Showing posts with label బాల పరమేశ్వరరావు. Show all posts
Showing posts with label బాల పరమేశ్వరరావు. Show all posts

Friday, November 18, 2011

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి " ప్రాక్టీసుకు నేపధ్యం": వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 4

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి ప్రాక్టీసుకు నేపధ్యం

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో నాలుగవ అధ్యాయం ఇది).

రాధాకృష్ణమూర్తిగారిని దత్తత తీసుకున్న పెదనాన్న యలమంచిలి సీతారామయ్యగారు, బాగా చదువుకున్న వారే కాకుండా, సంఘ సంస్కర్త కూడా. దత్తత పోవడంతో తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ కాగలిగారు రాధాకృష్ణమూర్తిగారు. దరిమిలా అన్నతో సహా, తమ్ములను కూడా పైకి తీసుకో రావాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ఆ బాధ్యత నేపధ్యంలో, ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత, వైద్యంలో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండా పోయింది. రాధాకృష్ణమూర్తి ఎంబిబిఎస్ సహాధ్యాయులందరూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి, ప్రొఫెసర్స్ స్థాయికి ఎదిగిన వారే. 1950లో, ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఆయన ఎంబిబిఎస్ చదువు పూర్తయింది. ఆయన చదువుకున్న కళాశాలలో అధ్యాపకులందరూ, బ్రిటీష్ వారు కాని, తమిళ, మళయాళీలు కాని వుండే వారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆ అధ్యాపకులందరూ, మద్రాస్ రాష్ట్రంలో వుండిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ కారణాన, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రొఫెసర్లుగా పనిచేయాలంటే, అవసరమైన పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు కొరకు, దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థికి సీటు దొరికింది. అప్పట్లో ఉద్యోగం చేసుకుంటూ పీజీ చేసే అవకాశం కలిగించారు. కొందరిని, ప్రభుత్వమే ఖర్చులు కూడా భరించి, విదేశాలకు పంపించింది ఉన్నత చదువుల కొరకు. అలాంటి వారిలో ప్రఖ్యాత వైద్యులు, న్యూరో చికిత్స నిపుణులు డాక్టర్ బాల పరమేశ్వరరావును ఇంగ్లండ్ పంపించింది. రాధాకృష్ణమూర్తిగారి కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన, డాక్టర్ వెంకట రావును కూడా ఇంగ్లాండుకు పంపించింది అలానే. ఆయన ప్రధాన అనస్థటిస్టుగా ఉస్మానియా ఆసుపత్రిలో పని చేశారు. యలమంచిలి సహాధ్యాయులు, సీనియర్లు, జూనియర్లందరూ ప్రొఫెసర్లుగానో, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగానో, వైద్య శాఖ డైరెక్టర్ల గానో పనిచేశారు.

1950 డిసెంబర్‍లో ఎంబిబిఎస్, 1951-1952ల్లో హౌజ్ సర్జన్‍షిప్ పూర్తవుతున్నప్పుడు, తదుపరి ఏం చెయ్యాలనే ప్రశ్న వచ్చింది ఆయనకు. ఇంకా పై చదువు (ఎం. డి) చదివి, వైద్య కళాశాలలో పనిచేయాలనే కుతూహలం బలంగా వుండేది డాక్టర్ గారికి. అప్పుడు ఆయనకు సీటు లభించడం సమస్యే కాదు. కాకపోతే, 2,3 సంవత్సరాలు విశాఖ పట్నంలో సొంత ఖర్చుతో చదువుకోవాలి. అంత ఆర్థిక స్థోమత లేదు. భూస్వామి - భాగ్యవంతుడైన మామ గారు మౌనం వహించారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే, అది చేసుకుంటూనే చదువుకునే అవకాశం వచ్చేది. కాని, ఇంకా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, ఆ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఆరంభం కాలేదు.

ఆ సమయంలోనే, ఆర్మీలో షార్ట్ సర్వీస్ రెగ్యులర్ కమీషన్ కు పిలుస్తే ఢిల్లీ వెళ్లి, ఇంటర్వ్యూలో నెగ్గి, సెలెక్టయి వచ్చారు. పిలుపు కోసం వేచి వున్నారు. కలకత్తాలోని "స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్" లో సీట్ కొరకు దరఖాస్తు చేస్తే, డి.టి.ఎం లో సీటొచ్చింది. సదరన్ రైల్వే మెడికల్ ఆఫీసర్స్ కోసం ప్రకటన వస్తే, మద్రాస్ వెళ్ళి, సెలెక్టయ్యారు. అంతా ఒక చౌరాస్తాలాగ వుందప్పుడాయనకు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో, తన అభిమాన ప్రొఫెసర్ డాక్టర్ అనంతా చారి గారిని సలహా కొరకు సంప్రదించారు. తన ప్రధమ ఆప్షన్ ఎం. డి చదవడంగా వుండాలన్నారు. ఆర్థిక స్థోమత లేదన్నారీయన. మిలిటరీ ఉద్యోగం అసలే చేయొద్దన్నారు. కలకత్తా డి.టి.ఎం కోర్సు తనకు చాలా చిన్నదని సూచించారు. ఇవేమీ కాకుంటే, తిన్నగా వెళ్ళి తనకు దగ్గరలో వున్న పట్టణంలో ప్రాక్టీసు పెట్టుకుంటే, మంచి ఫలితాలను సాధిస్తావని భరోసాగా - నమ్మకంగా చెప్పారు. ఇంకా రాష్ట్ర సర్వీస్ పై ఆశ పోని డాక్టర్ గారు, అప్పటికే పిలుపొచ్చిన రైల్వే సర్వీసులో, తాత్కాలికంగా చేరారు. మద్రాస్ పెరంబూర్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో పోస్టింగ్ వస్తే చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సహాధ్యాయులు కూడా అక్కడే చేరారు. అక్కడి నుండి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ డిస్పెన్సరీ, ఆవడి డిస్పెన్సరీ, చివరకు ఆర్కోణం జంక్షన్ లో వున్న కాస్తంత పెద్ద డిస్పెన్సరీకి మార్చుకుంటూ వచ్చారు.

