Showing posts with label లాస్ ఏంజల్స్. Show all posts
Showing posts with label లాస్ ఏంజల్స్. Show all posts

Friday, January 15, 2010

జ్వాలా మ్యూజింగ్స్-6 (అమెరికా రహదార్లు)

"శాంతా క్లారా-లాస్ ఏంజల్స్-డిస్నీ లాండ్"

"ఉడ్ లాండ్ హిల్స్-హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు-శాంతా క్లారా"

“అలసటెరుగని ఏడెనిమిది వందల మైళ్ల ప్రయాణం”

వనం జ్వాలా నరసింహారావు


యు.ఎస్.ఏ లో కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రత్యేకతుంది. శాన్ ఫ్రాన్ సిస్కో, శాంతా క్లారా లోయ, డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోలు, సిలికాన్ లోయ, ఆరెకిల్, గూగుల్ సంస్థలు ఇక్కడే వున్నాయి. ఆశ్చర్యం కలిగించే "బే వంతెన", "గోల్డెన్ గేట్ వంతెన" సముద్రం మీద కట్టబడింది ఇక్కడే. ఆహ్లాదం కలిగించే విహార స్థలాలెన్నో వున్నాయి. లాస్ వేగాస్ వెళ్లి "గాంబ్లింగ్" పత్తాల ఆట ఆడేందుకు దేశ-విదేశాల నుంచి పర్యాటకులొస్తుంటారు. న్యూ ఇయర్స్ డేకు వారి సంఖ్య అధికంగా వుంటుంది. శాన్ ఫ్రాన్ సిస్కో లోని డౌన్ టౌన్ రోడ్ మీద ప్రయాణం, అక్కడకు పోవడానికి సముద్రం పక్కనుంచి-దాదాపు సాగర జలాల అంచునుంచి చేరుకోవడం బలే సరదాగా వుంటుంది. అలానే క్రుకెడ్ రోడ్. రోడ్డంతా, నేరుగా, ఒంపులు-వంకర టింకరలు లేకుండా, సుదూరంలో ఆకాశం నేలను తాకుతున్నట్లు, అద్భుతమైన సుందర దృశ్యం లా కనిపిస్తుంటుంది. ఆ రహదారి మీద కారులో పోతుంటే భయం కూడా వేస్తుంది. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత వెనుక-ముందు ఎటు చూసినా-వళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుకు ఇరు పక్కలా, ఇళ్లు-కారు పార్కింగులుంటాయి. మేం ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు, మధ్యలో గుర్రపు స్వారీమీద గుజరాతీ పెళ్లి బృందం కనిపించింది. కారు నడిపేవాడి నైపుణ్యం మీదే అంతా ఆధారపడి వుంటుంది. లేదా దైవాధీనం. ఆదిత్య మొదటిసారిగా అటు వైపు వచ్చిన సంగతి వాడికి కూడా ఆలశ్యంగా తెలిసింది. శాన్ ఫ్రాన్ సిస్కో మీదుగా గోల్డెన్ గేట్ చూసి, తిరుగు ప్రయాణంలో, జీ.పి.ఎస్ అటు దిక్కుగా దారి చూపిస్తే అలానే ప్రయాణం చేశాం. రెండో సారి కావాలనే వెళ్ళాం. ప్రమాదాలకు నిలయమైనట్లున్నా, ఒక్క ప్రమాదం కూడా మాకంట కనపడలేదు. కొన్ని సంవత్సరాల క్రితం సంభవించిన భారీ భూకంపం తాలూకు గుర్తు లింకా కొన్ని అక్కడక్కడా ఆ ప్రాంతంలో కనిపిస్తాయి.


అమెరికా దేశంలోని నలు మూలల నుంచి వందల మైళ్ల దూరం అనాయాసంగా-సునాయాసంగా సొంత కార్లలో, స్వయంగా నడుపుకుంటూ ప్రయాణం చేసి ఇక్కడి ప్రదేశాలు చూసి పోగలగడానికి ప్రధాన కారణం దేశమంతా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన రహదారులు-అమల్లో వున్న డ్రైవింగ్ నిబంధనలు-చిత్త శుద్ధిగా వాటిని ఆచరణలో పెట్తున్న వాహనదారులు. అహర్నిశలూ అలసటొచ్చే దాకా పనిచేసే అమెరికన్లు, వారాంతపు శెలవులు గడపడానికి, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, వందల మైళ్ల వేగంతో వాహనాలు నడిపినా, వారి అంతిమ లక్ష్యమైన సుఖప్రదమైన జీవితం గడిపేందుకు, గిరిగీసుకున్నట్లుగా, కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందా-లేదా అని గమనించకుండా, పౌరులందరూ వాటిని పాటిస్తుంటారు. అందులో రహదారి నియమ నిబంధనలు ఒకటి. ఉదాహరణకు "కార్ పూల్ మార్గం". వేగంగా వెళ్లడానికి అనువుగా వుండే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, కారులో, ఇద్దరికంటే ఎక్కువ మంది వుండాలి. అలా లేని కారు నడిపే వ్యక్తి, ఎవరు గమనించినా-గమనించకున్నా, "కార్ పూల్ మార్గం" లోకి వచ్చే ధైర్యం చెయ్యడు.


ఆంధ్ర ప్రదేశ్ లో (ఆ మాటకొస్తే దేశం మొత్తం లో కూడా) "మౌలిక సదుపాయాల అభివృద్ధి" పేరుతో రోడ్ల అభివృద్ధికి అనేక ప్రణాళికలు వేయడం జరిగింది గాని, అమలు చేయడంలోనే అలసత్వం చోటు చేసుకుంటున్నది. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు అలనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో, "విజన్ 2020" బృహత్తర ప్రణాళిక కింద ఏర్పాటుచేసిన "మంత్రివర్గ ఉపసంఘం" అప్పటి జాతీయ-రాష్ట్రీయ రహదారుల్లో చోటుచేసుకున్న పలు లోటు పాట్లను గుర్తించింది. డ్రైవింగ్ కు అనుకూలించని నైపుణ్యం కొరవడిన రోడ్లు, ఎదురుగా-పక్కగా వచ్చే వాహనాలను తప్పించుకోవడానికి సరిపోయేంత వెడల్పులేని రోడ్లు, సరైన కంకర-డాంబర్-సిమెంట్ కు నోచుకోని రోడ్లు, అవసరమైన ప్రదేశాల్లో ఇంకా మాంధాతల కాలం నాటి కూలడానికి సిద్ధంగా వున్న వంతెనలు, అసందిగ్ధమైన హైవే హద్దులు, ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియ చేసే ఏర్పాట్లు లేకపోవడం, రహదారిపై ఒక పక్క ఆపుకోడానికి ఏ మాత్రం సౌకర్యాలు లేకపోవడం లాంటి ఎన్నో లోటు పాట్లను గుర్తించడమైతే జరిగింది గాని, ప్రభుత్వాలు మారినా, అవి సరిద్దిద్దేందుకు పటిష్ఠమైన చర్యలంతగా తీసుకోలేదనే అనాలి. అర-కొర సౌకర్యాలు కలిగించినా, అవి చాలావరకు కాంట్రాక్టర్లకు లాభమే కలిగించడానికే అనాలి.


