Showing posts with label ఒబామా. Show all posts
Showing posts with label ఒబామా. Show all posts

Sunday, July 15, 2012

ఫిడల్ కాస్ట్రో-జులై తిరుగుబాటు: వనం జ్వాలా నరసింహారావు


ఫిడల్ కాస్ట్రో-జులై తిరుగుబాటు
వనం జ్వాలా నరసింహారావు

2006 లో శస్త్ర చికిత్స జరిగిన తరువాత, క్షీణించిన ఆరోగ్యం కారణాన, క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆ దేశపు ఉక్కు మనిషి ఫిడల్ కాస్ట్రో స్థానంలో ఆయన సోదరుడు రావుల్ కాస్ట్రో పార్టీ-పాలనా బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నాడు. ఫిబ్రవరి 19, 2008 న దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాస్ట్రో స్థానంలో 15 మంది సభ్యులతో, రావుల్ కాస్ట్రో నాయకత్వాన పోలిట్ బ్యూరో ఏర్పాటైంది. 1959 లో జరిగిన విప్లవం దరిమిలా, మొట్టమొదటి సారి, క్యూబాలో నాయకత్వ మార్పిడి జరిగి, ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచిందని, న్యూయార్క్ టైమ్స్ వర్ణించింది. అన్నదమ్ములిరువురు ఒకరి పక్కన మరొకరు ఒకే వేదికపై ఉమ్మడిగా కనిపించిన ఆ సన్నివేశాన్ని కరతాళ ధ్వనులతో అక్కడ హాజరైన అసెంబ్లీ ప్రతినిధులు స్వాగతం పలికారు. "క్యూబాలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఆచరణలో కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, పదిలపరచుకుంటూ, బధ్రపరుచుకుంటూ, త్రికరణ శుద్ధిగా కొనసాగించడానికి, ఏ నాటికీ దేశం సామ్రాజ్యవాదం వైపు మొగ్గు చూపేందుకు అనుమతించకుండా వుండేందుకు నా పదవిని ఉపయోగించుకుంటాను" అని, ఆ సందర్భంగా అన్నాడు రావుల్.
కాస్ట్రోతో పాటు 50 సంవత్సరాల క్రితం తిరుగుబాటులో పాల్గొన్న దీర్ఘకాలిక పార్టీ సభ్యుడు రామొన్ మాషడోను, రావుల్ తన "నంబర్ టు" గా చేశాడు. ఆయన సహచర 15 మంది పోలిట్ బ్యూరో సభ్యులందరూ వయసు మీరిన వారే. అరవై ఏళ్ల పైబడిన వారిలో ఐదుగురు సైనిక జనరల్స్ కాగా, ఎక్కువమంది పురుషులే. అధికారాన్నైతే వదిలాడు కాని, క్యూబన్ రాజకీయాలలో, కాస్ట్రో గళం మాత్రం ఇంకా వినిపిస్తూనే వుంది. తన బ్లాగ్‍లో ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయాల మీద ఆయన వ్యాస పరంపర కొనసాగుతూనే వుందింకా. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు ఒబామా లిబియాలో ఇచ్చిన ఉపన్యాసం మీద చురకలు వేస్తూ, న్యూయార్క్ టైమ్స్ ఓపెన్ ఎడిట్ పేజీలో వ్యాసం రాస్తూ, ఆయనను విమర్శించాడు. ఒబామా చిన్నపిల్లలకు పని కొచ్చే కథలు రాసుకుంటూ జీవించటానికి పనికొస్తాడని పేర్కొన్నాడందులో. 2006 లో శస్త్ర చికిత్స జరిగిన తరువాత, యాక్టివ్ రాజకీయాలకు దూరమైనా, విదేశీ నాయకులను కలవడం మానలేదు. తన జాగింగ్ దుస్తుల్లో ఆయన వారిని కలిసేవాడు. "గ్రామా" అనే పత్రికకు అంతర్జాతీయ ఆర్థిక సమస్యల దగ్గరనుంచి, ప్రపంచ కప్పు వ్యవహారాల దాకా వ్యాసాలు పంపుతుండేవాడు. ప్రేమించినా-ద్వేషించినా, ఫిడల్ కాస్ట్రో లేని దేశంలో జీవించడాన్ని ఊహించలేదు చాలామంది క్యూబన్ పౌరులు. దానికి కారణం, అహర్నిశలూ, క్యూబాలో సామ్యవాదం కొనసాగేలా తన శాయశక్తులా కృషి చేస్తూ, ఆ వ్యవస్థను బలహీన పరిచేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని నిర్దాక్షిణ్యంగా కాస్ట్రో అణచి వేయడమే!
అంతటి మహనీయుడైన కాస్ట్రో, ప్రపంచ దేశాలలో-అందునా అలీన దేశాలలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం నేపధ్యంలో చాలా కృషి వుంది. జనవరి 7, 1959 న విజయ దుందుభి మ్రోగించుకుంటూ, క్యూబన్ రాజధాని హవానాలో అడుగిడిన ఫిడల్ కాస్ట్రో తిరుగుబాటు ప్రభుత్వాన్ని మొట్ట మొదటిసారి గుర్తించింది అమెరికా దేశమే! "కమ్యూనిస్ట్ భావాలకు దూరంగా వుంటూ, అమెరికా దేశంతో స్నేహ సంబంధాలు కలిగుండాలి క్యూబా" అన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచింది ఆ సందర్భంగా అమెరికన్ ప్రభుత్వం. అది మూణ్ణాళ్ల ముచ్చటే ఐంది.
మీడియం సైజు ప్రత్యేక శైలి గడ్డంతో అనునిత్యం కనిపించే కాస్ట్రో, తన 30 వ ఏట, విజయ గర్వంతో, హవానాలో అడుగిడినప్పుడు ఆయనకు, అప్పటి వరకు పాలించిన బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన "హీరో" గా స్వాగతం పలికారు క్యూబన్లు. అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే, నియంతృత్వ పాలనను ఏళ్ల తరబడి కొనసాగించిన బటిస్టా మద్దతు దార్లను అనేక మందిని, హవానాలోని చారిత్రాత్మక "లా కబానా" ఖిల్లా దగ్గర విచారణ జరిపించకుండానే వురి తీసింది ప్రభుత్వం. అప్పటిదాకా అమెరికన్ల ఆధీనంలో వుంటూ వస్తున్న ఆస్తులను-భూములను ప్రభుత్వం జప్తు చేసి తన అధీనంలోకి తెచ్చుకోవడంతో, అమెరికా దేశంలో ప్రజాభిప్రాయం కాస్ట్రోకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన కాస్ట్రో, తన వ్యతిరేక దారులను ఉక్కుపిడికిలితో అణచివేశాడు. ఎప్పుడైతే తన ప్రభుత్వం మద్దతుకోసం కాస్ట్రో సోవియట్ యూనియన్ వైపు దృష్టి సారించాడో, స్నేహ హస్తం సారించాడో, అప్పుడే, ప్రపంచ పశ్చిమ భూభాగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. ఆ పరిణామంతో ఖంగుతిన్న అమెరికా, కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేయాలన్న ఆలోచనలో పడవేసింది. అమెరికా దేశపు ఫ్లోరిడాకు కేవలం 90 మైళ్ల దూరంలోనే వున్న క్యూబాకు అమెరికాకు మధ్య సంబంధాలు చెడిపోసాగాయి. 1961 లో, 1962 లో, ఆ తరువాత మధ్య-మధ్య తమ దేశంపై అమెరికా చేసిన దాడులను, యుద్ధ వ్యూహంలో ఆరితేరిన కాస్ట్రో, తనకు అనుకూలంగా మలచుకున్నాడు. అమెరికా అధ్యక్షులైన ఫోర్డ్, కార్టర్, క్లింటన్‌లు ఏదో విధంగా కాస్ట్రోను లోబరచుకుని తమకు అనుకూలంగా తిప్పుకుంటామనుకున్నారు. అందుకే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చర్చలు జరిపారు. చర్చలకు అమెరికా చొరవ తీసుకున్న ప్రతిసారి, తన సహజమైన విప్లవాత్మక ధోరణిలో, ఆ చర్చలు విఫలమయ్యేట్లు చూశాడు. అమెరికా దేశాన్ని క్యూబన్ల దృష్టిలో శత్రువుగా చిత్రించి చూపి, క్యూబన్ల రక్షకుడుగా నిలిచాడు కాస్ట్రో. కమ్యూనిజాన్ని కౌగలించుకుని, అమెరికా వ్యతిరేకతను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ, రెండింటినీ తాను అధికారంలో కొనసాగేటట్లు మలచుకున్నాడు.



