Wednesday, September 30, 2020

Farm laws arm-twist farmers : Vanam Jwala Narasimha Rao

 Farm laws arm-twist farmers

Vanam Jwala Narasimha Rao

The Pioneer (01-10-2020)

Until four-five decades ago, when every village in our country functioned as a Republic in itself, agriculture was not considered as a mere profitable vocation. It was then more a profession, a passion and a serving mechanism. With majority of the population dependent directly or indirectly on agriculture, the entire village economy flourished and thrived on a convenient barter system.

Each village produced the agricultural commodities mainly for its needs and nobody gave a thought for any surplus production. Every farmer, big and small, had some sort of a storage mechanism that included storage of seeds for the next year. There was no concept of buying seeds.

Gradually with the advent of market-based economy, agriculture produce started moving out of the villages, to the nearby markets. This expansion of geographical area added to the problems of farmers and middlemen, traders and agents entered the system. This gave rise to commercialization and the producer of an agriculture product became dependent on outside market even for his needs. Not only agriculture products but also milk products, vegetables etc. which were hitherto were available in village itself have over a period became salable commodity elsewhere.  

Since Independence, despite policies and programs being launched by successive governments to make the country self-sufficient in essential commodities, in effect, not much was done to make agriculture profitable. On the contrary, due to several loopholes and lacunae in agriculture policies, farmers were often pushed into debts driving them to commit suicides. Most of these deaths were due to non-availability of money for the farmers for investment in agriculture operations from sowing seeds to selling the produce in markets for a good support price.

For the first time in the country, innovative schemes were designed, developed and delivered for the farming sector in Telangana after K Chandrashekhar Rao became Chief Minister. Notable among them was the Rythu Bandhu or the investment support scheme for agriculture that involved payment of Rs 10000 per acre in two instalments. Likewise, the Rythu Bhima, a life insurance scheme for farmers, gave tremendous confidence to farmer. Many schemes benefiting farmers preceded and succeeded these schemes in Telangana. 

Another innovative and practical model that CM KCR successfully implemented despite the massive Corona Pandemic was to set up purchasing centers at the village level to purchase the paddy and other agriculture produce, irrespective of its quality at best of the price acceptable to farmer. This helped the farmers to sell their produce without running hither and thither. PM Modi should have given a thought to this innovative Telangana State Model and replicated at the national level. Instead, came, the Amendment to Farm Acts in such a way that it would do harm to farmers and consumers in many ways.

This being so, the Union Government has preferred to bring three controversial and draconian laws that gave a free hand to Corporates to ride roughshod over the farm sector and making farmers a helpless victim of the Corporates and their whims and fancies for generations to come. For instance, the new Essential Commodities Act removes food items such as pulses, potato, cereals, onions, edible oilseeds and oils, from the list of essential commodities. Under the new Act, the government cannot impose a stock limit. In other words, the government cannot stop a vicious supermarket chain, retailer chain, or any corporate entity or another individual or group of individuals from hoarding essential commodities.

In states the Agriculture Produce Market Committee (APMC) sets up markets or Mandi or Market Yards in the state, where the farmers bring their produce, and wholesale and retail traders come to buy the produce through auction. The APMCs across the country ensure that farmers get a fair price for their produce, and aren’t forced to make a distress sale. Plus, the idea is to get rid of middlemen. The buyers and commission agents are regulated by the APMCs by providing them licensees, levying market fees and any such charges were always regulated. This has been the practice normally.


The new Act says that farmers can sell their produce ‘anywhere’.  What does this ‘anywhere’ mean nobody knows!!! They Act stipulates that farmer need not sell in the APMC approved marketplace. That is, they can sell within the state, outside the state or even online! How many farmers are capable of selling online, god alone knows!!! But the important point is that Agriculture Marketing is a state subject. And hence, the Centre had no business to make such laws in the first place.

Presently the APMC markets ensure that farmers get the Minimum Support Price for their produce. Farmers, activists and experts are worried that if the trade is done outside the APMC marketplace, they may not get any MSP, as the new law does not mention MSP. The new law does not say that the trade will have to be above MSP. This may lead to distress sale by farmers.

Another Bill says that farmers can enter into ‘written agreements’ with anyone, including a company, and sell them their produce for a set period of time, as per the contract. This implies that companies will have an upper hand in setting the price for the produce establishing standard and evaluating quality.

About 82% of farmers in the country (More in Telangana) are small or marginal farmers. Can they assert their rights while seeking the implementation of the contract on a level playing field? What happens if the buyer says the quality of crop is not what was agreed and does not implement the contract? What security, guarantee and protection the farmer has under the new farm laws?

The free hand given to private corporate houses will lead to exploitation of farmers. With corporate entities fixing the price to their advantage while entering into written contracts, the farmers will have no option but to sign on the dotted line. In any case with such Law in force, the farmers would be at the mercy of the Corporates. Corporates entities may also resort to extending loans to farmers for investment, which could be on high interest rates, for buying their product after harvest.

Corporate companies can now have contracts with farmers to buy their produce, but farmers do not have the protection of (MSP) Minimum Support Price. Retail chains can contract a whole bunch of farmers and hoard produce, thereafter artificially increasing prices for profit. And both the farmers and consumers have no option but to be at the receiving end.

The new laws are not as progressive as claimed by the center. They are retrograde in nature and they would destroy the problem ridden Agriculture Sector in the country.

with VJM Divakar

 

శ్రీకృష్ణావతార ఘట్టం .... శ్రీ మహాభాగవత కథ-51 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణావతార ఘట్టం

 శ్రీ మహాభాగవత కథ-51

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

పూర్వం పాపభారాన్ని మోయలేక భూమి, గోరూపం ధరించి, బ్రహ్మ దగ్గరికి పోయి కన్నీరు-మున్నీరుగా ఏడ్చింది. ఆమెను తీసుకుని, ఇంద్రాది దేవతలతో సహా విష్ణుమూర్తిని సందర్శించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మకు భగవద్వాణి వినిపించింది. తాను విన్నదాన్ని ఇతరులకు వినిపించాడు బ్రహ్మదేవుడు. భగవంతుడు యదుకులంలో అవతరించనున్నాడని, దేవతలంతా వారి-వారి అంశలతో యదువంశంలో భూమ్మీద విష్ణుమూర్తి కంటే ముందరే జన్మించమని చెప్పాడు. ఆ తరువాత విష్ణువు వసుదేవుడికి కొడుకై పుట్టి భూభారాన్ని తగ్గిస్తాడని చెప్పాడు. దేవతా స్త్రీలంతా శ్రీహరికి సపర్యలు చేయడానికి సుందర రూపంలో పుట్టాలనీ, ఆదిశేషుడు ఆయనకు అగ్రజుడిగా జన్మిస్తాడని కూడా చెప్పాడు.