ఆరు లేన్ల-నాలుగు లేన్ల జాతీయ-రాష్ట్రీయ రహదార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినా, అమలు వరకు వచ్చేసరికి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందాన నత్తనడకలో సాగుతున్నాయి పనులు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విషయంలో ఎన్నో మార్లు ఆందోళనలు-ఉద్యమాలు జరిగాయి. ఆ రహదారిలోని నియోజకవర్గానికి లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుడు, సంబంధిత మంత్రివర్గ శాఖను కేంద్రంలో నిర్వహించినప్పటికీ, అటు-ఇటు కొనల్లో కేవలం నలబై కిలోమీటర్ల దూరంలో కొంత నిర్మాణం జరిగినా పూర్తవడం ఎప్పుడనేది ఎవరికీ తెలియదు. ఈ నేపధ్యంలో అమెరికా రహదారుల్లో ప్రయాణం గొప్ప అనుభూతనాలి. ఆ రోడ్లను చూసి మనం నిర్మించాలనుకున్న రోడ్ల విషయంలో తెలుసుకోవాల్సిందెంతో వుంది.


అమెరికా రహదారుల మీద వాహనం నడపడమైనా, ఎవరన్నా నడుపుతుంటే కూర్చొని ప్రయాణం చేయడమైనా ఆసక్తికరంగా-ఆహ్లాదంగా-శరీరం గగుర్పొడిచేదిగా-మజాగా వుండడంతో పాటు, ఏ మాత్రం ఏమరు పాటుగా కారు నడిపినా-నడిపేవారి పక్కన కూర్చున్నా, ప్రమాదపుటంచుల్లోకి నేరుగా పోతున్నట్లుంటుంది. అన్ని రకాల వాహనాలు-భారీ, మధ్య రకం, చిన్నవి-వివిధ లేన్లలో, ఏక కాలంలో కనీసం నాలుగు కంటే తక్కువ లేకుండా, ఇరు వైపుల నుంచీ, తక్కువలో తక్కువగా గంటకు 50-60 మైళ్ల వేగంతో పోతుంటాయి. అంతకంటే ఎక్కువ వేగంతో పోకూడదని హెచ్చరికతో "కంప్యూటరైజ్డ్ డిజిటల్ బోర్డులు" రహదారి పొడుగూ ఏర్పాటు చేసినప్పటికీ అనుభవం-నైపుణ్యం-ఏమరు పాటుగా నడుపుతూ, డ్రైవింగ్ ను అదుపులోకి తెచ్చుకోగల సామర్థ్యం వున్న కొందరు వంద మైళ్ల వేగంతో కూడా నడుపుతుంటారు. కాకపోతే, వెనకాలే రహదారి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వస్తున్న వాసన తగలగానే వేగం తగ్గిస్తుంటారు.


వివిధ రాష్ట్రాలను కలుపుతూ వేసిన రహదారులను "జాతీయ హై వేలు" అని మనదేశంలో పిలుస్తున్నట్లు, అమెరికాలో వాటిని "అంతర్ రాష్ట్ర రహదారులు" అని అంటారు. ఇండియాలో వాటికి ఎన్. హెచ్ 1, ఎన్.హెచ్ 2 .. ... అని నంబర్లిస్తారు. అమెరికాలోను అదే మాదిరి నంబర్లుంటాయిగాని, ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దులో ప్రవేశించగానే అవి మారుతుంటాయి. ఉదాహరణకు "ఏ" రాష్ట్రంలోని ఒక స్థలం నుంచి "సి" రాష్ట్రం లోని మరో స్థలానికి "బి" రాష్ట్రం నుంచి పోవాలనుకుందాం. అలా పోతుంటే, "ఏ" నుంచి "బి" కి ఒక నంబర్, "బి" నుంచి "సి" కి మరో నంబర్ కేటాయిస్తారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశగా-దక్షిణం నుంచి ఉత్తర దిశగా వున్న అంతర్ రాష్ట్ర రహదారులకు బేసి సంఖ్యలు (1, 3, 5..), తూర్పు-పడమరగా, పడమర-తూర్పు గా వున్న రహదారులకు సరి సంఖ్యలు (2, 4, 6...) కేటాయించబడతాయి.


ఏ పరిస్థితుల్లోను, ఎదురుగా వాహనాలు రాకుండా-వాహనాలు ఒకదానికొకటి ఎదురు పడకుండా వుండే విధంగా, వెడల్పాటి రహదారి డివైడర్లను, ఇరువైపుల వేసిన అంతర్ రాష్ట్ర రోడ్ల మధ్య ఏర్పాటు చేస్తారు. ఒకవిధంగా "వన్ వే ట్రాఫిక్" అని చెప్పాలి. ఎంత వేగంతో ఎవరు వాహనం నడిపినా, "హెడ్ ఆన్ కొలిజన్" ప్రమాదాలకు ఆస్కారం లేదు. ఇతర రకాల ప్రమాదాలకు కూడా అవకాశాలు తక్కువే-దాదాపు వుండవనే అనొచ్చు. ఒకవేళ హైవేలలో ప్రమాదమంటూ జరుగుతే, అది వెనుకనుంచి వస్తున్న వాహనం ముందున్న దానిని, వేగాన్ని అదుపు చేయలేక, ఢీ కొనడం వల్ల మాత్రమే జరిగే అవకాశం వుంది. అలా ఎప్పుడు జరిగినా, సాధారణంగా, ఒక మోస్తరుగా కాకుండా, భారీ స్థాయిలోనే ప్రమాదం సంభవిస్తుంది. ఎంతో సేపు, ఎన్నో వాహనాలు ఒక పక్కగా ఆగిపోయే అవకాశం వుంది. అయితే వీలైనంత త్వరగా, అధికారులకు సమాచారం చేరి, అంతే వేగంగా, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్తారు.


ఇరువైపుల నుంచి, అంతర్ రాష్ట్ర రహదారుల్లో కనీసం రెండో-మూడో "చానల్స్" లేదా "పాస్ వేస్" (లేన్లు) ఏర్పాటుంటుంది. వాహనం నడిపేవారు, వారి-వారి వేగానికనుకూలంగా, సరిపడే విధంగా, ఒక లేన్లో ప్రయాణిస్తుంటారు. "ఎల్లప్పుడూ కుడి వైపునే నడపండి-లేన్ మారటానికి మాత్రమే ఎడమ వైపుకు తీసుకోండి" అన్న బోర్డులుంటాయి ప్రతి చోటా. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే, అందుబాటులో ఎడమ వైపున వున్న లేన్ లోకి మారి, వాహనం నడపాలి. వెనుకా-ముందు పోతున్న ఏ వాహనానికి-అది నడుపుతున్న వారికి, ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా, హారన్ మోగించ కుండా, లేన్లు మారాలి. మన దేశంలో మాదిరి, డోర్ అద్దాలు లేపి, పక్క వాహనం నడిపేవాడిని, దూషించుకుంటూ-అదే పనిగా హారన్ మోగించుకుంటూ, ఇతరులకు వీలైనంత అసౌకర్యం కలిగించుకుంటూ, వాహనాలు నడిపే వారెవరూ వుండరు. బధ్రతా కారణాల దృష్ట్యా, వాహనం నడిపే వ్యక్తి-ముందు సీట్లో నడిపే వారి పక్కన కూర్చొన్న వ్యక్తి, విధిగా "సీట్ బెల్ట్" కట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాల నిబంధనల ప్రకారం వెనుక సీట్లో కూచున్న వారు కూడా సీటు బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పట్టుబడితే, ఆ బాధ్యత, కారు నడుపుతున్న వాడిపైన వేస్తారు పోలీసులు. ఆ తప్పుకు అనుగుణమైన "టికెట్" ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాహనం నడిపే వ్యక్తి నడపడంలో ఎలాంటి తప్పుచేసినా, దానికి తగిన శిక్ష కింద, పోలీసులు "టికెట్లు" ఇవ్వడం జరుగుతుంది. వాటి వివరాలన్నీ డ్రైవింగ్ లైసెన్స్ లో పొందుపరిచి, ఆ తప్పుల కొచ్చిన పాయింట్ల ఆధారంగా, లైసెన్స్ కొంతకాలం రద్దుచేయడమో-శాశ్వతంగా తీసేయడమో జరిగే అవకాశం కూడా వుంది. టికెట్ ఇచ్చిన ప్రతిసారీ భారీగా ఫైన్ కూడా వసూలు చేస్తారు. అలానే మత్తు పదార్థాలు సేవించి వాహనం నడిపినా శిక్షార్హుడే. ఒక సారి లైసెన్స్ పోతే మళ్లీ రావడం చాలా కష్టం. అసలు మొదటిసారి రావడమే కష్టం. మా కోడలు మూడోసారి టెస్ట్ కు వెళ్తే గాని దొరకలేదు. లైసెన్స్ లేకుండా నడిపితే-ఇంక అంతే సంగతి.


