Showing posts with label ఇందిరాగాంధీ. Show all posts
Showing posts with label ఇందిరాగాంధీ. Show all posts

Saturday, July 22, 2017

పౌర హక్కుల ఉద్యమ సారధి శ్రీ శ్రీ : వనం జ్వాలా నరసింహారావు

పౌర హక్కుల ఉద్యమ సారధి శ్రీ శ్రీ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (22-07-2017)

(పౌరహక్కుల ఉద్యమం ఆరంభమై 55 ఏళ్లు నిండిన సందర్భంగా)

శ్రీశ్రీ గా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ రచయితల సంఘం (విరసం) నేతగా, సినీకవిగానే చాలామందికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మానవహక్కుల ఉద్యమం ఆవిర్భవించిన తొలినాళ్ళలో ఆయన హక్కుల సేనానిగా సేవలందించారు. తెలంగాణ ప్రాంతాలలో జరిగిన మానవహక్కుల ఉద్యమ సభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ పాలకుల నియంతృత్వ ధోరణులపై నిరసన గళం వినిపించారు. సరిగ్గా 55 ఏళ్ల క్రితం తెలుగునేలపై మానవహక్కుల ఉద్యమం ఆవిర్భావం వెనుక ఘన చరిత్ర వుంది.

ఖమ్మం జిల్లా కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి దేశవ్యాప్తంగా పలువురిని రాత్రికిరాత్రే అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టిన వాళ్ళలో ఒకరు. ఆయనతో పాటు, జిల్లా మేదావిత్రయంగా అప్పట్లో పిలుబడ్డ వారైన బోడేపూడి వెంకటేశ్వరరావు, కేవీ సుబ్బారావు అనే ఇద్దరు లాయర్లు కూడా అరెస్టయ్యారు. వీరిని అరెస్ట్ చేయకముందు మరెందరినో అరెస్టు చేసినప్పుడు వారి మదిలో మెదిలిన ఆలోచనే దేశవ్యాప్త పౌర హక్కుల ఉద్యమానికి అంకురార్పణ.

మొదట్లో అరెస్టయ్యి నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పిడియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.


ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, ఇ.ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది.

సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

ఏ.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు, కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు, డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ,, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ రాదాక్రుష్ణమూర్తికి ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది. సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం. శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన పోరాహక్కుల ఉద్యమం అంతటితో ఆగిందనాలి.


Tuesday, May 7, 2013

పార్లమెంటు ఆవరణలో విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష: వనం జ్వాలా నరసింహారావు


పార్లమెంటు ఆవరణలో 
విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష

వనం జ్వాలా నరసింహారావు

పార్లమెంటులో విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష కనిపిస్తూనే ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, నిన్నటి ఎన్టీ రామారావును కలుపుకొంటే ముగ్గురు రాష్ట్ర నేతల విగ్రహాలు పార్లమెంటులో ఏర్పాటు చేశారు. దేశానికి ప్రధానులుగా పని చేసిన వారందరి విగ్రహాలు, చిత్రపటాలు ఉన్నా.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఉత్తరాది వారు, నెహ్రూ గాంధీ కుటుంబీకులూ మాత్రమే ప్రధానులుగా ఎంపికవుతున్న సంప్రదాయాన్ని బద్దలు కొట్టి.. దక్షిణాది నుంచి-అదీ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రధాని పదవి చేపట్టి, ఐదేళ్లూ మైనార్టీ ప్రభుత్వాన్ని నిరాటకంగా నడిపిన అపర రాజకీయ చాణక్యుడు పీవీ నరసింహారావు ఎవరికీ తీసిపోని మహానేత. తెలంగాణపరంగానే కాకుండా.. ప్రపంచంలోనే ఎన్నదగిన ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుగాంచిన పీవీ విగ్రహాన్ని ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

 ఇదిలా వుండగా, పార్లమెంటు ఆవరణలో, సెంట్రల్‌హాల్‌లో ఉన్న వివిధ నేతల విగ్రహాలు, చిత్రపటాల వివరాలు ఇలా ఉన్నాయి.


