Showing posts with label ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం. Show all posts
Showing posts with label ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం. Show all posts

Tuesday, September 6, 2011

108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ట్రస్టీ ఏర్పడాలి: వనం జ్వాలా నరసింహారావు

108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ట్రస్టీ ఏర్పడాలి

108 ఒడిదుడుకుల వాస్తవాలు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-09-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఇ.ఎం.ఆర్.ఐ - 108 ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య మాజీ కన్సల్టెంటు

అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సర్వీసులను నడిపే శక్తి ప్రభుత్వానికి లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి. అంబులెన్సుల నిర్వహణ విషయంలో సర్కారు ఇరకాటంలో పడిందన్న వార్తలూ పొక్కాయి. రెండేళ్లుగా వీటిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థనుంచి వాటిని తొలగించే అవకాశం వున్నట్లు కూడా సమాచారం. ఎవరు-ఎలా నిర్వహిస్తారో అనే విషయం పక్కన పెడితే, తిరగవలసిన 802 అంబులెన్సుల్లో సుమారు 300 వరకు ఏమైనా యో-ఎక్కడున్నాయో అంతుపట్టకుండా పోయింది. 108 సేవల కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒక్కో అంబులెన్సుకు నెలకు ఇంతవరకు ఇస్తున్న రు. 1, 12, 499 కంటే తక్కువగా కేవలం రు. 95 వేల చొప్పున మాత్రమే చెల్లించాలని సూచించినప్పటికీ, .ఎం.ఆర్.ఐ అంగీకరించడం వెనుక కారణాలు అర్థం చేసుకోవడం కష్టమే! రు. 42 కోట్ల బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు కూడా జీవీకే సంస్థ ఒప్పుకున్నదట! 108 నిర్వహణ అధ్వాన్నంగా మారిన విషయం జగమెరిగిన సత్యం. అసలు ఆ సంస్థకు అంబులెన్సులు నడవడం కన్నా, ఆ సేవలను ఎలాగైనా నిర్వహించడమే ప్రధానంగా కనిపిస్తోంది.

ఒక్కో 108 అంబులెన్సు ప్రతి రోజూ కనీసం 3-4 పర్యాయాలైనా ఎమర్జెన్సీ సేవలందించేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాలి. సగటున అవి ఇప్పుడు 1-2 సార్లన్నా చేస్తున్నాయో-లేదో అనుమానమే! కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్లు కూడా గణనీయంగా పడిపోతున్నట్లు సమాచారం. ప్రతిసారీ రామలింగ రాజు హయాంలో యాక్సెస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రు. 42 కోట్ల రుణానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తుంటారు. అదేదో ఘన కార్యం చేస్తున్నట్లు తాను ఆ రుణానికి పూచీకత్తు పడతానని సంస్థ చైర్మన్ అనడం గమనించాల్సిన విషయం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రు. 60 కోట్ల నిధులను (రాజు హయాంలో చేసిన అప్పుల కింద?) సమకూర్చానని సీఎం వద్ద ఆయన వాదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా మరో 9 రాష్ట్రాలకు సహాయ సేవలను విస్తరించానని, జీవికే అనడం హాస్యాస్పదం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన చొరవతో కనీసం ఒక్క టంటే ఒక్క రాష్ట్రం కూడా కొత్తగా 108 సేవల నెట్‌వర్క్ లోకి రాలేదనే ది వాస్తవం. పైగా అంతకు ముందున్న రాజస్థాన్ రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పరిధి నుంచి వైదొలగింది కూడా.

"లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ దే. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవలు, ఇతర రాష్ట్రాలలో అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంటే, అవి ఆవిర్భవించిన రాష్ట్రంలో, కుంటుపడడం దురదృష్టం. 108 సేవలను తన సొంత నిధులతో ఆరంభించిన రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లిన తర్వాత తలెత్తిన పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం, అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రెండున్నరేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయం. దానికి ప్రత్యక్ష సాక్షులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే. సత్యనారాయణలతో సహా పలువురు ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ ప్రతినిధులు.

.ఎం.ఆర్.ఐ సొంత నిధులతో ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సులను ప్రవేశ పెట్టింది. తర్వాత తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలకు, రాష్ట్రంలోని అన్ని జిల్లా-రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు మొత్తం 70 వాహనాలతో విస్తరించింది. జనవరి 2007 లో గ్రామీణ ప్రాంతాలకు సేవలు విస్తరించడం, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 502 అంబులెన్సులు సేవలందించడం జరిగింది. మే నెల 2008 లో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి, నిర్వహణ వ్యయంలో 95% ప్రభుత్వం భరించాలని, అంబులెన్సుల సంఖ్యను దశలవారీగా 802 కు పెంచాలని నిర్ణయించింది. అప్పటినుంచి ఇంతవరకు 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం, పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం మొదలైంది.అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? ఇటీవల కింది స్థాయి సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వార్తలొస్తున్నాయి. కనీసం నాలుగొందల వాహనాలు సేవలను అందించలేని పరిస్థితుల్లో నిరుపయోగంగా పడి పోయాయంటున్నారు. ఏది నిజం?

