Showing posts with label పప్పు లక్ష్మీ నరసింహమూర్తి. Show all posts
Showing posts with label పప్పు లక్ష్మీ నరసింహమూర్తి. Show all posts

Sunday, February 28, 2010

వివాహబంధం-XIII : మూడు నిద్రలు-సత్యనారాయణ వ్రతం-పెళ్ళి సారె : వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-XIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

వరుడింట్లో వేడుకలు-వధువింటికి మళ్ళీ ప్రయాణం
వనం జ్వాలానరసింహారావు

ఖమ్మంలోని మా ఇల్లే విడిదిల్లు కూడా కావడం వల్ల, గృహ ప్రవేశం సొంత ఇంట్లో జరిగినట్లే అయింది. మామ గారింటినుంచి మా ఇంటికి రావడానికి ఎక్కువ సమయం పట్ట లేదు. ఆ రోజుల్లో (ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే వుంది) కొన్ని ఖర్చులను ఆడ-మగ పెళ్ళి వారు సమానంగా పంచుకునేవారు. ఉదాహరణకు పెళ్ళి ఫొటోలు, సన్నాయి మేళం, రవాణా చార్జీలు నిర్మొహమాటంగా చెరి సగం అనుకునేవారు. రవాణా చార్జీలు పెళ్ళికి వచ్చేటప్పుడు మగ పెళ్ళి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఆడ పెళ్ళి వారు చేయించేవారు. అంటే పెళ్ళికి తీసుకుని రావాల్సిన బాధ్యత వాళ్లదని అర్థం. ఇక పెళ్ళైన తర్వాత పెళ్ళి కూతురుతో తిరుగు ప్రయాణంలో ఖర్చంతా మగ పెళ్ళి వారిది. సన్నాయి ఖర్చూ అంతే. మాకు గుర్తున్నంతవరకూ, మా పెళ్ళికి ముందు చాలా మందికి వారిళ్లల్లో జరిగిన పెళ్ళిళ్లకు ఫొటోలు తీయించడం ఇంకా అలవాటు కాలేదు. ఖమ్మంలో మాతో పాటే కాలేజీలో చదువుకున్న వెంకట్రావుకు ఫొటో స్టూడియో వుండేది. ఆయనతోనే తీయించారు (బ్లాక్ అండ్ వైట్లోల) ఫొటోలు. బహుశా అప్పట్లో అదొక్కటే స్టూడియో అనుకుంటా. పెళ్ళికి ముందు జరిగిన ఒప్పందం ప్రకారం చెరొక కాపీ ఫొటోలన్నీ ఇవ్వాలని, ఖర్చు చెరి సగమని మా నాన్న-మామ గారు అనుకున్నారు. చివరికి ఎవరిచ్చారో గుర్తులేదు. అసలు ఫొటోలు తీయించిన ప్రధాన ఉద్దేశం, మా మామ గారి పెద్దకొడుకు డాక్టర్ రంగారావు గారు ఇంగ్లాండులో వుండి పెళ్ళికి రాలేకపోయినందున, అక్కడకు పంపించడానికని తర్వాత మా ఆవిడ చెప్పింది.

తిరుగు ప్రయాణం కూడా ఎద్దుల బండ్లలోనే అట్టహాసంగా జరిగింది. మా ఇద్దరిని పల్లకిలో కూర్చొబెట్టారు. ఖమ్మం నుండి తెల్లవారు ఝామున బయలుదేరి, వెంకటగిరి, లక్ష్మీ పురం, చిరు మర్రి మీదుగా మా వూరికి చేరుకున్నాం. దారిలో గ్రామం వచ్చినప్పుడల్లా, వూరు దాటిందాకా, పల్లకి ముందు సన్నాయి వాయించడం సాంప్రదాయంగా జరిగింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందని భావించి, ప్రతి గ్రామంలో అలా చేయొద్దని చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలోనూ నేను ధోవతి కట్టుకునే వుండడం కూడా తనకు నచ్చలేదని చాలా కాలం తర్వాత చెప్పింది మా ఆవిడ. మే నెల మొదటి తేదీన, ఉదయం సుమారు పది గంటల సమయంలో మా వూరికి చేరుకున్నాం. సాధారణంగా, సాంప్రదాయం ప్రకారం సాయంత్రం సమయంలో పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును గృహప్రవేశం చేయించడం ఆచారంగావస్తున్నది. అందువల్ల మా ఉభయులను, మా ఇంటికి కాకుండా, నాకు వరుసకు "నాయనమ్మ" అయిన మా పాలివారింటికి (వనం రంగనాయకమ్మ గారు) తీసుకెళ్లారు. స్నానం చేసి అలసటగా వుండడంతో మధ్యాహ్నం వరకూ నిద్ర పోయాం. భోజనానంతరం కూడా మళ్లీ కునుకు తీసిన గుర్తు. మా అవిడతో పాటు, వధువుతో సాంప్రదాయం ప్రకారం రావాల్సిన పుట్టింటి వారు కొందరొచ్చారు. ఆవిడ అక్క గార్లు జ్యోతి, హైమ(కూతుళ్లు చిన పాప, రుక్కు, రాణి); తమ్ముడు వెంకన్న; చెల్లెలు జుబ్బి; వదిన గారు కరుణ (కొడుకు భరత్ బాబు); ఇంట్లో నలబై సంవత్సరాలుగా చేదోడు-వాదోడుగా వుంటున్న చుక్కి వచ్చారు. అలానే మా మేనమామలు-వారి పిల్లలతో సహా, ఇతర బంధువులందరూ మా వెంట వున్నారు. అంతా కోలాహలం-సంబరం.

చీకటి పడుతూనే పూల పల్లకి సిద్ధం చేశారు. సాంప్రదాయం ప్రకారం వధూవరులను "ఊరేగించి" ఇంటికి తీసుకెళ్లాలి. ఊరేగించడానికి కూడా అర్థం వుంది. దీన్నే "ఊరు ఎరిగించడం" అని అంటారు. ఫలానా వాళ్లు దంపతులయ్యారనీ, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాల ప్రకారం భార్యాభర్తలకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలనీ వారిని ఎరిగిన వూరి వారందరికీ ఎరుక పరచడం కొరకు ఊరేగింపు జరుపుతారని అంటారు. అదలా వుంటే, ఆ వేడుక కూడా ఎంతో సరదాగా జరుపుకునే వేడుక. పూలపల్లకి వెంట బంధుమితృల కోలాహలం వుంటుంది. బాణా సంచా కాల్చారు. కమలాపురంలో వుండే మా బాబాయి వనం నరసింగరావు బాణా సంచా ఏర్పాటు చేసిన సంగతి మాకెవరికీ చివరవరకు తెలియదు. అదో సంబరం మితృలకు. ఐదారు గంటల వూరేగింపు తర్వాత సుమారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి చేరాం. ఇంటిముందు నూతన వధూవరులకు "దిష్టి తీయడం" కూడా సాంప్రదాయంలో భాగమే. ఎర్ర నీళ్లు వధూవరుల చుట్టూ తిప్పి దిష్టి తీశారు. మా వూళ్లోని మా ఇల్లు రెండస్థుల భవనం. "లేక్ వ్యూ" భవనం అనొచ్చు. మేడ మీద కూచొని చూస్తే సమీపంలో చెరువు-నిండా ఎప్పుడూ నీళ్లతో దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఎవరూ వుండడం లేనందున జీర్ణావస్థలో వుందా ఇల్లు.

