Showing posts with label తెలుగు దేశం. Show all posts
Showing posts with label తెలుగు దేశం. Show all posts

Thursday, December 29, 2011

భయపెట్టిన కేంద్ర పాలన: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! - 2
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలోని స్థితిగతులపై దృష్టి సారిస్తే ఆసక్తికరమైన సంఘటనలు 2011లో చోటుచేసుకున్న విషయం అవగతం చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, ఒకానొక తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లో నెల కొన్న పరిస్థితి మరే రాష్ట్రంలోను, నెలకొని లేదనే అనాలి. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్ రాజకీయాలలో, "శూన్యం" ఏర్పడి, రోశయ్య హయాంలో బలపడి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ప్రమేయం లేకుండానే మర్రి ఊడల్లాగా పెకిలించనలవికాని లోతుకు కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి "అధిష్టానం" అనేది వున్నదనే సంగతిని రాజశేఖర రెడ్డి తీసేయగా, రోశయ్య తన పాలనలో చేసిన పని మరిచిపోయిన అధిష్టానాన్ని గుర్తుచేయడమే! ఇక, ఆ తర్వాత, అధిష్టానమే ఇక్కడ పాలన చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదన, జగన్మోహనరెడ్డి సవాలు, ప్రభుత్వోద్యోగుల నిరసనలు, తెలుగు దేశం అవినీతి ఆరోపణలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి ఇటు ముఖ్యమంత్రికి-అటు అధిష్టానానికి తల బొప్పి కట్టించడం, అధికారుల్లో అలసత్వం, పధకాల అమలులో నిర్లిప్తత....ఇలా...రకరకాల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం లేని పరిస్థితులు రాబోతున్నాయా అన్న అనుమానం కూడా కలిగింది ఒక దశలో. రాష్ట్రంలో అప్పట్లో ఎవరి ఆలోచనలు వారివే...ఎవరి ఆరోపణలు వారివే. కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య మాచ్ ఫిక్సింగ్ అని తెరాస అంటే, టిడిపి-తెరాస మధ్యనే మాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ వాదించింది. జగన్మోహన రెడ్డికి కేసీఆర్ కు మధ్య మాచ్ ఫిక్సింగ్ కుదిరిందని తెలుగుదేశం ఆరోపించింది. వీటితో సంబంధం లేకుండా, బహిరంగంగానే ఫిక్సయిపోయాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో. చివరకు నెత్తిమీద కుంపటి దించుకుని తన పార్టీని, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హస్తాలలో పెట్టాడు.

