Sunday, January 29, 2012

శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శించిన ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం: వనం జ్వాలా నరసింహారావు


శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దర్శించిన 
ముత్తారం శ్రీ సీతా రామచంద్ర స్వామి  ఆలయం
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, ముత్తారం గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఈ నెల (జనవరి, 2012) 21 వ తేదీ, శనివారం నాడు దర్శించారు. ఆయనను భక్తులు-పూజారి పూర్ణ కుంభ స్వాగతంతో ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా చినజీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ, ప్రతిఒక్కరు విగ్రహ రూపంలో వున్న ఆ దేవుళ్లను విశ్వసనీయతతో పూజించాలని సూచించారు. నిత్యం భగవన్నామ స్మరణతో, చింతనాతత్పరతతో, ఆధ్యాత్మిక జీవన సాధకులుగా ముందుకు సాగాలని భక్తులకు ఉపదేశించారు. వైష్ణవ సాంప్రదాయానికి కులమతాలు లేవని ఆయన అన్నారు. అన్నింటిలోనూ వైష్ణవ సంప్రదాయం ఉత్తమమైనదని ఆయన అన్నారు. ఆనాడు భక్త రామదాసు ఎన్నో కష్టాలు పడి భద్రాచలం లాంటి ఆలయాలు నిర్మించారని, వనం కృష్ణరాయలు శ్రీరాముడిని పూజించి ముత్తారం దేవాలయం నిర్మించి, రాముడిని ఇక్కడకు తీసుకొచ్చారని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులందరిదీ అని చినజీయర్ స్వామి అన్నారు.  చినజీయర్ స్వామి ఆలయాన్ని పరిశీలించి అక్కడున్న శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను, ఆండాళ్ అమ్మవారి విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముత్తారం చుట్టుపక్కల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి చినజీయర్ స్వామి సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. ఆయా వెంట అహోబిల మఠం చినజీయర్ స్వామి కూడా వున్నారు. (ఆ కార్యక్రమంలో మా వూరి పెద్దలందరితో పాటు నేనూ పాల్గొన్నాను).

మా పూర్వీకులైన కృష్ణరాయల గారి కోరిక తీర్చేందుకు, శ్రీరామచంద్రుడు, భద్రాచలంలో వున్నట్లు మా గ్రామంలో కూడా వెలిసి, ముక్తి వరం ముత్తవరం - ముత్తారం రామాలయంగా దాన్ని ప్రఖ్యాతి గావించాడని చుట్టుపక్కల వారి నమ్మకం. దీనికి తగిన ఆధారాలు తెనాలి దగ్గరున్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం వారు ప్రచురించే "భక్తి సంజీవని" అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో దొరికాయి. ఇటీవలే గ్రామస్తులంతా కలిసి జీర్ణావస్థలో వున్న ముత్తారం రామాలయాన్ని పునర్మించి, ఆ ప్రాంతంలో పెద్ద దేవాలయంలాగా చేసారు.

ప్రాచీన కాలం నాటి మా ముక్తి వరం-ముత్తవరం రామాలయాన్ని గురించి మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కథలు-కథలుగా చెప్పుకుంటారు. ముత్తారం రెవెన్యూ గ్రామానికి మరో రెండు శివారు వూళ్లున్నాయి. ఒకదాని పేరు "కోదండరామపురం". చాలా చిన్న వూరనాలి. ఆవూళ్లో కేవలం వెలమ కులస్తులే వుండేవారు. అన్నీ కలిసి పదిహేను కుటుంబాలు కూడా వుండవు. అందరూ వెలమ దొరలే. సాగర్ కాలువ నీటితో ముంపుకు గురైన ఈ గ్రామాన్ని ఇటీవలే కొంచెం దూరంలో పునర్నించారు. మరో శివారు గ్రామం నేను పుట్టి పెరిగిన వనం వారి కృష్ణా పురం.

మా పూర్వీకుల్లో ప్రసిద్ధిచెందిన వనం కృష్ణ రాయలు గారు దాన్ని నిర్మించినందున దానికాపేరొచ్చింది. ఆయన అచంచలమైన శ్రీ సీతారామ భక్తుడు. ప్రతిఏటా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు విధిగా హాజరయ్యే వాడట. కాలంగడుస్తున్నాకొద్దీ, వయసు మీరుతుండడంతో, వెళ్ళిరావడానికి ఇబ్బందిపడుతుండేవాడు. అప్పట్లో ఆయన గుర్రంమీద వెళ్లొచ్చేవాడు. చివర కో సంవత్సరం గోదావరి నది దాకా వచ్చి, ఇక ముందుకు వెళ్లలేక, అలసిపోయి అక్కడే పడిపోయాడు. భద్రాచలంలో రాముడి కల్యాణానికి వేళవుతుండడంతో, ఉత్సవ విగ్రహాలను కల్యాణ మంటపానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఉత్సవ విగ్రహాలనుంచిన వాహనం లేపడం సాధ్యపడడం లేదు. ఎంతో బరువనిపించింది. చివరకు ఏం చెయ్యాలో పాలుపోని నిర్వాహకులకు, అశరీర వాణి అసలు విషయం బయటపెట్టింది. తన భక్తుడు గోదావరిలో అలసటతో పడిపోయాడని, అతడిని తోడ్కొనిరమ్మని దాని సారాంశం. నిర్వాహకులు అలాగే చేసి కృష్ణ రాయలుగారిని తీసుకొచ్చారు. ఆయన వస్తూనే తన చేయి వాహనం మీద వేయడంతో అది తేలికగా వాహకులకు మోసేందుకు అనువుగా మారింది. కృష్ణరాయలెంత భక్తుడో అందరికీ అర్థమయిందప్పుడు.

కల్యాణోత్సవం అయిపోగానే, ఎప్పటిలాగే తిరుగు ప్రయాణమయ్యారు కృష్ణ రాయలుగారు. కొంచం దూరం వెళ్లింతర్వాత ఆయనకు తన ముందు ఒక రథం పోతూ కనిపించింది. దాన్ని చేరుకుందామని ఆయన చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. తన ముందు రథం-దాని వెనుక ఈయన గుర్రం వూరిపొలిమేరవరకు చేరుకున్నారు. ముత్తారం సమీపంలోకి చేరుతూనే-కృష్ణ రాయలుగారు చూస్తుండగానే ముందున్న రథం అదృశ్యమైపోయింది. మర్నాడుదయం జరిగిన విషయాన్నంతా గ్రామస్థులకు వివరించి, రథం అదృశ్యమైన ప్రదేశానికి సమీపంలో అన్ని వైపుల ఏదన్నా వుంటుందేమోనన్న ఆశతో గాలించారు. ఆశ్చర్యంగా కొంత దూరంలో, భద్రాచలంలోని రామాలయంలో వున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల లాంటి విగ్రహాలే కనిపించాయి వారికి. వామాంకంమీద సీత కూర్చున్న రీతిలో, భద్రాచల రాముడి విగ్రహాలు దొరకడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచించసాగారు.

ఆ రాత్రి కృష్ణ రాయలుగారి కలలో కనిపించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయనకు వయసు మీరడంవల్ల భద్రాచలం రావడం కష్టమవుతుందని భావించిన తానే ఆయన దగ్గరకొస్తున్నానని, ముత్తారంలో తనకు గుడి కట్టించి యథావిధిగా పూజలు జరిపించమని చెప్పాడు. ఆయన ఆదేశానుసారం కృష్ణ రాయలుగారు ముత్తారం రామాలయాన్నీ-పక్కనే శివారు గ్రామమైన వనం వారి కృష్ణాపురాన్నీ నిర్మించారు. కృష్ణ రాయలుగారు నిజమైన భక్తుడై నందునే రాముడు ఆయనున్న చోటికి పోయాడు. అంటే భగవంతుడిని మనం వెతుక్కుంటూ పోవాల్సిన పనిలేదు. భక్తి మనలో వుంటే భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడనడానికి అదొక నిదర్శనం.
భద్రాచలం రామాలయం కట్టిన కొన్నాళ్లకు ముత్తారం రామాలయం కూడా కట్టబడింది. అయితే మూడు-నాలుగువందల సంవత్సరాల క్రితపు కట్టడమై నందువల్ల శిథిలావస్థకు చేరుకుంది. గత ఐదారు ఏళ్లలో మరీ శిథిలమై గర్భగుడిలోకి వర్షపు నీరుకూడా వచ్చే స్థితి కలగడంతో గ్రామస్థులంతా ఆలయాన్ని పునర్నిర్మించేందుకు నడుంకట్టారు. అయితే అన్ని గ్రామాల్లో లాగానే, మా వూళ్లోనూ రాజకీయాలున్నాయి- వర్గాలున్నాయి-ఈర్షాసూయలున్నాయి. మా ఇంటి పేరున్న ఈతరం రామ భక్తుడు, వరసకు బాబాయి, వనం గోపాలరావు ఆలయ పునరుద్ధరణకు అంకితమైన వారిలో ముఖ్యుడు. నేనేమో హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా నివసిస్తుండడంతో, ప్రతినెలా మా వూరికి పోయి వస్తున్నప్పటికీ, గుడి కట్టించే విషయంలో చూపించాల్సిన శ్రద్ధ చూప లేకపోయాను. అయితే ఆలయ నిర్మాణం కేవలం మానవ సంకల్పమే అయితే ముందుకు సాగక పోవచ్చు గాని, దైవ సంకల్పం అయితే దాన్ని ఆపేవారుండరనేది అనుభవపూర్వకంగా జరిగింది ముత్తారం దేవాలయం విషయంలో. మా పూర్వీకులు కట్టించిన ప్రాచీన దేవాలయ పునర్నిర్మాణానికి, పరోక్షంగా నాలో జొరబడి, నా వంతు సేవ చేసే అవకాశమిచ్చాడు భగవంతుడు.