పెళ్లికొడుకు ఇంట్లో చేయాల్సిన మూడు నిద్రలల్లా, అనివార్య కారణాల వల్ల-ఆడ పెళ్లి వారి వెంట వచ్చిన వారంతా పల్లెటూరు వాతావరణంలో మరికొంత కాలం గడపాలన్న కోరికున్నందువల్ల, ఐదు నిద్రలయ్యాయి. అలా, ఐదు రోజుల పాటు మా ఇల్లంతా కోలాహలం-సందడి-సంబరంగా నిండిపోయింది. మా మామయ్యలందరి కీ చీట్లపేకల ఆటంటే చాలా ఇష్టం. అందులో "రెమీ" (పదమూడు ముక్కల ఆట) డబ్బులు పెట్టి ఆడడం మరీ ఇష్టం. వారితో పాటు మరికొందరు చేరారు. రెండు-మూడు బృందాలుగా ఐదు రోజులూ వీలున్నప్పుడల్లా ఆట కొనసాగుతూనే వుండేది. కారప్పూస, బూందీ మిశ్రమం, అటుకులు-బొంగు బియ్యం మిశ్రమం, చక్కిలాలతో పాటు ప్రతిరోజూ చేసే వేడి-వేడి పదార్థాలను ఆస్వాదించుకుంటూ, పేకాట ఆడే వాళ్లు. మధ్యలో కోప-తాపాలు కూడా వచ్చేవి-సర్దుబాటయ్యేవి. అదేందోకాని, ఆ అయిదు రోజులూ కొద్దో-గొప్పో వర్షం కురుస్తూనే వుంది. ఆ వర్షంలోనే వూళ్లో వాళ్లందరూ (మహిళలు) రావడం, కాసేపు పెళ్లికూతురితో-వారి బంధువులతో ముచ్చడించడంతో ఆడ పెళ్లి వారందరికీ కూడా సరదాగా గడిచింది. మాకు ఆరోజుల్లో ఇంటి పక్కనున్న తోటలో "మల్లె పూలు" విరివిగా పూసేవి. చీకటి పడుతూనే మల్లె పూల సువాసనతో ఇల్లంతా మరింత ఆహ్లాదకరంగా మారిపోయేది. ఎండాకాలం-ఆరు బయట-ఇంటిముందు తాటాకు పందిళ్లు-మేడపైన-ఎదురుగా చెరువు కనపడుతుంటే, ఆ ఆనందమే ప్రత్యేకం. అదంతా అందరం అనుభవించాం ఆ అయిదు రోజులు. ఐదు రోజుల్లో కనీసం రెండు రోజులు వధూవరులతో కోలాహలం మధ్య "మేజువాణి" చేయించారు.

నాలుగో రోజున మా వూళ్లో అంతర్భాగమైన ముత్తారంలోని రామాలయానికి వెళ్లాం అందరం కలిసి. "ముత్తారం-వనం వారి కృష్ణా పురం-కోదండ రామపురం" అనే మూడు గ్రామాలు ఒకే రెవెన్యూ గ్రామం (ముత్తారం) కింద-ఒకే పంచాయితీ (కృష్ణా పురం) కింద వుంటాయి. ముత్తారంలో నాలుగు వందల ఏళ్లనాటి పురాతన రామాలయం (భద్రాచలం రామాలయాన్ని అన్ని విధాల పోలిన) వుంది. మా పూర్వీకులు (వనం కృష్ణ రాయలు గారు) కట్టించారు. ఆయన భక్తికి మెచ్చిన సాక్షాత్తు భద్రాచల రాముడు, భద్రాచలం గుళ్లో వున్నట్లే ఇక్కడా దర్శనం ఇచ్చే విధంగా, విగ్రహాల రూపంలో ఆయనకు కనిపించి దేవాలయంలో ప్రతిష్టించబడ్డాడు. జీర్ణావస్థలో వున్న ఆలయాన్ని గ్రామస్థులంతా కలిసి, పర్చూరు ప్రసాద్ గారిచ్చిన భారీ విరాళంతో ఇటీవలే పునర్మించారు. మా ఇంటిలో శుభకార్యాలు జరిగినప్పుడల్లా అక్కడకు, సమీపంలోనే మా నాన్నగారు కరిణీకం చేస్తున్న ఆమ్మ పేటలోని వెలగొండ వెంకటేశ్వర స్వామి గుట్టమీద కి దైవ దర్శనానికి వెళ్లడం అనాదిగా వస్తున్నది. ముత్తారానికి కూడా ఎద్దుల బండ్లు కట్టుకొని వెళ్లాం. "కచ్చడం" బండిలో వధూవరులిద్దరం, మా నాచేపల్లి తాతయ్య ముదిగొండ వెంకట్రామ నరసయ్య గారు వెళ్లాం. బండిలో మా ఇంటినుంచి అక్కడకు చేరడానికి పట్టిన అరగంట సమయంలో, ముత్తారం ఆలయం గురించి, వనం కృష్ణరాయల గురించి మా తాతయ్య వివరించారు.

ఐదోరోజు ఉదయం పెళ్లి సారె పట్టుకొని మా బావమరిది డాక్టర్ వేణు మనోహర రావు, తోడల్లుడు జూపూడి హనుమంత్ ప్రసాద్ మా వూరికి ప్రసాద్ కారులో చేరుకున్నారు. ఆడ పెళ్లి వారు సాంప్రదాయంగా తెచ్చిన సారెను ఆ సాయంత్రం లాంఛనంగా రెండు-మూడు ఇళ్లల్లో ఇవ్వడంతో ఆ వేడుకా అయిపోయింది. ఆ తర్వాత సారె తెచ్చిన వాళ్లిద్దరు ఖమ్మం వెళ్లిపోయారు.

ఆ రోజే సత్యనారాయణ వ్రతం జరుపుకున్నాం. వ్రతానికి వూళ్లో పెద్దలను కొందరిని, బంధువులను పిలిచాం. ఆ రోజున అందరి భోజనాలయ్యే సరికి సాయంత్రం అయిదు గంటలయింది. సత్యనారాయణ వ్రతానికి వచ్చిన వారిలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు చాలామంది వున్నారు. అమ్మ పేట గ్రామానికి చెందిన అలనాటి స్థానిక ప్రముఖ రాజకీయ నాయకుడు కోయ వెంకట రావు, తీవ్రస్థాయిలో మాతో విరోధం వున్నప్పటికీ, ఆ రోజున వచ్చి కొంత సేపు మాతో సరదాగా గడిపాడు. ఒకప్పుడు మా నాన్నకు అత్యంత ఆప్త మితృడు-ప్రాణ స్నేహితుడూ అయిన వెంకట రావు, మా వల్లా పురం పెద్దనాన్న వనం శ్రీరాం రావు గారితో వచ్చిన విభేదాల కారణంగా-పక్క వూరి బాబాయి వనం నరసింగ రావు తో విభేదించిన కారణంగా, అప్పట్లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో, మాతోనూ విరోధం కావాలనే తెచ్చుకున్నాడు. ఎంతో రాజకీయ భవిష్యత్ కలిగిన వెంకట రావు, తాగుడుకు బానిసై-రాజకీయాలలో నిలకడ లేకుండా పోయి, హత్యా రాజకీయాలకు బలైపోయాడు రెండేళ్ల తర్వాత.

