Sunday, January 31, 2021

అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-42 : వనం జ్వాలా నరసింహారావు

 అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-42

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-02-2021)

దశరథ మహారాజు మంత్రులు బుద్ధిమంతులు-ప్రసిద్ధికెక్కిన వారు-ఇతరుల అభిప్రాయాన్ని వారిని చూస్తుండగానే తెలుసుకొనే శక్తిగలవారు-సదాచార సంపత్తిగలవారు-ధర్మమంటే ఆసక్తిగలవారు-లోకానికి మేలుచేసే ఆలోచనలున్న వారు-న్యాయాన్ని నమ్మేవారు-అపరాధాలు చేయనివారు-ఆలోచనలు చేయడంలో, చేసిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టగల సామర్థ్యమున్న వారు-ప్రజల దగ్గరనుండి లంచాలు పుచ్చుకోవాలని గాని, రాజ ద్రవ్యం అపహరించాలని గాని అనుకునేవారు కాదు. మిక్కిలి రాజభక్తిగలవారు. మొత్తం ఎనిమిది మంది మంత్రులు దశరథుడి కొలువులో వుండేవారు-వారి పేర్లు: అర్థసాధకుడు, విజయుడు, సిద్దార్థుడు, ధృష్టి, జయంతుడు, మంత్రపాలుడు, అశోకుడు, సుమంత్రుడు. సుమంత్రుడు తప్ప మిగిలి ఏడుగురు మంత్రులంతా ఒక ఎత్తు-సుమంత్రుడు ఒక ఎత్తు. దశరథుడికి చాలా ముఖ్యుడైన సుమంత్రుడికి అంతఃపురం ప్రవేశించే అధికారం వుంది. వశిష్ఠుడు, వాసుదేవుడు అనే ఇద్దరు దశరథుడి రాజ పురోహితులుగా వుండేవారు. ఇద్దరూ సూర్య వంశ పురోహితులుగా వుంటూ, రాజుల మేలుకోరి-వారు అభివృద్ధి చెందేందుకు అవసరమైన శుభకార్యాలు చేయించేవారు.

అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని పిలువబడే నాలుగు రకాలైన రాజ విద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్న దశరథ మహారాజు మంత్రులు, చేయకూడని పనులు చేసేందుకు సిగ్గుపడేవారై- ఇంద్రియ చపలత్వం లేకుండా మంచి నీతి మార్గం తెలిసినవారై-బుద్ధి సూక్ష్మత గల వారై- శాస్త్ర జ్ఞానాన్ని మంచిగా కలిగుండి-పరాక్రమంలో ఎదురులేని వీరులై-మంచి కీర్తిని సంపాదించి, రాజ కార్యాలను మనో వాక్కాయ కర్మలతో నెరవేరుస్తూ, తమను చూసేందుకు వచ్చినవారిని సంతోషంగా తామే ముందుగా పలుకరిస్తూ, బల సంపదలతో, దురాశనేది లేకుండా, ప్రాణాపాయ స్థితిలో కూడా నియమం తప్పకుండా ప్రవర్తించేవారు. దేశ విదేశాల్లో జరిగిన-జరుగుతున్న-జరగబోయే వార్తా విశేషాలను, వేగులవారి నుండి తెప్పించుకుని, విశ్లేషించి, ఏ విషయంలో ఎలా ప్రవర్తించాల్నో అలానే చేసేవారు. వ్యవహారం నడపడంలో సమర్థులు. వీరిలో నీతి-నిజాయితీ ఎంత మోతాదులో వుందోనని తెలుసుకోదల్చిన దశరథ మహారాజు, రహస్యంగా వీరిని చేసిన పరీక్షలన్నిటి లోనూ, వారు నిష్కళంక పరిశుద్ధులని తేలింది. దోషం చేసారని తెలిస్తే, తమ కొడుకులనైనా దండించకుండా విడవని పరిశుద్ధ మనస్కులు దశరథుడి మంత్రులు. దోషం చేయని శత్రువునైనా దండించరు. మంత్రులకు తెలియకుండా ఏ వ్యవహారం జరగదు. రాజుకు-రాజ్యానికి అవసరమైన ధనార్జన విషయంలోగాని, సేనలకు జీతాలు-బహుమానాలు ఇచ్చే విషయంలోగాని, సంపాదించిన ధనం వ్యర్థం కాకుండా రక్షించే విషయంలోగాని మంత్రులంతా కడు సమర్థతతో వుంటారు. దశరథ మహారాజు సభలో వుండి మంచి ఆలోచనలు ఇవ్వడంతోపాటు, యుద్ధ సమయంలోనూ వీరులై, తమ ప్రతాపాన్ని ప్రదర్శించేవారు. శత్రువులను జయించడంలోను, మిత్రులను రక్షించడంలోను ఉత్సాహం కనబరుస్తారు. రాజనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినందున, శుచులై-పురజనులను ధర్మ పద్ధతిలో రక్షించే ఔదార్యం కలిగిన ధైర్యవంతులనిపించుకున్నారు.

దోషం చేసినవాడు బ్రాహ్మణుడైనా-క్షత్రియుడైనా-ఇంకెవరైనా, చేసిన నేరానికి-దోషి యోగ్యతను బట్టి ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష అమలుపర్చేవారు. మంచిమాటలు చెప్పడంలోను, ఆలోచన చేయడంలోను మంత్రులందరూ ఐకమత్యంతో మెలిగేవారు. రాజు ఎంత సమర్థుడైనప్పటికీ, పురోహితులతోనూ-మంత్రులతోనూ ఆలోచించే రాజ్యపాలన చేసే విధంగా మసులుకునేవారా మంత్రులు-పురోహితులు.

వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన-చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు.

(సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే, లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో, అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే, రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి వాడికంటే రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు).

సముద్రాన్ని హనుమంతుడే దాటగలడా? : వనం జ్వాలా నరసింహారావు

 సముద్రాన్ని హనుమంతుడే దాటగలడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (31-01-2021) ప్రసారం  

సంపాతి మాట ప్రకారం సముద్ర తీరం చేరిన వానరులకు ఆ సముద్రాన్ని ఎలా దాటాలో అర్థం కాలేదు. “ఈ సముద్రాన్ని దాటగల మహాతేజం కలవాడెవరో? నూరామడల సముద్రాన్ని దాటి ఆ వానరుల ప్రాణభయం పోగొట్టగల మహాబలవంతుడు ఎవరో? అలాంటి సామర్థ్యంకల వానర శ్రేష్టుడు, సముద్రాన్ని దాటగలవాడు వుంటే ఆయన వానరులందరికీ ప్రాణదానం చేయుగాక” అన్న అంగదుడి మాటలకు జవాబుగా గవయుడు, గవాక్షుడు, సుషేణుడు, ద్వివిదుడు, మైందుడు, గజుడు, జాంబవంతుడు, గంధమాదనుడు, శరభుడు ఇలా అన్నారు. గజుడు తాను పది ఆమడల సముద్రాన్ని దాటగలనన్నాడు. గవాక్షుడు ఇరవై, గవయుడు ముప్పై, శరభుడు నలబై, గంధమాదనుడు ఏబై, మైందుడు అరవై ఆమడలు దాటగలమని చెప్పారు. ద్వివిదుడు డెబ్బై ఆమడలు, సుషేణుడు ఎనబై ఆమడలు దాటగలమని అన్నారు. ఆ తరువాత జాంబవంతుడు ఇలా అన్నాడు.

