Showing posts with label శ్రీకృష్ణ కమిటీ. Show all posts
Showing posts with label శ్రీకృష్ణ కమిటీ. Show all posts

Thursday, December 13, 2012

కాలయాపనకే అఖిల పక్షాలు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
          
తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. తదనంతరం అఖిల పక్ష సమావేశాలూ జరిగాయి. ఇంతవరకూ ఏమీ తేలలేదు. మళ్లీ అఖిల పక్ష సమావేశ మంటున్నారు. అసలా మాటకొస్తే ఆ కమిటీ చేసిందంతా అఖిల పక్ష సమావేశాలే కదా? విస్తృత స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమైన తరువాతే నివేదిక ఇచ్చినప్పుడు మళ్లీ అఖిల పక్ష సమావేశం కావాల్నా?

నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని” అనడం కన్నా, బాధ్యత తీసుకునే ముందే, తమకంతగా చేతకాని బాధ్యత నెత్తిన వేసుకుంటున్నామని అనుకుంటే బాగుండేదేమో. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? తేల్చనప్పుడు-తేల్చలేమని గుర్తించినప్పుడు, ఆ సంగతే చెప్పాలి కాని, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం ఎంతవరకు సబబు? పైగా తాము చెప్పలేని దానికి, పోనీ పదే-పదే చెప్తూ వస్తున్న దానికి (అందరికీ ఆమోద యోగ్యమైన నివేదిక ఇస్తాం!) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగంలోని సూక్తులను పేర్కొనడం ఒక తెలివైన ఎత్తుగడ తప్ప మరోటి కాదు. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? సూచన-ఐదుకు ప్రభుత్వం అంగీకరించితే అది సమైక్య వాదులకు అపజయమే కదా! సూచన-ఆరుకు ఒప్పుకుంటే, ఇటు తెలంగాణ కోరుకునే వారికి, అటు సమైక్య వాదులకు అపజయమే కదా! జవహర్లాల్ నెహ్రూ చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చేకూరుస్తున్నామని చెప్పడం తగునా?


          నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. మహాభారత యుద్ధం పూర్వ రంగంలో, కౌరవ-పాండవ యుద్ధం నివారించడానికి శ్రీకృష్ణుడు హస్తినకు రాయభారానికి వెళ్లినట్లు వర్ణించడం జరిగినా, వాస్తవానికి, యుద్ధాన్ని ఖాయం చేసేందు కొరకే వెళ్లాడనే ది జగమెరిగిన సత్యం. అదే జరిగింది శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో కూడా. ఏభై నాలుగేళ్ల ఆంధ్రా నిలువెత్తు దోపిడీకి నిదర్శనంగా నేటికీ మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతం వారు చేయబోయే ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం. మరో విధంగా చెప్పాలంటే, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల న్యాయమైన కోర్కె సమంజసమని-సమర్థించాలని మనసులో వున్నా, చేసిన ఆరు సూచనలలో వద్దనుకుంటూనే నాలుగు సూచనలు విభజనకు సంబంధించినవి కావడం విశేషం. అంటే, విభజన సమస్య పరిష్కారానికి సరైన మార్గమని ఆయనకు తెలిసినా అసంబద్ధమైన విభజనలను మొదలు సూచించి, చివరకు అసలు సిసలైన రాయభారం తరహాలో... ఐదూళ్లిచ్చిన చాలును... అన్న చందాన పనికిమాలిన సూచనతో సహా, అసలు సిసలైన ఒకే ఒక్క సూచన చేశారు. ఆయన చెప్పిన విధంగా, ఐదో సూచనకు అనుగుణంగా తప్ప, వేరే రకంగా విభజనకు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. "అనివార్యమైతే - అంతా ఒప్పుకుంటేనే పరిశీలించాలి" అని కమిటీ వ్యాఖ్య చేసిన "రాష్ట్రాన్ని సీమాంధ్ర-తెలంగాణగా విభజించి... హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం" అన్న దానికి ప్రభుత్వం ఒప్పుకుని, దానికి అనుగుణమైన చర్యలు చేపట్టి తేనే, బహుశా మహాభారత యుద్ధం లాంటిది నివారించవచ్చేమో! శ్రీకృష్ణ కమిటీ సభ్యులంతా "మనసా-వాచా" తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైందని భావించినా, "కర్మనా" అనుకూలంగా లేకుండా-ప్రతికూలంగా కాకుండా తీర్పు లాంటి సూచన ఇవ్వడం అన్యాయం లాంటిదే!
          
ఒక వైపు సూచనలు చేస్తూనే అవే సూచనలు "ఆచరణ యోగ్యమైన వి కావు" అని అనడం కూడా ఎంతవరకు సబబు? "కలిసి ఉండటమే ఉత్తమం" అంటూనే, అదే "అత్యుత్తమమైన మార్గం" అని చెప్తూనే, సమైక్యాంధ్రకు అనుకూలమైన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణలో నిరసనలు తప్పక పోవచ్చని, పలు ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతుందని వ్యాఖ్యానించడంలోని ఆంతర్యం ఏంటి? సమైక్యంగా వుండడానికి తెలంగాణ ప్రాంతం వారు అంగీకరించ రనే కదా? అంటే శ్రీకృష్ణ కమిటీ మనసులోని మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదా? ఇంకొంచెం లోతుగా నివేదికను విశ్లేషిస్తే,"అనివార్యంగా రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని, సీమాంధ్ర సొంత రాజధానిని అభివృద్ధి చేసుకునే దాకా హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని" మరో సూచన కనిపిస్తుంది. ఇది కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందనాలి కదా? ఏదేమైనా, ‘‘ఇదేమంత అభిలషణీయమైన పరిష్కారం కాదు. అయినా సరే అనివార్యంగా విభజించాల్సి వస్తే అది మూడు ప్రాంతాల ప్రజల ఆమోదంతో జరగాలి’’ అని చెప్పకనే చెప్పింది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభుత్వానికి". ఇతర సూచనలకు కూడా "తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది" అని కమిటీ అభిప్రాయ పడడమంటే, నర్మ గర్భంగా తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పడమే కదా? కాకపోతే, ఎందుకో, ఏ కారణానో, "సందిగ్ధత లేని" తరహాలో మనసులో మాట చెప్పడానికి జంకింది శ్రీకృష్ణ కమిటీ.
          
మొదటి నాలుగు సూచనలలో “ఆచరణసాధ్యం కాని” ఒక సూచన, తెలంగాణలో ఒప్పుకోనందున “అసాధ్యమని భావించిన” మరో సూచన, ఏ ప్రాంతం వారికి “ఆమోదయోగ్యం కాని” ఇంకొక సూచన, నక్సలిజం పెరగడానికి అవకాశమున్నందున-ఏకాభిప్రాయం సాధ్యం కానందున “పనికి రాని” ఒక సూచన చేసిన కమిటీ, మిగిలిన రెండు సూచనలు సార్వజనీన సమ్మతమైన వని చెప్పడానికి సాహసించలేదు. ఒకటి పరిశీలనకు తగిందిగా, మరొక టి సమస్యలకు దారి తీసే దిగా కమిటీ మాటల్లోనే స్పష్టమవుతోంది. "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం-చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం" ఏబై సంవత్సరాల క్రితం చెప్పి వుంటే కొంతైనా అమలయ్యేదేమో కాని ఇప్పుడు అత్యంత అసాధ్యమైన విషయం. 1956 లో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తితో "తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు" చేయమని సూచించడం కన్నా తిరోగమన మార్గం లేదనాలి. ఇన్నేళ్లు జరగంది, ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం భవిష్యత్ "సీమాంధ్ర నాయకులు" ఎన్ని రాజ్యాంగ భద్రతలు కలిగించినా, తెలంగాణ ప్రజల్లో కలిగించడం జరగని పని. చట్టబద్ధమైన సంప్రదింపులను ప్రాంతీయ మండలి నిర్వహించడం కాని, ప్రాంతీయ మండలికి-రాష్ట్ర ప్రభుత్వానికి-శాసనసభకు మధ్య ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు... “గవర్నర్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ” ని ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం కాని ఎండమావుల లాంటి ఆలోచనలు. తెలంగాణ ఏర్పాటై, తెలంగాణకు చెందిన వారు ముఖ్యమంత్రి కావాలనుకునే తెలంగాణ ప్రజలకు, తమ ప్రాంతం వాడే మో "కేవలం కేబినెట్ మంత్రిగా" మిగిలి పోవడం ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కానే కాదు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు కేటాయించడం జరుగు తే, ప్రాంతీయ మండలి అధ్యక్షుడి హోదా ఏం కావాలి? బహుశా ఆచరణ యోగ్యం కాని సూచనలలో అగ్ర భాగాన నిలిచే సూచన ఇదేనేమో!
          
అన్నింటి కన్నా ఘోరమైంది, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా నామినేటెడ్ పోస్టులో నియమించబడిన గవర్నర్ కు, ఈ ప్రతిపాదన ద్వారా విస్తృత అధికారాలను కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.
          
శ్రీకృష్ణ కమిటీ మాటల్లోనే, తెలంగాణ-సీమాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించడం, అత్యధిక తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించినట్లన్న భావన వుంది. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం కూడా కమిటీ చెప్పింది. "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైతేనే" రాష్ట్ర విభజన జరగాలని కమిటీ అభిప్రాయపడడం, పరోక్షంగా, అలాంటి పరిస్థితులు కలుగుతాయని హెచ్చరించడమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన జరగకపోతే, ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది. "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని” అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం అని సూచన చేసింది. (…”Likelihood of the agitation continuing in case the demand is not met-unless handled deftly, tactfully and firmly as discussed under option six-consideration has to be given to this option.)
          
రాష్ట్ర విభజన చేసేందుకు నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగంలోని మూడవ ప్రకరణం కింద చెప్పిన విధంగా, ముందుకు సాగితే మంచిదని కూడా కమిటీ సూచించింది. అంటే, రాష్ట్ర రాజకీయ నాయకులతో సంప్రదింపులు అనవసరం అన్న భావన వుంది కదా! ఎలాగూ చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటనలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయిందని స్పష్టంగా చెప్పారు. కమిటీ అదే సూచించింది. ఇంకెందుకు ఆలశ్యం? పార్లమెంటులో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి-దాని ఎన్డీఏ మిత్ర పక్షాలు సమర్థించడం ఖాయం కనుక, ఆ దిశగా అడుగులు వేస్తే అందరికీ మేలు.ఇంకా అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం అనవసరం!