హైవే మీద వాహనం నడిపే వ్యక్తి ఏదన్నా ట్రాఫిక్ నిబంధనను అతిక్రమించినట్లు, రహదారి పెట్రోలింగ్ పోలీసు అధికారి గమనిస్తే, వాహనం వెనుకనే వస్తున్న పెట్రోలింగ్ కారుకు అమర్చబడిన లైట్ల ద్వారా సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. క్షణం కూడా ఆలోచించకుండా-కుయ్, కయ్ అనకుండా వాహనం నడుపుతున్న వ్యక్తి, తన వాహనాన్ని, రోడ్డుకు ఇరు పక్కలా వుండే "షోల్డర్స్" అని పిలువబడే వైపుగా తీసి ఆపు చేస్తాడు. వాహనం పట్టేంత జాగా మాత్రమే వుండే "షోల్డర్", వివిధ కారణాల వల్ల వాహనాన్ని హైవే మీద ఆపుకోవాల్సిన పరిస్థితుల్లో, పార్క్ చేసేందుకు, ఏర్పాటు చేసిన ఒక సౌకర్యం. దానిమీద వాహనం నడుపుతే, అంతులేని శబ్దం వచ్చే విధంగా, రోడ్డు కింది భూ పొరను తయారు చేస్తారు. కేవలం పార్క్ చేయడానికి మాత్రమే ఆ స్థలం అనుకూలం. పోలీసు సిగ్నల్ చూసి వాహనాన్ని ఆపు చేసిన వ్యక్తి కిందకు దిగాల్సిన అవసరం లేదు. పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసు అధికారే డ్రైవర్ దగ్గరకొస్తాడు. వచ్చిన వెంటనే, అతడు అతిక్రమించిన నిబంధన-దానికి చెల్లించాల్సిన ఫైన్, టికెట్ వివరాలు తెలియచేస్తాడు. వాద-ప్రతివాదాలకు అవకాశం వుండదు. తనకు పలుకుబడి వుందనో-పాత్రికేయుడిననో-ఉన్నతాధికారులు తెలుసుననో, వాహనం నడుపుతున్న వ్యక్తి వాదనకు దిగడు. అతడు తప్ప ఇతరులెవరు వకాల్తా పుచ్చుకొని మాట్లాడరు. తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి చట్టపరమైన మార్గాలను తర్వాత అన్వేషించవచ్చు. అక్కడ కాదు. అతడు చేసిన నిబంధనలకు విరుద్ధమైన చర్య ఆపాటికే రోడ్డు పైన అమర్చిన రాడార్ లో రికార్డయి వుంటుంది.అసలు వాహనం నడిపేవారికే తను చేసిన తప్పేంటో తెలిసిపోతుంది ఆపాటికే.


హైవే పొడుగునా రక-రకాల "ఎగ్జిట్లు" వుంటాయి. ప్రధాన హైవే నుంచి తప్పుకొని, మనం వెళ్లాల్సిన మరో దారికి పోవడానికి ఉపయోగించాల్సిన మార్గాన్నే "ఎగ్జిట్" అంటారు. వెళ్లాల్సిన కారణం ఏదైనా కావచ్చు. వాటిని "గాస్ ఎగ్జిట్" అని, "ఫుడ్ ఎగ్జిట్" అని, "లాడ్జింగ్ ఎగ్జిట్" అని, "కంఫొర్ట్ ఎగ్జిట్" అని, "హాలిడే ఎగ్జిట్" అని, "కాంప్ ఎగ్జిట్" అని, "హాస్పిటల్ ఎగ్జిట్" అని పిలుస్తారు. వాహనాలకు గాస్ నింపు కొనేందుకు, తిను పదార్థాలకొరకు, కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు, శెలవు దినంగా గడిపేందుకు, అత్యవసర వైద్య సదుపాయం కొరకు, లేదా మరేదైనా సౌకర్యం కొరకు ఉద్దేశించబడినవి ఇవి. అలానే, ప్రధాన రహదారి నుంచి, మనం వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకునేందుకు మళ్లాల్సిన మార్గాన్ని కూడా "ఎగ్జిట్" అంటారు. వీటికి నంబర్లుంటాయి. మనం తీసుకోవాల్సిన "ఎగ్జిట్" తెలిసైనా వుండాలి, లేదా, జీ. పి. ఎస్ సహాయంతోనైనా తెలుసుకోవాలి. హైవే ఎగ్జిట్ లలో అనేక సదుపాయాలుంటాయి. హైవేకు ఎడమ వైపున వున్న ప్రదేశానికి చేరుకోవాలంటే, కుడివైపునున్న సంబంధిత ఎగ్జిట్ లోకి ప్రవేశించి, ప్రధాన రహదారి పైన ఏర్పాటు చేసిన "ఫ్లై ఓవర్" మీద నుంచో, కింద ఏర్పాటు చేసిన రోడ్డు నుంచో, అటు వైపుగా పోవాలి. ఎక్కడ పడితే అక్కడ వాహనం మరల్చకూడదు-మరల్చే అవకాశం కూడా వుండదు. ప్రతి పాతిక-ముప్పై మైళ్లకు ఏదో ఒక రహదారి సౌకర్యం వుంటుంది. ఇందులో కొన్ని ప్రభుత్వ పరంగా, కొన్ని ప్రయివేట్ పరంగా నిర్వహించబడతాయి. పర్యాటక రంగానికి చెందిన సమాచారం అడుగడుగునా లభిస్తుంటుంది. తిండికి ఏ కొరతా వుండదు. శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మార్గంలో భారతీయ సంప్రదాయ ఆహారం కూడా దొరుకుతుంది. ఇక మెక్ డొనాల్డ్ లు సరే సరి.


అమెరికాలో "ఫ్రీ వేలు" చాలా చోట్ల వుంటాయి. అందులో వెళుతుంటే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపిస్తాయి. అయినా నిబంధనలను అతిక్రమించి ఎవరూ నడపరు. పల్లెటూరి మార్గంలో పోతున్నప్పుడు కూడా ఇరువైపుల ఒక్కోసారి ఒకే లేన్ వుండి, ఎదురెదురు వస్తున్న వాహనాలు కనిపిస్తుంటాయి.


ఇలాంటి సౌకర్యాలున్న శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ రహదారిలో, వెళ్లేటప్పుడు, తిరిగొచ్చేటప్పుడు, మధ్యలో డిస్నీ లాండ్ కు-యూనివర్సల్ స్టూడియోలకు పోయినప్పుడు, ఆదిత్య ఎంత వేగంగా కారు నడిపినా ఎలాంటి భయం వేయలేదు. సుమారు హైదరాబాద్-విజయవాడ మధ్య నున్న దూరం కంటే ఎక్కువే వున్న శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య నున్న 350 మైళ్లకు పైనున్న దూరాన్ని వెళ్లేటప్పుడు-తిరిగొచ్చేటప్పుడు నాలుగైదు గంటల లోపునే చేరుకున్నాం. మొత్తం ప్రయాణం ఆదిత్య కారు నడుపుతుంటే చేశాం. అన్ష్ పక్కనుండి అలసటనేది లేకుండా చేశాడు.

