Thursday, September 30, 2021

గుప్త వంశం (బ్రాహ్మణ రాజులు-12) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 గుప్త వంశం (బ్రాహ్మణ రాజులు-12)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           కుషాణు, శాతవాహన వంశాలు పతనమైన అనంతరం భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన రాజవంశం గుప్త వంశం.ఈ వంశీయుల పాలన క్రీస్తుశకం 275 నుండి ప్రారంభమైంది.కాకపోతే ఈ వంశపు రాజుల అభ్యున్నతి మాత్రం క్రీస్తుశకం 320 నుండి ఆరంభమైంది. శక రాజులు, క్షహరాట వంశీయులు భారతావని పశ్చిమ భాగంలోను, ఉత్తర భాగంలోనూ, చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలిస్తూ ప్రబల శక్తి సమన్వితులై వున్న సమయంలో గుప్త వంశీయుల పాలన మొదలైంది. గుప్త రాజుల పరిపాలనను స్వర్ణయుగ పాలనగా పరిగణింపబడుతున్నది. భారతీయ సంస్కృతీ వికాసానికి ఈ వంశీయులు దోహద పడ్డారు. భారత జాతి ప్రపంచంలో ఉన్నత సంస్కారంగల జాతిగా గుప్తుల కాలంలో ప్రసిద్ధికెక్కింది. పదమూడుమంది గుప్త వంశపు రాజులు క్రీస్తుశకం 275 నుండి క్రీస్తుశకం 600 వరకు భారత భూభాగాన్ని ఏలారు. ఈ వంశీయులలో ప్రథముడు శ్రీగుప్తుడు.

         గుప్త వంశ చక్రవర్తులు బ్రాహ్మణులు. గుప్త వంశానికి చెందిన రెండవ చంద్రగుప్త సార్వభౌముడి కూతురు ప్రభావతీ గుప్త వాకాటక ప్రభువైన రెండవ రుద్రసేనుడిని వివాహం చేసుకున్నది. వాకాటకులు బ్రాహ్మణులు. గుప్త, వాకాటక రాజ వంశాలకు చెందిన ధారణ, విష్ణువృద్ధ గోత్రాలు బ్రాహ్మణులలో సుప్రసిద్ధమైన అగస్త్య, భారద్వాజ గోత్రాంతర్గతాలు. గుప్త యుగానికి చెందిన రాజన్యులు బ్రాహ్మణులైనప్పటికీ, వారు తమ పేరు చివర పితృ వంశ నామాలనే నిలుపుకున్నారు.

         గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. ఇతడి పూర్వీకులు శాతవాహన నరేంద్రులకు, కుషాణు వంశపు రాజులకు విదేయ సామంతులుగా వుండి పాటలీపుత్ర ఉత్తర పరిసర ప్రాంతాలను పాలించారు. విదేశీయులైన శక, యవన, పహ్లవ, కుషాణు రాజ వంశీయులు ప్రజా కంటకులుగా మారిన సమయంలో హైందవ మతాన్ని, హిందువుల ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సభ్యతలను ఒక శక్తియుతమైన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా పూర్తిచేసిన ఘనత గుప్త వంశానికి దక్కింది. శ్రీగుప్తుడు చిన్న రాజ్యాన్ని స్థాపించుకుని, చుట్టుపక్కల వున్న చిన్న సామంత రాజ్యాలను జయించి, తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. మౌర్య, శాతవాహన సామ్రాజ్యాల నాటి ప్రాభవాన్ని పునరుద్ధరించడానికి ఆవిర్భవించిన రాజ వంశం గుప్త వంశం. శ్రీగుప్తుడు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అసహాయశూరుడు. గుప్త రాజ్యాన్ని అతి వైభవంగా పాలించాడు. పరమత సహనం కల ఈ రాజు అనేక దేవాలయాలను నిర్మించాడు. పాటలీపుత్ర నగరాన్ని జయించి, దానిని తన రాజధానిగా చేసుకుని, చుట్టుపక్కల వున్న రాజ్యాలను జయించాడు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు (క్రీస్తుశకం 275-3000) పాలించాడు.

         శ్రీగుప్తుడు మరణించిన తరువాత అతడి కుమారుడు ఘటోత్కచుడు మగథ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు గుప్త సామ్రాజ్యాన్ని విస్తృత పర్చాడు. ఇతడు అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. పాటలీపుత్ర మహానగరాన్ని తీర్చిదిద్దిన ఘనుడు. ఇతడు 20 సంవత్సరాలు (క్రీస్తుశకం 300-320) పాలించాడు.

ఘటోత్కచుడి మరణానంతరం అతడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు మగథ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప విజేతగా, అరివీరభయంకరుడిగా కీర్తి గాంచాడు. లిచ్చవీ రాజవంశీయులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నాడు. తనమీద దండెత్తిన లిచ్చవీ వంశీయులు ఇతడి పరాక్రమాన్ని చూసి సంధి చేసుకున్నారు. వారి రాజ్యాలన్నీ మగథ సామంత రాజ్యాలుగా వుండడానికి అంగీకరించారు. చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన క్రీస్తుశకం 320 నుండి గుప్త శకం ప్రారంభమైంది. ఇతడు క్రీస్తుశకం 326 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. గుప్తరాజ్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు రావడానికి కృషి చేసిన మహారాజుగా కీర్తి గాంచాడు.

