Monday, June 26, 2017

పొలంలో నిలిచిన మట్టిమనిషి : వనం జ్వాలా నరసింహా రావు

పొలంలో నిలిచిన మట్టిమనిషి
వనం జ్వాలా నరసింహా రావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (27-06-2017)

రైతుల అభ్యున్నతికి నిబద్ధతతో పనిచేస్తూ, గ్రామీణాభివృద్దికి పెద్దపీట వేస్తూ, తదనుగుణంగా  ప్రణాళికలను సిద్దం చేస్తూ, సమగ్రమైన విధివిధానాలను రూపొందిస్తూ, రైతుల పురోభివృద్ది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ దిశగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎకరానికి  రూ. 8000  ఆర్థిక సహాయాన్ని ఒక ఏడాదిలో రెండు దఫాలుగా, ఖరీఫ్, రబీ పంట కాలంలో రూ. 4000 చొప్పున రైతులకు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయం వ్యవసాయరంగం సంపూర్ణంగా అభివృద్ది చెందడానికి, రైతులు గణణీయంగా లాభాలను ఆర్జించేందుకు దోహదపడుతుంది.  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా, తొలిసారిగా, ప్రభుత్వ పెట్టుబడితో వ్యవసాయ రంగాన్ని, రైతు సమాఖ్యలను బలోపేతం చేయటం అనే వినూత్న సంప్రదాయాన్ని  ఆవిష్కరించటం ఒక అద్భుతంగా చెప్పుకోవాలి.

దశాబ్దాలుగా దళారీల, మధ్యవర్తుల దోపిడికి గురవుతున్న రైతాంగం ఆ చెర నుండి విముక్తులు కావటంతో పాటుగా ఒక సంఘటిత శక్తిగా మారడానికి వారిలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఆస్కారం లభిస్తుంది. రైతు పండించిన పంట అమ్ముడు పోకపోయినా, మధ్య దళారులు ఆటంకాలు కలిగించినా, రైతు సమాఖ్యలు జోక్యం చేసుకుని, సరైన సమయంలో స్పందించి, ఆ పంటకు తగు  ధరను నిర్ణయించి, సదరు పంటను కొనుగోలు చేసి, రైతంగానికి అండగా నిలబడే విధంగా సమాఖ్య వద్ద వుంచడానికి రూ. 500 కోట్లతో నిధి ఏర్పాటు చేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఆ ప్రకారం గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమాఖ్యలు ఏర్పాటు కావించి వాటికి తగు రీతిన నిధులు అందించి దిగుమతికి తగ్గ చెల్లింపులు అందించేందుకు ఆస్కారం కల్పించే విధంగా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.  ఇందులో భాగంగానే రైతు సంఘాల ప్రతినిధులతో సమాలోచనలు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు అవగాహన కల్పించడానికి దశల వారీగా వివిధ ప్రాంతాలలో పర్యటించేందుకు, రైతులను సమాయత్త పరిచి, వారికి ప్రభుత్వ ఆలోచనలను విశదీకరించేందుకు తగు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

రైతు సగటు కమతం రమారమి 1.12 హెక్టార్ల భూమిగా గణాంక లెక్కలు చెబుతున్నాయి. 61.97 లక్షల హెక్లార్ల భూమి 55.54 లక్షల మంది ఆధీనంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్ష పాతం ఆధారంగా, ఎర్రరేగడి, నల్లరేగడి వంటి రకాల ఆధారంగా,  పండించే పంటల ఆధారంగా, రాష్ట్రం నాలుగు వాతావరణ ఆధారిత వ్యవసాయిక జోన్లుగా విభజించడం జరిగింది. తిరిగి, ఈ నాలుగు జోన్లను ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా మరో 98 రకాల పంట భూమిగా విభజించటం జరిగింది. ఇందులో నలుపు, ఎరుపు, నిస్సార, కంకర చవుడు మట్టి లాంటి రకాలున్నాయి. గణాంకాల ఆధారంగా 57 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగుకు అణువుగా వుంది. తృణ ధాన్యాలైన వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలైన కంది, పెసర, శనగ, వేరుశనగ, సోయ, ఆముదం, పత్తి, మిరప, చెరకు, ఉల్లి తదితర పంటలు రాష్ట్రంలో పండించటం జరుగుతోంది.

‘విత్తనం’ మెరుగైన వ్యవసాయానికి మూలాధారం. నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం, రైతుకు అందుబాటులోకి తేవటంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ‘‘భారతదేశానికే విత్తన భాండాగారంగా’’ అభివృద్ది చేయడం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా దీర్ఘ కాల విత్తనోత్పత్తి ప్రణాళికలను రూపొందించే క్రమంలో వ్యవసాయ శాఖ, అనుబంధ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు కార్యాచరణకు పూనుకున్నాయి. రాష్ట్రంలో పది లక్షల  క్వింటాళ్ళ నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవటం జరుగుతుంది. అలాగే సబ్సీడీ కింద అందించే విత్తనాలను సరఫరా చేసే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తేవటం జరుగుతుంది. రాష్ట్రంలో  ఇప్పటి వరకు 10 విత్తనోత్పత్తి సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయటంతో పాటు విత్తన నియంత్రణ ప్రక్రియ కొరకు, విశ్లేషణ చేపట్టేందుకు, తదితర సేవలు అందించడానికి, విత్తన పరీక్షా కేంద్రాలు, నాణ్యతా ప్రమాణాలను అందించే కార్యక్రమాలు, విత్తన సరఫరా సంస్థలకు గుర్తింపు నిచ్చే కార్యాక్రమాలు చేపడుతూనే ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి తద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యతకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతున్నది.

వ్యవసాయరంగం పురోభివృద్దికి, పెద్దమొత్తంలో ఉత్పత్తికి, నాణ్యతతో కూడుకున్న దిగుబడికి  సక్రమమైన ఎరువుల వాడకం అవసరం. వ్యవసాయ శాఖ నాణ్యమైన ఎరువులను సరఫరా చేయటానికి  చర్యలు చేపడుతుంటుంది. పంటల పరిరక్షణకు, వాటిలో వచ్చే తెగుళ్లను, చీడ తదితర వ్యాధులను నిరోధించడానికి తగు చర్యలను సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు గాను కొత్త రకాల మందులను, వ్యాధి నిరోధక పరిశోధనలను క్రమం తప్పక అణ్వేషించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త రకం మందుల ఉత్పత్తితో పాటుగా, సమగ్ర పంటల పరిరక్షణ విధానాలు రూపొందిస్తూ, వాటిని అధ్యయనం చేస్తూ, రైతులకు ఆయా విధానాల పట్ల అవగాహన కల్పిస్తూ, శిక్షణనందిస్తూ, రైతన్నలకు చేదోడుగా ఉంటూ వ్యవసాయ శాఖ ఎన్నో చర్యలను చేపడుతున్నది.

