Friday, December 30, 2011
విపక్షాల వైఖరి మారాలి: వనం జ్వాలా నరసింహారావు
Thursday, September 8, 2011
అంతం కాదిది ఆరంభమే(నా) !: వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (09-09-2011)
ఆలోచింపచేస్తున్న సీబీఐ అరెస్టులు, కొందరికి వందల వేల రెట్ల ఆదాయం ఎలా సాధ్యం?, శిక్షల దాకా వ్యవహారం కొనసాగుతుందా?, ప్రజల్లో కొనసాగుతూనే ఉన్న అపోహలు, విచారణలకు రాజకీయ కారణాలేనా!, నివారణ కంటె నిరోధం ముఖ్యం....ఎడిటర్
స్వతంత్ర భారత దేశంలో, విభజించి-పాలించు అనే ఆంగ్లేయుల పరిపాలనా వారసత్వాన్ని, పోకడలో అవినీతి మయమైన కొన్ని ప్రపంచ దేశాల విధానాన్ని, అక్షరాలా పాటిస్తూ వస్తున్న ఈ దేశ రాజకీయ నాయకుల ఆటలకు మధ్య-మధ్య అంతరాయం కలిగించి, ఆట కట్టించడానికి కారణమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను - ఆ వ్యవస్థల పుణ్యమా అని నెల కొన్న సంస్థలను - అందులో (అందరూ కాకపోయినా) నిబద్ధతతో పని చేస్తున్న అధికారులను మనసార అభినందించాలి. వాస్తవానికి ఆ వ్యవస్థలు-సంస్థలు-వ్యక్తులు నిరంతరాయంగా కనుక తమ బాధ్యతలను పరిపూర్ణమైన నిష్ఠతో నిర్వర్తిస్తున్నట్లయితే (అధికారంలో వున్న రాజకీయనాయకులు అడ్డుపడకుండా వుంటే!) అవినీతిపరుల అరెస్టులతో మాత్రమే ఆగకుండా-వారి గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టే పరిస్థితులను కలిగించ గలిగే వారు. ఒక వైపు పౌర సమాజం నాయకుడు అన్నా హజారే-ఆయన బృందం గత కొన్ని నెలలుగా అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తరతమ భేదం లేకుండా, కాంగ్రెస్-కాంగ్రేసేతర-బీజేపి-బీజేపేతర అవినీతి సామ్రాట్టులను అంచలంచలుగా అదుపులోకి తీసుకుని విచారించడం, సామాజిక-రాజకీయ-ఆర్థిక విశ్లేషకులను ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా, స్వతంత్రం వచ్చి అరవై నాలుగు సంవత్సరాలు నిండిన సందర్భంలో తలఎత్తుతున్న ఈ పరిణామాలను సగటు భారతీయ పౌరుడు స్వాగతిస్తుంటే, ఈ దేశ పరిణామాలను ఆసక్తితో యావత్ ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. భారత దేశ ప్రజాస్వామ్యం ఇంత గట్టిగా పని చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు వారంతా.
ఆ సంస్థకు ఎవరిష్టమొచ్చిన పేర్లు వారు పెట్టారు. కొందరేమో "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అన్నారు. అలా అన్నవారు సహితం జగన్మోహన్ రెడ్డిపై అ సంస్థ విచారణను మనసార స్వాగతించారు. మరికొందరేమో అదే సంస్థను "కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్" అని సాక్షాత్తు చట్టసభలోనే నామకరణం చేశారు. అలా చేసి వారం రోజులు తిరక్కుండానే, ఎవరిని "బచావ్" చేయడానికి జరిగిందో కాని, ఆమె అనుంగు అనుచరుడు గాలి జనార్థన్ రెడ్డి కటకటాల పాలయ్యాడు. మధ్యలో పేర్లు పెట్టడానికి తామూ తీసి పోమన్న తరహాలో కొందరు మహా నాయకులు, తమ పార్టీని దూషించిన ప్రత్యర్థి పార్టీకి "భారతీయ జగన్ పార్టీ" అని, "బచావో జగన్ పాలసీ" అని మారు పేర్లు తగిలించారు. ఇవేవీ తమకు పట్టదన్న ధోరణిలో, గుట్టుచప్పుడు కాకుండా, తమపని తాము చేసుకుపోతున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు - ప్రస్తుతం వారికి ఆంధ్ర-కర్నాటకలలో నాయకత్వం వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆ అధికారి మన తెలుగువాడు కావడం, ఆరోపణలొచ్చిన వ్యక్తి ఎంత మహా-మహానుభావుడైనా, ఏ స్థాయిలో అండ-దండలున్నా, కాంగ్రెస్ వారైనా-ప్రతిపక్ష నాయకులైనా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుకుని పోవడం, ఆబాల గోపాలం అభినందించాల్సిన-ఆనందించాల్సిన విషయం.
అవినీతి సామ్రాట్టులను అదుపులో తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని (వున్నదున్నట్లు చెప్పాలంటే... న్యాయ స్థానాలను-సిబిఐని) అభినందించాల్నా? లేక ఇంతకాలం వారి అవినీతితో ప్రజాధనం కొల్లగొడుతుంటే, ప్రేక్షక పాత్ర వహించినందుకు-సీబీఐ తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా పరోక్షంగానన్నా అడ్డుకున్నందుకు అదే ప్రభుత్వాన్ని అభిశసించాల్నా? ఆలశ్యంగానైనా, మరింత దుర్మార్గం జరగనివ్వకుండా ఆపుదల చేసినందుకు, ప్రస్తుతానికి మెచ్చుకోవడమే మంచిదే మో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో-సరిహద్దు కర్నాటక రాష్ట్రంలో, ఇంచుమించు ఏక కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు లింకు వుండే అవకాశాలు చాలానే వున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమైతే-కనీసం వాస్తవానికి చేరువలో వుంటే (వుండే అవకాశాలే ఎక్కువ అనక తప్పదు), దశాబ్దం కింద వారి సొంతం అనుకున్న ఆస్తిపాస్తులకు, నేటి వారి ఆస్తులకు, నక్కకు-నాగ లోకానికి వున్న తేడా వుంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కాని-ఒక వ్యాపార సంస్థ కాని ఆస్తులు సమకూర్చుకోరాదన్న నిబంధన కాని, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెంపొందించుకోరాదన్న చట్టం కాని లేదన్నది ఒపుక్కోవాల్సిందే. వచ్చిన చిక్కల్లా, ఆ ఆదాయ వనరులు ఎలా సమకూరాయన్న విషయంలో అవలంబించిన మార్గాలే. రూపాయి ఆదాయం-పది రూపాయల ఆస్తులు-పాతిక రూపాయల ఖర్చులున్న వారికి, ఏడాది-రెండేళ్లు-మూడేళ్లు తిరక్కుండానే, వందల-వేల రెట్ల ఆదాయం పెరగడం-దానికి రెట్టింపు ఆస్తులు సమకూరడం, ఖర్చులే మో తగ్గడం ఎలా సంభవమనే దే అంతుచిక్కని ప్రశ్న. అదే జరిగింది-జరుగుతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోను, వారికి అత్యంత సన్నిహితుడు-అవునన్నా, కాదన్నా వ్యాపార భాగస్వామి గాలి జనార్థన్ రెడ్డి వ్యవహారంలో.