Tuesday, January 12, 2010

జ్వాలా మ్యూజింగ్స్-5 (హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియో)

ఉడ్ లాండ్ హిల్స్-ఓక్ ఉడ్ అపార్ట్ మెంట్స్ నుంచి హాలీవుడ్ కు

వనం జ్వాలా నరసింహారావు

లాస్ ఏంజల్స్ కు వచ్చిన మూడో నాడు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. దారిలో యూనివర్సల్ స్టూడియోలు చూసి వెళ్లాలన్నది ఆలోచన. లాస్ ఏంజల్స్ సబర్బ్ లోని ప్రశాంత్ వుండే ఉడ్ లాండ్ హిల్స్ నుంచి సుమారు 10 మైళ్ల దూరంలో వున్న స్టూడియోలకు వెళ్లడానికి డౌన్ టౌన్ మార్గంలో వెళ్లాల్సి వుంటుంది. అక్కడ నుంచి వెనక్కు రాకుండానే, అటు నుంచి అటే శాంతా క్లారాకు వెళ్లొచ్చు. కాలిఫోర్నియా-లాస్ ఏంజల్స్ కౌంటీ లోని అందమైన “ఫెర్నాండో లోయ” లో వుంది యూనివర్సల్ సిటీ ప్రాంతం. ఫెర్నాండో లోయ సుమారు 250 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, వాయువ్యాన శాంత సుజనా కొండలు-పశ్చిమాన సిమి కొండలు-దక్షిణాన శాంత మోనికా కొండలు-తూర్పున వెర్డుగో కొండలు-ఈశాన్యంలో సాన్ గాబ్రియల్ కొండలతో వ్యాపించి వుంటుంది. లాస్ ఏంజల్స్ నది సమీపంలోనే ప్రవహిస్తుంటుంది. యూనివర్సల్ స్టూడియోలకు చెందిన 400 ఎకరాలకు (65 చదరపు మైళ్ల విస్తీర్ణంలో) పైగా వున్న సొంత స్థలంలో వుందీ యూనివర్సల్ సిటీ. ఇందులో డబ్బై శాతం లాస్ ఏంజల్స్ నగర సరిహద్దులకు వెలుపల, మిగాతాది సరిహద్దుల్లోను వుండడానికి కూడా తగిన కారణం వుంది. ఒక విధంగా స్టూడియోలు లాస్ ఏంజల్స్ లో వున్నాయని చెప్పుకునేందుకు, మరో విధంగా నగర స్థాయి వాణిజ్య పన్నులను-ఇతర నిబంధనలను అధిగమించేందుకు ఈ విధమైన ఏర్పాటుచేశారు నిర్వాహకులు. శాంత మోనికా కొండల పక్కనుంచి పోయే “ముల్హోలాండ్ డ్రైవ్”, ఫెర్నాండో లోయకు-హాలీవుడ్ కు మధ్య సరిహద్దని చెప్పుకోవచ్చు.


యూనివర్సల్ సిటీ ప్రాంతంలో, ఒక 36 అంతస్థుల భవనంతో సహా పది సిటీ ప్లాజాలు, హాలీ వుడ్ స్టూడియో-థీమ్ పార్క్, వాణిజ్య-వినోద కేంద్రమైన యూనివర్సల్ సిటీ వాక్, యూనివర్సల్ సెట్టింగుల లాంటివి అనేకం వున్నాయి. 36 అంతస్థుల భవనంలోనే యూనివర్సల్ స్టూడియోలు-అమెరికన్ టెలివిజన్ నెట్ వర్క్ నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ఎన్. బి. సి) లకు చెందిన వివిధ విభాగాలుంటాయి. ఎన్. బి. సి కి చెందిన ఒక విభాగమైన యూనివర్సల్ సిటీ స్టూడియోలు, అమెరికాలోని ఆరు భారీ సినీ స్టూడియోలలో ఒకటి. దీనికి చెందిన ప్రధాన నిర్మాణ-పంపిణీ యూనిట్ ను “యూనివర్సల్ పిక్చర్స్” అంటారు. సుమారు 100 సంవత్సరాల క్రితం, 1912 లో, జర్మనీ నుంచి వలస వచ్చిన జ్యూ స్థాపించిన అమెరికన్ మూవీ స్టూడియో ఇది.


రోజంతా-ఆ మాటకొస్తే నెల రోజులు కలియ తిరిగినా, ఇంకా-ఇంకా చూడాలని పించే ఆహ్లాద భరితమైన విహార స్థలం "లాస్ ఏంజల్స్ ఎంటర్ టైన్ మెంట్ రాజధాని" గా పేర్కొన బడే "హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు". ప్రశాంత్-వాడి భార్య-కూతురు మాతో పాటు రాకుండా కొంచెం ఆలశ్యంగా వచ్చి మాతో కలిసి తిరిగారు. మేం అక్కడకు చేరుకునే సరికి ఉదయం పది గంటల పైన అయింది. కారు పార్క్ చేసి, సిటీ ప్లాజా లిఫ్ట్ ద్వారా స్టూడియో ప్రాంగణం చేరుకున్నాం. వెలుపలే అద్భుత సుందర దృశ్యాలు కనిపిస్తాయి. అన్ష్ కెందుకో చిరు కోపం వచ్చి నందువల్ల వాడిని సముదాయించి, టికెట్ కొనుక్కొని, లోనికెళ్లాం. అలాంటి ప్రదేశాల్లో సరైన "ప్రణాళిక" తో చూడాల్సినవి ఎంపిక చేసుకోకపోతే సమయం వృధా కావడమే కాకుండా, ముఖ్యమయినవి చూడలేక పోతాం. ఆదిత్య అంతకుముందు రాకపోయినా కరపత్రాలలో సమాచారం ఆధారంగా ముందు-వెనుకల చూడాల్సిన వాటిని చక్కగా ప్లాన్ చేశాడు.


ప్రశాంత్ వాళ్లొచ్చే లోపు మేం ముగ్గురం చూసిన వాటిలో మొదటిది "సైమన్ జె స్మిత్" దర్శకత్వంలో నిర్మించిన పదహారు నిమిషాల నిడివిగల "ష్రెక్-4-డి" లఘు చిత్రం. మొదలు మమ్మల్నందరిని డంజన్ లాగా వున్న ఒక గదిలో కాసే పుంచి, ఇరువైపుల వున్న రెండు భారీ టెలివిజన్ మోస్తారు స్క్రీన్ల ద్వారా కథను టూకీగా తెలియచేస్తారు నిర్వాహకులు. లార్డ్ ఫార్క్వాద్ ప్రేతాత్మ, తానెలా సర్పా కార డ్రాగన్ నోటి నుంచి తప్పించుకొని, "పినొక్ జో", "జింగీ", "ఫెయిరీ టెయిల్ పాత్రలైన మూడు పంది పిల్లలను" బందీలుగా తన వద్ద వుంచుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నదో తెలియచేసే సీన్ చూపిస్తారు. సినిమా చూడడానికొచ్చిన ప్రతి వారినీ తనకు కావాల్సిన సమాధానాలు వచ్చేంతవరకు హింసిస్తానని అంటుందా ప్రేతాత్మ. ప్రేక్షకులకు భద్రతకు సంబంధించిన సూచనలు-సలహాలు ఇచ్చిన తర్వాత థియేటర్ ద్వారాలు తెరుచుకుంటాయి. సినిమా ఆసాంతం, చూస్తున్నంతసేపు, మనమీదకు అందులోని పాత్రలు ఉరికొస్తున్న ఫీలింగ్‌ కలిగేలా వుంటుంది.కూర్చున్న కుర్చీలు, కదలాల్సిన సీన్ వచ్చినప్పుడల్లా, దడ-దడ శబ్దం చేస్తూ, గగుర్పొడిచే విధంగా ముందుకూ-వెనక్కూ కదుల్తుండే ఏర్పాటు ఆటోమాటిక్ గా చేసుంటుంది థియేటర్ లో. అందరం ఎంజాయ్ చేశాం. సినిమా చూడడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలనిస్తారు పెట్టుకునేందుకు. తిరిగెళ్లేటప్పుడు అవి వాపస్ చెయ్యాలి.