ఆ సమయంలో శూరసేనుడనే యాదవరాజు మధుర రాజధానిగా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన కొడుకు వసుదేవుడు దేవకీదేవిని పెళ్లి చేసుకుని, ఆమె అన్న, ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు స్వయంగా రథం తోలుతుంటే తన ఇంటికి బయల్దేరాడు. ఇంతలో అశరీరవాణి, కంసుడిని హెచ్చరిస్తూ, ఆయన సోదరికి పుట్టబోయే ఎనిమిదవ కుమారుడు ఆయన్ను సంహరిస్తాడని చెప్పింది. వెంటనే చెల్లెలిని రథం మీద నుండి లాగి చంపడానికి సిద్ధపడ్డాడు. ఆ పని విరమించుకొమ్మని వసుదేవుడు బావ కంసుడిని ప్రార్థించాడు. ఆమెకు పుట్టబోయే కొడుకులందరిని వరుసగా తెచ్చి కంసుడికి ఇస్తానని, వాళ్లను సంహరించమని చెప్పడంతో అంగీకరించి, చెల్లెలిని విడిచిపెట్టాడు. ఏడాదికి ఒకరిని చొప్పున దేవకీదేవి కన్న కొడుకులను వసుదేవుడు అన్నమాట ప్రకారం కంసుడికి తెచ్చి ఇచ్చేవాడు. వారితో తనకు అవసరం లేదని, ఎనిమిదవ వాడిని తెచ్చి ఇమ్మని చెప్పాడు కంసుడు.

ఒకనాడు నారదుడు కంసుడికి దగ్గరికి వచ్చి, దేవతలే యాదవులుగా పుట్టారని, ఆయన కాలనేమి అనే రాక్షసుడని చెప్పాడు. విష్ణుమూర్తి దేవకీదేవి పుత్రుడిగా పుట్టి కంసుడిని సంహరిస్తాడని అన్నాడు. వెంటనే దేవకీవసుదేవులను పట్టి బంధించి, చెరసాలలో వేసి, అప్పటికి పుట్టిన ఆరుగురు కొడుకులను సంహరించాడు. తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో వేశాడు. యాదవులందరినీ యుద్ధం చేసి ఓడించాడు.

దేవకీదేవి ఆరుగురు కొడుకులను కంసుడు చంపినా తరువాత ఏడవ గర్భంగా ఆదిశేషుడు అనబడే విష్ణువు అంశ ఆనే గర్భంలో ప్రవేశించింది. విష్ణువు యోగామాయాదేవితో, దేవకీదేవి గర్భంలో వున్న ఆయన తేజస్సును నేర్పుగా తీసి వ్రేపల్లెలోని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టమని, ఆమెను నందుడి భార్య యశోదకు కూతురుగా జన్మించమని ఆదేశించాడు. ఆయన ఆజ్ఞానుసారం యోగమాయ భూలోకానికి వచ్చింది. విష్ణువు చెప్పినట్లే చేసింది. దేవకికి గర్భస్రావం అయిందని భావించారు అంతా. కొన్నాళ్లకు రోహిణీదేవి బిడ్డను కన్నది. అతడిని బలభద్రుడని, రాముడని, సంకర్షణుడని పిలవసాగారు.

ఆ తరువాత శ్రీమన్నారాయణుడి తేజస్సు దేవకీదేవి గర్భంలో ప్రవేశించింది. పద్నాలుగు లోకాలను తన కడుపులో సంరక్షిస్తున్న శ్రీహరిని, గర్భంలో మోస్తున్న దేవకీదేవి ముఖ తేజస్సును చూసిన కంసుడు, విష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించి వుండాలన్న నిర్ణయానికి వచ్చాడు. కంసుడు ఎడతెగని విరోధం వల్ల నిరంతరం విష్ణు నామ స్మరణ చేస్తూ, బిడ్డ పుట్టగానే చంపడానికి ఎదురు చూడసాగాడు. తన శరీరాన్ని గడ్డిపోచ తాకినా అది విష్ణు మూర్తేమో అని భయపడసాగాడు. సరిగ్గా అదే సమయంలో ఇంద్రాది దేవతలు, నారదాది మునులు, బ్రహ్మ, శివుడు, దేవకీదేవి వున్నా చెరసాల వద్దకు వచ్చి, ఆమె గర్భంలో వున్న శ్రీమహావిష్ణువును స్తుతించారు. ఆయన జన్మించడం వల్ల భూదేవి భారం తగ్గిపోతుందని, ఆయన పాదస్పర్శతో భూలోకాన్ని ఆనందంగా చూడగలమని అన్నారు. భూభారాన్ని తొలగించమని ప్రార్థించారు. స్తోత్రం చేసిన తరువాత బ్రహ్మాది దేవతలు, మునులు దేవకీదేవిని ఆశీర్వదించి వెళ్లిపోయారు.

ఈ నేపధ్యంలో, గ్రహనక్షత్రాలు అత్యంత శుభ స్థానాలలో వుండగా దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో కుమారుడిని కన్నది. దేవదేవుడు ఉద్భవించాడు. ఆ బాలుడిని చూసిన వసుదేవుడు ఆ తేజస్సుకు ఆశ్చర్యపడి, మహోత్సాహాన్ని పొందాడు. అతడు తన బిడ్డ అని భావించకుండా, సాక్షాత్తు పరమాత్మగా భావించి స్తుతించాడు. కంసాది దానవులను సంహరించడానికి అవతరించిన భగవానుడని స్తుతించాడు. అప్పుడే దేవకీదేవి కూడా ఆబాలుడిని తేరిపార చూసింది. బాలుడిని భగవంతుడిగా గ్రహించి స్తోత్రం చేసింది.

దేవకీదేవి తనను స్తుతిస్తుంటే, శ్రీహరి తన నిజరూపంలో ఆమెకు ఆమె పూర్వ జన్మ వృత్తాంతం చెప్పాడు. స్వాయంభవ మన్వంతరంలో ఆమె ‘పృశ్ని’ అనే పరమ పతివ్రత అని, వసుదేవుడు ‘సుతపుడు’ అన్న పేరుగల ప్రజాపతి అని అన్నాడు. వారి తపస్సుకు మెచ్చి తాను ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మన్నప్పుడు తన లాంటి కొడుకు కావాలని కోరారని, అలాగే వరమిచ్చి, మొదట్లో ‘పృశ్నిగర్భుడు’ అనే పేరుతొ ఆమెకు జన్మించానని చెప్పాడు. వారు రెండవ జన్మలో అదితి, కశ్యపుడుగా పుట్టారని అప్పుడు వారికి అప్పుడు వామనుడిగా తాను జన్మించానన్నాడు. మూడవ జన్మలో మల్లీ ఇప్పుడు పుట్టానన్నాడు. ఇక ముందు వారికి జన్మ లేదని కూడా చెప్పాడు.

