Showing posts with label చిర్రావూరి లక్ష్మీనరసయ్య. Show all posts
Showing posts with label చిర్రావూరి లక్ష్మీనరసయ్య. Show all posts

Tuesday, December 27, 2011

ఖమ్మం జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన శీలం సిద్దారెడ్డి: వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-12-2011)
(శీలం సిద్దారెడ్డి 26-12-2011 న మరణించిన సందర్భంగా)
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంతో సహా చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల మధ్య హింసా కాండ కొనసాగింది. ఇరు పక్షాలలో ఎంతోమంది చనిపోయారు. పక్క గ్రామమైన వల్లభిలోనూ, మండల కార్యాలయమున్న ముదిగొండ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ రాజకీయ హత్యలెన్నో జరిగాయి. వీటన్నిటి వెనుక కేవలం కమ్యూనిస్టు-కాంగ్రెస్ పార్టీల మధ్య తగాదాలే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ జిల్లా నాయకుల మధ్య జరిగిన ప్రచ్చన్న ఆధిపత్య పోరాటం కూడా కారణమే అన్న విషయం అలనాటి జిల్లా రాజకీయాలను అర్థం చేసుకున్న ప్రతి వారికీ తెలుసు.
రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రాంకిషన్‍రావు, రావెళ్ళ సత్యనారాయణ వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుంది.
తొలి రోజుల్లో, ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. శీలం సిద్దారెడ్డి రాజకీయంగా ఎదిగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం-శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.
జలగం-శీలం వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్దారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్దారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం సిద్దారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు. వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి
ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గత శతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ, వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీప బంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరుసమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాం రావు. అప్పటికే రాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామ వాస్తవ్యుడైన రాం రావు శీలం గారికి అత్యంత సన్నిహితుడు.
ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ, పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడిగా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీ, సమితి అధ్యక్షుడికి భూమితగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి కొడుకును ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా వల్లభిగ్రామంలో పడింది. అలనాటి తగాదాలలో శీలం సిద్దారెడ్డి తన మద్దతును దళితుల పక్షాన నిలిచిన సమితి అధ్యక్షుడికి ఇచ్చారు.
 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావిళ్ల సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావిళ్ల సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు. తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్రవర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్రవర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.
సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేంద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరి కొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేంద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు
అవిశ్వాస తీర్మానంలో ఉపేంద్రయ్యకు అండగా నిలవని సర్పంచులపై కక్ష బూనిన జలగం వర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర వర్ణాల వారికి, అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళితులకు ముదిగొండ మండలంలోని వల్లభిగ్రామం మరో భూ పోరాటానికివేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన ఆ గ్రామ అగ్ర వర్ణాల వారికి, దళితులకు తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. చనిపోయిన వ్యక్తి అగ్రవర్ణానికి చెందిన వాడైనందున దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నిలిచిన ఆ గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్గీయ అయితరాజు రాం రావు గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మొత్తం రాజకీయ పోరాటంలో శీలం సిద్దారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడైన రాం రావు పక్షాన నిలిచారు.
ఈ సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రహించిన అయితరాజు రాం రావు, స్నేహితుల సహాయంతో గాంధి-వినోబా బావేల శిష్యుడైన ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. పోరాటం కన్నా శాంతే మేలని భావించాడు. వల్లభికి భన్సాలీ వచ్చిన మరుక్షణమే, దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. అంతవరకూ నిరాహార దీక్షలో ఉంటానని శపథం చేసాడు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదు. కాంగ్రెస్‌లోని ఇరు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు: జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో, బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు
ఆ ప్రాంత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నిక లొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలం వర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు-కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నరసింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలి తీసుకుంది. కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రా రెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.
శీలం సిద్దారెడ్డికి ఆ విధంగా ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఎన్నో విధాల అనుబంధం వుండేది. ఆయన తుది శ్వాస విడిచేంతవరకు కూడా, ఆయన ప్రభావం అంతో-ఇంతో ఖమ్మం జిల్లా రాజకీయాలపై పడుతూనే వుండేదంటే అతిశయోక్తి కాదేమో! చిన్న తనంలో ప్రాధమిక విద్యాభ్యాసం స్వగ్రామం బనిగళ్లపాడులో చేసిన సిద్దారెడ్డి, ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్నారు. ఇంటర్ రెండేళ్లు, బిఏ రెండేళ్లు, లా రెండేళ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాష్ట్ర సహకార బాంక్ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం కార్యదర్శిగా పనిచేశారు. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల కోటానుండి 1958 లో ఎన్నికైన సిద్దారెడ్డికి 1967 లో మొదటిసారి బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో చోటు దొరికింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మూడో పర్యాయం ఆయన మంత్రి అయ్యారు. నాలుగో సారి పివి నరసింహారావు మంత్రివర్గంలో స్థానం దక్కింది సిద్దారెడ్డికి. ఆయనకు ఎప్పుడూ నీటిపారుదల శాఖనే కేటాయించేవారు.
(రచయిత స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో వుంది)