బహిర్గతమైన ఆదాయ-వ్యయ వనరుల లెక్కల ప్రకారం, వీరిరురివురి ఆర్థిక పరిస్థితి దశాబ్దం క్రితం ఎంతనేది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు, ఐన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆదాయమెంత? ఆదాయపు పన్నెంత కట్టారు? పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఎన్ని ఆస్తులు అఫిడవిట్ లో చూపించారు? అన్న సంగతి బహిరంగ రహస్యమే కదా? అలానే సుష్మా స్వరాజ్ కర్నాటక నుంచి లోక్ సభకు పోటీ చేసిన రోజుల్లో-అంతకు కొన్నాళ్ల, కొన్నేళ్ళ క్రితం గాలి జనార్థన రెడ్డి ఆస్తులెన్నో మీడియాలో వస్తున్నాయి కదా. వారిరువురూ న్యాయసమ్మతంగా-ధర్మ సమ్మతంగా వ్యాపారాలు చేసి తమ ఆస్తులను పెంచుకున్నారా? లేక రాజకీయాధికారాన్ని (తమది-తమ ఆప్తులది) ఆసరాగా చేసుకుని ఆస్తులను కూడగట్టుకునారా? మైక్రో సాఫ్ట్ బిల్ గేట్స్, గూగుల్-ఒరాకిల్-ఫేస్ బుక్ సంస్థల అధినేతలు కూడా అతి తక్కువ సమయంలోనే ఆస్తులు సమకూర్చుకున్నప్పటికీ వారిపై అవినీతి ఆరోపణలెందుకు రావడం లేదు? బహుశా వారేమో ఫక్తు వ్యాపార సరళిలో మిలియనీర్లు-బిలియనీర్లు అయ్యుండాలి...వీరేమో... అందినంత దండుకో! అన్న చందాన కోటీశ్వరులై వుండాలి. ఐనా, ఇప్పుడిప్పుడే అలా మాట్లాడక పోవడం మంచిదే మో! ఎలాగూ, విచారణ జరుగుతోంది కదా! ఎటొచ్చీ..చిక్కల్లా, విచారణ చేసినంత కాలం చేసి, ఆ తర్వాత, సరైన సాక్ష్యాధారాలు లేవని వదులు తే ఏం కావాలన్నదే సామాన్యుడి మదిలో మెదిలే అంతులేని వింత ప్రశ్న. అరెస్టులు ఆరంభం కావాలే కాని అంతం కారాదు.
న్యాయస్థానాల ఆదేశాల మేరకే, సిబిఐ దర్యాప్తు ప్రారంభమై, త్వరితగతిన సాగుతున్నప్పటికీ, ప్రజల్లో అపోహలు ఇంకా కొనసాగుతూనే వుండడానికి కారణం...ఇన్నాళ్లూ-ఇన్నాళ్లూ, ఇంత అవినీతి జరుగుతున్నా, చేస్తున్న వారినెవరినీ నిలుపుదల చేయలేకపోవడం వెనుకనున్నబలీయమైన కారణాలేంటి? అని. ఏ అధికారులను-అనధికారులనైతే సిబిఐ ప్రస్తుతం విచారణ చేస్తున్నదో, వారితో సహా, చేయని ఇతర అధికారులకు-అనధికారులకు ఈ విచారణ ఒక కనువిప్పు కావాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచన జరగాలి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కాని, సోదాలు కాని, రాజకీయ కారణాల వల్ల కానేకాదు అన్న నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. కేవలం విచారణతో ఆగకుండా శిక్షల దాకా వ్యవహారం (తప్పు జరిగిందని తేలితే-తేల్చగలిగితే) కొనసాగాలి. అదెంతవరకు వీలుంటుందోకాని, గత రెండు-మూడు రోజులుగా ఉన్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే, అవినీతికి పాల్పడినట్లు భావించి విచారణకు గురవుతున్న వారు తమను వేధించడానికి రాజకీయ కారణాలే తప్ప మరేమీకాదన్న అభిప్రాయం బలంగా కలిగించడానికి దేశ రాజధానిలో కాలికి బలపం కట్టుకుని ఎక్కని గడప-దిగని గడప లేకుండా బిజీ-బిజీగా గడుపుతున్నారట.
చివరకు ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తా యో కాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఏ కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చాడో, ఆ పార్టీ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్" పంచన చేరడానికి తన సంసిద్ధతను బహిరంగంగానే-అదీ పేరుపొందిన జాతీయ టెలివిజన్ ఛానల్ ద్వారా తెలియచేయడము విశేషం. తన సచ్ఛీలతను తెలియచేయడానికి, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు విషయంలో సహితం మౌనంగా వుండి పోయారు. మరో వైపు, తనను లోక్ సభలో వెనకేసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మ స్వరాజ్ కు కూడా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా గాలి జనార్దనరెడ్డి ఆమెకు సన్నిహితుడంటారు. తాను జగన్మోహన్ రెడ్డికి లోక్ సభలో మద్దతిచ్చినా తన సన్నిహితుడి విషయంలో ఆయన ఏమీ తెలియనట్లు మాట్లాడడం వెనుక గూడార్థం ఏమై వుంటుందో?
భారత దేశంలో అపారమైన కోటానుకోట్ల రూపాయల విలువ చేసే సంపద వ్యవసాయ పంటల రూపేణా నెలల తరబడి ఎటువంటి బధ్రత లేకుండా బహిరంగంగానే అందరి కళ్ల ముందర పడేసి వుంటుంది. ఐనా, అందులో కొంచెం కూడా దొంగల పాలవదు-ఎప్పుడో ఒకప్పుడు తప్ప. గాలి లాంటి ఘనులే కనుక అనాదిగా మన వ్యవస్థలో వుండి వున్నట్లయితే, పరిస్థితి వేరే విధంగా వుండేదేమో! ఇక ఇప్పడు అలా కాదు. భూగర్భంలో అనాదిగా నిక్షిప్తమై వున్న అపార సంపదను కూడా కొల్లగొట్టే మహానుభావులు పుట్టుకొచ్చారు. అలాంటివారికి ఆ నిక్షిప్తమైన సంపదను వెలికి తీసేందుకు లైసెన్సులను ఇచ్చిన "ప్రభుత్వ అధికారులను" ప్రధమ ముద్దాయిలుగా పేర్కొనాలి. వారిని అలా చేయమని వారిని ప్రోత్సహించిన అనధికారులను (మంత్రి వర్గ సభ్యులను) రెండవ ముద్దాయిలుగా పేర్కొనాలి. అప్పుడే ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా వుండే ఆస్కారముంటుంది. ఏ విధంగానైతే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో స్థలం, విల్లాలు కొనుక్కున్న వారిని విచారణ చేయడానికి నిర్ణయం జరిగిందో, అదే విధంగా, పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా గాలి గనుల విషయంలో కాని, జగన్మోహన్ కంపెనీలలో పెట్టుబడుల వ్యవహారంలో కాని విచారణ జరగాలి.