మా నాన్న వనం శ్రీనివాసరావు గారు పదేళ్ల క్రితం చనిపోవడానికి మూడు రోజుల ముందర మా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సందర్భం వచ్చిన ప్రతి చోట అవి ప్రస్తావించాల్సిన అంశాలు.
          నాన్నగారిని గురించి నాకు తెలిసినంతవరకు: బాల్యం తిరిగొచ్చినా రావచ్చునేమోగాని, బాల్యంలో నా వరకు నేననుభవించిన భోగభాగ్యాలు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందే. ఆ జ్ఞాపకాలలోనే మా నాన్నగారి చిన్నతనం, ఆయన అనుభవించిన అష్టకష్టాలు, ఆ కష్టాల్లో ఆయనకు లభించిన అండదండలు, అవన్నీ నెగ్గు కొచ్చి-నిలదొక్కుకొని మా వూళ్లో-చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, సొంత వూళ్లోని గ్రామపెద్దలతోనూ-కరిణీకం చేస్తున్న అమ్మపేట గ్రామ పెద్దలతోనూ అవసరం మేరకే ఆయన వ్యవహరించిన తీరు, రాజకీయాలకు దూరంగా వుంటూనే గ్రామ రాజకీయాల్లో తన పలుకుబడికున్న విలువ నాయకులకు తెలియచేయడం, పొరుగూర్లో వున్న పెదనాన్నగారితో ఆయన మెలిగిన విధానం-తర తరాల వైరం మరిచిపోయేందుకు అందించిన స్నేహ హస్తం-స్నేహ ధర్మం తప్పిన ఆయనపై నాన్న గారి తిరుగుబాటు-సాధించిన తిరుగులేని విజయం, పురాతన-ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవసరాలకనుగుణంగా ఆయన ఆచరణలో పెట్టిన విధానం, తప్పని పరిస్థితుల్లో అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న ఆయనే స్వయంగా ముల్లుగర్ర చేతిలో వుంచుకొని-నాగలి పట్టిన వైనం లాంటివెన్నో ఎల్లప్పుడూ మదిలో మెదులుతూనే వుంటాయి. ఇక ఆయన దైవభక్తి, భారత భాగవత రామాయణాలను పారాయణం చేయడం, అనుష్టానం చేసే విధానం, అమ్మపేట-ముత్తారం దేవాలయాల్లో ఆయన నిర్వహించిన పాత్ర, పట్వారీ హోదాలో జిల్లా ఉన్నతాధికారులతో ఆయనకున్న సత్సంబంధాలు-వారు ఆయనకిచ్చిన గౌరవం ఎప్పుడూ గుర్తుకొస్తూనే వుంటాయి. ఇందులో కొన్ని విషయాలను నాన్నగారు చెప్తే తెలుసుకున్నాను-కొన్ని స్వయంగా చూసాను. నా చిన్నతనంలో నాన్నగారు గుర్రం స్వారీ చేస్తూ, తెల్లటి కమీజు ధరించి-ధోవతి కట్టి బయటకు వెళ్లడం-వెళ్తున్నప్పుడు గ్రామ వీధుల్లో అరుగులమీద కూచున్న వారందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం కూడా బాగా జ్ఞాపకం వుంది. ఆయన కమీజుకు పెట్టుకున్న బంగారపు గుండీలు కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత కాలంలో సైకిల్ పై వెళ్లేవారు కొన్నాళ్లు.
మా నాన్న చెప్పిన ముఖ్యమైన అంశాలలో రామాలయ ప్రస్తావన కూడా వుంది.
ప్రతిఏటా రామాలయంలో గోదాదేవి కల్యాణం జరిపించడం మన కుటుంబం చేయాల్సిన పనుల్లో ఒకటని, అది నేను కొనసాగించాలనీ, అది సక్రమంగా జరగాలంటే దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం (ఉత్సవ) ప్రతిష్టించాలనీ నాపై ఒక భాద్యతపెట్టారు నాన్నగారు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన అప్పగించిన పని చాలాకాలం వరకు నెరవేర్చ లేకపోయాను. ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణం. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఉద్యోగ విరమణ చేయడానికి కొన్నాళ్లక్రితం ఒక మిత్రుడి ప్రోద్బలంతో వాసు దాసుగారి సుందర కాండ మందరాన్ని "మందర మకరందం" గా లఘు కృతిలో రాసిన కొద్ది రోజులకే శ్రీరాముడి దయ నాపై అపారంగా కలిగింది. జీవితంలో ఊహించని విధంగా, పదవీవిరమణ చేసిన ఏ ఉద్యోగికీ లభించని రీతిలో నాకు మంచి వేతనంతో 108-అత్యవసర సహాయ సేవల సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆదాయం పెరిగి, అప్పులు తీరడం మొదలయింది. పిల్లలంతా ఎదిగి, ఉద్యోగాల్లో కుదుటబడి నెనెంతంటే అంత ఇచ్చేందుకు తయారయ్యే రోజులొచ్చాయి. సరిగ్గా అప్పుడే నాన్నగారు చనిపోయే ముందు అప్ప చెప్పిన భాద్యతను నెరవేరుద్దామన్న ఆలోచనొచ్చింది. అయితే ఆ ఆలోచనా క్రమంలో- ఆలోచన కార్యరూపం దాలుస్తున్న సందర్భంలో దేవాలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ జరుగనున్నదని ముందు నేనూహించలేదు.
2006 సంవత్సరం చివర్లో ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహం ప్రతిష్టించే ఆలోచన కార్యరూపం దాల్చడం మొదలైంది. మావూళ్లో మా పూర్వీకులనుండి సంక్రమించి, నాకింకా మిగిలిన ఆరెకరాలు వరి పొలాన్ని నా చిన్ననాటి స్నేహితుడు ఏటుకూరి నారాయణ కౌలు చేస్తుంటాడు ప్రతిసంవత్సరం. అతని సహాయంతో విజయవాడ సమీపంలో విగ్రహాన్ని తయారు చేయించి, 2007 లో ప్రతిష్టకు సన్నాహాలు చేశాం. ముత్తారం దేవాలయంలో పనిచేస్తున్న అర్చకుడు వాసు (శ్రీనివాసరావు) మహాపండితుడు. వేదాధ్యయనం చేసినవాడు. యువకుడు. ఆ చుట్టుపక్కల ఏ దేవాలయంలోనూ కళ్యాణోత్సవాలు చేయించగలవాడు కానీ, ప్రతిష్టలు చేయించగలవాడు కానీ, ఆగమశాస్త్రం తెలిసినవాడు కానీ లేరు. అందరు భుక్తికొరకు అర్చకత్వం చేస్తున్నవారే. వాసుకు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన అధ్వర్యంలో మూడు రోజులపాటు అంగరంగవైభోగంగా ముత్తారం దేవాలయంలో కృష్ణుడి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట విజయవంతంగా జరిగింది. మా కుటుంబం ఆ మూడు రోజులూ అక్కడే వున్నాం. వూరిపెద్దలు-చిన్నలు, విభేదాలు మాని ఏదో సమయంలో కార్యక్రమం చూడడానికి వచ్చారు. నాటి జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్, దేవాదాయ-ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు కూడా వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత దేవాలయ పునర్నిర్మాణ విషయంలో కొంత చర్చ జరిగింది.
మా గ్రామ సర్పంచ్ ముండ్ర అప్పారావు, మా బాబాయి వనం గోపాలరావు, దేవాలయ అర్చకుడు శ్రీనివాసరావు, ఇప్పటికీ ఇంకా వూళ్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న మా తమ్ముడు అప్పాజీ (శ్రీరామచంద్రమూర్తి), గ్రామంలోనే ఇటీవల వరకు వ్యవసాయం చేయించి ఆర్థిక ఇబ్బందులవల్ల హైదరాబాద్ చేరుకున్న మరో తమ్ముడు నరహరి కలిసి చేసిన ఆలోచనతో గ్రామస్తులలో పలుకుబడి కలిగిన వారందరూ దేవాలయానికి వచ్చారు. జీర్ణావస్థలో వున్న దేవాలయాన్ని ఎలా పునర్నిర్మించాలని అంతాకలసి ఆలోచన చేశాం. ప్రభుత్వం దగ్గర నుండి కొంత సహాయం పొందుదామనీ, విరాళాల రూపంలో కొంత వసూలు చేద్దామనీ నిర్ణయించాం. మా గ్రామంలో పుట్టి-పెరిగి, ఇంజనీరయ్యి, సంపాదనపరుడైన పరుచూరి ప్రసాద్ దేవాలయ పునరుద్ధరణకు పెద్దమొత్తంలో సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు. అయితే ఎలా-ఎవరికి నిర్మాణ పనిని అప్పగించాలనే విషయంలో సందిగ్ధత వుండడంతో వాయిదాపడుతూ వస్తున్నది. మరో వారంరోజుల తర్వాత మళ్లీ గుడిలో కలుద్దామనుకుని నిర్ణయించాం అప్పటికి.
ఆ రోజున సమావేశానికి వచ్చిన వారందరికీ, కృష్ణుడొచ్చిన వేళా విశేషంవల్ల రాముడికి కూడా కొత్త ఆలయం తప్పక వస్తుందన్న నమ్మకం కుదిరింది. నాకూ ఆనందం వేసింది. నా వంతు విరాళంగా లక్షా నూటపదహారు రూపాయలు ప్రకటించాను. మరుక్షణమే ఒకరి తర్వాత ఇంకొకరు తాహతుకు మించి విరాళాలు ప్రకటించారు. కొంద రైతే దేవాలయంలోని కొన్ని నిర్మాణాలకు పూర్తి ఖర్చు తామే భరిస్తా మంటూ ముందుకొచ్చారు. తర్వాత జరిగిన సమావేశానికి పర్చూరు ప్రసాద్ హాజరై, దేవాలయానికి సంబంధించిన మొత్తం నిర్మాణానికి అయ్యే వ్యయమంతా భరిస్తానని మాటిచ్చాడు.
2009 ఫిబ్రవరి నెలవరకల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. దేవాలయం పూర్తికావడానికి సర్పంచ్ అప్పారావు చేసిన కృషి నిజంగా అభినందించాలి. ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగవైభోగంగా, అశేష జనవాహిని మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఘనత అర్చకుడు వాసుగారి ది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా జరిగింది. ఉత్తర ద్వారం నిర్మాణంకూడా జరిగింది. పవళింపు సేవకు అద్దాలమేడ నిర్మాణంకూడా జరిగింది. సుమారు 50లక్షల రూపాయల వ్యయంతో చుట్టు పక్కల ఏ గ్రామంలో లేనంత గొప్ప దేవాలయం-రామాలయం మా ముత్తారంలో నిర్మించబడింది.
భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, ముత్తారంలో కూడా కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలనుండి వేలాది భక్తులు ఆ వేడుకను చూసేందుకు తరలి వస్తారక్కడికి. భద్రాచలంలో మధ్యాహ్నం జరిగే కళ్యాణోత్సవం, ముత్తారంలో సాయంత్రం జరుగుతుంది. గోదాదేవి కళ్యాణం భోగి రోజున జరుగుతుంది. సాధ్యమయినంతవరకు ఈ రెండు కార్యక్రమాలకు హాజరవుతుంటాం. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు-జరిగిన తర్వాత దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి.
పల్లెటూళ్లల్లో ఆ సందడిని "తిరునాళ్లు" అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. ముత్తారం దేవుడి పెళ్లిలో మా పక్క గ్రామంలో నివసించే మా దాయాదులు, వరుసకు పెదనాన్న గారైన వనం శ్రీరాం రావుగారి కుటుంబమంతా వచ్చేది. అందరం కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకాలు.