"రివెంజ్ ఆఫ్ ది మమ్మీ"-భయంకరమైన అనుభూతినిచ్చే ఒక అడ్వంచర్స్ రైడ్. సాంకేతిక సహాయంతో, వేలాది మైళ్ల వేగంతో వస్తున్నట్లనిపించే, మమ్మీల సందడితో సరదాగా వుందది. "జురాసిక్ పార్క్ రైడ్ అడ్వంచర్", నీళ్లలో కలిగించే మరో అనుభూతి. జురాసిక్ పార్క్ సినిమా ఇంకా నిర్మాణంలో వున్నప్పుడే, హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలలో జురాసిక్ రైడ్ పేరుతో ఆరంభించారు. "అడ్వంచర్స్ ఆఫ్ క్యూరి యస్ గైడ్", "టెర్మినేటర్", "వాటర్ వరల్డ్", "హౌజ్ ఆఫ్ హారర్స్" లాంటివి మరికొన్ని చూశాం. ఇంతలో ప్రశాంత్ వాళ్లొచ్చి కలిశారు. అందరం మొదలు "స్టూడియో టూర్" కు బయల్దేరాం.


“స్టూడియో టూర్” కంటే ముందు అన్ష్ ఏదో చూద్దామంటే సుదూరంలో వున్న ఒక ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడకు పోవడానికి ఐదారు "ఎస్కలేటర్లు" దిగి, తిరిగి రావడానికి ఎక్కాలి. మా శ్రీమతి ఎస్కలేటర్ ఉపయోగించడానికి గత పదేళ్ల గా నేను చేసిన ఏ ప్రయత్నం ఫలించ లేదింతవరకు. లోగడ అమెరికా వచ్చినప్పుడు-ఇప్పుడు కూడా, అన్ని ఎయిర్ పోర్ట్ లలో లిఫ్ట్ ఎక్కడుందో వెతికి మరీ ఉపయోగించటం ఆమెకు అలవాటై పోయింది. ఎస్కలేటర్ అంటే ఎందుకో భయం ఆమెకు. ఆ భయం తీరేటట్లు చేశాడు ఆదిత్య-అన్ష్ కలిసి. ఎట్లాగో అందులో నిలిపి కిందకు దింపాం. అక్కడున్న రైడ్ చూసి, తిరిగి పైకెక్కుతుంటే-బహుశా అమెరికా చరిత్రలోనే మొదటిసారి అయుండాలి-మధ్యలో ఎస్కలేటర్ విద్యుత్ సరఫరా లోపంవల్ల ఆగిపోయింది. ఇంతవరకెప్పుడూ యూనివర్సల్ లో అలా జరగలేదని అక్కడివారందరూ అనుకుంటుంటే ఆశ్చర్యపోయాం. అది మా శ్రీమతి మహిమేనేమో! ఎస్కలేటర్ మెట్లెక్కి పైకొచ్చిందెలాగో. ఇక ఆమెను మళ్లీ ఎక్కించడం మా తరం కాదే మో అనుకున్నాం. అదేం మహిమోగాని, ఇక అప్పటి నుంచి, నాకంటే తనే ముందుగా ఎక్కడెక్కడ ఎస్కలేటర్ ఉపయోగించుకునే వీలుంటుందో అక్కడ పరిగెత్తి మరీ చేరుకుంటున్నది.


అన్నింటిలోకి అద్భుతమైన అనుభూతి “స్టూడియో టూర్”. అందరం కలిసి ట్రెయిన్ లాంటి బస్సెక్కాం. ప్రయాణం సాగినంతసేపు నిర్వాహకులకు చెందిన వ్యక్తి దారి పొడుగూ వ్యాఖ్యానం చెప్తూనే వుంటాడు. స్టూడియో ఆవరణలో వున్న ప్రదేశాలన్నీ చూపించడమే కాకుండా, సినిమాలు తీసేటప్పుడు ఉపయోగించే సాంకేతికపరమైన ట్రిక్కులు-టెక్నిక్కులు ప్రయోగాత్మకంగా దారి పొడుగూ ప్రదర్శించి చూపారు. సినిమాల్లో జలపాతాలను ఎలా సృష్టిస్తారో చూపించినప్పుడు ఆశ్చర్య పోయాం. అలానే అగ్నిప్రమాదాలు సంభవించడం, భూకంపాలు చోటుచేసుకోవడం సినిమాల్లో రూపొందించే విధానం చూసి సాంకేతిక పరంగా "సినిమా తీయడానికి కాదే దీ అనర్హం" అనిపించింది. ఎక్కడా అసహజంగా ఏదీ అనిపించదు. వర్షం కురిపించి-వరదలు-వాగులు సృష్టించి-అందులో కొట్టుకుపోతున్న వారిని చూసి క్షణం పాటు నివ్వెరపడి పోయాం. సినిమాల్లో ప్రమాదాలకు కార్లు గురైనప్పుడు అవి కింద-మీదా పడి ఎగురుతుంటే, బాంబు దాడుల్లో తునా-తునకలై పోతుంటే-అగ్ని ప్రమాదంలో మాడి-మసై పోతుంటే, ఇదంతా నిజంగా జరిగి నిర్మాతలకు నష్టం జరుగుతుందని బాధ పడతాం. అదంతా ఉట్టిట్టిదేనని స్టూడియో టూర్ లో తేలిపోయింది. అంతా సాంకేతికంగా జరిగే వ్యవహారమే. అలానే వంతెన మీద రైలో-బస్సో పోతుంటే, కూలినప్పుడు అందులో వున్న మనకు కలిగే భయబ్రాంతులను, భూకంపం వచ్చినప్పుడు మన మందులో ఇరుక్కొని పోతే ఎలా వుంటుంది కళ్లకు కట్టినట్లు చూడవచ్చు-అనుభూతి పొందవచ్చు. భారీ విమాన ప్రమాదం జరిగిన దుర్ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలను దగ్గరగా చూడవచ్చు.

ఇవన్నీ చూసి, కలిసి అక్కడ దొరికిందేదో తిని, ప్రశాంత్ వాళ్లను వెళ్లమని చెప్పి, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరుగు ప్రయాణమై, సాయంత్రం ఎనిమిది గంటల కల్లా శాంతా క్లారా చేరుకున్నాం. పారుల్ పెట్టిన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం.

