Thursday, February 28, 2019

ఆర్ధిక వివేకం అర్థం చేసుకోవాలి ..... తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం-1 : వనం జ్వాలా నరసింహారావు


ఆర్ధిక వివేకం అర్థం చేసుకోవాలి
తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం-1
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (01-03-2019)
మొదటి విడత నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో వున్న కేసీఆర్ సారధ్యంలోని ప్రభుత్వాన్ని అహర్నిశలూ విమర్శించడంతో పాటు, వారి-వారి ఎన్నికల హామీలలో ఏదేదో చేస్తామని చెప్పిన ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మని ప్రజలు-ఓటర్లు మళ్లీ తెరాస పార్టీకే పట్టం కట్టారు. అఖండ విజయం చేకూర్చి పెట్టారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర శాసనసభకు, శాసనమండలికి వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించడం, దాన్ని ఉభయ సభలు ఆమోదించడం, ద్రవ్య వినియోగ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపడం జరిగింది. ఈ యావత్తు ప్రక్రియలో పసలేని ప్రతిపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి ధీటైన-ఆసక్తికరమైన సమాధానం చెప్పడం కూడా జరిగింది. బడ్జెట్ చర్చకు ఇచ్చిన సమాధానంలోను, ఆ తరువాత ద్రవ్య వినియోగ బిల్లుపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలోను, పలు అంశాలను ముఖ్యమంత్రి సందర్భోచితంగా లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఆ దిశగా ఒక విజ్ఞాన సర్వస్వం లాంటివనవచ్చు.

సభలకు సమర్పించి ఆమోదం పొందింది వోట్ ఆన అకౌంట్ బడ్జెట్ మూడు నెలలకా? నాలుగు నెలలకా? ఆరు నెలలకా? అనే ప్రతిపక్షాల విమర్శకు అర్థం లేదు. ఎన్ని నెలలకు తీసుకోవాలనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే వుంది. అసలు బడ్జెట్ గుణాత్మకమా? కాదా? అనేదే చూడాలికాని, ఎంతమేరకు గణాత్మకం అనేది అప్రస్తుతం.

తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ “ఎఫ్ఆర్బీఎం” పరిధులు దాటలేదు. అదే ఈ ప్రభుత్వానికున్న విశ్వసనీయత, గౌరవం. దీన్నే తెలంగాణ భాషలో చెప్పాలంటే “పతారా” అంటారు. ప్రభుత్వాలు స్వంతంగా మార్కెట్ కు పోయి డబ్బులు తీసుకునిరాదు. అటు కేంద్రానికైనా, ఇటు రాష్ట్రానికైనా రిజర్వ్ బాంక్ నోడల్ ఏజన్సీగా వుంటుంది. ఏ ఒక్క రూపాయి అప్పు తీసుకున్నా ఆర్బీఐ ద్వారానే తీసుకుంటుంది ప్రభుత్వం. ఎంత అవసరం వుంటుందో అంత మొత్తానికి రాతపూర్వకమైన ప్రతిపాదన ఇస్తుంది ప్రభుత్వం. అప్పుడు ఆర్బీఐ ఆ అభ్యర్థనను వివిధ ఆర్ధిక సంస్థలకు, అది ఎల్ఐసీ కావచ్చు, వాణిజ్య బాంక్ కావచ్చు, లేదా మరే ఇతర సంస్థ అన్నా కావచ్చు,  వారికి పంపుతారు. ఇది ప్రతినెలా రిజర్వ్ బాంక్ బిజినెస్. ఫలానా రాష్ట్ర, లేదా, కేంద్ర ప్రభుత్వం ఇంత మొత్తం కావాలంటూ అడుగుతున్నదని మార్కెట్ లో పెడతారు. పతారా వున్న తెలంగాణ రాష్ట్రాల లాంటి వాటికి తొందరగా లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం గొప్పతనం ఏంటంటే, ఇది కొత్త రాష్ట్రం అయినప్పటికీ, 25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయి. తెలంగాణ బాండ్స్ ను బాంకులు పోటీ పడి కొనుక్కున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.