నాలుగు లక్షల మంది తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆట విడుపు స్థలాలయ్యాయి. ఉద్యోగులు రావడం, సంతకాలు చేయడం, పెన్ డౌన్ సమ్మె చేయడంతో ప్రభుత్వం దాదాపు స్తంభించి పోయిందనాలి. ఆ తర్వాత రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె, మరో రోజున "పల్లె పల్లె పట్టాల" పైకి ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వానికి ఏం చేయాల్నో పాలుపోలేదు. జగన్మోహన రెడ్డి వారం రోజుల నిరాహార దీక్ష సహితం వార్తలలో ప్రముఖంగా చోటు చేసుకుంది. రాజశేఖర రెడ్డి హయాంలో వాగ్దానం చేసిన ఫీజు రీఇంబర్స్ మెంటు విషయంలో, చేసిన దీక్ష అది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను, నిజాం కళాశాల ప్రాంగణంలోను చెలరేగిన హింసా కాండ కూడా దారుణమైన సంఘటనలే అనాలి. అదే రోజుల్లో లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడంతో, వారికి కాంగ్రెస్ సభ్యుల, ఎన్డీయే సభ్యుల మద్దతు లభించడంతో, సభ పలు మార్లు వాయిదా పడింది. ఎమెల్యేలు శాసన సభలో లేకుండా, మంత్రులు రాజీనామా బాట పడుతుంటే, (కాంగ్రెస్ పార్టీకి చెందిన)ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుంటే, ఏమీ చేయలేని స్థితిలో వున్న (రాష్ట్ర) ప్రభుత్వాన్ని రద్దు చేసి, అసెంబ్లీని సుషుప్తావస్థలో వుంచి రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందేమో అన్న అని అనుమానాలు కలిగాయప్పట్లో. చివరకు అంతా సర్దుమణిగింది.
పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చే జారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. ఆ చర్యతో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒకింత అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. ఇక అంతే సంగతులు...తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. 2011 మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. అంతవరకూ వేచి చూడాల్సిందేనని, ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ. అలనాటి ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. అదలా వుండగా మిలియన్ మార్చ్ వ్యవహారాన్ని తెర పైకి తెచ్చింది రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. 
అదే రోజుల్లో మార్చ్ 11, 2011 న జపాన్ తీరప్రాంతంలో సంభవించిన సునామీ-భూకంపం దరిమిలా చెలరేగిన అణు సంక్షోభం క్షణ-క్షణ భీకరమైపోయింది. పరిస్థితి విషమించింది. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ స్థాయి తీవ్రమై, హెలికాప్టర్ సహాయంతో రి యాక్టర్ పై నీళ్లు చల్లేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఇంధన కడ్డీలను చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా బోరిక్ యాసిడ్ చల్లే అవకాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఫుకుషిమా విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే కలుషిత గాలి, రష్యా మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాకు చేరవచ్చనీ అన్నారప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో, అంతవరకూ ఎన్నడూ, కనీ-వినీ ఎరుగని రీతిలో, దేశంలో వున్న మిలిటరీ సిబ్బందిలో సగానికి పైగా, సుమారు లక్ష మందిని సహాయ-పునరావాస కార్యక్రమాలకు పురమాయించింది జపాన్ ప్రభుత్వం. అమెరికా దేశానికి చెందిన న్యూ క్లియర్ ఆధారిత విమానాలు మోసుకెళ్లే నౌక "రొనాల్డ్ రీగన్" తన వంతు సహాయం చేయడానికి అక్కడకు చేరుకుంది కూడా. రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితులు తీవ్రమయ్యాయేకాని తగ్గే సూచనలు అంతగా కానరాలేదు.
గెలుపు-ఓటములు దైవాధీనం కాదని, మానవాధీనం అని ఘంటా పధంగా చెప్పడానికి 2011 మార్చ్ నెలలో జరిగిన మూడు రకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉపాధ్యాయ-పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాని, ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు కాని, స్థానిక సంస్థల కోటావి కాని...ఆ మాట కొస్తే భవిష్యత్ లో జరగబోయే మరి కొన్ని ఈ మోస్తారు ఎన్నికలు తీరుతెన్నులు కాని, కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కించిత్తైనా గమనించిన దాఖలాలు లేవు. ఆ పార్టీ-ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఉపాధ్యాయ-పట్టభద్రుల-ఎమ్మెల్యే-స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల గెలుపు-ఓటములు. ఎన్నికల నిబంధనలతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, తమ గెలుపు-ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం దురదృష్టకరం.