Tuesday, January 24, 2012

ఈ మంత్రివర్గ విస్తరణ...సి. ఎం. కు ప్లస్సా, మైనస్సా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (19-01-2012)
వనం జ్వాలా నరసింహారావు
(ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి; మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి స్వేచ్ఛ అవసరం; మధ్యేమార్గం పార్టీకి శ్రేయస్కరం కాదు; పద్ధతి మార్చుకోవాల్సిన అధిష్టానం; అప్పుడే రాష్ట్రంలో పార్టీకి గౌరవం....ఎడిటర్)


సమిష్టి బాధ్యతారాహిత్యానికి, సమన్వయ లోపానికి నిలువెత్తు నిదర్శనమైన రాష్ట్ర మంత్రి మండలిలో మరో ఇద్దరు-ముగ్గురు చేరవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కష్ట కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్షానికి అండగా నిలిచిన నాటి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు చిరంజీవి అనుయాయులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని, వారీపాటికే బంధు మిత్రులకు తమ ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ ఆహ్వానాలు కూడా పంపారని, మీడియాలో కబుర్లొచ్చాయి. సర్వసాధారణంగా మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పాల్సిన ముఖ్యమంత్రికి బదులుగా, ఆ విషయాన్ని, తాజా కాంగ్రెస్ నాయకుడు-మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి ప్రకటించడం కొంత ఎబ్బెట్టుగా వున్నప్పటికీ, వార్త బయటకు పొక్కడానికి మాత్రం ఆయనదే బాధ్యత అనాలి. అసలాయనకు వారిద్దరిమీదనే ఎందుకంత ప్రేమ అన్నది అంతుచిక్కని విషయం. ఇక వారిద్దరిలో కనీసం ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లోను, మంత్రిపదవి దక్కకుండా చేయాలని, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి మాట నెగ్గేలా చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగితే, ఆయనకు వ్యతిరేకంగా, కొందరు మంత్రివర్గ సభ్యులతో సహా కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, పలు ఎన్నికల బహిరంగ సభలలో అశేష జనాన్ని ఆకర్షించి, ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చిరంజీవికి ఆ కోరిక నెరవేరలేదు. పోనీ పార్టీని బతికించుకుని, కనీసం వచ్చే ఎన్నికల నాటికన్నా, మళ్ళీ తన కోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో వున్నాడా అంటే, అదీ చేయలేకపోయాడు. నెత్తిమీద కుంపటి దించుకుని, పార్టీని-పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందన్న ఆశలు పెంచుకుంటున్నాడు. అదిప్పట్లో నెరవేరే అవకాశం లేనప్పుడు, తన అనుయాయులకు రాష్ట్ర మంత్రి మండలిలో స్థానం కలిపించమని అడిగే బదులు, తానే రాష్ట్ర మంత్రివర్గంలో చేరకూడదా? రాష్ట్ర మంత్రి పదవి తన స్థాయికి తగదనుకుంటున్నాడా? లేక, ఏకంగా కేంద్రమంత్రిగా నో, అవకాశం చిక్కితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నో కావాలని కలలు కంటున్నాడా? మించిపోయిందేమీ లేదు! తాను చేరదలుచ్కున్నట్లు ముఖ్యమంత్రికి, గులాంనబీ ఆజాద్‌కు సంకేతం ఇచ్చి, అటు కిరణ్‌కుమార్‌కు, ఇటు బొత్స సత్యనారాయణకు కొంత ఊరట కలిగించడం మంచిది. కడప కాంగ్రెస్ నాయకులకూ మంచిది కూడా!


ఏదేమైనా, కాంగ్రెస్ రాజకీయం, ఎక్కడ జరగాలో అక్కడికే మళ్లీ చేరింది. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ రాజకీయాలెప్పుడూ ఢిల్లీలోనే జరుగుతాయి. మధ్య-మధ్య రాష్ట్ర రాజధానికి, అప్పుడప్పుడూ జిల్లాలకూ చేరుకుంటాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో సంప్రదింపులకు ముఖ్యమంత్రి ఢిల్లీకి చేరుకునే లోపునే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లడం గులాంనబీ ఆజాద్‌తో మాటామంతీ జరపడం జరిగిపోయాయి. చెరో మాట అనడంతో, సీను సోనియాగాంధీ దగ్గరకు మారింది ప్రస్తుతానికి. ఫలానావారికి మంత్రివర్గంలో చోటు దక్కనుందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఇంతకూ విస్తరణా? పునర్వ్యవస్థీకరణా? చిరంజీవి చెప్పినట్లు కేవలం ఆ ఇద్దరికి మాత్రమే చోటు కలిగించడమా? ముఖ్యమంత్రికి-సహచర మంత్రివర్గ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒకరిద్దరికి మాత్రమే ఉద్వాసనా? శాఖల్లో సమూలంగా మార్పులు-చేర్పులా? అనే విషయమన్నా ఈ సారి తేలుతుందేమో చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ రాబోయే ఉపఎన్నికలలో, అలానే 2014 ఎన్నికలలో పరువు-ప్రతిష్టలతో బయట పడాలంటే, కనీసం గౌరవప్రదమైన ప్రతిపక్షంగానన్నా ఎన్నికవాలంటే, అధిష్టానం తన పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం వుంది. ఏ అధిష్టానమైతే, కనీసం ఒక్కసారన్నా మంత్రిపదవి అనుభవం పొందని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో పెట్టిందో, అదే అధిష్టానం, ఆయనా పీఠం మీద పటిష్టంగా వుండడానికి చర్యలు తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తరువాత అనేక సమస్యలను ఢీ కొన్నప్పటికీ, తడబడుతూ అడుగులు వేసినప్పటికీ, గత ఏడాది కాలంలో, కష్టాల కడలిని అధిగమించు తూ, ఆత్మ విశ్వాసంతో ముందుకు పోతున్నారనే ది వాస్తవం. అలాంటప్పుడు, ఆయనను బలపర్చాల్సిన అధిష్టానం, సమాంతరంగా దానికి విరుద్ధంగా ఏ చర్యను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రోత్సహిస్తే నష్టం పార్టీకే! అందుకే, తప్పో-ఒప్పో, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పూర్తిగా కాకపోయినా, పరిమిత మోతాదులోనన్నా స్వేచ్ఛ ఇవ్వాలి. అధిష్టానం అభీష్టం మేరకు, ఢిల్లీ నాయకులు చెప్పిన ఒకరిద్దరికి మంత్రి మండలిలో స్థానం కలిగించమని కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించడంతో సహా, ఆయన కావాలనుకున్న "టీం" ను ఏర్పాటు చేసుకునే వీలు కలిగించాలి. ఆయన తొలగించాలనుకుంటున్న మంత్రులను, అధిష్టానం దృష్టిలో ఏదో ఒక ప్రత్యేకమైన కారణం వుంటే తప్ప, అలా చేసే వీలు కిరణ్ కుమార్ రెడ్డికి కలిగించాలి. అవసరమైతే, అల నాడు అంజయ్య విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన విధానాన్నే, నేడు సోనియాగాంధీ కూడా పాటించి తీరాలి. హైదరాబాద్ రావాలి. వచ్చి ఆయనకు మద్దతుగా తానూ-తన అధిష్టానం నూటికి-నూరు పాళ్లు వుందన్న సంకేతాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వారిని తొలగించనన్నా తొలగించాలి-లేదా-తప్పు ముఖ్యమంత్రి దే అని భావిస్తే తదనుగుణంగా చర్యలన్నా చేపట్టాలి. మధ్యేమార్గం మంచిదికాదు. పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.