యాంత్రీకరణ వ్యవసాయం వల్ల దిగుబడి పెరిగి ఖర్చులు తగ్గేందుకు ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ముందుకు పోవటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు వీలు కలుగుతుంది. వ్యవసాయ శాఖ ఇందుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ యంత్రాలను సబ్సీడీ ధరలకు అందుబాటులోకి తీసుకు వచ్చి వ్యవసాయదారులకు తగు రీతిన సహాయ పడుతూ ఉంటుంది.

2016 నుండి ఇప్పటి వరకూ రాష్ట్రంలో మూడు రకాలైన పంటల భీమా పథకాలను అమలు పరచటం జరుగుతున్నది. ఖరీఫ్ పంట కాలంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమాయోజన పథకం, వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం, ఏకీకృత  భీమా పథకం వంటివి తీసుకురావటం జరిగింది. పంటలకు రుణాలను పొందిన వారందరికీ ఈ భీమా పథకాన్ని వర్తింపచేస్తూ వారు ఎంచుకున్న పంటలకు అనుగుణంగానే భీమా పథకాన్ని అమలు చేయటం జరుగుతోంది. ఇతరులకు మాత్రం వారు కోరుకుంటేనే భీమా అందించే విధంగా చర్యలు చర్యలు చేపట్టడం జరుగుతుంది.


పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు, ఆవశ్యకతలకు లోబడి ఆహర ధాన్యాల ఉత్పత్తి, పెంపుదల ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో రైతులకు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా శిక్షణ, మెరుగైన సాగుకు మెళుకువలు అందించడం జరుగుతుంది. వ్యవసాయ విస్తరణకు, వ్యవసాయ రంగంలో సాగిస్తున్న సాంకేతిక పురోగతిని, రైతులకు అందుబాటులోకి తీసుకు రావటం ఎంతయినా అవసరం. మహిళలు కూడా వ్యవసాయ రంగంలో ముఖ్య భూమిక వహిస్తుంటారు. భూమిని వ్యవసాయానికి అణువుగా తయారు చేసి అందుబాటులోకి తేవటం మొదలుకుని దానిని మార్కెట్ వరకు తీసుకురావటంలో వారి కృషి, వారి పరిశ్రమ ఎంతయినా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు కృషి జరుగుతున్నది.

వర్షాధార ప్రాంతాల అభివృద్దికి ‘‘రైన్ ఫెడ్ ఏరియా డెవలప్ మెంట్’’  (ఆర్.డి.ఎ) కార్యక్రమం కింద ఆయా ప్రాంతాలలో తగురీతిన వ్యవసాయం కొనసాగించే విధంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతాలలో సమీకృత వ్యవసాయ విధానం అవలంభించటం వల్ల పంటలు పండించటం,  మిశ్రమ పంటలు పండించటంతో పాటుగా అనుబంధంగా పూలు, కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, చేపల చెరువుల రూపకల్పన  ద్వారా చేపలు, రొయ్యలు, వృద్ది చేయటం జరుగుతుంది. తద్వారా, వారి జీవనోపాధిని పెంపొందించే విధంగా దోహద పడటం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.

నాణ్యమైన, ఆరోగ్యకరమైన సాగుభూమిని రూపొందించుకొని దానిని పరిరక్షించుకోవటం ఈ మొత్తం ప్రక్రియలో సాంకేతికమైన సవాలు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి వ్యవసాయ భూమిలో సాంద్రత పెంచేందుకు చర్యలు చేపడుతూ పెద్ద ఎత్తున దిగుబడికి, ఆహార భద్రతకు, సమగ్ర గ్రామీణాభివృద్దికి చర్యలు తీసుకోవటం, అమలు పరచటం జరుగుతుంది. ఈ కార్యక్రమ లక్ష్యం సమీకృతంగా సారవంతంగా భూమి కొనసాగేవిధంగా చర్యలు తీసుకోవటం, తగురీతిగా ఎరువులను తదితర ఉత్పత్తులను వినియోగించే విధంగా చూడటం, ఆర్గానిక్ ఎరువుల ద్వారా భూమి సారాన్ని దీర్ఘకాలం వినియోగించుకునే విధంగా చూడటం, తద్వారా సారవంతమైన భూమిని పరిరక్షించుకోవటం జరుగుతుంది. వ్యవసాయ శాఖ ఇందుకు తగ్గ పరీక్షలను నిర్వహించి సారవంత భూముల సంపూర్ణ ఆరోగ్య భద్రతకు, పరిరక్షణకు తగ్గ భద్రతా ప్రమాణాలకు లోబడి వారికి గుర్తింపు కార్డులను జారీ చేయటం జరుగుతుంది.

రాష్ట్రంలో వ్యవసాయపరంగా ఉన్న అవసరాన్ని బట్టి అంచనాలు వేసి క్రాఫ్ కాలనీలు ఏర్పాటు కావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులైన పంటలు, కూరగాయలు, నూనెలు, పళ్ళు మన అవసరాలకు సరిపడేవిగా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయటానికి అన్నట్లుగా ఉత్పత్తి చేసుకుని, అలాగే మానవ అవసరాలతో పాటుగా పశువుల పోషణకు సరిపడే విధంగా దాణాకు, కోళ్ళ దాణాకు, చేపల దాణా తదితర అవసరాలకు తయారు చేసుకునే విధంగా సన్నద్దం కావాలని ఆలోచనలు సాగించింది.

ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలకనుగుణంగా కేవలం కూరగాయలను మాత్రమే ఉత్పత్తి చేసే విధంగా గుర్తించి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఒక గ్రామంలో స్వయం సమృద్దిగా కూరగాయ పంటలు పండించినట్లయితే ఆ గ్రామ అవసరాలు సంపూర్ణంగా తీర్చినట్లు అవుతుందని తద్వారా ప్రతీ గ్రామంలో వారి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు అందుబాటులోకి తేవటం జరుగుతుందని ఆయా పంటలు, ఉత్పత్త అక్కడికక్కడ ఉండటం  ద్వారా స్వయం సమృద్ది సాధించినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.


వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాలికలు, పథకాలు, అనుకున్న విధంగా అమలవుతే, దశాబ్దాలుగా రైతులను పీడిస్తున్న దళారీలు  కనుమరుగై  రైతే రాజన్న బంగారు తెలంగాణ ఆవిర్భవించడం తధ్యం. తెలంగాణ రైతు సంతోషంగా, సుఖంగా, సౌభాగ్యంగా వుండడమూ తధ్యం. END

తెలుగు భాష , సాహిత్యాల కలయికే మానవతావాదం : వనం జ్వాలా నరసింహారావు

తెలుగు భాష , సాహిత్యాల కలయికే మానవతావాదం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (26-06-2017) and (03-07-2017)

            మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీద ఆధారపడి వుండే రీతిలో మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో, ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా, మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు, చివర అంటూ ఏమీలేదు.