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వభావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. ఐనా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం నియమించిన కమిటీ, ఆర్థిక శాఖ కొంచెం లోతుగా అధ్యయనం చేయడం మొదలెట్టింది. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో ఇంకొక ముసాయిదాను తయారు చేసి, పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో ప్రభుత్వం-.ఎం.ఆర్.ఐ మధ్య కుదుర్చుకున్న మొదటి, రెండో, మూడో ఎంఓయు విషయంలో గాని, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో గాని ఏ విధమైన అభ్యంతరాలను ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రాతిపదిక ఆధారంగా ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది.

ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్., ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. దరిమిలా నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం. ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది కొత్త ముసాయిదాలో. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు !) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే (జీ.వి.కె) .ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాజు చైర్మన్ గా తొలగిన సమయానికి ఇ.ఎం.ఆర్.ఐ ఇరుక్కుపోయిన సుమారు రు. 120 కోట్ల "అప్పుల ఊబి" వ్యవహారం కూడా ఆర్థిక శాఖకు ఎంతమాత్రం రుచించలేదు. అసలు విషయాలిలా వుంటే ఎంఓయు ఎలా కుదురుతుంది?

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు? నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు? కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు? రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు? ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా? ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు? ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు? చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ?

సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజుపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రం ముందస్తుగా నిధులను విడుదల చేయడం జరిగింది. గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా విడుదల చేసింది. ఆ తర్వాత కాలంలో ప్రతి రాష్ట్రం పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కింద కు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం.

ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సిందే.

రామలింగ రాజు జైలుకెళ్లే ముందర తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయం కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఆ తర్వాత జి.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. పిరమల్ అధినేత, జి.వి.కె. లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.

రాజు సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో? సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షణ లేని" వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.

ఇంతవరకూ జరిగిందే దో జరిగింది. ఇక ముందైనా, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రయివేట్ సంస్థ కాని-వ్యక్తి కాని ఏ ఒక్కరో కాకూడదన్న నిబంధన రావాలి. పటిష్టమైన "ట్రస్టు" చేతుల్లో ప్రయివేట్ పరమైన యాజమాన్య బాధ్యతలు వుంచాలి. ఇ.ఎం.ఆర్.ఐ అప్పులను, దానికున్న ఆస్తులతో కలిపి విశ్లేషించాలి. అవెవరివో తేల్చాలి. అప్పుడే మరో అడుగు ముందుకు వేయాలి. అంతవరకు, 108-అత్యవసర సహాయ సేవలు ఆగకుండా-నాణ్యతతో నిర్వహించాలి. ప్రభుత్వానికి వాటిని నడిపే శక్తి లేదని సంబంధిత మంత్రి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. 104 కాల్ సెంటర్ సేవలను, నిర్ధారిత తేదీ సహాయ సేవలను హెచ్.ఎం.ఆర్.ఐ నుంచి తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపగలిగిన శక్తి వున్న ప్రభుత్వానికి 108-అత్యవసర సహాయ సేవలు నడపగలిగే సామర్థ్యం లేదా?


