Sunday, March 31, 2024

సదాచార జీవన ప్రవాహిణి By గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు (సజీవ వాహిని సనాతన ధర్మం by వనం జ్వాలానరసింహారావు పుస్తక సమీక్ష) : ఆంధ్రప్రభ (01-04-2024)

 సదాచార జీవన ప్రవాహిణి

గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు

ఆస్థాన పురోహితులు, భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం

ఆంధ్రప్రభ (01-04-2024)

శ్రీ రామాయనమః

శ్రీమతే రామానుజాయ నమః

సనాతనం-సదాయతనం

అపౌరుషేయమైన వేదమే అఖిల ధర్మాలకు మూలం. సనాతన ధర్మానికి అదే ఆలవాలం. ఆ వేదోక్త ధార్మిక కర్మ విశేషాల జీవన విధానమే సనాతన ధర్మం. ‘సనాతనమేనమాహుః ఉతాద్యస్యాత్ పునర్ణవః’ అన్నారు. ఇది సనాతనమైనది అయినా ఇప్పటికీ నిత్యనూతనమైనదే అని అథర్వ వేదం చెపుతోంది. సనాతనధర్మానికికల వైలక్షణ్యమిది. కాలం చెల్లిన ధర్మం కాకుండా సదాతనమై, సదాయతనమై, ఆచరించబడే కర్మవిశేషమే సనాతన ధర్మం.

‘సర్వకాలే సనాప్రోక్తా విద్యమానే తనో భిదా! ..... సర్వత్ర సర్వకాలేషు విద్యమాన స్సనాతనః’

 సర్వకాలములందు అనుష్ఠానయోగ్యమైన శ్రుత్యుక్త ధర్మమే సనాతన ధర్మం..అని నిఘంటుకారులనిర్వచనం.అందుకే ఇది సజీవవాహిని. సదాచార జీవన ప్రవాహిణి.

సత్య, ధర్మాలు రెండూ ఈ వైదిక సంస్కృతికి జీవనాడులు. సత్యం వచనీయం, ధర్మం ఆచరణీయం. సత్యం వద, ధర్మం చర అనే తైత్తిరీయోపనిషత్ తాత్పర్యమిదే. సత్యం అనేది సదైకరూపం. మార్పులేనిది, మార్చరానిది. ధర్మం అనేది ప్రత్యేక పరిణామశీలం. వివిధమైనది, విలక్షణమైనది. దేశాన్నిబట్టి, కాలాన్ని బట్టి, పాత్రతను బట్టి, శ్రుత్యనుగుణముగా, స్మృత్యనుసారముగా విభిన్నమైనది.

        ‘దేశకాల పాత్రతా మనుసృత్య యో విధీయతే స ధర్మః’ అనే ధర్మ నిర్వచనానికి తాత్పర్యమిదే. వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, వ్యక్తిధర్మాలు, విశేషధర్మాలు, అనే నాలుగు విధాల నానారూపాత్మకం, ఈ ధర్మం. ఈ ధర్మాలన్నీ సదాయతనాలు. సత్ పదార్దమే ఉనికిగా కల్గినవి. సత్ అనగా వేదోక్త దైవం. శ్రీ భగవద్ రామానుజులు కీర్తించినట్లు వివిధ విచిత్రానన్తా శ్చర్య మయమైన ఈ జగత్తునకు కారణభూతుడైన భగవంతుడికే సత్ అని పేరు. సదాత్మకమై, తదుపాసనాత్మకమైన పావన జీవన సంవిధానమే ఈ సనాతన ధర్మం. అందుకే ఇది సనాతనము--సదాయతనమూ.

        ఆయతనమనగా దేవస్థానం-వేదస్థానం-యజ్ఞస్థానము అని నిఘంటువులు నిర్వచించాయి. ఈ మూడింటి వైభవాన్ని, ప్రాభవాన్ని సులభతమమైన శైలిలో అందిస్తున్న చక్కని కోశమిది. వేదం నుంచి ప్రబంధం దాకా అనే దృక్కోణంతో సనాతనధర్మం లోని వివిధాంశాలను కరబదరసమానం చేసిన చక్కని కోశమిది. కొండవంటి ఈ సంస్కృతియొక్క ఔన్నత్యాన్ని అద్దంలో చూపించినంత అందంగా దిగ్దర్శనం చేయించే సంగ్రహస్వరూపమిది. సనాతన సంస్కృతికి చెందిన ప్రతి హిందువు తప్పకుండా చదువతగిన గ్రంథము. జిజ్ఞాసువులకు కూడా సముచితమైన విధంగా తగు సమాచారాన్ని అందిస్తుందనడంలో ఏవిధమైన అతిశయోక్తి లేదు. 

శ్రీమాన్ వనం జ్వాలా నరసింహారావు గారు చక్కని శ్రీ సంప్రదాయ కుటుంబానికి చెందిన  వారు. విద్యావేత్తలు. ప్రభుత్వాధినేతలకు కూడా మార్గదర్శనం చేయగల మేధావులు. పరిణతి పొందిన పాత్రికేయ పితామహులు. ప్రసిద్ధిని పొందిన రచయితలు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించగల ఆత్మగుణసంపన్నులు.

అలాంటి నిండైన వారినుండి వెలువడిన వెలకట్టలేని విలువలమూట....సజీవవాహిని-సనాతనధర్మం అనే ఈ గ్రంధము. ఇది ప్రతిఒక్కరు తప్పక చదువవలసిన కోశముగా నేను సంభావించుచున్నాను.

భద్రాచల దివ్యక్షేత్రముతో తరతరాల భక్తి భాంధవ్యముకల శ్రీ వనంవారికి మా భద్రాచల సీతారామచంద్ర మహాప్రభువు ఇతో2ధికముగా శక్తియుక్తులను, భక్తి ప్రపత్తులను ప్రసాదించుగాక! అని ప్రార్ధిస్తున్నాను.

{{భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి

సజీవ వాహిని సనాతన ధర్మం (వేదం నుండి ప్రబంధం దాకా)

వనం జ్వాలానరసింహారావు పుస్తక (ప్రచురణలో వున్న) సమీక్ష

{మహా, మహా పండితులు శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు గారు, ద్వివేది                 (కృష్ణ యజుర్వేదం, అథర్వవేదం), ఉభయ వేదాంతవిద్వాన్ (శ్రీభాష్యమ్, భగవద్విషయం), ఆమ్నాయవిద్వన్మణి (తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే), వేదాచార్య, వేదజ్యోతి, శ్రీ పాంచరాత్రాగమకోవిద, ఇత్యాదయః} ..... (98485 27268)}}

విష్ణుకుండిన వంశం, మాఠర వంశం (బ్రాహ్మణ రాజులు-9 & 10) : వనం జ్వాలా నరసింహారావు

 విష్ణుకుండిన వంశం, మార వంశం

(బ్రాహ్మణ రాజులు-9 & 10)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-04-2024) 

విష్ణుకుండిన వంశం

శాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని ఏకఛ్చత్రాదిపత్యంగా పాలించిన రాజవంశాలలో విష్ణుకుండిన వంశం పేర్కొనదగినది. మహోజ్వల చరిత్ర కల విష్ణుకుండిన రాజన్యుల చరిత్ర అనుపమానమైనది. అసదృశమైనది. ఇక్ష్వాకు వంశీయుల సామంతుడిగా లేదా మాండలికుడిగా వున్న విష్ణుకుండిన వంశ స్థాపకుడైన మహా రాజేంద్రవర్మ మహబూబ్ నగర్ మండలంలోని అచ్చంపేట తాలూకాలో వున్న అమరాబాదు ప్రాంతాన్ని పాలించాడు.