 ఉపాధ్యాయ-పట్ట భద్రుల కోటాలో బరిలోకి దిగినవారిలో, ఎవరో ఒకరిద్దరి విషయం మినహాయించి, పోటీకి దిగిన ప్రతివారూ, ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, రంగంలోకి దిగడం జరగలేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ నేపధ్యంలోనే జరిగింది. వీరి విషయంలో కూడా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా నైనా క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది వ్యవహారం. కాంగ్రెస్ సమ్మతి-అసమ్మతి వర్గ అభ్యర్థులు, జగన్ వర్గం అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులు, వీరి మద్దతు అంతో-ఇంతో కూడగట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగి, ప్రత్యర్థుల ఓటమికి కృషి చేశారు. తమ గెలుపు లక్ష్యం కన్నా, ఇతరుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలివి. సరే అంచనాలు కొందరి విషయంలో అనుకూలంగాను, మరి కొందరి విషయంలో తారు-మారుగాను జరగడంతో, ఓడిన వారి పక్షాన నిలిచిన రాజకీయ పార్టీ నాయకుల కన్ను ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై పడింది.
ఎమ్మెల్యేల కోటాలో పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు మాత్రమే వీలుండగా, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ చాణక్యులు, వారి-వారి అనుకూల కూటముల అవగాహన (రాహిత్యం) ప్రకారం, కలిమిడిగా-విడి విడిగా, పన్నెండు మంది అభ్యర్థులను రంగంలో దింపారు. సాధారణంగా బలాబలాలు స్పష్టంగా వున్నప్పుడు ఏకగ్రీవంగా జరిగే నిర్ణయం, ఈ సారి, ఎన్నికల ద్వారా తీసుకోవాల్సిన అవసరం పడింది. "సీక్రెట్ బాలెట్" కాస్తా "ఓపెన్ సీక్రెట్ బాలెట్" గా మారి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళికి విరుద్ధంగా జరిగింది. ఆసాంతం పర్యవేక్షించాల్సిన ఎన్నికల సంఘం నోట మాట లేదు. ఎవరినీ తప్పు పట్టలేని స్థితికి చేరుకుంది. గెలిచిన వారు, ఓడిన వారు ఒకే తప్పు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష పార్టీల వారు, తమ చేతిలో వున్న "క్రాస్ ఓటింగు" ఆయుధాన్ని యధేఛ్చగా వాడుకున్నారు. తాము ఓడి పార్టీని ఓటమి పాలు చేసిన వారు కొందరైతే, పార్టీని ఓడించి తామూ ఓటమి పాలైన వారు మరి కొందరయ్యారు.
ఏప్రిల్ 2011 చివరలో దేశ-విదేశాలలోని లక్షలాది మంది తమ ఆరాధ్యదైవంగా భావించే భగవాన్ సత్య సాయిబాబా ఆరోగ్యం విషమించి పరమపదించారు. ఆస్తికులు-నాస్తికులు, అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, అధికారులు-అనధికారులు, ఆంధ్రులు-ఆంధ్రేతరులు, దేశ-విదేశాల్లోని సామాన్యులు-అసామాన్యులు, బాబా అపర భక్తులు-ఏ మాత్రం గిట్టని వారు, వారు-వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, ఆయనో మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, మానవ రూపంలో మనందరి మధ్యనే-మన కోసం కద లాడుతున్న "పురుషోత్తముడు" అనే విషయం బోధ పడుతుంది. పొలిమేరలే తప్ప ఎల్లలు లేని ఒక కుగ్రామంలో జన్మించి, ఎల్లలెరుగని అపురూప ప్రదేశంగా దాన్ని మలిచి, ప్రపంచ వ్యాప్తంగా దేశ-దేశాల పౌరులకు ఆధ్యాత్మిక తృప్తిని, మానసిక స్థయిర్యాన్ని కలుగజేసే "ప్రశాంత నిలయం" గా ఆ పల్లె రూపు-రేఖలనే మార్చి, తన చిన్న కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా చేసుకున్న భగవాన్ సత్య సాయిబాబా తన భక్తులను వీడి శివైక్యం పొందారుసత్య సాయిబాబా మానవ రూపంలో మన మధ్య నున్న దైవం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ దైవాన్ని మన మధ్యనే ఆ భగవంతుడు వుంచి నంత కాలం అందరికీ అంతా మంచే జరిగింది. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎలా జరగాలనుకున్నాడో అలానే జరిగింది. ఇదే భగవత్ అవతార రహస్యం!
(మరిన్ని మిగిలాయింకా)