రైల్వే ఉద్యోగంలో వుండగా...అలనాటి అనుభూతులను, అప్పటి పరిస్థితులలో తనకు అనుభవంలో కొచ్చిన కొన్ని నగ్న సత్యాలను నెమరేసుకున్నారు డాక్టర్‌గారు. తాను అనుకున్న-కోరుకున్న ఉద్యోగం దొరకక అప్పటికి ఏదో ఒకటి లెమ్మని రైల్వే ఉద్యోగంలో చేరారు డాక్టర్‌గారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లాగానే, అప్పట్లో, ఉమ్మడి సదరన్ రైల్వే (ఇంకా దక్షిణ మధ్య రైల్వే ఏర్పడలేదు) ప్రధాన కార్యాలయం (మద్రాస్ పెరంబూర్ లో వుండేది) ఆసుపత్రిలో డాక్టర్‌గారు, ఆయన మిత్రుడు-క్లాస్ మేట్ కె. విశ్వనాథరావు ఏకకాలంలో రిపోర్టు చేశారు. వారి జీతం నెలకు రు. 200 +రు. 100 కరువుభత్యం. ఆ మొత్తంలో ఒక రూపాయి రెవెన్యూ స్టాంపుకు మినహాయించుకొని, చేతికి రు. 299 లు ఇచ్చేవారు. అప్పటికి మిత్రుడు బ్రహ్మాచారే. డాక్టర్‌గారు తప్పనిసరి బ్రహ్మచారి. ఇద్దరికీ వుండడానికి కాంపస్‌లోనే క్వార్టర్స్ ఇచ్చారు. అరవ హోటల్లో భోజనం 60 టికెట్ కూపన్ల పుస్తకానికి (ఒకేసారి కొంటే) రు. 55.

ఆసుపత్రిలో ఔట్ పేషంట్‍లో డ్యూటీ. వారికి అరవం బొత్తిగా రాదు. పేషంట్లంతా అరవంలోనే మాట్లాడేవారు. అటెండరే దుబాసీ. నెమ్మదిగా చిన్నచిన్న మాటలు అర్థం చేసుకోవడం మొదలైంది. "వైత్‍వరి"(వళ్లు నొప్పులు), "మారువలి"(ఛాతినొప్పి), "వాంగో, ఉకారు"(రండి, కూర్చోండి), ఎన్న, ఎంగి, అప్పడియా, పార్కలాం, ఇరికె పదాలతోపాటు భోజనానికి వెళ్లినప్పుడు అవసరమయ్యే మాటలను కూడా నేర్చుకున్నారు. సాపాటు, సాంబార్, కూట్, మోర్, మోర్ కొళింబి, పోరుం, వేండా లాంటి కొన్ని నేర్చుకోక తప్పలేదు.

డాక్టర్‌గారు మద్రాస్‌లో వుండగానే పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార సత్యాగ్రహ దీక్ష మొదలైంది. ఆయన ప్రాణత్యాగం (ఆంధ్రా నాయకుల మొండితనం) చూశామన్నారు. ఆ తరువాత జరిగిన సంతాప సమావేశాలు, ఆగ్రహావేశాలు, ప్రదర్శనలు మౌన సాక్షులుగా గమనించారు.

అవి "హిందీ-చీనీ భాయీ-భాయీ" అనుకునే రోజులు. అప్పట్లో (బహుశా) కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు, చైనా సాంస్కృతిక బృందం ఒకటి మిగతా నగరాలతోపాటు మద్రాస్‌కు కూడా వచ్చిందట. ఆ సందర్భంగా ఒక పెద్ద స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ప్రస్తావించారు. సంగీతం, నాటకం, నృత్యం, ఏక్రోబాటిక్స్ లాంటివెన్నో రెండు-మూడు గంటలపాటు అద్భుతంగా ప్రదర్శించారట. ప్రతి ఐటమ్‍కు, హాజరైన నలబైవేల మంది ప్రేక్షకులనుండి మిన్నంటే కరతాళ ధ్వనులు వినిపించాయట. వారు విముక్తి చెంది అప్పటికింకా నాలుగు సంవత్సరాలేనని, బహుశా వారి సాంస్కృతిక సంపదకు నూతన ప్రభుత్వం చాలా మెరుగులు దిద్ది వుండాలని అంటారు డాక్టర్‌గారు.

స్నేహితులిద్దరు కలిసి ప్రతిరోజూ సాయంత్రం బజారుకెళ్లేవారు. ఒకనాడు చైనా బజారు, ఒకరోజు మౌంటు రోడ్డు (ఇప్పటి అన్నాసలై), మరోనాడు ట్రిప్లికేన్ బీచ్‍లో తిరిగి, తరువాత సినిమా చూసి వచ్చే వాళ్లు. ఆ రోజుల్లోనే జరిగిన విదేశీ సినిమాల పనోరమా గుర్తుచేసుకున్నారు. పరుశువాకంలోని ఒక సినిమాహాలులో రెండు రోజులు ఇటలీ సినిమాలు, రెండు రోజులు జపాన్ సినిమాలు చూసే అవకాశం కలిగింది వారికి. వాటిలో ఇటాలియన్ ప్రసిద్ధ దర్శకుడు(Vittorio De Sica) తీసిన "బైసికిల్ థీఫ్", జపాన్ ప్రసిద్ధ దర్శకుడి(Akira Kurosawa) "రోషోమోన్" తనకిప్పకిటికీ జ్ఞాపకం వున్న మాస్టర్ పీసెస్‍ అన్నారు డాక్టర్‌గారు.

