంతరంగా, ఎదుటి వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చాలా కాలం వరకు కొంతలో కొంత నిజాయితీగానే, ఒకరిపై మరొకరు ప్రచారాలు చేసుకునే వారు. అవన్నీ పనికి రాని రోజులొచ్చాయిప్పుడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, వారి నుంచి పాఠాలు నేర్చుకుంటూ-వారినే ఆదర్శంగా తీసుకుంటున్న అనేక మంది, ఎదుటి వారిని దెబ్బ తీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం "అప నమ్మకం". తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటు వ్యాధి అన్ని రంగాల్లోకి పాక సాగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంతకాలం నుంచి, సాగుతున్న మాటల యుద్ధమే.

పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం, సినిమా హీరో నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించి, తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీదుల్లో అవమానం పాలైందనీ-ఆ అవమానానికి ప్రతీకారంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోను-దేశంలోను ఓడించాలని ఇచ్చిన పిలుపుకు తొలుత ఆయన స్వరాష్ట్రంలోను, అనంతరం దేశ వ్యాప్తంగానూ స్పందించిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు (ఆంధ్ర ప్రదేశ్ తో సహా) రాష్ట్రాలలోను, అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలడం గత శతాబ్ది డబ్బై దశకంలో మొదలైంది. రాష్ట్రాలలో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971 లో కాంగ్రెస్ పార్టీని విజయ పధంలో నడిపించిన ఇందిరా గాంధిని ఓడించడానికి, అప్పటి రాజకీయ పార్టీలు, ఎదురు దెబ్బ తీశారే తప్ప, వెన్ను పోటు రాజకీయాలను కాని, అవాస్తవాలు ప్రచారం చేయడం కాని చేయ లేదు. ఆమె చేసిన "తప్పు" నే తమ ఎన్నికల ప్రధానాంశంగా ఉపయోగించుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన "అవినీతి వ్యతిరేక ఉద్యమం" లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, ఆబాల గోపాలాన్ని అందులో పాల్గొనే లా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఇందిరా గాంధి పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా, ఎందరో, ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఇందిరను ఓడించారు. ఆమె చేసిన తప్పులను మాత్రమే ఎంచి చూపారు కాని, ఆమె చేయని-ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై "అప నమ్మకం" కలిగే ప్రయత్నం బహుశా ఎవరూ చేయలేదు.

1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నాయకులు ఉపయోగించిన మరో బ్రహ్మాస్త్రం "నియంతృత్వమా-లేక-ప్రజాస్వామ్యమా" కోరుకొమ్మని ఓటర్లను అడగడం. ఎమర్జెన్సీకి ముందు-ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు, కారణాలు సహేతుకమైనా-కాక పోయినా, ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు చోటు చేసుకున్న విషయం, ఆమెకు అతి సన్నిహితంగా మెలిగిన వారు సహితం ధృవీకరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాల పిలుపుకు స్పందించిన ఓటర్లు, "ప్రజాస్వామ్యానికి" ఓటే సారు. జనతా పార్టీని గెలిపించారు. రెండేళ్ల లోనే ప్రజాస్వామ్యానికి సరైన సారధులు "జనతా పార్టీ నాయకులు" కానే కాదని, కాలేరని నిరూపించడానికి ఇందిరకు అవకాశం దక్కింది. తనపై నమ్మకం పెట్టుకునే దిశగా దరిమిలా వచ్చిన మధ్యంతర ఎన్నికలలో వాగ్దానాలు చేసిందే కాని, ప్రత్యర్థులపై అపనమ్మకం అస్త్రాన్ని వాడుకోలేదు. జనతా పార్టీ అప్పట్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమయిందని ఓటర్లకు తెలియచేసే ప్రయత్నం మాత్రం చేసింది ఇందిరా గాంధి.