ఈ నేపధ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సహా, చిన్నా-చితకా పార్టీలు కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ, ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు, ఏదో ఒక పేరుమీద యాత్ర చేపట్టడమో, పనిగట్టుకుని ప్రత్యర్థుల మీద దాడికి దిగడమో, లేదా ఎదురుదాడి చేయడమో, అదేమీ కాకపోతే టెలివిజన్ ఛానళ్ల పుణ్యమా అని చర్చలలో పాల్గొన్నప్పుడు అందివచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా, తమ-తమ వ్యూహాలను కాసింత బహిర్గతం చేయడమో గమనించాల్సిన విషయం. గతకొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు సమన్వయ కమిటీ ఏర్పాటు; తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు పోరుబాట; జగన్ రైతు దీక్షా శిబిరం; తెరాస-ఐకాస సమైక్యతా వాదుల యాత్రలను అడ్డుకునే ప్రయత్నాలు; భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయడం అనే విషయాలు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అధిష్టానం నియమించిన సమన్వయ కమిటీ సాధించిదేమిటో కాని, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు-కుమ్ములాటలు మాత్రం బహిర్గతం అయ్యాయి. కిరణ్‍కూ, బొత్సకూ; ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విభేదాలున్న ట్లు స్పష్టమైనాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొందరు గులాంనబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేస్తే, బొత్సను అడ్డుకునే ప్రక్రియకు కిరణ్ శ్రీకారం చుట్టారనుకుంటున్నారు. కొందరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, విడతలవారీగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలను (సూర్య దినపత్రిక) ప్రముఖంగా ప్రచురించారు. వారికి కొందరు ఎంపీల మద్దతుకూడా వుందని అంటున్నారు. ఇదంతా గమనించిన ఆజాద్‌కు ఆగ్రహం కూడా కలిగిందట. ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ ఎంత సీరియస్‌గా వుంటుందో కాని, ప్రతిపక్షాలు మాత్రం ఒక కన్నేసి వుంచాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సడలిందని ప్రచారం చేయసాగాయి. ప్రజా సమస్యలను ఆయన అసలే పట్టించుకోవడం లేదని ఆరోపించాయి. ముఖ్యంగా రైతు సమస్యలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజం ఎత్తాయి. చివరకు మీడియా కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపాయి.


ఇందులో భాగంగా, ఒకానొక పాపులర్ టెలివిజన్ ఛానల్, రైతు ఆత్మహత్యలపై-సమస్యలపై, అన్ని రాజకీయ పార్టీల-రాజకీయేతర ప్రముఖుల-పాత్రికేయుల-సామాజిక కార్యకర్తల సమక్షంలో, వారి భాగస్వామ్యంతో ఒక ఆసక్తికరమైన గోష్టిని నిర్వహించిందిటీవల. గోష్టిలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్నో ఆసక్తికరమైన, ఆలోచనలను రేకెత్తించే అంశాలను తెరమీదకి తెచ్చారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో గ్రామీణ-వ్యవసాయదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ బహిర్గతం చేసిన విషయాలను ప్రభుత్వం పట్టించుకుని తీరాల్సిందే. వెలుగులోకి వస్తున్న రైతు ఆత్మహత్యలను, సాధారణ ఆత్మహత్యలుగా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతి మూడు గంటలకు దేశవ్యాప్తంగా సంభవిస్తున్న చోటుచేసుకుంటున్న ఆరు రైతు అత్మ హత్యలలో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినదే అని ఆయన అన్నారు. మద్దతు ధర లేక, సాంప్రదాయ పద్దతులకు స్వస్తి పలికిన నేపధ్యంలో, పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడం వల్ల కూడా రైతు ఆత్మహత్యలు సంభవిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు. మరి ఈ నేపధ్యంలో, చంద్రబాబు నాయుడు చేపట్టిన రైతు పోరుబాట కాని, జగన్ రైతు దీక్షా శిబిరం కార్యక్రమం కాని, ఎంతవరకు రైతు సమస్యలను ప్రతిబింబించాయో ప్రశ్నార్థకమే!
          
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని భావనలో వున్న కిరణ్ కుమార్ రెడ్డికి, అందుకే, అధిష్టానం మరింత మద్దతు ఇవ్వాలి. రైతు సమస్యలతో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పార్టీపరంగా ఆయనకు వ్యతిరేకతను తగ్గించాలి. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే ఈ విషయాలపై అధిష్టానం దృష్టి సారించాలి.


(ఈ ఆర్టికల్ 18-01-2012, మంత్రివర్గ విస్తరణ జరుగవచ్చన్న ఊహాగానాలకు పూర్వం రాసింది)

Wednesday, January 11, 2012

సిపిఎం ఆవిర్భావ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు


జనవరి 11, 12 న హైదరాబాద్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో


సూర్య దినపత్రిక (12-01-2012)


వనం జ్వాలా నరసింహారావు

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో (జనవరి 3, 4 తేదీల్లో) జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పార్టీ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరగనున్న నేపధ్యంలో కీలకమైన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పార్టీకి నూతన కార్యదర్శిని ఎన్నుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ఖమ్మం పట్టణంలో ప్రముఖ ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్ర-"తీపి గుర్తులు-చేదు అనుభవాలు" లో పేర్కొన్న పార్టీ ఉమ్మడి మహాసభలు, పార్టీలో చీలిక, సిపిఎం ఆవిర్భావం లాంటి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను గురించి, ఆ పుస్తకాన్ని గ్రంధస్థం చేసిన రచయితగా పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది. 

ఏబై మూడు సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ మహాసభ, 1958 డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు. 7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు. అజయ్ ఘోష్ తన ప్రసంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు. నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు ఆకర్షించాయి. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్‌కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, రణదివేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం దరిమిలా అజయకుమార్ ఘోష్‌ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.

అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‌సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించింది జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషిలు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‌గా నియమించింది.

సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగా లేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ  కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో సహితం ఉత్సాహవంతులైన కొందరు యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో బత్తుల వెంకటేశ్వరరావు లాంటి వారు తొలినాళ్లలోనే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో

Tuesday, January 10, 2012

“తెలంగాణ మార్క్సిస్టు సవ్యసాచి” ఖమ్మం జిల్లా రావెళ్ల సత్యం: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