శ్రీహరి వసుదేవుడి కర్తవ్యాన్ని కూడా చెప్పాడు. అదే సమయంలో యశోదాదేవికి యోగమాయ కూతురుగా జన్మించింది. వాసుదేవుడు నిమ్మడిగా బాలుడిని రొమ్మున అదుముకుని పురిటి ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. హరి మాయవల్ల తలుపుల తాళాలు విడివడ్డాయి. ఆదిశేషుడు బాలుడికి గొడుగులాగా కప్పివున్నాడు. ముందుకు వెళ్తుండగా యమునానది అడ్డం వచ్చింది. అది దారి ఇచ్చింది వసుదేవుడికి. యమునానదిని దాటి నందుడి వ్రేపల్లెలో ప్రవేశించాడు. యశోదాదేవి పక్కన బాలకృష్ణుడిని పడుకోబెట్టి, యోగామాయను ఎత్తుకుని తిరిగి వచ్చి దేవకీదేవి పక్కన వుంచాడు. యశోదాదేవికి ఇదేమీ తెలియదు.

చంటి బిడ్డ ఏడుపు విని ఆ విషయాన్ని కంసుడికి తెలియచేశారు కావలివారు. కంసుడు వచ్చి ఆబిడ్డను చంపబోయాడు. ఆడపిల్ల కాబట్టి చంపవద్దని వేడుకుంది దేవకీ. వినకుండా ఆ బాలికను ఎత్తి పట్టుకుని చంపబోయాడు కంసుడు. ఆ బాల కిందపడిపోకుండా, ఆకాశానికి ఎగిరింది. ఆమె దివ్యాయుదాలతో దర్శనం ఇచ్చింది. ‘నిన్ను చంపే వీరుడు నాతోపాటుగా జన్మించి, ఒకచోట భద్రంగా పెరుగుతున్నాడు’ అని పలికి అదృశ్యమైపోయింది. చింతాక్రాంతుడైన కంసుడు దేవకీవసుదేవులను తనను క్షమించమని వేడుకున్నాడు. వారి పాదాలు పట్టుకున్నాడు. దేవకీవసుదేవుల అనుమతి తీసుకుని కంసుడు ఇంటికి పోయాడు. కంసుడు యోగమాయ ద్వారా విన్న వృత్తాంతాన్ని కొందరు మంత్రులకు చెప్పాడు ఏకాంతంగా.

ఇదిలా వుండగా అక్కడ వ్రేపల్లెలో నందుడు తనకు మగ పిల్లవాడు పుట్టినందుకు సంబురాలు చేసుకున్నాడు. గోపకులంతా నందుడి కుమారుడిని చూడడానికి వెళ్లారు. వసంతోత్సవం జరుపుకున్నారు. గోపయువతులు ఆ శుభవార్తను ఒకరితో మరొకరు పంచుకున్నారు. వారంతా ఎంతో ఉత్సాహంతో ఆ పసివాడిని చూశారు. కానుకలిచ్చారు. పాటలు పాడారు. బాలుడు కేరింతలు కొడుతూ ఆడుకోసాగాడు.

నందుడు పన్ను కట్టడం కోసం మథురకు పోయి, వాసుదేవుడి ఇంటికి వెళ్లి తగిన మర్యాదతో ఆయన్ను దర్శించాడు. ఆయన దగ్గర వున్నది తన పుత్రుడేనని మెల్లగా చెప్పాడు. తన కొడుకు వాసుదేవుడి కొడుకే అనుకో అని ఓదారుస్తూ అన్నాడు నందుడు. ఆ తరువాత బయల్దేరి వెళ్లిపోయాడు నందుడు.                   

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Tuesday, September 29, 2020

రంతిదేవుడి చరిత్ర, పాంచాల వంశం .... శ్రీ మహాభాగవత కథ-50 : వనం జ్వాలా నరసింహారావు

 రంతిదేవుడి చరిత్ర, పాంచాల వంశం

 శ్రీ మహాభాగవత కథ-50

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

రంతిదేవుడి కీర్తి ప్రత్యేకంగా ఇలాంటిదని చెప్పలేనంత గొప్పది. సంపాదించినదంతా దానధర్మాలు చేసి ధనహీనుడయ్యాడు. ఐనప్పటికీ అధైర్యపడక దొరికింది తింటూ 48 రోజులవరకూ ఎలాగో కాలక్షేపం చేశాడు. ఒకరోజు ఉదయాన తనకు లభించిన నేయి, పాయసం, నీరు సేవించడానికి కుటుంబం సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో, ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆహారం అడిగాడు. తనకు వున్న ఆహారంలో సగం పెట్టాడు. అంతలో ఒక శూద్రుడు వచ్చి ఆకలిగా వుందన్నాడు. మిగిలిన అన్నంలో అతడికి సగ భాగం ఇచ్చి సంతృప్తి పరిచాడు. ఆ తరువాత కుక్కల గుంపుతో ఒకడొచ్చి ఆకలి అన్నాడు. మిగిలిందంతా వాడికిచ్చాడు. ఆ కాసేపటికి ఒక చండాలుడు వచ్చాడు. ఆకలి, ఆహారం కావాలన్నాడు. తన దగ్గర మంచినీరు మాత్రమే వుందని చెప్పి, పాత్రలో వున్న నీటిని పోశాడతడికి రంతిదేవుడు. అప్పుడు బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా తమ ద్వారా జరిగిన విష్ణుమాయ అని చెప్పారు. వారినేమీ వరం కోరుకోకుండా రంతిదేవుడు పరమపదానికి, ముక్తిపదానికి చేరుకున్నాడు.

ఇదిలా వుండగా, బృహత్‍క్షత్రుడికి పుట్టిన హస్తి అనేవాడు హస్తినాపురాన్ని నిర్మించాడు. హస్తికి అజమీఢుడు అతడికి బృహదిషుడు జన్మించారు. అతడి వంశక్రమంలో బ్రహ్మదత్తుడు అనేవాడు జన్మించి, యోగతంత్రాన్ని అభ్యసించాడు. అజమీఢుడికి నళిని అనే భార్య వల్ల కలిగిన నీలుడి సంతతి వాడే భర్మ్యాశ్వుడు. అతడికి తనలాంటి ఐదుగురు కొడుకులు కలిగారు. వారికి ఆయన పాలనలో వున్న ఐదు ప్రాంతాలను పంచాడు. ఆనాటి నుండి వారికి పాంచాలురని పేరొచ్చింది. ఐదుగిరిలో పెద్దవాడైన ముద్గులుడి కొడుకు దివోదాసుడు, కూతురు అహల్య. ఆమె గౌతమ మహర్షిని వివాహమాడింది. వారి కొడుకు శతానందుడు. అతడి మనుమడైన శరద్వంతుడు ఒకనాడు ఊర్వశిని చూడగా అతడి వీర్యం రెల్లు దుబ్బుమీద పడి ఇద్దరు బిడ్దలు పుట్టారు.   