Wednesday, December 28, 2011

తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా!: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (29-12-2011)

     కిరణ్‌ వైపే మొగ్గిన అసంతృప్తి వాదులు; ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న కిరణ్‌; ఎటూ తేల్చని శ్రీకృష్ణ కమిటీ; మరో వివాదాన్ని తెచ్చిన బ్రజేష్‌ తీర్పు; న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావం; కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఆంధ్రులకు అన్యాయం; అరబ్‌ ప్రపంచాన్ని కుదిపివేసిన తిరుగుబాట్లు - ఎడిటర్

          ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు, అన్ని రంగాలలో కాకపోయినా, కనీసం రాజకీయ రంగంలోనైనా, గత ఏడాది కోడి కొంచెం ముందే కూసింది. తన రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో, నిత్య "అసంతృప్తి వాది" గా ముద్రపడినప్పటికీ, ఏనాడూ, భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడే సాహసం చేయని వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యం పూరించలేక పోయిన నేటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్థానంలో, గత ఏడాది (2010) చివరలో-నవంబర్ నెలాఖరులో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. నెల తిరిగే కల్లా 2011 సంవత్సరానికి స్వాగతం పలికాం. అప్పటివరకూ కనీసం మంత్రిగా ఒక్కసారైనా పనిచేయని కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికను జీర్ణించుకోలేక పోయారు పలువురు కాంగ్రెస్ నాయకులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానంలో నూట ఏబైమందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోదలిచిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరిక తీరలేదు. ఆయన కోరిక తీరనందుకు ఆయనకంటే ఎక్కువగా ఆయన వీర విధేయులు కలతచెందారు. అలా కలతచెందిన వారిలో, అలనాటి మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులున్నారు కూడా. వారిలో కొందరు, రాజ్యాంగపరంగా చేయాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవడానికి ఒకింత విముఖత చూపించారు కూడా. ఐతే, కాలం-కర్మం కలిసి రాకపోవడంతో, అలా విముఖత చూపిన వారే, తమ మంత్రి పదవికి ఎక్కడ ఎసరొస్తుందనే భయంతో, ఒక్కరొక్కరే, కిరణ్ కుమార్ రెడ్డి పంచన చేరడం మొదలెట్టారు. ఏ వీర విధేయతను వారంతా జగన్ పట్ల చూపించారో, అదే వీర విధేయతను, అంచలంచలుగా ముఖ్యమంత్రి పట్ల చూపించసాగారు. "తప్పటడుగులు" వేసి తమ గుప్పిట్లో చిక్కకపోతాడా ముఖ్యమంత్రి అని భావించిన పలువురికి ఆశాభంగం కలిగింది. కొంత "తడబడుతూ అడుగులు" వేసినప్పటికీ, రోజులు-నెలలు గడుస్తున్నా కొద్దీ, అత్యంత "ఆత్మవిశ్వాసం" తో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన ఆధిపత్యాన్ని అన్ని విధాలా నిలుపుకోవడం 2011 రాజకీయ సంవత్సరం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసి, తదుపరి ప్రక్రియ జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల 2010 సంవత్సరానికి సంబంధించినంతవరకు, ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు అప్పజెప్పిన పని సులభమైంది కాదనిఅన్నారు. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? అనేది ప్రశ్నార్థకం. ఒక విధంగా చెప్పాలంటే, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం జరిగింది. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? జవహర్లాల్ నెహ్రూ  చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చే కూరుస్తున్నామని చెప్పడం తగునా? నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం.
          "కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమయింది 2011 సంవత్సరం.
ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది
కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం 2011 జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.
మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ఆవిర్భవించడం, ఆ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల మద్దతుండడం గమనించ దగ్గ విషయం. ఈ సంస్థ మార్గదర్శకాలకు, ఇంతవరకూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఎన్‌బీయేసంస్థ ఆదేశాలకు వ్యత్యాసం ఏమేరకుంటుందో చూడాలి. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు. మన రాష్ట్రంలో ఆవిర్భవించిన తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్స్వయం సంయమనం పాటించే దిశగా చర్యలు తీసుకుంటే అభినందించాల్సిందే. వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ బాధ్యతను, రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల చొరవతో ఆవిర్భవించిన తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్చేపడ్తుందని ఆశించుదాం.
జనవరి 19, 2011 న చేసిన కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ అన్యాయం జరిగింది. ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది. ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలో అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది. అదే మరో మారు జరిగింది 2011లో కూడా. ఒకసారి కాదు, రెండు సార్లు.
నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈజిప్ట్ ప్రజల, అందునా యువకుల, పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం, ఆ దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసింది. ముప్పై సంవత్సరాల హోస్నీ ముబారక్ పాలనకు చరమ గీతం పాడిన దేశ పౌరులకు, వారి చిరకాల వాంఛైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడే విషయమా, లేక, మరికొంత కాలం సైనిక పాలనే కొనసాగనున్నదా అనేది ఇప్పటికీ చెప్పడం కష్టమే. తిరుగుబాటు అనంతరం పాలనను చేపట్టిన ఈజిప్ట్ మిలిటరీ నాయకులు, త్వరలోనే రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుతామని, ప్రజల న్యాయమైన హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని, ముబారక్ కాలం నుండి అమల్లో వున్న "అత్యవసర చట్టాన్ని" తొలగించుతామని బహిరంగంగా ప్రకటించి కూడా ఏడాది కావస్తోంది. పౌర పాలన స్థాపనకు శ్రీకారం చుట్టి, ప్రజలెన్నుకున్న నాయకుల కింద పనిచేసేందుకు సైన్యం అంగీకరించుతుందా, లేక, మరో మిలిటరీ నియంత పాలనకు కనీసం ప్రయోగాత్మకంగానన్నా దోహదపడుతుందా అనే విషయం ఇంకా తేలాల్సి వుంది.
లిబియాలో అధికారంలో ఉన్న గడాఫికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17, 2011 న మొదలైన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంది. ఇరవై మూడేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తునీషియా అధ్యక్షుడు జినే బెన్ అలీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. బహరైన్ లోనూ పరిస్థితి తీవ్రతరమయింది. యెమెన్ లో కూడా ప్రభుత్వ మార్పిడి కోరుతూ ప్రజలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ మార్గాన్నే 41 సంవత్సరాల కల్నల్ గడాఫి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు. పెట్రోలియం నిల్వలతో-ఉత్పత్తులతో సంపన్న దేశాల జాబితాలో చేరిన లిబియా దేశాన్ని తన ఉక్కు పిడికిలిలో బంధించిన గడాఫి, చివరకు అమెరికా కుట్రలో భాగంగా అసువులు కోల్పోయాడు. ఇటీవలి కాలంలో అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న తిరుగుబాటులకు, గతంలో సైనిక తిరుగుబాటులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తిరుగుబాటుల వల్ల నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశాలు అప్పూడూ-ఇప్పుడూ లేవు. ఆ దేశాల్లో సైనికులు ప్రభుత్వాలను పడగొట్టడానికి నూతన మార్గాలను ఎంచుకున్నట్లు కనబడుతున్నది. ఉన్న నియంతకు వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పి, వారిని గద్దె దింపి, ఆ స్థానంలో అధికారం పొందడమనే వ్యూహం వుందా అన్న ధోరణిలో అక్కడి తిరుగుబాటులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నెలకొననంత వరకు తిరుగుబాటు చేసిన ప్రజలకు వారు కోరుకున్నది లభించనట్లే. ఇదిలా వుండగా, అరబ్ ప్రపంచాన్ని అస్థిర పరచడానికి, అమెరికా పన్నిన కుట్రలో భాగంగానే, ఆయా దేశాల్లో తిరుగుబాటులు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యమైనా-నియంతృత్వమైనా, రాబోయే ప్రభుత్వాలు తన కనుసన్నలలో మెలగాలని అమెరికా పన్నాగమని విశ్లేషకులనుకుంటున్నారు.
(మరిన్ని మిగిలాయింకా)

Monday, October 24, 2011

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?: వనం జ్వాలా నరసింహా రావు

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

(నమస్తే తెలంగాణ: 25-10-2011)

వనం జ్వాలా నరసింహా రావు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో, నూతనోత్సాహంతో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, నాటి నుంచి నేటి వరకు, పూర్తిగా అహింసాయుత మార్గంలో, ఆబాలగోపాలం తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో అంచలంచలుగా ఉదృతమై, ఊపందుకుంటున్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర పాలక పక్షాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ, ఆ మాటకొస్తే ఏ నియంతృత్వ దేశంలోనూ జరిగుండదు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రాంతంలోని ప్రజల-ఓటర్ల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకంటే ఎక్కువ వున్నప్పటికీ, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు, తెలంగాణకు మద్దతిచ్చే నాయకులను కలుపుకు పోవాలన్న వ్యూహంతో, 2004 ఎన్నికలలో రాష్ట్ర ఏర్పాటును తప్పక వ్యతిరేకిస్తాడని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి నాయకత్వాన (రాష్ట్రంలో) వున్న కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ అధిష్టానాన్ని నమ్మారు. కేంద్రంలో మంత్రి పదవిని అంగీకరించారు. నమ్మక ద్రోహం జరిగిందాకా పదవిలో కొనసాగారు. తాను పదవీ త్యాగం చేశారు. తన ఎమ్మెల్యేలతోను, రాష్ట్ర మంత్రులతోను రాజీనామాలు చేయించారు. ఇటు తెలంగాణ ప్రజలకు, అటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఏలుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి తన, తన పార్టీ వాళ్ల నిబద్ధతను ఎరుక పరిచారు. ఏం చేసినా ఆయననుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించలేక పోయారు. ఆయన ఎంపీ పదవికి ఎన్నిసార్లు రాజీనామా చేసి, మళ్లీ గెలిచినా, ఎవరికీ కనువిప్పు కాలేదు. తెలంగాణ ఏర్పాటు కాలేదు.

మళ్లీ ఎన్నిక లొచ్చే దాకా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, కాశీ-రామేశ్వరం మజిలీ కథలాగా కాసేపు, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందాన మరి కాసేపు సాగింది. తెలంగాణ వచ్చినా, రాకపోయినా, కనీసం కాంగ్రెస్ లోని తెలంగాణ వాదులకు కనువిప్పు కలగడానికి కెసిఆర్ వ్యూహం ఫలించిందనవచ్చు. 2009 ఎన్నికలలో, తెలుగు దేశంతో (మహా కూటమితో) మరో రకమైన వ్యూహాత్మకంగా చేతులు కలిపారు కెసిఆర్. సీట్లెన్ని వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే, ఈ సారి, తెలంగాణ తెలుగుదేశం వారిలో చలనం కలిగింది. పైకి చంద్రబాబు నాయుడి మాటలకు వంతపాడినా, టిడిపి తెలంగాణ వాదుల్లో కొంతలో కొంతైనా జ్ఞానోదయం కలిగిందనక తప్పదు. ఎన్నికలలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మళ్లీ కనుమరుగైంది. మరో ఉద్యమానికి తెర లేపక తప్పని పరిస్థితులు దరిమిలా కలిగాయి.