సుమారు ఐదు దశాబ్దాల అనంతరం రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో జరుపుకునే ఏర్పాట్లలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తలమునకై వుంది.
ఖమ్మం జిల్లాలో (1964 లో) మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించిన తరువాత, పార్టీ పరంగా, బహు ప్రజా సంఘాల, రాష్ట్ర స్థాయి-అఖిల భారత స్థాయి మహాసభలు నిర్వహించినప్పటికీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా వున్న రోజుల్లో నిర్వహించిన రాష్ట్ర మహాసభలు తప్ప ఇంతవరకూ సిపిఐ(ఎం) ఒక్క సారికూడా రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరుపుకోలేదు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాముఖ్యత సంతరించుకున్న ఇతర సభలు ఎన్నైనా పేర్కొనవచ్చు. రాష్ట్ర ఎస్.ఎఫ్.. రెండో మహా సభలు ఖమ్మంలో 1967 జనవరి 2-7 తేదీలలో జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ కార్మిక మహా సభలు 1980 నవంబర్ లో జరిగాయి. ఆ నాటి పశ్చిమ బెంగాల్ రెవెన్యూ మంత్రి బినయ్ కృష్ణ చౌదరి, సుందరయ్య, కేరళ నుండి చాతున్నిమాస్టర్ హాజరయ్యారు. 1977 ఆగస్టులో యు.టి.ఎఫ్ రెండవ రాష్ట్ర మహా సభలు జరిగాయి. ఆ నాటి కేంద్ర విద్యామంత్రి ప్రకాశ్ చంద్ర చందుర్ హాజరయ్యారు. 1985 ఏప్రిల్ లో రాష్ట్ర ప్రజా నాట్య మండలి తృతీయ మహా సభలు జరిగాయి. రాష్ట్ర రైతు మహా సభలు 1986 ఏప్రిల్‍లో జరిగాయి. నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి జ్యోతి బసు, బసవ పున్నయ్య హాజరయ్యారు. 1989 ఏప్రిల్ లో అఖిల భారత రైతు మహా సభలు పెద్ద ఎత్తున జరిగాయి. కేరళ ముఖ్య మంత్రిగా వున్న ఇ. కె. నాయనార్ హాజర్ అయ్యారు. 1996 నవంబర్ 2-4 తేదీలలో నాలుగవ అఖిల భారత వ్యవసాయ కార్మిక మహా సభలు ఖమ్మంలో జరిగాయి. ఈ విషయాలన్నీ సిపిఎం పార్టీ నుంచి ఎన్నికైన మాజీ రాజ్యసభ సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమ నాయకుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవిత చరిత్ర (ప్రచురణకు సిద్ధంగా వున్న) "అనుభవాలే అధ్యాయాలుగా" లో విపులంగా పేర్కొనడం జరిగింది. పలు సభలకు ఆహ్వాన సంఘ అధ్యక్షుడుగా నో, అనువాదకుడుగా నో, కీలక నిర్వాహకులలో ఒగరుగానో డాక్టర్ హాజరయ్యారు.
జిల్లా-రాష్ట్ర వ్యాప్తంగా రైతు-కూలీ ఉద్యమాలకు, గ్రామాలలో భూస్వాముల వ్యతిరేక పోరాటాలకు, ఆరణాల కూలీలకు-అధిక వడ్డీలకు-మేరల పెంపుకు-కుల వివక్షతలకు-దళిత-వెనుకబడిన వర్గాల ఐక్య ఉద్యమాలకు, పౌరహక్కుల ఉద్యమాలకు, ప్రభుత్వ మాన్యాలను-బంచరాయి భూములను పేదల స్వాధీనం చేసే ఉద్యమాలకు  ఏనాడో దూరమైన కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), ఒక్క సారి ఆ ఉద్యమ స్పూర్తి దాయకులైన ఖమ్మం జిల్లా వారిని కొందరినైనా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మంచిదేమో!
మార్క్స్-లెనిన్ నీతి సూత్రాలను నిబద్ధతతో పాటిస్తూ, వాటిని అమలు పెట్టడంలో స్థిర చిత్తుడుగా వుంటూ, ఎటువంటి బెదిరింపులకు-బలప్రయోగాలకు లొంగకుండా, ఆజన్మాంతం మంచి కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న అరుదైన వ్యక్తి ఖమ్మం జిల్లా గోకినేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ రావెళ్ల సత్యం. అనుక్షణం బీదా-బిక్కీ మధ్య మెదలాడుతూ, తెల్లటి ముతక బట్టల పంచె-అంగీ-పైన తెల్ల పచ్చ గళ్ల కండువా ధరించిన, ఒంటి చేతి చెట్టంత ఎత్తు పెద్దమనిషి సత్యం గారు. తన చిన్నతనంలో మామిడి చెట్టు ఎక్కి కిందపడినప్పుడు, చేతికి తగిలిన తీవ్రమైన దెబ్బ మూలాన, కుడి మోచేతి వరకు తొలగించాల్సి వచ్చింది. అలా ఒంటి చేత్తోనే, మరణించేంతవరకు, సవ్యసాచిలా కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని ఖమ్మం జిల్లాలో సమున్నతంగా నిలబెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. పన్నెండేళ్ల వయసులో, పొరుగూరు కమలాపురంలో వున్న బాబాయి వనం నరసింగరావును కలవడానికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా, రావెళ్ల సత్యంను, 1959 సంవత్సరంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చూడడం తటస్థించింది. ఆ తరువాత పరిచయం చేసుకున్నాను కొన్నాళ్లకు. ఎన్నికలలో కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకునే ప్రక్రియలో భాగంగా ప్రచారం కొరకు చుట్టుపక్కల గ్రామాలలో తిరుక్కుంటూ అక్కడకొచ్చారాయన. అప్పట్లో "జోడెద్దుల" కాంగ్రెస్ గుర్తుకు, "చేతి" గుర్తున్న కమ్యూనిస్టులకు మధ్యనే ప్రధాన పోటీ. అల నాడు ఆయన ప్రచారం చేసిన కమలాపురం గ్రామంలో, కమ్యూనిస్టు అభ్యర్థుల మీద పోటీ చేసిన బడా భూస్వాములకు సైతం ఒక్క టంటే ఒక్క ఓటు కూడా పడని వార్డులున్నాయంటే, అది రావెళ్ల సత్యం గొప్పదనంగానే భావించాలి.

1959 నాటికి స్వాతంత్ర్యం వచ్చి పన్నెండేళ్లు అయింది. ఐనా, ఓటర్ల జాబితాలో, మహాత్మా గాంధీ ఆశయమైన హరిజనోద్ధరణకు విరుద్ధంగా, దళితుల పేర్ల చివర "గాడు" చేర్చేవారు. "పుల్లిగాడు" సన్ ఆఫ్ "మల్లి గాడు" అని వుండడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వారిలో ముఖ్యుడు రావెళ్ల సత్యం. బహుశా ఆయన లాంటి వారు చేసిన ఉద్యమ ఫలితంగానే, దరిమిలా పేర్ల చివర "గాడు" తగిలించడం మానుకుంది ప్రభుత్వం. రావెళ్ల సత్యం కృషి ఫలితంగా ఖమ్మం సమితి కింద వున్న అనేక గ్రామాలలో కమ్యూనిస్టు అభ్యర్థులు గెలుపొందడం, పంచాయితీ సమితిని పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది. అదనంగా మెరికలలాంటి కార్యకర్తలను కూడా తయారుచేయగలిగారాయన. ప్రగల్భాలను, దూషణ-భూషణలను, పదవీ వ్యామోహాలను, ధన దాహాలను దరికి రానీయని ఈ నిష్కళంక కమ్యూనిస్టు యోధుడు, పుచ్చలపల్లి సుందరయ్యకు ప్రియ శిష్యుడు.

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినేపల్లి గ్రామం సాయుధపోరాట కమ్యూనిస్టు వీరులకు, స్వాతంత్ర్య సమరయోధులకు పుట్టిల్లు. స్వర్గీయ మచ్చా వీరయ్య లాంటి కామ్రేడ్స్ నాయకత్వంలో ఆ గ్రామానికి చెందిన అనేకమంది కార్యకర్తలు వీర తెలంగాణ విప్లవ సాయుధ తిరుగుబాటులో పాల్గొని, నిజాం నవాబుకు వ్యతిరేకంగా-రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. అలా పోరు సలిపినవారిలో రావెళ్ల సత్యం ఒకరు. వీర తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రపుటల్లో చిర స్థాయిగా నిలిచింది. నూనూగుమీసాల లేత వయసులోనే, వైవాహిక బంధాన్ని కూడా లెక్క చేయకుండా, వున్న ఒక్క చేతితో తుపాకి పట్టుకుని, బుల్లెట్లు సంధించిన థీశాలి రావెళ్ల. 1945-1946 మధ్య కాలంలో, ఉర్దూలో ప్రాధమిక విద్యాభ్యాసం ముగించుకున్న రావెళ్ల సత్యం, ఇతరులకు సహాయపడేందుకు, తన ఇంటి ఆవరణలోని పశువుల పాకలో ఒక పాఠశాలను నిర్వహించేవారు. చివరకు అదే కమ్యూనిస్టు పార్టీకి అడ్డగా మారింది. అలా ఆరంభమైన ఆయన కమ్యూనిస్టు జీవన యానం, 1945-1948 మధ్య కాలంలో, పొరుగునున్న కృష్ణా జిల్లా మలకాపురం సరిహద్దు కాంపుకు చేరుకుని, సమరయోధుడుగా శిక్షణ పొంది, పై కమిటీ ఆదేశాల మేరకు అజ్ఞాతవాసానికి పోయేటట్లు చేసింది. అజ్ఞాతంలో వుండగానే కృష్ణా జిల్లా సరిహద్దులో అరెస్టు కాబడి, మద్రాస్ రాష్ట్రంలోని కడలూరు సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. జైల్లో, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, మోటూరు హనుమంతరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో కామ్రేడ్ రాయల వీరయ్య కూడా నిర్బంధంలో వుండేవారప్పుడు. కడలూరు జైలులో ఆయన నిర్బంధంలో వున్నప్పుడు, ఒకరోజు జైలులో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో, తోటి డిటెన్యూ రాయల వీరయ్య చేతి వేళ్లు తెగిపోయాయి. 1951 డిసెంబర్ నెలలో, మొదటి సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత, సహచర డిటెన్యూలతో పాటు రావెళ్ల కూడా విడుదలయ్యారు. జైలునుంచే ఆయన సరాసరి ఎన్నికల ప్రచార సమరంలోకి దూకారు. 

