వామపక్ష ఐక్యత మిధ్యేనా?
సూర్య దినపత్రిక
(14-12-2012) and (16-12-2012)
I have spent a good part of the last 45 years in the fields of Information, Print and Electronic Journalism, Governance and Consulting on Public Private Partnership. This blog is a collection of those experiences. The topics in the blog will be diverse and that is intentional and expected. Read on...
సీపీఎం ఆవిర్భావం - Part Two
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఎనిమిదవ అధ్యాయం ఇది).
భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.
అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‍సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలుడైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‍గా నియమించింది.
ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్‌లాల్‌నెహ్రూ చైనా పర్యటించి పంచశీల సూత్రం పఠిస్తూనే, సోవియట్‌యూనియన్‌తో మైత్రీ సంబంధాలు పెంపొందించుకుంటూ వచ్చారు. చైనా-సోవియట్‌దేశాలతో భారత దేశం కొనసాగిస్తున్న సత్సంబంధాలతో నిమిత్తం లేకుండానే (ఉమ్మడి) భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ విధానాలను కొన్నింటిని ఘాటుగా వ్యతిరేకించేది. సోవియట్‌యూనియన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా- భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగాలేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!
తెనాలిలో జరిగిన సమావేశాల వివరాలకు సంబంధించి "ప్రజాశక్తి" పత్రిక "మార్క్సిస్ట్" మాగజైన్ లో వచ్చిన వ్యాసాన్ని జలై 12, 2009 రోజున ప్రచురించింది. ఆ వివరాలు:
"భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలోని ఒక సెక్షన్‌లో తెలంగాణా పోరాట కాలంలోనే రివిజనిస్టు పోకడలు పొడచూపాయి. రివిజనిజానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఆంతరంగిక పోరాటం 1955- 56 నాటికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఉమ్మడి పార్టీలోని రివిజనిస్టు నాయకత్వం అనుసరిస్తున్న వర్గసంకర విధానాన్ని పార్టీలోని పెద్ద సెక్షన్ (తరువాత మార్క్సిస్టు పార్టీగా పునర్నిర్మాణం చెందింది) తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల విషయంలో ఆంతరంగి కంగా పార్టీ నిలువునా చీలిపోయింది. 1961 లో విజయవాడలో జరిగిన ఉమ్మడి పార్టీ చివరి మహాసభ ఈ విభేదాలను పరిష్కరించలేక పోయింది. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యంగా ఉండాలంటే పార్టీలో కిందినుండి పైస్థాయివరకు కార్యక్రమం, ఎత్తుగడలపై కూలంకషమైన చర్చ కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్దతుల్లో జరగాలని పార్టీలోని ఒక భాగం డిమాండ్‌చేసింది. కాని నాటి పార్టీ నాయకత్వంలోని మెజారిటీ సభ్యులు రివిజనిస్టు ప్రభావానికి గురైఉన్నందున ఇటువంటి చర్చకు ఆస్కారం ఇవ్వలేదు సరికదా కాంగ్రెస్‌ప్రభుత్వంతో చేతులు కలిపి అలా డిమాండ్ చేసినవారిని అరెస్టు చేయించడం ప్రారంభించింది”.
