Showing posts with label మహాత్మా గాంధి. Show all posts
Showing posts with label మహాత్మా గాంధి. Show all posts

Sunday, March 4, 2012

కాంగ్రెస్‌లో లబ్ది పొందాలంటే ధిక్కరించాల్సిందే!: వనం జ్వాలా నరసింహారావు




వనం జ్వాలా నరసింహారావు

నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘకాలం జాప్యం జరిగినప్పటికీ, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వోటు వేసి, ధిక్కార స్వరం వినిపించిన కాంగ్రెస్ శాసన సభ సభ్యులమీద వేటు పడింది. వారితో సహా మరో రెబెల్, లోక్ సభ సభ్యుడు మేకపాటి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం సహితం కోల్పోయి, తమ భవిష్యత్‌ను తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో పడిపోయారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను గమనిస్తే, ఒకరిపై ఇంకొకరు దుమ్మెత్తి పోసుకునే స్థితికి దిగజారి పోయిందనాలి. అధిష్ఠానం అంటే భయం కూడా లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు కిరణ్-బొత్స వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదులుగా, ఒకే ప్రాంతంలోని సమ్మతి-అసమ్మతి ముఠాలుగా, ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అధిష్ఠానం తన వంతుగా, వర్గాలను-విభేదాలను, అందులోని వ్యక్తుల ఇష్టానుసారంగా, ఒక్కోసారి ఒక్కో విధంగా రెచ్చగొట్టే విధానం అవలంబిస్తుంటుంది. అప్పుడప్పుడూ, తన మాటను మరీ ఖాతరు చేయడం లేదని భావించినప్పుడు, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో-తాత్కాలిక శాశ్వతంగానో వేటు వేయడం, ఆ తర్వాత అదంతా తమ సొంత ఇంటి వ్యవహారంగా పేర్కొనడం, అందరూ సర్దుకోవడం జరుగుతుంటుంది. అందుకే, తాత్సారం చేసీ-చేసీ, ఇక తప్పదనుకున్నప్పుడు, పార్టీని ధిక్కరించిన శాసన సభ సభ్యులపై వేటు వేసింది. నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు.

          ఆంగ్లేయుల పాలనలోని భారతీయ సివిల్ సర్వెంట్-రాజకీయ సంస్కర్త ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే...... ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ ప్రాధమిక సభ్యత్వంస్వీకరించారు. అచిర కాలంలోనే, 1998 లో, కొందరు ఆమె జాతీయతను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పదమూడేళ్లు గా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె "ఏక వ్యక్తి అభిప్రాయమే", “ఏకాభిప్రాయంగా పరిగణలోకి తీసుకోవాలి.

          నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు అణిగిమణిగివుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లయితే, ఏ నాటికీ ప్రధాన మంత్రిఅయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాంకు ఉప ప్రధాన మంత్రి దక్కిందంటే ఎదురు తిరిగి పార్టీని వీడడం వల్లనే! నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది అందుకే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొనసాగినట్లైతే, ఒక ప్రణబ్ ముఖర్జీ వలెనో, గులాం నబీ ఆజాద్ లాగానో, "మంత్రివర్గంలో స్థానం" తో సరిపుచ్చుకోవాల్సిందే.

          భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. చాలావరకు నెహ్రూ-గాంధి కుటుంబీకుల ఆధిపత్యం చుట్టూతా నే అవన్నీ చోటు చేసుకున్నాయనాలి. విశ్లేషించి చూస్తే, ఎదురు తిరగడమైనా చీలిక తేవడమైనా, మోతీలాల్ నెహ్రూతో మొదలెట్టి, ఆ వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, “మనస్సాక్షి చెప్పినట్లునడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

          నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యానికి ఆద్యుడైన ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత అధ్యక్ష బాధ్యతఅప్ప చెప్పారు. వారసత్వానికి, బలమైన పునాదులు, 1929 లోనే వేశారు. ఆ కుటుంబ వారసత్వానికి పరోక్షంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం (రాహుల్? ప్రియాంకా?) త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

          నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ఇందిర ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో, “సామ్యవాదులు”, “సంప్రదాయ వాదులుఅని పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఆధిపత్యం కొరకు వీరు బహిరంగంగానే విమర్శించుకునే వారు. 1967 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీ భారీగా తగ్గింది. పార్టీలో మొరార్జీని ఓడించి ఇందిర ప్రధాని కాగలిగింది. తనను వ్యతిరేకించిన మొరార్జీని మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్ తో సహా, హేమామేమీలైన సంప్రదాయ వాదులను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

          ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన యంగ్ టర్క్స్ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, “కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. “వీర విధేయులుదానికి మద్దతీయగా, “నిశ్సబ్ద వ్యతిరేకులుమౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధి కి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ () అని ఉపయోగించడం మొదలైంది.

          నెహ్రూ-గాంధి వారసత్వంలో నాలుగో తరం పార్టీ నాయకత్వం మొదలైంది. అప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న రాజీవ్ గాంధి నాయకు డయ్యారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, “ఇందిర కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించాడు. దరిమిలా వీపీ సింగ్ ధిక్కార ధోరణిని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే బోఫోర్స్కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, “నేషనల్ ఫ్రంట్ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి వీర విధేయుడిగా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

          నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో, భారత దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మన్ననలందుకోవడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన దరిమిలా, పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

          ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది. ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

          తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా కంట్లో నలుసులతోనే. సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-ప్రణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్ కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం సోనియా చేస్తుండవచ్చు. కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే సోనియాకు మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే.

          అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్(ఆర్-రాహుల్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్-సోనియా) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి-ప్రియాంక) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా సోనియా వుండే అవకాశాలు లేనే లేవు! End

Friday, August 13, 2010

ఆనంద - విషాదాల మధ్య భారత స్వాతంత్య్రం : వనం జ్వాలా నరసింహారావు


బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 సంవత్సరంలో రాయల్‌ చార్టర్‌ ద్వారా జరగడంతో మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అంకురార్పణ మొదలైంది. డచ్‌, బ్రిటిష్‌ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్‌ కంపెనీ అంతగా పురోగతి సాధించ లేకపోయింది. జహంగీర్‌ వంటి మొఘల్‌ చక్ర వర్తులతో బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతినిధులు సత్సంబంధాలు పెంపొందించుకోసాగారు. దరిమిలా సూరత్‌ లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వెలిసింది. బాంబే, ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో, పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, వాణి జ్యపరంగా పటిష్ఠమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు.

మొఘలాయి సామ్రాజ్యం-దాని చక్రవర్తి ఔరంగజేబు పతనంతో భారతావనిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి బ్రిటీష్ వారికి కలిసొచ్చిందనాలి. నాదిర్ షా లాంటి వారి దండయాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో రక్తపాతం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వదిలి వెళ్లిన నాదిర్ షా, తన వెంట, మొఘల్ సామ్రాజ్య గుర్తుగా మిగిలిన "నెమలి సింహాసనం" తీసుకెళ్లాడు. ఒకటి వెంట మరొకటిగా ఏడు దండయాత్రలు జరిగాయప్పట్లో. కష్టాల కడలిలో మునుగున్న భారతదేశంలో బ్రిటీష్ ఆధిపత్యానికి మార్గం సుగమం అయింది. అప్పటికే, బ్రిటీష్ ప్రభుత్వ ఆదాయంలో పది శాతానికి పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచే రాసాగింది. ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారత దేశంలో అధికారానికి చేరువై, సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది.