మర్నాడుదయం, మే నెల ఆరవ తేదీన, మళ్ళీ బండి మీద ప్రయాణమయ్యి ముదిగొండ చేరుకున్నాం. అక్కడ రావులపాటి సత్యనారాయణ రావు గారింట్లో కాసేపుండి, కాఫీ-టీలు తాగి, మా మామ గారు పంపించిన కారులో ఖమ్మం చేరుకున్నాం. ఇక ఆ తర్వాత మూడురోజులు మళ్ళీ వధువింట్లో సత్యనారాయణ వ్రతం లాంటి కార్యక్రమాలు జరిగాయి.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. అదే మా ఇద్దరిమధ్యనా జరుగుతున్నది.(Concluded)

Saturday, February 27, 2010

వివాహబంధం-IX: గౌరీ పూజ-వర పూజ-మధు పర్కం-గోత్రం, ప్రవర: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-IX
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

ముహూర్తం సమీపించే ముందు కార్యక్రమం
వనం జ్వాలానరసింహారావు

వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్లారు. మా మామగారింట్లోని మధ్య హాలులో ఎడమ వైపున గౌరీ పూజ కార్యక్రమాన్ని వారి పురోహితుడు జరిపించాడు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి బయలుదేరి వచ్చారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. అయితే, మా పెళ్ళిలో (ఇటీవలి కాలంలో అందరి పెళ్లిళ్లలోనూ జరిగినట్లే) స్నాతకం-కాశీ యాత్ర విరమణ వేడుకలను మా వూళ్లోనే పూర్తి చేసుకుని, ఖమ్మం మా ఇంటికి (విడిది) చేరుకున్నాం కాబట్టి, రాగానే ఎదురు కోలు, పెళ్లినాటి ఉదయం వరపూజ జరిగాయి. వరపూజలో భాగంగా, ఇక్కడ మా ఇంట్లో, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకున్నారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.

మా వైపు వారందరూ కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. అలా వెళ్లిన మా బంధు-మిత్రులకు మంగళ వాయిద్యాలతో ఎదురొచ్చి, వేద మంత్రాల మధ్య సత్కరించారు. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. నేను ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత మా నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న హాలులోకి తీసుకెళ్లారు.

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. ముందుగా, మా పురోహితుడు ఇలా ప్రారంభించాడు: "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-వశిష్ట, శక్తి, పరాశర త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, నరహరి రావు శర్మణో నప్త్రే, వెంకట రంగారావు శర్మణ పౌత్రాయ, శ్రీనివాసరావు శర్మణ పుత్రాయ, జ్వాలా నరసింహారావు శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న పరాశరుడితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, నరహరి రావు గారి ముని మనుమడూ, వెంకట రంగారావు గారి మనుమడూ, శ్రీనివాసరావు గారి పుత్రుడూ అయిన జ్వాలా నరసింహారావు అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇదంతా నాకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇలా మా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.

కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు. అదే జరిగింది మా పెళ్లిలోనూ-అదే గౌరీ పూజ దగ్గర. కన్యా దాత పురోహితుడు ఇలా అడిగాడు: "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-అంగీరస బార్హస్వత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత…. …. రంగారావు శర్మణో నప్త్రీ, వెంకట కిషన్ రావు శర్మణ పౌత్రీం, రాంరావు శర్మణ పుత్రీం, విజయలక్ష్మి నామ్నీ భవదీయాం కన్యాం, ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న భరద్వాజునితో సమానమైన గోత్రం కలది… … … రంగారావు శర్మ గారి ముని మనుమరాలూ, వెంకట కిషన్ రావు శర్మ గారి మనుమరాలూ, రాంరావు గారి కూతురూ అయిన విజయలక్ష్మి అనే వధువుకి, వరుడిని అడగడానికి వచ్చాం"). లాంఛనంగా ఇరువురు అంగీకరించారనుకోవాలి.(Part X Next Follows)

Friday, February 26, 2010

వివాహబంధం-VIII: పెళ్ళి రోజు-బంధు మిత్రుల రాక:వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్ళి రోజు-బంధు మిత్రుల రాక
"లక్ష్మి, పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపం వధువు
త్రిమూర్తుల దివ్య స్వరూపం వరుడు

వనం జ్వాలానరసింహారావు

అనుకున్న రోజు ఏప్రియల్ 30, 1969 రానే వచ్చింది. వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. ముహూర్తం ఉదయమే కావడంతో పనులన్నీ తెల్లవారు ఝామునుంచే ప్రారంభమయ్యాయి. ఇక్కడ మా ఇంట్లో (విడిది), అక్కడా ఆడ పెళ్లివారింట్లో హడావిడి ఆడంబరంగా మొదలయింది. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో మాదిరిగా మాకూ ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది. అయితే మా వివాహం మాత్రం, జరిగింది బస్తీలో అయినా, పద్దతంతా పల్లెటూరుదే. మా మామగారి ఇంట్లోనే, ఉన్న జాగాలోనే, ఇంటిముందు ఖాళీ ఆవరణలో, కల్యాణ మంటపాన్ని మరిపించే తాటాకు పందిరి కింద కొబ్బరి ఆకుల వేదిక సిద్ధం చేశారు. మామిళ్లగూడెం బజార్లో కాపురముంటున్న చాలామంది మా ఇరువురికీ బంధువులే. అందరూ దగ్గరి వారే. ఆడ పెళ్లి వారి అతి సమీప బంధువుల ఇళ్లు వీరింటికి ఇరువైపుల వున్నందున ఆ ఇళ్లన్నీ పెళ్లి వారి ఇళ్ల లానే కనిపించాయి. వధువు ఇంటినుంచి మా ఇంటి దాకా రోడ్డంతా మా వాళ్లతోనే నిండి పోయిందనాలి.