“1962 భారత్-చైనా యుద్ధాన్ని రివిజనిస్టు నాయకత్వం దీనికోసం ఉపయో గించుకుంది. చైనాతో యుద్ధాన్ని బలపరుస్తూ రివిజనిస్టు నాయకత్వం జాతీయ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించిన వారందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రారంభిం చింది. నాయకులు జైళ్లలో ఉన్న సమయంలో మొత్తం పార్టీ కార్యాలయాలనూ, పత్రికలనూ రివిజనిస్టు నాయకత్వం స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ప్రజాతంత్ర విరుద్ధంగా జరుగుతున్న ఇటువంటి కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్‌పెట్టాలనీ, పార్టీలో ఐక్యత పాదుకొల్పేం దుకు అన్ని స్థాయిల్లో చర్చలజరగాలని జాతీయ కౌన్సిల్‌కు కొందరు సభ్యులు ఇచ్చిన నోటీసును నాయకత్వం తిరస్కరించడంతో ఇంక చేసేది లేక 32 మంది జాతీయ కౌన్సిల్‌సభ్యులు వాకౌట్‌చేసి బయటకు వచ్చేశారు. పార్టీని విప్లవ పంథాలో పునర్నిర్మించాలని ఆ 32 మంది సభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రకారమే తెనాలిలో 1964 జులైలో మూడురోజుల జాతీయ సదస్సు జరిగింది. అదే ఏడాది నవంబర్‌లో కలకత్తాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏడవ మహాసభకు సన్నాహంగా తెనాలి సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే పార్టీ కార్యక్రమం, ఎత్తుగడల పత్రం రూపుదిద్దుకుంది. కలకత్తా మహాసభ దీన్ని ఆమోదించింది".
"సన్నాహక సదస్సును విజయవాడలో నిర్వహించాలని తొలుత భావించారు. కాని ప్రభుత్వం దానికి ఆటంకం కల్పించింది. ఆ సమయంలో విజయవాడ నగరంలో భారీ స్థాయిలో సాగిన గృహదహనాల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. కాంగ్రెస్‌వాళ్లు పార్టీపై దుష్ప్రచారానికీ, దాడులకూ పాల్పడ్డారు. పాత జైహింద్‌టాకీస్‌వద్ద ఏర్పాటుచేసుకున్న పార్టీ కార్యాలయంపై కూడా దుండగులు దాడులకు పాల్పడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే ప్రతినిధులు ఒక చోట కూర్చుని చర్చించే వాతావర ణమూ లేదు, పోలీసులు కూడా అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో సమావేశ స్థలాన్ని అక్కడకు దగ్గరలోనే ఉన్న గుంటూరు జిల్లా తెనాలికి మార్చారు".
"తెనాలిలో నాడు పార్టీకి మంచి పట్టుండేది. ప్రతినిధులకు కావలసిన వసతులు సమకూర్చ డానికి కావలసిన ప్రాంగణాలు కూడా అక్కడ ఉన్నాయి. దాంతో తక్కువ సమయంలోనే సదస్సు నిర్వహణకు అక్కడ ఏర్పాట్లు జరిగాయి. తెనాలిలో సదస్సు జరపాలని పార్టీ జాతీయ కౌన్సిల్‌నుండి వాకౌట్ చేసినవారు నిర్ణ యించుకున్నట్లు సాయంత్రం ఏడు గంటలకు రేడియో వార్త వెలువడింది. అంతే రాత్రి ఎనిమిది గంటల సమయానికి పట్టణంలోని లాడ్జీ లన్నిటినీ ప్రభుత్వాధికారులే బుక్ చేశారు. దాంతో ప్రతినిధులకుగాని, నాయకులకు గాని ఎక్కడా వసతి దొరకని పరిస్థితి. దాంతో చెంచుపేటలో రైల్వేస్టేషన్‌దగ్గరలోనే కోనేరు పక్కన పాడుపడిన రైసు మిల్లును శుభ్రం చేసి సదస్సు ప్రధాన ప్రాంగణంగా ఉపయోగించారు. ఈదర శివరామకృష్ణయ్య అనే పార్టీ సానుభూతిపరుడు ఆ రైసుమిల్లును అద్దెకు తీసుకుని నడిపాడు. కాని కొన్నాళ్లు నడిచి ఆగిపోయింది. దానిపేరు రాజ రాజేశ్వరీ రైస్‌మిల్లు. రైసుమిల్లు ఒక ఇనుప రేకుల షెడ్డు. దానికి ప్రక్కనే ఒక తాటాకు పాక వేశారు. అదే ప్రతినిధుల భోజనశాల. సదస్సు ప్రాంగణానికి కోటేశ్వరనగర్‌అని పేరుపెట్టారు. సదస్సు ఏర్పాట్లలో రావి హైమారావు పూర్తికాలం పనిచేయగా ఆయన కుటుంబం సహకరించింది".
