Showing posts with label 108 అంబులెన్సు సేవలు. Show all posts
Showing posts with label 108 అంబులెన్సు సేవలు. Show all posts

Saturday, December 25, 2010

రాజశేఖర రెడ్డి "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో అపశృతులు: వనం జ్వాలా నరసింహారావు


ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అపశృతి, ఈ మాత్రం సేవలు కూడా దక్కవా?,
నిధుల మళ్ళింపుతో సమస్యలు, పెరిగిన రుణ భారం, ఉద్యోగులకు అభద్రత
(సూర్య దినపత్రిక:19-01-2011)

వనం జ్వాలా నరసింహారావు
కన్సల్టెంటు హెచ్ఎంఆర్ఐ & ఇ.ఎం.ఆర్.ఐ మాజీ సలహాదారుడు

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అత్యవసర సహాయ సేవలందించే 108 అంబులెన్సులను, నడపకుండా నిలుపుదల చేస్తామని, గత ఐదేళ్లు గా వాటిని నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. నడపకుండా నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి రెండు వారాలు గడవక ముందే, ఆ సంస్థ సీఈఓ వెంకట్ చెంగవల్లి రాజీనామా చేసారు. రెండేళ్ల క్రితం .ఎం.ఆర్.వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు రాజీనామా కంటే సీఈఓ రాజీనామా ప్రభావం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణపై పడడం, సేవలు సంక్షోభం దిశగా పయనించడం వాస్తవం అనవచ్చునేమో!.

వ్యక్తిగత పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా! 108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలా జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడం కొరకు కమిటీలను వేయడమంటే 108-అత్యవసర సహాయ సేవలు పౌరులకు గతంలో మాదిరి నాణ్యమైన సేవలు లభ్యం కాకుండా చేయడమే! అంబులెన్సుల సేవలు ఆగిపోతే నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడానికి భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ నేరస్తులే.

ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా ఒప్పందం".

"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ఆవిర్భావం జరిగింది. తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు.

అలాంటప్పుడు ఇ.ఎం.ఆర్.ఐ ఎందుకు అల్టిమేటం ఇవ్వాల్సి వచ్చింది? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? జీ. వి. కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకు ముందు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం" పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో నాలుగు పర్యాయాలు కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఏ విధమైన అభ్యంతరాలను చెప్పని ప్రభుత్వం, ఈ సారి రకరకాల ఆక్షేపణలు తెలియచేయడానికి కారణాలే వై వుండొచ్చు? అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" తెరలేపింది ప్రభుత్వమైనా అవకాశం ఇచ్చింది మాత్రం ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యమే అనాలి. ఇలా జరగకుండా వుండాల్సింది.

నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రత్యక్ష నిర్వహణ వ్యయం కింద రు. 1, 12, 499 చొప్పున ఇ.ఎం.ఆర్.ఐ కి ఇస్తామని 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ప్రభుత్వం, అంబులెన్సుల సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తుంది. జీ.వీ.కె యాజమాన్యం 95% నిర్వహణ వ్యయాన్ని 100% పెంచమని, అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు. అధికారిక లెక్కల పుస్తకాలలో నెలనెలా నిర్వహణ వ్యయం ఒక్కో అంబులెన్సుకు సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది.

"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా 2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ "నమ్మకం-విశ్వాసం" తో తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది. అయితే అప్పటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న. 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు పెరిగినప్పుడు, దగ్గుతోందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి?

అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వాన్సుగా నిధులను విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" అలా విడుదలైన నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ తెర లేపింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. అదే క్రమేపీ రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!

ఇ.ఎం.ఆర్.ఐ వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో యాజమాన్యం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.

సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!

జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండొచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు.

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి", "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.

ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది?