బంధువుల రాక ఉదయాన్నుంచే మొదలయింది. మా మామ గారు మంచి పేరున్న జిల్లా స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుడైనందున హేమా-హేమా కాంగ్రెస్ నాయకులందరూ ఉదయాన్నే రాసాగారు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని మా గ్రామాలన్నీ రాజకీయంగా మా వెంట వుండేవి. ప్రతి గ్రామంలోనూ, ఎవరో ఒకరు, మా బంధువులకు చెందిన వారో- లేక వాళ్ల అనుంగు అనుచరుడో సర్పంచ్‍‍గా ఎన్నికవాల్సిందే. ఆ నేపధ్యంలో, మా మామగారి గ్రామం వల్లభిలో ఆయనకు-ఆయన వ్యతిరేక వర్గం వారికీ ఘర్షణలొచ్చి, ఆయన అనుచరులైన హరిజనులను గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు కొందరు. అహింసా మార్గాన్ని అవలంబించే మా మామగారు అయితరాజు రాంరావు గారు, ఘర్షణలకు దిగకుండా, గాంధేయ మార్గంలో సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు. ఆచార్య వినోబా బావే శిష్యుడు ఆచార్య భన్సాలీని వల్లభి గ్రామానికి ఆహ్వానించి, గ్రామ పరిస్థితులను వివరించారు. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కదిలొచ్చిన అలనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, ఆచార్య భన్సాలికిచ్చిన హామీకి అనుగుణంగా హరిజనులందరూ గ్రామ ప్రవేశం చేశారు. సమస్య పరిష్కారమయ్యి, అందరూ కలిమిడిగా వుండడానికి ఇష్టపడ్డారు. ఇవన్నీ జరిగి అప్పటికింకా ఎక్కువ రోజులు కానందున, సత్సంబంధాలు కొనసాగించే దిశగా, వల్లభి గ్రామం మొత్తం కదిలొచ్చింది. ఇక మావైపు వారి విషయానికొస్తే, మేమూ చాలామందిమే అయ్యాం.

నేనప్పుడప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ వారితో తిరుగుతుండడం వల్లా, గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నందు వల్లా, మా వూరినుంచీ అనేకమంది రావడమే కాకుండా, జిల్లాకు చెందిన కమ్యూనిస్ట్ నాయకత్వమంతా పెళ్ళికొచ్చారు. ఇలా పెళ్ళి వారిల్లు కళ-కళలాడింది. పెళ్ళికి వచ్చినవారిలో మాకు గుర్తున్నంతవరకు హాజరయిన పెద్దల్లో, శ్రీయుతులు (అప్పటి ఎమ్మెల్యే) కత్తుల శాంతయ్య, (జిల్లా పరిషత్ అధ్యక్షుడు) భువన సుందర రెడ్డి, (ప్రముఖ కవి-ఎమ్మెల్సీ) హీరా లాల్ మోరియా, రావులపాటి జానకి రాంరావు, (ఒకసారి ఎమ్మెల్యే) బొమ్మకంటి సత్యనారాయణ రావు, (ఒకసారి ఎమ్మెల్యే) చేకూరి కాశయ్య, (ఒకప్పటి సమితి అధ్యక్షుడు) రావులపాటి సత్యనారాయణ రావు వున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన శ్రీయుతులు (ఎమ్మెల్యే) రజబ్ అలి, (మునిసిపల్ చైర్మన్) చిర్రావూరి లక్ష్మీనరసయ్య, (ఒకసారి ఎమ్మెల్యే) మంచి కంటి రామ కిషన్ రావు, (ఒకసారి ఎమ్మెల్యే) బాజి హనుమంతు, వనం నరసింగరావు, రావెళ్ల సత్యనారాయణ, గండ్లూరి కిషన్ రావు కూడా వచ్చారు. ఇంతలో పెళ్లి తంతు మొదలయింది. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలయ్యాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. ఆ నాడు-ఆ కాసేపు మేమిద్దరం ఆ పాత్రలను పోషించాం.(Part IX Next Follows)

వివాహబంధం-VII: పెళ్లికి తరలి పోవడం-ఎదురుకోలు: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్లికి తరలి పోవడం-ఎదురుకోలు
మగ పెళ్ళివారికి విడిది మర్యాదలు

వనం జ్వాలానరసింహారావు

ఏప్రియల్ 29, 1969 న, మా స్వగ్రామం వనం వారి కృష్ణా పురంలో స్నాతకం చేసుకున్న రోజునే "తరలి" పోయేందుకు ఖమ్మం బయల్దేరాం. మాకు, మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో వున్న పరిచయాల వల్ల, మా వెంట పెళ్ళి బృందంలో చాలామంది బయల్దేరారు. పల్లెటూళ్లల్లో ఎవరింటిలో పెళ్ళి జరిగినా అదోరకమైన ఉత్సాహం అందరి ఇళ్లల్లోనూ వుంటుందనాలి. అప్పటికే మా వూళ్లో- గ్రామ రాజకీయాల్లో నేను తలదూర్చినప్పటికీ, పార్టీలకతీతంగా చాలామంది నా పెళ్ళికి మా వెంట రావడానికి ప్రయాణం కట్టారు. సుమారు నలభైకి పైగా ఎడ్ల బండ్లలో తరలిపోవడానికి ప్రయాణమయ్యాం. ఒక్కొక్క బండిలో ఒకరే వుండొచ్చు-ఒకరికంటే ఎక్కువా వుండొచ్చు. మనం ఎన్ని బండ్లలో తరలిపోయామనేదే పల్లెటూళ్లలో ముఖ్యం. అదే జరిగింది మా పెళ్లిలోనూ. పైగా ఆ బండ్లను-బండికి కట్టిన ఎద్దులను, అలంకరించు కోవడంలోనూ పోటీ వుంటుంది. అదో సరదా. బండ్లతో పాటు ఒక మేనా, ఒక పల్లకి కూడా ఖమ్మం వరకు వచ్చింది.

మా వూరినుంచి సుమారు పది మైళ్ల దూరంలో వున్న ఖమ్మం చేరేసరికల్లా చీకటి పడింది. ఇంటిని సమీపిస్తుంటే, అంతకు సరిగ్గా పది రోజుల క్రితం (ఏప్రియల్ 19, 1969 న), నేను ఖమ్మంలోని మా ఇంటి ముందర మంచం మీద సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో కూచుని వున్నప్పుడు సంభవించిన భారీ భూకంపం గుర్తుకొచ్చింది. వాస్తవానికి మా పెళ్లైన పద్దెనిమిది రోజులకు మే నెల 18, 1969 న ఖమ్మం జిల్లాతో సహా ఆంధ్ర ప్రదేశ్ మొత్తాన్ని తుపాను-వరదలు భీభత్సం చేశాయి. ఇలా మా పెళ్ళికి పది రోజుల ముందు భూకంపం, పెళ్లైన పద్దెనిమిది రోజులకు వరదలు వచ్చిన సంగతి ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. సాధారణంగా ఆడ పెళ్లి వారు, మగ పెళ్లి వారికి "విడిది" వసతి కొరకు ఏర్పాటు చేస్తారు. అయితే మాకు ఖమ్మంలో స్వంత ఇల్లుండడం వల్ల మా ఇంటినే విడిదిగా ఉపయోగించుకున్నాం. ఖమ్మం చేరుకున్న తర్వాత, మగ పెళ్లి వారందరినీ, ఆడ పెళ్లివారింటికి భోజనాలకు తీసుకెళ్లారు-నన్నొక్కడిని తప్ప. కాబోయే అల్లుడు పెళ్లైన తర్వాతే వాళ్లింట్లో భోజనం చేయాలనేది ఒక ఆచారం. మర్నాడుదయమే పెళ్లి ముహూర్తమైనందున వచ్చిన వారందరూ విశ్రాంతి తీసుకొని ఉదయానికల్లా పెళ్ళి వారింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మా మామగారింట్లోనే పెళ్ళి పందిరి ఏర్పాటు చేశారు. ఉదయం ఏడెనిమిది గంటల మధ్య మామిళ్లగూడెంలో-మా ఇంటికి అతి సమీపంలో వున్న పెళ్ళి వారింటికి బయల్దేరాం. ఆ కాస్త దూరం పోవడానికి మర్యాద కోసం-వేడుక కోసం, కారు, జీపు సౌకర్యం కొందరికి ఏర్పాటు చేశారు.