"మూడు రోజుల సదస్సు నిర్వహణలో దాదాపు 20 మంది కార్యకర్తలు ఆహోరాత్రులు కష్టపడ్డారు. నాలుగో రోజు బహిరంగ సభ జరిగింది. కామ్రేడ్స్ లావు బాలగంగాధరరావు, కొరటాల సత్యనారాయణ, పర్చూరు నాగేశ్వరరావు, సదస్సు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే సదస్సు సమయంలో మాత్రం కామ్రేడ్ లావు బాలగంగాధరరావు అక్కడ లేరు. పార్టీ అగ్రనాయకులు మాకినేని బసవ పున్నయ్య సతీమణి, బాల గంగాధరరావు సోదరి జగదాంబగారు తీవ్ర అస్వస్థతతో ఉండడమే దీనికి కారణం. ఆ సదస్సులో ఖరారు చేసిన పార్టీ కార్యక్రమ పత్రాలు తయారు చేయడంలో బసవ పున్నయ్య తలమునకలయ్యారు. దాని వల్ల జగదాంబగారి దగ్గర గంగాధరరావు ఉండాల్సి వచ్చింది. బసవపున్నయ్య కూడా సదస్సులో ప్రవేశపెట్టే పత్రాలను చాలావరకు ఇంటివద్దనే ఉండి తయారుచేశారు. ఈ సమస్య వల్లనేనేమో తెనాలి సదస్సు సందర్భంగా తీసిన ఏ ఫోటోలో కూడా బసవపున్నయ్య కనిపించరు. తరవాత జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో కూడా బసవ పున్నయ్య లేరు. సదస్సులో వాలంటీర్స్‌గా పనిచేసినవారిలో గడ్డిపాటి కోటేశ్వరరావు, కొండ్రగుంట వెంకటేశ్వర్లు, రాశాబత్తుని నాగేశ్వర రావు, గుదిబండి శివబసివిరెడ్డి, దేవా సీతారామయ్య, దొడ్డపనేని వెంకటేశ్వరరావు, సింహాద్రి శివారెడ్డి తదితరులున్నారు".
"తెనాలి సదస్సు పార్టీలో తీవ్రమైన ఆంతరంగిక పోరాటానికి పరాకాష్టగా జరిగింది. అందువల్ల పత్రికల్లో ఈ సదస్సు గురించి తీవ్రమైన చర్చోపచర్చలు జరిగేవి. ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీగా ఏర్పడిన నాయకులపైనా, వారి వైఖరిపైనా దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని పత్రికలు విషప్రచారం గావించాయి. సదస్సు జరిగినంత కాలం కామ్రేడ్ హరేకృష్ణ కోనార్ పత్రికా గోష్టి పెట్టి వివరణ ఇచ్చేవారు. సదస్సు ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలు ప్రాంగణంలోని అయిదు స్థంభాలకు అయిదుగురు అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతల ఫోటోలు తగిలించారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల ఫోటోలు. ఆర్ట్ పెయింట్ తో వేసిన ఆ ఫోటోలను మంచికలపూడికి చెందిన కొండపనేని రంగారావు జెకోస్లోవేకియా నుండి తెచ్చారు. ఆ ఫోటోలలో మావో బొమ్మ ఉండడం, అప్పుడు చైనాకు వ్యతిరేకంగా దేశంలో ప్రచారం జరుగుతుండడంతో పత్రికల్లో పెద్ద దుమారం రేపారు. ఇండియన్ ఎక్సప్రెస్ లో "మావో పార్టీ" అని సంభోదిస్తూ సదస్సు గురించి వార్త రాశారు. అప్పటికి ఉమ్మడి పార్టీనుండి చీలిపోయిన వారు పార్టీకి పేరుపెట్టలేదు. చైనా అనుకూలురుగా ముద్రవేస్తూ పత్రికలు పెద్ద ఎత్తున వ్యతిరేక వార్తలు రాసేవి. తెనాలి సదస్సు మూడు రోజులు పాటు జరగగా నాలుగో రోజున బహిరంగ సభ జరిగింది. తెనాలి మున్సిపల్ ఆఫీసు ప్రాంతాన్ని అప్పట్లో గాడిబావి సెంటర్ అనేవాళ్లు. అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. సుమారు పదివేల మంది హాజరైన సభనుద్ధేశించి బసవ పున్నయ్య, సుందరయ్య, ప్రమోద్ దాస్ గుప్త తదితరులు ప్రసంగించారు. వేదిక నిర్మాణం, బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక కార్మిక సంఘం కార్యకర్తలు నిర్వహించారు".
"తెనాలి సదస్సుకు సంబంధించి లభించిన ఫోటోల ప్రకారం దేశవ్యాపితంగా సుమారు 140 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌నుండి 24 మంది, బెంగాల్ 22, తమిళనాడు 20, కేరళ 19, ఉత్తర ప్రదేశ్10, రాజస్థాన్7 మంది హజరవగా పంజాబ్, అస్సాం ఇతర రాష్ట్రాలనుండి సుమారు 40 మంది ప్రతినిధులు హాజరైనారు. సిపిఐ జాతీయ కౌన్సిల్‌నుండి వాకౌట్‌చేసిన 32 మంది సభ్యులు ఈ సదస్సుకు హాజరైనారు. అయితే సదస్సు సందర్భంగా దిగిన ఫోటోలో 30 మంది మాత్రమే ఉన్నారు. బసవపున్నయ్య, మరొకరు ఫోటోలో లేరు. వాకౌట్ చేసిన వారిలో తరువాత మార్క్సిస్టు పార్టీ తొలి పొలిట్‌బ్యూరోకు ఎన్నుకోబడిన పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, ఎకె గోపాలన్, ఇఎంఎస్ నంబూద్రిపాద్, జ్యోతి బాసు, ప్రమోద్ దాస్ గుప్త, హరికిషన్ సింగ్ సూర్జిత్, పి. రామమూర్తి ఉన్నారు. సిపిఐ(ఎం) తొలి పొలిట్ బూరోలో సభ్యుడైన బిటి రణదివే జైలులో ఉన్నందున సదస్సుకు హాజరు కాలేదు. వీరితో బాటు పంజాబ్ నుండి జగ్ జిత్ సింగ్ లాయల్‌పురి, బెంగాల్ నుండి ముజఫర్ అహ్మద్, హరేకృష్ణ కోనార్, తమిళ నాడు నుండి ఎంఆర్ వెంకటరా మన్, శంకరయ్య, కేరళ నుండి ఇకె నయనార్, కనరన్, రాజస్థాన్ నుండి మోహన్ పునామియా తదితరులున్నారు".
"వాకౌట్‌చేసిన కౌన్సిల్‌సభ్యుల్లో మన రాష్ట్రం నుండి పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్యలతోబాటు నండూరి ప్రసాదరావు, మోటూరు హనుమంతరావు, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, గుంటూరు బాపనయ్య, ఉద్దంరాజు రామం ఉన్నారు".
"ఆంధ్రప్రదేశ్ నుండి హాజరైన ప్రతినిధుల్లో పైన పేర్కొన్న ఎనిమిది మంది సభ్యులతోబాటు గుంటూరు జిల్లానుండి కొల్లా వెంకయ్య, కృష్ణా జిల్లా నుండి సనకా బుచ్చికోటయ్య, మానికొండ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి అన్నే వెంకటేశ్వరరావు, నెక్కల పూడి రామారావు, ఖమ్మం జిల్లా నుండి పర్సా సత్యనారాయణ, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, నల్గొండ జిల్లా నుండి భీమిరెడ్డి నర్శింహారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి కానేటి మోహన రావు, జి. ఎస్. బాలాజీ దాస్, వరంగల్ జిల్లా నుండి ఎం. ఓంకార్, విశాఖ జిల్లా నుండి కోడుగంటి గోవిందరావు, చిత్తూరు జిల్లా నుండి వజ్రవేలు చెట్టి, శ్రీకాకుళం జిల్లానుండి రామలింగాచారి ఉన్నారు. వీరు కాకుండా నిజామాబాద్ నుండి ఒక కామ్రేడ్ పాల్గొన్నారు".