టిడిపి లోని తెలంగాణ మద్దతు దారులతో సహా, బిజెపి, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా ఉద్యమంలో దూకాయి. మరికొన్ని భావ సారూప్యతగల పార్టీలూ పుట్టుకొచ్చాయి. ఉద్యమించాయి. ఐనా తెలంగాణ రాలేదు. కెసిఆర్ ప్రయత్నాలు, ఆయనదైన శైలితో ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఇంతలో రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఆయన స్థానంలో పైకి తటస్థంగా, లోపల సమైక్యానికి అనుకూలంగా, దేని కీ ఇదమిద్ధంగా మద్దతు తెలియ చేయలేని రోశయ్య ముఖ్య మంత్రి అయ్యారు. మళ్లీ తెలంగాణ కథ మొదటికొచ్చింది. అస్థిర ప్రభుత్వం పాలనలో, కెసిఆర్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. నవంబర్ 2009 లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి రాక తప్పని పరిస్థితులొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్నట్లు చిదంబరంతో (కపట) ప్రకటన చేయించింది కేంద్ర ప్రభుత్వం. దీక్ష విరమించారు కెసిఆర్. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల బెదిరింపు రాజీనామాలు మొదలయ్యాయి. (అన్ని పార్టీలకు చెందిన) తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. మళ్లీ చిదంబరం మరో ప్రకటన. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (ఇద్దరు మినహా) ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే అంగీకరించబడ్డాయి. మరో ఆలశ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో, వస్తుందనుకున్న తెలంగాణ, ఎప్పుడో ఒకప్పుడు రాకపోతోందా అన్న మజిలీకి చేరుకుంది. ఓపికతో కమిటీ ప్రక్రియను స్వాగతించారు తెలంగాణ కోరుకునేవారు కూడా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

తెలంగాణాకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనుకున్న శ్రీకృష్ణ కమిటీ, గోడమీద పిల్లి వాటంగా, ఏమీ చెప్పకుండా దాటవేసింది. అది సేకరించిన సాక్ష్యాధారాలు నిబద్ధతతో పరిశీలించినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి వుండేది. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో కూడా తెలంగాణ రాలేదు. వస్తుందన్న నమ్మకం కలిగే విధంగా కేంద్రంలో ఈ వ్యవహారాన్ని ఒక "పార్ట్ టైమ్ జాబ్" లాగా చూస్తున్న చిదంబరం, అఖిల పక్షం సమావేశం అంటూ కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయసాగాడు. ఎన్నడో వేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ అసలా సంగతే మర్చిపోయింది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పర్యవసానంగా, రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి పీఠాన్ని అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కను చూపు మేరలో లేకుండా పోయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కూడా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రాంత ప్రభుత్వోద్యోగులు సమ్మె చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఏవో కొన్ని హామీలు ఇచ్చి అప్పట్లో సమ్మెను విరమింప చేసింది ప్రభుత్వం. మిల్లీనియం మార్చ్ కూడా రాష్ట్ర సాధన దిశగా ఫలితం కలగలేదు. ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, ఆత్మ హత్యలు, ఉద్రిక్తతలు ఎన్ని చోటుచేసుకున్నా తెలంగాణ రాలేదు.

కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా-బింకంగా-మొండి ధైర్యంతో గమనిస్తోందే కాని, నిర్ణయం తీసుకోవడంలో మాత్రం పురోగతి కనిపించలేదు. రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల మంది శాసన సభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రావు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. పార్టీలకు అతీతంగా-లాయల్టీలకు అతీతంగా, రాజీనామా చేసిన వారున్నారు. కాంగ్రెస్ వారిలో, అందరి కంటే ముందే రాజీనామా చేసింది జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ. ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో, రాజకీయ-రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే దిశగా, వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల, వాటి ఆమోదం అంత కష్టం కాకూడదనుకున్న ఎమ్మెల్యేలకు ఆశాభంగమే మిగిలింది. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

సమష్ఠి బాధ్యతా రాహిత్యం, సమన్వయ లోపం, అసమర్థ నాయకత్వంతో, పీకల లోతుకు మునిగి పోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్ ప్రభుత్వం దాని సారధి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఏ విషయంలోను ఒక విధానం అంటూ లేకుండా, ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకుండా ఇలా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నాయకత్వానికి, విధాన పరంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి, కీలకమైన విషయాలలో తమ విధానం ఇదంటూ పాలక పార్టీ ప్రకటించ లేక పోవడానికి, ప్రతి పక్ష పార్టీల సూచనలు-సలహాలు పాటించక పోవడానికి, వందల ఉదాహరణలు పేర్కొనవచ్చు. మధ్యలో ఏకాభిప్రాయమంటూ మరో వాదన లేవదీసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమస్యను, తన రాజకీయ అవసరాల కొరకు, చంద్రబాబు నాయుడి ఆధిపత్యాన్ని, పలుకుబడిని ఎదుర్కొని, ఎన్నికలలో విజయం సాధించడానికి, 2004 ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని గులాం నబీ ఆజాదులు, చిదంబరాలు, ప్రణబ్ ముఖర్జీలు, వారి అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మరిచిపోయారో? ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా వున్న అభిప్రాయం కలిగించారు ఇటువంటి చిదంబరాలు, ఆజాదులు. ఆనాడు ఏకాభిప్రాయంతోనే ఆ పని చేశారా? ఆ నాడు సీమాంధ్ర నాయకులను సంప్రదించే ఆ పని చేశాడా చిదంబరం, ఆజాద్? అప్పుడు గుర్తుకురాని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకు గుర్తుకు రావాలి? తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదిక్కడ ముఖ్యం. మాట మార్చే అలవాటే చిదంబరం నైజం అనడం ఇక్కడ ప్రధానం.

పోనీ, యుపిఎ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు ఏకాభిప్రాయం గుర్తుకు రాలేదా చిదంబరానికి? డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేయడానికి ముందర కాని, దరిమిలా చేసిన ప్రకటనప్పుడు కాని ఏకాభిప్రాయం మంచిదన్న భావనే కలగలేదా? వాస్తవానికి, డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు జరిగింది అన్ని పార్టీల ఏకాభిప్రాయం కాదా? ఒకనాడు శాసన సభలో చేసిన తీర్మానం ఏకాభిప్రాయం కాదా? ఒక రాష్ట్రంలోని ఒకటికి మించిన ప్రాంతాల ప్రజలు-ప్రజా ప్రతినిధులు నిలువుగా-అడ్డంగా-ఏటవాలు గా చీలిపోయినప్పుడు, ఎవరి సిద్ధాంతంతో వారు పట్టుదలగా వున్నప్పుడు, ఏకాభిప్రాయం నెపంతో, వారి మధ్య వైషమ్యాలు పెంపొందించడం కేవలం మాట మార్చేవారికి మాత్రమే సాధ్యపడుతుందని అనక తప్పదు. దొంగ... ఎదుటివారిని "దొంగ..దొంగా" అని అరిచి, తన దొంగతనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లే, తన పార్టీ మధ్యనే ఏకాభిప్రాయం సాధించలేని చిదంబరం, తెలుగుదేశం పార్టీని, దాని నాయకుడు చంద్రబాబు నాయుడునీ తప్పుబట్టడం మరీ హాస్యాస్పదం. ముందు తన తప్పు ఒప్పుకుని, ఇతరులు తప్పు చేశారంటే అర్థముంటుంది కాని, ఇతరులది తప్పు-తనది ఒప్పు అనడం ఎంతవరకు భావ్యం? ఇరు ప్రాంతాల వారికి వీలై నన్ని తక్కువ అభ్యంతరాలతో సమస్యను పరిష్కరించాలి తప్ప, ఏకాభిప్రాయం పేరుతో, దీర్ఘకాలికంగా వాయిదా వేసుకుంటూ పోతే, దొరికే ది పరిష్కారం కాదు కదా...మరిన్ని సమస్యల తోరణాలు మాత్రమే!

ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెతో నన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదా అన్న ధీమాతో, ప్రపంచ చరిత్రలో ఎవరూ కనీ-వినీ ఊహించని రీతిలో, ఉద్యమించారు తెలంగాణ ప్రజలు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమ్మెతో ప్రభుత్వానికి దిమ్మ తిరిగిందే కాని అసలు సమస్యను పరిష్కరించాలన్న ఇంగిత జ్ఞానం మాత్రం కలగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఏ సకల (తెలంగాణ) జనులకొరకు తాము ఇబ్బందులకు గురైనా సమ్మెకు దిగారో, ఆ సకల జనులే ఇబ్బందుల పాలవుతుంటే, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, పాఠశాలల-కాలేజీల సిబ్బంది సమ్మెను విరమించుకున్నారు (వాయిదా వేసుకున్నారు). రైలు రోకోలు, సార్వత్రిక బందులు ఏవీ కూడా ప్రభుత్వంలో చలనం తెప్పించలేక పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! ఈ నేపధ్యంలో, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవడానికి తెరాస అధినేత కేసీఆర్, మరో పర్యాయం ఆమరణ నిరాహారదీక్షకు దిగవచ్చనే వార్తలు కూడా వచ్చాయి.

ఇంకేం చేస్తే తెలంగాణ వస్తుంది? తెలంగాణ ప్రజలంతా ప్రతిరోజూ, ఏదో ఒక నిర్ణీత సమయాన, ఎవరింటి ముందర వారు వీధుల్లోకి వచ్చి ముక్త కంఠంతో ఢిల్లీ దాకా వినిపించేటట్లు తెలంగాణ ఏర్పాటు కావాలని నినాదాలు చేయాల్నా? ప్రతి తెలంగాణ వాది తన వంతు విరాళంగా నెలకు కనీసం ఒక్క రూపాయన్నా ఇచ్చి నెలకింత అని (నాలుగైదు కోట్ల రూపాయలు?) తెలంగాణ ఇచ్చిందాకా అధిష్టానానికి అధికారికంగా "ముడుపు" చెల్లించాల్నా? ప్రతివారం కనీసం కొన్ని లక్షల సంఖ్యలో ఒక్కో తెలంగాణ వాది దగ్గర నుంచి ఓ కార్డు ముక్క సోనియా గాంధీకి పోస్టు చేద్దామా? పోనీ ఇలాంటివే ఇంకేమన్నా మార్గాలు వెదుకుదామా?

కాదూ కూడదంటే సీమాంధ్ర ప్రభుత్వాన్ని బహిష్కరించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని మనం ఏలు కుందాం.