“కపులారా! నాకు పూర్వం గమనశక్తి వుండేది. ఇప్పుడు చాలా ముసలివాడినయ్యాను. యౌవనం పోయింది. ఏదెలావున్నా, రామలక్ష్మణులు, సుగ్రీవుడు మనం ఎలాగైనా ఈ కార్యాన్ని సాధిస్తామని నమ్మారు. కాబట్టి దీన్ని ఉపేక్షించరాదు. కాబట్టి ఇప్పటి నా శక్తి ఆలోచిస్తే, తొంబై ఆమడ దాటగల భుజ శక్తి వుండవచ్చునేమో అనిపిస్తున్నది. నా శక్తి ఇంతేనా? అనవద్దు. మీలాగే నేను వయసులో వున్నప్పుడు అసమానబలం, వేగంకలవాడినై వుండేవాడిని. ఆ వయసు గడిచిపోయింది. ముసలితనం వచ్చింది. గమనం తగ్గిపోయింది. బలం కూడా తగ్గింది. కాబట్టి నేనెంత ఉత్సాహం చూపినా ఇంతకు మించి పోలేను. తొంబై ఆమడ పోవడం వల్ల కలిగే లాభం ఏదీ లేదు”.

తానూ నూరామడ పోగలను కాని మరలి రాగలనో, లేదో, సందేహమన్నాడు అంగదుడు. అప్పుడు జాంబవంతుడు, “నువ్వు నూరామడ కాదు వేయామడ కూడా పోగలవు. మరల రాగలవు. అయినా నువ్వాపని చేయకూడదు. రాజు సేవకులతో పని చేయించాలి. కాబట్టి సేవకులు వూరికే కూర్చుండి రాజుకు పనులు చెప్పకూడదు. ఈ వానర సేనకంతా నువ్వు స్వామివి. మేమంతా ఇక్కడ వుండి నిన్ను పంపడం మాకు మర్యాదకాదు. అదే కాకుండా ఈ కార్యానికంతా ఆధారం నువ్వే. మా ప్రభువు కుమారుడివైనందున నువ్వు మాకు ప్రభువువే. కాబట్టి నిన్ను ముందు వుంచుకుని కార్యం సఫలం చేస్తాం” అని చెప్పాడు.

అంగదుడు జవాబుగా, “తాతా! నన్ను పోవద్దంటున్నావు. వేరేవారెవరూ పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మళ్లీ ప్రాయోపవేశమే మార్గమా? చావడం ఎందుకు వూరికి పోదామంటావా? సుగ్రీవుడి ఆజ్ఞ నెరవేర్చకుండా అక్కడికి పోతే మన ప్రాణాలుండవు. సుగ్రీవుడు దండించడానికి, రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలో చెప్పు” అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడిని కార్యోన్ముఖుడిని చేయడానికి ప్రోత్సహించసాగాడు. హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “సర్వశాస్త్రాలలో ప్రసిద్ధమైన పాండిత్య కల వానరవీర శ్రేష్టుడా! పవననందనా! ఎందుకిలా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూచున్నావు? రామకార్యంతో నీకు పనిలేదా? నువ్వు బలంలో, పరాక్రమంలో, తేజంలో, రామలక్ష్మణ సుగ్రీవులు ముగ్గురికీ సమానమైనవాడివి కదా? ఆ ముగ్గురు ఒక ఎత్తు, నువ్వొక్కడివే ఒక ఎత్తు కదా! పక్షిరాజైన గరుత్మంతుడి రెక్కలకు ఎంత బలం, వేగం వుందో నీ బాహువులకు కూడా అంతే వుంది. లోకంలో వుండే అందరికంటే తేజంలో, బుద్ధిబలంలో, ధైర్యంలో నువ్వే అధికుడివి. నీ శక్తి సామర్థ్యాలు నువ్వేల తెలుసుకోలేవు? దానికి కారణం ఏమిటో ఆలోచించు”.

         “అప్సరసలలో శ్రేష్టురాలైన ఒక ప్రసిద్ధ సుందరి శాపవశం వల్ల వానరస్త్రీగా అంజనాదేవి అనే పేరుతో  పుట్టింది. ఆమె కేసరి అనే వానర వల్లభుడికి భార్య అయింది. అత్యంత సౌందర్యవతైన ఆ వానర స్త్రీ ఒకానొక రోజున సంతోషంగా మనుష్యస్త్రీ  స్వరూపం ధరించి, అలంకరించుకుని, మెడలో పూల పూలదండలు వేసుకుని, మృదువైన సన్నటి చీర కట్టుకుని, పర్వత ప్రదేశంలో తిరుగుతున్నది. అప్పుడామె కట్టుకున్న ఎర్రటి అంచుకల పచ్చని దువ్వలువ కొండగాలికి మెల్లగా జారిపోయింది. ఆమె అందమైన ఆకారం చూసిన వాయుదేవుడు, ఆమె భుజాలను పట్టుకుని గట్టిగా కౌగలించుకున్నాడు”.

“ఆమె అప్పుడు భయపడి ‘ఎవ్వడు నా పాతివ్రత్యానికి హానికలిగించాలని చూస్తున్నాడు?’ అని అంది. వాయుదేవుడప్పుడు ‘నీమీద మనస్సు కలిగి నేను కౌగలించుకున్నాను. అంతమాత్రాన నీ పాతివ్రత్యానికి హానిలేదు. నువ్వు భయపడవద్దు. నేను నిన్ను ఎప్పుడూ తాకే వాయుదేవుడిని. నీకు దీనివల్ల కీర్తి కలుగుతుంది. ఈదడంలో, దాటడంలో నాకు సమానమైన కొడుకు, మిక్కిలి వేగంగా పోయేవాడు, పరాక్రమవంతుడు, బుద్ధిబలం కలవాడు నీకు పుట్టుతాడు’. అని చెప్పగా నీ తల్లి మనసులో సంతోషించి అక్కడినుండి వెళ్లిపోయి, ఒక కొండ గుహలో వానర శ్రేష్టుడివైన నిన్ను కనింది”.

“అసమాన కీర్తికలవాడా! ఒకనాడు నువ్వాఅడవిలో ఉదయిస్తున్న సూర్యుడిని చూశావు. అది పండు అనుకున్నావు. నువ్వు ఆకాశానికి ఎగిరి మూడొందల యోజనాలు పోగా సూర్య కిరణాల వేడికి నీ దేహం తపించినప్పటికీ లక్ష్యం చేయకుండా సూర్యుడిని సమీపించగా ఇంద్రుడు కోపంతో నీమీద తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం దెబ్బకు నీ ఎడమ చెంప గాయపడ్డది. అప్పటినుండి నీకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. నీకు కలిగిన బాధ చూసి కోపంతో వాయుదేవుడు కొంచెం కూడా సంచరించకుండా స్తంబించి వుండిపోయాడు. దేవతలు కలతచెంది వచ్చి, వాయుదేవుడిని సమాదానపర్చడానికి ప్రయత్నించారు. అప్పుడు వానరేంద్రా! నిన్ను చూసిన బ్రహ్మ నీకు శస్త్రాలతో మరణం లేకుండా వరాలిచ్చాడు. ఇంద్రుడు నువ్వు కోరేవరకూ నీకు మరణం రాకుండా వరం ఇచ్చాడు. నువ్వు కేసిరికి క్షేత్రజుడివి. వాయుదేవుడికి ఔరసుడివి. కాబట్టి గొప్ప తేజస్సుతో దాటులు వేయడంలో నీ తండ్రైన వాయుదేవుడికి సరితూగుతావు”.

