Showing posts with label కొణిజేటి రోశయ్య. Show all posts
Showing posts with label కొణిజేటి రోశయ్య. Show all posts

Tuesday, October 26, 2010

సమష్ఠి బాధ్యతా రాహిత్యంతో నానాటికి కొరవడుతున్న విశ్వాసం : వనం జ్వాలా నరసింహారావు

సమష్ఠి బాధ్యతా రాహిత్యంతో నానాటికి కొరవడుతున్న విశ్వాసం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దిన పత్రిక (28-10-2010)

కొందరు మంత్రులు తమ శాఖలను పట్టించుకోవడం లేదని, విధాన నిర్ణయాల విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాలనే బే ఖాతరు చేస్తున్నారని, స్వీయ నిర్ణయాలు తీసుకోవడానికి జంకి ముఖ్యమంత్రిపై భారం మోపుతున్నారని వార్తలొస్తున్నాయి. సంస్కరణల పేరుతో మంత్రులకు తెలియకుండా-ముఖ్యమంత్రి దృష్టికి పోనీ కుండా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను గురించి సీఎం ను అడిగితే ఆయన అమాయకంగా స్పందిస్తున్నట్లు, సంబంధిత శాఖ మంత్రిని వివరణ అడుగుతే తనకూ తెలియదని జవాబిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనికి తోడు మంత్రి వర్గ నిర్ణయాలు సమిష్టి బాధ్యతగా భావించడం ఏ మంత్రీ పాటించడం లేదని, మంత్రులకు అధికారులకు మధ్య విధాన నిర్ణయాల విషయంలోను-పథకాల అమలు విషయంలోను-రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను తిరగ తోడే విషయంలోను, అవగాహనా రాహిత్యం పూర్తి స్థాయిలో చోటుచేసుకుంటున్నదని కూడా వార్తలొస్తున్నాయి.

చాలా మంది మంత్రులు తనకు గుదిబండలుగా పరిణమించినట్లు, సగానికి పైగా మంత్రులు క్రియాశీల రాహిత్యంగా-నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నట్లు, సచివులు మొక్కుబడి కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే ఉద్దేశంతో కానట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయనలోని అసహనం హద్దులు దాటి, మీడియా వీటికి సంబంధించిన అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు గుప్పిస్తుంటే, "పొరపాటునో గ్రహపాటునో సీఎం అయినంత మాత్రాన అన్ని విషయాలూ ఫింగర్‌ టిప్స్ పైన ఉంటాయా?'' అని అన్నట్లు పత్రికలు రాశాయి. అలానే, ఒకానొక అతి ముఖ్యమైన విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత ఫైలు మీద సంతకం పెట్టి విధి విధానాలను రూపొందించమని మంత్రికి సూచించినప్పటికీ, ఆ విషయంలో ఆయన మీడియాకు బాధ్యతా రాహిత్యంగా సమాధానాలు ఇచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. ఒకే విషయాన్ని తనను, ముఖ్యమంత్రిని అడగడమంటే, ఇద్దరి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నంగా ఆ మంత్రి అనడం, సమిష్టి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇదిలా వుండగా, వరదల్లో వైఫల్యం, విత్తనాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం, నిత్యావసర ధరలు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, తెలంగాణ న్యాయవాదుల పోరాటం, సోంపేటలో రైతులపై కాల్పులు, బయ్యారం గనులు, ఆరోగ్య సేవలు, మైక్రో ఫైనాన్స్ ఆగడాల లాంటి పలు సమస్యలకు సంబంధించి అధికారుల నుంచి సరైన సమాచారం ముఖ్య మంత్రి స్థాయిలో ప్రభుత్వానికి చేరుతున్నట్లు కూడా కనిపించడం లేదు.