Tuesday, March 8, 2011

"తెలంగాణ" వైకుంఠ పాళి": వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన అధినేత్రి వ్యూహం;
సొంత పార్టీ వారే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న వైనం
శాసన సభలోనూ అదే పరిస్థితి;అప్పుడే తెలంగాణ ఏర్పడే పరిస్థితి లేదన్న సంకేతం
మళ్ళీ మొదటికి వచ్చిన ఆట!;తెలుగు దేశంలో మరో కుంపటి

చిన్నతనంలో వైకుంఠపాళి ఆట ఆడనివారు అరుదుగా వుంటారు. ఆ ఆటనే "పరమపద సోపాన పటం" అని కూడా కొందరనేవారు. ఇక ఇప్పటి ఆంగ్ల మాధ్యం పిల్లలు "పాముల-నిచ్చెనల" ఆట అంటున్నారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది ఆడడానికి అందరికీ ముఖ్యంగా కావాల్సింది, ఒక అట్టపై కాని, లేదా చిన్నగా ఉండే బోర్డుపై కాని, రంగు రంగుల గళ్ళతోనన్నా-నలుపు, తెలుపు రంగులలో నన్నాతయారు చేసిన పటం. ఆ పటం పెట్టడానికి పావులు-ఆడడానికి గవ్వలు. ఈ ఆటలో 1 నుంచీ 100 వరకూ అంకెలు, అడ్డు వరుసకు 10 గళ్ళ చొప్పున, నిలువుగా పది వరుసలు వుంటాయి. ఈ పటంలో అక్కడక్కడా పాములూ, నిచ్చెనలూ వ్యాపించి ఉంటాయి. పావు చేరుకున్న గడిలో పాము తల ఉంటే, దాని నోట బడి మింగడంతో, ఆ గడి నుంచి పాము తోక ఉన్న కింది గడి దాకా పావు దిగుతుంది. పావు పడిన గడిలో నిచ్చెన కింది చివర ఉంటే, అది నిచ్చెన ఎక్కి, పై చివర వరకూ చేరుకోవచ్చు. పాము నోట్లో పడకుండా-దాటుకుంటూ, నిచ్చెనలు ఎక్కు కొంటూ, 100వ గడికి ముందుగా చేరుకున్నవారు ఆటలో విజేత. నూరవ గడికి చేరుకునే ముందు కూడా, చిట్ట చివరి గడి వరకూ వ్యాపించి ఉండే అతి పెద్ద పాముండే ఏర్పాటు వైకుంఠపాళి ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడడం తెలిసిన ప్రతి వారికీ, అందునా చిన్నా-పెద్దా పాముల బారిన పడి ఓడిన వారికి, చాకచక్యంగా ఆడి నిచ్చెనలను అధిరోహించుకుంటూ పైకెదిగి, గెలవబోతున్నామనుకున్న సమయంలో, "అతి పెద్ద పాము" నోట బడి, మళ్ళీ ఆట మొదలెట్టిన వారికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడొస్తుందో ఊహించడం అంత కష్టం కాదు. బహుశా గత కొద్ది రోజుల పరిణామాలు నిశితంగా గమనించినవారికి, చిన్ననాటి పరమపద సోపాన పటం ఆట జ్ఞప్తికి వస్తుండవచ్చు.

డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లే అని భావించారందరూ. 1971 సార్వత్రిక ఎన్నికల్లో, అలనాటి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులుగా పోటీచేసిన వారిలో, దాదాపు అందరూ గెలిచినా, కించిత్తైన చెక్కు చెదరని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, "తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు" అని ఎంత స్పష్టంగా ప్రకటించిందో, అదే స్పష్టతతో, "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ" ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు చిదంబరం. ఇందిరా గాంధి ప్రకటన, వైకుంఠపాళి ఆటలో గెలిచేవారి తరహాలో గవ్వలు విసిరి-పావులు కదిపి, పాము నోట్లో పడకుండా నిచ్చెనలెక్కి, పెద్ద పామును కూడా తప్పించుకుని విజేతగా నూరవ గడికి చేరుకున్న రీతిలో వుంటే దానికి పూర్తి భిన్నంగా వుంది చిదంబరం ప్రకటన. ఒక ఔచిత్యం లేకుండా చిదంబరం చేసిన ప్రకటన, గవ్వలు విసరడం చేతకాని-పావులు కదపడం రాని ఆటగాళ్లు పరమపద సోపాన పటంలో పాము నోట్లో తలదూర్చిన వారి రీతిలో వుంది. చిదంబరం నిర్ణయం దరిమిలా చోటు చేసుకున్న సంఘటనలు, ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అని ఆందోళన చేసిన వారికి కాని, సమైక్యాంధ్రే వుండాలని కోరుకుంటున్న వారికి కాని అనుకూలంగా లేవు.

తాను ఆడుతున్నది రాజకీయ వైకుంఠపాళి అని, జాగ్రత్తగా పావులు కదపకపోతే, పరిణామాలు తీవ్రంగా వుంటాయని చిదంబరం గ్రహించకపోవడం దురదృష్టం. ఇక ఆ తర్వాత, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడంతో, తానేదో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నానన్న భ్రమలో పడ్డారాయన. మరో ఏడాదిపాటు తెలుగు వారితో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చని భావించాడు. ఆయన భావనకు అనుగుణంగానే, రాష్ట్రంలో, కమిటీ నివేదిక వచ్చేంతవరకు, చిదంబరం పావులు పరమపద సోపాన పటంపైన నిచ్చెనలెక్కుకుంటూ పోయాయి. డిసెంబర్ 31, 2010 వరకు-ఆ తర్వాత బహుశా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసే దాకా, నిచ్చెనలను అధిరోహించిన పావు "పెద్ద పాము నోట్లో పడింది". మళ్లీ కధ మొదటికొచ్చింది. ఇందిరా గాంధీ తన రాజకీయ చతురతతో, తెలంగాణ ప్రజా సమితి టికెట్ పై పోటీ చేసి గెలిచిన వారందరినీ, దాని నాయకుడు మర్రి చెన్నారెడ్డితో సహా, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాగలిగితే, చిదంబరం వ్యూహం-ఆయనకు అండగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ వ్యూహం, వారి అధినాయకురాలు సోనియా గాంధీ వ్యూహం దానికి పూర్తి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది. సొంత పార్టీ వాళ్లే, పార్లమెంటును స్థంబింప చేసే దాకా పోయింది. చివరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, పరమపద సోపాన పటంలో, చిట్ట చివరి గడికి పావు చేరుకున్న చందాన తయారయింది.

కేంద్రంలో వ్యవహారం అలా వుంటే, రాష్ట్రంలో సంగతులు కూడా అలానే వున్నాయి. శాసన సభ సమావేశాలు ఆరంభం కావడానికి ముందు వరకు, అటు ప్రభుత్వం, ఇటు తెలంగాణ వాదులు, తమ తమ పావులను జాగ్రత్తగా కదుపుకుంటూ, (మాటల తూటాలనే) గవ్వలు ఆచితూచి విసురుకుంటూ, నిచ్చెనలు ఎక్కుకుంటూ-పాము నోట్లో పడుకుంటూ, పై గడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ చేరుకోలేక పోయారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు, హఠాత్తుగా (కాంగ్రెస్, తెరాస, తెలుగు దేశం) తెలంగాణ వాదులందరూ, విడి విడిగా గవ్వలు విసురుకుంటూ-పావులు కదుపుకుంటూ, నూరవ గడి దరిదాపుల్లోకి వచ్చే దిశగా చకచకా కదిలారు. వీరందరి కంటే ముందే, ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కోదండ రామ్, నూరవ గడికి అతి సమీపంలోకి చేరుకున్నారు. విద్యార్థుల ఆందోళనలు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ, శాసన సభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల జై తెలంగాణ నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, బడ్జెట్ ప్రసంగాన్ని సాగనీయక పోవడం, కాంగ్రెస్ శాసన సభ సభ్యులు-మంత్రులు ఢిల్లీకి మకాం మార్చి పార్లమెంటు సభ్యులతో కలిసి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలు, పట్టాల పైకి పల్లెలు లాంటి చర్యలు, ఎవరి పరిధిలో వారి గవ్వలు సక్రమంగా విసిరిన రీతిలో-పావులు కదిపిన తరహాలో, పరిష్కారాన్ని చివరి అంకానికి వచ్చేలా చేయగలిగాయి. ఇంతలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర రావు-సహచర లోక్ సభ సభ్యురాలు విజయ శాంతి వ్యూహాత్మకంగా గవ్వలు విసిరి, పావులు కదిపి, లోక్ సభను స్థంబింప చేశారు. మరో మారు తెలంగాణ ఇచ్చినట్లే-వచ్చినట్లే కనిపించింది అందరికీ. అందరూ, ఫిబ్రవరి చివరి వారంలో అతి పెద్ద పాము నోటికి అతి చేరువలో, నూరవ గడికి, అతి సమీపంలో చేరుకున్నారు. మార్చ్ మొదటి వారంలో-ఆరంభంలో, గవ్వలు సరిగ్గా పడకుండా, అందరి పావులను పాము నోటికి చేర్చాయి. హఠాత్తుగా పరిస్థితిలో ఊహించని పరిణామం, అందరికి దాదాపు అర్థమయ్యేలా, చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేది లేదు అన్న సంకేతం స్పష్టంగా వెలువడింది.

మళ్ళీ ఆట మొదటి కొచ్చింది. పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. ఎన్డీయే సారధి భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చేజారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. గవ్వలు విసిరారు. తన పావులను కదిలించారు. కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. చేతిలో గవ్వలు జారి పోయాయి. తాత్కాలికంగా ఆట గెల్చారు ప్రణబ్. ఆట గెలుపు ధీమాతో, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ-ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను సరాసరి-నేరుగా కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. మూడు నెలలు ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ.

ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. ఆటలో మళ్లీ నిచ్చెనలు ఎక్కడం మొదలెట్టారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు-మంత్రులు-ఎమ్మెల్సీలతో సహా, ఢిల్లీకి పోయి సోనియాను కలిసే ప్రయత్నంలో పడ్డారు. వారి ఆటలో వారూ కొంత ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు తన వర్గంలోని బలీయమైన తెలంగాణ వాది-నాగం జనార్ధన రెడ్డి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగు దేశం వారు ప్రత్యేక నినాదం వైకుంఠపాళి ఆటలో చేరడానికి మరికొంత సమయం పట్టొచ్చునేమో. ఎలాగూ, మూడు నెలల సమయం వుందికదా! ఇక ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, తెరాస నాయకులు తేల్చుకోవాల్సింది మిలియన్ మార్చ్ వ్యవహారం. అలా వారూ పావులు కదుపుతున్నారు.

పరమపద సోపాన పటంలో నూరవ గడికి ఎవరు ముందుగా చేరుకుంటారో ఊహించడం కష్టమైనా, మూడు నెలల వరకూ, నిచ్చెనలెక్కుతూ-పాము నోట్లో పడి కిందకు జారుతూ, వుండడం మాత్రం తధ్యం.

