Showing posts with label 108 అత్యవసర సహాయ సేవలు. Show all posts
Showing posts with label 108 అత్యవసర సహాయ సేవలు. Show all posts

Saturday, December 31, 2011

రాజకీయ మ్యాచ్‌ ఫిక్సింగ్‌!: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?

తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! -3
వనం జ్వాలా నరసింహారావు

ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న వారితో సహా, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి కూడా, అత్యవసర వైద్య సహాయం-అత్యవసరంగా-సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాలనుకుందీ సంవత్సరం. ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు, రాష్ట్రవ్యాప్తంగా, సుమారు రెండువందల ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులను తొలిదశలో ఎంపిక చేయదలిచింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగయ్యాయి. తొలుత రెండువందల ఆసుపత్రులకే పరిమితం చేయదల్చుకున్న ప్రభుత్వ నిర్ణయం దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు విస్తరించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన ఈ ఏడాది చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర వైద్య విధానం సంపూర్ణంగా కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు.  

2011 ఏప్రిల్ నెలలో తరచుగా వినిపించిన పదం "మాచ్ ఫిక్సింగ్". ఒక అ నైతిక ఒప్పందంగా "మాచ్ ఫిక్సింగ్" అనే మాట ముద్ర పడింది. ఆ తరహా "అప నమ్మకం" అనే ఆయుధాన్ని రాష్ట్ర రాజకీయ నాయకులు విపరీతంగా వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం. ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, తరువాత జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. అదే కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు. ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా.

ప్రభుత్వ ప్రయివేటు భాగ స్వామ్యంలో, 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు, సంబంధిత ప్రభుత్వ శాఖలోని కొందరు అధికారుల అలసత్వం వల్ల, మే నెల కల్లా, గతంలో వలె సేవలందించలేని స్థితికి చేరుకున్నాయి. సగటున గతంలో హాజరయ్యే రోజువారీ అత్యవసర సహాయ సేవలు గణనీయంగా పడిపోయాయి. సేవలను కోల్పోతున్న వారిలో, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, చిన్న పిల్లలు కూడా వున్నారుఅత్యవసర చికిత్స ఆలశ్యమవుతే సంభవించేది మరణాలే కదా! అదే విధంగా, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలలో పని చేస్తున్న సిబ్బంది సమ్మె సాకుగా చూపి, సిబ్బంది లేవనెత్తిన అంశాలను పరిష్కరించే బదులు, గత ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి, ప్రభుత్వమే సంబంధిత జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు పూర్వం, 475 సంచార వాహనాల ద్వారా, ఆ సేవలందించిన యాజమాన్యం, రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో- తాము నివసిస్తున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు కనీస వైద్య సౌకర్యాలు ఏ మాత్రం లేని, సుమారు ఇరవై వేల గ్రామాల ప్రజలకు, నెలకొక్క సారి, అది కూడా నిర్ధారిత తేదీన, అన్ని రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను సమకూర్చింది. లబ్ది పొందిన లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలలో, అనేక మంది గర్భిణీ స్త్రీలు, ప్రసూతి స్త్రీలు, పసి పిల్లలు, చంటి పిల్లలు కూడా వున్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ఆ సేవలెంతగానో తోడ్పడ్డాయి. డిసెంబర్ నెలనుంచి, కలెక్టర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అవే వాహనాలు, కనీసం ఒక్క రోజన్నా, ఒక్క గ్రామానికన్నా, నిర్ధారిత తేదీన వెళ్ళిన దాఖలాలు లేవని చెప్పాలి. ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు. అలాంటి ప్రజోపయోగమైన పథకాలలో అత్యంత ప్రయోజనమైన వి, బహుళ జనా మోదం పొందినవి, రాజకీయాలకు అతీతంగా-కుల మతాలకు అతీతంగా ఉపయోగ పడేవి, 108 అంబులెన్సులు- నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు-ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలు. వీటిని నిధుల లేమితో నీరు కార్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అన్న భావం ప్రజలలో కలిగిందీ ఏడాది.

