Sunday, February 28, 2021

ఋశ్యశృంగుడి చరిత్రను మరింత వివరించిన సుమంత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-46 : వనం జ్వాలా నరసింహారావు

 ఋశ్యశృంగుడి చరిత్రను మరింత వివరించిన సుమంత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-46

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-03-2021)

ఋశ్యశృంగుడి చరిత్రను మునీంద్రులకు సనత్కుమారుడి మాటలుగా తెలిపిన సుమంత్రుడు, వారికి ఆయన చెప్పిన మరికొన్ని విషయాలను కూడా దశరథుడికి తెలియచేస్తాడీవిధంగా: " పాల సముద్రంలో చంద్రుడిలాగా, ఇక్ష్వాకుల వంశంలో ధర్మాత్ముడు-సత్యాత్ముడైన దశరథ మహారాజు జన్మిస్తాడు. ఆ దశరథుడికి శాంత అనే కూతురు కలుగుతుంది. దరిమిలా దశరథుడికీ, అంగరాజు కుమారుడైన రోమపాదుడికీ స్నేహం కుదురుతుంది. పిల్లల్లేని రోమపాదుడికి తన కూతురైన శాంతను దత్తతిస్తాడు దశరథుడు".

(అంగ దేశానికి రాజధానైన "చంపా నగరం" ఇప్పటి భాగల్పూర్ సమీపంలో వుండేది. మొంఘిర్ నుండి ఏభై మైళ్లు తూర్పుగా ప్రయాణించి, హ్యూయన్ సాంగ్, చంపా నగరానికి చేరుకున్నట్లు దాఖలాలున్నాయి. "చంప" భాగల్పూరుకు పాత పేరు).

"రోమపాదుడికి చిత్రరథుడనే పేరుకూడా వుంది. ఆయనకు, దశరథుడికి స్నేహం కుదిరిన తర్వాత, కుమారులు లేని దశరథుడు తన బాధను ఆయనకు వివరిస్తాడు. కొడుకులు పుట్టేందుకు తాను యజ్ఞం చేయదల్చానని-ఆ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించేందుకు శాంత భర్త ఋశ్యశృంగుడిని తన వెంట అయోధ్యకు పంపమని-పుత్రులు లేని తన దుఃఖాన్ని తొలగించి తన వంశ ప్రతిష్ఠను స్నేహితుడైన రోమపాదుడు కాపాడమని వేడుకుంటాడు దశరథుడు. దశరథుడి కోరిక మేరకు, ఋశ్యశృంగుడిని సంప్రదించి, భార్యా సమేతంగా ఇద్దరినీ దశరథుడితో పంపుతాడు రోమపాదుడు. దశరథుడు ఋశ్యశృంగుడితో యజ్ఞం చేయించుకుంటాడు. ముందుగా దశరథుడి ప్రార్థన మేరకు, ఋశ్యశృంగుడు ఋత్విజుడు గా వుండడానికి అంగీకరించి, యజ్ఞాన్ని నిర్విఘ్నంగా చేయిస్తాడు. సంతానం కొరకు-స్వర్గలోక ప్రాప్తికొరకు, దశరథుడు యజ్ఞం చేసినందువల్ల, స్థిరమైన-కీర్తిమంతులైన, వంశ ప్రతిష్ఠ నిలిపే నలుగురు కొడుకులను కంటాడు దశరథుడు". ఇలా జరిగిందంటూ బ్రహ్మ పుత్రుడైన సనత్కుమారుడు ఋషులెందరో వినే విధంగా, ఎప్పుడో-పూర్వ యుగంలోనే చెప్పబడింది. ఆయన చెప్పిన విషయాన్ని ఋషీశ్వరులు చెప్పుకుంటుంటే, తాను వినటం జరిగిందని సుమంత్రుడంటాడు దశరథుడితో. ఇంద్ర సమానుడైన దశరథుడిని చతుర్విధ సేనలతో రోమపాదుడి దగ్గరకు పోయి, సాదరంగా ఋశ్యశృంగుడిని ఆహ్వానించి-తెచ్చి, తన కోరిక నెరవేర్చు కొమ్మని సలహా ఇస్తాడు మంత్రి సుమంత్రుడు.

(తనకు తెలిసిన విషయాన్ని ఇంత కాలం దశరథుడికి చెప్పకుండా, సుమంత్రుడెందుకు దాచిపెట్టాడని సందేహం కలగొచ్చు. ఆకలిగొన్నవాడికి అన్నం పెట్తే దాని విలువ తెలిసినట్లే, అవసరం కలిగి అడిగినప్పుడే, తెలిసిన విషయాన్ని చెప్పడం మంచిదన్న వుద్దేశంతో ఇన్నాళ్లూ వూరుకున్నాడు సుమంత్రుడు. సనత్కుమారుడు ఈ విషయాలను వెల్లడించేనాటికి రోమపాదుడు పుట్టనేలేదు. భగదవతారం గురించి ఋషులకు-మునులకు తెలిసినా, సందర్భం వస్తేనే ఆ విషయాలను బయట పెట్తారుగాని, ఎప్పుడు పడ్తే అప్పుడు అందరికీ చెప్పరు. అవతార విషయం ఒక దేవ రహస్యం. అందుకే ఋషులు ఆ విషయాన్ని సుమంత్రుడికి చెప్పలేదేమో).

ఋశ్యశృంగుడిని తీసుకొచ్చేందుకు ప్రయాణమైన దశరథుడు

సుమంత్రుడి సలహా విన్న దశరథుడు, వశిష్ఠుడికి విషయాన్నంతా తెలియ పరుస్తాడు. సుమంత్రుడు చెప్పిందంతా సత్యమేనని, ఆయన సలహా పాటించమంటాడు వశిష్ఠుడు. ఎక్కడే లోపం కలిగితే, ఏ ప్రమాదమొస్తుందోనని, అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు దశరథుడు. అంతఃపుర స్త్రీలను, బుద్ధిమంతులైన తన మంత్రులను, భార్యలను వెంట తీసుకుని పోతాడు దశరథుడు. దారిలో నదులను-పర్వతాలను దాటుకుంటూ, రోమపాదుడి చంపా నగరానికి చేరుకుంటారు. వెళ్లిన వెంటనే, ముందుగా ఋశ్యశృంగుడి దర్శనం చేసుకుని, తర్వాత రోమపాదుడి వద్దకు వెళ్తాడు దశరథుడు. ఆయన రాకకు సంతోషించిన రోమపాదుడు, సకల మర్యాదలు చేసి, సాదరంగా తోడుండి, ఋశ్యశృంగుడి దగ్గరకు తీసుకుని పోతాడు దశరథుడిని. "పవిత్ర చరిత్రా" అని ఋశ్యశృంగుడిని సంబోధిస్తూ-తన ఆప్తమిత్రుడిగా-బంధువుగా దశరథుడిని ఆయనకు పరిచయం చేస్తాడు. దశరథుడు తన కుమార్తె శాంతను తనకు దత్తత ఇచ్చిన విషయాన్ని తెలియపర్చి, తానేవిధంగా ఆయనకు మామగారినో-అలానే దశరథుడు కూడానని అంటాడు. ఋశ్యశృంగుడు మామగారివలెనే దశరథుడిని గౌరవిస్తాడు. చంపా నగరంలో వారం రోజులుండి, ప్రయాణానికి సిద్ధమై, కూతురిని-అల్లుడిని తన వెంట అయోధ్య చూసేందుకు పంపమని రోమపాదుడిని అడుగుతాడు. ఋశ్యశృంగుడికీ విషయాన్ని చెప్పి, ఆయన అంగీకరించిన తర్వాత, సహృదయుడైన ఆయనను-భార్య శాంతతో సహా, అయోధ్యకు వెళ్లి రమ్మని కోరాడు రోమపాదుడు.