Saturday, July 24, 2010

XIII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-13) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-13
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నోడల్ ఏజన్సీగా, 108-అత్యవసర సహాయ సేవలు, ఆంధ్ర ప్రదేశ్ తో సహా పది రాష్ట్రాలలో లభ్యమవుతున్నాయిప్పుడు. గుజరాత్, ఉత్తరాంచల్, గోవా, తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, అస్సాం, మధ్య ప్రదేశ్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుని, ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే అత్యవసర సహాయ సేవలు అక్కడి ప్రజలకు పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్యం సంక్షోభం దరిమిలా, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు జనవరి 2009 లో రాజీనామా చేయడంతో, మీడియాలో ఆ సేవలందించడం పట్ల సందేహాలు వ్యక్తమైన నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలాంటి హామీనే 108-అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించారు. అంతవరకు ప్రభుత్వం భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని, నూటికి 100% భరించడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టులో ఇ.ఎం.ఆర్.ఐ కి వ్యతిరేకంగా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గాని, సంస్థ చైర్మన్ రాజీనామా గాని, ఆ సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకున్న "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" సడలించ లేకపోయాయి . అప్పట్లో "విశ్వసనీయత" కు ఇ.ఎం.ఆర్.ఐ పర్యాయపదం అనొచ్చు. ఈ అన్ని రాష్ట్రాలలో మేఘాలయ ప్రభుత్వాన్ని మరీ-మరీ అభినందించాలి. కోర్టు కేసులో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అందాయని తెలిసి కూడా, సంస్థ చైర్మన్ రాజీనామా చేశారని తెలిసి కూడా, ఫిబ్రవరి 2009 లో, వీటన్నిటి కి అతీతంగా, అక్కడి అధికారులు-అనధికారులు ఒక్క మాట మీద నిలబడి, ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా నియమిస్తూ ఎంఓయు కుదుర్చుకునేందుకు కృషి చేశారు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రపంచంలోనే, అత్యంత అరుదైన పద్ధతిలో, అత్యవసర సహాయ సేవలను పూర్తి ఉచితంగా పౌరులకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం-ఆ రాష్ట్ర (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి. అచిర కాలంలోనే, ఇక్కడ లభిస్తున్న ఈ అరుదైన తరహా సేవల ప్రక్రియను అధ్యయనం చేసేందుకు, పొరుగు రాష్ట్రాల నుంచి-విదేశాల నుంచి అధికార-అనధికార ప్రతినిధులు, బృందాలు రావడం మొదలయింది. అంతటితో ఆగకుండా, ఆ సేవలను ఇతర రాష్ట్రాలలో ఆరంభించడం కూడా మొదలయింది. అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇ.ఎం.ఆర్.ఐ ద్వారా సేవలను ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. రాజుగారు చైర్మన్ గా వుండి వుంటే, ఈ పాటికి కనీసం రెండు-మూడు ఇతర దేశాలలో ఇ.ఎం.ఆర్.ఐ ఝండా ఎగురుతుండేదే ! ఇప్పుడిక ఆస్కారం లేకపోగా, అప్పట్లో ముందుకొచ్చిన కొన్ని ప్రభుత్వాలు వెనక్కు తగ్గుతున్నాయి కూడా. సేవలు లభ్యమవుతున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాల ఆలోచనా ధోరణిలో కొంత మార్పు వస్తున్న సంకేతాలు అందుతున్నాయి. మరో వైపు, గతంలో మాదిరిగానే, ఇ.ఎం.ఆర్.ఐ పట్ల-సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి పట్ల "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ప్రదర్శిస్తూ, ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఏప్రిల్ 2010 లో, ఎంఓయు కుదుర్చుకుంది. ఆ "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఆయన పై స్థాయిలో వున్న"భాగస్వామ్య యాజమాన్యం" ఎంతవరకు నిలుపుకోగలుగుతుందో చూడాలి.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన అత్యవసర సహాయ సేవలు, దరిమిలా, అతి కొద్ది కాలంలోనే, పది రాష్ట్రాలకు వ్యాపించడం, సుమారు మూడువేల అంబులెన్సుల ద్వారా ప్రతిరోజు పది-పదిహేను వేలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన వ్యక్తులను సమీప ఆసుపత్రికి చేర్చడం, కులాలకు-మతాలకు-రాజకీయాలకు-సామాజిక వర్గాలకు-ధనిక, బీద తేడాలకు-స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా లక్షల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయడం పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలను, పరిశోధకులను ఆసక్తి పరిచాయి. అసలీ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ఏమిటని-ఎలా రూపు దిద్దుకుంటుందని-మనుగడ ఎలా సాగిస్తున్నదని ప్రశ్నించసాగారు. వాస్తవానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా మనకు లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. ప్రయివేట్ భాగస్వామి "లాభాపేక్ష" తో ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం-కొనసాగించడం ఆచరణ సాధ్యమవుతుందేమోగాని, "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అత్యవసర సహాయ సేవలు పది రాష్ట్రాలలో లభ్యం కావడానికి ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడం మంచిది. ఈ భాగస్వామ్యంలో ప్రయివేట్ భాగస్వామిగా కేవలం ఇ.ఎం.ఆర్.ఐ నే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఎంపిక చేశాయో-ఎలా ఎంపిక చేశాయో-చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం కూడా అవసరమే. ఆ విషయాలు సవివరంగా తెలుసుకునే ముందర ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల వారపత్రిక (ఔట్ లుక్, జనవరి 26, 2009) ఇ.ఎం.ఆర్.ఐ ని తప్పుబడుతూ ప్రచురించిన వ్యాసంలోని ముఖ్య విషయాలపై దృష్టి సారించాలి. సత్యం కుంభకోణం-సుప్రీం కోర్టులో ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపధ్యంలో ప్రచురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య సిద్ధాంతానికి-ఆచరణకు సంబంధించినవైనందున వాటిని ప్రస్తావించడం ఇక్కడ అవసరమని భావిస్తున్నాను. సత్యం కుంభకోణం నేపధ్యంలో రాజుగారికి సంబంధముందనుకున్న సంస్థలన్నిటి మీద నిఘా సంస్థల కన్ను పడిందని, సత్యం కంప్యూటర్ సర్వీసుల అనుబంధ సంస్థలకు చెందిన సమాచారాన్నంతా వెబ్సై్ట్లోంచి తొలగించే ప్రయత్నం చేసినా ఇ.ఎం.ఆర్.ఐ ని వేరుపరచడం సాధ్య పడలేదని, రాజు గారికి చెందిన 108-అత్యవసర సహాయ సేవలను ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేయడానికి "అనైతిక పద్ధతులను" అవలంబించారని, "టెండర్లను-ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇన్ట్రె స్టులను" తమకు అనుకూలంగా మలచుకోవడానికి అధికారులను ప్రభావితం చేశారని, తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి "భారీ మొత్తంలో బడ్జెట్" కేటాయింపులు జరిగేలా చేశారని ఆ వ్యాసంలో ఆరోపించడం జరిగింది. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న "యాజమాన్య స్థాయి ఉద్యోగులు" భారీ మొత్తంలో వేతనాలు పొందేవారని, అందులో కొందరి జీతభత్యాలన్ని కలిపి, ఏడాదికి సుమారు "కోటి రూపాయల" వరకుంటుందని ఆరోపించబడింది.

