Friday, March 1, 2013
చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక: వనం జ్వాలా నరసింహారావు
Thursday, September 15, 2011
నాయకుడెవరు - మోడీనా, రాహులా?: వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (16-09-2011)
వనం జ్వాలా నరసింహారావు
ఎవరు నాయకులు? నాయకత్వ సామర్ధ్యాలేమిటి?, ప్రదర్శితం కాని రాహుల్ నాయకత్వ లక్షణాలు, ప్రశంసలనందుకున్న వరుణ్ గాంధీ ప్రసంగం, మోడీ, రాహుల్‌లలో నాయకుడెవరైనా కావచ్చు, కాకపోవచ్చు, నిర్ణేతలు ప్రజలే! ...ఎడిటర్
అందరికీ నాయకత్వ లక్షణాలుండాలని లేదు. నాయకత్వ లక్షణాలు లేనంత మాత్రాన మంచివారు కాదని కాని, గొప్ప వారు కాకూడదని కాని అనలేము. మంచితనం వేరు, నాయకత్వం వహించడం వేరు. నాయకత్వం కొందరికి పుట్టుకతో అబ్బితే, మరి కొందరికి వయసు పెరిగినా కొద్దీ ఆ లక్షణాలు రావచ్చు. ఎలా-ఎప్పుడు రావడం కంటే, వచ్చిన వాటిని ఆచరణలో నిరంతరం పెట్టగలిగే వారే శాశ్వతంగా నాయకులుగా మిగిలి పోతారు. కుటుంబ నేపధ్యంతో కొందరు హఠాత్తుగా నాయకులుగా ఎదగ వచ్చు. నాయకులైన తర్వాత స్వయం ప్రతిభతో సమర్థవంతంగా ముందుకు సాగవచ్చు. ఇక కొందరికి, ఎన్ని విధాల నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎన్ని లభించినా, ఉపయోగించుకోలేక మరో నాయకుడి కిందనే పని చేయడానికి ఇష్ట పడతారు. రాజకీయాల విషయానికొస్తే, వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, (అవినీతికి దూరంగా) మంచి-మంచి అలవాట్లతో, ఫలవంతమైన సహాయాన్ని తన పార్టీకి-రాష్ట్రానికి-దేశానికి అందించగల వారే నాయకులనిపించుకోగలుగుతారు. వీరిలో రక-రకాల స్థాయికి చెందిన వ్యక్తులుంటారు. అందరు, అన్ని రంగాలలో రాణించ లేరు.
"మొదటి స్థాయి (కింది) యోగ్యత గల స్వయం సాధకులు", "రెండో స్థాయికి చెందిన బృందంలోని భాగస్వామ్య సభ్యులు", సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల శక్తిగల వారై వుంటారు. "మూడో స్థాయికి చెందిన మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వారై వుంటారు. ఇక "నాలుగో స్థాయి సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. ఇలాంటి వారి నాయకత్వ లక్షణాలను ఉమ్మడిగా కలిగుండి, వీరందరిని, ఏఏ పనికి-ఎవరిని-ఎప్పుడు-ఎలా ఉపయోగించుకోవాలో, లక్ష్యాలను చేరుకోవడానికి-అధిగమించడానికి సరైన స్థానంలో ఎవరెవరిని-ఎంత మేరకు నియమించాలో నిర్ణయించగలిగేది, కేవలం "ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి" మాత్రమే. వీరు తమ వ్యక్తిగత నమ్రతలను, అణకువలను వృత్తి పరమైన కార్య సాధనతో జోడించి, ఒక రకమైన “అసంభవ మిశ్రమం” గా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థానాన్ని చేరుకోగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. అలాంటివారే, రాజకీయాలలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ రాష్ట్ర-జాతీయ స్థాయి అధ్యక్షులుగా, మంత్రులుగా-ముఖ్య మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా-ప్రధాన మంత్రిగా, "స్వయం ప్రతిభతో" ఎదగ గలుగుతారు. వారసత్వం గానో, అయాచితంగా నో, రాజీ అభ్యర్థిగా నో, తాత్కాలిక నాయకుడుగా నో, ఒకరి త్యాగ ఫలితంగానో, "మధ్యంతర ఏర్పాటు" గానో, ఇలాంటి ఉన్నత స్థానాలకు చేరుకున్న వ్యక్తులకు, ఆ స్థానాలు తాత్కాలికంగానే మిగిలిపోతాయి తప్ప, శాశ్వతం కావు. ఇవన్నీ అనుభవంలో, మన దేశంలో-ఇతర దేశాలలో గమనిస్తూనే వున్నాం.