ఇదిలా వుండగా, ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍‍ఎంఆర్ఐ ) సమకూరుస్తున్న "104 నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, కొత్త యాజమాన్య విధానాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. 104 సంచార వాహన సేవలు ఆరంభించడానికి ఒక మహత్తర ఆశయం వుంది. కనీస వైద్య సౌకర్యం కూడా నోచుకోని నిరక్షరాస్యులైన నిరుపేద గ్రామీణులు, తమ గ్రామానికి 104 సంచార వాహనం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇచ్చినంత కాలం ఆనందించారు. రాని రోజున ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియనందున మౌనం దాల్చారు. అలాంటి నాలుగు కోట్ల మంది అభాగ్యులకు 104 సంచార వాహన సేవలు మొదలయ్యేంతవరకు అలాంటి సేవలుంటాయనే విషయమే తెలియదు. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమై ఇంతవరకు నిరంతరాయంగా ప్రజలకు లభ్యమవుతున్న సేవలు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారానే లభించాలను కోవడం ఎంతవరకు సమంజసమో కూడా భవిష్యత్తే నిర్ణయించాలి? ఇప్పటికే పండిన పంటలు చేతికి రాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న లక్షలాది మంది పేద రైతులకు సకాలంలో ఇప్పటివరకూ లభ్యమవుతున్న ఆరోగ్య వైద్య సేవలు కూడా మృగ్యమవుతే ఎలా?

ఏదేమైనా రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో అపశృతులు చోటుచేసుకోవడం మాత్రం వాస్తవం! End

Thursday, December 23, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం"-3

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-III
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓకు ఫోన్ చేసి, మరి కాసేపట్లోనే తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?).

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు.

సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా సేవలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో, ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. ఆ తాకిడిని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట (2007 లో) ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన తక్షణమే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ముందస్తుగా విడుదల చేసిన ఆ నిధులను, అదే రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు (అంబులెన్సులు కొనడానికి, కాల్ సెంటర్ నెలకొల్పడానికి) ప్రధానంగా ఉపయోగించాలి. అయితే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆపాటికే ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి తెర లేచింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. రాజుగారి నిష్క్రమణంతో ఆ రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి రు. 70 కోట్లకు పైగా సమకూర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను మళ్లించడానికి బాధ్యులైన వారు, తక్షణ సమాధానం ఇవ్వాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకోలేరు. అలా చేసిన వ్యయం "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. ఆ పాటికే రాజుగారు నిధులను ఇవ్వడం నిలిపేశారు. అడగాల్సిన సిఇఓ తన బాధ్యతను విస్మరించారు. ఇతర రాష్ట్రాల నిధుల మళ్లింపే తేలికనుకున్నారు. సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!

ఇ.ఎం.ఆర్.ఐ అప్పట్లో ఎదుర్కున్న కష్టాల్లో ప్రధానమైంది "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, సుప్రీం కోర్టులో సంస్థపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం, మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, కింది స్థాయి ఉద్యోగులకు కూడా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా బహిర్గతం చేశారే మో! జీ.వీ.కె తొలుత సానుకూలంగా స్పందించి జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లో లేనందున ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్యను ఉదయమే వెళ్లి కలిశాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారూ ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు. పిరమల్ అధినేత అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యను కలిసినప్పుడు, డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మాట్లాడినప్పుడు (బహుశా) లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో, ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.

ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది? END

Wednesday, December 22, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం"-2

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-II
వనం జ్వాలా నరసింహారావు

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. కాకపోతే, ప్రజాస్వామ్యంలో "అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సంబంధిత సమాచారాన్ని పొందే హక్కు" ప్రతి పౌరుడికి వుంది. దానికి తోడు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. బహుశా ప్రభుత్వం కూడా అలానే భావించి వుంటుంది. అయితే, ప్రభుత్వం నాలుగు దశల్లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సమకూర్చిన 732 అంబులెన్సులు-అంతకు ముందే ప్రయివేట్ భాగస్వామిగా ‘రామ లింగరాజు గారి ఇ.ఎం.ఆర్.ఐ’ జతకూర్చిన మరో 70 అంబులెన్సులు కలిపి మొత్తం 802 అంబులెన్సులు పౌరులకు సేవలందించాల్సి వుండగా, వాటిలో కనీసం 100 అంబులెన్సులు, వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం.

రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించడమంటే, ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో విభిన్న కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? వాస్తవానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు గారు ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా రాజీనామా చేసిన నాటినుంచి (జనవరి 7, 2009) జీ.వీ.కె ఆ పదవి చేపట్టిన రోజు (మే నెల 26, 2009) వరకు బాహ్య ప్రపంచానికి అంతగా అవసరంలేని-పట్టని పలు ఇబ్బందులకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ లోనైంది. అయినా ఒక్క రోజుకూడా 108 అత్యవసర సహాయ సేవలు, ఒక్క క్షణం కూడా ఆపబడలేదు.

జీ.వీ.కె రెడ్డి అధ్యక్షతన జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ గా 108-అత్యవసర సహాయ సేవలు రూపాంతరం చెందాక యాజమాన్య పరంగా, నిర్వహణ పరంగా ఊహించీ-ఊహించని-ఊహ కందని అనేకానేక మార్పులు కనిపించసాగాయి. అనారోగ్యకరమైన మార్పులకు అంకురార్పణ జరిగిన ప్రతి సందర్భంలోనూ బాధను-అసంతృప్తిని బాహాటంగానే కొందరం వ్యక్త పరిచాం. నూతన చైర్మన్ జీ.వీ.కె రెడ్డి మొదటిసారి తన ఆంతరంగాన్ని ఇ.ఎం.ఆర్.ఐ సీనియర్ అధికారుల సమక్షంలో బహిర్గతం చేస్తూ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్‌ వర్క్ నుంచి తొలగిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నప్పుడు, ఇతర రాష్ట్రాలను నెట్‌ వర్క్ లోకి తెచ్చిన మా లాంటి కొందరికి తీవ్రమైన బాధ కలిగింది. ఆయన ఆంతరంగం అర్థమయింది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆపు చేస్తామని సిఇఓ తో లేఖ ఇప్పించినప్పుడు అప్పటి మా భయం నిజమయింది.

జీ. వి. కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం" పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో కుదుర్చుకున్న మొదటి (ఏప్రియల్ 2, 2005) ఎంఓయు విషయంలో, రెండో (సెప్టెంబర్ 22, 2006) ఎంఓయు విషయంలో, మూడో (అక్టోబర్ 5, 2007) ఎంఓయు విషయంలో, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో ఏ విధమైన "కొర్రీలను" వేయని ప్రభుత్వం, ఈ సారి ఆక్షేపణలు తెలియచేసింది. అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది. ఇంతకూ ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన ముసాయిదా ఎంఓయు లో వున్న అంశాలేంటి ? వాటి విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలేంటి ?

ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ, ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. జీ.వీ.కె యాజమాన్యం బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది నెలల ముందు నుంచి నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం.

ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు.

2008 సంవత్సరంలో ప్రభుత్వం అంగీకరించిన నెలసరి సగటు అంబులెన్సు నిర్వహణ వ్యయానికి అదనంగా రు. 8,833 లు (అంటే రు. 1, 27, 253) ఖర్చయ్యాయని లెక్కలు చూపించింది సంస్థ. అయితే అధికారిక లెక్కల పుస్తకాలలో ఆ వ్యయం సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది. ఎంఓయు లో అంగీకరించిన దానికంటే ఎందుకంత అదనంగా ఖర్చయ్యిందన్న అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. సగటున ప్రతి నెలా అంబులెన్సుకు అయ్యే సరాసరి నిర్వహణ వ్యయం ఎంతుంటుందన్న విషయాన్ని "నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించడం గాని" లేదా "టెండర్ విధానం ద్వారా వేలం పోటీ పద్ధతిన సరసమైన ధరను నిర్ణయించడం గాని" జరగాలని ఆర్థిక శాఖ అభిప్రాయం. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోని పలు అంశాలను మార్చవలసిన ఆగత్యాన్ని కూడా ఆర్థిక శాఖ ప్రశ్నించింది. వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నందున కుటుంబ సంక్షేమ శాఖలో "అంకిత భావం కలిగిన మానిటరింగ్ యూనిట్" ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా అభిప్రాయ పడింది. నిధుల సేకరణకు "అడ్వర్టయిజింగ్" విధానం అవలంభించడం మంచిదని మరో సూచన చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వానికి అనుమానాలొస్తుంటే భవిష్యత్ లో ఏం జరుగబోతోంది ఊహించడం కష్టమే!