ఆగస్టు 15, 2005 న కేవలం 30 అంబులెన్సులతో ఆంధ్ర ప్రదేశ్ లో ఆరంభమయిన ఇ.ఎం.ఆర్.ఐ ప్రస్థానం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి, నెల-నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 12, 000 చొప్పున, నిర్వహణ వ్యయంలో ప్రభుత్వ పరంగా లభించిన 95% నిధులతో, తమ వంతుగా కేవలం 5% నిధులను మాత్రమే భరిస్తూ, 652 అంబులెన్సులను నడిపే స్థాయికి ఎదిగిందని, ఇక అక్కడినుంచి, ఇతర రాష్ట్రాలలో "టెండర్" ప్రక్రియను ప్రభావితం చేసి దిన-దిన ప్రవర్థమానం అయిందని వ్యాసంలో రాశారు. అప్పట్లో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య యూనిట్ లీడ్ పార్ట్ నర్ హోదాలోను, తర్వాత కన్సల్టెంట్ గాను పనిచేస్తున్న "జ్వాలా నరసింహారావు" (నేను), తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి (పి. డబ్ల్యు. సి. డవిడర్) తో నిరంతరం సంబంధాలు ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వం విడుదల చేయబోయే టెండర్ అడ్వర్టయిజ్ మెంటులో పొందుపరచాల్సిన అంశాలను ఇ.ఎం.ఆర్.ఐ కి అనుకూలంగా వుండే విధంగా తయారు చేయించాడని ఆరోపణ కూడా వుందా వ్యాసంలో. అందుకు సాక్ష్యంగా ఇరువురి మధ్య సాగిన ఇ-మెయిల్ కమ్యూనికేషన్లు తమ దగ్గరున్నాయని పేర్కొన్నారు. అలానే మధ్య ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను రాశారందులో. దీంట్లో అనైతికత ఏమీ లేదని నేను చేసిన వ్యాఖ్యానాన్ని కూడా ప్రచురించారు అదే వ్యాసంలో. టెండర్లలో అత్యవసర సహాయ సేవలను నిర్వహించడానికి కావాల్సిన అనుభవం విషయంలో ఇ.ఎం.ఆర్.ఐ కున్న అనుభవానికి సరిపడే విధంగా మేం రాయించామని మరో ఆరోపణ చేశారు.