వ్యాధి నివారణ కంటే, నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి జరిగిన తర్వాత చర్యలకంటే, ముందస్తుగానే నిరోధించగల వ్యవస్థలుండాలి. కావాల్సింది "పోస్ట్ ఆడిట్" కాదు.."ప్రీ ఆడిట్". లక్ష్మీ నారాయణ లాంటి అధికారులు లక్షలలో-వేలల్లో కాకపోయినా, వందల సంఖ్యలో నన్నా మన దేశంలో వుండే వుంటారు. భారీ కుంభకోణం జరిగేందుకు ఆస్కారముండే వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే ముందర, ఇలాంటి అధికారులతో, లైసెన్సు కోరిన వారి పూర్వా-పరాలు, రాజకీయ సంబంధాల గురించి సమగ్ర దర్యాప్తు చేయించాలి. అంతటితో ఆగకుండా, ఆ లైసెన్సుకు సంబంధించిన వారి వ్యాపారం సాగేంతవరకూ, ఏడాదికో-ఆర్నెల్లకో వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో, లేదో, విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా-బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. అప్పటికీ దొరకకుండా తప్పించుకుంటే, ఇక ఎలాగూ పోస్ట్ ఆడిట్ వుండనే వుంటుంది. కనీసం కొంతకాలమైనా, అవినీతి కొంతలో కొంతన్నా అరికట్టడానికి ఈ చర్యలు అమల్లోకి రావాలి. లోక్ సభలో చర్చకు రానున్న లోక్ పాల్ బిల్లులో ఈ అంశాలకూ ప్రాధాన్యతుండాలి. లేకపోతే, గాలి లాంటి వారు తమకున్న పలుకుబడితో అప్రతిహతంగా అవినీతి మార్గాలలో పయనిస్తూనే వుంటారు.
Thursday, August 25, 2011
విజ్ఞప్తి చేయాల్సిన పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం తగదు: వనం జ్వాలా నరసింహారావు
ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం తగదు
వనం జ్వాలా నరసింహారావు
ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా, ఏ ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధిని పలకరించినా, అంతో-ఇంతో పరిజ్ఞానం వున్న ఏ వ్యక్తిని మాట్లాడించినా, వారి నోట వచ్చే ఒకే ఒక వాక్యం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలన్నదే! అలా మాట్లాడుతున్నవారికి అవినీతి గత చరిత్ర వుండవచ్చు-వుండక పోవచ్చు...ఐనా పోరాటంలో ముందేనంటారు. టెలివిజన్ ఛానళ్లు, దిన-వార-మాస పత్రికలు, హజారే బృందానికి, ప్రభుత్వానికి, లేదా అరుణా రాయ్ లాంటి పౌర సమాజం కార్యకర్తలకు అనుకూలంగానో-వ్యతిరేకంగానో వెల్లడి చేసే వారి అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తున్నాయి. అందరిది ఒకే నినాదం..."అవినీతి అంతమొందాలి, లోక్ పాల్ చట్టం రావాలి" అని. ఆ చట్టం ఎలాంటిది అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు-ఎవరి దారి వారిదే! గతంలో కేంద్రంలోను-రాష్ట్రాలలోను ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వచ్చినప్పుడు అధికారంలో వుండి కూడా ఏమీ చేయని-చేయలేని వారితో సహా, ప్రతి రాజకీయ నాయకుడు, ఆపాదమస్తకం తానేదో నీతిమంతులకు ప్రతిరూపం అనుకుని, తనకున్న పరిధిలోనే లోక్ పాల్ బిల్లును చట్ట సభలో ప్రవేశ పెట్టడానికి కారణమైన ప్రధాని మన్మోహన్ సింగ్ ను తీవ్రంగా విమర్శించే వారే. ఇలాంటి వారు తాము చేయక-చేయలేక పోగా చేసేవాడిని చెయ్యనివ్వరు. విమర్శించడానికి మాత్రం వెనుకాడరు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి ఈ మహానుభావులంతా వంత పాడడం ఎంతవరకు న్యాయం? అరవై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో-అరవై రెండు సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం ఏమిటి? నలభై రెండేళ్ల క్రితం నాటిన లోక్ పాల్ మొక్కకు నీరు పోసిన వారు-పోయనివారు ఏకమై పోయారిప్పుడు. వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొక టి అనుసంధానం చేసి అవినీతి పరులపై ప్రయోగించడానికి, ఇదే రాజకీయ నాయకులు-పౌర సమాజం ప్రతినిధులు ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య ఇంత జటిలమయ్యేదా? అంతా జరిగినాక, ఇప్పుడు రాత్రికి రాత్రే, "సర్వోపతి" లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం సమంజసం కాదు.
దశాబ్దంన్నర క్రితం, స్వాతంత్ర్యం వచ్చి ఏబై వసంతాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో, నవంబర్ 1996 లో నాటి ప్రధాని దేవె గౌడ, మే 1997 లో ఆయన వారసుడు ఐకె గుజ్రాల్, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల, ముఖ్య మంత్రుల సమావేశాలు నిర్వహించారు. కేంద్ర-రాష్ట్ర స్థాయిలలో బాధ్యతాయుతమైన, పారదర్శకతతో కూడిన పాలన ప్రజలకందించాల్సిన అంశంపై ఏకగ్రీవ తీర్మానాలను ఆ రెండు సభలు ఆమోదించాయి. ప్రభుత్వాలపై ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని ఏ విధంగానైనా నిలబెట్టుకోవాలన్న ఆందోళన వారిలో అప్పట్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ సభల దరిమిలా దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని, ప్రత్యక్షంగాను-పరోక్షంగాను, సేకరించే ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన ఆరు నెలల లోపు అ సభలో ఆమోదించిన "నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక" కు సంబంధించిన అంశాలను అమలు చేయాలని, అమలు ఎలా జరుగుతున్నదనే విషయాలను ప్రధాన మంత్రి స్వయంగా సమీక్షించాలని నిర్ణయం కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే ది ఆ ప్రణాళికలో ప్రధానమైన అంశం. అలనాటి నిర్ణయాలే అక్షరాలా అమలు జరిగివుంటే ఈనాడు హజారే ఆందోళన చేయాల్సిన అవసరమే లేదు.
అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే ఆ నాడూ పౌర జీవితంలోనే వున్నారు. నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి వైఫల్యాల విషయంలో మాట మాత్రంగా నన్నా, నిరసన తెలియ చేసినట్లయితే, బాగుండేదేమో! అప్పట్లో ఉద్యోగాలలో వుంటూ, నేడు హజారే ఆందోళనకు మద్దతిస్తున్న "పౌర సమాజం నాయకులు" కేజ్రివాల్, కిరణ్ బేడి తదితరులు కొంచెమన్నా గళం విప్పినట్లయితే పరిస్థితులు ఎలా వుండేవో? అలానే శాంతి భూషణ్, ప్రశాంతి భూషణ్ లు తమ న్యాయవాద వృత్తికి కేటాయించిన సమయాన్ని కొంతలో కొంతైనా ప్రజల సమస్యలకు కేటాయించినట్లయితే సమంజసంగా వుండేదేమో! అంతెందుకు...అప్పట్లో ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన అతిరథ-మహారథులెందరో నేటికీ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వారిలో కొందరు అధికారంలో, కొందరు ప్రతిపక్షంలో వుంటూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు..నాటి గుజరాత్ ముఖ్య మంత్రి-ఆ తర్వాత కొన్నాళ్లకు కేంద్ర మంత్రిగా పనిచేసిన శంకర్ సింగ్ వాఘేలా; నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి-నేటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్ర బాబు నాయుడు; అప్పుడు-ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి; ఇప్పుడు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్; నాటి బీహార్ ముఖ్యమంత్రి రబ్రీ దేవి-ఆమె భర్త లాలూ ప్రసాద్ యాదవ్; శివ సేనకు చెందిన నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ జోషి వీరిలో ప్రముఖులు. ఒకరి వెంట మరొకరు ప్రధానులుగా పనిచేసిన దెవె గౌడ, గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పాయీలు కూడా రాజకీయాలలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారింకా. వీరంతా వ్యక్తిగతంగనో-కలిసికట్టుగానో అలనాటి నవ సూత్ర ప్రణాళిక అమలుకు కృషి చేసి వుంటే అవినీతి కొంతలో కొంతన్నా కట్టడి అయివుండేదేమో? ఇప్పుడు మాత్రం వీరంతా అన్నా హజారే జపం చేస్తున్నారు. తప్పంతా తమదికాదని-ఇతరులదేనని వీరి నమ్మకం.

దేవె గౌడ-గుజ్రాల్ ల తర్వాత ప్రధాని పీఠం ఎక్కిన అటల్ బిహారీ వాజ్ పాయి, తమ రాజకీయ కూటమికి చెందిన ఎన్డీఏ జాతీయ ఎజెండాలో (మార్చ్ 18, 1998) అవినీతి నిర్మూలన విషయం పొందుపరిచారు. "పటిష్టమైన లోక్ పాల్ చట్టాన్ని తీసుకొస్తామని, ప్రధానిని కూడా అందులో చేరుస్తామని" ఎన్డీఏ నొక్కి వక్కాణించింది. ఆ తర్వాత, పార్లమెంటులో, ఆ చట్టం తేకపోయినా, "సమాచార స్వేచ్ఛ చట్టం" తీసుకొచ్చింది. చట్టం కాని లోక్ పాల్ కు ఏ గతి పట్టించిందో, అదే గతి సమాచార స్వేచ్ఛ చట్టానికి కూడా పట్టించింది. అది ఎన్డీఏ కాలంలో అమలుకు నోచుకోలేక పోయింది. ఇప్పుడేమో, అన్నా హజారే ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీతో ఎన్డీఏ లో భాగస్వాములుగా నాడు-నేడు వున్న మరికొన్ని పార్టీలు, తమ సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ఇంతకంటే "హిపొక్రసీ" ఇంకేముంటుంది? వాజ్ పాయి ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలో కొచ్చిన యుపిఎ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ చొరవతో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పటిష్టంగా అమలు చేస్తుంది. ఆ చట్టం రూపకల్పనలో, హజారే నడుపుతున్న పౌర సమాజం లాంటి దానికే సారధ్యం వహిస్తున్న అరుణా రాయ్, నేటి హజారే ఉద్యమంలాగా కాకుండా, సంయమనంతో తన వంతు సహకారాన్ని అందించారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లోక్ పాల్ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అంతవరకు మాత్రం ఆయనను అభినందించాల్సిందే!
సరే అయిందేదో అయిందను కుందాం. తన మాట నెగ్గ లేదనుకుని, మరింత పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరటంలో తప్పు లేదనుకుందాం. దాని కొరకు దీక్షకు దిగడంలోను న్యాయం వుందను కుందాం. ఆయన వెంట నడుస్తున్న ఇతర పౌర సమాజం సభ్యులు, హజారే కంటే అధిక స్థాయిలో పట్టుదల ప్రదర్శించడాన్నీ ఒప్పుకుందాం. కాని, తమకు-తమ పౌర సమాజానికి-తమకు మద్దతిస్తున్న వారికి తప్ప ఇతరులెవరికీ లోక్ పాల్ బిల్లు విషయంలో, ఏమీ తెలవదని వాదించడం మాత్రం అన్యాయం. హజారే ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రభుత్వం-ప్రతి పక్షాలు, పరస్పరం సంప్రదింపులు చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్న సమయంలో తమవంతు సహకారం అందించడంలో హజారే బృందం సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా-ప్రతిపక్షాలు ఎంత సహకారం అందించినా, పరిష్కారం కను చూపు మేరలో కనిపించడం లేదు. జన లోక్‌పాల్ బిల్లు పెడతామని ప్రధానమంత్రి లిఖిత పూర్వంగా హామీ ఇవ్వాలని , హజారే బృందం అనడం కంటే విడ్డూరం మరొక టి లేదు. ఒక వైపు తాను మరో తానింకా తొమ్మిది రోజులు దీక్ష చేయగలనని హజారే అంటుంటే, క్షణ-క్షణానికి ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలన్న పరోక్ష సలహాతో, ఆయన బృందం సభ్యులు, హజారేకేమన్నా జరుగు తే, ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరికలు చేస్తున్నారు. తాను ఆసుపత్రికి పోయే సమస్యే లేదని చెప్తున్న హజారే, తనను నిర్బంధంగా పోలీసులు పట్టుకెళితే వారిని అడ్డుకోవాలని ఒక వైపు చెప్తూనే-మరో వైపు శాంతియుతంగా ఆందోళన చేయాలని భోదిస్తున్నారు గాంధీ తత్వం పుణికిపుచ్చుకున్న అన్నా హజారే!