         శాలంకాయన వంశీయులలో బలహీనులైన రాజులు ఆంధ్రదేశాన్ని ఏలుతున్న కాలంలో విష్ణుకుండిన వంశీయులు కృష్ణానది ఉత్తరాన వున్న అత్యధిక భూభాగాలను ఆక్రమించుకుని రాజ్యాన్ని విస్తరించుకున్నారు. విష్ణుకుండిన రెండవ మాధవ వర్మ వాకాటక రెండవ పృధ్వీసేనచక్రవర్తి ఏకైక కుమార్తె వాకాటక మహాదేవిని వివాహమాడి విష్ణుకుండిన వాకాటక రాజ్యాలను పాలించాడు. బలవంతమైన రాజవంశాలతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకుని విష్ణుకుండిన వంశీయులు దీర్ఘకాలం ఆంధ్రదేశాన్ని పాలించారు. విష్ణుకుండినులు మొదట్లో అమరాబాదు ప్రాంత పాలకులుగా వుండి, రాజ్యాన్ని విస్తరించి, ఇంద్రపురిని రాజధానిగా పాలించారు. వీరికి దెందులూరు, వేల్పూరు, విజయవాడ, విజయస్కంథావారములుగాను, అమరావతి, బెజవాడ, ఇంద్రపురి రాజధానులుగాను వుండేవి.

         విష్ణుకుండిన వంశ స్థాపకుడు మహారాజేంద్రవర్మ, శాలంకాయన, ఆనందగోత్రిక, పల్లవ రాజన్యులు ఒకరితో ఒకరు కలహించే కాలంలో అమరాబాదు, ఏలేశ్వరం ప్రాంతాలలో తన అధికారాన్ని సుస్థిరపర్చుకుని, క్రీస్తుశకం 358 లో విష్ణుకుండిన రాజ్యాన్ని స్థాపించి, క్రీస్తుశకం 370 వరకు 12 సంవత్సరాలు పాలించాడు. మహారాజేంద్రవర్మ అనంతరం అతడి కుమారుడు మొదటి మాధవవర్మ క్రీస్తుశకం 370 లో సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం 398 వరకు 28 సంవత్సరాలు పాలించాడు. ఇతడు అమరాబాదు, కీసర, భువనగిరి ప్రాంతాల దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు.

         మొదటి మాధవవవర్మ తరువాత అతడి కుమారుడు మొదటి గోవిందవర్మ విష్ణుకుండిన రాజ్య పీఠాన్ని అధిష్టించినాడు. ఇతడు క్రీస్తుశకం 398 నుండి 435 వరకు సుమారు 38 సంవత్సరాలు పాలించాడు. గోవిందవర్మ గొప్ప విజేత. పరిపాలనాదక్షుడు. బౌద్ధమతానుయాయి. శాలంకాయన రాజ్యం క్షీణదశలో వుండగా, గోవిందవర్మ విజృంభించి, కృష్ణా-గోదావరీ నడులమధ్యన వున్న భూభాగాలను జయించి, రాజ్యాన్ని విస్తరించాడు. గుంటూరు ప్రాంతాన్ని కూడా జయించి మహాసామ్రాజ్య నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. మహారాజపదవిని అలంకరించాడు. మొదటి గోవిందవర్మ బౌద్ధమతానురక్తుడు. మహాజ్ఞాని. అనేక దేవాలయాలను నిర్మించాడు. విష్ణుకుండిన తోలిరాజులలో ఇతడు అగ్రగణ్యుడు.

         మొదటి గోవిందవర్మ కుమారుడు రెండవ మాధవవర్మ తండ్రి అనంతరం రాజయ్యాడు. ఇతడు విష్ణుకుండిన రాజన్యులలో అత్యంత ప్రతిభావంతుడు. అజేయుడు. సార్వభౌముడు. దక్షిణాపథం మాత్రమే కాకుండా దక్షిణ భారతాన్ని కూడా జయించాడు. ఇతడు వైదికమత నిరతుడు. 11 సార్లు ద్విగ్విజయ యాత్రలు చేసి శత్రురాజులను ఓడించి అశ్వమేధ యాగాలను, రాజసూయ యాగాలను చేశాడు. సువిశాలమైన విష్ణుకుండిన సామ్రాజ్య నిర్మాణానికి రెండవ మాధవ వర్మ అనేక రాజ్యాలను జయించాడు. విష్ణుకుండిన వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు. ఇతడి పరిపాలనాకాలం క్రీస్తుశకం 435-470. సుమారు 35 సంవత్సరాలు పాలించాడు.

         రెండవ మాధవవర్మ పెద్దకొడుకు దేవవర్మ తండ్రి అనంతరం సింహాసనాన్ని అధిష్టించి కొద్దికాలం మాత్రమే-3 సంవత్సరాలు, పాలించాడు. ఆయన తరువాత కుమారుడు మూడవ మాధవవర్మ క్రీస్తుశకం 473 లో సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం 522 వరకు, అంటే సుమారు 49 సంవత్సరాలు పాలించాడు. ఇతడి రాజధాని నేటి అమరావతి, నాటి అమరపురం. మూడవ మాధవవర్మ పరాక్రమవంతుడు. పల్లవులు ఆక్రమించిన భూభాగాలను ఇతడు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సుదీర్ఘకాలం పాలన చేసి, విష్ణుకుండిన ప్రతిష్టను ఇనుమడింప చేసి, వైదిక మతాన్ని ఆదరించాడు. ఇతడి పినతండ్రైన విక్రమేంద్రవర్మ మూడవ మాధవవర్మ మీద యుద్ధాలు చేసి విజయం సాధించి రాజయ్యాడు.

విక్రమేంద్రవర్మ క్రీస్తుశకం 522 నుండి 528 వరకు సుమారు 6 సంవత్సరాలు పాలించాడు. ఇతడు బౌద్ధమతాభిమాని. మహాకవి. గొప్ప యోధుడు. అతడి అనంతరం కుమారుడు ఇంద్రవర్మ రాజ్యానికి వచ్చాడు. ఇతడు గొప్ప శూరుడు. రాజ్య తంత్రజ్ఞుడు. అనేక యుద్ధాలలో విజయుడై, సుస్థిరమైన రాజ్యపాలన చేశాడు. ఇంద్రవర్మ విష్ణుకుండిన సామ్రాజ్యాన్ని 29 సంవత్సరాలు (క్రీస్తుశకం 528-556) పాలించాడు. అనేక దేవాలయాలను నిర్మించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలను దానంగా ఇచ్చాడు.

ఇంద్రవర్మ కుమారుడు విక్రమేంద్ర భట్టారకవర్మ రాజ్యానికి వచ్చి సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 556-570) పాలించాడు. ఇతడి పాలనాకాలమంతా యుద్ధాలలో, సత్కార్యాలు చేయడంలో గడిచింది. దాయాదులతో పోరాడాల్సి వచ్చింది. పల్లవులకు, విష్ణుకుండినులకు వున్న వైరం వల్ల ఆంధ్ర భూభాగాల మీద పల్లవ సింహవర్మ ప్రచండ సైన్యంతో దండెత్తాడు. విక్రమేంద్ర భట్టారకవర్మ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా యుద్ధంలో వీరవిహారం చేశాడు. పృధ్వీమూలరాజు సహాయం చేయడం వల్ల పల్లవ సైన్యం ఛిన్నా భిన్నమై పోయింది.