రెండు సంవత్సరాలలో, అంబులెన్సు నిర్వహణ వ్యయాన్ని, ఇ.ఎం.ఆర్.ఐ, నెలకు రు. 14, 000 నుంచి రు. 1,12,000 కు పెంచిందని మరో అసంబద్ధమైన ఆరోపణ కూడా చేసింది ఆ వార పత్రిక. మరీ హాస్యాస్పదమైన విషయం ఇంకోటుంది. ప్రపంచ బాంక్ నిధులతో, అప్పటివరకు తమిళనాడులో, నెల-నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 10,000 సరిపోతుండగా, ఇ.ఎం.ఆర్.ఐ ప్రభావితం చేసినందున దాన్ని లక్ష రూపాయలకు పెంచారని దాని సారాంశం. ఇ.ఎం.ఆర్.ఐ పైన చేసిన ఆరోపణలకు బలం చేకూరేందుకు, సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన (ట్రాన్సపరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్) సంస్థకు చెందిన వ్యక్తి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు లోని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. వ్యాసంలోని ప్రతి అంశానికి వివరణ ఇస్తూ పంపిన లేఖను ప్రచురించే సాహసం ఇంతవరకూ చేయలేదాపత్రిక. ఇ.ఎం.ఆర్.ఐ ఇతర రాష్ట్రాలలో కూడా అత్యవసర సహాయ సేవలను ఎలా ప్రారంభించింది, నిర్వహణ వ్యయం పెంచడంలోని నిజా-నిజాలు వివరంగా మరో చోట తెలియచేస్తాను. క్లుప్తంగా, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, నిర్వహణ వ్యయం పెరిగిందా, లేక, ప్రభుత్వ పరంగా అందిస్తున్న నిధులు పెరిగాయా అనేది ఇక్కడ వివరిస్తాను.

ప్రభుత్వ పరంగా చాలాకాలం నుంచీ ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, సంస్కరణలే శరణ్యమని, ఆ రంగంలోని నిపుణులు నిర్ధారించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలనే సరైన రీతిలో నిర్వహించలేని స్థితిలో వుందని గుర్తించింది ప్రభుత్వం. దానికి ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం కూడా భావ్యం కాదు. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా గ్రామీణ-గిరిజన ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు కావల్సినంత సంఖ్యలో ముందుకు రావడం లేదు. పట్టణాలలో పరిస్థితి మరో మాదిరిగా వుంది. ప్రభుత్వ పరంగా లభించే వైద్య సేవలకు ధీటుగా-మరింత మెరుగుగా ప్రయివేట్ సేవలు ఆరంభమై, అచిర కాలంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేసే స్థాయికి వ్యవస్థ మారింది. ఈ నేపధ్యంలో, సామాన్యుడికి-అ సామాన్యుడికి మధ్య ఆరోగ్య-వైద్య సేవలు లభించడం విషయంలో అంతరాలు పెరిగాయి. ప్రయివేట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చింది. సంస్కరణలకు నాంది పలికింది ప్రభుత్వం. సంస్కరణలలో ప్రధానంగా పేర్కొనాల్సింది ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ద్వారా ఆరోగ్య-వైద్య సేవల కల్పన. మన దేశంలో, స్వాతంత్ర్యం లభించిన తర్వాత, వరుస పంచవర్ష ప్రణాళికలలో-జాతీయ ఆరోగ్య, వైద్య విధానాలలో-ప్రపంచ బాంక్ ఆదేశాలలో, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ఆవశ్యకతకు సంబంధించి కొంత పురోగతి కనిపించినప్పటికీ, 2004 లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణాత్మకమైన ప్రగతి కనిపించిందనాలి. ఆయన ఆలోచనా ధోరణికి అనుకూలంగా రూపుదిద్దుకున్న "జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్" ఈ ప్రక్రియకు మరికొంత ఊతమిచ్చిందనాలి. ఆ ఆలోచనల-ఆచరణల అడుగుజాడల్లోనే, అత్యవసర సహాయ సేవలను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లో చొరవ తీసుకోవడం, క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం జరిగింది.

అనవసర జాప్యాలకు, ప్రభుత్వ ఉద్యోగులలో కూరుకుపోయిన అలసత్వానికి అతీతంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు లభ్యమయ్యే అభివృద్ధి-సంక్షేమ పథకాలను మరింత మెరుగుగా-వేగవంతంగా అందించాలన్న ఆశయంతో, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న పలు ప్రజాస్వామ్య దేశాల్లో, ఐదారు దశాబ్దాల క్రితం ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జరిగింది. దురదృష్టవశాత్తు, యావత్ ప్రపంచంలో, అధిక సంఖ్యాకం ప్రభుత్వ రంగ సంస్థలు, ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వకపోగా, నష్టాల్లో కూరుకుపోయాయి. మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా వున్న కాలంలో, ఆమె చొరవతో రూపు దిద్దుకున్న "ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలు" క్రమేపీ వివిధ దేశాల ప్రభుత్వాధినేతలను ఆకర్షించాయి. సంస్కరణల పుణ్యమా అని, భారతదేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరిగింది. వాటి మూసివేతకు కొంత ముందు-వెనుకగా నెల కొన్న "జాయింట్ వెంచర్లు" కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. "ప్రభుత్వ ప్రయివేట్ సంయుక్త రంగంలో" స్థాపించిన పరిశ్రమలలో చాలా వరకు, యాజమాన్య పరమైన బాలారిష్టాలకు గురై, మూసివేయడం జరిగింది. సుమారు దశాబ్దంన్నర-రెండు దశాబ్దాల క్రితం, ఒకే ఒక్క సంవత్సరంలో, స్వదేశీ-విదేశీ సంస్థల భాగస్వామ్యంలో వందల సంఖ్యలో నెలకొల్పిన జాయింట్ వెంచర్లు, విరివిగా లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతో వెలిసినప్పటికీ, నష్టాల బాటలో పయనించాయి.