ప్రభుత్వం ఎన్నో మెట్లు దిగి వచ్చింది. జన లోక్ పాల్ బిల్లులోని మరికొన్ని అంశాలను, పార్లమెంటు ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్లమెంటు స్థాయీ సంఘం ఆమోదం పొందడానికి రాజ్యాంగపరంగా ఎలాంటి వెసులుబాటు వుందో పరిశీలిస్తోంది. హజారే నిరసన దీక్ష విరమింప చేయడానికి-ఆయన బృందం సభ్యులు వేసిన పీట ముడిని విప్పడానికి, ప్రభుత్వం, పౌర సమాజం సభ్యులతో, అఖిల పక్షం సభ్యులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. పౌర సమాజం సభ్యుల ప్రతినిధులైన కేజ్రీవాల్, కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్ లు తమ పట్టు సడలించేది లేదన్న రీతిలో వ్యవహరించా రక్కడ. సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్, ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. పార్లమెంటు సార్వభౌమాధికారం, శాసన ప్రక్రియ, న్యాయ స్థానాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా లోక్ పాల్ బిల్లులో మార్పులు-చేర్పులు చేయాలన్నది వారి మాటల్లో స్ఫురించింది. అలాగే హజారే దీక్షను విరమించుకోవాలని కూడా అందరూ అభిప్రాయ పడ్డారు.
సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం ప్రధాని పదే-పదే వ్యక్తం చేశారు. లోక్ సభలో అవినీతిపై జరిగిన చర్చకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. లోక్ పాల్ బిల్లును చట్ట సభలో ప్రవేశ పెట్టడానికి ఒకరకంగా కారణ భూతుడైన అన్నా హజారేకు "అభివాదం" చేస్తున్నానని వినమ్రంగా చెప్పారు. జన్ లోక పాల్ ముసాయిదాతో సహా, అరుణా రాయ్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారి ముసాయిదాలను కూడా పార్లమెంటులో చర్చకు చేపట్టి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్త పరిచారు ప్రధాని. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, సభాపతి మీరా కుమార్ లు కూడా అన్నా హజారేను దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకంటే ముందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మను జోక్యం చేసుకోమని-హజారే నిరాహార దీక్ష విరమింప చేయాలని ప్రధాని ఆయనను కోరినట్లు వార్తలొచ్చాయి. ఇదిలా వుంటే, మరోవైపు మంకు పట్టు వీడని అన్నా హజారే బృందం, ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేయాలని పిలుపిచ్చింది.
దీక్ష చేపట్టడం ఎంత ముఖ్యమో, సమయం వచ్చినప్పుడు దీక్ష విరమించడం కూడా అంతే ముఖ్యమని మహాత్మా గాంధీ నిరూపించారు. గాంధీ స్ఫూర్తితో దీక్ష చేస్తున్నానంటున్న హజారే పట్టుదలకు పోకుండా, చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన లోక్ పాల్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చేలా చేస్తే మంచిదే మో!
Thursday, August 4, 2011
రాజ్యాంగ వ్యవస్థలు X హజారే !: వనం జ్వాలా నరసింహారావు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దిన పత్రిక (05-08-2011)
ప్రశ్నించ తగని పార్లమెంట్ సార్వభౌమత్వం; తొందరపడుతున్న అన్నా హజారే బృందం; పార్లమెంట్‌ను ఆదేశిస్తారా?; కార్యనిర్వాహణ, న్యాయ వ్యవస్థల ఆధిక్యత?; అన్నా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం సబబేనా?
ప్రజాస్వామ్య విధానంలో-అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగాన్ని తుచ తప్పకుండా పాటించాలంటే, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ కేవలం చట్ట సభలు మాత్రమే. ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో-చేసిన దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా ఆమోదింపచేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా అధిగమించాలన్న విషయాలను నిర్ణయించే అధికారం చట్ట సభలకే వుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ-శాసన ప్రక్రియ వ్యవస్థ-న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి వుండడం వల్ల, ఒక దాని అధికారం మరో దాన్ని కబళించలేని విధంగా-అధిగమించలేని పద్ధతిలో, "అదుపులు-అన్వయాలు" ఆ అధికారాలను పరిమితం చేస్తుంటాయి. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అని మన నమ్మకం. అలానే, పార్లమెంటుకున్న తిరుగు లేని అధికారంతో, దాని ద్వారా-రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన ఒక "కార్య నిర్వహణ అధికారి" (ప్రధాన మంత్రి), పరోక్షంగా పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్ర పతి నియమ-నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన అత్యున్నత న్యాయ వ్యవస్థ, పార్లమెంటు (రాజ్యాంగ సభ) సూత్రాలకు అనువుగా వుండే శాసన ప్రక్రియ, తమ విధులను చట్ట సభల అధికారానికి లోబడే పని చేస్తాయి. అలాంటప్పుడు పార్లమెంటు తన హక్కుగా-బాధ్యతగా పారదర్శకతతో చేయాల్సిన విధిని, అదేదో తమ పనిగా, ఎవరో కొందరు-ఏ కారణంతోనైనా, తమపైన వేసుకోవడం, పార్లమెంటును-కార్య నిర్వహణ వ్యవస్థను ఒత్తిడికి గురిచేయడం పార్లమెంటరీ సిద్ధాంతాలకు విరుద్ధం మాత్రమే కాకుండా ప్రజాస్వామికం కాదు కూడా.
