Showing posts with label రోశయ్య. Show all posts
Showing posts with label రోశయ్య. Show all posts

Thursday, December 30, 2010

ఉగాది పచ్చడిని పోలిన 2011 ఆంగ్ల సంవత్సరాది: వనం జ్వాలా నరసింహారావు

రెండువేల పది సంవత్సరానికి వీడ్కోలు... పదకొండుకి స్వాగతం...
వనం జ్వాలా నరసింహారావు

కొత్త ఆశలు - పాత వైఫల్యాలు - (ఆంధ్ర జ్యోతి, 1-01-2011)

2010 సంక్రాంతి రోజున అమెరికాలో వున్న నేను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పండుగ శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఫోన్ చేశాను. ఉభయ కుశలోపరి తర్వాత, మరికొన్నాళ్ళు నన్ను అక్కడే వుండమని సలహా ఇచ్చారాయన. ఆయనలా ఎందుకన్నారో కారణం అందరికీ తెలిసిన విషయమే! అంతకు ముందు నెల రోజుల పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష దరిమిలా కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసా కాండ వల్ల శాంతిభద్రతల సమస్యలతో సతమవుతున్న హైదరాబాద్ కు రావడం కంటే, మరి కొద్ది రోజులు అమెరికాలో పిల్లల దగ్గర గడపడమే మేలని, ఆయన సూచనగా నాకర్థమయింది. మరో నూతన సంవత్సరాదికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న నేడు కూడా రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం వుండడమంటే అంతకంటే దురదృష్టం బహుశా మరోటి లేదనాలి.

2010 న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అమెరికా - హ్యూస్టన్ నగరంలో వుంటున్న సాహితీ మిత్రుడు పిల్లుట్ల సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమం మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోయింది. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలిసి-మెలిసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూచినట్లే, వీళ్ళింట్లోకి వెళ్లిన మాకు, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముందర సాక్షాత్కరించాయి. అలానే సంక్రాంతి సంబరాలు కూడా అక్కడే జరుపుకున్నాం. మరి ఈ ఏడాదో?... ఎలా వుండబోతోందో? ఈ వ్యాసం రాసేటప్పుడు అగమ్యగోచరంగానే వుందనాలి?

ఏం జరగనున్న దో అని అనుకుంటూ ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే, తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమాల నేపధ్యంలో అల నాడు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితులను అధిగమించడానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసింది. తదుపరి ప్రక్రియ, జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల ఇక 2010 సంవత్సరానికి ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. కాకపోతే, "కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమవుతున్న ది నూతన సంవత్సరం. ఉగాది పచ్చడిని పోలిన ఆంగ్ల ఉగాదికి ఇలా స్వాగతం పలుకుతాం!

ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది?

2009 సంవత్సరంలో విమాన ప్రమాదంలో మరణించిన రాజశేఖర రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య సారధ్యంలో, ఆయనకు ప్రమేయం వున్నా - లేకపోయినా, రాష్ట్ర ప్రజలకు 2010 సంవత్సరం ఎన్నో చేదు అనుభవాలను రుచి చూపించింది. ఆయనకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. డిసెంబర్ (2009) తొమ్మిది నాటి చిదంబరం "తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు" ప్రకటన వేర్పాటు వాదుల్లో ఆశలు రేకెత్తించగా, సమైక్య వాదులను ఉద్యమ దిశగా మళ్లించింది. దరిమిలా, తెలంగాణలోని ప్రజాప్రతినిధులు-ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలకతీతంగా తమ పదవులకు రాజీనామా చేయడం, చివరకు కేవలం పన్నెండు మంది ఎమ్మెల్యేల రాజీనామాలు మినహా మిగతా అందరివీ తిరస్కరించడం జరిగింది. రాజీనామాల విషయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శించిన "వ్యూహం", అధిష్టానం దృష్టిని ఆకర్షించి, రోశయ్య స్థానంలో అతి పిన్న వయస్సులో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి దోహద పడిందనవచ్చు! ఆ పన్నెండు మందిలో ఒకరు టిడిపికి, మరొకరు బిజెపికి చెందిన వారు కాగా, మిగతా పదిమంది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన వారే. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలలో రాజీనామా చేసిన వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించారు తెలంగాణ ఓటర్లు. ఆ తీర్పు ఒక విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనకు బలం చే కూరిస్తే, మరో విధంగా రోశయ్య నాయకత్వంలోని బలహీనతలను బహిర్గతం చేశాయనాలి. ఆ మాటకొస్తే, రాజశేఖర రెడ్డి మరణంతో పార్టీ పరంగా కాంగ్రెస్, పాలనాపరంగా రాష్ట్రం "పటిష్టమైన నాయకత్వాన్ని" దాదాపు కోల్పోయిందనవచ్చు. ఒక వైపు తెలంగాణా ప్రజల్లో జాగృతి పెరగడానికి, మరోవైపు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి "ప్రత్యామ్నాయ నాయకుడు" గా ఎదగడానికి పరిస్థితులు అనుకూలించసాగాయి. అధిష్టానం అండదండలు పుష్కలంగా వున్న రోశయ్య, తన అపారమైన రాజకీయ అనుభవాన్ని ఫణంగా పెట్టినప్పటికీ, సంక్షోభాన్ని అధిగమించడంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

రాజకీయ రంగంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న మరో పరిణామం వై ఎస్ జగన్ చేపట్టిన "ఓదార్పు యాత్ర". వర్తమాన రాజకీయాల్లో, యావదాంధ్ర దేశంలో ఆబాలగోపాలం నోట జగన్ ఓదార్పు యాత్ర చర్చనీయాంశమైపోయినంతగా, బహుశా మరే అంశం కాలేదే మో! కారణాలే వైనా, ఆయన వెళ్లిన ప్రతి చోటా, విశేషంగా ప్రజాదరణ లభించింది. ముఖ్యమంత్రి హోదాలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లకుండా ఆంక్షలు విధించే ప్రయత్నాలు రోశయ్య చేసినా, ఫలితం కనిపించలేదు. ఆయన నాయకత్వ లోపానికి అది మరో నిదర్శనంగా మిగిలిపోయింది. చివరకు సాక్షాత్తు "కాంగ్రెస్ అధినేత్రి" బెదిరింపులకు కూడా లొంగని జగన్ వెంట చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రజాప్రతినిధుల మద్దతు లభించింది. చివరకు, పార్టీని-అధిష్టానాన్ని తప్పు పడుతూ, జగన్ తన పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, కనీవినీ ఎరుగని సవాలు విసిరారు. ఆధ్యతన భవిష్యత్ లో ఆ సవాలు కాంగ్రెస్ అస్తిత్వానికే ముప్పు తెచ్చే దిగా పరిణమించవచ్చు. 2010 లో రాజకీయంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా భావించాలి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరుగుతుందో-లేదో కాని, ఆ పేరుమీద జరుగుతున్న వుద్యమంలో భాగంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సాంస్కృతిక విభేదాలు కొట్టొచ్చినట్లు పొడచూపాయి. తెలంగాణ ధూమ్-ధాం, బ్రతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం. సినిమాలలో కూడా ఆంధ్ర తెలంగాణ విభేదాలు కనిపించాయి. ఒక ప్రాంతం వారికి చెందిన అంశాలకు సంబంధించిన సినిమాలను చేరే ప్రాంతం వారు బహిష్కరించే దాకా పోయింది కొన్ని సందర్భాల్లో.

వామ పక్ష వుద్యమం ఆంధ్ర ప్రదేశ్ లో క్రమేపీ బలహీన పడుతున్న సూచనలు ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా కనిపించ సాగాయి. భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం.

అయోధ్యలోని ఒకానొక చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న ఇచ్చిన చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పు ప్రభావం మిశ్రమంగా కనిపించింది. విశ్వాసాల ప్రాతిపదికగా, నమ్మకాల ప్రాతిపదికగా, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం ప్రాతిపదికగా, చారిత్రిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా, స్వాధీన అధీనం ప్రాతిపదికగా అనేకానేక పరిశోధనల సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పును పలువురు ఆహ్వానించారనే అనాలి.

మరి కొన్ని విశేషాలు చెప్పుకోవాలంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" గ్రహీత, ప్రముఖ సినీ దర్శక నిర్మాత-మానవతావాది-సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పిన కె. బి. తిలక్ సెప్టెంబర్ నెలలో చనిపోయారు. తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, "తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను, అందరికీ సుపరిచితుడైన మహాకవి శ్రీశ్రీ నూరేళ్ల విరసం మహాసభలు జరిగాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా-విలీనమా అన్న వాదనలు ఈ సంవత్సరం చోటుచేసుకున్నంతగా గతంలో ఎప్పుడూ లేదు. బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులను, మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి, పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మూడు రోజులు శారీరకంగా హింసకు గురిచేయడం పలువురిని విస్మయ పరిచింది.

