శరద్ పవార్‌కు కోపం వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి సర్దుకుపోయింది. అప్పుడే మో, సోనియా విదేశీయతకు కోపం వస్తే, ఇప్పుడేమో తనకు మంత్రివర్గంలో రెండో స్థానం ఇవ్వలేదని కోపం వచ్చింది. మంత్రిపదవికి రాజీనామా చేస్తానని బెదిరించే వరకూ కోపం వచ్చింది. ఇంతకీ పవార్ యుపిఎని వీడిపోతాడా? పోడా? అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం కాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంచెం కష్టాలు తెస్తాడని మాత్రం చెప్పవచ్చు. అసలిదంతా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కావాలనే చేస్తున్నదా? గత పదమూడేళ్లు రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి తన పార్టీలోను, యుపిఎ భాగస్వాములలోను అసంతృప్తిని పసికట్టిందా? ఇక తప్పదనుకున్న సోనియా అత్తగారి తరహా దిద్దుబాటులోనే పయనించి, యుపిఎలోను-పార్టీలోను చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? ఎదురుతిరగగల శక్తి-యుక్తులున్న శరద్ పవార్ లాంటి కాంగ్రేసేతర నాయకులను కాని, ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మరికొందరు అసంతృప్త నాయకులను కాని, వదిలించుకునే ఆలోచనలో సోనియా వుందా? వారికీ విడిపోతేనే మంచి జరుగుతుందని, రాజకీయంగా లబ్ది చేకూరుతుందని భావన కలుగుతోందా? ఎవరి వ్యూహం ఎలా వుందో అర్థం చేసుకోవాలంటే చరిత్ర తిరగదోడాల్సిందే! నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!
Monday, July 23, 2012
శరద్ పవార్ కోపం కాంగ్రెస్ ప్రక్షాళణకు దారితీయనుందా?: వనం జ్వాలా నరసింహారావు
శరద్ పవార్‌కు కోపం వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి సర్దుకుపోయింది. అప్పుడే మో, సోనియా విదేశీయతకు కోపం వస్తే, ఇప్పుడేమో తనకు మంత్రివర్గంలో రెండో స్థానం ఇవ్వలేదని కోపం వచ్చింది. మంత్రిపదవికి రాజీనామా చేస్తానని బెదిరించే వరకూ కోపం వచ్చింది. ఇంతకీ పవార్ యుపిఎని వీడిపోతాడా? పోడా? అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం కాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంచెం కష్టాలు తెస్తాడని మాత్రం చెప్పవచ్చు. అసలిదంతా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కావాలనే చేస్తున్నదా? గత పదమూడేళ్లు రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి తన పార్టీలోను, యుపిఎ భాగస్వాములలోను అసంతృప్తిని పసికట్టిందా? ఇక తప్పదనుకున్న సోనియా అత్తగారి తరహా దిద్దుబాటులోనే పయనించి, యుపిఎలోను-పార్టీలోను చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? ఎదురుతిరగగల శక్తి-యుక్తులున్న శరద్ పవార్ లాంటి కాంగ్రేసేతర నాయకులను కాని, ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మరికొందరు అసంతృప్త నాయకులను కాని, వదిలించుకునే ఆలోచనలో సోనియా వుందా? వారికీ విడిపోతేనే మంచి జరుగుతుందని, రాజకీయంగా లబ్ది చేకూరుతుందని భావన కలుగుతోందా? ఎవరి వ్యూహం ఎలా వుందో అర్థం చేసుకోవాలంటే చరిత్ర తిరగదోడాల్సిందే! నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!
