Showing posts with label శాన్ ఫ్రాన్ సిస్కో. Show all posts
Showing posts with label శాన్ ఫ్రాన్ సిస్కో. Show all posts

Saturday, January 16, 2010

జ్వాలా మ్యూజింగ్స్-8 (గోల్డెన్‌ గేట్ వంతెన)

శాన్ ఫ్రాన్ సిస్కో- ఉత్తర దిశ అమెరికా
మధ్య వారధి-"గోల్డెన్‌ గేట్ వంతెన"

వనం జ్వాలా నరసింహారావు

ఇంద్ర ధనుస్సును తలదన్నే శోభాయమాన రంగులతో-వీనులకు విందైన ధ్వనులతో-అందంగా అలరారే వింత వింత కాంతులతో రంజిల్లుతూ, అద్భుతమైన భారీ శిఖరాలు-కేబుల్లు కలిగి, చాలా పొడుగ్గా వుండే, శాన్ ఫ్రాన్ సిస్కో "గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్" ప్రపంచంలోని అత్యంత సుందరమైన వంతెనల్లో అగ్రస్థానంలో వుంటుందంటారు. సముద్ర గర్భం నుండి ఆవిర్భవించి, ఆకాశాన్ని తాకుతున్నదా అన్న చందాన కనిపించే ఈ పసిఫిక్ మహా సముద్రం పైన కట్టిన "వారధి" ని తనివితీరా చూసేందుకు, సంవత్సరం పొడుగూ-ముఖ్యంగా వేసవి రోజుల్లో, సుమారు కోటి మంది పర్యాటకులు వస్తుంటారని అంచనా. అద్భుతమైన ఆ వంతెన వరకు వెళ్లి, దాని మీదుగా ప్రయాణం చేసి, ఆ పక్కకు చేరుకుని, అలా నిలబడి ఎన్ని గంటలు గడిపినా తనివి తీరదనే అనాలి. ఇక దానిపై నడవడం గాని, సైకిల్ మీద తిరగడం గాని చేయడమంటే, ఏదో అడ్వంచర్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది.

"బే బ్రిడ్జ్" లాగా, ఇది కూడా శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లను కలిపి, రెండు ప్రాంతాల మధ్య, రవాణా సౌకర్యం సులభ తరం-వేగవంతం చేస్తుంది. అమెరికా ఉత్తర-దక్షిణ అంతర్ రాష్ట్ర రహదారి-హైవే లో, పసిఫిక్ మహా సముద్రం మీద నిర్మించిన "గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్", ఓక్ లాండ్ తో సహా, శాన్ ఫ్రాన్ సిస్కో - ఉత్తర దిశగా వున్న అమెరికన్ కౌంటీలకు మధ్య కీలకమైన వారధిగా రాక పోకడలకు ఉపయోగ పడుతున్నది.

వంతెనను-ఆ ప్రాంతాన్ని చూసేందుకొచ్చే పర్యాటకుల సౌకర్యం కొరకు, విస్తృతమైన ఏర్పాట్లుంటాయక్కడ. అనేక పక్కలనుంచి బ్రిడ్జ్ ను వీక్షించేందుకు చేసిన ఏర్పాట్లలో కార్ పార్కింగ్, పబ్లిక్ రవాణా సౌకర్యం, విశ్రాంతి గదులుంటాయి. ఈ సౌకర్యాలను ఈశాన్యం వైపు, ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసారు.