కడప లోక్ సభ, పులివెందుల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపధ్యంలో, ఓటమి దరిమిలా ప్రభుత్వ భవిష్యత్ పై ఆసక్తికర పరిణామాలు సంభవించవచ్చని భావించిన నేపధ్యంలో, తన పార్టీ ఓటమిని ఎలా తీసుకుంటారని మీడియా వారడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఒక సారి ఓడిపోయినంత మాత్రాన, అది శాశ్వతంగా ఓటమి పాలైనట్లు కాదని సమాధానం ఇచ్చారు. ఓటమిని క్రికెట్ మాచ్ తో పోల్చి, ఉదాహరణగా, ఒకానొక అంతర్జాతీయ క్రికెట్ మాచ్ లో బలమైన టీమిండియా, బలహీనమైన బంగ్లాదేశ్ టీంతో ఓటమి పాలైన విషయాన్ని, తర్వాత, ప్రపంచ కప్పును గెలవడాన్ని చెప్పారు సీఎం. ఓటమి-గెలుపుల వరకు పోలిక బాగానే వుంది కాని, మిగతా విషయాలలో టీమిండియా సాధించిన విజయ రహస్యానికి-వ్యూహానికి వెనుక నున్న కృషి-పట్టుదల, ఓటమి పాలు కాకుండా వుండేందుకు, "కిరణ్ కుమార్ రెడ్డి కడప ఎన్నికల టీం" కు లేదనేది పలువురి మనసులో మాటగా చెప్పుకోవాలి. వాస్తవానికి, ఆద్యంతం, జగన్మోహన్ రెడ్డిని అత్యంత బలీయమైన శక్తిగానే ఊహించింది కాంగ్రెస్. కాకపోతే, ఎన్నికల వ్యూహరచన ఓటమి దిశగానే  చేసింది. చివరకు ఓటమి పాలైంది. తన తండ్రి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టను అని అన్న జగన్ నోటితోనే, పడగొట్టి తీరుతాను అన్న దాకా ప్రేరేపించింది. ఏదేమైనా, గెలిచింది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐనప్పటికీ, ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడించింది ప్రభుత్వాన్ని. ఓడిపోయింది  అధికారుల అలసత్వానికి ప్రతీకైన ప్రభుత్వంప్రభుత్వంలోని సమిష్టి బాధ్యతా రాహిత్యం, ఆ బాధ్యతా రాహిత్యానికి వూతమిచ్చిన కొందరు అధికారుల సంక్షేమ పథకాల అమలు తీరు. ఈ తప్పులను కనీసం రాబోయే ఏడాదన్నా సరి దిద్దుకుంటే మంచిదేమో!

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. విదేశాంగ విధానమైనా, ఆర్థిక పరమైన నిర్ణయాలైనా, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలైనా, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి" లోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.

అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది. పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.

(మరిన్ని మిగిలాయింకా)

Monday, April 26, 2010

II-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-2) : వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-2
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