శంతనుడనే మహారాజు వేటకొచ్చి, ఆ ఇద్దరు బిడ్డల్ని చూసి ఇంటికి తెచ్చి, వారికి కృపి, కృపుడు అని పేర్లు పెట్టి పెంచాడు. కృపి ద్రోణుడి భార్య అయింది. ముద్గులుడి కుమారుడు దివోదాసుడి సంతతిలో ద్రుపదుడు జన్మించాడు. ద్రుపదుడికి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ధృష్టద్యుమ్నుడికి ధృష్టకేతువు జన్మించాడు. పాంచాల రాజులనేది వీరినే! అజమీఢుడికి ఋక్షుడు కూడా జన్మించాడు. అతడికి సంవరణుడు, అతడికి సూర్యుడి కుమార్తె తపతి వల్ల కురువు జన్మించారు. ఆ కురువు పేరు మీద ఏర్పడిందే కురుక్షేత్రం. కురువు సంతతిలోనే బృహద్రథుడికి జరాసంధుడు పుట్టాడు. అలాగే జయత్సేనుడనేవాడు జన్మించాడు. అతడి సంతతిలో పుట్టినవాడే శంతనుడు. అతడి అన్న దేవాపి రాజ్యం చేయడానికి ఇష్టపడక అడవులకు పోయినందున శంతనుడు రాజ్యం చేయసాగాడు. శంతనుడికి, గంగానదికి పుట్టినవాడే భీష్ముడు. శంతను మహారాజుకు సత్యవతి వల్ల చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడిని గంధర్వ వీరులు చంపారు. సత్యవతికి శంతనుడితో పెళ్లికాక పూర్వం, పరాశర మహర్షి సాంగత్యం వల్ల వ్యాస మహర్షి విష్ణుమూర్తి అంశతో జన్మించాడు.

         విచిత్రవీర్యుడికి భీష్ముడు అంబిక, అంబాలికలను బలవంతంగా తెచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్లకు విచిత్రవీర్యుడు చనిపోయాడు. సత్యవతి ఆజ్ఞానుసారం వ్యాస మహర్షి విచిత్రవీర్యుడి భార్యల ద్వారా ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులకు తండ్రిగా జన్మ ఇచ్చాడు. ధృతరాష్ట్రుడికి గాంధారి వల్ల దుర్యోధనుడితో సహా నూర్గురు కుమారులు, దుశ్శల అనే కూతురు జన్మించారు. దుర్యోధనాదులను కౌరవులంటారు. పాండురాజు కుంతీదేవి వల్ల యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుల వరప్రసాదాన యుధిష్టర, భీమ, అర్జున అనే ముగ్గురు కుమారులను; మాద్రి వల్ల అశ్వినీదేవతల వరప్రసాదాన నకుల, సహదేవులనే ఇద్దరిని; మొత్తం అయిదుగురు కుమారులను పొందారు. వారి భార్య ద్రుపదరాజు కుమార్తె ద్రౌపది. వీరినే పాండవులంటారు. ఉప పాండవులు కాకుండా భీముడికి ఘటోత్కచుడు, అర్జునుడికి భభ్రువాహనుడు, అభిమన్యుడు పుట్టారు. అభిమన్యుడు కురువంశ కర్త అయ్యాడు. ఆయన కొడుకు పరీక్షిత్తు తల్లి గర్భంలో వుండగా అశ్వత్థామ వేసిన బాణం వల్ల ప్రాణాలు కోల్పోయి శ్రీహరి దయవల్ల బతికాడు. పరీక్షిత్తు కుమారులు జనమేజయుడు, శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే నలుగురు.

తక్షక శాపం వల్ల తండ్రి పరీక్షిత్తు మరణిస్తున్నాడని తెలుసుకున్న జనమేజయుడు సర్పలోక సంహారాన్ని కోరి సర్పయాగం చేయనున్నాడు. ఆయన  సర్వ భూమండలాన్నీ జయిస్తాడు. హస్తినాపురి యమునానది ముంపుకు గురి అకవడం వల్ల ఆయన కొశాంబిలో నివసిస్తాడు. ఆయన సంతతిలోనే కలియుగంలో కూడా జీవించిన బ్రహ్మక్షత్రుడు జన్మిస్తారు. జరాసంధుడి వంశ క్రమంలో చివరగా పురంజయుడు జన్మిస్తాడు. వీరంతా మగధ దేశ ప్రభువులు. వీరు కలియుగంలో వేయి సంవత్సరాల లోపున జన్మించి చెల్లిపోతారు. 

యయాతి వంశ పరంపరలో చిత్రరథుడు జన్మించాడు. అతడినే రోమపాదుడని కూడా అంటారు. అతడికి సంతానం లేనందున దశరథుడు తన కుమార్తె శాంతను ఆయనకు దత్తత ఇచ్చాడు. ఆమెను రోమపాదుడు ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశాడు. దశరథుడు ఆ ఋష్యశృంగుడి కృపతోనే యాగం చేసి సంతానాన్ని పొందాడు. యయాతి పెద్దకొడుకు యదువు సంతతిలో వాడే హైహయుడు. అతడి వంశ క్రమంలో జన్మించిన వాడే అర్జునుడు. కార్తవీర్యుడు అనిపించుకున్నాడతడు. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Monday, September 28, 2020

యయాతి-దేవయాని, దుష్యంత-శకుంతల, భరతుల వృత్తాంతం .... శ్రీ మహాభాగవత కథ-49 : వనం జ్వాలా నరసింహారావు

 యయాతి-దేవయాని, దుష్యంత-శకుంతల, భరతుల వృత్తాంతం  

 శ్రీ మహాభాగవత కథ-49

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

నహుషుడి కొడుకు యయాతి తండ్రి అనంతరం రాజై శుక్రుడి కుమార్తెను, వృషపర్వుడి కుమార్తెను వివాహమాడి భూచక్రాన్నంతటినీ పరిపాలించాడు. వివరాల్లోకి పోతే....

రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్ట ఒకనాడు తన చెలికత్తెలతో, గురువు (శుక్రాచార్యుడు) గారి కూతురు దేవయానితో, కలిసి ఉద్యానవనంలోని కొలనుకు వెళ్లింది. బట్టలు విప్పి కొలనులోకి దిగి ఉత్సాహంగా స్నానం ఆడసాగారు. అదే సమయంలో శివుడు, పార్వతీదేవి అక్కడికి రావడం జరిగింది. పరమేశ్వరుడిని చూసిన ఆ యువతులంతా సిగ్గుపడి తొందర-తొందరగా బట్టలు కట్టుకుంటుండగా, రాకుమారి శర్మిష్ట పొరపాటున గురువుగారి కూతురు దేవయాని బట్టలు ధరించింది. దానికి ఆక్షేపణ తెలియచేసిన దేవయాని, ’తెలిసి-తెలిసి దాసి అయిన శర్మిష్ట’ తన బట్టలు కట్టుకున్నదని, బ్రాహ్మణ కులంలో పుట్టిన తన బట్టలు రాక్షస కులంలో జన్మించిన పనికత్తె లాంటి ఆమె ఎలా కట్టుకుంటుందని దూషించింది. తనను తూలనాడుతున్న దేవయాని మీద కోపంతో, ఆమె అలా మాట్లాడినందుకు ప్రతిగా, శర్మిష్ట తన చెలికత్తెలతో దేవయానిని పట్టించి, బట్టలు కూడా ఇవ్వకుండా నూతిలోకి తోయించి రాచనగరుకు వెళ్లిపోయింది. అదే సమయంలో యయాతి అడవిలో వేటాడుతూ, దైవవశాత్తూ దేవయాని పడివున్న నూతి దగ్గరికి వచ్చాడు. నూతిలో దుఃఖిస్తున్న దేవయానిని చూశాడు.