మన రాష్ట్రంలో పుట్టక పోయినా ఇక్కడి అశేష ప్రజానీకం ఆదరాభిమానాలను చూరగొన్న మహామనిషి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ మృతి, పౌర హక్కుల నాయకుడు కన్నభీరన్ మృతి 2010 లో చోటుచేసుకున్న అత్యంత విషాదకరమైన సంఘటనలుగా పేర్కొనాలి.

మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ "అధినాయకి " సోనియా గాంధీని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజీనామా చేసిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైపు, కాంగ్రెస్ పార్టీతో సరి సమానమైన ప్రజా బలం వున్న తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మరో వైపు, ఏ క్షణం ఎలాంటి వ్యూహంతో-ఎత్తుగడలతో ఎదురు తిరుగు తాడో అర్థంకాని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె సి ఆర్ ఇంకో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, 2010 సంవత్సరంలో (ఆయన పాలన చేసిన సుమారు నెల రోజులు) ఇబ్బందులకు గురి చేస్తూనే వున్నారనాలి. జగన్ ఓదార్పు యాత్రలు, రైతు సంక్షేమ యాత్రలు, చివరకు రెండు రోజుల సామూహిక "లక్ష్య దీక్ష" కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సవాలు విసిరింది గత ఏడాది. అలానే, అంతకంటే ఎక్కువ మోతాదులోనే చంద్రబాబు నాయుడి ఆమరణ నిరాహార దీక్ష, దరిమిలా చెలరేగిన సంఘటనలు, గుంటూరులో నిర్వహించిన "రైతు కోసం" మహా సభ కూడా ముఖ్య మంత్రికి పెను సవాలే. విద్యార్థులపై వుద్యమాల సందర్భంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా శీతాకాలం శాసన సభ సమావేశాలలో డిమాండు చేసినా ఒప్పుకోని కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరాహార దీక్షకు దిగగానే ఒప్పుకోవడం 2010 సంవత్సరాంతంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రధాన అంశం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కాని, తదనంతర పరిణామాలు కాని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టక పోతే, 2010 లో సంభవించిన పరిణామాల కంటే తీవ్రమైన పరిణామాలు 2011 జరగడానికి ఆస్కారం వుండబోతుందన వచ్చు. అలా జరగ రాదని, అందరూ సంయమనం పాటించాలని కోరుకుంటూ, రెండువేల పది సంవత్సరానికి వీడ్కోలు... పదకొండుకి స్వాగతం పలుకుదాం.

Monday, August 16, 2010

"108-నూట ఎనిమిది సేవల" ఐదో వార్షికోత్సవం : వనం జ్వాలా నరసింహారావు


“రాజశేఖర రెడ్డి-రామలింగ రాజు” ప్రస్తావన లేని
108-నూట ఎనిమిది సేవల ఐదో వార్షికోత్సవం
వనం జ్వాలా నరసింహారావు
108 అత్యవసర సహాయ సేవల మాజీ కన్సల్టెంటు

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో, తనంతట తానే స్వయంగా వెల్లడిచేసిన అంశాల ఆధారంగా, లొంగిపోయి, పందొమ్మిది నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ రామలింగ రాజుకు, ఎట్టకేలకు, షరతులతో కూడిన బెయిల్ దొరికింది. బెయిల్ దొరికే ముందర, సీబీఐ న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్ షీట్ లో ఆయనపై మోపిన అభియోగాలకు లిఖిత పూర్వంగా ఇచ్చిన జవాబులో, తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని ఆయన పేర్కొన్న ట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఏదేమైనా విచారణ పూర్తయ్యేవరకూ నిజా-నిజాలు బయటపడవు. ఆయనకు బెయిల్ దొరకడానికి సరిగ్గా "ఐదు రోజుల క్రితం" ఆయన నెలకొల్పిన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో ఆరంభించి-పది రాష్ట్రాలకు వ్యాపించి-అంతర్జాతీయంగా భారత దేశానికి పేరు తెచ్చిన 108 అత్యవసర సహాయ సేవలు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా " ఐదో వార్షికోత్సవం" జరుపుకుంది. కాకపోతే, కోట్లాది రూపాయల విరాళాన్ని తన సొంత డబ్బులతో సమకూర్చి, కోట్ల విలువ చేసే భూమిని-భవనాలను ఆయన స్థాపించిన ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) కు ఇచ్చిన రామలింగ రాజు పేరు నామ మాత్రంగా కూడా ఆ ఉత్సవాల్లో ఎక్కడా వినిపించలేదు. ఆయన చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కానీ, అయన నియమించిన ఇ.ఎం.ఆర్.ఐ ముఖ్య కార్య నిర్వహణాధికారి కానీ ఆయనను కనీసం ఒక్కసారైనా ఆ సందర్భంగా గుర్తుచేసుకోక పోవడం శోచనీయం.

"కారే రాజుల్? రాజ్యముల్ గలుగవే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే?" అని బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో అన్నాడో లేదో కాని, తన గ్రంధంలో అలా-ఆ పాత్ర ద్వారా, బమ్మెర పోతన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జవాబు పోతన దగ్గరుందో లేదో కాని, తన జీవిత కాలంలోనే, తన "సిరి” ని (సంపద ఎలాగూ మహేంద్రా పరమైంది!) ఇతరులు మూట గట్టుకొని సమాజంలో (పేరు-ప్రతిష్టలతో) వెలిగి పోతుంటే, నిశ్శబ్దంగా కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని దీనస్థితిలో వున్న రామలింగ రాజు సమాజానికి ఎలాంటి ప్రశ్నలు సంధించగలడనేది రాయడం పోతన లాంటి వారి తరం కూడా కాదని అనాలి. ఒక చోట చేసిన (సత్యం కంప్యూటర్స్ విషయంలో చేశాడో లేదో ఇంకా తేలాల్సి వుంది) నేరానికి, ఇంకో చోట కూడా (108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి) చేయని నేరానికి శిక్ష విధించడం న్యాయమేనా? అదే జరుగుతుందిప్పుడు.

"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, దేశంలోని ప్రతి పౌరుడికి, అత్యవసర పరిస్థితుల్లో-ఎల్ల వేళలా, తక్షణ వైద్య సహాయం, నేరాల, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ కలిగించాలన్న ఆయన మహత్తర ఆశయాన్ని, ప్రభుత్వ ప్రయివేట్ పథకంగా మలిచి, ఆ సేవలను తొలుత మన రాష్ట్రంలో ఉచితంగా అందచేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరిస్థితీ అంతే అనాలి. 108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం నుంచి అమలు దాకా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు, అటు రాజు జైలుకు వెళ్లేంత వరకు, ఇటు రాజశేఖర రెడ్డి అకాల మరణం పాలయ్యేంతవరకు, త్రి కరణ శుద్ధిగా, ప్రయివేట్ పరంగా-ప్రభుత్వ పరంగా రాజు-రాజశేఖర రెడ్డి కృషిచేసిన విషయం, లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు దోహద పడే అత్యవసర సహాయ సేవల రూపకల్పన చేశారన్న విషయం, ఎవరిని అడిగినా చెబుతారు. కాకపోతే, ఆ సేవలను ప్రారంభించి అయిదేళ్లు పూర్తి చేసుకుని ఆగస్టు పదిహేనున వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి రోశయ్య మినహా ఒక్కరు కూడా వారిరువురి పేరు ప్రస్తావించక పోవడం దురదృష్టకరం. సభా ముఖంగా ప్రసంగం చేసిన సిఇఓ వెంకట్ తో సహా, ఏడాది క్రితం ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ కృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగానైనా వారి పేర్లను జ్ఞప్తికి చేసుకోకపోవడంలోని అంతరార్థం ఏమిటో? అసలింతకీ, ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకుంది ఆ సేవల ప్రారంభానికా? లేక ఆ సేవలను ప్రారంభించిన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆవిర్భావానికా? ఈ రెండింటికి కాదన్న రీతిలో కొందరు వక్తలు ప్రసంగించారు. "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ 108 అంబులెన్సు సేవలు ప్రారంభమై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమం" గా దీనిని అభివర్ణించడం విచారకరం.

హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్ లో జరిగిన "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ వార్షికోత్సవం" లో మాట్లాడిన సంస్థ చైర్మన్ జీవి కృష్ణారెడ్డి, ఐదేళ్ల కిందట 30 అంబులెన్సులతో ప్రారంభమైన 108 సేవలు, ప్రస్తుతం 752 కు చేరి, సుమారు డబ్బై వేల ప్రాణాలు కాపాడా మన్నారు. ఆ క్రమంలోనే, ఆయన, ఏ మహానుభావుడు ఆ సేవలను ప్రారంభించింది, ఎవరెవరి కృషి వల్ల 30 నుంచి 752 కు పెరిగింది (వాస్తవానికి మొత్తం అంబులెన్సులు 802) కొంచెమన్నా వివరించితే ఔదార్యంగా వుండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ చేస్తే ఇ.ఎం.ఆర్.ఐ సేవల బాధ్యతను స్వీకరించానని (తనంతట తానుగా ఇలాంటి మహత్తర సేవా కార్యక్రమం స్వీకరించే దాతృత్వ గుణం లేదని !) ఒప్పుకున్నందుకు అభినందించాలి ఆయనను. తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి రోశయ్య, 108 సేవలను రామలింగ రాజు సొంత నిధులతో ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించడానికి ప్రభుత్వ సాయం కోరిన విషయాన్ని, కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 95% వ్యయం భరించడానికి ఒప్పుకున్న విషయాన్ని, "సత్యం సంస్థ సమస్యల్లో వున్నప్పుడు" జీవీకే గ్రూప్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన విషయాన్ని వివరించి, రాజు ప్రస్తావన, రాజశేఖర రెడ్డి ప్రస్తావన తేకపోతే, జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ (చైర్మన్, సిఇఓ లతో సహా) తో పాటు అఖిలాంధ్ర ప్రజానీకం వారిద్దరినీ మరిచి పోయినట్లే అనుకోవాలి.

అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, వెంకట్ చంగవల్లి కూడా రామలింగ రాజు, రాజశేఖర రెడ్డిల ప్రస్తావన తేకుండా వార్షికోత్సవ ప్రసంగం చేయడం. 2005 కు పూర్వం అత్యవసర సహాయ సేవల గురించి కాని, అధునాతన అంబులెన్సుల గురించి కాని, 108 నంబర్ గురించి కాని, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల గురించి కాని, అంబులెన్స్ పైలట్ల గురించి కాని భారత దేశంలో ఎవరూ విని వుండరని చెప్పారే తప్ప, అవన్నీ కార్యరూపం దాల్చడానికి కారణ భూతులైన వారెవరో చెప్పకపోవడం బాధాకరం. కనీసం ఆయనైనా సంస్థ ఆవిర్భావం నాటినుంచి, నేటి దాకా, దాని వెనుక నున్న ఓ నలుగురైదుగురి పేర్లనన్నా "ఐదేళ్ల వార్షికోత్సవం" లో ప్రస్తావించినట్లతే బాగుండేదేమో ! వెంకట్ సంస్థ సిఇఓ బాధ్యతలు చేపట్టే నాటికే, ఏడాది పూర్తిచేకోవడమే కాకుండా, ఎన్ని రకాల పునాదులో వేయడం జరిగింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేంద్రం ఏర్పాటు, ప్రోటోకాల్స్ రూపకల్పన, అంబులెన్స్ డిజైన్ కు అంకురార్పణ లాంటి పలు విషయాల్లో పురోగతి అంతో ఇంతో జరిగింది. రాజు గారికి సహాయం చేసిన-సలహాలనిచ్చిన వారెందరో వున్న విషయం వెంకట్ కంటే ఇతరులకు ఎక్కువ తెలియదు. ఐదేళ్లకోసారి, పదేళ్లకోసారి జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో వారి నొక్క సారి జ్ఞప్తికి తెచ్చుకోవడం కనీస మర్యాద. రామలింగ రాజు సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చిన పూర్వ రంగంలో, ఆ తర్వాత కొంత కాలం, మీడియా ముఖంగా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు కంట తడి పెట్టిన వెంకట్ కనీసం ఆయన గురించి ఒక్క మాటన్నా చెప్పకపోవడానికి బలవత్తరమైన కారణం వుండి వుండాలి.

కార్యక్రమం ఆరంభంలో ఇ.ఎం.ఆర్.ఐ ప్రస్థానం పై చూపించిన వీడియో ఫిల్మ్ లో, రాజు గారి ప్రోద్బలంతో చైర్మన్ ఎమిరిటస్ గా కొంతకాలం వున్న కలాం సూక్తులను వినిపించగా లేంది, రాజు చెప్పిన ఒకటి-రెండు మాటలను వల్లె వేస్తే వచ్చిన ప్రమాదమేంటో వెంకట్ మాత్రమే చెప్పగలరు. ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగరాజు తన పదవికి రాజీనామా చేయడంతో, అంతవరకు ఆయన ఆహ్వానం మేరకు ఇ.ఎం.ఆర్.ఐ బోర్డ్ సభ్యులుగా వున్న వారిలో చైర్మన్ ఎమిరిటస్ గా వున్న మాజీ రాష్ర్ట్రపతి భారత రత్న ఏ.పీ.జె అబ్దుల్ కలాంతో సహా నలుగురు మినహా అందరూ రాజీనామా చేశారు. ఆపదలో ఆదుకోలేని వారి ఆప్త వాక్యాలు ఎవరికి కావాలి? కలాం వాక్యాలతో మొదలైన వీడియో చిత్రంలో, చూపించాల్సిన వాటిలో, దివంగత ముఖ్యమంత్రికి 108 అత్యవసర సహాయ సేవల అంబులెన్సులతో వున్న అనుబంధానికి సంబంధించిన ఒకటి రెండు అంశాలుంటే బాగుండేదేమో! రామలింగ రాజు "విజన్" గురించి ఒక నాడు పదే-పదే పలు సందర్భాల్లో ప్రస్తావించిన వెంకట్, ఈ నాడు తొమ్మిది రాష్ట్రాల్లో ఆ సేవలు లభ్యమవడానికి ఆ "విజన్" ప్రధాన కారణమన్న విషయం చెప్పి వుండాల్సింది. అప్పట్లో రాజీనామా చేయకుండా, ఇప్పటిదాకా గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణను వేదిక పైకి ఆహ్వానించి, కనీసం ఆయన ద్వారానన్నా అత్యవసర సహాయ సేవల ఆవిర్భావ-ఆరోహణల గురించి చెప్పించినట్లైతే బాగుండేది.

ఇవ్వాళ 108 అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కటి కూడా "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ" అవతారంలో వచ్చినవి కాదు. ఆ రాష్ట్రాలన్నీ రామలింగ రాజు చైర్మన్ గా వున్నప్పుడే ఆ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ ద్వారా పొందాయి. వాస్తవానికి, అలా పొందిన పది రాష్ట్రాల్లో (కారణాలు ఏవైనా) జీవీకే బాధ్యతలు స్వీకరించిన తర్వాత "రాజస్థాన్" ఉపసంహరించుకుంది. సేవల విస్తరణకు ఎవరు కారణమో చెప్పకపోయినా, ఉపసంహరణకు బాధ్యులెవరో చెప్పినా బాగుండేదేమో! వీటన్నింటి కన్నా గమనించాల్సిన విషయం, సంస్థ చూపించిన వీడియోలో, ఆగస్టు పదిహేను 2005 న ప్రప్రధమంగా అత్యవసర సహాయ సేవలు ఆరంభమైన సందర్భంలో (నేటి ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకోవడానికి కారణమైన రోజు!) తీసిన ఫొటోలో రామలింగ రాజు ఫొటోని "కవర్" చేసి చూపడం! ఆ నాటి ఆ ఫొటోలో దయానిధి మారన్, రాజశేఖర రెడ్డి, రోశయ్యల సరసన రామలింగ రాజు వున్నప్పటికీ, ఆ ఫొటోని జనవరి 9, 2009 కి పూర్వం వెంకట్ కొన్ని వందల-వేల సార్లు అనేక సందర్భాల్లో చూపించినప్పటికీ, ఐదేళ్ల వార్షికోత్సవంలో ఆయన్ను తప్ప అందరినీ చూపించారు. ఇంకా నయం మారన్ ను, రాజశేఖర రెడ్డిని కూడా కత్తిరించలేదు!

ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామ లింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు, వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు. రాజు ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి ఏడాదికి పైగా తోడ్పడిన వారిలో, ఆయనే స్థాపించిన హెచ్.ఎం.ఆర్.ఐ (104 సేవలు) సిఇఓ గా ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ బాలాజి, ఆరోగ్య-వైద్య సంబంధమైన విషయాల్లో కీలకమైన సలహాలనిచ్చిన డాక్టర్ ఎ. పి. రంగారావు, వెంకట్ కు పూర్వం సిఇఓ గా పనిచేసి మొదటి అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన వారణాసి సుధాకర్ లాంటి కొందరిని వార్షికోత్సవంలో గుర్తుచేసుకుంటే బాగుండేదేమో! వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. కనీస మర్యాదకోసమైనా రాజు కుటుంబ సభ్యులను ఆహ్వానించి వుండాల్సింది. రామలింగ రాజు పేరును రోశయ్య ప్రస్తావించగా లేని భయం సంస్థ చైర్మన్ కు, సిఇఓ కు ఎందుకుండాలనో వారికే తెలియాలి. బహుశా కావాలనే అలా చేశారే మో? "చీమల పుట్ట పాములపాలైనట్లు", ప్రస్తుతం వారెవరినీ అనుకున్నవారు లేకపోవడం దురదృష్టకరం. రామలింగ రాజు అంబులెన్స్ పైన తన పేరు గాని, తన సత్యం సంస్థ పేరు కానీ వుండాలని మాటమాత్రంగానైనా అనలేదు. ఇప్పుడేమో అవే అంబులెన్సులు ఒకరి సొంత ఆస్తిలాగా రోడ్లపై తిరుగుతున్నాయి.