“నాయనా! మాకు ప్రాణదానం చేసి మమ్మల్ని రక్షించు. నువ్వీ సమయంలో రక్షించకపోతే మేమంతా చస్తాం. రామలక్ష్మణులు కూడా చనిపోతారు. వారికొరకు విలపిస్తూ అయోధ్యలోని అందరూ చస్తారు. ఇంతమంది ప్రాణాలు నీచేతిలో వున్నాయి. నువ్వు ధైర్యంలో, కార్యసాధనలో, సామర్థ్యంలో రెండో గరుత్మంతుడివి. కొండలు, అడవులతో సహా వున్న ఈ భూమండలాన్ని త్రివిక్రమావతార సమయంలో ఇరవైఒక్క సార్లు ప్రదక్షిణగా తిరిగావు. నువ్విప్పుడు సమస్త సద్గుణాలు కలవాడివి. భూమ్మీద ఉన్నవారిలో బలంలో, దూరం పోవడంలో నువ్వే గొప్పవాడివి. నిన్ను మించినవాడు లేడు. ఏదీ నీ విజృంభణం, పరాక్రమం చూపించు. మా హనుమంతుడు ఇంతటివాడు కదా అని ప్రత్యక్షంగా చూసి సంతోషిస్తాం. వానరోత్తమా లెమ్ము. ఈ సముద్రాన్ని దాటు. ఈ వానరసేనలు నీ వేగాన్ని, పరాక్రమాన్ని చూడడానికి ఆశతో వున్నారు. వీరి కోరిక తీర్చు. నీ శక్తి చూడడానికి కోరికగా వున్నారు వానరులు కాబట్టి నువ్వు ఉపేక్షించ వచ్చా?

(ఉత్తిష్ఠ హరి శార్దూల లంఘ యస్వ మహార్ణవమ్....అనే వాల్మీకి రామాయణంలోని ఈ మాటల ఆధారంగా వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణ రచనకు పూనుకున్నారు)

జాంబవంతుడు ఇలా ప్రోత్సహించగా, ప్రేరేపించగా ఆ క్షణంలోనే హనుమంతుడు విజృంభించాడు. వానరులు సంతోషంగా చూస్తుంటే తన దేహాన్ని పెంచాడు.

         నూరామడల వెడల్పుకల సముద్రాన్ని దాటడానికి బలం పెంచుకుని, విజృంభిస్తిన్న హనుమంతుడిని వానరులు చూసి తమ దుఃఖాన్ని వదిలి, సంతోషంచి కిల-కిలమని చప్పుడు చేస్తూ ఆంజనేయుడిని పొగిడారు. ఆంజనేయుడు దేహాన్ని పెంచి విజృంభించగా వానర శ్రేష్ఠులు మేలు-మేలని పొగిడారు. హనుమంతుడు వానరుల మధ్యనుండి లేచి, వానరులలో పెద్దవారికందరికీ నమస్కారం చేశాడు.

         ఆ తరువాత ఆంజనేయుడు తన పరాక్రమం గురించి ఇలా అన్నాడు.“ సముద్రాన్ని దాటడానికి నాకు సమానమైన వారు లేరు. నా తండ్రికి నేనే సమానమైన వాడిని. మేరు పర్వతానికి వెయ్యి సార్లు ప్రదక్షిణ చేసి రావాల్నా? సముద్రంలోని నీళ్లు చేతులతో ఎగజల్లి, కొండలతో, అడవులతో, మడుగులతో నిండిన భూమిని ముంచాల్నా? నేను పొయ్యేటప్పుడు నా పిక్కల వల్ల కలిగిన గాలితో మొసళ్లతో కూడిన సముద్రాన్ని ఆకాశానికి ఎగజిమ్మాల్నా? ఆకాశంలో వేగంగా తిరుగుతున్న గరుత్మంతుడిని వెయ్యి సార్లు ప్రదక్షిణ చేయాల్నా? ఇక్కడి నుండి ఎగిరిపోయి పొడుస్తున్న సూర్యుడిని సమీపించి ఆయన పడమటి కొండ చేరే లోపల నేను ఆకడికి పోయి ఆయన నెత్తిమీద వున్నప్పుడు ఎదురు రావాల్నా? అక్కడి నుండి భూమ్మీద దిగకుండా ఇక్కడికి రాగలను”.

“నా బలవేగంతో ఆకాశాన సంచరించే వాటినన్నిటినీ దాటి పోగలను. నువ్వు గింజంత తునకలయ్యేట్లు భూమిని చీల్చాలా? సముద్రాన్ని ఎండబెట్టాలా? పర్వతాలను చేతులతో పిండి-పిండిగా దంచాలా? తొడల వేగంతో భయంకరమైన సముద్రాన్ని నావెంట వచ్చేట్లు చేయాల్నా? భయంకరమైన దేహం కల ఆంజనేయుడిని ఏమని అనుకుంటున్నారు? రివ్వున నేను ఆకాశంలో పోతుంటే, తీగల్లో, చెట్లలో, వున్న పూలు ఆ వేగానికి తటాలున తెగి నా వెంట వస్తున్నప్పుడు నేను పోయే మార్గం నక్షత్రాలతో దీర్ఘమైన ఆకాశంలాగా చూసేవారికి కనిపిస్తుంది. ఆకాశంలో పైకి ఎగురుతూ, కిందికి దిగుతూ నేను పోయేటప్పుడు ప్రాణికోటులన్నీ ఆశ్చర్యంతో స్పష్టంగా నన్ను చూడగలవు. సముద్ర జలాలను సల-సల వుడికేట్లు చేస్తూ, మహా వేగంగా మేఘాలను అదరగొట్టుతూ వానరులారా! నేను సముద్రాన్ని దాటుతాను. మీరు చూస్తూ వుండండి”.

“బలంలో, వేగంలో వాయువుకు, గరుత్మంతుడికి సమానుమైన వాడిని. నా వెంట పక్షిరాజైన గరుత్మంతుడు, వాయువు తప్ప మరెవ్వరూ రాలేరు. నేను నిమిషంలో ఆకాశానికి ఎగిరి నిరాధారంగా సముద్రాన్ని దాటేటప్పుడు త్రివిక్రమావతారుడైన విష్ణుమూర్తి లాగా ప్రకాశిస్తాను. సీతాదేవిని చూడలేక పోయామే అన్న విచారాన్ని వదలండి. అపాయం లేదు. సంతోషంగా వుండండి. నా అంతఃకరణం ఉత్సాహంగా వుంది. అంతఃకరణం నిర్మలంగా వుంది, ఉత్సాహపూరితంగా కార్యం అవుతుందని చెప్పితే తప్పక జరుగుతుంది. వాయువేగ, గరుడవేగాలకంటే అధికమైన వేగంతో వెయ్యి యోజనాల సముద్రాన్నైనా దాటగలనని భావిస్తున్నాను. అలాంటప్పుడు నూరు యోజనాలు ఒక లెక్కా? పునాదితో సహా లంకానగారాన్ని కూడా పెరికి ఈడ్చుకుని రాగలనని సందేహం లేకుండా తోస్తున్నది”.

