Sunday, August 29, 2021

వాసుదాస విరచిత శ్రీకౌసల్యా పరిణయం : వనం జ్వాలా నరసింహారావు

 వాసుదాస విరచిత శ్రీకౌసల్యా పరిణయం

వనం జ్వాలా నరసింహారావు

           దశరథుడి తాత రఘు మహారాజు. ఆయన కుమారుడు అజుడు. గొప్ప పరాక్రమవంతుడు. అందగాడు. ఆయన యువరాజుగా వున్నప్పుడు విదర్భ మహారాజు భోజుడు తన సహోదరి ఇందుమతి స్వయంవరాన్ని ప్రకటించాడు. అజుడు విదర్భ చేరి ఆ స్వయంవరంలో పాల్గొన్నాడు. ఇందుమతి కరగ్రహణం చేశాడా స్వయంవరంలో. ఆమెతో కలిసి అయోధ్యకు బయల్దేరాడు. ఆ తరువాత తండ్రి ఆజ్ఞానుసారం పైతృకమైన రాజ్యాన్ని ప్రజాను రంజకంగా పాలించాడు. భార్య ఇందుమతి దశరథుడికి జన్మనిచ్చింది. ఒకనాడు ఇందుమతితో ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆకాశమార్గాన పయనిస్తున్న నారదుడి మెడలోని పూలమాల వాయువశాన జారి ఇందుమతి మీద పడింది. వెంటనే ఆమె మరణించింది. దానికి నారదుడిని అజుడు నిందించగా అది ఆమెకు శాప విమోచనమని నచ్చ చెప్పాడు నారదుడు. భార్యా వియోగాన్ని భరించలేక దశరథుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేసి ప్రాణత్యాగం చేశాడు అజుడు.

         అజ మహారాజు మరణానంతరం దశరథుడు అయోధ్యాపుర సింహాసనం అధిష్టించాడు. పెద్దలు అతడి వివాహానికి తొందరపడ సాగారు. ఒకనాడు దశరథుడు వేటకు పోయి క్రూర మృగాలను సంహరించ సాగాడు. కాసేపటికి గుర్రాలు అలసిపోవడంతో సమీపంలో వున్న అత్రి మహాముని ఆశ్రమానికి పోయారు. అత్రి మహాముని రాజుకు ఆతిథ్యమిచ్చి ధర్మాలను బోధించాడు. అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం ఉత్తమమైనదని చెప్తూ, త్వరగా మంచి కన్యను వివాహమాడమని సూచించాడు. దక్షిణ కోసల రాజ్యాధిపతి కుమార్తె సౌందర్యవతి అని ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు. అత్రిమహాముని దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు పోతూ మార్గమధ్యంలో తన కులగురువైన వశిష్టుడి ఆశ్రమానికి వెళ్లాడు. వశిష్టుడు దశరథుడికి రామనామ మహాత్మ్యాన్ని గురించి చెప్పాడు. అయోధ్యకు వచ్చిన దశరథుడు నిరంతరం రామనామ ధ్యాన చిత్తుడై వున్నాడు.

         దశరథుడికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. దండయాత్రకు బయల్దేరాడు. దండయాత్ర చక్కగా సాగింది. దక్షిణ కోసల రాజ్యం సమీపంలో వుండగా ఆ దేశ రాజైన భానుమంతుడి కుమార్తె కౌసల్యను చూడాలని కోరిక కలిగింది దశరథుడికి. వశిష్టుడిని ధ్యానించగా ఆయన రాగానే తన మనసులోని మాట చెప్పాడు. ఆ సాయంకాలం దగ్గరలో వున్న ప్రమదావనంలో దాగి వుంటే ఆయన కోరిక తీరుతుందని వశిష్టుడు చెప్పాడు. వశిష్టుడు చెప్పినట్లే ఆ దేశ రాకుమారి కౌసల్యాదేవి ఆ సాయంకాలం చెలికత్తెలతో ఉద్యానవనం ప్రవేశించింది. ఆమె చూడ చక్కగా వున్నదని అనుకున్నాడు దశరథుడు.

         ఇక కౌసల్యాదేవి విషయానికొస్తే......దక్షిణ కోసలదేశ రాజు భానుమంతుడికి, అతడి భార్య చంద్రభాగకు చాలా కాలం సంతానం కలగలేదు. సంతానం కొరకు వారిరువురు శ్రీహరి గురించి అరణ్యాలలో తపస్సు చేశారు. శ్రీహరి ప్రత్యక్షమై వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టుతారని, వారి కుమార్తెకు తాను కుమారుడిగా జన్మించుతానని వరం ఇచ్చాడు. శ్రీహరి చెప్పినట్లే ఆ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిగారు. కుమార్తెకు కౌసల్య అని, కుమారుడికి భామమంతుడు అని పేర్లు పెట్టారు. కౌసల్యకు తగిన వరుడు దశరథుడు అని ఒకనాడు వారింటికి వచ్చిన అత్రి మహాముని చెప్పాడు. దశరథుడి గుణగణాలను, పరాక్రమాన్ని గురించి వివరించాడు అత్రి.

         ఈ నేపధ్యంలో కౌసల్య ప్రమదావనానికి రావడం, ఒక పూల పొదల చాటున దాగివున్న దశరథుడిని చూడడం, వారిరిరువురు కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. తమతమ వృత్తాంతాలను చెప్పుకొన్నారు. తనను వివాహం చేసుకోవాలంటే తన తండ్రిని సంప్రదించమని చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు భానుమంతుడు కౌసల్యను దశరథుడికిచ్చి వివాహం చేయడానికి ముహూర్తం నిశ్చయించి ఆ విషయాన్ని తెలియచేయడానికి పురోహితులు వచ్చారని తెలుసుకొని దశరథుడు సంతోషించాడు. ముహూర్తం కొరకు ఎదురు చూడసాగాడు.

         ఇదిలావుండగా రాక్షసరాజు రావణాసురుడు పెట్టె బాధలు సహించలేక దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. శ్రీహరి తాను మానవుడిగా,  శ్రీరాముడిగా దశరథ మహారాజుకు పుట్టి, సీతాదేని పెండ్లి చేసుకొని రావణుడిని సంహరిస్తానని, దేవతలంతా వానర రూపాలలో పుట్టి తనకు సహాయం చేయాలని అన్నాడు. అదెప్పుడు జరుగుతుందని దేవతలు బ్రహ్మను అడిగారు. కౌసల్యా దశరథుల వివాహం రాబోయే ఫాల్గుణ శుద్ధ దశమి శుక్రవారం నాడు జరుగుతుందని చెప్పాడు. ఇదంతా విన్న నారదుడు ఆ వృత్తాంతమంతా రావణుడికి చెప్పాడు. ఇది దేవరహస్యమని, బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తమని కూడా అన్నాడు.

దశరథుడుకి, కౌసల్యకు వివాహం కాకుండా చేస్తానని నారదుడితో అన్నాడు రావణాసురుడు. ఆ తరువాత భార్య మండోదరి ఎంత వారిస్తున్నా వినకుండా కౌసల్యాదేవి వుంటున్న నగరానికి వెళ్లి రాత్రివేళ నిద్రిస్తున్న ఆమెను మంచంతో సహా అపహరించి తెచ్చాడు. ఆ మంచాన్ని ఒక పెట్టెలో పెట్టి సముద్రుడిని పిలిచాడు. మానవులకు, దానవులకు, దేవతలకు, కింపురుషులకు, యక్షులకు, ఇతరులెవరికీ కనపడకుండా ఆ పెట్టెను దాచి పెట్టమని, తాను ఆదేశించినప్పుడు భద్రంగా తనకు అప్పగించమని, అలా చేయకపోతే చంపుతానని బెదిరించాడు. సముద్రుడు ఆయన సమక్షంలోనే ఒక తిమింగలాన్ని పిలిచి హెచ్చరిక చెప్పి ఆ పెట్టెను దానికి అప్పగించాడు.