డాక్టర్‌గారి మిత్రుడు విశ్వనాధరావుది విజయనగరపు సనాతన బ్రాహ్మణ కుటుంబం. ఆయన మాత్రం మంచి మాంస ప్రియుడట. వారుండే అడ్డాలోని బుఖారీ హోటల్లో తినేవారు. కొన్నాళ్ల తరువాత ఆవడి డిస్పెన్సరీకి, ఆ తరువాత మరో వూరు ఆర్కోణం జంక్షన్‌కు డాక్టర్‌గారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ డాక్టర్‌గారికంటే సీనియర్ అసిస్టెంట్ సర్జన్ ఒకరుండేవారు. ఆయన తమిళ బ్రాహ్మణుడు. మంచి వ్యక్తి. కానీ వ్యవస్థలోని లోటుపాటులకు అలవాటు పడిపోయారట. ఆయన దగ్గర కొచ్చే పేషంట్లు చాలామంది లీవ్ సర్టిఫికేట్ కోసమే వచ్చేవారట. రైల్వే ఉద్యోగంలో పెళ్ళికైనా-చావుకైనా శెలవులు దొరకడం కష్టమట. అందుకోసం డాక్టర్ సర్టిఫికేట్లకు గిరాకీ. ఐదు రూపాయలు కాగితం బల్లమీద పెట్టి అడిగేవారు. డాక్టర్‌గారికి అది చూస్తే చాలా అసహ్యమనిపించేది. ఇక జూనియర్ డాక్టర్ "ఆన్ కాల్ డ్యూటీ” లో వుండేవారు. అవసరమొచ్చినప్పుడల్లా బయటకెళ్లాలి. ఆర్కోణం స్టేషన్‌కు టెలిగ్రాం వస్తుందట. ఫలానా స్టేషన్ వున్న వూళ్లో రైల్వే క్వార్టర్స్ లో ఫలానా ఉద్యోగికి సుస్తీగా వుందని దాని సారాంశం. వెంటనే అటెండ్ కమ్మని, రాత్రయినా-పగలైనా, ఏ రైలు దొరికితే అది పట్టుకుని, ఏదీ లేకపోతే గూడ్సు బండైనా ఎక్కి వెళ్లాల్సి వుండేదట. చాలా సార్లు వెళ్లారట కూడా. తీరా అక్కడకు వెళ్లిన తరువాత, పేషంటుగా కనిపించాల్సిన వ్యక్తి లుంగీ సర్దుకుంటూ, తలుపు తీసి దర్శనం ఇచ్చేవాడు. నవ్వుకుంటూ, పది రూపాయల నోటు జేబులో పెట్టి, "శెలవు కావాలి సార్" అని అడిగేవాడు. అది చాలా ఇబ్బందికరంగా వుండేదట. ఇవన్నీ చెప్పి, ఏం చెయ్యాలని సీనియర్‌ను అడిగితే, "ఎడ్జెస్ట్ అవడం ఇద్దరికీ మంచిది" అని సమాధానం వచ్చేది. డాక్టర్‌గారు రాజీనామా కాగితం పంపితే, డి.ఎం.ఓ వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఇక తన వల్ల కాలేదన్నారు. ఉద్యోగంనుంచి వైదొలగారు. డాక్టర్‌గారితో పాటు చేరిన వారి క్లాస్ మేట్స్ విశ్వనాధరావు, సత్యనారాయణ దక్షిణ మధ్య రైల్వేలో మంచి ఉన్నత స్థాయిలో, రైల్వే లాలా గూడా ఆసుపత్రిలో పదవీ విరమణ చేశారు.

"ఎడ్జెస్ట్ కాకపోతే ఎక్కడైనా సరే ఇబ్బందులు తప్పవు అని చెప్పిన ఆ పాఠం ఇప్పటికీ నాకు ఒంటపట్టలేదు" అంటారు డాక్టర్‌గారు.

రైల్వే ఉద్యోగంలో వుండగానే, రాష్ట్ర సర్వీస్ కమీషన్ మెడికల్ ఆఫీసర్స్ సెలక్షన్ కు పిలిచారు. కాని ఆయన విషయంలో పోలీసు రిపోర్టు సెలక్షన్‍కు అడ్డుపడింది. ఆ నాడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఆంధ్ర జిల్లాలుండేవి. రాష్ట్ర ముఖ్య మంత్రిగా శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి వుండేవారు. ఆయన కమ్యూనిస్టులను తన మొదటి శత్రువు గాను, పి.డబ్ల్యు.డి శాఖ వారిని రెండో శత్రువు గాను వర్ణించేవారు. రాధాకృష్ణమూర్తి గారు తన మెడిసిన్ నాలుగో సంవత్సరంలో వుండగానే (1949) అరెస్టు కాబడి, కమ్యూనిస్ట్ గా ముద్రపడి వున్నాడు. ఆ రికార్డంతా ప్రభుత్వం దగ్గర, సెలక్షన్ కమిటీ దగ్గర వుంది. ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు సర్జరీ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ రమణమూర్తి గారే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా వున్నారు. ఐనా ఆశ ఆవిరైపోయింది. రైల్వే ఉద్యోగం నచ్చలేదు. రాజీనామా చేసి, డాక్టర్ గారు, భార్య సరళా దేవి, ఒకటిన్నర సంవత్సరాల వయసున్న కూతురు నిర్మలతో ఖమ్మం పట్టణానికి వచ్చి, ప్రయివేట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