ఈ విధంగా మేఘగంభీరధ్వనితో చెప్తున్న వానరాదిపతిని, మహాతేజుడిని చూసి, వానరులంతా ఆశ్చర్యపడి చాలా సంతోషించారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి, “ఈ వానర మండలమంతా నీకు కార్యసాధనకై, నీకు మంచి దీవెనలు ఇస్తున్నది. మునుల అనుగ్రహ ప్రభావం వల్ల, వానర వృద్ధుల అభిప్రాయం వల్ల, గురువుల దయ చేత, కపిశ్రేష్టా! నువ్వీ మహాసముద్రాన్ని దాటి కీర్తితో ప్రకాశిస్తావు. నువ్వు చేయబోయే కార్యం తపస్వులకు, సాధువులకు సంతోషమైనది. కాబట్టి వారు నిన్ననుగ్రహిస్తారు. కులానికి కీర్తి తేబోతున్నావు కాబట్టి కులవృద్ధులు నిన్నుగ్రహిస్తారు. ఇలాంటి మహాత్ముడు మనకు శిష్యుడయ్యాడు కాబట్టి గురువులు నీమీద దయ చూపుతారు. ఈ బలంతో నువ్వు సముద్రాన్ని దాటుతావు. కీర్తి సంపాదిస్తావు”.

         అప్పుడు ఆంజనేయుడు వానరులతో సహా మహేంద్ర పరవటం కొండ మీదికి పోయాడు. పోయాడు. అక్కడ నానారకాల చెట్లతో, పొదలతో, సకల రకాల మృగాలతో, ఫల-పుష్పాల చెట్లతో, జల ప్రవాహాలతో, సింహాలు, పులులు తిరుగుతూ వున్న, పక్షుల కోలాహలంతో నిండిన, మదించిన ఏనుగులున్న గొప్ప ప్రదేశంలో హనుమంతుడు సంచరించాడు. ఆంజనేయుడి పదఘట్టనతో పీడించబడి, సింహంతో కొట్టబడ్డ ఏనుగులాగా, ఆ పర్వతం వుంది. ఆ పర్వతం తారుమారై, చెదిరిన రాలుగలదై, నీటి వంకలను కక్కింది. భయపడిన మృగాలు, కదులుతున్న చెట్లు, ఎగిరిపోయే పక్షులు, మధుపానసక్తులైన గంధర్వ నాగ దంపతులు, బొక్కల్లో దూరే పాములు కలిగి, దొర్లుతున్న రాళ్లు ఒకదానితో ఒకటి  తగులుతుంటే అవి చాలా బాధపడి నిట్టూర్పులు విదిచాయి. ఆ పర్వతం ధ్వజంతో కూడిన దానిలాగా భయం కలిగించాయి. ఆ పర్వతాలు ఒంటరిగా చిక్కిన బాటసారిలాగా వున్నాయి. అప్పుడు వానరశ్రేష్టుడైన హనుమంతుడు లంకకు పోవాలని నిశ్చయించుకున్నాడు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

Saturday, January 30, 2021

కురుపాండవ కుమారుల అస్త్ర విద్యా సందర్శనం భారతంలో ఒక అద్భుత ఘట్టం: వనం జ్వాలా నరసింహారావు

 కురుపాండవ కుమారుల అస్త్ర విద్యా సందర్శనం

భారతంలో ఒక అద్భుత ఘట్టం

ఆస్వాదన-4

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-01-2021)

కురు పాండవులు ఒక్కటిగా కలిసి విలువిద్యలు నేర్చుకున్న గురువులైన కృపాచార్యుల, ద్రోణాచార్యుల జన్మ వృత్తాంతం ఆసక్తికరంగా తెలుసుకోవాల్సిన విషయం.

గౌతముడి అనే మహాముని కొడుకు శరద్వంతుడు మహా నిష్ఠతో తపస్సు చేస్తున్నప్పుడు దాన్ని భగ్నం చేయడానికి దేవేంద్రుడు ‘జలపద అనే యౌవనవతిని పంపాడు. ఆమెను చూసి పరవశుడైన శరద్వంతుడి వీర్యం ఒక రెల్లు గుంటలో జారిపడి రెండు భాగాలుగా చీలింది. దాన్నుండి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. ఒకనాడు వేటకు వచ్చిన శంతన మహారాజు వారిని చూసి, బ్రాహ్మణ పిల్లలుగా భావించి, ఇంటికి తీసుకుని వచ్చి పెంచాడు. వారిలో ఒకరికి కృపుడని, ఇంకొకరికి కృపి అని పేర్లు పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన సంతానమని చెప్పి, కృపుడికి ఉపనయనం చేశాడు. వేదాలు, అస్త్ర శస్త్ర విద్యలు నేర్పించాడు. అలాంటి కృపాచార్యుడిని భీష్ముడు కురుపాండవులకు గురువుగా నియమించాడు.

భరద్వాజ మహాముని ఒకనాడు గంగానదిలో స్నానం చేస్తుండగా ఎదురుగా మహావిలాసంతో, పెనుగాలికి చీర తొలగిన నిర్మలమైన దేహంతో ఉన్న ఘ్రుతాచి అనే అప్సరసను చూసి కామించాడు. ఆ క్షణంలోనే అతడికి వీర్యస్ఖలనం కావడంతో ఆ వీర్యాన్ని తెచ్చి ఒక కలశంలో పెట్టాడు. దాన్నుండే శుక్రుడి అంశతో ద్రోణుడు పుట్టాడు. ద్రోణుడు, పాంచాలరాజైన వృషతుడి కొడుకు ద్రుపదుడు కలిసి వేదాలు చదువుకున్నారు. విలువిద్యలు నేర్చుకున్నారు. ఆ తరువాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు కాగా, ద్రోణుడు అగ్నివేశ్యుడి దగ్గర ధనుర్విద్యలు నేర్చుకున్నాడు. అనేక దివ్యాస్త్రాలు పొందాడు. కృపుడి చెల్లెలైన కృపిని వివాహం చేసుకున్నాడు. అశ్వత్థామ అనే కొడుకును కన్నాడు. తనను తాను పోషించుకోవడానికి ధనాపేక్షతో పరశురాముడి దగ్గరికి వెళ్లిన ద్రోణుడికి తన దగ్గర వున్న శస్త్రాస్త్రాలను ఇచ్చాడు ఆయన. దివ్యాస్త్రాలను, వాటిని ప్రయోగించే మంత్రాలను నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర. ఆ తరువాత ధన సహాయం కోరి స్నేహితుడైన ద్రుపద మహారాజు దగ్గరికి పోతే, అతడు ఐశ్వర్యగర్వంతో అమర్యాద చేసి పంపాడు.

ఏమీ చేయడానికి తోచక ద్రోణుడు హస్తినాపురానికి వచ్చాడు. ఆయన వచ్చిన సమయంలో కౌరవపాండవ కుమారులు చెండాట ఆడుకుంటూ వుండగా వారి బంగారు బంతి బావిలో పడింది. అది బయటకు తీయలేక సతమవుతున్న సమయంలో ద్రోణుడు తన బాణపరంపర విద్యతో దాన్ని బయటకు తీసి ఇచ్చాడు వారికి. ముందు ఒక బాణాన్ని బంతికి నాటుకునే విధంగా కొట్టి, ఆ బాణం చివర మరో బాణాన్ని, దాని చివర ఇంకొకదాన్ని, ఇలా బాణాల తాడు చేసి దాన్ని బయటకు లాగాడు. రాజకుమారులు ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకునిపోయి భీష్ముడికి జరిగినదంతా చెప్పారు. తాను తన కొడుకుకు పాలు కూడా పోయలేని స్థితి, ద్రుపదుడి దగ్గరకు పోయిన సంగతి, అతడి తిరస్కారం, హస్తినకు రావడం అంతా చెప్పాడు. ద్రోణుడికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసిన  భీష్ముడు కుమారులను అతడికి శిష్యులుగా సమర్పించాడు.