Monday, January 10, 2011

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా? స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?: వనం జ్వాలా నరసింహారావు

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా? స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?
వనం జ్వాలా నరసింహారావు

హద్దులు గీసేది ఎవరనేదే పేచీ - యథార్థాలు తెలపకపోతే పుకార్లదే రాజ్యం
వాస్తవాలు దాస్తే ఎలా! - ఉద్యమాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగమేనా?
స్వయం సంయమనమే ఉత్తమం
(సూర్య దినపత్రిక : 12-01-2011)

కేబుల్‌ నియంత్రణ చట్టం ప్రకారం హింసాత్మక సంఘటనలు ప్రసారం చేయరాదన్న నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ (ఎన్‌బీయే) నిబంధనలను-హైకోర్టు ఆదేశాలను పాటించాలని మాత్రమే చెప్పాం కాని, మీడియాపై ప్రభుత్వపరంగా ఎటువంటి ఆంక్షలు విధించలేదని హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంటుండగా, అది వాస్తవం కాదని మీడియాకు చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ’ఎన్‌బీయే’ మార్గదర్శకాలను అమలుచేసేందుకు కొన్ని ఛానళ్లు మాత్రమే అంగీకరించాయని, మీడియాలో కూడా "సీమాంధ్రుల" ప్రభావం వల్ల వాస్తవాలు వెలుగు చూపకుండా పరోక్షంగా "ఆంక్షల-మార్గదర్శకాల ముసుగు" లో తెలంగాణ సాధన ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని కొందరంటున్నారు. ఏదేమైనా కొన్ని ఛానళ్లకు నోటీసులందిన వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలో, మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” ఆవిర్భవించడం, ఆ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల మద్దతుండడం గమనించ దగ్గ విషయం. ఈ సంస్థ మార్గదర్శకాలకు, ఇంతవరకూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ’ఎన్‌బీయే’ సంస్థ ఆదేశాలకు వ్యత్యాసం ఏమేరకుంటుందో చూడాలి.

అసలింతకీ అమల్లో వున్నాయని అందరూ భావిస్తున్నవి, "ఆంక్షలా"? "లక్ష్మణ రేఖలా"? "స్వీయ నియంత్రణలా"? "మార్గదర్శకాలా"? ఎవరికి వారే తమ ప్రయోజనాలకు అనుగుణంగా-అనుకూలంగా మలుచుకుంటున్న "ముసుగులా"?. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో మీడియా నిర్వహించాల్సిన పాత్ర గురించి, వారి బృహత్తర బాధ్యత గురించి, పరాయి వారు తమపై ఆంక్షలు విధించే బదులు వారే స్వయం సంయమనం పాటించే అంశం గురించి, రాజ్యాంగ బద్ధంగా మీడియా వారికున్న స్వాతంత్ర్యం గురించీ చర్చ నిరంతరం కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తప్పొప్పులను విమర్శించే హక్కు మీడియాకుందంటూనే, ఆ హక్కుకు "హద్దులుండాలి" అని అనడం సబబే మో కాని, ఆ హద్దులకు "ఎల్లలు" ఎవరు-ఎలా గీయాలనే విషయంలోనే పేచీ వస్తున్నది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2004 లో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే, ఒకటి రెండు పత్రికలపై ఆయనకున్న వ్యతిరేకత-ఒకటి రెండు పత్రికలకు ఆయన పట్ల వున్న వ్యతిరేకత నేపధ్యంలో, "మీడియాకు లక్ష్మణ రేఖ" అన్న అంశంపై చర్చ జరుగుతుండేది. "వార్తలకు, వ్యాఖ్యలకు" తేడా లేకుండా పత్రికలు ప్రచురించడం వల్ల, పాఠకులు అయోమయానికి గురై, వ్యాఖ్యలనే వార్తలనుకుంటున్నారని, అప్పట్లో ఆయన ఒకటి రెండు పత్రికలపై విమర్శలు గుప్పించే వారు. ఆయన అన్న దాంట్లో ఎంత నిజముందో పక్కన పెడితే, ఇప్పుడున్న ప్రభుత్వం, అసలు వార్తలనే "నిభందనలకు-ఆంక్షలకు-మార్గదర్శకాలకు" లోబడి ప్రచురించాలనీ, ఛానళ్లలో ప్రసారం చేయాలని అంటే, అదెలా అర్థం చేసుకోవాలన్నదే ప్రశ్న! యదార్థంగా జరిగిన-జరుగుతున్న సంఘటనలను, వ్యాఖ్యానం జోడించకుండా, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యతను కూడా మీడియాను నిర్వర్తించ నీయకపోతే, అసత్యాలు-పుకార్లు చోటుచేసుకునే ప్రమాదం వుంది. వాస్తవాలు దాచడమంటే, పరోక్షంగా అవాస్తవాలు బయటపెట్టమని అనడమే!

ఏదీ సమయం సందర్భం లేకుండా జరగదు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చేసిన ఆరు సూచనలలో తెలంగాణ కోరుకునేవారికి సంబంధించినంతవరకు ప్రధానమైంది ఒకే ఒక్కటి. అదే ఐదో సూచన. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం చెప్తూ, "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైతే" తెలంగాణ-సీమాంధ్రలుగా రాష్ట్ర విభజన జరగాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన జరగకపోతే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది. "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని”అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం అని చెప్తూ, శాంతి భద్రతల సమస్య తలెత్తే విషయాన్ని ప్రస్తావించింది. బహుశా శ్రీకృష్ణ కమిటీ భావించి-సూచించిన "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంలో భాగమే ఈ ఆంక్షలు, లక్ష్మణ రేఖలు, స్వీయ నియంత్రణలు, మార్గదర్శకాలు అనుకోవాలేమో!

ఇవన్నీ కాసేపు పక్కన పెడితే... ఇటీవలి కాలంలో, మీడియా వ్యవహరించే తీరులో, ఊహించని ధోరణులు-విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విజ్ఞులు, మేధావులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పాత్రికేయ నాయకులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. సమాజంపై ఈ మార్పు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని కూడా వారి అభిప్రాయం. అలా అభిప్రాయ పడుతున్న వారి పరోక్ష సూచనే "లక్ష్మణ రేఖలు" అన్న సిద్ధాంతానికి మార్గం చూపాయి. అయితే, లక్ష్మణ రేఖ అంటే, నియంత్రణ కాదని-కాకూడదని, మీడియా కూడా ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థల వలెనే, ప్రజలకు "జవాబుదారీగా-బాధ్యతాయుతంగా-పారదర్శకంగా" పనిచేసేందుకు దోహద పడేది మాత్రమేనని సర్ది చెప్పుకున్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాలన్నీ మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ, అడపాదడపా ఆంక్షలు విధించకుండా వుండడం జరగదు. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు. మన రాష్ట్రంలో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” స్వయం సంయమనం పాటించే దిశగా చర్యలు తీసుకుంటే అభినందించాల్సిందే.

ఒక్క విషయం మాత్రం వాస్తవం అనక తప్పదేమో. ఇటీవల కాలంలో, సామాజిక ప్రయోజనాలను కాపాడవలసిన మీడియా, ఆ పని చేస్తూనే, అది అనుకూలించనప్పుడు, కార్పొరేట్ గొంతును మాత్రమే వినిపిస్తున్నదని సర్వత్రా చర్చనీయాంశమైంది. మీడియా మొత్తం అలా, అన్ని వేళలా చేస్తున్నదని చెప్పలేం కాని, దాని ధోరణిలో సరికొత్త నిర్వచనాలు, సరికొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యతలు చోటు చేసుకోవడం మాత్రం కాదనలేం. ఎలెక్ట్రానిక్ మీడియా ప్రభావిత పాత్రికేయ రంగంలోని కొంత భాగం, తన విశ్వసనీయతను కోల్పోతున్నదనడానికి పలు ఉదాహరణలు దొరుకుతాయనవచ్చు. ఈ ధోరణికి తోడు, ఎలెక్ట్రానిక్ మీడియాలో నెల కొన్న పోటీ, మీడియా విశ్వసనీయతకు సవాలుగా మారింది. సంక్లిష్టమైన సామాజిక ప్రయోజనం కలిగే అంశాలను తగ్గించి ప్రసారం చేయడం, పైపై మెరుగులకు అనవసర ప్రాధాన్యతను ఇవ్వడం, సంచలన వార్తల కొరకు పరుగులు తీయడం, ఆ వార్తలను తమ ఛానల్ కంటే ముందుగా ఇతరులు ప్రసారం చేస్తారేమోనన్న ఆందోళనతో దృఢ పరచుకోకుండానే "బ్రేక్" చేయడం తరచుగా జరగడంతో మీడియా విశ్వసనీయత కోల్పోయేందుకు దారితీస్తున్నది. అలాంటప్పుడు, స్వయం సంయమానికి మించిన లక్ష్మణ రేఖలు కాని, ఆంక్షలు కాని, నియంత్రణలు కాని ఎంతవరకు ఆ విశ్వసనీయతను కాపాడ కలుగుతాయి?

భారత రాజ్యాంగంలో, "ఎగ్జిక్యూటివ్-జుడీషియరీ-లెజిస్లేచర్" వ్యవస్థలు ఎటువంటి కట్టుబాట్లకు, అదుపులు-అన్వయాలకు లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలో స్పష్టంగా వివరించబడింది. అయినా, అప్పుడప్పుడూ, ఆయా వ్యవస్థలను అత్యున్నత స్థాయిలో అజమాయిషీ చేసేవారి "యాక్టివిజం" వల్ల, అనుకోకుండానే అనర్థాలు కలగడం, వాటి పర్యవసానాలు పౌరుల మీద ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిన విషయమే. కాకపోతే, రాజ్యాంగ బద్ధమైన ఆ వ్యవస్థలు తమ తప్పులను దరిమిలా సరిదిద్దుకోవడం కూడా జరిగింది. పోనీ పునఃపరిశీలన చేయడం జరిగింది. ఉదాహరణకు, జనవరి మొదటి వారంలో పౌర హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పును తీసుకోవచ్చు. దాదాపు 35 సంవత్సరాల క్రితం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ-ఎగ్జిక్యూటివ్" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని అలనాటి సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు తీర్పిచ్చారు. అయితే, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, తిరిగి అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం, ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. "ఫోర్త్ ఎస్టేట్" గా పిలవబడే మీడియా విషయంలో రాజ్యాంగపరంగా "అదుపులు-అన్వయాలకు" వీలు కలిగించలేదు. అందుకే రాజ్యాంగంలో పొందుపరచిన పౌరుల "భావ ప్రకటనా స్వేచ్ఛ" అనే ప్రాధమిక హక్కును, స్వీయ నియంత్రణ లాంటి "అదుపులు-అన్వయాలకు" (Self Imposed Checks and Balances) లోబడి ఉపయోగించుకుంటే బాగుంటుందేమో.

వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పౌరుల భద్రత, వైద్య పరమైన విషయాలు, నీతి వర్తన లాంటి అంశాల్లో గందరగోళం సృష్టించే పరిస్థితులకు వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ దారితీయకూడదు. ఒక పౌరుడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, మరో తోటి పౌరుడి స్వేచ్ఛకు భంగం కలిగించ కూడదు. ఏ విధంగానైతే బహుళ ప్రయోజనాలకు ఒక వ్యక్తి స్వేచ్ఛ భంగం కలిగించ రాదో, అలానే, మీడియా స్వేచ్ఛ కూడా వుంటే మంచిదేమో. ఆ ప్రయోజనాలేంటో, ఆ పరిమితులేంటో నిర్ణయించుకోవాల్సింది విశ్వసనీయత కాపాడుకోవాల్సిన మీడియానే. బహుశా ఆ బాధ్యతను, రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల చొరవతో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” చేపడ్తుందని ఆశించుదాం. End.