ఒక వైపు వీటి పరిస్థితి ఇలా వుంటే, మరో వైపు, ప్రయివేట్ రంగంలో నెల కొన్న అనేక సంస్థలు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, లాభాలను ఆర్జించడం కూడ మొదలయింది. ప్రభుత్వ రంగ సంస్థల, జాయింట్ వెంచర్ల చేదు అనుభవాల నేపధ్యంలో-ప్రయివేట్ పరంగా మెరుగైన పౌర సేవలు లభ్యమవుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "అవగాహనా ఒప్పందం" (Memorandum of Understanding-MoU).

ప్రభుత్వ శాఖలలోని నైపుణ్యం-నాణ్యతా పరమైన లోటుపాటులను, ప్రయివేట్ రంగంలోని (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల) ఆర్థిక పరమైన ఇబ్బందులను, ఉమ్మడిగా అధిగమించేందుకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం సరైన ప్రక్రియని ప్రభుత్వం గుర్తించింది. ఈ దిశగా, ఆరోగ్య-వైద్య రంగంలో మెరుగైన సేవలందించేందుకు, పదవ పంచవర్ష ప్రణాళికలోనే, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఆవశ్యకతను గుర్తించింది ప్రభుత్వం. అలా గుర్తించడానికి బలవత్తరమైన కారణం కూడా వుంది. అప్పట్లో (బహుశా ఇప్పటికీ), ఆరోగ్య-వైద్య రంగంలోని పలు సేవలను, ప్రభుత్వపరంగా లభించే అవకాశం లేకపోవడంతో, ఆర్థిక స్థోమత లేనివారు కూడా, కార్పొరేట్ రంగాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువనున్న మూడోవంతు పైగా జనాభా మాత్రం, ప్రభుత్వపరంగా లభించే సేవలు ఎలా వున్నప్పటికి-నాణ్యత లోపాలున్నప్పటికీ, తమ వైద్యావసరాలకు అక్కడకు వెళ్లక తప్పలేదు. మధ్యతరగతి వారి విషయం అగమ్య గోచరం. అటు పోలేక-ఇటు పోక తప్పక అప్పుల్లో కూరుకు పోయేవారు. ఈ నేపధ్యంలో, మౌలిక వసతులను ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం, దానికి కావాల్సిన తొలి విడత పట్టుబడి సమకూర్చుకోగలిగే స్థోమత, సాంకేతిక పరిజ్ఞానం అమర్చుకోగల శక్తి గల, లాభాపేక్ష లేని ప్రయివేట్ వ్యక్తులతో-సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే ఆలోచన చేసింది ప్రభుత్వం. పరస్పర సంబంధ-బాంధవ్యాల విషయంలో, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం-నిబద్ధత-హక్కులు-బాధ్యతల విషయంలో, ఎవరి పాత్ర ఏమిటన్న అంశం క్షుణ్ణంగా పరిశీలించాలని భావించింది ప్రభుత్వం.

పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-2012), ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరోగ్య సేవలందించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి, ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కార్య నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య రంగంలోని ఏ విభాగాలలో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ అర్థవంతంగా-సమర్థవంతంగా ఫలితాలనిచ్చే అవకాశాలు, ఆ విధమైన భాగస్వామ్యంలో వ్యయ నియంత్రణ అవకాశాలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను అమలు పరిచే అవకాశాలు, ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలు తీర్చేందుకు భాగస్వామ్య ప్రక్రియ ఎలా తోడ్పడగలదన్న అంశాలు పరిశీలించాల్సిందిగా అధ్యయన నిర్వాహక బృందాన్ని కోరింది ప్రణాళికా సంఘం. ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన-మెరుగైన-నాణ్యమైన సేవలను పౌరులకు లభ్యమయ్యేలా చేసేందుకు, యావత్ వైద్య రంగం "జాతీయ సంపద" గా మలిచేందుకు, ఒక ప్రధానమైన సాధనంగా "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియకు నిర్వచనం వివరిస్తూ పేర్కొంది ప్రణాళికా సంఘం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలోని ప్రయివేట్ పదానికి పెడార్థాలు చెప్పరాదని, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా "ప్రయివేటీకరణ" చేసి, బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని భాష్యం చెప్పొద్దని ప్రణాళికా సంఘం అభిప్రాయం వెలిబుచ్చింది.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు-ధ్యేయాలు చేరుకునేందుకు, అందులో ప్రధాన భాగమైన "గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల పథకం" అమలుకు-ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమై పది రాష్ట్రాలకు పాకిన 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడింది.