దేవయానిని ఆ పరిస్థితిలో చూసిన యయాతి ఆమెకు తన చేయి అందించి, నూతి నుండి పైకిలాగాడు. తనను అలా పైకి లాగిన యయాతిని, అతడు తన చేయి పట్టుకున్నందున, ఆయనే తన భర్త అన్నది. ఇది దైవ సంకల్పం అన్నది. తాను శుక్రాచార్యుడి కుమార్తెనని, తన పేరు దేవయాని అని చెప్పింది. తాను బ్రాహ్మణుడిని వివాహమాడనని శాపం వున్నందున, యయాతే తనను పెళ్లిచేసుకోవాలని, ఆయనే తన ప్రాణనాథుడని అన్నది. సరే అని యయాతి ఆమెను వరించాడు. దేవయాని తండ్రికి శర్మిష్ట చేసిన విషయమంతా చెప్పి, కన్నీరు-మున్నీరుగా ఏడ్చింది. వృషపర్వుడి కొలువులో వుండవద్దనుకుని, శుక్రాచార్యుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని రాజధాని విడిచి వెళ్లిపోయాడు. వృషపర్వుడు క్షమించమని కోరడంతో కోపాన్ని విడిచి వెనక్కు వచ్చాడు. వేయిమంది చెలికత్తెలతో సహా ఆయన కూతురు శర్మిష్ట తన కూతురుకు చెలికత్తెగా వుండాలన్న నిబంధనను అంగీకరించి, కూతురును దేవయానికి చెలికత్తెగా చేశాడు వృషపర్వుడు. ఆ తరువాత శుక్రాచార్యుడు దేవయానిని యయాతికిచ్చి వివాహం చేశాడు. కుమార్తెను యయాతితో పంపేటప్పుడు, శర్మిష్టతో సంగమం కూడదని అల్లుడికి చెప్పి పంపాడు శుక్రాచార్యుడు.

దేవయాని, యయాతులకు యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. ఒకనాడు దేవయాని లేని సమయాన, సమయం కొరకు వేచివున్న శర్మిష్ట ఒంటరిగా వున్న యయాతి దగ్గరికి పోయి తన అభీష్టాన్ని వెలిబుచ్చింది. రాకుమార్తె కోరికను అంగీకరించి ఆమెతో అప్పటి నుండి రహస్యంగా కాలం గడుపుతూ వచ్చాడు యయాతి. శర్మిష్ట యయాతి వల్ల గర్భం దాల్చి, ద్రుహ్యువు, అనువు, పూరువు అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. ఇదంతా దేవయానికి తెలిసింది. ఈ విషయం శుక్రాచార్యుడికి కూడా తెలిసింది. ముసలివాడివి కమ్మని యయాతిని శపించాడు. తనకు ఇంకా దేవయానిమీద మోజు తీరలేదని, అది తీరిన తరువాత ఆయన అన్నట్లే వృద్ధాప్యాన్ని పొందుతానని అన్నాడు యయాతి మామగారితో.

రాజధానికి తిరిగొచ్చిన యయాతి కొడుకులను పిలిచి తనకు వారి యవ్వనం ఇవ్వమని అడిగాడు. పూరుడు తప్ప అంతా కాదన్నారు. ఆయన తండ్రి ముదిమిని తీసుకుని తన యౌవనాన్ని తండ్రికిచ్చాడు. యయాతి యువకుడయ్యాడు. యయాతి, దేవయానులు ఇష్టభోగాలను ఆనందంగా అనుభవించారు. యయాతి ధ్యానిస్తూ అనేక శ్రీహరిని యాగాలు కూడా చేశాడు. కాలం అలా గడిచిపోతుంటే జరిగినదానికి యయాతి విచారించసాగాడు. పూరుడి యవ్వనాన్ని అతడికి ఇచ్చివేసి, తన ముసలితనాన్ని పొందాడు. పూరుడికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఇంద్రియ సుఖాలను విడనాడాడు. శ్రీహరి దయవల్ల భగవత్ భక్తులు పొందే ఉత్తమ గతిని పొంది వాసుదేవ పరబ్రహ్మంలో లీనమయ్యాడు. ఆ తరువాత దేవయాని కూడా ముక్తిపథాన్ని చేరుకుంది.

     పూరుడికి జనమేజయుడు జన్మించాడు. అతడి వంశాను క్రమంలో రైభ్యుడికి జన్మించాడు దుష్యంతుడు. అతడు మహారాజుగా సకల వైభవాలతో వర్థిల్లాడు. ఒకనాడు అడవికి వేటాడడానికి పోయాడు. వేటాడుతూ, కణ్వమహాముని ఆశ్రమం చేరువలోకి వచ్చాడు. అక్కడ జాతివైరం కల జంతువులన్నీ కలిసిమెలిసి ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. తన సేవకులను ఆశ్రమం బయటే వుండమని చెప్పి, తాను లోపలి వెళ్లి కణ్వమహామునికి నమస్కారం చేసి వస్తానన్నాడు. లోపలికి వెళ్లి అక్కడ శకుంతలను చూశాడు దుష్యంతుడు. ఆమె మీద మనసుపోయింది అతడికి. ఆమె ముఖకవళికలను బట్టి ఆమె రాచకన్య కావచ్చునన్న నిర్ణయానికి వచ్చాడు దుష్యంతుడు. ఆమె ఎవరని ప్రశ్నించాడు. మేనకా, విశ్వామిత్రులు తనను కన్నవారని, కణ్వమహర్షి పెంచాడని, ఈ అడవిలో తన జన్మ ధన్యమైందా అన్నట్లు ఆయన్ను కలవగలిగానని అన్నది శకుంతల. ఇద్దరూ గాంధర్వ పద్ధతిలో వివాహమాడారు.