వాస్తవానికి ఐఎమ్ఎఫ్, నాబార్డ్ లాంటి సంస్థల తీరుతెన్నులకూ, మన పల్లెల్లో వున్న అప్పులు ఇచ్చేవాళ్ళకు పెద్ద తేడాలేదనాలి. వీళ్లు ఇంకా హుషారుగా వుంటారు. క్లిష్టమైన విశ్లేషణ చేసిగాని అప్పులివ్వరు. ప్రభుత్వం అడిగిన అప్పుకు లక్షా తొంభై పత్రాలు అడుగుతారు. ప్రభుత్వ ఆర్ధిక శాఖ వాళ్లు అవన్నీ సమర్పించడానికి నానా ఇబ్బంది పడతారు. వాళ్ళు చాలా నిశితంగా ప్రభుత్వ పనితీరును, లెక్కలను, ఖర్చుల వివరాలను నిశితంగా పరిశీలించి మర్చిపోయిన అంశాలను గుర్తుచేస్తారు, తప్పొప్పులను ఎత్తి చూపిస్తారు. పన్నుల వసూళ్లను, ప్రభుత్వ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాతే ప్రభుత్వానికి అడిగిన డబ్బు సమకూరుస్తారు తప్ప అలా వూరికే ఇవ్వరు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పనిచేసినా, ఎంత వేడుకున్నా వారికి ఋణాలివ్వరు కానీ తెలంగాణాకు ఇస్తున్నారు.