ప్రపంచంలో క్వీన్ ఎలిజబెత్ తరువాత అధిక కాలం అధికారంలో వున్న వ్యక్తిగా ఫిడల్ కాస్ట్రో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. లాటిన్ అమెరికాలో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు. చెరకు పండించే రైతు అక్రమ సంతానమైన కాస్ట్రో ఆగస్ట్ 13, 1926 న క్యూబాలో జన్మించాడు. చిన్న తనంనుంచే విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న కాస్ట్రో పదమూడేళ్ల వయస్సులోనే, తండ్రి వ్యవసాయ క్షేత్రంలో, సమ్మెను నిర్వహించాడు. తల్లిదండ్రులిరువురూ నిరక్షరాస్యులైనప్పటికీ, ఫిడల్‍ను బోర్డింగ్ పాఠశాలకు పంపారు. పాఠశాల క్రమశిక్షణ అంతగా నచ్చకపోయినా, అచిర కాలంలోనే, ఫిడల్ కాస్ట్రో తెలివైన-చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పరుగు పందెంలోను, ఫుట్ బాల ఆటలోను, బేస్ బాల్ గేంలోను నైపుణ్యం సాధించాడు. 1944 లో పాఠశాల ఉత్తమ క్రీడాకారుడుగా బహుమతి పొందాడు కూడా. చదువు పూర్తైన తరువాత హవానాలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించాడు. నిరంతరం బీద-పేదల కేసులే వాదించడానికి ఒప్పుకోవడం వలన, ఆర్థికంగా ఎదగలేక పోయాడు. ఈ నేపధ్యంలో క్యూబాలో నెలకొన్న ఆర్థిక అసమానతలను అర్థం చేసుకో సాగాడు. దేశాన్ని నియంత్రిస్తున్న అమెరికన్ వ్యాపార వేత్తల ఐశ్వర్యాన్ని, అంతస్తును అసహ్యించుకో సాగాడు. తిరుగుబాటు భావాలు పెరగ సాగాయి.
21 సంవత్సరాల వయస్సులో, 1947 లో, క్యూబన్ పీపుల్స్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు కాస్ట్రో. అవినీతికి, అన్యాయానికి, బీదరికానికి, నిరుద్యోగానికి, చాలీ-చాలని జీతభత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆ పార్టీ భావాలు ఆయనకు నచ్చాయి. ఐదేళ్ల లోనే, 1952 లో, ఆ పార్టీ పక్షాన ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. సహజంగా మంచి వాగ్ధాటి కలిగిన కాస్ట్రోకు పార్టీలోని యువకుల మద్దతు బాగా లభించింది. క్యూబన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్న తరుణంలో, జనరల్ ఫల్జెన్సియో బటిస్టా, సైన్యం తోడ్పాటుతో, అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని ఎన్నికలు జరగకుండా ఆపాడు. ఇక లాభం లేదనుకున్న కాస్ట్రో విప్లవం ద్వారానే క్యూబన్ ప్రజలకు విముక్తి లభిస్తుందని భావించాడు. 1953 లో 123 మంది స్త్రీ-పురుష విప్లవకారుల సహాయంతో, సైన్యం నివసించే మోంకాడా ప్రాంతంపై దాడి చేశాడు. బటిస్టాను పదవీచ్యుతుడిని చేయాలన్న వ్యూహం అప్పటికి బెడిసికొట్టింది. కాస్ట్రో అరెస్టు అయ్యాడు. అదృష్టవశాత్తు, కాస్ట్రోను వురితీయకుండా దగ్గర లోని పౌర జైలుకు పంపారు. జైలులో కూడా మరణానికి చేరువైన సందర్భాలున్నాయి. ఆపాటికే చోటుచేసుకున్న ప్రపంచ వ్యాప్త ప్రజాభిప్రాయ నేపధ్యంలో కాస్ట్రోను చంపించే ప్రయత్నం మానుకున్నాడు బటిస్టా. ముద్దాయిగా తనను విచారణ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకున్న కాస్ట్రో, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరవు పెట్టాడు. ఆయన ఆనాడిచ్చిన ఉపన్యాసాన్ని తరువాత " హిస్టరీ విల్ అబ్సాల్వ్ మి" అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. కాస్ట్రోకు పదిహేనేళ్ల కారాగార శిక్ష విధించబడింది. పుస్తకం, విచారణ, జైలు శిక్ష లాంటివి క్యూబన్ల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో కాస్ట్రోను హీరో చేశాయి. క్యూబన్ పౌరుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపధ్యంలో, రెండేళ్ల జైలు శిక్షను మాత్రమే అనుభవించిన కాస్ట్రోను ప్రభుత్వం విడుదల చేసింది. క్యూబా నుంచి మెక్సికోకు వెళ్లిన కాస్ట్రో, బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసేందుకు వ్యూహం పన్న సాగాడు.
యుద్ధ సామాగ్రిని సరిపోయినంత మోతాదులో సమకూర్చుకున్న అనంతరం, ఎనభై మంది విప్లవకారులతో కలిసి కాస్ట్రో, చి గువేరా, జాన్ ఆల్మీడా 1956 లో క్యూబాలోకి ప్రవేశించారు. మోంకాడా సైనిక స్థావరాల మీద దాడి చేసిన తేదీకి గుర్తుగా, ఈ బృందాన్ని "జులై 26 ఉద్యమం" గా పిలవ సాగారు. సియారా పర్వత శ్రేణిలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధం కొనసాగించాలని ఆ బృందం ఎత్తుగడ వేసుకుంది. పర్వతాల దగ్గరకు చేరుకునే లోపునే ప్రభుత్వ సేనలు వారిపై దాడి చేశాయి. సియారాకు చేరుకునే సరికి కేవలం పదహారు మంది మాత్రమే మిగిలారు. వారి వద్ద వున్న ఆయుధాలు మొత్తం కలిపి పన్నెండే! తరువాత కొన్ని నెలల పాటు సమీపంలోని-చుట్టుపక్కల సైనిక స్థావరాలపై దాడి చేసి కాస్ట్రో బృందం తమ ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంది. వారున్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వాధీనంలోకి తెచ్చుకున్న వెంటనే అక్కడి పేద రైతులకు భూమిని పంచారు. ఆ రైతుల మద్దతు వారికి పూర్తిగా లభించింది. కాస్ట్రో జాడ చెప్పమని పలువురిని హింసించ సాగారు. బటిస్టా ప్రభుత్వం చేయిస్తున్న అరాచకాలకు నిరసనగా ప్రజల మద్దతు కాస్ట్రోకు పెరగ సాగింది. 1958 లో నలబై ఐదు సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వానికి రాసిన లేఖలో "జులై 26 ఉద్యమం" కు మద్దతు తెలిపాయి. న్యాయవాదుల, ఆర్కిటెక్టుల, దంతవైద్యుల, గణాంక నిపుణుల, సామాజిక కార్యకర్తలతో కూడిన జాతీయ స్థాయి సంస్థలవి. ఒకప్పుడు కేవలం పేద వారి మద్దతు మాత్రమే వుంటుందనుకున్న కాస్ట్రోకు పరపతిగల మధ్యతరగతి వారి మద్దతు కూడా పూర్తి స్థాయిలో లభించసాగింది.