మొదటి చంద్రగుప్తుడి అనంతరం అతడి కుమారుడు సముద్రగుప్తుడు మగథ సామ్రాజ్యాధిపతి అయ్యాడి. సముద్రగుప్తుడు గుప్త రాజులలో గొప్ప విజేతగా కీర్తిని పొందినవాడు. అసాదారణ ప్రజ్ఞాపాటవాలు వున్నవాడు. రాజకీయ పరిజ్ఞాని. శక్తిమంతుడు. యుద్ధవిద్యా విశారదుడు. సంగీత సాహిత్యాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. అనితర సాధ్యమైన దండయాత్రలు నిర్వహించి, అనేకమంది రాజులను ఓడించిన మహావీరుడు. ప్రపంచ విజేతలలో ఒకడు. పాటలీపుత్రనగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరచాడు. మగథ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 326 నుండి క్రీస్తుశకం 375 వరకు సుమారు 50 సంవత్సరాలు అతి వైభవంగా పాలించాడు. అనేక దండయాత్రలు (ఉత్తర, దక్షిణ భారత) చేశాడు. విశాల సామ్రాజ్యంగా మగథ రాజ్యాన్ని స్థాపించాడు. సముద్రగుప్తుడు చక్రవర్తి. భారతదేశం విచ్చిన్నమై అదఃపతనమవుతున్న సమయంలో భారతజాతిని ఉద్ధరించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, భారత జాతి సంస్కృతీ సభ్యతలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించడానికి దండయాత్రలు చేసి మహాస్మారాజ్య నిర్మాణం చేసిన ఘనుడు.

సముద్రగుప్తుడి మరణం తరువాత అతడి జ్యేష్ట కుమారుడు రామగుప్తుడు మగథరాజ్య పీఠాన్ని క్రీస్తుశకం 375 లో అలంకరించాడు. అతడు పిరికివాడు. రాజ్యపాలనా విషయ పరిజ్ఞాని కాదు. శకరాజుల ప్రాబల్యానికి లోబడినవాడు. అతడెక్కువ రోజులు పాలించలేదు. క్రీస్తుశకం 375 లోనే సముద్రగుప్తుడి రెండవ కుమారుడు రెండవ చంద్రగుప్తుడు (చంద్రగుప్త విక్రమాదిత్యుడు) మగథరాజ్య సింహాసనం అధిష్టించాడు. భారతదేశ చరిత్రలో అసలు సిసలు స్వర్ణయుగం చంద్రగుప్తుడి కాలంలోనే అని చరిత్రకారులు అంటారు. చంద్రగుప్తుడు విద్యావైదుష్యాలు కలవాడు. ధర్మశాస్త్రజ్ఞుడు. వీరాధివీరుడు. చంద్రగుప్తుడు కాశ్మీర దేశాన్ని జయించాడు. ఇతడు బలవంతులైన రాజులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని తన రాజనీతిజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఇతడు మగథ రాజ్యాన్ని 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 375-413) పాలించాడు.

చంద్రగుప్త విక్రమాదిత్యుడి రెండవ రాణి ద్రువాదేవికి జన్మించిన మొదటి కుమార గుప్తుడు యువరాజుగా వుండి తండ్రి మరణానంతరం గుప్త సామ్రాజ్యాధినేత అయ్యాడు. తాత, తండ్రులు ఆర్జించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని అన్యాక్రాంతం కాకుండా మొదటి కుమారగుప్తుడు జీవిత చరమ దశ దాకా పాలించాడు. సముద్రగుప్తుడి లాగానే ఇతడు అశ్వమేధ యాగం చేశాడు. కుమారగుప్తుడి అవసాన దశలో పుష్యమిత్ర జాతులవారు మగథ రాజ్యం మీద దండెత్తారు. మగథ సైన్యం ఓటమి చవి చూసింది. ఓడిపోయే సమయంలో ఆ ఆటవిక సైన్యాన్ని కుమారగుప్తుడి కుమారుడు, యువరాజైన స్కందగుప్తుడు ఎదిరించి పోరాడి వారిమీద విజయం సాధించాడు. ఆ విధంగా గుప్త వంశీయుల గౌరవాన్ని కాపాడాడు. కుమారగుప్తుడు విశాల మగథ సామ్రాజ్యాన్ని 42 సంవత్సరాలు (క్రీస్తుశకం 413-455) పాలించాడు.

మొదటి కుమారగుప్తుడి మరణానంతరం అతని కుమారుడు స్కందగుప్తుడు రాజయ్యాడు. స్కందగుప్తుడు సమర వ్యూహ రచనా నిపుణుడు. స్కందగుప్తుడి పాలనారంభ కాలంలో అతడు హూణుల మీద సాధించిన విజయం దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి తోడ్పడింది. కాని, క్రీస్తుశకం 465 లో హూణుల దండయాత్రలు తిరిగి మొదలయ్యాయి. గుప్తసామ్రాజ్యంలో అనేక భూభాగాలను జయించారు వారు. మగథ సైన్యం హూణులను ఎదిరించి ఓడిపోయింది. రాజ్య భాగాలను హూణుల పరం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం వల్ల గుప్త సామ్రాజ్యం ఆర్థికంగా క్షీణించింది. స్కందగుప్తుడి సవతి సోదరుడు పూరుగుప్తుడు  తిరుగుబాటు చేశాడు. ఇంతలో హూణులతో జరిగిన యుద్ధంలో స్కందగుప్తుడు మరణించాడు. ఇతడి పాలనాకాలం 18 సంవత్సరాలు (క్రీస్తుశకం 455-473).