“విజ్డం ఆఫ్ ఎకానమీ” (ఆర్ధిక వివేకం) అంటే అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రయివేట్ బడ్జెట్ కు చాలా తేడా వుంది. ప్రభుత్వాలు చేసే అప్పులు ప్రయివేట్ అప్పుల మాదిరిగా వుండవు. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు దీన్ని అప్పుగా పరిగణించకూడదు. అప్పు తెచ్చి ఎందుకు, ఎక్కడ, ఎలా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యం. అది కాపిటల్ (మూలధన) వ్యయమా? మరొకటా? అనేది కూడా చూడాలి. వాటిమీద ఆధారపడి మాత్రమే సమకూర్చేవారు సమకూరుస్తారు. లేకపోతే లేదు. కేసీఆర్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఐదారు రోజుల్లోనే పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలెక్ట్రికల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, మరికొన్ని సంస్థలు ఋణం ఇవ్వడానికి సిద్ధంగా వున్నట్లు ప్రభుత్వానికి తెలిపాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ చివరి భాగం పనులు పూర్తికావడానికి కావాల్సిన నిధులు తెచ్చే ప్రయత్నంలో ఆర్థికశాఖ అధికారులున్నారు. ఇది అప్పులు చేయడం కిందికి రాదు. అలా ప్రతిపక్ష నాయకులు విమర్శించడం కూడా సబబు కాదు. ప్రయివేట్ వాళ్ళు తీసుకునే అప్పులు వేరు, ప్రభుత్వం చేసే అప్పులు వేరు. బడ్జెట్ తయారీలో నిధుల కూర్పు అని వుంటుంది. అది రాజ్యాంగం, భారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అనేక నిబంధనలు, పద్ధతులకు లోబడి వుంటుంది. దానికి మించి ప్రభుత్వం పోలేదు. భారత దేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సినంత స్వయంప్రతిపత్తి ఇవ్వలేదు. 15 వ ఆర్ధిక సంఘం రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం ఈ విషయాలను చాలా గట్టిగా, నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది. వాళ్లకిచ్చిన వివరణలో తన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన కూడా వుంది. దురదృష్టం ఏంటంటే, మన దేశంలో మనం అనుకున్నంత ప్రజాస్వామ్యం లేదు. అభివృద్ధి, ప్రజల జీవిక లాంటి ప్రాథమికతలు పోయి దురదృష్ట వశాత్తూ రాజకీయ ప్రాధాన్యతలు ముందుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం చిలిపి దృక్పధాన్ని అమలు చేస్తున్నాయి. అది యూపీఏ కావచ్చు, లేదా, ఎన్డీయే కావచ్చు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా విధానాల కేంద్రీకృతం ఎక్కువైంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రాల పరిధిలో వుండే అనేక శాఖలను, అనేక అంశాలను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి-అప్పటి ఎన్డీయే ప్రభుత్వం ఇద్దరూ కంకరెంట్ (ఉమ్మడి) జాబితాలో పెట్టాయి. ఈ జాబితా ఒక పెద్ద మాయ. అదొక తమాషా. విచిత్రమైంది. వాస్తవానికి రాష్ట్రాల జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని మూడు జాబితాలు రాజ్యాంగంలో వున్నాయి. ఉమ్మడి జాబితా అంటే రాష్ట్ర ప్రభుత్వాల మెడమీద కత్తిలాంటిది. ఉమ్మడి జాబితాకు సంబంధించి కేంద్రం జోక్యం లేకపోతే ఏదైనా అంశం విషయంలో రాష్ట్రాలు చట్టం చేసుకోవచ్చు. అలాకాకుండా కేంద్రం చట్టం చేస్తే అదే అమలవుతుంది. ఉదాహరణకు రాష్ట్రాల జాబితాలో వున్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. అంటే దానికి సంబంధించి కేంద్ర చట్టానికి ప్రాధాన్యత వుంటుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయాలమీద గంటల తరబడి చెప్పారు. సీఎంకు నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటుంది కాబట్టి, చాలా దురుసుగా ఇవే విషయాలను నీతీ ఆయోగ్ లో కూడా చెప్పారు. కాకపొతే అవన్నీ చెవిటివాడి ముందర శంఖం వూదినట్లుగానే వుంది. ఉదాహరణకు, ఎక్కడో ఒక గ్రామంలో వున్న ఒక ప్రాథమిక పాఠశాల నడపడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం వుండాలా? ఒక మారుమూల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంచి చెడ్డలు కేంద్రం చూడాలా? ఒక మారుమూల గ్రామంలో పనిచేసే దినసరి కూలీ వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ చేయాలా? ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఇక ఈ ముఖ్యమంత్రులు ఎందుకు? రాష్ట్ర మంత్రిమండలి ఎందుకు? రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శులు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద అట్టహాసం ఎందుకు? ఇంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలా? విత్త విధానాన్ని కూడా అదే పద్ధతిలో చాలా ధృఢంగా నిర్వహిస్తున్నది కేంద్రం. విస్తృత విత్త విధానం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుంది. రాష్ట్రాల పరిధిలో లేదు. జీఎస్డీపీలో మూడు శాతం మించి రాష్ట్ర ప్రభుత్వం ఋణం తీసుకోవాలంటే ఆర్ధిక శాఖ కార్యదర్శి కనీసం ముప్పై-నలబై సార్లు కేంద్రం చుట్టూ ప్రదక్షిణ చేయాలి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇది కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా (సెంట్రల్ డెవోల్యూషన్) కు సంబంధించినది. వాస్తవానికి దీనికి సంబంధించి ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. ఇది రాజ్యంగబద్ధంగా తెలంగాణకు రావాల్సిన డబ్బు. కేంద్రంలో గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికికంటే ముందున్న ఏ ప్రభుత్వమైనా తప్పకుండా, ప్రతినెలా ఒకటో తేదీనాడు సెంట్రల్ డెవోల్యూషన్ నిధులు రాష్ట్రానికి వచ్చేవి. దీనిమీద ఆధారపడి రాష్ట్రాలు జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులు చెల్లించేవారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి పంపిన లేఖకు ప్రాధాన్యత వుంది. ఆయన చెప్పింది....రాష్ట్రాల నుండి వివిధ రకాల పన్నుల మొత్తం కేంద్రానికి 15, 16 తేదీలకు మాత్రమే వస్తున్నాయి కాబట్టి, రాష్ట్రాలకు ఒకటో తేదీన ఇస్తే ప్రతినెలా ఒకటి నుండి 18 వ తేదీ వరకు వడ్డే పడుతుంది.....అందువల్ల ఒకటో తేదీన సెంట్రల్ డెవోల్యూషన్ ఇవ్వలేమని. ఇలా, కేంద్రం నుండి రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులను కూడా వారు అదిమిపట్టి ఇబ్బంది కలిగించే వ్యవహారం చేస్తున్నారు. కేంద్రంలోని పెద్దలకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందనేది భగవంతుడి దయ. భారత ప్రజానీకం తిరుగుబాటు చేసే స్థితి కలగవచ్చు. గుణాత్మకమైన మార్పు రాకపోవడం దురదృష్టకరమైన విషయం.