Saturday, October 16, 2010

పయ్యావుల చెప్పిన వీర తెలంగాణా విప్లవ గాధ : వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరణ జరిగి
(అక్టోబర్ 21, 2010 న)
59 సంవత్సరాలు నిండిన సందర్భంగా

సూర్య దిన పత్రిక (17-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

ఐదేళ్ల పాటు సాగిన వీర తెలంగాణా విప్లవ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మైలు రాయి-కీలకమైన ఒక మలుపు రాయి. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి విప్లవ యోధుల సరసన పోరాటంలో పాల్గొన్న వారిలో చరిత్ర పుటల్లోకి ఎక్కనివారి పాత్రను తక్కువగా అంచనా వేయలేము. సరిగ్గా ఏభై తొమ్మిది సంవత్సరాల క్రితం, అక్టోబర్ 21, 1951న ఉపసంహరించబడిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఖమ్మం జిల్లా, గోకినేపల్లి గ్రామానికి చెందిన 85 సంవత్సరాల పయ్యావుల లక్ష్మయ్యకు ఇప్పటికీ, ఈ వయసులోను ఎన్నో విషయాలు గుర్తున్నాయి. సాయుధ పోరాట ఉద్యమంలో దూకిన పయ్యావుల లక్ష్మయ్య, తనను నిర్బంధించిన నిజామాబాద్ జైలు కిటికీ వూచలు కోసి, తప్పించుకుని, సొంత గ్రామం గోకినేపల్లికి చేరుకున్నారు. క్రమేపీ ఉద్యమం తీవ్రమైంది.

మైదానంలో రక్షణ లేదని లక్ష్మయ్య ప్రభృతులు, ఇల్లెందు అడవుల్లోకి పోయారు. అప్పటికే రంగ ప్రవేశం చేసిన యూనియన్ సైన్యాలు అడవుల్లోకి, గుట్టల్లోకి వీరిని గాలించుకుంటూ వచ్చాయి. మిలిటరీ ధాటికి తట్టుకోలేక మొదట్లో ఐదు గురితో ఏర్పాటైన దళాలు, క్రమేణ ముగ్గురి తో, ఇద్దరితో కుదించడం జరిగింది. మొండిగా ఉద్యమం సాగించారు. ఉద్యమం కొనసాగించడం సరైందా, కాదా అన్న మీమాంసలో లక్ష్మయ్య లాంటి వారున్నప్పటికీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మాత్రం, అడవుల్లో దళాలను అంటిపెట్టుకుని ముందుకు సాగేవారు. అప్పట్లో లక్ష్మయ్య పాలేరు ప్రాంతం ఇన్-చార్జ్ గా పనిచేశారు. నేలకొండపల్లి సమీపంలోని మూటా పురానికి చెందిన బాగం వీరయ్య రైఫిల్ పోగొట్టుకుని చిత్రహింసలకు గురై కూడా రహస్యాలు బయటపెట్టని విషయం గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