మన రాష్ట్రంలో మంత్రులకు-మంత్రులకు మధ్య, మంత్రులకు-ముఖ్య మంత్రికి మధ్య, మంత్రులకు, ముఖ్యమంత్రికి-సంబంధిత శాఖ అధికారులకు మధ్య అగాధం నానాటికి పెరిగిపోతోంది.. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగ పరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యతే ఉంటుంది.. అధికారికీ, మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి... అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పనిచేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. సంస్కరణల పేరిట పాత పథకాలకు పేర్లు మార్చడమో, నీరు కార్చడమో చేసి సంబంధిత శాఖ మంత్రికి, ముఖ్య మంత్రికి విషయం తెలిసే లోపున ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తారు. ఇటీవల కాలంలో ఇవన్నీ మామూలై పోయాయి.

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు దాటినా, ఆయన మంత్రివర్గంలోని చాలామందికి తమ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, శాఖాధిపతులతో నేటికీ సత్సంబంధాలు ఏర్పడలేదు. అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు సీనియర్ అధికారులు సంబంధిత మంత్రి నుంచి కాకుండా ఇతర మంత్రులనుంచి ఆదేశాలు తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే తాము జవాబుదారీ అనే ధోరణి కూడా కొంతమంది అధికారుల్లో కనిపిస్తోంది.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న చర్చ మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. బ్రిటిష్ సంప్రదాయాలనే చాలావరకు మనం అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. ఆచరణలోకి వచ్చేటప్పటికి, కొన్ని సందర్భాల్లో మనదైన శైలిలో నడుస్తున్నాం. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకూ మధ్య ఉండాల్సిన సంబంధాల విషయంలో ఇరువురూ ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటిస్తున్నారు. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్ లో రూపొందించిన" ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" లో వివరించారు. పదేళ్ల క్రితం ఆ మెమొరాండానికి కొన్ని సవరణలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుతం మన రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను సమీక్షించడం సబబు. మెమొరాండంలో పేర్కొన్నట్లు రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే మంత్రులు చట్టసభలకు జవాబుదారీ అయినట్లే, సివిల్ సర్వెంట్లు (అధికారులు) మంత్రులకు జవాబుదారీగా ఉండాలి. మంత్రులకు అంటే, ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అర్ధం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ముఖ్య మంత్రి పదవిలో వున్నా, రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రధమ కర్తవ్యం. ప్రభుత్వాలు మారినా వారి ఈ కర్తవ్యం మారదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి-అంటే సంబంధిత మంత్రికి-వారు అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలి. తమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమల్లో ప్రభుత్వానికి అండదండగా ఉండాలి. విదేశాల్లో నేర్చుకున్న పాఠాలను, భారత దేశ పరిస్థితులకు అన్వయించకుండా, యధా తధంగా అప్ప చెప్పడం మానుకోవాలి. అక్కడ విన్నవీ-కన్నవీ, ఆ విషయాలంతగా తెలియని మంత్రులకు చెప్పి, వారు అర్థం చేసుకోకుండా ఒప్పించి, అప్పటివరకూ ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు.

ప్రభుత్వమంటే, సమష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న పూర్తి మంత్రి మండలి. దాని అధినేత ముఖ్యమంత్రి. సంబంధిత శాఖకు చెందిన పాలన విధానాన్ని నిర్ణయించేది ఆ శాఖ మంత్రే అయినా, అది యావత్ మంత్రి మండలి సమష్టి నిర్ణయమే. ఏ ఒక్క మంత్రి తప్పు చేసినా, దానికి అందరూ బాధ్యత వహించాలి అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అసలీ విషయం గురించిన ఆలోచనే ఇటీవలి కాలంలో మంత్రులకు రావడం లేదు. పైగా తోటి మంత్రి చేసిన దాన్ని తప్పు పట్టడం, బాహాటంగా మరో మంత్రిని విమర్శించడం, వీలుంటే ముఖ్య మంత్రినే విమర్శించడం, తన పార్టీకి చెందిన వాడే ముఖ్య మంత్రిగా వున్నప్పటికీ మరో వ్యక్తి ఆ పీఠంలోకి వస్తే బాగుంటదని వ్యాఖ్యలు చేయడం, సంబంధిత శాఖ మంత్రికి తాను తీసుకున్న నిర్ణయంపై అవగాహన లేకపోవడం సర్వసాధారణ విషయాలవుతున్నాయి. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగపరంగా ఏ విధమైన బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అలాంటి బాధ్యతే ఉంటుంది. పాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖ ముఖ్య అధికారి పూర్తిగా తోడ్పడాలి. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి. మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి.

సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, తాను అత్యంత శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా, అది పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇదంతా జరిగిన తరువాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, అభిప్రాయభేదాలున్నా, అమలు విషయం వచ్చేసరికి ఎటువంటి అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో పనిచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం పెరుగుతాయి. అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహా ఇచ్చినా, మంత్రులను మభ్యపెట్టినా, మంత్రులకు తెలియకుండా రహస్య సమాచారాన్ని అధికారికంగా బహిర్గతం చేసినా, ఆ దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వంపైనా పడుతుంది. పర్యవసానం ఏదైనా, తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంటులమీద రాజకీయ ఒత్తిడుల ప్రభావం పని చేస్తుందన్న విషయం కూడా ఆలోచించాలి. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా సరళికి అనువుగా ఉండే సలహాని మాత్రమే పొందే విధంగా సివిల్ సర్వెంటులపైనా ఒత్తిళ్లు రావచ్చు. మన దేశంలో ఇలాంటి ఒత్తిడులు వచ్చే అవకాశాలే ఎక్కువ. వృత్తి ధర్మానికి విరుద్ధంగా సివిల్ సర్వెంట్లతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఒకవేళ మంత్రి ప్రోద్భలం లేకపోయినా అలాంటి తప్పులు స్వతహాగా అధికారులు చేయొచ్చా? జీతభత్యాల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ మంత్రుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదని తెలిసినా, అఖిల భారత సర్వీసులకు చెందిన సివిల్ సర్వెంట్లకన్నా ఎందుకు మరింత మెరుగ్గా పనిచేయకూడదు? తమను వేలెత్తిచూపు చూపే రీతిలో కొందరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?

ఏదైనా పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ,జనా కర్షక పధకంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, అధికారులు మంత్రుల ఆలోచనా విధానానికి అనుగుణంగా స్పందించాల్సిన అవసరమొస్తే అలాంటి స్పందనను ఒత్తిడి అనలేం. మంత్రుల అభిప్రాయాన్ని, అభిమతాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత అతి ముఖ్యం. సలహా అడిగిన మంత్రికీ, ఇచ్చిన అధికారికీ మధ్యన గట్టి విశ్వాసం ఉండాలి. అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పని చేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్లో అమలవుతున్న సత్ సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టి పనిచేయడం మంత్రులకూ, అధికారులకూ మంచిది.

Monday, September 27, 2010

పాత తరం నాయకుడు కోట్ల విజయ భాస్కర రెడ్డి : వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 27, 2010 న కోట్ల విజయభాస్కర రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా
పాత తరం నాయకుడు కోట్ల విజయ భాస్కర రెడ్డి
వనం జ్వాలానరసింహా రావు

పాత తరం నాయకులలో కోట్ల విజయ భాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఆద్యంతం-ఆజన్మాంతం, చెదరని నిజాయితీతో, క్రమశిక్షణతో, పరిపాలనా దక్షతతో, ముందు చూపుతో, సామర్థ్యంతో, నైతిక విలువలతో, ఆత్మ విశ్వాసంతో, ముక్కు సూటిగా పోయే మనస్తత్వంతో, పట్టుదలతో రాష్ట్ర-దేశ రాజకీయాలలో తనదంటూ చెరిగిపోని ముద్ర వేసిన పెద్దమనిషి, సౌమ్యుడు, మితభాషి, అజాతశత్రువు, సంస్కార వంతుడు, అరుదైన సహజ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డి. జీవన యానంలో సహస్ర చంద్ర దర్శనం, రాజకీయ యానంలో షష్టి పూర్తి జరుపుకున్న ఆ మహా మనిషిని వరించని పదవి లేకపోయినా, ఎన్నడూ పదవే ధ్యేయంగా రాజకీయాలు చేయలేదు. అందుకేనేమో, అశేష జనం అభిమానాన్ని చూరగొన్న "పదహారణాల పెద్దాయన" య్యారు. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కర రెడ్డిది పెద్ద మనిషి తరహా వ్యవహార శైలి.