Monday, January 11, 2010

జ్వాలా మ్యూజింగ్స్-4 (డిస్నీ లాండ్)

లాస్ ఏంజల్స్ ప్రశాంత్ ఇంటి నుంచి డిస్నీ లాండ్ కు

వనం జ్వాలా నరసింహారావు

లాస్ ఏంజల్స్ లో ప్రశాంత్ వుండే ఫ్లాట్ నుంచి కాలిఫోర్నియా డిస్నీ లాండ్ పార్క్ వున్న "అనా హిమ్" ప్రదేశం సుమారు 40 మైళ్ల దూరంలో వుంటుంది. గంట సేపు ప్రయాణం. మర్నాడు అక్టోబర్ రెండు ఉదయాన్నే, ప్రశాంత్ కారులో, వాడు, మేం ముగ్గురం బయల్దేరాం. చంటిది-అదిథి (ప్రశాంత్ కూతురు) అక్కడి అడ్వంచర్స్ చూసి భయపడుతుందని, వాళ్లమ్మ శిల్ప చెప్పడంతో తల్లీ-కూతుళ్లను ఇంట్లోనే వుంచి మేం వెళ్లాం. అక్కడికి చేరుకుని, కారు పార్క్ చేసి, టికెట్ కొనుక్కుని పదింటి కల్లా డిస్నీ లాండ్ లోనికి వెళ్లాం. ప్రశాంత్ అంతకు ముందు ఒకటి-రెండు సార్లు వచ్చినా, మా అందరికి అదే మొదటిసారి.

అనా హిమ్, కాలిఫోర్నియా (అమెరికా) లోని "థీమ్ పార్క్” తో సహా, డిస్నీ లాండ్ పేరు మీద పారిస్, టోక్యో, హాంగ్ కాంగ్ లో కూడా థీమ్ పార్కులున్నాయి. రిసార్ట్స్ పేరు మీద, కాలిఫోర్నియా, పారిస్, హాంగ్ కాంగ్, అమెరికా-ఫ్లారిడాలోని ఆర్ లాండ్, జపాన్-టోక్యోకు సమీపంలోని ఉరయసులో వున్నాయి. 2014 లో షాంగాయిలో ఇలాంటిదే ఒకటి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి చురుగ్గా.

థీమ్ పార్క్, అమ్యూజ్ మెంట్ పార్క్ ఒకరకమైనవే అనొచ్చు. పిల్లల దగ్గరనుంచి-పెద్దలవరకు, అన్ని వయసుల వారికి, స్త్రీ-పురుష భేదం లేకుండా, అందులోనూ, ఒక బృందంగా కలిసి వచ్చినప్పుడు, ఆనందాన్ని-ఆహ్లాదాన్ని అందించే ప్రదేశాలను థీమ్ పార్కనో-అమ్యూజ్ మెంట్ పార్కనో పిలుస్తారు. సాధారణంగా ప్రతిదినం మనం వుండే పరిసరాల్లో తీరిక సమయాల్లో వెళ్తుండే నగర పార్కులకు-ఆట స్థలాలకు, వీటికి చాలా తేడా వుంటుంది. అమ్యూజ్ మెంట్ పార్క్ కంటె థీమ్ పార్క్ లో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రదేశంతో పాటు, విభాగాలు కూడా చాలా ఎక్కువగా వుంటాయి. ఎన్నో ఏళ్లు శ్రమ పడి రూపొందిస్తారు వీటిని. అక్కడున్న ప్రతి విభాగం వెనుక ఒక కథ-అడ్వంచర్స్-ఒక నిడివైన దృశ్యంతో పాటు, అక్కడ కొచ్చిన పర్యాటకులకు వివరణాత్మకంగా తెలియచేసే ఏర్పాట్లుంటాయి. అలాంటి అద్భుతమైన థీమ్ పార్కుల్లో, అత్యంత పరమాద్భుతమైంది కాలిఫోర్నియాలోని అనా హిమ్ డిస్నీ లాండ్ థీమ్ పార్క్. అమెరికా వెళ్లిన వారెవరైనా, ఏ మాత్రం వీలున్నా, ఇక్కడకు కాని-ఆర్ లాండ్ కు కాని పోకుండా వుండరు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కరలేదు. అమెరికాలో నివసిస్తున్న వారైతే, ఏడాది పాసులనీ-నెల పాసులనీ తీసుకొని, వీలున్నప్పుడల్లా సందర్శిస్తుంటూనే వుంటారు.

అనా హిమ్-కాలి ఫోర్నియాలోని థీమ్ పార్క్, వాల్ట్ డిస్నీ సంస్థకు చెందిన "పార్కుల-రిసార్ట్సుల విభాగం" నిర్వహణలో నడుస్తుంది. వాల్ట్ డిస్నీ ప్రత్యక్ష పర్యవేక్షణ కింద రూపు దిద్దుకొని-నిర్మించబడిన ఈ ఏకైక డిస్నీ లాండ్ జులై 17, 1955 న పాత్రికేయుల ప్రివ్యూగా మొదలై, మర్నాటినుంచి పర్యాటకుల సందర్శన కొరకు ఆరంభమయింది. దేశాధ్యక్షులు, అధినేతలు, ప్రధాన మంత్రులు, ముఖ్యాతి ముఖ్యులతో సహా సుమారు పదికోట్లకు పైగా సందర్శకులు థీమ్ పార్కుకొచ్చారిప్పటివరకు. ఒక్క 2007 లోనే కోటిన్నరకు పైగా సందర్శకులొచ్చారని అంచనా. ఓ ఆదివారం నాడు, వాల్ట్ డిస్నీతన ఇద్దరు కూతుళ్లతో "గ్రిఫిత్ పార్క్" కు వెళ్లినప్పుడు, ఆయన మదిలో మొలకెత్తిన ఆలోచనే, అరవై ఏళ్ల తర్వాత డిస్నీ లాండ్ గా 1955 నాటికి రూపు దిద్దుకొంది.

జులై 17, 1955-ఆదివారం నాటి "అంతర్జాతీయ పాత్రికేయుల ప్రివ్యూ" ఆహ్వానితులైన అతిధులకు-పాత్రికేయులకు మాత్రమే పరిమితం చేశారు. హాలీవుడ్ కు చెందిన ముగ్గురు ప్రముఖ వాల్ట్ డిస్నీ స్నేహితులు-ఆర్ట్ లింక్ లెటర్, బాబ్ కమ్ మింగ్స్, రొనాల్డ్ రీగన్-యాంకర్లుగా వ్యవహరించిన అలనాటి ప్రివ్యూ ప్రత్యక్ష ప్రసారాలను అమెరికా వాసులెందరో వీక్షించారు. ఆ తర్వాత కొంతకాలానికి రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ప్రపంచ చరిత్రలోనే క్లిష్టమైన-భారీ ప్రత్యక్ష టెలివిజన్ ప్రసారమది. మర్నాడు మొదటిసారి సందర్శకులను అనుమతించిన రోజున, తెల్లవారు ఝామునుంచే జనం మూగడం, మొదటి టికెట్ ను వాల్ట్ డిస్నీ సోదరుడు రాయ్ డిస్నీ స్వయంగా కొనుక్కోవడం, రెండో టికెట్ కొన్న వ్యక్తిని డేవిడ్ మెక్ ఫెర్సన్ గా గుర్తించడం జరిగింది. అతడికి జీవితాంతం అన్ని డిస్నీ పార్కులకు ఉచితంగా ఎప్పుడైనా వెళ్లేందుకు పాస్ ను ఇచ్చారు నిర్వాహకులు. సెప్టెంబర్ 1959 లో సోవియట్ రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ అమెరికాకు వచ్చినప్పుడు, డిస్నీ లాండ్ కు వెళ్లాలనుకున్న అతడి అభ్యర్థనకు అమెరికా అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా సానుకూలంగా స్పందించలేదు.