చారిత్రాత్మక లోక్ బాల్ నమూనా బిల్లు రూపొందించే ప్రక్రియలో, ప్రభుత్వాన్ని-మంత్రి మండలిని ఆమోదించే క్రమంలో, క్రియాశీలక పాత్ర వహించిన గాంధేయ వాది అన్న హజారేను-ఆయన పౌర సమాజ బృందాన్ని ప్రతి భారతీయ పౌరుడు మనఃపూర్వకంగా అభినందించాల్సిందే! అంత మాత్రాన, వారెంత మహనీయులైనా, భారత పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని-తద్వారా కొనసాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచే దిశగా అడుగులు వేయబూనుకోవడం సరైందికాదు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన శాసన నిర్మాణ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన పార్లమెంటు అధికారం తిరుగులేనిదే! వాస్తవానికి ముసాయిదా లోక్ బాల్ బిల్లులో, జన లోక్ పాల్ సూచించిన అంశాలు చాలావరకు పొందుపరిచింది ప్రభుత్వం. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఎట్టకేలకు బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్తున్నందుకు- ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ఆయన మంత్రి మండలిని అభినందించాల్సిన హజారే-ఆయన పౌర సమాజ బృందం, దానికి బదులుగా, పార్లమెంటు ఆమోదించనున్న ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించనున్నదని ముందే జోస్యం చెప్పడం దురదృష్టకరం. చట్టం రూపొందించే హక్కును ఎలాగైతే ఏ రాజ్యాంగం పార్లమెంటుకు ప్రసాదించిందో, అదే రాజ్యాంగం ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు తిరస్కరించే అధికారం కూడా ఇచ్చింది కదా! అంతవరకు వేచి మాట్లాడాల్సిన హజారే "తొందరపడి ముందే కూసిన కోయిల" వలె మాట్లాడడం అన్యాయం.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం, అదుపులు అన్వయాలకు లోబడి, కార్య నిర్వహణ అధికారి (ప్రధాన మంత్రి) మంత్రి మండలి సమష్ఠి బాధ్యతకు అనుగుణంగా, చట్టాల (రూప కల్పనను) ప్రతిపాదించు తారు. అలా తయారు చేసిన ప్రతిపాదన బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశ పెట్టి-చర్చించిన తర్వాత, (సవరణలతో)ఆమోదించడమో-తిరస్కరించడమో జరగడం ఆనవాయితీ. "లాబీ వర్గాల" కు (పౌర సమాజం వారితో సహా) పార్లమెంటే తరులకు, లాంఛనంగా-చట్ట పరంగా, ఆ ప్రక్రియలో ముందుగా పాల్గొనే వీలు రాజ్యాంగం కలిగించలేదు. కాకపోతే, వారి పలుకుబడి-ప్రభావం చూపించి, ప్రభుత్వం మీద-పార్లమెంటు సభ్యుల మీద కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం లేక పోలేదు. అది హక్కు ఎంత మాత్రం కానేకాదు. ప్రతిపక్షాలను కూడా అవసరమనుకుంటేనే ప్రభుత్వం సంప్రదిస్తుంది కాని, ఉపేక్షించితే తప్పు పట్టాల్సిన పని లేదు. ఏ పార్టీ అధికారంలో వున్నా ఇలానే జరుగుతుంది.
అన్నా హజారే-ఆయన పౌర సమాజం చెప్పిందల్లా చేస్తే, ఇక పార్లమెంటుకు-ప్రధానికి ఏదన్నా పాత్ర వుందనుకోవాలా? లేదా? పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేస్తే ప్రజాస్వామ్యం ఏం కావాలి? చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన తన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టిందన్న అపవాదు ఇటీవల కాలంలో తలెత్తడంతో, పరోక్షంగా అది తన ఉనికిని కోల్పోతోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే కొన్ని రాజ్యాంగ వ్యవస్థలకు (భవిష్యత్ లో లోక్ పాల్ లాగా) బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. కార్య నిర్వహణ వ్యవస్థ పార్లమెంటును శాసిస్తున్నదా అన్న అనుమానం కలుగుతోంది. న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం, చట్టం స్థానంలో తరచుగా "ఆర్డినెన్సుల" ను తేవడం ద్వారా (గుడ్డిలో మెల్లగా లోక్ పాల్ ఆర్డినెన్సు తేవాలని హజారే పట్టు బట్టలేదు!) కార్య నిర్వహణ వ్యవస్థకు (ప్రధాన మంత్రికి) తన అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనత. ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేదు. రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోతున్నాయి.
పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశం. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు. భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత వహించక తప్పదు. తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే అభిప్రాయం కూడా కలుగుతోంది. పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం పార్లమెంటు పనితీరుపై పడుతోంది.
పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచల ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.
ప్రధాని మన్మోహన్ సింగ్, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత, చొరవ తీసుకుని (పోనీ హజారే చొరవ వల్ల అనుకుందాం), లోక్ బాల్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. స్వయంగా ప్రధానిని కూడా లోక్ పాల్ పరిధిలో చేర్చమని ఆయనే కోరారు. చివరకు కమిటీ సభ్యుల సూచనను అంగీకరించారు. బహుశా అత్యున్నత స్థాయి కార్య నిర్వహణ అధికారిని (ప్రధాని), అత్యున్నత న్యాయ వ్యవస్థను, పార్లమెంటులో సభ్యుల పనితీరును, లోక్ పాల్ పరిధిలో తీసుకురాక పోవడం సమంజసమే మో! అదుపులు-అన్వయాలకు బాధ్యత వహించాల్సిన ఈ మూడు వ్యవస్థలను ఆ స్థాయిలో గౌరవించాల్సిన అవసరం వుందనాలి. లోక్ బాల్ సభ్యులుగా నియామకం కాబోయే తొమ్మిది మంది సభ్యులలో భవిష్యత్ లో ఏ నాడూ-ఎవరూ-ఎలాంటి పరిస్థితుల్లోను, ఇతర ఉన్నత స్థాయి-మధ్య స్థాయి-కింది స్థాయి వ్యక్తుల లాగా, ఏ బలహీనతలకు లోను కారన్న నమ్మకం వుందా? అలాంటి వారే ప్రధాని కూడా అని, న్యాయ మూర్తులని భావించడం మంచిదే మో!
పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని-దాని శాసన నిర్మాణ కర్తవ్యాన్ని-ఆ కర్తవ్యంలో పాలు పంచుకుంటున్న గౌరవ సభ్యులను-కార్య నిర్వహణ అధికారి ప్రధానిని కాదని, ఆ మరణ నిరాహార దీక్షకు దిగడం ఎంతవరకు సబబు?
Friday, July 22, 2011
యూపీఏ- కాంగ్రెస్‌లకు సమర్ధ నాయకత్వం ఉందా?: వనం జ్వాలా నరసింహారావు
యూపీఏ- కాంగ్రెస్‌లకు సమర్ధ నాయకత్వం ఉందా?
వనం జ్వాలా నరసింహారావు
గత కొద్ది మాసాలుగా దేశ చరిత్రలో కనీ-వినీ ఎరుగని మోతాదులో, సమష్ఠి బాధ్యతా రాహిత్యం-సమన్వయ లోపం-అసమర్థ నాయకత్వంతో, పీకల లోతుకు మునిగి పోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వం దాని సారధి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఏ విషయంలోను ఒక విధానం అంటూ లేకుండా పనిచేయడం మరి కొంతకాలం కొన సాగితే, భావి భారత భవిష్యత్ అంధకార బంధురం కావడం ఖాయం. కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాన పార్టీ వారే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అధికారంలో వుండడంతో, ఆ నీలి నీడలు ఇక్కడ కూడా పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అక్కడ కేంద్రంలోను, ఇక్కడ రాష్ట్రంలోను, కాంగ్రెస్ పార్టీ అడ్రసు గల్లంతు కావడం తప్పక పోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? దీనికి బాధ్యులు ఒకరా? ఏ విషయంలోనూ-ఏ నిర్ణయం తీసుకోలేని దుస్థితిలో వీరుండాల్సిన ఆగత్యం ఏంటి? సమాధానాలు వారివ్వ లేక పోయినా, తెలుసుకోవాల్సిన-పోనీ ఏదో విధంగా రాబట్టాల్సిన అవసరం ప్రజల కుంది.