1857 నాటి సిపాయిల తిరుగుబాటులో మొఘలాయుల చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి వారు పాల్గొన్నారు. బ్రిటన్ లోని పార్లమెంటరీ ప్రభుత్వం, అప్పటివరకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో, నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి, సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే, ఒక మోస్తారు సాంస్కృతిక విప్లవం, భారతావనిలో వేళ్లూనుకోవడమే కాకుండా, రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి. 1885 లో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోని కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒక వైపు బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే, మరొక వైపు, పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయ సాగింది. బెంగాల్ విభజన నిర్ణయం దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. నోబెల్ బహుమతి గ్రహీత రబీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారప్పట్లో. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాల గంగాధర తిలక్, అరబిందో ఘోష్ ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన, భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి. ఆద్య తన భవిష్యత్ లో, స్వాతంత్ర్యోద్యమం ఊపందుకునేందుకు సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి.

ప్రధమ ప్రపంచ సంగ్రామంలో బ్రిటన్ కూరుకుపోయిన సమయంలోనే, స్వదేశీ ఉద్యమం బలపడ సాగింది. పూనా కేంద్ర కార్యాలయంగా, హోం రూల్ లీగ్ స్థాపించిన తిలక్ దేశ వ్యాప్తంగా పర్యటించి, దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని చేసిన విజ్ఞప్తికి అన్నీ బీసెంట్ సహకారం లభించింది. హోం రూల్ ఉద్యమ లక్ష్యం పూర్ణ స్వరాజ్యమనేది స్పష్టమైపోయింది ఆంగ్లేయ పాలకులకు. ఇంతలో, మహాత్మా గాంధి నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమం బలపడ సాగింది. ఆయన "అహింస" నినాదంతో దూసుకు పోయారు. దక్షిణాఫ్రికాలో ఆపాటికే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధి, బాంబేలో కాలుపెట్టిన వెనువెంటనే, జాతీయోద్యమానికి నాయకత్వం వహించమన్న నినాదం మొదలైంది. గాంధీ నిర్ణయం తీసుకునే లోపుగానే, రౌలట్ చట్టం తీసుకొని వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం, విచారణ జరపకుండా, రాజకీయ ఖైదీలను శిక్షించి, జైలుకు పంపించే అధికారాన్ని ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకిచ్చింది. విశ్వసనీయతను కోల్పోయిన ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, "ఆత్మ గౌరవం" నినాదంతో. సత్యాగ్రహ ఉద్యమానికి పిలుపిచ్చారు మహాత్మా గాంధి.

పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్ లో, ఏకైక ఇరుకైన ద్వారమున్న ఒక ప్రదేశంలో, బైసాఖి పండుగను జరుపుకునేందుకు శాంతియుతంగా సమావేశమైన అమాయక ప్రజలపై దారుణ-మారణ కాండ జరిపించాడు జనరల్ డయ్యర్. వేలాదిమంది మరణించారా సంఘటనలో. దేశ వ్యాప్తంగా విషాదం చోటు చేసుకున్న ఆ సంఘటన దరిమిలా, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు మహాత్మా గాంధి. ఆబాల గోపాలం మద్దతు లభించిందా ఉద్యమానికి. లక్షలాది మంది ప్రజలు, తారతమ్యాలు మరిచి, ఒక్క మాట మీద నిలబడి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దురదృష్ట వశాత్తు చౌరీచౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు ప్రజాగ్రహానికి గురై చంప బడడంతో, గాంధి ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. ఆ నిర్ణయం వల్ల గాంధీని కొందరు విమర్శించినప్పటికీ, ఆయన తిరుగులేని నాయకత్వం కొనసాగింది. ప్రజల హృదయాల్లో ఆయనపై నున్న అభిమానం చెరిగిపోలేదు. జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ నినాదంతో త్రి వర్ణ పతాకాన్ని రావి నది ఒడ్డున ఎగురవేయడం, శాసనోల్లంఘన ఉద్యమాన్ని గాంధి మొదలెట్టేందుకు సంపూర్ణ మద్దతును భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం, స్వతంత్రం పొందే దిశగా కదిలేందుకు దోహద పడింది.