1. చంద్రప్తు మౌర్య, 2. పండిట్ మోతీలాల్ నెహ్రూ, 3. గోపాల కృష్ణ గోఖలే, 4. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, 5. అరబిందో ఘోష్, 6. మహాత్మా గాంధీ, 7. వైబీ చవాన్, 8. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, 9. పండిట్ గోవింద్ వల్లభ్ పంత్, 10. బాబూ జగ్జీవన్‌రామ్, 11. పండిట్ రవిశంకర్ శుక్లా, 12. ఇందిరాగాంధీ, 13. మౌలానా అబుల్ కలాం ఆజాద్, 14. నేతాజీ సుభాష్ చంద్రబోస్, 15. కే కామరాజ్ నాడార్, 16. ఆచార్య ఎన్‌జీ రంగా, 17. సర్దార్ వల్లభాయ్ పటేల్, 18. బిర్సా ముండా, 19. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, 20. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, 21. ఎస్ సత్యమూర్తి, 22. సీఎన్ అన్నాదురై, 23. గోపీనాథ్ బొర్డొలోయ్, 24. పీ ముత్తురామలింగ థేవర్, 25. ఛత్రపతి శివాజీ మహరాజ్, 26. మహాత్మా బసవేశ్వర, 27. మహారాజా రంజిత్ సింగ్, 28. షహీద్ హేము కలానీ, 29. సీహెచ్ దేవీలాల్, 30. మహాత్మా జ్యోతిరావు పూలే, 31. ఎన్టీ రామారావు.

పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లోని నేతల చిత్ర పటాలు

1. మదన్ మోహన్ మాలవీయ, 2. దాదాభాయ్ నౌరోజీ, 3. లోకమాన్య బాల గంగాధర తిలక్, 4. లాలా లజపత్ రాయ్, 5. మోతీలాల్ నెహ్రూ, 6. సర్దార్ వల్లభాయ్ పటేల్, 7. దేశబంధు చిత్తరంజన్ దాస్, 8.రవీంద్రనాథ్ ఠాగూర్, 9. సరోజినీ నాయుడు, 10. మౌలానా అబుల్ కలాం ఆజాద్, 11. డాక్టర్ రాజేంద్రప్రసాద్, 12. జవహర్‌లాల్ నెహ్రూ, 13. సుభాస్ చంద్రబోస్, 14. సీ రాజగోపాలచారి, 15. ఇందిరాగాంధీ, 16. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, 17. రామ్‌మనోహర్ లోహియా, 18. శ్యాంప్రసాద్ ముఖర్జీ, 19. రాజీవ్‌గాంధీ, 20. లాల్ బహదూర్ శాస్త్రి, 21. సీహెచ్ చరణ్‌సింగ్, 22. మొరార్జీ దేశాయ్, 23. వీడీ సావార్కర్.