చకిలం శ్రీనివాస రావు కార్యదర్శిగా వున్న (ఏరియా కమిటీ) దళంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి (పార్లమెంట్ మాజీ సభ్యుడు), మచ్చా వీరయ్య, చిర్రావూరి లక్ష్మీనరసయ్య (ఖమ్మం మాజీ మునిసిపల్ చైర్మన్) లతో పాటు లక్ష్మయ్య కూడా వుండేవారు. ఒక సారి జరిగిన దాడిలో లక్ష్మయ్య వారినుంచి చీలి హుజూర్ నగర్ దళంలో కలిశాడు. అక్కడ మేదరమెట్ల సీతారామయ్య, నిజామాబాద్ జైలునుంచి తనతో పాటు పారిపోయి వచ్చిన వంకాయలపాటి కృష్ణయ్య కలిశారు. సీతారామయ్య ధైర్య సాహసాలను గుర్తుచేసుకుంటూ, ఒకసారి అడవి దేవులపల్లి-దేవరకొండ ప్రాంతంలో పోతున్నప్పుడు, తమను నిర్భంధించడానికి వస్తున్న గూర్ఖాలను పసిగట్టి ఎలా వెనుక దెబ్బతీసింది వివరించారు లక్ష్మయ్య. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్ మీద దాడి చేసేందుకు ప్రణాళిక తయారుచేయమని లక్ష్మయ్యను పార్టీ ఆదేశించించింది. సహచర ఉద్యమకారుడు వంకాయలపాటిని, మేదరమెట్లను, మరొకరిని కలుపుకుని, నలుగురు స్టేషన్ పై దాడికి ప్రణాళిక వేసుకున్నారు. పొగాకు అమ్మే బేర గాళ్ల వేషంలో వూళ్ళోకి సాయంత్రం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. వూరి బయట పొగాకు పరిచి, తరాజులు పెట్టి అమ్మకాలు మొదలెట్టారు. జనసంచారం తగ్గింతర్వాత ముసుగులు ధరించి, వెంట తెచ్చుకున్న తుపాకీలు పట్టుకుని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. దాడికి వచ్చింది నలుగురే అని భావించని పోలీసులు భయంతో, లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వెంటిలేటర్ల నుంచి బయటున్న వీరు కాల్పులు చేయడంతో లోపలున్న పోలీసులు గాయపడి చేతులెత్తి లొంగిపోయారు. బయట కొచ్చిన ఒక్కొక్కరి ని బంధించారు వీళ్ళు. వాళ్ళ దగ్గరున్న 14 తుపాకీలను కట్టకట్టి, మోయలేక, అతి కష్టం మీద ఊరి బయటకు చేర్చారు. అప్పటికి అక్కడున్న రాతి బావిలో పడవేసి, తర్వాత తీసుకున్నారు.

అడుగడుగునా పోలీసు కాపలా అవరోధాల మధ్య, సానుభూతి పరుల సహాయం లభించేది. ఒక సారి ఈయన దళాన్ని వంద మంది పోలీసులు చుట్టుముట్టారు. సమీపంలోని జొన్న చేలలో, చుట్టూతా తుపాకీల పహరా మధ్య తప్పించుకునే ప్రయత్నంలో వుండగా, తోటి ఉద్యమకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపిస్తున్న లక్ష్మయ్యకు దండం పెట్టి, తాను పోలీసులకు చిక్కక ముందే చంపమని ప్రాధేయ పడ్డాడట. అతడిని భుజంపై వేసుకుని ఎలాగోలా లక్ష్మయ్య తప్పించుకోగలిగాడు. జొన్న చేలు దాటి, మరో దళానికి చెందిన సభ్యుడొకరిని, దొడ్డా నరసయ్య గ్రామం దగ్గరున్న చిలుకూరు సమీపంలో కలిశాడు లక్ష్మయ్య. ఒకరినొకరు క్షణకాలం అనుమానించినా కలిసిపోయారు. గాయపడిన సహచరుడిని, సుదూరంలో కనిపిస్తున్న గుర్రానికి కట్టి తీసుకెళ్దామని భావించారు. అయితే, ఆ గుర్రం సహాయంతోనే మరో సహచరుడు వంకాయలపాటి కృష్ణయ్య రావడం గమనించారు. మొత్తం మీద అందరూ కలిసి, చిలుకూరు నుంచి గొర్రగూడెం అడవులకు చేరుకున్నారు. అక్కడే హుజూర్ నగర్ దళం పని చేస్తున్నది. అప్పటికే, ఖమ్మం దళం కంటే పటిష్టంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న హుజూర్ నగర్ దళం, కాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నది.