మే నెల 25, 2009న రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడడానికి ఒక పాత్రికేయుడిగా రాజ్ భవన్ కు వెళ్ళాను. వెంకట్ గారు వస్తే బాగుంటుందని నేను అనడంతో ఆయన కూడా వచ్చారు. ప్రమాణ స్వీకారం అయింతర్వాత ఇద్దరం కలిసి తెలిసిన ఒకరిద్దరిని కలుసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి మర్నాడు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం గురించి ఫోన్ వచ్చింది వెంకట్ గారికి. మర్నాడు ఉదయం (మే నెల 26, 2009) పదకొండు గంటలకు సమావేశం జరిగింది. ఆరోగ్య-వైద్య శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి జె.సత్యనారాయణ గారు, కమీషనర్ అనిల్ పునీఠ గారు, 108-104 సేవల ప్రభుత్వ సలహాదారు పీ.కె.అగర్వాల్, (ఆర్థిక శాఖ) సీనియర్ మంత్రి శ్రీ రోశయ్య, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆ సమావేశంలో వున్నారు. సమావేశానికి ముందర ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ గారి దగ్గర అందరం కలిసాం. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించిన వివరాలను సత్యనారాయణ గారు మాతో చర్చించారు. ఆయనకు ఏం చెప్పాల్నో-ఏ విధమైన సహాయం ప్రభుత్వం నుంచి అవసరమౌతుందో అన్న విషయాలపై అందరం ఒక అవగాహనకు వచ్చాం. అయితే దివంగత ముఖ్యమంత్రి అవేవీ పట్టించుకోలేదు. కేవలం సీ.ఇ.ఓ ను తనకవసరమైన వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ గారు, అగర్వాల్ గారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు. తక్షణమే స్పందించారు. స్పందించి, జీ.వి.కె రెడ్డి గారికి ఫోన్ కలవమన్నారు.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, అనునయంగా-ఆప్యాయంగా మాట్లాడుతూ, ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చవలసిన ఆవశ్యకతను వివరించిన పద్ధతి నిజంగా శ్లాఘనీయం.ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. "అన్నా... ఇంతకు ముందే నీతో చెప్పాను గదా! ఎన్నికల హడావిడిలో మరోమారు చెప్పడం కుదరలేదు. ఎవరో మహారాష్ర్ట్ర నుంచి పిరమిల్ అనే సంస్థ యాజమాన్యం ఇక్కడకు వచ్చి, మన 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణలో ఎందుకు ప్రయివేట్ భాగస్వామి కావాలి? మీరందరూ లేరా? మా ప్రభుత్వానికి అత్యంత ఆదరణీయమైన ఈ పథకానికి యాజమాన్య పరంగాను, ప్రయివేట్ భాగస్వామ్య పరంగాను అవసరమైన నిధులను మీరెందుకు సమకూర్చకూడదు? సమకూర్చమని కోరుతున్నాను. ప్రభుత్వం ఎలాగూ 95% మేర నిర్వహణ పరమైన నిధులను సమకూరుస్తుంది కదా !" అని అన్నారాయన తో. అటువైపు నుంచి ఆయన ఏం మాట్లాడోకాని, ఇటునుంచి రాజశేఖర రెడ్డి గారు మాత్రం "తప్పక-తప్పకుండా" అన్న మాటలను పదే పదే ఉచ్చరించడం మాకు వినపడింది. బహుశా ముఖ్యమంత్రి నుంచి జీ.వీ.కె కొన్ని హామీలు కోరినట్లు మేమర్థం చేసుకున్నాం. అవేమై వుంటాయో కూడా నాకు కొంతమేరకు అవగాహన అయింది. ఏదేమైనా సంక్షోబంలో వున్న ఇ.ఎం.ఆర్.ఐని గట్టెక్కించడానికి రాజశేఖర రెడ్డి గారు తీసుసుకున్న చొరవ-అది వెంటనే ఫలితమివ్వడంతో, సంతోషంతో సమావేశం నుంచి బయటకొచ్చాం. బయటకొస్తూనే మంత్రివర్గ పోర్ట్ పోలియోల జాబితా చూసుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు 108-104 శాఖలను కేటాయించినట్లు తెలుసుకున్నాం. ఆయన్ను కలవాలని నిశ్చయించుకున్నాం. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, అత్యవసర సహాయసేవలకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయడం మన రాష్ర్ట్రంలోనే జరిగిందనాలి. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారిదే.

లంచ్ ముగించుకొనేలోపల, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి గారు జీ.వీ.కె కు ఫోన్ చేసి ఆయన్ను ఆ సాయింత్రం (మే నెల 26, 2009) నాలుగు-అయిదు గంటల సమయంలో కలిసే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాన్నే చాకచక్యంగా "బోర్డ్ సభ్యుల సమావేశం" గా మలిచారు వెంకట్. ఈ లోగా 108-104 శాఖలకు కేటాయించిన కొత్త మంత్రిని మర్యాద పూర్వకంగా ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నాం. అక్కడినుంచి జీ.వీ.కె కార్యాలయం వున్న తాజ్ కృష్ణా హోటల్ కు వెళ్లాం. ఇక్కడొక విషయం చెప్పాలి.

ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగరాజు గారు సత్యం కుంభకోణంలో జైలుకెళ్లడానికి ముందర తన పదవికి రాజీనామా చేయడంతో, అంతవరకు ఆయన ఆహ్వానం మేరకు ఇ.ఎం.ఆర్.ఐ బోర్డ్ సభ్యులుగా వున్న వారందరూ ఒకరి వెంట ఒకరు రాజీనామాలు సమర్పించారు. చైర్మన్ ఎమిరిటస్ గా వున్న మాజీ రాష్ర్ట్రపతి కలాంతో సహా నలుగురు మినహా అందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారిలో, భారత రత్న ఏ.పీ.జె అబ్దుల్ కలాం, రామరాజు, తరుణ్ దాస్, కె.వి.కమత్, క్రిష్ణా పాలెపు, కిరణ్ కార్నిక్ లున్నారు. రాజీనామా చేయంది నలుగురు మాత్రమే. సీ.ఇ.ఓ వెంకట్ తో కలుపుకుని కేవలం అయిదుగురు సభ్యులే ఇక బోర్డ్ లో మిగిలారు. రాజీనామా చేయని మెకన్జీ మాజీ ఎం.డీ రజత్ గుప్తా, కర్నెగీ మిలన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ రెడ్డి, లోక్ సత్తా నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ, సుచిత్ర చైర్మన్ కృష్ణం రాజులను జీ.వీ.కె కార్యాలయానికి ఆహ్వానించారు వెంకట్. డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ, కృష్ణం రాజులు హాజరుకాగా, మిగిలిన ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

తాజ్ కృష్ణా సమావేశమందిరంలో సరిగ్గా సాయింత్రం అయిదు గంటలకు మొదలైన సమావేశం సుమారు గంటన్నర పైగా సాగింది. ఆరంభంలో వెంకట్ గత నాలుగు నెలలుగా ఆయన చేసిన ప్రయత్నాలు, అందులో భాగంగా జీ.వీ.కె సంస్థ ఇ.ఎం.ఆర్.ఐ కి తోడ్పడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వైనం, మధ్యలో పిరమిల్ ఆసక్త్గి కనబరచడం-వెనక్కు తగ్గడం, ఆ రోజున ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశపు వివరాలు, జీ.వీ.కే తోడ్పాటుతో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన సూచనకు సంబంధించిన వివరాలను బోర్డ్ సభ్యులకు తెలియచేశారు. సమావేశంలో కొద్దిసేపు సీ.ఇ.ఓ వెంకట్ తో పాటు, ఆయన సహచరులం కొందరం కూడా పాల్గొన్నాం. జీ.వీ.కె తన భావాలను, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పట్ల-108 అత్యవసర సహాయ సేవల పట్ల తనకున్న గౌరవాన్ని, రాజుగారి పట్ల తనకున్న అభిమానాన్ని, ముఖ్యమంత్రి ఆదేశాల అమలు విషయంలో తనకున్న చిత్తశుద్ధిని, ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేయాల్సిన కృషిని చక్కగా వివరించారు. ఎంతో బిజీగా వున్న ముఖ్యమంత్రిని ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ అంత సులభంగా కలుసుగోగలిగి, సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చి, పరిష్కార మార్గాన్ని త్వరితగతిన అన్వేషించగలిగినందుకు ఆయన్ను అభినందించారు. రాజీనామా చేయకుండా కొనసాగుతున్న రజత్ గుప్తాను, రాజ్ రెడ్డిని, జయప్రకాశ్ నారాయణను, కృష్ణంరాజును మున్ముందు కూడా సభ్యులుగా కొనసాగమని విజ్ఞప్తి చేశారు జీ.వీ.కె. బోర్డ్ సభ్యుల కోరిక మేరకు, తక్షణమే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా జీ.వీ.కె పదవీ బాధ్యతలు స్వీకరించారు . ఆ సాయింత్రం ముఖ్యమంత్రిని కూడా కలిశారు ఆయన. రాజుగారు రాజీనామా చేసిన నాలుగున్నర నెలలకు, ఆ విధంగా, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు నూతన అధ్యక్షుడిగా జీ.వీ.కె బాధ్యతలు చేపట్టారు. మర్నాడు పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించాయి.