ప్రభుత్వ సేనలపైన దెబ్బ మీద దెబ్బ తీసుకుంటూ ముందుకు సాగింది "జులై 26 ఉద్యమం". 1958 వేసవికాలంలో వేయి మందికి పైగా బటిస్టా సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగింది. బటిస్టా సేనల మాదిరి కాకుండా, తమకు పట్టుబడిన ప్రభుత్వ సైనికులను గౌరవంగా చూడడం చేసేది "జులై 26 ఉద్యమం" బృందం. యుద్దంలో అనుకూలంగా లేని ప్రతిసారి బటిస్టా సేనలు కాస్ట్రో సేనలకు లొంగిపోవడానికి ఇది దోహదపడింది. క్రమేపీ సేనలు మొత్తం గొరిల్లాలతో కలవడం ప్రారంభమైంది. అమెరికా బటిస్టా ప్రభుత్వానికి మద్దతుగా అధునాతన ఆయుధాలను సరఫరా చేసింది. గొరిల్లాల ముందర అవి వాడడం తెలియని ప్రభుత్వ సేనలు అపజయం దిశగానే పోసాగారు. మార్చ్ 1958 లో బటిస్టా సేనల విఫలం చూసిన అమెరికా, ఆ దేశంలో ఎన్నికలు జరిపించమని సూచించింది. ఆ సూచనను పాటించి ఎన్నికలు జరపడం జరిగింది కాని, ఓటర్లు ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరించారు. ఎదురు దాడిలో బటిస్టాను ఓడించగలనన్న నమ్మకంతో కాస్ట్రో గొరిల్లాలు ప్రధాన నగరాల వైపుగా కదల సాగారు. అమెరికాను సంప్రదించిన బటిస్టా, దేశం వదిలి పారిపోవడానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన కొందరు సైనిక జనరల్స్ మిలిటరీ పాలన తేవాలని చేసిన ప్రయత్నాలను కాస్ట్రో తిప్పికొట్టాడు. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా, దేశ వ్యాప్త కార్మిక-కర్షక-సకల జనుల సమ్మెకు పిలుపిచ్చాడు. పెద్ద సంఖ్యలో ఆ పిలుపుకు లభించిన స్పందనను గమనించిన మిలిటరీ వెనక్కు తగ్గింది. జనవరి 9, 1959 న కాస్ట్రో విజయ పథంవైపు దూసుకుంటూ, హవానా నగరం చేరుకుని క్యూబా నూతన నాయకుడుగా ప్రజల ముందుకొచ్చాడు.
కాస్ట్రో పాలన అమెరికాకు రుచించలేదు. క్యూబాలోని అమెరికన్ ఆస్తులను, టెలిఫోన్ కంపెనీని జాతీయం చేయడమే దీనికి కారణం. అమెరికా పట్ల తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శించేవాడు కాస్ట్రో. తన దేశంలో పండిన చక్కెరను కొనడానికి అమెరికా అంగీకరించక పోవడంతో, సోవియట్ యూనియన్‍తోను, ఇతర తూర్పు యూరోప్ దేశాలతోను చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా నిరాకరించిన ఆయుధ సామాగ్రిని, సాంకేతిక నిపుణులను, మెషినరీని ఇవ్వడానికి కూడా సోవియట్ యూనియన్ అంగీకరించింది. నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ కోపంతో కాస్ట్రోకి పాఠం చెపుదామనుకున్నాడు కాని, అది బెడసి కొట్టి, కాస్ట్రోను సోవియట్ యూనియన్‌కు మరింత చేరువ చేసింది. క్యూబా సోవియట్ యూనియన్ సైనిక స్థావరం అవుతుందేమోనన్న భయం కలగ సాగింది ఐసెన్హోవర్‍కు. క్యూబా వెలుపల గొరిల్లా సేనలను తయారు చేసి కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేసే ప్రణాళిక సిద్ధం చేసింది అమెరికన్ ప్రభుత్వం. ఆయనను కనీసం ఇరవై పర్యాయాలన్నా మట్టుబెట్టే ప్రయత్నం చేసింది సిఐఏ. 1961 లో ఐసెన్హోవర్ స్థానంలో వచ్చిన జాన్.ఎఫ్.కెన్నెడీ మెడకు చుట్టుకుంది క్యూబన్ వ్యవహారం. కాస్ట్రోను తుదముట్టించడానికి కెన్నెడీ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. క్యూబా విషయంలో సరళంగా వ్యవహరించ దలిచిన కెన్నెడీకి, తనను కమ్యూనిస్ట్ పక్షపాతి అంటారేమోనన్న భయం పట్టుకుంది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పెద్ద ఎత్తున క్యూబా పక్షాన నిలిచిందో, అప్పుడే, కెన్నెడీ ఆ దేశానికి పిర్యాదు చేయడం జరిగింది.
అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో, ప్రజాభిప్రాయం తనకు వ్యతిరేకంగా వుంటుందేమోనని భయపడ సాగాడు కెన్నెడీ. క్యూబాపై దాడి మోతాదును కుదించుదామనుకున్నాడు కెన్నెడీ. సోవియట్ యూనియన్ మరోవైపు తన క్యూబా మద్దతును ద్విగుణీకృతం చేసింది. అణుయుద్ధం జరిగే ప్రమాదం దిశగా అమెరికా-సోవియట్ యూనియన్ కదల సాగాయి. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు మొదలయ్యాయి. రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ తన కోపాన్ని కెన్నెడీకి వరుస వుత్తరాల ద్వారా వ్యక్త పరిచాడు. క్యూబాపైన దాడికి దిగబోమని అమెరికా హామీ ఇస్తే, తాము తమ మిస్సైల్స్ ను ఉపసంహరించుకుంటామని కృశ్చేవ్ అన్నాడు. కెన్నెడీ ఆ ప్రతిపాదనకు అంగీకరించడంతో అప్పటికి అణు యుద్ధ ప్రమాదం తప్పింది. అమెరికా-సోవియట్ యూనియన్ల మధ్య అణుయుద్ధ ప్రమాదం సంభవించాల్సిన ఏకైక సన్నివేశం "క్యూబన్ మిస్సైల్ సంక్షోభం" ఆ విధంగా అప్పటికి సమసి పోయింది. ఇక అక్కడినుంచి ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. సోవియట్ యూనియన్‌పై క్యూబా సైనిక సంపత్తి కోసం ఆధారపడడం కొనసాగింది. నికితా కృశ్చేవ్ తరువాత వచ్చిన ఆయన వారసులు బ్రెజ్నేవ్, యాండ్రపోవ్, చెర్నెంకో, గోర్బచేవ్‍లు ఆ ఆచారాన్ని కొనసాగించారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత అది ఆగిపోయింది. జులై 31, 2006 న తన రాజకీయ బాధ్యతలను తమ్ముడు రావుల్‍కు బదలాయించాడు కాస్ట్రో. ఫిబ్రవరి 19, 2008 న తానిక భవిష్యత్‍లో దేశాధ్యక్షుడుగా కాని, సైనికాధికారిగా కాని వుండబోనని ప్రకటించాడు. 