పయ్యావుల లక్ష్మయ్యను కల్వకుర్తి జోనల్ కమిటీ కార్యదర్శిని చేసింది పార్టీ. సరిగ్గా అదే రోజుల్లో, ఉద్యమంతో బాగా అనుబంధమున్న ఒక సీనియర్ కార్యకర్తను అరెస్టు చేసింది ప్రభుత్వం. అతడు పోలీసు ఇన్ ఫార్మర్ గా మారిపోయాడు. గుట్టల్లో దళం సభ్యులను కలిసి, పాత పరిచయాలతో వారినుంచి సమాచారం సేకరించి, పోలీసులకు చేరవేయ సాగాడు. చివరకు వాడిని తమ దగ్గర నుంచి, ఎల్. బి. గంగాధర రావు సారధ్యంలోని కేంద్రానికి పంపారు. ఆ దళంలో, కొండన్న అనే మాజీ సైనికాధికారి సభ్యుడుగా వుండేవారు. అతను వీడి విషయం పసిగట్టాడు. అది గ్రహించిన ఇన్ ఫార్మర్ జరగబోయేది ఊహించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పార్టీకి, ఉద్యమానికి ద్రోహం చేశానని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా గొడ్డలితో నరికి చంపారని, ఆ సంఘటన మీద పార్టీలో చాలాకాలం చర్చ జరిగిందని, తప్పొప్పుల బేరీజు వేసుకోవడం కూడా జరిగిందని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య. ఏదేమైనా చరిత్ర మటుకు ముందుకు సాగింది.

కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలున్న విషయం ప్రస్తావించారు లక్ష్మయ్య. ఒకటి సుందరయ్య వర్గం కాగా, మరొకటి రావి నారాయణరెడ్డి వర్గం. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తర్వాత, తెలంగాణా సాయుధ పోరాటం కొనసాగించడమంటే, అది నెహ్రూ ప్రభుత్వాన్ని కూల దోయడానికి జరిగే కుట్రగా ప్రచారం మొదలైంది. యూనియన్ సైన్యాలు నిజాం సంస్థానంలో ప్రవేశించిన మరుక్షణం నుంచే, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఖండించే వర్గం మొదలైంది. తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించుతున్న నాయకత్వం లోని చండ్ర రాజేశ్వర రావు, మాకినేని బసవ పున్నయ్య, మద్దుకూరి చంద్రశేఖర రావు, పుచ్చలపల్లి సుందరయ్య అక్టోబర్ 20, 1951 న సమావేశమై, పోరాటాన్ని ఉపసంహరించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని అక్టోబర్ 21, 1951 న ప్రజలకు, పత్రికలకు విడుదల చేయడం రేడియోలో ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో పయ్యావుల లక్ష్మయ్య ప్రభృతులు, వారిలాంటి చాలామంది కార్యకర్తలు అజ్ఞాత వాసంలో వుంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