స్కందగుప్తుడి తరువాత పూరుగుప్తుడు గుప్త సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు మూడు సంవత్సరాలు మాత్రమే (క్రీస్తుశకం 473-476) పాలించగలిగాడు. వాస్తవానికి స్కందగుప్తుడి తరువాత గుప్తరాజుల చరిత్ర సమగ్రంగా లేదు. పూరుగుప్తుడి కాలం నుండి గుప్తవంశం రెండు శాఖలుగా చీలిందని కొందరు చారిత్రకారులు అంటారు కాని అది వాస్తవం కాదు. పూరుగుప్తుడి కుమారుడు బుధగుప్తుడు తండ్రి తరువాత రాజయ్యాడు. ఇతడు సుమారు 19 సంవత్సరాలు (క్రీస్తుశకం 476-495) రాజ్యం ఏలాడు. బుధగుప్తుడు నామ మాత్రపు రాజు మాత్రమే. బుధగుప్తుడి తరువాత వైశ్యగుప్తుడు, భానుగుప్తుడు నరసింహగుప్త బాలాదిత్యుడు పాలించారు.

ఆ తరువాత మిహిరకులుడు, మూడవ కుమారగుప్తుడు, యశోధర్మ విక్రమాదిత్యుడు, మాతృగుప్తుడు, ప్రవరసేనుడు రాజులయ్యారు. మూడవ కుమారగుప్తుడి తనయుడు దామోదరగుప్తుడు రాజ్యానికి వచ్చిన కొద్ది కాలానికే మౌఖరి ఈశానవర్మ సంతతివారితో సంభవించిన యుద్ధంలో మరణించాడు. ఇంతటితో గుప్తవంశం సమూలంగా నిర్మూలించబడింది.

             

Tuesday, September 28, 2021

పృధ్వీ మూలరాజు వంశం (బ్రాహ్మణ రాజులు-11) ..... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 పృధ్వీ మూలరాజు వంశం (బ్రాహ్మణ రాజులు-11)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           వేంగీ నగరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన శాలంకాయన రాజుల సామంతులుగా, గుణపాశపురం రాజధానిగా, తీరాంధ్రాన్ని ఏలిన మూలరాజు వంశీయులు పరాక్రమవంతులు. సాహసోపేతులు. అరివీర భయంకరులు. శాలంకాయన రాజులలో చివరివారు భీరువులై, అసమర్థులై, భోగలాలసులై, వున్న తరుణంలో మూలరాజు వంశీయుడైన ప్రభాకర మహారాజు స్వతంత్రుడై, తన పరిధి రాజ్యాన్నే కాకుండా, పరిసర సామంతులను ఓడించి, విశాల రాజ్యాన్ని నెలకొల్పి పాలించాడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు. ఈ వంశానికి ఆద్యుడు ప్రభాకర మహారాజు.

         ప్రభాకర మహారాజు శక్తిసంపన్నుడు. యుద్ధ విద్యా విశారదుడు. సాహసి. ఇతడు శాలంకాయన ప్రభువుల సామంతుడిగా వుండి, విష్ణుకుండినుల విజృంభణాన్ని గమనించి, స్వాతంత్ర్యం ప్రకటించి, విష్ణుకుండినుల వంశీయులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని, తన సామంత రాజ్యాన్ని సుస్థిరపర్చుకున్నాడు. ఇతడు సుమారు 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 360-398) పాలించాడు.

         ప్రభాకర మహారాజు మరణానంతరం అతడి కుమారుడు పృధ్వీమూలరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. పృధ్వీమూలరాజు శక్తిసంపన్నుడు. అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. ప్రభు భక్తి పరాయణుడు. యుద్ధ విద్యా విశారదుడు. పృధ్వీమూలరాజు రాజకీయ పరిజ్ఞాని. భవిష్యత్కాలాన్ని గమనించి, తండ్రి ప్రభాకర మహారాజు ఆజ్ఞానుసారం, తన ఏకైక కుమార్తె పరమ భట్టారికా మహాదేవిని విష్ణుకుండిన రాజ్యాన్ని ఏలుతున్న మొదటి గోవిందవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. పృధ్వీమూలరాజు వివేకనయ విద్యా సంపన్నుడు. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. విష్ణుకుండినుల సామంత రాజుగా వారికి తోడ్పడి వారి రాజ్య విస్తరణకు సహాయం చేశాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 398-460, సుమారు 62 సంవత్సరాలు.

         పృధ్వీమూలరాజు మరణానంతరం అతడి కుమారుడు హరివర్మ మూలరాజ వంశ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ వంశీయుల రాజధాని గుణపాశపురం, నేటి తూర్పు గోదావరి జిల్లాలోని తాడూరు. హరివర్మ తన మేనల్లుడు విష్ణుకుండిన రెండవ మాధవ వర్మకు తన ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం చేయడమే కాకుండా, శాలంకాయన రాజ్యాన్ని విష్ణుకుండిన మహాసామ్రాజ్యంలో విలీనం కావడానికి తోడ్పడ్డాడు. హరివర్మ క్రీస్తుశకం 460-528 మధ్య కాలంలో సుమారు 68 సంవత్సరాలు పాలించాడు.

         హరివర్మ కుమారుడు మూలరాజు. ఇతడు పల్లవ  సింహవర్మను ఓడించి తన ప్రభువైన విక్రమేంద్ర భట్టారకునికి విజయం చేకూర్చాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 528-580, సుమారు 52 సంవత్సరాలు. మూలరాజుతో ఈ వంశం అంతరించినది.        