గాంధీజీ పిలుపు మేరకు ఆరంభం కానున్న శాసనోల్లంఘన ఉద్యమం రూపురేఖలెలా వుండబోతున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి కేవలం భారతీయులలోనే కాకుండా, బ్రిటీష్ ప్రభుత్వంలోనూ కలిగింది. అనుకున్న రోజునే, సబర్మతీ ఆశ్రమం నుంచి, ఉప్పు సత్యాగ్రహం కొరకు "దండి" యాత్ర గాంధీ సారధ్యంలో మొదలైంది. దాన్నంత పెద్దగా పట్టించుకోవద్దుకున్న బ్రిటీష్ ప్రభుత్వానికి ఉద్యమం ఉధృతం అవగాహనైంది. అరెస్టుల పర్వం మొదలైంది. గాంధి, త్యాబ్జీ, సరోజినీ నాయుడు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అదుపుచేసేందుకు ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, అదరకుండా-బెదరకుండా, ఎదురుతిరగకుండా, వెనుకంజ వేయకుండా, భారతీయులు ముందుకు సాగడంతో, ఆంగ్లేయులు శక్తిలేని వారై పోవడం-భారతీయులు అజేయులు కావడం జరిగింది" అని శాసనోల్లంఘనం గురించి లూయి ఫిషర్ వర్ణించారు.

లండన్ లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులెవరు హాజరు కాకపోవడంతో, నాటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ గాంధీజీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇరువురి మధ్య సమావేశం జరిగింది. గాంధి-ఇర్విన్ ఒప్పందం దరిమిలా రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు గాంధి. నిరాశతో స్వదేశానికి రావడం మినహా ఒరిగిందే మీ లేదు. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో ఆంగ్లేయులకు మద్దతిచ్చి, ప్రతిఫలంగా, సంపూర్ణ స్వరాజ్యం పొందాలని భారత జాతీయ కాంగ్రెస్ భావించింది. ఇంతలో, జిన్నా ముస్లిం లీగుతో, కాంగ్రెస్ నాయకత్వానికి అభిప్రాయ బేధాలొచ్చాయి. పాకిస్తాన్ ఏర్పాటు తన లక్ష్యంగా ప్రకటించాడు జిన్నా. యుద్ధానంతరం డొమైన్ హోదా కల్పిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గాంధి తిరస్కరించడంతో 1947 వరకు పరిష్కారం దొరకని స్థితికి పరిస్థితులు చేరుకున్నాయి.

గాంధీజీ నాయకత్వంపై భారత జాతీయ కాంగ్రెస్, ప్రజలు, యావత్ భారతావని, అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమానికి, విజయమో-వీర స్వర్గమో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. నాటినుంచి కౌంట్ డౌన్ మొదలైంది. స్వాతంత్ర్యం సిద్ధించే సూచనలు కనపడ సాగాయి. 1946 లో లార్డ్ మౌంట్ బేటన్ ఢిల్లీకి రావడంతో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నేర్చుకున్న పాఠాలతో భారత దేశాన్ని వదిలిపెట్టి పోవాలన్న నిర్ణయానికొచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. హఠాత్తుగా వదిలిపెట్టకుండా, అధికార మార్పిడికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను మౌంట్ బేటన్ కు అప్ప చెప్పిన బ్రిటీష్ ప్రభుత్వం, భవిష్యత్ లో భారత దేశంతో సత్సంబంధాలు కొనసాగేట్లు చూడమని సూచించింది. విభజన తప్పని పరిస్థితులు అప్పటికే చోటు చేసుకున్నాయి.