మామగారి వద్ద వీడ్కోలు తీసుకుని, ఋశ్యశృంగుడు ప్రయాణం కావడం-దశరథుడు, రోమపాదుడు ఒకరికొకరు బహుమానాలిచ్చుకోవడం – పొగుడుకోవడం - నమస్కరించుకోవడం జరిగింతర్వాత, అందరు కలిసి బయల్దేరుతారు. తామొస్తున్న సంగతి ముందుగానే తెలియచేసి-వెళ్లే సరికి నగరమంతా అలంకరించి, అంగరంగ వైభోగంగా తీర్చిదిద్ది, రంగవల్లులు పెట్టి, పూల తోరణాలు కట్టే ఏర్పాట్లు చేయిస్తాడు దశరథుడు.

సీత హనుమతో పోకపోవడానికి కారణం? : వనం జ్వాలా నరసింహారావు

 సీత హనుమతో పోకపోవడానికి కారణం?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (28-02-2021) ప్రసారం  

తాను శ్రీరాముడి దూతననే విషయాన్ని ధృవీకరించడానికి, సీతాదేవి కోరినట్లే శ్రీరాముడి గుణగణాలను వర్ణించాడు హనుమంతుడు. మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి, తర్వాత దేహగుణాలను వర్ణిస్తాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ను గురించి చాలా నిగూఢ౦గా చెప్పడంతో సీతకు విశ్వాస పాత్రుడైనాడు. ఇక అక్కడి నుంచి సీతాన్వేషణలో రామలక్ష్మణులు ఎక్కడెక్కడ తరిగి కిష్కింధకు చేరుకున్నదీ వివరించాడు.

           “సీత కొరకై వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులు మేముండే చోటుకు వచ్చారు. అన్న రాజ్యంలోంచి వెళ్లగొట్టబడి, ఋష్యమూకాద్రి మీద నివసిస్తున్న సుగ్రీవుడు, నార చీరెలు, చేతుల్లో బాణాలతో వస్తున్న వారిని చూశాడు. వారెవరో తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు. నా కంటికి వారు మహాత్ముల్లాగా కనపడినందున, వినయంగా, చేతులు జోడించి, వారి దగ్గరకు పోయాను. నన్నాదరించి, గౌరవించిన వారిద్దరినీ తీసుకునివచ్చి, సుగ్రీవుడి ఎదుట నిలిపాను”.

         “కలిసిన రామ, సుగ్రీవులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు నమ్మారు. ఒకరి దుఃఖం ఇంకొకరికి చెప్పుకొని సమాధానపర్చుకున్నారు. తన భార్యను అపహరించాలనుకున్న ఆయన అన్న వాలి, సుగ్రీవుడిని వెళ్లగొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేని సుగ్రీవుడిని నీ మగడు సమాదానపర్చాడు. వాలి, సుగ్రీవుల కలహకారణం ఇదే. నీ ఎడబాటుతో దుఃఖిస్తున్న శ్రీరాముడి చరిత్రను లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. గతంలో రావణాసురుడు ఆకాశమార్గాన నిన్ను ఎత్తుకొని వెళ్తున్నప్పుడు, నువ్వు, భూమి మీద పడేసిన ఆభరణాలను సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపాడు. నీ జాడ మాత్రం చెప్పలేకపోయాం. నీ ఎడబాటుతో, నీమగడు, ఎల్లప్పుడు లోలోన కుములుతుంటే, అగ్నిని కలిగిన అగ్నిపర్వతంలాగా కనిపించాడు”.

“రావణుడిని, వాడి కొడుకులను, స్నేహితులను, యుద్ధంలో చంపి, నీ భర్త, నిన్ను త్వరలోనే తీసుకెళ్తాడు. వాలిని చంపుతానని రాముడు, నిన్ను వెతికించి నీవార్త తెప్పిస్తానని సుగ్రీవుడు ప్రమాణం చేసారు. సుగ్రీవుడితో కిష్కిందకు పోయి, వాలిని చంపి, సుగ్రీవుడిని రాజుగా చేసాడు రాముడు. ఇలావారిద్దరికీ స్నేహం కుదిరింది. నేను వారి దూతను, నిన్ను వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి ఇక్కడకు వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు రాజై, తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి, నిన్ను వెతికేందుకు వానరులను పది దిక్కులకు పంపాడు. నిన్ను మేము వెతుకుతూ కనపడక బాధపడ్తుంటే, జటాయువు సోదరుడు సంపాతి కనబడి నీ జాడ చెప్పి, నువ్వు లంకలో వున్నావని అన్నాడు. ఆయన మాట ప్రకారం, నూరామడల సముద్రాన్ని దాటి, రావణుడి నగరం లంక ప్రవేశించి, రాత్రి సమయంలో రావణుడినీ, నిన్నూ చూశాను. వాస్తవం చెప్పాను. భయం లేకుండా, ధైర్యంగా నాతో మాట్లాడు. నన్ను నమ్ము. నాలో మాయలేదు. రామకార్యం చేసేందుకు నీ కొరకై వచ్చాను. వానర రాజు మంత్రిని, వాయుదేవుడి కొడుకును, సూర్యవంశం రాజు రామచంద్రమూర్తి దూతను”.

ఇంతవరకు తాను రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన హనుమంతుడు, తన జన్మ వృత్తాంతాన్ని కూడా సీతాదేవితో చెప్పాడు. "మాల్యవంతమనే పెద్ద పర్వతముంది. అక్కడ నాతండ్రి కేసరి అనే వానర రాజున్నాడు. దేవ ఋషుల ఆజ్ఞానుసారం, గోకర్ణమనే పర్వతానికి పోయి, శంభసాధనుడనే దైత్యుడిని చంపాడొకసారి. ఇట్లా మాతండ్రి కాలం నుండే, రాక్షసులకు, మాకూ విరోధముంది. ఆయన భార్యకు, వాయుదేవుడికీ, నేను జన్మించాను. నా స్వశక్తితో, స్వకార్యంతో, హనుమంతుడన్న పేరు తెచ్చుకున్నాను. నీ నమ్మకం కొరకు నీ భర్త గుణ-గణాలన్నీ చెప్పాను".

సీతమ్మ హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే అడిగింది. దానితోపాటు తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడు చెప్పాడు. అడగనిదే చెప్పడం దేనికి? అని అనిపించవచ్చు. కానీ హనుమంతుడు ఆంజనేయుడు కదా! అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యర్థంగా ఏదీ మాట్లాడడు. అసలు కారణమేమిటంటే, తాను రామదూతను అనీ, సామాన్యమైన సగటు వాడిని కాదనీ, సమర్ధుడననీ సీతమ్మను నమ్మించ చేయడం. నమ్మదగిన వాడినీ, విశ్వాసపాత్రుడినీ అని సీతమ్మకు రూఢి చేయాలని భావించడం! తనను ఈ మహాకష్టం నుండి తప్పించగలవాడని, రాముడిని రప్పించి తనను ఆయనతో కూర్చగల సమర్ధుడనీ విశ్వాసాన్ని పాదుకొల్పటానికే తన వైనం చెప్పాడు. ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత హనుమంతుడు, శ్రీరామచంద్రమూర్తి దూతన్న విషయం నమ్మింది సీతాదేవి.

జనకరాజు కూతురు సీతాదేవికి శ్రీరాముడి పేరు చెక్కిన ఉంగరాన్ని చూపిస్తాడు. దానిని దూతైన తనకు ఇచ్చిన రామచంద్రుడు, సీతకు ఇమ్మని చెప్పాడనీ, అది చూసిన ఆమెకు తనమీద నమ్మకం కుదురుతుందన్నాడనీ, అంటాడు హనుమంతుడు. ఆ ఉంగరాన్ని చూసిన సీతకు మనోవ్యాకులత కూడా తీరుతుందని రాముడు చెప్పినట్లు తెలియచేస్తాడు. హనుమంతుడిచ్చిన ఉంగరాన్ని సంతోషంగా తీసుకుంటుంది సీత. ఇదొక అద్భుతమైన ఉంగరం. ఇందులో మూడు మణులుంటాయి. అందులో ఒక మణిలో రాజైనవానికి పితృ-పితామహంగా వచ్చే సూర్యవంశపు శక్తిని ఆవహింప చేస్తారట. ఇది శ్రీరాముడి రాజ్యాధికార ముద్ర. దానిపై శ్రీరాముడి పేరు కూడా చెక్కబడి ఉందని పెద్దలంటారు. అలాంటి రాజ ముద్రను ఇవ్వడమంటే రాజ్యాన్నే ఇచ్చి వేయడమని అర్థంకద! సీతమ్మ కంటే రాజ్యం గొప్పది కాబోదు అని రాముడి భావన అనేది స్పష్టమవుతున్నది.

తనభర్త శ్రీహస్తాన్ని అలరించే ఆ ఉంగరాన్ని చూసిన సీతకు తన మగడే ఎదురుగా వచ్చినంత సంతోషం కలిగింది. ఆ ఉంగరాన్ని తాకుతూ అనుకుంటుంది సీత: "పాణిగ్రహ సమయంలో మొదటిసారి తన చేతిని రామచంద్రమూర్తి పట్టుకున్నప్పుడు, తనను తగిలిన ప్రధమాభరణం ఇదేకదా! తనకు ప్రణయకోపం వస్తే, శాంతింప చేయటానికి, భర్త తన గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతుంటే, తాకేదీ ఉంగరమేకదా! తనను కౌగలించుకున్నప్పుడు, వంటిమీదున్న ఆభరణాలన్నీ తీసేసినా, తీయందీ ఉంగరం కదా! ప్రణయకోపంలో ఇరువురికీ మాటలు లేనప్పుడు, మాట్లాడే నెపంతో, నేలమీద ఉంగరం పడేస్తే, తీసుకొమ్మని మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ ఉంగరమేకదా! అరణ్యాలకు పోతున్నప్పుడు, సర్వాభరణాలూ తీసేసినా, తనతో పాటు వెంట తెచ్చుకున్నదీ ఈ ఉంగరమేకదా!" ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తున్న సీతకు, సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు, భావనాతిశయ బలం వల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపించిందామెకు.

లజ్జవతైన సీత, తన పతి క్షేమం, పతివార్త తెలిపిన ఆంజనేయుడిని, అభినందన పురస్సరంగా స్తోత్రం చేసింది. హనుమంతుడిని ప్రశంసించి శ్రీరామాదుల కుశలం అడిగింది. రామచంద్రమూర్తి తనను తప్ప మరేదీ తల్చుకోవడం లేదని ఆంజనేయుడు చెప్పడంతో, సీతకు అమృతం తాగినంత సంతోషం కలిగింది. అయితే ఆయన అమితంగా దుఃఖ పడుతున్నాడని కూడా చెప్పినందువల్ల విషం తాగినట్లనిపించింది. "విషం కలిపిన అమృతాన్నిచ్చినట్లున్నాయి నీమాటలు" అంటుంది సీతాదేవి హనుమంతుడితో.

"ఓ మారుతీ! రామచంద్రమూర్తి సూర్య వంశానికే అలంకార ప్రాయమైన వాడే! ఆయన ఈ వ్యధా సముద్రంలో మునగకుండా, తీరానికి ఎప్పుడు చేరుతాడయ్యా? గాలివానకు గిర-గిరా తిరిగే నావలాగా నలిగిపోయాడా? నన్నెప్పుడు తీసుకునిపోతాడో? ఎప్పుడు రావణుడిని చంపుతాడో? ఎప్పుడొస్తాడయ్యా రామచంద్రుడు? ఎప్పుడు చీలుస్తాడయ్యా రాక్షసమూకను? వాళ్లనెప్పుడు తన బాణాలతో ఖండిస్తాడు? పునాదులతో సహా ఎప్పుడీలంకాపురి పాడైపోతుంది? ఎప్పుడు నన్నాయన చూస్తాడు?"

"ఆంజనేయా! రావణుడు నాకొక్క సంవత్సరం గడువిచ్చాడు. అది ముగిసేవరకే నేను బ్రతికుంటాను. ఆ సంవత్సరంలో పదోనెల జరుగుతున్నదిప్పుడు. ఇంకా రెండునెలలే గడువున్నది. అవికాగానే నా చావు సిద్దం. కాబట్టి రామచంద్రమూర్తిని ఈ లోపలే వచ్చేటట్లు తొందరపెట్టు. ఆ తర్వాత వచ్చినా ఫలితం వుండదు”. ఇలా కళ్లనిండా నీళ్లు వుంచుకుని మాట్లాడుతున్న సీతాదేవిని చూసి హనుమంతుడు శోకించవద్దని ప్రార్ధిస్తూ, ఇలా అన్నాడు.

"నామాటలు విన్న శ్రీరాముడు సేనతో, వెంటనే ఇక్కడకు వస్తాడు. అంతవరకు దుఃఖమెట్లా ఆపుకోవాలంటే, దానికో మార్గముంది. నా వీపుపైనెక్కు, రామచంద్రమూర్తి వున్న చోటుకి నిన్ను తీసుకుని పోతాను. నేను దూతను. నీశీలానికి ఏ హానీలేదు. నిన్ను శ్రీరాముడి దగ్గరకు ఇప్పుడే చేరుస్తాను. నీమగడు, తమ్ముడితో కూడి రావణాదులను చంపే ప్రయత్నాన్ని నీకళ్లతో నువ్వే చూడగలవు. నావీపుపైకెక్కు. నామాట నమ్ము. ఆకాశంలో సూర్యచంద్రులతో ముచ్చటిస్తూ, సముద్రాన్ని, ఆకాశాన్ని అవలీలగా నావీపుమీద కూర్చొని దాటు. రాముడివద్దకు పోయేంతవరకూ నిన్ను దించను" అన్న ఆంజనేయుడి మాటలకు, భక్తికి, సంతోషించిన సీత, ఆయన మాటలకు ఆశ్చర్యపోయి ఇలా జవాబిస్తుంది.

"ఆంజనేయా! నేను సొమ్ములను మూటవేసిన స్థలం నాకు గుర్తుంది. అక్కడికి, ఇక్కడికి చాలా దూరం. ఇంతదూరం నన్ను ఎట్లా మోసుకుని పోతావు? నీమాటలు వినడానికే వింతగా వున్నాయి. ఇంతవరకు నీవు నిజంగా కోతివో, కాదో అన్న అనుమానం, సందేహం వుండేవి. ఇప్పుడు నీబుధ్ధిని పట్టి చూస్తే నీవు నిజంగా కోతివేనని, నిశ్చయించుకుంటున్నాను. ఈడ్చి కొలిస్తే నువ్వు జానెడు కూడా లేవు. నీవు నన్నెట్లా మోసుకుపోతావు" అన్న సీతాదేవిమాటలకు హనుమంతుడు విచారపడ్డాడు. మేరుపర్వతంతో సమానమైన ఆకారంతో, ఎర్రటి ముఖంతో, వజ్రాయుధం లాంటి గోళ్లతో, కోరలతో, సీతాదేవి ముందరర నిలబడి: "దేవీ! ఈ లంకను, కొండలతో, వనాలతో, బురుజులతో, ప్రాకారాలతో, తోరణాలతో, రావణాసురుడితో సహా పెల్లగించి, అత్యంత వేగంగా తీసుకునిపోయే శక్తి నాకుంది. నేను చిన్నవాడినన్న అభిప్రాయం మానుకో. ఆలస్యం చేయకుండా రాముడి దగ్గరకు పోదాం రా!" అంటాడు హనుమంతుడు సీతతో.

హనుమంతుడలా చెప్పగానే, ఆశ్చర్యం, భయం కలిగించే అతడి ఆకారాన్ని చూసి: "కపీశ్వరా! నీ బలగర్వం, వాయువేగం, కార్చిచ్చులాంటి నీశరీరం, ఎలాంటిదో తెలుసుకున్నాను. నీవు సామాన్య కోతివికావు. ఇంత గొప్పవాడివి కాకపోతే నువ్వెట్లా సముద్రాన్ని దాటి, రహస్యంగా లంక ప్రవేశించి, నన్ను వెతకగలిగే సమర్ధుడవవుతావు? ఇంతపని మామూలు వాళ్లకు సాధ్యమవుతుందా? నన్ను రామచంద్రమూర్తి దగ్గరకు తీసుకుపోగలవని నమ్ముతున్నాను. నీపై నాకెంత విశ్వాసమున్నా నీవెంట రాకూడదు. నీ వెంట రాకపోటానికి, మరో ముఖ్య కారణముంది. నా భర్తపై నాకున్న భక్తివల్ల, మగవాడిని, రాముడిని, తప్ప మరెవ్వరినీ తాకను. అలా చేయటానికి నామనస్సు ఒప్పుకోదు. ఈ వాస్తవాన్ని ముందే చెప్పితే, నీవేమనుకుంటావోనని, చివరకు చెప్తున్నాను".

"రామచంద్రమూర్తి వచ్చేవరకు ఆగలేను. రాలేను. రాముడు, రావణుడిని, యుద్ధంలో, ఈలంకలోనే చంపి నన్ను తీసుకోపోవాలి. అదే ఆయన యోగ్యతకు తగిన పని. ఆయన నన్ను రక్షించలేడన్న సందేహం వుంటేకదా, నేను నీవెంట రావాల్సింది. శ్రీరాముడి యోగ్యతకు తగనిదీ, ఆయనకు కష్టసాధ్యమైనదీ, సందిగ్దమైంది, నేనుకోరడం లేదు. ఎలాంటి విరోధులనైనా చంపేశక్తి, దండించే పరాక్రమం, ఆయనకున్నదని చెప్తే విన్నాను. కళ్లారా చూసాను. ఆయన శక్తి నాకు తెల్సు. ఆ సమర్ధుడి ఎదుట యుధ్ధభూమిలో నిల్చే శక్తి ఇంద్రాది దేవతలకు కానీ, పన్నగులకు కానీ, దేవదానవ రాక్షస సమూహాలకు కానీ లేదు. నీవు త్వరగా లక్ష్మణ, సుగ్రీవులతో కూడిన రామచంద్రమూర్తినే లంకకు తీసుకొచ్చి, రావణుడిని చంపి, నన్ను తీసుకుని పొమ్మని ఆయనతో చెప్పు. ఆయనకొరకు తీవ్ర దుఃఖంతో వున్న నన్ను కృతార్ధురాలిని చేయి. నీకు పుణ్యముంటుంది" అని చెప్తుంది. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

 

 

Saturday, February 27, 2021

ధర్మరాజును ప్రశ్నిస్తూ నారదుడు చెప్పిన రాజనీతి విషయాలు (ఆస్వాదన-8) : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజును ప్రశ్నిస్తూ నారదుడు చెప్పిన రాజనీతి విషయాలు

(ఆస్వాదన-8)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-02-2021)

ఖాండవ దహనం తరువాత శ్రీకృష్ణార్జునుల దయవల్ల ప్రాణాలు కాపాడుకున్న మయుడు, వారిద్దరూ ధర్మరాజు దగ్గర వున్నప్పుడు వచ్చి నమస్కరించి, అర్జునుడికి ఏదైనా పని చేసి పెట్టాలని వుందని అన్నాడు. తాను దానవ శిల్పినని, వివిధ కళల్లో నేర్పరినని, వారికి ఇష్టమైన దాన్ని నిర్మించి ఇస్తానని ఆజ్ఞాపించమని కోరాడు. మయుడి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఒక మహాసభను నిర్మించి ఇవ్వమని చెప్పాడు శ్రీకృష్ణుడు. మయుడు అందమైన, అపూర్వమైన, అపురూపమైన సభా నిర్మాణానికి పూనుకుని, బిందు సరోవరం దగ్గర 14 నెలలు పరిశ్రమించి నిర్మించాడు. ఎనిమిది వేలమంది రాక్షస భటులతో దాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు. అలాగే భీముడికి గదను, అర్జునుడికి శంఖాన్ని ఇచ్చాడు. ఒక మంచి ముహూర్తంలో ధర్మరాజు మయసభా ప్రవేశం చేశాడు. రాజ్యపాలన చేయసాగాడు

ఇలా వుండగా నారదుడు ఒకనాడు ధర్మరాజును, పాండవులను చూడడానికి వచ్చాడు. నారద మహర్షి పాండవులను కుశల ప్రశ్నలు అడిగిన అనంతరం ధర్మరాజుతో రాజనీతి విషయాలు ప్రస్తావించి, ఆయన ఏమేమి చేయాల్నో, చేస్తున్నాడో తెలుసుకున్నాడు. వాటి సారాంశం:

పూర్వీకులు ఏర్పరిచిన ధర్మపద్దతిని రాజు ఆచరించాలి. ధర్మాన్ని తెలుసుకుని, ధర్మార్థకామాలు ఒకదానికొకటి బాధించకుండ, కాలోచితాలుగా వాటిని విభజించి సేవించాలి. ధర్మం మీదనే మనస్సు నిలిపి, చేయాల్సిన రాజకార్యాలను స్వబుద్ధితో ఎల్లప్పుడూ అర్థరాత్రి దాటిన తరువాతే ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరంగా యోగ్యులైన వారిని వారి-వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి, గౌరవ భావంగా స్థిరంగా నియమించాలి. పుణ్యాత్ములను, శాస్త్ర నియమాలు బాగా తెలిసినవారిని, రాజుమీద ప్రేమ కలవారిని, తాతతండ్రుల నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్న వారిని, బ్రాహ్మణోత్తములను రాజకార్య నిర్వహణకు మంత్రులుగా ఏర్పరుచుకోవాలి. రాజుకు విజయకారణమైన అతడి రహస్యాలోచనను ఆయన ప్రజల చెవిన పడకుండా జాగ్రత్త పడాలి. రాజు గారి పురోహితుడు పండితుడై వుండాలి. ధర్మాధర్మాలు తెలిసినవాడు, వివిధ శాస్త్రాలను బాగా అధ్యయనం చేసినవాడు, రాగద్వేషరహితమైన సమచిత్తం కలవాడై వుండాలి.

దీని భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు: ‘ప్రాచీనకాలంలో పురోహిత వ్యవస్థ సత్త్వశుద్ధిని కూర్చి ధర్మపాలనకు, ప్రభు క్షేమానికి, ప్రజా క్షేమానికి విశేషంగా దోహదం చేసింది’.

పలు విధాలైన యుద్ధాలలో విజయాన్ని సాధించడంలో నిపుణులైన వారిని, ఎదిరించడానికి సాధ్యం కాని పరాక్రమం కలవారిని, విశ్వాసపాత్రులైన వారిని, గౌరవానికి అర్హులైన వారిని, రాజు మేలు కోరే వారిని సైన్యాధ్యక్షులుగా నియమించాలి. ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలియై, సమర్థుడైన మంత్రి తన పరిమితిమీరి, ఇతరులతో చేతులు కలిపి, రాజుకు వ్యతిరేకంగా ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. దీని భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు: ‘అధికార పక్షంలో వుంటూ, అన్ని ప్రయోజనాలు పొంది, అధికంగా బలపడి, దురాశా దురహంకారాలు పెంచుకుని, అన్యులతో చేతులు కలిపి, అధికార పక్షాన్ని బలహీనపరిచే వ్యతిరేక వర్గాన్ని సృష్టించే వెన్నుపోటుదారులంతా ఈ కోవకు చెందిన మంత్రులే. కలియుగ రాజకీయాలలో వీరి సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. అలాంటి వారిని ఒక కంట కనిపెట్టి వుండడం మంచిదని నారదుడు ఆ కాలంలోనే హెచ్చరించాడు’.

ఆస్థానజ్యోతిష్కులు తమ శాస్త్ర పాండిత్యం వల్ల, స్వీయ ప్రతిభ వల్ల, దేవతా, అంతరిక్ష, భూసంబంధాలైన ఉత్పాతాలను (ఉప్పెనలు, భూకంపాలు, వానలు-వరదలు) కనిపెట్టి వాటికి విరుగుడు సూచించాలి. వైద్యులు సమర్థులై లోకానికి మేలుచేసే బుద్ధితో, ప్రజలమీద ప్రేమతో సేవలు చేయాలి. మనోవ్యాధులకు, శారీరక వ్యాధులకు వారు చికిత్స చేయగలగాలి. పన్నులు వసూలు చేయడం లాంటి ధనార్జన రూపక రాచకార్యాలలో పరిశుద్ధులైన వారిని, పాపరహితమైన చిత్తవృత్తి కలవారిని, నీతిమార్గంలో నడుచుకునేవారిని, రాగద్వేషరహితమైన సమబుద్ధితో వ్యవహరించేవారిని, నైపుణ్యం కలవారిని నియమించాలి. వ్యక్తుల యోగ్యతలకు అనుగుణంగా ఉన్నత, మాధ్యమిక, కింది స్థాయి ఉద్యోగాల్లో నియామకం జరగాలి. సేవకులందరికీ కొరతలేకుండా తగుజీతాలు సకాలంలో ఇవ్వాలి. రాజు కొరకు యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు సరైన ఆర్ధిక సహాయం చేయాలి. (కుటుంబ పించను పథకం భారత కాలంలోనే వుండేదని భావించాలి).

ధనం మీద లోభ బుద్ధి కలవారిని, దొంగలను, స్నేహానికి యోగ్యులు కానివారిని, శత్రువుల పట్ల పక్షపాతం కలవారిని, ధైర్యం చాలని వారిని, దుర్మార్గులను, రాజకార్యాలు నిర్వహించడానికి పంపకూడదు. దొంగల భయం లేకుండా రాజ్యాపాలన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యులు ధనాశాపరులై, దొంగల దగ్గర డబ్బులు తీసుకుని వారికి రక్షణ కలిగించకుండా జాగ్రత్త పడాలి. (లంచగొండులైన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభువు ఎలా అప్రమత్తుడై ఉండాలో నారద మహర్షి అప్పుడే సూచించాడు). రాజుపాలనలో అనావృష్టి లేకుండా, ఎల్లప్పుడూ చెరువులు నిండి కళకళలాడాలి. ఉదారబుద్ధితో పేదరైతులకు ధాన్యపు విత్తనాలు, వర్తకులకు నూటికి రూపాయి మాత్రమే వడ్డీ చొప్పున ప్రభుత్వపరంగా అప్పులు లభించాలి. (నారద మహర్షి మాటలను బట్టి మహాభారత కాలంలోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, ఆర్థికాభివృద్ధికి తక్కువ వడ్డీతో రుణాలు ప్రభువులు ఇచ్చేవారని అర్థం చేసుకోవాలి). వికలాంగులను, అనాధలను దయతో పోషించాలి. మేలుచేసిన వ్యక్తులను ఉచితరీతిన సత్కరించాలి.

ఆదాయంలో నాల్గవ భాగాన్ని లేదా మూడవ భాగాన్ని లేదా సగభాగాన్ని మాత్రమేఖర్చు చేయాలి కాని అంతకు మించి చేయకూడదు. ఆయుధ శాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, గజశాలలు, కోశాగారాల లాంటి వాటి పాలనలో ఎంతో నమ్మదగిన వారిని, రాజుపట్ల భక్తి కలవారిని, సమర్థులైన వారిని, నియమించాలి. ప్రజలంతా రాజును ప్రశంసించే విధంగా గురువులను, వృద్ధులను, గొప్ప వ్యాపారులను, ఆశ్రితులను, సజ్జనులను, పేదరికం రాకుండా కాపాడాలి. మంత్రులు, సైన్యాధిపతులు, హితులు, రాకుమారులు, పండితులు, ఆసీనులై వుండగా ప్రపంచమంతా ప్రశంసించే విధంగా ప్రతిదినం కొలువు తీరాలి. సమర్థులైన గూఢచారులను నియమించుకోవాలి. ఎదుటివారి ఎత్తుగడలను తెలుసుకోవాలి. ఆత్మరక్షణకు, శత్రు శిక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. సమబుద్ధితో లోక వ్యవహారాలు విచారించాలి.

ప్రపంచం మొత్తం వార్తమీదే ఆధారపడింది. అది లేకుంటే ప్రజలంతా పెనుచీకట్లో మునిగినట్లే. అందువల్ల ప్రభువు వార్తను బాగా నడపాలి. దీని భావాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఇలా రాశారు: ‘వార్తలను సేకరించడం, ప్రసరించడం ప్రభుత్వ బాధ్యత. అది గొప్ప సామాజిక అవసరం కూడా. వార్తా నిర్వహణ సరిగ్గా లేకుంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అవగాహన కుంటుపడుతుంది. సమన్వయం లోపిస్తుంది. అంతా అంధకారంలో వున్నట్లు వుంటుంది. అందువల్ల ప్రభువు వార్తను సమర్థవంతంగా నిర్వహించాలి’.

నాస్తికత, అసత్యమాడడం, ఏమరుపాటుతనం, సోమరితనం, తెలివితక్కువ వారితో కార్యాలోచన చేయడం, అతికోపం, అధిక కాలం దుఃఖపడడం, చేయాల్సిన పనిని గురించి అతి దీర్ఘంగా ఆలోచించడం, ఆలస్యంగా చేయడం, జ్ఞానులను గుర్తించక పోవడం, ప్రయోజనకరమైన విషయాలలో ప్రయోజనభంగకరమైన ఆలోచనలు చేయడం, నిర్ణయించిన పనులు చేయకపోవడం, రహస్యాలోచనలు బయటపడకుండా కాపాడలేకపోవడం, శుభకార్యాలు చేయకపోవడం, ఇంద్రియ సుఖాలలో తగులుకోవడం అనే పద్నాలుగు రాజదోషాలను వదిలిపెట్టాలి.

అలానాడు ధర్మరాజుకు నారద మహర్షి చెప్పిన రాజనీతి విషయాలు చాలావరకు ఇప్పటికీ, ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా అన్వయిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వాస్తవానికి నారదుడు ధర్మరాజును అవన్నీ చేస్తున్నావుకదా అని ప్రశ్నించాడు. ఆ విధంగా నారద మహర్షి అభిషిక్తుడైన ధర్మరాజు తన రాజ్య ప్రజలకు ఎలాంటి పరిపాలన అందివ్వాలో తెలియచేశాడు.               సమాధానంగా ధర్మరాజు, తనకు చేతనైనంతవరకు అన్యాయమార్గాన్ని వదలి, మహాత్ముల చరిత్రలను ఆదర్శంగా వుంచుకుని, నారదుడి లాంటివారి ధర్మబోధవల్ల శుభాలైన వాటిని మనఃపూర్వకంగా ఆచరిస్తానని అన్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, సభాపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

హనుమ సీతకు విశ్వాసపాత్రుడయ్యాడా? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమ సీతకు విశ్వాసపాత్రుడయ్యాడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (27-02-2021) ప్రసారం  

రావణాసురుడు ఆజ్ఞాపించిన దరిమిలా, రాక్షసస్త్రీల బెదిరింపు మాటలను, సీత సమాధానాన్ని, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతాన్ని శింశుపా వృక్షం మీద కూర్చుని విన్న హనుమంతుడు, ఈమె దేవలోకంలోని నందనవనంలో వుండాల్సిన స్త్రీగాని, మనుష్య స్త్రీకాదని తలుస్తాడు. వివిధ రకాల  ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాల వల్ల, తానూ చూసింది సీతనేనీ, రామచంద్రమూర్తి సందేశం వినే అర్హత ఈమెకే వుందనీ, హనుమంతుడు తీర్మానించుకుంటాడు. ఇంతవరకు సుగ్రీవుడు అప్పగించిన సీతాన్వేషణ పని సాధించిన హనుమంతుడు, ఇక శ్రీరాముడు చెప్పిన కార్యసాధన గురించి ఇలా ఆలోచించసాగాడు.

"సీతాదేవికి ఆమె భర్త యోగక్షేమాలు తెలిపి, ధైర్యం చెప్పడమే మేలైన పని. ఈమెకు ధైర్యం చెప్పి, ఈమె దుఃఖాన్ని నివారించడం నా ప్రధమ కర్తవ్యం. రామచంద్రమూర్తి సీతను ఎప్పుడు చూస్తానా అని ఆసక్తితో వున్నాడక్కడ వనంలో. ఆయన మాటలు ఈమెకు చెప్పి, ఓదార్చి, ఈమెచెప్పే మాటలు ఆయనకూ చెప్పి ఆయన్ను కూడా ఓదార్చాలి. ఇదే సరైన మార్గం." అనుకుంటాడు హనుమంతుడు.

"శ్రీరాముడి వృత్తాంతం ఈమెకు చెప్పడం ఆవశ్యకమే అయినా, ఎలా చెప్పాలి? అవకాశం చూసి, సీతాదేవిని ఓదార్చిపోవడమే మంచిది. ఎట్లాజరగాలది? నేను చిన్న ఆకారంలో వున్నాను. దాన్నిప్పుడు పెంచొద్దు. కోతినైన నేను మనుష్యులలా సంస్కృతం మాట్లాడవచ్చా? బ్రాహ్మణుడిలాగా సంస్కృతం మాట్లాడితే, నన్ను రావణుడిగా అనుమానించి అసలే మాట్లాడదేమో! మాట్లాడకుండా వూరుకుంటే, ఓదార్చాల్సిన ఆమెను ఎలా ఓదార్చాలి? మాట్లాడాలంటే, ఎలా, ఏమి మాట్లాడాలి? వేరేమార్గం లేదు. ఈమెకు తెలిసిన ప్రాకృతభాషలోనే మాట్లాడుతా. ఎలా చెప్పితే సీత నామాటలు చక్కగా వింటుంది, నన్ను చూడగానే సీత భయపడకుండా ఎట్లా వుంటుంది?"

ఇలా పరిపరి విధాల ఆలోచించిన హనుమంతుడు, బుధ్ధిమంతుడు కనుక, సరైన నిర్ణయానికొస్తాడు. తన్ను చూస్తేనే కదా సీత భయపడేది అనుకుంటాడు. కనిపించకుండా, కొమ్మల్లో దాక్కుని, సీత భయపడకుండా, రామచంద్రమూర్తిని, ధర్మంతోకూడిన, శుభాన్నిచ్చే, తియ్యటి మాటల్తో పొగిడి, ఆమె నమ్మేటట్లు చేస్తే మంచిదని భావిస్తాడు. తనమాటలను ఆమె ఎంతవరకు నమ్ముతుందో చూసిన తర్వాతనే, ముందు-ముందు ఏమిచేయాల్నో నిర్ణయించుకోవచ్చు అనుకుంటాడు. హనుమంతుడు, ఆమెను చూస్తూ, ఆమె మాత్రమే వినేటట్లు, చెట్టుచాటునుండి, తియ్యగా మాట్లాడసాగాడు.

దశరథుడి పేరు స్మరించేవారెవ్వరూ లంకలో వుండరు కాబట్టీ, ఆ ప్రస్తావన వచ్చినా కీర్తించే వారెవరూ లేరుకాబట్టీ, దశరథుడితో మొదలెట్టి ఆయన ఉదారకీర్తిని గురించిన మాటలు సీతచెవిలో పడేటట్లు చేసి, ఆమెమనస్సును ఆకర్షిస్తాడు హనుమంతుడు. ఈవిధంగా సీతాదేవి మనస్సును తనవైపు లాక్కొని, ఆతర్వాత ఇంకేమి చెప్తాడో విందామన్న ఆసక్తి ఆమెలో కలిగిస్తాడు హనుమంతుడు. పరేంగిత జ్ఞానిగా హనుమంతుడు సాక్షాత్కరిస్తాడు. ఎవరో తనమామగారిని పొగడ్తున్న మాటలు విన్న సీతాదేవి ఇంకేమి వినపడ్తుందో అని ఆలకించింది ఆసక్తిగా.

"దశరథ మహారాజు పెద్దకొడుకే శ్రీరామచంద్రుడు. (ఎవరో తన మగడిపేరు చెప్పుతున్నారే అని, ఇంకా ఏంచెప్తారో విందామని, మరింత ఆసక్తిగా మనస్సు పెట్టి వినసాగింది సీత). శ్రీరాముడు తండ్రి ఆజ్ఞప్రకారం, తమ్ముడు, భార్య తోడురాగా అడవులకెళ్లాడు. రావణుడు, మాయలేడి నెపంతో, మోసంచేసి, శ్రీరాముడి భార్యను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులు వానర రాజైన సుగ్రీవుడితో స్నేహం చేసారు. వాలిని చంపి, రాజ్యాన్ని ఆయనకప్పగించాడు రాముడు. సీతాదేవిని వెతికేటందుకు, సుగ్రీవుడు పంపిన, పరాక్రమమవంతులు, కామరూపులైన వానరులనేకమందిలో ఒకడినైన నేను, జటాయువు సోదరుడు సంపాతి సలహామేరకు, ఆయన మాటలు నమ్మి, నూరామడల పొడవున్న సముద్రాన్ని దాటి లంకకొచ్చాను. సీతాదేవిని ఇక్కడ వెతుకుతున్న నాకు, నా పూర్వ పుణ్యఫలంవల్ల, శ్రీరాముడు చెప్పిన ఆకారం, వర్ణన, కాంతి, గుణం, సౌందర్యం వున్న పతివ్రత కనిపించింది”.

ఇలా హనుమంతుడు అంటున్న మాటలను విన్న సీతాదేవి, ఆశ్చర్యపడి, కుటిలాలకాలను సవరించుకుంటూ తలపైకెత్తి, ఎవరీ మాటలు చెప్పుతున్నారా అని చెట్టువైపు చూసింది. ఇదేమన్నా రావణుడి మాయేమో అనుకుని, భయం, భయంగా, రాముడిని స్మరించుకుంటూ, చెట్టు కింద, మీద, ప్రక్కన, సందుల్లో చూడసాగింది సీత. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మకు హనుమంతుడు చేసిన రామగుణగానం జీవివితంపైన ఆశలు చిగురింప చేసింది. సీతమ్మకు ఊపిరులూదింది.

రామనామస్మరణ వింటున్న సీతాదేవికి, చెట్టుకొమ్మల్లో కనిపించిన కోతిని చూడగానే వళ్లుజలదరించింది. తనకేం కీడు జరగబోతున్నదో అని భయపడింది. రామలక్ష్మణులను స్మరించి మెల్లగా ఏడ్చింది సీత. అయితే తాను చూసింది హనుమంతుడనే విషయం ఆమెకు తెలియదు. తాను  చూసింది వాస్తవంగా కోతేనని నిశ్చయించుకుంటుంది. రెండు చేతులు జోడించి, బ్రహ్మకు, అగ్నికి, బృహస్పతికి, నమస్కరించుతుంది. కోతిచెప్పిన మాటలన్నీ నిజం కావాలని, భిన్నంగా జరుగవద్దని కోరుకుంటుంది. సీతాదేవి మనస్సుకు తాను నిజమైన కోతేనన్న నమ్మకం కుదిరిందనీ, పూర్తిగా నమ్మకం ఇంకా కుదరలేదని భావిస్తాడు హనుమంతుడు.

తనమీద సీతకు కొంత విశ్వాసం కలిగిందన్న నమ్మకంతో, హనుమంతుడు పైకొమ్మనుండి కింది కొమ్మకు దిగి, వినయంతో, ఇలా అంటాడు సీతతో: "అమ్మా నన్ననుగ్రహించి  నువ్వెవరివో, ఎందుకిట్లా మాసిన పట్టువస్త్రం కట్టుకుని, కొమ్మను పట్టుకుని, నిలబడి వున్నావో చెప్పు తల్లీ? అమ్మా! ఎక్కడనుండి నీవిక్కడకు వచ్చావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీవు క్షత్రియస్త్రీవని కూడా నీ శుభచిహ్నాలు చూసి భావిస్తున్నాను. రావణాసురుడు బలాత్కారంగా ఎత్తుకొచ్చిన సీతవు కావుకదా! నిజం చెప్పు. నీవు రామచంద్రమూర్తి భార్యవన్న సందేహం కలుగుతున్నది. నా అభిప్రాయం నిజమేకద! చెప్పాలి" అని అడుగుతాడు హనుమంతుడు సీతాదేవిని. త్రిజట మాటలకు భయపడ్డ రాక్షస స్త్రీలు సీతను వదిలి ఎక్కడి వారక్కడే దూరంగా పోయారు కొంతసేపు. అందువల్లనే సీతతో మాట్లాడటానికి కొన్త సమయం దొరికింది హనుమంతుడికి.

హనుమంతుడు తన భర్తను కీర్తించినందుకు, సంతోషించిన సీత, ఆయనతో తన గురించి చెప్పసాగింది ఇలా:

"దశరధుడి కోడలను నేను. జనకరాజు కూతుర్ని. రామచంద్రుడి భార్యను. నాపేరు సీత. భోగ-భాగ్యాలన్నీ అనుభవిస్తూ పన్నెండు సంవత్సరాలు శ్రీరాముడింట్లో వున్నాను. పదమూడో ఏట దశరథుడు నా భర్తను రాజును చేయాలనుకున్నాడు. దశరథుడి ముద్దుల భార్య కైకేయి. రామచంద్రమూర్తిని అడవులకు పంపాలని కోరుతుంది. దశరథుడు భార్యకేమీ సమాధానం చెప్పలేక, అయిష్టంగానే తనపెద్దకొడుకును రాజ్యం వదిలి పొమ్మంటాడు. తండ్రిపైనున్న భక్తి, గౌరవాల వల్ల, శ్రీరాముడు, ఆయనతో కలసి మేమిద్దరం వనవాస దీక్ష తీసుకుని, భయంకరమైన అడవిలో ప్రవేశించాం. రాముడి భార్యనైన నన్ను, వంచనతో, రావణాసురుడు దొంగతనంగా ఎత్తుకొచ్చాడు. అందుకే ఇక్కడ దిక్కులేక ఏడుస్తున్నాను. పన్నెండు నెలలు గడువిచ్చాడు వాడిమాట వింటానికి. అందులో ఇన్కా రెండునెలలే మిగిలి ఉన్నాయి. ఆ గడువు ముగిస్తే చస్తాను. ఈ లోపల రామచంద్రమూర్తి రాకపోతాడా అన్న ఆశతో చావకుండా బ్రతికున్నాను".

సీతాదేవి మాటలను విన్న ఆంజనేయుడు, ఆమెను ఊరడిస్తూ,"దేవీ! రామచంద్రమూర్తి నీకోమాట చెప్పమని పంపినందువల్ల, ఆయన దూతగా నేనిక్కడకు వచ్చాను. ఆయన క్షేమమని నీతో చెప్పమన్నాడు. నీ క్షేమసమాచారం తెలుసుకుని రమ్మన్నాడు. లక్ష్మణుడు, నీకు సాష్టాంగ నమస్కారమని చెప్పమన్నాడు. వారిరువురూ కుశలం” అని చెప్పాడు. ఈమాటలను విన్న సీతాదేవి సంతోషపడి, తనువెల్ల పులకరిస్తుంటే శుభవార్త తెలిపిన హనుమంతుడిపై సీతాదేవికి ప్రేమకలుగుతుంది. ఒకర్నొకరు నమ్మి మాట్లాడుకోవడం ప్రారంభించారు. సీతాదేవి చెప్పిన మాటలను విన్న హనుమంతుడు, ఈమెకు తనమీద దృఢమైన నమ్మకం కుదిరిందన్న విశ్వాసంతో, ఆమెను బుజ్జగిస్తూ, ఆమె దుఃఖాన్ని అణచటానికి, కొద్ది-కొద్దిగా ఆమె దగ్గరకు పోసాగాడు. ఆయనలా దగ్గరకు వస్తుంటే, రావణాసురుడే ఈవేషంలో తనతో మాట్లాడడానికి వచ్చాడన్న భయం కలిగింది సీతాదేవికి. అప్పుడు హనుమంతుడితో ఇలా అంటుంది.

“నీవు నిజంగా రామదూతవే అయితే నాకు ప్రియమైన ఆయన గుణాలు వర్ణించు. అలాచేస్తే నాకు అమిత సంతోషం కలుగుతుంది. రావణుడైతే రామచంద్రుడిని కీర్తించడు కద!" సీతాదేవి తనను సందేహిస్తున్నదనుకున్న హనుమంతుడు, అది పోగొట్టడానికి, తియ్యటి మాటల్తో, రామచంద్రమూర్తిని కీర్తిస్తాడు. ఆయన గుణగణాలను వర్ణిస్తాడు వివరంగా.

"త్వరలో నువ్వు రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని లంకలో చూస్తావు. నేను మాయలమారి రావణుడిని కాను. నీకు కనిపిస్తున్న రూపమే నా అసలు రూపం. నేనుకోతినే. పేరు హనుమంతుడు. సూర్యపుత్రుడు, వానరరాజు అయిన సుగ్రీవుడికి మంత్రిని. అధముడను కాను. ఇలాంటి నేను నీకొరకై, రామాజ్ఞ ప్రకారం సముద్రాన్ని దాటాను. లంకలో ప్రవేశించాను. రావణుడి నెత్తిమీద దొంగచాటుగా కాకుండా, పరాక్రమంతో కాలుపెట్టాను. ఇదంతా చేసి నిన్ను చూడటానికి వచ్చాను. నన్ను నమ్ము. నేను నువ్వనుకుంటున్నట్లు రావణుడను కాను. సందేహం మాని, పరులతో ఎలా సంభాషించ వచ్చన్న అనుమానం లేక, నీ దాసుడైన నాతో, నీబిడ్డతో మాట్లాడినట్లే మాట్లాడు" అంటాడు హనుమంతుడు.

సందేహ నివృత్తి కొరకు హనుమంతుడిని ఈవిదంగా ప్రశ్నిస్తుంది సీత: "శ్రీరామచంద్రమూర్తికీ, నీకూ స్నేహమెలా కలిగింది? లక్ష్మణుడెట్లు తెలుసు నీకు? నరులు, వానరులు, ఒకరిని చూస్తే ఇంకొకరు బెదురుతారు కదా! ఎట్లా మీరిరువురూ ఒకచోట చేరారు? అన్నదమ్ములిద్దరికి ఎలాంటి గుర్తులున్నాయి? రాముడికీ, లక్ష్మణుడికీ తొడలెలా వుంటాయి? చేతులెట్లా వుంటాయి? నీవు నిజమైన వానరుడవే అయితే, రామదూతవే అయితే, వాస్తవం చెప్పి నన్ను మెప్పించు"

శ్రీరామ-లక్ష్మణుల చిహ్నాలేంటని సీతాదేవి హనుమంతుడికి వేసిన ప్రశ్న ఒక విషమ ప్రశ్న. అందులో రెండు భాగాలున్నాయి. చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు. అందరికీ కనిపిస్తాయి కాబట్టి. "తొడలెలా వుంటాయని" కూడా అడుగుతుంది. అంటే మర్మాంగాలను గురించి ఆరా తీస్తున్నదన్న మాట. దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది. జవాబు చెప్పేటప్పుడు ఔచిత్యం కనబరుస్తాడా? లేదా అని పరీక్షించ దల్చింది. దీనర్థం: "ఆచార్యుడు", భగవత్ తత్వాన్ని ఆమూలాగ్రంగా, రహస్యాలతో సహా తెలిసిన వాడై వుండాలని.

జవాబుగా హనుమంతుడు: "దేవీ! నా అదృష్టం కొద్దీ, నేను రావణుడను కానని నమ్మి, మౌనం చాలించి, నీభర్త గుర్తులు, లక్ష్మణుడి చిహ్నాలు, యోగ్యంగా, వాస్తవంగా చెప్పమని అడిగావు. చెపుతావిను” అని అంటూ ఆమెక నచ్చే విధంగా, మెచ్చే విధంగా అన్నీ సవివరంగా చెప్తాడు. ఆయన ఆత్మగుణాలనీ, దేహగుణాలను కూడా చెప్పాడు. హనుమంతుడు మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి, తర్వాత దేహగుణాలను వర్ణిస్తాడు. “తేజస్సు, యశస్సు, శ్రీ” ల వల్ల వ్యాపించిన వాడంటాడు. బ్రహ్మచర్య నిష్ఠ కలవాడంటాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ను గురించి చాలా నిగూఢ౦గా చెప్తాడు. హనుమంతుడు జయశీలుడు. పరీక్ష నెగ్గాడు. సీతకు విశ్వాస పాత్రుడైనాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందారం ఆధారంగా)