Sunday, December 27, 2009

అమెరికా ఆరోగ్య సంస్కరణల చట్టం-భారతీయుడి అభిప్రాయం

ఈ కింది ఇంటర్నెట్ లింకులలో అమెరికా ఆరోగ్య సంస్కరణలకు సంబంధించిన ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఒకటి సుజనరంజనిలోను, మరొకటి ఆంధ్ర జ్యోతిలోను ప్రచురించబడినవి. పూర్తి ఆర్టికల్ కింద వుంది:

http://siliconandhra.org/nextgen/sujanaranjani/dec2009/healthcare.html
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/nov/20edit3

Text:

అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన హెల్త్ కేర్ సంస్కరణల బిల్లుకు, స్వపక్షంనుండి-ప్రతిపక్షం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం పొందేందుకు అధ్యక్షుడు బారక్ ఒబామా చేయని ప్రయత్నం లేదు. పాలకపక్ష డెమొక్రాట్లకు చెందినవారు 258 మంది వున్నప్పటికీ, మొత్తం 177 రిపబ్లికన్లతో సహా పలువురు డెమొక్రాట్లు బహిరంగంగానే బిల్లును వ్యతిరేకిస్తుండడంతో, తన అధికారిక-వ్యక్తిగత పలుకుబడినంతా పణంగా పెట్టి, వ్యతిరేక లాబీ ప్రయత్నాలకు గండి కొట్టాడు బారక్ ఒబామా. ఎట్టకేలకు నవంబర్ 7, 2009 న అమెరికా దిగువసభలో జరిగిన ఓటింగ్ లో, బిల్లుకు అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 215 ఓట్లు రావడంతో, బొటాబొటి ఆధిక్యంతో బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఇక సెనేట్ ఆమోదం పొందాల్సి వుంది.

ఒబామా ఎంత ప్రయత్నం చేసినా, పాలక పక్షానికి 258 మంది సభ్యులున్నప్పటికీ, వచ్చిన ఓట్లు 220 మాత్రమే. 39 మంది డెమొక్రాట్లు వ్యతిరేకంగా ఓటువేయగా, గుడ్డిలో మెల్లలాగా, ప్రతిపక్షానికి చెందిన ఒకే ఒక్క రిపబ్లికన్ బిల్లుకు అనుకూలంగా ఓటువేశాడు.భవిష్యత్ లో తమ ఆదాయవ్యయాలపైనా, ఆరోగ్యపరమైన సమస్యలపైనా హెల్త్ కేర్ చట్టం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనన్న విషయంలో చాలామంది అమెరికన్లు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. చట్ట రూపంలో అమల్లోకి రానున్న బిల్లుకు మద్దతుగా-వ్యతిరేకంగా దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. పతాక శీర్షికలతో దినపత్రికలు రోజుకొక విధంగా బిల్లులోని అంశాలను ప్రచురిస్తుండడంతో, గందరగోళ పరిస్థితులు నెలకొని, చివరకు ఏవిధంగా అది అమలులోకిరానున్నదోనని భావిస్తున్న పలువురు, తమ అభిప్రాయాన్ని అప్పటిదాకా వెల్లడించలేక పోతున్నామంటున్నారు.అమెరికాలోని ప్రింట్-ఎలెక్ట్రానిక్ మీడియాలో గత నెల రోజులుగా దీనికిసంబందించిన వార్తలకే ప్రాముఖ్యం ఇస్తున్నారు.

బిల్లు చట్ట రూపేణా చేసే సమయం దగ్గర పడే కొద్దీ, అధ్యక్షుడు ఒబామా ప్రతిపాదించిన బిల్లులోని పలు అంశాలను, రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యో, లాబీ వర్గాలవారి ప్రయత్నాలవల్లో, తొలగించే పరిస్తితులొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ల, ఆసుపత్రి వర్గాల, భీమా కంపెనీల,ఇతర బలీయమైన ఒత్తిడివర్గాలప్రయత్నాలు చాలావరకు ఫలించాయని, ఫలితంగా, ఒబామా తలపెట్టిన విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన ప్రాధాన్యతాంశాలకు సవరణలొచ్చాయని కూడా అనుకుంటున్నారు. సెనేట్ ముందుకొచ్చి, దాని ఆమోదం పొందేనాటికి సంస్కరణల మౌలిక స్వరూపమే మారినా ఆశ్చర్య పడక్కరలేదుఏదేమైనా, ఎవరెన్ని అంటున్నా-అనుకుంటున్నా, అధ్యక్షుడు ఒబామా మాత్రం, తాను ప్రతిపాదించిన దేశవ్యాప్త ఆరోగ్య పరిరక్షణ సంస్కరణలకు అసాధారణమైన ఏకాభిప్రాయం లభిస్తున్నదన్న విశ్వాసంతో వున్నాడు. నవంబర్ 7, 2009న, చట్టసభలో చారిత్రాత్మక ఓటింగ్ జరుగనున్న నేపధ్యంలో,సంప్రదాయాలకు అతీతంగా రెండు రోజుల ముందు, శ్వేత సౌధంలో బహిరంగంగా ప్రజల మద్దతు కోరుతూ వారి ముందుకు వచ్చాడు ఒబామా.

సంస్కరణలకు మద్దతు పలుకుతున్న అమెరికన్ మెడికల్ అసోసియేషన్, సీనియర్ అడ్వొకసీ వర్గాలలాంటి బలీయమైన అమెరికా సంస్థల వాదనలకు ప్రసార మాధ్యమాల ప్రాచుర్యం లభించేలా చర్యలు చేపట్టాడు. గతంలో వ్యతిరేకించిన కొన్ని వర్గాలు, డాక్టర్లు, వైద్యరంగ నిపుణులు తన సంస్కరణలకు బహిరంగ మద్దతివ్వడమంటే, హెల్త్ కేర్ బిల్లు చట్టం కావడానికి అడ్డంకులు తొలిగినట్లేనని అత్యంత విశ్వాసంతో చెప్పాడు."అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఫర్ అమెరికా యాక్ట్" అన్న పేరుతో అమల్లోకి రానున్న ఒబామా తలపెట్టిన ఆరోగ్య సంస్కరణల ముఖ్యోద్దేశం, రాబోయే రోజుల్లో అమెరికన్లందరికీ ఎప్పటికంటే తక్కువ ఖర్చుతో, అందుబాటులో-నాణ్యమైన-మెరుగైన వైద్య సదుపాయం కలిగించడమే. ఇంతవరకు ఆరోగ్య భీమా సౌకర్యం వున్నవారికి అదనపు రక్షణలు కలిగించేందుకు, భీమా సౌకర్యానికి నోచుకోనివారికి భవిష్యత్ లో కలిగించేందుకు, అమెరికా వాసులందరికీ-అమెరికా వ్యాపారసంస్థలన్నింటికీ-అమెరికా ప్రభుత్వానికీ, వైద్య-ఆరోగ్యపరమైన వ్యయాన్ని తగ్గించేందుకు వుద్దేశించిందీ చట్టం. భీమా తీసుకునే ముందర వున్న ఆరోగ్యసమస్యలకు కూడా కవరేజ్ సౌకర్యం కలిగించింది చట్టం. గతంలో లాగా, భీమా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా, ఎటువంటి ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యకైనా భీమా వర్తించేలా చట్టంలో నిబంధన విధించబడింది. భీమా పరిధిలోకి రాని వ్యయంకూడా తగ్గనున్నది. వ్యాధినిరోధక ఆరోగ్య రక్షణ చర్యలకు అదనపు భారం లేకుండా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సౌకర్యాలు లభించనున్నాయి. భీమా సౌకర్యానికి నోచుకోనివారికి, సరసమైన-అందుబాటు ధరల్లో కొత్తగా ఏర్పాటుచేయనున్న ప్రభుత్వరంగ భీమా విపణి (ఇన్సూరెన్స్ మార్కెట్) ద్వారా లాభం చేకూరనున్నది.

ఒక్కమాటలో చెప్పాలంటే, 1500 పేజీలకు పైగా వున్న సుదీర్ఘమైన ఆరోగ్య సంస్కరణల బిల్లు చట్టమై, ఒబామా అనుకున్నది అనుకున్నట్లే జరుగుతే, ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. అయితే, ఒత్తిళ్లకు-ఆటుపోట్లకు ఆలవాలమైన అమెరికా రాజకీయ-మతాధిక్య నేపధ్యంలో అదెంతవరకు సాధ్యపడుతుందో వేచిచూడాల్సిందే.

అమెరికాలోని ఆసుపత్రులు పనిచేసే విధానం విచిత్రంగా వుంటుందనాలి. ఒకవైపు మెరుగైన సేవలు అందిస్తూనే, మరోపక్క ఎవరికీ అర్థంగాని రీతిలో వ్యవహరిస్తుంటాయవి. నడక దూరంలో వున్న ఒకే రకమైన రెండు ఆసుపత్రుల్లో, ఒకే రకమైన ఆరోగ్యసమస్యకు, భిన్నమైన ధరలుంటాయి. ఇంకో వింత విషయం, ఒకే ఆసుపత్రిలో, ఒకే జబ్బుకు, ఏ ఇద్దరికీ ఒకే మోతాదులో పీజు వసూలుచేయరు. మెనూ వెల్లడించని హోటల్లో, దాని యజమాని ఏది చేస్తే అదే తిని, వాడు అడిగిన ధరే చెల్లించి, మన కడుపు నింపుకున్నట్లుగా వుంటాయి అమెరికా ఆసుపత్రులు. చికిత్సకు ఆసుపత్రికెళ్లిన రోగికైనా-రోగి సంబంధీకులకైనా, దేనికెంత వసూలుచేస్తున్నారో తెలుసుకోవాల్సిన ఆసక్తి వుండదు. అడిగినా వాళ్లు చెప్పరు. అసలా ఫీజు విషయం ఇచ్చేవాడు ఆలోచించడు-కారణం, చెల్లించేది భీమా సంస్థ కాబట్టి. అయితే భీమా సంస్థ తనకోసం ఇస్తున్న ఫీజు తన సంపాదనలోదేనని ఆలోచించడు. మొట్ట మొదటిసారి, ఈ సమస్యపై కూడా దృష్టి సారించింది అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన హెల్త్ కేర్ బిల్లులో. భవిష్యత్ లో ఆసుపత్రిలో వున్న సౌకర్యాలు, ధరలు, మౌలిక సదుపాయాలు ఉపయోగించుకునేందుకు వచ్చిన అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేయాలి.

అమెరికాలో, గత ఇరవై సంవత్సరాలలో వైద్య-ఆరోగ్య ఖర్చులు, రెట్టింపయ్యాయని, దేశ ఆర్థిక వ్యయంలో సుమారు 16% పెరిగాయని నిపుణుల అంచనా. విపరీతంగా పెరిగిన భీమా ప్రీమియానికి అదనంగా పన్నుల భారం విధించితేనే, ప్రస్తుతం భీమా సౌకర్యానికి నోచుకోని లక్షలాది మంది అమెరికన్లకు, అందుబాటులో వైద్య సదుపాయం లబించేందుకు వీలుంటుంది. ఇలా విధించడానికి ఒబామా ప్రభుత్వం సూచించిన ప్రణాళికకు సంబంధించి, పాలక డెమాక్రాట్లకు-రిపబ్లికన్లకు ఒకవైపు, ఎగువ-దిగువ సభలకు మరోవైపు, తీవ్ర అభిప్రాయ భేదాలొచ్చాయి. చట్టసభల ఆమోదంకొరకు ఎదురుచూస్తున్న హెల్త్ కేర్ బిల్లులో, 2013 సంవత్సరంనుండి వ్యక్తిగత భీమాకు 8000 డాలర్లు, కుటుంబ భీమాకు 21000 డాలర్ల భీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని ప్రతిపాదనుంది. ప్రీమియం వ్యక్తులు చెల్లించినా, వారు పనిచేస్తున్న వ్యాపార సంస్థలు చెల్లించినా, అది అదనపు భారమవుతుందని బిల్లును వ్యతిరేకిస్తున్న వారంటున్నారు. అయితే ఇలా అదనంగా సేకరించిన నిధులను భీమా సౌకర్యానికి నోచుకోని-నోచుకోలేని లక్షలాది మంది తక్కువ ఆదాయంవున్నవారికి, సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుందని బిల్లును సమర్ధిస్తున్నవారంటున్నారు.

ఈ నేపధ్యంలో, ఒకే ఒక్క రిపబ్లికన్ సెనేటర్, తనవోటును బిల్లుకు అనుకూలంగా వేయడంతో, అక్టోబర్ 13 న, సెనేట్ ఆర్థిక కమిటీ అమోదం లభించింది. చారిత్రాత్మక ఆరోగ్య సంస్కరణల దిశగా, సెనేట్ ఆర్థిక కమిటీ ఆమోదం "ఒక మైలురాయి “గా వర్ణించాడు ఒబామా.సెనేట్ లో బిల్లుకు అనుకూలంగా ఓటువేసిన రిపబ్లికన్ సెనేటర్, ప్రభుత్వ ఆధ్వర్యంలో భీమా సౌకర్యం కలిగించాలన్న ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనకు కొందరు డెమాక్రాట్ల మద్దతు లభించగా, మరికొందరు వ్యతిరేకించారు. సెనేట్ కమిటీ ఆమోదం లభించిననాటినుండి, అంతవరకు మౌనం పాటించిన భీమా సంస్థలు, పలుకుబడి కలిగిన వైద్యులు, ఆసుపత్రి యజమానులు బిల్లుకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆరంభించారు. బిల్లువల్ల ప్రీమియం ఖర్చులు పెరిగి, వైద్యానికయ్యే వ్యయం విపరీతంగా పెరుగుతుందని ప్రకటనలివ్వడం ప్రారంభించారు. భవిష్యత్ లో మెడికేర్ విధానంవల్ల తమ ఆదాయం పడిపోతుందని భావించిన హృద్రోగ నిపుణులు అధ్యక్షుడు ఒబామాకు బహిరంగ లేఖ రాసి, అనతికాలంలో, ఆయన అమలుచేయనున్న సంస్కరణల వల్ల, తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని బెదిరించారు. ఇవేమీ పట్టించుకోకుండా, అధ్యక్షుడు ఒబామా, భీమా కంపెనీలపైనా, బిల్లును వ్యతిరేకిస్తున్న వారిపైనా, తీవ్రమైన విమర్శలు చేశాడు. అనైతిక ప్రకటనలిచ్చి సంస్కరణలను నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని అంటూ, భీమా సంస్థల ప్రధాన ధ్యేయం సంపాదనేనని విమర్శించాడు.

అసలింతకీ, అధ్యక్షుడు ఒబామా తీసుకొస్తున్న సంస్కరణల్లో, ఇరవైనాలుగు గంటల వైద్య సౌకర్యం అందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ వుండేందుకు అవసరమైన నిబంధనలున్నాయా అనేది ప్రశ్నార్థకం. అమెరికాలో వుంటున్న ఎవరికైనా సరే అన్నివేళలా వైద్య సౌకర్యం లభిస్తుందా? ఎక్కువ ఆదాయం వున్న వారికైనా-తక్కువ వున్న వారికైనా, ఏ వయసు వారికైనా, స్త్రీ-పురుష భేదం లేకుండా, జన్మతః అమెరికన్ అయినా-కాకున్నా, అమెరికాలో వుద్యోగంచేస్తున్న ఇతరదేశస్తుల తల్లిదండ్రులకైనా, ఎవరికైనా సౌకర్యం సమానంగా వుండడానికి వీలుకలిపించబడిందా? అవసరానికి వైద్య సదుపాయం అందుబాటులో వుండదనేది ఇక్కడ చాలామంది భావన-ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న పలువురు భారతీయుల భావన.

పది సంవత్సరాల క్రితం నాకెదురైన అమెరికా ఆసుపత్రుల-వైద్య సౌకర్యాల అనుభవం ఎప్పటికీ గుర్తుంటుంది.పదేళ్లక్రితం అమెరికాలో పనిచేస్తున్న మా అమ్మాయి సిన్సినాటిలోని బెతెస్డా నార్త్ ఆసుపత్రిలో ఆగస్ట్ 4, 1999న ప్రసవించింది. ఆసుపత్రిలో లభించిన సమస్త సౌకర్యాలు చూసింతర్వాత అమెరికాలో వైద్య సౌకర్యాలు అంత గొప్పగా వుంటాయా అనిపించింది. ఆసుపత్రినుండి డిస్చార్జ్ అయిన తర్వాత, బాబు పుట్టిన ఐదో రోజున వాడికి పచ్చకామెర్లున్న అనుమానం కలిగి, చంటిపిల్లల డాక్టర్ ను సంప్రదించడం జరిగింది. ఆయన సూచన మేరకు రక్తపరీక్ష చేయించడం కూడా జరిగింది. జాండిస్ వున్నదనడానికి కారణమైన ఇన్ఫెక్షన్ వుందని కూడా నిర్ధారణ జరిగింది. అయితే భీమా సంస్థ అనుమతి లభించనందున, చంటివాడిని ఆసుపత్రిలో చేర్పించడానికి డాక్టర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించేందుకు అయ్యే ఖర్చుకన్నా, బాబుకు ఇంట్లోనే చేయిస్తే తక్కువవుతుందని, ఆ భీమా సంస్థ భావించడంతో, సరైన వైద్య సౌకర్యం లభించడానికి ఒకరోజుకుపైగా ఆలశ్యమైంది. జాండిస్ పెరిగింది. ఇంట్లోనూ వైద్యం జరగలేదు. చివరకు విశ్వప్రయత్నం చేసింతర్వాత, మర్నాడు ఆసుపత్రికి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. అక్కడకూడా చేర్పించడానికి సవాలక్ష అర్థంలేని ప్రశ్నలు వేశారు. అందులో హాస్యాస్పదమైనవి పదే-పదే అడిగిన "ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆ ది చైల్డ్". కాకపోతే అడ్మిట్ చేసుకున్న తర్వాత అత్యంత మెరుగైన వైద్యం చేసి బాగయిన తర్వాత ఇంటికి పంపించారు. దీనంతకీ కారణం, అమెరికాలో ఎంత చిన్నదైనా-పెద్దదైనా వైద్య సదుపాయం కావాలంటే, భీమాకంపెనీవారి దయా దాక్షిణ్యాలుండాల్సిందే.

