Showing posts with label సోనియా గాంధీ. Show all posts
Showing posts with label సోనియా గాంధీ. Show all posts

Saturday, November 17, 2012

ఇక రాహుల్ రాజ్యమేనా?: వనం జ్వాలా నరసింహారావు


ఇక రాహుల్ రాజ్యమేనా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (18-11-2012)

అందరూ అనుకున్నట్లే అయింది. "దేశ్ కీ నేతా రాహుల్ గాంధీ" అన్న ఆబాల గోపాలం కాంగ్రెస్ వర్గాల నినాదాలు సోనియా గాంధీ చెవిన పడ్డాయి. పన్నెండేళ్లకు పైగా మౌన ముద్ర వహించిన మేడం, కార్యకర్తల మొర ఆలకించారు. తనయుడు రాహుల్ గాంధీకి గురుతర బాధ్యత అప్పగించారు. గతంలో ఆయన ఇంత పెద్ద బాధ్యత నిర్వహించలేదని కాదు. ఐతే, అది ఏదో ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమై పోయింది. ఇప్పుడేమో యావత్ భారత దేశానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరంగా దిశా నిర్దేశం చేయాల్సిన బృహత్తర బాధ్యత అప్పగించబడింది. బహుశా రాహుల్ దృష్టికి రాకుండా ఏ ఒక్కరు కూడా ఎన్నికలలో పోటీ చేసే వీలుండదేమో! ముఖ్యంగా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఆయన చేతుల మీదుగానే రూపొందించాల్సి వుంటుంది. తన టీంను తానలా పూర్తిగా తయారు చేసుకుని, ఎన్నికల రంగంలో దిగి, విజయం సాధించి, ఆ విధంగా పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన సోనియా గాంధీ చేసి వుండవచ్చు. ఐతే ఇదంతా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించే స్థానాలపైన, దాని ఎన్నికల ముందస్తు-ఎన్నికల తదనంతరం అవగాహన కొచ్చే మిత్ర పక్షాలు సాధించే స్థానాలపైన ఆధార పడి వుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొనసాగుతున్న యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా వున్న పార్టీలు ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి-కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు గోపీలుగా వుంటూ ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నంలో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతున్నది మైనారిటీ ప్రభుత్వమే! సంఖ్యాపరంగా చూస్తే అది ఏ క్షణాన్నైనా కూలి పోవడానికి సిద్ధంగా వుందనాలి. పూర్తిగా దింపుడు కళ్లెం ఆశ మీద వుంది. తృణమూల్ ప్రభుత్వంలోంచి వైదొలగిన తరువాత ప్రారంభమైన ఈ పతనం కరుణానిధి అలకతో పతాక స్థాయికి చేరుకుంది. మజ్లిస్ కూడా దూరమైంది. మాయావతి, ములాయంలు దోబూచులాడుతున్నారు. ఈ నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు పోవడం కంటే కాంగ్రెస్ పార్టీకి మరో గత్యంతరం లేనే లేదు. అదే పనిలో మునిగి పోయింది కాంగ్రెస్ పార్టీ, దాని నూతన బాస్ రాహుల్ గాంధీ.


అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోక్ సభ ఎన్నికలకు, అవి కూడా అనుకున్న దానికంటే ముందుగానే జరుగవచ్చన్న ఊహాగానాల నేపధ్యంలో, పూర్తి స్థాయిలో సమాయత్తమౌతోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొందరు కొత్త వారిని చేర్చుకుంటే, మరి కొందరు పాతవారిని పార్టీ పని కోసమని బయటకు పంపింది. పార్టీని నష్ట పరుస్తున్నారని భావించిన మరి కొందరిని ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అలక పానుపు ఎక్కిన వారిని ఓదారుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ యువ నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో వేట ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా, వివిధ నియోజక వర్గాలలో భారీ స్థాయిలో సమాచార సేకరణకు శ్రీకారం చుట్టారు. విజయావకాశాలున్న నేతలు, ఇతర ప్రముఖుల కోసం ఆయన లోతుగా ఆరా తీస్తున్నారు. వారు పార్టీ సభ్యులు కాకపోతే, ఎలా వారిని తమలో చేర్చుకోవాలన్న అంశంపైనా దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రతి లోక్‌సభ స్థానానికీ తన సొంత వేగులను పంపుతున్నారు! ప్రతి సెగ్మెంట్ నుంచీ ప్రాధాన్యత క్రమంలో ముగ్గురి పేర్లను వారు గుర్తించి డిసెంబర్ తొలి వారానికల్లా రాహుల్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకొరకు, స్వయానా రాహుల్ గాంధీ తనదైన శైలిలో ఎంపిక చేసి, ప్రత్యేక తరహా శిక్షణ ఇచ్చిన పరిశీలకులు, ఆంధ్ర ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఇలా వివిధ రాష్ట్రాలకు పోయే బృంద సభ్యులలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నేతలు కూడా వున్నారు. ఈ సభ్యులకు పది-పదిహేను లోక్ సభ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, పలు వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడి.. గెలుపు గుర్రాలు కాగల అభ్యర్థులను గుర్తించనున్నారు.

ఇంతకూ ఈ పరిశీలకులు చేయాల్సింది ఏంటి? ముందుగా తమకిచ్చిన సుమారు ముప్పై ప్రశ్నలతో కూడిన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. దీని కొరకు శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వినికిడి. అభ్యర్థుల ఎంపిక పరిశీలన ఏ కోణంలో జరగాలి అన్న అంశంపై వ్యక్తిగత నైపుణ్యంతో కూడిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానికంగా గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో అంచనా వేయడం పరిశీలకుల ప్రధమ కర్తవ్యం. ఒక్కో నియోజక వర్గానికి మూడేసి పేర్లతో కూడిన జాబితా రూపొందించాలి. వారి విజయావకాశాలకు వివిధ కోణాల నుంచి గల కారణాలను విశ్లేషణా పూర్వకంగా అంచనా వేయాలి. పరిశీలనా క్రమంలో మండల స్థాయి పైనుంచి, జిల్లా స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించి తమ విశ్లేషణకు వాటిని జోడించాలి. సిట్టింగ్ ఎంపీల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారికి టికెట్ ఇవ్వకుండా వుండడానికి గల కారణాలను సహేతుకంగా పొందుపరచాలి. వీటన్నింటి కీ అదనంగా పరిశీలకులు సిఫార్సు చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వారు ఆ కోణంలో గెలుపు గుర్రాలా? కారా? అనేది తేల్చి చెప్పాలి. కిందటి ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి దారితీసిన కారణాలను అంచనా వేసి, అవి సరి చేయడానికి, అదే అభ్యర్థి సరైన వాడా? కాదా? అనేది విశ్లేషణ చేయాలి. ఇక అభ్యర్థి సామాజిక నేపధ్యం, కులం, మతం, గుణగణాలు, నిజాయితీ తనం, ఎలాగూ అంచనా వేయాలి. అభిప్రాయ సేకరణ కొరకు కేవలం పార్టీ ప్రముఖులనే కాకుండా, పార్టీతో అంతో-ఇంతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో అనుబంధం వున్న వారిని, స్థానికంగా ప్రముఖ వ్యాపార వేత్తలను, స్వచ్చంద సంస్థల కార్యకర్తలను, ప్రభుత్వేతర సంఘాల నాయకులను, పాత్రికేయులను, ఇతర ప్రముఖులను కూడా సంప్రదించాలి. మొత్తం మీద రాహుల గాంధీ అంచనాల మేరకు నివేదిక రూపొందించాలి. ఎవరికి టికెట్ కేటాయించాలనేది రాహుల గాంధీకి వదిలేయాలి!