అశేష ప్రజానీకం ఎదురు చూసిన రోజు ఆనంద-విషాదాల మధ్య రానే వచ్చింది. ఆగస్టు పదిహేను 1947 అర్థ రాత్రి ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగింది భారత దేశానికి. మరో రెండు రోజులకు పాకిస్తాన్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పాటవడంతో భారతావని రెండుగా చీలిపోయింది. చీలిక కోరుకున్న వారిలోను, కోరుకోని వారిలోను, ఎందరో తమకిష్టం వున్నా-లేకపోయినా, తర-తరాలుగా తాముంటున్న ప్రదేశాలను వదిలి, సుదూరంగా వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. జాతి పిత మహాత్మా గాంధికి మాత్రం, తాను కోరుకున్న స్వతంత్రం సిద్ధించినా, కోరుకున్న రీతిలో సిద్ధించనందుకు సంబరాలకు దూరంగా, శాంతిని కాంక్షిస్తూ గడిపారు. ఢిల్లీలో వుండమని ఆయనకు చేసిన విజ్ఞప్తికి స్పందించలేదాయన. “సంబరాలు జరుపుకునేందుకు ఏం మిగిలింది? దేశ విభజన తప్ప” అన్నారాయన. ఆగస్టు పదిహేను అర్థ రాత్రి జవహర్లాల్ నెహ్రూ "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ఉపన్యాసం వినకుండా నిద్రించిన మహాత్మా గాంధి తెల్లవారు ఝామున నిద్రలేచి, ఆయన వుంటున్న "హైదరీ హౌజ్" నుంచి మార్నింగ్ వాక్ కు బయలు దేరగానే ఆయన్ను ఒక్క సారన్నా చూద్దామని అశేష జన వాహిని ఆయనను అనుసరించారట. నడక ముగించుకుని తిరిగి రాగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు నూతన మంత్రివర్గం ఆయన ఆశీస్సులకొరకు వచ్చారట. "ముళ్ళ కిరీటాన్ని" ధరించమని వారితో అన్నారట గాంధి. అహింసకు కట్టుబడమని, అసత్యం పలకొద్దని, వినయ విధేయతలతో మెలగమని, సహన శీలంతో మసలుకోవాలని, అధికారం అంటే అప్రమత్తంగా వుండాలని, భారతదేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న పేద గ్రామీణులకు సేవచేసేందుకే అధికారమని వారికి బోధించారట మహాత్ముడు. ఆయన బోధనలను కొన్నైనా గుర్తుంచుకున్నప్పుడే, స్వతంత్ర భారతదేశంలో వుండే అర్హత మనకుందనుకోవాలి. ఆగస్టు పదిహేనున ఇదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి.

Saturday, August 7, 2010

స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో.... వనం జ్వాలా నరసింహా రావు

ఆగస్ట్ 9 న "క్విట్ ఇండియా" ఉద్యమం మొదలైన సందర్భాన్ని స్మరించుకుంటూ....


బ్రిటీష్ వలస పాలన నుండి భారత దేశానికి విముక్తి కలిగించేందుకు జరిగిన "ప్రప్రధమ స్వతంత్ర సంగ్రామం"-1857 నాటి సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా, ఆంగ్లేయుల దోపిడీ విధానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫ్యూడల్, జమీందారీ వర్గాలను పురికొల్పడం ద్వారా, బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానం ఆరంభమైంది. పాశ్చాత్య ధోరణులు విపరీత పుంతలు తొక్కుతూ, జాతీయ వ్యతిరేక భావాలకు దారితీయడంతో, సహించలేని పలువురు సంఘ సంస్కర్తలు, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి పూర్వ రంగంలో, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, థియోసాఫికల్ (బ్రహ్మ విద్య) ఉద్యమం, రామ కృష్ణా మిషన్ లాంటి పునరుజ్జీవన-పునర్వికాస ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.

లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానంలో భాగమే. అయితే, ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు, తమ ఆశీస్సులతోనే ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ముసుగులో, భారత జాతీయ ఉద్యమం వేళ్లూనుకుంటున్న సంగతి అర్థం చేసుకోలేకపోయింది బ్రిటీష్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, "మాడరేట్లు" గా పిలువబడే మితవాద భావాల నాయకులు పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేశారు. బ్రిటీష్ వారి పద్ధతులను పూర్తిగా వ్యతిరేకించే దశకు అలనాటి మాడరేట్లు చేరుకోలేదప్పటికి. బ్రిటీష్ పాలకులు న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తున్నారని కూడా అప్పట్లో వారి నమ్మకం. భావ స్వాతంత్ర్యానికి, పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగినప్పుడు జరిపిన పోరాటంలో తిలక్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. మాడరేట్ల ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, పార్టీలో తీవ్రవాదుల ప్రాబల్యం మొదలయింది. అదికూడా ఒక విధంగా బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానానికి అనుకూలంగానే కనిపించింది పాలకులకు.

లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, భారతీయ యువత, స్వదేశీ ఉద్యమం చేపట్టింది. అరబిందో, తిలక్, బిపిన్ పాల్ సహాయ నిరాకరణకు ఇచ్చిన పిలుపే, భవిష్యత్ లో మహాత్మా గాంధి, పెద్ద ఎత్తున చేపట్టారు. పూర్ణ స్వరాజ్యం-స్వపరిపాలనాధికారం కావాలంటూ, బాలగంగాధర తిలక్-ఇతర అతివాద నాయకులు నినాదం లేవనెత్తటాలు. 1907 లో, కాంగ్రెస్ పార్టీలో చీలి కొచ్చి, మాడరేట్లు అతివాదులనుంచి విడిపోయారు. మాడరేట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా, అతివాదులపై మరిన్ని ఆంక్షలు విధించ సాగారు బ్రిటీష్ పాలకులు. "విభజించి పాలించే" దిశగా మరో అడుగు వేసింది ప్రభుత్వం.

భారత రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత స్వాతంత్ర్యోద్యమంపై ఆయన ప్రభావం పడింది. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన పిదప, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటి సారి జాతీయ స్థాయిలో "సత్యాగ్రహం" ఉద్యమానికి పిలుపునిచ్చారు గాంధి. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, ఉద్యమం జరపాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు.

"శాసనోల్లంఘనం" ఉద్యమానికి నాంది పలికిన గాంధి, చౌరీ చౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు మరణించడంతో, సహాయ నిరాకరణకు ఏక పక్షంగా స్వస్థి చెప్పారు. దరిమిలా, నవంబర్-డిసెంబర్, 1922 లో జరిగిన కలకత్తా, గయ కాంగ్రెస్ సమావేశాలలో చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. తండ్రి మోతీలాల్ స్థానంలో లాహోర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన జవహర్ లాల్ నాయకత్వంలో, డిసెంబర్ 31, 1929 అర్థ రాత్రి, నూతన సంవత్సరం ఆరంభమవుతుండగా, "పూర్ణ స్వరాజ్" నినాదంతో, త్రి వర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక అప్పటినుంచి "సత్యాగ్రహ శకం" ఆరంభమయిందనాలి.

ఫిబ్రవరి 1930 లో సబర్మతి ఆశ్రమంలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, శాసనోల్లంఘన ఉద్యమం విషయంలో నిర్ణయాధికారం గాంధీజీకి వదిలింది. మార్చ్ 12, 1930 న చారిత్రాత్మక దండి సత్యాగ్రహానికి నాంది పలికారు. అప్పటికింకా గాంధీని అరెస్ట్ చేయలేదుగాని, వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది. ఏప్రిల్ 5, 1930 నాటికి దండి చేరుకుంది గాంధీజీ బృందం. సముద్రపు ఒడ్డున పిడికెడు ఉప్పును చేతబట్టి, "ఉప్పు చట్టాన్ని" ఉల్లంఘించామని, ఇక ముందు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పౌరుడు తాము అనుకున్న స్థలంలో ఉప్పు తయారు చేసుకోవచ్చని పిలుపిచ్చారు. ఉప్పు కర్మాగారాలపై దాడి చేస్తామని మరో లేఖను వైస్రాయ్ కు రాయడంతో, గాంధీజీని అరెస్ట్ చేసి ఎర వాడ జైలుకు తరలించింది బ్రిటీష్ ప్రభుత్వం. వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం కొనసాగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని చట్టవిరుద్ధ సంస్థగా పేర్కొంటూ, మోతీలాల్ నెహ్రూను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "విభజించి పాలించే" విధానాన్ని నమ్ముకున్న బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీని ఒంటరి వాడిని చేసి, ఇతరులను నిర్బంధించి ఉద్యమానికి గండి కొట్టాలని తలచింది. అయినా వారి కోరిక సఫలం కాలేదు.