Monday, August 9, 2010

కాంగ్రెస్‌లో ఎవరికి వారే, యమునా తీరే!-వనం జ్వాలా నరసింహారావు

-విభజించి పాలించే విధానం
-అధిష్ఠానాన్ని ఖాతరు చేయని రాష్ట్ర నేతలు
-సమ్మతి- అసమ్మతి ముఠాలు
-సీమాంధ్ర- తెలంగాణ విభేదాలు
-పార్టీని బలోపేతం చేసే దిశగా లేని చర్యలు
-ముదిరి పాకాన పడ్డ జగన్‌ వ్యవహారం

చివరికి, అనుకున్నది- అయినదీ ఒకటే అన్నట్లుగా ఉంది, నిన్న- మొన్న జరుగుతున్న సంఘటనలు విశ్లేషించి చూస్తే. జగన్‌ కాంగ్రెస్‌ను వదలక ముందే, ఆయనకు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారనేది బయ టపడక ముందే, అలా పోవాలనుకున్న వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ముందు కొచ్చారు చిరంజీవి. ఎలాగూ ఎంఐఎం అండ కాంగ్రెస్‌ పార్టీకి ఉండనే ఉంది. వాళ్లు మద్దతు ఇస్తామనడం బాగానే ఉంది కాని, రోశయ్య వెంటనే దానికి అంగీ కరించినట్లు మాట్లాడడమే కొంత అనుమానాలకు దారి తీస్తుందనాలి. ఒక వైపు తన ప్రభుత్వానికి ఏ ఢోకా లేదంటూనే, తక్షణం వచ్చిన ముప్పేమీ లేదంటూనే, ఔదార్యంతో ఎవరైనా మద్దతిస్తా మంటే తప్పకుండా తీసుకొంటామనడంలో అంతరార్థం మాత్రం- అసలు సిసలైన కాంగ్రెస్‌ వ్యవహార శైలిలోనే ఉందనాలి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో సంభవి స్తున్న పరిణామాలు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంతమాత్రం సాగడంలేదు.

ఆ పరి ణామాలకు ఫలానా వారే బాధ్యులనడం, ఫలానా వ్యక్తులనే ఎత్తి చూపడం సాధ్యం కాదు. శ్రీ కృష్ణ కమిటీకి అభిప్రాయం చెప్పి వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు- మంత్రులతో సహా, తెలంగాణ వాదులను దేశ ద్రోహులు గా అభివర్ణించడాన్ని టీఆరెస్‌తో సహా, కాం గ్రెస్‌ తెలంగాణ నాయకులందరూ తప్పు బట్టారు. తమది దేశ ద్రోహమైతే, తమ ఉమ్మడి నాయకురాలు సోనియా గాంధీదీ దేశ ద్రోహమే అనే వరకూ కాంగ్రెస్‌ జగడం సాగింది. ఇలా బాహాటంగా ఒకరి నొకరు విమర్శించుకున్నప్పటికీ, క్రమశిక్షణ చర్యలు మ్రాతం ఏ ఒకరిద్దరు కాంగ్రెస్‌ నాయకులకో పరిమితమై పోవడం గమ నార్హం. అయినా క్రమ శిక్షణకు, క్రమ శిక్షణా రాహిత్యానికి మారు పేరైన నూట ఇరవై అయిదేళ్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇవన్నీ మామూలే నంటున్నారు విశ్లేషకులు. సాక్షాత్తు రాజీవ్‌ గాంధీనే పార్లమెంటులో ఉరి తీయాలని అన్న వారికే కాంగ్రెస్‌ లో ఉన్న తాసనం వేయగా లేనిది, ఇతరుల క్రమశిక్షణ గురించి మా ట్లాడే అర్హత క్రమశిక్షణా సంఘానికి ఎక్కడిది అని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ వాది ప్రశ్నించే దాకా వెళ్లింది.

భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆంగ్లేయుల ‘విభజించి పాలిం చే విధానం’ వారసత్వంగా అబ్బిందనాలి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులతో సహా సాధారణ కార్యకర్తలకు కూడా అధిష్ఠానం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు రోశయ్య- జగన్‌ వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదు లుగా, ఇంకో దిక్కున ఒకే ప్రాంతంలోని సమ్మతి- అసమ్మతి ముఠాలుగా, ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధిష్ఠానం కూడా తన వంతు రెచ్చగొట్టే విధానం అవలంబి స్తున్నదేగాని, పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. కాకపోతే, అప్పుడప్పుడూ, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో- తాత్కాలిక శాశ్వతం గానో వేటు వేయడం జరుగుతున్నది. అంబటిపై తక్షణ చర్యైనా- పాల్వాయిపై అర్థంలేని మౌనమైనా, గోనె-యాష్కీల మధ్య తలదూర్చక పోవ డమైనా, రాయపాటి- కన్నా విభేదాలను నాన్చడమైనా, సర్వే- శంకర్రావులను పురిగొల్పడమైనా అధిష్ఠానం ఎత్తుగడల్లో భాగమేనేమో !

వైఎస్‌ జగన్మోహన రెడ్డి, ఏది జరిగినా తన మంచికేనన్న దృక్పథంతో, ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నాడు. ఈ సుదీర్ఘ యాత్రలో- చాలా భాగం సంయమనంతో ఉపన్యాసాలిచ్చినప్పటికీ, మనసులో మాట బయట పెట్ట దల్చుకున్నప్పుడు, వెనుకా-ముందు చూడకుండా మాట్లాడడం భవిష్యత్‌ సంకేతాలకు నిదర్శనమనవచ్చు. సహనం కోల్పోయే సమయం ఆసన్నమైందన్న సంకేతాలనూ ఇస్తున్నాడు. మొత్తమ్మీద జగన్‌ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఓదార్పు యాత్రలో ఆయనేం మాట్లాడాడన్నది ప్రధానం కానేకాదు. ఆయన వేరు కుంపటి పెట్టినా- పెట్టక పోయినా మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సంక్షోభంలో పడిపోతున్నదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఒక్కసారి ఓడితే మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఆ మినహాయిం ఉంది ఇంతవరకు. బహుశా ఇక ముందు ఇక్కడ కూడా, జాతీయ కాంగ్రెస్‌ మనుగడ ఏదో ఒక ప్రాంతీయపార్టీపై ఆధారపడే రోజు లు రాబోతున్నాయేమో!

ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయ కుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్‌ చేసిన వైనం కాంగ్రెస్‌ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేశాడన్న ఆరోపణతో రాంబాబును సస్పెండ్‌ చేసింది అధిష్ఠానం. అంతేకాదు, జగన్‌ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్‌ ధిక్కార ధోర ణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. అంత టితో ఆగకుండా జగన్‌ మరో వీరాభిమాని, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ కార్యదర్శి గట్టు రామచందర్రావుకు ఉద్వాసన జరిగింది. మరో జగన్‌ వీరాభిమాని కొండా సురేఖ- రోశయ్యను చేతకాని సీఎం అంటూ పత్రికలకెక్కారు. వీరందరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. వారిదే క్రమశిక్షణా రాహిత్యమంటూ అంబటి అండ్‌ కంపెనీ పత్రికలకెక్కింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు, అసంతృప్తి జ్వాల లు భారత కాంగ్రెస్‌ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుకు తెస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపో వడం, స్వగృహ ప్రవేశం చేసి- గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం వంటివి ఆది నుంచీ కనిపిస్తున్నవే. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు ఒకటయ్యా రని అంటారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పో యి, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతుల ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్‌ నాయ కులు పావులు కదిలించారు. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్‌ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీ యాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్య క్షుడయ్యారు.

1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల, విబి రాజుల మద్దతు నీలం సంజీవరెడ్డికి లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సివచ్చింది. నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగ డమే మంచిదని భావిం చిన జవహర్లాల్‌ నెహ్రూ, పథకం ప్రకారం యుఎన్‌ ధేబర్‌ స్థానంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా 1960లో నీలంను నియ మించారు. 1962 లో, ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి పంపారు. ఆయన వారసుడిగా 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ము ఠా రాజకీయాలకు తెర లేచింది.

ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమ ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానం లో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమ ర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత ఇందిర మంత్రివర్గంలో హోం మినిస్టర్‌ గా పని చేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌-ఐ)ని మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో కనీసం గెస్ట్‌ హౌజ్‌ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రిపదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభిం చేది. అసమ్మతి పుణ్యమా అని అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ను, 1989లో మరో పర్యాయం పీసీసీ అధ్యక్షుడుగా, గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైంది. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ముఖ్య మంత్ర య్యారు.

ఆయన్నూ ఉండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డా రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్‌ను అధికా రంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లుగా వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి.