గోల్డెన్‌ గేట్ వంతెన "సస్పెన్షన్" తరహా సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిన బ్రిడ్జ్. శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరం వైపున వున్న "గోల్డెన్‌ గేట్" దగ్గర ఆరంభమై, పసిఫిక్ మహా సముద్రం మీదుగా సాగుతుంది. 1937లో, వంతెన నిర్మాణం పూర్తి కాగానే, యావత్ ప్రపంచంలో, ఇది అతి పొడుగాటి సస్పెన్షన్ బ్రిడ్జ్ గా-శాన్ ఫ్రాన్ సిస్కో, కాలిఫోర్నియాలకు అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించిపెట్టిందిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కాలంలో ఇలాంటివి మరికొన్ని నిర్మించబడడంతో, వాటిల్లో ఇదొకటయింది. ఇప్పటికీ, అమెరికాలో రెండవ అతి పెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇదే. బ్రిడ్జ్ నిర్మాణం జరగుకముందు, శాన్ ఫ్రాన్ సిస్కో నుంచి, సమీపంలోని సముద్రానికి అటు దిక్కుగా వున్న మారిన్ కౌంటీకి వెళ్లాలంటే, సముద్ర ప్రయాణమే ఏకైక మార్గం. సముద్రం మీద, అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా వంతెన నిర్మాణం అప్పట్లో దుర్లభమే అనుకున్నారు. సముద్ర లోతు. అలల వేగం, గాలి వేగం, పొగమంచు అన్నీ పెను సవాళ్లుగా వున్నప్పుడు నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

కవి హృదయం వున్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ థీసిస్‌ కొరకు చేసిన డిజైన్ ఆధారంగా, అతడు సూచించిన తక్కువ వ్యయం అంచనాలను దృష్టిలో వుంచుకొని, ఇతర నిపుణుల సలహా సంప్రదింపులను తీసుకొని నిర్మాణం చేపట్టారు. మూడున్నర కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో జనవరి 5, 1933 న ఆరంభమైన నిర్మాణం, సుమారు నాలుగేళ్లలో 1937 లో పూర్తయింది. అమెరికాలో-కాలిఫోర్నియా రాష్ట్రంలో-శాన్ ఫ్రాన్ సిస్కోలో అపురూపమైన దర్శనీయ స్థలంగా ప్రఖ్యాతి కాంచింది.

జ్వాలా మ్యూజింగ్స్-7 (బే వంతెన)

శాన్ ఫ్రాన్ సిస్కో-ఓక్ లాండ్ లను కలిపే "బే వంతెన"

వనం జ్వాలా నరసింహారావు

డిస్నీ లాండ్, యూనివర్సల్ హాలీవుడ్ స్టూడియోలను చూసి, లాస్ ఏంజల్స్ నుంచి శాంతా క్లారా తిరిగొచ్చిన వెంటనే, మొదటి సోమవారం నాడు, గూగుల్ సంస్థలో పనిచేస్తున్న మా అబ్బాయి ఆదిత్య, ఆఫీస్ పని మీద, నాలుగు రోజులు న్యూయార్క్ వెళ్లాడు. వాడు తిరిగొచ్చేంతవరకు, కోడలు పారుల్, మనుమడు అన్ష్, నేను-శ్రీమతి దాదాపు ఇంట్లోనే గడిపాం. మధ్య-మధ్య సమీపంలోని మాల్స్ కు అత్యవసర సరకుల కొరకు వెళ్లి రావడం తప్ప ఎక్కువ ఇంట్లోనే వుండే వాళ్లం. వాడొచ్చిన వెంటనే, రెండు-మూడు రోజుల వ్యవధిలో అన్ష్ కు శెలవులు అయిపోతున్నందున, ఆదిత్య స్నేహితుడు హైదరాబాద్ వెళుతుంటే, అక్టోబర్ 10, 2009న అతడి వెంట పంపించాం . వెళ్లే లోపు ఆదిత్య-పారుల్ వాడిని గ్రేట్ అమెరికన్ పార్క్ లాంటి ప్రదేశాలకు తీసుకొని పోయారు. వాడికి కావాల్సిన వస్తువులను కొన్నారు. వాడెళ్లిన తర్వాత ముందుగా చూసిన వాటిలో ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన" గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విశేషం ఏంటంటే, సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఈ వంతెనపై, ఇంతవరకు, ఏ విఘ్నం లేకుండా కొనసాగుతున్న వాహనాల రాకపోకలకు, ప్రప్రధమంగా, మేం వెళ్లొచ్చిన మర్నాటినుంచి, అంతరాయం ఏర్పడింది. యాదృచ్చికమే కావచ్చు గాని, తాత్కాలికంగా చేపట్టిన రిపేర్ల సందర్భంగా, ఏర్పడిన అంతరాయం వల్ల వారం రోజుల వరకు దీన్ని మూసి వుంచారు.


శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లు పక్క-పక్కనే వున్న రెండు ప్రదేశాలు. దాదాపు జంట నగరాలని పిలవచ్చు. రెండూ వేర్వేరు గుర్తింపున్న నగరాలే. ఒక విధంగా రెండూ కలిసే వుంటాయి కాబట్టి, రెంటి మధ్య దూరం లేదనే చెప్పొచ్చు. సుమారు పది మైళ్ల నుంచి పదిహేను మైళ్ల దూరం ఒక అర గంటసేపు కారు నడుపుకుంటూ పోయే దూరమని అంటే మంచిదే మో. ఈ రెంటి మధ్య - రెంటినీ వేరు చేస్తూ, సముద్రముంటుంది. 1870 నుంచే రెంటిని కలుపుతూ, సముద్రం మీద వంతెన నిర్మించాలని భావించినప్పటికీ, 1930 లో-అప్పటి అమెరికా అధ్యక్షుడు, హెర్బర్ట్ హూవర్, ఆ ప్రతిపాదనకు అంగీకరించి, పూర్తి మద్దతు ప్రకటించిన తర్వాతే, ఆ కల నెరవేరింది. అమెరికా-కాలిఫోర్నియా సాగర ప్రాంతంలో నిర్మించిన, అనేక వంతెనల్లో, "బే వంతెన" ఒకటి. కాకపోతే దీని ప్రత్యేకత వేరు. ప్రపంచంలోని అతిపెద్ద నిడివిగల వంతెనల్లో ఒకటైన బే బ్రిడ్జ్ పై, ప్రతి రోజు, దాదాపు మూడు లక్షల వాహనాలు అటు-ఇటు వచ్చి పోతుంటాయి.


1848–1855 నాటి "గోల్డ్ రష్" స్మృతులను ఇప్పటికీ అమెరికాలో జ్ఞప్తికి తెచ్చుకుంటారు. కాలిఫోర్నియా-కొలామా ప్రాంతంలో జనవరి 24, 1848 న, జేమ్స్ విల్సన్ మార్షల్ అనే వ్యక్తి, "బంగారం" నిల్వలు కనుగొనడంతో, బంగారం అన్వేషణ కొరకు అనేక మందిలో ఆత్రుత ఆరంభమైంది. దానికే చరిత్రకారులు "గోల్డ్ రష్" అని పేరు పెట్టారు. బంగారం కనుగొనబడిందన్న వార్త (వినాయకుడు పాలు తాగాడన్న వార్త కంటె వేగంగా) ఆ నోటా-ఆ నోటా పడి, అమెరికా లోని ఇతర ప్రాంతాలకు-విదేశాలకు పాదరసంలా పాకింది. లక్షన్నర మంది ఇతర ప్రాంత అమెరికన్లు-లక్షన్నర మంది విదేశీయులు, మొత్తం మూడు లక్షలకు పైగా స్త్రీ-పురుష భేదం లేకుండా-పిల్లా జెల్లాతో సహా, భూ మార్గం-సాగర మార్గం-ఇతర మార్గాల ద్వారా కాలిఫోర్నియాకు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక టోల్ బ్రిడ్జ్ సముద్రం మీద నిర్మించాలన్న ఆలోచన జరిగింది. అదే కార్యరూపం దాల్చి, 1933 కల్లా నిర్మాణం మొదలయింది. నవంబర్ 12, 1936 న, "గోల్డెన్‌ గేట్" ప్రారంభానికి ఆర్నెల్ల ముందర, వాహనాల రాకపోకలు దానిమీద మొదలయ్యాయి.


అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న శాన్ ఫ్రాన్ సిస్కో-ఓక్ లాండ్ నగర వాసులు, ఇరు ప్రాంతాలను కలుపుతూ, త్వరగా రాకపోకలు సాగించేందుకు, అనువైన మార్గం వుండాలని ఎనభై ఏళ్ల కిందనే భావించారు. ఇప్పుడు వారందరి అభిమాన మార్గం బే వంతెనే. అత్యంత వేగంగా ఉప్పొంగే అలలొస్తుండే సముద్ర మీదా, అందునా అతి వేగంగా గాలులు వీచే ఆ ప్రదేశంలో, సముద్రం మధ్యలో వంతెన నిర్మించడం జరగని పని అని, నిరాశావాదులు ప్రచారం చేసేవారు. వంతెన మార్గమధ్యంలో, భూ కంపాల తీవ్రత కంటె భయంకరమైన రెండు దారుణమైన అవరోధాలకు నిరంతరం ఆస్కారమున్న, అక్కడ బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్లు పలు మార్లు సందేహించారు. సముద్రపు అడుగున అంచనాల కందని నేల పరిస్థితి, ఊహ కందని నీటి లోతు, భూ పొరల్లో కానరాని రాతి ప్రదేశం, అపురూపమైన డిజైన్ తయారు చేయడం లాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు ఇంజనీర్లు. ఇన్ని అవాంతరాల నేపధ్యంలో, ఎనిమిది మైళ్ల పొడవు పైగా వుండవలసిన వంతెన నిర్మాణం దాదాపు నమ్మశక్యం కాదనే భావించారు పలువురు. సాంకేతిక అవరోధాలను అధిగమించడం ఒక ఎత్తైతే, రాజకీయ పరమైన అవాంతరాలు మరో ఎత్తు. అయితే, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మానవ మేధస్సు సాధించిన అపూర్వ విజయాలలో ఒకటి. చివరకదే జరిగింది. వంతెన నిర్మాణం మొదలయింది-పూర్తయింది. "సస్పెన్షన్ బ్రిడ్జ్" అయితేనే లోతైన సముద్రం మీద, నిడివైన వంతెన కట్టడం సాధ్యమైన పని అని భావించిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, డిజైన్ నిపుణులు ఆ దిశగా ముందుకు పోయి, నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసారు.


డిజైన్-నిర్మాణంలో భాగమైన "ట్రస్ కాంటీ లివర్", వందలాది అడుగుల లోటు దాకా సముద్రంలోకి దిగి వుండి, వంతెనను నిరంతరం కాపాడే "యాంకర్" లాంటిది. దీని ఉపయోగం అంతా-ఇంతా అని చెప్పలేం. వంతెన లైఫ్ అంతా దానిమీద ఆధార పడి వుంది. 76 అడుగుల వెడల్పు-సుమారు నాలుగంతస్థుల ఎత్తైన భవనం తో సమానమైన పొడవున్న, ప్రపంచంలోనే అత్యంత భారీ డయామీటర్ గల "బోర్ టన్నెల్" తూర్పు-పడమరలలో వున్న వంతెన భాగాలను కలుపుతుంటుంది. ఇది మరో "యాంకర్". వంతెన నిర్మాణం అయిదు దశల్లో పూర్తయింది. మొదలు తూర్పు భాగం, తర్వాత యెర్బా బ్యూనా ఐలాండ్ ద్వారా పోయే సొరంగ మార్గం, దాంతర్వాత పశ్చిమ భాగం, అక్కడినుంచి పశ్చిమ దిశగా పోవాల్సిన రహదారి మార్గం-అవసరమైన రాంపులు, చివరగా శాన్ ఫ్రాన్ సిస్కో వైపున "ట్రాన్స్ బే టర్మినల్" నిర్మాణం జరిగింది. మూడు సంవత్సరాల ఇంజినీరింగ్ నైపుణ్యం-సాంకేతిక శక్తి-రాజకీయ మద్దతు, సుమారు ఎనిమిది కోట్ల డాలర్ల వ్యయం, వంతెన పూర్తవడానికి తోడ్పడ్డాయి.


అక్టోబర్ 17, 1989 న సంభవించిన భారీ భూ కంపంలో, వంతెన తూర్పు భాగానికి నష్టం జరిగింది. అవసరమైన రిపేర్లు చేపట్టి సరిదిద్దడ జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో, కొద్ది రోజులపాటు మూసి వేసి, డబ్బై గంటల పాటు అత్యవసరమైన మరికొన్ని రిపేర్లు చేసారు. అయితే, అక్టోబర్ 28, 2009 న, కాంటీ లివర్ విభాగానికి కొంత నష్టం జరిగి నందువల్ల, మరి కొన్ని రోజులు మూసి వుంచి, వారంరోజుల తర్వాత రాక పోకలకు తెరిచారు.


ఆదిత్య మమ్మల్ని అక్కడకు తీసుకెళ్లి చూపించినప్పుడు, ఒక్క సారి మా మదిలో రిషీకేశ్ లోని "రామ్ కా ఝూలా" "లక్ష్మన్ కా ఝూలా" లు గుర్తుకొచ్చాయి అయితే వాటికీ దీనికి పోలికున్నదని కాదు. వాటిని చూసి ఆశ్చర్య పోయిన మాకు దీన్ని చూస్తే మతి పోయిందనాలి. "బే వంతెన" చూసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందర ఒక సారి "గోల్డెన్‌ గేట్" చూసి పోయాం. ఆ విశేషాలు తర్వాత తెలుసుకుందాం.

Saturday, January 9, 2010

జ్వాలా మ్యూజింగ్స్-2 (మోంటిరే బే అక్వేరియం-శాంతా క్రజ్ బీచ్)

శాన్ ఫ్రాన్ సిస్కో సమీపంలోని మోంటిరే బే అక్వేరియం-శాంతా క్రజ్ బీచ్

వనం జ్వాలా నరసింహారావు

శాన్ ఫ్రాన్ సిస్కో- అమెరికా వచ్చిన మర్నాడు కోడలు పారుల్ పుట్టిన రోజు సరదాగా గడిపాం. సెప్టెంబర్ 24, 2009న ఆదిత్య, నేను, శ్రీమతి కలిసి అన్ష్ ను తీసుకొని సమీపంలోని "మోంటిరే బే అక్వేరియం" వెళ్లాం. అన్ష్ బాగా ఎంజాయ్ చేశాడు.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని పసిఫిక్ మహాసముద్రం ఒడ్డు నున్న సహజ సిద్ధమైన బ్రహ్మాండమైన "మోంటిరే బే అక్వేరియం" 1984లో నెలకొల్పబడింది. ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల మంది దర్శకులు వచ్చిపోతుండే ఈ సుందర ప్రదేశంలో 623 జాతులకు చెందిన 35,000 కు పైగా మొక్కలు, జలచరాలున్నాయి. మోంటిరే బే నుండి, గొట్టాల ద్వారా సముద్ర జలాలను అక్వేరియంలోకి నిరంతరం ప్రవహింప చేసే విధంగా శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 33 అడుగుల ఎత్తున వుండి, 13 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యమున్న నిలువెత్తు వాటర్ టాంక్-దాని గుండా యావత్ సాగర జలచరాలను వీక్షించే ఏర్పాటు, మోంటిరే బే అక్వేరియంలోని ప్రధాన ఆకర్షణ. ప్రపంచం మొత్తంలోనే ఎక్కడా దొరకని అరుదైన కాలిఫోర్నియా "జైంట్ కెల్ప్" (ఎరువులాగా ఉపయోగపడే ఒక రకమైన గడ్డి మొక్క) ను, ఈ వాటర్ టాంక్ లో, జలచరాల నిత్యావసరాలను తీర్చేందుకు పెంచుతుంటారు. ఇలా పెంచడం కూడా ప్రపంచంలో మరెక్కడా జరగదు. బే ప్రదేశానికి సుదూరంలో 45 లక్షల లీటర్ల సముద్రపు నీటిని నిల్వ చేయగల మరో పెద్ద వాటర్ టాంక్ ఇంకో ప్రధాన ఆకర్షణ.

అక్వేరియంలో ప్రదర్శన కుంచిన "స్టింగ్ రేస్", "జెల్లీ ఫిష్", "సీ ఒట్టెర్స్", ఏబై సంవత్సరాల వయసున్న పదకొండు పౌండ్ల బరువు గల "లొబ్ స్టర్" లే కాకుండా, కొన్ని వందల సాగర జలచరాలు, నీళ్లకు ఎగువనా-దిగువన కదలాడు తుంటే, అద్భుతమైన ఆ దృశ్యాన్ని సందర్శకులు మైమర్చి వీక్షిస్తుంటారు. "జెల్లీ ఫిష్" కదలికలకు ఎటువంటి ఇబ్బందికలుగకుండా, ఆసరా లభింప చేసేందుకు, వృత్తాకారంలో నీరు ప్రవహించే సౌకర్యం ఏర్పాటుచేసిన, ప్రత్యేకమైన "క్రైజిల్ టాంక్ “ను ఉపయోగిస్తున్నారు అక్వేరియం నిర్వాహకులు. ఏ జలచరానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సహజ వాతావరణంలో జీవించే ఏర్పాట్లెన్నో చేశారిక్కడ. "సాగర సంపద పరిరక్షణను ప్రోత్సహించడం" అక్వేరియం ధ్యేయం-లక్ష్యం.

"మోంటిరే బే అక్వేరియం" డిజైన్ లోనే ఒక ప్రత్యేకతుంది. నిమిషానికి 2000 గాలన్ల సముద్ర జలాలను, రాత్రింబగళ్లు, వందకు పైబడి టాంకుల ద్వారా అక్వేరియంలోకి ప్రవహించే ఏర్పాటు చూడ ముచ్చటగా వుంటుంది. సందర్శకులు రకరకాల చేపలను నీటిపైనా-కిందా, స్పష్టంగా వీక్షించే వీలుగా వడబోసిన పరిశుద్ధమైన జలాలను పగటి సమయంలో ప్రవహింపచేస్తారు. రాత్రివేళల్లో యధా విధి సముద్ర జలాలు, సహజసిద్ధమైన సాగర ఆహారాన్ని దాని వెంట వచ్చే విధంగా, అక్వేరియం టాంకుల్లో ప్రవహిస్తుంటాయి. చెత్త నీరంతా తిరిగి సముద్రంలోకి విడువబడే విధంగా ఏర్పాట్లున్నాయి. పర్యావరణానికి భంగం కలగని రీతిలో, ఎరువుగా ఉపయోగపడే "జైంట్ కెల్ప్" మొక్కల పెరుగుదలకు భంగం కలగని పద్ధతిలో, అసలు-సిసలైన సముద్రమా ఇది అన్న తరహాలో వుంటుంది "మోంటిరే బే అక్వేరియం".