Monday, September 27, 2021

మాఠర వంశం (బ్రాహ్మణ రాజులు-10) ....... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 మార వంశం (బ్రాహ్మణ రాజులు-10)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           ఖారవేల మహారాజు అనంతరం కళింగ దేశం మార వంశీయుల పాలనలోకి వచ్చింది. సముద్ర గుప్తుడి దక్షిణాపథ, దక్షిణ భారత దిగ్విజయానంతరం కళింగ రాజ్యం చిన్న-చిన్న రాజ్యాలుగా తలెత్తాయి. మార వంశీయులు పిష్టపురం రాజధానిగా కళింగ దేశాన్ని ఏలసాగారు. కాలక్రమంలో వీరికి పిష్టపురం బదులుగా వర్థమాన పురం, సింహపురాలు రాజధానులుగా వర్ధిల్లాయి. ఈ వంశీయులలో మొదటి రాజు శక్తివర్మ. బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రికుల లాగా వీరు కూడా గోత్రనామాన్ని వంశనామంగా గ్రహించిన విప్రులు. శక్తివర్మ నాల్గవ శతాబ్దంలో కళింగ దేశాధీశుడయ్యాడు. ఇతడి రాజధాని పిష్టపురం. ఇతడు క్రీస్తుశకం 350-365 మధ్య కాలంలో 15 సంవత్సరాలు పాలించాడు.

         శక్తివర్మ కుమారుడు అనంతవర్మ క్రీస్తుశకం 365 లో కళింగ రాజ్యాధినేత అయ్యి ఒక సంవత్సరం మాత్రమే పాలించాడు. ఇతడు శక్తిమంతుడు కాదు. శాలంకాయన వంశీయులు, వాసిష్ట గోత్రీకులైన ప్రభువులు పిష్టపురం మీద దండయాత్రలు చేయడం వల్ల అనంతవర్మ తన రాజధానిని సింహపురానికి మార్చాడు. కాని ఎక్కువ కాలం రాజ్యభారం వహించలేదు. ఇతడి అనంతరం ఆయన కుమారుడు అనంత శక్తివర్మ సింహాసనం అధిష్టించాడు. ఇతడు కడు సమర్థుడు. ఇతడి కాలం నుండి సింహపురి మార వంశీయుల రాజధానిగా వర్దిల్లినది. సింహపురం సింగాపురంగా ప్రఖ్యాతిగాంచినది. ఇది శ్రీకాకుళం, నరసన్న పేటల మధ్యన వున్నది. అనంత శక్తివర్మ సింహపుర రాజ్యాన్ని అతి సమర్థవంతంగా క్రీస్తుశకం 365 నుండి క్రీస్తుశకం 394 వరకు 29 సంవత్సరాలు పాలించాడు.

         అనంత శక్తివర్మ తరువాత అతడి కుమారుడు చండవర్మ సింహపురాదీశుడు అయ్యాడు. ఇతడు కళింగ రాజ్యాన్ని క్రీస్తుశకం 394 నుండి క్రీస్తుశకం 400 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. చందవర్మ కుమారుడు ఉమావర్మ తండ్రి అనంతరం కళింగ రాజ్య పీఠాన్ని అలంకరించాడు. ఆయన రాజ్యారంభ కాలంలోనే సింహపురాన్ని కోల్పోయాడు. ఇతడు క్రీస్తుశకం 400 నుండి క్రీస్తుశకం 440 వరకు సుమారు 40 సంవత్సరాలు పాలించాడు.

         ఉమావర్మ అనంతరం అతడి కుమారుడు విశాఖవర్మ కళింగ రాజ్యాధికారం వహించాడు. ఇతడు కొద్దికాలం మాత్రమే పాలించాడు. విశాఖవర్మతో మార వంశీయుల పాలన అంతరించింది. కళింగ దేశాన్ని గాంగ వంశీయులు స్వాధీనపర్చుకున్నారు.    

Sunday, September 26, 2021

విశ్వామిత్రుడిని గంగానదీ వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-74 : వనం జ్వాలా నరసింహారావు

 విశ్వామిత్రుడిని గంగానదీ వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-74

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-09-2021)

ఆ విధంగా మిగిలిన రాత్రంతా మునీంద్రుల సమూహంతో, శోణ నదీతీరంలో హాయిగా నిద్రించిన "ముని సింహం"-విశ్వామిత్రుడు, తూరుపు తెల్లవారగా మేల్కొని, ఆ సమయంలో చేయాల్సిన స్నాన-సంధ్యావందనాది కార్యక్రమాల నన్నిటినీ పూర్తి చేసుకుని, మిక్కిలి ప్రీతితో-గౌరవంతో-శుభకరమైన మంచి మాటలతో, రామ లక్ష్మణులను మేలుకొలిపాడు. రామ లక్ష్మణులు బ్రహ్మచారులే కనుక, వారికి స్నానం-సంధ్య తప్ప వేరే కృత్యాలు ఉదయాన లేవు. కాబట్టి, తన కార్యక్రమాలన్ని నెరవేర్చుకుని వాళ్లను నిదురలేపుతూ: " నాయనా, రామచంద్రా ! తూర్పు తెల్లవారడం ప్రారంభమయింది. ప్రాతస్సంధ్య సమీపించింది. కమలాక్షా ! సూర్యుడు ఉదయించిన తర్వాత, కమలాలు ముకుళించి వుండవుకదా-కాబట్టి నిద్ర లే. మీరు సంతోషంతో ప్రయాణం చేయాలి-అలా ప్రయాణం చేసేందుకు మీకు మేలు కలగాలి" అని విశ్వామిత్రుడు అనడంతో, వారు నిద్రలేచి, స్నాన-సంధ్యావందనం చేసి, ప్రయాణానికి సిద్ధమయ్యారు. నిర్మలమై-శుభప్రదమై-శుభ్రమైన నీటినిగలదై-ఇసుక దిబ్బలతో సుందరమై-ఎంతో లోతుగా వున్న శోణ నదిని ఎలా దాటాలి అని మునిని అడుగుతాడు శ్రీరాముడు. మునిశ్రేష్ఠులందరు ఎలా దాటుతారో, మనమూ అలానే వెళ్దామని ఆయన జవాబివ్వడం, ఋషేశ్వరులందరూ సంతోషంతో నదిని దాటి, వనంలో ప్రవేశించి, దారి వెంటబడి నడుచుకుంటూ పోయి, మధ్యాహ్నం కల్లా హంసలు-చక్రవాకాలున్న గంగా తీరానికి చేరారు.