కుమారులందరికీ ద్రోణుడు విలువిద్య నేర్పసాగాడు. వీరితో పాటు సూతుడి కుమారుడైన రాధేయుడు విలువిద్యా నైపుణ్యంలో అర్జునుడితో సమానంగా వుంటూ, అతడిని ద్వేషిస్తూ, దుర్యోధనుడితో స్నేహంగా వుండసాగాడు. ద్రోణుడి దగ్గర ఏకలవ్య శిష్యరికం చేస్తూ విద్య నేర్చుకుంటూ, విలువిద్యా రహస్యాలన్నీ  గ్రహిస్తున్న ఒక ఎరుకరాజు కొడుకును తనకు గురుదక్షిణగా ఇవ్వమని అతడి కుడి చేతి బొటన వేలు తీసుకుంటాడు ద్రోణుడు. ఆ విధంగా అర్జునుడికి సాటి ఎవరూ లేకుండా చేశాడు ద్రోణుడు.

శస్త్రాస్త్ర విద్యలన్నీ  సమగ్రంగా అభ్యసించి, కౌరవులు, పాండవులు ఆ విద్యలలో మంచి నేర్పరులయ్యారు. వాళ్ల నేర్పును సభలో తెలుసుకునే ఏర్పాటు చేయాలని ద్రోణుడు ధృతరాష్ట్రుడిని కోరాడు. దానికి ఆయన అంగీకరించి, కురుకుమారుల శస్త్రాస్త్ర విద్యా ప్రదర్శనకు, అందమైన రంగస్థలాన్ని, శాస్త్రప్రకారం సర్వాంగ సుందరంగా సిద్ధం చేయించాడు. ఒక మంచిరోజున శుభ ముహూర్తంలో వారి విద్యను వీక్షించడానికి అక్కడికి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, వ్యాసమహర్షి, బ్రాహ్మణ సమూహం, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు మొదలైన వారంతా వచ్చారు.

పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యుడి వెనుక, ధర్మరాజు పక్కన వయో ధర్మాన్ని బట్టి వరుసగా రంగమధ్యంలో నిలిచారు. ద్రోణాచార్యుడి ఆజ్ఞతో భీమ దుర్యోధనులు తమ గదా కౌశలాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి చూపారు. రాబోయే కురుపాండవ మహాసంగ్రామాన్ని స్పష్టంగా సూచించేదిగా వున్నది. ఆ తరువాత ద్రోణుడు తన ప్రియ శిష్యుడు ఆర్జునుడిని అతడి ధనుర్విద్యానైపుణ్యాన్ని చూపమన్నాడు. అస్త్ర విద్యలన్నిటిలో నేర్పరైన అర్జునుడు తన అస్త్ర విద్యా ప్రదర్శనను శోభాయమానంగా ప్రారంభించాడు. మొదలు అస్త్ర విద్యా విచిత్రాలను ప్రదర్శించి, ఆ తరువాత గద, కత్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆహుతులను ఆశ్చర్య పరుస్తుండగా, కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని రంగ ద్వారంలో నిల్చి భుజం చరిచాడు.

అలా ప్రవేశించిన కర్ణుడిని వర్ణిస్తూ చక్కటి పద్యం రాశారు నన్నయ కవి ఇక్కడ ఇలా:

శా:      సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోభాసితున్

           బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ

           ర్యాలంకారు సువర్ణవర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణపూ

           ర్ణా లోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్

         (మద్ది చెట్టులాగా ఎంతో ఎత్తైనవాడు, సహజ కవచ కుండలాలతో బాగా ప్రకాశించేవాడు, బాల సూర్యుడిని పోలినవాడు, ధనుస్సును ధరించిన వాడు, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్న వాడు, శౌర్యమే అలంకారంగా కలవాడు, బంగారు వన్నె కలవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచి గుణాలు కలవాడు అయిన కర్ణుడిని చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్య పడ్డాడు).


నన్నయ రాసిన ఈ పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు ఇలా రాశారు: “మహాభారతంలో ఇది ఒక ప్రసిద్ధ పద్యం. నన్నయ నాటకీయ రచనకు పతాకవంటి పద్యం. హస్తినాపురరంగ మధ్యంలో ప్రేక్షకులు చూసిన కర్ణుడి మహనీయ వ్యక్తిత్వాన్ని, దీప్తిని చదువరుల కంటికి కట్టినట్లు రాసిన చాయాచిత్రం లాంటి పద్యం. నన్నయ ప్రసన్నకథాకవితలో స్థిరచిత్రవర్ణశిల్పానికి ఈ పద్యం ఒక మచ్చు తునక”.

తాను కూడా అర్జునుడి లాగానే విద్యలు నేర్చుకున్నానని, ఆయన చూపిన అన్ని విద్యలు తాను కూడా ప్రజలు మెచ్చుకునేలా చూపుతానని అంటాడు. ద్రోణుడి అనుమతితో అర్జునుడు చూపించిన అస్త్రవిద్యా విశేషాలన్నీ అతి సులభంగా ప్రదర్శించాడు. దుర్యోధనుడు వెంటనే స్నేహ హస్తం చాచాడు కర్ణుడికి. కర్ణుడు అలాగే అని సమ్మతించాడు. అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలని వుందన్నాడు. అప్పుడు అర్జునుడికి, కర్ణుడికి వాగ్వివాదం అయింది. ఆ తరువాత కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం మొదలైంది. ఇద్దరూ భీకరమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఉపసంహరించారు. ఈ సందర్భంగా కుంతి స్పందన అద్భుతంగా వర్ణించాడు కవి నన్నయ.

ఇంతలో కృపాచార్యుడు కలిగించుకుని, కర్ణార్జునుల మధ్య నిలిచి, అర్జునుడు పాండురాజుకు, కుంతీదేవికి పుత్రుడనీ, కర్ణుడు అతడితో యుద్ధం చేయాలనుకుంటే అతడి తల్లిదండ్రుల వివరాలు చెప్పాలనీ, ఇద్దరూ సమానులైతే అర్జునుడు ఎదిరిస్తాడనీ అంటాడు. ఇక్కడ కృపాచార్యుడు అన్న మాటల పద్యం అద్భుతంగా రాశారు నన్నయ ఇలా:

చ:       కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుఁడు రాజధర్మ బం

ధుర చరితుండు నీ వితనితోడ రణం బొనరించెదేని వి

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు చెప్పినన్

దొర యగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్

         కృపాచార్యుడు అడిగినదానికి జవాబుగా, తాను సూతనందనుడినని, రాదేయుడినని  చెప్పడానికి సిగ్గుపడ్డాడు కర్ణుడు. వెంటనే దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి అర్హత రాజరికం అయితే తాను కర్ణుడిని అంగరాజ్యం ఇచ్చి రాజుగా చేస్తానని అంటాడు. అప్పటికప్పుడే భీష్మధృతరాష్ట్రులకు చెప్పి, వారి అనుమతితో, బ్రాహ్మణులతో కర్ణుడిని అంగరాజ్యాభిషిక్తుడిని చేయించాడు.  ప్రతిగా తానేం ఇవ్వగలనని అన్న కర్ణుడితో, దుర్యోధనుడు, లోకం కొనియాడేట్లు తనతో స్నేహం చెయ్యమంటాడు. కర్ణుడు దానికి మనసారా అంగీకరించాడు. కర్ణుడు తండ్రి అక్కడికి వచ్చి కొడుకును దీవించాడు.