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో (మా ఇంటిలో) ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తునారు మా కోసం ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో మమ్మల్ని ఆహ్వానించిన వారిలో కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు చాలా మంది వున్నారు. ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిచ్చారు. నాకేమో ఆ పనిని బావమరిది వెంకన్నతో చేయించారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఒక సారి మనోహర రావు కూడా చేసిన గుర్తు. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామన్నారు ఆడ పెళ్ళివాళ్లు. అలానే చేశారు.(Part VIII Next Follows)

Thursday, February 25, 2010

వివాహబంధం-VI: మంగళ స్నానాలు-మామిడి తోరణాలు స్నాతకం-సమా వర్తనం-కాశీ యాత్ర-అంకురార్పణ: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VI
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమానికి వరుడు
వధువును పెళ్లికూతురును చేయడం
వనం జ్వాలానరసింహారావు

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. "సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.

హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేశాడు పురోహితుడిక్కడ.

స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య నేను (వరుడు) గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరాను. వధువు సోదరుడు (వెంకట గనేష్ కుమార్-వెంకన్న) వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి నన్ను వెనుకకు తీసుకొని వచ్చాడు. ఆచారం ప్రకారం వెంకన్న వెంబడి ఖమ్మం నుంచి వాళ్ల (బుల్లి) బాబాయి రాధా కిషన్ రావు గారు వచ్చారు. శాస్త్రం ప్రకారం బావమరిదైన వెంకన్నకు వరుడిగా నూతన వస్త్రాలను పెట్టాను.

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది.

స్నాతకం మా ఇంట్లో చేసుకున్న నాడే, అంతకు ముందుగా పెళ్ళికొడుకును చేసే తంతు జరిగింది. అదే విధంగా, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరిగింది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వచ్చారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు. (Part VII Next Follows)

Wednesday, February 24, 2010

వివాహబంధం-IV: పెళ్లి చూపులు-ఇరు కుటుంబాల నేపధ్యం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం- IV
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం-వాగ్దానాలు
వనం జ్వాలానరసింహారావు

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం మేమందరం, మా బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూడాలి. అదే చేశాం మేమందరం. వల్లభి, వారి స్వగ్రామ మైనా, వారికి ఖమ్మంలో కూడా ఇల్లున్నందువల్ల, మాకూ అక్కడ ఇల్లున్నందువల్ల పెళ్లి చూపుల ఏర్పాటు ఖమ్మంలో చేశారు. మా రెండు కుటుంబాల వాళ్ళ ఇళ్లు "మామిళ్లగూడెం" వీధిలో వున్నాయి. ఆ వీధిలో అప్పట్లో నూటికి తొంబై మంది బ్రాహ్మణ కుటుంబాలవారే వుంటుండేవారు. ఇప్పటికీ, మూడొంతుల మంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారే. అక్కడి మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ కూడా సాధారణంగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే అయ్యుంటారు. ప్రస్తుతం మా ఆవిడ అక్క కొడుకు జూపూడి షమంత్ అక్కడినుంచి కౌన్సిలర్గాం ఎన్నికయ్యాడు. పెళ్ళి చూపులకు మా వైపునుంచి, వారి వైపునుంచి వచ్చిన వారిలో చాలామంది ఇరువురికీ కావాల్సినవారే-ఇరుకుటుంభాలకూ పరిచయస్తులే. పింగళి తిరుమలరావు గారు, వనం శ్రీరాంరావు గారు, కవుటూరి కృష్ణమూర్తి గారు, జూపూడి నరసింహారావు గారు, జూపూడి ప్రసాద్, వనం నరసింగరావు-వారి కుటుంబానికి చెందిన వారు పెళ్ళి చూపులకు వచ్చినవారిలో ప్రముఖులు. మా అమ్మ, నాన్న, మా అన్నదమ్ములందరూ, అక్కచెళ్లెల్లందరు, బావగారు చలపతిరావు గారు వచ్చారు.

నా వయస్సు అప్పటికి 20 సంవత్సరాలు. కాబోయే శ్రీమతి వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే. అయినా, వధూ-వరులు పరస్పరం నచ్చారన్న నిర్ణయానికి ఇరు పక్షాల బంధువులు వచ్చారు. అది నిజంకూడా. అయితే ఎలా నిజం? అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అందుకే, సమాధానం రాబట్టుకొనేందుకు, సీతా కల్యాణ ఘట్టం చదవాలి. ఇక ఆ తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. వరకట్న నిషేధం అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవాలి. పెళ్ళి చూపుల కార్యక్రమం అయింతర్వాత, మిగిలిన విషయాలను మాట్లాడుకోవడానికి మర్నాడు మా ఇంటికి రమ్మని మా నాన్నగారు వాళ్లను ఆహ్వానించారు. వారూ సమ్మతించారు. అంచెలంచల ఘట్టంలో మరో అడుగు పడింది.

మా ఆహ్వానం మేరకు మర్నాడు ఆడ పెళ్లి వారి పెద్దలందరూ మా ఇంటికి భోజనానికి వచ్చారు. మాటా-మంతీ జరిగింది. ఒకే ఒక్క రోజులో పెళ్ళి సంబంధం కుదిరినందుకు మా మామగారి తరఫు బంధువులంతా సంతోషించారు. మార్చ్ నెల 30న లగ్నాలు పెట్టుకుందామని అనుకున్నారు. లండన్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న రాంరావు గారి పెద్ద కొడుకు డాక్టర్ రంగారావు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వుత్తరాలు రాసేవాడని మా ఆవిడ తర్వాత చెప్పింది. అటువైపు-ఇటు వైపునుంచి మా ఇంటికి వచ్చిన పెద్దలు మా ఇరు వంశాల వారి గురించీ-వారి గొప్పదనాన్ని గురించీ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇది సహజంగా ప్రతి పెళ్ళిముందరా జరిగేదే. సీతా కల్యాణ ఘట్టంలో వశిష్టుడు మాదిరిగా ఇరుపక్షాలకు చెందిన పురోహితులో, ఎవరైనా పెళ్లి పెద్దలో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో వంశ క్రమం ప్రస్తావన తెస్తారు. ఎవరెంత గొప్పవారైందీ-ఎంత మందీమార్బలం వున్నవారైందీ చెప్పుకుంటారు. అదే జరిగింది మా ఇంట్లో కూడా.