"తెనాలి సదస్సుకు హజరైన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల్లో అత్యధికులు చివరివరకు మార్క్సిస్టు పార్టీలో పనిచేశారు. కొందరు 1967-68 నక్సలైట్ చీలికలో వెళ్లి పోయారు. అలా నక్సలైట్‌ల వైపుకు పోయిన వారిలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సనకా బుచ్చికోటయ్య, వజ్రవేలు చెట్టి, అన్నే వెంకటేశ్వరరావు, నెక్కల పూడి రామారావు, కొల్లా వెంకయ్య, రామలింగాచారిలు ఉన్నారు. అన్నే వెంకటేశ్వరరావు తరువాత తిరిగి మార్క్సిస్టు పార్టీలోకి వచ్చారు. కానేటి మోహన రావు తరువాతి కాలంలో పార్టీ పనిలో చురుకుగా లేరు. ఓంకార్, భీమిరెడ్డి నర్సింహారెడ్డి కొంతకాలం మార్క్సిస్టు పార్టీ నాయకత్వంలో ఉండి పార్టీని విడిచిపెట్టారు. కోడుగంటి గోవిందరావు ఎక్కువ కాలం మార్క్సిస్టు పార్టీలో లేరు. ఆయన తరువాత సిపిఐలో చేరారు. తెనాలి సదస్సుకు హజరైన ప్రతినిధులు అందరూ కలిసి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా విడివిడిగా ఫోటోలు దిగారు. ఉత్తర ప్రదేశ్‌ప్రతినిధుల్లో భగత్ సింగ్ సహచరుడైన శివవర్మ, పశ్చిమ బెంగాల్ ప్రతినిధుల్లో, సరోజ్ ముఖర్జీ, వినయకృష్ణ చౌదరి, కేరళ ప్రతినిధుల్లో సుశీలా గోపాలన్ తదితరులు కూడా ఉన్నారు".
సీపీఎం ఆవిర్భావం - Part One
వనం జ్వాలా నరసింహారావు
(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో ఎనిమిదవ అధ్యాయం ఇది).
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఇక్కడ కొంత తెలుసుకోవాలి. ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. ఎం.ఎన్ రాయ్ తో సహా, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్రకేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడింది.
వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరికి కఠిన శిక్షలు పడ్డాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన న్యాయస్థానం విచారణను, కమ్యూనిజం సందేశం ప్రజల్లోకి పంపే ఆయుధంగా ఉపయోగించుకున్నారు నిందితులు. కమ్యూనిజం ఉద్యమంగా బలపడ సాగింది. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో, మరి కొన్నాళ్లలో, స్వతంత్రం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి జోషి మితవాద వైఖరిని, అతివాద భావాల రణదివే అనుచరులు వ్యతిరేకించారు. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, "స్వతంత్ర భారతదేశం" అంటే, "బ్రిటీష్ సామ్రాజ్య వాదుల పాక్షిక వలస ప్రాంతం" గా పేర్కొని, మితవాదిగా ముద్రవేసిన జోషిని తప్పించి, రణదివే ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది.

మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, ఎలా సాగిందో, సవివరంగా, స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య తన "వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు" పుస్తకంలో తెలియచేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. ఆ నాయకత్వానికీ-నూతన రాజకీయ విధానానికి మద్దతు పలికిన వారికీ, తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తున్న వారికీ మధ్య తలెత్తిన విభేదాలతో పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయిందని వివరించారు సుందరయ్యగారు తన పుస్తకంలో. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్య గారు వ్యాఖ్యానించారు. దరిమిలా అజయకుమార్ ఘోష్ ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.