మనస్సుకింపైన గంగానదీ తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారందరు. ఆ సమయంలో గంగానదిని చూపిస్తూ, అదెలా మూడు మార్గాల్లో సముద్రాన్ని చేరడానికి కారణమేంటని రాముడు ఆయన్ను ప్రశ్నిస్తాడు. దశరథుడి ముద్దుల కొడుకైన రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు సంతోషించిన విశ్వామిత్రుడు గంగానదీ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. " అనేక రత్నాలను కూడిన శిఖరాలతో ఆకాశాన్నంటుతూ, నానా ధాతు వర్ణాలతో ప్రకాశిస్తూ, మిక్కిలి చల్ల గాలి వీచడంవల్ల అసమానమైనదిగా ప్రసిద్ధిగాంచిన హిమవత్పర్వతం గురించి తెలియనివారు లేరు. ఆ హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మేనకనే మనోరమను పెళ్లి చేసుకుని, ఇద్దరు కూతుళ్లను కన్నాడు. వారిలో పెద్దది ’గంగ” , చిన్నది ’ఉమ’. వారిద్దరూ పెరిగి పెద్దవారైతున్నప్పుడు, దేవతలు ఆయన్ను కలిసి, తమ కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, అందులో ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. దేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు, మూడు లోకాలను పావనం చేసేదై-స్వేఛ్చగా చరించేదై-ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను, వారికి వెంటనే ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు. ఇక రెండో కూతురైన ఉమా దేవి, ఆకులలాలు కూడా తినకుండా, అపర్ణగా, ఘోరమైన తపస్సు చేసింది. హిమవంతుడామెను సమస్త లోకాలు మ్రొక్కే శివుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా పర్వతరాజు ప్రియపుత్రికలిద్దరు కీర్తిమంతులై ప్రకాశించారు" అని మొట్టమొదట పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియచెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు.

శ్రీరాముడికి గంగ "త్రిపథగ" అయిన వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు

గంగ వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు, పాప రహితమైన గంగ దేవలోకంలో-మనుష్యలోకంలో ఎలా సంచరించిందని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావడానికి కారణమేంటని, ఏ పని చేయడంవల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైందిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా, ఋషులందరు వినే విధంగా, రామచంద్రా అని సంబోధిస్తూ గంగా చరిత్రను చెప్పాడు విశ్వామిత్రుడు. "పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని, సంతోషంగా ఆమెతో నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు. రేతస్ఖ్సలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖ్సలనం కాకపోతే-అయినప్పుడు ఎంత బలిష్ఠమైనవాడు పుడతాడోననీ, వాడెలాంటివాడవుతాడోననీ, వాడిని భరించడమెట్లాననీ దేవతలు భయపడి, తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్లి శివుడిని కలిసి, నమస్కరించి, తమ మ్రొక్కులను గ్రహించి తమననుగ్రహించమని వేడుకుంటూ, ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలెన్ని కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని-పార్వతిని, వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ, ఆయన నుండి వెలువడే కాంతి పూరితమైన తన రేతస్సును పార్వతిలో విడువకుండా తనలోనే వుంచుకొమ్మని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్ని సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించారు".

(దీన్నే "మహా మైథునం" అని వాడుకలో పిలుస్తారు. పంచమ కారులైన శాక్తేయులకు ఇది పరమ పవిత్రమైన వ్రతం)

"ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు, వారి కోరినట్లే చేస్తానంటాడు. తను వీర్యాన్ని, పార్వతి శోణితాన్ని తమలోనే ధరించెదమని-రెంటినీ కలవనీయమని-వేర్వేరుగా వుంచుతామని అంటూ, మనుష్యులు, దేవతలు సుఖంగా వుండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా, ఆయన తేజం జారితే, దాన్ని భూదేవి ధరిస్తుందని దేవతలంటారు. అప్పుడు శివుడు దాన్ని వెలుపలకి వదిలాడు. అది, అడవులు-కొండలు తో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయమేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి, అగ్నిహోత్రుడిని-వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా, అగ్నిహోత్రుడందులో ప్రవేశించాడు. ఆకారణాన అదొక పెద్ద మంచు కొండలాగా యింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోకసమ్మతమయింది. కాలక్రమంలో అది శరవణం అయింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు".