పోరాట విరమణ నిర్ణయాన్ని, దాని వెనుక వున్న భావాన్ని కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోలేక పోయారంటారు లక్ష్మయ్య. పోరాట విరమణ కార్యక్రమం ఉద్యమ కారులకు వివరించడానికి లక్ష్మయ్య జోనల్ కమిటీ కార్యదర్శిగా వున్న కల్వకుర్తి జోన్ ను ఎంపిక చేసింది పార్టీ నాయకత్వం. పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడ కొచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట వచ్చిన ఒక ప్రముఖ ఉద్యమ నాయకుడు (దరిమిలా ఆయన సీపీఐ లోను, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లోను పని చేశారు) సుందరయ్య గారి సమక్షంలో, "ఎప్పుడో పోరాటం విరమించాల్సింది" అని వ్యాఖ్యానించడంతో, అక్కడున్న వారంతా ఆయన్ను తప్పుబట్టి ఎదురు తిరిగారట. పోరాట విరమణ నిర్ణయాన్ని వివరించిన సుందరయ్య గారు, "ఆత్మ రక్షణ కొరకు పోరాటం కొనసాగిస్తే తప్పులేదు" అన్న మాటలను లక్ష్మయ్య బృందం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. "చంపవద్దు" అన్న మాట అర్థమయినా, ప్రభుత్వంతో తుపాకీల అప్పగింత విషయంలో చర్చ లింకా జరుగుతున్నాయని సుందరయ్య అనడాన్ని, ఆత్మ రక్షణ కొరకు వాటిని వాడుకోవచ్చని భావించారు.

సాయుధ పోరాటం కొనసాగుతున్న రోజుల్లో, ఇంకా తుపాకీలు అప్పచెప్పకముందు, పయ్యావుల లక్ష్మయ్య దళంలో పనిచేసిన వారిలో బూర్గుల రామకృష్ణా రావు గారి బంధువు హనుమయ్య ఒకరు. విద్యాధికుడైన హనుమయ్య, డాక్టర్ పరాంజిపే దగ్గర వైద్యం నేర్చుకున్నాడు. ఆత్మ రక్షణ కొరకు ఆయుధాలింకా ఉపయోగిస్తున్న తరుణంలో, ఒకానొక సందర్భంలో హనుమయ్యను నిర్భంధించినప్పుడు, ఆ గ్రామ పటేల్ ఆయనను కాపాడి నందువల్ల పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన సంగతిని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

ఎప్పుడో ఒకప్పుడు సాయుధ పోరాటం వస్తుందని సుందరయ్య గారు నమ్మేవారని, అందుకే, ఆయన మార్గాన్ని అనుసరించే తన లాంటి వారెందరో, తుపాకీల అవసరం తప్పక రావచ్చని భావించామని ఆనంద భాష్పాల మధ్య, వ్యక్తపరచలేని సుందరయ్య గారి మీదున్న అభిమానం మధ్య పేర్కొన్నారు. నందికొండ ప్రాజెక్టు కింద మునిగి పోయిన స్థలంలో, ఇప్పుడు సాగర్ జలాలు ప్రవహిస్తున్న అలనాటి ప్రాంతంలో, ఒక గుర్తు ప్రకారం తామంతా ఆయుధాలు దాచిపెట్టామని, అవి ఎప్పుడో ఒకప్పుడు భావి తరాల ఉద్యమకారులకు దర్శనమిస్తాయని, అపారమైన నమ్మకంతో, 85 ఏళ్ళ పయ్యావుల లక్ష్మయ్య అంటుంటే, ఆయన నమ్మకానికి జోహార్లు అనాలనిపించింది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి ఎనలేని సేవలందించిన అలనాటి వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు పయ్యావుల లక్ష్మయ్యను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణ మీద సీపీఎం నుంచి బహిష్కరించడం కడు బాధాకరమైన విషయం. విప్లవ యోధులను గౌరవించడమంటే ఇదేనని సోదాహరణంగా చూపించింది సీపీఎం. లక్ష్మయ్య లాంటి "తెలుగు సోమనాథ్ ఛటర్జీ" లు ఖమ్మం జిల్లాలో చాలామంది కనిపిస్తారు మనకు. వారిలో చాలామంది నుంచి ఇలాంటి గాధలెన్నో వినవచ్చు. ఇంత జరిగినా పార్టీ మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని అణు మాత్రం కూడా వదులుకోలేని లక్ష్మయ్య, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, తనను చూసేందుకు వచ్చిన వారితో, పార్టీతో-విప్లవంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటారు.