Showing posts with label ఇందిరా గాంధి. Show all posts
Showing posts with label ఇందిరా గాంధి. Show all posts

Friday, November 18, 2011

మనం మరచిపోలేని మహా నేత: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు
{తండ్రి జవహర్‌లాల్ కంటే మిన్నగా ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చిన మహా నాయకురాలు ఇందిర. అధికారంలో ఉన్నా లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా ఆమె గుర్తింపు పొందారు. తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరాగాంధీతో పోల్చ దగ్గ వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! - ఎడిటర్, ఆంధ్ర జ్యోతి}
ఇందిరా గాంధీ మరణించి పాతికేళ్ళు గడిచిపోయాయి. జాతీయ అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. పదహారేళ్ళపాటు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆత్మ స్తైర్యం, నిరంకుశ ధోరణి, రాజీపడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి సమర్థ పరిపాలనను అందించి చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. రాధాకృష్ణన్, జకీర్ హుస్సేన్, వివిగిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి. జైల్ సింగ్ రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు ఆమె ప్రధానిగా పనిచేశారు. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న 'సిండికేట్' నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భార జాతీయ కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న అసాధారణ నేత ఇందిర. ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ను మరో మారు చీల్చి ఇందిరాకాంగ్రెస్‌గా నామకరణం చేసి రెండేళ్ళకే మళ్ళీ అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలను పార్టీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకున్నారు. తనకు ఎదురులేకుండా, ఎదిరించిన వారికి పుట్టగతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించి నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ధీర ఇందిర.
ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకున్నారు ఇందిరాగాంధీ. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దు కోసాగాయి. పార్టీలో కూడా ఆమె నియంతృత్వ ధోరణులే అవలంభించారు. తమ పార్టీకి చెందిన ముఖ్య మంత్రులను ఇష్ట్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య మంత్రులను ఇబ్బందులకు గురిచేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్‌లోని సిండికేట్‌పై విజయం సాధించడానికి వామపక్షాలను కలుపుకున్నారు. 'కమ్యూనిజం' కంటే 'కమ్యూనలిజం' వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేశారు.
ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ వీరూ అనే తేడా లేకుండా తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్ళకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా బ్యాంకుల జాతీయకరణైనా, గ్రామీణ బ్యాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో 'సామ్యవాదం, లౌకిక వాదం' అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ముఖ్యమైనవని చెప్పడమైనా మరేదైనా ఏమి చెప్పినా చేసినా ఇందిర మనసులో మాట ఒకటే. భారతదేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేరు. నమ్మకమే ఆమె గెలుపునకు సోపానాలయ్యాయి. ఓటమికి కారణాలయ్యాయి.
1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, నాలుగేళ్ళ అనంతరం, నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిర ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా ఏడాది కాలంలోనే ఆమె తన రాజకీయ దక్షతను చూపారు. దానితో పాటే కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దుచేయించడంలో ఇందిర కీలక పాత్ర వహించారు. తరువాత జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సమకూర్చారు. అయినా మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఆమె సుముఖత చూపలేదు. తండ్రి మరణాంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఇందిర సమాచార శాఖను నిర్వహించారు. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా కాంగ్రెస్ అధిష్ఠానం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు.
తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ ప్రధాన మంత్రి కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో కనుసన్నల్లో నడుచుకుంటుందన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిర వైపు మొగ్గు చూపారు. అయితే భవిష్యత్తులో ఆమె నుంచి తమ రాజకీయ అస్తిత్వానికి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు.
అకస్మాత్తుగా మరణించిన రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరను విమర్శించే సంజీవరెడ్డిని కాంగ్రె స్ అధిష్ఠాన వర్గం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. తొలుత ఆయననే ప్రతిపాదించిన ఇందిర ఓటింగులో స్వతంత్ర అభ్యర్థి వివిగిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. తన వారందరినీ ఆయనకే ఓటేయ్యమని సూచించారు. ఆమె మాటే నెగ్గింది. నీలం ఓటమిపాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ ని మంత్రి వర్గంలోంచి వెళ్లి పోయే పరిస్థితులను ఇందిర కల్పించారు. క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణపై వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీనుంచి తొలగించింది. దీంతో 'సిండికేట్'గాచెలామణీ అవుతున్న నాయకులందరూ అభివృద్ధి నిరోధక శక్తులుగాను, సామ్యవాద పథకాలను అడ్డుకునే వారుగాను చిత్రించారు ఇందిర. పార్లమెంటరీ పార్టీ ఇందిర నాయకత్వంలో విశ్వాసం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిర ఏడాదిముందే 1971లో ఎన్నికలు నిర్వహించారు. అఖండ విజయం సాధించారు.
తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. అలహాబాద్ హైకోర్టు, లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పుచెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, ఇందిర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించారు. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపారు ఇందిరాగాంధీ. రాజ్యాంగాన్ని తిరగ రాయించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు నుంచి ఊరట పొందారు.
సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేశారు. మీడియాపై ఆంక్షలు విధించారు. అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకున్నారు. అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 1977లో ఎన్నికల నిర్ణయం ప్రకటించి, మార్చి నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని చెప్పి, జైళ్ళలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించారు. భారతదేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి ఇందిర ఎంతైనా తోడ్పడ్డారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగ సహచరుడు జగ్జీవన్ రాం వారితో చేయి కలిపారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్‌లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపునిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చి 20, 1977 జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజకవర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. కలగాపులగం లాంటి కాంగ్రెసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసిన మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.
ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు హాజరవడానికి ఇందిర నిరాకరించారు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, రాజ్యాంగ బద్ధంగా, మంత్రివర్గం సిఫార్సుపై, పార్లమెంటు ఆమోదం లభించిన చర్య అని ఆమె స్పష్టం చేశారు. కమిషన్ ఏర్పాటుకు చట్టబద్ధత లేదన్నది. అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. బెయిలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన సలహాను ఆమె నిరాకరించారు. ఆమె అరెస్టుకు తగిన కారణాలు ప్రభుత్వం చూపలేకపోయిందని, ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇందిర ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, మరో మారు పార్టీని చీల్చి, కాంగ్రెస్ ()ని స్థాపించారు.
అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్‌గా ప్రకటించారు. కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్() అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మరధం పట్టసాగారు. లోక్‌సభలో సుదీర్ఘచర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచున్నారు ఇందిరా గాంధీ. అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది. ఆమె అరెస్టుకు నిరసనగా లక్షలాది మంది అభిమానులు ఆందోళన చేశారు. అరెస్టయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆమెను విడుదల చేసింది ఫ్రభుత్వం. ఆమెను వదిలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు, ప్రజల నుండి లభిస్తున్న అభిమానాన్ని గమనించి తిరిగి ఆమె పంచన చేరారు. ఇంతలో అంతర్గత వైరుధ్యాల మధ్య జనతా ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.
1979 జూలైలో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణభూతుడైన చరణ్‌సింగ్‌కు మద్దతు పలికి, వ్యూహాత్మకంగా ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడ్డారు ఇందిరాగాంధీ. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని విశ్మాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఉన్న చరణ్ సింగ్ ఆచరణలో ఇందిర ప్రతినిధిగా పాలన చేశాడనాలి. జనవరి 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (), మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. సుస్థిరతా అస్థిరతా అన్న నినాదంతో ఇందిరా గాంధీ ఎన్నికల బరిలో దిగి గెలిచారు. సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. అస్థిర పాలన కంటే, నియంతృత్వ ప్రజాస్వామ్యమే మెరుగైందని ఓటర్లు తీర్పిచ్చారు. దాని రూపకర్త ఇందిరను మరో మారు ప్రధానిని చేశారు. ప్రధానిగా ఉండగానే ఇందిర హత్యకు గురయ్యారు.
రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించిన ఇందిర, తండ్రి జవహర్లాల్ కంటే మిన్నగా ప్రధానమంత్రి పదవికి వన్నెతెచ్చిన మహానాయకురాలు. అధికారంలో ఉన్నా లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొందారు. వైరివర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి, తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరాగాంధీతో పోల్చ దగ్గ వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! వారసత్వ అధికారాన్ని వంశపారంర్యంగా తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిర నవ భారత వర్తమాన చరిత్రలో వేరెవరూ సాధించలని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా ఇందిర చిరస్థాయిగా మిగిలిపోతారు.