అనేక ప్రజోపయోగమైన కీలక పదవులను తన అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో పొందారు. పొందిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. స్వపక్షం-విపక్షం అన్న తేడా లేకుండా, తన వారైనా-పరాయి వారైనా తప్పుచేశారని భావించినప్పుడు, అందుకవసరమైన న్యాయ విచారణకు ఆదేశించి, ప్రశంశలను-అభిశంసలను అందుకున్నారు. అందుకేనేమో, సాక్షాత్తు రాజీవ్ గాంధీ లాంటి వారు, తన తల్లిపై-ఆమె ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో దాన్ని తిప్పికొట్టడానికి, విజయభాస్కర రెడ్డి లాంటి వారి పేరును వాడుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేంత వరకు, ఏ విధంగానైతే కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో "నంబర్ టు" గా వ్యవహరించి, ఏ ముఖ్యమంత్రి వున్నా ఆయనకు అండగా సంపూర్ణ సహకారాలందించే వారో, అదే విధంగా అటు కేంద్రంలోను-ఇటు రాష్ట్రంలోను నిర్మాణాత్మక పాత్ర పోషించేవారు విజయభాస్కర రెడ్డి. ఆయన "నంబర్ టు" గా వుండడం, ఎప్పుడో బ్రహ్మానంద రెడ్డి కాలంలోనే ఆరంభమైంది. ఆయన ఏ శాఖను ఏ స్థాయిలో నిర్వహించినా, దానికి సంబంధించిన పూర్వా-పరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారని ఆయన ఆంతరంగిక అధికారులంటుండేవారు. నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకు ఎనలేని గౌరవం. వారిని ఎన్నో రకాలుగా ప్రోత్సహించేవారని పేరుంది. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఎన్ టీ రామారావు దగ్గర ఎస్వీ ప్రసాద్ పనిచేసినప్పటికీ, నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకున్న గౌరవమే తన దగ్గర పనిచేసేందుకు కూడా ఆయన్నే ఎంపిక చేసుకునేందుకు దారితీసింది. అలానే సమస్య ఎదురైనప్పుడు, దాన్ని ధైర్యంగా ఎదుర్కునేవారు కాని, ఇప్పటి నాయకులవలె బాధ్యతనుంచి తప్పించుకునే ధోరణి కాని-ఇతరులను నిందించడం కాని ఎన్నడూ చేయలేదని కూడా ఆయనతో పనిచేసిన అధికారులనేవారు. ఉదాహరణకు, తీవ్రవాదుల కిడ్నాప్‌కు గురైన ప్రభుత్వాధికారులను విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పలువురి ప్రశంసలనందుకుంది.