Friday, January 7, 2011

మనసులో మాట దాచుకోలేక పోయిన శ్రీకృష్ణ : వనం జ్వాలా నరసింహారావు

"హైదరాబాద్ తో సహా తెలంగాణ"
"హైదరాబాద్ లేని సీమాంధ్ర" రాష్ట్రాలుగా
ఆంధ్ర ప్రదేశ్ విభజన జరగడం సరైన పరిష్కారం

(ఆంధ్ర ప్రభ దిన పత్రిక : 12-01-2011)
వనం జ్వాలా నరసింహారావు

నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని” అనడం కన్నా, బాధ్యత తీసుకునే ముందే, తమకంతగా చేతకాని బాధ్యత నెత్తిన వేసుకుంటున్నామని అనుకుంటే బాగుండేదేమో. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? తేల్చనప్పుడు-తేల్చలేమని గుర్తించినప్పుడు, ఆ సంగతే చెప్పాలి కాని, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం ఎంతవరకు సబబు? పైగా తాము చెప్పలేని దానికి, పోనీ పదే-పదే చెప్తూ వస్తున్న దానికి (అందరికీ ఆమోద యోగ్యమైన నివేదిక ఇస్తాం!) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగంలోని సూక్తులను పేర్కొనడం ఒక తెలివైన ఎత్తుగడ తప్ప మరోటి కాదు. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? సూచన-ఐదుకు ప్రభుత్వం అంగీకరించితే అది సమైక్య వాదులకు అపజయమే కదా! సూచన-ఆరుకు ఒప్పుకుంటే, ఇటు తెలంగాణ కోరుకునే వారికి, అటు సమైక్య వాదులకు అపజయమే కదా! జవహర్లాల్ నెహ్రూ చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చేకూరుస్తున్నామని చెప్పడం తగునా?

నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. మహాభారత యుద్ధం పూర్వ రంగంలో, కౌరవ-పాండవ యుద్ధం నివారించడానికి శ్రీకృష్ణుడు హస్తినకు రాయభారానికి వెళ్లినట్లు వర్ణించడం జరిగినా, వాస్తవానికి, యుద్ధాన్ని ఖాయం చేసేందు కొరకే వెళ్లాడనే ది జగమెరిగిన సత్యం. అదే జరిగిందిప్పుడు కూడా. ఏభై నాలుగేళ్ల ఆంధ్రా నిలువెత్తు దోపిడీకి నిదర్శనంగా నేటికీ మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతం వారు చేయబోయే ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం. మరో విధంగా చెప్పాలంటే, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల న్యాయమైన కోర్కె సమంజసమని-సమర్థించాలని మనసులో వున్నా, చేసిన ఆరు సూచనలలో వద్దనుకుంటూనే నాలుగు సూచనలు విభజనకు సంబంధించినవి కావడం విశేషం. అంటే, విభజన సమస్య పరిష్కారానికి సరైన మార్గమని ఆయనకు తెలిసినా అసంబద్ధమైన విభజనలను మొదలు సూచించి, చివరకు అసలు సిసలైన రాయభారం తరహాలో... ఐదూళ్లిచ్చిన చాలును... అన్న చందాన పనికిమాలిన సూచనతో సహా, అసలు సిసలైన ఒకే ఒక్క సూచన చేశారు. ఆయన చెప్పిన విధంగా, ఐదో సూచనకు అనుగుణంగా తప్ప, వేరే రకంగా విభజనకు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. "అనివార్యమైతే - అంతా ఒప్పుకుంటేనే పరిశీలించాలి" అని కమిటీ వ్యాఖ్య చేసిన "రాష్ట్రాన్ని సీమాంధ్ర-తెలంగాణగా విభజించి... హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం" అన్న దానికి ప్రభుత్వం ఒప్పుకుని, దానికి అనుగుణమైన చర్యలు చేపట్టి తేనే, బహుశా మహాభారత యుద్ధం లాంటిది నివారించవచ్చేమో! శ్రీకృష్ణ కమిటీ సభ్యులంతా "మనసా-వాచా" తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైందని భావించినా, "కర్మనా" అనుకూలంగా లేకుండా-ప్రతికూలంగా కాకుండా తీర్పు లాంటి సూచన ఇవ్వడం అన్యాయం లాంటిదే!

ఒక వైపు సూచనలు చేస్తూనే అవే సూచనలు "ఆచరణ యోగ్యమైన వి కావు" అని అనడం కూడా ఎంతవరకు సబబు? "కలిసి ఉండటమే ఉత్తమం" అంటూనే, అదే "అత్యుత్తమమైన మార్గం" అని చెప్తూనే, సమైక్యాంధ్రకు అనుకూలమైన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణలో నిరసనలు తప్పక పోవచ్చని, పలు ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతుందని వ్యాఖ్యానించడంలోని ఆంతర్యం ఏంటి? సమైక్యంగా వుండడానికి తెలంగాణ ప్రాంతం వారు అంగీకరించ రనే కదా? అంటే శ్రీకృష్ణ కమిటీ మనసులోని మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదా? ఇంకొంచెం లోతుగా నివేదికను విశ్లేషిస్తే,"అనివార్యంగా రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని, సీమాంధ్ర సొంత రాజధానిని అభివృద్ధి చేసుకునే దాకా హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని" మరో సూచన కనిపిస్తుంది. ఇది కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందనాలి కదా? ఏదేమైనా, ‘‘ఇదేమంత అభిలషణీయమైన పరిష్కారం కాదు. అయినా సరే అనివార్యంగా విభజించాల్సి వస్తే అది మూడు ప్రాంతాల ప్రజల ఆమోదంతో జరగాలి’’ అని చెప్పకనే చెప్పింది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభుత్వానికి". ఇతర సూచనలకు కూడా "తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది" అని కమిటీ అభిప్రాయ పడడమంటే, నర్మ గర్భంగా తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పడమే కదా? కాకపోతే, ఎందుకో, ఏ కారణానో, "సందిగ్ధత లేని" తరహాలో మనసులో మాట చెప్పడానికి జంకింది శ్రీకృష్ణ కమిటీ.

మొదటి నాలుగు సూచనలలో “ఆచరణసాధ్యం కాని” ఒక సూచన, తెలంగాణలో ఒప్పుకోనందున “అసాధ్యమని భావించిన” మరో సూచన, ఏ ప్రాంతం వారికి “ఆమోదయోగ్యం కాని” ఇంకొక సూచన, నక్సలిజం పెరగడానికి అవకాశమున్నందున-ఏకాభిప్రాయం సాధ్యం కానందున “పనికి రాని” ఒక సూచన చేసిన కమిటీ, మిగిలిన రెండు సూచనలు సార్వజనీన సమ్మతమైన వని చెప్పడానికి సాహసించలేదు. ఒకటి పరిశీలనకు తగిందిగా, మరొక టి సమస్యలకు దారి తీసే దిగా కమిటీ మాటల్లోనే స్పష్టమవుతోంది. "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం-చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం" ఏబై సంవత్సరాల క్రితం చెప్పి వుంటే కొంతైనా అమలయ్యేదేమో కాని ఇప్పుడు అత్యంత అసాధ్యమైన విషయం. 1956 లో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తితో "తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు" చేయమని సూచించడం కన్నా తిరోగమన మార్గం లేదనాలి. ఇన్నేళ్లు జరగంది, ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం భవిష్యత్ "సీమాంధ్ర నాయకులు" ఎన్ని రాజ్యాంగ భద్రతలు కలిగించినా, తెలంగాణ ప్రజల్లో కలిగించడం జరగని పని. చట్టబద్ధమైన సంప్రదింపులను ప్రాంతీయ మండలి నిర్వహించడం కాని, ప్రాంతీయ మండలికి-రాష్ట్ర ప్రభుత్వానికి-శాసనసభకు మధ్య ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు... “గవర్నర్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ” ని ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం కాని ఎండమావుల లాంటి ఆలోచనలు. తెలంగాణ ఏర్పాటై, తెలంగాణకు చెందిన వారు ముఖ్యమంత్రి కావాలనుకునే తెలంగాణ ప్రజలకు, తమ ప్రాంతం వాడే మో "కేవలం కేబినెట్ మంత్రిగా" మిగిలి పోవడం ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కానే కాదు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు కేటాయించడం జరుగు తే, ప్రాంతీయ మండలి అధ్యక్షుడి హోదా ఏం కావాలి? బహుశా ఆచరణ యోగ్యం కాని సూచనలలో అగ్ర భాగాన నిలిచే సూచన ఇదేనేమో!

అన్నింటి కన్నా ఘోరమైంది, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా నామినేటెడ్ పోస్టులో నియమించబడిన గవర్నర్ కు, ఈ ప్రతిపాదన ద్వారా విస్తృత అధికారాలను కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.

శ్రీకృష్ణ కమిటీ మాటల్లోనే, తెలంగాణ-సీమాంధ్రలుగా రాష్ట్రాన్ని విభజించడం, అత్యధిక తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించినట్లన్న భావన వుంది. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం కూడా కమిటీ చెప్పింది. "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైతేనే" రాష్ట్ర విభజన జరగాలని కమిటీ అభిప్రాయపడడం, పరోక్షంగా, అలాంటి పరిస్థితులు కలుగుతాయని హెచ్చరించడమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన జరగకపోతే, ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది. "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని” అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం అని సూచన చేసింది. (…”Likelihood of the agitation continuing in case the demand is not met-unless handled deftly, tactfully and firmly as discussed under option six-consideration has to be given to this option.)

రాష్ట్ర విభజన చేసేందుకు నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగంలోని మూడవ ప్రకరణం కింద చెప్పిన విధంగా, ముందుకు సాగితే మంచిదని కూడా కమిటీ సూచించింది. అంటే, రాష్ట్ర రాజకీయ నాయకులతో సంప్రదింపులు అనవసరం అన్న భావన వుంది కదా! ఎలాగు చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటనలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయిందని స్పష్టంగా చెప్పారు. కమిటీ అదే సూచించింది. ఇంకెందుకు ఆలశ్యం? పార్లమెంటులో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి-దాని ఎన్డీఏ మిత్ర పక్షాలు సమర్థించడం ఖాయం కనుక, ఆ దిశగా అడుగులు వేస్తే అందరికీ మేలు.