రాహుల్ గాంధీ రాజకీయం ఫలిస్తుందా? ఆయన అనుకున్న అభ్యర్థులు దొరుకుతారా? అసలాయన మనస్సులో ఏముంది? ఈ కసరత్తంతా ఏదో విధంగా గెలిచే అభ్యర్థుల కొరకా? లేక, భవిష్యత్‍లో అవినీతికి తావులేని అభ్యర్థులనే రంగంలోకి దింపాలన్న మంచి ఆలోచనా? ఇవ్వాళ దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. సాక్షాత్తు రాహుల్ కుటుంబ సభ్యుడైన వాద్రాపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో, తాను అవినీతికి దూరం అని తెలిపే విధంగా అభ్యర్థుల ఎంపికకు రాహుల్ శ్రీకారం చుట్ట దల్చుకున్నాడా? ఆయన నిజంగా అలా భావిస్తే అలాంటి అభ్యర్థులు దొరకడం అంత సులువైన పనేనా? నేర చరిత్ర లేనివారు, నీతిమంతులు, కుల-మతాలకు అతీతులు అసలెవరైనా మిగిలారా? కోట్ల రూపాయలలో ఆర్థిక స్తోమత లేనివారు ఎన్నికలలో నిలబడి గెలిచే పరిస్థితులున్నాయా? ఇవన్నీ రాహుల్ గాంధీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నాడనేది ప్రధానమైన ప్రశ్న. ఎన్నో ఆశలతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్టానం రాహుల్‌ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించుకుంటే, భావి భారత ప్రధాని ఆయనే సుమా అనే రీతిలో రాహుల్‍కు బరువు బాధ్యతలు అప్పగించారు. కనీసం మన్మోహన్ సింగ్ ప్రసక్తే లేకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రధాన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆంటోనీ, ద్విగ్విజయ్ సింగ్‌లకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మన్మోహన్ సింగ్‌కు ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తుంటే రాబోయే రోజుల్లో అంతా రాహుల్ గాంధీదే హవా అనిపిస్తోంది.

ఇదిలా వుండగా, ముందస్తుగానే రావచ్చని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికలకోసం పార్టీపరంగా రాహుల్‌గాంధీకి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకు ధీటుగా సమాధానం చెపుతున్నాయి. వారికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఒకటి వెంట మరొకటి యుపిఎ భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వం నుంచి తొలగి పోతుంటే, దిగజారిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు, తద్వారా అన్నివిధాలా కలిగిన నష్టాన్ని చక్కదిద్దుకునేందుకు, కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం ఒక పక్క ఖండిస్తూనే, మరో పక్క తన ప్రయత్నాలలో తానుంది. ప్రతిపక్షాలు కూడా ముందస్తు ప్రయత్నంలో వున్నాయనడానికి ఉదాహరణ సమాజ వాది పార్టీ తీసుకున్న తాజా నిర్ణయమే! వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అప్పుడే 55 మంది పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే ఎన్నికలకు వెళ్లవచ్చని సిపిఎం సీనియర్‌ నాయకుడు సీతారాం ఏచూరి చెప్పడం మరో ఉదాహరణ. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే ఖండించింది. తమ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వానికి పూర్తిగా అయిదేళ్లు, అంటే 2014 వరకు, పాలించమని ప్రజలు అధికారమిచ్చారని, ప్రభుత్వం తన పూర్తి కాలపరిమితిని పూర్తిచేస్తుంది అని అంటుంది. యూపీఏ 2 అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి పుకార్లు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అయిదేళ్లు పాలించేందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పిచ్చారు. అలాగే ప్రభుత్వం అయిదేళ్ల వరకూ అధికారంలో ఉంటుంది’ అని ఆ పార్టీ అంటుంది. ముందస్తు ఎవ్న్నికలకు అవకాశమే లేదని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వానికి ముప్పేమీ లేదని బల్ల గుద్ది మరీ చెప్తోంది ఆ పార్టీ.

ఐతే, రాజకీయ పార్టీగా ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధమేనని ఏఐసిసి వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఎవరి దగ్గర నుంచీ రాదు.  కాకపోతే, కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌కు మరింత విస్తృతమైన పాత్ర ఇవ్వడం అనేది ఆయనను వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించ డానికి సూచనే కదా? దీనికి సమాధానంగా పార్టీ వర్గాలు, పార్టీలో రాహుల్‌కు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన స్థానం అలాగే ఉంటుంది’ అని చెప్తున్నారు. రాహుల్‌కు కాంగ్రెస్‌లో కొత్త పాత్ర ఇచ్చారు కనుక మధ్యంతర ఎన్నికలు వస్తాయా?’ అన్న ప్రశ్నకు, ఇది పూర్తికాలం కొనసాగే ప్రభుత్వమే కానీ, మధ్యంతర ప్రభుత్వం కాదు’ అని సమాధానం వస్తుంది.

ఏదేమైనా రాహుల్ రాజ్యం రాబోతోంది. ఒక వేళ కాంగ్రెస్ ఓడితే అంతా తారుమారు కావచ్చు. అది వేరే సంగతి!

Saturday, July 21, 2012

రాహుల్ రావడమంటే నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ రావడమంటే నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!
వనం జ్వాలా నరసింహారావు


వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతానికి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే వున్న సోనియా తనయుడు, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ పరంపరలో ఐదోతరంవాడైన రాహుల్ గాంధీకి పార్టీలో మరింత కీలక బాధ్యతలు-నిర్ణయాత్మకమైన బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టుకుని మరీ డిమాండు చేస్తున్నారు. వారిలో కొందరు నేతలు మరొక్క అడుగు ముందుకు వేసి, 2014 ఎన్నికలలో రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా అంటున్నారు. ఆ మాటకొస్తే దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పలువురు రాష్ట్ర స్థాయి-జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు వీలైనప్పుడల్లా రాహుల్ జపం చేస్తూనే వస్తున్నారు. నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని పదిలంగా వుంచే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. 'రావాలి... రావాలి... రావాలి...' అని అందరూ ఆహ్వానిస్తుంటే ఎందుకు రాకూడదని అనుకున్నాడేమో ఏమో కాని, వచ్చేస్తున్నానంటూ బదులు పలకనే పలికాడు రాహుల్. డిమాండులకు తల్లి సోనియా పెదవి విప్పి, రావడం-రాకపోవడం తనయుడు రాహుల్ ఇష్టాయిష్టాలకు వదిలేస్తే, ఆ మర్నాడే, తనయుడు నోరు గట్టిగా విప్పి, ప్రభుత్వంలోను-పార్టీలోను క్రియాశీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధం అని ప్రకటించాడు. తనను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది తల్లి సోనియాకు, ప్రధాని మన్మోహన్‌కు వదిలేస్తున్నానని ఎంతో ఉదారంగా అన్నాడు. ఇలా రాహుల్ పెదవి విప్పాడో-లేదో, వెంటనే, మంత్రివర్గంలో ఆయన అప్పుడే చేరినట్లు, ఆయనకు ఫలానా పోర్టుఫోలియో కేటాయించనున్నట్లు ప్రచారాలు మొదలయ్యాయి. 1999 లో ఏ విధంగానైతే, పార్టీ అవసరాల దృష్ట్యా సోనియా గాంధీకి మొదలు సభ్యత్వం, ఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారో, అదే తరహాలో, ఆమె వారసుడి ఎంపికకు కూడా రంగం సిద్ధమౌతోంది. వారసత్వ రాజకీయాలు, అందునా నెహ్రూ-గాంధీ వారసత్వ రాజకీయాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.