సర్వ సత్తాక ప్రతిపత్తి గల స్వతంత్ర రాజ్యాల భూభాగం తరహాలో పలు విభాగాలుగా-నాలుగు మూల స్థంబాల్లా, వుంటుంది పార్క్. ఒక విభాగంలో ప్రవేశించిన సందర్శకుడికి, అందులో పూర్తిగా మునిగిపోయి, దాన్నే తిలకిస్తూ, ఆనందిస్తూ, మరిన్ని విభాగాలున్నాయని గాని-వాటిని కూడా చూడాలని గాని అనుకోడు. వాటి ఉనికినే గుర్తించడు. ఆరంభంలోని "మెయిన్ స్ట్రీట్-యు. ఎస్. ఏ", "అడ్వంచర్స్ లాండ్", "ఫ్రాంటియర్ లాండ్", "ఫాంటసీ లాండ్", "టుమారో లాండ్" లకు తోడుగా దరిమిలా ఏర్పాటుచేసిన "హాలిడే లాండ్", "న్యూ ఆర్లియన్స్ స్క్వేర్", " క్రిట్టర్ కౌంటీ", "మిక్కీస్ టూన్ టౌన్" లు ఇక్కడి థీమ్ పార్క్ లోని ఆకర్షణలు.

సందర్శకులు మొట్ట మొదలు ప్రవేశించే ప్రదేశం "మెయిన్ స్ట్రీట్-యు. ఎస్. ఏ". అక్కడినుంచి నలు దిక్కులకు వారి-వారి అభిరుచులను బట్టి వెళుతుంటారు సందర్శకులు. మెయిన్ స్ట్రీట్ లో రైలు స్టేషన్, టౌన్ స్క్వేర్, సినిమా హాలు, సిటీ హాలు, ఎంపోరియం, దుకాణాలు, డబుల్ డెక్కర్ బస్ లాంటివి కనిపిస్తాయి. మేం ముఖ్యంగా "అడ్వంచర్స్ లాండ్" లోనే ఎక్కువ సమయం గడిపాం. వీటిలో "జంగిల్ క్రూజ్", "ఇండియానా జోన్స్ అడ్వంచర్", "టార్జాన్స్ ట్రీ హౌజ్" లున్నాయి. "జంగిల్ క్రూజ్" లో ఒక పడవలో ఎక్కించి సహజ సిద్ధంగా ఉన్న నదుల్లోంచి తీసుకెళ్తుంటే నిజంగా ఎంజాయ్ చేశాం. దారిలో నీళ్లల్లో-నీళ్ల పక్కన ఒడ్డుపైన, పాము, వినాయకుడి బొమ్మ, ఏనుగు, కోతి, ఎలుగుబంటులు, జిరాఫీ, సింహాలు, పులులు, రైనో, మొసలి, గిరిజన నృత్యం, మునులు --- ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఒక చోట పక్కనున్న గోడమీద ఉర్దూలో ఏదో రాసి వుండడం కనిపించింది.

"ఇండియానా జోన్స్ అడ్వంచర్" భయంకరంగా అనిపించినా ఆహ్లాదకరంగా వుందనాలి. ఇండియానా జోన్స్ సినిమా ఆధారంగా రూపొందించారు దీన్ని. ఒక ఓపెన్ జీప్ లో కూర్చొబెట్టి, చీకటి గుహలగుండా, అత్యంత వేగంగా, బహుశా కంప్యూటర్ సహాయంతో తీసుకెళ్లారు. ఆసాంతం వ్యాఖ్యానం కొనసాగుతూనే వుంటుంది. జీపు అంతులేనన్ని కుదుపులుతో కదులుతుంటుంది. ఒక్కో చోట సరాసరి గుహను ఢీ కొట్టుకుంటున్నదా అనిపిస్తుంటుంది. కొద్ది నిమిషాల తర్వాత అక్కడినుంచి మరో చోటుకు వెళ్లాం. మరోచోట "టార్జాన్స్ ట్రీ హౌజ్" ను చూశాం. పెద్ద వట వృక్షం మీదకు నడుచుకుంటూ వెళ్ళే విధంగా అమర్చారు దీన్ని. పిల్లలు-ముఖ్యంగా మా అన్ష్ బాగా ఎంజాయ్ చేసాడిక్కడ.

కాసేపు డిస్నీ లాండంతా తిప్పే ట్రెయిన్ ప్రయాణం చేశాం. అది పోతుండే దారి పొడుగూ, అనేక దృశ్యాలు కనిపిస్తాయి. అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణ "జలాంతర్గామి" లో ప్రయాణం. సగ భాగం నీటిలో-సగ భాగం నీటిపైనా ప్రయాణించే పడవలో సుమారు పావుగంట సాగిన ప్రయాణంలో సముద్ర గర్భంలో జరిగే అద్భుతాలెన్నో తిలకించే ఏర్పాట్లు చేసారు నిర్వాహకులు.

మధ్యలో దొరికిందేదో తిన్నాం. అప్పుడప్పుడు నేను-మా శ్రీమతి విశ్రాంతి తీసుకుంటుంటే, అన్ష్, ఆదిత్య, ప్రశాంత్ మరికొన్ని అడ్వంచర్స్ తిలకించారు. ఒకచోట ఎవరికి వారే నడుపు కొని పోయే ఆటోమేటిక్ కార్లలో రైడ్ చేశాం. నేను-మా శ్రీమతి ఒక దాంట్లో, ఆదిత్య-అన్ష్ ఒక దాంట్లో, ప్రశాంత్ ఒక్కడు ఒక దాంట్లో రైడ్ చేశాం. మరో ప్రదేశంలో వున్న "మిక్కీస్ టూన్ టౌన్" కు వెళ్లాం. అక్కడ "మిక్కీ మౌస్" ను కలిసి ఫొటోలు దిగాం. "నువ్వు నిజమైన మిక్కీ మౌస్ కాదు" అన్నాడు అతడితో అన్ష్. చీకటి పడుతుంటే, నీటి మధ్యలో ప్రదర్శకులు, పడవపై ఆహ్లాదకరమైన నృత్యం చేసుకుంటూ సందర్శకులకు కను విందు కలించేదే "ఫాంటాస్మిక్". ప్రధానంగా కాలిఫోర్నియా డిస్నీ లాండ్ లో ప్రదర్శించే దీన్ని తిలకించేందుకు సందర్శకులు కొన్ని గంటల ముందు నుంచే అక్కడకు చేరుకుంటారు. దొరికిన జాగాలో కూర్చుంటారు.

ఇదవుతూనే చివరిగా, ఆకాశంలో మన దీపావళి పండుగను మైమరిపించే టపాసుల కాల్పులు మధురానిభూతిని కలిగిస్తాయి. అవి అలా చూసుకుంటూ, విడిచి పోలేక, నడుచుకుంటూ కారు పార్క్ చేరుకొని ప్రశాంత్ ఇంటికి వెళ్ళిపోయాం రాత్రి పదకొండు గంటల సమయంలో.

Sunday, January 10, 2010

జ్వాలా మ్యూజింగ్స్-3 (శాంతా క్లారా టు లాస్ ఏంజల్స్)

శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు కారులో ప్రయాణం

వనం జ్వాలా నరసింహారావు

అమెరికా-ఉత్తర కాలిఫోర్నియాలోని "శాన్ ఫ్రాన్ సిస్కో" సాగర తీరానికి దక్షిణ భాగాన వున్న అందమైన లోయ ప్రదేశమే "శాంతా క్లారా వాలీ". శాంతా క్లారా కౌంటీ లోని ఎక్కువ భాగంతో సహా శానోజ్ నగరం కూడా ఈ లోయలోనే వున్నాయి. "హృదయాలను పులకరించే మధురమైన లోయ" గా ఒకప్పుడు కవులచే అభివర్ణించబడిన ఈ లోయ ప్రాంతమంతా, ఇప్పటికీ మైళ్ల పర్యంతం, అందమైన వృక్షాలు-పూల పొదలు-పళ్ల చెట్లు-కూరగాయల తోటలు, వ్యాపించి వుంటాయి. 1960 సంవత్సరం వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద పళ్ల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిందీ లోయ. చుట్టుపక్కలంతా సారవంతమైన భూమి వుండడంతో, వ్యవసాయ ప్రాధాన్యమైన ప్రాంతంగా ఒకప్పుడుండే శాంతా క్లారాలోని చాలా భాగం, క్రమేణ నగరంగా మారిపోయినప్పటికీ, ఇంకా గ్రామీణ ఛాయలు పరిసరాల్లో-ముఖ్యంగా లాస్ ఏంజల్స్ దిక్కుగా పోతుంటే ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. వాస్తవానికి, "శాంతా క్లారా వాలీ", ఈనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన "సిలికాన్ వాలీ", ఒకదానిలో ఇంకోటి అంతర్భాగమే. శాంతా క్లారా వాలీ ఉత్తర కొనే, శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరానికి దక్షిణాన చివరి ముక్క. వాలీకి నైరుతీ భాగాన అందమైన "శాంతా క్రజ్ పర్వత సముదాయం", ఈశాన్య భాగాన "డైబ్లో కనుమలు" వ్యాపించి వుంటాయి. శాంతా క్లారా నగర ప్రాంతంలోని లిక్ మిల్ రోడ్ లోని ఒక భవన సముదాయంలో మా అబ్బాయి ఆదిత్య వుండే ఫ్లాట్ వుంది.


శాంతా క్లారా చేరుకోవడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరిన మే మెక్కిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం, శాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో లాండ్ అవుతుంటే అదో అద్భుత దృశ్యంలాగా వుంటుంది. సరాసరి సముద్రం మీదనుంచి, అందులో పడబోతోందా అన్న భయం కలిగే విధంగా, పక్కనే నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ ఒక్కటే కాదు: చుట్టుపక్కలున్న, ఓక్ లాండ్, శాంతా క్లారా, శానోజ్ విమానాశ్రయాలు కూడా అలానే వుంటాయిక్కడ. చుట్టూ సముద్రం-మధ్యలో ఒక ద్వీప కల్పం లాగా విమానాశ్రయం.


శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు సుమారు 350 మైళ్ల దూరం. విమానాలు, బస్సులున్నప్పటికీ, అక్కడినుంచి డిస్నీ లాండ్ కు-హాలీవుడ్ స్టూడియోలున్న ప్రదేశానికి వెళ్లి రావడానికి నిర్ణయించుకున్నందున మేం (అబ్బాయి ఆదిత్య, శ్రీమతి విజయలక్ష్మి, మనుమడు అన్ష్, నేను) కారులో వెళ్లాం. అక్కడెలాగు మా శ్రీమతి అక్క కొడుకు ప్రశాంత్ ఉద్యోగ రీత్యా వుంటున్నందువల్ల వాడింట్లోనే వుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూద్దామనుకున్నాం.


సుమారు ఐదున్నర గంటల ప్రయాణం ఆహ్లాద భరితంగా గడవడానికి కారణం ఆరు సంవత్సరాల వయసున్న మా మనుమడు అన్ష్. వాడికెందుకో నామీద ఆ ప్రయాణంలో కోపమొచ్చింది. హైదరాబాద్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు చేసిన విమాన ప్రయాణంలో వాడికిష్టమైన వాడిని నేనైతే, ఈ ప్రయాణంలో, ఆ ఇష్టం వాడి అమ్మమ్మ మీదికి పోయింది. పైగా నాపై ప్రదర్శించిన కోపానికి వాడిదైన పరిభాషలో, నా పై సినిమా తీసే ప్రతిపాదన దాకా పోయింది. ఆ సినిమాకు వాడే పేరు పెట్టాడు. వాడు తీద్దామనుకున్న ఆ సినిమా పేరు: "అల్ట్రా నైట్రోజెన్ ఉల్టా తాతయ్య-ప్యార్ కర్నేసే వజే ట్రబుల్ కర్తా హై". దారి పొడుగూ, వాడెలా ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు రాయ దల్చుకుంది, స్క్రీన్ ప్లే ఎలా వుండబోతుంది, సంగీతం ఎలా సమ కూర్చదల్చాడు అన్నీ వివరించాడు. సినిమాలో నన్ను విలన్ పాత్రకు, వాడి అమ్మమ్మను ప్రధాన పాత్రకు ఎంపిక చేశాడు. నన్నెలా వాడు తన ఆధీనంలో వుంచుకోదలిచాడో అసలు-సిసలైన అనుభవజ్ఞుడైన సినీ దర్శకుడిలా వర్ణిస్తుంటే ఆనందం-ఆశ్చర్యం కలిగింది. గర్వంగా కూడా ఫీలయ్యాం.


శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య కారు ప్రయాణం చేస్తుంటే విస్తారమైన పంట భూములు, ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్న అమెరికన్లు, లారీలలో నింపుకొని తీసుకెళ్తున్న టొమాటోలు-బంగాళ దుంపలు, దారి పొడుగూ కనిపించే రోడ్ పక్కనున్న పంటపొలాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల-పళ్ల అమ్మకం దుకాణాలు, సాగునీరు-తాగు నీరు సరఫరాకు సంబంధించిన చెరువులు-నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు-రిజర్వాయర్లు, అనేకం దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది మధ్య-మధ్యలో. ఆ సుందర దృశ్యాలను ఆస్వాదించుకుంటూ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరిన వాళ్లం, సాయంత్రం అయిదింటికల్లా ప్రశాంత్ వుండే ఫ్లాట్ కు చేరుకున్నాం. అమెరికాలో ఎవరినీ అడ్రెస్ అడగక్కరలేదు. జీ.పి.ఎస్ సహాయంతో సరాసరి ఇంటి ముందు వాలొచ్చు. వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, ప్రశాంత్-వాడి భార్య-కూతురుతో సహా అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం.


కాలిఫోర్నియా-పశ్చిమ లాస్ ఏంజల్స్ కౌంటీ లో, సుమారు 20 మైళ్ల నిడివున్నపసిఫిక్ సముద్ర తీరప్రాంతమే "మాలిబు" అని పిలువబడే చిన్న పట్టణం. పూనా-ముంబై మధ్యలో, ఖండాలా లోయలో, హిందీ సినిమా యాక్టర్లు కట్టుకున్నట్లే, హాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ తారలు మాలిబు పరిసరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకున్నారు. మాలిబు బీచ్, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చలి వున్నప్పుడు కూడా, వేడిగా వుంటుందని ప్రతీతి. దక్షిణ ప్రాంత కాలిఫోర్నియాకు చెందిన ధనవంతులైన పారిశ్రామిక వేత్తల ఇళ్లు కూడా మాలిబు బీచ్ ప్రాంతంలోనే వుంటాయి. పసిఫిక్ మహాసముద్రం తీరానికి కేవలం వందల మీటర్ల దూరంలోనే, దాదాపు సముద్రాన్ని ఆనుకొనే వీళ్ల ఇళ్లుంటాయక్కడ. అలా అంత చేరువలో వుంటూ సముద్రాన్ని-బీచ్ నూ అనునిత్యం దర్శించుకొని ఆనందిస్తుంటారు.


మాలిబు బీచ్ కు మేం చేరుకొనేసరికి సుమారు రాత్రి ఎనిమిదయింది. అయినా వందల సంఖ్యలో పర్యాటకులున్నారింకా. సముద్రంలో దిగి కాసేపు, బీచ్ లో కూచొని ఇంకొంచెం సేపు, సరదాగా గడిపాం. మాకంటే కూడా చిన్న పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ ప్రోగ్రాం వుంది కనుక ఆలశ్యం చేయకుండా, త్వరగా ఇల్లు చేరుకున్నాం.