Tuesday, April 20, 2010

I-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-1): వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-1
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

గత అరవై సంవత్సరాలలో, స్వతంత్ర భారత దేశ చరిత్రలో అధికారంలో వున్న ఏ ప్రభుత్వమైనా తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటికన్నా అత్యంత కీలకమైంది గా భావించదగింది బహుశా "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" అని ఘంటాపథంగా చెప్పొచ్చు. సరళీకృత ఆర్థిక విధానం కన్నా, ప్రపంచీకరణ కన్నా, కమ్యూనికేషన్ విప్లవం కన్నా... అలాంటి మరెన్నో విధానాలకన్నా క్రమేపీ అన్ని రంగాలలో ఆదరణ తెచ్చుకుంటున్నదీ ప్రక్రియ. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనా విధానానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియగా ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి, ఊపిరి పోసి, ఊతమిచ్చి, కొత్త భాష్యం చెప్పి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి దే. అదే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డి గారికి మరీ ప్రీతిపాత్రమైనది. ఆరోహణ-అవరోహణల మధ్య మహాప్రస్థానం సాగిస్తున్న 108 అత్యవసర సహాయ సేవలు, ఈ రోజున, ఒక వైపు పది రాష్ట్రాలలోని నలభై కోట్ల జనాభాకు లాభం చేకూరుస్తుండగా, మరోవైపు ఆ సేవల ఆవిర్భావం జరిగి, అఖిల భారతావనికి మార్గదర్శకంగా నిలిపిన ఆంధ్ర ప్రదేశ్ లో, రాజశేఖరరెడ్డి గారు మరణించిన అచిరకాలంలోనే అనేకానేక కారణాలవల్ల అవే సేవలు ఒడిదుడుకుల్లో పడుతున్నాయన్న మీడియా కథనాలు అత్యవసర సహాయ సేవల లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ల మన్ననలను-అభినందనలను పొంది, కేంద్రప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వారు నియమించిన అఖిల భారత వైద్య బృందం వారి అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన "108 అంబులెన్స్" ఆవిర్భావం, పరిణామక్రమం, ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు ఆసక్తికరమైనవే కాకుండా పరిశోధకులకు అధ్యయనపరమైనవి కూడా. ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామలింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గార్ల పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు "ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో" కాదు-కాకూడదు. దాని ఆరంభ దశలో, అభివృద్ధి చెందుతున్న దశలో, ఉఛ్చ స్థాయికి చేరుకుని ఇబ్బందులకు లోనయినప్పటికీ సీ.ఇ.ఓ వెంకట్ సంస్థను-సేవలను కొనసాగించడానికి కష్టపడుతున్న దశలో, సేవలందిస్తున్న పది రాష్ట్ర్రాల్లో ఒక రాష్ట్ర్రం విడిపోయే ప్రయత్నం చేస్తున్న దశలో అనుబంధం వున్న వ్యక్తిగా, ఆందోళన చెందుతూ నాకు తెలిసిన వాస్తవాలను నా బ్లాగ్ లో వారం-వారం పొందుపరుస్తున్నాను.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఆ రోజున అన్న ప్రతి మాటా-ఇచ్చిన భరోసా పదే-పదే జ్ఞప్తికొస్తూనే వున్నాయి. ఆ క్రితం రోజున ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు భైర్రాజు రామలింగ రాజు గారు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. తప్పులెంచడానికి గాని, మమ్మల్ని మందలించడానికి గాని జరిపిన సమీక్ష కాదది. రాజు గారు వాస్తవానికి అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించడంతో, సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి-ఆయన లీడర్షిప్ బృందం అయోమయానికి గురై, సమీప భవిష్యత్ లో అత్యవసర సహాయ సేవలను అందించడంలో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కావాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న సందర్భమది.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.

జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారు, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి కూడా, ప్రయివేట్ భాగస్వామ్యం కింద అప్పటివరకూ భరిస్తూ వస్తున్న ఖర్చును ఏదో విధంగా సమకూర్చుకునేందుకు శాయ శక్తులా కృషి చేస్తామనీ, దానికొరకు నాలుగు నెలల సమయం కావాలనీ కోరారు. ప్రయివేట్ భాగస్వామ్య వాటా ఖర్చు కింద తక్షణం ఎంత కావాల్సి వస్తుందని వెంకట్ ను అడిగారు ముఖ్యమంత్రి. జవాబుగా ఆయన అయిదు కోట్లన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయడానికి ముందు రాజశేఖర రెడ్డి గారన్న మాటలు నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనాలి. "రోశయ్య గారూ, పోనీ ఒక పని చేద్దాం. ప్రభుత్వ పరంగా ఇవ్వడం విధానానికి విరుద్ధమన్న విమర్శ వస్తుందని మీరు భావిస్తే, మనమే ఎవరన్నా తెల్సినవాళ్ల ద్వారా ఇ.ఎం.ఆర్.ఐ కి అవసరమైన ఆ అయిదు కోట్ల రూపాయలు ఏర్పాటు చేద్దాం" అన్నారు. ఎంత మంచి మనసాయనదో ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్ దేశానికి పోవడానికి ముందర మే నెల చివరి వారారంభంలో తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీ.ఎం చేసిన మొట్ట మొదటి సమీక్షా సమావేశం అదే. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. "ఏం జరుగుతుంది వెంకట్? ఎవరన్నా ప్రయివేట్ భాగస్వామి దొరికాడా" అని సమీక్ష మొదలవుతూనే అడిగారు. దైవమే ఆయన నోటి నుంచి ఆ ప్రశ్న వేయించిందని భావించాం మేం.

వాస్తవానికి మా పరిస్తితి అప్పటికే అగమ్య గోచరంగా వుంది. వివరాల్లోకి పోయే ముందర ప్రస్తుతానికి క్లుప్తంగా ప్రస్తావిస్తానవి. రామలింగరాజు గారి స్థానంలోకి ఎవరినన్నా "దాత" ను సంపాదించుకునేందుకు వెంకట్ గారు పడని పాట్లు లేవు, ఎక్కని-దిగని "గడప" లేదు. ఏ పుట్టలో ఏ పాముందోనని అన్ని పుట్టలని స్పర్శించాడాయన. మధ్యలో రాజుగారు ఏర్పాటు చేసిన "బోర్డ్ మెంబర్లు" అయిదారుగురు తప్ప ఒక్కరొక్కరే రాజీనామా చేశారు. నిర్వహణ ఖర్చులెలానో ప్రభుత్వ నిధులతో సర్దుకు పోగలిగినా, యాజమాన్య పరంగా నెలనెలా చెల్లించాల్సిన సీనియర్ల జీతాలు అప్పటికి మూడు నెలలుగా చెల్లించడం సాధ్య పడలేదు. అయినా వెంకట్ గారి నాయకత్వంలో నమ్మకమున్నందున ఒకారు కూడా సంస్థను వదిలి పోలేదు. అయితే కొందరిలో నిరాశ చోటు చేసుకో సాగింది. ఈ నేపధ్యంలో సరిగ్గా మే నెల 23, 2009 చావు కబురు చల్లగా అందింది వెంకట్ గారికి. అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న ముంబాయికి చెందిన "పిరమిల్" చేతులెత్తేశారు. సంస్థ లోని కొన్ని లోటుపాట్లను ఎత్తిచూపిస్తూ (వివరాలు ముందు ముందు తెలుసుకుందాం) తనకు రాజు గారి స్థానంలోకి రావడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఇక మిగిలిన ఆశ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీ.వి.కృష్ణారెడ్డి గారు. అయితే అప్పటివరకూ ఆయన ఎటువంటి ఆశాజనకమైన సంకేతాలను ఇవ్వలేదు. అయినా వెంకట్ గారికి-ఆయన బృందంలోని మాకు ఆశ చావలేదు. వెంకట్ గారి బాధను అర్థం చేసుకున్న నాకు ముఖ్యమంత్రి దగ్గరనుంచి కబురొస్తే బాగుంటుందని అనిపించింది. అనుకున్నట్లే ఆయన కార్యదర్శి-ఇ.ఎం.ఆర్.ఐ సబ్జెక్ట్ ను చూస్తున్న స్వర్గీయ సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి ముఖ్యమంత్రిగారి సమీక్షకు సంబధించిన పిలుపొచ్చింది వెంకట్ గారికి. అదే ఇజ్రాయెల్ వెళ్లే ముందర సీ.ఎం జరిపిన సమావేశం.

సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం, ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎం.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ గా మార్పు చెందడం జరిగింది.

ఇంతవరకూ బాగుంది. ఇది జరిగి ఏడాది కావస్తుంది. ఆ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా సంబంధిత అధికారులందరూ వున్నారు. ఆ తర్వాత రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించారు. అంటే ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో ఈ కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా?జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? దివంగత ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండవచ్చు?

వివరాల్లోకి పోవాలంటే వారం వారం చదవాల్సిందే !