Thursday, August 5, 2010

ముదిరి పాకాన పడుతున్న కాంగ్రెస్ రాజకీయాలు : వనం జ్వాలా నరసింహా రావు

ముదిరి పాకాన పడుతున్న కాంగ్రెస్ రాజకీయాలు
వనం జ్వాలా నరసింహా రావు

అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, ఆంగ్లేయుల "విభజించి పాలించే" విధానం నర-నరాన పాకిందంటే అతిశయోక్తి కాదే మో. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను గమనిస్తే, ఒకరిపై ఇంకొకరు దుమ్మెత్తి పోసుకునే స్థితికి దిగజారి పోయిందనాలి. అధిష్ఠానం అంటే కూడా భయం లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు రోశయ్య-జగన్ వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదులుగా-ఒకే ప్రాంతంలోని సమ్మతి-అసమ్మతి ముఠాలుగా-ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అధిష్ఠానం తన వంతుగా, వర్గాలను-విభేదాలను, అందులోని వ్యక్తుల ఇష్టానుసారంగా, ఒక్కోసారి ఒక్కో విధంగా రెచ్చగొట్టే విధానం అవలంబిస్తుంటుంది. అప్పుడప్పుడూ, తన మాటను మరీ ఖాతరు చేయడం లేదని భావించినప్పుడు, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో-తాత్కాలిక శాశ్వతంగానో వేటు వేయడం, ఆ తర్వాత అదంతా తమ సొంత ఇంటి వ్యవహారంగా పేర్కొనడం, అందరూ సర్దుకోవడం జరుగుతుంటుంది. అంబటిపై చర్యైనా, పాల్వాయిపై మౌనమైనా, గోనె-యాష్కీ మధ్య తలదూర్చక పోవడమైనా, రాయపాటి-కన్నాల విభేదాలను నాన్చడమైనా, అధిష్ఠానం ఎత్తుగడల్లో భాగమే.

వైఎస్ జగన్మోహన రెడ్డి, ఏది జరిగినా తన మంచికేనన్న దృక్ఫదంతో, ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నాడు. సుదీర్ఘ యాత్రలో, చాలా భాగం సంయమనంతో ఉపన్యాసాలిచ్చినప్పటికీ, మనసులో మాట బయట పెట్ట దల్చుకున్నప్పుడు, వెనుకా-ముందు చూడకుండా, మాట్లాడడం భవిష్యత్ సంకేతాలకు నిదర్శనమనొచ్చు. "సహనం కోల్పోయే సమయం" ఆసన్నమైందన్న సంకేతాలనూ ఇస్తున్నాడు. మొత్తమ్మీద జగన్ వ్యవహారం ముదిరి-ముదిరి పాకాన పడిందనే అనాలి. ఓదార్పు యాత్రలో ఆయనేం మాట్లాడాడన్నది ప్రధానం కానేకాదు. ఆయన వేరుకుంపటి పెట్టినా-పెట్టకపోయినా, మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సంక్షోభంలో పడిపోతున్నదనడంలో అతిశయోక్తి లేశ మాత్రం కూడా లేదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఒక్కసారి ఓడితే మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే ఆ మినహాయింపుంది ఇంతవరకు. దానికి కారణం ఇక్కడ ఇంతవరకు ఒకే ఒక్క బలమైన ప్రాంతీయ పార్టీ వుండడమే. బహుశా ఇక ముందు ఇక్కడ కూడా, జాతీయ కాంగ్రెస్ మనుగడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీపై ఆధారపడే రోజులు రాబోతున్నాయే మో ! అందుకే జగన్ ను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా వుండకపోవచ్చునేమో!

జగన్ అనుంగు సహచరుడిగా భావిస్తున్న కాపు వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్ చేసిన వైనం కాంగ్రెస్ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, చేయకూడని విధంగా, రాంబాబు విమర్శలు చేశాడన్న ఆరోపణతో ఆయన్ను సస్పెండ్ చేసింది అధిష్ఠానం. రాంబాబు సస్పెన్షన్ వ్యవహారంతో ఆగకుండా, వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్ ధిక్కార ధోరణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్టంగా వ్యక్తమైంది. అంతటితో ఆగకుండా జగన్ మరో వీరాభిమాని, కాంగ్రెస్ కిసాన్ సెల్ కార్యదర్శి గట్టు రామచంద్ర రావుకు ఉద్వాసన జరిగింది. మరో జగన్ వీరాభిమాని రోశయ్యను "చేతకాని సీఎం" అంటూ పత్రికలకెక్కింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠానం, పటిష్ఠమైన ఈ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని, అప్రయత్నంగానే వదులుకునే దిశగా అడుగులేస్తున్నదన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతుందనాలి.

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు బ్రిటీష్ ప్రభుత్వపు రౌలట్‌చట్టాన్ని నిరసిస్తూ "సత్యాగ్రహం" చేపట్టాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించినప్పుడు మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చి, మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపిస్తే, మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు గాంధీజీకి వ్యతిరేకంగా. జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్ తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్ లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ.

నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో, మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులు పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి, తిరిగి స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ కాంగ్రెస్ ముఠా రాజకీయాలే. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బెజవాడ గోపాల రెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు. అయినా ధిక్కార స్వరాలు ఆగిపోలేదు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారు. ఆ తర్వాత స్వగృహ ప్రవేశం చేసారంతా.

"ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం అవతరించిన తర్వాత ముఖ్య మంత్రి పదవికోసం పోటీ మొదలైంది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దరిమిలా ఆయన బలపడకుండా జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, యు ఎన్ ధేబర్ స్థానంలో, 1960 లో ఆయన్ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని "మినిస్టీరియలిస్టులు" అని, ఏసీ వర్గాన్ని "డిసిడెంట్లు" అని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా రాజకీయాలలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న1969-1971 మధ్య కాలంలో, సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన అలనాటి కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపించారు. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది. "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు) లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న వర్గం, సిండికేట్ పక్షానున్న వారిని "సామ్యవాద-లౌకికవాద" వ్యతిరేకులని ముద్రవేశారు. ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించిన ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.

ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిన ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ముల్కి కేసు తీర్పుపై పీవీ చేసిన వ్యాఖ్యల దరిమిలా పదవి కోల్పోయిన ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం, ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో "ఎమర్జెన్సీ హోం మినిస్టర్" గా పనిచేసిన "బ్రహ్మానంద రెడ్డి” కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.

అసమ్మతి పుణ్యమా అని, అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైంది. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.

నూటా పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి "స్వరాజిస్ట్ పార్టీ" లో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని "సిండికేట్" పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 12 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి "చేతితో" అధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో "ఏకాభిప్రాయం" అంటే, సోనియా గాంధి అనే "ఏక వ్యక్తి అభిప్రాయం" గా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం "విభజించి పెత్తనం సాగించడం" అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

Saturday, July 24, 2010

ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం :వనం జ్వాలా నరసింహారావు

ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుంగు సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్ చేసిన వైనం కాంగ్రెస్ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, చేయకూడని విధంగా, రాంబాబు విమర్శలు చేశాడన్న ఆరోపణతో ఆయన్ను సస్పెండ్ చేసింది అధిష్ఠానం. రాంబాబు వివరణ కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా సంఘం ఇచ్చిన గడువు ముగియక ముందే, హఠాత్తుగా సస్పెన్షన్ చేయాల్సిన కారణాలను మీడియాకు వివరించడంలో స్పష్టత లోపించిందనాలి. రాంబాబు సస్పెన్షన్ వ్యవహారంతో ఆగకుండా, వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్ ధిక్కార ధోరణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠానం, పటిష్ఠమైన ఈ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని, అప్రయత్నంగానే వదులుకునే దిశగా అడుగులేస్తున్నదన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతుందనాలి.

భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేసిన మితవాద భావాల "మాడరేట్ల" ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, 1907 లో పార్టీలో చీలి కొచ్చింది. మాడరేట్ల "కన్వెన్షన్" బాల గంగాధర తిలక్ ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించింది. వారంతా "నేషనలిస్ట్ పార్టీ" పేరుతో సమావేశమయ్యారు. అలా వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగింది. తిలక్ కారాగార శిక్ష పూర్తి చేసుకుని విడుదలై వచ్చేటప్పటికి, అయన్ను బహిష్కరించిన మాడరేట్లకు అనుచరులు లేకుండా పోయారు. రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ పై ఆయన ప్రభావం పడింది. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా "సత్యాగ్రహం" చేపట్టాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. దరిమిలా చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలది ధిక్కార స్వరమా? అభిప్రాయ భేదమా?