గాంధీ చౌక్‍లో, గాంధీ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా వుండే ఒక బంగళాలో, క్రింద పోర్షన్ లో క్లినిక్ పెట్టుకునేందుకు, నెలకు రు. 25 అద్దెకు కుదిరింది. సరిగ్గా అదే బంగళాపైన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వుండేది. ఆ భవనం షరాబు మల్లయ్య గారనే స్థానిక వైశ్య ప్రముఖుడి ది. ఆయన గారు అప్పటికే వయసులో చాలా పెద్దవారు. వారి పెద్దబ్బాయి రామ్మూర్తి డాక్టర్ గారిలాగానే దత్తుడు. పెద్దాయన ప్రేమ, రామ్మూర్తి స్నేహం యలమంచిలిని ఎంతగానో ఉత్సాహపరిచింది. వుండడానికి, మామిళ్లగూడెంలో లక్ష్మారెడ్డి గారి డాబాలో, ఒక పోర్షన్ దొరికింది. వీరు తీసుకున్న పక్క పోర్షన్ లో, స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న యలమాటి సిద్దయ్య గారి కుటుంబం వుండేది. ఆయన చాలా గౌరవనీయులు. అందరికీ సహాయపడే స్వభావం కల వ్యక్తి. మంచి కుటుంబ నేపధ్యం. వారి కుటుంబంతో రాధాకృష్ణమూర్తి కుటుంబానికి అప్పుడేర్పడిన సాన్నిహిత్యం, నేటికీ కొనసాగడం ఒక ప్రత్యేకతగా చెప్పారాయన. వారి పెద్దబ్బాయి విద్యాసాగరరావు, తర్వాత డాక్టరై, ఉస్మానియా ఆసుపత్రిలో సర్జన్‍గా పని చేసి రిటైర్ అయ్యారు. రెండవ కుమారుడు సత్యనారాయణ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో పి హెచ్ డి చేసి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేసి, మంచి పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. కూతుళ్లు కొందరు అమెరికాలో, కొందరు దేశంలో స్థిరపడ్డారు. లక్ష్మారెడ్డి గారింట్లో అద్దెకున్న కొద్ది మాసాల్లో, సిద్దయ్య గారి కుటుంబం యలమంచిలి యువ దంపతుల మీద కనబరిచిన ఆప్యాయత-సహాయం మరువలేనిదంటారాయన.

మామిళ్లగూడెం ఇల్లు క్లినిక్‍కు దూరం అనిపించింది. ఆ రోజుల్లో ఖమ్మంలో రిక్షాల సౌకర్యం కూడా లేదు. ఒకటి-రెండు గుర్రపు బగ్గీలు మాత్రం వుండేవి. క్లినిక్‍కు వెళ్లి రావడం ఇబ్బందిగా వుండేది. దగ్గరగా వుండేందుకు, డాబాల బజారులో, మొదటి బిల్డింగైన, నోముల రాజయ్యగారింట్లో, పై అంతస్తులో, ఒకటిన్నర గదుల చిన్న పోర్షన్‍కు మారారు. డాక్టర్‍గారి పెద్ద కుమారుడు రాంకోటేశ్వరరావు 1953లో, చిన్న కుమారుడు రవీంద్రనాథ్ 1955లో అక్కడ వీరుండగానే కలిగారు. నెలకు రు. 21 అద్దె ఇచ్చే వారు. ఎందుకో తెలియదు గాని, రాజయ్యగారికి, డాక్టర్‍గారి కుటుంబం మీద ప్రత్యేకమైన అభిమానం వుండేది. ఏ చిన్న సదుపాయం కావాలన్నా నిమిషాలలో చేయించి పెట్టేవారు. వీరుండే ఇంట్లోనే, పక్క పోర్షన్లలో తూము హైమావతమ్మ గారు, వారి తోటి కోడలు, ఆర్టీసి ఉద్యోగి రంగారావు గారు, ఇండియన్ బాంక్ ఉద్యోగి కుటుంబం వుండేవారు. "మేమంతా కలిసి మెలిసి ఎంతో ప్రేమగా వుండేవారమని" చెప్పారు డాక్టర్‌గారు. 1957లో ఇప్పటి సొంత ఇంటికి మారారు. 1960లో ఇప్పటి ఆసుపత్రి భవనంలోకి మారారు.

"నా సహచరులూ, నా కింద పనిచేసేవారూ, నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తరువాత నేను దిగ్భ్రాంతి చెందాను. నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాడిని’ అనుకుంటూ వుండేవాడిని. కాని, నా కింద పనిచేసేవారు, ’నేను ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరిస్తానని’ అనుకునేవారు. నేను అందరినీ స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకునేవాడిని. కాని, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడేవారిని అడ్డుకుంటానని నా సహచరులు అనుకునేవారు. ఇలా నేను నా బలాలుగా ఏ ఏ అంశాలుగా భావించానో, అవన్నీ నా బలహీనతలుగా తరువాత బయట పడ్డాయి" - ఆర్. గోపాలకృష్ణన్ "టాటా రిఫ్లెక్షన్స్" - ఏ మేనేజర్ గివ్స్ హిజ్ ఎక్స్ పీరియెన్సెస్: బుక్ - "వెన్ ద పెన్నీ డ్రాప్స్" లో…..