వాస్తవానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు గారు ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా రాజీనామా చేసిన నాటినుంచి (జనవరి 7, 2009) జీ.వీ.కె ఆ పదవి చేపట్టిన రోజు (మే నెల 26, 2009) వరకు బాహ్య ప్రపంచానికి అంతగా అవసరంలేని-పట్టని పలు ఇబ్బందులకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ లోనైంది. అయినా ఒక్క రోజుకూడా 108 అత్యవసర సహాయ సేవలు, ఒక్క క్షణం కూడా ఆపబడలేదు. వెంకట్ కు, ఆయన సహచర యాజమాన్య బృందానికి, నెల-నెలా జీతాలు వచ్చినా-రాకపోయినా, అంబులెన్స్ లో పని చేసే పైలట్లకు-ఇ.ఎం.టీ లకు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (కాల్ సెంటర్) లో పని చేసే కమ్యూనికేషన్-డిస్పాచ్ ఉద్యోగులకు, ఇతర కింది స్థాయి వుద్యోగులకు (జిల్లా మేనేజర్లతో సహా) ఒకటి-రెండు రోజులు ఆలస్యమైనా ప్రతినెలా జీతాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ, ఐ.టి సంస్థ సత్యం సంక్షోభంలో పడిందని, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగ రాజు నెలకొల్పిన (ప్రజలకు ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 108 అత్యవసర సహాయక సేవలందించే) అత్యవసర యాజమాన్య పరిశోధనా నిర్వహణ సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) గతంలో మాదిరిగా ఇకముందు కూడా సేవలనందిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తపరచని పత్రిక-ఛానల్ లేదనే చెప్పొచ్చు. జనవరి 7, 2009న రామలింగ రాజు తన పదవికి రాజీనామా చేసిన మర్నాడే-అంటే జనవరి 8, 2009న మన రాష్ర్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లాంటి హామీలనే జనవరి 9, 2009న కర్నాటక, గుజరాత్, ఉత్తరాంచల్ ప్రభుత్వాలు ఇచ్చాయి. ఆ తర్వాత ఒకటి-రెండు రోజుల్లో 108 అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న మిగతా రాష్ర్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా అవసరమైతే నూటికి-నూరు శాతం నిర్వహణ పరమైన నిధులిస్తామని ప్రకటించాయి. రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చిన మరుక్షణం నుంచే ఇ.ఎం.ఆర్.ఐకి ప్రయివేట్ భాగస్వామిగా నిధులను సమకూర్చ గలిగే ఆసక్తి వున్న వ్యక్తుల-సంస్థల కొరకు వెంకట్-ఆయన సహచరులు ప్రయత్నాలు చేయసాగారు. సంక్షోభం వుందని పత్రికలన్నీ ఎలుగెత్తి చాటుతున్నా, కొత్తగా మేఘాలయ రాష్ర్ట్రంలో ఫిబ్రవరి 2, 2009 న 108 అత్యవసర సహాయ సేవలు ప్రారంభించాం.

అయితే ఇ.ఎం.ఆర్.ఐ పడుతున్న ఇబ్బందులు ఒకరికి చెప్పుకోలేనివి. ఒక విధంగా "మింగలేకా-కక్కలేకా"అన్న చందాన వున్నటువంటివి.