శకుంతల గర్భం దాల్చిన తరువాత దుష్యంతుడు రాజధానికి చేరుకున్నాడు. కొంతకాలానికి శకుంతల మగబిడ్డకు జన్మనిచ్చింది. కొండకోనల్లో. అడవిలో బిడ్దతో  అవస్థలు పడవద్దని, భర్తదగ్గరికి వెళ్లమని కణ్వమహాముని శకుంతలకు చెప్పాడు. సమస్త విద్యల్లో ఆరితేరిన కొడుకును వెంటబెట్టుకుని శకుంతల రాజధానికి వచ్చింది. వచ్చి, దుష్యంతుడు కొలువు తీర్చి వున్న సభామండపంలో ప్రవేశించింది. కుమారుడిని, తనను చూసికూడా రాజు మాట్లాడకపోవడంతో శకుంతల ఆందోళనకు గురైంది. శకుంతల దుష్యంతుడి భార్య అని, ఆమెను అతడు చేపట్టాలని, భరించాలని ఆకాశవాణి మాటలు వినిపించాయప్పుడు. అలా ఆకాశవాణి అన్నందున అతడి పేరు భరతుడు అయింది. దుష్యంతుడు వారిని చేరదీసి, కొంతకాలం రాజ్యం చేసి, పరలోకానికి చేరుకున్నాడు. తరువాత భరతుడు రాజ్యపాలన చేశాడు. మొత్తం 133  అశ్వమేధ యాగాలు చెసి బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించాడు. బలపరాక్రమాలతో, చక్కటి ప్రవర్తనతో, సంపదతో, నాటి రాజులందరికంటే అధికుడై 27 వేల సంవత్సరాలు ఈ భూమిని పాలించాడు. భరతుడు పుత్రుల కొరకు తపిస్తుంటే, బృహస్పతి, ఆయన అన్న భార్య మమత, విడిచి వెళ్లిన భరద్వాజుడు అనే బిడ్దను మరుత్తులు భరతుడికి ఇవ్వడంతో అతడు స్వీకరించి పెంచాడు. అతడి సంతతిలో వాడే రంతిదేవుడు. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Sunday, September 27, 2020

రామావతారం పూర్ణావతారమే .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-27 : వనం జ్వాలా నరసింహారావు

 రామావతారం పూర్ణావతారమే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-27

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (29-09-2020)

పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ ఇష్టప్రకారం తిరిగే సమయంలో, జన స్థానంలో నివసించే కామ రూపిణి-భయంకర రాక్షస స్త్రీ-శూర్పణఖ, ముక్కు చెవులు కోసి వికార రూపం వచ్చేటట్లు చేస్తాడు లక్ష్మణుడు. ఇది తెలిసిన జన స్థానంలోని ఖర-దూషణ-త్రిషిరుడితో సహా పద్నాలుగు వేల రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారు. లక్ష్మణుడి సహాయం లేకుండానే, రణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తి, పద్నాలుగు వేల మందినీ, కేవలం భుజబలంతోనే వధిస్తాడు. తన బంధువుల మరణ వార్త విన్న రావణుడు, కోపంతో, తనకు సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడు. మహా బల పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా ఇస్తాడు మారీచుడు. ఆ ఆలోచన మాను కొమ్మని బోధిస్తాడు. మృత్యువు ప్రేరేపిస్తుంటే, వాడిని తీసుకొని సీతారాములున్న చోటికి పోతాడు రావణుడు. వంచన చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారువన్నెగల జింక రూపంతో సీతకు కనిపిస్తాడు. ఆ జింక కావాలని సీత కోరితే, దాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడు. చస్తూ ’హా లక్ష్మణా’ అని అరుస్తాడు మారీచుడు. ఆ ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడు. ఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువనే గద్దను చంపి లంకకు చేరి సీతను అశోక వనంలో వుంచుతాడు రావణుడు".

"సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని, చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసి, ఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడు. తన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలో, చనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడు. తనవల్ల కదా జటాయువుకింత దుఃఖం కలిగిందని బాధపడి విలపిస్తాడు".

      (రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు.   మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది.

అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?


రామావతారం పూర్ణావతారమే. అంటే ప్రకృతి సంసర్గం లేదు. శరీరం అప్రాకృతం. ప్రకృతి గుణాలు ఆయన్ను బాధించవు. రామచంద్రమూర్తి శోకించాడని వాల్మీకి రాసిందీ అసత్యం కాదు. నిజంగానే శోకం కలిగిందాయనకు. అయితే శోకం కలిగింది తనకొచ్చిన కష్టానికి కాదు. తమకు దుఃఖాలొచ్చాయని మనుష్యులు దుఃఖిస్తారు. తనకై, తన ఆప్తులకు దుఃఖం కలిగిందికదానని, తన మూలాన వీరికింత దుఃఖం ప్రాప్తించిందికదానని, వారి దుఃఖాన్ని ఆపాల్సిన తానే వారి దుఃఖానికి కారణమయ్యానేనని మాత్రమే రాముడు శోకించాడు. అలానే, సీతాదేవి విషయంలోనూ దుఃఖించాడు శ్రీరాముడు. తనను నమ్మి అడవులకు వచ్చిన సీతను, రాక్షసుడు ఎత్తుకుపోతే, తనను వదిలిన బాధతో, అమెకెంత దుఃఖం కలిగిందోనని రామచంద్రమూర్తి దుఃఖించాడు. వియోగంవల్ల తమకు కలిగిన నష్టానికి దుఃఖించే వాళ్లు మనుష్యులు. జీవులకు కలిగిన నష్టానికి దుఃఖించేవాడు భగవంతుడు).

అడవులన్నీ వెతుక్కుంటూ పోయి, శ్రీరాముడు భయంకర-వికార స్వరూపుడైన కబంధుడనే రాక్షసుడిని చంపి దహనం చేసాడు. శాప విముక్తుడైన కబంధుడు, పంపా తీరంలో వున్న శబరిని చూసిపొమ్మని బోధించాడు. ఆమె శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదనీ, అతిథి పూజలాంటి సకల ధర్మాలను ఎరిగినందున, ఆ బోయసన్యాసినిని తప్పక చూడమనీ అంటాడు”.

(సన్యాసిని అంటే, కాషాయ వస్త్రాలు కట్టి, బోడి తల చేయించుకుని, చతుర్థాశ్రమస్వీకారం చేసిందని అర్థంకాదు. కామ్యకర్మాలు చేయకపోవడమే నిజమైన సన్యాసం. జ్ఞానం సన్యాస లక్షణం).