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆమె అప్పగించిన నలుగురిలో తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే, సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం మొదలెట్టింది. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో, అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి తిరిగొచ్చారని భావించారు పలువురు. ఇక ఆయన భజన బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్" తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను, రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం. హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా, లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించు తూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.
మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. ఒక వేళ అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం, "దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!
ఈ నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఇటీవల. ఇదే సమయంలో యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది. ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో సహా చర్చలకు నడుం బిగించారు. వీరిద్దరిలో ఎవరు ప్రధాని అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!

జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్ ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ, తప్పో-ఒప్పో, అప్పటికే ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!
తన తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్ గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం, అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్ గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు. అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా, పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్ తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పన్నెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత మాత్రాన నాయకులు కాకుందా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం కలిగుండాలని లేనే లేదు.
ఇన్ని తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే, ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే, ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే, కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!
సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని వుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!
Saturday, May 21, 2011
యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు:వనం జ్వాలా నరసింహారావు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (24-05-2011)
డాక్టర్ మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్లయింది. భారత దేశ చరిత్రలో, స్వాతంత్ర్యం వచ్చిన సుమారు ముప్పై సంవత్సరాల అనంతరం, అలనాటి జనతా పార్టీ సారధ్యంలో, ప్రప్రధమంగా కాంగ్రేసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది. ఆ తర్వాత, ఓటమి పాలైన రెండున్నర ఏళ్లకే, అదే పూర్వ శోభతో కాంగ్రెస్ పార్టీని, మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కింది. ఆమె హత్యానంతరం, రికార్డు స్థాయిలో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధి. తదనంతరం సంభవించిన-సంభవిస్తూ వస్తున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో, అధికారం చేపట్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలే కాని, ఏ ఒక్క రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి మాత్రం కాదు. రాజీవ్ హత్యానంతరం ప్రధానైన పీవీ నరసింహారావు సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకి తొలుత లోక్ సభలో మెజారిటీ లేదు. అలానే ఆయన తర్వాత ప్రధానైన వాజ్ పాయే సారధ్యంలోని బీజేపీకి సొంత మెజారిటీ లేదు. కేంద్రంలో అధికారం దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ పార్టీ చేరుకోలేని పరిస్థితుల్లో, పీవీ-కేసరిల తర్వాత, పార్టీ పగ్గాలను చేపట్టిన సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర 2004 లో ప్రారంభమైంది. రాజీవ్ హత్యానంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని సోనియా గాంధీ 1996 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంభవించిన పరాజయం తర్వాత, పీవీ వారసుడు కేసరి పార్టీకి న్యాయం చేకూర్చలేడని భావించి పదవి స్వీకరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లోక్ సభలో పార్టీ బలాన్ని పెంచగలిగినా, ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేయలేకపోయింది కాంగ్రెస్.
ఆ నేపధ్యంలో 2004 లో జరిగిన ఎన్నికలలో 145 స్థానాలు గెలిచి, తన ప్రత్యర్థి ఎన్డీయేకు ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యాబలం లేదని తేలిన తర్వాత, "యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలైన్స్" ఏర్పాటు చేసింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి 2004 ఎన్నికలలో ఎన్డీయే పక్షాన లోక్ సభకు గెలిచింది 169 మంది సభ్యులు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, తన సభ్యులతో సహా-తన ఆలోచనా ధోరణికి దగ్గర లో వున్న, వివిధ పార్టీల నుంచి లోక్ సభకు గెలుపొందిన, 222 మందితో 59 మంది సభ్యుల వామ పక్ష కూటమిని కలుపుకుని తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. "కామన్ మినిమమ్ ప్రోగ్రాం" పేరుతో, సంకీర్ణ భాగస్వామ్య పార్టీలందరికీ ఆమోద యోగ్యమైన ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది యూపీఏ.