Wednesday, January 26, 2011

కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ అన్యాయమే:వనం జ్వాలా నరసింహారావు

కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ అన్యాయమే
వనం జ్వాలా నరసింహారావు
(సూర్య దినపత్రిక:1-02-2011)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరు ప్రధాన మంత్రిగా పని చేసి వుండవచ్చు. ఇద్దరు రాష్ట్రపతి హోదాకు, ముగ్గురు లోక్ సభ స్పీకర్ పదవికి చేరుకుని వుండవచ్చు. అయినా ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది.

కేంద్ర మంత్రివర్గం ఏర్పాటులో కాని, విస్తరణలో కాని, పునర్ వ్యవస్తీకరణలో కాని, రాజ్యాంగపరమైన నిబంధనలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులు, పటిష్ఠమైన సాంప్రదాయాలు ఎన్ని వున్నప్పటికీ, అవన్నీ రాజకీయ అనుకూలతలు-వెసులుబాటుల ముందు దిగదుడుపే. వాటి విస్తృత పరిధులకు లోబడి పాటించాల్సిందే. అక్షర క్రమంలోను, కేంద్రంలో అధికారం చెలాయించే రాజకీయ పార్టీలకు అత్యధిక సంఖ్యాక పార్లమెంటు సభ్యులను గెలిపించడంలోను, ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలోను అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, ఇంతవరకూ, కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సుమారు 300 మందికి పైగా వున్న కాబినెట్ స్థాయి మంత్రులలో, ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారి సంఖ్య కేవలం 20 లోపే...అంటే 6% మాత్రమే. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి 42 లోక్ సభ స్థానాలు దక్కినప్పుడైనా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగు దేశం-బిజెపి పార్టీలకు అత్యధిక స్థానాలు దక్కినప్పుడైనా, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం నామ మాత్రమే. అదే విధంగా ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా సహాయ మంత్రుల పదవులు పొందగా, అందులో ఆంధ్ర ప్రదేశ్ కోటా 25 కు మించలేదు..అంటే కేవలం 5% మాత్రమే. 64 సంవత్సరాల స్వతంత్ర భారత వర్తమాన రాజకీయ చరిత్రలో, రాష్ట్రానికి చెందిన కనీసం 50 మంది నాయకులు (అధిక శాతం అగ్ర కులాలకు చెందిన వారే!) కూడా, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేక పోయారంటే...అంటే..సగటున ఏడాదికి ఒక్కరైనా లేరంటే, ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదనే అనాలి. కాకపోతే, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా, వాటిని అధిగమించి, ఇదే రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు, ప్రప్రధమ దక్షిణ భారత ప్రాంత పౌరుడుగా, ప్రధాన మంత్రి పదవిని పొందగలిగారు. మొట్టమొదటి సారి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వాడిగా, అయిదేళ్ల పూర్తి కాలం అధికారంలో వుండగలిగి, దేశ దేశాల మన్ననలను పొందిన ఆర్థిక సంస్కరణలను అమలు పరచగలిగాడు ఆయన. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ ఇలా అన్యాయం చేయడంలో, కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వమైనా, బిజెపి సారధ్యంలోని ప్రభుత్వమైనా కొద్ది తేడాతో ఒకే పద్ధతిని అవలంబించాయి.

రాజ్యాంగం ప్రకారం భారత ప్రధాన మంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రివర్గ సభ్యులందరినీ, నియమించే అధికారం రాష్ట్రపతి కుంది. కాకపోతే, ప్రధాన మంత్రిగా నియమితులు కాబోయే వ్యక్తికి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తప్పనిసరిగా వుండాలి. అలా వున్న వ్యక్తిని-వుందని రాష్ట్రపతి భావించిన వ్యక్తినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి కోరుతారు. ఇది మనం అనుసరిస్తున్న బ్రిటీష్ పార్లమెంటరీ సాంప్రదాయం. పాలనా సౌలభ్యం కొరకు మంత్రులకు పోర్టుఫోలియోలు ప్రధాన మంత్రి సూచన మేరకు రాష్ట్రపతి కేటాయించినప్పటికీ, మంత్రులందరూ, వ్యక్తిగతంగా-సామూహికంగా ప్రధానికి, ప్రధాని ద్వారా రాష్ట్రపతికి-పార్లమెంటుకు బాధ్యులవుతారు. దీన్నే "మంత్రివర్గ ఉమ్మడి బాధ్యత" అంటాం. ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే అధికారం, పోర్టుఫోలియోలను కేటాయించే అధికారం, పూర్తిగా ప్రధానిదేనని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ, వాస్తవానికి, ఆ అధికారం కొన్ని హద్దులకు లోబడి వుంటుందని సాంప్రదాయాలు చెపుతున్నాయి. ప్రధాని, అధికార పార్టీ అధినేత వేర్వేరు వ్యక్తులైనప్పుడు, ఆ హద్దు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు సారధ్యం వహించిన ప్రధాని కూడా ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు కాని, విస్తరణ కాని, పునర్ వ్యవస్తీకరణ కాని చేయలేరు. ప్రస్తుతం ఈ రెండు రకాలైన పరిస్థితులు నెలకొని వుండడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ సర్వ స్వతంత్రుడు కాదనే విషయం అర్థం చేసుకోవడానికి ఇటీవల జనవరి 19, 2011 న చేసిన విస్తరణే నిదర్శనం.