         ఇంతలో భీముడు కలిగించుకుని, అంగరాజ్యం కర్ణుడికి అనుభవ యోగ్యం కాదని అధిక్షేపించాడు. కర్ణుడిని దూషించాడు. వెలవెల బోతున్న కర్ణుడికి అండగా దుర్యోధనుడు వచ్చాడు. ‘వాయువు వల్ల పుట్టిన బీమా అని భీముడిని సంబోధిస్తూ, ఎత్తిపొడుపుగా అన్న మాటలను చక్కటి పద్యంగా రాశారు నన్నయ కవి ఇలా:

         సీ:       శూరుల జన్మంబు సురల జన్మంబును నేరులజన్మంబు నేరుగా నగునె

                     మొగిని దధీచియెమ్మున బుట్టదయ్యెనే వాసవాయుధ మైన వజ్ర మదియు

                     గాంగేయు డన మరి కార్తికేయుం డన నాగ్నేయు డన రౌద్రు డనగ శరవ

                     నోద్భవుం డన గుహుం డుద్భవిల్లడె” శర స్తంబ జన్ముడు గాడె ధర్మవిదుడు    

           తే:       గృపుడు? ఘట సంభవుడు గాడె కీర్తిపరుడు వరుడు ద్రోణుండు? విప్రులవలన బుట్ట

                     రైరె సత్క్షత్రియులు ఘను లవని గావ? గడగి మీ జన్మములు నిట్ల కావే వినగ

         ఇలా అంటూ దుర్యోధనుడు, శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలుసుకోవడం సాధ్యమేనా  అని ప్రశ్నించాడు. కుమారస్వామి పుట్టుక, కృపాచార్యుడి పుట్టుక, ద్రోణుడి పుట్టుకలను ప్రస్తావించాడు. జన్మలతో పని లేదని, కర్ణుడు దివ్య లక్షణాలు కలవాడని, సహజ కవచ కుండలాలు కలవాడని, సామాన్యుడు కాదని అంటాడు. తన బాహుబలంతో కేవలం అంగ రాజ్యాన్నే కాకుండా, సమస్త భూమండలాన్ని పరిపాలించ సమర్థుడు అని అన్నాడు. ఇంతలో  సూర్యాస్తమయం అయింది. దుర్యోధనుడు కర్ణుడిని వెంటబెట్టుకుని ఇంట్లోకి వెళ్లాడు. పాండవులు, మిగిలిన అందరూ వెళ్లారు.

         కుంతీదేవి కర్ణుడిని చూసి గుర్తు పట్టినా, తన ప్రేమ బయట పడకుండా జాగ్రత్త పడింది.

         కర్ణుడిని స్నేహితుడిగా పొందిన దుర్యోధనుడు సంతోషించి, ఇక అర్జునుడి వల్ల భయం లేదనుకున్నాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, పంచమ-షష్టాశ్వాసాలు

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

సంపాతి వల్లే సీత జాడ తెలిసిందా? : వనం జ్వాలా నరసింహారావు

 సంపాతి వల్లే సీత జాడ తెలిసిందా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (30-01-2021) ప్రసారం

సీతాన్వేషణలో విఫలమై, నిరాశా నిస్పృహలతో  అంగదుడి ఆజ్ఞానుసారం ఏ ప్రదేశంలోనైతే వానరులు చావాలని నిర్ణయించారో, ఏ ప్రదేశంలోనైతే అంగదుడు దర్భల మీద పడుకుంటాడో, అక్కడే, దీర్ఘకాలం జీవించివున్న గద్దలకు రాజు, సంపాతి పర్వతగుహలో నుండి బయటకు వచ్చి, వానరులందరినీ సంతోషంగా చూశాడు. తానున్న చోటుకే దైవం కొత్త ఆహారాన్ని తెచ్చిందనుకున్నాడు. ఈ వానరులను దినానికి ఒకరిని వంతున వరుసగా చంపి తింటాను అనగా ఆ మాటలకు భయపడ్డ అంగదుడు హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “ఆంజనేయా! ఆహారం మీద ఆశకల ఆ పక్షిని చూశావా? సీతనే నెపంతో యముడే వానరులను చంపడానికి ఈ రూపంలో వచ్చాడు. మనమేమో శ్రీరాముడి కార్యం నెరవేర్చలేకపోయాం. ఇంతలో తటాలున ఈ ఆపద సంభవించింది. సీతాదేవికి మేలుచేయాలనుకున్న జటాయువుకు ఏం జరిగిందో మనందరికీ తెలసుకదా! అలాంటి గతే మనకిప్పుడు తటస్థించింది. రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికే ధర్మం తెలిసిన జటాయువు శరీరాన్ని విడిచి కీర్తి గడించింది. రావణాసురుడి చేతుల్లో యుద్ధంలో నరకబడి పక్షిరాజు జటాయువు చనిపోయి పరమపదానికి పోయింది. కాబట్టి ఆయనే పుణ్యాత్ముడు. దశరథుడు చావడం, సీతను రావణుడు అపహరించడం వల్ల జటాయువు చావడం, వీటన్నిటివల్ల మనకు ప్రాణాపాయం సంభవించింది”. నేలమీద పడిన వానరులు అంగదుడు చెప్పిన వృత్తాంతం వింటుండగా సంపాతి మనస్సు చలించి, పరితాపం కలగడంతో, ఇలా అన్నాడు.

         “అయ్యో! ఎన్ని రోజులకు నా తమ్ముడి పేరు వినడం జరిగింది! నా ప్రాణాలకంటే వాడు నాకు ప్రియుడు. వాడి మరణవార్త వినడంతో నా హృదయం చలించింది. దండకలో రావణాసురుడికి, వాడికి యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యుద్ధంలో వాడు ఎలా చనిపోయాడు? వానరా! ఆ కథంతా చెప్పే నువ్వెవరివి? మీరు గొప్ప మనస్సుతో నన్ను కొండ మీదనుండి కిందకు దింపమని వేడుకుంటున్నాను. నా తమ్ముడు మిక్కిలి బలశాలి. ఎన్నో సుగుణాలను తెలిసినవాడు. అతడిని మీరు పొగుడుతుంటే ఇన్నాళ్లకు ఇక్కడ వినగలిగాను. రామచంద్రమూర్తి తండ్రైన దశరథమహారాజుకు నా తమ్ముడు స్నేహితుడెలా అయ్యాడు? వానరులారా అదంతా వినాలని వుంది. వానర శ్రేష్టులారా! సూర్యకిరణాలతో నారెక్కలు కాలిపోవడంవల్ల నేను కొండ దిగలేను. నామీద కనికరం చూపి నన్ను మీదగ్గరకు తీసుకుపోండి”. వానరులలో కొందరు పోయి దాన్ని కొండమీదనుండి కిందకు దింపారు. అప్పుడు అంగదుడు దాంతో ఇలా అన్నాడు.