Sunday, January 2, 2011

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు - ఎక్కడి గొంగళి అక్కడే నా?: వనం జ్వాలా నరసింహారావు

జనవరి 6, 2011 న అఖిల పక్ష సమావేశం జరుగనున్న నేపధ్యంలో ...
తారు మారైన "అభిప్రాయం - అధ్యయనం - తీర్పు" ప్రక్రియ
వనం జ్వాలా నరసింహారావు
(ఆంధ్ర జ్యోతి, 4-01-2011)

ఏమిటీ జాగు? ఎందుకీ జాగు? ఏడాది క్రితమే చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని “ప్రభుత్వ తీర్పు” గా ప్రకటించి, వెనక్కు తగ్గి, మళ్లీ అభిప్రాయ సేకరణకు, అధ్యయనానికి తెర లేపారు. అంతవరకు బాగానే వుంది... అభిప్రాయం , అధ్యయనం జరిగిన తర్వాత, తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కమిటీ దన్నా కావాలి, లేదా, ప్రభుత్వానిదన్నా కావాలి తప్ప, రాజకీయ నాయకులది ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. పరిష్కారం ప్రభుత్వం చేతుల్లో వుంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా, తీర్పు ప్రకటించాలి. అలా కాదు... రాజకీయ నాయకుల చేతుల్లో వుందని ప్రభుత్వం భావిస్తే, వారు శ్రీకృష్ణ కమిటీకి వెల్లడించిన అభిప్రాయాల సారాంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. కాదు... తీర్పు ప్రజలదే అనుకుంటే, గతంలోకి ఒక్క సారి తొంగి చూడాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయ తల్చుకుంటే, పార్లమెంటులో సంబంధిత ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.... పార్లమెంటులోని వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడమే ప్రభుత్వ నిర్ణయమైతే, ధైర్యంగా బయట పెట్టాలి... పర్యవసానానికి ఎదురు చూడాలి!

కథ మళ్లీ మొదటికొచ్చింది. కర్ణుడి చావుకు ఎందరో కారణమైనట్లు నేతి ఈ దుస్థితికి కూడా అందరూ కారకులే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, నవంబర్ 2009 ఆఖరు వారంలో, తన చివరి పోరాటంగా ప్రకటించి, "తెలంగాణ రాష్ట్రం" ఏర్పాటు ప్రకటన వెలువడేంతవరకు, వెనక్కు తగ్గేది లేదని అంటూ, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షకు కూచునే లోపునే ఆయన్ను అరెస్టు చేయడం, ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి జైలులోనే ఆయన దీక్ష కొనసాగించడం-ఆసుపత్రిలో చేర్పించడం, దీక్ష విరమించాడని ప్రకటించడం, దాన్ని ఆయన ఖండించడం నాటకీయంగా ఒకదాని వెంట ఒకటి జరిగాయి. చివరకు, మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు కె.సీ.ఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఆందోళన చెందిన అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం-యూపీఏ ప్రభుత్వం, డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కర్ర విరగ కుండా-పాము చావకుండా వుండే రీతిలో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం" అన్న అర్థం వచ్చే ఒక ప్రకటన చేయించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు, "సమైక్యాంధ్ర-ప్రత్యేకాంధ్ర" ఉద్యమాల పేరుతో హింస చెలరేగడంతో మరో ప్రకటన వెలువడింది. అనంతరం, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జనవరి 5, 2010 న చిదంబరం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, సమస్య పరిష్కారాన్ని కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యతగా చిత్రీకరించి, తాత్కాలికంగా చేతులు దులిపేసుకున్నారు. ఆ నాడు సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో (పార్టీకి ఇద్దరు చొప్పున) ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు తప్ప మిగతా ఎవరూ, స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఆ పార్టీ నాయకులతో సహా అందరు కూడా చర్చల కొన సాగింపుకు "ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో" అంగీకరించడంతో దరిమిలా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కాలయాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు “తమ తీర్పు” ను ఆ నాడే ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు దాటినా, తెలంగాణ ప్రాంత వారందరిలో, విడిపోయి- "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగు తే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది. ఆ నినాదమే, ఒక లక్ష్యంగా - ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న స్థాయికి చేరుకోవడం "తమ తుది తీర్పు" గా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ వేయడాన్ని తెలంగాణ ప్రజలు ఓర్పుతో, సహనంతో, భవిష్యత్ మీద నమ్మకంతో సహించి అంగీకరించారే తప్ప రాష్ట్రాన్ని సాధించుకోవడం చేతకాక ఒప్పుకో లేదు. కమిటీ నివేదిక తర్వాత కూడా మళ్లీ ఆట మొదలెడితే ఫలితాలు ఎలా వుండబోతున్నాయో ఎవరూ వూహించలేరేమో!

తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకేమిచ్చినా అంగీకరించడానికి ససేమిరా ఒప్పుకోని ఆ ప్రాంతంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు, ప్రత్యేకమైన రాయితీలను చట్ట రీత్యా - రాజ్యాంగ పరంగా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని మరో మారు పక్కదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. ఇక ఇప్పుడా అవకాశం లేనే లేదు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో, 1971 సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అంత కంటే " తుది తీర్పు" ఇంకేమైనా వుందా? ఆ తీర్పు తర్వాత ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యయనం చేయాల్సిన అవసరం వుందా? ఐనా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు పరిణితి చెందిన తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ కమిటీ తీర్పు తెలంగాణ ఏర్పాటుకు విరుద్ధంగా వుంటే వారు ఒప్పుకుంటారని ప్రభుత్వం భావించడం కన్నా పొరపాటు మరొక టి లేదు.

కె. చంద్రశేఖర రావు "తెలంగాణ రాష్ట్ర సమితి" (టీ ఆర్ ఎస్) ని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తూ, పదేళ్లు గా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అడపాదడపా ఇతర పార్టీల మీద, పార్టీ నాయకుల మీద దురుసుగా విరుచుకుని పడినా, లక్ష్య సాధన కొరకు అందరితో రాజీ పడుతున్నారు. మహబూబాబాద్ పర్యటనకు వెళ్తున్న జగన్ ను అడ్డుకునే విషయంలోను, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తి వేయించే విషయంలోను, అలాంటి మరి కొన్ని ఉమ్మడి అంశాలలోను కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించడానికి వెనుకాడ లేదు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్తి చెపుతున్నట్లు టీవీ ఛానళ్లద్వారా ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబుకాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ అప్పటికి నిరాశే మిగిలింది.

ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంథాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో అప్పటికీ-ఇప్పటికీ "చిదంబర రహస్యం" గానే మిగిలిపోయింది. ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.

ఎనిమిది వందల పేజీల శ్రీకృష్ణ కమిటీ నివేదికలో, అఖిల పక్షం సమావేశానికి చిదంబరం ఆహ్వానించిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు లేవా? అవన్నీ క్రోడీకరించి, రెండు-మూడు పేజీల సంక్షిప్త సమాచారంగా చేసి, ప్రభుత్వ అభిప్రాయాన్ని- ముసాయిదా తీర్పును దానికి అనుబంధంగా చేర్చి, పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి, తమ నిర్ణయం ప్రకటించి, వారి సమాధానం తెలుసుకొని, ముందుకు సాగుతే మంచిది. అలా కాకుండా, జనవరి 5, 2010 నే పునరావృతం చేస్తే ఫలితం శూన్యం. అంతగా పిలవ తల్చుకుంటే, ఇదే ప్రక్రియను రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాత్రమే చేస్తే సరిపోతుంది. "ఒక పార్టీ-ఒక అభిప్రాయం" అన్న సిద్ధాంతాన్ని పాటించాలి తప్ప, అఖిల పక్ష సమావేశం ఒక చర్చా వేదికగా మార్చే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడమంటే, ప్రభుత్వ నిర్ణయం వాయిదా వేసి, శాశ్వతంగా ఉద్యమానికి అంకురార్పణ చేయడమే! శాశ్వతంగా శాంతి భద్రతల సమస్యను ప్రభుత్వ పరంగా సృష్టించడమే! అంటే, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లే!

చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.... కాదను కుంటే...ధైర్యంగా చేయమని చెప్పాలి... జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలి. నాన్చు డు ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం.

Friday, April 16, 2010

లగడపాటిది సమైక్యవాదమా? వితండవాదమా?అమాయకత్వమా?: వనం జ్వాలానరసింహారావు

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు లగడపాటి లాంటి సమైక్యతా వాదులు ఏం చేశారు?
ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎన్ని రకాల చులకన-గేలి చేశారు?
వనం జ్వాలానరసింహారావు

"బత్తీస్ మార్ ఖాన్, చత్తిస్ మార్ ఖాన్" అని మా చిన్నతనంలో ఒక సరదా గేమ్ ఆడే వాళ్లం. తెలిసీ-తెలియని వయసులో ఒకేసారి ఈగలను అన్యాయంగా చంపడంలో నైపుణ్యం ప్రదర్శించే ఆట అది. సరిగ్గా అలాంటి గేమే ఆడుతున్నారు లగడపాటి తన "సమైక్య వాదం" తో. ఎన్ని ఎక్కువ నివేదికలిస్తే అంత గొప్ప అనుకుంటున్నారాయన. అందులో ఎన్ని ఎక్కువ పేజీలుంటే, తన తెలివి తేటలకు అంత నిదర్శనమని కూడా భావిస్తున్నట్లుంది. వాస్తవానికి తానేం చేస్తున్నాడని కనీసం ఒక్కసారైనా ప్రజా ప్రతినిధిగా ఆలోచించిన దాఖలాలు కనపడడం లేదు ఆయన వాదనలు వింటుంటే. "ఎందుకిన్ని నివేదికలిచ్చావయ్యా"అని అడుగుతే, సమాధానం ఇస్తూ రెచ్చిపోయి, మరో రెండు నివేదికలిస్తానంటాడు. "అందులో ఏముందండీ"అని ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం ఇవ్వకుండా, తెలంగాణ వాదులు (ముఖ్యంగా టీ ఆర్ ఎస్ ను వుద్దేశించి) అవాస్తవాలు చెపుతున్నారనీ-ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడుతున్నారనీ-అనేక విషయాల మీద వక్రీకరించి శ్రీకృష్ణ కమిటీ ముందు పెడుతున్నారని, అవన్నీ నిర్వీర్యం చేయడానికి తాను దశలవారీగా వారం-వారం ఒక నివేదిక ఇస్తున్నానని అంటారు. ఆయన సమైక్యతా వాదనలో స్పష్టత లేదనీ-నివేదికలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదాన్ని బలపరుస్తున్నాయని ఆయన దృష్టికి తెస్తే, ఎదురు ప్రశ్నిస్తారు తప్ప వివరణ ఇవ్వనే ఇవ్వరు. ఎప్పుడో నవంబర్ 1, 1956 ముందు సంగతులను, మహరాష్ట్ర-కర్నాటక రాష్ట్రాలలోని పూర్వ హైదరాబాద్ జిల్లాల విషయాన్ని అసందర్భంగా ప్రస్తావించి వితండ వాదాన్ని-అమాయకత్వాన్ని బయట పెట్టుకుంటారు. ప్రతిరోజు ఆయన గారు ఏదో ఒక ఛానల్ లో కనిపించి ఇదే అమాయకత్వాన్ని-వితండవాదాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి మరింత రెచ్చిపోయి, కే సీ ఆర్ ను బహిరంగ చర్చకు రమ్మంటూ సవాలు విసిరి ఇంకో నివేదిక తయారీలో నిమగ్నమైపోతారు. ఆ క్రమంలోనే ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడబోయి, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ముందు అవాక్కయి పోవడంతో ఆ తర్వాత మరే ఛానల్స్ లోను ఎక్కువగా కనిపించడం లేదు.