14 వ ప్రధాన మంత్రిగా, తొలి యూపీయే మంత్రులతో కలిసి, మే 22, 2004 న ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్, మొదటి ఐదేళ్ల కాలంలో ఒకటి-రెండు పర్యాయాలు మాత్రమే మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు చేశారు. రెండో తడవ, సరిగ్గా ఐదేళ్ల తర్వాత, మే 22, 2009 న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, 29 మంది కాబినెట్ మంత్రులతో, 48 మంది సహాయ మంత్రులతో మంత్రి మండలిని ఏర్పాటు చేశారాయన. ఇటీవలి విస్తరణలో, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారెవరూ లేకుండానే, కొత్తగా ముగ్గురి కి స్థానం కలిగించి, మొత్తం 37 మంది కాబినెట్ స్థాయి, 43 మంది స్టేట్ స్థాయి మంత్రులతో పునర్ వ్యవస్తీకరించారు. ప్రస్తుత మంత్రి మండలి సభ్యులతో కలుపుకుని, కేంద్ర మంత్రి మండలిలో జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి ఇంతవరకు, 300 మందికి పైగా కాబినెట్ మంత్రి హోదా, సుమారు 70 మంది వరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రుల హోదా, మరో 360 మంది దాకా సహాయ మంత్రుల హోదా, 70 మందికి డిప్యూటీ మంత్రుల హోదా లభించింది. మొదట్లో మంత్రి మండలి మూడంచెల పద్దతిలో, కాబినెట్-సహాయ-డిప్యూటీ మంత్రులతో, ఏర్పాటు చేసే ఆనవాయితీ వుండేది. అయితే రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలంటూ ఏదీ లేదు. కేవలం బ్రిటీష్ సాంప్రదాయాన్ని అనుకరించే ఇది కూడా జరిగింది. పాలనా సౌలభ్యం కొరకు కూడా ఆ ఏర్పాటు పనికొచ్చింది. వాస్తవానికి, మంత్రులందరూ మంత్రి మండలి సభ్యులే. జీత భత్యాల విషయంలోనే కొంత తేడాలున్నాయి. కాకపోతే, ప్రధాన మంత్రి సమాన స్థాయి మంత్రులందరిలో ప్రథముడుగా పేర్కొంటారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు డిప్యూటీ మంత్రుల స్థాయికి స్వస్తి పలికారు. రాజీవ్ గాంధి మళ్లీ పునరుద్ధరించినప్పటికీ, అనతి కాలంలోనే, వారందరినీ సహాయ మంత్రులుగా పదోన్నతి కలిగించారు. ఇక ఆ తర్వాత అందరూ అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాకపోతే, సహాయ మంత్రులలో కొందరికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆనవాయితీ మొదలైంది.

సర్దార్ వల్లభాయి పటేల్, అంబేడ్కర్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సీడి దేశ్ ముఖ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రాజగోపాలాచారి, బాబు జగ్జీవన్ రాం, కృష్ణ మీనన్, బహుగుణ, ఎంసీ చాగ్లా, కే ఎం మున్షి, అద్వాని, వీ వీ గిరి, వైబి చవాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, టీ టీ కృష్ణమాచారి, గోబింద్ వల్లభ్ పంత్, మోహన్ కుమార మంగళం, ఉమా శంకర్ దీక్షిత్, శంకర్ దయాళ్ శర్మ, జార్జ్ ఫెర్నాండెజ్, సుబ్రమణ్యం స్వామి, రామ్ జీత్మలాని, కరణ్ సింగ్, జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా, ఆర్ వెంకటరామన్, గ్యానీ జైల్ సింగ్, అశోక మెహతా, ప్రణబ్ ముఖర్జీ లాంటి ప్రముఖులు కాబినెట్ మంత్రులుగా పనిచేశారు. కేఆర్ నారాయణన్, సంతానం, షీలా దీక్షిత్, ఓం మెహతా, ఎం జీకే మీనన్, నందినీ సత్పతి లాంటి ప్రముఖులకు మంత్రి మండలిలో స్థానం లభించినా, సహాయ మంత్రులుగానే పనిచేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొత్త రఘురామయ్య, జలగం వెంగళ రావు, బెజవాడ గోపాల రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, శివశంకర్, వెంకట స్వామి, కే చంద్ర శేఖర రావు, ఉపేంద్ర, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ఎర్రం నాయుడు, జైపాల్ రెడ్డిలకు కాబినెట్ హాదా లభించింది. టీ అంజయ్య, రేణుకా చౌదరి, మల్లికార్జున్, బంగారు లక్ష్మణ్, ఎస్ బీ పట్టాభి రామారావు, రంగయ్య నాయుడు, జగన్నాథరావు, కె ఎల్ రావు, విద్యాసాగర్ రావు, అంకినీడు ప్రసాద రావు, ఎస్ బీపిబికే సత్యనారాయణ రావు, కేవి రఘునాథ రెడ్డి, వెంకట సుబ్బయ్య, కృష్ణం రాజు, వేణుగోపాలాచారి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, సాయిప్రతాప్, పురంధరేశ్వరి లకు సహాయ మంత్రుల హోదా లభించింది. డిప్యూటీ మంత్రులుగా జేబీ ముత్యాల రావు, ఎం సంజీవ రావు, ఎం తిరుమల రావు, పీ వెంకట రెడ్డి లకు స్థానం లభించింది.