రాజకీయాలలో వారసత్వంగా ఎదగ గలిగిన వారు అనేకమంది వున్నారు. దానికి కారణాలు అనేకం. ఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కాని, వారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు. ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కాని, భారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయి, ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదు. రాజకీయాల్లో కీలకమైన పదవులను పొంది, ఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనే, రాజకీయ ప్రవేశం చేసి, చకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది. మొదటి తరం నాయకులు, తమ సంతానాన్ని-సోదరీ, సోదరుల సంతానాన్ని, తమ్ముళ్లను, చెల్లెళ్లను, భార్యలను, వీలున్న బంధువులను వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి దింపి, వారసత్వ సంపదలాగా పదవులను దక్కించుకుంటున్నారు.

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. సుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలో, న్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ" కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారు. కాకపోతే, అందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకుని వుండవచ్చు. కుటుంబ నేపధ్యం తప్పక ఉపయోగపడిందనాలి.

భారత రాజకీయ కుటుంబ వారసత్వ పరంపరలో మునిగి తేలుతున్నవారు కోకొల్లలు. మూడేళ్ల క్రితం జరిగిన సారస్వత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన-ఓడిన అభ్యర్థుల జాబితా చూస్తే చాలు, రాజకీయ వారసుల జాబితాలో ఎన్ని పేర్లున్నాయో తెలుసుకోవడానికి. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మురళి దేవరా కుమారుడు మిళింద దేవరా, సునీల్ దత్ కుమార్తె ప్రియా దత్, చగన్ భుజ బల్ అల్లుడు సమీర్ భుజ్ బల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.బి.చవాన్ అల్లుడు-ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బావమరిది భాస్కర రావ్ పాటిల్, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొడుకు ముకుల్ వాస్నిక్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్. ఎన్. బహుగుణ కొడుకు ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ (ఇతడి సోదరి యు.పి.సీ.సీ అధ్యక్షురాలుగా పనిచేసిన రిటా బహుగుణ-మరో కజిన్ బిసి.ఖండూరీ ఒక నాటి ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి), ఆంధ్ర ప్రదేశ్ (దివంగత)ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి వారసులుగా ఎదుగుతున్న మరో తరం ప్రజాస్వామ్య భావితరం నాయకులు. ఆ మాటకొస్తే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు, ఆయన తమ్ముడికి, అల్లుడికి ఎమ్మెల్యే టికెట్లు, భార్యకు ఎంపీ టికెట్ లభించింది. అందరూ గెలవడం విశేషం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉమాశంకర్ దీక్షిత్ కోడలు శీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా దశాబ్దం పైగా పనిచేస్తుంది. ఆమె తనయుడు సందీప్ దీక్షిత్ ను ఆమె అప్పుడే రాజకీయాల్లోకి తేవడం పార్లమెంట్ సభ్యుడుగా చేయడం జరిగిపోయింది. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు దీపీందర్ సింగ్ హుడా ఆయన వారసుడుగా ఎదుగుతున్నాడు. ఆయనిప్పుడు పార్లమెంటు సభ్యుడు. భూపిందర్ కన్నా ముందున్న ముఖ్యమంత్రి దేవీ లాల్ తనయుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సమాజ్ వాది పార్టీ నాయకుడు, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులంతా వారసులుగా ఎదుగుతున్నవారే. కొడుకు అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కాగా, ఆయన రాజీనామా చేసిన పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన కోడలు ప్రస్తుతం లోక్ సభ సభ్యురాలు.

నెహ్రూ-గాంధి కుటుంబ వారసుడిగా ఐదో తరం నాయకుడు-భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధి, ఆయన తల్లి సోనియా గాంధి కాంగ్రెస్ అభ్యర్థులుగా వారసత్వ పరంపరలో పోటీ చేసి గెలవగా, సంజయ్ గాంధి కొడుకు వరుణ్-భార్య మేనకా గాంధి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచారు. ఒరిస్సా ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనయుడు దిప్ గొగోయ్, మరో మాజీ ముఖ్య మంత్రి బిజూ పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మనీష్ తివారి, వినీత్ సింగ్ బిట్టు, కుమారి షెల్ జా, నాధు రాం మిర్ధా మనుమ రాలు జ్యోతి మిర్ధాలు కూడా వారి-వారి కుటుంబాలకు వారసులే. మోతీలాల్ ఓరా కొడుకుకు, అజిత్ జోగి భార్యకు, రాజస్థాన్ లో జగన్నాధ పహాడియా-సిస్ రామ్ ఓలా-నావల్ కిశోర్ శర్మ-గోవింద్ సింగ్ గుర్జార్ వాళ్ల పిల్లలకు వారసత్వ నాయకులుగా ఎదిగే అవకాశాలు దొరికాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ-గాంధి కుటుంబ అడుగు జాడల్లోనే, ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా నడుచుకోవడం విశేషం. వారసత్వ కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్.సీ.పీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ కూతురు తండ్రికి వారసురాలిగా ఎదగసాగింది. ఆమె ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పెద్దకొడుకు రాఘవేంద్ర, మాజీ ప్రధాని దేవెగౌడ ఇద్దరు కుమారులు (ఒక కొడుకు హెచ్. డి. కుమార గౌడ ఈ ఈపాటికే జె. డి-ఎస్ నాయకుడు మాత్రమే కాకుండా, కర్నాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు), తమిళ నాడు ముఖ్యమంత్రి సంతానం: కొడుకు అజహగరి, కూతురు కణిమొజిహి, కొడుకు స్టాలిన్, మురసోలి మారన్ కొడుకు దయానిధి మారన్, మాజీ లోక సభ స్పీకర్ పీ. . సంగ్మా కూతురు అగాథ చురుగ్గా ఎదిగిన కొందరు కాంగ్రేసేతర వారసులు. వీరంతా చట్ట సభల్లో రంగ ప్రవేశం చేశారీ పాటికే. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా తనయుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా...అందరూ నాయకులే. అంతా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వారే. కేంద్రంలో కీలక పదవులను అనుభవించిన వారే. వారి ప్రత్యర్థి పీ.డీ.పీ నాయకుడు ముఫ్టి మహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా అప్పుడే నాయకురాలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు అల్లుళ్లిద్దరు, ఒక కొడుకు, కూతురు రాజకీయాల్లో కీలకమైన స్థానాల్లో వున్నారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు నాయకుడే. కొడుకు కూడా ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాడు. మహారాష్ట్ర శివసేన నాయకుడు బాల్ థాకరే కొడుకు నాయకుడే. అలానే కరుణాకరన్, నందినీ సత్ పథి, జగ్జీవన్ రాం వారసులూ ఎదిగారు. ఆర్.జే.డీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, జెఎంఎం పార్టీ మహితో, మాజీ గుజరాత్ సీ. ఎం చిమన్ భాయి పటేల్ తమ అర్థాంగులను అందలం ఎక్కించారు.
          
ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా, తమ సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. అందుకే, స్థానిక సంస్థల నుంచి, ప్రధాన మంత్రి స్థాయి వరకు, వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది. ఒక్క సారి అధికారంలోకి రావడంతోనే, తమ సర్వ శక్తులను ఒడ్డి, బయట వారెవరినీ రాకుండా, తమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా? భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ, అవినీతిని ఉత్పత్తిచేసే, వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలు. వీటిని పెంచి పోషించే వ్యక్తులు, తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని, తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం, ధన బలం-కండ బలం-కుల, మత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులు, సమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నా, దానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం, చేసినా, గెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.
          
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వారసత్వ స్వామ్యంగా మార్పుచెందుతుందనడానికి సజీవ సాక్ష్యాలెన్నో--ఎన్నెన్నో వున్నాయి. ఆదిలో ముఖ్యమంత్రి పీఠాన్నెక్కిన బూర్గుల, నీలం, బెజవాడల తర్వాత మిగిలిన వారందరి వారసులు పదవులను పొందిన వారే. బ్రహ్మానందరెడ్డికి చెందిన కాసు కృష్ణారెడ్డి; పీవీ నరసింహా రావుకు చెందిన ఇద్దరు రాజేశ్వర రావులు, రంగారావు, మరో ఒకరిద్దరు కజిన్లు; జలగం వెంగళ్ రావు తమ్ముడు, కొడుకులు; మర్రి చెన్నారెడ్డి కొడుకు శశిధర రెడ్డి; అంజయ్య సతీమణి మణెమ్మ; ఎన్. జనార్ధన రెడ్డి సతీమణి రాజ్య లక్ష్మి; కోట్ల విజయభాస్కర రెడ్డి కొడుకు సూర్య ప్రకాశ్ రెడ్డి-కోడలు సుజాత; డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి కొడుకు, భార్య; నాదెండ్ల భాస్కర రావు కొడుకు మనోహర్; ఎన్ టీ రామారావు కొడుకు, కూతురు, అల్లుళ్లు; చిరంజీవి తమ్ముళ్లు, బావమరిది; తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే సీ ఆర్ అల్లుడు, కొడుకు; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇంకా మిగిలి పోతారు. ఎంపీల, ఎమ్మెల్యేల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, పార్టీల అధ్యక్షుల కుటుంబీకులనేక మంది వారసత్వ వరుసలో వున్నారు.

ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందర, తర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసింది. విమాన ప్రమాదంలో సంజయ్ దుర్మరణం తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆ తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది కాదా? ఏమో! ఇలా...మోతీలాల్...దేవీ లాల్...భజన్ లాల్... కైరాన్... కరుణానిధి.. కరుణాకరన్..చరణ్ సింగ్...అర్జున్ సింగ్..బిజూ పట్నాయక్...దేవెగౌడ..శరద్ పవార్...బాల్ ఠాక్రే.. బహుగుణ.. నందిని సత్పథి...ఎవరైనా ఒకటే ! అందరి కోరికా తమ కుటుంబీకులే, తమ స్థానాల్లో పదవులలంకరించాలని. రాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదే! ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదు. అధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతో, కొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యం" గా మలిచేశారు. ప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసి, హాస్యాస్పదం చేశారు. ప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారు. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతో, ఇంతో భాగం వుంది. వారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్ప, చాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

Thursday, July 12, 2012

ఎవరికీ కాని పీవీ నరసింహారావు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ వారసత్వ కుటుంబానికి బేధాభిప్రాయాలున్నాయా? ఆయన భారతీయ జనతా పార్టీతోను, ఎన్డీయే తోను కుమ్మక్కయాడా? పీవీ మతతత్వ వాదా? ఎందుకు పీవీ ఎవరికీ కానివాడయ్యాడు? అసలు సోనియాకు పీవీకి ఎందుకు-ఎక్కడ చెడింది? పీవీ మంచోడా? చెడ్డోడా? అన్న విషయాలపై ఇటీవల మాజీ కేంద్రమంత్రి అర్జున్ సింగ్, సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ ఆత్మకథలలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. వారు రాసిన ఆత్మకథలు "ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌గ్లాస్ ఆఫ్ టైమ్", "బియాండ్ ద లైన్స్" లలో పేర్కొన్న అంశాలలో వాస్తవికత ఎంత? ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి మన మధ్య అర్జున్ సింగ్ కాని, పీవీ నరసింహారావు కాని, కులదీప్ నయ్యర్‍కు చెప్పిన మధు లిమాయే కాని బ్రతికి లేరు. చెప్పాల్సిన వారు, వారి సమకాలీనులే. అదే జరుగుతోందిప్పుడు. పీవీ ప్రధానిగా వున్నప్పుడు ఆయన మీడియా సలహాదారుడు గాను, ఆయనకు ఆంతరంగికుడు గాను పనిచేసిన మన రాష్ట్రానికి చెందిన మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పీవీఆర్‍కె ప్రసాద్ ఆ పుస్తకాలలో పేర్కొన్న పలు వివాదాంశ అంశాలపై వివిధ ఛానళ్లలో మాట్లాడడమే కాకుండా, హైదరాబాద్‌లో పాత్రికేయ సంఘాలు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా వివరించారు.
జరుగుతున్నదంతా పీవీ పైన ఆశ్చర్యకరమైన, బాధాకరమైన ఆరోపణలనక తప్పదు. వాస్తవమేంటో, బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యంలో అక్కడ పీవీ ఇంట్లో జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత తన మీద వుందంటూ, జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు బహిరంగ పరిచారు పీవీఆర్‍కె. దాని సారాంశమే వ్యాసం. అర్జున్ సింగ్, కులదీప్ నయ్యర్ చెప్పిన దాంట్లో రాజకీయ కోణాలున్నాయి. అసలా మాటకొస్తే ఇవేవీ కొత్తగా చేస్తున్న వ్యాఖ్యానాలు కానే కావు. కాకపోతే చేసే పద్ధతే మారింది. ఇందులో రెండు-మూడు విషయాలు ప్రధానంగా చెప్పుకోవాలి. అసలు చేస్తున్న వ్యాఖ్యానాలు వాస్తవాధారంగా వున్నాయా? లేనప్పటికీ చేశారంటే, ఏదో ఒక కారణం-ప్రణాళిక వుండి తీరాలి. ఇదేదో మామూలుగా జరుగుతున్న విషయంలాగా కనిపించడం లేదు. అర్జున్ సింగ్ కానీ, కులదీప్ నయ్యర్ కానీ సంఘటనా స్థలంలో (పీవీ ఇంట్లో) లేరప్పుడు. అక్కడ జరిగింది ప్రత్యక్షంగా ఇద్దరూ చూడలేదు. ఇద్దరు కూడా ఎవరో చెప్పారని మాత్రమే అంటున్నారు. పీవీకి తాను టెలిఫోన్ చేసానని, అందుబాటులోకి రాలేదని అంటున్నారు అర్జున్ సింగ్. ఆయనకు ప్రధాని పీవీ కార్యాలయంలో-ఇంట్లో పనిచేస్తున్న వారందరూ తెలుసు. అందరి పేర్లూ తెలిసే వుండాలి. ఆయన ఎవరితో మాట్లాడారో చెప్పకుండా డొంక తిరుగుడుగా పీవీ అందుబాటులోకి రాలేదంటే ఎలా? ఆయన ఉద్దేశం పీవీ దొరకలేదనే అంశాన్ని హై లైట్ చేయడమే తప్ప అసలు వాస్తవం-నిజం తెలియచేయడం కానే కాదు. కులదీప్ నయ్యర్ లాంటి సీనియ పాత్రికేయుడు-పెద్ద మనిషి కూడా అర్జున్ సింగ్ తరహాలోనే రాయడం విడ్డూరం.
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు ఉదయం నుంచి, రాత్రి పొద్దు పోయేంతవరకూ, మీడియా సలహాదారు హోదాలో పీవీఆర్‍కె ప్రసాద్ ప్రధాని ఇంట్లోనే ఆయన సమక్షంలోనే అధికారిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ వున్నారు. పీవీ గదిలో తలుపులు వేసుకుని "నీరో” లా పూజలు చేస్తున్నారనడం అసత్య ఆరోపణ. బాబ్రీ మసీదు చివరి ఇటుక కూలేంతవరకూ, ఆ విషయం తలుపులు తీసుకుని ఆయన చెవిలో ఎవరో చెప్పేంతవరకూ పీవీ పూజ చేస్తూనే వున్నారట! ఇంతకన్నా కాకమ్మ కథ ఇంకోటి లేదు. ఆనాడు, ఆ టైమ్‌లో చోటు చేసుకున్న సంగతులు, జరిగిన వ్యవహారం, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమం అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే, పీవీ గదిలో కూర్చుని పూజ చేశాడో? వ్యవహారాలు చక్కదిద్దుతున్నాడో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. పీవీ నిరంతరం హోం కార్యదర్శి మాధవ్ గోడ్బోలేతోను, కాబినెట్ కార్యదర్శి తోను, ఆయన వ్యక్తిగత కార్యదర్శితోను మంతనాలు చేస్తూనే వున్నాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో వారి ద్వారా కాంటాక్ట్ లో వున్నాడు. ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాల గురించి ఆరా తీసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఉత్తర్వులు కూడా ఇప్పించారు పీవీ. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావు గారిని, ఇతర అధికారులను పిలిపించుకుని, ఒక వేళ పరిస్థితి అలానే కొనసాగితే, కేంద్రం ఏం చెయ్యాలనేది కూడా బేరీజు వేసుకుంటున్నారు. 


ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయలేమని చేతులెత్తేసి ఆ విషయాన్ని కేంద్రానికి తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే ముందస్తు జాగ్రత్తగా కేంద్రం పంపిన బలగాలను, బాబ్రీ మసీద్ కట్టడం దగ్గర కాకుండా, మూడు కిలోమీటర్ల ఆవల వుంచింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని అప్పుడు కదిలించమని ఉత్తర్వులు ఇవ్వడమంటే, వేలాదిమంది కరసేవకులను చంపుకుంటూ పోవడమే! దానికీ పీవీ గారే బాధ్యుడా? ఆయన ఒకదానికి మాత్రం బాధ్యుడు. ముందుగానే రాష్ట్రపతి పాలన విధించక పోవడానికి బాధ్యుడు! అదే జరిగి వున్నట్లయితే మసీదు కూలకపోయేదేమో! కాకపోతే పీవీ రాష్ట్రపతి పాలన విధించాలా? వద్దా? అన్నది చాలా "ట్రిక్కిష్" ప్రశ్న. రాష్ట్రపతి పాలన విధించడానికి కొన్ని నిబంధనలున్నాయి-నియమాలున్నాయి-రాజ్యాంగ విలువలున్నాయి. శాంతి-భద్రతల సమస్య క్లిష్టతరమైందా ఒక రోజు ముందర, అంటే, అలాంటిదేమీ జరగలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ స్వయంగా వచ్చి ప్రభుత్వానికి, ఎన్డీయేకు ఏమీ జరగదని నమ్మకంగా చెప్పాడు. ప్రధానికీ అలానే చెప్పాడు. సుప్రీం కోర్టు ముందు కూడా చెప్పాడు. శాంతి-బధ్రతలను కాపాడుతానని వాగ్దానం చేశాడు. తనతో పాటు బీజేపీ జాతీయ నాయకులను కూడా పీవీ దగ్గరకు తీసుకొచ్చి మరీ నమ్మబలికాడు కల్యాణ్ సింగ్.
అర్జున్ సింగ్ ఇప్పుడే మంటున్నాడు? పీవీ బిజెపిని నమ్మాడని! ఆయన అందరితో మంచిగా వుండాలని ప్రయత్నం చేశాడని! పీవీ చేసింది అందరితో మంచిగా వుండే ప్రయత్నం కన్నా రాజ్యాంగపరంగా ఏం చేస్తే మంచిదనేది. పీవీ అంతటితో ఆగలేదు. సమస్యను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు. రాజ్యాంగపరంగా శాంతిబధ్రతలు రాష్ట్రం చూసుకోవాలి. కేంద్రం వెనుకనుంచి మద్దతు ఇస్తుంది. పరిస్థితుల నేపధ్యంలో, బాబ్రీ మసీదు కట్టడాన్ని కాపాడే బాధ్యతను కేంద్రానికి అప్పచెప్పాలని సుప్రీం కోర్టును కోరింది పీవీ ప్రభుత్వం. న్యాయ స్థానం దానికి అంగీకరించలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటానంటే ఎందుకు కేంద్రానికి ఆతురత అని ప్రశ్నించింది. మరో అడుగు ముందుకు వేసి, ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసి, పరిశీలకుడిని నియమించింది.  మరి, ఆ పరిశీలకుడు ఏం చేస్తున్నట్లు? కేంద్ర పంపిన బలగాలను వినియోగించుకోవడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరించిందో ఆ పరిశీలకుడు ప్రశ్నించాడా? అందుకే, మొత్తం వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్నన్నా తప్పు పట్టాలి, లేదా, పరిశీలకుడినన్నా తప్పు పట్టాలి. మధ్యలో పీవీ ఏం తప్పు చేశాడు? రాష్ట్రపతి పాలన విధించక పోవడమేనా?
రాష్ట్రపతి పాలన విధించాలంటే, శాంతిబధ్రతల వైఫల్యం వుండాలి. అలాంటిదేమీ లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ నాయకులు నమ్మకంగా చెప్పారు. కేవలం వారి మీద ఆధార పడకుండా గవర్నర్ నివేదిక ప్రామాణికంగా తీసుకున్నారు పీవీ. గవర్నర్ తన నివేదికలో అలాంటిదేమీ లేదని స్పష్టంగా తెలియచేశారు. చాలామంది కరసేవకులొచ్చారనీ, అంతా శాంతియుతంగా జరుగుతుందనీ, అప్పుడు గనుక కేంద్రం జోక్యం చేసుకుంటే-రాష్ట్రపతి పాలన విధించితే, గొడవలు జరిగే అవకాశం వుందనీ గవర్నర్ నివేదిక సారాంశం. మరి ఆ గవర్నర్ గారి "లాయల్టీ" ఎలాంటిదో! అది వేరే విషయం. కానీ, రాజ్యాంగపరంగా నిర్ణయం తీసుకోవాలంటే వీలు కాని పరిస్థితి. న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావుగారు రాష్ట్రపతి పాలన రాజ్యాంగ విరుద్ధ మన్నారు. ఈ విషయాలన్నీ కేవలం పీవీ ఒక్కడిదే కాదు-అర్జున్ సింగ్‌తో సహా అక్కడున్న యావత్తు మంత్రి మండలి తీసుకున్న సమిష్టి నిర్ణయం. ఆనాడు తలెత్తిన ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానాలు లేవు. పీవీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాని అయినంత మాత్రాన బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎక్కడా లేదు. ఆయనకు రాజ్యాంగం మీద ఎనలేని గౌరవం. ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకున్నాడన్న నింద మోపవచ్చు! పోనీ, కల్యాణ్ సింగ్ మోసం చేశాడందామా? నమ్మక ద్రోహం చేశాడందామా? ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోవడానికి అనేక కారణాలుండవచ్చు! బహుశా బీజేపీకి కూడా అలా జరుగుతుందన్న సమాచారం వుండి వుండకపోవచ్చు! ఆ తరువాత పార్లమెంటులో వాజ్‌పేయి-ఇతర బీజేపీ నాయకులు మాట్లాడిన దానిని బట్టి చూస్తే, అదే అర్థం స్ఫురిస్తుంది. వాళ్లు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని. చివరకు కల్యాణ్‌తో సహా వారి నాయకత్వం దెబ్బ తింది-పీవీని దెబ్బ కొట్టారు!