15వ ఆర్ధిక సంఘం ఇటీవల రాష్ట్రానికి వచ్చి, ఫిబ్రవరి 17 నుండి 20వ తేదీవరకు పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సమీక్షించింది. ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సమావేశమైంది. ఆ సమావేశంలో కేసీఆర్ చాలా గట్టిగా ఆర్ధిక సంఘం చైర్మన్ కు, సభ్యులకు తన వాదనను వినిపించారు. ఆయన చెప్పిన పలు విషయాలను కొన్ని పత్రికలు ప్రచురించాయి, కొన్ని అంతగా కవర్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వాలు ఒక విధంగా మొద్దు నిద్రలో పనిచేస్తున్నాయి అనాలి. విదేశీ మారక ద్రవ్య విలువలను బాలెన్స్ చేయడానికి కొన్ని నిధులు అవసరం కాబట్టి రిజర్వ్ బాంక్ లో కొన్ని నిధులు రిజర్వులో వుండాలి. కాని కేంద్రం దగ్గర వున్న నిల్వలు ఘోరంగా వున్నాయి. ప్రస్తుతం అవి రు.13,00,000 కోట్లున్నాయి. గతంలో నవరత్నాలుగా వున్నవి ఇప్పుడు మహారత్నాలయ్యాయి. వీళ్ళ దగ్గర కూడా సుమారు రు.11,00,000 కోట్లు రిజర్వులో వున్నాయి. వాళ్ళు ఆ డబ్బును ప్రతి పది-పదిహేను రోజులకొక సారి వేలం వేసి ఒక బాక్ నుంచి మరొక బాంకుకు, అక్కడి నుండి ఇంకో బాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధంగా సుమారు రు.24,00,000 కోట్లు ఈ బాంకుల మధ్యనే తిరుగుతుంది. ఈ మొత్తం దాదాపు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానం. అభివృద్ధిచెందుతున్న భారతదేశానికి ఈ నిధులు ఇంత పనిలేకుండా వృధాగా పడివుండడం అవసరమా? ఇది పెద్ద నేరమనాలి.
(ఇంకా వుంది...వచ్చే వారం)
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం ఆధారంగా

Saturday, February 23, 2019

అడుగడుగున గుడి వుంది (అలనాటి ఖమ్మం తాలూకాలోని ఆధ్యాత్మిక, యాత్రా స్థలాలు) : వనం జ్వాలా నరసింహారావు


అడుగడుగున గుడి వుంది
(అలనాటి ఖమ్మం తాలూకాలోని ఆధ్యాత్మిక, యాత్రా స్థలాలు)  
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (24-02-2019)
ప్రపంచ ప్రక్యాత వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన జన్మించి చాలాకాలం నివసించిన ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి గ్రామానికి ఫిబ్రవరి, 8, 2019 న వెళ్లాను. ఆ సందర్భంగా ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా జిల్లా కలెక్టర్ కర్ణన్ కు, ఆయన ద్వారా నాకు, ఎప్పుడో 1961లో అప్పటి ప్రభుత్వం ముద్రించిన (ఎ చంద్రశేఖర్ ఐఏఎస్ ద్వారా) నాటి ఖమ్మం జిల్లా జనాభా గణనకు సంబంధించిన పుస్తకం జీరాక్స్ కాపీని నాకిచ్చారు. పలు ఆసక్తికరమైన అనేక అంశాలతో పాటు ఆ పుస్తకంలో అలనాటి ఖమ్మం తాలూకాలోని ఉత్సవాలు, పండుగలు, జాతరలు నిర్వహించుకునే గ్రామాల వివరాలు, ఎక్కడెక్కడ ఏఏ దేవాలయాలున్నాయో ఆ వివరాలు కూడా వున్నాయి. ఒకప్పటి ఖమ్మం తాలూకా, నేటి ముదిగొండ మండలంలో నేను పుట్టి పెరిగిన వనంవారి కృష్ణాపురం గ్రామం వుండడాన, ఆసక్తికరంగా ఆ పుస్తకాన్ని చదివాను. ఇప్పటి తరానికి చాలామందికి తెలియని అ ఆవిషయాల సమాహారమే ఈ వ్యాసం.  

ఖమ్మంకి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది విచారిస్తే పట్టణ మధ్యలో ఉన్న నరసింహ స్వామి పేరు మీద స్థంబాద్రిగా వెలసిందిస్తంభాన్ని ఉర్దూలో ఖంబా అంటారుకనుక అందుకనే ఖంబానికి స్థంబాద్రి అనే పేరుతో మనం వ్యవహరిస్తాంప్రముఖ కవికవిత్వం ద్వారా నిప్పులు కురిపించిన దాశరధిఖమ్మం "తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖద్వారం" అన్నాడు. రంగారెడ్డి, లఖ్నారెడ్డి, వేమారెడ్డి అనే ముగ్గురు సోదరులు ఓరుగల్లు నుండి అపారమైన గుప్తనిధిని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి ఖమ్మం ఖిల్లాను, లఖ్నవరం చెరువును నిర్మించారని అంటారు. పౌరాణిక గాధల ఆధారంగా, ఏ గుట్టమీద కోట ఉన్నదో దాన్ని, కృతయుగంలో సాలగ్రామాద్రి అని, త్రేతాయుగంలో నరహరిగిరి అని, ద్వాపరయుగంలో స్థంబశిఖరి అని, కలియుగంలో స్తంబాద్రి అని పిలిచేవారట. అందుకే ఖమ్మానికి ఆ పేరొచ్చింది. ఖమ్మం పట్టణాన్ని ఆనుకుని మునేరు ఉపనది ప్రవహిస్తుంటుంది. స్తంబాద్రి మీద తపస్సు చేసిన మౌద్గల్య మహాముని పేరుమీదుగా ఉపనడికి ఆ పేరు వచ్చిందని అంటారు.

          ఒకనాటి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా వున్న ఖమ్మం, అక్టోబర్ 1, 1953 న కొత్త జిల్లాగా ఏర్పాటైంది. తిరిగి ఇటీవల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాను రెండుగా విడదీసి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంగా రెండి జిల్లాలను చేసింది ప్రభుత్వం. అప్పటి ఖమ్మం తాలూకా రెండు-మూడు మండలాలుగా మారి ఇప్పటికీ ఖమ్మం జిల్లాలోనే వుండిపోయాయి.

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికిరాజకీయ చైతన్యానికి-ప్రగతికివిద్యా వ్యాప్తికివ్యాపార-వాణిజ్య-వ్యవసాయ రంగాలకువైజ్ఞానిక స్ఫూర్తికి ఖమ్మం పర్యాయపదం అంటే అతిశయోక్తి కాదేమో! ఖమ్మానికి అద్వితీయమైన ప్రాచీన చరిత్ర కూడా వుంది. కొన్నాళ్లు కాకతీయుల వశంలోఆ తరువాత గోల్కొండ సుల్తానుల పాలనలోఆ క్రమంలో ఆసఫ్ జాహీలనిజాంల అధీనంలో వుండేది.

         భారతదేశంలో అనాదిగా పాటిస్తూవస్తున్న అనేక వేడుకల, పండుగల, ఉత్సవాల, సంస్కృతుల, కళల, హస్తకళల, తదితర సంబంధిత గ్రామీణ నైపున్యతా పనితనాల ప్రాముఖ్యత బ్రిటీష్ వారి పాలనాకాలంలో ఒకరకమైన నిరాదరణకు గురైందనాలి. వారనుసరిమ్చిన శిక్షాత్మక ఎగుమతి విధానం, యాంత్రిక వస్తువుల దిగుమతి విధానం కూడా వేడుకల, పండుగల, ఉత్సవాల మీద తీవ్రమైన ప్రభావం చూపాయి. ఒకప్పుడు గ్రామీణ వ్యాపార-వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించిన ఇవి కాలక్రమేనా అంతరించి పోయాయనాలి. ఈ నేపధ్యంలో అలనాటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్న జాతరలు, పండుగలు, ఉత్సవాలమీద ఒక సేవే చేపట్టాలని అప్పటి కేంద్ర రిజిస్త్రార్ జనరల్ అశోక్ మిత్రా సూచించారు. ఆ సర్వ్ ఆధారంగా ప్రతి గ్రామం, నగరం, పట్టణాలలోని ప్రతి జాతర, పండుగ, ఉత్సవం మీద సరైన సమాచార సేకరణకు ఒక ప్రశ్నావళిని రూపొందించారు. సర్వ్ చేసినవారు ప్రాధమికంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు. వాళ్లకు స్థానిక విషయాలమీద అవగాహన వుండడమే దీనికి కారణం.