 

చంద్ర వంశరాజులు, పురూరవ, పరశురాముల కథ .... శ్రీ మహాభాగవత కథ-48 : వనం జ్వాలా నరసింహారావు

 చంద్ర వంశరాజులు, పురూరవ, పరశురాముల కథ

 శ్రీ మహాభాగవత కథ-48

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీరామచంద్రుడి కుమారుడు కుశుడికి అతిథి, అతడికి, నిషధుడు జన్మించారు. అలా ఆ పరంపరలో, పద్దెనిమిదోవాడిగా మరువు అనే రాజశ్రేష్టుడు జన్మించాడు. ఆయన కలాపమనే గ్రామంలో వుంటున్నాడు. కలియుగాంతంలో ఈ సూర్యవంశం నశిస్తుంది. అప్పుడు మరువు తిరిగి సూర్యవంశాన్ని పునరుద్ధరిస్తాడు. మరువు కుమారుడు ప్రసుశ్రుతుడు. అతడి కుమారుడు సంధి. అతడికి అమర్షణుడు, అమర్షణుడికి మహస్వంతుడు జన్మించారు. మహస్వంతుడి కుమారుడు విశ్వసాహ్యుడు. అతడి కొడుకు బృహద్బలుడు. ఇతడినే భారత యుద్ధంలో అభిమన్యుడు సంహరించాడు. బృహద్బలుడి తరువాత ఆ వంశక్రమంలో చివరగా సుమిత్రుడు జన్మిస్తాడు. అతడి తరువాత సూర్యవంశం వుండదు.

ఇక్ష్వాకుడి మరో కుమారుడు నిమి. ఇతడు వశిష్టుడి శాపానికి గురై మరణిస్తాడు. అలాగే నిమి శాపవశాన వశిష్టుడు మిత్రావరుణుల వల్ల ఊర్వశికి జన్మించాడు. శాపగ్రస్తుడై మరణించిన నిమి కళేబరాన్ని వృద్ధులైన మునులు మథించగా, ఒక కుమారుడు జన్మించాడు. లోకం ఆయన్ను ’జనకుడు’ అని పిలవసాగింది. అతడినే వైదేహుడని, మిథిలుడని కూడా అన్నారు. అతడి వల్ల నిర్మించబడిన నగరమే మిథిలానగరం. జనకుడి వంశంలో ఒకరి తరువాత ఒకరిగా, హ్రస్వరోముడికి సీరధ్వజుడు జన్మించాడు. అతడు యజ్ఞం చేయడానికి భూమిని దున్నిస్తుంటే నాగలి కర్రుకు సీత జన్మించింది. సీరధ్వజుడికి కుశధ్వజుడు, అలా, ఆవరుసలో చివరకు కృతికి మహావశి జన్మించారు. వీరిని మైథిల ప్రభువులనేవారు. వీరంతా ఆత్మజ్ఞానం కలవారే!

ఇదిలా వుండగా, జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మకు అన్ని విధాల సాటిరాగల వాడైన అత్రి జన్మించాడు. ఆయన ద్వారా చంద్రుడు జన్మించి, తారా సమూహానికి ప్రభువైనాడు. ఒకనాడు అతడు దేవతల గురువు బృహస్పతి ఇంట్లో చొరబడి ఆయన భార్యను ఎత్తుకొచ్చాడు. అదే సమయంలో దేవాసుర యుద్ధం జరుగుతుండడం వల్ల, శుక్రుడు, రాక్షసులు చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని తరిమేశారు. శివుడు, దేవేంద్రుడు బృహస్పతికి అండగా నిలిచారు. చివరకు బ్రహ్మ జోక్యం చేసుకోవడం వల్ల చంద్రుడు గర్భిణైన తారను ఆమె భర్త బృహస్పతికి అప్పచెప్పాడు. తార మగబిడ్దను కన్నది. బృహస్పతి, చంద్రుడు ఇద్దరూ ఆ బిడ్ద తనదే అను వివాదపడ్డారు. బిడ్దకు తండ్రి ఎవరని బ్రహ్మ తారను అనునయంగా అడగ్గా, సిగ్గుతో ఆమె, చంద్రుడని సమాధానం ఇచ్చింది. ఆ బిడ్డకు బుధుడు అని పేరు పెట్టి చంద్రుడికి అప్పగించాడు బ్రహ్మ.

చంద్రుడి కొడుకు బుధుడికి, ఇళాకన్యకు పురూరవుడు జన్మించాడు. పురూరవుడి శౌర్యపరాక్రమాలు విన్న ఊర్వశి భూలోకానికి వచ్చి పురూరవుడిని ఆకట్టుకుంది. తనను ప్రేమించమని ఆమెను వేడుకున్నాడు. ఊర్వశి రెండు గొర్రెలను చూపించి, ఆరెంటినీ ఎప్పుడూ వెంటవుండి కాయాలనీ, తన ఎదుట అతడు వివస్త్ర కాకూడదనీ నిబంధన విధించింది. దానికి ఒప్పుకుని ఇద్దరూ ఒకటై ఆనందించసాగారు. ఊర్వశీ, పురూరవులు రాత్రీ-పగలు తేడా లేకుండా గడపసాగారు. దేవేంద్రుడు ఊర్వశి లేదన్న విషయం తెలుసుకుని, ఆమెను వెతకడం కొరకు గంధర్వులను పంపాడు. వారు భూలోకం వచ్చి ఊర్వశి గొర్రెలను పట్టుకోగా అవి అరిచాయి. వెంటనే ఊర్వశి గొడవ చేయడంతో, తన ఒంటిమీద బట్ట వున్నదీ-లేనిదీ చూసుకోకుండా పురూరవుడు, దిగంబరంగా, దొంగల వెంటబడి, వారినుండి గొర్రెలను విడిపించాడు. ఆయన దిగంబరుడిగా కనిపించడంతో ఊర్వశి మాయమై పోయింది. ఆయన ఆమె కోసం వెతకగా సరస్వతీ నది ఒడ్డున కనిపించింది. రమ్మని అడిగితే రానని, ఏడాది తరువాత తన దగ్గరికి వస్తే ఆయన కుమారులను చూపిస్తానని అన్నది. ఆయన రాజధానికి తిరిగి వెళ్లిపోయాడు.

సంవత్సరం తరువాత ఊర్వశి దగ్గరికి వెళ్తే ఆమె తనను తీసుకుపోవాలంటే గంధర్వులను ప్రార్థించాలి అన్నది. ఆయన అలా చేయగా, వారు ఆమెకు మారుగా అతడికి ఒక అగ్నిస్థాలిని ఇచ్చారు. అది ఊర్వశి కాదని తెలుసుకుని అడవిలో వదిలేశాడు. కొంతకాలానికి త్రేతాయుగం ప్రవేశించింది. పురూరవుడి మనస్సులో మూడు వేదాలు మూడు కర్మ మార్గాలుగా పొడగట్టాయి. అప్పుడాయన అడవికి పోయి, అక్కడ జమ్మి వృక్షంలో నుండి పుట్టిన ఒక రావి చెట్టును చూశాడు. ఆ రావితో రెండు అరణులు తయారు చేశాడు. ఒకదాన్ని తానుగాను, మరొకదాన్ని ఊర్వశిగాను, రెంటి మధ్యలో వున్న కొయ్యను కుమారుడిగాను భావించి, మంత్ర పఠన చేస్తూ మథించసాగాడు. అప్పుడు జాతవేదుడు అనే అగ్ని సంభవించింది. ఆ అగ్ని మూడు రూపాలలో వర్ధిల్లి, పురూరవ కుమారుడని కల్పించబడింది. ఆ అగ్ని పురూరవుడిని పుణ్యలోకాలకు పంపడానికి కారణమైంది. ఊర్వశిని కనుక్కోవడానికి ఆ అగ్నితో యజ్ఞం చేశాడు పురూరవుడు. అతడే వేద విభాగం కూడా చేసి ఊర్వశి వున్న గంధర్వలోకానికి వెళ్లాడు. ఊర్వశి ఆతడికి తన కడుపు పంటగా ఆరుగురు కుమారులను చూపింది. వారి సంతతి వాడే గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టిన జహ్నుడు. అతడి సంతతికి చెంది, కుశాంబుడికి జన్మించినవాడే గాధి.