పీవీ దెబ్బ తినడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల వ్యాఖ్యానాల కంటే స్వపక్షం వారి దాడే! పీవీ ప్రధానిగా ఏదో మూణ్ణాళ్ల ముచ్చటగా-ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే పదవిలో కొనసాగుతాడని భావించాడు అర్జున్ సింగ్. అయన తరువాత తానే ప్రధాని అవుతానని కలలు కన్నాడు. పీవీని దింపుదామంటే, ఆయనేమో పావులు చాకచక్యంగా కదిపి, ఏకు-మేకై కూర్చున్నాడు. పాతుకు పోయాడు. కాంగ్రెస్ పార్టీ వారందరూ కలిసి బీజేపీని నిందించడానికి మారుగా, సొంత మనిషి పీవీని నిందించడం ఎంతవరకు సబబు? అంతే కాకుండా, బీజేపీతో పీవీ జతకట్టాడు అనే దాకా వెళ్లాడు అర్జున్ సింగ్. ఆ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే: చివరకు, పదిహేను సంవత్సరాల అనంతరం కూడా, అదీ, లిబర్హాన్ కమీషన్ పీవీని నిర్దోషి అని తేల్చిన తరువాత కూడా, కాంగ్రెస్ నాయకుడైన అర్జున్  సింగ్ తన ఆత్మకథలో ఇలా రాయడం, దానికి కులదీప్ నయ్యర్ లాంటి వారు వంత పలకడం విడ్డూరం. బాబ్రీ మసీదు కూల్చివేతకు తన పార్టీ-తమ ప్రధాని బాధ్యుడనే స్థితికి దిగజారాడు అర్జున్ సింగ్. ఆయన మైండ్ సెట్, అజెండా, ఒక రకంగా పీవీ మీద ద్వేషం-మరొక రకంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోవడం. ఆయన ఆర్థిక సంస్కరణలైనా, భూసంస్కరణలైనా, నెహ్రూ-గాంధీ విధానాలను కొనసాగించడమే కాని దానికి విరుద్ధమెలా అవుతుంది? పీవీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం కోసం మాత్రమే. ఆయనే కనుక తనకోసం నిర్ణయం తీసుకుంటే, మరో మారు ప్రధాని కావడం ఏ మాత్రం కష్టమయ్యేది కానే కాదు.
సోనియా వ్యతిరేకత విషయం ప్రస్తావించిన అర్జున్ సింగ్ పీవీ "ఎమోషనల్ ఔట్ బరస్ట్" గురించి రాశాడు. పీవీ తత్వం అర్థం చేసుకున్న చాలామందికి ఆయనకసలు అలాంటి గుణమే లేదనే వాస్తవం తెలుసు. ఇవన్నీ సోనియాకు-పీవీకి సంబంధాలు చెడగొట్టే ప్రయత్నం చేయడమే! బ్రతికుండగా అర్జున్ అస్తమానం పీవీ మీద సోనియాకు పితుర్లు మోయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటికీ అలానే చేస్తున్నాడు. పీవీకి లాయల్టీ అంటే, విధానాలకా? వ్యక్తులకా? లాయల్టీకి సైకోఫెన్సీకి తేడా తెలియని అర్జున్ సింగ్ అలా రాయడంలో ఆశ్చర్యం లేదు. అర్జున్ సింగ్ తన అవసరాలకొరకు, స్వలాభం కొరకు, పీవీకి సోనియాకి మధ్య అగాధం సృష్టించాడు. అసలు పీవీని సోనియా కాని, ఆ నాటి కాంగ్రెస్ పెద్దలు కాని ప్రధాని చేయడానికి కారణం ఆయనకు నెహ్రూ-గాంధీ కుటుంబంపై లాయల్టీ కాదా? ఇప్పుడిలా సమయం సందర్భం లేకుండా పుస్తకాలలో ఏదో రాసి, రాసింది అంతవరకే బహిర్గతం చేసి పీవీని బదనాం చేయడం ఎంతవరకు సబబు? అసలు పీవీకి ఇంట్లో పూజ గదే లేనప్పుడు పూజ చేయడమనే ప్రశ్నే ఉదయించదు! అసలా రోజున ప్రధానిగా పీవీ ఇంటికి ఎవరెవరు-ఎప్పుడెప్పుడు వచ్చింది మొత్తం రికార్డై వుంటుంది కదా! అదెందుకు పరిశీలించరు? మరి ఎందుకీ రాతలు?
ఈ మధ్య కాలంలో మన దేశం దౌర్భాగ్య స్థితిలోకి పోతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఒక వైపు, ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన పీవీ ప్రభుత్వాన్ని మరో వైపు పోల్చి చూపే ప్రక్రియ మొదలైంది. ఇదే మన్మోహన్, పీవీ హయాంలో అలా ఎలా చేయగలిగాడు? అన్న చర్చ మొదలైంది. ఇప్పుడాయన ప్రధాని ఐతే కూడా ఎందుకు పని చేయలేకపోతున్నాడన్న ప్రశ్న అడుగుతున్నారు. పీవీ చేసిన మంచి పనంతా బయటకొస్తుందేమోనన్న భయం పట్టుకుంది కొందరు కాంగ్రెస్ వారికి. నిజంగా కాంగ్రెస్‌కు సద్భుద్దే వుంటే, పీవీ పనితీరును చెప్పి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచుకోవాలి! దురదృష్టం ప్రతిపక్షాలకంటే కూడా కాంగ్రెస్ పార్టీలోనే పీవీ వ్యతిరేకులు ఎక్కువమంది వుండడం. తర-తమ బేధం లేని పాములపర్తి వెంకట నరసింహారావు పేరు అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో వుంటుందో-లేదో చెప్పలేం కాని, భారత దేశ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడడం ఖాయం. ఆయన పేరు చిర స్థాయిగా నిలవడం నిజం!

Monday, July 9, 2012

పీవీపై నింద మోపడమంటే ఈర్ష్య-అసూయలకు పరాకాష్టే!: వనం జ్వాలా నరసింహారావు


పీవీపై నింద మోపడమంటే 
ఈర్ష్య-అసూయలకు పరాకాష్టే!
వనం జ్వాలా నరసింహారావు

పీవీపై అసత్య కథనాలు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-07-2012)

స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ ప్రత్యర్థి "కీర్తి శేషులు" అర్జున్‌ సింగ్ "ఆత్మకథ-ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌ గ్లాస్ ఆఫ్ టైమ్" పేరిట, పీవీతో అంతగా పరిచయమే లేని సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ పుస్తకం "బియాండ్ ద లైన్స్" పేరిట, ఆ మహనీయుడిపై బురద చల్లే కార్యక్రమానికి కొందరు ఇటీవల పనిగట్టుకుని మరీ శ్రీకారం చుట్టారు. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపమని, సోనియా అంటే పీవీకి సదభిప్రాయం లేదని, రాజీవ్ హత్యా-మరణానంతరం సోనియా గాంధీని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేద్దామన్న సూచనకు పీవీ వ్యతిరేకమని, ఇంజనుకు తగులుకుని రైలు పెట్టెలన్నీ దాని వెనకాలే వెళ్లినట్టు నెహ్రూ-గాంధీ కుటుంబం వెనుకే కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికని పీవీ ఆ సందర్భంగా ప్రశ్నించాడని, బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో ఆయన ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చోవడమంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్న దృశ్యం తనకు గుర్తుకొచ్చిందని అర్జున సింగ్ ఆరోపించారు తన ఆత్మకథలో. అసంపూర్తి గా మిగిలిపోయిన అర్జున సింగ్ గ్రంథాన్ని ఆయన సన్నిహితుడైన అశోక్ చోప్రా పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా మరికొన్ని సంచలనాత్మక విషయాలున్నాయి. సోనియా పట్ల పీవీ ప్రవర్తన తనకు రాజకీయాలంటేనే అసహ్యం వేసే స్థితికి తీసుకెళ్లిందని, ఐతే, కొద్ది సేపటికే పీవీ మనసు మార్చుకుని తానిచ్చిన ఆలోచనకు సానుకూలంగా స్పందించారని అర్జున సింగ్ పేర్కొనడం జరిగింది. రాసిన అర్జున సింగ్ కాని, ఎవరినుద్దేశించి రాయడం జరిగిందో ఆ నాయకుడు పీవీ నరసింహారావు కాని ఇప్పుడు మన మధ్య లేరు. ఆ పుస్తకంలోని నిజా-నిజాలు వారిద్దరన్నా చెప్పాలి, లేదా, వారి సమకాలీనులన్నా చెప్పాలి.

బాబ్రీ కూల్చివేత వార్త వినగానే తన మనసులో ఆ దృశ్యాలు కదిలాయని, ఆ విషాద ఘటన తాలూకు పరిణామాలు దేశ చరిత్రలో అంచనా వేయలేని స్థాయిలో ఉంటాయని తన మనసుకు అనిపించిందని, భారతదేశ "లౌకిక వ్యవస్థ" తీవ్రంగా దెబ్బతిన్నదన్న బాధ కలిగిందని, ఆ మనస్తాపంతోనే పీవీకి ఫోన్ చేస్తే, ఆయన అందుబాటులో లేరని సమాచారం అందిందని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, మరొక్క అడుగు ముందుకు వేసి, బాబ్రీ మసీదును కూల్చడానికి ఒక రోజు ముందే, ఆ విషయాన్ని తాను పీవీకి చెప్పానని అర్జున్ రాసుకున్నారు. అయితే ఆయన ఆ అంశాన్ని అంత తీవ్ర విషయంగా పరిగణించడం లేదనే భావన తనకు కలిగిందని పేర్కొన్నారు. బీజేపీ, ఇతర హిందూత్వ అనుకూల సంస్థల కుట్రలు, కుతంత్రాలను ఎందుకు పట్టించుకోవడం లేదని పీవీని ఆయన ప్రశ్నించారట! ఒక విధంగా పీవీకి "కమ్యూనల్ కలర్" ఇచ్చే ఆరోపణ ఇది.



సరిగ్గా ఇలాంటిదే-ఇదే సమయంలో, సందర్భం అనేదేదీ లేకుండా, బహుశా ఇలా కలిమిడిగా చేద్దామని ఆలోచించి మరీ చేశారన్న భావన కలిగే విధంగా, కులదీప్ నయ్యర్ పుస్తకంలోని కొన్ని భాగాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. బురదజల్లుడు కార్యక్రమం ఆ విధంగా కొనసాగించే ప్రక్రియకు ఆయనా తయారయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో, అర్జున్ సింగ్ చేసిన ఆరోపణను కులదీప్ నయ్యర్ మరి కొంచెం విస్తరించి చెప్పారు. పీవీ "నిష్క్రియగా" కూర్చొన్నారనేదే వారిరువురి ఆరోపణ. తనకున్న సమాచారం ప్రకారం "బాబ్రీ మసీదు కూల్చివేతకు పీవీ మౌనంగా అంగీకారం తెలిపారు" అనేది కులదీప్ నయ్యర్ ఆరోపణ. ఆ సమాచారమేంటో ఇదమిద్ధంగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన స్థాయి సీనియ పాత్రికేయుడు. కరసేవకులు మసీదును కూల్చడం మొదలుపెట్టగానే పీవీ పూజలో కూర్చున్నారని, చిట్టచివరి రాయిని కూడా తొలగించిన తర్వాతే ఆయన పూజనుంచి లేచారని, పూజ జరుగుతుండగా పీవీ అనుచరుడొకరు వచ్చి ఆయన చెవిలో మసీదు కూల్చివేత అయిపోయిందని చెప్పారని తన పుస్తకంలో రాసుకున్నారు. తనకందిన సమాచారానికి ఆధారంగా దివంగత సోషలిస్టు నాయకుడు మధు లిమాయేను పేర్కొన్నారు. తన పుస్తకంలోని "నరసింహారావు ప్రభుత్వం" అనే అధ్యాయంలో మసీదు కూల్చివేతకు నిరసనగా మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు పీవీ కొందరు సీనియర్ పాత్రికేయులను తన ఇంటికి పిలిచిన విషయం; మసీదు కూల్చివేతను ఆపడానికి తన ప్రభుత్వం వీలైన ప్రతి ప్రయత్నమూ చేసిందని చెప్పిన విషయం; తాను లక్నోకు సీఆర్ పీ దళాలను పంపినా వాతావరణం అనుకూలించని విషయం; లాంటివి పేర్కొన్నారు. పీవీ అంటే సోనియా గాంధీకి ఇష్టం లేని విషయాన్ని కులదీప్ నయ్యర్ సహితం రాశారు. పార్టీ పగ్గాలు, ప్రధాని పదవిని పీవీ చేపట్టడం సోనియాగాంధీకి ఎప్పుడూ ఇష్టం లేదనే సంగతినీ వెల్లడించారు. సోనియా "మత తత్వ శక్తులు రాజకీయాలను ఆక్రమిస్తున్నాయని" వెలిబుచ్చిన ఆవేదనకు ప్రాధాన్యం ఇస్తూ రాసిన కులదీప్ నయ్యర్, మతతత్వంపై పోరాడాలంటే సోనియా రాజకీయాలలో చేరక తప్పదని, అందుకు ఆమె చేతుల్లో వున్న ఏకైక ఆయుధం కాంగ్రెస్ పార్టీనే నని ఆనాడే తాను అంచనా వేశానని నయ్యర్ రాసుకున్నారు. దీని సారాంశం కూడా పీవీ కమ్యూనలిస్టేనని!