దేవతలను శపించిన పార్వతి

"ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి, వారుచేసిన పాప ఫలం అనుభవించమని నిష్ఠురాలాడింది. దోసిట్లో నీళ్లు తీసుకుని, కళ్లల్లో కోపం కనపడుతుంటే, తనకు కొడుకు కనాలన్న కోరికని విఘ్న పరిచిన దేవతల భార్యలు బిడ్డలను కనరని-వారు గొడ్రాళ్లవుతారని శపించింది పార్వతి. ఆ తర్వాత భూమిపైనా కోపించింది పార్వతి. తను బిడ్డలను కనడం సహించలేకపోయిన భూదేవి, అనేక మందికి భార్యగా-అనేక రూపాలుగలిగుండి, ప్రీతితో బిడ్డల్ని కనే సంతోషం లేకుండా పోవాలని శపించింది పార్వతి. అందుకే, భూపుత్రి-సీత-నరకాసురుడు భూ పుత్రులైనా రేతస్సువల్ల గర్భం ధరించి కనే సుఖాన్ని భూమికి కలిగించలేదు. ఇలా పార్వతీదేవి అహంకార-రోషాలతో శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు వంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసేందుకు పోయాడు" ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు.

 

విష్ణుకుండిన వంశం (బ్రాహ్మణ రాజులు-9) ..... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 విష్ణుకుండిన వంశం (బ్రాహ్మణ రాజులు-9)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           శాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని ఏకఛ్చత్రాదిపత్యంగా పాలించిన రాజవంశాలలో విష్ణుకుండిన వంశం పేర్కొనదగినది. మహోజ్వల చరిత్ర కల విష్ణుకుండిన రాజన్యుల చరిత్ర అనుపమానమైనది. అసదృశమైనది. ఇక్ష్వాకు వంశీయుల సామంతుడిగా లేదా మాండలికుడిగా వున్న విష్ణుకుండిన వంశ స్థాపకుడైన మహా రాజేంద్రవర్మ మహబూబ్ నగర్ మండలంలోని అచ్చంపేట తాలూకాలో వున్న అమరాబాదు ప్రాంతాన్ని పాలించాడు.

         శాలంకాయన వంశీయులలో బలహీనులైన రాజులు ఆంధ్రదేశాన్ని ఏలుతున్న కాలంలో విష్ణుకుండిన వంశీయులు కృష్ణానది ఉత్తరాన వున్న అత్యధిక భూభాగాలను ఆక్రమించుకుని రాజ్యాన్ని విస్తరించుకున్నారు. విష్ణుకుండిన రెండవ మాధవ వర్మ వాకాటక రెండవ పృధ్వీసేనచక్రవర్తి ఏకైక కుమార్తె వాకాటక మహాదేవిని వివాహమాడి విష్ణుకుండిన వాకాటక రాజ్యాలను పాలించాడు. బలవంతమైన రాజవంశాలతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకుని విష్ణుకుండిన వంశీయులు దీర్ఘకాలం ఆంధ్రదేశాన్ని పాలించారు. విష్ణుకుండినులు మొదట్లో అమరాబాదు ప్రాంత పాలకులుగా వుండి, రాజ్యాన్ని విస్తరించి, ఇంద్రపురిని రాజధానిగా పాలించారు. వీరికి దెందులూరు, వేల్పూరు, విజయవాడ, విజయస్కంథావారములుగాను, అమరావతి, బెజవాడ, ఇంద్రపురి రాజధానులుగాను వుండేవి.

         విష్ణుకుండిన వంశ స్థాపకుడు మహారాజేంద్రవర్మ, శాలంకాయన, ఆనందగోత్రిక, పల్లవ రాజన్యులు ఒకరితో ఒకరు కలహించే కాలంలో అమరాబాదు, ఏలేశ్వరం ప్రాంతాలలో తన అధికారాన్ని సుస్థిరపర్చుకుని, క్రీస్తుశకం 358 లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించి, క్రీస్తుశకం 370 వరకు 12 సంవత్సరాలు పాలించాడు. మహారాజేంద్రవర్మ అనంతరం అతడి కుమారుడు మొదటి మాధవవర్మ క్రీస్తుశకం 370 లో సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం 398 వరకు 28 సంవత్సరాలు పాలించాడు. ఇతడు అమరాబాదు, కీసర, భువనగిరి ప్రాంతాల దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు.

         మొదటి మాధవవవర్మ తరువాత అతడి కుమారుడు మొదటి గోవిందవర్మ విష్ణుకుండిన రాజ్య పీఠాన్ని అధిష్టించినాడు. ఇతడు క్రీస్తుశకం 398 నుండి 435 వరకు సుమారు 38 సంవత్సరాలు పాలించాడు. గోవిందవర్మ గొప్ప విజేత. పరిపాలనాదక్షుడు. బౌద్ధమతానుయాయి. శాలంకాయన రాజ్యం క్షీణదశలో వుండగా, గోవిందవర్మ విజృంభించి, కృష్ణా-గోదావరీ నడులమధ్యన వున్న భూభాగాలను జయించి, రాజ్యాన్ని విస్తరించాడు. గుంటూరు ప్రాంతాన్ని కూడా జయించి మహాసామ్రాజ్య నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. మహారాజపదవిని అలంకరించాడు. మొదటి గోవిందవర్మ బౌద్ధమతానురక్తుడు. మహాజ్ఞాని. అనేక దేవాలయాలను నిర్మించాడు. విష్ణుకుండిన తోలిరాజులలో ఇతడు అగ్రగణ్యుడు.

         మొదటి గోవిందవర్మ కుమారుడు రెండవ మాధవవర్మ తండ్రి అనంతరం రాజయ్యాడు. ఇతడు విష్ణుకుండిన రాజన్యులలో అత్యంత ప్రతిభావంతుడు. అజేయుడు. సార్వభౌముడు. దక్షిణాపథం మాత్రమే కాకుండా దక్షిణ భారతాన్ని కూడా జయించాడు. ఇతడు వైదికమత నిరతుడు. 11 సార్లు ద్విగ్విజయ యాత్రలు చేసి శత్రురాజులను ఓడించి అశ్వమేధ యాగాలను, రాజసూయ యాగాలను చేశాడు. సువిశాలమైన విష్ణుకుండిన సామ్రాజ్య నిర్మాణానికి రెండవ మాధవ వర్మ అనేక రాజ్యాలను జయించాడు. విష్ణుకుండిన వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు. ఇతడి పరిపాలనాకాలం క్రీస్తుశకం 435-470. సుమారు 35 సంవత్సరాలు పాలించాడు.