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. ఒకానొక సందర్భంలో, సుభాష్ చంద్ర బోసు కాంగ్రెస్ అధ్యక్షుడవడం ఇష్టపడని గాంధీజీ రాజీనామాకు సిద్ధపడడంతో, తనకంటే ఆయన సేవలే పార్టీకి శ్రేయస్కరమని భావించిన బోసు పార్టీని వదిలి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నారు. తనకిష్ఠమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్ తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్ లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్ఠమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్ కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్ లో ఆయన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించారు నెహ్రూ. అవన్నీ ఒక విధంగా గ్రూప్ రాజకీయాలే కదా ! పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించుకునే ప్రయత్నాలే కదా ! అసలు-సిసలైన అంతర్గత పోరాటం స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలైందనాలి.

1948-1950 మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా "జనగణమణ.." వుండాలా, "వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, నెహ్రూ ఎంత ప్రయత్నించినా, రాజ్యాంగంలో, "ప్రణాళిక, సామ్యవాదం" అన్న పదాలకు తావులేకుండా పటేల్ జాగ్రత్త పడ్డారు. జనవరి 26, 1950 న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్ కు ఆ పీఠం దక్కింది. ఆయన అధ్యక్షుడైన మరుక్షణం నుంచే, రాష్ట్రపతికి, ప్రధానికి వుండే అధికారాల-హక్కుల విషయంలో చర్చ మొదలైంది. ఒకవిధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. ఇంతలో పటేల్ చనిపోవడం, ఆయన చనిపోయిన పక్షం రోజుల లోపునే, నెహ్రూ అభీష్ఠం మేరకు, "ప్రణాళికా సంఘం" ఏర్పాటు కావడం జరిగింది. అయితే దానికి రాజ్యాంగ బద్ధత కలిపించకుండా, ఎగ్జిక్యూటివ్ బాడీ హోదా కలిగించడం విశేషం.

వల్లభాయ్ పటేల్ చనిపోవడంతో, టాండన్ కు చిక్కులు మొదలయ్యాయి. ప్రధానిగా వున్న నెహ్రూ టాండన్ కు వ్యతిరేకంగా తన నిరసన తెలియచేసేందుకు, పార్టీ పదవులన్నిటి కీ రాజీనామా చేశారు. దేశానికి నెహ్రూ వల్ల కలిగే మేలు ఎక్కువని భావించిన టాండన్, స్వచ్చందంగా, అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. వెంటనే సమావేశమైన వర్కింగ్ కమిటీ, నెహ్రూను ఆయన స్థానంలో ఎన్నుకోవడంతో, పార్టీ పదవి-ప్రధాని పదవి ఒకే వ్యక్తి చేపట్టారు. నెహ్రూ మద్దతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. మద్రాస్ రాష్ట్రం విషయంలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని రెండుండేవి. మొదటిది చెన్నైలోను, రెండోది విజయవాడలోను పనిచేస్తుండేవి. అప్పట్లో నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారని అంటారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదే-పదే "ఆ రెండు పత్రికలు" అన్న రీతిలోనే, ఇంచుమించు అదే అర్థం వచ్చే విధంగా, తనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు, ఒక పత్రిక సంపాదకుడు వరుసగా రాసిన ఐదు సంపాదకీయాలను "పంచ మహా పాతకాలు" గా ప్రకాశం పంతులు వర్ణించారు. 1950 లో జరిగిన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో నెహ్రూ మద్దతున్న సంజీవరెడ్డి చేతిలో ఎన్జీ రంగా ఓడిపోయారు. దరిమిలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న నినాదం పుంజుకుంది. ఇంతలో 1952 ఎన్నికలొచ్చాయి. రాజగోపాలా చారి మద్రాస్ ముఖ్య మంత్రయ్యారు. ఆంధ్ర మంత్రుల్లో చాలామంది ఓడిపోవడంతో, విద్యాధికుడైన దామోదరం సంజీవయ్యను, నెహ్రూ సలహామీద, మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజాజీ. జస్టిస్ శ్రీకృష్ణ కమీషన్ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా రాకపోతే "అంతర్యుద్ధం" తప్పదని కేసీఆర్ హెచ్చరిక చేసిన విధంగానే, అప్పట్లో అదే మాటను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయంలో, ప్రకాశం పంతులు ఉపయోగించారు.

అప్పట్లో నీలం సంజీవ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా, అల్లూరి సత్యనారాయణ రాజు ప్రధాన కార్యదర్శి గా, కాసు బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లా పరిషత్ బోర్డ్ చైర్మన్ గా వున్నారు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న సమయంలో, రాజధాని ఎక్కడ వుండాలన్న సంగతి మద్రాస్ శాసనసభలోని ఎమ్మెల్యేలు నిర్ణయించాల్సి వచ్చింది. ఎన్జీ రంగా తిరుపతి కావాలంటే, రాయలసీమలో వుండాలని ఎవరూ అనలేదు. ఏర్పాటు కాబోయే ఆంధ్ర రాష్ట్రం, తాత్కాలికమే నన్న రాజాజీ, ఒక్క రోజు కూడా మద్రాస్ రాజధానిగా వుండడానికి ఒప్పుకోలేదు. పైగా అంతా కాంగ్రెస్ వారే. అందరివీ ధిక్కార స్వరాల కాంగ్రెస్ రాజకీయాలే. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. తాత్కాలికంగా కర్నూల్ ను రాజధానిగా ఎంపిక చేశారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్ ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా కృషిక్ లోక్ పార్టీకి నాయకుడప్పట్లో.

శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్ నాయకులు పావులు కదిలించారు. అడుసుమల్లి సుబ్రహ్మణ్యం శాసన సభకు రాకుండా ఒక వర్గం ప్రణాళిక వేసింది. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో "కుల రాజకీయాలు" బహిర్గతం కావడం కూడ ఆరంభమయ్యాయనవచ్చు. కమ్యూనిస్టు అభ్యర్థులపై పోటీకి దిగడానికి వెనుకంజ వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి కుల రాజకీయాల అవసరం కలిగింది. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవ పున్నయ్యను కూచిన పూడిలో ఓడించడానికి వ్యూహాత్మకంగా, గౌడ కులానికి చెందిన అనగాని భగవంత రావును ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు. అయినా ధిక్కార స్వరాలు ఆగిపోలేదు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. అప్పట్లో ఆ ముగ్గురి ని "బుర్రకథ దళం" అని ముద్దు పేరుతో పిలిచేవారట. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా, 1956 లో విశాలాంధ్రగా "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చేసినాయన, తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తి కింద ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. ఒప్పుకోకపోతే, ధిక్కార స్వరాలు వినిపించే వే ! 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. మళ్లీ ధిక్కార స్వరాలు వినిపించాయి. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి " కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదని" అన్నారు. అదే రోజుల్లో జాతీయ స్థాయిలో రామ మనోహర్ లోహియా స్థాపించిన "సోషలిస్ట్ పార్టీ” లో, రాష్ట్రానికి చెందిన పివిజి రాజు చేరారు. వారూ-వీరూ ఏకమై "సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ" గా అవతరించి, నీలంకు వ్యతిరేకంగా పనిచేశారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1957-59 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన యు ఎన్ ధేబర్ స్థానంలో, 1960 లో ఆయన్ను నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో ఎవర్ని ముఖ్య మంత్రి చేయాలన్న విషయంలో మళ్లీ పోటీ మొదలైంది. అల్లూరి సత్యనారాయణ రాజు కాని, కాసు బ్రహ్మానందరెడ్డి కాని ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలున్నప్పటికీ, ఇరువురి లో ఎవరినీ కాదనలేని పరిస్థితుల్లో, అధిష్ఠానం ఆశీస్సులతో, వారిద్దరి మద్దతుతో, రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను పీఠం ఎక్కించారు. తనకు మద్దతిచ్చిన అల్లూరికి-కాసుకు, పి డబ్ల్యు-ఆర్థిక శాఖలను కేటాయించారు సంజీవయ్య. వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మర్రి చెన్నారెడ్డి స్థాపించిన డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బొమ్మ కంటి సత్యనారాయణ రావు అప్పట్లో సంజీవయ్యకు మద్దతుగా చక్రం తిప్పారు. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. రాష్ట్ర రాజకీయాలకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్న నీలం సంజీవరెడ్డి అప్పట్లో దూరంగా వుండేవారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. అంతకుముందే అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీని, 1962 ఎన్నికల్లో, కాంగ్రెస్ లో విలీనం చేశారు మర్రి చెన్నారెడ్డి ప్రభృతులు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు. ధిక్కార స్వరాలకు కొంతకాలం తెర పడింది.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని "మినిస్టీరియలిస్టులు" అని, ఏసీ వర్గాన్ని "డిసిడెంట్లు" అని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. ఏసీ సుబ్బారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేకాటలో, టెన్నిస్ క్రీడలో స్నేహితులైనా, రాజకీయాల్లో విరోధులే. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. అప్పట్లో, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైన శీలం సిద్దారెడ్డికి కాసు అండదండలుండడంతో, మరో నాయకుడు జలగం వెంగళ రావు పరోక్షంగా తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో మొదలవడానికి ప్రోత్సాహం ఇచ్చారంటారు. అదో రకమైన ధిక్కారం. ఇక చెన్నారెడ్డి నాయకత్వంలో హింసా మార్గంలోకి పోయిన తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానందరెడ్డిని, ఆయన భార్యను బాహాటంగా కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో ఎలా దూషించిందీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి గతంలో మాదిరిగానే, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

పీవీ మంత్రివర్గంలో పనిచేసిన జలగం వెంగళ రావు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ధిక్కార ధోరణి ప్రదర్శించిన వాడే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కి కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో "ఎమర్జెన్సీ హోం మినిస్టర్" గా పనిచేసిన "బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్" లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఏమైందాయన ధిక్కార స్వరం? ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.