         “ఓ పక్షి శ్రేష్టమా! విను. దశరథమహారాజు కొడుకు, రామచంద్రమూర్తి, తండ్రి ఆజ్ఞానుసారం తన భార్యతో, తమ్ముడితో దండకారణ్యంలో ప్రవేశించాడు. ఆ సమయంలో రావణాసురుడు ఆ ముగ్గురూ జనస్థానంలో తిరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి భార్య సీతాదేవిని అపహరించుకుని పోయాడు. అలా తీసుకెళ్తున్న సమయంలో శ్రీరామచంద్రమూర్తి తండ్రికి స్నేహితుడైన జటాయువు జానకీదేవిని చూశాడు. ఆమెను విడిపించాలని ఆకాశంలో పోతున్న రావణుడిని ఎదుర్కుని వాడి రథాన్ని విరిచి ఆమెను భూమ్మీదకు దించాడు. అంతటితో ఆగకుండా రావణుడితో యుద్ధానికి దిగాడు. పక్షిరాజు రెక్కలను, యుద్ధంలో రావణుడు నరికాడు. అంతట జటాయువు మరణించాడు. రామచంద్రమూర్తి అతడికి అగ్ని సంస్కారాలు చేసి ఉత్తమలోకాలు ప్రసాదించాడు. ఆ తరువాత నా పినతండ్రి సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి వాలిని చంపాడు. ఆ తరువాత సీతను వెతకడానికి మమ్మల్ని దక్షిణ దిక్కుకు పంపాడు సుగ్రీవుడు. ఆమెకోసం మేం వెతికాం కాని ఆమె మాకు కనబడలేదు. కార్యం సాధించకుండా వెనక్కు తిరిగిపోతే మా ప్రాణాలు దక్కవు. కాబట్టి ఇక్కడే మరణిద్దామని నిశ్చయించుకున్నాం. ఈ మాట నిజం”. అని చెప్పాడు.

         మరణానికి సిద్ధమైన వానరులు కన్నీళ్లు కారుతుంటే దుఃఖపడుతూ తమ చరిత్రను తెలపగా సంపాతి వారితో ఇలా అన్నాడు. “రావణుడి చేతిలో చనిపోయిన జటాయువు నా తమ్ముడు. అతడి మరణ వార్త తెలిసికూడా రెక్కలు కాలిపోవడం వల్ల, ముసలివాడినైనందున, పగ తీర్చుకునే బలం లేనందున, ఏమీ చేయలేక ఇలా అనాథలాగా పడి సహించి వూరికే వున్నాను. పూర్వం వృత్రుడికి, ఇంద్రుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో మేమిద్దరం మా వేగం తెలుసుకోవడానికి, ఒకరినొకరు గెలవాలన్న కోరికతో ఆకాశానికి ఎగిరి, సూర్యమండలం సమీపించడానికి పోవడానికి ప్రయత్నించాం. చక్రాకారంలో గాలిలో తిరుగుతూ, ఆకాశాన మేం పోతున్నప్పుడు సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. అప్పుడు తమ్ముడు ఆ ఎండ వేడిని సహించలేక బాధపడ్డాడు. నేనప్పుడు ప్రేమతో అతడికి ఎండ తగలకుండా రెక్కలతో కప్పాను. ఫలితంగా నా రెక్కలు కాలిపోవడం, నేను వింధ్యపర్వతం మీద పడడం జరిగింది. నేనిక్కడ వుండడం వల్ల నా తమ్ముడి గురించిన వార్తలు వినలేకపోయాను”.

         ఇలా అంటున్న సంపాతితో అంగదుడు ఇలా అన్నాడు. “నువ్వు జటాయువు అన్నవే అయితే, నేను చెప్పినదంతా విన్నావు కదా! నీకు తెలిసుంటే, రావణుడు వుండే చోటు ఇక్కడికి దగ్గరలో వుందా? దూరంలో వుందా? చెప్పు”.

         అంగదుడి మాటలకు జవాబుగా వానరులకు సంతోషం కలిగించే మాటలు చెప్పాడు సంపాతి. “నేనిప్పుడు శౌర్యం లేనివాడిని. కాబట్టి నేను విశేష సహాయం మాత్రం చేయలేను. మాట సహాయం తప్పకుండా చేస్తాను. నాకు రావణాసురుడి విషయమే కాదు. రావణుడు తీసుకుని పోతుంటే నిడుపాటి కళ్ళుకల యౌవనవతిని, సమస్త భూషణాలతో ప్రకాశించే దానిని, కన్నీరు కారుస్తూ శరీరం మీద ఆభరణాలను ఒక్కటొక్కటే పారవేస్తూ బాధపడుతున్న ఒక స్త్రీని చూశాను. ఆమె పట్టుచీర రావణాసురుడి మీద పడుతుంటే గమనించాను. ఆమె రామా! లక్ష్మణా! అని ఏడిచింది. కాబట్టి ఆమె సీతాదేవి అని భావిస్తాను. ఆ రాక్షసుడు వుండే చోటు చెప్తా విను”.

         “రావణాసురుడు లంకాపురంలో వుంటాడు. సముద్రానికి ఇక్కడి నుండి నూరామడల దూరంలో ఒక ద్వీపం వుంది. అదే రావణుడు వుండే పురం. ఆ పురంలో, రావణాసురుడి అంతఃపురంలో, రాక్షస స్త్రీల కాపలాలో సీత దుఃఖిస్తున్నది. సముద్రం మీద నుండి దక్షిణ దిక్కుగా మీరు నూరామడలు పోతే, అక్కడ సముద్రమే అగడ్తగా కల లంక వుంటుంది. అక్కడికి పోయి రావణాసురుడిని చూసి, ఫలసిద్ధి పొంది రండి. మీ విస్తార పరాక్రమం చూపడానికి తొందరపడండి. ఆలశ్యం చేయవద్దు. నా జ్ఞాన దృష్టితో చూశాను. మీరు కార్యం సఫలం చేసుకుని రాగలరు”.

“మాకు స్వభావంగా ఇలాంటి దృష్టి కలగడానికి కారణం మేమేమో దూరంగా వున్న ఆహారం తినడానికి పోవాల్సి వుంటుంది. మాకు కావాల్సిన ఆహారం సమీపంలో దొరకదు. ఆ కారణాన భగవంతుడు మాకు దూరదృష్టి ఇచ్చాడు. రాక్షసుడు లోకం నిందించే పని చేశాడు. వానరులారా! దానికి తగ్గ విధంగా మీరు చేయబోయే కార్యం నా తమ్ముడిని చంపినడానికి బదులు కావాలి. సముద్రాన్ని దాటే ఉపాయం వెతకండి. సముద్రం దాటి లంకలో వున్న సీతను చూసి ధన్యులై జై అంటూ కిష్కింధకు మరలి పొండి. చనిపోయిన నా తమ్ముడికి సముద్ర జలంతో తర్పణం చేయాలి. కాబట్టి మీరు నన్ను సముద్రం దగ్గరికి తీసుకుని పొండి”. సంపాతి చెప్పిన విధంగానే వానరులు అలానే చేశారు. మళ్లీ ఆయన వున్న చోటుకు తెచ్చి దింపారు. సీతాదేవి వార్త తెలియడం వల్ల వానరులు సంతోషించారు.