అప్పట్లో ద్విసభ్య నియోజక వర్గాల ఆనవాయితీ వుండేది. వాటిలో ఖమ్మం ఒకటి. ఆ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, సంచీ చేతబట్టుకుని, సుమారు రెండు నెలల పాటు, ఒంటరిగా తిరిగారు రావెళ్ల. ఇంకా అప్పటికి, ప్రభుత్వ నిర్భంద ఛాయలు ప్రజలను భీతావహులను చేస్తూనే వున్నాయి. పలువురింకా నిజాం జైళ్లలో మగ్గుతూనే వున్నారు. కొందరప్పటికీ, అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. వయోజనులకు అదే మొదటి ఓటింగ్. కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తల కొరత కొట్టొచ్చినట్లు కనబడేది. అన్ని లోటులనూ రావెళ్ల పూరించారు. తానే ఆన్నీ అయ్యారు. ఎన్నికల ఫలితాలలో విజయం పార్టీ పరమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఇంకా సడలించనందున, పి.డి.ఎఫ్ (పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్) పేరుతో, చేతి గుర్తుతో, ఖమ్మం ద్విసభ్య నియోజకవర్గం నుండి పోటీలోకి దిగిన కమ్యూనిస్టు అభ్యర్థులిద్దరూ గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా స్వర్గీయ నామవరపు పెద్దన్న, జనరల్ అభ్యర్థిగా కర్నాటి కృష్ణయ్య భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం, అనారోగ్యానికి గురైన రావెళ్ల సత్యం, హైదరాబాద్ ఎర్రగడ్డ క్షయ ఆసుపత్రిలో చేరి, స్వస్థత చేకూరగానే, ఖమ్మం చేరుకుని, పార్టీ పూర్తికాలం ఆర్గనైజర్‌గా పనిచేయడం ప్రారంభించారు. 1960 లో ఖమ్మం జిల్లా మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేసి సహకార ఉద్యమానికి పేరు-ప్రతిష్టలు తేవడమే కాకుండా, రైతుబాంధవుడని పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలం ఖమ్మం జిల్లా సహకార బాంక్ ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేశారు. 1964 లో పార్టీ చీలిపోయినప్పుడు, సిపిఎం పక్షాన వుండి, ఆ సంవత్సరం మిగతా నాయకులతో పాటు నిర్బంధానికి గురై, 16 మాసాల పాటు హైదరాబాద్ సెంట్రల్ జైలు జీవితం గడిపారు. నాయకుల నిర్బంధాలతో కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలను ఆపలేమని భావించిన ప్రభుత్వం, అందరు డిటెన్యూలతో పాటు 1966 మే నెలలో రావెళ్ల సత్యంను కూడ విడుదల చేసింది. పార్టీ చీలిపోయినా, రావెళ్ల లాంటి వారి చొరవతో, పెద్దగా సిపిఎంకు నష్టం జరగలేదు. 1967 సాధారణ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఖమ్మం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచారు.

రావెళ్ల సత్యంకు ఏ పని అప్ప చెప్పినా కార్య దక్షతతో చక్కదిద్దేవారని పేరుండేది. కిచెన్ మేనేజ్‌మెంటులో కడు నేర్పరి. కడలూరు జైలులోను, హైదరాబాద్ సెంట్రల్ జైలులోను అదే డ్యూటీ ఇచ్చారాయనకు. సెంట్రల్ జైలులో రోజువారీ వంట సరుకులు-కూరగాయలు కొని తేవడం, దగ్గరుండి వండించి వడ్డించడం ఆయన చాలా పకడ్బందీగా నిర్వహించేవారని, అదే జైలులో డిటెన్యూగా వున్న ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరహక్కుల ఉద్యమ నాయకుడు డాక్టర్ వై. రాధాకృష్ణ మూర్తి చెప్తుండేవారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి జిల్లా-రాష్ట్ర-అఖిల భారత పార్టీపరమైన మహాసభలకు వంటశాల నిర్వహణ బాధ్యత ఆయనకే అప్ప చెప్పేవారు. ప్రతి పైసాకి జమా ఖర్చులు రాసేవారు. ఎల్లవేళలా, పాకెట్ సైజు అకౌంటు పుస్తకం, చిన్న పెన్ను, ముతక చొక్కా పక్క జేబులో ఒక చైన్ కీ గడియారం ఆయన దగ్గరుండేవి. ముత్యాలలాంటి దస్తూరీతో అకౌంటు పుస్తకంలో ఎప్పటి లెక్కలప్పుడే రాసే అలవాటుండేది ఆయనకు. గ్రామాలలో తిరగని ప్రతి దినం, ఉదయాన్నే గోకినేపల్లి నుంచి బస్‍లో ఖమ్మం వచ్చి, పార్టీ పనులన్నీ చక్కదిద్దుకుని, తిరిగి రాత్రికి బస్సు ఎక్కి ఇంటికి చేరుకునేవారు. అలా ఒకరోజు ఇంటికెళ్తున్నప్పుడు, ఆదమరిచి వున్న సమయంలో ఎవరో ఆయన గడియారాన్ని తస్కరించారు. పరధ్యానానికి ఆమడ దూరంలో వుండే రావెళ్ల, ఆ రోజున, కేరళ కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ మరణించాడన్న తప్పుడు వార్త వినడంతో అలా అయిపోయారు. గడియారం పోయినందుకు చాలా మనోవేదనకు గురయ్యారు రావెళ్ల.

1964 సంవత్సరం నాటికి, రెండు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఒకవైపు స్థానిక సంస్థల కింద వుండే గ్రామ పంచాయితీలకు-సమితులకు మెరుగైన అధికారాలున్నప్పటికీ, రాజకీయపరమైన వివక్షలు-కక్షలు-కార్పణ్యాలు తీవ్రంగా వుండేవి. కాంగ్రెస్ గుప్పిట్లో వున్న ఖమ్మం పంచాయితీ సమితి పరిధిలోని గ్రామాలలో అనేక రకాల వేధింపులకు ప్రజలు గురవుతుండేవారు. గ్రామాలలో రైతు, కూలీల బ్రతుకులు దుర్భరంగా వుండేవి. దానికి తోడు అతివృష్టి, అనావృష్టి సమస్యలుండేవి. భూస్వాముల, ధనికుల ప్రత్యక్ష-పరోక్ష దోపిడీ కొనసాగేది. సరైన రహదారి సౌకర్యం వుండకపోయేది. విద్యుత్ సౌకర్యం వున్న గ్రామాలు ఏ ఒకటి-రెండో మాత్రమే. ఆ రోజులు నిజాం పాలనకు నకలంటే అతిశయోక్తి కాదేమో! ఆ నేపధ్యంలో రావెళ్ల సత్యం సారధ్యంలో, స్థానిక మార్క్సిస్టు నాయకులైన గండ్లూరి కిషన్‌రావు (సమితి మాజీ ఉపాధ్యక్షుడు), తాళ్లూరి వైకుంఠం, బాజి హనుమంతు (మాజీ ఎమ్మెల్యే), వనం నరసింగరావు (పాలేరు సహకార చక్కెర కర్మాగారం మాజీ అధ్యక్షుడు), చుట్టు పక్కల గ్రామాలలోని రైతు-కూలీ సమస్యలను అధ్యయనం చేయడం, సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడం మొదలైంది. వాస్తవానికి ఆ ప్రయత్నం ఎన్నో సత్ఫలితాలను ఇచ్చింది.