Saturday, December 24, 2011

"అత్యవసర" పరిస్థితి: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 16
"అత్యవసర" పరిస్థితి
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదహారవ అధ్యాయం ఇది).
                36 సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాల కోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు.
''తీవ్ర నిర్బంధ కాండకు, నియంతృత్వానికి పాలకవర్గ పార్టీ పాల్పడుతున్నది. ఇది ఏక పార్టీ నియంతృత్వాన్ని తీవ్రతరం చేస్తుంది. నేడు దేశం ముందున్న పెద్ద ప్రమాదం ఇదే'' అంటూ 1973లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం ఒక హెచ్చరిక చేసింది. అంతకు ముందు, 1972లో జరిగిన పార్టీ 9వ మహాసభ కూడా ఇదే విధంగా హెచ్చరించింది. మహాసభ రాజకీయ తీర్మానంలో: ''గణనీయమైన రాయితీలు చూపి జనసామాన్యంలోని పెద్ద భాగాన్ని సంతృప్తిపరిచే శక్తి కాంగ్రెస్‌కు లేకపోవడం, మరిన్ని భారాలను మోపడం, నిర్బంధకాండను ప్రయోగించడం, వామపక్షాలు, ప్రతిపక్షం బలహీనంగా ఉండడం, పాలక పార్టీ మొత్తంగా ప్రతిపక్షాన్ని సహించలేని స్థితిలో ఉండటం ఇవన్నీ ఏక పార్టీ నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముంది...అన్ని ప్రజాతంత్ర పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఓటింగ్‌ హక్కుతో సహా కాంగ్రెస్‌ పాలనలో ఇంక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రజాతంత్ర పార్టీలు, గ్రూపులు, వ్యక్తులతో కూడిన సాధ్యమైనంత విస్తృతమైన ఐక్య సంఘటన అవశ్యం''.
ఇలా సిపిఎం హెచ్చరికలు చేసిన అనతికాలంలోనే, 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించింది. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అంటే దాదాపు 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణంలేకపోలేదు. రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాని ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్‍లో, ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, నియంతృత్వ దిశగా అడుగులు వేసింది. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె అనుంగు సహచరుడు, సిద్ధార్థ శంకర రే, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ. వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ సిపిఎం ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు. సిపిఎంతో సహా పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.
భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.
దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.
ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో-లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ విధించిన నాటి అర్థరాత్రి సమయంలో, డాక్టర్‍గారి ఆసుపత్రి కాలింగ్ బెల్ మోగింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి ఇంకా తెలియని డాక్టర్‍గారు, తలుపు తీసి, ఎదురుగా కనిపించిన మఫ్టీలోని పోలీసు అధికారిని, ఏమీ జరగనప్పుడు-ఏమవసరమున్నదని అంత అర్థరాత్రి వచ్చారని ప్రశ్నించారు. తనకు తెలియదని, ఎస్పీ గారు పిలుచుకుని రమ్మంటే వచ్చానని జవాబిచ్చాడా అధికారి. విషయం కొంతవరకు అవగాహన చేసుకున్న రాధాకృష్ణమూర్తి, అదేదో అరెస్ట్ వ్యవహారమేనని నిర్ధారించుకుని వచ్చిన పోలీసు అధికారిని గౌరవంగా సంబోధిస్తూ, కూచోమని కోరి, ఆయనకు కాఫీ ఏర్పాటు చేసి, దుస్తులు సర్దుకునేందుకు లోనికెళ్ళారు. తన జీవితంలో, అరెస్ట్ చేసేందుకొచ్చిన పోలీసు అధికారికి అంత మర్యాద ఇచ్చిన వారిని ఎవరినీ చూడ లేదన్నాడతడు. అలనాటి రాత్రి సంగతులను గుర్తు చేసుకున్న డాక్టర్‍గారు, పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వచ్చినప్పుడు, గౌరవించడం కనీస బాధ్యతని, తానదే చేసానని చెప్పారు. తాను, తన తోటి కామ్రేడ్స్ అలా ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం వల్లే, వారు కూడా తమ పట్ల గౌరవంగా వుండేవారని, ఒకటి రెండు జైలు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. జైలులో వాళ్ల కొచ్చిన ఉత్తరాలను ముందుగానే పరిశీలించి-సెన్సార్ చేసినప్పటికీ, పూర్తి పాఠాన్ని చదువుకునే వీలు కలిగించి తిరిగి తీసుకునేవారు జైలు అధికారులు. అలా సహకరించని ఒక జైలు అధికారితో, లోగడ మాకినేని బసవ పున్నయ్యగారు తాను కోరిన పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒక సందర్భంలో, "I can smuggle Elephants in to your Bloody Jail" అన్నారట.
ఇంటర్వ్యూలో పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే -అదీ ఒకరిద్దరిని, ఒక గంట సేపు మాట్లాడనిచ్చేవారట. భార్యా పిల్లలు వచ్చినా, మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి పక్కనే కూర్చుని తనకు వినబడేట్లు మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టేవారట.
డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు గార్లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జైల్లో వీరే కాకుండా నక్సలైట్లు, ఆరెస్సెస్‍కు చెందినవారు, జనసంఘీయులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన మరికొందరు కూడా వున్నారు. వారం రోజుల పాటు అందరూ ఉమ్మడి కాపురం చేసి, కలిసిమెలిసి భోజనాలు చేసేవారు. ఖమ్మం నుండి అతివాద గ్రూపులకు చెందిన చీకటి రోశయ్య, జీవన్, వడ్డెల్లి కృష్ణమూర్తి, వాసిరెడ్డి కోటేశ్వరరావు గార్లు వీరితో కలిశారు. వీరంతా డాక్టర్‍గారికి వ్యక్తిగతంగా స్నేహితులే. జైలులో ఆ స్నేహం స్థిరపడింది. తరువాత కూడా కొనసాగింది. అలాగే, కరీంనగర్ నుండి జనసంఘం పార్టీకి చెందిన చెన్నుపాటి విద్యాసాగరరావుగారు (వీరు 1998 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు)  వంటినిండా దెబ్బలతో జైలుకు వచ్చారు. , ఆ తర్వాత ఎవరి బారక్స్ వాళ్లకే కేటాయించారు. సిపిఎంకి చెందిన డాక్టర్ వై.ఆర్.కె, చిర్రావూరి, మంచికంటి, భగవాన్ దాస్, బోడేపూడి, నర్రా రాఘవరెడ్డి, ఓంకార్ లకు ఒక రెండు గదుల ఇల్లు లాంటి దాన్ని కేటాయించారు. వరండా అందరికీ కామన్‍గా వుండేది. వేరే గదిలో వంటా-వార్పు చేసుకునేవారు. తమ పార్టీ వారికి రాజకీయ పాఠాలు చెప్పినట్లే, అక్కడ ఇతరులకు తమ పార్టీ విధానాలు చెప్పడం, ఇతర పార్టీ వారి నుంచి వినడం ఒక నిత్యకృత్యమై పోయింది. డిటెన్యూలలో వరంగల్ అడ్వకేట్ ఆర్.ఎస్.ఎస్ నాయకులు భండారు సదాశివరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి. భగవద్గీత, షడ్ దర్శనాలకు సంబంధించిన పలు విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతివాది భయంకర షఠగోపాచారి మరో డిటెన్యూ. ఆయన ఆయుర్వేద వైద్య ప్రముఖులు. వరవర రావును కూడా వీరితో పాటు అదే జైల్లో డిటెన్యూగా వుంచింది ప్రభుత్వం. అలానే పలు ముస్లిం నాయకులనూ నిర్బంధించి అక్కడే పెట్టింది. పద్దెనిమిది నెలల ఆ జైలు జీవితంలో సహచర డిటెన్యూల దగ్గర భగవద్గీత, షడ్ దర్శనాలు, ఆయుర్వేద వైద్యం, ఇస్లాం మతానికి చెందిన విషయాలను నేర్చుకున్నారు డాక్టర్ వై.ఆర్.కె. ఈ జైల్లో కూడా జైలు డాక్టర్ డ్యూటీని ఆయన డిటెన్యూగా వచ్చిన తర్వాత ఆయనకే అప్ప చెప్పారు. తృప్తిగా వృత్తి ధర్మాన్ని అక్కడ కూడా నిర్వహించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడానికి నెల రోజుల ముందర అందరు డిటెన్యూలతో పాటు డాక్టర్ వై.ఆర్.కె ని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆలా బయటకు పోయి, ఇలా లోనికి వస్తానని అనుకోలేదాయన అప్పటికి. అలా గడిచింది డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారి నాలుగో పర్యాయం జైలు జీవితం.
జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకులని భావించిన డాక్టర్ వై.ఆర్.కె, రావెళ్ల సత్యం, కె.ఎల్. నరసింహారావు గార్లను అరెస్ట్ చేసి, మళ్ళీ జైలుకు తరలించారు. అలా ఐదవ సారి అరెస్ట్ చేయడం జరిగింది. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, 1977 మార్చ్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ వై.ఆర్.కె ను పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు. అలా డాక్టర్ గారి అయిదో పర్యాయం జైలు జీవితం ముగిసింది.
హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.