ఇందిరా గాంధీనైతే ఓడించ గలిగారు కాని, నిల దొక్కుకోలేక పోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. ఎన్నికలొచ్చాయి. ఇందిరా గాంధి వ్యూహాత్మకంగా, "సుస్థిరతా? అస్థిరతా" అన్న నినాదం లేవనెత్తిందే కాని, "అప నమ్మకం" ఆయుధాన్ని వాడ లేదు. శత్రువును తన బలంతోను, వారి బలహీనతల తోను, గెలిచిందే తప్ప, వాళ్లకు అపవాదు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే, అయిదేళ్ల తర్వాత, అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్ టీ రామారావు, ఇందిరా కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీశాడే కాని ఆమెపై ప్రజల్లో "అప నమ్మకం" ప్రచారం చేయలేదు. తన వ్యతిరేకులతో ఆమె జత కట్టిందని అసత్య ప్రచారాలు చేయలేదు. "మాచ్ ఫిక్సింగ్" అన్న పదాలు ఆమెకు వ్యతిరేకంగా వాడిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్ధతి, మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇటీవలి కాలం వరకూ అవలంబిస్తూనే వున్నాయి. కాని కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైంది, ప్రత్యర్థిని కించపరచడం-అసత్యాన్ని ప్రచారం చేయడం-ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వారిపై ఓటర్లలో "అప నమ్మకం" కలగ చేయడం అని గ్రహించాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఎవరు కూడా ఒకరికి మరొకరు తీసిపోరనే చెప్పాలి.

ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం "మాచ్ ఫిక్సింగ్". క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల-కోచ్ ల-కెప్టెన్ల ప్రతిభ కాదని, ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని, ప్రచారాలు మొదలయ్యాయి. దాన్నే "మాచ్ ఫిక్సింగ్" అని ముద్దుగా పిలువ సాగారు. అదొక అ నైతిక ఒప్పందంగా ముద్ర పడింది. నిజానికి అలా జరిగుంటే అది అ నైతికమే. ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా. కాకపోతే, ఎప్పుడు ఏ మాచ్ ఏ టీం గెలిచినా, దానికి ఏదో రకమైన "మాచ్ ఫిక్సింగ్" కారణం అనే "అప నమ్మకం" ప్రచారంలోకొచ్చింది. ఆ తరహా "అప నమ్మకం" ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే, గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం "మాచ్ ఫిక్సింగే మో!" అన్నంత "నమ్మకం" గా భావించడం మొదలైంది. ఇక రాజకీయ నాయకులు ఆ ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం.

ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ ఆర్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, ప్రస్తుతం జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్" అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో, ప్రచారం తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. ఇటీవలి కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు.

ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా. దీన్ని అరికట్ట లేక పోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించే స్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటి వారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్య పోనక్కర లేదు. తస్మాత్ జాగ్రత్త!

Thursday, March 24, 2011

తానోడి పార్టీని ఓడించెనా? పార్టీ ఓటమితో తానూ ఓడనున్నాడా?:వనం జ్వాలా నరసింహారావు

కౌన్సిల్‌ ఎన్నికలు వైకుంఠపాళి స్థానిక సమరంలో విరిగిన చేయి’

వనం జ్వాలా నరసింహారావు

(సూర్య దినపత్రిక:25-03-2011)

విజయ రహస్యాలు ఎన్నికల సంఘాలకు తెలియవా?, పెద్దల సభా, పునరావాస కేంద్రమా!
మొత్తమంతా రాజకీయ నేపథ్యమే!, ప్రత్యర్థుల ఓటమే లక్ష్యమా?
ఓపెన్‌ సీక్రెట్‌ బ్యాలెట్‌గా మారిన తతంగం