Tuesday, November 15, 2011

వైజాగ్ లో డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి మెడిసిన్ (1945-50-52) చదువు: వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం 2

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి మెడిసిన్ (1945-50-52) చదువు

వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో రెండో అధ్యాయం ఇది)

ఆ రోజుల్లో ఐదున్నర సంవత్సరాల ఎంబిబిఎస్ కోర్సులో మొదటి ఆరునెలలు "ప్రీ రిజిస్ట్రేషన్" అనేవారు. ఆ ఆరు మాసాలు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బి.ఎస్సీ వారికిచ్చే సబ్సిడియరీ బుక్స్ తో సహా) ఉండేవి. ఆరు నెలల తరువాత పబ్లిక్ పరీక్షలుండేవి. అందులో ఉత్తీర్ణులైన వారే ఫస్ట్ ఇయర్ కు వెళ్ళడానికి అర్హులు. చిత్రమేమిటంటే, డాక్టర్‍గారి బాచ్ లో, ఆ ఆరు నెలల పరీక్షల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారిలోనే సగం మందికి పైగా ఫెయిలయ్యారట. అనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్టులకు రెండు పూర్తి సంవత్సాలుండేవి. రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు వరకు అనాటమీ డి సెక్షన్ వుండేదట. సాయంకాలం లెక్చర్ క్లాసులుండేవి. ఆనాడున్న ప్రొఫెసర్ మాథ్యూస్‍గారిని, ఫిజియాలజీ ప్రొఫెసర్ మేడమ్‍గారిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేసిన డాక్టర్ సీతారామారావుగారిని, డాక్టర్ బ్రహ్మయ్యశాస్త్రిగారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు డాక్టర్‍గారు. "ఫస్ట్ ఎంబీ" పరీక్షల్లో రాధాకృష్ణమూర్తిగారు "ఫస్ట్ రాంక్" సాధించారు. వాస్తవానికి ఆ రాంక్ మిత్రులు బాల పరమేశ్వరరావుగారికి దక్కాల్సిందేనని, ఆయన ఆనాటమీ పేపర్ రాసేటప్పుడు, కాస్త కంగారుపడి "సెలినస్ ఏంటీరియర్" గురించి రాయడానికి బదులు "సెర్రేటస్ ఏంటీ రియర్" గురించి చక్కగా రాసేసి, బయటకు వచ్చి నాలుక కరుచుకున్నారట! ఆ చిన్న పొరపాటు చేయకపోతే, ఆ రాంక్ ఆయనకే దక్కేదని - దక్కి ఉండాల్సిందేనని అంటారు డాక్టర్ గారు. నిజానికి ఫైనల్ ఎంబిబిఎస్‍లో, ఆ రాంక్ ఆయనకే న్యాయంగా దక్కింది. మిత్రుడిని అభినందించారీయన.

క్లినికల్ సైడ్ వెళ్లాక సర్జరీ ప్రొఫెసర్ లెఫ్ట్ నెంట్ కల్నల్ రమణమూర్తి, ప్రొఫెసర్ కృష్ణస్వామి, మెడిసిన్‍లో ప్రొఫెసర్ టి.కె. రామన్, ప్రొఫెసర్ అనంతాచారి గార్లను గురించి చెప్పుకోవాల్సిందేనంటారు. ప్రొఫెసర్ భాస్కర మీనన్ పెథాలజీ అద్భుతంగా చెప్పేవారట. ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఈశ్వరయ్య చాలా డ్రై సబ్జెక్టును ఎంతో ఆసక్తికరంగా, మధ్య మధ్య హాస్యంగా, చెణుకులతో చెప్పేవారట. ఆయన ప్రొఫెసర్ డేవిడ్‍తో కలిసి తరువాత ఎంతో పాపులర్ పుస్తకంగా పేరుతెచ్చుకున్న "ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్" (డేవిడ్ అండ్ ఈశ్వరయ్య) రాశారట. అలాగే బాక్టీరియాలజీ ప్రొఫెసర్ - ప్రిన్సిపాల్ గా కూడా కొంతకాలం పనిచేసిన ఎన్.డి. పండాలే గారు మంచి లెక్చరర్ కాకపోయినా. చాలా లోతుగా సబ్జెక్ట్ వున్నవారంటారు. ఆయన కూడా బాక్టీరియాలజీ టెక్స్ట్ బుక్ అప్పటికే రాశారట. అలాంటి ఉద్దండులైన సీనియర్ ప్రొఫెసర్లు దొరకడం కూడా తన బాచ్ వైద్య విద్యార్థుల అదృష్టంగా చెప్పవచ్చు నంటారు.

ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంటు సర్జన్లుగా పనిచేసిన డాక్టర్ పినాకపాణి ఎం.డి (తరువాత కాలంలో గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరు తెచ్చుకున్నారు), డాక్టర్ కోదండ రామయ్య ఎం.డి (గుంటూరులో ప్రొఫెసర్‍గా, పాపులర్ ఫిజిషియన్‍గా పేరు సంపాదించుకున్నారు), ఎం.సి.ఐ చైర్మన్‍గా చాలా సంవత్సరాలు పనిచేసిన డాక్టర్ పిన్నమనేని నరసింహారావు ఎం.ఎస్ (.ఎన్.టి), డాక్టర్ లింగం సూర్యనారాయణ (తరువాత వైస్ ఛాన్సలర్‍గా పనిచేశారు), విద్యార్థులకు చాలా సహాయం చేసేవారట.

1947లో జరిగిన రెండు ముఖ్య సంఘటనలను డాక్టర్ వై.ఆర్.కే గుర్తు చేసుకున్నారు. ఆ ఏడాది మే నెల 4 న తన వివాహం జరిగిందని, అది తన స్వాతంత్ర్యం పోయిన రోజని చమత్కరించారు! రెండోది ఆగస్ట్ 15. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఆ రోజుతో అంతకు ముందు విధిగా ధరించాల్సి వున్న సూటూ-బూటూ -నెక్ టై బాధ తీరిపోయిందన్నారు. స్టాఫ్ - స్టూడెంట్స్ కూడా ఎవరికిష్టమైన డ్రస్ వారు వేసుకునే వారట. 1949లో నాలుగో సంవత్సరం మెడిసిన్ చదువుతుండగా తనకు రెండు స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయంటారు. ఒకటి జైలుకు వెళ్లి రావడం - కేసులు, రెండు ఆయన ఎంతగానో ప్రేమించే చెల్లెలు భీమేశ్వరి టైఫాయిడ్ జ్వరంతో చనిపోవడం - తనను పెంచిన తల్లితండ్రులకు గర్భ శోకం మిగల్చడం.