Sunday, October 9, 2011
కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు! : వనం జ్వాలా నరసింహారావు
వనం జ్వాలా నరసింహారావు
మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యుపిఎ సారధ్య నాయకుల (నాయకీమణుల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మూసుకునే వుంటే, వారింక ఎప్పటికీ తెరవలేమోనన్న భయం పట్టుకుంది. అప్పుడో మాట, ఇప్పుడో మాట - అక్కడో మాట, ఇక్కడో మాట - అమ్మ ముందో మాట, వెనుకో మాట - సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో ఒక మాట, తెలంగాణ వారితో మరొక మాట - తమ పార్టీ రాష్ట్ర నాయకులతో చెప్పేదొకటి, ఇతర పార్టీల వారితో చెప్పేదొకటి - ఇలా ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఢిల్లీ (కాంగ్రెస్ అధిష్టానం బృందగానం ఆలాపించే) నాయకులకు సకల జనుల సమ్మె వేడి నపాళానికెక్కింది. మింగలేక, కక్క లేక, అధినేత్రి సోనియాకు మొర పెట్టుకుని వుండవచ్చు. జ్ఞానోదయం కలగడం ఆమె దగ్గర నుంచి ఆరంభమైందా? లేక ఆమె సూచనతో బృందగాన భజన పరులకు స్వయానా కలిగిందా? అర్థం చేసుకోవడం కష్టమే! కాని, రాదనుకున్న కదలిక కనపడడం (కనీసం వినపడడం) మాత్రం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం తధ్యమనే విషయం, దాంతో పాటే, మూడు వారాలకు పైగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సకల జనుల సమ్మె ప్రభావం నుండి బయటపడే అవకాశాలు మటుకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అలా జరగకపోతే, ముఖ్యమంత్రి మొదట్లో చెప్పినట్లు, సమ్మె ప్రభావం ఒక్క తెలంగాణ ప్రాంతం పైనే కాకుండా, యావత్ ఆంధ్ర ప్రదేశ్ తో సహా, భారత దేశంలోని పలు రాష్ట్రాలపై పడే అవకాశాలున్నాయనే సంగతి కేంద్రం ఈ పాటికే గ్రహించి వుండాలి.
అరవై ఏళ్లుగా - పోనీ నలభై ఏళ్ళుగా - కనీసం గత పదకొండేళ్లు గా నన్నా - అధమ పక్షం రెండేళ్లకు పైగా - ఇవేవీ కాకపోయినా ఇటీవల మూడు వారాలకు పైగా జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావం నేపధ్యంలోనైనా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కళ్ళున్న కబోదుల మాదిరిగా, చూసీ చూడనట్లు -అంటీ ముంటనట్లుగా వ్యవహరించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (నాటి నుంచి నేటి వరకున్న) అధిష్ఠానం, ఆ పార్టీ ఈ నాటి అధినేత్రి, ఆమె భజన బృందం, కనీసం ఇప్పటికైనా తెలంగాణ సమస్యపై సముచిత స్థాయిలో దృష్టి పెట్టడం ఆహ్వానించ దగ్గ పరిణామం. దాని పర్యవసానమే, బహుశా, తమలో తాము విస్తృతంగా చర్చించుకోవడం, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఢిల్లీకి రమ్మనడం - ప్రదాన మంత్రితో భేటీకి పిలవడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను కూడా రమ్మనడం కావచ్చు. కోర్ కమిటీలు, మినీ కోర్ కమిటీలు ఎడతెరిపి లేకుండా సమావేశమవుతున్నాయి. ఏం జరుగబోతుందోనన్న అంశం ఇంకా అస్పష్టంగా వున్నప్పటికీ, ఏదో జరుగడం ఖాయం అన్న విషయంలో మాత్రం స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఎవరి (కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ) నోటి నుండి తెలంగాణ విషయంలో ఒక అసంబద్ధమైన మాటలు రెండు రోజుల క్రితమే వెలువడ్డాయో, ఆ వ్యక్తికే కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియా గాంధి అప్ప చెప్పడం విశేషం. దసరా పండుగ (తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ఏడాది జరుపుకోని పండుగ!) పూర్తయిన వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించడమంటే, కనీసం దీపావళి కానుకగా నన్నా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భౌగోళికంగా విడదీసి - రాబోయే తర తరాల తెలుగు వారు కలిసి మెలిసి సహజీవనం సాగించే విధంగా, చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించవచ్చన్న ఆశలు ఇరు ప్రాంతాలలో చిగురిస్తున్నాయనవచ్చు.
తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభమైంది కాదని, ఐనా అందుకు తామందరం యత్నిస్తున్నామని, ఎప్పటి లోపు సమస్య తేలుతుందోనని, అసలు ఏ దిశగా అది పరిష్కరించబడుతోందని, చూద్దాం - చేద్దాం అని, క్లిష్టమైన సమస్యను మరింత సంక్లిష్టంగా - భూతద్దంలో చూపించే ప్రయత్నం "రాజనీతిజ్ఞుడు" అని అందరూ భావించే ప్రణబ్ ముఖర్జీ కూడా చేశాడంటే, ఏదో జరుగబోతుందోనన్న సంకేతం ఇచ్చినట్లే! భారతదేశంలో, రాష్ట్రాల ఏర్పాటులో, ఒక పద్ధతిని అనుసరించలేదని, అలా అలవోకగా చరిత్ర -భూగోళం కలిపి కలగాపులగంగా ఓ ప్రైవేట్ చానల్ ఇంటర్వ్యూలో, ప్రణబ్ ఏదేదో మాట్లాడడం వెనుక అనేకానేక గూడార్థాలుండే వుండాలి. యాదృచ్చికంగానే జరిగిందో? లేదో? కాని, సరిగ్గా అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన జవాబులో (ఆయన రాసిన లేఖకు ప్రతిగా) తెలంగాణ అనే సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేయ దగ్గ కృషి అంతా చేస్తున్నది అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రధాని ఈ విషయాన్ని తెలంగాణ విషయంలో ఏ అభిప్రాయం చెప్పని ఒక పార్టీ నాయకుడికే ఎందుకు రాశారో అర్థం కాని అంశం.
తెలంగాణ అంశం సున్నితమైనదని, సంక్లిష్టమైనదని, దాన్ని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించలేమంటూ ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఐనా, ఆ వ్యాఖ్యలలో తప్పేమీ లేదని సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రణబ్ వ్యాఖ్యలలో తెలంగాణ అనుకూలమైన అర్థాలను వెతికే ప్రయత్నమే చేశారు. దీంతో.. అసలు ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవా? లేక నోరు జారి చేసినవా? అన్న సంశయం కూడా కలిగింది. ప్రణబ్ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేమని ఇదంతా వ్యూహాత్మకమేనని మెజారిటీ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ప్రణబ్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే, మరి కొందరు తెలంగాణ ఏర్పాటు కొరకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదేమైనా, ఆ వ్యాఖ్యలు చేసిన అతి కొద్ది సమయంలోనే ఢిల్లీలో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం శుభపరిణామాలకు దారితీయవచ్చని అందరి ఆశగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇవ్వడం - ఇవ్వకపోవడం కాదు సమస్య. సకల జనుల సమ్మె ప్రభావంగా దినదినం దుర్భరమవుతున్న సామాన్య-అసామాన్య పౌరుల జీవనం ఒకింత కుదుట బడే వీలుంటుందన్న నమ్మకం కలుగుతోంది.
ఈ నేపధ్యంలో గత వారం రోజులుగా ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషకులకు, రాజకీయాలలో వున్న నాయకులకు, రాజకీయం చేసే వారికి, ఆసక్తి కలిగించినప్పటికీ, చిత్తశుద్ధితో తెలంగాణ సమస్యకు పరిష్కారం త్వరలో లభించాలని కోరుకుంటున్న ప్రజానీకానికి మాత్రం అసహ్యంగా, అతి జుగుప్సాకరంగా వున్నాయనక తప్పదు. సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం ఎందుకు కావాలి? ఎవరి కొరకు కావాలి? ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించమని అడిగే వారికి వారెందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదా? సమస్యకు పరిష్కారం కావాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలంటున్న వారి ఉద్దేశం ఒక ప్రాంతం వారికే ఈ సూత్రం వర్తిస్తుందా? ఎప్పటికీ ఒకరే ఇచ్చుకోవాల్నా? పుచ్చుకోవాల్నా? ఎవరూ నష్టపోని రీతిలో విన్-విన్ సిచ్యువేషన్ పరిస్థితి వుండాలనడం ఎంతవరకు సమంజసం? "విన్" అంటే ఒకరి "విన్నా"? ఇద్దరి "విన్నా"? భాగస్వాములందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. తెలంగాణ విషయంలో "భాగస్వాములు" (స్టేక్ హోల్డర్స్) అంటే ఆ ప్రాంతంలో వుండే ప్రజలు -ప్రజా ప్రతినిధులు - రాజకీయ పార్టీల నాయకులు - పౌర సమాజం నాయకులు - ప్రభుత్వ, ప్రభుత్వేతర సిబ్బంది, సిబ్బంది నాయకులే కాని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ససేమిరా ఇష్టపడని పొరుగు వారు, పొరుగు రాష్ట్రాల వారు, ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఎలా అర్హులవుతారు? ఇంకా నయం...సరిహద్దు దేశాల వారిని, ఐక్య రాజ్య సమితి సభ్యులను కూడా "స్టేక్ హోల్డర్స్" చేద్దామని అనడం లేదు!