గాంధి-ఇర్విన్ మధ్య కుదిరిన ఒప్పందం అమలులో పూర్తిగా విఫలమైంది. ఇంగ్లాండ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ, రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి నాయకులను మరోసారి అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జనవరి 4, 1932 న గాంధీజీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులను అరెస్ట్ చేయడంతో సహా, కాంగ్రెస్ పార్టీని చట్ట వ్యతిరేక సంస్థగా నిర్ణయించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1940 లో, భావ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటూ, కాంగ్రెస్ నాయకత్వం సత్యాగ్రహానికి దిగింది మరో సారి. మొదటి సత్యాగ్రహి వినోభా భావే కాగా, జవహర్లాల్ నెహ్రూ ఆయన తర్వాత సత్యాగ్రహి. అరెస్టయిన నెహ్రూకు నాలుగేళ్ల కారాగార శిక్ష పడింది. జులై 14, 1942 న, వార్దాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, "క్విట్ ఇండియా" డిమాండ్ చేయాలని తీర్మానించింది. ఆగస్ట్ 7, 1942 న బాంబేలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆ మర్నాడు ఆగస్ట్ 8, 1942 న, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశ పెట్టిన, "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ఆమోదించింది. సర్దార్. వల్లభాయ్ పటేల్ తీర్మానాన్ని బలపర్చారు. తీర్మానంలో చివరగా "స్వతంత్ర భారతదేశం కావాలన్న వాంఛ వున్నప్పటికీ, దానికి సామూహిక ప్రజా ఉద్యమం చేపట్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలన్న ఉద్దేశం లేదు. అధికారం ఎప్పుడొచ్చినా, అది ప్రజలకే చెందుద్తుంది" అని పేర్కొనడం జరిగింది. కాకపోతే స్వతంత్రం వచ్చిన నలభై సంవత్సరాల వరకు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే వుంది. తీర్మానం ఆమోదించిన మరుక్షణమే మాట్లాడిన గాంధీజీ, తాను "తక్షణమే, వీలుంటే ఆ రాత్రే-తెల్లవారే లోపునే" స్వరాజ్యం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. స్వతంత్రం కంటే తక్కువైనదేదీ తనకు అంగీకారం కాదని కూడా స్పష్టం చేశారాయన.