పాఠ్య గ్రంధాల చదువుతో పాటు, ఇతర గ్రంధాల పట్ల ఆసక్తి పెరగడంతో, ఆ కారణాన, ఫైనల్ ఎంబిబిఎస్ లో నాలుగో రాంక్ మాత్రమే పొందగలిగానంటారు. తనకన్నా ఎక్కువ రాంక్ వచ్చిన మిత్రులు తనకంటే ఏ మాత్రం తక్కువ వారు కాదని, అందరూ చాలా సమర్థులేనని అంటారాయన.

డిసెంబర్ 1950లో పరీక్షలు అయిపోయాయి. జనవరి 1951 నుండి హౌస్ సర్జన్‍గా పని చేశారు. ఆ రోజుల్లో అందరికీ స్టయి ఫండ్ దొరికేది కాదు. మొదటి 10 రాంకులు వచ్చిన వాళ్లకే ఇచ్చేవారు. వారిలో రాధాకృష్ణమూర్తిగారు కూడా వుండడంతో ఆయనకు కూడా రు. 90లు దొరికేవి. సంవత్సరం పూర్తయిన తరువాత ఇంకా కొన్ని స్పెషాలిటీల్లో అనుభవం కోసం స్టయిఫండ్ లేకుండానే సీనియర్ హౌజ్ మెన్‍గా మరొక ఆరు మాసాలు పనిచేశారు. ఆ అనుభవం తనకు ప్రయివేట్ ప్రాక్టీసులో బాగా ఉపయోగపడిందంటారు.

ఆయన వైద్య విద్య సాగుతున్నప్పుడే వీర తెలంగాణ రైతాంగ విప్లవ సాయుధ పోరాటం సాగింది. జరిగింది తెలంగాణ ప్రాంతంలోనే అయినప్పటికి, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి ఆంధ్ర ప్రాంతం వారి సహాయ సహకారాలతో పాటు నాయకత్వం కూడా దానికుండేది. పోరాటం చేసే వారికి ఆయుధాలు-ఆయుధ సామగ్రి సమకూర్చడానికి, పోరాటంలో గాయపడిన వారికి చికిత్స చేయడానికి ఆంధ్ర ప్రాంతం వారి అవసరమొచ్చేది. రాధాకృష్ణమూర్తికి అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయి. వైజాగ్ జిల్లా కమిటీ నాయకుడు వై. విజయ కుమార్ (హైదరాబాద్ లోని స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ సబిత నాన్నగారు) తో, అనకాపల్లి చెరకు రైతు ఉద్యమ నాయకుడు గోవిందరావుతో, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతకర్తగా-అధ్యయనకర్తగా పేరున్న ఏటుకూరి బలరామ మూర్తితో, విజయనగరానికి చెందిన డాక్టర్ లక్ష్మి భర్త వల్లభరావుతో, వైజాగ్ లోని పార్టీ కార్యాలయంలో వుండే జొన్నలగడ్డ రామలింగయ్యతో, ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎం.వి భద్రంతో, మరి కొంత మందితో, వై ఆర్ కెకు పరిచయాలుండేవి.

పార్టీ మీద నిషేధం వున్నప్పుడు, విజయ కుమార్ ఆయన రూమ్‍లోనే వుండే వారు. ఏటుకూరి బలరామ మూర్తిని గురువుతో సమానంగా భావించే వారు యలమంచిలి. ఆయనే పార్టీ సాహిత్యాన్ని చదవడం అలవాటు చేసిందీయనకు. ఇతర స్థానిక నాయకులతో పాటు, ఒక సంవత్సరం సీనియర్ విద్యార్థి అయిన కె. పున్నయ్య చౌదరి (తెనాలి) తో పరిచయం పెంచుకున్నారు. ఆయన కంటె నాలుగేళ్లు సీనియర్, డాక్టర్ సూరి భగవంతం అల్లుడైన డాక్టర్ సూర్యనారాయణ (కాకినాడ)తో సహా చాలామంది రాధాకృష్ణమూర్తిని నమ్మకస్తుడైన కామ్రేడ్‍గా భావించేవారు. తెలంగాణ నుంచి కామ్రేడ్స్ వచ్చి, ఆయన గదిలో రహస్యంగా వుండి, దొరికినంత మందుగుండు సామగ్రిని పోగు చేసుకుని వెళ్లేవారు. జబ్బున పడ్డవారు కూడా ఆయన గదిలో వుండి చికిత్స చేయించుకుని వెళ్లేవారు. అవి తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా జరుగుతున్న రోజులు. వై ఆర్ కెకు నేరుగా తెలంగాణ సాయుధ పోరాట నాయకులతో సంబంధాలు లేకపోయినా ఉద్యమానికి తన వంతు సేవ చేస్తుండేవారు.