అన్నింటికన్నా వింతైన వార్తలను గత వారం కొన్ని పత్రికలు ప్రచురించాయి. వాటిలో నిజా-నిజాలెంతవరకో కాని, అందులో ఏ మాత్రం వాస్తవం వున్నా, పరిస్థితి గందరగోళం అనక తప్పదు. తెలంగాణ సమస్యను వేగంగా పరిష్కరించమని, లేకపోతే, తాము తమ-తమ నియోజక వర్గాల్లో తిరగడం కష్టమని, తమ మనుగడ - కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని, మొర పెట్టుకోవడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు-ప్రజా ప్రతినిధులకు, మన్మోహనే తన మొర వినిపించాడట. అదో వింత అనుభవం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొందరు. తానూ-తన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగడం ఇబ్బందికరంగా వుందని, ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాకపోతే, తన మొర ఎలా వున్నా, తెలంగాణ నాయకుల మొరను అధినేత్రి సోనియా దృష్టికి, కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంచి మనసుతో అన్నారు పాపం ప్రధాని! తాను, తన పార్టీ కేంద్ర స్థాయి నాయకులు, తన సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకుంటున్న చొరవకు సంబంధించిన అన్ని సంగతులు వివరించారట ప్రధాని.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చారో, అలానే తిరుగు ప్రయాణం కట్టారు కేసీఆర్ అని కొందరనడం హాస్యాస్పదం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా జరుగుతుందంటే, ఆయన ప్రమేయం ఏదీ లేకుండా ఎలా వుంటుంది? తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాని పక్షంలో, రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, కాంగ్రెస్ తెలంగాణ నాయకులు, తెలుగుదేశం తో సహా ఇతర పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో, కారణాలేవైనా, తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం ఓ స్పష్టమైన అంచనాకు వచ్చిందనేది స్పష్టం. ఇక ఎంతమాత్రం నాన్చడం మంచిది కాదని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారుతోందని అర్థమవుతోంది కాంగ్రెస్ అధిష్టానానికి. కళ్లున్న కబోదులకు, మూసిన కళ్లను తెరవక తప్పలేదు. ఒకరి వెంట మరొకరిని ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. గవర్నర్ నరసింహన్ ప్రధానిని, రక్షణ మంత్రి ఆంటోనీని కల్సినట్లు సమాచారం. మరోపక్క, ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ, ఇతర నాయకులు ఆజాద్ ను, ఇతర ప్రముఖులను కలుస్తున్నారు. ఉక్కు పిడికిలితో ప్రజాభిప్రాయాన్ని అణచి వేయడం అసాధ్యం అనే సంగతి స్పష్టమైంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందనాల్సిందే. ఆటకు ముగింపు రానున్నది.
Thursday, May 26, 2011
అయోమయం-అస్తవ్యస్తం-గందరగోళం:వనం జ్వాలా నరసింహారావు
అక్కడ పునరంకితం... ఇక్కడ దినదిన గండం
(సూర్య దిన పత్రిక:27-05-2011)
వనం జ్వాలా నరసింహారావు
కేంద్రంలో తొలి మలి విడతలు కలిపి ఏడేళ్లు; రాష్ట్రంలో సీఎంలు మారినా కాంగ్రెస్ దే పెత్తనం; అక్కడా, ఇక్కడా అధినేత్రే కీలకం; సమస్యల పరిష్కారంలో వైఫల్యమా, సాఫల్యమా?; అవినీతి విషయంలో ప్రజల ఆందోళన; ఇక్కడ పోగ్రెస్ రిపోర్టులూ లేవు, పునరంకితాలూ లేవు!; అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం!
అక్కడ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలైన్స్" (యుపిఎ) తొలి-మలి విడతలు కలిపి అధికారంలో కొచ్చి ఏడేళ్లు, ఒక్క మలివిడత అధికారంలో కొచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక ఇక్కడ, ఆంధ్ర ప్రదేశ్ లో, పదేళ్ల విరామం అనంతరం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, తొలి విడత పూర్తి కాలం-మలివిడత నాలుగు నెలలు ఆయనే ముఖ్య మంత్రిగా, ఆయన మరణానంతరం రోశయ్య కొన్నాళ్లు-ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ముఖ్య మంత్రిగా, అధికారంలో కొచ్చి కూడా ఏడేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ, రాజశేఖర రెడ్డి వున్న రోజుల్లో కొద్ది మోతాదులో, రోశయ్య గారి హయాంలో తగు మోతాదులో, ప్రస్తుతం పూర్తి మోతాదులో, ఎవరు ముఖ్యమంత్రైనా అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరుగుతున్నదిప్పుడు.