         ప్రశ్నావళిలో గ్రామం వివరాలు; గ్రామ చారిత్రిక, పౌరాణిక ప్రాముఖ్యత; నివసించే కులాల వివరాలు; వారి జీవనోపాధులు; వారి మతాలు; గ్రామంలో దేవతారాధన, ఉత్సవాలు, పండుగలు, వాటికి సంబంధించిన జాతరలు లేక సంతలు; దేవతలా ఆరాధన ఉత్సవాలు; ఉత్సవం పేరు, సందర్భం, సమయం, జరిగేది ఎంతకాలం?; రకరకాల మొక్కుబడుల వివరాలు; జాతరలు ఏర్పాటు చేసే స్థలాల వివరాలు; ఆ సందర్భంగా పెట్టే అంగళ్ళ వివరాలు; గ్రామంలో వ్యవసాయ పనివాళ్ల పరికరాల వివరాలు; కళల, వృత్తుల, చేనేత వస్తువుల లాంటి వాటి వివరాలు; యాత్రీకుల వివరాలు; తదితర అంశాలున్నాయి. ఈ ప్రశ్నావళి ఆధారంగా ఖమ్మం తాలూకాలో ఇతర వివరాలతో పాటు దేవాలయాల వివరాలు చాలా ఆసక్తిగా, అధ్యయనపరంగా, గత చరిత్ర గుర్తు చేసే విధంగా వున్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక దేవాలయం వుంది. గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, అంకమ్మ, మైసమ్మ గుళ్లు అన్ని గ్రామాల్లో వున్నాయి.


         ఖమ్మం పట్టణంలో స్తంబాద్రి లక్ష్మీ (నృ)నరసింహస్వామి గుడి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ స్వామి పేరుమీదే వున్న గుట్ట పైన హనుమంతుడి ఆకారంలో వున్న స్వయంభు రాతి విగ్రహానికి సింహం ఆకారంగల శిరస్సు వుంటుంది. పురాతన కాలంలో ఋషులు స్వామిని అక్కడ ప్రతిష్టించారని నమ్మకం. కిందభాగంలో ఒకటి, పైభాగంలో మరొకటి, రెండు కోనేర్లున్నాయిక్కడ. నరసింహస్వామి ఉగ్రరూపంలో వున్నప్పుడు గట్టిగా గుట్ట మీద ఒక పాదం మోపగా ఏర్పడిందే ఈ కోనేరని ఒక నమ్మకం. వాస్తవానికి మరో పాదం గుర్తు దగ్గరలోనే కనిపిస్తుంది కూడా. గుట్టమీద వున్న స్తంబాద్రి లక్ష్మీ (నృ)నరసింహస్వామి దేవాలయంతో పాటు, ఖమ్మం పట్టణంలో, వేంకటేశ్వరస్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి, ముత్యాలమ్మ గుడి, శివ, రామ, గుంటి మల్లేశ్వర స్వామి, యాదగిరిస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా వున్నాయి. స్తంబాద్రి లక్ష్మీ (నృ)నరసింహస్వామి కల్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి దాకా ఐదు రోజులు జరుగుతుంది. ఆ సందర్భంగా ఒకప్పుడు జాతర కూడా జరిగేది. హరికథలు, ఆధ్యాత్మిక కచేరీలు, నాటకాలు, నిర్వహించేవారు. మిగతా దేవాలయాలకు సంబంధించి కూడా ఉత్సవాలు జరుగుతాయి.