తండ్రి అనంతరం విక్రమేంద్ర భట్టారక వర్మ కుమారుడు రెండవ గోవిందవర్మ రాజయ్యాడు. క్రీస్తుశకం 570 నుండి క్రీస్తుశకం 576 వరకు, సుమారు 6 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. గోవిందవర్మ పరాక్రమశాలి. రెండవ గోవిందవర్మ కుమారుడు నాల్గవ మాధవవర్మ తండ్రి అనంతరం క్రీస్తుశకం 576 లో సింహాసనాన్ని అధిష్టించి, సుదీర్ఘకాలం పాలించాడు. అశ్వమేధ యాగాలు చేశాడు. చాళుక్యులు ఆంధ్రదేశాన్ని ఆక్రమించే నాటికి మాధవవర్మ ముసలివాడు. అయినప్పటికీ వీరావేశంతో యుద్ధంలో పోరాడి క్రీస్తుశకం 623 లో మరణించాడు.

నాల్గవ మాధవవర్మ కుమారుడు మంచన భట్టారకుడు తండ్రి అనంతరం రాజై, సామంత, మాండలికులను సమీకరించుకుని, చాళుక్యులతో పోరాటం కొనసాగించాడు. రాజధాని లేని రాజుగా, అనుచరుల సహాయంతో సైన్యాన్ని సమకూర్చుకుని, చాలాకాలం యుద్ధాలు చేసి, చివరకు జయసింహ వల్లభుడి చేతిలో చనిపోయాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 623-624. ఇతడితో విష్ణుకుండిన రాజ్యం అంతరించింది.   

మార వంశం          

           ఖారవేల మహారాజు అనంతరం కళింగ దేశం మార వంశీయుల పాలనలోకి వచ్చింది. సముద్ర గుప్తుడి దక్షిణాపథ, దక్షిణ భారత దిగ్విజయానంతరం కళింగ రాజ్యం చిన్న-చిన్న రాజ్యాలుగా తలెత్తాయి. మార వంశీయులు పిష్టపురం రాజధానిగా కళింగ దేశాన్ని ఏలసాగారు. కాలక్రమంలో వీరికి పిష్టపురం బదులుగా వర్థమాన పురం, సింహపురాలు రాజధానులుగా వర్ధిల్లాయి. ఈ వంశీయులలో మొదటి రాజు శక్తివర్మ. బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రికుల లాగా వీరు కూడా గోత్రనామాన్ని వంశనామంగా గ్రహించిన విప్రులు. శక్తివర్మ నాల్గవ శతాబ్దంలో కళింగ దేశాధీశుడయ్యాడు. ఇతడి రాజధాని పిష్టపురం. ఇతడు క్రీస్తుశకం 350-365 మధ్య కాలంలో 15 సంవత్సరాలు పాలించాడు.

         శక్తివర్మ కుమారుడు అనంతవర్మ క్రీస్తుశకం 365 లో కళింగ రాజ్యాధినేత అయ్యి ఒక సంవత్సరం మాత్రమే పాలించాడు. ఇతడు శక్తిమంతుడు కాదు. శాలంకాయన వంశీయులు, వాసిష్ట గోత్రీకులైన ప్రభువులు పిష్టపురం మీద దండయాత్రలు చేయడం వల్ల అనంతవర్మ తన రాజధానిని సింహపురానికి మార్చాడు. కాని ఎక్కువ కాలం రాజ్యభారం వహించలేదు. ఇతడి అనంతరం ఆయన కుమారుడు అనంత శక్తివర్మ సింహాసనం అధిష్టించాడు. ఇతడు కడు సమర్థుడు. ఇతడి కాలం నుండి సింహపురి మార వంశీయుల రాజధానిగా వర్దిల్లినది. సింహపురం సింగాపురంగా ప్రఖ్యాతిగాంచినది. ఇది శ్రీకాకుళం, నరసన్న పేటల మధ్యన వున్నది. అనంత శక్తివర్మ సింహపుర రాజ్యాన్ని అతి సమర్థవంతంగా క్రీస్తుశకం 365 నుండి క్రీస్తుశకం 394 వరకు 29 సంవత్సరాలు పాలించాడు.

         అనంత శక్తివర్మ తరువాత అతడి కుమారుడు చండవర్మ సింహపురాదీశుడు అయ్యాడు. ఇతడు కళింగ రాజ్యాన్ని క్రీస్తుశకం 394 నుండి క్రీస్తుశకం 400 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. చందవర్మ కుమారుడు ఉమావర్మ తండ్రి అనంతరం కళింగ రాజ్య పీఠాన్ని అలంకరించాడు. ఆయన రాజ్యారంభ కాలంలోనే సింహపురాన్ని కోల్పోయాడు. ఇతడు క్రీస్తుశకం 400 నుండి క్రీస్తుశకం 440 వరకు సుమారు 40 సంవత్సరాలు పాలించాడు.

         ఉమావర్మ అనంతరం అతడి కుమారుడు విశాఖవర్మ కళింగ రాజ్యాధికారం వహించాడు. ఇతడు కొద్దికాలం మాత్రమే పాలించాడు. విశాఖవర్మతో మార వంశీయుల పాలన అంతరించింది. కళింగ దేశాన్ని గాంగ వంశీయులు స్వాధీనపర్చుకున్నారు.   

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

Saturday, March 30, 2024

Raj Dharma vital for peace and prosperity : Vanam Jwala Narasimha Rao

 Raj Dharma vital for peace and prosperity

(‘Brahma Niti Shastra’ to ‘Rajyanga’ Raj Dharma is Sacred)

Vanam Jwala Narasimha Rao

The Hans India (31-03-2024)

{Sri Rama’s explanation of Raj Dharma to his younger brother Bharata, Kanika’s two-way Raj Neeti to Duryodhana, Sage Narda’s views on Raj Dharma as told to Dharmaraja, Raj Purohit Dhoumya’s politico ethics class to Pandavas when they were in exile, and more importantly, the various Dharmas preached by Bhishma from his death bed to Dharmaraja in Mahabharata’s ‘Shanti’ and ‘Anushasana’ chapters, all speak of the importance protecting and practicing Raj Dharma or Neeti even at the cost of one’s life}-Editor Synoptic Note

Vedas, Sri Ramayana, Mahabharata and Bhagavata have incorporated various aspects of great ‘Sanatana Dharma’ in different contexts, including ‘Raj Dharma’, or morals, ethics, and principles of governance to be strictly followed by the ruler. If only they are contextualized, suiting to changing times, keeping the spirit intact, then eternal peace and tranquility prevails incessantly everywhere. Sri Rama’s explanation of Raj Dharma to his younger brother Bharata, Kanika’s two-way Raj Neeti to Duryodhana, Sage Narda’s views on Raj Dharma as told to Dharmaraja, Raj Purohit Dhoumya’s politico ethics class to Pandavas when they were in exile, and more importantly, the various Dharmas preached by Bhishma from his death bed to Dharmaraja in Mahabharata’s ‘Shanti’ and ‘Anushasana’ chapters, are worth mentioning.

Kanika’s Raj Dharma was in the background and context of Kauravas’ poorer performance than Pandavas in the talent display of their learning experience, received from Guru Dronacharya. To pacify aggrieved Duryodhana, his wicked uncle Shakuni engaged Kanika to guide him about the further course of action. His Raj Dharma included qualities of king like: overriding power, adopting penal system, guiding people on the path of righteousness, well behaviour etc. One outstanding advice of Kanika was that Raj Dharma included entertaining even the worst enemy until he is required and once the necessity is thru, the same enemy ‘Shall be destroyed like a clay pot’ on a rock, absolutely without any hesitation!!!       

Raj Dharma advocated by Sage Narada was in the context of Dharmaraja’s initial days of governance from ‘Maya Sabha.’ Emphasising the essentiality of strict adherence by the King to the moral code and ethos established by his ancestors, Narada counseled him, among others, to know what constitutes Dharma-Artha-Kamas, to concentrate more on Dharma, to appoint eligible and efficient persons to assist in governance, to spend only a part of income but not more than it, to establish an independent news gathering and dissemination network etc.