భారత దేశంలో పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని, ప్రాధమిక దశలో వ్యావసాయిక ప్రాధాన్యమైన విప్లవం చేపట్టడానికి వీలు కావచ్చునని, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుందని", గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అరవై ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 1951 లో సోవియట్ యూనియన్‍ను సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్పష్టం చేశారు స్టాలిన్. చి యాంగ్కై-షేక్ తో జవహర్ లాల్ నెహ్రూను పోల్చడం సరికాదని, నెహ్రూ బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని, ఆయనకు ప్రజల్లో అభిమానం బలంగా వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్. మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల గురించి, చీలికల గురించి, అభిప్రాయ భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1951 సంవత్సరం అక్టోబర్ నెలలో ఉపసంహరించి సుమారు అరవై ఏళ్లు కావస్తోంది. ఉపసంహరణ పూర్వ రంగంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం, సోవియట్ ప్రతినిధి వర్గానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు యధాతధంగా, రష్యన్ భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు (డాక్టర్ సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారిటీవల. చారిత్రక ప్రాధాన్యమున్న అందులోని విషయాలు తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాకుండా, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు సంబంధించినవి కూడా. భారత కమ్యూనిస్ట్ పార్టీ అతివాద, మితవాద వర్గాలుగా, తర్వాత నక్శలైట్లుగా-మావోఇస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా-మొహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి. చర్చలకు ముందు, సోవియట్ బృందం పరిశీలనకు తయారు చేసిన డాక్యుమెంటులో, ప్రతినిధి బృందం సభ్యుల వివరాలు, ప్రధమ పార్టీ మహాసభల నుంచి 1951 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజేశ్వరరావు-బసవ పున్నయ్యల, డాంగే-అజయకుమార్ ఘోష్ ల విడి-విడి అభిప్రాయాలు పొందుపరచడం జరిగింది. భారత దేశంలో విప్లవ మార్గం అవలంభించడానికి అనువైన పరిస్థితులున్నాయా-లేవా? సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోగలదా? చైనా తరహా విప్లవం సాధ్యమేనా? లాంటి పలు సందేహాలను డాక్యుమెంటులో చేర్చారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఆసక్తి గల పరిశోధకులకు డాక్యుమెంటులోని వివరాలు ప్రాముఖ్యత సంతరించుకున్న వనే అనాలి. అలనాటి "భారత కామ్రేడ్ల" మధ్య తలెత్తిన తీవ్ర విభేదాల నేపధ్యం ప్రస్తావిస్తూ, ప్రధమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్ గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, జోషి ఆలోచనా విధానం మితవాద విధానంగా ముద్రవేసి ఆయనను పార్టీ నుంచి తొలగించడం, రణదివే ప్రతిపాదించిన "భారత జాతీయ ప్రజాస్వామ్య విప్లవ వ్యూహం తీరు తెన్నుల" ను పోలిట్ బ్యూరో ఆమోదించడం, ఆంధ్ర పార్టీకి చెందిన రాజేశ్వరరావు-బసవ పున్నయ్యలు రణదివే వ్యూహాన్ని విమర్శించడం, దరిమిలా 1950 మే నెలలో కేంద్ర కమిటీ రణదివే విధానాలను ఖండించి ఆయన స్థానంలో జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడానికి సంబంధించిన అంశాలున్నాయందులో. పార్టీ సభ్యులకు చండ్ర రాజేశ్వరరావు రాసిన ఉత్తరంలో, సాయుధ పోరాట పంథాను అనుసరించాలని-దానికి వారి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఆ మార్గాన్ని వ్యతిరేకించిన డాంగే-ఘోష్ నాయకత్వం, కేంద్ర కమిటీ యాంత్రికంగా చైనా అనుభవాన్ని భారత దేశానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. డిసెంబర్ నెలలో జరిగిన పార్టీ ప్లీనంలో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సోవియట్ నాయకుల సలహా కొరకు వచ్చిన విషయం కూడా డాక్యుమెంట్ లో పేర్కొనడం జరిగింది. చర్చలు ప్రారంభమైన మొదటి రోజున ప్రతినిధి బృందంలోని నలుగురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు తొలుత. ఒక వైపు డాంగే-ఘోష్ లు విప్లవ సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించగా, మరో వైపు ఆ పంథా సరైన మార్గమని రావు-పున్నయ్యలు వాదించారు. విప్లవ మార్గాన్ని బోధించిన చండ్ర రాజేశ్వరరావు కొన్నాళ్లకు మితవాద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కావడం, దాన్ని వ్యతిరేకించిన రణదివే సిపిఎం నాయకుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం అనాలి.