గెలుపు-ఓటములు దైవాధీనం అనే నానుడి పచ్చి అసత్యం. నూటికి మరో నూరు పాళ్లు అవి మానవాధీనం అని ఘంటా పధంగా చెప్పడానికి ఇటీవల జరిగిన మూడు రకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉపాధ్యాయ-పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాని, ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు కాని, స్థానిక సంస్థల కోటావి కాని...ఆ మాట కొస్తే భవిష్యత్ లో జరగబోయే మరి కొన్ని ఈ మోస్తరు ఎన్నికలు తీరుతెన్నులు కాని, కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కించిత్తైనా గమనిస్తున్న దాఖలాలు అసలు లేనే లేవు. ఏ పార్టీ అభ్యర్థులు-ఎంత మంది-ఎలా గెలిచారనేది ఇంగిత జ్ఞానం వున్న ప్రతివారికి ఆసాంతం తెలిసిన విషయమే అయినా, ఎన్నికల సంఘానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. "పెద్దల సభ” కు ఎన్నికయ్యేది "పెద్దలు” కాదని, అది కేవలం "రాజకీయ నాయకుల పునరావాస కేంద్రం" అని భావించిన స్వర్గీయ ఎన్ టీ రామారావు తెలుగు దేశం అధికారం చేపట్టిన తక్షణమే దాన్ని రద్దు చేయించారు. సభను పునరుద్ధరించడానికి బహిరంగంగా అయిష్టం వ్యక్తం చేసిన ఎన్ టీ రామారావు వారసులు, మనస్సులో ఒకింత సంతోష పడి, సభను రాజకీయ వేదికగా మలచడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఫలితమే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఆ పార్టీ-ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఉపాధ్యాయ-పట్టభద్రుల-ఎమ్మెల్యే-స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల గెలుపు-ఓటములు. ఎన్నికల నిబంధనలతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, తమ గెలుపు-ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలు భవిష్యత్ భారతానికి ఇస్తున్న సంకేతం-సందేశం ఏదైనా వుందా?

ఉపాధ్యాయుల సమస్యలకు తోడు, దైనందిన ఇతర ప్రజా సమస్యల విషయంలో కూడా, రాజకీయాలకు అతీతంగా విశ్లేషణాత్మకమైన తమ మేధో సంపదను చట్ట సభలకు అందించి, విలువైన పాలనా పరమైన సూచనలను ప్రభుత్వానికి అందించేందుకు, ఉపాధ్యాయ వృత్తికి చెందిన వారినే ఎమ్మెల్సీలుగా ఎన్నుకునేందుకు ఎగువ సభలో కొంత కోటా ఏర్పాటయింది. అదే విధంగా పట్ట భద్రులకూ కొంత కోటా వుంది. అయితే జరుగుతున్న దేంటి? ఈ రెండు కోటాల్లోను, ఎవరో ఒకరిద్దరి విషయం మినహాయించి, పోటీకి దిగిన ప్రతివారూ, ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, రంగంలోకి దిగడం లేదు-దిగ లేకపోతున్నారు. ఈ కోటాల్లో కూడా, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ నేపధ్యంలోనే జరుగుతోంది. అంతవరకు బాగానే వుంది. వీరి విషయంలో కూడా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా నైనా క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది వ్యవహారం. కాంగ్రెస్ సమ్మతి-అసమ్మతి వర్గ అభ్యర్థులు, జగన్ వర్గం అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులు, వీరి మద్దతు అంతో-ఇంతో కూడగట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగి, ప్రత్యర్థుల ఓటమికి కృషి చేశారు. తమ గెలుపు లక్ష్యం కన్నా, ఇతరుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలివి. సరే అంచనాలు కొందరి విషయంలో అనుకూలంగాను, మరి కొందరి విషయంలో తారు-మారుగాను జరగడంతో, ఓడిన వారి పక్షాన నిలిచిన రాజకీయ పార్టీ నాయకుల కన్ను ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై పడింది. అదో తతంగం.