అప్పటివరకూ జాతీయ కాంగ్రెస్‍లో అంతర్భాగంగా, ఒక గ్రూపుగా, కమ్యూనిస్టులుండేవారు. 1941 జూన్ నెలలో నాజీ హిట్లర్ సైన్యాలు సోవియట్ యూనియన్ లోకి ప్రవేశించిన సందర్భంగా, రెండవ ప్రపంచ యుద్ధ స్వభావం మారిందని భావించిన కమ్యూనిస్టులు, దాన్ని "ప్రజా యుద్ధం"(పీపుల్స్ వార్)గా ప్రకటించింది. ఫాసిజానికి వ్యతిరేకంగా మిత్రకూటమిని బలపర్చాలని పిలుపునిచ్చింది. ఆ అవగాహనతో, 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా వున్నారు. యుద్ధానంతరం, జైళ్ల నుంచి బయట కొచ్చిన కాంగ్రెస్ నాయకత్వం, కమ్యూనిస్టులను కాంగ్రెస్ సంస్థనుండి బహిష్కరించింది. ఫాసిస్ట్ జపాన్ సాయంతో తూర్పు ఆసియాలో సైన్యాన్ని నిర్వహిస్తున్న నేతాజీ సుభాస్ చంద్ర బోసును విమర్శించారు కూడా. వీటన్నిటి ఫలితంగా కమ్యూనిస్టులను దేశద్రోహులుగా ముద్రవేసి, దేశంలో కమ్యూనిస్టుల సమావేశాలపై, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేయసాగారు. దానిలో భాగంగా ఆనాటి పార్టీ కార్యదర్శి పి.సి. జోషి, సుందరయ్యగార్లు నాటి ఒరిస్సా రాజధాని కటక్‍లో మీటింగ్ పెడితే, దాన్ని విచ్చిన్నం చేసి, కార్యకర్తలను చావబాదారు. అక్కడ నుండి, వారిద్దరూ విశాఖపట్నం చేరారు. బీచ్‍లో, మీటింగ్ ఏర్పాట్లకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం కలిగింది. మీటింగు చుట్టూ, వాలంటీర్లు తలా ఒక పెద్ద బాణా కర్ర పుచ్చుకుని నిలుచోవాలన్నది నిర్ణయం. వారిలో ఒక వాలంటీరుగా తానున్నానని డాక్టర్‍గారు గుర్తుచేసుకున్నారు.

వేదిక కింద అదనంగా కర్రల కట్ట వుంచుకున్నారట. వేదిక కింద కర్రలెందుకు పెట్టారని మధ్యలో ఒక ప్రేక్షకుడు చీటీ పంపాడట. "అవును నిజమే - కర్రలుంచిన మాట వాస్తవమే! మీరు మాపై దాడి చేయనంతవరకు, మా వాళ్లు వాటికి పని చెప్పరు" అని సుందరయ్య గారు సమాధానం ఇచ్చారట. పి.సి. జోషి గారిని, సుందరయ్య గారిని మొదటిసారిగా అప్పుడే చూశానని చెప్పారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. విశాఖపట్నంలో వుండగానే (1947-1949 మధ్యలో కావచ్చు) జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన "ముందడుగు" నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశారు. గారిసన్ థియేటర్ (రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సైనికుల కొరకు నిర్మించిన) లో, ఆ నాటకం చూడడానికి, మెడికల్ కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులు వెళ్లారు. కోడూరి అచ్చయ్య, వి. (విక్టరీ) మధుసూధన రావు పాల్గొన్న ఆ ప్రదర్శన, పార్టీయే తరులను కూడా మంత్రముగ్దులను చేసిందన్నారు డాక్టర్. ఒక్కొక్క సన్నివేశం ప్రదర్శిస్తుంటే హాలు దద్దరిల్లిందట. ఆ నాటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం, ఆ ప్రదర్శన తరువాత కొన్నాళ్లకు, ఆ నాటకాన్ని నిషేధించింది.

మెడికల్ కాలేజీ నుంచి (బహుశా 1946 లో కావచ్చు) కాకినాడలో జరిగిన విద్యార్థి ఫెడరేషన్ మహాసభలకు మిత్రుడు రాజరత్నంతో కలిసి ప్రతినిధిగా వెళ్లారట. అందులో ఆయనొక తీర్మానంపై మాట్లాడినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. ఊరేగింపులో కూడా పాల్గొన్నారు. అప్పటి ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఎస్. వి. నరసయ్య ప్రస్తుతం బెంగళూరులో పరిశ్రమ నిర్వహిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సభ్యులుగా కూడా వున్నారు. 1946-1947 ప్రాంతంలో గుంటూరులో జరిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభలకు కూడా హాజరయ్యారట. ఆనాటి అఖిల భారత ఫెడరేషన్ కార్యదర్శి, నర్గీస్ బాట్లావాలా (ఆమె భర్త బాట్లావాలా పార్టీ పోలిట్ బ్యూరో నుండి బహిష్కృతుడై కాంగ్రెస్ లో చేరాడు. ఆయనతో కాంగ్రెస్ వారు అదే సమయంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు). మహాసభలకు ప్రముఖ మార్క్సిస్టు చరిత్ర కారుడు దేవీ ప్రసాద్ చటోపాధ్యాయ ప్రత్యేక ఆహ్వానితుడుగా వచ్చారు. ఆయన కుమారుడు గౌతమ్ చటోపాధ్యాయ, ఫెడరేషన్‍లో ముఖ్య నాయకుడు. ఆ సందర్భంలోనే శ్రీపాద అమృత డాంగేతో గుంటూరు గాంధీ పార్కులో బహిరంగసభ జరిగింది.