మానవ విలువల పరిరక్షణకు అసలు, సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. పండితులైనా, పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే "సాహిత్యం అంటే ఏంటి" అన్న తన పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని, ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే.. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు, ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.

అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథాన్నిoచి పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా తెలుగు ప్రాంతాన్ని పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. తెలుగువారు  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని అంటారు. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారున్నారు.

నవంబర్1,1956 తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. తరువాత మూడేళ్ళ కింద జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో, లేదో, తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు, తమిళులు మాత్రం విడిపోయారు. కలిసుండ వద్దనుకున్న అంధ్ర, తెలంగాణ ప్రాంతం  తెలుగువారు మాత్రం విడిపోయారు. కాకపోతే, భాషాపరంగా ఒకరిమీద పడ్డ మరొకరి ప్రభావం ఇంకా కొంతమేరకు అలాగే వుంది.

తెలుగువారు మాట్లాడే భాషను "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని, "మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా వారు అలానే పిలిచేవారు "మసూలీపట్నం", "మచిలీపట్నం", "బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రాన్ని పిలుస్తాం.


విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ బహిష్కృతులైన ఆయన ఏభైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలో వున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది. ఆర్యన్ కు వికృతి "అయిరాన్ అనీ, అదే ఇరాన్ గా మారిందనీ చెప్పబడింది. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్, భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం, క్రీస్తు శకం ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని, తెగలవారిని కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.

దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ  శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య, యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది.


మతపరమైన నమ్మకాలు, సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల, చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహుశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు.

ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నంది వర్ధనుడు, ఆయన శిష్యుడు దేవల రాయ అని అంటారు. తెలుగు భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదుకాకూడదనీ లేదు. తెలుగు మాట్లాడే  దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం, నిబంధనలు, మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, భాషా కోవిదులు, పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర, దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల, ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.

పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం, అభివృద్ధి నన్నయకు పూర్వం, క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి: తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి. క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక దశ, వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో, ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి. ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ, దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.

ఇదిలా వుంటే, తెలుగు భాష గురించి కాళోజీ నారాయణరావు గారి వ్యాఖ్యలు ఓ విజ్ఞాన సర్వస్వం లాంటివి. వారి ఆత్మకథలో ఒకచోట, విశ్వనాథ సత్యనారాయణ గారితో కాళోజీ చెప్పిన మాట... "మీరు తెలుగుల రాసింది నా బోటి వాండ్లకు కూడా తెలివకపోయె. తెలుగుల రాయడం వల్ల తెలుగు రాని ప్రాంతం వాండ్లకి మీ ప్రతిభ తెల్వడం లేదు. కాబట్టి దయచేసి మీరు తెలుగు రాయడం మానుకుని సంస్కృతంలోనె రాస్తె సంస్కృతం తెల్సిన వాండ్లకి మీ ప్రతిభ బోధపడుతుంది. మీ స్థాయీ వాండ్ల కర్థమవుతుంది. మీరు తెలుగులో రాయడమెందుకు? మీ భాష అర్థం కాక మేం బాధపడడమెందుకు? ‘నీకేం తెలుస్తుందిలే’ అని మీరనడమెందుకు? సంస్కృతంలో రాయండి".

          మడులు దడులు కట్టుకోవడానికి కాళోజీ వ్యతిరేకం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెపుతారు ఆయన. "జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా మడులూ, దడులు కట్టుకోడం, గీతలూ, గిరులు గీసుకోవడం సరికాదని నేను భావిస్తను. నా ’ఇజం’ గేయంలో దీన్నే ఎండగట్టిన.....భాష, సాహిత్యం, సంస్కృతి, మనల్ని (తెలుగువాండ్లని) ఒకటి గనే వుంచెగద. నన్నయ్య మహాభారతం, పోతన భాగవతం, పెద్దన మనుచరిత్ర, విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు ఆంధ్రావళి, అడవి బాపిరాజు గోన గన్నారెడ్డి, అన్నే తెలుగు పుస్తకాలే. అవీ ఇవీ కూడా మనవే అని అప్పుడూ అనుకున్నం. ఇప్పుడూ అనుకుంటం. వాండ్లు వేరు, మనం వేరు అనే భావం తెలంగాణా వాండ్లకి ఎన్నడూ లేదు. కాని, వీండ్లూ మనవాండ్లే, వీండ్లదీ మన భాషే, వీండ్లదీ మన జీవిత విధానమే, అనేటి భావాలు, మా గురించి పైనుంచి వచ్చినోళ్లకి వుండేటివి కాదు. కాని తెలంగాణ లోపటి పరిస్థితి వేరు......కృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టులాగా ప్రతాపరుద్రుడు కూడా మన తెలుగువాడేనని మేమనుకునెటోళ్లం. నన్నయ్య తెలుగువాడు, తిక్కన తెలుగువాడు, ఎల్లయ్య తెలుగువాడు, పుల్లయ్య తెలుగువాడు అని మా అభిప్రాయం. సాహిత్యంతో పరిచయమున్న పది మందికే ఇది పరిమితం".

"మేం తెలుగువాండ్లం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా వుండేటిది. తెలంగాణా, రాయలసీమ - రెండూ కూడా కలిసి వుంటేనే అది తెలుగు రాష్ట్రమవుతది. మొదటి నుంచీ తెలుగు భాషకీ, సంస్కృతికీ, సాహిత్యానికి ఈ మూడు ప్రాంతాల వాండ్లూ కలిసికట్టుగనే తోడ్పడిన్రు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక మాత్రమే మనం రాజకీయంగ ఒకటైనం. ఈ మాట మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణా వాండ్లు తెలుగువాళ్లే కాదన్నట్టు ఒక వ్యవహారముండేటిది గద! ఎవరిదాకానో ఎందుకు? ముఖ్యమంత్రి అంజయ్య (తెలంగాణా) తెలుగు మీద ఎంత గల్లంతు లేచిందీ! ఎన్ని కార్టూనులచ్చినై? అంజయ్య తెలుగు ఎంతచదువుకున్నడు అనేటిది అనవసరం. అతని ఇంట్లో భార్యా బిడ్దలతో గానీ, బయట ఇరుగు పొరుగుతో గానీ, తెలుగులోనె మాట్లాడిండు గద! అతని మాతృ భాష (తెలుగు) లో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో మాట్టాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఆరణాల కూలీగా పని చేసినోడు ముఖ్యమంత్రి కాకూడదా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిదీ తెలుగే. అందరం తెలుగోండ్లమే......రావి శాస్త్రి విశాఖ భాషని తెలుగు కాదని మేమూ, నల్గొండ వాండ్లది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగుకాదని బెజవాడ వాడు, బెజవాడ వానిది తెలుగు కాదని రాయలసీమవాడు - ఇట్లనుకుంటపోతె మన మధ్య సహృద్భావం ఎట్టొస్తది? మనమందరం తెలుగువాండ్లం అని చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ - అత్మీయత ఏముంటది? ఒకని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం....."


ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో, ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

అణిమాది సిద్దులున్నహనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలానరసింహారావు

అణిమాది సిద్దులున్నహనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (26-06-2017)

హనుమంతుడు మైనాకుడి చేతిలో చేయి కలిపి, నవ్వు ముఖంతో పోయివస్తానని సెలవుతీసుకొని, మరింత వేగంగా, మరింత పైకెగిరి, సముద్ర మైనాకుల ఆశీర్వాదం పొందాడు. హనుమంతుడి రెండవ ఈ అసాధ్య కార్యం చూసిన దేవతలు ఆయన్ను పొగిడారు. మొదటి అసాధ్య కార్యం సముద్రం దాటడమైతే, రెండవది కొండ అడ్డు వచ్చినా ఛేదించుకొనిపోడం.

            మైనాకుడు చేసిన స్నేహపూర్వక కార్యాన్ని చూసి, ఆకాశం పైనుంచి ఈ సన్నివేశాన్నంతా చూస్తూ నిల్చున్న దేవతలు, ఆయన్ను పొగిడారు. ఇంద్రుడు మైనాకుడిని చూసి, ఇక తనవల్ల అతడికి భయంలేకుండా వరమిచ్చానన్నాడు. సంకోచంలేకుండా లోకంలో సుఖపడమనీ మనస్సునందైనా భయపడవద్దనీ చెప్పాడు ఇంద్రుడు.

            "హనుమంతుడు నిండు ధైర్యంతో పోతున్నప్పటికీ, ఇతడెట్లా నూరుయోజనాల సముద్రం దాటగలడన్న భయంతో, మా గుండెలు కొట్టుకున్నాయి. అట్లా రామకార్యం కొరకు దూతగా పోతున్న హనుమంతుడిని సరైన సమయంలో ఆదరించావు....నిన్ను మెచ్చాను స్నేహితుడా" అని అన్నాడు మైనాకుడితో ఇంద్రుడు.


            ఈ ప్రకారం దేవేంద్రుడు తనతో అనడంతో వరంపొందిన మైనాకుడు భయం విడిచి సంతోషించాడు. హనుమంతుడు తన ప్రయాణం కొనసాగించాడు. (భగవత్ సేవకులకు దేవతలు సహాయపడ్తారని దీనివల్ల తెలుస్తోంది. శ్రేయస్కరమైన కార్యాలకు విఘ్నాలు ఎక్కువ. సంసారాన్ని తరించాలని ఆత్మావలోకనపరుడై యోగాభ్యాసం చేసే వ్యక్తిని చూసి, ఇతడు చెడిపోతున్నాడనే భయంతో, ప్రేమతోనే, అతడి బంధువులు తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తారు. కారణం ప్రేమతో అయినప్పటికీ విఘ్నం, విఘ్నమే. కావున ఇట్టివారిని లక్ష్యం చేయకూడదు. మంచి మాటలతోనే వారికి సమాధానం చెప్పి వెనుకంజ వేయక కృషి కొనసాగించాలి. అదే నిష్ఠ.)

          ఒంటరిగా సాహసించి పోతున్న హనుమంతుడు రావణుడిని ఎలాగెల్చి రాగలడని, దేవతలు, ఋషులు, సిధ్ధులు అనుకుంటారు. ఎలా సముద్రాన్ని దాటగలడన్న సందేహంతో, ఆయన బలాన్ని తెలుసుకోదల్చారు వారు. ఆ ఆలోచనతో, సూర్యకాంతిగల నాగమాత "సురస"ను సందేహ నివృత్తి కొరకు ఉపయోగించ దల్చారు. దైత్య స్త్రీగా పోయి వేగంగా సముద్రాన్ని దాటుతున్న హనుమంతుడికి అడ్డుపడి, ముహూర్తకాలం పాటు ఆలస్యం చేయమని సురసను కోరుతారు. దారికి అడ్డుపడే సమయంలో కోరలు, ఆకాశాన్నంటే నోరు, ఎర్రనిచూపులు, ఎదుటివారిని చంపే మిడిగ్రుడ్లు, ఆమెకుండాలని సూచిస్తారు. తెలివిగా ఆమెను దాటిపోతాడో, లేక, ఆమెకు చిక్కి, పోలేక ఆగిపోతాడో చూద్దామనుకుంటారు.

            సరేనని అంగీకరించిన సురస, ఇంతకు ముందెప్పుడూ ప్రాణికోటి వినని, కనని, భయంకరమైన పెద్ద వికార రూపాన్ని ధరించి ఆకాశంలో తిరుగుతూ, ఆంజనేయుడికడ్డుపడి, ఎదురునిల్చి, "ఎటుబోతున్నావు" అని ప్రశ్నిస్తుంది. "దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు. నన్ను దాటి నీవెక్కడకు పోలేవు. నానోట్లో చొరపడు. నిన్నుమింగుతా. నువ్వేం మాట్లాడినా నేనువినను" అంటుంది సురస. ఈమె సహజ రాక్షసి కాదు, నన్ను పరీక్షించ వచ్చింది, నిజంగా నన్ను తినాలని వుంటే తనే నన్ను నోట్లో వేసుకోవచ్చుకదా! అనుకొని, ఆమెతో విరోధానికి పోకుండా, రెండు చేతులెత్తి జోడించి, నమస్కరించి, తాను వెళ్తున్న పనిని వివరిస్తాడు హనుమంతుడు.

            "దేవీ! శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో అరణ్యంలో తిరుగుతుండగా, రాక్షసులందు ద్వేష బుధ్ధిగల శ్రీరాముడు లేని సమయంలో, ఆయన భార్య సీతాదేవిని రావణుడు అపహరించాడు. ఆ పతివ్రతను నేను చూడడానికి పోతున్నాను. ఇది శ్రీరాముడి ఆజ్ఞ. నీవున్న దేశం కూడా ఆయనదే. నీవుకూడా ఆయన పనిచేయాల్సినదానివే. నువ్వు చేయాల్సిందల్లా నన్ను క్షేమంగా పోనీయడమే. ఆ సహాయం చాలు. అది వీలుకాదంటే, జానకీదేవిని చూసొచ్చి, ఆమె క్షేమ సమాచరం రాముడికి తెలిపిన తర్వాత నీనోట్లో ప్రవేశిస్తాను" అని తాను వెళ్లే కార్యక్రమం గురించి తెలియచేస్తాడు సురసకు. హనుమంతుడి మాటలు తాను నమ్మననీ, తనకు చిక్కి ఆతడు ప్రాణాలతో తప్పించుకుని పోలేడనీ, అదితనకీయబడ్డ వరమనీ అంటూ సురస హనుమను అడ్డుకుంటుంది. అలా అంటూ నోరు తెర్చుకొని నిలబడ్తుంది. తన్ను మింగగల నోరు ఆమెకు లేదని తన దేహాన్ని పది ఆమడల నిడివిగా పెంచుతాడు హనుమంతుడు. సురస తన నోటిని ఇరవై ఆమడల నిడివిగా చేస్తుంది. హనుమంతుడు ముప్పై ఆమడలకు పెంచుతాడు. ఇలా ఇరువురూ పెన్చుకుంటూ పోతుంటారు. ఎప్పుడైతే సురస తన నోటిని నూరు ఆమడలకు పెన్చుతుందో, బుధ్ధిమంతుడైన హనుమంతుడు తక్షణమే తన దేహాన్ని చిన్నదిగా చేసాడు. (హనుమంతుడికి అణిమాది సిధ్ధులున్నాయనడానికి ఇదొక ఉదాహరణ)