ఎమ్మెల్యేల కోటాలో పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు మాత్రమే వీలుండగా, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ చాణక్యులు, వారి-వారి అనుకూల కూటముల అవగాహన (రాహిత్యం) ప్రకారం, కలిమిడిగా-విడి విడిగా, పన్నెండు మంది అభ్యర్థులను రంగంలో దింపారు. సంఖ్యాపరంగా ఖచ్చితంగా గెలిచే స్థానాలు కాంగ్రెస్-ఎంఐఎం-ప్రజారాజ్యం పార్టీ కూటమికి ఏడు కాగా, టిడిపి-సీపీఐ కూటమికి మూడున్నాయి. ఈ రెండింటితో సంబంధం లేని తెరాస పార్టీకి కాని, వారికి మద్దతిచ్చిన బిజెపికి కాని, ఇదమిద్ధమైన సంఖ్యా బలం లేని జగన్ వర్గానికి కాని తమ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం లేదు. వ్యూహాత్మకంగా జగన్ వర్గం రంగంలోకి దిగకుండా, జాగ్రత్తగా పావులు కదిపింది. తెరాస-బిజెపి కూటమి ఒక అభ్యర్థిని, తెలుగు దేశం పార్టీ అదనంగా మరో అభ్యర్థిని రంగంలోకి దింపాయి. సాధారణంగా బలాబలాలు స్పష్టంగా వున్నప్పుడు ఏకగ్రీవంగా జరిగే నిర్ణయం, ఈ సారి, ఎన్నికల ద్వారా తీసుకోవాల్సిన అవసరం పడింది. గెలుపుపై ధీమా-ఓటమిపై గుబులు-నమ్మకం-అప నమ్మకం అన్ని పార్టీలలో చోటు చేసుకుంది. తప్పకుండా ఓడుతామని తెలిసిన తెరాస-బిజెపి కూటమితో సహా, అన్ని పార్టీలు, తమ-తమ ఎమ్మెల్యేలను తమదైన శైలిలో "కట్టుబాట్ల" లో వుంచే ప్రయత్నం చేశాయి. "సీక్రెట్ బాలెట్" కాస్తా "ఓపెన్ సీక్రెట్ బాలెట్" గా మారి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళికి విరుద్ధంగా జరిగింది. ఆసాంతం పర్యవేక్షించాల్సిన ఎన్నికల సంఘం నోట మాట లేదు. ఎవరినీ తప్పు పట్టలేని స్థితికి చేరుకుంది. గెలిచిన వారు, ఓడిన వారు ఒకే తప్పు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష పార్టీల వారు, తమ చేతిలో వున్న "క్రాస్ ఓటింగు" ఆయుధాన్ని యధేఛ్చగా వాడుకున్నారు. తాము ఓడి పార్టీని ఓటమి పాలు చేసిన వారు కొందరైతే, పార్టీని ఓడించి తామూ ఓటమి పాలైన వారు మరి కొందరయ్యారు. రహస్య బాలెట్ కు అపహాస్యం జరిగిన ఈ ఎన్నికను ఆసాంతం ఎన్నికల కమీషన్ సమీక్షించక పోతే, భవిష్యత్ లో "సాధారణ ఎన్నికల్లో కూడా ఇలానే జరగడం తథ్యం".

రంగంలోకి దింపిన అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నంలో పడ్డ పార్టీలు ఎన్నికల నియమావళిని అతిక్రమించాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం బహిరంగంగా ఆయా పార్టీల నాయకులు తమ-తమ ఎమ్మెల్యేలకు "కోటాలు-కోడ్ లు" ఏర్పాటు చేయడమే. గతంలో కేవలం పార్టీల అంతర్గత వ్యవహారంగా వుండే ఈ విధానం, అవధులు దాటి, ఫలానా ఎమ్మెల్యేను-ఫలానా ఎమ్మెల్సీ అభ్యర్థికి "మాత్రమే" ఓటెయ్యాలని నిబంధన విధించడంతో పాటు, వారు పార్టీ చెప్పిన ప్రకారం వేశారా-లేదా తెలుసుకోవడానికి "రహస్యమైన కోడ్" ని ఆయా ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేశామని ప్రకటన చేసే దాకా వచ్చింది. రహస్య బాలెట్ అన్నప్పుడు రహస్యంగా వుంచాలి. కాదనుకున్నప్పుడు ఓపెన్ బాలెట్ పెట్టి బలా-బలాలు తేల్చుకోవాలి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రెండూ కాకుండా పోయింది. సాక్షాత్తు అధికార పార్టీ, తమ ఎమ్మెల్యేలకు కోడ్ విధించిన విషయం బాహాటంగా ప్రకటించగా, బాధ్యతాయుతమైన ప్రతి పక్ష పార్టీ అదే పని చేయడం దురదృష్టం. అదే పనిని ఓడి పోతామని తెలిసిన తెరాస కూడా చేసింది. ఇంత జరిగినా, "కోడు-గీడు" పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన పలువురు ఎమ్మెల్యేలు, "తమకు నచ్చిన"-"తమనే నమ్మిన" అభ్యర్థికి ఓటు వేశారు. ఫలితంగా, అధికారిక కోటాకన్నా అధికంగానో, తక్కువగానో దాదాపు అందరు (గెలిచిన-ఓడిన) అభ్యర్థులు ఓట్లున్నాయి. తమ బలం కంటే మూడు రెట్లు ఓట్లు ఎంఐఎం పార్టీ తెచ్చుకుంటే, కేటాయించిన దానికంటే, ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం సాక్షాత్తు ముఖ్యమంత్రినే ఆశ్చర్య పరిచింది. అదే పరిస్థితి తెలుగు దేశంలోను ఏర్పడింది. ఫలితంగా ప్రతిభా భారతి ఓటమి, మహమ్మద్ జానీ గెలుపు ప్రపంచకప్పు క్రికెట్ పోటీలను తలపించాయి. కధ ఇంతటితో ఆగ లేదు. ఒక కాంగ్రెస్ అభ్యర్థికి కేటాయించిన దానికంటే ఎక్కువగా వచ్చిన ఓట్లు తెరాస పార్టీవని, ఆ పార్టీకి చెందిన ముగ్గురు క్రాసు ఓటింగుకు పాల్పడ్డారని, వారి ముగ్గురి ని పార్టీ నుంచి సస్పెండు చేశారని, మర్నాడు బయట పడింది. తప్పు చెయ్యమని (కోటా కేటాయించడం) పార్టీ నాయకులు చెప్పినప్పుడు, ఆ తప్పును తమకు ఇష్టమొచ్చిన (తాము అనుకున్న అభ్యర్థికి) వారికి ఓటెయ్యడం ద్వారా చెయ్యడంలో తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు.