మే నెల 26, 2009 న డాక్టర్ జీ.వీ.కె రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పది రోజులకు జూన్ 3, 2009 న బోర్డ్ సమావేశమైంది. వివిధ రంగాలలో నిష్ణాతులుగా ప్రసిద్ధికెక్కిన మరో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను బోర్డ్ సభ్యులుగా చేర్చుకున్నారు. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన మాజీ ఇండియన్ అడ్మినిస్ర్టేటివ్ సర్వీసెస్ అధికారి డాక్టర్ అబిద్ హుస్సేన్, మాజీ సీ.బి.ఐ డైరెక్టర్-మాజీ జాతీయ మానవ హక్కుల కమీషన్ డైరెక్టర్ జనరల్ డీ.ఆర్. కార్తికేయన్, ఎల్ అండ్ టీ సంస్థ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్-మాజీ ప్రెసిడెంట్ ఏ. రామకృష్ణ లను అప్పుడున్న అయిదుగురు సభ్యులకు అదనంగా బోర్డ్ సభ్యులుగా జీ.వీ.కె ఆహ్వానించారు . అంతే కాకుండా, జీ.వీ.కె సంస్థ పక్షాన, చైర్మన్ గా డాక్టర్ జీ.వీ.కె రెడ్డి-ఆయన భార్య శ్రీమతి ఇందిర కృష్ణారెడ్డి-వైస్ చైర్మన్ గా ఆయన కుమారుడు శ్రీ జీ.వీ. సంజీవరెడ్డి-సభ్యుడుగా శ్రీ ఎస్. భూపాల్ కూడా వుండే ఏర్పాటు చేశారు.

ఆ వెంటనే సమావేశమైన బోర్డ్ సభ్యులు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పేరును ఇకముందు "జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ"గా మార్చాలని నిర్ణయించారు. అలా మార్చడం వల్ల "ప్రాణాలను కాపాడే అత్యవసర సహాయక సేవలు మరింత పటిష్ఠ పడేందుకు జీ.వీ.కె నిబద్ధత ప్రతిబింబిస్తుందని, తద్వారా సేవలందించడం మరింత వేగవంతంగా-నైపుణ్యంగా-ఆచరణాత్మకంగా-పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని" బోర్డ్ సభ్యులు అభిప్రాయ పడ్డారు. దేశం నలుమూలలకూ అత్యవసర సహాయ సేవలు విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని, అవి మరింత పటిష్ఠ పడేలా చర్యలు తీసుకుంటానని నూతన అధ్యక్షుడు పత్రికాముఖంగా ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి ఎగువగా, ఇనుమడించిన పారదర్శకతతో-ఆధునిక యాజమాన్య, నాయకత్వ సిద్ధాంతాలకనుగుణంగా అత్యవసర సహాయక సేవలను జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తుందని వైస్ చైర్మన్ గా నియమితులయిన సంజీవరెడ్డి ప్రకటించారు. మిగతా సభ్యులందరూ వారికి వంతపాడారు.

మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు-జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? లేక యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? పోనీ అధికారులు రాజశేఖర రెడ్డి లేని లోటును పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? ఒకవైపేమో "నిబద్ధత “ను కలిగున్న జీ.వీ.కె-మరో వైపేమో రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానంటున్న ముఖ్యమంత్రి రోశయ్య గారు-108 శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారేమో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి (జగన్మోహన్ రెడ్డి గారి) అనుయాయుడు-అన్నింటికన్నా మించి పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణ అనుభవం, కష్ట కాలంలో బాధ్యతలు నైపుణ్యంతో నెరవేర్చిన సీ.ఇ.ఓ వెంకట్. అంగట్లో అన్నీ వున్నా... అల్లుడి నోట్లో శని అన్న చందాన వుంది అత్యవసర సహాయ సేవలు. ఈ సేవల కొనసాగింపు ప్రభుత్వ (లాభాపేక్ష లేని) ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకే ఒక పెను సవాలు. వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు కేవలం ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు.

Tuesday, April 20, 2010

I-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-1): వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-1
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