Wednesday, January 5, 2011

ప్రాధమిక హక్కుల ఉల్లంఘన సమర్థనీయం కాదన్న సుప్రీం కోర్టు:వనం జ్వాలా నరసింహారావు

జనవరి 3, 2011 న ప్రాధమిక-మానవ హక్కుల అంశంపై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో....

ప్రాధమిక హక్కులను ఉల్లంఘించిన ఎమర్జెన్సీ రోజుల నాటి
అత్యున్నత న్యాయస్థానం తీర్పును తప్పుబట్టిన నేటి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
వనం జ్వాలా నరసింహారావు

కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఏడాది కింద అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

అలనాటి అత్యున్నత న్యాయస్థానం బెంచిలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఖన్నా, మిగిలిన నలుగురు సహచర న్యాయమూర్తుల మెజారిటీ తీర్పుతో ఏకీభవించకుండా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని కూడా జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు పేర్కొన్నారు. "హెబియస్ కార్పస్ ఆదేశం" అనేది రాజ్యాంగంలో ప్రధానమైన అంతర్భాగమని, అలాంటి ఆదేశాలను ఇచ్చే రాజ్యాంగపరమైన హైకోర్టుల అధికారాన్ని రద్దుచేసే నిర్ణయాధికారం ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా, రాజ్యాంగం ఎవరికీ దఖలు చేయలేదని, ఖన్నా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని న్యాయమూర్తులు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ వెంకటచలయ్య ఫిబ్రవరి 25, 2009 న, ఖన్నా స్మారకోపన్యాసం చేస్తూ, ఎమర్జెన్సీ రోజుల నాటి మెజారిటీ నిర్ణయాన్ని "చరిత్ర పుటల్లో పనికిరాని పేజీలకు పరిమితం" చేయాలని చేసిన వ్యాఖ్యను కూడా న్యాయమూర్తులు గుర్తుచేసుకున్నారు. అలనాటి సుప్రీం కోర్టు నిర్ణయం పౌరహక్కుల అమలును త్రి కరణ శుద్ధిగా కోరుకునే వారిపై ఎటువంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణగా భావించాలి.

ఈ వ్యవహారం పూర్వాపరాల్లోకి పోతే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. నలుగురు ని హత్య చేసిన నేరారోపణ మీద చౌహాన్ అనే వ్యక్తికి కోర్టు మరణ శిక్ష విధించిన విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంస్థ, అతడి కౌమార వయసు దృష్ట్యా, కేసుని పరిశీలించాల్సిందిగా అస్సాం గవర్నర్ ను కోరారు 2009 లో. పరిశీలన అనంతరం మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది ప్రభుత్వం. చౌహాన్ కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకున్నారు. విచారణ జరిపిన సుప్రీం కోర్టు, జాతీయ మానవ హక్కుల సంస్థను తప్పు పడుతూ, సంస్థకు కోర్టు తీర్పులో కలుగచేసుకునే అధికారం లేదని చెప్పి, మరణ శిక్షను ధృవ పరుస్తూ మే 2009 లో తీర్పిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ, చౌహాన్ కుటుంబ సభ్యులు మరో రివ్యూ పిటీషను సుప్రీం కోర్టులో వేశారు. మానవ హక్కులను కాపాడడానికి జాతీయ మానవ హక్కుల సంస్థ ఎటువంటి చర్యైనా తీసుకోవచ్చని 1993 చట్టంలో వున్న విషయాన్ని పేర్కొంటూ, చౌహాన్ మరణ శిక్షను మరో మారు యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. ఆ సందర్భంగా ప్రాధమిక హక్కుల అంశాన్ని ప్రస్తావిస్తూ, 1976 నాటి సుప్రీం కోర్టు తీర్పులోని అంశాలను పేర్కొన్నారు న్యాయమూర్తులు.

భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత, రాజ్యాంగంలో పొందుపరచిన విధానం ప్రకారం, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుది. న్యాయం కొరకు పౌరుడు చివరి పోరాటం చేసే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టే. దురదృష్టవశాత్తు, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ పుణ్యమా అని, 1975-1977 మధ్య కాలంలో, న్యాయ వ్యవస్థకున్న స్వతంత్ర అధికారాలకు భంగం వాటిల్లింది. "ముందస్తు నిర్బంధ చట్టాల" కు అనుగుణంగా అరెస్టు చేయబడి జైళ్లలో నిర్బంధించిన పౌరుల రాజ్యాంగ పరమైన హక్కులు కాల రాయబడ్డాయి. జబల్పూర్ అదనపు మెజిస్ట్రేట్-శివ కాంత్ శుక్లాల హెబియస్ కార్పస్ కేసు సుప్రీం కోర్టు ముందుకు విచారణకొచ్చింది. తీర్పిచ్చిన ఐదుగురిలో, నలుగురు న్యాయమూర్తులు ఏఎన్ రే, పిఎన్ భగవత్, వైవి చంద్రాచూడ్, ఎంహెచ్ బెగ్ ప్రభుత్వ సర్వాధికారాలను సమర్థించారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరహక్కుల ఉల్లంఘన జరిగినా తప్పులేదన్న రీతిలో తీర్పిచ్చారు. జస్టిస్ ఖన్నా మాత్రం, విచారణ జరపకుండా నిర్బంధంలో వుంచడం పౌరుల వ్యకి స్వేచ్ఛ పై ఆంక్షలు విధించడమేనని తన తీర్పులో చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి, చట్ట ప్రాధాన్యత తెలియ చేయడానికి, భవిష్యత్ రోజుల విజ్ఞతకు, మెజారిటీ నిర్ణయం భవిష్యత్ లో సరిదిద్దడానికి, తన భిన్నాభిప్రాయం ఉపయోగపడుతుందని ఖన్నా అన్నారు ఆ రోజున. అదే జరిగిందిప్పుడు.

తన భిన్నాభిప్రాయం కోర్టులో తెలియచేయడానికి ముందు, తానివ్వబోయే తీర్పును పరోక్షంగా ప్రస్తావిస్తూ, బహుశా తనకు రావాల్సిన సుప్ర్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా, తనకు దక్కకుండా పోయే అవకాశాలున్నాయని సోదరితో అన్నారట జస్టిస్ ఖన్నా. ఆయన అనుమానమే నిజమైంది. జనవరి 1977 లో, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందరికంటే సీనియర్ న్యాయమూర్తైన జస్టిస్ ఖన్నా పేరును సిఫార్సు చేయలేదు. అంతవరకు వస్తున్న సాంప్రదాయానికి ఇందిర ప్రభుత్వం స్వస్తి పలికింది. జరిగిన అన్యాయానికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తూ జస్టిస్ ఖన్నా తీసుకున్న నిర్ణయం, నేటికీ-ఏ నాటికి, సహచర భారత దేశ న్యాయ వ్యవస్థకు చెందిన వారిలో ఒక సాహసోపేత వ్యక్తిగా గుర్తింపు తెచ్చింది. ఇందిరా గాంధి ఓటమి తర్వాత జస్టిస్ ఖన్నా కొంతకాలం లా కమీషన్ చైర్మన్ గా, కొంతకాలం చరణ్ సింగ్ మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పిటిఐ సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారాయన. జైల్ సింగ్ పై ప్రతి పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడి పోయారు. ఎమర్జెన్సీ రోజుల్లో సుప్రీం కోర్టు హెబియస్ కార్పస్ పిటీషన్ కేసులో ఖన్నా వెలిబుచ్చిన "భిన్నాభిప్రాయం", దరిమిలా 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా రూపొంది, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగంలోని 20, 21 ఆర్టికల్స్, ఎమర్జెన్సీ నిబంధనల పరిధి నుంచి తొలగించడ జరిగింది.

బహుశా జస్టిస్ ఖన్నా గురించి అప్పట్లో అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసిన కధనం పౌరహక్కులు కోరుకునే అందరికీ మార్గదర్శకంగా పేర్కొన వచ్చు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి పద్దెనిమిది సంవత్సరాల స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామ్యానికి, సర్వ సత్తాక స్వతంత్ర జాతికి, గుర్తుగా ఎవరో ఒకరు-ఎప్పుడో ఒకప్పుడు, జస్టిస్ ఖన్నా జ్ఞాపకార్థం శాశ్వతంగా వుండే "స్మారక స్థూపం" నిర్మించడానికి పూనుకుంటారని పేర్కొంది న్యూయార్క్ టైమ్స్. స్వతంత్ర న్యాయ వ్యవస్థ నిరంకుశ ప్రభుత్వానికి లొంగి పనిచేయడమంటే, ప్రజాస్వామ్యం నశించిపోయే దిశగా ఆఖరి అడుగు వేసినట్లే అని కూడా వ్యాఖ్యానించింది ఆ పత్రిక.