మా విషయానికొస్తే, మాది పరాశర గోత్రమైనందున మా వంశానికి ఆది పురుషుడు వశిష్ట మహర్షి, ఆయన కొడుకు శక్తి, ఆయన కొడుకు పరాశరుడి వంశీయులం మేము. వనం కృష్ణ రాయలు గారనే మా పూర్వీకుడు నిర్మించిన గ్రామమే మా వూరైన వనం వారి కృష్ణా పురం. మా తాత గారి పేరు వెంకట రంగారావు, బామ్మ గారి పేరు కనకమ్మ. వెంకట రంగారావు గారి తండ్రి పేరు నరహరి రావు. వెంకట రంగారావు గారి అన్న చలపతిరావు గారు, తమ్ముడు వెంకటప్పారావు గారు. అన్నదమ్ముల్లో ఒక్క వెంకటరంగారావు గారికి తప్ప ఎవరికీ సంతానం కలగలేదు. ఆయన ఏకైక కుమారుడే మా నాన్న వనం శ్రీనివాసరావు గారు. ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల కొడుకు. చలపతిరావు (మా నాన్నకు "బాప్ప") గారి భార్య పెద వెంకట రామ నర్సమ్మ గారు, వెంకటప్పారావు (మా నాన్నకు "కక్కయ్య") గారి భార్య చిన వెంకట రామ నర్సమ్మ గారు మా పెళ్లినాటికి ఆరోగ్యంగానే వుండేవారు. పిల్లల్లేని వాళ్లిద్దరిలో చలపతిరావు గారికి మా నాన్నగారే కొడుకు వలె అన్ని కార్యాలూ చేశాడు. వెంకటప్పారావు గారి భార్య చిన వెంకట రామ నర్సమ్మ గారు కోరినందున మా తమ్ముడుని ( నా తర్వాత పుట్టిన వాడు) ఆమెకు దత్తత ఇచ్చాం. మా నాన్న మేనమామల వూరు మా వూరికి ఆమడ దూరంలోని చెరువుమాధారం.

మా అమ్మ సుశీల పుట్టింది బలపాలలోనైనా, పెరిగింది దత్తతొచ్చిన నాచేపల్లి గ్రామంలో. మా వరకు మాకు అమ్మమ్మ గారంటే నాచేపల్లిలోని సుభద్రమ్మ గారు, తాతయ్యంటే ముదిగొండ వెంకట్రామనర్సయ్య గారే. వారికి సంతానం కలుగనందున మా అమ్మను చిన్నతనంలోనే తెచ్చుకొని పెంచుకున్నారు. మా అసలు అమ్మమ్మకు పురుడు సమయంలో కొంచెం మతిస్థిమితం తప్పేదని అంటారు. అందుకే పసిగుడ్డుగా వున్నప్పుడే అమ్మను నాచేపల్లికి తెచ్చుకున్నారు. బలపాల అమ్మమ్మ-తాతయ్యల(లక్ష్మీ నర్సమ్మ-వెంకటేశ్వర రావు గార్లు) కు నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు కలిగారు. ఆమ్మ లలితమ్మ గారు అందరి లోకి పెద్ద. ఆమెను గోకినేపల్లి గ్రామానికి చెందిన రావులపాటి సీతారాంరావు గారికిచ్చారు. తర్వాత రమణారావు గారు (భార్య మా గ్రామంలో పుట్టిన మధురమ్మ గారు). మూడో ఆమె రుక్మిణమ్మ గారు. నాలుగో ఆమే మా అమ్మ. నాచేపల్లికి దత్తతగా వచ్చింది. ఐదో సంతానం వెంకట కిషన్ రావు-భార్య మా గ్రామంలో పుట్టిన లక్ష్మిబాయి గారు-మధురమ్మ గారి చెల్లెలు. (వారి రెండో కూతురునే మా దత్తత పోయిన తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు). కిషన్ రావు గారి తర్వాత రాజేశ్వర రావు గారు-భార్య లక్ష్మీ నర్సమ్మ. వీరి పెద్దమ్మాయిని మా రెండో తమ్ముడు వివాహం చేసుకున్నాడు. ఆయనా దత్తత పోయి జగన్నాథరావుగా పేరు మార్చబడి నేలకొండపల్లిలో వుండేవారు. తర్వాత మా చిన్న మామయ్య సత్యనారాయణ రావు గారు. ఆఖరున భారతమ్మ గారు పుట్టారు. ఆమెను భైర్నపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు గారు వివాహమాడారు. మామయ్య సత్యనారాయణరావు గారు హైదరాబాద్‍లో వుంటున్నాడు. నేను ఆయన ఇంట్లోనే వుండి డిగ్రీ చదువుకున్నాను. అత్తయ్య విమలమ్మ పెట్టిన భోజనం ఎప్పటికీ మరువలేను. సత్యనారాయణరావు మామయ్య డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ రావడమే కాకుండా, మా కుటుంబానికి చెందినవారిలో మొదటి గ్రాడ్యుయేట్. మా అమ్మ అసలు (జన్మస్థానంలో) పుట్టింటి వారి పేరు "కంకిపాటి" కాగా, దత్తత పోయినవారి పుట్టింటి పేరు "ముదిగొండ".

కంకిపాటి వారి గోత్రం "కణ్వస"-ఋషులు అంగీరస, అజామీళ, కణ్వస. మా బలపాల అమ్మమ్మ గారి పుట్టిల్లు, మా నాచేపల్లి అమ్మమ్మగారి పుట్టిల్లు మా పక్కనున్న కమలాపురం గ్రామానికి చెందిన "వనం" వారి కుటుంబం. నాచేపల్లి అమ్మమ్మకు స్వయానా మేనకోడలు బలపాల అమ్మమ్మ. ఆమె స్వయానా తమ్ముడి కొడుకే, నాకు అత్యంత ఆప్తుడు, కమ్యూనిస్ట్ పాఠాలు నేర్పిన బాబాయి వనం నరసింగరావు. ఆయన అక్క గారే, మా నేలకొండపల్లి మామయ్య రాజేశ్వర రావు గారి భార్య.

నాకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు (చెల్లెళ్లకు, ముగ్గురు తమ్ముళ్లకు అప్పటికింకా పెళ్లిళ్లు కాలేదు). అక్కకు పెళ్లైంది. పేరు రాధ (భర్త చలపతి రావు గారు అలియాస్ సహదేవ రావు గారు). దత్తత పోయిన తమ్ముడుకి కూడా పెళ్లైంది. ఒక చెల్లెలు ఇందిర (భర్త కందిబండ నరసింహారావు గారు), ఇంకో చెల్లెలు కృష్ణవేణి (భర్త శ్రీనివాస రావు గారు). తమ్ముళ్ల పేర్లు: వెంకట ప్రసాదరావు (భార్య ఇందిర), నరహరి రావు (భార్య ఇందిర), శ్రీనాథ్ (భార్య జ్యోతి), శ్రీరామచంద్ర మూర్తి (భార్య రుద్రాణి). అక్క-బావ వ్యవసాయం వృత్తిగానూ, చెల్లెలు ఇందిర భర్త కేంద్ర ప్రభుత్వోద్యోగి గానూ, మరో చెల్లెలు కృష్ణవేణి లాయర్ గానూ-భర్త రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, పెద్ద తమ్ముడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, రెండో తమ్ముడు వ్యవసాయం-వ్యాపారం వృత్తిలోనూ, మూడో తమ్ముడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగి గానూ, నాలుగో తమ్ముడు వ్యవసాయం వృత్తిగానూ వున్నారు-వుండేవారు.