కేంద్ర ప్రభుత్వ సాఫల్యాలపై ప్రధాని మన్మోహన్ ఏటేటా విడుదల చేసే "ప్రోగ్రెస్ రిపోర్టు" ఈ ఏడాది కూడా విడుదలైంది. తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పాలనలోని విజయాలను గత ఏడాది విడుదల చేసిన రిపోర్టులో ఆయన ప్రస్తావించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడంలో తమ సర్కారు విజయం సాధించిందని అప్పట్లో ప్రధాని తెలిపారు. గడిచిన సంవత్సరం 8.5 శాతం వార్షిక వృద్ధిరేటు సాధిస్తామన్న ధీమాను ఆయన అప్పట్లో వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ముందంజలో ఉన్నామన్నారు. నక్సల్స్ సమస్య తమ ముందున్న ప్రధాన అడ్డంకిగా ఆయన తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయన గత ఏడాది చెప్పిన వాటిలో చేసినవి కొన్ని, చేయలేనివి మరి కొన్ని వున్నాయి. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందే దిశగా, రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోను, కేంద్ర మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల సఫలతలను-విఫలతలను విశ్లేషించి చూపుతూ, యుపిఎ-2, మరో మారు ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు విడుదల చేసింది. అవినీతి, ద్రవ్యోల్బణం, సంకీర్ణ కష్టాలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల ప్రభుత్వాన్ని బాధిస్తున్న అంశాల్లో ముఖ్యమైనవిగా నివేదికలో పొందుపరచడం గమనిస్తే, వాటిని ఎదుర్కోవడంలో నాయకత్వం కొంత మేరకు విఫలమైన ట్లుగా భావించాల్సి వస్తుంది. ప్రధాని మన్మోహనే అయినప్పటికీ, ఆయన విడుదల చేసే రిపోర్టును మొదట యుపిఎ రధ సారధి, కాంగ్రెస్ అధినాయకి సోనియా గాంధీకి చూపి మరీ బహిర్గతం చేశారు ప్రధాని. ప్రభుత్వ విజయాలను గురించి విపులంగా పేర్కొన్నారు కూడా.
రిపోర్టులో ఏముందనేదాని కంటే, తాము చేసిందే దో చెప్పే ప్రయత్నమై తే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రం విషయానికొస్తే, రాజశేఖర రెడ్డి హయాంలో, ఏటేటా, ఆయన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజున, "పునరంకిత సభలు" జరిగేవి. ఆ సందర్భంలో, తమ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చేసినా వాగ్దానాల అమలులో, ఎలా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ పోయింది సవివరంగా-సభా ముఖంగా, అఖిల భారత స్థాయి-రాష్ట్ర స్థాయి అతిరధ-మహారధ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రజలకు తెలియ చేసేవారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంటివి ఎలా అమలవుతున్నాయో సగర్వంగా, బహిరంగసభ జరిపి చెప్పేవారు. ఆ పథకాల అమలులో జరుగుతున్నాయని భావించిన లోటుపాటులను కూడా ప్రజలు మరిచిపోయేలా, ఆయన వివరించేవారు. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనట్లే. రెండేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో, మే నెల 20, 2009 న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైందన్న సంగతే ఎవరికీ గుర్తున్న దాఖలాలు లేవు. పునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తున్నట్లు లేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!