నూటా పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి "స్వరాజిస్ట్ పార్టీ" లో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని "సిండికేట్" పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 12 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి "చేతితో" అధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో "ఏకాభిప్రాయం" అంటే, సోనియా గాంధి అనే "ఏక వ్యక్తి అభిప్రాయం" గా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం "విభజించి పెత్తనం సాగించడం" అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

Saturday, June 19, 2010

IX-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-9) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-9
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న మీడియా అభివర్ణించిన "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ కు ఫోన్ చేసి, మరి కాసేపట్లో తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?). సుమారు రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి, బాలాజి-వారణాసి-రంగారావు లాంటి వారి తోడ్పాటుతో లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ సంస్థగా నెలకొల్పి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టి, (దివంగత) ముఖ్యమంత్రి సమక్షంలో దానికి అనుగుణమైన అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయించి, అపారమైన అనుభవజ్ఞుడు వెంకట్ ను సీ.ఇ.ఓ గా నియమించి, లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు 15, 2005 న ప్రారంభించడానికి రామ లింగరాజు చేసిన కృషిని ఏనాడో-ఒకనాడు ఆయన మాటల్లోనే తెలుసుకోవాలి గాని, ఇతరులకు వర్ణించడం సాధ్య పడదు.

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు. కాకపోతే, ఊహాజనిత సమాధానాలు అన్వేషించి 108-అత్యవసర సహాయ సేవల "ఒడిదుడుకులకు" వాస్తవ కారణాలను అంచనా వేయొచ్చు. ఆ ప్రయత్నమే ఇది.

ఈ నేపధ్యంలో రాజు గారి ఆందోళనను అర్థం చేసుకోవాలి. సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన "భవిష్యత్ దర్శనం-విజన్" కు అనుగుణంగా సేవలు వ్యాపించడంతో ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. నాకు గుర్తున్నంతవరకు అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. గుజరాత్ రాష్ట్రాన్ని పొందడానికి మేం ఆ ప్రభుత్వం వెంట పడితే, ఇతర రాష్ట్రాలు మా ద్వారా అత్యవసర సహాయ సేవలు పొందడానికి మా వెంట పడసాగాయి ఆ తర్వాత. తిరిగి కొంతకాలానికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది అనేక కారణాలవల్ల. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. క్రమేపీ నెలకొంటున్న సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఇప్పుడా రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. జవాబు దొరికేలోపుల రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి తన జీ. వి. కె సంస్థ నుంచి (మీడియాలో సీ.ఇ.ఓ వెంకట్ చెప్పిన లెక్కల ప్రకారం) రు. 50 కోట్లకు పైగా సమకూర్చినట్లు తెలుస్తోంది.

ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి కారకులైన వారు, కనీసం ఒక్క విషయంలో నన్నా తక్షణ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని-అంతగా అత్యవసరం లేని-ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. అలా చేసిన ఖర్చు "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ ఎదుర్కుంటున్న "ఆర్థిక పరమైన ఒడిదుడుకులను" విశ్లేషించడానికి కేవలం దానికున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది. "ఆలస్యం అమృతం విషం" అన్నారు పెద్దలు.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. తెలిసో-తెలియకో, సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతికి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ఎవరిదో వారు వివరించాల్సిందే.

కష్టాలన్నీ ఒక్క సారే వస్తాయన్నది ఇ.ఎం.ఆర్.ఐ విషయంలోనూ జరిగింది. రాజు గారి నిష్క్రమణం కన్నా ముందే "అంబులెన్స్ యాక్సెస్ ఫౌండేషన్", "ట్రాన్స్ పరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్" అనే రెండు సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల పూర్వ రంగంలో అవకతవకలు జరిగాయని-ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా గుర్తించే విషయంలో పోటీ పద్ధతిని పాటించలేదని ఆరోపిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాయి. అవి తమ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను, కౌంటర్ అఫిడవిట్లలో వివిధ రాష్ట్రాలు వాటికిచ్చిన సమాధానాలను, సుప్రీం కోర్ట్ నోటీసుకు సంబంధించిన అంశాలను మరో సందర్భంలో వివరంగా తెలుసుకుందాం. ఇ.ఎం.ఆర్.ఐ ని ఉపయోగించుకుని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారన్న ఆరోపణతో ఒక "చోరీ కేసును" కూడా రామ లింగరాజు పై పెట్టడం జరిగింది అదే రోజుల్లో. ఈ ఆరోపణలను ఖండిస్తూ కూడా సమాధానం ఇచ్చింది సంస్థ. అదే రోజుల్లో న్యూ ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న "నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి)", ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పక్షాన, ఏప్రిల్ 2009 లో నిర్వహించిన అధ్యయనంలో, అధిక శాతం ఇ.ఎం.ఆర్.ఐ సేవలను కొనియాడుతూనే సంస్థా పరమైన లోటుపాటులను కూడా ఎత్తి చూపింది. ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి చెప్పిన మంచిని మరిచిపోయిన మీడియా ఎత్తి చూపిన లోటుపాటులను మాత్రం భూతద్దంలో ప్రదర్శించి మరీ కథనాలు ప్రచురించింది. అధ్యయన కమిటీ చెప్పిన విషయాలను వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం.

వీటి వల్ల లాభం-నష్టం ఎంతవరకు జరిగిందో-జరగబోతుందో ఏమో కాని, మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమవుతూ వార్తలొచ్చాయి. ఫలితంగా సీ.ఇ.ఓ వెంకట్ జనవరి 18, 2009 న పాత్రికేయులను ఆహ్వానించి సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన వివరణతో సమస్య చాలావరకు తాత్కాలికంగా సమసి పోయినా అనుమానాలు పూర్తిగా వీడలేదు. కష్టాలన్నీ ఒక్క సారే వచ్చినా వెంకట్ గారు ధైర్యాన్ని-స్థైర్యాన్ని కోల్పోలేదు. జనవరి 8, 2009 నుంచి, మే 26, 2009 వరకు ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకున్న పటిష్టమైన కార్యాచరణ పథకం ప్రకారమే ఆయన ముందుకు సాగారు. తనతో పనిచేస్తున్న సీనియర్ ఇ.ఎం.ఆర్.ఐ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులుండడంతో, భవిష్యత్ పై వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు నిరంతరం పాటుపడేవారాయన. అందులో భాగంగా మార్చ్ నెల 25, 2009 న, ప్రొఫెసర్ రంజన్ దాస్ తో చక్కటి శిక్షణా సంబంధమైన ఉపన్యాసాన్ని సీనియర్లకు ఇప్పించారు వెంకట్. ఆయనా పాల్గొన్నారందులో. భవిష్యత్ లో ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేస్తున్న ప్రతి "లీడర్" ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి, ఎలా సంస్థకు నిధుల సమీకరణలో తోడ్పడాలి, ఒక లక్ష్యంతో-ధ్యేయంతో ముందుకెలా సాగాలి అన్న సందేశం ఆ శిక్షణా కార్యక్రమానికి హాజరైన మా అందరిలో బలీయంగా నాటుకు పోయింది. "వ్యూహం అంటే ఏమిటి-వ్యూహ రచన ఎలా వుండాలి-పోటీని ఎలా ఎదుర్కోవాలి" లాంటి అంశాలపై రంజన్ దాస్ విశ్లేషణను మరో సందర్బంలో తెలుసుకుందాం.