గత అరవై సంవత్సరాలలో, స్వతంత్ర భారత దేశ చరిత్రలో అధికారంలో వున్న ఏ ప్రభుత్వమైనా తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటికన్నా అత్యంత కీలకమైంది గా భావించదగింది బహుశా "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" అని ఘంటాపథంగా చెప్పొచ్చు. సరళీకృత ఆర్థిక విధానం కన్నా, ప్రపంచీకరణ కన్నా, కమ్యూనికేషన్ విప్లవం కన్నా... అలాంటి మరెన్నో విధానాలకన్నా క్రమేపీ అన్ని రంగాలలో ఆదరణ తెచ్చుకుంటున్నదీ ప్రక్రియ. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనా విధానానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియగా ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి, ఊపిరి పోసి, ఊతమిచ్చి, కొత్త భాష్యం చెప్పి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి దే. అదే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డి గారికి మరీ ప్రీతిపాత్రమైనది. ఆరోహణ-అవరోహణల మధ్య మహాప్రస్థానం సాగిస్తున్న 108 అత్యవసర సహాయ సేవలు, ఈ రోజున, ఒక వైపు పది రాష్ట్రాలలోని నలభై కోట్ల జనాభాకు లాభం చేకూరుస్తుండగా, మరోవైపు ఆ సేవల ఆవిర్భావం జరిగి, అఖిల భారతావనికి మార్గదర్శకంగా నిలిపిన ఆంధ్ర ప్రదేశ్ లో, రాజశేఖరరెడ్డి గారు మరణించిన అచిరకాలంలోనే అనేకానేక కారణాలవల్ల అవే సేవలు ఒడిదుడుకుల్లో పడుతున్నాయన్న మీడియా కథనాలు అత్యవసర సహాయ సేవల లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ల మన్ననలను-అభినందనలను పొంది, కేంద్రప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వారు నియమించిన అఖిల భారత వైద్య బృందం వారి అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన "108 అంబులెన్స్" ఆవిర్భావం, పరిణామక్రమం, ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు ఆసక్తికరమైనవే కాకుండా పరిశోధకులకు అధ్యయనపరమైనవి కూడా. ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామలింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గార్ల పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు "ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో" కాదు-కాకూడదు. దాని ఆరంభ దశలో, అభివృద్ధి చెందుతున్న దశలో, ఉఛ్చ స్థాయికి చేరుకుని ఇబ్బందులకు లోనయినప్పటికీ సీ.ఇ.ఓ వెంకట్ సంస్థను-సేవలను కొనసాగించడానికి కష్టపడుతున్న దశలో, సేవలందిస్తున్న పది రాష్ట్ర్రాల్లో ఒక రాష్ట్ర్రం విడిపోయే ప్రయత్నం చేస్తున్న దశలో అనుబంధం వున్న వ్యక్తిగా, ఆందోళన చెందుతూ నాకు తెలిసిన వాస్తవాలను నా బ్లాగ్ లో వారం-వారం పొందుపరుస్తున్నాను.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఆ రోజున అన్న ప్రతి మాటా-ఇచ్చిన భరోసా పదే-పదే జ్ఞప్తికొస్తూనే వున్నాయి. ఆ క్రితం రోజున ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు భైర్రాజు రామలింగ రాజు గారు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. తప్పులెంచడానికి గాని, మమ్మల్ని మందలించడానికి గాని జరిపిన సమీక్ష కాదది. రాజు గారు వాస్తవానికి అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించడంతో, సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి-ఆయన లీడర్షిప్ బృందం అయోమయానికి గురై, సమీప భవిష్యత్ లో అత్యవసర సహాయ సేవలను అందించడంలో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కావాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న సందర్భమది.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.

జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారు, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి కూడా, ప్రయివేట్ భాగస్వామ్యం కింద అప్పటివరకూ భరిస్తూ వస్తున్న ఖర్చును ఏదో విధంగా సమకూర్చుకునేందుకు శాయ శక్తులా కృషి చేస్తామనీ, దానికొరకు నాలుగు నెలల సమయం కావాలనీ కోరారు. ప్రయివేట్ భాగస్వామ్య వాటా ఖర్చు కింద తక్షణం ఎంత కావాల్సి వస్తుందని వెంకట్ ను అడిగారు ముఖ్యమంత్రి. జవాబుగా ఆయన అయిదు కోట్లన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయడానికి ముందు రాజశేఖర రెడ్డి గారన్న మాటలు నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనాలి. "రోశయ్య గారూ, పోనీ ఒక పని చేద్దాం. ప్రభుత్వ పరంగా ఇవ్వడం విధానానికి విరుద్ధమన్న విమర్శ వస్తుందని మీరు భావిస్తే, మనమే ఎవరన్నా తెల్సినవాళ్ల ద్వారా ఇ.ఎం.ఆర్.ఐ కి అవసరమైన ఆ అయిదు కోట్ల రూపాయలు ఏర్పాటు చేద్దాం" అన్నారు. ఎంత మంచి మనసాయనదో ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్ దేశానికి పోవడానికి ముందర మే నెల చివరి వారారంభంలో తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీ.ఎం చేసిన మొట్ట మొదటి సమీక్షా సమావేశం అదే. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. "ఏం జరుగుతుంది వెంకట్? ఎవరన్నా ప్రయివేట్ భాగస్వామి దొరికాడా" అని సమీక్ష మొదలవుతూనే అడిగారు. దైవమే ఆయన నోటి నుంచి ఆ ప్రశ్న వేయించిందని భావించాం మేం.

వాస్తవానికి మా పరిస్తితి అప్పటికే అగమ్య గోచరంగా వుంది. వివరాల్లోకి పోయే ముందర ప్రస్తుతానికి క్లుప్తంగా ప్రస్తావిస్తానవి. రామలింగరాజు గారి స్థానంలోకి ఎవరినన్నా "దాత" ను సంపాదించుకునేందుకు వెంకట్ గారు పడని పాట్లు లేవు, ఎక్కని-దిగని "గడప" లేదు. ఏ పుట్టలో ఏ పాముందోనని అన్ని పుట్టలని స్పర్శించాడాయన. మధ్యలో రాజుగారు ఏర్పాటు చేసిన "బోర్డ్ మెంబర్లు" అయిదారుగురు తప్ప ఒక్కరొక్కరే రాజీనామా చేశారు. నిర్వహణ ఖర్చులెలానో ప్రభుత్వ నిధులతో సర్దుకు పోగలిగినా, యాజమాన్య పరంగా నెలనెలా చెల్లించాల్సిన సీనియర్ల జీతాలు అప్పటికి మూడు నెలలుగా చెల్లించడం సాధ్య పడలేదు. అయినా వెంకట్ గారి నాయకత్వంలో నమ్మకమున్నందున ఒకారు కూడా సంస్థను వదిలి పోలేదు. అయితే కొందరిలో నిరాశ చోటు చేసుకో సాగింది. ఈ నేపధ్యంలో సరిగ్గా మే నెల 23, 2009 చావు కబురు చల్లగా అందింది వెంకట్ గారికి. అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న ముంబాయికి చెందిన "పిరమిల్" చేతులెత్తేశారు. సంస్థ లోని కొన్ని లోటుపాట్లను ఎత్తిచూపిస్తూ (వివరాలు ముందు ముందు తెలుసుకుందాం) తనకు రాజు గారి స్థానంలోకి రావడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఇక మిగిలిన ఆశ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీ.వి.కృష్ణారెడ్డి గారు. అయితే అప్పటివరకూ ఆయన ఎటువంటి ఆశాజనకమైన సంకేతాలను ఇవ్వలేదు. అయినా వెంకట్ గారికి-ఆయన బృందంలోని మాకు ఆశ చావలేదు. వెంకట్ గారి బాధను అర్థం చేసుకున్న నాకు ముఖ్యమంత్రి దగ్గరనుంచి కబురొస్తే బాగుంటుందని అనిపించింది. అనుకున్నట్లే ఆయన కార్యదర్శి-ఇ.ఎం.ఆర్.ఐ సబ్జెక్ట్ ను చూస్తున్న స్వర్గీయ సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి ముఖ్యమంత్రిగారి సమీక్షకు సంబధించిన పిలుపొచ్చింది వెంకట్ గారికి. అదే ఇజ్రాయెల్ వెళ్లే ముందర సీ.ఎం జరిపిన సమావేశం.

సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం, ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎం.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ గా మార్పు చెందడం జరిగింది.

ఇంతవరకూ బాగుంది. ఇది జరిగి ఏడాది కావస్తుంది. ఆ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా సంబంధిత అధికారులందరూ వున్నారు. ఆ తర్వాత రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించారు. అంటే ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో ఈ కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా?జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? దివంగత ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండవచ్చు?

వివరాల్లోకి పోవాలంటే వారం వారం చదవాల్సిందే !