అసలు అక్కడా-ఇక్కడా (అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను) ఏం జరుగుతోందని నిశితంగా పరిశీలిస్తే, ఏదన్నా కనీసం జరుగుతోందా? అన్న అనుమానం వేస్తోంది. మన్మోహన్ సింగ్ నీతికి-నిజాయితీకి మారు పెరే కావచ్చు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడో-బాధ్యుడో కావచ్చు. సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడే కావచ్చు. మంత్రి మండలి సభ్యులందరి మన్ననలను పొందుతుండవచ్చు. దేశ-విదేశాల్లో తనకూ-భారత దేశానికీ పేరు-ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నాడన్న గుర్తింపు పొందివుండవచ్చు. ఇవేవీ, సామాన్యులకు పట్టదు. అందునా మధ్య తరగతి ప్రజానీకానికి అసలే అవసరం లేదు. వాళ్ల దృష్టంతా, అతి తక్కువ సమస్యలతో, ఎలా జీవన యానం సాగించాలన్న అంశంపైనే. ఆ అంశానికి సరాసరి సంబంధమున్న, ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలోని అధికార-అనధికార వ్యక్తుల్లో పేరుకుని-కూరుకుపోయిన అవినీతి అనే బ్రహ్మ పదార్థం గురించి మన్మోహన్ ఏం చేశాడన్నది వారి ముందున్న ప్రశ్న. రాజా టెలికాం స్కాం, సురేష్ కల్మాడి కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో పాల్పడిన అంతులేని అవినీతి లాంటి అంశాలు సామాన్యుడి మదిని అహర్నిశలు తొలి చేస్తుంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, నిత్యావసర వస్తువుల దరలు ధనవంతుడికి కూడా అందుబాటులోకి లేనంత ఘోరంగా పెరిగి పోతుంటే, తమ దగ్గర పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్న పైకం బాహాటంగా అవినీతి చక్రవర్తులు స్వాహా చేస్తుంటే, నిశ్శబ్దంగా-నిబ్బరంగా గమనించడం తప్ప చేయగలిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో కలగడాన్ని, మన్మోహన్ రిపోర్టులో ఏ విధంగా వివరించబడిందో అర్థం కావడం లేదు. అహర్నిశలు భాగస్వామ్య పక్షాలను ఎలా మంచి చేసుకోవాలన్న తపన, మంచి చేసుకోక పోతే ప్రభుత్వం మనుగడ వుండదేమోనన్న ఆందోళనతో కాలం గడుపుతున్నదేమో కేంద్ర ప్రభుత్వం అన్న భావన పలువురి లో కలగడంలో తప్పులేదే మో!
ఇక మన రాష్ట్రం విషయానికొస్తే అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం! రాజశేఖర రెడ్డి అకాల మరణం రాష్ట్ర రాజకీయాలలో-అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అంతుచిక్కని శూన్యాన్ని తెచ్చి పెట్టింది. ఆయన బ్రతికున్నంత కాలం ఆయనతో ఎట్లా వేగాలో-ఆయన్నెట్లా అదుపుచేయాలా అని ఆలోచించిన కాంగ్రెస్ అఖిల భారత స్థాయి అధినాయకత్వం, ఆయన మరణానంతరం, ఆయనకు ధీటైన వారసులెవరో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది. ఆయన ప్రారంభించిన పథకాలకు నిధులెలా సమకూర్చాలో అని మధన పడిన అలనాటి ఆర్థిక మంత్రి రోశయ్య, ముఖ్య మంత్రయ్యాక, ఆ పథకాలను ఎలా ఊడగొట్టాలో అన్న ఆలోచనలో పడిపోయారు. ఆయన తర్వాత ముఖ్య మంత్రిగా అధిష్టానం ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల మద్దతు కూడగట్టడంలోనే సమయమంతా గడిచిపోతుంది. మరో వైపు అధికార యత్రాంగం ఎవరికివారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఏ పథకం అమలు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో, ఏ పథకం అమలు చేస్తే ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చో, అన్న విషయం మంత్రులకు తెలియదు. తెలియ చేయాల్సిన అధికారులకు ఆ సంగతే పట్టదు. పట్టించుకున్న ఒకరిద్దరు అధికారులకు సముచితమైన గుర్తింపు వుండదు. అందుకే ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టులు లేవు. పునరంకితం ప్రస్తావనే లేదు.
ఇవన్నీ ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప మరేదీ కానందున, అన్ని పార్టీల వారికి చెందిన వారిలో వీలున్నంత మందిని, తమ వైపు ఆకర్షించుకునే కార్యక్రమంలో వారు నిమగ్నమై వున్నారు. సోనియా గాంధీని ఎదుర్కుని కడపలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయ భేరీకి కాచుక్కూచున్నారు. తమ పార్టీలో వున్న వారు తెలంగాణ పేరు మీదో-మరే కారణానో పార్టీ వదిలి పోకుండా జాగ్రత్త పడుతూ, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఆధిక్యాన్ని పెంచుకునే పనిలో టీడీపి వుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోను కోల్ఫొకుండా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకుండా వేయాల్సి నన్ని ఎత్తులు వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిజీగా వుంది. ఇక బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతరులు ఇవేవీ తమకు పట్టనట్లు, వారి సహజ ధోరణిలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నంలో వారున్నారు.
ప్రజలకు మాత్రం అంతా అయోమయం-అంతా అస్తవ్యస్తం-అంతా గందరగోళం గా కనపడుతున్నవి!