వామ పక్షాలు ఒకానొక సందర్భంలో మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో, సమాజ్ వాది పార్టీ, బహు జన సమాజ్ పార్టీలు సమయానుకూలంగా మద్దతిచ్చి యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా కాపాడాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, యూపీఏ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టి, తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగును యూపీఏ పక్షాన ప్రధాన మంత్రిగా ప్రతిపాదించారు. పదమూడవ భారత ప్రధానిగా 2004 లో బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ సారధ్యంలోని తొలి యూపీఏ ప్రభుత్వం సాధించిన సాఫల్యాలు, ఐదేళ్ల అనంతరం 2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, తిరిగి యూపీఏ ను అధికారంలోకి వచ్చేందుకు దోహద పడ్డాయి. 2004 ఎన్నికల అనంతరం ఏర్పాటైన "యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలైన్స్" భాగస్వామ్య పక్షాలు, ఈ సారి 2009 లో జరిగిన ఎన్నికలలో, ఉమ్మడిగా పోటీ చేసి, సంఖ్యా పరంగా తమ బలాన్ని పెంచుకుని, గతంలో కంటే, 61 స్థానాలను అధికంగా గెలుచుకుని, మొత్తం 262 సభ్యుల బలీయమైన కూటమిగా విజయ పథాన నిలిచింది. భారత దేశంలో, జవహర్లాల్ నెహ్రూ తర్వాత, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మరో మారు ప్రధాని కాగలిగిన రెండో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ రికార్డు సాధించారు. మే నెల 22, 2009 న, సరిగ్గా రెండేళ్ల క్రితం, రెండవ పర్యాయం ప్రధాన మంత్రిగా, యూపీయే ప్రభుత్వ సారధిగా, బాధ్యతలు చేపట్టారు. సుస్థిర ప్రభుత్వానికి బాటలు మరో మారు వేశారాయన.
మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం తొలి విడత అధికారంలో వున్న మొదటి ఐదేళ్ళలో, పాలనా పరమైన సంస్కరణలు, సమాచార హక్కు చట్టం, పనికి ఆహార పథకం లాంటివి ప్రవేశ పెట్టి తన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టారు. ఐనా, ఏ నాడు, తన ప్రభుత్వం సాధించిన దాన్ని, అతిగా చెప్పే ప్రయత్నం చేయలేదు. అలానే, రెండో విడత అధికారం చేపట్టి ఏడాది నిండిన సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను, తక్కువ చేసి చూపుతూ, చేయాల్సింది ఇంక ఎంతో ఉందన్నారు. "సముచితమైన సాఫల్యాలను" సాధించిందని మాత్రమే అన్నారు ప్రధాని. తాను సాధించ దల్చుకున్నది ఎంతో మిగిలి పోయిందని, తన సాఫల్యాలను చారిత్రక కారులు ఎప్పుడో ఒకప్పుడు సరైన రీతిలో అంచనా వేస్తారని కూడా అన్నారాయన.
మన్మోహన్ సింగ్ ఎంత సవినయంగా తన ప్రభుత్వం గురించి అన్నప్పటికీ, యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ అంచనా వేయలేం. విదేశాంగ విధాన కానీయండి, ఆర్థిక పరమైన నిర్ణయాలు కానీయండి, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పే విషయమే కానీయండి, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వారి విషయంలో, సమతుల్యం పాటిస్తుందనడానికి నిదర్శనం తొలి విడత-మలి విడతలలో ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి". అందులోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం.
గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో పని చేసిన నాటి ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. ఆ మాటకొస్తే, పీవీ మంత్రివర్గంలో మన్మోహన్ నాటిన ఆర్థిక సంస్కరణల విత్తనాలు, మొక్కలై-వృక్షాలై, యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో భారతావనికి ఆ ప్రభావం పడకుండా చూడడానికి, యూపీఏకు ముందున్న ఎన్డీఏ సారధి వాజ్ పాయే కూడా కారణమనాలి. ప్రపంచం దృష్టిలో ఆర్థిక పరంగా రెండు దశాబ్దాల క్రితం భారత దేశంపై నున్న చులకన భావన స్థానంలో, అత్యంత గౌరవ స్థానం లభించడానికి కూడా మన్మోహన్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వమే కారణం. అలానే ప్రపంచ వర్తక-వాణిజ్య రంగంలో కూడా చక్కటి పురోగతి సాధించింది గత ఏడాది-రెండేళ్లలో. స్టాక్ మార్కెట్ పతనం దరిమిలా, దాని దుష్ప్రభావం ఏ మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా కాపాడిందీ ప్రభుత్వం.
మన్మోహన్ సింగ్ సారధ్యంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను-సాధించలేక పోయిన వాటిని గురించి ప్రతి పక్షాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే, బహుశా, రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సభ్యులనుద్దేశించి, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్తూ, ప్రధాని చేసిన ప్రసంగంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చి ఓటర్లు గెలిపించ తల్చుకోనప్పుడు, సంకీర్ణాలు తప్పవు. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.
రాష్ట్రపతి ప్రసంగంలో లేవనెత్తిన అంశాలను-ప్రతిపక్ష నాయకుల విమర్శలకు అనుసంధానం చేస్తూ, తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని, పరోక్షంగా, భవిష్యత్ లో యూపీఏ చేయబోతున్న వాటితో కలిపి చెప్పారు మన్మోహన్ సింగ్. సామాన్యులు-సగటు మనిషి, అధిక ధరల తాకిడి తట్టుకోడానికి ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడం, ప్రజా జీవితంలో సత్య నిష్టను-న్యాయ బుద్ధిని ప్రోత్సహించడం, బీద-సాద-పేద-బలహీన-వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధిలో తమ వంతు వాటా పొందేలా ఆర్థికాభి వృద్ధి సాధించడం, దేశ సమగ్రత-సమైక్యత విషయంలో అప్రమత్తంగా వుండడం, అంతర్జాతీయ స్థాయిలో భారత జాతి గొంతు గట్టిగా వినిపించేలా విదేశాంగ విధానం రూపొందించడం యూపీయే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం, తొలి విడత-మలి విడతలలో సాఫల్యం సాధించిందని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మాటల్లోనే, యూపీఏ సాధించిన ప్రగతిని అవగాహన చేసుకోవచ్చు.
అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, వారికి-యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు కూడా. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది.
పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. జాతీయ ఆరోగ్య బధ్రతా బిల్లు దీని కొరకే తెచ్చే ఆలోచనలో వుంది యూపీఏ ప్రభుత్వం. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.
సంకీర్ణ ధర్మం అడపదడప యూపీఏ ప్రభుత్వాన్ని ఊగిసలాటలో పడ వేసినప్పటికీ, మొదటి విడత లాగానే, గత రెండేళ్లలో గణనీయమైన సాఫల్యాలను సాధించిందనడంలో అతిశయోక్తి లేదనొచ్చు. యూపీఏ విజయాల వెనుక ప్రధాని మన్మోహన్ సింగ్, చైర్ పర్సన్ సోనియా గాంధి, సంకీర్ణ భాగస్వామ్య పక్షాల నాయకులు, బాధ్యతాయుతమైన ప్రతి పక్షాలున్నాయని చెప్పాలి.
Saturday, April 30, 2011
ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం:వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం
వనం జ్వాలా నరసింహారావు
ఇటీవలి కాలంలో, "అపనమ్మకం" అనే ఆయుధం అలవోకగా వాడకంలో కొచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంత కంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరి లోను, ప్రత్యేకించి రాజకీయ నాయకులలోను బలంగా నాటుకుని పోయింది. అకార క్రమంలో అగ్రభాగాన వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఆది మానవుడు చేతికి దొరికిన దాన్నే తనకు రక్షణగా ఉపయోగించుకుంటే, పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారడంతో, అలా రక్షణకు వాడిన వాటినే, ఇతరులపై దాడికి ఉపయోగించుకో సాగారు. మరి కొంతకాలం గడిచాక, వాటినే పదునైన ఆయుధాలుగా మలచుకోవడం మొదలైంది. ఇలా ఆరంభమైన ఆయుధాల వాడకం, పరిణామ క్రమంలో, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో, తుపాకులుగాను-ఫిరంగులగాను, దరిమిలా రసాయన-అణ్వాయుధాల వాడకం వరకూ పోయింది. ఆ తర్వాత ఆంత్రాక్స్...అలాంటి మరి కొన్ని మాధవ మేధస్సులోంచి బయటకొచ్చాయి.
ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి తన రక్షణకోసం-ఎదుటివారిని దెబ్బతీయడానికి ఆది మానవుల కాలం నుంచి మొదలైన ఆయుధాల వాడకం, నాగరికత పెరిగే కొద్దీ, దేశ దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే దాకా పోయింది. ఇవన్నీ ఒక వైపు ఇలా కొన సాగుతూంటే, ఆధిపత్య పోరులో భాగంగా, అధికారం కొరకు, వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి వాడే ఆయుధాలు, వ్యూహాత్మకమైన ఆయుధాలు కా సాగాయి. వాటి రూపకర్తలు ప్రజాస్వామ్యం ముసుగులో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ నాయకులు. మొదట్లో ఆ వ్యూహాలు, ప్రజలకు తామేం మంచి చేయదల్చు కున్నామో తెలియచేసే "వాగ్దానాలు" మాత్రమే. అలా చెప్పే వారిలో నిజాయితీ ప్రతి బింబించేది మొదట్లో. క్రమేపీ, చేస్తామని మభ్య పెట్టే వాగ్దానాలు మొదలయ్యాయి. సమాంతరంగా, ఎదుటి వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చాలా కాలం వరకు కొంతలో కొంత నిజాయితీగానే, ఒకరిపై మరొకరు ప్రచారాలు చేసుకునే వారు. అవన్నీ పనికి రాని రోజులొచ్చాయిప్పుడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, వారి నుంచి పాఠాలు నేర్చుకుంటూ-వారినే ఆదర్శంగా తీసుకుంటున్న అనేక మంది, ఎదుటి వారిని దెబ్బ తీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం "అప నమ్మకం". తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటు వ్యాధి అన్ని రంగాల్లోకి పాక సాగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంతకాలం నుంచి, సాగుతున్న మాటల యుద్ధమే.
పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం, సినిమా హీరో నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించి, తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీదుల్లో అవమానం పాలైందనీ-ఆ అవమానానికి ప్రతీకారంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోను-దేశంలోను ఓడించాలని ఇచ్చిన పిలుపుకు తొలుత ఆయన స్వరాష్ట్రంలోను, అనంతరం దేశ వ్యాప్తంగానూ స్పందించిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు (ఆంధ్ర ప్రదేశ్ తో సహా) రాష్ట్రాలలోను, అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలడం గత శతాబ్ది డబ్బై దశకంలో మొదలైంది. రాష్ట్రాలలో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971 లో కాంగ్రెస్ పార్టీని విజయ పధంలో నడిపించిన ఇందిరా గాంధిని ఓడించడానికి, అప్పటి రాజకీయ పార్టీలు, ఎదురు దెబ్బ తీశారే తప్ప, వెన్ను పోటు రాజకీయాలను కాని, అవాస్తవాలు ప్రచారం చేయడం కాని చేయ లేదు. ఆమె చేసిన "తప్పు" నే తమ ఎన్నికల ప్రధానాంశంగా ఉపయోగించుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన "అవినీతి వ్యతిరేక ఉద్యమం" లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, ఆబాల గోపాలాన్ని అందులో పాల్గొనే లా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఇందిరా గాంధి పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా, ఎందరో, ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఇందిరను ఓడించారు. ఆమె చేసిన తప్పులను మాత్రమే ఎంచి చూపారు కాని, ఆమె చేయని-ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై "అప నమ్మకం" కలిగే ప్రయత్నం బహుశా ఎవరూ చేయలేదు.