         రెండవ మాధవవర్మ పెద్దకొడుకు దేవవర్మ తండ్రి అనంతరం సింహాసనాన్ని అధిష్టించి కొద్దికాలం మాత్రమే-3 సంవత్సరాలు, పాలించాడు. ఆయన తరువాత కుమారుడు మూడవ మాధవవర్మ క్రీస్తుశకం 473 లో సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం 522 వరకు, అంటే సుమారు 49 సంవత్సరాలు పాలించాడు. ఇతడి రాజధాని నేటి అమరావతి, నాటి అమరపురం. మూడవ మాధవవర్మ పరాక్రమవంతుడు. పల్లవులు ఆక్రమించిన భూభాగాలను ఇతడు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సుదీర్ఘకాలం పాలన చేసి, విష్ణుకుండిన ప్రతిష్టను ఇనుమడింప చేసి, వైదిక మతాన్ని ఆదరించాడు. ఇతడి పినతండ్రైన విక్రమేంద్రవర్మ మూడవ మాధవవర్మ మీద యుద్ధాలు చేసి విజయం సాధించి రాజయ్యాడు.

విక్రమేంద్రవర్మ క్రీస్తుశకం 522 నుండి 528 వరకు సుమారు 6 సంవత్సరాలు పాలించాడు. ఇతడు బౌద్ధమతాభిమాని. మహాకవి. గొప్ప యోధుడు. అతడి అనంతరం కుమారుడు ఇంద్రవర్మ రాజ్యానికి వచ్చాడు. ఇతడు గొప్ప శూరుడు. రాజ్య తంత్రజ్ఞుడు. అనేక యుద్ధాలలో విజయుడై, సుస్థిరమైన రాజ్యపాలన చేశాడు. ఇంద్రవర్మ విష్ణుకుండిన సామ్రాజ్యాన్ని 29 సంవత్సరాలు (క్రీస్తుశకం 528-556) పాలించాడు. అనేక దేవాలయాలను నిర్మించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలను దానంగా ఇచ్చాడు.

ఇంద్రవర్మ కుమారుడు విక్రమేంద్ర భట్టారకవర్మ రాజ్యానికి వచ్చి సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 556-570) పాలించాడు. ఇతడి పాలనాకాలమంతా యుద్ధాలలో, సత్కార్యాలు చేయడంలో గడిచింది. దాయాదులతో పోరాడాల్సి వచ్చింది. పల్లవులకు, విష్ణుకుండినులకు వున్న వైరం వల్ల ఆంధ్ర భూభాగాల మీద పల్లవ సింహవర్మ ప్రచండ సైన్యంతో దండెత్తాడు. విక్రమేంద్ర భట్టారకవర్మ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా యుద్ధంలో వీరవిహారం చేశాడు. పృధ్వీమూలరాజు సహాయం చేయడం వల్ల పల్లవ సైన్యం ఛిన్నా భిన్నమై పోయింది.

తండ్రి అనంతరం విక్రమేంద్ర భట్టారక వర్మ కుమారుడు రెండవ గోవిందవర్మ రాజయ్యాడు. క్రీస్తుశకం 570 నుండి క్రీస్తుశకం 576 వరకు, సుమారు 6 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. గోవిందవర్మ పరాక్రమశాలి. రెండవ గోవిందవర్మ కుమారుడు నాల్గవ మాధవవర్మ తండ్రి అనంతరం క్రీస్తుశకం 576 లో సింహాసనాన్ని అధిష్టించి, సుదీర్ఘకాలం పాలించాడు. అశ్వమేధ యాగాలు చేశాడు. చాళుక్యులు ఆంధ్రదేశాన్ని ఆక్రమించే నాటికి మాధవవర్మ ముసలివాడు. అయినప్పటికీ వీరావేశంతో యుద్ధంలో పోరాడి క్రీస్తుశకం 623 లో మరణించాడు.

నాల్గవ మాధవవర్మ కుమారుడు మంచన భట్టారకుడు తండ్రి అనంతరం రాజై, సామంత, మాండలికులను సమీకరించుకుని, చాళుక్యులతో పోరాటం కొనసాగించాడు. రాజధాని లేని రాజుగా, అనుచరుల సహాయంతో సైన్యాన్ని సమకూర్చుకుని, చాలాకాలం యుద్ధాలు చేసి, చివరకు జయసింహ వల్లభుడి చేతిలో చనిపోయాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 623-624. ఇతడితో విష్ణుకుండిన రాజ్యం అంతరించింది.                