స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి జరిగిన ఎన్నికలు మరో తతంగం. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇరకాటంలో పడింది. అభ్యర్థులను గెలిపించలేక పోయారన్న నింద సంబంధిత మంత్రులపై అంతో-ఇంతో పడింది. వారికి జిల్లాల్లో పట్టులేదన్న కారణాన ఓటమికి దారితీసిందంటే, "కాంపుల నిర్వహణ" లో వారి బలహీనత బహిర్గతమైందనుకోవాలి. కాంపుల నిర్వహణంటే డబ్బుల పంపకం, ఇచ్చిన డబ్బులకు ప్రతిఫలం దక్కేందుకు అదో రకమైన "కోడ్" వుండే వుండాలి. అయినా అనుకున్న ఫలితాలు దక్కలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి జిల్లాలో కూడా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రావాలని భావించిన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలలో బలం స్పష్టంగా వుండాలి. ఈ రెండు జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఓటమికి బాధ్యత ఎవరిదనే విషయంలో ఇప్పుడిప్పుడే స్పష్టత రాదు. అది ఆ పార్టీకున్న ప్రత్యేకత. జగన్ వర్గం ఓడిందా-గెలిచిందా అంటే, ప్రజా స్వామ్యంలో, ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే కనుక, గెలిచిందనే అనాలి. కడపలో బలం తగ్గిందా అంటే, ఈ గెలుపుతో ఆ వర్గం కనీసం భవిష్యత్ లో నన్నా బలపడుతుందని చెప్పక తప్పదు. కాకపోతే జగన్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకత్వం గట్టి పోటీ ఇచ్చింది.

ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన మిశ్రమ ఫలితాలు నిరాశ పరిచాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అన్నారు. ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని బావించిన సీఎంకు మూడు స్థానాల్లోనే గెలవడం, భవిష్యత్ లో నన్నా మరింత బలపడమని ఆయనకు పరోక్ష సంకేతం అనుకోవాలి. టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒక్కరినీ గెలిపించుకోలేని జగన్‌కు సరికొత్త వూపిరినిచ్చింది ఈ ఎన్నికలు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. "కాంగ్రెస్ ఓడిపోదని... ఓడించబడుతుందని ఫలితాలు మరోసారి రుజువు చేశాయి'' అని కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా తనమీదే వేసుకున్న ముఖ్యమంత్రి "తానోడి పార్టీని ఓడించెనా? పార్టీ ఓటమితో తానూ ఓడనున్నాడా?". మరింత బలపడడానికి ఈ ఎన్నికలు కారణం కానున్నాయా? తేల్చాల్సింది ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులే. గెలుపు ఓటములు ఎప్పుడూ దైవాధీనం కాదని, మానవాధీనం కూడా అని ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి.