Showing posts with label బతుకమ్మ. Show all posts
Showing posts with label బతుకమ్మ. Show all posts

Thursday, June 6, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు

బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అక్కయ్యతో పాటు మాకూ సంబరమే! దసరా పండుగకు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ. ఒక విధంగా దసరా, బతుకమ్మ పండుగలు ఏక కాలంలోనే జరుపుకుంటాం. బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలను మేం ఇంటింటికి వెళ్లి సేకరించేవాళ్లం. మా జీతగాళ్లు తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లు. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. ఒక్కొక్కరి స్థోమతను బట్టి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ ఒక సంరక్షిత దేవత. తెలుగువారు, అందులో తెలంగాణ వారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. బతుకమ్మ బొమ్మను వుంచాల్సిన పళ్లెం, ఆకులతో కాని, వెదురుతో కాని చేసే వాళ్లు. గుమ్మడి పూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మ (గౌరమ్మ) ను వుంచేవారు. ఇలాంటివే మరికొందరు చేసిన వాటిని ఒక స్థలంలో వుంచి పూజిస్తారు. ధర్మాంగ-సత్యవతి దంపతులకు లక్ష్మీదేవి కటాక్షం వల్ల పుట్టిన బిడ్డ బతుకమ్మ. బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూంటారు స్త్రీలు. ఉదాహరణకు..."ఒక్కొక్క పూవేసి చందమామ, ఒక్క ఝాము ఆయె చందమామ, పోయిరా గౌరమ్మా, పోయిరా గౌరమ్మా, పోయి అత్తవారింట్లో గౌరమ్మా, బుద్ధిగా వుండాలి గౌరమ్మా...." అనే పాటలు పాడేవారు. కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మ చెక్క లాడడం, బతుకమ్మ పండుగలో భాగం. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. ఓ గుడి ముందో, లేకపోతే ఎవరో ఒకరి ఇంటి ముందో దీనికి అనువుగా వుండే స్థలాన్ని ఎంపిక చేసుకునేవారు. ఎనిమిది రోజులపాటు...అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలెట్టి, తొమ్మిదో రోజున మా వూరు సమీపంలోని ముత్తారం పక్కన వున్న వూర చెరువు దగ్గర చద్దుల బతుకమ్మ ఆడేవారు. ఆడి, బతుకమ్మను నీటి ఒడిలో చేర్చేవారు. చద్దుల బతుకమ్మ రాత్రి బాగా పొద్దుపోయే దాకా ఆడేవారు. స్త్రీలతో పాటు పురుషులు కూడా వచ్చి దూరం నుంచి చూసి ఆనందించేవారు. ఐదు రకాల ప్రసాదాలను ఆ పండుగలో పంచి పెట్టే వారు. పెసర పప్పు, గోధుమ పిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో తయారు చేసినవవి. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది. బతుకమ్మ పండుగను బలే ఎంజాయ్ చేసే వాళ్లం మేం.

బాల్యంలో...ఆ మాటకొస్తే కొంచెం పెద్దైన తరువాత కూడా ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. దసరాకు, మా ఊరూ-వాడా, వూరి బయట పైలు పెంట సమీపంలో, పాఠశాలకు ఎదురుగా, పాతిన జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, "శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం" అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. విజయ దశమి (దసరా) కి, మా ప్రాంత పరిసరాలకి కొంత అవినాభావ సంబంధముంది. మా వూరికి అతి సమీపంలో వున్న "బాణాపురం" గ్రామ సరిహద్దులలోని జమ్మి చెట్టుపైనే, పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందర, వారి శస్త్రాస్త్రాలను వుంచారట. అదే విధంగా, సమీపంలోని మరో గ్రామం నేలకొండపల్లిలో "విరాటరాజు గద్దె" వుంది. భీముడు వంట చేసిన పెద్ద గాడి పొయ్యిలు కూడా వున్నాయి. ఇప్పుడా గద్దె పురా తత్వ శాఖ వారి ఆధీనంలో వుంది. దసరా పండుగ రోజుల్లో మా ఇంట్లో బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేసేవారు. ఇక వూరి బయట వున్న జమ్మి చెట్టు వద్ద, "యాట" (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. సాధారణంగా గ్రామాల్లో దసరా పండుగ నాడు నివురు గప్పిన నిప్పులా వున్న తగాదాలే మన్నా వుంటే బయట పడతాయి. ఒక ఏడాది మా వూళ్లో అదే జరిగింది. మా గ్రామ రాజకీయాలనే పూర్తిగా మార్చి వేసిన ఆ వివరాలు మరో సందర్భంలో ప్రస్తావిస్తాను.

మేం ఆనందంగా జరుపుకుంటుండే మరో పండుగ దీపావళి. దీపావళికి మా చిన్నతనంలో "రోలు-రోకలి" అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. అదే విధంగా, రాత్రిపూట కాల్చుకునే టపాసులు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. అన్ని టపాసుల్లోకి చీమ టపాకాయలు  బలే మజా వచ్చేవి. దీపావళి నాడు కాల్చగా మిగిలినవి బధ్రపర్చుకుని, కార్తీక పౌర్ణమికి కాల్చే వాళ్లం. ఆ రోజున ముత్తారం దగ్గరలో వున్న వూర చెరువులో దేవుడి "తెప్ప ఉత్సవం" జరిగేది. దీపావళి పండుగకు ముత్తారం నుంచి దేవుడి ఉత్స విగ్రహాలను వూరేగింపుగా మా వూళ్లోకి తీసుకొచ్చేవారు. కొఠాయి మీద వుంచి పూజలు చేసే వాళ్లు. ఆ రోజంతా హడావిడే. చాలా సరదాగా గడిచేది. ముక్కోటి ఏకాదశికి కూడా దేవుడు వూళ్లోకి వచ్చేవాడు. ముక్కోటి రోజుల్లో జొన్న పంట "వూస బియ్యం" తయారయ్యేవి. జొన్న కంకులలోంచి అవి కొట్టుకుని వుడకబెట్టుకుని తింటుంటే బలే సరదాగా వుండేది.

మా ఇంటి ముందు భాగాన వున్న ధాన్యం పాతర్లు

మరో పండుగ "సంక్రాంతి". ఆ పండుగ రోజుల నాటి గొబ్బిళ్లు, హరిదాసులు, "గంగిరెద్దులు", రేగు పళ్లు....మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, "బోరాల" లో నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది. మా జొన్న కల్లం మా ఇంటి పక్కనే తోటలో వేసే వాళ్లం. ధాన్యం కొలవడానికి ఉపయోగించే "కుండ" లు, "మానికలు", "తవ్వలు" "సోలలు", "గిద్దెలు" మా వూరి రైతుల్లో అతి కొద్ది మందికి మాత్రమే వుండేవి. మా ఇంట్లో వుండేవి. ధాన్యం కొలవడానికి మా ఇంటి నుంచి చాలా మంది తీసుకెళ్తుండేవారు. కుండకు పదిన్నర మానికలు...మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు...తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు...సోలకు నాలుగు గిద్దెలు...ఇదీ కొలత. అలానే, ఐదు కుండలైతే ఒక "బస్తా" ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక "పుట్టి" అవుతుంది. కొలత కొలిచేటప్పుడు కుండకు కాని, మానికకు కాని, తవ్వకు కాని, సోలకు కాని, గిద్దెకు కాని, ధాన్యం పూర్తిగా నిండి పై వరకు వచ్చే విధంగా పోయాలి. ఎడ్ల బండిపైన "బోరెం" వేసి, ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యాన్ని నింపి ఇంటికి తోలేవారు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఆశ్చర్యకరమైన విషయం....పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. రాజకీయ కొట్లాటలున్న గ్రామాలలో తప్ప, మిగతా చోట్ల ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది. పొలంలో కల్లం పూర్తైన తరువాత, వూళ్లోని కొంత మందికి "మేర" అని ఇచ్చే ఆచారం వుండేది. గ్రామంలోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, నీరుకాడు, షేక్ సింద్....ఇలా కొద్ది మందికి కల్లంలో కొంత ధాన్యం వారు ఏడాది పొడుగూ చేసే పనులకు ప్రతిఫలంగా ఇవ్వడం ఆనవాయితీ. ఆ ప్రక్రియ అంతా కళ్లల్లో మెదుల్తూంది.

అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు చిన్నతనం నుండి నేటి వరకు హాజరవుతూనే వున్నాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. ముత్తారంలోనే స్థిరపడి పోయిన వనం గోపాలరావు బాబాయింట్లో అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.

మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ "పీర్ల పండుగ". గ్రామంలో బత్తుల వారి ఇంటి సమీపంలో "పీర్ల గుండం" వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు. మా కుటుంబానికి వంశ పారంపర్యంగా "హస్సేన్-హుస్సేన్" పీర్లుండేవి. ఏడవ సరగస్తు నాడు వాటిని బయటకు తీసేవారు. కుదాయ్ సాహిబ్ వీటిని నిర్వహించేవాడు. 

చిన్నతనంలో మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం (రాత్రవుతుండగానే) జరిగే ఒక కార్యక్రమం నాకింకా గుర్తుంది. మాది పెద్ద వ్యవసాయం. జీతగాళ్లు కూడా పది మందికి పైగా వుండేవారు. రోజువారీ కూలీకి వచ్చే వాళ్లు కూడా కొందరుండేవారు. పొలం పనులు చూసుకుని ఇంటికి తిరిగొచ్చి, పశువులకు ఆ రోజుకు వేయాల్సిన దానా, ఇతర పనులు పూర్తైన తరువాత జీత గాళ్లకు "పొగాకు" పంచే కార్యక్రమం మొదలయ్యేది. జీత గాళ్లకు ఏటా ఇచ్చే జీతంతో పాటు, ఏడాదికి రెండు జతల చెప్పులు, ప్రతి రోజు తాగడానికి (పీల్చడానికి) పొగాకు (లేదా బీడీలు) ఇవ్వడం ఆనవాయితీ. మా నాన్న గారు ఒక కుర్చీలో కూచుని, హుందాగా ప్రతి రోజు పొగాకు కాడల పంపకం చేసేవారు. ఒకే సారి నెలకో-పదిహేను రోజులకో కలిపి ఇవ్వక పోయేవారు. పొగాకు పంపిణీ జరిగే సమయంలోనే ఆ రోజు పొలం పనులను సమీక్షించేవారు. జీత గాళ్లకు పొగాకు ఇవ్వడానికి మేం పొగాకు పంట కూడా వేసే వాళ్లం మొదట్లో. ఆ తరువాత రోజుల్లో పొగాకు పంట వేయడం ఆపుచేశాక బీడీలు పంపకం చేసే వాళ్లం

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part ONE: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part ONE
వనం జ్వాలా నరసింహారావు

ఎక్కడనుంచి మొదలెట్టాలో సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు.....బుద్ధి తెలిసినప్పటినుంచి ప్రారంభిస్తాను. వ్యవసాయం, కరిణీకం వృత్తిగా, పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని వనం వారి కృష్ణా పురం అనే ఒక కుగ్రామంలో నివసిస్తుండె, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో ఆగస్ట్ 8,1948 న పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. ఆరవ తరగతి నుంచి ఖమ్మంలో విద్యాభ్యాసం కొనసాగినప్పటికీ, తరచుగా గ్రామానికి వెళ్లొస్తుండేవాడిని.

మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. చిన్నతనంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లొచ్చిన తరువాత, ఇంటికి రాగానే మేం పాఠశాలకు వేసుకెళ్లిన దుస్తులు విడిపించేవారు మా పెద్దలు. స్కూల్లో మైల పడిపోయామని వాళ్ల భావన. స్నానం చేసిన తరువాతే శుద్ధి ఐనట్లు పరిగణలోకి తీసుకునేవారు. మా బావి నీరు ఉప్పు నీరు. మంచినీటిగా తాగడానికి ఉపయోగపడదు. మా జీతగాడు వెంకులు ప్రతిరోజు వాళ్లింటి బావి నుంచి ఒక రెండు బిందెల మంచి నీళ్లు పట్టుకొచ్చేవాడు. అందులో మా అమ్మ కొద్దిగా చల్ల (మజ్జిగ) చుక్క వేసేది. అలా చేయడంతో ఆ నీళ్లు మజ్జిగతో సమానమని ఆమె నమ్మకం. ఇంట్లో వంట మడి కట్టుకుని చేసేవారు. వంట చేయడానికి ఒక అయ్యగారుండేది.  మామిడి కాయ వూరగాయలు కూడా మడితోనే పెట్టేవారు మా అమ్మ. రోజువారీ ఉపయోగానికి కొంత మోతాదులో బయటుంచుకునేవాళ్లం. అవి ఐపోతే, మళ్లీ మడి కట్టుకునైనా తీసేవారు, లేదా, పిల్లల్లో ఒకళ్లని "బరివాత" (వంటి మీద బట్టలేమీ లేకుండా) తీయించేవారు. అలా చేయడం మాకెంతో ఇష్టం కూడా. మా వూరు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. అత్యధిక సంఖ్యలో గిరిజనులున్న జిల్లా మాది. అత్యధికంగా షెడ్యూల్డ్ ప్రాంతం వున్న జిల్లా కూడా మాదే. దేశంలో ప్రసిద్ధికెక్కిన భద్రాచల రామాలయం మా జిల్లాలోనే దండకారణ్యంలో వుంది. రామాలయం కట్టించిన కంచర్ల గోపన్న-భక్త రామదాసు మా సమీప గ్రామం నేలకొండపల్లి వాస్తవ్యుడు. అది మా మేనమాముండే వూరు. నేలకొండపల్లిలో ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా ఇప్పటికీ పిలుస్తున్నారు. మా రెవెన్యూ గ్రామమైన ముత్తారంలో కూడా పురాతన రామాలయం వుంది. ఆ దేవాలయానికి కూడా చాలా చారిత్రక ప్రాముఖ్యత వుంది. ఆ వివరాలు మరో సందర్భంలో రాస్తాను. 

బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, ఆ బాల్యంలో నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ, కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామ పెద్దలతోనూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పొరుగూర్లో వున్న పెదనాన్నగారితో ఆయన మెలిగిన విధానం-తర తరాల వైరం మరిచిపోయేందుకు అందించిన స్నేహ హస్తం-స్నేహ ధర్మం తప్పిన ఆయనపై నాన్న తిరుగుబాటు, సాధించిన తిరుగులేని విజయం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని, నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మపేట, ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్న చెప్తే తెలుసుకున్నాను. కొన్ని స్వయంగా చూసాను. నా చిన్నతనంలో నాన్న గుర్రం స్వారీ చేస్తూ, తెల్లటి కమీజు ధరించి, ధోవతి కట్టి బయటకు వెళ్లడంవెళ్తున్నప్పుడు గ్రామ వీధుల్లో అరుగులమీద కూచున్న వారందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం బాగా జ్ఞాపకం వుంది. ఆయన కమీజుకు పెట్టుకున్న బంగారపు గుండీలు కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత కాలంలో సైకిల్ పై వెళ్లేవారు కొన్నాళ్లు. ఆయన అమ్మపేట గ్రామం పట్వారీ.


         నా చిన్నప్పటి ఆటపాటలింకా మదిలో మెదులుతూనే వున్నాయి. మా ఇంటికి ఎదురుగా మా వూరి "పటేల్" గారిల్లుండేది. ఆయన పేరు తుల్లూరి రామయ్య. మా వూరి పెత్తనమంతా చాలావరకు ఆయనదే. ఆయన మొదటి భార్య తమ్ముడు, కూతురు భర్త బయన నరసింహారావు మా వూరి పోస్ట్ మాస్టర్. ఆయనే నాడు ఇల్లు వదిలి బయటకు రాడు సాధారణంగా. మా వూళ్లోని ఇతర పెద్ద మనుషులలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వారు పర్చూరి వీరభద్రయ్య, బత్తుల సత్యనారాయణ, బత్తుల సురేందర్, చాగంటి వారు, నీరు కొండవారు, పక్క శివారు గ్రామం కోదండరామపురంలోని వాడపల్లి రాజేశ్వర రావు గారు...తదితరులు. ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, మా నాన్న, ఎదురింటి పటేల్ రామయ్య, కొంచెం దూరంలో వున్న బత్తుల సత్యనారాయణ మా ఇంటి బయట వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వూళ్లో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే అదే సమయంలో ఆ కార్యక్రమం కూడా జరిగేది. నేను, పటేల్ కొడుకు వెంకట్ రావు కూడా మా తండ్రులను అనుకరిస్తూ, వేప పుల్లతో పళ్లు తోముకుండేవాళ్లం. గ్రామాల్లో పంచాయతీ తీర్పులు అమోఘంగా వుండేవి. అన్నీ పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. న్యాయస్థానాలలో మాదిరిగా "అపీల్" లేదు. ఒక సారి పెద్ద మనుషులు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో ఒకరిద్దరు కూడా వుండేవారు.

          వీళ్లందరిలోకి నాకు అనుబంధం ఎక్కువగా మా ఇంటి ఎదురుగా వుండే "బయన" వారి కుటుంబంతోనే వుండేది. ఆ ఇంటిని "బయమోరి ఇల్లు" అని వూరంతా పిలిచే వాళ్లం. పటేల్ కొడుకు వెంకట్ రావు నా క్లాస్ మేట్. నా వయస్సే. మేమిద్దరం, మాతో పాటు తాతోరి వెంకటేశ్వ్రర్లు, పురుషోత్తం రావు, మల్లెల నరసయ్య....ఇలా కొంతమందిమి కలిసిమెలిసి ఆడుకునేవాళ్లం. మరో క్లాస్ మేట్ చట్టు వెంకయ్యతో కలిసి సమీపంలోని అడవికి పోయి "తుమ్మ బంక" తెచ్చుకునే వాళ్లం. మా అక్కయ్య రాధమ్మకు బయన నర్సయ్య భార్య మధురమ్మతో స్నేహం. మధురమ్మ చెల్లెలు (వెంకట్ రావుకు కూడా చెల్లెలే) "బేబి", నేను, వెంకట్ రావు కలిసి "అచ్చన గిల్లలు", "వాన గుంటలు" ఆడేవాళ్లం. సాయంత్రాలు కొఠాయివైపుకు వెళ్ళి "గోలీలు", "బలిగుడు-చెడు గుడు" (కబడ్డీ), "బెచ్చాలు", "పత్తాలు", "జిల్ల గోనె", "దస్తీ ఆట". "తొక్కుడు బిళ్ల" ఆడేవాళ్లం. మధురమ్మ, మా అక్కయ్య కలిసి "పచ్చీసు" ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం.  

మధ్య మధ్య మా వూరి పట్వారీ (అసల్దారు కాదు...గుమాస్తా), మాకు సమీప బంధువు కొండపల్లి సుందరయ్య తాత గారి మనుమలు, మనుమ రాళ్లు (కూతుళ్ల పిల్లలు) తాతగారి ఇంటికి శెలవులకు వస్తుండేవారు. మేమంతా కలిసి ఆడుకునే వాళ్లం. ఆయన పెద్ద కూతురు సుగుణమ్మది గంగారం గ్రామం. రెండో కూతురు మధురమ్మ, మూడో కూతురు లక్ష్మీబాయిలది బలపాల. మధురమ్మను మా పెద మేనమామ, లక్ష్మీబాయిని మా రెండో మేనమామ వివాహం చేసుకున్నారు. నా వయసున్న ఆడపిల్ల (అత్త కూతురు) సీతా మహాలక్ష్మి సుగుణమ్మ కూతురు కాగా, మధురమ్మ కొడుకు ప్రభాకర్, సవతి కొడుకు మోహన్ రావులు నా వయసున్న వారే. లక్ష్మీబాయి కూతురు రాజ్యం నా కంటే చిన్నది కాని మాతో పాటే ఆడుకునేది. రాజ్యం చెల్లెలిని మా తమ్ముడు వివాహమాడాడు. సుగుణమ్మత్తయ్య కూతురు సీతతోను, లక్ష్మీబాయత్తయ్య కూతురు రాజ్యంతోను, తుల్లూరి రామయ్య కూతురు బేబితోను ఎక్కువగా "అచ్చన గిల్లలు" అడేవాడిని చిన్నతనంలో. ఓడిపోయిన వారికి "పులుసు పోయడం" అని పందెం వుండేది.  బలే సరదా ఐన ఆట అది. మా పెద తమ్ముడు వెంకట రమణ కూడా మాతో కలిసేవాడు. వాడికీ, నాకు వయసులో మూడేళ్ల తేడానే. సుందరయ్య గారిని మా నాన్న "కంస మామా" అని సంబోధించేవాడు. చిన్నప్పుడు పొలాలకు పోవడం అలవాటే. అదే విధంగా మా పక్క వూళ్లో-కమలాపురంలో వుండే వనం నర్సింగరావు కూడా మధ్య మధ్య మా వూరికి రావడమో, లేక మేం అక్కడకు పోవడమో జరుగుతుండేది. నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామం భార్గవ కూడా మా చిన్న తనంలో ఆటపాటల్లో మాతో కలిసేవాడు.


మా అక్కయ్య రాధను మా గ్రామం సమీపంలో, ఆరేడు కిలోమీటర్ల దూరంలో వున్న నాచేపల్లి గ్రామ వాస్తవ్యులైన ముదిగొండ చలపతిరావు అలియాస్ సహదేవరావుకు ఇచ్చి వివాహం చేశారు. చలపతి రావును మా అమ్మమ్మ (అమ్మ పెంపకపు తల్లి) గారు పెంచుకున్నారు. వారికి సంతానం కలగకపోతే, ఒక ఆడపిల్లను (మా అమ్మ), ఒక మగ పిల్లవాడిని (మా బావ-మామయ్య) దత్తత తెచ్చుకున్నారు. మా అక్కయ్య వివాహం ఆ రోజుల్లో (1955 ప్రాంతంలో) ఐదు రోజులు వైభవోపేతంగా జరిపించారు మా నాన్న గారు. హరి కథలు, బుర్ర కథలు కూడా ఏర్పాటు చేసారు. శెలవుల్లో అమ్మమ్మగారి గ్రామం నాచేపల్లి వెళ్లే వాళ్లం. మా తాత గారు పరమ రామ భక్తుడు. ఉదయాన్నే లేచి, అలా నడుచుకుంటూ వెళ్ళి, కిలోమీటర్ దూరంలో వాళ్ల గ్రామంలో వున్న రామాలయాన్ని సందర్శించి వచ్చేవాడు. అది నిత్య కృత్యం. స్నానం చేసిన తరువాత కనీసం నాలుగైదు గంటలన్నా పూజ చేసేవాడు. ఇంట్లో "సాల గ్రామం" వుండేది. మేం శెలవుల్లో వెళ్లినప్పుడు మాకు భారత, భాగవత, రామాయణంలోని అనేక గాధలను కథలు-కథలుగా మలిచి చెప్పేవాడు. ప్రతి ఏటా ఆ వూరి రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే వారు. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతూనే వుంది. దాదాపు ప్రతి పండుగకు మా అక్కా-బావలను మేం మా వూరు తీసుకొచ్చే వాళ్లం మా చిన్నతనంలో. అందులో ప్రధానమైంది "బ్రతుకమ్మ" లేదా "బతుకమ్మ" పండుగ.