1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నాయకులు ఉపయోగించిన మరో బ్రహ్మాస్త్రం "నియంతృత్వమా-లేక-ప్రజాస్వామ్యమా" కోరుకొమ్మని ఓటర్లను అడగడం. ఎమర్జెన్సీకి ముందు-ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు, కారణాలు సహేతుకమైనా-కాక పోయినా, ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు చోటు చేసుకున్న విషయం, ఆమెకు అతి సన్నిహితంగా మెలిగిన వారు సహితం ధృవీకరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాల పిలుపుకు స్పందించిన ఓటర్లు, "ప్రజాస్వామ్యానికి" ఓటే సారు. జనతా పార్టీని గెలిపించారు. రెండేళ్ల లోనే ప్రజాస్వామ్యానికి సరైన సారధులు "జనతా పార్టీ నాయకులు" కానే కాదని, కాలేరని నిరూపించడానికి ఇందిరకు అవకాశం దక్కింది. తనపై నమ్మకం పెట్టుకునే దిశగా దరిమిలా వచ్చిన మధ్యంతర ఎన్నికలలో వాగ్దానాలు చేసిందే కాని, ప్రత్యర్థులపై అపనమ్మకం అస్త్రాన్ని వాడుకోలేదు. జనతా పార్టీ అప్పట్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమయిందని ఓటర్లకు తెలియచేసే ప్రయత్నం మాత్రం చేసింది ఇందిరా గాంధి.
ఇందిరా గాంధీనైతే ఓడించ గలిగారు కాని, నిల దొక్కుకోలేక పోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. ఎన్నికలొచ్చాయి. ఇందిరా గాంధి వ్యూహాత్మకంగా, "సుస్థిరతా? అస్థిరతా" అన్న నినాదం లేవనెత్తిందే కాని, "అప నమ్మకం" ఆయుధాన్ని వాడ లేదు. శత్రువును తన బలంతోను, వారి బలహీనతల తోను, గెలిచిందే తప్ప, వాళ్లకు అపవాదు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే, అయిదేళ్ల తర్వాత, అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్ టీ రామారావు, ఇందిరా కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీశాడే కాని ఆమెపై ప్రజల్లో "అప నమ్మకం" ప్రచారం చేయలేదు. తన వ్యతిరేకులతో ఆమె జత కట్టిందని అసత్య ప్రచారాలు చేయలేదు. "మాచ్ ఫిక్సింగ్" అన్న పదాలు ఆమెకు వ్యతిరేకంగా వాడిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్ధతి, మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇటీవలి కాలం వరకూ అవలంబిస్తూనే వున్నాయి. కాని కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైంది, ప్రత్యర్థిని కించపరచడం-అసత్యాన్ని ప్రచారం చేయడం-ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వారిపై ఓటర్లలో "అప నమ్మకం" కలగ చేయడం అని గ్రహించాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఎవరు కూడా ఒకరికి మరొకరు తీసిపోరనే చెప్పాలి.
ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం "మాచ్ ఫిక్సింగ్". క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల-కోచ్ ల-కెప్టెన్ల ప్రతిభ కాదని, ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని, ప్రచారాలు మొదలయ్యాయి. దాన్నే "మాచ్ ఫిక్సింగ్" అని ముద్దుగా పిలువ సాగారు. అదొక అ నైతిక ఒప్పందంగా ముద్ర పడింది. నిజానికి అలా జరిగుంటే అది అ నైతికమే. ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా. కాకపోతే, ఎప్పుడు ఏ మాచ్ ఏ టీం గెలిచినా, దానికి ఏదో రకమైన "మాచ్ ఫిక్సింగ్" కారణం అనే "అప నమ్మకం" ప్రచారంలోకొచ్చింది. ఆ తరహా "అప నమ్మకం" ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే, గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం "మాచ్ ఫిక్సింగే మో!" అన్నంత "నమ్మకం" గా భావించడం మొదలైంది. ఇక రాజకీయ నాయకులు ఆ ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం.
ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ ఆర్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, ప్రస్తుతం జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్" అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో, ప్రచారం తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. ఇటీవలి కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు.
ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా. దీన్ని అరికట్ట లేక పోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించే స్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటి వారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్య పోనక్కర లేదు. తస్మాత్ జాగ్రత్త!