కోట్ల తీసుకున్న సారా నిషేధం నిర్ణయం వల్ల మహిళలకు ధైర్యం కలగడం-అనేక బీద కుటుంబాలు బాగుపడడం జరిగింది. చౌక దుకాణాలను మహిళలకు కేటాయించాలనే నిర్ణయం కూడా ఆయనదే. అనాదిగా కాంగ్రెస్ పార్టీపై మహిళలకున్న అభిమానం, విజయభాస్కర రెడ్డి నిర్ణయాల మూలంగా ఇనుమడించిందనాలి. కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన ఆయనకు పాలనా దక్షుడుగా పేరొచ్చింది. ఆ పేరే ఆయనను 1962లో రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు దోహదపడిందంటారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా, రాష్ట్ర స్థాయికి చేరుకుని, దరిమిలా కేంద్ర స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభను గుర్తించిన అధిష్టానం, ఎన్ని విధాల వీలై తే అన్ని విధాల, ఆయన సేవలను ఉపయోగించుకుంది. అహర్నిశలు ఆత్మవిశ్వాసంతో పనిచేసే విలక్షణమైన వ్యక్తిత్వమున్న విజయభాస్కర రెడ్డి ఏ పదవిలో వున్నా, అనవసర విషయాలకు, ఇప్పటి నాయకుల లాగా ప్రాధాన్యమివ్వకుండా, తన కర్తవ్య నిర్వహణలో ఎవరు కూడా వేలెత్తి చూపని రీతిలో హుందాగా ముందుకు సాగేవారు.

మానవత్వానికి, మంచితనానికి, సహనానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన కాన్వాయ్ వెంట ప్రయాణిస్తున్న పాత్రికేయుల వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైందట. అది గమనించిన విజయభాస్కర రెడ్డి, తాను ముఖ్యమంత్రినన్న విషయం పక్కన పెట్టి, తన వాహనం దిగి, స్వయంగా గాయపడిన విలేఖరులకు సహాయ పడ్డారట. అదీ ఆయన మానవత్వం. వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ విషయంలో శ్లాబ్ పద్దతిని ప్రవేశపెట్టిన మంచితనం ఆయనది. కాపులను ముస్లింలను వెనుకబడిన వర్గాల వారిగా గుర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించింది ఆయనే. బలహీన వర్గాల గృహనిర్మాణ పధకం రూపకర్తా ఆయనే. ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఇందిరా గాంధి నిర్ణయం తీసుకోవడానికి కారణం, అంతకు ముందే, అలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ లో విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా అమలుపరచడమే. ఆయనకు సాగునీటి శాఖన్నా, విద్యుత్ శాఖన్నా, విద్యా శాఖన్నా ఎక్కువ మక్కువ నేవారు. అప్పటి ప్రధాని పీవీ సమక్షంలో తనకు, తన పార్టీ వారినుంచే జరిగిన అవమానానికి నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆత్మగౌరవం ప్రదర్శించిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. ముఠా రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన సహనానికి ప్రతీక అనాలి. రాజకీయ నాయకుల కుండే సహజసిద్ధమైన "లౌక్యం" ఆయనకు అలవాటులేదు. నిర్మొహమాటంగా తాను చెప్పదల్చుకుంది చెప్పేవారేకాని మనసులో ఒక మాట, బయటకు మరో మాట చెఫ్ఫే మనస్తత్వం కాదు. ఉదాహరణకు, పీవీ నరసింహా రావు ఓటమి తర్వాత, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మద్దతు విషయంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చెప్పుకోవాలి. తెలుగు దేశంతో కలిసి ఫ్రంట్కు మద్దతివ్వడం మంచిది కాదని నిక్కచ్చిగా ఆయన చేసిన సూచన విలువ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత తెలిసొచ్చింది.

విజయభాస్కర రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన గురించి పెద్దలు చెప్పిన మంచి వాక్యాలు మన మదిలో ఎల్లప్పుడూ మెదులుతూనే వుంటాయి. సీపీఎం నాయకుడు స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వర రావు, శాసన సభలో తెలుగుగంగపై జరిగిన అవినీతికి సంబంధించిన చర్చలో పాల్గొన్నారొక పర్యాయం. ఆయన ఆ సమయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూనే, ఆయన సహచరులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే, విజయభాస్కర రెడ్డిని గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యాఖ్యలు చేశారు. "నీతి-నిజాయితీలకు" ఆయన నిదర్శనమని, తాను చేస్తున్న ఆరోపణలకు విజయభాస్కర రెడ్డికి సంబంధం లేదని అన్నారాయన. అరుదైన నాయకుడాయన.