బంగారు పెట్టెలో వున్న కౌసల్యాదేవికి మెలకువ వచ్చింది. తనను ఎవరో వంచన చేసి, పెట్టెలో బంధించి తీసుకొని పోతున్నారని తలచింది. వనదేవతలను, నదులను కాపాడమని ప్రార్థించింది. ఆమెకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ధైర్యం చెప్పింది. తనకు దశరథుడు భర్తగా కావాలని వరం కోరింది కౌసల్య. అలాగే కాగలదని చెప్పి లక్ష్మి అంతర్థానం అయింది. ఇదిలా వుండగా దశరథుడు పెండ్లికై పౌరులతో బయలుదేరి సరయూనది దగ్గరికి వచ్చాడు దానిని దాటడానికి. ఇంతలో పెనుగాలి వచ్చి ఆయన వున్న నావ సరయూ నదిలో మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకు పోసాగింది. అలా పోయి, పోయి సముద్రంలోని ఒక ద్వీపానికి చేరాడు. అక్కడున్న ఒక దిగుడుబావిలో స్నానం చేసి దొరికిందేదో తిన్నాడు. తన దుస్థితికి చింతిస్తూ శ్రీహరిని ధ్యానించాడు.

ఆ సమయంలో అక్కడికి ఒక బంగారు పెట్టె కొట్టుకొని వచ్చింది. అది దశరథుడి కంట బడింది. దగ్గరికి పోయి తెరచి చూడగా దానిలో కౌసల్య కనబడింది. ఇద్దరూ ఒకరి కష్ట సుఖాలు మరొకరికి చెప్పుకున్నారు. ఇంతలో వారి పెళ్లి ముహూర్తం దగ్గరపడడంతో ఇంద్రాది దేవతలు అక్కడి వచ్చారు. వారంతా ఇరువురిని పెండ్లికి సిద్ధం చేశారు. బ్రహ్మ నిర్ణయించిన ముహూర్తానికి దశరథుడు కౌసల్యాదేవిని వివాహం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు వారిద్దరినీ ఆశీర్వదించి తిరిగి బంగారు పెట్టెలో వుంచి దేవతలతో సహా అదృశ్యమైపోయారు. ఇది జరిగిన కాసేపటికి తిమింగలం వచ్చి ఆ పెట్టెను నోట కరచుకొని తీసుకుపోయింది.

మర్నాటి ఉదయం బ్రహ్మరాత తప్పని చెప్పడానికి రావణుడు నారదుడితో కలసి సముద్రతీరానికి వచ్చాడు. సముద్రుడిని పిలిచి పెట్టె తెప్పించి తెరచి చూశాడు. దానిలో నుండి నవదంపతులు కౌసల్యా దశరథులు బయటకొచ్చారు. సముద్రుడి మీద కోపంతో చంపడానికి పూనుకున్నాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పాడు సముద్రుడు. చేసేది లేక రావణుడు కౌసల్యాదేవిని చంపడానికి సిద్ధపడ్డాడు. విభీషణుడు అడ్డుపడి స్త్రీని చంపడం పాపం అని చెప్పాడు. అప్పుడు రావణుడు ఆ దంపతులను వదిలి లంకలోకి పోయాడు.

అక్కడినుండి పోయే ఉపాయం చెప్పమని నారదుడిని అడిగారు కౌసల్యా దశరథులు. నారదుడు అప్పుడు జటాయువును స్మరించగా అతడు ప్రత్యక్షమయ్యాడు. కౌసల్యా దశరథులు జటాయువును ఎక్కి అయోధ్యాపురం వెలుపల వున్న ఉద్యానవనంలో దిగారు. తన మంత్రైన సుమంత్రుడిని పిలుచుకు రమ్మని జటాయువుకు చెప్పాడు దశరథుడు. విచారంలో మునిగి వున్న సుమంత్రుడి దగ్గరికి పోయిన జటాయువు దశరథుడు సతీ సమేతంగా వచ్చిన వార్త, ఉద్యానవనంలో దిగిన వార్త చెప్పి అక్కడికి పోదాం రమ్మని అన్నాడు. అక్కడికి వెళ్ళిన సుమంత్రుడు రాజును చూసి ఆనందంతో అతడి పాదాల మీద పడ్డాడు.

ఆ తరువాత నగరానికి పోయి పౌరులందరికీ దశరథుడు సతీ సమేతంగా వచ్చిన వార్త చెప్పి స్వాగతానికి ఏర్పాట్లు చేశాడు. పౌరుల స్వాగతం మధ్యన దశరథుడు సతీ సమేతంగా నగరంలోకి ప్రవేశించాడు. కూతురు రాక, వివాహం విషయం తెలుసుకున్న కౌసల్య తండ్రి భానుమంతుడు అయోధ్యకు వచ్చి కొంతకాలం వుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దశరథుడు కొంతకాలానికి సుమిత్రాదేవిని, కైకేయీదేవిని వివాహం చేసుకున్నాడు.  

Saturday, August 28, 2021

ధర్మరాజుకు సతీసావిత్రి, సత్యవంతుడి కథ చెప్పిన మార్కండేయుడు ..... ఆస్వాదన-35 : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజుకు సతీసావిత్రి, సత్యవంతుడి కథ చెప్పిన మార్కండేయుడు

ఆస్వాదన-35

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (29-08-2021)

రామాయణ కథ విన్న ధర్మరాజు ఎవరైనా పుణ్యసతి చరిత్ర వినాలని వున్నదనగానే మార్కండేయుడు, సావిత్రి గాథ చెప్పాడు. మద్రదేశాన్ని పరిపాలించే ఆశ్వపతి అనే మహారాజు సంతానం కొరకు 18 సంవత్సరాలు సావిత్రీదేవిని ఉపాసించాడు. ఆమె ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నది. పుత్ర సంతానం కావాలని రాజు కోరగా ఆమె కూతురును ప్రసాదించింది. అలా వరం ఇచ్చిన తరువాత కొడుకు కూడా కావాలని ఆశ్వపతి మళ్లీ ప్రార్థించగా కొన్నాళ్ల తరువాత ఒకానొక సన్నివేశం ప్రాప్తించి ఆయనకు నూర్గురు సుతులు జన్మిస్తారని చెప్పింది ఆ దేవత. ఆ తరువాత ఆశ్వపతి భార్య మాళవి గర్భం ధరించి సావిత్రి అనే అత్యంత సౌందర్యవతైన కూతురును కన్నది. ఆమె యవ్వనవతి కాగానే వరుడి కొరకు వెతకసాగారు తల్లిదండ్రులు.

సావిత్రి సాళ్వదేశ రాజైన ద్యుమత్సేనుడి కొడుకు సత్యవంతుడిని గురించి విన్నది. అతడిని ప్రేమించింది. కాని సిగ్గుతో ఎవరికీ చెప్పలేకపోయింది. ఇంతలో ఒకనాడు నారదుడు వచ్చాడు వారింటికి. తండ్రి దగ్గర కూచున్న సావిత్రిని చూసిన నారదుడు, ఎందుకామెకు ఇంకా తగిన వరుడిని చూడలేదని ప్రశ్నించాడు. జవాబుగా ఆశ్వపతి కూతురిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆమెకు తగిన వరుడిని ఆమెనే ఎంచుకోమన్నాడు. వెంటనే సిగ్గుపడుతూ తన మనసులోని అభిప్రాయాన్ని తండ్రికి తెలియచేస్తూ, సాళ్వదేశాధిపతి కొడుకైన సత్యవంతుడు తనకు తగిన వరుడని, అతడికి తననిచ్చి పెండ్లి జరిపించమని అన్నది.

అప్పటికే సాళ్వదేశాధిపతి విధిబలీయం వల్ల అధికారాన్ని కోల్పోవడమే కాకుండా గుడ్డివాడయ్యాడు. భార్యాపుత్రులతో అడవిలో నివాసం వుంటున్నాడు. అయినప్పటికీ సత్యవంతుడే తనకు భర్త కావాలని సావిత్రి చెప్పింది. సత్యవంతుడి గుణగణాలను గురించి అడిగాడు ఆశ్వపతి నారదుడిని. అతడిని అన్నివిధాలా పొగడిన నారదుడు అతడికి ఒక లోపం మాత్రం వున్నదని చెప్పాడు. పెండ్లి అయిన ఒక సంవత్సరానికి అతడు మరణిస్తాడని అన్నాడు. ఇంకో వరుడిని అన్వేషించుకొమ్మని సావిత్రికి తండ్రి చెప్పినప్పటికీ, మనోవాక్కాయకర్మలా ఆయన్నే మనసారా వరించానని, సత్యవంతుడు ఎలాంటివాడైనా అతడినే పెండ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది ఆమె. అప్పుడు నారదుడు, సావిత్రిని అభినందిస్తూ, ఆమె పుణ్యం వల్ల సత్యవంతుడికి నిండు ఆయుర్దాయం లభించగలదని అన్నాడు.