1968 లో సిపిఎం పార్టీపై నక్సలిజం ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్తంగా నక్సలిజం వూపందుకుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు, తీవ్రవాదంవైపు మొగ్గుచూపినవారికి, వ్యతిరేకించిన సిపిఎం వారికి మధ్య చర్చలు-వాదోపవాదాలు జరిగాయి. పుచ్చలపల్లి సుందరయ్య వాదనతో ప్రభావితుడైన రావెళ్ల సత్యం నాయకత్వంలో పనిచేస్తున్న గండ్లూరి, బాజి, వనం లాంటి వారంతా, నక్సలిజంవైపు ఆకర్షితులైన బత్తుల, బోసు, లింగాల లాంటి వారితో ఎవరి మార్గం వారే చూసుకుందాం అని చెప్పారు. వారిని పల్లెలు వదిలి తుపాకిలు పట్టమనితాము మాత్రం పల్లెల్లోనే వుండి ప్రజలను చైతన్య ఉద్యమాలవైపు మళ్లిస్తామని స్పష్టం చేశారు. ఆ సంభాషణ అనంతరం అడవుల్లోకి వెళ్ళిన బత్తుల వెంకటేశ్వరరావు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. పల్లెల్లోనే వుండిపోయిన ఇతరుల నాయకత్వంలో రైతు-కూలీ ఉద్యమాలు సాగాయి. ఆరణాల కూలీలు, అధిక వడ్డీలు, జెట్టీలు, తక్కువ మొత్తంలో పాలేర్ల వేతనాలు, మేరల పెంపు, కుల వివక్షతలకు వ్యతిరేకంగా రావెళ్ల సత్యం బృందం నాయకత్వంలో దళిత-వెనుకబడిన వర్గాల ఐక్య ఉద్యమం వూపందుకుంది. ప్రభుత్వ మాన్యాలు, బంచరాయి భూములు పేదల స్వాధీనమయ్యాయి. కూలీల శ్రమ దోపిడీ చిహ్నాలైన "పిచ్చ మానికలు", "కుండలు" ధ్వంసమయ్యాయి. భూస్వాముల భూములలో కలుపుకున్న మిగులు ప్రభుత్వ భూములు పేదల వశమయ్యాయి. వరి నాట్ల, జొన్న కోతల, వేరు శనగ పీకుడుకు ఇవ్వాల్సిన కూలీ రేట్లను ముఠా నాయకులే నిర్ణయించే స్థాయికి ఉద్యమం చేరుకుంది. చివరకు భూస్వాములు కొనుక్కునే పశువుల ఎరువు ఎక్కించాల్సిన "బండి జల్లల" కొలతలు కూడా కూలీలే నిర్ణయించడం మొదలైంది. అదో మహోద్యమం. ముదిగొండ మండలంలోని అన్ని గ్రామాలకు ఆ ఉద్యమం పాకింది. బలపడింది. సహజంగానే ధనిక రైతుల్లో వ్యతిరేకత మొదలైంది. రైతులను కలుపుకుపోయి ఉద్యమాన్ని బలోపేతం చేస్తే మంచిదన్న  రావెళ్ల సత్యం సూచనను కూలీలు అర్థం చేసుకోలేక పోయారు. దాంతో, ధనిక రైతులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం సమితి అధ్యక్షుడు సామినేని ఉపేంద్రయ్యను ఆశ్రయించారు. నాటి హోంమంత్రి జలగం వెంగళ్ రావు అనుయాయుడైన ఉపేంద్రయ్య అండతో రావెళ్ళ అనుచరులపై గ్రామ-గ్రామాన నిర్బంధ కాండ మొదలైంది. దానికి కేంద్రంగా బాణాపురం గ్రామాన్ని ఎంచుకున్నారు.

ముదిగొండ మండలం బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్‌రావు మీద ప్రారంభమైన పోలీసు దమన కాండ, చుట్టుపక్కల గ్రామాలైన పమ్మి, అమ్మ పేట, గంధసిరి, కమలాపురం గ్రామాలకు కూడా విస్తరించింది. పోలీసు క్యాంపులు పెట్టి మరీ కమ్యూనిస్టులను-సానుభూతిపరులను హింసించసాగారు. హత్యాకాండ కూడా మొదలైంది. లైసెన్సులు లేని తుపాకిల వాడకం కూడా వెలుగులోకి వచ్చింది. ఐనా, ప్రభుత్వం ఒక పక్షాన్నే సమర్థించడం కొనసాగింది. ముక్క చిన నర్సయ్య, గండ్ర వీరభద్రా రెడ్డి లాంటి నాయకులు హత్యకు గురయ్యారు. అంతా పోలీసులకు తెలిసే జరిగిందని అనుకునేవారు. ధనవంతులైన భూస్వాములకు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా, విచక్షణారహితంగా రావెళ్ల సత్యం నాయకత్వంలో పని చేస్తున్న కమ్యూనిస్టులందరి పైనా క్రిమినల్ కేసులు బనాయించేవారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాటిలో "బైండోవర్ కేసులు" వుండేవి. ఆ నేపధ్యంలో 1970 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీలో జలగం వెంగళ్ రావును వ్యతిరేకిస్తున్న మరో జిల్లా మంత్రి శీలం సిద్దారెడ్డి వర్గంతో సర్దుబాటు చేసుకున్న మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, రావెళ్ల సత్యం ప్రాంతమైన గోకినేపల్లి ఫిర్కాలో అత్యధిక స్థానాలు సంపాదించి తిరిగి ఖమ్మం సమితిని చేజిక్కించుకుంది. దురదృష్టవశాత్తు సమితి అధ్యక్షుడుగా కావాల్సిన రావెళ్ల సత్యంను, కో-ఆప్షన్ సభ్యుడుగా ఎన్నికవకుండా, పార్టీకి చెందిన కొందరు కుట్ర పన్నడంతో ఆయన ఓడిపోయారు. ఆయన స్థానంలో రాయల వీరయ్యను అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్‌రావును ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. 1982 సంవత్సరానికల్లా ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పెనుమార్పులు సంభవించాయి. వామపక్షాల మధ్య ఒడంబడిక కుదిరింది. ఖమ్మం సమితికి సిపిఎం, పక్కనే వున్న తిరుమలాయపాలెం సమితికి సిపిఐ అభ్యర్థులు పోటీచేశారు. ఖమ్మం సమితి అధ్యక్షుడుగా రావెళ్ల సత్యం ఎన్నికయ్యారు. సమితి అధ్యక్షుడుగా ఆయన సేవలు చిరస్మరణీయం. అటెండర్ దగ్గర నుంచి, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వరకు సత్యం సలహాలకు విలువిచ్చేవారు.

జనవరి 1927 లో గోకినేపల్లి గ్రామంలో జన్మించిన రావెళ్ల సత్యం ఫిబ్రవరి 2, 1985 న గుండె జబ్బుతో అరవై సంవత్సరాలన్నా నిండకుండానే మరణించారు. వాస్తవానికి రావెళ్ల సత్యంను 1985 లో జరుగనున్న మధ్యంతర ఎన్నికలలో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. విధి వక్రించి ఆయన మరణించడంతో అది నెరవేరలేదు. ఆయనే కనుక బ్రతికుండి పోటీచేసి గెలిచినట్లయితే, జిల్లాలో సిపిఎం పతాకాన్ని ఎంతో సమున్నత స్థానానికి తీసుకెళ్తేవారు. అది జరగకపోగా, అలనాటి ఆయన సహచరులంతా పార్టీనుండి బహిష్కృతులై సిపిఎం పడుతున్న కష్టాలను బయట నుంచే బాధతో గమనిస్తున్నారు. 

Saturday, January 7, 2012

సమన్వయమా, సమాంతరమా: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (8-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

సమన్వయ కమిటీ సమన్వయ సాధన కోసమేనా?; ప్రథమ సమావేశంలో అనూహ్య పరిణామాలు; అసంతృప్తివాదుల సమర శంఖం; పరస్పర ఆరోపణలు, విమర్శలు; విభేదాలపై కథనాలు; సమర్ధ పాలనకు సహకరిస్తారా? (ఎడిటర్)


పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో తడబడుతూ అడుగులు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అచిర కాలంలోనే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్రమ పద్ధతిలో ఆకళింపు చేసుకుని, అందరినీ కూడదీసుకుని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న నేపధ్యంలో, కారణాలేవైనప్పటికీ, పార్టీకి-ప్రభుత్వానికీ మధ్య అవగాహనుండాలన్న నెపంతో, ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఆ కమిటీలో సమతుల్యం వుండాలన్న భావనతో ముఖ్యమంత్రిని-ఉపముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని-మాజీ పీసీసీ అధ్యక్షుడిని, కావూరిని-చిరంజీవిని-షబ్బీర్ అలీని ఒక ఆలోచన ప్రకారం సభ్యులుగా ప్రకటించింది అధిష్టానం. కిరణ్ తోక కత్తిరించడానికే ఈ కమిటీ ఏర్పాటైందని కొందరు భావిస్తే, కానేకాదు... బొత్స దూకుడు కట్టడి చేయడానికే అని మరికొందరన్నారు. అదేం కాదు, చిరంజీవిని బుజ్జగించడానికే అని అన్నవారు కూడా వున్నారు. మాజీ పీసీసీ ఛీఫ్‌ను, మహమ్మద్ అలీ షబ్బీర్‌ను, కావూరి సాంబశివరావును ఎందుకు నియమించారంటే ఇదమిద్ధంగా సమాధానం లేదెవరిదగ్గరనుంచి కూడా. ఏదేమైనా, ఏదో ఒక పదవిని అప్ప చెప్పడం, అదెంత పెద్దదైనా-చిన్నదైనా, ఆ పదవి లభించినవారెంత పెద్దవారైనా-చిన్నవారైనా, మురిసిముక్కలవడం కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడూ అదే జరిగింది. సమన్వయ కమిటీలో పేర్లున్న వారిలో కొందరిని ఈ వ్యాస రచయిత అభినందించినప్పుడు, వారి ఆనందానికి హద్దులు లేని విధంగా వారి దగ్గర్నుంచి స్పందన లభించిందంటే, ఆ పదవి ఎంతముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా, సమన్వయ కమిటీ ప్రధమ సమావేశానికి కమిటీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పూనుకుని, హైదరాబాద్ నగరానికి విచ్చేయడం, సమావేశం పూర్వ రంగంలో- సమావేశంలో, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.