"భారీ తెల్ల షార్క్"ను 16 రోజుల సుదీర్ఘ కాలం పాటు బందీగా వుంచగలిగి, తిరిగి సముద్రంలోకి వదల గలిగిన ఏకైక అక్వేరియం, ప్రపంచంలో "మోంటిరే బే అక్వేరియం" ఒక్కటే. "జువెనైల్ తెల్ల షార్క్"లను పలుసార్లు పట్టుకొని, రవాణా చేసి, కొంతకాలం పాటు అక్వేరియంలో వుంచి, సందర్శకులు వీక్షించిన తర్వాత సముద్రంలోకి వదలగల సామర్థ్యాన్ని సిబ్బంది అలవరచుకున్నారు. అక్వేరియంలో అన్ష్ లాంటి చిన్న పిల్లలు ఆనందంగా గడిపేందుకు, ఎన్నో రకాల వినోదకరమైన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అందుకేనేమో, శలవులిస్తే చాలు-నేల ఈనినట్లు వందల-వేల మైళ్ల ప్రయాణం చేసి సందర్శకులు కుటుంబ సమేతంగా వస్తుంటారిక్కడకు. కాలిఫోర్నియా లో, శాన్ ఫ్రాన్ సిస్కోకు అతి సమీపంలో వున్న ఈ అక్వేరియంను పర్యాటకులు సందర్శించి తీరాల్సిందే.

రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 26 సాయంత్రం ఆదిత్య వుంటున్న శాంతా క్లారా-లిక్ మిల్ రోడ్ సమీపంలో, ఓ పాతిక మైళ్ల దూరంలో వున్న "శాంతా క్రజ్ ప్రధాన బీచ్" కు అన్ష్ ను తీసుకొని, అందరం వెళ్లాం. అక్వేరియంకు రావడం కుదరని పారుల్ కూడా బీచ్ అనగానే బయల్దేరింది. మేమెళ్లిన రోజున పెద్దగా జనం లేనందున ఇబ్బంది లేకుండానే పార్కింగ్ దొరికింది. సాధారణంగా అక్కడ పార్కింగ్ దొరకడం కష్టమంటారు. చలికూడా బాగానే వేసింది. ఆదిత్య కొంచెం సేపు మమ్మల్ని రెస్టారెంటులో కూచోబెట్టి, అన్ష్ కిష్టమైన ఆటలాడించడానికి, చుట్టుపక్కల తిప్పాడు. అందరం కలిసి చాలా సేపు సముద్రంలో-బీచ్ లో ఆనందంగా గడిపాం.

శాంతా క్రజ్ బీచ్ వంద సంవత్సరాల పూర్వంనుంచి సందర్శకులను ఆహ్లాద పరుస్తుంది. సుమారు మైలు దూరం పైగా వుంటుందిక్కడ బీచ్. బీచ్ పరిసరాల్లో ఆకర్షణీయమైన ఎన్నో వినోద సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటుచేశారిక్కడ. ప్రయివేట్ సంస్థ నడుపుతున్న ఈ బీచ్ కు ఆనుకొని వున్న భవన సముదాయం అక్టోబర్ 17, 1989న సంభవించిన భూకంపంలో పగుళ్లకు లోను కావడంతో, పునర్నిర్మించారు తిరిగి. శానోజ్ కు 35మైళ్ల దూరంలోను, మోంటిరేకు ఉత్తర దిశగా 40మైళ్ల దూరంలోను, శాన్ ఫ్రాన్ సిస్కోకు దక్షిణంగా 70 మైళ్ల దూరంలోను వుందీ బీచ్. పారుల్, ఆదిత్య అక్కడ అందరితో కలిసి తీసిన ఫోటోలు ఎప్పటికీ భద్రపరుచుకునే విధంగా వున్నాయి.

ఇక ఆ వారమంతా మేమిద్దరం విశ్రాంతి తీసుకున్నాం గాని, ఆదిత్య-పారుల్ అన్ష్ ను వూళ్లో వున్న వాడానందించే ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత గురువారం, అక్టోబర్ మొదటి తేదీన, పారుల్ కు ఆఫీస్ కు వెళ్లాల్సిన పని వున్నందువల్ల, మేం ముగ్గురం అన్ష్ ను తీసుకొని "లాస్ ఏంజెల్స్" కు ప్రయాణమై పోయాం.