కేంద్ర ప్రభుత్వ-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నాయకత్వానికి, విధాన పరంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి, కీలకమైన విషయాలలో తమ విధానం ఇదంటూ పాలక పార్టీ ప్రకటించ లేక పోవడానికి, ప్రతి పక్ష పార్టీల సూచనలు-సలహాలు పాటించక పోవడానికి, పలు ఉదాహరణలు పేర్కొనవచ్చు. లోక్ పాల్ బిల్లు విషయంలో ప్రభుత్వానికి కాని, కాంగ్రెస్ పార్టీకి కాని స్పష్టమైన విధాన మంటూ లేదు. అన్నా హజారే నిరాహార దీక్షను ఏ వుద్దేశంతో విరమింప చేసారు? ఏ వుద్దేశంతో పౌర సమాజం వారితో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసారు? ఎందుకు ఒకడగు ముందుకు వేస్తారో-ఎందుకు మళ్లీ ఎవరూ అడక్కుండానే అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్కు తగ్గుతారో ఎవరికీ అర్థం కాదు. పోనీ చట్టాల రూప కల్పనలో పార్లమెంటుకే సార్వభౌమాధికారం అని ప్రకటించే ధైర్యం వుందా? అంటే ...అదీ లేదు. చివరకు జరిగిందేంటీ అంటే, లోక్ పాల్ బిల్లు విషయంలో ఎక్కడి గొంగళి అక్కడే! ఆగస్టు పదహారు నుంచి హజారే మరో నిరాహార దీక్షకు దిగేందుకు పరోక్షంగా దోహదం. ప్రభుత్వానికి కావలసిందల్లా...ఏదో విధంగా నిర్ణయం వాయిదా పడడం. అదే జరుగుతోంది లోక పాల్ విషయంలో. బాబా రాం దేవ్ విషయంలోనూ అదే విరుద్ధ పాత్రలను పోషించారు ప్రభుత్వ-కాంగ్రెస్ పెద్దలు. కొందరేమో ఆయనకు స్వాగత మిస్తారు...కొందరేమో ఆయనను పనిగట్టుకుని దూషిస్తారు. ఒకరు దీక్షకు కూచోమని పురమాయిస్తే, మరొకరు దీక్షను భగ్నం చేయించే బాధ్యతను నెత్తిమీద వేసుకుంటారు.
ఒక్క లోక్ పాల్ విషయమే కాదు. విదేశాల్లో నల్ల ధనం వ్యవహారమూ అంతే. రాజా కుంభకోణం సంగతీ అంతే. మైనారిటీల రిజర్వేషనూ అలానే. వెనుకబడిన వర్గాల వారికి సమకూరాల్సిన హక్కుల పరిరక్షణ విషయంలోనూ అదే తీరు. వర్గీకరణ వ్యవహారంలో అంతా నాన్చుడే! ఏ విషయమూ తేల్చరు. దొందు-దొందే...అన్న చందాన, రాష్ట్ర ప్రభుత్వం కూడా, అదే దోవలో నడుస్తుంటుంది. వర్గీకరణ వ్యవహారంలోను, తెలంగాణ ఎన్ జీవో నాయకుల డిమాండ్ల విషయంలోనూ, ప్రభుత్వ పరంగా అఖిల పక్షాన్ని తీసుకెళ్తానని చెప్పి, ఏం చేసింది అందరికీ తెలిసిందే. ఇక సంక్షేమ పథకాల అమలు విషయం చెప్పాల్సిన పనే లేదు. కొన్ని పథకాలను నిధుల లేమి పేరుతో, మరి కొన్ని రాజశేఖర రెడ్డి పథకాలన్న పేరుతో, మరి కొన్ని సంస్కరణల అమలు అన్న నెపంతో, ఇంకొన్ని అధికారుల అలసత్వంతో, ఇంకా కొన్ని సంబంధిత మంత్రులకు ఇష్టంలేక పోవడంతో, అమలుకు నోచుకోని పరిస్థితులు కలుగుతే-తద్వారా పౌరులు నిత్యం ఇబ్బందులకు గురవుతుంటే, ప్రభుత్వ పరంగా కనీసం సమీక్షించే నాధులే లేరు. మంత్రులే మో రాజీనామా చేశారా యె! చేయని మంత్రులే మో ఏ క్షణానన్నా చేయడానికి సిద్ధంగా వున్నారాయె! వారి వద్ద నున్న ఫైళ్లకు దిక్కూ-మొక్కూ లేదా యె! మధ్యలో తెలంగాణ-సమైక్యాంధ్ర-జై ఆంధ్ర ఉద్యమాలు-రాజీనామాలా యె! తెలంగాణ ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసా యె! ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పాపం. ఏదన్నా పరిష్కార మార్గం కనుక్కుందా మని కేంద్ర ప్రభుత్వం వైపుగా, కాంగ్రెస్ అధిష్ఠానం వైపుగా దృష్టి సారిస్తే, అక్కడా అంతా అగమ్య గోచరంగా కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి-ఆ ప్రభుత్వ కాంగ్రెస్ నాయకత్వానికి. మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత తలనొప్పి కలిగించడం చూస్తే ఒక్కో సారి జాలి కూడా వేస్తోంది. చివరకు ఆ విషయంలో హైకోర్టు పుణ్యమా అని, సిబిఐ విచారణ మొదలవడంతో, కాంగ్రెస్ పార్టీ వారికి ’ఇంటర్వెల్’ లాంటి రిలీఫ్ దొరికింది.
ఇదంతా ఒక ఎత్తై తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం-సమైక్యాంధ్ర నినాదం, ఆ రెండింటి లో పాలుపంచుకుంటున్న ఉద్యమకారుల-నాయకుల డిమాండ్లకు స్పందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏ కోణం లో అర్థం చేసుకోవాలో బోధపడడం లేదు. ప్రభుత్వంలో వున్న వారి-పార్టీలో వున్న వారి వ్యవహార శైలి, అత్యంత జుగుప్సాకరంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా, యావదాంధ్ర తెలుగు ప్రజలను అనుక్షణం అవమాన పరిచే రీతిలో వుందనాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నాయకుడు (రాలు) అంటూ ఎవరన్నా వున్నారా? వుంటే, ఆ నాయకుడు (రాలు) గతంలో, ఏ కాంగ్రెస్ నాయకులకూ లేని నాయకత్వ లోపం వుందనాల్సిందే!