ఎమర్జెన్సీ విధించి పలువురిని నిర్బంధించి జైళ్లలో నిర్బంధించిన దరిమిలా, హెబియస్ కార్పస్ పిటీషన్ల రూపంలో చాలా మంది డిటెన్యూలు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన హక్కులకు భంగం కలిగిందని, తమ హక్కులను పునరుద్ధరించి విడుదలకు ఆదేశాలిప్పించాలని వారు కోరారు. అయితే, ఎమర్జెన్సీ విధించు తూ, రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులో, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ, తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు పేర్కొనడంతో, వివిధ హైకోర్టులు, భిన్నాభిప్రాయాలను వెల్లడించాయి. ఎమర్జెన్సీ ఉత్తర్వులున్నప్పటికీ పౌరుడు కి వున్న రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరగడానికి అంగీకరించని కొన్ని హైకోర్టులు, నిర్బంధాన్ని న్యాయస్థానాల్లో డిటెన్యూలు సవాలు చేయవచ్చని అభిప్రాయ పడ్డాయి. రాజ్యాంగపరమైన మౌలిక అంశం ఇమిడి వున్నందున సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. మెజారిటీ న్యాయమూర్తులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని న్యాయ మూర్తులు అన్నారు. స్వేచ్ఛ "చట్టం ఇచ్చిన కానుక" లాంటిదని, అదే చట్టం ఆ కానుకను వెనక్కు తీసుకోవచ్చునని వారంటారు. తాత్కాలికంగా పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగినంత మాత్రాన, సుప్రీం కోర్టు-హైకోర్టుల అధికారాలకు భంగం కలిగిందని భావించరాదని కూడా న్యాయ మూర్తులు పేర్కొనడం విశేషం. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ఉత్తర్వులకనుగుణంగా, డిటెన్యూలకు హెబియస్ కార్పస్ పిటీషన్ ద్వారా కోర్టును ఆశ్రయించడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేస్తూ, అంతర్గత భద్రత కాపాడడం రాజ్యాంగ రీత్యా చెల్లుబాటవుతుందని అన్నారు.

అల నాడు అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఈ నాడు, అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఆస్వాదించే హక్కు, అనుభవించే హక్కు, భంగం కలిగినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, దేశంలోని ప్రతి పౌరుడికి తాత్కాలికంగానైనా రద్దు చేసే అధికారం ఎవరికీ వుండరాదు. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు మళ్లీ తలఎత్తకూడదు. ప్రభుత్వ-ప్రభుత్వేతర మానవ హక్కుల సంస్థలు, వ్యక్తులు నిరంతరం ఆ దిశగా కృషి చేసిన నాడే ఒక కన్నభీరన్ కు, ఒక ఎస్ ఆర్ శంకరన్ కు, ఒక బాలగోపాల్‌కు మనం నిజమైన నివాళులు అర్పించిన వాళ్లమౌతాం. End

Saturday, September 25, 2010

రాజకీయ ఆజానుబాహుడు-విజయభాస్కర రెడ్డి: వనం జ్వాలానరసింహా రావు

సెప్టెంబర్ 27, 2010 న కోట్ల విజయభాస్కర రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా

కోట్ల విజయ భాస్కర రెడ్డి మరణించి అప్పుడే తొమ్మిదేళ్లయింది. ఐనా ఆయన మన మధ్య ఇంకా కదలాడుతున్నట్లే వుంది. కేవలం తన కంటిచూపుతోనే ఆత్మీయ తను పంచిపెట్ట గలిగే వ్యక్తిత్వం ఆయనది. ప్రలోభాలకు-ఒత్తిళ్లకు లోనుకాకుండా తనకు తానే సాటి అనిపించుకున్న కోట్ల, రెండు పర్యాయాలు, రాష్ట్ర ముఖ్య మంత్రిగా, అనేక సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, విద్యార్థి నాయకుడుగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, లాఠీ దెబ్బలు తిన్న కోట్ల జీవితాంతం అవే స్వతంత్ర భావాలు కనబరచారు. అడ్వొకేట్‌గా పనిచేస్తూనే, రాజకీయ రంగంలో ప్రవేశించారు.ఆరు సార్లు కర్నూలు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు, డోన్, పాణ్యం, పత్తికొండల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు కర్నూల్ జిల్లాపరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

