దిక్కుతోచని
స్థితిలో బ్రాహ్మణులు
ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన
బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్
మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన
బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి,
స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల
కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను
ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో
బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది.
పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా
మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు
కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం,
భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు
బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే
స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన,
భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది
బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా
నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.
అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక
కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది
బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ
మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా,
అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత
సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు
(పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని
పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు,
బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు
"వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన
జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని,
క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు. అగ్ర కులంగా, అగ్ర
వర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా
కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి,
ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా
వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర
కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ
వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే
చాలా కాలం వరకూ పరిమితమై పోయింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల
వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన
విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక
వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు
సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి
లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన
వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ
ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం.
నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై,
సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ
సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని
పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం
లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి
ఉంటారు.
బ్రాహ్మణులను "విప్ర" ("ప్రేరణ"), లేదా
""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా
పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "బ్రాహ్మణులు" అయినప్పటికీ,
ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారాలు-వేద పాఠశాలల (శాఖలు) వలన
వారు వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం
పూజారులు అయినప్పటికీ, అందరు బ్రాహ్మణులు అగ్ని (హోత్ర)
పూజారులు కారు. ఇటీవలి కాలంలో కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రమే వేద విద్య
నేర్చుకోవడం చేస్తున్నారు. మరి కొందరు పౌరోహిత్య విధులు నిర్వర్తిస్తున్నారు.
పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ
వృత్తుల్లో, ఉద్యోగాలలో బ్రాహ్మణులు కూడా తమ అవకాశాలు
వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు కూడా
సాగుతున్నాయి.
రామాయణ కాలం నాటి బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించారు. పరులను వంచించాలనే దురాచారానికి
దూరంగా వుండేవారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుండేవారు. వేదాల్లో
చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుండేవారు. ఆరంగాల
(శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం)
వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద
మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో
భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై
మెలగుతుండేవారు. అలాంటి వారు ఇప్పటికీ పలువురు వున్నారు. కాకపోతే ఆధునిక రాజకీయ, సామాజిక
మార్పులకు, ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా ఆ సంఖ్య తగ్గుతూ
వచ్చింది. బ్రాహ్మణులను ద్విజాతులని, వేదషడంగ పారగోత్తములని,
అహితాగ్నులని, సహస్రదులని, మహామతులని, సత్యవచస్కులని, హిమకర
మిత్ర తేజులని, ఋషులని
ఆంధ్ర వాల్మీకి రామాయణ గ్రంధ కర్త శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు పోల్చారు.
వారినే, హృష్ఠ మానసులని, శాస్త్ర చింతన
పరాయణులని, స్వస్వతుష్టులని, త్యాగశీలురని,
భూరి సంచయులని వర్ణించారు తన రామాయణంలో. తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో,
దానినే
బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో, అధ్యయనంలో ఉత్తములై ,
వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు.
రాజకీయంగా అధికారం మరో అగ్ర వర్ణం వారైన క్షత్రియుల చేతుల్లో
వున్నప్పటికీ, అమాత్యులుగా రాజులకు సలహాలనిచ్చే బాధ్యతను-హక్కును
వారే కలిగి వుండడం కూడా అనాదిగా వస్తోంది. ఆంగ్లేయుల పాలనలో, బ్రాహ్మణులు, మేధ పరమైన తమ ఆధిపత్య నాయకత్వాన్ని
పదిలంగా కాపాడుకున్నారు. వారి ఆ ఆధిపత్యం, తొలినాళ్లలో,
ఆంగ్లేయుల ప్రభుత్వంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఉద్యోగాలలో
పనిచేయడంతో ప్రారంభమై, జాతీయోద్యమంలో కీలక నాయకత్వం చేపట్టడం
దాకా పోయింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడా వారి ఆధిపత్యం
కొనసాగింది చాలా రోజుల వరకు. అధికారంలో వున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పొందడంలోను, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించడంలోను బ్రాహ్మణులే ముందుండే వారు.
వీరి ఈ ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో-ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. కాకపోతే, ఆ
ఉద్యమాల ప్రభావం వారి హక్కులను హరించడం వరకే పరిమితమైనాయి తప్ప, పూజారులుగా, అర్చకులుగా, వేద
పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో పెద్ద నష్టం జరగలేదు.
వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా
పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. క్రమేపీ, వీటికే పరిమితమై పోవడంతో, గతంలో మాదిరి రాజకీయంగా
కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని
ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన
పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు
వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి
చేయసాగింది.
బ్రిటీష్
ప్రభుత్వ పాలనలో, జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించిన బ్రాహ్మణుల నుంచి ఎదురైన సవాళ్లను
అధిగమించడానికి, ఒక వైపున సైద్ధాంతికంగా వారిని నిర్వీర్యం
చేసే ప్రయత్నం చేస్తూ, మరో వైపున బ్రాహ్మణేతర అగ్ర కులాల
వారిని, బ్రాహ్మణులతో సమానంగా పరిగణించబడాలన్న డిమాండుతో తెర
పైకి తేవడం జరిగింది. ఆ తరువాత కాలంలో అదే పద్ధతిని ముస్లింల విషయంలో కూడా అవలంబించింది
బ్రిటీష్ ప్రభుత్వం. భారత దేశ చరిత్రను తిరగ రాసే ప్రయత్నంలో, బ్రాహ్మణులను, ఇతర వర్ణాల వారికి వ్యతిరేకులుగా,
పీడించే వారిగా, దుర్మార్గులుగా చిత్రించే
ప్రయత్నం కూడా చేసింది. భారత సమాజాన్ని అభివృద్ది పరచడంలో బ్రాహ్మణులు వహించిన
పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది. ఇదంతా కావాలనే చేసింది నాటి ప్రభుత్వం. ఆ
ప్రయత్నాలే ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలో కూడా మరో రూపంలో కొనసాగాయనవచ్చు.
సమాజాన్ని
ఐక్యంగా, సమైక్యంగా వుంచడానికి బ్రాహ్మణులు అనాదిగా చేసుకుంటూ వస్తున్న అవిరళ
కృషిని, మరుగుపర్చి, బ్రాహ్మణ
వ్యతిరేకతను ప్రోత్సహించింది నాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకతే దరిమిలా
కొనసాగి, అరవై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మరింత బలపడి,
చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో, బ్రాహ్మణులను
అణగ దొక్కే స్థాయికి తీసుకుపోయింది. వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ,
బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన
సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు
దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా
కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా
ఏదీ జరగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు
దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే
పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని,
దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది.
చివరకు
జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం
మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల
పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ
భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం
కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి
జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా
కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ
మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని
బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు
ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని
దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు
55 శాతం మది
బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు
దిగువగా
జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని,
ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు
గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు,
దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక
ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో
చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది.
5-18 సంవత్సరాల వయసున్న
బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం
మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం
మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల
ఆదాయంతో పోల్చి చూస్తే,
నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ
బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్
స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!
కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల
నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని
వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని
భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని
కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ
ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత
అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి
వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు
చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు
ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల
కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని
దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా,
కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్
పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని
కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ
తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర
ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్
రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా,
సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు
బ్రాహ్మణులు.
ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి
బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా
ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత
రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని
ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా
చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే
అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!