రాష్ట్రానికి సంబంధించి నంతవరకూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? గులాంనబీ ఆజాదా? బొత్స సత్యనారాయణా? పోనీ టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు చంద్రశేఖర రావా? సోనియా గాంధీ దగ్గర పలుకుబడి వున్న వారు నాయకులా? అలాంటప్పుడు వారు కాంగ్రెస్ వారు కాకపోయినా పరవాలేదా? అలాంటి నాయకులు సాక్షాత్తు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆజాద్ ను తప్పుబడుతూ, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నాయకులున్న వేదికపై ఉపన్యసిస్తుంటే, అడ్డు తగలక పోవడానికి బలవత్తరమైన కారణాలేంటి? రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన వెలువడుతుందని ధైర్యంగా ఒక కాంగ్రేసేతర నాయకుడు కాంగ్రెస్ నాయకులున్న వేదికపై ప్రకటించారంటే, ఎవరు సమర్థులో-ఎవరు అసమర్థులో ప్రశ్నించుకోవాలి-సమాధానం వెతుక్కోవాలి. ఏ కాంగ్రెస్ అధినాయకత్వం చంద్రశేఖర రావు వెనుకనుండి ఆ ప్రకటన చేయించారో కాని, ఆ ప్రకటనతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ధైర్యం తెచ్చుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే, దేశం కాని దేశంలో చీమ టపాకాయ లాంటి టపాసు పేల్చాడు గులాం నబీ ఆజాద్. అంటే మరో దిక్కునుంచి మరో సంకేతం...దాని పర్యవసానం... ఇప్పట్లో తెలంగాణ లేనట్లేనా! కేసీఆర్ ప్రకటనకు తెలంగాణ వారికి ధైర్యం ఎంత వచ్చిందో కాని, సీమాంధ్ర నాయకులలో మాత్రం ఐక్యత మరో మారు తక్షణమే వచ్చింది. మళ్లీ కధ పునరావృతం... మరో మారు ఢిల్లీ ప్రయాణం... సమైక్య నాదం వినిపించడం... అధినాయకత్వం భరోసా పొందడం...వెంట వెంటనే జరిగాయి. ఏం జరుగుతోంది? ఎవరు ఎవరిని ఎందుకు ఎంతకాలం ఏ కారణాన మోసం చేయాలనుకుంటున్నారు? సరిగ్గా ఆ సమయంలోనే, డిసెంబర్ తొమ్మిది-రెండువేల తొమ్మిది నాటి నుంచి-నేటి వరకు, కోటల దాటిన మాటలు, ఒక్కొక్కటే వెనక్కు మళ్ల సాగాయి. పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా అన్నది అనలేదని బాధ్యతాయుత పదవులలో వున్న వారనడం, దానికి మనలో కొందరం వంత పాడడం, తెలుగు మాట్లాడే వారందరినీ, మూకుమ్మడిగా అవమానాలకు గురిచేయడానికి కాంగ్రెస్ పార్టీకి-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు అవకాశం ఇచ్చినట్లే!
చిదంబరం కొద్ది రోజుల ముందే బయటపడ్డారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటనను, డిసెంబరు ఇరవై మూడు ప్రకటనతో కలిపి చదవాలని. ఆ మాటకొస్తే, ఆయన అధికారంలో లేనప్పుడు, చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాసిన వాక్యాలను, అసలు పరిగణలోకే తీసుకోవద్దని ఆయనే ఒక సారి అన్న మాట గుర్తు చేసుకోవాలి. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆజాదు చైనాలో అన్న మాటలను, మీడియా వక్రీకరించిందని, సాక్షాత్తు ఆయనే అన్నారు. ఆ సంగతి ఆయనకు పదిమంది చివాట్లు పెట్టిందాకా జ్ఞప్తికి రాకపోవడం విశేషం. పోనీ, మీడియా వారన్నా, ఆజాదును ఖండించారా అంటే అదీ లేదు. ఆయనే మన్నారు? ఎంతవరకు మీడియా వక్రీకరించింది? ఎవరికీ తెలియదు. ఈ లోపున, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడిందాకా ఢిల్లీ ముఖం చూసే ప్రసక్తే లేదని హైదరాబాద్ లో భీష్మించుకుని కూర్చొన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు, ఆజాదు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేయడం కొంత వెసులుబాటు కలిగించింది. పొలో మంటూ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు కొందరు "కీలక నాయకులు".
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో అతి సీనియర్ నాయకుడు, ప్రధాని కావాలని అహర్నిశలూ వువ్విళ్లూరుతున్న వ్యక్తి, సోనియాకు అత్యంత ఆంతరంగికుడు, ప్రణబ్ ముఖర్జీ, మరో బాంబ్ పేల్చారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన చిదంబరం ఒక్క డిదే కాదని, దానికి తనతో సహా ప్రభుత్వ పెద్దలందరి బాధ్యత వుందని, దానికి సమష్టిగా బాధ్యత వహించాల్సిసిందేనని ప్రణబ్ ప్రకటన చేశారు. ఇంతకంటే, "సమష్ఠి బాధ్యతా రాహిత్యం-సమన్వయ లోపం-అసమర్థ నాయకత్వం" ఎక్కడైనా-ఏ దేశంలోనైనా వుంటుందా? ఒక సీనియర్ నాయకుడు అనవలిసిన-అనదగ్గ మాటలేనా ఇవి? తెలంగాణ ఇవ్వు-ఇవ్వక పో! కాని ఇంత బాధ్యతారాహిత్యంతో యుపిఎ ప్రభుత్వంలో-కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న నువ్వు-నీ అధినేత్రి సోనియా-ఆమె కనుసన్నలలో మెలిగే ప్రధాని సోనియా దేశాన్ని ఎలా సమర్థవంతంగా నడిపించగలరయ్యా?
ఇలాంటి అసమర్థ నేతలు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో వుండి వున్నట్టయితే, సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనం అయ్యేవా? నిజాం నవాబు హైదరాబాద్ ను విలీనం కానిచ్చేవాడా? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవా? నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగుండేదా? అంతరిక్షంలోకి భారతావని అడుగుడగలిగేదా? న్యూ క్లియర్ శక్తిగా ఎదగ గలిగే దా? చైనా-పాకిస్తాన్ దేశాలకు గుణపాఠాలు నేర్పగలిగే దా?
చేవ వుంటే, అల నాడు, 1969-70 లలో, ఇందిరా గాంధీ చెప్పినట్లు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధంగా లేదని చెప్పాలి. పోనీ, పార్టీలో ఒప్పించి, అందరూ అంగీకరించే నిర్ణయమన్నా తీసుకోవాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, ఒక విధానం లేని పార్టీకి అధికారంలో వుండే అర్హత లేదు. ఉంటే, "సమష్ఠి బాధ్యతా రాహిత్యం-సమన్వయ లోపం-అసమర్థ నాయకత్వం" మరికొంత కాలం కొనసాగినట్లే!