Saturday, September 25, 2021

ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి ..... ఆస్వాదన-39 : వనం జ్వాలా నరసింహారావు

 ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి

ఆస్వాదన-39

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (26-09-2021)

అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాసాన్ని విరాటరాజు ఏలికలో వున్న మత్స్యదేశంలో గడపాలని నిర్ణయించిన పాండవాగ్రజుడు ధర్మరాజు, తమ తదుపరి కర్తవ్యం నిశ్చయించాడు. తన వెంట వచ్చినవారందరినీ వెళ్లిపొమ్మన్నాడు. తమ వివరాలు ఏవీ, ఎవరికీ చెప్పవద్దని అన్నాడు. అగ్నిహోత్ర రక్షణకు పురోహితుడైన ధౌమ్యుడిని నియోగించాడు. అప్పుడు ధౌమ్యుడు పాండవులకు చెప్పిన సేవాధర్మాలు, బహుశా నాటి నుండి నేటి వరకు ఒకరి దగ్గర కొలువు (ఉద్యోగం) చేసే ఎవరికైనా ఆచరణ యోగ్యాలే. వాటిని అందరూ విధిగా తెలుసుకోవాల్సిందే, ఆచరణలో పెట్టాల్సిందే!!! అలా చేస్తే, కొలువు చేస్తున్న ప్రతివారికీ సర్వదా శ్రేయస్కరం. ధౌమ్యుడి మాటల్లోనే ఆ వివరాలు....

   “రాజులను (ఆధునిక యజమాని, లేదా బాస్) సేవించి జీవించేవాడు చాలా జాగ్రత్తగా వుండాలి. తగిన పద్ధతిలో సభలో (పని చేసే చోటులో) అడుగు పెట్టాలి. తన స్థానానికి తగిన ఆసనంలో కూర్చోవాలి. తన వేషధారణ, ఆకారం వికృతంగా వుండకూడదు. సమయం, సందర్భం తెలుసుకుని మసలుకోవాలి. అలా చేస్తే రాజుకు (యజమాని లేదా బాస్) గౌరవపాత్రుడు అవుతాడు. ‘నేను రాజు కొలువులో వున్నాను, రాజుతో చనువుగా వున్నాను, నాకేమిటి’ అని మర్యాదను అతిక్రమించ కూడదు. రాజుగారి ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకోకూడదు. సేవకులు రాజు కంటే ఏ విషయంలోనూ అధికులుగా వుండకూడదు. రాజు (బాస్) తో సన్నిహితంగా ఉండడంలో తప్పులేదు కాని, రాజుగారి దగ్గర వుండే చాలామందికి కష్టం కలిగించే పనుల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదు. అలా చేస్తే సేవకుడి (ఉద్యోగి) శక్తి బహిర్గతం కావచ్చును కాని, ఆ తరువాత హాని కలగడం మాత్రం తధ్యం”.

“రాజు దగ్గర మౌనంగా వుండకూడదు. అలా అని చెప్పి, పదిమందితో ఆర్భాటంగా మాట్లాడడం మంచిది కాదు. తనకు దగ్గరి వారైన ఇతరులతో కలిసి తాను రాజుతో మాట్లాడడం ఉత్తమం. రాజుగారి కొలువులో (ఆధునిక పరిభాషలో, యజమాని కార్యాలయంలో) రాజుకు మరీ ఎట్ట ఎదురుగా వుండకూడదు. అలాగని, మరీ వెనుకగా కూర్చోకూడదు. ఏదో ఒక పక్కన నిలబడి (వీలున్నంత సేపు) సేవించాలి. రాజు ముఖం మీదనే దృష్టి సారించి సభలో మెలగాలి. కార్యాలయంలో మాటలు ఎప్పటికీ, ఎక్కడా బయట పెట్టకూడదు. బయట ఎక్కడైనా రాజుకు సంబంధించిన మాటలు వింటే, అవి వినదగినవైతేనే రాజుకు చెప్పాలి. చెప్పేటప్పుడు సేవకుడు కొంత విచక్షణ చూపాలి. విన్న మాటల్లో నిజానిజాలు తెల్సుకోవాలి. రాజుకు అనవసరమైన విషయం అసలే చెప్పరాదు. రాజుకు అప్రియమైన విషయం ఎప్పుడూ చెప్పకూడదు”.

“రాజు అనుగ్రహిస్తేనే ఆసనాలు ఎక్కాలి (కుర్చీమీద కూర్చోవాలి). అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా, రాజానుగ్రహం లేకుండా, శ్రేష్టమైన ఆసనాలు, పెద్ద పెద్ద వాహనాలు తమంతట తాము అధిరోహించడం తప్పు. రాజు (బాస్) తనను గౌరవించాడని ఉబ్బిపోకూడదు. అవమానించాడని కుంగిపోకూడదు. ఆ రెంటినీ లెక్కించకుండా ఎప్పటిలాగే రాజు దగ్గర పనిచేస్తే సేవకులకు మంచి జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. రాజు ఎవరినైనా రక్షించాలని కాని, శిక్షించాలని కాని నిర్ణయిస్తే, అ అవిషయాలు సేవకుడికి తెల్సినా, అవి అమలు కాకముందే బయట పెట్టకూడదు. రాజుకు (బాస్) దగ్గరగా మెలిగే ఏనుగుతో కాని, దోమతో కాని, వైరం కలిగే విధంగా ప్రవర్తించ కూడదు”.

ఇలా ఎన్నో విషయాలను చెప్పాడు ధౌమ్యుడు పాండవులకు.

“రాబోయే హితాన్ని సూచించేవాడు పురోహితుడు. అజ్ఞాతవాసంలో ప్రభువు దగ్గర వుండబోతున్న పాండవులకు ‘సామాన్య నియమావళిని’ ధౌమ్యుడు బోధించాడు. వాటిని ధారణలో వుంచుకొమ్మని హితవు పలికాడు. తిక్కన రచన తత్కాలోచిత వృత్తి ధర్మ ప్రభోధ ప్రవృత్తికి ప్రాధాన్యం ఇచ్చింది”.

ధౌమ్యుడు చెప్పిన సామాన్య సేవానియమావాలి ఎల్లకాలాలకు ఆచరణీయం.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, ప్రథమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)