పాత తరం నాయకులలో విజయభాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఎన్ టీ రామారావుకు ఖ్యాతినిచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, అంతకు పది పైసలకన్నా తక్కువ ధరకే ప్రవేశ పెట్టిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. అలాగే సారాను నిషేధించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత కాలంలో మద్య నిషేధానికి దారి తీసింది. ఈ నిర్ణయాలు ఆయన తీసుకోకపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు వాటిని పట్టించుకోక పోయేవారేమో!

కోట్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తొలుత, 1955 శాసన సభ ఎన్నికలలో పోటీ చేసి, టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం అవిశ్వాసం తీర్మానంలో ఓటమి చెందడానికి కారణమైన న్యాయ కంటి శంకర రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 1959 లో కర్నూల్ జిల్లా పరిషత్ మొదటి అధ్యక్షునిగా, మళ్లీ రెండో పర్యాయం 1964 లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. శాసన మండలి సభ్యుడుగా కూడా 1967 లో ఎన్నికయ్యారు. బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. 1977-1999 మధ్య కాలంలో ఆరు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి, పీవీ నరసింహా రావు మంత్రివర్గాలలో పనిచేశారు. 1983 లో నాలుగు నెలలు, 1992-1994 మధ్య కాలంలో రెండేళ్లకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా, వర్కింగ్ కమిటీ సభ్యునిగా, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి సభ్యునిగా, వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా సేవలందించారు. దక్షిణాది నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రెండుసార్లు ఎన్నికైన ఏకైక వ్యక్తి విజయభాస్కర రెడ్డి. తిరుపతి ప్లీనరీలో 1992 లో మొదటి పర్యాయం, కలకత్తాలో 1996 లో రెండో పర్యాయం వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారాయన.

కోట్ల విజయభాస్కర రెడ్డి గురించిన ఘటన ఒకటి అప్పట్లో ప్రచారంలో వుండేది. ఇందిరా గాంధి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో, సిండికేట్‌ నాయకులతో ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంలో నీలం సంజీవరెడ్డి అనుచరుడుగా పేరున్న కోట్లపై ఆమె దృష్టి పడింది. అప్పటికి ఆయన రాష్ట్రంలో ఆర్థిక మంత్రి మాత్రమే. ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధి పక్షం. సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీలో వున్నారు. ఆయనను సాక్షాత్తు ఇందిరా గాంధి ప్రతిపాదించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన వీవీ గిరికి "అంతరాత్మ ప్రబోధం" అనే నినాదంతో మద్దతు ప్రకటించారు. ఇందిరా గాంధి పిలుపు మేరకు విజయభాస్కర రెడ్డి ఆమెను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆమె నివాసంలో ఇందిరను కలిసి మాట్లాడుతున్న సమయంలోనే, సంజీవరెడ్డి అమెను కలిసేందుకు వచ్చారట. తనతో మాట్లాడడం పూర్తైన తర్వాత విజయభాస్కర రెడ్డిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా, వేరే ద్వారం నుంచి వెళ్తే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చారట. కోట్లకు, సంజీవరెడ్డికి ఉన్న అనుబంధం తెలిసిన ఆమె ఇరువురి స్నేహం చెడకుండా ఈ సలహా ఇచ్చిందంటారు. అయితే, కోట్ల మాత్రం తాను బహిరంగంగా ఇందిరకు మద్దతు తెలపడానికి వచ్చానని అంటూ వేరే ద్వారం నుంచి వెళ్లడానికి మర్యాదగా తిరస్కరించారట.

కోట్ల మరణించినప్పుడు సంతాపసభలో లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి చెప్పిన మాటలు మరువలేనివి. "ఆరడుగుల ఆజానుబాహుడు విజయభాస్కర రెడ్డి పార్లమెంటు సెంట్రల్ హాలుకు నడుచుకుంటూ వస్తుంటే, తెలుగు తేజం ఉట్టిపడుతుంది" అన్నారాయన.