అత్యధిక కాలం-సుమారు 32 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రి హోదాలో పని చేసిన ఘనత బాబూ జగ్జీవన్ రాంకు దక్కింది. అతి తక్కువ కాలం-కేవలం ఐదు రోజులు మాత్రమే కాబినెట్ మంత్రిగా వుంది జస్టిస్ హెచ్ అర్ ఖన్నా. మన రాష్ట్రానికి సంబంధించి నంతవరకు ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావు, కొత్త రఘురామయ్యలు సుమారు 15 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రులుగా వున్నారు. రఘురామయ్య అదనంగా మరో ఐదేళ్లు సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఉప ప్రధానులుగా సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వై బి చవాన్, జగ్జీవన్ రాం, దేవీ లాల్, అద్వానీలు పని చేశారు. వీరిలో మొరార్జీ, చరణ్ సింగ్ ప్రధానులు కాగలిగారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఏ మాత్రం లేని రాజీవ్ గాంధి, చంద్ర శేఖర్ నేరుగా ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు.

ఆగస్ట్ 15, 1947 న స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అత్యధిక కాలం-సుమారు 16 సంవత్సరాల 9 నెలలకు పైగా పదవిలో వుండి, 63 పర్యాయాలు మంత్రి మండలి విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ఆయన కూతురు ఇందిరా గాంధి కూడా దాదాపు కొంచెం తక్కువగా, రెండు విడతలుగా, సుమారు 16 సంవత్సరాల కాలం ప్రధానిగా పనిచేసి, 67 సార్లు విస్తరణలు-భారీ మార్పులు చేపట్టారు. ఇక ఆ కుటుంబ వారసుడు, ఇందిరా గాంధి అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధి, కేవలం ఐదేళ్ల కాలంలోనే, 36 సార్లు మంత్రి మండలిలో మార్పులు చేయాల్సి వచ్చింది. అటల్ బీహారీ వాజ్ పాయ్ ఆరేళ్ల పాటు ప్రధానిగా వుండి, 27 పర్యాయాలు విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ప్రధాన మంత్రులుగా పని చేసిన మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో, లాల్ బహదూర్ శాస్త్రి ఏడాదిన్నర కాలంలో చెరి పది సార్లు; చరణ్ సింగ్ ఆరు నెలల్లో ఆరు సార్లు; దేవె గౌడ పది నెలల పదవీ కాలంలో నాలుగు పర్యాయాలు; గుజ్రాల్ పది నెలల్లో రెండు సార్లు; వీపి సింగ్ 11 నెలల్లో, చంద్రశేఖర్ ఏడు నెలల్లో ఒకే ఒక్క సారి మంత్రి మండలిలో మార్పులు-చేర్పులు చేశారు. పీ వీ నరసింహారావు ఐదేళ్ల కాలం ప్రధానిగా వున్నప్పటికీ, కేవలం తొమ్మిది పర్యాయాలు మాత్రమే విస్తరణ చేపట్టారు. వీరందరితో పాటు, గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు.

మంత్రి మండలిలో మార్పులు చేసినప్పుడల్లా, విస్తరణ చేపట్టినప్పుడల్లా, అది జరిగిన వెంటనే, ప్రధాని మంత్రి సన్నిహిత వర్గాల నుంచి మీడియాకు ఒక సందేశం రావడం ఆనవాయితీ. అతి త్వరలో, మంత్రివర్గ విస్తరణ వుండబోతున్నదని, కొత్త వారికి అవకాశం కలిగిస్తామని, దాని సారాంశం. ఆశావహుల ఆశలు అలా సజీవంగా వుంచడం అనాదిగా జరుగుతున్నదే! అలా జరిగిన నాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సరైన న్యాయం జరుగుతుందని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు!

Monday, September 13, 2010

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కుల రాజకీయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు. మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపికచేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.