అతి వేగంతో, సమర్ధతతో, హనుమంతుడు బొటన వేలంత రూపంలో, చటుక్కున సురస నోట్లో చొరబడి, అంతే వేగంతో, ఆమె నోరుమూసేలోపల, బయటపడి, ఆకాశంలో నిల్చి ఆమెకోరిక తీర్చానంటాడు. "తల్లీ దాక్షాయణీ! నీవు కోరినట్లే నీనోట్లో ప్రవేశించాను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరాన్నీ నిజం చేసాను. నన్ను దయతల్చి నా నమస్కారాన్ని అంగీకరించు. సంతోషంతో నేను సీతను వెదికేందుకు పోతాను. నేను తలపెట్టిన కార్యం సఫలం కావాలని కూడా నీ మనస్సులో అనుకొ" అని హనుమంతుడు చెప్పాడు. రాహువు నోట్లోకెళ్లి బయటకు వచ్చిన చంద్రుడిలాగున్న హనుమంతుడిని చూసి, సంతోషించిన సురస తన నిజస్వరూపాన్ని ధరిస్తుంది. సుఖంగా పోయిరమ్మని దీవిస్తుంది. పనులన్నీ శ్రమ లేకుండా జరిగిపోతాయనీ, శ్రీరాముడి భార్యను ఆయన వద్దకు చేర్చమనీ చెప్పి ఆ నాగమాత వెళ్లిపోతుంది. దేవతలు, ఇతరులు, ఆంజనేయుడు విజయవంతంగా చేసిన ఈ మూడో పనిని కూడా చూసి, "మేలు-మేలు" అని మెచ్చుకుంటారు. (ముముక్షువైన యోగినీ, భాగవతులనీ, దేవతలు పరీక్షిందేకు, విఘ్నాలు కల్పిస్తారు. వీటిని భక్తితోనే తప్పించుకుని పోవాలి హనుమంతుడులాగా అనేది అంతర ధ్వని)


Saturday, June 24, 2017

It’s time TS govt reclaimed its land : Vanam Jwala Narasimha Rao

It’s time TS govt reclaimed its land
Vanam Jwala Narasimha Rao
The Hans India (25-06-2017)

Some land goons grabbed the government lands in Hyderabad and with the help of fabricated general power of attorney documents showing them as private owned lands and sold and managed to register in connivance with the concerned registrar in violation of Registration Act. The Chief Minister K Chandrashekhar Rao on knowing this not only ordered to cancel them but also withdrawn the anywhere registration policy.

This is followed by the state government promulgating an ordinance known as “Telangana Rights in Land and Pattaadar Pass Book Amendment 2017” with the objectives among others maintenance of record of rights in electronic form, combining title deed and pass book and to ensure registration officers to affect the registration of property based on revenue records. The amendments will enable the goals of ease of doing business and faster greater responsibility and accountability in the department.

The land records maintained in the combined state of AP has their own loopholes. There is no Record of Rights Act for the lands in urban areas. The land could be registered even if there is no survey number for it. Despite abolition of Jaghirdari system way back its reminiscences are still in vogue. During the regime of Nizams thousands of acres were gifted to various persons who worked under them. Taking advantage of the fact that those documents were in Urdu, some people are creating forged documents on old stamp papers projecting them as original documents prepared at the time of Nizams and grabbing those lands also. Sub-registrars are registering those fake documents for their illegal benefits. All the properties of Nizam with all details are entered in the “Blue Book” a copy of which is in the custody of Nizam Trust and another with the government.

 “Political Economy of India” a study of Land Reforms Policy in Andhra Pradesh edited by BAV Sharma a professor of Political Science of Osmania University in 1980 has several interesting things on land related issues in Telangana which are of great relevance.

The Nizam and his nobles, who were mostly Muslims, owned 40% of the total land in the state of Hyderabad. It was only after the police action that the Sarf-e-Khas and Jaghirdari system were abolished and these lands were merged in Diwani bringing under government land revenue system. Sarf-e-Khas, Nizam’s own direct estate or “Crown Lands” was the most important under the Jaghirdari system. Sarf-e-Khas land revenue and the resources were used to serve the Nizam family exclusively in addition to some amount from treasury until its merger with Indian Union in 1948. As far as Telangana is concerned Sarf-e-Khas lands cover the area surrounding the city of Hyderabad known as Atraf-i-Baldah.


There were other types of Jaghirs other than Sarf-e-Khas. Paigas were estates granted to Muslim feudals, especially the Nizam relatives, for recruiting and maintaining armed personnel to help Nizam in his wars. The Jaghirs and Samsthanams were those given as reward to officers who distinguished themselves in serving the Nizam. Makhtas, Banjars, Agraharams, Tanakha Jagir, Jaath Jaghir, Altanga Jaghir and Inams were given for various services and their owners were entitled to exploit the peasantry to collect revenue at their will. Some of these Paigas, Jaghirs, and Samsthanams had their own separate police, revenue, civil and criminal systems.

The Jaghirdari system was a vital element of the political system in Hyderabad. In the Khalsa and Diwani areas it was the domination of Deshmukhs and Deshpandes. They grabbed thousands of acres of land fraudulently and made them as their property reducing the cultivator as tenants.  During the first survey settlement, they got the lands registered in their names without the knowledge of the peasants. Under the Hyderabad Land Revenue Act of 1317 Fasli (1908) which lays down the principles of survey and settlement and of land revenue administration each field is considered holding a survey number and the land holder is called Pattaadar who has the right on the land. For maintaining up-to-date record of rights in lands the “Record-of -Rights” (RoR) system was introduced in Hyderabad in 1346 Fasli (1937) but could be enforced only in 19 out of 108 Diwani Taluks. Out of the then 6535 Jaghir villages, survey and settlement was introduced in 5938 villages and the remaining were unsettled. These are mostly in Telangana area.