కిరణ్ కుమార్ రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నారని సమన్వయ కమిటీ ఛైర్మన్ గులాంనబీ ఆజాద్‌కు పలువురు ఫిర్యాదులు చేశారని, అసంతృప్తి వాదులెందరో ముఖ్యమంత్రిపై సమరశంఖం పూరించారని, అంత భారీ ఎత్తున ఆయనకు వ్యతిరేకత వ్యక్తం కావడం ఆజాద్‌ను విస్తుపోయే ట్లు చేసిందని మీడియాలో కధనాలొచ్చాయి. తనపైనా, తన సహచర మంత్రులపైనా కొందరు ఎమ్మెల్యేలు-మంత్రులు ఫిర్యాదులు చేయడం వెనుక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రోత్సాహం వుందన్న అనుమానం కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల ముందర వ్యక్త పరిచినట్లు కూడా మీడియా కధనాలొచ్చాయి. నిఘా వర్గాలు కూడా ఆ అనుమానాలను ధృవపర్చాయట. నిజానిజాలేవైనప్పటికీ, బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటినుంచి, ఆయనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య విభేదాలున్న ట్లు కథనాలొస్తూనే వున్నాయి. వాస్తవానికి ఆ కథనాల నేపధ్యంలోనే, సమన్వయకమిటీ ఏర్పాటైందని కూడా అనుకుంటున్నారు విశ్లేషకులు. ఐతే, సమన్వయ కమిటీ ఏర్పాటుకు కిరణ్ హస్తముందా? బొత్స హస్తముందా? లేదా వారిద్దరినీ ఒకరిపై మరొకరు దాడి చేసుకోకుండా నివారించేందుకు అధిష్టానమే అందుకు పూనుకుందా? అనే దానికి ఎవరి సమాధానం వారే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన బొత్స పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ప్రత్యేక అజెండాతో వెళుతున్నారని, అందులో భాగంగానే కిరణ్‌ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారని బాహాటంగా బొత్స వర్గీయులే చెప్పడమే కాకుండా, ఆజాద్‌ ఎదుట ఆ తర్వాత జరిగినట్లు భావిస్తున్న పంచాయితీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, చిరంజీవితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా కిరణ్‌‍ను టార్గెట్ చేశారట.

తొలి సమన్వయంలోనే వెల్లువెత్తిన సమర ధ్వనులలో, కిరణ్ కుమార్ రెడ్డిపై చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి, ఆయన ఎవరినీ సంప్రదించకుండానే నూతన పథకాలను ప్రకటించడం, సీఎం వి అన్నీ ఒంటెత్తు పోకడలనడం, గాంధీభవన్‌కు అంతవరకూ ఎన్నడూ రానివారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారనడం, ప్రభుత్వ పాలనంతా పూర్తిగా ఏకపక్షం అనడం లాంటివున్నాయి. అలా ఫిర్యాదులు మొదటిరోజు చేసిన వారిలో సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి కూడా వున్నారు. ఆయన లేవనెత్తిన అంశంలో సహచర మంత్రి శంకర్రావుపై సబితా ఇంద్రారెడ్డి మనుషులు చేసినట్లు చెప్పుకుంటున్న దాడి కూడా వుండడం విశేషం. ఇక ఎప్పటినుంచో 104, 108 వాహనాల విషయంలోను, రాజీవ్ ఆరోగ్య శ్రీ విషయంలోను, ఆ మాటకొస్తే మొత్తం ఆరోగ్య-వైద్య శాఖ విషయంలోను ముఖ్యమంత్రి జోక్యాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆ శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ప్రభుత్వ పథకాల విషయంలో సీఎం సంబంధిత శాఖ మంత్రులను అసలే సంప్రదించడం లేదని, అలానే తామూ ఆయనను సంప్రదించే అవకాశమే లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారట. అలాగే 108 వాహనాలపై రాజీవ్ గాంధి బొమ్మ వివాదం కూడా ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. కొందరు పార్టీ నాయకులు, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే 2014 ఎన్నికల్లో పరాజయం పాలైతుందని అనే దాకా వెళ్లడం గమనించాల్సిన విషయం.

గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకెలా పొక్కాయోకాని, ముఖ్యమంత్రిని "మిస్టర్ చీఫ్ మినిస్టర్" అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సంబోధించినట్లు కూడా కొన్ని పత్రికలలో వార్తలొచ్చాయి. మరీ విడ్డూరం: కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వ లక్షణాలను కూడా ఆయన ప్రశ్నించారట. కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ అస్పష్టతలే అన్న చందాన సాగిన దామోదర రాజ నరసింహ ధిక్కార ధోరణిలో భాగంగా జగన్ విషయం కూడా ప్రస్తావనకొచ్చిందట. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, యువనేత రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేకపోవడం, పై పెచ్చు ఆ తిట్ల పురాణమంతా రాస్తున్న ఆయన పత్రికకే కోట్ల రూపాయల ప్రభుత్వ అడ్వర్టైజ్‌మెంట్లు విడుదల చేయడం రాజనర్సింహ తప్పుబట్టారు. ఒకానొక సందర్భంలో ఆయన దాడికి అడ్డుతగిలిన ప్రతివారిపై కూడా ఎదురుదాడికి దిగారట ఆయన. టెలివిజన్ ఛానళ్లలో ప్రతిరోజూ వస్తున్న విశ్లేషణల-చర్చల ప్రస్తావన కూడా తీసుకొచ్చిన దామోదర రాజ నరసింహ, కనీసం వాటిల్లోనైనా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా వాదనలు విన్పించేవారు లేకపోవడం కూడా ముఖ్యమంత్రి తప్పుగానే వర్ణించారట. ముఖ్యమంత్రికి మీడియా విషయంలోను స్పష్టమైన అవగాహన లేదనే దాకా వెళ్లింది ఆయన ఆరోపణల పర్వం.

ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు స్పష్టంగా పొడచూపాయి. విభేదాలుండడంలో తప్పు లేదు. వాటిని సమన్వయ సమావేశంలో చర్చించుకోవడంలోను తప్పులేదు. ఎటొచ్చీ, ఆ సమావేశ విషయాలు బయటకెందుకు పొక్కాలనే విషయంలోనే పార్టీ వారందరినీ తప్పు పట్టాల్సి వస్తుంది. సమన్వయ సమావేశానికి ముందు ఆజాద్‌కు అందిన ఫిర్యాదులు బయటకు రావడం సహజం. కాకపోతే, సమన్వయ సమావేశంలో జరిగినవి కూడా ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా అంతా పూస గుచ్చినట్లు రావడం వెనుక ఎవరి హస్తం వుందనేదే అర్థం కావాల్సిన అంశం.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చేతనైనంత మేరకు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్తున్న సమయంలోనూ, చేపట్టిన మరుక్షణం నుంచీ ఆయన చుట్టూ సమస్యల తోరణాలు స్వాగతం పలికాయి. ఆయన ధరించింది ఒక ముళ్ల కిరీటం. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పట్లో ఆయన పాలనా దక్షతకు, సమర్థతకు అవన్నీ అగ్నిపరీక్షల లాంటివే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యఆందోళనలు-ఉద్యమాలు, ఫ్రీ జోన్ అంశం, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ధిక్కార ధోరణి, నత్తనడకన సాగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత లాంటి సమస్యలెన్నో ఆయనకు ఎదురయ్యాయి.  ఒక్కొక్క సమస్యను అధిగమించే క్రమంలో, ఆయన ఒక్కొక్క అడుగే ముందుకు వేశారు. మంత్రివర్గం ఏర్పాటులో తనదైన శైలిని అనుసరించి మంచి పేరే తెచ్చుకున్నారు. శాసన సభాపతి ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంటి వాటిలో తన మాట చెల్లించుకోవడంతో పాటు, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం కూడా చెప్పుకోవాల్సిన సంగతే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినప్పుడు, ఎదురు చెప్పకపోవడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం అనాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనను విమర్శించినా, సంయమనం కోల్పోకుండా, తగు రీతిలో, ఎవరినీ నొప్పించకుండా-అందరినీ మెప్పించుకుంటూనే, స్పందించారే కాని, తన స్థాయి మరిచిపోయి ఎదురుదాడికి దిగలేదు. వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవలం పదహారు మంది ఎమ్మెల్యేలే మిగలడం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాకచక్యమే అనాలి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, తన జిల్లాకే చెందిన తన చిరకాల ప్రత్యర్థి, నారా చంద్రబాబునాయుడుని సహితం తన దారిలోకి తెచ్చుకోగలిగి, శాసనసభలో ఆయన పరోక్ష మద్దతు కూడా తనకే సుమా అని ప్రచారం చేయించుకోగలిగిన థీశాలి కిరణ్ కుమార్ రెడ్డి. అవిశ్వాస తీర్మానంలో, నెగ్గుకోరావడం కూడా అభినందించాల్సిన అంశమే.

ఐనా, అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికీ, బొత్స సత్యనారాయణకూ మధ్య ఏదో అగాధం వుందని భావించింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం వుండాలనీ భావించింది. పర్యవసానంగా సమన్వయ కమిటీ రూపు దిద్దుకుంది. ఆ కమిటీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరింత పటిష్టంగా పనిచేయడానికి తోడ్పడాలి కాని, అడ్డుకోవడానికి కాకూడదు. గులాంనబీ ఆజాద్ అలా అడ్డుకునేవారికి తన మద్దతు ఇవ్వకూడదు. రాబోయే రోజుల్లో ఆ కమిటీ సమన్వయం కొరకు సంయమనంతో పనిచేస్తుందని, అందులోని సభ్యులంతా సమాంతరంగా పనిచేయరని భావించుదాం.