గాధికి సత్యవతి అనే కుమార్తె పుట్టింది. ఆమెను ఋచికుడు అనే బ్రాహ్మణుడు వివాహమాడాడు. సత్యవతికి జమదగ్ని జన్మించాడు. సత్యవతే కౌశికి అనే నది పేరుతో లోకపావనిగా ప్రవహించింది. జమదగ్ని రేణువు కుమార్తె రేణుకను వివాహమాడాడు. పురుషోత్తముడైన విష్ణుమూర్తి అంశగా పరశురాముడు జమదగ్నికి పుత్రుడుగా జన్మించాడు.

ఇదిలా వుండగా, హైహయవంశంలో కార్తవీర్యార్జునుడనే రాజు దత్తాత్రేయుడిని ఆరాధించి వేయి చేతులను పొందాడు. అణిమాదిసిద్ధులను పొంది భూమ్మీద వెలుగొందాడు. ఒకనాడు అతడు విర్రవీగుతూ రేవానది సఛ్చమైన జలాల్లో క్రీడిస్తూ, తన చేతులతో నదీప్రవాహాన్ని అడ్డుకున్నాడు. పైకుబికిన నీరు దండయాత్రకై బయల్దేరిన రావణాసురుడిని చుట్టుముట్టింది. రావణుడు వెంటనే కార్తవీర్యార్జునుడి మీద యుద్ధానికి దిగాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని పట్టి, మోకాళ్లతో తన్ని, తన సేవకులతో బోనులో పెట్టించి, తనతో మాహిష్మతీ నగరానికి తీసుకువచ్చాడు. ఆ తరువాత విడిచి పెట్టి, ఎక్కడా వీరుడనని చెప్పుకోవద్దని అవమానకరంగా మాట్లాడాడు.

మరో రోజున కార్తవీర్యుడు వేటకు వెళ్లి, జమదగ్ని ఆశ్రమానికి పోయాడు. ఆయన రాజును గౌరవించి, తన హోమధేనువును రప్పించి, రాజుకూ-అతడి సేనకూ మృష్టాన్నాన్ని సమకూర్చాడు. రాజు ఆ హోమధేనువును పట్టి తెమ్మన్నాడు తన భటులను. అది అంబారావం చేస్తున్నా వినిపించుకోకుండా భటులు దాన్ని లాక్కొచ్చారు. రాజు వెళ్లిన తరువాత ఆశ్రమానికి వచ్చిన పరశురాముడికి తండ్రి ఈ విషయం చెప్పాడు. రాజుమీద యుద్ధానికి బయల్దేరాడు పరశురాముడు. అతడిని ’వెర్రి బాపనయ్’ అని హేళన చేశాడు కార్తవీర్యార్జునుడు. అతడి సైనికులు పరశురాముడిని ఆయుధాలతో బాధించారు. ఆ సేనలను తన బాణవర్షంతో ముంచెత్తి రూపుమాపాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. భీకరమైన బ్రాహ్మణ-క్షత్రియ యుద్ధం కొనసాగింది. ధనుర్విద్యలో మేటైన పరశురాముడు తన గండ్రగొడ్దలితో కార్తవీర్యార్జునుడి చేతులను, తరువాత తలను తెగనరికాడు. పరశురాముడు హోమధేనువును తోలుకొచ్చి తండ్రికి అప్పచెప్పాడు. రాజును చంపిన పాప పరిహారార్థం ఏడాది పాటు తీర్థయాత్రలు చేయమని కొడుక్కు సలహా ఇచ్చాడు జమదగ్ని. ఆయన అలా చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

కొంతకాలం తరువాత ఒకనాడు జమదగ్ని భార్య రేణుకాదేవి నీళ్లు తేవడానికి గంగానదికి వెళ్లింది. అదే సమయంలో అక్కడ అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్న చిత్రరథుడనే గంధర్వుడిని ఆసక్తిగా చూస్తూ నీరు తెచ్చే విషయం మర్చిపోయింది. ఆలశ్యంగా వచ్చిన భార్యను చూసి దానికి కారణాన్ని దివ్యజ్ఞానంతో పసిగట్టాడు జమదగ్ని. కొడుకులను పిలిచి ఆమెను చంపమని ఆజ్ఞాపించాడు జమదగ్ని. వారు ఆయన మాట వినకపోవడంతో కొడుకులనూ, భార్యనూ చంపమని పరశురాముడిని ఆదేశించాడు. ఆయన తండ్రి చెప్పినట్లే వారిని నరికి చంపేశాడు. ఆ తరువాత తండ్రిని సమీపించి వారిని బతికించమని ప్రార్థించాడు. ఆయన అలాగే అని వారిని బతికించాడు.

పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యార్జునిడి కుమారులు ఆశ్రమానికి వచ్చి భీభత్సాన్ని సృష్టించి, జమదగ్ని శిరస్సు ఖండించి వెళ్లిపోయారు. పరశురాముడు రాగా, అతడిని చూసి, తల్లి ఇరవై ఒక్క సార్లు తల కొట్టుకుని ఏడ్చింది. పరశురాముడు వెంటనే పోయి కార్తవీర్యార్జునుడి కుమారులందరినీ హతం చేశాడు. అంతటితో ఆగకుండా 21 సార్లు దండెత్తి ఎక్కడెక్కడున్న రాజులందరినీ వెతికి-వెతికి మరీ చంపాడు. భూమ్మీద రాజు అనే పదం లేకుండా చేశాడు. తరువాత శమంత పంచకంలో రాజుల రక్తాన్ని తొమ్మిది మడుగులు చేసి, తన తండ్రి శిరస్సును ఆయన దేహానికి కూర్చి యాగం చేశాడు. జమదగ్ని సశరీరుడై తపోబలం వల్ల వినువీధిలో సప్తర్షి మండలంలో సప్తమ మునిగా విరాజిల్లాడు. పరశురాముడు తరువాతి మన్వంతరంలో సప్తర్షులలో స్థానాన్ని అలంకరిస్తాడు. ఆ తరువాత అతడు మహేంద్రగిరికి తపస్సుకై పోయాడు.     

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)