Dr M Satyanarayana Rao another political scientist, in his article in the book, wrote that, in the first week of February 1949 the Military Governor announced the approval of The Nizam of Hyderabad for amalgamating of his Sarf-e-Khas lands with the Government Lands voluntarily. The Sarf-e-Khas lands were to a tune of 5682 Square Miles spread over 1374 villages mainly in and around Hyderabad. In accordance with another announcement he made the same day, the Hyderabad abolition of Jaghirs Regulation was promulgated on August 15, 1949. With this an estimated 150 Lakhs of acres of Jaghir lands were abolished. A jaghir administrator was appointed and all those who lost lands were compensated. However, Jaghirdars who lost Jaghirs claimed that the lands still belong to them since they owned them leading to litigation even till date.

According to Professor Satyanarayana Rao there was no centralized administration for land related issues until Salarjang introduced his reforms in 1875. Nizam at his will and pleasure used to award Jaghirs to whomever he liked. After Salarjang introduced Jillaband system two types of administrations came into existence. One was known as Government Administration for Diwani lands and the other was known as Different Administration of Jaghirs for different varieties. There was no survey or settlement for Sarf-e-Khas lands. They were never classified.

Yet another classification of lands was known as “Evacuee Property” the owners of which left for Pakistan at the time of partition. It is a known fact that such properties are completely vested in the state. Government of India has appointed an Evacuee Property Administrator in Bombay. The understanding was to allot these lands to those who migrated from Pakistan. Many managed to get fake certificate. Some people alleging that they obtained GPA from the original owners who went to Pakistan are grabbing the evacuee properties.

For instance, the sixth Nizam Mehboob Ali Khan established a match factory in Mahaboobabad in 40 acres of land. After police action, someone grabbed it under the pretext of evacuee property and converted in to house sites plots and sold them. Today no evidence of any match factory there. Dr Satyanarayana Rao says that, the Government College for women opposite HPS Begumpet and the Secunderabad Kasturba Degree College also belong to evacuee property.


For avoiding illegal transactions, each piece of land must be resurveyed and must be entered in the revenue records. All the details are to be made public. There must be an Act like RoR for the lands in urban areas like the one for rural areas agricultural lands. Until and unless yet another survey and settlement takes place to set right the land records and asserting the government right on its own land there may not be an end to litigation. END

మరో సర్వే సెటిల్‍మెంటే శ్రీరామరక్ష : వనం జ్వాలా నరసింహారావు

మరో సర్వే సెటిల్‍మెంటే శ్రీరామరక్ష
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (25-06-2017)

     హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కొందరు దురాక్రమణదారులు ప్రభుత్వ భూములను స్వాహాచేసి, కృత్రిమ ‘‘జనరల్ పవర్ ఆఫ్ అటార్ని’’ పత్రాలను సృష్టించి, వాటిని ప్రయివేటు హక్కుభుక్తంలో వున్న భూములుగా చూపించి, అమ్మి సొమ్ముచేసుకోవడంతోపాటు, "ఎక్కడైనా రిజిస్ట్రర్ చేసుకునే" విధానాన్నిఆసరాచేసుకుని, సంబంధిత రిజిస్ట్రార్ల కుమ్ముక్కుతో, చట్ట విరుద్దంగా రిజిస్ట్రేషన్ చేయించడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం జరిగిందిటీవల. తన దృష్టికి వచ్చిన వెనువెంటనే, ఇలాంటి చట్ట వ్యతిరేక మోసాలకు స్వస్తి పలకాలని నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ రద్దు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, "ఎక్కడైనా రిజిస్ట్రర్ చేసుకునే" విధానాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆదేశాలిచ్చారు

     దీనికి కొనసాగింపుగా, తెలంగాణ "రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్-1971 ను సవరిస్తూ, రికార్డ్ ఆఫ్ రైట్ (ఆర్వోఆర్) యాక్ట్ ఆర్డినెన్స్ అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. జాగీర్, మక్తా, సంస్థాన్, పాయిగా భూములకు ఇకపై ఆర్వోఆర్ హక్కులు లేవని ఈ ఆర్డినెన్స్ స్పష్టం చేసింది. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో, కమ్మ్యూటేషన్ పద్ధతిన, జాగీర్దార్లు, వారి వారసులకు పరిహారం ఇచ్చినట్లుగానే భావించాలని ఈ యాక్ట్ అర్థం. ఇవన్నీ సర్కారు ఆస్తులుగానే పరిగణించాలని కూడా యాక్ట్ చెపుతోంది. అంటే, తెలంగాణ రాష్ట్రంలో  జాగీర్, ఇనాం భూముల రిజిస్ట్రేషన్ ను సంపూర్ణంగా రద్దు చేస్తున్నట్లు అయింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయబడిన భూములు ప్రభుత్వం స్వాధీనపరుచుకునేందుకు ఈ నూతనంగా జారీ చేయబడిన ఆదేశాలు వెసులుబాటు కల్పిస్తాయి. అలాగే, భూమి నమోదుకు సంబంధించి, తొలిగించబడిన విధి విధానాలను ఉటంకిస్తూ తెలంగాణ భూమి పై హక్కులు, పట్టాదారుకు అందించాల్సిన పాసు పుస్తకాలు-2017  ప్రకారం, ఎలక్ట్రానిక్ విధానాన్ని అనుసరించి ఎటువంటి ప్రామాణికలను పాటించాల్సి వుంది, టైటిల్డీడ్, పాస్ పుస్తకాలను అనుసరించి ఎటువంటి ఒప్పంద పత్రాలు జారీ చేయవలసి వుంది, రెవెన్యూ పరిధిలో అధికారులు రిజిస్ట్రేషన్స్ గురించిన ఏఏ నియమాలకు బద్దులై వుండాలి, తద్వారా వ్యాపార లావాదేవీలను త్వరిత గతిన ఏ ప్రాతిపదికలను పాటించాల్సి వుంటుంది. భాద్యతాయుతమైన ఇట్టి పనులను నియమానుసారంగా, పారదర్శకంగా ఆ విభాగం ఎలా రూపొందించాల్సి ఉంటుంది, అనే అంశాలను పొందుపర్చడం కూడా జరిగింది. ఇదో చారిత్రాత్మక నిర్ణయంగా అనుకోవచ్చు.