ఒకానొక శుభదినాన ఆశ్వపతి మహారాజు సావిత్రిని వెంటబెట్టుకుని మందీమార్బలంతో, పెండ్లి ఏర్పాట్లతో, అడవిలో వున్న ద్యుమత్సేన మహారాజు దగ్గరికి వెళ్లాడు. ఉభయకుశలోపరి వచ్చిన విషయం చెప్పాడు ఆశ్వపతి ద్యుమత్సేనుడికి. తన ఏకైక పుత్రిక సావిత్రిని కోడలుగా స్వీకరించమని ప్రార్థించాడు. తమ పరిస్థితులను, పడుతున్న కష్టాలను ఆశ్వపతికి వివరించాడు ద్యుమత్సేనుడు. అడవుల్లో కష్టాలు పడుతూ కాపురం చేయగలదా? అని అడిగాడు. చివరకు, అందరి అంగీకారంతో సత్యవంతుడికి, సావిత్రికి వివాహం నిశ్చయమైంది. ఆశ్రమవాసులైన ఋషులు నిర్ణయించిన శుభముహూర్తాన పెండ్లి జరిపించారు. తదనంతరం ఆశ్వపతి తన రాజధానికి వెళ్లిపోయాడు.

సావిత్రి సాధారణ స్త్రీలాగా అడవిలో భర్తతో, అత్తమామలతో నివసించసాగింది. నారద మహర్షి చెప్పిన విధంగా తన భర్త ఆయుర్దాయం లెక్కపెట్టుకుంటూ వుండగా నాలుగురోజులు తక్కువగా ఒక సంవత్సరం గడిచింది. వెంటనే మూడు రోజుల నిరాహార దీక్ష చేయాల్సిన త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని పూనింది. ఎందుకీ వ్రతం పూనావని మామగారడిగితే శుభాలను కోరి చేస్తున్నానన్నది. వ్రతం పూర్తై నాలుగో రోజు వచ్చింది. నాలుగవనాడు కూడా సూర్యాస్తమయం అయ్యేదాకా ఉపవాస దీక్ష కొనసాగుతుంది. ఆనాడు తన భర్త మరణించే రోజని మనస్సులో పరితపించి, కాలకృత్యాలను తీర్చుకుని, అత్తమామలకు నమస్కారం చేసి వారి దీవెనలు తీసుకుంది.

ఇంతలో సావిత్రి భర్త సత్యవంతుడు సమిధలు, దర్భలు, పండ్లు తేవడానికి అడవికి బయల్దేరాడు. భర్త వెంట సావిత్రి కూడా అడవికి పోవడానికి సిద్ధమైంది. అలా సుకుమారైన సావిత్రి భర్త వెంట అరణ్యానికి వెళ్లింది. అడవిలో సత్యవంతుడు పండ్లను కోసి బుట్ట నింపాడు. ఇంతలో అతడి శరీరం స్వాధీనం తప్పింది. మనస్సు భ్రమచెందినట్లు తూలసాగింది. తలపోటు వచ్చింది. సావిత్రి తొడను తలగడగా చేసి సత్యవంతుడు నిద్రపోయి, కాసేపటికి చైతన్యం లేనివాడుగా అయిపోయాడు. కొంతసేపటికి భయంకరమైన ఒక దివ్యపురుషుడు పాశాయుధాన్ని హస్తాన ధరించి సత్యవంతుడిని సమీపించాడు. ఎవరాయన అని ప్రశ్నించింది సావిత్రి. తాను యమధర్మరాజునని, సావిత్రి గొప్ప పతివ్రత కాబట్టి తనను చూడగలిగిందని, సామాన్యులు చూడలేరని, ఆమె భర్త సత్యవంతుడి ఆయువు తీరిందని, అతడు గొప్ప పుణ్యాత్ముడు కాబట్టి తానే స్వయంగా తీసుకుపోవడానికి వచ్చానని జవాబిచ్చాడు ఆ దివ్యపురుషుడు.

ఇలా చెప్పిన యమధర్మరాజు పాశాలను ప్రయోగించి, సత్యవంతుడి శరీరం నుండి జీవుడిని బంధించి బయటకు లాగాడు. ఆ తరువాత దక్షిణ దిక్కుగా పోసాగాడు. తన భర్త శరీరాన్ని ఒకచోట భద్రపరిచి సావిత్రి యమధర్మరాజును వెంబడించింది. తన వెంట రావద్దని వెనక్కు తిరిగి పొమ్మని యమధర్మరాజు సావిత్రికి చెప్పాడు. భర్త వెంటే భార్య వుండాలి కాబట్టి, తాను వెనక్కు పోనని చెప్పి, యమధర్మరాజు వల్ల ఏదైనా మేలు పొందకుండా ఎలా తిరిగిపోతానని అన్నది. ఆమె మాటలకు మెచ్చిన యమధర్మరాజు, తన భర్త జీవితం తప్ప ఏదైనా వరం కోరుకొమ్మని సావిత్రికి చెప్పాడు.

వరం కోరుకొమ్మని ఎప్పుడైతే యమధర్మరాజు అన్నాడో, వెంటనే, తన మామగారైన ద్యుమత్సేనుడి కన్నులు తిరిగి పొందేట్లుగా కోరింది. ఆమె కోరిన వరాన్ని ప్రసాదించాడు యమధర్మరాజు. అయినా సావిత్రి ఇంకా వెంబడించసాగింది. యమధర్మరాజును పొగడసాగింది. ఆమె మాటలకు సంతోషించి ఇంకేదైనా వరం కోరుకోమ్మానాడు సావిత్రిని. ద్యుమత్సేనుడికి శత్రువులు అపహరించిన రాజ్యాన్ని తిరిగి లభించేలా వరం కోరింది ఈసారి. దాన్ని కూడా అనుగ్రహించాడు యమధర్మరాజు. ఇక వెళ్లిపొమ్మన్నాడు. అప్పుడు భర్త ప్రాణం తప్ప మరో వరం కూడా కోరుకోమ్మాన్నాడు. తన తండ్రి ఆశ్వపతికి నూర్గురు కొడుకులు కలిగేట్లు వరం ఇవ్వమని అడగ్గా ఆలాగే ప్రసాదించాడు. అయినాసరే వెనక్కు పోకుండా యమధర్మరాజును వెంబడించ సాగింది సావిత్రి.

అప్పుడు యమధర్మరాజు ప్రసన్నుడై సావిత్రిని ఆమె ఇష్టం వచ్చిన వరం కోరుకొమ్మన్నాడు. వెంటనే, తన భర్త సత్యవంతుడు తిరిగి బతికేటట్లుగా వరాన్ని ప్రసాదించమని కోరింది. సరేనన్న యమధర్మరాజు తక్షణమే సత్యవంతుడిని బంధించిన పాశాలను తొలగించి, భర్త ప్రాణాలను తీసుకొమ్మని సావిత్రికి చెప్పాడు. ఇక ముందు నాలుగు వందల సంవత్సరాలు సత్యవంతుడు జీవిస్తాడని కూడా చెప్పాడు. నూరు మంది కొడుకులను కని, పేరు ప్రతిష్టలను ఆర్జించగలడని అన్నాడు. అలా చెప్పి యమధర్మరాజు అదృశ్యమయ్యాడు. సావిత్రి వెనక్కు వచ్చి యథాప్రకారం తన భర్త శిరస్సును తన తొడమీద పెట్టుకుని కూచున్నది. కొంతసేపటికి సత్యవంతుడికి మేలుకొచ్చింది. నిద్రలేచాడు.