ఆగస్ట్ 8, 1942 న తెల్లవారక ముందే, ప్రభుత్వం వేసుకున్న పటిష్ఠమైన ప్రణాళిక ప్రకారం, గాంధీజీ తో సహా కాంగ్రెస్ నాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకుని, రహస్య ప్రదేశాలకు తరలించింది ప్రభుత్వం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎక్కడ దొరికితే అక్కడే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వున్న అన్ని సంస్థలను, వ్యవస్థలను నిషేధించింది. ఖాదీ-హరిజన సంస్థల లాంటి సాంఘిక కార్య కలాపాలను కూడా నిషేధించింది. ప్రజలనుంచి కూడా అదే మోతాదులో ప్రతిఘటన ఎదురైంది. బొంబాయిలో పోలీసు హెచ్చరికలను లక్ష్య పెట్టకుండా అరుణా ఆసఫ్ అలీ ఝండా ఎగుర వేసింది. ఒక వైపు "క్విట్ ఇండియా" ఉద్యమం, మరో పక్క "ఆజాద్ హింద్ ఫౌజ్" ప్రభావం, ఇంకో దిశగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఓటమి, ప్రభుత్వాన్ని కలవర పరిచాయి. చర్చిల్ వారసుడు క్లెమెంట్ అట్లీ, త్రి సభ్య కాబినెట్ కమిటీని నియమించి, ఆ కమిటీ భారత దేశాన్ని సందర్శించనున్నదని ఫిబ్రవరి 19, 1946 న ప్రకటించారు. కమిటీతో చర్చలకు పాకిస్తాన్ ఏర్పాటు ప్రాతిపదిక కావాలని జిన్నా అభిప్రాయ పడ్డారు. త్రి సభ్య కాబినెట్ మిషన్ తో రాజకీయ నాయకుల చర్చలు సఫలం కాలేదు. ఇంతలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన బడుగు-దళిత వర్గాల వ్యక్తితో కలిపి ఆరుగురు హిందువులు, ముస్లింలీగుకు చెందిన ఐదుగురు ముస్లింలు, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ-మొత్తం పద్నాలుగురుండే మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు వైస్రాయ్. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో, తాత్కాలికంగా, అధికారులతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు వైస్రాయ్. తదనంతరం, వైస్రాయ్ ఆహ్వానం మేరకు, ఆరుగురు హిందువులతో, ముగ్గురు ముస్లింలతో, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీలతో జవహర్లాల్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం సెప్టెంబర్ 2, 1946 న అధికారాన్ని చేపట్టింది. అక్టోబర్ చివరి వారంలో ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వంలో చేరింది. కాకపోతే షరతులతో చేరింది. అధికారం నడుపుతున్నది మంత్రివర్గం తరహా ప్రభుత్వంగా పరిగణించ రాదనీ, అది కేవలం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమేనని ముస్లిం లీగ్ వాదన.

1946-1947 మధ్య కాలంలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో హిందువులకు ప్రాణ-ఆస్తి నష్టం కలిగింది. నవంబర్ 1946 లో గాంధీజీ నవొకాళీకి వెళ్లి, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు పరిస్థితిని కుదుట బర్చాయి. దేశ విభజన జరగాలన్న మౌంట్ బేటన్ ప్రణాళికకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. గాంధీజీకి విభజన ఇష్టం లేదు. వ్యతిరేకిస్తే విప్లవం మినహా మార్గాంతరం లేదని కూడా ఆయనకు తెలుసు. రెండు దేశాల జిన్నా వాంఛ నెరవేరనున్న తరుణంలో, స్వతంత్రం సిద్ధించనున్న తరుణంలో, లక్షలాది హిందువులు, ముస్లింలు తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాలను-అనుభవిస్తున్న తాత-ముత్తాతల ఆస్తులను వదిలి "శరణార్థుల కాంపుల" లో ఇతరుల దయాదాక్షిణ్యాలతో జీవించాల్సిన పరిస్థితులు కలిగాయి. అలనాటి సంఘటనలను "భారత మాత ఆత్మ సంక్షోభం" గా అభివర్ణించారు జవహర్లాల్ నెహ్రూ.

లక్షలాది భారతీయుల ఇక్కట్ల-త్యాగాల ఫలితంగా, ఆగస్ట్ 14-15 అర్థ రాత్రి సమయంలో, పాకిస్తాన్ భూభాగం భారత దేశం నుంచి విడిపోయిందన్న అశేష జన వాహిని మనస్థాపం మధ్య సంపూర్ణ స్వతంత్రం సిద్ధించింది భారతావనికి. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఆగస్ట్ 9, స్వాంతంత్ర్యం వచ్చిన ఆగస్ట్ 15 భారతీయులకు అసలైన పండుగ దినాలు.