ఉమ్మడి రాజదానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమికి సంబంధించిన రికార్డులను ఇష్టానుసారంగా తయారు చేయటం వల్ల వాటిలో లోప భూయిష్టమైన తప్పులు అనేకం దొర్లటం జరిగింది. సర్వే నెంబర్లు లేకపోయినప్పటికీ చాలా సార్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయేది. జాగీర్దారీ విధానాన్ని ఎన్నడో రద్దుచేసినప్పటికీ వాటి వల్ల ఉత్పన్నమౌతున్న తప్పిదాలు ఇప్పటికీ ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి. నిజాం పరిపాలనా సమయంలో వేలకువేల ఎకరాల భూమిని వారికింద పని చేసే వారికి నజరానాగా ఇవ్వడం జరిగింది. అలాంటి నజరానా పత్రాలన్నీ ఉర్దూ భాషలో ఉండటంతో దాన్ని అనువుగా తీసుకొని కొందరు పాత దస్తావేజుల మీద, ఇష్టం వచ్చినట్లు నకిలీ ఆస్తి పత్రాలు సృష్టించి, భూముల ఆక్రమణకు పూనుకొవటం మొదలుపెట్టారు. సంబంధిత సబ్ రిజిస్ట్రార్లు వాటిని డబ్బుకు కక్కుర్తి పడి కొనుక్కున్న వారి పేర రిజిస్ట్రర్ చేయించడం కూడా జరిగిపోయేది. వాస్తవానికి, నిజాం ఆరోజుల్లో చేసిన అన్ని లావాదేవీలను ఒక "బ్లూ బుక్" లో నమోదు చేయడమే కాకుండా, దాని కాపీ ఒకటి నిజాం ట్రస్టుకు ఇచ్చి, మరోకటి  ప్రభుత్వం అధీనంలో వుంచడం జరిగింది. ఇదంతా జగమెరిగిన సత్యం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బి..వి. శర్మ సంపాదకత్వంలో, 1980 దశకంలో, పలు ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా తెలంగాణ భూములకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తూ, "పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఇండియా" అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో పేర్కొన్న వాటికీ, నేటి పరిస్తితులకు ఎంతో దగ్గరిసంబంధం, మూలాలు కానవస్తున్నాయి. ఈ పుస్తకంలో ఎందరో అనుభవజ్ఞులైన అధ్యాపకుల వ్యాసాలున్నాయి.

ముస్లిం మతస్తులైన నిజాంలు, వారి అనుయాయులు ఉమ్మడిగా, అలనాటి హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 40 శాతం భూమిని తమ స్వాధీనంలో వుంచుకున్నారు. ‘‘పోలీసు యాక్షన్’’ జరిగిన తరువాత మాత్రమే ‘‘సర్ఫ్--ఖాస్’’, జాగీర్దారు వ్యవస్థలను రద్దు చేసి, ఈ భూములను ‘‘దివానీ’’ భూములకు అనుసంధానం చేసి, తద్వారా ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో చేర్చడం జరిగింది. నిజాం సొంత ఆస్తి అయిన సర్ఫ్--ఖాస్ భూములకు జాగీర్దారీ వ్యవస్థలో ఎక్కువ ప్రాముఖ్యం లభించేది. వీటినే "క్రౌన్ ల్యాండ్స్" అని వ్యవహారించేవారు. వీటిమీద వచ్చే ఆదాయాన్ని, పండేపంటలను నిజాం కుటుంబీకులే అనుభవించేవారు. అంతే కాకుండా హైదరాబాద్ రాష్ట్ర ఖజానా మొత్తం నుండి కూడా కొంత మొత్తాన్ని నిజాం వాడుకునేవారు. ఇలా 1948 లో భారత యూనియన్ లో కలిసిపోయేవరకు కొనసాగేదని, తెలంగాణకు సంబంధించినంత వరకు సర్ఫ్--ఖాస్ కింద పరిగణించబడే భూములన్నీ కూడా హైదరాబాద్ చుట్టు పక్కన ప్రాంతాలు మాత్రమేనని వీటినే అత్రాఫ్--బల్దా అనేవారిని శర్మ రాసిన పుస్తకంలో వుంది.

సర్ఫ్--ఖాస్ కాకుండా ఇతర జాగీరులు ఉండేవి. పాయిగాల పేరిట సంస్థానాలను నిజాం బంధువర్గానికి చెందిన ముస్లిం భూస్వాములకు ప్రత్యేకంగా కట్టబెట్టేవారు. వీరు నిజాంకు యుద్ధ సమయంలో సైనిక సిబ్బందిని సమకూర్చుతూ వారి నియామకాలను, శిక్షణను, పర్యవేక్షణను పరిశీలిస్తూ ఉండేవారు. వారు అంధించే సేవలకు బహుమతిగా జాగీరులను, సంస్థానాలను నిజాం వారికి ధారాదత్తం చేసేవారు. మక్తాలు, బంజరలు, అగ్రహారాలు, తనఖా జాగీరులు, జాత్ జాగీరులు, అల్తంగా జాగీరులు, ఇనాంలు వారి వారి సేవలను బట్టి ప్రకటించేవారు. వాటిని పొందేవారు, వారి పరిధిలో ఉన్నంతవరకు వాటిపై ఇష్టానుసారంగా శిస్తులు వసూలు చేస్తూ రైతులని ఇబ్బందులు పెట్టేవారు. పాయిగాల కింద, జాగీర్దారుల కింద, సంస్తానాదీశులకింద ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, సివిల్, క్రిమినల్ వ్యవస్థలు పనిచేసేవి.


     జాగీర్దారు వ్యవస్థ అలనాటి హైదరాబాద్ రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన అంశం. ముఖ్యంగా ఖల్సా, దివానీ భూముల విషయంలో దేశ్ పాండేల, దేశ్ ముఖ్ ల పెత్తనo, ఆధిపత్యం విపరీతంగా ఉండేది. వీరి దుశ్చర్యల వల్ల వేల ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమ మార్గంలో ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల ఎందరో వ్యవసాయదారులు కేవలం కౌలుదారులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. తొలి సర్వే, సెటిల్మెంట్  ఆధారంగా రైతుల ప్రమేయం లేకుండానే, వారికి ఏమాత్రం తెలియకుండానే, దేశ్ పాండేలు, దేశ్ ముఖ్‍లు తమ పేరుమీద దస్తావేజులను తయారు చేయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ (1908 వ సంవత్సరం) కింద కొన్ని ప్రామాణికాలను అప్పటి సర్వే, సెటిల్మెంట్ భూ పరిపాలన పేర్కొంటూ తద్వారా భూమికి సర్వే నెంబర్లు పొందిన వారిని పట్టాదారులుగా పెర్కొంటూ వారినే భూ హక్కుదారులుగా పరిగణించటం జరిగింది. తద్వారా ఎప్పటికప్పుడు సంబంధిత రికార్డులలో భూ హక్కుదారులను పేర్కొంటూ ‘‘రికార్డు ఆఫ్ రైట్స్’’ (రికార్డుల రూపేణా హక్కుదారులను) పద్దతిని హైదరాబద్ లో 1346 ఫస్లీ (1937) లో అమల్లోకి తేవడం జరిగింది. కాకపోతే, మొత్తం 108 దివానీ తాలూకాలకు గాను, కేవలం 19 వాటిలో మాత్రమే రికార్డ్ ఆఫ రైట్స్ ని అమలుచేయడం జరిగింది. మొత్తం 6535 జాగీరు గ్రామాలుండగా వాటిలో సర్వే సెటిల్మెంట్ కేవలం 5938 గ్రామాలలో మాత్రమే జరిగింది. మిగతావి అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అలా సర్వే సెటిల్మెంట్ జరగని గ్రామాలన్నీ దాదాపు తెలంగాణ ప్రాంతాలలోనే వుండడం గమనించాల్సిన విషయం.  