చండ్ర రాజేశ్వరరావు చొరవతో, వివాదాస్పద సమస్యల్ని, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ నాయకులతోను, స్టాలిన్ తోను చర్చించడానికి ఆయనతో పాటు మాకినేని బసవ పున్నయ్య, అజయ కుమార్‍ఘోష్, ఎస్ ఏ డాంగేలతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కోకు వెళ్లింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందంతో చర్చించేందుకు స్టాలిన్ నాయకత్వంలో, మోలటోవ్, మాలెంకోవ్, సస్లోవ్ లతో ఒక కమీషన్‍ను సోవియట్ పార్టీ నియమించింది. ఇరు బృందాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సుందరయ్య గారు తన పుస్తకంలో కొంతవరకు పొందుపరిచారు. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం కారణంగా, భారత విప్లవానికి సంబంధించిన సమస్యలు చర్చకొచ్చాయని, ఆ సమస్యలన్నీ తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా వెలుగులోకి వచ్చాయని సుందరయ్యగారు వ్యాఖ్యానించారు. చర్చల సారాంశాన్ని భారత ప్రతినిధి బృందం కేంద్ర కమిటీకి వివరించడం, దరిమిలా అజయకుమార్ ఘోష్‍ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించటం జరిగింది.
భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమర్పించిన డాక్యుమెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక విధానపరమైన ప్రశ్నలున్నాయి. అప్పట్లో భారత దేశంలో నెల కొన్న రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా? ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా? అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? తెలంగాణా సాయుధ పోరాటం లాంటి పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను, సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? చైనా తరహా గొరిల్లా విప్లవం భారత దేశంలో సాధ్య పడుతోందా? భూస్వామ్య-సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవంలో కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? భారత స్వాతంత్ర్యాన్ని-సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమెలా? భారత విదేశాంగ విధానాన్ని కమ్యూనిస్ట్ దేశాలను దృష్టిలో వుంచుకుని ఎలా అర్థం చేసుకోవాలి?నవ భారత దేశంలో భూమిని జాతీయం చేయడం తగునా?పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ దండన" విధించడం తగునా? లాంటి ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ప్రశ్నలన్నిటి కి, తనదైన శైలిలో మర్నాడు జరిగిన చర్చల్లో స్టాలిన్ సమాధానం ఇచ్చాడు. భారత దేశంలోని పరిస్థితులు అప్పటికింకా సోషలిస్ట్ విప్లవానికి అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.
స్టాలిన్ నాయకత్వంలోని రష్యన్ల దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి, రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని, ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్. దాన్నే ఆయన "పీపుల్స్ డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. ఆ స్థితికి భారత దేశం అప్పుడప్పుడే వస్తుందన్నాడు. రెండో దశ, పారిశ్రామిక విప్లవం. ఆ దశకు భారత దేశం ఇంకా చేరుకోలేదని ఆయన అభిప్రాయం. రణదివే సిద్ధాంతాన్ని కూడా ఆయన తప్పుబట్టాడు. పోరాటం బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వుండాలని, అమెరికన్ సామ్రాజ్యవాదానికి కాదని కూడా అంటాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటన్ నుంచేనని, భారత దేశం కామన్ వెల్త్ లో భాగమని ఘోష్ సందేహాన్ని నివృత్తి చేశాడు ఒక దశలో. ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.
"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్కై-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.