ఇక మా కాబోయే శ్రీమతి పుట్టింటి వారి విషయానికొస్తే, వారిది భారద్వాజ గోత్రం. ఋషులు, అంగీరస, బార్హస్వత్య, భరద్వాజలు. తండ్రి అయితరాజు రాంరావు గారు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని భారత ప్రభుత్వం వారిచ్చిన "తామ్ర పత్ర గ్రహీత". స్వగ్రామం వల్లభి. దేశంలోనే ప్రప్రధమంగా, ఒక దళితుడు పూజారిగా వున్న రామాలయం వల్లభిలో కట్టించింది ఆయనే. ఆయన తండ్రి మంగపతి రావు గారు, తల్లి సీతారామమ్మ గారు. అయితే పాలివారైన వెంకట కిష్టయ్య గారికి దత్తత పోయారు రాంరావు గారు. దత్తత ఇంట్లో రాంరావు గారి తాత పేరు రంగారావు గారు. రాంరావు గారి అక్క రాజ్యలక్ష్మి గారు, చెల్లెలు రుక్మిణమ్మ గారు. సోదరులలో పెద్దవాడు నరసింహారావు గారు కాగా, చిన్నవాళ్లు వెంకట కిషన్ రావు, రాధా కిషన్ రావు, సీతారాంరావు, సత్యనారాయణ గార్లు. మా కాబోయే అత్తగారి పేరు రాధ-కృష్ణా జిల్లా ఖమ్మం పాడు లో జన్మించారు. రాధ గారి తల్లి వెంకట్రామమ్మ గారు, ఇటీవలే మరణించారు.

మా అత్తగారికి ఆరుగురు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు. చెల్లెళ్ల పేర్లు: శారద (భర్త కొలిపాక రామచంద్ర రావు గారు), సరస్వతి (భర్త తుర్లపాటి హనుమంత రావు గారు), సావిత్రి (భర్త కవుటూరు కృష్ణమూర్తి గారు), అన్నపూర్ణ (భర్త కొమరగిరి అప్పారావు గారు), ప్రేమ (భర్త పింగళి మధుసూధన రావు గారు), భారతి (భర్త తుర్లపాటి రంగారావు గారు) గార్లు. తమ్ముళ్ల పేర్లు: పర్వతాల రావు గారు (భార్య సరోజిని గారు), రామచంద్ర రావు గారు (భార్య విమల గారు), వెంకటేశ్వర రావు గారు (భార్య అరుణ గారు), శ్రీనివాస రావు గారు (భార్య నిర్మలాదేవి గారు). మా కాబోయే అత్త గారి పుట్టింటి పేరు "భండారు"-గోత్రం "పరాశర". అక్కచెల్లెళ్లు, అన్న తమ్ములు అందరూ, వారి వారి వృత్తుల్లో-ప్రవృత్తుల్లో సమాజం గుర్తింపు పొందారు. మా కాబోయే ఆవిడకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లెలు. అప్పటికి (మా పెళ్లినాటికి) అక్కలిద్దరికి, పెద్దన్నయ్యకు మాత్రమే వివాహమైంది. అక్కల పేర్లు: హైమ (భర్త కొండపల్లి లక్ష్మీ నరసింహారావు గారు), జ్యోతి (భర్త జూపూడి హనుమంత ప్రసాద్). చెల్లెళ్లు పేరు వాణి (భర్త విజయ శంకర్). పెద్దన్నయ్య పేరు డాక్టర్. పాండు రంగారావు గారు (భార్య కరుణ), రెండో అన్నయ్య పేరు డాక్టర్ వేణు మనోహర రావు (భార్య ఉష). తమ్ముడి పేరు వెంకట గనేష్ కుమార్ (భార్య నిర్మల). అన్నయ్యలిద్దరూ పేరొందిన డాక్టర్లు కాగా తమ్ముడు లాయర్. అక్క చెల్లెళ్లందరి కీ మంచి సంబంధాలు కుదిర్చి పెళ్లిళ్లు జరిపించారు. (Part V Next Follows)

వివాహబంధం-III: పెళ్లి పెద్దలు-సంధాన కర్తలు: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం- III
శ్రీ పప్పు లక్ష్మీనరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

వివాహ ప్రక్రియ-నాంది
వనం జ్వాలానరసింహారావు

మా పెళ్లికి ముందు కూడా ఇవన్నీ జరిగాయి. 1968వ సంవత్సరంలో, అప్పుడే డిగ్రీ పాసయ్యి, అప్పట్లో మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, నేను మా వూళ్లోనే వుంటూ వ్యవసాయం చేయిస్తున్నాను. వ్యవసాయంతో పాటు రాజకీయాల్లో కూడ చురుగ్గా పాల్గొంటున్నాను. మా వూళ్లో ఒక కులానికి చెందిన కొందరు పెత్తందార్లు, గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినా, బలమెక్కువగా వున్న కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వారిని గ్రామ సర్పంచ్ కాకుండా పెత్తనం చెలాయిస్తున్న రోజులవి. మా నాన్న వనం శ్రీనివాసరావు గారు కూడా గ్రామ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, అందరితో మంచిగా వుండాలనే ఆలోచనతో, వారికే మద్దతు పలికేవాడు.

అయితే పక్క గ్రామంలో వుంటున్న మా పెదనాన్న వనం శ్రీరాంరావు గారు అలా కాకుండా, ఆయన వూళ్లో తనకంటూ ఒక రాజకీయ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఆయన గ్రామం వల్లాపురం, మా నాన్న కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామం ఒకే పంచాయితీగా వుండేది. ఆ పంచాయితీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన అభ్యర్థి గెలవాల్సిందే. ఆయనకు నేనంటే ఆయన పిల్లలకంటే ఎక్కువ ప్రేమ. ఆయన రాజకీయ వారసుడిని నేనని అందరితో అనేవాడు. ఆయనకు నన్నెలాగైనా మా వూరికి పరిమితంచేసి, నన్ను రాజకీయాల్లో పూర్తిగా దించాలన్న కోరిక వుండేది. నాకూ రాజకీయాలంటే మక్కువే కాబట్టి ఆయన మాటలపై గురి కలిగింది. అయితే పక్క వూరు కమలాపురంలో వున్న బాబాయి స్ఫూర్తితో కమ్యూనిస్ట్ పార్టీమీద ఎక్కువ అభిమానంతో వుండేవాడిని. ఈ నేపధ్యంలో, పెదనాన్నగారి కుమారుడు, నా పాఠశాల క్లాస్ మేట్ గోవిందం (వరదా రావు), పెనుగంచిపోలు గ్రామ వాస్తవ్యులైన అప్పారావు-అన్నపూర్ణల కూతురు సావిత్రిని వివాహం చేసుకున్నాడు. అది పూర్తిగా పెద్దలు కుదిరించిన పెళ్లి. పెనుగంచిపోలులో జరిగిన ఆ పెళ్ళికి నేను హాజరయ్యాను.