ఆ తరువాత ఆశ్రమానికి బయల్దేరారు ఇద్దరూ. ఇక అక్కడ ద్యుమత్సేనుడికి గుడ్డితనం పోయి దృష్టి వచ్చింది. కొడుకు సత్యవంతుడి కొరకు ఎదురు చూశాడు. అక్కడి ఆశ్రమవాసులైన ఋషులు దుఃఖిస్తున్న అతడిని అనునయించారు. ఇంతలో సావిత్రీసమేతుడై సత్యవంతుడు ఆశ్రమాన్ని చేరాడు. ఆలస్యానికి కారణం వివరించసాగాడు. వెంటనే సావిత్రి కలిగించుకుని ద్యుమత్సేనుడితో నారద మహర్షి సత్యవంతుడి అకాల మరణం గురించి చెప్పడం దగ్గరి నుండి, సత్యవంతుడితో తాను అడవికి పోయిన కారణం, సత్యవంతుడు అలసిపోయి నిదిరించినప్పుడు యమధర్మరాజు రావడం, రాజకుమారుడి ప్రాణాలు తీసుకుపోవడం, తాను వెంబడించడం, ఆయన నాలుగు వరాలివ్వడం, సత్యవంతుడు పునర్జీవితుడు కావడం అంతా వివరంగా చెప్పింది. అత్తమామలు సావిత్రిని అభినందించారు.             

కొన్నాళ్ల తరువాత సాళ్వరాజు గారి మంత్రులు ఇతర ముఖ్యులు వచ్చారు. రాజుగారి శత్రువులంతా మరణించారని చెప్పి ద్యుమత్సేనుడిని పట్టపు ఏనుగునెక్కి రాజధానికి రమ్మన్నారు. ఆ క్షణంలోనే ద్యుమత్సేనుడు అక్కడి ఋషులకు వీడ్కోలు పలికి, కొడుకు సత్యవంతుడితో సహా రాజధానికి చేరి పట్టాభిషిక్తుడయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు.

సావిత్రి కథను చెప్పిన మార్కండేయుడు పాండవులను వీడ్కొని తన ఆశ్రమానికి వెళ్లాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, August 22, 2021

విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తున్న శ్రీరామ లక్ష్మణులు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-70 : వనం జ్వాలా నరసింహారావు

 విశ్వామిత్రుడి యాగాన్ని రక్షిస్తున్న శ్రీరామ లక్ష్మణులు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-70

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (23-08-2021)

గురువును ఎప్పుడు-ఎలా-ఏ ప్రదేశంలో ప్రశ్నించాలన్న విషయంలో నేర్పరులు, తియ్యటి మాటలతో చేయాల్సిన కార్యాన్ని చక్కపెట్టి-సాధించగల శక్తిగలిగిన శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, "మహాత్మా ! రాక్షసులు ఏ సమయంలో ఇక్కడ కొచ్చి కలహానికి కాలు దువ్వుతారు? అది మీరు చెప్తే, ఆ కాలాన్ని అతిక్రమించకుండా, మేము యజ్ఞాన్ని కాపడుతుంటాం" అని అడుగుతారు. యుద్ధానికి పోవడమంటే, ఆటలకు పోవడమన్నట్లుగా ఉత్సాహం చూపిస్తున్న సాహసవంతులైన వారిద్దరినీ చూసి, మునులందరు సంతోషించి, వారికి మేలు జరగాలని పొగిడారు. నాటినుండి ఆరు రాత్రులు వారు యజ్ఞాన్ని కాపాడాలని-రాక్షసులు రాత్రివేళల్లోనే వస్తారని, విశ్వామిత్రుడు దీక్ష వహించి మౌన వ్రతంలో వున్నాడు కనుక, ఆయన మాట్లాడడని, అందువల్ల వాళ్లీ ఆరు రాత్రులు హెచ్చరికతో యజ్ఞాన్ని రక్షించాలని బోధిస్తారు మునులు. వాళ్లు చెప్పినట్లే శ్రీరామ లక్ష్మణులు భయంకరమైన బాణాలను దగ్గరుంచుకుని, హెచ్చరిక తప్పకుండా, విశ్వామిత్రుడి యాగ భూమిని ఆరు దినాలు రాత్రింబగళ్లు రక్షించిన తర్వాత, ఆరవనాడు, రాముడు లక్ష్మణుడిని హెచ్చరిస్తాడు.

"లక్ష్మణా ! రాక్షసులు వచ్చే రోజిదే. నీవు-నేను హెచ్చరికగా వుండి యజ్ఞాన్ని మరింత ప్రయత్నం తో కాపాడాలి" అని యుద్ధ సన్నద్ధులై వున్నారిరువురు. అప్పుడు యజ్ఞవేది పూలతో, స్రుక్కుతో, దర్భలతో, ఋత్విజులతో, సోమపానం చేసే పాత్రతో ప్రజ్వలించింది. శాస్త్రంలో చెప్పిన విధంగా, సమంత్రకంగా యజ్ఞం జరుగుతున్న సమయంలో, ఆకాశం పగిలి పోయేటట్లు-భయంకరమైన పెద్ద ధ్వని వచ్చింది. వెంటనే, వానాకాలంలో కారు మబ్బులు కమ్మినట్లు, ఆకాశం మరుగున పడే విధంగా రాక్షసులు మాయావులై, ఆకాశమంతా కమ్ముకున్నారు. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు తమ సేనలతో వచ్చి, నెత్తురు వానను వేదిపై ఘోరంగా కురిపించారు. వేదికూడా రక్తంతో ప్రకాశించసాగింది.

మారీచుడిని తరిమికొట్టి సుబాహుడిని చంపిన శ్రీరాముడు

ఆ రాక్షసులు చేసిన దానిని చూసి కోపించిన శ్రీరాముడు, ఆకాశం నుండి వస్తున్న వారిని గమనించి, మనుష్య భక్షకులైన దుష్ట రాక్షసులను మానవాస్త్ర బలంతో పెనుగాలికి మేఘాలు చెదిరిపోయేటట్లు చెదరగొట్తానని, తమ్ముడు లక్ష్మణుడితో అంటూ, ఆ అస్త్రాన్ని తీసుకుని మారీచుడి రొమ్ముపై కొట్టాడు. వాడిని తాకిన ఆ అస్త్రం మారీచుడిని ఈడ్చుకునిపోయి నూరామడ దూరంలో-సముద్రంలో పడేసింది. అస్త్రం తగిలి, మారీచుడు మూర్ఛపోయి-స్మృతి తప్పుతే, తన మానవాస్త్రం కారణంగా, పెనుగాలికి ఆకులాగా కొట్టుకుపోతున్న రాక్షసుడిని చూపించి రాముడు లక్ష్మణుడితో " మానవాస్త్రం ధర్మబుద్ధికలది కనుక, మారీచుడిని చంపకుండా ఆకాశ మార్గంలో దూరంగా తీసుకుని పోతుంది. మునులను బాధించే, దయలేని చెడు గుణాలున్న దేవతా శత్రువులను-పాప స్వభావులను పదునైన బాణాలతో చంపుతాను చూడు" అంటాడు. అంటూనే, ఆగ్నేయాస్త్రాన్ని తీసి, వింటిలో సంధించి, కోపంతో, సుబాహువుడి రొమ్ముకు గురి చూసి, ఈడ్చివేయగానే, వాడు చచ్చిపడిపోతాడు. మిగిలిన రాక్షసులపై వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించగా, వారంతా నేల కూలుతారు. ఈ విధంగా యజ్ఞానికి విఘ్నం కలిగించాలనుకున్న రాక్షస సేనలను వధించి, యుద్ధంలో గతంలో గెలిచిన ఇంద్రుడిలాగా, రామచంద్రమూర్తిని ఋషులు పూజించారు. రాక్షసుల మాయవల్ల కమ్మిన మబ్బులు పోవడంతో దిక్కులు ప్రకాశించసాగాయి. యజ్ఞం సక్రమంగా నెరవేరింది. ఆని చోట్లా రాక్షసుల బాధలు తొలిగాయి. ఇదంతా గమనించిన విశ్వామిత్రుడు, "రామా ! నేను కృతకృత్యుడనయ్యాను. మీ తండ్రి చెప్పిన ప్రకారం నీవు గొప్పగా యజ్ఞాన్ని రక్షించి, ఈ ఆశ్రమానికి ’సిద్ధాశ్రమం’ అన్న పేరును సార్థకం చేశావు" అని అంటాడు.

 

Saturday, August 21, 2021

శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-3 ...... వారధి నిర్మాణం, రామరావణ యుద్ధం, శ్రీరాముడి విజయం-పట్టాభిషేకం ..... ఆస్వాదన-34 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మదాంధ్ర మహాభారతంలో వాల్మీకి రామాయణం-3

వారధి నిర్మాణం, రామరావణ యుద్ధం, శ్రీరాముడి విజయం-పట్టాభిషేకం

ఆస్వాదన-34

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధంమ్ (22-08-2021)

శ్రీరాముడు లంకమీదకు దండయాత్రకు బయల్దేరగానే వాయునందనుడైన హనుమంతుడు ఆ కోతుల సేనలకు మార్గదర్శకుడై నాయకత్వం వహించి ముందు నిలిచాడు. సైన్యంతో సహా శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు మున్నగు యోధులు దక్షిణ సముద్ర తీరాన్ని చేరారు. అప్పుడు సుగ్రీవుడితో శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయం చేయమన్నాడు. వానరనాయకులు రకరకాల ఆలోచనలు చెప్పారు కాని అవి ఏవీ సాధ్యపడేవి కావని అన్నాడు శ్రీరాముడు. తాను ఆహారం విసర్జించి ఉపవాస వ్రతంతో సముద్రుడిని ఆరాదిస్తానని, దారి ఇవ్వమని ప్రార్థిస్తానని, ఆయన అంగీకరించకపోతే సాత్త్విక పధ్ధతి విడనాడి రాజసపద్ధతిన తన బాణాగ్నితో సముద్ర జలాలను ఇంకింప చేస్తానని అన్నాడు శ్రీరాముడు. ఇలా చెప్పి రామలక్ష్మణులు నిరాహార దీక్ష పూని దర్భలమీద పడుకొని సముద్రుడిని ఆరాధించారు.

సముద్రుడు ప్రత్యక్షమై పదిమందికి తెలిసే విధంగా దారి ఇవ్వడం సమంజసం కాదని చెప్పి, ఒక ఉపాయం సూచించాడు. వానరసేనలలో నలుడనే పేరుకల శిల్పకళావేత్త ఉన్నాడని, అతడు విశ్వకర్మ కొడుకని, అతడు సముద్రంలో చెట్లు, చేమలు, కొండలు వేస్తే వారధిగా ఉపయోగపడుతుందని, ఆ వారధి మీద పయనించి వానరసేన సముద్రాన్ని దాటి శత్రువులను గెల్వవచ్చని చెప్పాడు. శ్రీరాముడు నలుడుని పిలిచి వారధి కట్టడానికి నియమించాడు. వానరవీరులు నలుదిక్కుల నుండి తెచ్చి ఇచ్చిన పర్వత శిఖరాలను నలుడు సముద్రంలో వేసి, వంద ఆమడల పొడవు, పది ఆమడల వెడల్పు గల గట్టి వారధిని నిర్మించాడు. సరిగ్గా అదే సమయంలో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు అన్నమీద ఆగ్రహించి లంకను వీడి వచ్చి, శ్రీరాముడి శరణు కోరాడు. శ్రీరాముడు అతడికి అభయప్రదానం చేశాడు. విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని చేస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు.

వానరసేనతో, విభీషణుడు మార్గదర్శకుడుగా సేతుమార్గాన శ్రీరామలక్ష్మణులు సముద్రాన్ని దాటారు. త్రికూట పర్వతాన్ని అధిరోహించారు. శిబిరాలను నిర్మించుకున్నారు వానర నాయకులు. వానరసేనల విషయం తెలుసుకోవడానికి వచ్చిన రావణాసురుడి గూఢచారులు శుకసారణులను గుర్తించి విభీషణుడు రాముడికి అప్పచెప్పాడు. రాముడు వారిని విడిచి పెట్టాడు. వారు వెళ్లి రామలక్ష్మణుల యుద్ధ సన్నాహాలను రావణాసురుడికి విపులంగా వివరించి చెప్పారు. లంకకు పూర్తి రక్షణ కలిపించాడు రావణుడు. శ్రీరాముడు అంగదుడిని రావణుడి దగ్గరికి రాయభారిగా పంపాడు. సీతను వదలడం మంచిదని రాముడి మాటలుగా హితవు చెప్పాడు అంగదుడు రావణాసురుడికి. రావణుడు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపాడు. తనను శరణు వేడమని, సీతను అప్పగించమని రాముడు చెప్పినట్లు చెప్పాడు.

అంగదుడి మాటలకు రావణుడికి కోపం వచ్చింది. బంధించాలనుకున్నాడు. కాని అతడికి చిక్కకుండా అంగదుడు ఎగిరిపోయాడు. శ్రీరాముడి దగ్గరికి పోయి తాను నిర్వహించిన రాయభారాన్ని గురించి చెప్పాడు అంగదుడు.  ఆ తరువాత కపివీరులు యుద్ధానికి బయల్దేరారు. లంక కోట వద్దకు చేరి రాక్షసులను పారద్రోలారు. సమస్తం ధ్వంసం చేశారక్కడ. లంకను ఆక్రమించుకునే ప్రయత్నంలో వానరులకు, రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం చోటు చేసుకున్నది. ఇంతలో రామలక్షణులు యుద్ధానికి ఉపక్రమించారు. రాక్షసులు కాసేపు మాయా యుద్ధం చేసి వానరులను బాధించారు. విభీషణుడు కూడా యుద్ధానికి దిగాడు. అతడి ధాటికి రాక్షస సేన సగం మంది చావగా, మిగిలిన సగం మంది పారిపోయారు. ఇది విని రావణుడు రణరంగానికి బయల్దేరాడు. యుద్ధంలో రాముడు రావణుడిని ఎదుర్కొన్నాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును, సుగ్రీవుడు విరూపాక్షుడిని ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.

రావణుడు యుద్ధంలో శ్రీరాముడి ధాటికి ఓర్వలేక రణరంగం వదిలి లంకానగారానికి వెళ్లాడు. ప్రహస్తుడు మాత్రం యుద్ధం కొనసాగించాడు. వాడిని విభీషణుడు డీకొన్నాడు. విభీషణుడు ‘శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించి ప్రహస్తుడిని చంపాడు. అప్పుడు యుద్ధానికి ధూమ్రాక్షుడు వచ్చాడు రావణుడి పక్షాన. హనుమంతుడు అతడిని ఎదుర్కొని భీకరంగా ద్వంద్వ యుద్ధం చేసి సంహరించాడు. అప్పుడు రావణుడి ఆజ్ఞానుసారం ఆయన తమ్ముడు కుంభకర్ణుడిని గాఢనిద్ర నుండి మేలుకొల్పారు రాక్షస భటులు. విషయం విన్న కుంభకర్ణుడు యుద్ధానికి బయల్దేరాడు. యుద్ధ రంగంలో రామలక్ష్మణులు వున్న దిక్కుకు పోయి విజృంభించి యుద్ధం చేయసాగాడు. అనేక మంది వానర వీరులను చంపాడు. తనమీదకు యుద్ధానికి వచ్చిన సుగ్రీవుడిని పట్టుకున్నాడు. అది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుడిని గొప్ప బాణంతో గట్టిగా కొట్టాడు. ఆ తరువాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడిని సంహరించాడు.

కుంభకర్ణుడి మరణవార్త విన్న రావణుడు తన కొడుకైన ఇంద్రజిత్తును అతడి కోరికమీద యుద్ధానికి పంపాడు. అతడిమీడికి లక్ష్మణుడు యుద్ధానికి దిగాడు. వారిద్దరూ ముల్లోకాలు భీతి చెందే విధంగా భయంకరమైన యుద్ధం చేశారు. కాసేపు అంగదుడు లక్ష్మణుడికి సాయంగా వచ్చాడు. ఇలా కాదనుకొని ఇంద్రజిత్తు ఆదృశ్యమై ఆకాశానికి ఎగిరిపోయాడు. మబ్బుల చాటునుండి మాయా యుద్ధం చేయసాగాడు. అప్పుడు రామలక్ష్మణులు శబ్దభేది బాణాలను ప్రయోగించి, ఇంద్రజిత్తును కొట్టారు. ఇంద్రజిత్తు బాణాలకు రామలక్ష్మణులు మూర్చపోయారు. అప్పుడు ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు. రామలక్ష్మణులను నాగాస్త్రంతో బంధించాడు ఇంద్రజిత్తు. ఇది చూసి, విభీషణుడు అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను నాగపాశ బంధవిముక్తులను చేశాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే ఔషధంతో రామలక్ష్మణుల దేహబాధ తొలగించాడు. విభీషణుడు ఇచ్చిన దివ్యజలాలను కళ్లకు రాసుకున్నారు రామలక్ష్మణులు.

ఆకాశంలో తిరుగుతున్న ఇంద్రజిత్తును స్పష్టంగా చూడగలిగారు రామలక్ష్మణులు. అభిచార హోమం చేయడానికి వెళ్తున్న ఇంద్రజిత్తుమీద, విభీషణుడి సూచన మేరకు లక్ష్మణుడు బాణాలను ప్రయోగించాడు. ఇద్దరి మధ్యా యుద్ధం జరిగింది మరోమారు. చివరకు ఇంద్రజిత్తు శిరస్సును లక్ష్మణుడు నరికాడు. రావణుడు పుత్రశోకాన్ని భరించలేక అశోకవనానికి పోయి సీతను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అవింధ్యుడు అనే రాక్షసుడు అడ్డుకున్నాడు. స్త్రీహత్యా ప్రయత్నం తప్పని వారించాడు. ఆ తరువాత రావణుడు యుద్ధ రంగానికి వెళ్లాడు. భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు దేవేంద్రుడి ఆజ్ఞానుసారం ఆయన సారథి మాతలి ‘వైజయంతి అనే దివ్యరథాన్ని తేగా, శ్రీరాముడు దాన్ని అధిరోహించి యుద్ధం చేశాడు. యుద్ధంలో రావణుడు విజృంభించి పోరాడాడు. చివరకు శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఒక్క త్రుటిలో రావణుడిని సంహరించాడు. ఇంద్రాది దేవతలు, గంధర్వులు, కిన్నరులు సంతోషించారు. ముల్లోకాలు పండుగ జరుపుకున్నాయి.

శ్రీరాముడు లంకకు వచ్చి విభీషణుడికి పట్టం కట్టాడు. అవింధ్యుడుతో కలిసి విభీషణుడు సీతను తీసుకువచ్చి శ్రీరాముడికి సగౌరవంగా సమర్పించారు. అప్పుడు శ్రీరాముడు కఠినాత్ముడై, సీతాదేవి చెడునడవడి కల రావణుడి గృహంలో ఉన్నందున తాను స్వీకరించలేనని చెప్పి, ఆమె ఇష్టం వచ్చిన స్థలానికి పొమ్మన్నాడు. సీత అగ్నిప్రవేశం చేస్తానన్నది. అప్పుడు పంచభూతాలు, జనకుడి కూతురైన సీతాదేవి ఉత్తమురాలని, మహాపతివ్రత అని ముక్తకంఠంతో చెప్పాయి. బ్రహ్మదేవుడు కూడా వచ్చి సీతలో ఏ దోషం లేదని చెప్పాడు. ఎలాంటి సంకోచం లేకుండా సీతను అయోధ్యానగరానికి తీసుకుపొమ్మని అన్నాడు. యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ బతికించాడు. మాతలి ఇంద్రలోకానికి వెళ్లిపోయాడు.

శ్రీరాముడు సతీసమేతంగా పుష్పక విమానం ఎక్కి అయోధ్యానగరానికి వెళ్లాడు. రాముడి తమ్ముడు భరతుడు సంతోషించాడు. వశిష్ట వామదేవులు ఒక శుభలగ్నంలో శ్రీరామ పట్టాభిషేకం జరిపారు. ఆ తరువాత శ్రీరాముడు అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, భోగ భాగ్యాలను అనుభవించి, వైకుంఠం చేరారు.

మార్కండేయుడు చెప్పిన రామాయణ కథ విని ధర్మరాజు శ్రీరాముడి పరాక్రమాన్ని, సీతాదేవి పాతివ్రత్యాన్ని మెచ్చుకుని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, సప్తమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Wednesday, August 18, 2021

A Historic Declaration : Vanam Jwala Narasimha Rao

 The Historic Huzurabad Declaration

Vanam Jwala Narasimha Rao

Millennium Post, New Delhi (19-08-2021)

The Hans India (22-08-2021)

Dalit Bandhu Scheme, a landmark policy intervention towards Dalit empowerment in Telangana, could potentially be replicated across the country-Editor

Powerful public speech, which comes out of conviction, has been one of the driving forces in the political landscape of any democratic country. Human history has many examples about the influence of powerful speeches. Chief Minister K Chandrashekhar Rao’s speech in Huzurabad on Monday the 16th August,2021 is one of the rare public addresses which came from depths of his heart, a rightful combination of political emotions, language and a classic example about how a public speech should be. It had clarity, excellent communicative and convincing skills with total grip on the listeners’ attention. It is a perfect translation of thoughts into words.

KCR had timed it all so perfectly. From Huzurabad he wanted to give a call to the state, its people in general and Dalits in particular about his innovative and revolutionary brain child, the Dalit Bandhu Scheme and in the process he did it exceptionally and exceedingly well. His public speech in Huzurabad, may well be known hence forth from generations to come into the history records as the Huzurabad Declaration! an emphatic statement.


KCR’s others schemes, a plethora of them and many of them first of its kind in the country, have been successful and became a role model for others in the country. But his Dalit Bandhu Scheme should have a special mention in the present-day time and in future too. The reason is both very simple and profound. Simple, because KCR had explained the aims, objectives, and modalities of the scheme in very simple words, profound because, Dalit Bandhu will for once and for all change the lives of Dalits in State. Dalit Bandhu Scheme is not like some welfare and development schemes where the beneficiaries are helped for once. It is a scheme that will have far reaching positive effects on the entire Dalit community in the State on a continuous basis.


The uniqueness of the scheme is that it directly grants financial assistance to the Dalit families not to fulfil their immediate needs but to start their own economic activity which will make them financially self-sufficient forever. It helps them to stand on their own and attain growth financially without depending on any government or financial institution. It helps them to make a respectable space for themselves in the society. Once the Dalits gain economic self-reliance and have a respectable status in the society, the so-called social discrimination will wither away.

CM KCR, as he himself admitted in the speech, did a lot of brain storming with his officials, intellectuals, writers, people’s representatives from all political parties and thinkers from the Dalit Community before making an elaborate policy of Dalit Bandhu. The idea of Dalit empowerment took seed in KCR’s mind 25 years ago in Siddipet when he started Dalit Chaitanya Jyoti, an awareness program. Though the scheme was planned for launch more than a year ago, it was delayed due to the Covid-19 pandemic.  

As dwelled at length by KCR, from village to the state level Dalit Bandhu Samithis will be formed on par with Rythu Bandhu Samithis and they would monitor and supervise the implementation of the scheme. Entire Dalit Bandh scheme would be monitored by Dalit public representatives through committees with six members at the village, 15 at mandal, 24 each at Assembly constituency and district and 42 members at the State level. There are about 25,000 Dalit public representatives like village sarpanches, ward members, MPTC and ZPTC members. Thus, an army of over one lakh Dalit soldiers would regularly monitor the scheme.

Dalit Bandhu is expected to bring about a qualitative change in the lives of SCs in the next four to five years. After the success of the pilot project in Huzurabad, the entire SC population in the State, will be eligible to avail the benefits of the scheme just as they are benefitting from the Rythu Bandhu program for farmers.  


Under Dalit Bandhu, every Dalit family in the State would be given Rs 10 lakh to start a business venture of their choice, without any bank linkages or facing the stress of having to return the money. The Rs 10 lakh that would be deposited directly into the accounts of Dalit families will serve as capital to start a business with the end goal being the economic empowerment of the entire SC community. Besides elevating their financial position that would also minimize, if not completely eliminate, social inequalities, the scheme is expected to trigger a ripple effect that would have a direct impact on the entire rural economy by igniting spending in other sectors.

KCR also dropped a note of caution to the beneficiaries.  He advised the beneficiaries not to take up the same businesses in the area. He asked them to collaborate and form into groups that would facilitate setting up of bigger business ventures since they will have more investment at their disposal. This would fetch more profits.  

CM KCR said that a total of Rs 1.7 lakh crore is required to extend Dalit Bandhu to all these SC families in the State. ‘We will allocate Rs 30,000 crore to Rs 40,000 crore in the State Budget every year for the next three-four years to cover all the SC families under the scheme’ said Chief Minister KCR.

Under Telangana Dalit Bandhu Scheme, Dalit Security Fund for protection and safety of Dalits as a supportive mechanism, is also being set up permanently with the government and beneficiary participation. This Fund will be managed by the District Collectors with a committee of the beneficiaries. Every year a minimum amount will be deposited and it will be continued regularly to further help Dalits to become financially strong.

‘If a Dalit dies due to some accident or ailment, the family should not slip into debt trap. To support them, this fund would act as safety net’ the CM said. A sum of Rs 10,000 would be kept aside from the Rs 10 lakh assistance to each family under Dalit Bandhu scheme. If there are 25,000 Dalit families in Huzurabad assembly constituency, an amount of Rs 25 crore protective fund would be kept aside with Rs 10,000 from each beneficiary. To this, government would add another Rs 25 crore, making a fund of Rs 50 crore.

As KCR himself, reiterated in his speech, the most important aspect of Dalit Bandhu is in its implementation to the last letter and spirit, as KCR believes in the adage of the proof of pudding is in its eating. Observing that Dalit Bandhu covers every Dalit in the State including Dalit government employees, Chief Minister K. Chandrasekhar Rao announced that Dalits would get reservations in government works and contracts.

The public meeting in Shalapally, on the outskirts of Huzurabad will be remembered for the landmark and historic Huzurabad Declaration that the KCR made. This will ignite a new chapter in the history of Dalits and will spread like a wild fire in the country to flourish the community. (With inputs from VJM Divakar, senior journalist)

Sunday, August 15, 2021

శ్రీరాముడికి సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-69 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడికి సిద్ధాశ్రమ వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-69

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-08-2021)

"శ్రీరామచంద్రా! పూర్వం అనేక యుగాలు-సంవత్సరాలు, నిష్ఠకు ఎటువంటి లోపం కలగకుండా, తపస్సు-మహాయోగం సిద్దిపొందేందుకు తపస్సు చేసిన విష్ణుమూర్తైన వామనుడు నివసించిన ప్రదేశం ఇదే. ఇక్కడ విష్ణుమూర్తి తపస్సు చేశాడంటే, దానర్థం, లోకప్రవర్తనార్థం ఆయనలా చేశాడని అనుకోవాలి. విష్ణుమూర్తి అంతటి వాడు తపస్సు చేస్తే ఎంత ఫలమున్నదోనని, లోకులందరూ అనుకుని, వాళ్లూ తన లాగే ప్రవర్తించాలన్న వుద్దేశంతో, బదరీ నారాయణంలోలాగా ఆయనిక్కడ తపస్సు చేశాడు. ఎక్కడో హిమవత్పర్వతాలలో తపస్సు చేస్తే, లోకంలో వున్నవారికెలా తెలియాలని ఇక్కడ చేశాడు. ఆయన విష్ణు స్వరూపంలోను-వామన స్వరూపంలోను తపస్సు చేశాడని చెప్పేటందుకే, విష్ణువు పేరును-వామనుడి పేరును చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి దివ్య క్షేత్రం నివాస యోగ్యమైందని చెప్పేందుకు, విష్ణుమూర్తి చరిత్రే చెప్పడం జరిగింది. ఎంత గొప్ప తపస్సైనా, నిర్విఘ్నంగా సాగి, ఫలవంతంగా ముగుస్తుందిక్కడ. ఇక్కడ చేసిన తపస్సు వ్యర్థంకాదు. కశ్యపుడు అలానే చేసి సిద్ధి పొందాడిక్కడ. అందుకే దీనికి ’సిద్ధాశ్రమం’ అని పేరొచ్చి, జగత్ ప్రసిద్ధమైంది".

"యాచకుల కోరికలు కాదనకుండా తీర్చేవాడు - బలవంతుడు, విరోచనుడి కుమారుడు అయిన బలిచక్రవర్తి, వాయువులను - సిద్ధులను - ఇంద్రుడిని జయించి, రాక్షసులు - దేవతలు తనను సేవిస్తుంటే, ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ, లోకంలో కీర్తిమంతుడై మూడు లోకాలను పాలించాడు. ఆ బలిచక్రవర్తి వున్న స్థలమే మహాబలిపురం. ఆ సమయంలో అగ్ని ముందుండగా, దేవతలు ఈ ప్రదేశానికొచ్చి, విష్ణుమూర్తిని చూసి, దీనంగా, బలిచక్రవర్తి పెద్ద యాగం చేస్తున్నాడని - అది ముగిసేలోపల ఆయన అతడిని చూడడానికి పోయి, ఆయన స్వకార్యమైన దేవతా కార్యాన్ని చక్కపెట్టాలని ప్రార్థించారు. యజ్ఞ దీక్షలో వున్న సమయంలో, ’దేహి’ అని యాచకులు అడిగితే ’నాస్తి’ అనకుండా అడిగిందివ్వాల్సిందే. అందుకే యాచకులు నాలుగు దిక్కులనుండి, గుంపులు-గుంపులు గా వచ్చి, వారిష్టప్రకారం అడుగుతుంటే, లేదనకుండా - ఎంతటి కష్టమైనదైనా - మితిమీరినదైనా, ఇస్తున్నాడు బలిచక్రవర్తని అంటారు దేవతలు. ’నారాయణా-పుండరీకాక్ష’ అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ, అచింత్యమై - అద్భుతమై, అఘటన ఘటనా సమర్థమైన ఆయన శక్తిని ఆశ్రయించి, లోకానికి తన శరీరాన్ని కనిపించనీయకుండా, దేవతలకు మేలు కూర్చేందుకు పొట్టివాడివలె వామనావతారం ఎత్తి, తమకు మేలు చేయమని ప్రార్థిస్తారు దేవతలందరు".

"అదే సమయంలో, అగ్ని తేజంతో సమానమైన తేజంగల కశ్యపుడనే ముని శ్రేష్ఠుడు కొడుకును కనాలన్న కోరికతో తపస్సు చేస్తుంటాడు. కశ్యపుడు తన భార్యైన అదితి తో కలిసి, ఓపికగా అనేక దివ్య సంవత్సరాలు, మిక్కిలి నిష్ఠతో, సత్త్వగుణం కలిగి శ్రీమన్నారాయణుడి కొరకు తపస్సు చేయడంతో, ఆయన సంతోషించి ప్రత్యక్షమవుతాడు. తనకు ప్రత్యక్షమైన భగవంతుడిని చూసి కశ్యపుడు: ఆయన తపస్సువల్ల ఆరాధ్యుడని - తపఃఫలం ఇచ్చేవాడని - జ్ఞాన స్వరూపుడని -జ్ఞాన గుణకుడని - భక్త కామిదాతని - గొప్ప తపస్సే స్వభావంగా కలవాడని, అలాంటి వాడిని తను ఆరాధనాబలంతో ప్రత్యక్షంగా చూడగలిగానని స్త్రోత్రం చేశాడు. సమస్త ప్రపంచం శ్రీమన్నారాయణుడి శరీరంలో కనిపించడమే కాకుండా, సాక్షాత్తూ ఆయన శరీరం కూడా తనకు కనిపిస్తున్నదని - కల్యాణ గుణాకరమైన ఆకారం కలిగి, ఇంతటి వాడని చెప్పడం ఎవరికీ సాధ్యపడనంత గొప్పవాడివైన ఆయన చరణాలే తనకు శరణ్యమని, విష్ణుమూర్తితో అనడంతో, ఆయనకే వరం కావాల్నో చెప్పమంటాడు”.

వరమిచ్చేందుకు అనుగ్రహించిన విష్ణువు తో, తన కొడుకుగా - ఇంద్రుడి భ్రాతగా జన్మించి, దుఃఖాలపాలైన దేవతలను రక్షించ మంటాడు కశ్యపుడు. అసుర విరోధైన విష్ణువును అయన స్వభావ విరుద్ధమైన కార్యాలు చేయమని తాను కోరనని కూడా అంటాడు. అలాగే తన తపస్సు సిద్ధిపొందిన ఈ ప్రదేశం ’సిద్ధాశ్రమం’ గా ప్రసిద్ధికెక్కాలని కూడా కోరుతాడు కశ్యపుడు. ఆయన కోరినట్లే చేస్తానన్న విష్ణుమూర్తి, దయతో, అదితి గర్భంలో వామనుడిగా పుట్టి, బలి చక్రవర్తిని చూసేందుకు అతడి యజ్ఞశాలకు పోయి, త్రిలోక రక్షకుడైనందున దేవతలకు కీడుచేయతలపెట్టిన బలి చక్రవర్తి దురహంకారాన్ని నాశనం చేసే కార్యక్రమం చేపట్తాడు. తన కాలి కొలత ప్రకారం, దానవ రాజును ఒకటి-రెండడుగుల భూమిని యాచించి, ఆయన వద్దనుండి దాన్ని పొంది, లోకమంతా వ్యాపించి తన శక్తితో బలిని బంధించాడు. ఇలా వామనుడు బలిని వంచించి, త్రివిక్రముడై, ప్రపంచమంతా ఆక్రమించి - ఇంద్రుడికిచ్చాడు దాన్నంతా. వామనుడు చేసిన ఆ మేలుకు మునీశ్వరులు సంతోషించగా, దేవతలు మునుపటి లాగా తేజోవంతులయ్యారు".

"ఇక్కడ తపస్సు చేసేవారికి శ్రమ కలుగదు. సంసార శ్రమ తొలిగిపోతుంది. అందుకే ఈ ఆశ్రమంలోకి వామనుడు మళ్లీ వచ్చాడు. రామచంద్రా ! నేను విష్ణుపాద భక్తుడను అయినందువల్ల ఇక్కడికొచ్చాను. చెడునడవడిగల రాక్షసులు యజ్ఞం విఘ్నం చేసేందుకు ఇక్కడకొస్తారు. నువ్వు వారిని చంపాలి. మనమిక మిక్కిలి మనోహరమైన - శుభప్రదమై మిగుల శ్రేష్ఠమైన - పాపరహితమైన నా ఆశ్రమాన్ని చూసేందుకు పోతున్నాం. నా ఆశ్రమం నాకెలాంటిదో, నీకు అలానే" అంటూ విశ్వామిత్రుడు కడు స్త్రోత్ర పాత్రులైన రామ లక్ష్మణులను తన వెంట తన ఆశ్రమానికి తీసుకుని పోయాడు. ఆశ్రమంలో వున్న చెట్ల నీడల వల్లా, మంచి పరిమళాలతో కూడిన గాలి వీచడం వల్లా, నడిచి వచ్చిన బడలిక పోతుంటే, విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో ఆశ్రమంలోకి ప్రవేశించాడు.

వస్తున్న విశ్వామిత్రుడిని చూసిన సిద్ధాశ్రమంలోని మునులందరు ఎదురుగా వచ్చి, శాస్త్ర ప్రకారం పూజించి - రాజకుమారులకు ఆతిథ్యమిచ్చి - సంతోషింపచేసి - కుశల ప్రశ్నలను అడిగి - రామ లక్ష్మణుల అలసట తీరేందుకు కొంచం సేపు వూరుకుండి - ఆ రోజే యజ్ఞ దీక్ష వహించమని, అతడికి మేలు కలుగుతుందని, యజ్ఞం సఫలమవుతుందని, సిద్ధాశ్రమం అనే పేరు సార్థకమవుతుందని, విశ్వామిత్రుడితో అంటారు. విశ్వామిత్రుడు వారు చెప్పిన మాటలను ప్రీతితో విని, మౌన వ్రతం పూని, ఇంద్రియాలను నిగ్రహించి, దీక్ష వహించాడు. ఉదయమే దశరథ నందనులు నిద్రలేచి, సంధ్యావందనాది కాల కృత్యాలను తీర్చుకుని, విశ్వామిత్రుడి కార్యం నెరవేర్చేందుకు ఆసక్తిగలవారై, ఆయనకు నమస్కరిస్తారు.

(బలి చక్రవర్తి ఇంద్రుడిని-ఇతర దేవతలను తృప్తి పరిచేందుకు యజ్ఞం చేయలేదు. ఆయన విష్ణు భక్తుడు - విష్ణు భక్తుడు విష్ణువును తప్ప ఇతర దేవతలను ఫలం కోరి పూజించడు. కాబట్టి, బలి చేసింది, విష్ణ్వారాధన రూపమైన యజ్ఞం. యజ్ఞమంటే దేవ పూజ-ఇక్కడ ఆయన పూజించిన దేవత విష్ణువు. ఆయా దేవతలను ప్రీతి పరిచేందుకు, వారినుద్దేశించి, ఆయా మంత్రాలతో చేసే హోమాన్ని యాగం అంటారు. బలి యజ్ఞం చేయడం సమ్మతమే. ఇంద్రాయ స్వాహా - వరుణాయ స్వాహా అన్నప్పటికీ, విష్ణు భక్తుడైన వాడు ఆ దేవతల పేర్లు చెప్పినప్పుడు తన ఇష్టదేవతైన నారాయణుడినే ఆ పదంతో పూజిస్తున్నాడని భావించాలి. అయితే, తనమీద అనన్య భక్తిగల బలిని ఎందుకు విష్ణువు అణచదల్చుకున్నాడన్న సందేహం రావచ్చు. తనమీద భక్తి వున్నవాడికంటే, తన భక్తులమీద భక్తి వున్నవాడిని చూసి సంతోషిస్తాడు భగవంతుడు. భక్త విరోధైన మరో భక్తుడిని చూసి సంతోషించడు. వాడిని శిక్షించైనా మంచి మార్గంలోకి తెస్తాడు. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే, విష్ణు భక్తులను సంతోషపెట్టాలి. తనను ఆరాధించకపోయినా, తన భక్తులను ఆరాధించేవారిని భగవంతుడు అనుగ్రహించి, వారికి ఇష్ట సిద్ధిని కలిగిస్తాడు. బలి చక్రవర్తి, దేవతలను బాధించినందువల్ల, తన భక్తుడైనా, దండించాల్సి వచింది. భక్తుడైన వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఇతర భక్తులను బాధించకూడదు.

ప్రపంచ సృష్టి విషయంలో పరిణామ వాదం అని, వివర్త వాదం అని రెండు రకాలున్నాయి. మట్టి ముద్దే కుండయినట్లు, సూక్ష్మాలైన చిదచిత్తులలో వుండే భగవంతుడే, స్థూల చిదచిద్విష్టుడై, ప్రపంచాకారంగా పరిణమించాడని - సూక్ష్మానికి, స్థూలానికి అణుత్వ బృహత్త్వ భేదంతప్ప, మరే భేదం లేదని - రెండూ సత్యమని చెప్పేదే "పరిణామ వాదం". ప్రపంచం మిధ్య - బ్రహ్మమే సత్యం, అనడం "వివర్త వాదం". బాలుడు యౌవనవంతుడైనట్లు, సూక్ష్మంగా వున్న వామనుడే ముల్లోకాలను ఆక్రమించి, త్రివిక్రముడైనందువల్ల, ఇరువురికీ భేదం లేదని - రెండూ సత్యమని, తేలడంతో, వామనావతారం పరిణామవాదాన్ని స్థిరపరుస్తున్నది. దీనికే "వామన త్రివిక్రమ న్యాయం" అని పేరుంది. వామనావతారానికి యాచనే ఉద్దేశమని, ఆ కారణం తోనే, యాచన వృత్తిగాగల కశ్యపుడికి పుట్టాడని, ఇదే వామనావతార తత్త్వమని కొందరు చేసే వాదన తుఛ్చాతి తుచ్చమైన ఆలోచన. వామనుడు యాచించింది తన భార్య సొమ్ములకొరకు కాదు - తను బ్రతక లేక కాదు. యాచనా దోషం అందులోలేదు. గుర్వర్థమై - దేవతార్థమై - లోకోపకారార్థమై చేసే యాచన, యాచన కాదు).