అర్జున సింగ్, కులదీప్ నయ్యర్ తమ ఆత్మకథలలో రాసిన మాటలను వాస్తవాలుగా ఎంతవరకు పరిగణించవచ్చు? వాస్తవ దూరం ఐతే అవి నిజాలు కావని చెప్పేదెవరు? అర్జున్ సింగ్ కాని, పీవీ నరసింహా రావు కానీ, కులదీప్ నయ్యర్ ప్రస్తావించిన మధు లిమాయే కాని మన మధ్య లేరు. కాకపోతే, పీవీ హయాంలో బాధ్యతాయుతమైన స్థానాలలో పనిచేసిన వారిలో పలువురు ఇంకా జీవించే వున్నారు. బాబ్రీ మసీదు సంఘటన కూల్చివేత పూర్వ రంగంలో, ఉత్తర రంగంలో ఆయనతో ఆ విషయాలను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో పంచుకున్న వారూ లేకపోలేదు. మధులిమాయేను కోట్ చేసిన కులదీప్ నయ్యర్, అసలాయన ఆ క్షణంలో పీవీ సమీపంలో వున్నారా? లేరా? అన్న విషయాన్ని కూడా ధృవీకరించుకున్నట్లు లేదు. సరిగ్గా ఇవే విషయాలను పీవీ హయాంలో (మరో ఐదుగురు ప్రధాన మంత్రులతో సహా) న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసి ఆయనకు "రాజ్యాంగ పరమైన" అనేక విషయాల్లో నిర్మొహమాటమైన సూచనలిచ్చిన పీసీ రావు, అదే విధంగా పీవీకి మీడియా సలహాదారుగా మాత్రమే కాకుండా ఆయనకు అనేక విషయాలలో ఆంతరంగికుడుగా పనిచేసిన పీవీఆర్‍కె ప్రసాద్ స్వయానా హైదరాబాద్ మీడియాకు వివరించడం జరిగింది. అర్జున సింగ్-కులదీప్ నయ్యర్ రాసినవన్నీ అసత్య కథనాలేనని, పీవీపై కడుపు మంటతో వారీ పని చేశారని వారి మాటల్లో వ్యక్తమైంది. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన సమయంలో, అలనాటి వాస్తవాలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. తమతో పాటు నాటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాధవ్ గోఖలే, కాబినెట్ కార్యదర్శి రాజగోపాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ వైద్య, పీవీ ఆంతరంగిక కార్యదర్శి ఏఎన్ వర్మ, కేంద్ర హోం మంత్రి ఎస్‍బీ చవాన్ వున్నారని వీరన్నారు. మరి వారందరికీ తెలియని విషయాలు మధులిమాయేకు ఎలా తెలిశాయో అర్థం కాని ప్రశ్న.  వారి రాతలన్నీ పీవీ ప్రతిష్టను దిగజార్చేటందుకేనన్నది కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. ప్రధాని పదవి ఆశించి భంగపడిన అర్జున్ సింగ్‌కు పీవీపై ఎప్పుడూ కోపమేనని అంటూ ఆయన అలా రాశారంటే ఆ కోణంలో అర్థం చేసుకోవచ్చు కాని, కులదీప్ నయ్యర్ కూడా లా రాయడం దురదృష్టం అన్నారు.

బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో పీవీ పూజ గదిలో వున్నారని చేసిన ఆరోపణ చాలా హాస్యాస్పదమైంది గా పీవీఆర్‍కె, పీసీ రావులు పేర్కొన్నారు. అర్జున్ సింగ పీవీ వ్యతిరేకైతే, కులదీప్ నయ్యర్ పీవీని ఏనాడూ దగ్గరనుంచి చూడలేదని, అలనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చేసిన తప్పులకు పీవీని బాధ్యుడుగా చేయడం తగదని అన్నారు. వారన్నట్లుగా పీవీని రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరోతో పోల్చడం చాలా తప్పు. అసలు పీవీ నరసింహారావు ఇంట్లో పూజ గదే లేదట. కూల్చివేత సంఘటన జరిగిన డిసెంబర్ ఆరవ తేదీన పీవీ రోజంతా ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతూనే వుంటే ఇక పూజ గదిలో కూర్చోడం ఎలా జరిగింది? పీవీ ఏ పని చేసినా రాజ్యాంగ బద్ధమైందేతేనే చేసేవారట. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని దింపి రాష్ట్రపతి పాలన ఒక రోజు ముందట విధించడమంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమే! అలా చేయనందున ఈ రోజున ఆయనపై అసత్య ఆరోపణలు చేసి "కమ్యూనలిస్ట్" అనే ముద్ర వేయడం తగని పని. పీవీ ఏ నాడూ రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు.

పీవీని అప్రతిష్ట పాలు చేయడం ఇవ్వాళ కొత్తేమీకాదు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం, పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముడుపులు ఇచ్చారన్న కేసులో పీవీ శిక్షార్హుడని న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు మీడియాలో ఆ విషయం ప్రముఖంగా ప్రచురించారు. "అవినీతికి అర దండాలు" అని, "చెరసాలకు మాజీ ప్రధాని" అని, "ఆర్థిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు శిక్ష" అని శీర్షికలు పెట్టారు. న్యాయమూర్తి అజిత్ బరెహోక్ తన తీర్పులో, కఠిన పదజాలాన్ని వాడి, పీవీ చేసిన ప్రయత్నం భారత రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకమని, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనీ పేర్కొన్నారు. కాని ఆ తరువాత ఏమైంది? ఐదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి, పలువురికి పంచిపెట్టిన మేధావి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని థీశాలి ముఖంలో కొన్ని సెకనులు మాత్రమే ఆందోళన కనిపించింది. పీవీ నేరం చేశారో-లేదో తరువాత వెలువడిన తీర్పులే తేల్చాయి. ఏ ఒక్క దాంట్లో నూ ఆయన నేరస్తుడుగా మిగలలేదు. కొన్నాళ్లకు పై కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. బహుశా ఇప్పుడు పీవీ జీవించి వున్నట్లయితే అర్జున్ సింగ్-కులదీప్ నయ్యర్ రాతలకు అలానే చిరునవ్వు నవ్వేవాడేమో!

ఇంతకీ పీవీ చేసిన తప్పేంటి? ఆలోచనలలో, అమలులో, విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనబడిన ఈ వ్యక్తి, అపర చాణక్యుడుగా అందరూ స్తుతించిన ఈ వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాలతో సహా ఖండ-ఖండాంతర ఆర్థిక నిపుణులనుండి ప్రశంసలనందుకున్న ఈ వ్యక్తి చేసిన పెద్ద పొరపాటు, బహుశా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని-నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా-ఐదేళ్లు కలిగించడం, విశ్వాస ఘాతకులకు వందేళ్ల చరిత్రను అంకితం చేయడం! తొలి దక్షిణాది వ్యక్తిగా ప్రధాని పీఠాన్ని అందుకుని, అందులో ఐదేళ్ల పాటు కొనసాగడం చాలా మందికి అందునా ఉత్తరాది వారికి నచ్చలేదు. నెహ్రూ కుటుంబానికి చెందనివాడు, దక్షిణాది వాడు, ముఖ్యమంత్రిగా కూడా పూర్తికాలం పనిచేయలేనివాడు, కనీస మెజారిటీ సభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పదవిని చేపట్టి నెగ్గు కొచ్చినవాడు కావడంతో, పీవీని దెబ్బతీసే ప్రయత్నం రవై ఏళ్ల కిందటే మొదలైందంటే అతిశయోక్తి కాదేమో!

భారతావనిలో కులాలు, మతాలు, భాషలు అటుంచి, ఉత్తరాదివారు-దక్షిణాదివారు అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగాహన చేసుకోవాలంటే, చరిత్రపుటల్లోకి ఎక్కి-విశ్వవ్యాప్త మన్ననలందుకున్న మహనీయుడు పీవీ లాంటి వ్యక్తిని ఎలా అధఃపాతాళానికి తొక్కే ప్రయత్నాలు చేసారో తెలుసుకోవడమే! అర్జున్ సింగ్‍లు, కులదీప్ నయ్యర్‍లు ఇప్పుడా కోవకు చెందిన వారే.