వైజాగ్ మెడికల్ కాలేజీలో మిత్రుల గురించి మరికొంత వివరంగా చెప్పాలంటారు డాక్టర్ వై.ఆర్.కె. ఆయన, ఎస్. బాలపరమేశ్వరరావు, ఎన్. సత్యనారాయణ-ముగ్గురు కలిసి, మెడికల్ కాలేజీ హాస్టల్ (మూడు సంవత్సరాలు) లోను, చెంగల్‍రావు పేటలో కాలేజీ బిల్డింగ్ కు ఎదురుగా వున్న పాత మేడ(ఏడాదిన్నర)లోను, టర్నర్ సత్రం దగ్గర మిలిటరీ వాళ్లు ఖాళీ చేసిపోయిన "లాస్ట్ హొరైజన్స్" పేరుతో పిలిచే బారక్స్ లోను, చివరగా కలెక్టర్ కార్యాలయం పక్కనే వున్న "లాడ్జ్ మెడికో" డాబాలోను, మొత్తం ఆరు సంవత్సరాలు ఒకే గదిలో వుంటూ వచ్చారు. వారి ముగ్గురుది ఒక వూరు కాదు-ఒక ప్రాంతం కాదు-ఒక బంధుత్వమూ కాదు. ఐనా, స్నేహం అలా కుదిరింది. ముగ్గురివీ భిన్నాభిప్రాయాలంటారు డాక్టర్ గారు. బాల పరమేశ్వరరావు సాయిబాబా (ఒరిజినల్) భక్తుడట. అల్మరాలో ఆయన ఫొటో పక్కనే విభూతి వుండేది. రోజూ ఉదయం స్నానం చేసి, దణ్ణం పెట్టుకుని, తేలికగా విభూతి రాసుకునేవాడు. కొన్నిసార్లు సాయంకాలం టెన్నిస్ ఆడడానికి వెళ్లేవాడు. రాజకీయాలపై బొత్తిగా ఆసక్తి లేదట. ఇక, సత్యనారాయణ గోడకు లక్ష్మీదేవి ఫ్రేం కట్టిన ఫొటో వేలాడ తీసుకునే వాడు. ఉదయం ప్రార్థనలు చేసేవాడట. పెందరాళే లేచి దండీలు (బిస్కీలు) తీసేవాడు. ఆయన మైలు రన్నర్. బహుమతులూ వచ్చాయి. ఒక సారి ఎన్. జి. రంగా విశాఖపట్నం వస్తే ఆయన వెంట వెళ్లాడు. మళ్లీ ఎన్నడూ ఆ గొడవలేదు. డాక్టర్ వై.ఆర్.కె నేమో నిరీశ్వర వాది. ఏ రకమైన పూజలూ చేసేవాడు కాదు. వ్యాయామం, ఆటలూ బొత్తిగా లేవు. పార్టీ సాహిత్యం, ఇతర పుస్తకాలు చదవడం, పార్టీ ఆఫీసుకు-యూనివర్సిటీలో సమావేశాలకు వెళ్లడం, రాజకీయాలపై ఆసక్తి పెంచుకోవడం ఆయన పని. ఎప్పుడైనా సరదాగా చిన్నచిన్న జోకులు విసురుకోవడం, వాటిని నవ్వుకుంటూ స్వీకరించడం మినహా, వారి మధ్య ఏనాడూ ఎటువంటి ఘర్షణ చోటుచేసుకోలేదట. ఆ స్నేహం కాలేజీ వదిలిన తరువాత కూడా, నేటికీ కొనసాగుతూనే వుందంటారు. వేర్వేరు చోట్ల భిన్న రంగాలలో సెటిల్ ఐనా, వారిది కుటుంబ స్నేహంగా మిగిలింది. దురదృష్ట వశాత్తు ఎంతో శరీర కసరత్తు చేసే మిత్రుడు సత్యనారాయణ ఇటీవలే కాలం చేశారని బాధపడ్డారు డాక్టర్‍గారు. ఆయన ఒక సంవత్సరం ఐ.ఎం.ఏ జాతీయ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. బాల పరమేశ్వర రావు, నిజాం ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్"(నిమ్స్)లో న్యూరో సర్జరీ విభాగాన్ని అభివృద్ధి చేసినందుకు బిసీ రాయ్ ఆవార్డును అందుకున్నారు. ఇది తనకు గర్వంగా అనిపిస్తుందంటారు డాక్టర్ వై.ఆర్.కె.

మరొక సహాధ్యాయుడు, మిత్రుడు పి. సుబ్బారాయుడు(పాలకొల్లు)తో డాక్టర్‍గారిది సాహిత్యానుబంధం. దానితో వారిద్దరి మధ్య మంచి దోస్తీ కుదిరింది. ఇద్దరూ కలిసి వ్యాసాలు రాసి, "రాధాకృష్ణ-సుబ్రాయుడు" పేరుతో, ఆ రోజుల్లో మద్రాసు నుండి వచ్చే ఆనంద వాణి, రూప వాణి పత్రికలకు కొంతకాలం పంపేవారట. వాటి లోతు-విలువ ఎంతో తనకు తెలియదు కాని, పంపినవన్నీ అచ్చయ్యాయట! రాధాకృష్ణమూర్తిగారు వేరుగా తన పేరు మీద కాలేజీ మాగజైన్‍కు అడపాదడపా, కథో, వ్యాసమో సంపాదకుని కోరిక మీదట ఇచ్చేవారు. అలాంటి వాటి కాపీలేవీ జాగ్రత్త పరచుకోవాలని అప్పుడనిపించలేదట. సుబ్బారాయుడుకు సినిమాలపై ఆసక్తి మెండు. మొదటి రోజున, మొదటి ఆటకు టికెట్లను ఇద్దరికీ తెప్పించేవాడు. అతను "జీవితం" (వైజయంతిమాల + తమిళ హాస్య నటుడు) సినిమాను కనీసం పదిహేను సార్లు చూశాడట. అలాగే "నందా ఔర్ నీరా" (శ్రీ శ్రీ తెలుగు డబ్బింగ్) కూడా ఐదారు సార్లు చూశాడట. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, నిష్కపటమైన స్నేహాభిమానాలు చూపిన ఆ మిత్రుడిని ఎన్నడూ మర్చిపోలేనని అంటారు డాక్టర్ గారు.