Showing posts with label రాహుల్ గాంధీ. Show all posts
Showing posts with label రాహుల్ గాంధీ. Show all posts

Friday, April 12, 2013

ప్రధానిగా 'నాయకుడు': వనం జ్వాలా నరసింహారావు


ప్రధానిగా 'నాయకుడు'
వనం జ్వాలా నరసింహారావు

రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఎవరన్న చర్చ రాజకీయాలలో ఆసక్తి వున్న ప్రతి ఇద్దరి మధ్య నడుస్తోంది. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాహుల్ గాంధీ చురుకైన పాత్ర వహించిన నాటినుంచి, ఆ మాటకొస్తే అంతకంటే ముందునుంచే, ఆయనను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరమీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ బైటక్ దరిమిలా ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన జపం మరింత వేగం పుంజుకుంది. అదే విధంగా గుజరాత్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినప్పటినుంచి నరేంద్ర మోడీ పేరును బీజేపీ తన పార్టీ అభ్యర్థిగా తెర పైకి తెచ్చింది. తనకు ప్రధాన మంత్రి కావాలని లేదంటున్నప్పటికీ, రాహుల్ జపం మాత్రం పార్టీ కార్యకర్తలు మానలేదు. ఇక మోడీ విషయానికొస్తే ఆయనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా నియమించి ఆ పార్టీ కూడా ఆయనను ప్రధానమంత్రిని చేసే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. వారిద్దరికీ తోడు నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, మాయావతి.....ఇలా మరి కొన్ని పేర్లు ప్రధాని పదవికి పోటీలో వినపడుతున్నాయి. పనిలో పనిగా తానూ రేసులో వున్నానని సంకేతాలిస్తున్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. వీరిలో ఎవరు నాయకుడెవరనేది తేల్చేది మొదట ఓటర్లయితే, ఆ తరువాత వారెన్నుకున్న కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు.

          కొంతకాలం క్రితం, కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆమె అప్పగించిన నలుగురిలో ఆమె తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే, సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం మొదలెట్టింది ఆనాటినుంచి. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో, అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి తిరిగొచ్చారని భావించారు పలువురు అప్పట్లో. ఇక ఆయన భజన బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, హజారే దీక్షకు స్పందనగా, పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్" తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను, రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం. హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా, లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించుతూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.

మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. కానివ్వక పోవచ్చు. ఒక వేళ అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం, "దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!

          ఈ నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఆ మధ్యన. అదే సమయంలో యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది. ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో సహా చర్చలకు నడుం బిగించారు. వారిద్దరిలో ఎవరు ప్రధాని అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!

          జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్ ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ, తప్పో-ఒప్పో, అప్పటికే ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!

          తన తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్ గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం, అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్ గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు. అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా, పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్ తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత మాత్రాన నాయకులు కాకుండా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం కలిగుండాలని లేనే లేదు.

          ఇన్ని తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే, ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే, ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే, కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!

          సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని మనసులో వుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!

Thursday, July 5, 2012

"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?: వనం జ్వాలా నరసింహారావు


"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?
సూర్య దినపత్రిక (06-07-2012)
వనం జ్వాలా నరసింహారావు

స్వర్గీయ పివి నరసింహా రావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా, ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరైనా రహస్యంగా అడుగుతే, వచ్చిన సమాధానం, మరొక్క సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వున్నదని అట. దానికి కారణం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడమే. అలానే ప్రణబ్ ముఖర్జీని ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరన్నా అడుగుతే ఠంఛన్‍గా వచ్చే సమాధానం, ఏ నాటికైనా ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాలని వుందని. ఆ కోరిక ఇక తీరే అవకాశం లేదు. ఒక సారి రాష్ట్రపతి ఐన తరువాత ప్రధాని అయ్యేందుకు కుదరదని తెలిసినా, ఆయన ఆ పదవిని ఎంచుకోవడానికి కారణం, ఇప్పట్లో, కాంగ్రెస్ పార్టీ మరో మారు అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనందునే. ఆ విషయం బాగా అర్థం చేసుకున్న ప్రణబ్, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, తనకెలాగూ ప్రధాని అయ్యేందుకు వీలు కాదు అని భావించి రాష్ట్రపతి పదవికి అంగీకరించారు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, దేశంలోను, రాష్ట్రంలోను 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేనట్లే. దీనికి కారణాలు అనేకం. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి కాయ కల్ప చికిత్స చేసినా, ఆంధ్రప్రదేశ్ చేయి జారిపోయినట్లే!
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొంది 2009 లో మరో మారు ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు గురిచేస్తోంది.


అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య గారి నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని ఈ వ్యాస రచయిత భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది. 
2009 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ విజయం, తెలంగాణలో తెరాస అభ్యర్థి విజయం కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించాయి. అధిష్ఠానానికి నెత్తి బొప్పి కట్టించేలా చేశాయి. నెత్తి మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం. కాకపోతే, చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు కాంగ్రెస్‌కు రెండు సీట్లిచ్చాయి. ఇదేదో తన ఘనతగా చాటుకుంటున్నాడు చిరంజీవి. ఆయన తన సినీరంగ పలుకుబడితో జనాలను ఆకర్షించుకోగలడేమో కాని, ఓటర్లను ఆకట్టుకోలేరనేది మరో మారు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసో-తెలియకో, ప్రత్యక్ష జోక్యంతోనో-పరోక్ష ఒత్తిడితోనో, ఆ పార్టీ రచించిన ప్రణాళికా వ్యూహం బెడిసికొట్టిందనాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్-తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర ప్రతికూలతకు దారి తీశాయి. మరి ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే, నాలుగో కృష్ణుడి రూపంలో, జైపాల్ రెడ్డో-జానారెడ్డో-శషిధర రెడ్డో-డి. శ్రీనివాసో-లేదా, మరో వ్యక్తో రావాలి. కాకపోతే ఆ వచ్చే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కాదన్న నమ్మకం లేదు.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర, రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డకో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా? ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?  
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌ గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్తమౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన తెలంగాణ అంశంపైన, వైఎస్‌ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌ దూకుడు పైన రాహుల్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు మీడియా కధనాలొచ్చాయి. రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు. ఇప్పటికే రాహుల్‌ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమై పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారంటున్నారు. అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్‌ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
సీనియర్ పార్టీ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డికి రాహుల్ కబురు పంపి మరీ కలుస్తున్నాడు. ఈ కలయిక వెనుక కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆశయముందా? లేక తాత్కాలికంగా నాయకత్వ మార్పు గురించిన ఆలోచన వుంటుందా? ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేం. ఇటీవల కాలంలో పాల్వాయి గోవర్ధన రెడ్డిని సంప్రదించడం కొంచెం ఎక్కువైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ నాయకత్వం మార్చే అవకాశం వుంటే, సీనియర్ నాయకుడైన ఈ తెలంగాణ ప్రాంత వ్యక్తికి కూడా అవకాశాలుండవచ్చేమో! ఏదేమైనా ప్రత్యేక తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా, రాయల తెలంగాణాను ఏర్పాటు చేసి, తెరాసతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన సీమాంధ్ర ప్రాంతానికి మొదలు ఢిల్లీ నుంచి ఒక నాయకుడిని దిగుమతి చేసి ముఖ్యమంత్రిని చేయడం, ఆ తరువాత చిరంజీవిని పీఠం ఎక్కించడం జరగొచ్చని భావిస్తున్నారు.

Wednesday, June 27, 2012

రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!
సూర్య దినపత్రిక (28-06-2012)
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలా రాష్ట్రంలో ఏం జరుగుతోందా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేకించి, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర-రాష్ట్రేతర విశ్లేషకులకు, ఆ ఫలితాల మర్మం ఏంటో? అన్న చిక్కుముడిని విప్పే పనిలో పడిపోయారానక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ-ఆమె కుమారుడు, ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం ఈ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా కలగక మానదంటునారు ఆ పరిశీలకులు. పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు, వైఎస్సార్ తనయుడు, "రెబెల్" వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు వేస్తోంది. తాను నమ్ముకున్న-తననే నమ్ముకున్నారని భావిస్తున్న రాష్ట్ర ప్రజలను "ఓదార్పు యాత్ర" పేరుతో కలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు ధోరణిని అల నాడు అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయన కోరుకున్న విధంగా చేయడానికి ఆయనను అనుమతి ఇచ్చినట్లయితే, ప్రజల సానుభూతి-సహానుభూతి పొంది, ఒక ప్రజానాయకుడుగా జగన్ ఎదిగేందుకు దోహదపడుతుందని అప్పట్లో అధిష్ఠానం భావించి, ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది. మొన్న జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. వీటన్నింటి నేపధ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి భారత ప్రధానిగా చూడడమే! అది ఇలా సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!


అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం, కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాల రాసింది. రాజగోపాలాచారిని రాష్ట్రపతి కాకుండా చేయగలిగింది. ఎదురుతిరిగిన వైబి చవాన్ ను, మొరార్జీ దేశాయ్ ని, ఆ మాటకొస్తే ఎంతో మంది అతిరధ-మహారధులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. అలాంటప్పుడు జగన్ స్థాయి నాయకుడిని, ఆయన ఇష్టం వచ్చినట్లు చేయనివ్వడానికి అధిష్ఠానం ఎలా అంగీకరించుతుంది? అది గతం. ఇక ఇప్పుడో? రెండేళ్ల తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఇప్పటికే ఉప ఎన్నిక ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్ పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. సోక్రటీస్ దగ్గర నుంచి అరిస్టాటిల్ వరకు వాటి రుచి ఎరిగినవారే.
పవర్ పాలిటిక్స్ అనే ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. ఆ మాటకొస్తే, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలలో పవర్ పాలిటిక్స్ అనాదిగా వస్తున్న ఆచారమేనేమో! రామాయణ , మహాభారత కావ్యాలలో, భగవద్గీతలో, చాణక్యుడి అర్థశాస్త్రంలో, కుటిల రాజకీయాల గురించి అనేకానేక విషయాలు చెప్పడం జరిగింది. "నారద మహా మునులు", "మామ శకునిలు", "కౌటిల్యులు" మనకు కనిపించుతారు సందర్భోచితంగా. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పురాతన-ఆధునిక కాలపు పవర్ పాలిటిక్స్ ను , అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికల ఫలితాలు దానికొక ఉదాహరణ మాత్రమే! ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే! ఈ పరంపరలో జారి ప్రయోజనాలు దెబ్బతిన్నా పర్వాలేదు.
ఢిల్లీ దర్బారులో జగన్మోహన్ రెడ్డికి "గాడ్ ఫాదర్" గా కొందరు భావిస్తున్న బెంగాల్ దాదా ప్రణబ్ కుమార్ ముఖర్జీ, మరో నెల రోజుల లోపు భారత రాష్ట్రపతి కాబోతున్నారు. వాస్తవానికి, ప్రణబ్ కున్న అనుభవం రీత్యా, పరిణితి రీత్యా, సీనియారిటీ రీత్యా, రాజకీయ స్థితప్రజ్ఞత రీత్యా, ఏ కోణం నుంచి చూసినా, మన్మోహన్ సింగ్‌కు ఆయనే వారసుడు కావాలి. ప్రధాన మంత్రి పదవికి ఆయనకంటే అర్హుడు మరెవ్వరూ లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‍కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్తున్నది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ భాగస్వామ్య పార్టీల నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడానికి అన్నీ అడ్డంకులే. బిజెపి, దాని మిత్ర పక్షాలలో కూడా అలజడి రేగింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లోనే ఏకాభిప్రాయం లేదు. కుదరదు కూడా. ఇక రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ బయటకు తెచ్చింది. ఎప్పుడైతే పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని గుంజుకుంది. కీలకమైన ఉప ఎన్నికల సమయంలో జగన్ జైలు పాలయ్యాడు. ఆయన జైలుకు పోతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లబ్ది పొందేందుకు బదులుగా, సానుభూతి పవనాలతో భారీగా నష్టపోయింది. ఓటర్ల మనోగతాన్ని పసికట్టడంలో దారుణంగా విఫలమైంది. విజయమ్మ కన్నీళ్లు వైఎస్సార్ సీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టాయి. షర్మిల హావభావాలు రాజశేఖర రెడ్డిని తలపించాయి. జగన్ కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనుందని కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించలేకపోయింది. నష్టం జరిగిపోయింది. ఘోరంగా ఓటమి పాలైంది. పది స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది. ఓటు బాంకుకు గండి పడింది. ప్రధాన ప్రతిపక్షం కూడా మట్టి కరిచింది.
జగన్ తల్లీ-కూతురు, గాయపడ్డ కొదమ సింహాలలా ఓటర్ల ముందు రెచ్చి పోయారు. భర్తను పోగొట్టుకుని, కొడుకును జైలు పాలు చేస్తుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వున్నాననని విజయమ్మ అంటే, తండ్రిని పోగొట్టుకుని అన్నను జైలులో చూడాల్సి వస్తున్నదని షర్మిల వాపోయింది. ఓటర్లు సానుభూతి విపరీతంగా పోగైంది. మరో పక్కన జగన్‌పై సిబిఐ దర్యాప్తు కూడా ముమ్మరమైంది. దారుణ పరాభవం తప్పదనుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ-రాష్ట్ర స్థాయి కీలకమైన నాయకులను ప్రచార రంగంలోకి దింపింది. గులాం నబీ ఆజాద్, చిరంజీవి, పురంధరేశ్వరి, రేనుకా చౌదరి, వైలార్ రవి లాంటి వారెందరో తమ వంతు పాత్ర పోషించినా ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు జైలులోనే వుంటాడన్న ప్రచారమూ జరిగింది. డబ్బు విషయంలో అటు కాంగ్రెస్ పార్టీకి కాని , ఇటు జగన్మోహన్ రెడ్డికి కాని ఎదురే లేదు. "ఓటుకు నోటు" అన్న నినాదం ఓటర్లను కించపరిచే స్థాయి వరకూ పోయింది. నిజంగా డబ్బు ఓట్లను తెచ్చిందా? లేదా? అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి. ఒక్క నెల్లూరు లోక సభ పరిధిలోనే వందల కోట్లు ఖర్చైందని వార్తలొచ్చాయి. పట్టుబడ్డ పైకమే అరవై కోట్లకు పగా వుందంటే ఖర్చైంది ఎంతో అంచనా వేసుకోవచ్చు. కేజీల కొద్దీ బంగారం, లీటర్ల కొద్దీ మద్యం కూడా పట్టుబడింది. ఇంత జరుగుతున్నా, న్యాయస్థానానికి వచ్చేటప్పుడు-పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాసాగా నవ్వుకుంటూ-చేతులు ఊపుకుంటూ వుండడం గమనించాల్సిన విషయం.
ఇదంతా పరిశీలుస్తున్న విశ్లేషకులకు అంతా గమ్మత్తుగా వుంది.