అమెరికా తలపెట్టిన సంస్కరణల్లో ఎంతసేపూ ఏ ఆదాయవర్గాలవారు ఎంత భరించాలన్న అంశానికే అధిక ప్రాధాన్యతనిచ్చారుగాని, ఎంతమందికి అవసరమైనప్పుడు, వారనుకున్న వైద్య సేవలు అందుబాటులో వుండాలి అన్న అంశానికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు. డాక్టర్ ను ఒకసారి నిర్ణయించుకొని భీమా కంపెనీ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే, ఇక వాడి ఇష్టాఇష్టా లపైనే మన భవిష్యత్ ఆధారపడి వుంది. లాబ్ టెస్ట్ లు చేయించుకోవాలన్నా- చేయించుకున్న వాటి ఫలితాలు తెలుసుకోవాలన్నా మనచేతిలోలేదు. ఆరోగ్యసమస్య వచ్చినప్పుడు కటిక బీదవాడైనా సరైన వైద్యసౌకర్యం-తనకిష్టమైన వైద్యుడి ద్వారా కోరుకుంటాడు గాని, ఖర్చుకు వెనుకాడడు. అసలు అమెరికాలో అనుకున్న మరుక్షణం డాక్టర్ సహాయం అందుతుందాననేది అనుమానమే. అత్యవసర స్థితిలో వేరే సంగతి. అయితే ప్రతి దానికీ డబ్బుకు-భీమాకు లంకె.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో అమలవుతున్న మూడు రకాల ఆరోగ్య వైద్య సదుపాయాలు బహుశా ప్రపంచంలోని పలుదేశాలకు మార్గదర్శికం కాదగినవనవచ్చేమో. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతోనూ-రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్న నిధులతోనూ "రాజీవ్ ఆరోగ్యశ్రీ" గొడుగు కింద అమలవుతున్న ఈ మూడు పథకాలు రాష్ట్రంలో నివసిస్తున్నవారికే కాకుండా, ప్రవాస ఆంధ్రులకు కూడా ఎనలేని ధైర్యాన్ని సమకూరుస్తున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగ రీత్యా విదేశాల్లో వుంటున్న పలువురు ప్రవాస ఆంధ్రులకు ఒకప్పుడు వారి వైద్య-ఆరోగ్య సదుపాయాలపట్ల ఆందోళన వుండేది. చేస్తున్న ఉద్యోగానికి శలవుపెట్టి హటాత్తుగా దేశానికి తల్లిదండ్రులకొరకు రావాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందిలేదు. మున్నూట అరవై అయిదు రోజులు-ఇరవైనాలుగు గంటలూ, మారుమూల వున్న కుగ్రామానికి సైతం, ఎలాంటి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్తితి వచ్చినా, పూర్తి ఉచితంగా-ఫోన్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 108 అంబులెన్స్ ఇంటి ముందుకొచ్చి- దారిపొడుగూతా అత్యవసర వైద్య సదుపాయం అందిస్తూ సమీప ఆసుపత్రికి చేరుస్తుంది. అలా చేర్పించిన ఆసుపత్రిలో-ప్రయివేట్ దైనా సరే, 24 గంటలపాటు, పూర్తి ఉచిత వైద్య సహాయం దొరుకుతుంది. దీని కయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య సేవలకొరకు ఏ ఆసుపత్రికిపోవాలనేది పేషంట్ ఇష్టప్రకారం జరుగుతుంది. నిర్వహణను ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఈ.ఎమ్.ఆర్.ఐ అనే సంస్థకు అప్ప చెప్పింది ప్రభుత్వం. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను, ఏరియా ఆసుపత్రులను అభివృద్ధి పరిచింది ప్రభుత్వం. ప్రయివేట్ ఆసుపత్రులతోనూ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని ఉచితంగా 24 గంటలపాటు రోగికి చికిత్స అందించే ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

108 అంబులెన్స్ అత్యవసర ఆరోగ్య సహాయ సేవల కదనంగా 104 ఆరోగ్య సేవలను కూడా ప్రవేశపెట్టి, ఆ సేవల పరిధిని విస్తృతపరుచుకుంటూ, మరిన్ని ఆరోగ్య- వైద్య రంగ సేవలను ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అమలు పరుస్తోంది ప్రభుత్వం. వాటిలో ముఖ్యమైంది ‘నిర్దిష్ట దిన సంచార ఆరోగ్య సేవల’ పేరుతో ఏర్పాటు చేసిన అధునాతన అంబులెన్సులు. మూడు కిలో మీటర్ల దూరంలో ఏ రకమైన ఆరోగ్య కేంద్రానికీ నోచుకోని 1500 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి, నెల కోమారు, ఎంపిక చేసిన నిర్దిష్ట దినాన, సంచార ఆరోగ్య సేవలందించే అంబులెన్స్ వచ్చి నాలుగు గంటల పాటు సేవలందిస్తుంది. ప్రతి అంబులెన్స్ లో ఫార్మసిస్టులు, లాబ్‌టెక్నిషియన్లతో పాటు అవసరమైన వైద్య పరికరాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, పౌష్టికాహార లోపాల పరీక్షలు, రక్త-మూత్ర పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, ఏ మందులు వాడాలో సూచనలివ్వడం జరుగుతుంది. గర్భిణీస్ర్తీల ప్రసవతేదీ నిర్ధారణ, చక్కెర- రక్తపోటు వ్యాధుల నిర్ధారణ చేయడమూ జరుగుతుంది. టెలీమెడిసిన్ పద్ధతిననుసరించి మారుమూల కుగ్రామంలో వున్న పేషంట్ కు కూడా తక్షణ వైద్య సలహాలనందించి, ఏ మందులు వాడాలో కూడా సూచించబడుతుంది ఈ సేవలకింద.

‘రాజీవ్‌ఆరోగ్యశ్రీ’ కింద పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న మరో అతిముఖ్యమెంది ‘ఆరోగ్యశ్రీ- సామాజిక ఆరోగ్య బీమా పథకం’. ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల తోడ్పాటుతో అమలవుతున్న ఈ పథకం దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల పాలిటి పెన్నిధి. ‘ఆరోగ్య బీమా’ పథకం ద్వారా ఏరకమైన వ్యాధికైనా చికిత్స చేయించుకునేందుకు అవసరమైన వ్యయాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన బీమా సౌకర్యం కింద ప్రభు త్వమే భరిస్తుంది. ‘ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్‌ ట్రస్ట్’ కింద అమలవుతున్న ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మంది మందికి శస్త్ర చికిత్సలు ఉచితంగా వివిధ ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రుల్లో జరిగాయి.

బహుశా ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న ఈ మూడు పథకాలు అమెరికాకు కూడా వినూత్నమైన మార్గదర్శకాలే. ఏదెలా వున్నా, ఒబామా ప్రతిపాదించి అమల్లోకి తేదల్చుకున్న వైద్య-ఆరోగ్య సంస్కరణలవల్ల, భవిష్యత్ లో అందరికీ అందుబాటులో, అసలు సిసలైన ఆరోగ్య-వైద్య సేవలు లభించనున్నాయని పలువురు భావిస్తున్నారు. ప్రతినిధుల సభ ఆమోదం లభించిన హెల్త్ కేర్ బిల్లుకు త్వరలో సెనేట్ ఆమోదం కూడా లభిస్తే మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని ఆశించుదాం. ఎల్లలెరుగని ప్రపంచాన్ని స్థాపించాలని కలలుకన్న మార్క్స్ స్వప్న సౌధాలకు బీటలు పడి, సామ్యవాదంనుండి సామ్రాజ్యవాదం దిక్కుగా మారబోతున్న సమయంలో, అతిపెద్ద ధన స్వామ్య దేశంలో, సామ్యవాద సిద్ధాంతాల అమలుకు ఆరోగ్య సంస్కరణల ద్వారా అంతో-కొంతో అంకురార్పణ జరగడం విప్లవాత్మకమే.