ఆ పెళ్లికి అయితరాజు వారమ్మాయి విజయలక్ష్మి రాలేదు. కాని, ఆ తర్వాత ఖమ్మం శ్రీరాంరావు గారింట్లో జరిగిన "మూడు నిద్రల" తంతులో భాగమైన "మేజువాణి" కి నేను కూడా వెళ్ళినప్పుడు, ఆ అమ్మాయి పాట పాడుతుంటే విన్నాను. అమ్మాయినీ చూశాను. "ఆవకాయ...మాగాయ..గోంగూర పచ్చడి..." అనే ఆ పాట అప్పటికీ-ఇప్పటికీ ఆమె పాడుతూనే వుంటుంది. బహుశా మా ఆవిడకు వచ్చిన-పాడగలిగిన పాట అదొక్కటేనేమో ! పాట పాడిన అమ్మాయి ఎవరని నేను మా పెదనాన్నగారిని అడగడం, ఎవరో ఆయన వివరించడం, పెళ్లి చేసుకుంటావా అని పరాచకంగా మాట్లాడడం జరిగాయప్పుడు. నేను మరిచిపోయినా, మా పెదనాన్న మరిచిపోకుండా, ఆ అమ్మాయంటే నేను ఇష్టపడుతున్నానని అయితరాజు రాంరావు గారికి చెప్పి సంబంధం కుదిరించడానికి నిశ్చయించుకున్నాడప్పుడు.

అప్పట్లో నాకింకా ఇరవై ఏళ్ల వయస్సే. అప్పట్లో నాకున్న ఒకే ఒక్క పట్టుదల మా వూళ్లో "పెత్తందార్ల" అభ్యర్థి కాకుండా, మేమనుకుంటున్న(కొంతమంది యువకుల బృందం) వ్యక్తి, పెత్తందార్లను ఎదిరించగలిగిన వ్యక్తి సర్పంచ్ కావాలని. ఆ దిశగా, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరులందరూ, అప్పటివరకూ బయటపడడానికి భయపాడిన వారితో సహా, నా మాట మీద నమ్మకంతో మా పక్షాన చేరారు. సరిగ్గా అదే రోజుల్లో, జనవరి నెల 1969 వ సంవత్సరంలో, ఒక నాడు, పెదనాన్న శ్రీరాంరావు గారు, మా సమీపంలోని వల్లభి గ్రామానికి చెందిన అయితరాజు రాంరావు గారిని, ఆయనతో పాటు ఆ గ్రామానికే చెందిన కొడాలి వెంకయ్యను తీసుకొని కృష్ణా పురంలోని మా ఇంటికొచ్చారు. నేనప్పుడు ఇంటిపక్కనే వున్న పొలంలో జొన్న కళ్ళం వేయిస్తున్నాను. అప్పట్లో మాకు ఏటా 150-200 బస్తాల పచ్చ జొన్నలు, 300-400 బస్తాల వడ్లు పండేవి. కందులు, పెసలు, వేరుశనగ కూడా పెద్ద మోతాదులో పండేవి. పది అరకల వ్యవసాయం-పది మందికి పైగా పనివాళ్లు (జీత గాళ్లు అనేవారప్పుడు)-పది జతల ఎడ్లు-నాలుగు పెద్ద బండ్లు-కచ్చడం-మేనా-పల్లకి వుండేవి మాకు.

ఇంతకూ ఆ ముగ్గురొచ్చినకారణం-అయితరాజు రాంరావు గారి మూడో కూతురు విజయలక్ష్మికి, నాకు పెళ్లి జరిపించే ప్రతిపాదన చేయడానికి. పెళ్లి సంబంధాల ప్రతిపాదనలు చాలా గమ్మత్తుగా వుంటాయి. ఇంతకు ముందే చెప్పినట్లు, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. మా విషయంలో ఇరు పక్షాలకు కావాల్సిన వ్యక్తి శ్రీరాంరావు గారు. అయితరాజు రాంరావు గారి తోడల్లుడు కూతురునే తనకొడుక్కు చేసుకున్నందువల్ల వాళ్ళకు, మా నాన్నకు అన్నగారైనందున మాకు-ఇలా ఇద్దరికీ కావాల్సిన పెద్ద ఆయన. అలానే అయితరాజు రాంరావు గారి గ్రామానికి చెందిన కొడాలి వెంకయ్య (కులం వేరైనా, బంధువు కాకపోయినా, మా నాన్నకు తెలిసినాయన) కూడా. వాస్తవానికి రాంరావు గారు మా ఇంటికి రావడానికి మరొకరి తోడు అవసరంలేదు. ఆయన, మా నాన్న చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు "ఒరేయ్" అని పిల్చుకునే చనువుంది. అయినా, వివాహ సంబంధం కుదిరించడానికి, ఇలాంటి ప్రక్రియ అందరూ చేయడం ఆచారంగా వస్తున్నది. దీనికి కారణం, ఇది కేవలం రెండు కుటుంబాలను మాత్రమే కలపడం కాకుండా, ఇరువైపుల సంబంధీకులను కూడా కలపేటందుకే.

మా అమ్మా-నాన్న వెంటనే వారి ప్రతిపాదనకు అంగీకరించి, పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు. ఆ సమయంలో రాంరావు గారి కూతురు విజయలక్ష్మి, విజయవాడలో తల్లి గారి తరపున బాబాయైన తుర్లపాటి హనుమంతరావు (రాంరావు గారి తోడల్లుడు) గారి ఇంట్లో వుంటూ, హోమియో వైద్య చికిత్స చేయించుకుంటున్నందున, ఆమెను ఖమ్మం పిలిపించిన తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటుచేశారు. పెళ్లి చూపులకు మేమొస్తున్నామని చెప్పడానికి రాంరావు గారు విజయవాడకు వెళ్లారు. ఆ సమయంలో హనుమంతరావు గారింట్లో వారి బావమరిదులు భండారు శ్రీనివాసరావు, భండారు పర్వతాల రావు గారు కూడా వున్నారు. శ్రీనివాసరావు, నేను ఖమ్మం రికాబజార్ హైస్కూల్లో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. రాంరావు గారి రెండో కూతురు భర్త జూపూడి ప్రసాద్ కూడా మాతో కలిసి చదువుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు మా ఇద్దరి పరిచయం గురించి, నాకు క్రికెట్ ఆటంటే అభిమానం అన్న సంగతీ చెప్పాడని మా ఆవిడ తర్వాత నాకు చెప్పింది. శ్రీనివాసరావుకు కాబోయే సతీమణి నిర్మలా దేవి (దుర్గ) విషయం తెలుసుకుని, కాబోయే పెళ్లి కూతురుకు బోలెడు బహుమానాలు కొని ఇచ్చిందట. ఆమెగారికి, అప్పటికీ-ఇప్పటికీ ఇలా అందరికీ బహుమానాలు ఇవ్వడం అలవాటే. అదొక అరుదైన సద్గుణం ఆమెలో. పెళ్లి చూపులతో మా వివాహ ప్రక్రియ మొదలవడానికి నాంది జరిగిందలా.(Part IV Next Follows)