Contents of Humble and Common Service Code, as stated by Purohit Dhoumya, to be followed by Pandavas in anonymity, in Virata Kingdom to serve the King in various capacities, are equally applicable even now, to everyone engaged in some job or other. The essence is that one needs to be utmost careful with the boss, enter the place of work cautiously and most properly, occupy seat that absolutely suits his position, dress and shape should not be deformed, should know the time and the context before speaking etc. Taking advantage of intimacy with the boss, one shall not exceed the limits and interfere in matters unconcerned etc. form part of the code.

On completion of Kurukshetra War, victorious Dharmaraja, following his coronation, on the advice of Lord Sri Krishna, approached Bhishma who was on the death bed made of Arjuna’s arrows (Ampa Shaiyya). He requested Bhishma to enlighten him the essence of omniscience, Vedas, Vedanta, and philosophical knowledge encompassing every aspect of ‘Raj Dharma.’

Bhishma underscored the equal importance of ‘Divine Grace’ and ‘Human Effort’ to achieve success. He said that the king who envisions peace and harmony will be successful and can get all comforts. The seven key components namely, head, minister, friend, treasury, state, fort, and strength, should be identified and managed appropriately by the king. King shall not blindly believe anyone, which does not mean to disbelieve everyone. Welfare, development, and safety of people shall be the priority of a king, said Bhishma.

Referring to ‘Brahma Niti Shastra,’ the ethical discipline and penal code, Bhishma said that initially people and king were protecting each other, but with the passage of time, gradually the Dharma got destroyed and people committed offences and destroyed Vedas. As a result, different gods (Devatas) prayed to Brahma to rescue them. In order to establish salvation universally. Brahma composed ‘Hundred Thousand Chapters of Ethics’ with Sapta Sopanas, Penal Code, Dvadasha Raja Mandalas and Panchopayas, known as ‘Brahma Niti Shastra.’

Subsequently, it was edited to 10,000 chapters by Virupaksha and named ‘Vaishalakshya.’ Later, Indra further edited it to 5.000 chapters. It was further shrunk by Brihaspati to 3,000 chapters and Shukracharya to 1,000 chapters. Finally, to enable its wide reach and comprehensibility, Maharshis abbreviated it to a greater extent. Having said this, Bhishma advised Dharmaraja to meticulously follow the principles enunciated in this. He said that, the king shall practice righteousness on the path of truth. And that is precisely was the Raj Dharma, said Bhishma.

When Lord Rama was in Chitrakoota, his brother, king designate Bharatha came to plead with him for his return to Ayodhya, abandoning the exile, and take over the reins of empire. During the conversation between the brothers, Sri Rama highlighted various aspects of ‘Raj Dharma’ which holds good cent per cent, even till this day. Broadly they are: keeping people happy and listening to them, offering salutations to elders, serving (Gurus) teachers, choose ministers with knowledge of moral code and Shastras, better IQ, capable of face reading etc.

Rama added that king is not supposed to deliberate on secrets either with everyone or with single individual, and not to disclose his thoughts before they take the shape of action. He shall not delay the work to such an extent that it spoils the work itself. It is better to have one intelligent and efficient person with the king rather than 1000 jokers. Important was, appointing adequate Tirthas as ministers, private secretary, prince, commander-in-chief, gate keeper, palace controller, superintendent of jails, revenue collector, judge, accountant general, Munsif, magistrate etc. In conclusion, Sri Rama advised Bharata that he should never, even at the cost of his life, deviate from the path of Dharma and ‘Raj Dharma.’

The Hindu concept of Triumvirate (Tri Murthy) consists of ‘Three Gods,’ Brahma, Vishnu and Maheswara (Shiva), believed to be manifestation of one Single Unique God, the Parabrahma or Virat-Swaroop, who is Omnipotent, Omnipresent and Omnicompetent. The Triumvirate independently and interdependently takes care of Creation (Srushti), Constancy (Sthithi) and Annihilation (Laya) of all living and non-living. A parallel may be drawn between the Trinity of Hindu Mythology and the organs of governance - legislature, executive and judiciary, the ‘Three Estates’ or the ‘Three Pillars’ of Indian democracy. This democratic Trinity shapes the destiny of our Great Nation. Our Constitution which is a mix of Ancient (Sanatana) and Modern (Adhunika) Dharmas, clearly defined the roles of these three institutions, and shall continue to be ever dynamic generally and in the context of adhering strictly to ‘Raj Dharma,’ to keep all Indians happy for ever and ever.

Former Prime Minister Late PV Narasimha Rao, according to his media advisor, late PVRK Prasad, invariably used to put one question, ‘Is it Constitutional’ whenever an issue concerning governance was brought to his notice. That was and is the greatness of our ‘Constitution’ which is nonetheless akin to ‘Brahma Niti Shastra’ or the ‘Brahma Ethical Discipline’ which fundamentally speaks among others, ‘The Raj Dharma’ too. Why not successors ‘Keep it Up’??

{Post Script: In the entire Globe, seldom there is an equivalent, to the Exceptional, Boundless, Brilliant, and Absolutely Righteous centered, Ancient Vedic ‘Way of Life’ as recorded meticulously, in the Indian, Hindu and Vedic Ethos. In other words, this was what the ‘Sanatana Dharma’ elucidated in detail in the invaluable Earliest Hindu Great Literatures, be it the Vedas or Ramayana or Mahabharata or Bhagavata or any other similar work. ‘Vedic Structure’ itself was considered as a ‘Noble Structure’ that has no comparison with any other structure globally. This Eternal, Everlasting, Secured, Flourishing for Ages, Intact ‘Way of Life’ has been perennially thriving like a Live Stream, irrespective of countless social rebellions from time to time. From Atheists of Vedic Times to the Oblivious and Intellectually Poor individuals of Modern Times, every attempt made to weaken ‘Sanatana Dharma’ ultimately ended in futile exercise, resulting in added resurrection}

 

Thursday, March 28, 2024

నిరంకుశత్వం వైపు పరిగెడుతున్న ప్రజాస్వామ్యం : వనం జ్వాలా నరసింహారావు

 నిరంకుశత్వం వైపు పరిగెడుతున్న ప్రజాస్వామ్యం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (29-03-2024)

ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు దిశగా గణనీయమైన పురోగతి ఏనాడో భారత ఉపఖండంలోనూ, సమీప తూర్పు దేశాల్లోనూ ఆరంభమైంది. సమాజంలో ‘స్వేచ్ఛ, ఆమోదయోగ్యత, సమానత్వం, సమగ్రత’ల ప్రాతిపదికగా, సనాతన భారతీయ ధర్మానికి అనుగుణంగా, పౌరులకు నాణ్యమైన, గౌరవప్రదమైన జీవనాన్ని లభించేలా, పరిఢవిల్లిన మహత్తర ప్రజాస్వామ్య భావన భారతదేశం స్వంతం. భారతదేశంలోని సర్వతంత్ర స్వతంత్ర గణతంత్ర రాజ్యాల నాటినుండే తొలినాటి ప్రజాస్వామ్య సంస్థల ఆవిర్భావం జరిగిందని చరిత్ర చెపుతున్నది. ప్రాచీన భారాతవనిలోనే ప్రజాస్వామ్య రాష్ట్రాలు ఉద్భవించాయని గ్రీక్ చరిత్రకారుడు డియోడోరస్ సహితం ధృఢపరచాడు.      

భారతదేశంతో సహా బ్రిటీష్ సామ్రాజ్య పరిధిలోని పలు దేశాలు, ఇంగ్లాడ్ రాజకీయవేత్త జాన్ బైట్ రూపకల్పన చేసిన పదబంధం, ‘పార్లమెంటుల మాతృక’ గా పిలువబడే ‘వెస్ట్ మినిస్టర్ నమూనా బ్రిటీష్ పార్లమెంట్’ విధానాన్ని స్వీకరించాయి. భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం, 1950 సంవత్సరంలో రాజ్యాంగం ఏర్పడినాక, సమాఖ్య విధాన పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, ఆధునిక ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. భారత ప్రధమ ప్రధాని, నవభారత నిర్మాత, జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యానికి పటిష్టమైన పునాదులు వేసినప్పటికీ, అడపాదడప అనేక అవాంతరాలను ఎదుర్కుంటూ నిలదొక్కుకుంది. ‘ఆధునిక ప్రజాస్వామ్యానికి ఆధ్య్దుడు’ గా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్గ్ వాషింగ్టన్ ను, మరో మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ను ప్రజాస్వామ్యాన్ని ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వంగా నిర్వచించిన వ్యక్తిగా పేర్కొంటారు. ఆంగ్లేయ తత్త్వవేత్త, వ్యావహారిక సత్తావాదం స్థాపకుడు జాన్ లాక్ ను కూడా ‘ప్రజాస్వామ్య పితామహుడని అంటారు.   

‘ఎన్నికల నిరంకుశ భావన పుణ్యమా అని, ప్రజలచే పాలన అనే స్ఫూర్తికి కాని, పౌరులకు తాము కోరుకునే, తమ గొంతు వినే వ్యవస్థగాకాని, ఆధునిక ప్రజాస్వామ్యం కట్టుబడిలేదనాలి. ప్రపంచం ప్రజాస్వామ్యయుతంగా మార్పుచెందుతున్నదన్న విస్తృతాభిప్రాయం పూర్తిగా ఆధారరహితమే అనాలేమో! ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దశ, దిశ విషయంలో ఆందోళన చెందుతున్న వ్యక్తుల్లో, పౌర సమాజ సంస్థలలో, మేధావుల్లో, రాజ్యాంగ నిపుణుల్లో, దినదినం పలు సందేహాలు ఊపందుకుంటున్నాయి. నిశితంగా పరిశీలించి చూస్తుంటే, అప్పుడప్పుడో, ఒక క్రమపద్ధతిలోనో, న్యాయ బద్ధమో, అన్యాయ బద్ధమో, నిర్వహిస్తున్న ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యానికి నిదర్శనం, గీటురాయి అనే అపోహ కలుగుతున్నది. కఠోర వాస్తవం ఏమిటంటే, ప్రపంచం మొత్తం ప్రస్తుతం ‘నిరంకుశత్వాలు, ప్రజాస్వామ్యాలు’ గా విభజన జరిగింది. వాస్తవానికి మనం అనుకుంటున్న మెజారిటీ ప్రజాస్వామ్యాలు కూడా దాదాపుగా ‘అర్థ నిరంకుశాలే. ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్న నేపధ్యంలో, దాని మనుగడ విషయంలో గణనీయమైన అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది.  

   పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల భాగస్వామ్యాన్ని, సలహా, సూచనలను స్వాగతిస్తారు. ప్రోత్సహిస్తారు. అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి పుష్కలంగా అవకాశాలు కలిగించి, విభిన్న ధృక్కోణాలకు విలువ ఇస్తారు. అలాంటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర తక్కువ నియంత్రణలదిగా, ప్రజలు నమ్మినదాన్ని, కోరుకున్న దాన్ని, సులభతరంగా పొందడానికి సహకరించేదిగా వుంటుంది. ప్రజలు తాము ఎంపికచేసుకున్న రాజకీయ పార్టీలోకాని, ఇతర సమూహాలలోకాని నిరభ్యంతరంగా చేరే అవకాశం వుంటుంది. ప్రజాస్వామ్యం పరిపక్వత చెందక, నియంతృత్వ ధోరణులు వున్న చోట, పార్టీ, ప్రభుత్వం, దేశంపై సంపూర్ణ నియంత్రణ చేసే ఒకే ఒక్క నాయకుడు వుంటాడు.

‘నిరంకుశ తరహా ప్రజాస్వామ్య నాయకత్వం, ‘ప్రజాస్వామ్య నియంతృత్వం’ అనే రెండు విచిత్ర ప్రజాస్వామ్య విధానాలు ఇటీవలికాలంలో ఆవిర్భవించి, పుంజుకుంటున్నాయి. ఈ రెండింటిలోనూ నిర్ణయాదికారాలన్నీ ఒకే ఒక్క వ్యక్తి (నాయకుడు) చేతుల్లో కేంద్రీకృతమై, క్యాబినెట్ సహచరులతో సహా, పౌర సంఘాల, బ్యూరోక్రాట్ల, మేధావుల, వివిధ రంగాలకు చెందిన నిపుణుల సూచనలు కూడా ససేమిరా పట్టించుకోని పరిస్థితి కలుగుతున్నది. భారతదేశానికి సంబంధించినంతవరకు ‘ప్రజాస్వామ్య నియంతృత్వం’ ఇందిరాగాంధీ పాలనలో మొదలైందని చెప్పాలి. ప్రాంతీయపార్టీల ఆవిర్భావంతో, వ్యవస్థాపకుడి తిరుగులేని ఆధిపత్యం ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరంగా మారిందనవచ్చేమో!  

స్వాతంత్ర్యానంతర భారతావనిలో రాజకీయ పార్టీల నిర్ణయాధికారం ఒక అద్భుతమైన ‘టీం వర్క్ లాగా వుండేది. కాంగ్రెస్ పార్టీ ‘పార్లమెంటరీ బోర్డ్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ‘పోలిట్ బ్యూరో కానీ, అలాంటి ఏర్పాటే వున్న జనసంఘ్ లేదా దాని రూపాంతరమైన భారతీయ జనతా పార్టీ కాని, ‘ఏకాభిప్రాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవి. క్రమేపీ ‘ఏకాభిప్రాయం అర్థమే మారిపోయి, ‘ఏక వ్యక్తి అభిప్రాయంగా, ఏకస్వామ్యంగా మారింది. ప్రజాస్వామ్యం, పార్టీలు, గెలుపు, ఓటముల ప్రాధమిక మౌలిక సూత్రాలను ఆచరించడం అరుదైపోయింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం కానీ, ఓడిపోవడం కానీ శాశ్వతం కాదనే సహజ ‘అద్భుతం అర్థం చేసుకోలేని దుస్థితి నెలకొన్నది. ఎవరూ శాశ్వతంగా అధికారంలో వుండరనీ, ఘోరంగా పరాజయం పాలవడం లేదా బ్రహ్మాండంగా విజయం సాధించడం అనే అంశం ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ నాయకుల తలకెక్కడంలేదు.  

ఒకానొక కాలంలో ఏ రాజకీయ పార్టీలోనైనా అంచెలంచెలుగా నిచ్చెన మెట్లు ఎక్కాలంటే పార్టీ ప్రాధమిక సభ్యత్వం తప్పనిసరి. అదిప్పుడు పూర్తిగా గత చరిత్ర. అలాగే సర్పంచ్ స్థాయి నుండి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగేవారు. ఇక ఇప్పుడు అన్నీ సత్వరమార్గాలే! చిలక్కొయ్యకు తగిలించిన చొక్కాలు మార్చినంత సులభం. మరీ చెప్పాలంటే, రసాయన శాస్త్రంలోని ‘సబ్లిమేషన్’ ప్రక్రియలో ఒక పదార్ధం నేరుగా ఘనస్థితి నుండి మధ్యస్థ ద్రవస్థితి దాటవేసి, వాయుస్థితికి మారడంలాగా. చాలామందిలో రాజకీయ భావజాలం కాని, నిబద్ధత కాని, అసలేలేదు. ఒక హార్డ్‌కోర్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తి, లేదా నిబద్ధతగల ఒక సెక్యులర్ పార్టీ సభ్యుడు, రాత్రికి రాత్రే సభ్యత్వంతో సంబంధం లేకుండా, మతతత్త్వ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాగే ఇటునుండి అటు మారుతున్నారు. అలా మారినవారికి వెంటనే పార్టీ టికెట్ ఇవ్వకూడదన్న నిబంధన పెట్టే ధైర్యం ఎన్నికల కమీషన్ కు ఏమాత్రం లేదు. పలుకుబడి కలవారికి, సంపన్నులకు, పార్టీ సభ్యత్వం తీసుకుని, కొంతకాలం వేచి వుండి, ఆ తరువాతే ఎన్నికలలో పోటీ చేయాల్సిన అవసరం లేనే లేదు. దీన్నే ఆంగ్లంలో ‘లీప్ ఫ్రాగింగ్ అంటారు. రాజకీయ పార్టీగా నమోదు చేసుకుంటున్నప్పుడు ఉన్నతమైన ఆదర్శాలను వల్లించని రాజకీయపార్టీ వుండదు. ఆచరణలో మాత్రం శూన్యం.  

ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగానూ, భారతదేశంలోనూ, కొన్ని రాష్ట్రాలలోనూ చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనల అంతరార్థాలను నిశితంగా అవగతం చేసుకున్నవారిని ఆందోళనకు గురిచేస్తున్నదని విశ్లేషకుల భావన. హిందు సమాజాన్ని అణచి వేయడం కొరకు, కాంగ్రెస్ పార్టీ ప్రాధమికంగా వక్రీకరించిన రాజ్యాంగాన్ని మార్చడానికి తమపార్టీకి 400 లోక్ సభ స్థానాలు అవసరమౌతాయని కర్నాటక బీజేపీ ఎంపి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా వున్నాయనాలి. బీజేపీ అధినాయకత్వం ఆ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిదంబరం ఆ మాటలు ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ముగింపు గా ముద్రవేశారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య నిర్మాణానికి కానీ, లౌకిక వ్యవస్థ మనుగడకు కానీ,  ఎలాంటి ముప్పు కలిగినా సహించరాదు.

డాక్టర్ ఎన్ భాస్కర రావు అనే ఒక సామాజిక పరిశోథనా మార్గదర్శి, ‘రెజ్యువెనేటింగ్ ద రిపబ్లిక్’ అనే తన ఆంగ్ల పుస్తకంలో ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యానిస్తూ-చాలామంది భారతీయులకు, అందునా యువతకి, స్వాతంత్ర్య సౌధం ఎంతమంది త్యాగాల పునాది మీద నిర్మించబడిందో అవగాహన లేదని అంటారు. వారికి స్వాతంత్ర్యం, గణతంత్రం, రాజ్యాంగం లాంటివాటి ద్వారా ప్రయోజనాలు పొందడం మాత్రమే కావాలని, నిజానికి ఇన్ని దశాబ్దాల కాలంలో దేశ గణతంత్ర పరిస్థితి ఒకేలా స్థిరంగా లేదని, మొదటి 25 సంవత్సరాలు ఒకే ఒక పార్టీ పెత్తనం నడిచిందని, తరువాతి 25 యేళ్లలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయని, ప్రస్తుతం ఒకే నాయకుడు, ఒకే పార్టీ అన్న లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని,  ఇదే పంథా మరొక 25 యేళ్లు సాగుతుందా? అన్నది ప్రజల ఊహాగానాలకే వదిలేద్దామని అంటారు. ఇలాంటి పరిస్థితి బహుశా ప్రజాస్వామ్య దేశాలన్నిటిలో ఉన్నదేమో!

ఇదిలా వుండగా,  ఏటా ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్య పరిస్థితుల మీద నివేదిక విడుదల చేసే ‘వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీస్ అనే సంస్థ తన నివేదికలో, నియంతృత్వం పరంగా ప్రపంచ దేశాలలో భారత్ ‘విశ్వగురు స్థానంలో వుందని పేర్కొంది, ఎన్నికలు జరిగే నియంతృత్వ దేశం స్థాయికి పడిపోయిందని, భారత్ అసలు ప్రజాస్వామ్య దేశంగానే లేదని తీర్మానించింది. అలాగే, మూడింట రెండువంతులకు పైగా భారతీయులు దేశంలో ‘నిరంకుశ లేదా ‘సైనిక పాలనకు మద్దతు ఇస్తున్నట్లు ‘ ప్యూ రీసర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇలాంటి కథనాలు భారతదేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి. END

{Additional Information......హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కులు లోయకు దగ్గరగా వున్న ‘మలానా’ అనే ప్రాచీన కాలంనాటి భారతీయ గ్రామాన్ని, ప్రపంచంలోని 'అతి పురాతన ప్రజాస్వామ్యాలలో ఒకటి'గా చెప్పుకుంటారు. జమ్లు అనే ఋషి, ఏనాడో రూపొందించిన నియమ, నిబంధనలకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి, ‘కనిష్ఠాంగ్’ అనే దిగువ సభ, ‘జయేష్‌తాంగ్’ అనే ఎగువ సభల వ్యవస్థీకృత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన జరుగుతున్నది ఇప్పటికీ గ్రామంలో. స్వతంత్ర న్యాయవ్యవస్థ కూడా వుందిక్కడ. ఉత్తర భారతదేశంలో పెరిగిన, సర్ జాన్ బెట్జెమాన్ భార్య, ఆంగ్ల యాత్రా రచయిత, పెనెలోప్ వాలెంటైన్ హెస్టర్ చెట్వోడ్ లేడీ బెట్జెమాన్, ఈ గ్రామం గురించి తన రచనల్లో వివరించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ గ్రామం ఉన్నప్పటికీ, దీనిని భారతదేశంలో భాగంగా గ్రామ ప్రజలు పరిగణించడంలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం, పరిణామక్రమం, ఆరోహణ, అవరోహణ, విలువల క్షీణత, ప్రజాస్వామ్య నియంతృత్వం మొలకలు, ప్రజాస్వామ్యం పేరుతో నిరంకుశ ధోరణులు అనేవి ఆసక్తికరమైన అంశాలు. మలానా గ్రామం విషయం అటుంచితే, ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటైన ఏథెన్స్ ను ప్రజాస్వామ్యానికి జన్మస్థలంగా పరిగణిస్తుంది చరిత్ర.

క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దినాటికే ఏథెన్స్ లో ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులువేసి, స్థాపించి, తీర్చిదిద్ది, ‘ఎథీనియన్ ప్రజాస్వామ్య పితామహుడిగా’ పేరు గడించిన క్లీస్టెనెస్ ఏథెన్స్ లోని గ్రామాలను పది తెగలుగా ఏర్పాటుచేసి, ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఎథీనియన్ కౌన్సిల్‌ను సంస్కరించి, పలు ప్రజాస్వామ్య సంస్కరణలను క్లీస్టెనెస్ ప్రోత్సహించాడు. ప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు పెరికల్స్ సహితం ఎథీనియన్ సమాజంలో ప్రజాస్వామ్య భావజాల వ్యాప్తికి దోహదం చేశాడు. అయినప్పటికీ, ప్రజాస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అని చెప్పుకునే ఏథెన్స్, ఏనాడూ పరిపూర్ణంగా ప్రజాస్వామికమైనదని అనలేము. సోక్రటీసు శిష్యులలో అగ్రగణ్యుడు, తత్త్వవేత్త,  పాశ్చాత్య సంస్కృతికి పునాదులు నిర్మించిన ప్లేటో మాత్రం పురాతన గ్రీసులో ప్రజాస్వామిక పాలనను వ్యతిరేకించాడు.

1933 సంవత్సరంలో అప్పటి జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్, నియంత హిట్లర్ ను ఆ దేశ చాన్సలర్ గా నియమించడాన్ని, ‘ప్రజాస్వామ్య విధ్వంసానికి బీజాలు పడ్డ అంశం గా పరిగణించారు. ఇటీవల 2024 మార్చ్ నెల మొదటివారంలో, అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' లో మాట్లాడిన దేశాధ్యక్షుడు జొ బైడెన్, ‘అమెరికాతో సహా యావత్ ప్రపంచానికి ట్రంప్‌ నేతృత్వంలో ప్రజాస్వ్యానికి ముప్పు పొంచి వున్నది అని తీవ్రంగా విమర్శించాడు. ‘మీరు ఏమి చేయాలనుకుంటే అదే చేయండి అని రష్యన్ నాయకుడు పుతిన్ తో ట్రంప్ చెప్పడానికి అభ్యంతరం తెలియచేశాడాయన. దాన్ని ఆయన ‘దారుణమైన, ప్రమాదకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యవహారంగా వర్ణించారు. ఇలాంటి వ్యాఖ్య కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజల భావాలను అర్థం చేసుకోకుండా ట్రంప్ లాంటి నాయకులు నిరంకుశంగా ప్రవర్తిస్తుంటే, బైడెన్ లాంటి నాయకులు దాన్ని నిష్కర్షగా విమర్శించడం, ఖచ్చితంగా దాన్ని వెలుగులోకి తేవడంలాంటివి ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైపోయాయి}

 

బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రిక వంశాలు (బ్రాహ్మణ రాజులు 6, 7 & 8) : వనం జ్వాలా నరసింహారావు

 బృహత్పలాయన, శాలంకాయన, ఆనందగోత్రిక వంశాలు

(బ్రాహ్మణ రాజులు 6, 7 & 8)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-03-2024)  

బృహత్పలాయన వంశం

ఇక్ష్వాకుల అనంతరం ఆంధ్ర దేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించినవారు బృహత్పలాయన వంశీయులు. మూడవ శతాబ్ది ఉత్తరార్థంలో కృష్ణా నదికి ఉత్తరాన వున్న భాగాలను ఈ వంశీయులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. జయవర్మ మహారాజు ఇక్ష్వాకుల సామంతుడు. ఇక్ష్వాకుల అనంతరం ఆంధ్ర దేశ భూభాగాలను ఆక్రమించిన పల్లవ రాజులను యుద్ధంలో ఓడించి, ఆంధ్ర దేశం నుండి తరిమి వేసి, జయవర్మ మహారాజు బృహత్పలాయన వంశాన్ని స్థాపించి సుమారు 15 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని పాలించాడు. ఆయన ఆ తరువాత ఆ వంశం వారు ఇంకెవరైనా పాలించారో లేదో ఆధారాలు లేవు. అతడితోనే బృహత్పలాయన వంశం అంతరించిందనాలి.

         జయవర్మ మహారాజు పల్లవ రాజులతో యుద్ధం చేసి, రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పి, చక్కటి పరిపాలన చేశాడు. జయవర్మ మహారాజు నిరంకుశుడు. కాకపొతే ప్రజాభీష్టాన్ని అనుసరించి, మంత్రుల సలహాలను పాటించి పరిపాలన చేశాడు. ఇతడి పాలనలో వేదం విదులైన విప్రులు గౌరవాదరాలు పొందారు. జయవర్మ మహారాజు స్వతంత్రుడు కావడానికి ముందర శాతవాహనులకు, తరువాత ఇక్ష్వాకులకు సామంతుడిగా వుంది, కృష్ణా నదీ దక్షిణ భాగాన్ని పాలించాడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు. పల్లవులతో జరిగిన ఒకానొక యుద్ధంలో జయవర్మ మరణించి ఉండవచ్చని చరిత్ర చెప్తున్నది.

         బృహత్పలాయనులు కృష్ణానదీ ముఖద్వారం దాకా తమ రాజ్యాన్ని విస్తరింప చేసి కూదూరును రాజధానిగా చేసుకొని ఆంధ్ర దేశాన్ని పాలించారు. కంటక శైలం, కోడూరు, అల్లోసైని మొదలైన పట్టణాలు బృహత్పలాయన రాజ్యంలో వుండేవి. బృహత్పలాయనుల కాలంలో ఆంధ్ర దేశంలో బౌద్ధ మతం రాజాదరణ లేక విదేశాలలో వ్యాపించింది. బృహత్పలాయన జయవర్మ పాలించిన కాలంలో ప్రజలు ప్రశాంతమైన జీవనం గడిపారు. ఆనాడు శైవ మతం ఆదరించబడి పోషించబడింది. బౌద్ధ, జైన మతాలు క్షీణించాయి. ఇక్ష్వాకు వంశ పతనానంతరం ఆంధ్ర దేశం పల్లవుల బారిన పడకుండా ఆంధ్ర ప్రజలను ఆదుకున్నది బృహత్పలయానుల వంశం.

శాలంకాయన వంశం

           ఆంధ్రదేశాన్ని శాతవాహనుల అనంతరం పాలించిన రాజ వంశాలలో శాలంకాయన వంశం పేర్కొనదగినది. ఈ వంశీయులు గోత్ర నామాన్నే వంశ నామంగా ధరించారు. శాలంకాయనుడు వేదర్షి. విశ్వామిత్ర సంతతి వాడు. ఈ వంశీయుల నామాంత్యంలో వర్మ పదం వుండడం వల్ల వీరు బృహత్పలాయన, ఆనంద గోత్రిక, కదంబ, విష్ణుకుండిన, పల్లవ రాజన్యుల లాగా బ్రాహ్మణులు. శాలంకాయనులు ప్రాచీనాంధ్ర గణాలలోని వారు. శాలంకాయన అంటే నంది అని అర్థం. వీరిది వృషభ లాంఛనం. శాలంకాయన రాజులు వరుసగా, విజయదేవ వర్మ, హస్తి వర్మ, నంది వర్మ, చండ వర్మ, విజయనంది వర్మ, విజయస్కంద వర్మలు. శాలంకాయనులు క్రీస్తుశకం 300 నుండి 440 వరకు పాలించారు.

         ఆంధ్రదేశ ప్రాక్తీర ప్రాంతాన్ని ఆక్రమించి వేంగీ నగరం రాజధానిగా శాలంకాయన వంశీయులు పాలించారు. వీరు శాతవాహనుల సామంతులు. వీరు కృష్ణా నదీ పరీవాహక ప్రాంత పాలకులుగా నియమించబడి, శాతవాహనుల తరువాత ఇక్ష్వాకుల సామంతులై, స్వతంత్రులై, బృహత్పలాయన జయవర్మ మరణానంతరం రాజ్యాన్ని విస్తృతపరచుకున్నారు.

         శాలంకాయన రాజ్య స్థాపకుడు విజయదేవ వర్మ. ఇతడు క్రీస్తుశకం 300 నుండి క్రీస్తుశకం 335 వరకు శాలంకాయన రాజ్యాన్ని పాలించాడు. ఇతడు ఇక్ష్వాకుల రాజ్య పతనానంతరం పల్లవులను ఎదిరించి, బృహత్పలాయన జయవర్మ మరణానంతరం వేంగిని ఆక్రమించి, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్రదేశం పల్లవాక్రాంతం కాకుండా తెలుగువారి స్వాతంత్ర్య పరిరక్షణ కొరకు ఇతడు శాలంకాయన వంశాన్ని స్థాపించాడు. ఇతడు అసహాయశూరుడు. అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు.