"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా 2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ గారి "నమ్మకం-విశ్వాసం" తో కూడుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది.

అప్పటి ఆర్థిక-ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రోశయ్య సమక్షంలో 22-09-2006 న అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై సంతకాలు చేశారు. పూర్తిగా తన స్వయం పర్యవేక్షణ కింద (నా సమక్షంలో) తానే తయారుచేసిన అవగాహనా ఒప్పందం "అవతారిక"లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ గురించి రాసిన వాక్యాలు ఆ సంస్థమీద ప్రభుత్వానికి అప్పట్లో వున్న"నమ్మకానికి-విశ్వాసానికి" అసలు-సిసలైన మచ్చుతునకలు. ఎంఓయు పూర్వ రంగంలో అలనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జంధ్యాల హరినారాయణ్, అగర్వాల్ కు ముందున్న ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, ఉప కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడానికి-అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి చేసిన కృషి-తీసుకున్న చొరవ "నమ్మకానికి- విశ్వాసానికి" ఉదాహరణలు. అదే "నమ్మకాన్ని-విశ్వాసాన్ని" ఐదేళ్ల తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ కోల్పోవడానికి బలవత్తరమైన కారణాలుండి తీరాలి. అవి విశ్లేషించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ అధికారులపైనుంది.

108-అత్యవసర సహాయ సేవల పటిష్ఠ అమలుకు ప్రభుత్వం ప్రదర్శించిన "విశ్వాసానికి- నమ్మకానికి" మరో మచ్చుతునక, జులై 12, 2007 న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ్, నాటి ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనార్థం పంపిన వివరణ. ఆ వివరణ పూర్వ రంగంలో ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, అప్పటికి సరిగ్గా నాలుగు నెలల క్రితం (8-2-2007 న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "ఇ.ఎం.ఆర్.ఐ సలహా సంఘం సమావేశం" జరిగింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ పరంగా, ఇ.ఎం.ఆర్.ఐ కి 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణ నిధులను దశలవారీగా పెంచడానికి నాంది జరిగిన చారిత్రాత్మక సలహా సంఘం సమావేశమది. అవగాహనా ఒప్పందం ఆధారంగా, ఒక్కో అంబులెన్సుకు రు. 68, 700 అవుతుందని నిర్ణయం తీసుకున్న సమావేశం అది. ఒక పథకం విషయంలో, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పై "ఎంతో విశ్వాసం-నమ్మకం" వుండబట్టే అలా వ్యవహరించడం జరిగిందని భావించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉత్తర్వులు వచ్చిన కొద్ది రోజుల్లోనే, అత్యవసర సహాయ సేవల అంశం క్రమేపీ ముఖ్యమంత్రి దృష్టికి మరింత చేరువగా పోవడంతో, అక్కడినుంచి నిర్ణయాలు ఆయన కనుసన్నల్లో జరగడం మొదలయింది. అత్యంత ఆదరణ పొందిన సేవలుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా పాకడానికి మాత్రం కారకుడు (దివంగత) ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని, ఆ తర్వాత (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న.

ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి జరిపిన మరో సమీక్షా సమావేశంలో, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించింది ప్రభుత్వం. ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న "విశ్వాసం-నమ్మకం" కొనసాగిందనడాని నిదర్శనంగా అప్పుడున్న వాటికి అదనంగా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చడం జరిగింది. 95% నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం ఎంత భరించాలన్న నిర్ణయం తీసుకోవడంలో నాటి ఆరోగ్య-వైద్య శాఖల ముఖ్య కార్యదర్శి పి. కె. అగర్వాల్ తీసుకున్న చొరవ ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న"విశ్వాసానికి-నమ్మకానికి" మరో నిదర్శనం. ఆ మొత్తాన్ని ఒక్కో అంబులెన్సుకు రు. 1,12,499 గా నిర్ణయించి, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు పెరిగినప్పుడు, తగ్గుతుందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో ! End of Part II

Monday, December 20, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం-I": వనం జ్వాలా నరసింహారావు

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?- I
వనం జ్వాలా నరసింహారావు

అవగాహనా ఒప్పందం లేకుండా అత్యవసర సహాయ సేవలను అందిస్తున్నామని, నెల నెలా నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుల కోసం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వం నుంచి అనునిత్యం బెదిరింపులు-సాధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ 108 అంబులెన్సు సేవలను నడపమని, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో వాటిని గత ఐదేళ్లు గా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తకు స్పందించిన వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్ ఇ.ఎం.ఆర్.ఐ అధికారులకు ఎంఓయు విషయంలో భరోసా ఇవ్వడంతో తాత్కాలికంగా సమస్య సమసిపోయినా, ఒక ఇ.ఎం.ఆర్.ఐ బోర్డు సభ్యుడి ప్రోద్భలం మేరకు, సిఇఓ సంతకంతో ప్రభుత్వానికి అలాంటి హెచ్చరిక వెళ్లడం వెనక బలమైన కారణాలుండవచ్చు. సిఇఓ లేఖ కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కైతే, సమస్య పరిష్కరించింది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కావడం కూడా గమనించాల్సిన విషయం.

అసలేం జరుగుతున్నది? ప్రభుత్వ హామీలు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చైర్మన్ జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? అధికారులు నిరాసక్తతను పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణలో అపారమైన అనుభవం గడించిన సిఇవో, ప్రభుత్వానికి అలా హెచ్చరిక ఎందుకు చేయాల్సి వచ్చింది? అంబులెన్సుల సేవలు ఆగిపోతే నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు. వ్యక్తిగత పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా!

108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం భవిష్యత్ పరిణామాలకు సంకేతం కావచ్చు.

ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు భాగస్వాముల ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ చొరవ తీసుకున్న దాఖలాలు ఆ కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు లేదు. అసలా నివేదికలో ఏముందో కూడా బహిర్గతం కాలేదు. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, పౌరులకు గతంలో మాదిరి నాణ్యమైన సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన చిట్టచివరి సమీక్షా సమావేశంలో (ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య కన్సల్టెంటు గా నేను కూడా వున్నాను), ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు మే నెల 5, 2008 తో ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలని, కొత్త ఎంఓయు పై సంతకాలు కావాలని ఆయన చేసిన సూచన ఇంతవరకు అమలు జరగలేదు. లక్షలాది ప్రాణాలను కాపాడవలసిన సంస్థ నిర్వహణ వ్యయం కొరకు విడుదల చేయాల్సిన నిధులను తెచ్చుకోవడంలోనే సంస్థ అధికారులు నెలంతా కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితులున్నాయిప్పుడు. నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలని, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెడుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలని, రాజశేఖర రెడ్డి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల (జీవీకే సంస్థ) నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు. అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుందని మినిట్స్ లో నమోదుచేశారు. మినిట్స్ లో పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన మరి కొన్ని విలువైన సూచనలు, ఎంత మేరకు అమలుకు నోచుకున్నాయన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం.

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఇ.ఎం.ఆర్.ఐ సమకూరుస్తున్న 108-అత్యవసర సహాయ సేవల విషయంలో ఆ సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒకప్పుడున్న "నమ్మకానికి-విశ్వాసానికి" సంబంధించిన ఒకటి-రెండు అంశాలను పేర్కొంటానిక్కడ.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో ప్రారంభమైన అత్యవసర సహాయ సేవలు, కులాలకు-మతాలకు-రాజకీయాలకు-సామాజిక వర్గాలకు-ధనిక, బీద తేడాలకు-స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా లక్షల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయడం పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలను, పరిశోధకులను ఆసక్తి పరిచాయి. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రయివేట్ భాగస్వామి "లాభాపేక్ష" తో ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం-కొనసాగించడం ఆచరణ సాధ్యమవుతుందేమోగాని, "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ నేరస్తులే.

ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. అత్యవసర సహాయ సేవలను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తులు కొందరు ఆంధ్ర ప్రదేశ్ లో చొరవ తీసుకోవడం, క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం జరిగింది. అనవసర జాప్యాలకు, ప్రభుత్వ ఉద్యోగులలో కూరుకుపోయిన అలసత్వానికి అతీతంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు లభ్యమయ్యే అభివృద్ధి-సంక్షేమ పథకాలను మరింత మెరుగుగా-వేగవంతంగా అందించాలన్న ఆశయంతో, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న పలు ప్రజాస్వామ్య దేశాల్లో, ఐదారు దశాబ్దాల క్రితం నెలకొన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. సంస్కరణల పుణ్యమా అని, భారతదేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరిగింది. వాటి మూసివేతకు కొంత ముందు-వెనుకగా "ప్రభుత్వ ప్రయివేట్ సంయుక్త రంగంలో" స్థాపించిన పరిశ్రమలు (జాయింట్ వెంచర్లు) కూడా యాజమాన్య పరమైన బాలారిష్టాలకు గురై, మూసివేయడం జరిగింది.

మరో వైపు, ప్రయివేట్ రంగంలో నెల కొన్న అనేక సంస్థలు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, లాభాలను ఆర్జించడం కూడ మొదలయింది. ప్రయివేట్ పరంగా మెరుగైన పౌర సేవలు లభ్యమవుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా ఒప్పందం".

ప్రభుత్వ శాఖలలోని నైపుణ్యం-నాణ్యతా పరమైన లోటుపాటులను, ప్రయివేట్ రంగంలోని (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల) ఆర్థిక పరమైన ఇబ్బందులను, ఉమ్మడిగా అధిగమించేందుకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం సరైన ప్రక్రియని ప్రభుత్వం గుర్తించింది. మౌలిక వసతులను ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం, దానికి కావాల్సిన తొలి విడత పట్టుబడి సమకూర్చుకోగలిగే స్థోమత, సాంకేతిక పరిజ్ఞానం అమర్చుకోగల శక్తి గల, లాభాపేక్ష రహిత ప్రయివేట్ వ్యక్తులతో-సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే ఆలోచన చేసింది ప్రభుత్వం. పరస్పర సంబంధ-బాంధవ్యాల విషయంలో, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం-నిబద్ధత-హక్కులు-బాధ్యతల విషయంలో, ఎవరి పాత్ర ఏమిటన్న అంశం క్షుణ్ణంగా పరిశీలించాలని భావించింది ప్రభుత్వం.

పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-2012), ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరోగ్య సేవలందించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి, ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కార్య నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన-మెరుగైన-నాణ్యమైన సేవలను పౌరులకు లభ్యమయ్యేలా చేసేందుకు, యావత్ వైద్య రంగం "జాతీయ సంపద" గా మలిచేందుకు, ఒక ప్రధానమైన సాధనంగా "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియకు నిర్వచనం వివరిస్తూ పేర్కొంది ప్రణాళికా సంఘం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలోని ప్రయివేట్ పదానికి పెడార్థాలు చెప్పరాదని, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా "ప్రయివేటీకరణ" చేసి, బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని భాష్యం చెప్పొద్దని ప్రణాళికా సంఘం అభిప్రాయం వెలిబుచ్చింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు-ధ్యేయాలు చేరుకునేందుకు, అందులో ప్రధాన భాగమైన "గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల పథకం" అమలుకు-ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమై పది రాష్ట్రాలకు పాకిన 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడింది.

ఫిబ్రవరి 8, 2005 న సత్యం కంప్యూటర్స్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావం జరిగింది. తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్స్" గా అతి చాకచక్యంగా సొసైటీ నియమ-నిబంధనలను రూపొందించారు రాజు గారు. "భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్ప బడిందే అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ. తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. End of Part-I