అప్పుడు జాంబవంతుడు లేచి నిలబడి సంపాతితో ఇలా అన్నాడు. “సీత ఎక్కడ వుంది? ఎవరైనా చూశారా? ఆమెను అపహరించిన రాక్షసుడు ఎక్కడివాడు? పక్షిరాజా! అంతా చెప్పి వానరులను రక్షించు. వజ్రసమానమైన రామచంద్రమూర్తి బాణాలను ఆ మూఢుడు లక్ష్యం చేయడం లేదు”.          జాంబవంతుడి ప్రశ్నకు ఇంతకు ముందే సమాధానం చెప్పిన సంపాతి, సీతాపహరణం గురించి తాను విన్నది, కన్నది, సీత వుండే ప్రదేశం గురించి మళ్లీ చెప్పాడు.

         “వానరులారా! వినండి. రెక్కలు విరిగినవాడినైనందున నేనీకొండమీదే వుంటాను. ఇలాంటి నా మీద పితృ భక్తివల్ల నా కొడుకు సుపార్శ్వుడు ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. ఒకనాడు ఆకలి వేసి ఆహారానికి ఎదురు చూస్తుండగా సూర్యాస్తమానమైన తరువాత ఆహారం తేకుండానే నా దగ్గరికి వచ్చాడు. ముసలివాడికి కోపం ఎక్కువ కాబట్టి దప్పికతో వాడిని నిందించాను. నన్నాతడు శాంతపరచి ఏమన్నాడంటే, తాను మహేంద్ర పర్వతం దగ్గర వున్న సమయంలో ఎవరో ఒక స్త్రీని తీసుకు పోవడం చూశాడట. వాడు రావణుడనే రాక్షస రాజని సిద్దులు అంటుంటే విన్నాడు నా కొడుకు. ఆ సిద్దులే, దుర్నీతిపరుడైన రావణుడు రాముడి భార్య సీతను బలవంతంగా అపహరించుకుని పోతున్నాడని, రామా! లక్ష్మణా! అని ఏడుస్తున్న ఆ స్త్రీ సీతేనని అన్నారట. ఇలా వారన్నారని నా కొడుకు నాకు చెప్పాడు. వానరులారా! ఏది రామకార్యమో, అది నా సొంత కార్యమే! ఇది సత్యం. ఇందులో సందేహం లేదు. మీరు సుగ్రీవుడు పంపగా వచ్చారు. దేవతలకైనా మీరు అసాధ్యులు. మీకు అసాధ్యం లేదు. కాబట్టి ఆలశ్యం చేయవద్దు”.

తనకు రెక్కలు పోయిన విషయం చెప్పి అవి మళ్ళా ఎలా వస్తాయో నికాశరుడు అనే మునీశ్వరుడు తనతోఅన్న మాటలు చెప్పాడు. “ఇక్ష్వాకు వంశంలో దశరథరాజు పుట్తాడనీ, అతడికి రామభద్రుడు అనే కొడుకు కలుగుతాడనీ, ఆయన తండ్రి మాట ప్రకారం తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు వస్తాడనీ, ఆ రామచంద్రుడి భార్య సీతాదేవిని రాక్షసరాజు రావణాసురుడు అపహరిస్తాడనీ, రామదూతలైన వానరులు సీతాదేవిని వెతుకుతూ తను వుండే ప్రదేశానికి వస్తారనీ, వారికి సీతాదేవి వృత్తాతం తెలిపితే నాకు మేలవుతుందనీ, నేను ఈ ప్రదేశం వదిలి ఎక్కడికీ పోవద్దనీ, ఇక్కడే వుండాలనీ నిశాకరుడు నాకు చెప్పాడు. విస్తార కీర్తికల రామచంద్రుడిని చూడాలని ఆశ వుందికాని, అంతకాలం బతకడానికి మనస్సంగీకరించడం లేదు. కాబట్టి దేహాన్ని వదులుతాను” అంటాడు సంపాతి.

         ఇలా సంపాతి చెప్తుండగానే వానరులు చూస్తుంటే సంపాతికి రెక్కలు మొలిచాయి. తన రెక్కలను చూసుకుని సంపాతి సంతోషించాడు. “ఏవిధంగానైనే సరే, ఎంత కష్టపడైనా సరే మీరు సీతాదేవిని వెతకండి. నాకు రెక్కలు వచ్చిన వ్యవహారం చూస్తుంటే మీరు ఆయన చెప్పినట్లు సీతను చూడగలరని నమ్మకం కలుగుతున్నది. నాకు ఆజ్ఞ ఇస్తే నేను ఆకాశమార్గాన పోతాను”. అని చెప్పి సంపాతి వెళ్లిపోగా వానరులు మళ్లీ పౌరుషం తెచ్చుకుని సీతాదేవిని వెతకడానికి అభిజిత్ ముహూర్తానికి ఎదురు చూస్తూ ఆమె వున్న దిక్కుకు పయనించారు.

         రావణుడు వుండే స్థలాన్ని సంపాతి చెప్పడంతో, వానరులు సంతోషంగా విజృంభించి, పొంగిపోతూ, గంతులేస్తూ, పుణ్యాత్మురాలు సీతను చూడాలన్న కోరికతో సముద్ర తీరాన్ని చేరారు. అక్కడ దక్షిణ సముద్రాన్ని తేరిపార చూశారు. వానరుల దేహాలు పులకరించాయి. వివిధ రకాల వికార జంతు సమూహాలతో నిండిన గగుర్పాటు కలిగించే ఆసముద్రాన్ని చూసి, విచారపడి, ఇక ఏం చేయాలి అని, ఎలా దాన్ని దాటాలా అని భయపడ్డారు. అలా భయంతో, దుఃఖంతో, వానర సమూహాలు బాధపడుతుంటే వారిని చూసిన అంగదుడు వారికి ధైర్యం కలిగేట్లు ఇలా చెప్పాడు.

         “ఈ సముద్రాన్ని దాటగల మహాతేజం కలవాడెవరో? నూరామడల సముద్రాన్ని దాటి ఆ వానరుల ప్రాణభయం పోగొట్టగల మహాబలవంతుడు ఎవరో? అలాంటి సామర్థ్యంకల వానర శ్రేష్టుడు, సముద్రాన్ని దాటగలవాడు వుంటే ఆయన వానరులందరికీ ప్రాణదానం చేయుగాక. వానరులారా! మీరు బలవంతులలో ఉత్తములు. అధిక పరాక్రమం వల్ల పొగడబడిన వారు. గొప్ప వంశంలో పుట్టినవారు. ఇలాంటి మీకు ఎలా పోయినా, ఏసమయంలో పోయినా, పోలేని స్థలం లేదు. ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అందరం కలిసి దాటిపోదామా? అని అనుకుంటే, అంతా పోలేరేమోనని అనిపిస్తోంది. అంతా దాటగలిగితే అందరం కలిసే పోదాం. ఈ సముద్రాన్ని ఎవరెవరు వారి-వారి శక్తికొలది ఎంతమేరకు దాటగాలరో ఆలోచించి చెప్పండి” అని అన్నాడు.

         అంగదుడి మాటలకు వానర వీరులు ఎవరికీ వారే ఆ అవకాశం తీసుకోవాలని ముందుకు రాసాగారు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)