అసలు విషయానికొస్తే ఆ రోజు జరిగిన చర్చలో లగడపాటి, అమర్ తో పాటు దళిత వుద్యమ నాయకులు ప్రభాకర్ కూడా వున్నారు. వాద-ప్రతివాదనలు ఉదృత రూపం దాల్చడానికి ముందు, రాజగోపాల్ నివేదికల వుద్దేశాన్ని తప్పుబడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర్ర నినాదాన్ని నీరు కార్చే ప్రయత్నంలో భాగంగానే, మహరాష్ట్ర-కర్నాటక లోని జిల్లాలను అక్కడినుంచి విడగొట్టి తెలంగాణలో కలపే విషయాన్ని సమైక్యవాదులు తెర పైకి తెస్తున్నారన్నారు అమర్. ఇంతకూ తెలంగాణ కావాలని వుద్యమం చేసేది ఆంధ్రప్రదేశ్ లో వున్న తెలంగాణ ప్రాంతం వాళ్లే కాని, పక్క రాష్ట్రాల వాళ్లు కాదనే విషయం లగడపాటికి తెలియదా? ఏమో ! అదే విధంగా, సమాజంలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన దళితులు-అట్టడుగు వర్గాల వాళ్లు-పేదల స్థితిగతుల గురించి, వాటికీ-సమైక్య వాదానికీ వున్న సంబంధాల గురించి లగడపాటి తన నివేదికల్లో ఏమన్నా ప్రస్తావించారా అని ప్రభాకర్ అడిగిన దానికి కూడా సూటిగా వివరణ ఇవ్వలేదాయన. కరీంనగర్ లోగాని, కృష్ణా జిల్లా లోగాని దళితుల అణచివేతలో ఒకే విధంగా వ్యవహరించాయని, కాకపోతే తెలంగాణలో నెలకొన్న పటేల్-పట్వారీ వ్యవస్థ మూలాన వారు అక్కడ మరింత దోపిడీకి గురయ్యారని, అయినా ఎక్కడున్నా వారి పరిస్థితి ఒకటే అని ఏదో చెప్పబోయారే తప్ప సమైక్య వాదానికి దానికీ వున్న సంబంధం కానీ, అవి నివేదికల్లో పొందుపరిచిన విషయం కానీ వివరించలేదు. మధ్యలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన తెచ్చి వాదనను మరో వైపు మళ్లించారు. అదే విధంగా, మహారాష్ట్ర-కర్నాటక ప్రాంతాలకు, భారత-పాకిస్తాన్ ప్రాంతాలకు మరో రకమైన పోలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అసలు విషయమైన తెలంగాణ దళితుల ఆకాంక్ష గురించి ఆయనకు పట్టినట్లు లేదు. 54 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాల కాలం తప్ప మిగతా కాలం అంతా పాలించిన "లగడపాటి కాంగ్రెస్ పార్టీ" దళితులకు సమైక్య రాష్ట్రంలో మేలు జరుగుతుందా? ప్రత్యేక రాష్ట్రంలో మేలుజరుగుతుందా అన్న విషయాన్ని లగడపాటి తన నివేదికల్లో పట్టించుకోలేదని చర్చలో ప్రస్తావనకొచ్చింది. అందుకే తెలంగాణ ప్రాంత దళితులు, తాము విడిపోతా మంటున్నారు కదా అని ప్రశ్నిస్తే దానికీ సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోయారు రాజగోపాల్ గారు.

చిదంబరం డిసెంబర్ ప్రకటన తర్వాత అందరికంటే ముందు ఎందుకు లగడపాటి రాజీనామా చేశారని, ఎందుకు కే సీ ఆర్ కు పోటీగా నిరాహార దీక్షకు పూనుకున్నారని, వీటికి సంబంధించి నివేదికల్లో ఏమన్నా ప్రస్తావన వుందా అని ప్రశ్నిస్తే, ఆ సమాధానం కూడా వింతగానే వుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో అంతర్లీనంగా సమైక్య భావన వుందని, కలిసి వుండాలన్న తహ-తహ నిజాం కాలం నుంచే నాటుకు పోయిందని మరో రహస్యం వెల్లడి చేశారు. దరిమిలా హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడగొట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చి విశాలాంధ్ర ఏర్పాటు చేశారని, అప్పట్లో తెలంగాణ జిల్లాలతో సహా అందరూ "విశాలాంధ్ర" కు అనుకూలంగా తీర్మానం చేశారని బల్ల గుద్ది చెప్పడం మరో విశేషం. "తెలుగు తల్లి గర్భ సంచిలోంచి సమైక్యత వాదం పుట్టుకొచ్చింది" అని, దానికి తాను బలం చేకూరుస్తున్నానని (అందుకే తాను అవతరించినట్లు) గొప్పలు చెప్పుకున్నారు. ఇక ఇక్కడ నుంచి వాద-ప్రతివాదనలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతం వారు తమ వ్యాపార లావాదేవీలను కాపాడుకోవడానికి డిసెంబర్ తొమ్మిది తర్వాత సమైక్య వాదన పుట్టుకొచ్చిన విషయం వాస్తవం కాదా అని లగడపాటిని వివరణ అడుగుతే, దానికి సమాధానం ఇవ్వకుండా, పెద్దమనుషుల ఒప్పందం ఏ విషయంలోనూ, ఎప్పుడూ (ఒక్క ఉపముఖ్యమంత్రి విషయంలో తప్ప) ఉల్లంఘన జరగలేదని మరో వితండ వాదన తెర పైకి తెచ్చారు. రాజగోపాల్ ఎప్పుడైతే అలా వర్తమాన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం మొదలెట్టారో తెలంగాణ వుద్యమం గురించి ఆయనకు కొంత వివరించడం మంచిదని ఆ దిశగా తన వాదనను వినిపించారు సీరియస్ గా అమర్.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందని, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని, తమ సామాజిక-సాంస్కృతిక-భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగు వారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు ఏనాడో అభిప్రాయపడ్డారని, అయినా "విశాలాంధ్ర" ఏర్పాటు జరిగిందని, ఆ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అది జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయిందని మరొక్కమారు చరిత్రను గుర్తుచేశారు అమర్. 1969 లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గురించి, 1970 నాటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం గురించి, 350మంది తెలంగాణ ప్రాంతం వారు మరణించిన సంగతి వివరిస్తూ, అమర్ గత 30-40 సంవత్సరాల కాలంలో ఇంత జరుగుతున్నా, లగడపాటి లాంటి సమైక్యవాదులు, ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి వుండాలన్న భావనను ముందుకు తీసుకెళ్లడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకపోగా, రెచ్చగొట్టే చర్యలెన్నో చేపట్టారన్నారు. ఒకవేళ కలిసుంటే బాగుంటుందేమో అనుకునే కొంత మందిలో కూడా అ భద్రతా భావాన్ని పెంపొందించారని గుర్తుచేశారు. విడిపోదామన్న ఆకాంక్ష మరింత బలీయమై, ఈ రోజు గ్రామ-గ్రామానికి పాకి, ప్రతి తెలంగాణ వ్యక్తి, తమకు అన్నివిధాల అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి అరుస్తుంటే, ఈ సమైక్యవాదులు ఏమని నచ్చచెప్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం రాజగోపాల్ దగ్గర్నుంచి రాలేదు.

ఇరు ప్రాంతాలు విడిపోవాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగాలని కోరుతూ అనేకానేక పాటలు-గేయాలు-జానపదాలు-నాటకాలు వెలువడ్డాయని, సెమినార్లు నిర్వహించబడ్డాయని, కలిసుండాలన్న సమైక్యతా వాదులు ఇలాంటివి చేసిన దాఖలాలు ఒక్కటైనా ఎందుకు లేవని దళిత నాయకుడు ప్రభాకర్ ప్రశ్నిస్తే దానికీ జవాబు రాలేదు లగడపాటి నుంచి. ఎన్నికల్లో అన్ని పార్టీలు తెలంగాణ ఇస్తామని ప్రకటించ లేదా అని నిలదీస్తే అవాక్కై పోయారు పాపం. ఇక ఇలా కాదను కొన్న లగడపాటి మరో వితండవాదాన్ని-ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రస్తావించి చర్చలో పాల్గొన్న వారితో పాటు చూస్తున్న మాలాంటి వారి ఆగ్రహానికి కూడా గురయ్యారు. పంజాబ్ రాష్ట్రం నుంచి ఖలిస్తాన్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఒకటేనని పోల్చడంతో ఆయనకు ఘాటుగా సమాధానం చెప్పాల్సి వచ్చింది.

ఖలిస్తాన్ తో తెలంగాణ ఉద్యమాన్ని పోల్చడాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణించారు అమర్. భారత దేశాన్నుంచి విడిపోవాలన్న ఖలిస్తాన్ ఉద్యమానికి, భారత దేశంలోనే వుండాలన్న తెలంగాణ ఉద్యమానికి వ్యత్యాసం తెలుసుకోలేక పోవడం రాజగోపాల్ లాంటి వారు చేస్తున్న కుట్రలో భాగమే అని, ఇలాంటి వాదనలు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి ఎలా దోహదపడ్తాయని, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలను సీమాంధ్రులు తమ సరసకు తెచ్చుకునే ప్రయత్నం ఇదేనా అని ఎదురుదాడికి దిగితే తప్పించుకునే మార్గం కూడ కనపడలేదు లగడపాటికి ఆరోజు జరిగిన చర్చలో.

చివరగా:
"ఖలిస్తాన్-తెలంగాణ ఉద్యమాలు ఒకరకమైనవి కావు లగడపాటి గారు. ఖలిస్తాన్ ఉద్యమం ఎందుకు జరిగిందో చదువుకుని హోమ్ వర్క్ చేసి మరీ చర్చల్లో పాల్గొనండి రాజ్ గోపాల్ గారూ..."

"రెండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన వాళ్లు మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆలోచించండి !"

"రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు లగడపాటి లాంటి సమైక్యతా వాదులు ఏం చేశారు? ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎన్ని రకాల చులకన-గేలి చేశారు?"

"ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పక్కదారి పట్టించే ’బూచి’ ని చూపించకండి !"

"ఎన్నికల్లో గెలుపు-ఓటములు ఉదాహరణలుగా తీసుకుని తెలంగాణ వాదనను బలహీనంగా చిత్రించకండి !"