శర్మ సంపాదకత్వంలో వెలువడ్డ పుస్తకంలో ఆచార్య డాక్టర్ మారంరాజు సత్యనారాయణ రావు అనే రాజకీయ శాస్త్రవేత్త  ఈ అంశాలను గూర్చి విపులంగా ప్రస్తావిస్తూ, 1949 ఫిబ్రవరి మొదటి వారంలో అప్పటి మిలటరీ గవర్నర్ కు హైదరాబాద్ నిజాం స్వతంత్రంగా సర్ఫ్--ఖాస్ భూములను ప్రభుత్వ భూములుగా అప్పజెప్పడానికి ముందుకొచ్చినట్లు రాశారు. ఈ సర్ఫ్--ఖాస్ భూములు 5682 చదరపు మైళ్ల విస్థీర్ణంలో 1374 గ్రామాలకు విస్తరించబడి అధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవి. మరో ప్రకటనలో ఆగస్టు 15, 1949 నుంచి జాగీర్దారి వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు కూడా మిలటరీ గవర్నర్ ప్రకటించారుమొత్తం మీద ఆ విధంగా, దాదాపు 150 లక్షల ఎకరాల జాగీరు భూములు రద్దుచేయడం జరిగింది. అనంతరం ఒక జాగీరు పరిపాలనా అధికారిని నియమించి ఎవరెవరు భూములను కోల్పోయారో వారికి తగు విధంగా నష్టపరిహారం చెల్లించడానికి కూడా నిర్ణయం  జరిగింది. అయితే భూములు కోల్పోయిన జాగీర్దారులు మాత్రం భూమి తమకే చెందుతుందనీ, అది వారికి సంబంధించినంత వరకు వారి స్వంత భూమేనని పేర్కొనటం జరిగింది. ఇదే లిటిగేషన్ ఇప్పటి దాకా కొనసాగడం వల్లనే ప్రభుత్వ భూములను అక్రమంగా సొంత భూములుగా చూపుతూ, రిజిస్ట్ర్తేషన్ అధికారుల కుమ్ముక్కుతో భూ బదలాయింపులు జరుగుతున్నాయి.

          1875 లో సాలార్జంగ్ నేతృత్వంలో భూసంబంధిత సంస్కరణలు తీసుకరావటం జరిగేంతవరకు భూ వ్యవహారాలకు ఒక కేంద్రీకృత వ్యవస్థ అనేది లేదని, సరైన పరిపాలనా విధానం అవలంభించకపోవడం వల్లనే భూములకు సంబంధించిన అంశాలు పరిష్కరించలేకపోయారని ఆచార్య సత్యనారాయణ రావు రాశారు. నిజాం అతని ఇష్టానుసారంగా ఎవరికిపడితే వారికి జాగీర్లను దారాదత్తం చేసేవారని, సాలార్జంగ్ ‘‘జిల్లాబంద్’’ వ్యవస్థను ప్రవేశ పెట్టిన తర్వాత రెండు రకాలుగా పరిపాలన వ్యవహారాలు జరిగేవని ఆయన పేర్కొన్నారు. ఇందులో మొదటి పద్దతి ద్వారా ప్రభుత్వ పరిపాలన కింద దివాని భూముల వ్యవహారం చక్కదిద్దబడేదని, రెండవ పద్దతి ద్వారా భిన్న పరిపాలన కింద భిన్న తరహా జాగీరు భూముల వ్యవహారం పరిష్కరించబడేదనీ పేర్కొన్నారు. అయితే సర్వే, సెటిల్మెంట్ కింద సర్ఫ్--ఖాస్ భూముల సమస్య మాత్రం పరిష్కరింపబడలేదని వాటి వర్గీకరణ ఎన్నడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

మరోరకమైన భూ వర్గీకరణ ఉండేది. దానినే ‘‘కాందిశీకుల ఆస్థి’’ అని పేర్కొనేవారు. విభజన సమయంలో వారంతా పాకిస్తాన్ దేశానికి తరలిపోయారు. భారత ప్రభుత్వం ఈ కాందిశీకుల భూముల పరిష్కారానికి ఒక పరిపాలనాధికారిని ప్రస్తుత ముంబయి (అప్పటి బొంబాయి) నగరం లో నియమించటం జరిగింది.       పాకిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులకు-ఇతరులకు అవి అప్పజెప్పాలన్నది అప్పటి ఆదేశం. కాకపోతే జరిగింది దీనికి విరుద్ధం. అనేక మంది నకిలీ దృవపత్రాలను తీసుకరావటంలో సఫలీకృతులయ్యారు. కొందరైతే, అలనాటి భూ సొంతదారులు తమకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని అంటూ, నకిలీ పత్రాలను సృష్టించి, ప్రభుత్వ భూములను ఖబ్జా చేసారు. ఉదాహరణకు 6వ నిజాం అయిన మహబూబ్ అలీ ఖాన్ మహబూబాబాద్ లో 40 ఎకరాలలో ‘‘మ్యాచ్ ఫాక్టరీ’’ స్థాపించారు. ఐతే పోలీసు యాక్షన్ తదుపరి గుర్తుతెలియని కొందరు  కాందిశీకుల ఆస్తికింద కాజేసి దానిని ఇళ్ల స్థలాల కింద ముక్కలు చేసి అమ్ముకున్నారు. ఈ రోజున అక్కడ ఎటువంటి మ్యాచ్ ఫాక్టరీ ఆదారాలు, ఆనవాళ్లు లేవు. హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాల, సికింద్రాబాద్ లోని కస్తూరిబా డిగ్రీ కళాశాల భూములూ కాందిశీకులవేనని డాక్టర్ సత్యనారాయణ రావు అంటారు

అనధికారికంగా, అక్రమంగా భూపట్టాలు, హక్కులు పొందిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే, మరో సర్వే, సెటిల్మెంట్ చేసి అపరిష్కృత భూములను పరిష్కృతం చేసేంత వరకు, తద్వారా రెవెన్యూ రికార్డులను సరిదిద్ది పటిష్టపరిచేంతవరకు, ఈ లిటిగేషన్లు, వివాదాలు ఇలా కొనసాగుతూనే వుంటాయి. అన్ని వివరాలను ప్రజలకు బహర్గతం చేసి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూములను సరిచేసినట్లుగానే పట్టణ ప్రాంతాలలోనూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) పద్దతిని ప్రవేశపెడుతూ ఆ విధంగా చట్టం చేసి భూ ఆక్రమణదారులకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమయ్యిందనే చెప్పాలి. అందుకే మరో సర్వే సెటిల్మెంటే ప్రభుత్వ భూములకు శ్రీరామరక్ష! End