         విజయదేవ వర్మ తరువాత హస్తి వర్మ సింహాసనాన్ని అధిష్టించి సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 335-350) శాలంకాయన రాజ్యాన్ని పాలించాడు. ఇతడు వేంగి చుట్టుపక్కల వున్న అనేక సామంత రాజ్యాలను గెలిచి శాలంకాయన రాజ్యాన్ని విస్తరించాడు. హస్తి వర్మ అనంతరం ఆయన కుమారుడు నందివర్మ రాజై సుమారు 30 సంవత్సరాలు (క్రీస్తుశకం 350-380) పాలించాడు. ఇతడు పరాక్రమవంతుడు. సముద్రగుప్తుడి దండయాత్ర నేపధ్యంలో సామంతుల తిరుగుబాటును అణచి, కృష్ణా నదికి దక్షిణాన వున్న భూభాగాలను ఆక్రమించి, రాజ్య విస్తరణ చేశాడు. ఇతడు ధర్మ చింతన కలవాడు.

         నందివర్మ సోదరుడు దేవవర్మ ఆ తరువాత రాజ్య పీఠాన్ని అలంకరించాడు. సుమారు 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 380-395) పాలించాడు. ఇతడు అనేక యుద్ధాలలో విజయం సాధించి అశ్వమేధ యాగం చేశాడు. ఇతడి పాలనాకాలంలో అన్నగారి కుమారుడు, యువరాజుగా వున్న  అచండ వర్మతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈ జ్ఞాతుల పోరాటాన్ని చూసి సామంతులు స్వతంత్రులయ్యే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితులలో పినతండ్రి మీద యుద్ధం చేసి అచండవర్మ విజయం సాధించి రాజ్య పీఠాన్ని ఆక్రమించాడు. అచండవర్మ పాలన కొద్ది కాలం (క్రీస్తుశకం 395-398) మాత్రమే కొనసాగింది. అచండవర్మ సోదరుడు రెండవ హస్తివర్మ జాజ్ పుర ప్రాంతంలో రాజ ప్రతినిధిగా వుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించి శాలంకాయన భూభాగాలను ఆక్రమించి పాలించసాగాడు. హస్తివర్మ పాలనా కాలం క్రీస్తుశకం 395-405.

         హస్తివర్మ కాలంలోనే అచండవర్మ రెండవ కుమారుడు విజయనంది వర్మ పినతండ్రితో కలహిస్తూ, రాజ్యాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశాడు. ఫలితంగా శాలంకాయన రాజ్యం రెండుగా చీలింది. విజయనంది వర్మ వేంగి ప్రాంతాన్ని ఏలుతుండగా విజయస్కంద వర్మ తూర్పు తీర ప్రాంతాన్ని ఆక్రమించి జాజ పురం రాజధానిగా పాలించ సాగాడు. నందివర్మ విజయస్కంద వర్మతో చేసిన యుద్ధాలలో తాత్కాలిక విజయాలను సాధించినప్పటికీ, అన్య రాజ వంశీయులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రాజన్యులు శాలంకాయన రాజ్య భాగాలను ఆక్రమించారు. విజయనంది వర్మ పరమ భాగవతోత్తముడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 405-415.

         రెండవ హస్తివర్మ కొడుకైన విజయస్కంద వర్మ తండ్రి అనంతరం రాజ్యాన్ని సాధించడానికి రెండవ విజయనంది వర్మను ఎదుర్కోవాల్సి వచ్చింది. విజయస్కంద వర్మ విష్ణుకుండినుల సామంతుడిగా కొంతకాలం పాలించాడు. విష్ణుకుండినులు సర్వాంధ్ర భూభాగాలనే కాకుండా యావత్ దక్షిణా పథాన్ని, దక్షిణ భారతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలనుకుని శాలంకాయన వంశాన్ని అంతరింప చేశారు. విజయస్కంద వర్మ పాలనాకాలం క్రీస్తుశకం 415-440. ఇంతటితో శాలంకాయన వంశం అంతరించింది.

ఆనందగోత్రిక వంశం

           బృహత్పలాయన జయవర్మ అనంతరం పల్లవులు ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. కృష్ణానదికి దక్షిణాన వున్న చేజెర్లను లేదా కపోత కందరపురం రాజధానిగా చేసుకొని తీరాంధ్రాన్ని, కృష్ణా, గుంటూరు మండలాలను ఆనందగోత్రికులు ఆక్రమించి పాలించారు. వీరు గోత్ర నామాన్ని వంశ నామంగా ధరించారు. ఆనంద మహర్షి వంశానికి చంద్రుని లాంటి వాడు కందర రాజు. స్వశక్తితో రాజ్యాన్ని స్థాపించి పల్లవ రాజులకు సామంతుడిగా ఆంధ్ర భూభాగాలను పాలించాడు. ధాన్యకటక యుద్ధంలో ఇతడు శత్రువులను, ముఖ్యంగా శాలంకాయన నందివర్మను ఓడించి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఇతడి రాజ్యం త్రికూట పర్వతం నుండి కృష్ణానది వరకు వ్యాపించినది. ఇతడి రాజధాని దాన్యవాటి అని అంటారు. తరువాత ఇతడు తన పేరుమీద కందరపుర నిర్మాణం చేశాడు. ఆ తరువాత ఇతడి వారసులకు అదే రాజధాని అయింది. పల్లవ శివస్కంద వర్మ ఇతడిని ఓడించి సామంతుడిగా చేసుకున్నాడు. ఇతడు 35 సంవత్సరాలు (క్రీస్తుశకం 290-325) పాలించాడు.

         కందర రాజు తరువాత అత్తివర్మ రాజయ్యాడు. ఇతడు యమ నియమవంతుడు. ఆపస్తంబ సూత్రుడు. ఋగ్యజుస్సామ వేదవిదుడు. ఈ మహారాజు శైవుడు, వైదిక మతోద్దారకుడు. ఇతడి కాలంలో బౌద్ధం క్షీణించినది. అత్తివర్మ శక్తియుతుడు. అనేక రాజుల స్వాతంత్ర్యాన్ని హరించినవాడు. విజేత. పల్లవ, శాలంకాయన రాజన్యులు ఆక్రమించిన రాజ్య భాగాలను అత్తివర్మ తిరిగి సాధించాడు. అత్తివర్మ పాలనాకాలం 45 సంవత్సరాలు (క్రీస్తుశకం 335-380).

అత్తివర్మ తరువాత అతడి తనయుడు దామోదర వర్మ పాలనా పగ్గాలను చేపట్టాడు. ఇతడు ఆంధ్రదేశ భూభాగాలను పాలించినప్పటికీ, పల్లవ, శాలంకాయన, విష్ణుకుండిన వంశీయులతో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. విష్ణుకుండినులతో జరిగిన యుద్ధంలో ఓటమి పాలై, ఆనందగోత్రికులు త్రికూట మలయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

దామోదర వర్మ అనంతరం రాజ్యానికి వచ్చిన ఆనందగోత్రికులు అతి బలహీనులు కావడం వల్ల విష్ణుకుండినులు విజృంభించి వారి రాజ్యాన్ని జయించి తమ సామంతులుగా చేసుకున్నారు. దామోదర వర్మ పాలనా కాలం 45 సంవత్సరాలు (క్రీస్తుశకం 380-425).

ఆనంద గోత్రికుల పాలనాకాలంలో ఆంధ్రదేశంలో కరువుకాటకాలు లేవు. దేశం సుభిక్షంగా వున్నది. ఆనంద గోత్రికులు శిల్ప కళను పోషించి అభివృద్ధి చేశారు.  

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)