వెంకట్ ఎదుర్కొన్న కష్టాల్లో అతి కీలకమైంది, "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". అదంత తేలికయిన విషయం కాదు. ఒక వైపు మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, ఇంకో వైపు సుప్రీం కోర్టులో కేసు, మరో వైపు మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, ఒక్కోసారి కింది స్థాయి ఉద్యోగులకు కూడా విశ్వ ప్రయత్నం చేసినా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో భాగంగా కనీసం పదికి పైగా సంస్థలను తడిమి చూశారు వెంకట్. అందులో చాలామంది, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో సరైన పారదర్శకత లేదని, కార్పొరేట్ గవర్నెన్సుకు ప్రాధాన్యత లేదని... ఇలా అసందిగ్ధమైన ఆరోపణలు చేసి తప్పుకున్నారు. మరికొందరిని "ఇంటి వాసాలు లెక్క పెట్టే తరహా మనుషులు" పనిగట్టుకుని మరీ తప్పు దోవ పట్టించారు. వెంకట్ గారు తలుపు తట్టిన సంస్థల్లో బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్, వారెన్ బఫర్ ఫౌండేషన్ లాంటివి కూడా వున్నాయి. బహుశా ఆయన "ఎక్కని-దిగని గడప లేదే మో !". పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

ఇక్కడొక విషయం చెప్పాలి. జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడి వుండవచ్చు గాని తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. నాకు అర్థమయినంతవరకు-అర్థం చేసుకున్నంతవరకు, రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు వెంకట్ గారు. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డి గారిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా వెంకట్ కు చేరి వుండాలి. జనవరి 21, 2009 న తాజ్ కృష్ణా హోటల్ లో వెంకట్ గారితో నేను కూడా వెళ్ళి డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశాం. పరిస్థితి వివరించి సంస్థను గట్టెక్కించమని కోరాం. నేను డాక్టర్. మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పౌర సంబంధాల అధికారిగా పనిచేశానని, ఆ సమయంలో చాలా సందర్భాల్లో డాక్టర్. జీ.వి.కె. రెడ్డి గారిని కలిశానని ఆయనకు గుర్తుచేశాను. ఆయన జ్ఞాపక శక్తికి నిజంగా జోహార్లు. అప్పటి సంగతులు ఆయన చాలా గుర్తుకు చేసుకోవడమే కాకుండా, చెన్నారెడ్డి గారిని బాగా పొగిడారు. జీ.వీ.కె మా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారుగాని, ఆయన హైదరాబాద్ లో లేనందున కుదర లేదు. ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారిని ఉదయమే వెళ్లి కలిశాం. పిరమల్, ఆయన కుమారుడు, వెంకట్, నేను కలిసి వెళ్లాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య గారు. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, సరిగ్గా మే 23, 2009 న వెంకట్ కు ఫోన్ చేసి, "పారదర్శకత-కార్పొరేట్ గవర్నెన్సుకు సంబంధించిన అస్పష్ట అంశాలను" పేర్కొని, ఆ నెపం మీద తమ నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి గారు ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు.

పిరమల్ అధినేత, ఆయన కుమారుడు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య గారిని కలిసినప్పుడు, (బహుశా) ఫోన్లో డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో (ఆయన జరిపిన చివరి సమీక్షా సమావేశంలో) మాట్లాడినప్పుడు లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి. ఈ కీలకమైన అంశం గురించి వివరంగా ముందు-ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Sunday, June 13, 2010

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల (మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?:వనం జ్వాలా నరసింహా రావు

గవర్నర్లలో ఇక నుంచి రెండు రకాల
(మంచి-చెడ్డ) వారుండ బోతున్నారా?
వనం జ్వాలా నరసింహా రావు

ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు తాను నియమించి-శాఖలను కేటాయించిన నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, పరిణితి చెందిన 86 గ్రామాల సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రభుత్వం చేసే ప్రతి పని గవర్నర్ పేరు మీదే జరగడం రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఆ ప్రకరణను కొంచెం విస్తరించి, బహుశా రాష్ట్ర గవర్నర్, ఇక నుంచి కేవలం నామ మాత్రంగా తన పేరుమీద కాకుండా, తానే-తన పర్యవేక్షణలోనే, ప్రజా సంక్షేమం గురించి స్వయంగా పర్యటనలు చేయబోతున్నారన్న అర్థం ఆయన మాటల్లో గోచరిస్తున్న ది. గవర్నర్ పేరుపై సాగే దే రాష్ట్రంలోని పాలనని, నెలకు మూడు రోజులు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానని, సర్పంచులు పంచాయితీలను దత్తత తీసుకోవాలనీ, నిర్మల్ పురస్కార గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దాలనీ అనడమే కాకుండా, ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కూడా చేశారు నరసింహన్. ఆయన ఉద్దేశం సమాంతర ప్రభుత్వం నడపడమో, లేక, "తన ప్రభుత్వం" నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు "అనుబంధంగా-అభినందనగా" (సప్లిమెంటరి-కాంప్లిమెంటరి) మరో మార్గంలో ప్రజల క్షేమం పట్టించుకోవడమో అయ్యుండాలి. రెండు పద్ధతులూ, రాజ్యాంగ పరిమితులకు-సాంప్రదాయాలకు లోబడి వున్నంతవరకు, అభిలషణీయమే.

కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍ గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆ కాలంలో నాలుగు సంవత్సరాల పాటు చేతనకు నేను అడ్మినిస్ట్ర్రేటివ్ అధికారిగా-ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసాను. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

గత సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు ముఖ్యమంత్రి రోశయ్యా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి రోశయ్యను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? రోశయ్యకు సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం. రాజ్యాంగం రీత్యా ముఖ్యమంత్రిని-ఆయన మంత్రివర్గ సహచరులను నియమించిన గవర్నర్ కు, పాలనా సంబంధమైన కొన్ని లోపాలు కలవర పడే విధంగా వుండి ఉండాలి ! అలాంటప్పుడు, పరిపాలనా వ్యవహారాలలో ఎదురవుతున్న అనేకానేక ఇబ్బందుల జోలికి పోకుండా, కేవలం, ముఖ్యమంత్రి అధికారాలేంటి ? గవర్నర్ అధికారాలకు పరిమితులేంటి? గవర్నర్ పాత్ర ఏంటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించ తగునా? అన్న విషయాలనే పదే-పదే ప్రస్తావించి, కొందరు రాజకీయ నాయకులు వారి పరిమిత దృష్టిని ప్రదర్శిస్తున్నారు ఇటీవల. కొంతకాలం క్రితం గవర్నర్ కేంద్రానికి రహస్యంగా నివేదిక పంపించారని (ధృవీకరించుకోకుండానే) ఆయన మీద నిప్పులు చెరిగారు. అలా పంపించడం ఆనవాయితీగా జరిగేదేనని, అందులో వింతేమీ లేదని తెలిసిన మేధావులు కూడా గవర్నర్ నరసింహన్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకులై తే మరీ రెచ్చిపోయారు. ప్రతి పక్షాల వారే మో, ఆయన రహస్య నివేదికను బహిర్గతం చేయాల్సిందేనని డిమాండు చేశారు. చివరకు కొన్నాళ్లకు సమస్య సమసిపోయింది.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! కాకపోతే, 1995 లో అలాంటిదే జరిగినప్పుడు, ఆ పనిచేసిన నాటి గవర్నర్ కృష్ణకాంత్ కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు సహకరించారు. గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు నెల కొన్న ప్రత్యేక పరిస్థితులు, తనను ప్రజల వద్దకు తరచుగా పోయేందుకు ప్రేరేపిస్తున్నాయని గవర్నర్ భావిస్తుండవచ్చు. ఆలానే, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని కూడా గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో రాష్ట్రంలో పర్యటిస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. (గవర్నర్) ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు సంబంధించిన వివరాలు, గవర్నర్ కు తెలిసి వుండాల్సిన అవసరం వుంది. దాని మూలాన, ఆయనకు రాష్ట్రంతో పరిచయం పెంచుకోవడం తేలికవుతుంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు తన చేతనైన సహాయం చేసే వీలుకూడా కలుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో, రాజకీయ అస్థిరత్వం ఏర్పడి (ఇప్పుడు ఏర్పడనున్నదని ఉద్దేశం కాదు !), రాష్ట్రపతి పాలన విధించి, గవర్నర్ పాలనా యంత్రాంగాన్ని నడపాల్సి వస్తే ఆ పరిచయం తోడ్పడుతుంది. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. అమలవుతుందో, లేదో, వేచి చూడాలి. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

రాజ్యాంగం సంక్రమింప చేసిన అధికారాలను-బాధ్యతలను, అనేక సందర్భాల్లో, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అనిపిస్తోంది. "ఆర్థిక అత్యయిక పరిస్థితిని" కొన్ని రాష్ట్రాలలో అమలు చేయాల్సిన సందర్భంలో కూడా మౌనం వహించింది ప్రభుత్వం. అలా చేయడం వల్ల, కొన్ని రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ ?) యధేఛ్చగా, ఆర్థిక దోషాలకు పాలపడుతున్నాయి. వాస్తవానికి కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక ప్రగతికి అవరోధం కూడా ఏర్పడుతుందనాలి. గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెల రోజుల క్రితం "రహస్య నివేదిక" పంపడం వాస్తవమైతే, ఆ చర్యను విమర్శించకుండా, ఆయనను రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడానికి వీలు కలిగేలా చేయాలి. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు. కాకపోతే, "నేను మంచి గవర్నర్ ను కాను.. చెడ్డ గవర్నర్ ను" అని అనకుండా వుండాల్సింది గవర్నర్ నరసింహన్. మంచి-చెడులు ప్రజలే నిర్ణయిస్తారు.(End)