         ఇక చుట్టుపక్కల తాలూకాలోని గ్రామాల విషయానికొస్తే.....కాకరవాయి గ్రామంలో గోపాలస్వామి, గ్రామ దేవతలైన కనకదుర్గమ్మ, ముత్యాలమ్మ గుళ్లు వున్నాయి. కనకదుర్గమ్మ, ముత్యాలమ్మ జాతరలు గ్రామంలో శ్రావణ మాసంలో రెండు రోజులపాటు నిర్వహిస్తారు. విరివిగా కొబ్బరికాయలు కొట్టుతారు. జంతు, పక్షి బలి ఇస్తారు. మేడిదేపల్లి గ్రామంలో ఒక దేశ్ముఖ్ గారి మామిడి తోటలో మూడు అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేస్తారు. సగం విగ్రహం భూమిలో పాతిపెట్టబడి వుంటుంది. విగ్రహానికి దేవాలయం అంటూ ఏదీ లేదు. ఏటేటా ఒకరోజు హనుమాన్ ఆరాధన కార్తీక శుద్ధపూర్ణిమ నాడు జరుపుతారు. అదేవిధంగా గ్రామదేవతలైన గడి మైసమ్మ, ముత్యాలమ్మ, బొడ్డురాయి కూడా వున్నాయి గ్రామంలో. గడి మైసమ్మ పూజ శ్రావణ మాసంలో జరిపి జంతువులను, పక్షులను బలి ఇస్తారు. పూజారులకు వారసత్వ హక్కులుంటాయి. బీరవెల్లి గ్రామంలోని  రామలింగేశ్వరస్వామి దేవాలయంలో శివలింగం ఆకారంలో విగ్రహం వుంది. భద్రకాళి, వీరభద్ర విగ్రహాలు కూడా వున్నాయి. ఇవికాక పైకప్పు లేని ఆలయంలో హనుమంతుడి విగ్రహం, వేపచెట్టు నీడలో ఒక ముత్యాలమ్మ గుడి, ఒక చర్చ, ఒక చావిడి కూడా వున్నాయి. కట్ట మైసమ్మ, గడి మైసమ్మ, ఉప్పలమ్మ, మల్లన్న గుళ్లు కూడా వున్నాయి. రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం చైత్ర శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కొబ్బరి, పులిహోర, పండ్లు స్వామికి అర్పిస్తారు. ముత్యాలమ్మ, కట్ట మైసమ్మ జాతరలు కూడా జరుగుతాయి. బోనాలు సమర్పించుకుంటారు స్థానికులు. జంతుబలి కూడా వుంటుంది.

         పాతర్లపాడు గ్రామంలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం వున్నాయి. స్వామివారి కల్యాణం వైశాఖ సుద్ధ పూర్ణిమనాడు జరుగుతుంది. ముత్యాలమ్మ, పోలేరమ్మ, బొద్దురాయిలను కూడా ఆరాధిస్తారు. జుజ్జాల్రావుపేటలో శివలింగ ఆకారంలో కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం, ముత్యాలమ్మ గుడి, పీర్ల చావిడి వున్నాయి. మాఘబహుల ద్వాదశి నుండి నాలుగు రోజులపాటు కాశీవిశ్వేశ్వరస్వామి కల్యాణం జరుగుతుంది. శ్రావణ-కార్తీక మాసాలలో ముత్యాలమ్మ పూజలు నిర్వహిస్తారు గ్రామస్థులు. పెరికసింగారంలోని వేణుగోపాలస్వామి ఉత్సవాలు పదిరోజులపాటు జరుగుతాయి. ఒకనాటి రామాలయంతో పాటు దరిమిలా రూపుదిద్దుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయాలు జీళ్ళచెరువు గ్రామంలో వున్నాయి. సీతారాముల కల్యాణం చైత్ర సుద్ధ నవమినాడు జరుగుతుంది. గుట్టమీది వెంకటేశ్వర స్వామి దేవాలాయానికి పలువురు యాత్రీకులు వస్తుంటారు. తిరుమలాయపాలెంలో శివకల్యాణాన్ని ఎనిమిది రోజులపాటు జరుపుకుంటారు. ఎదుళ్ళచెర్వు గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం, ముత్యాలమ్మ, మారెమ్మ విగ్రహాలు మాత్రమే వున్నాయి. ముత్యాలమ్మ, మారెమ్మ జాతరలు ఒకరోజుపాటు జరుగుతాయి. కార్తీక శుద్ధ పూర్ణిమనాడు ఆంజనేయస్వామికి అభిషేకం జరుగుతుంది.

          తెల్ల శివలింగం, మానవ ఆకారంలో పార్వతి విగ్రహం వున్న రామలింగేశ్వరస్వామి దేవాలయం, అదే కాంపౌండులో రాతి హనుమాన్ విగ్రహంతో ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ, మారెమ్మ గుళ్లు వెంకటాయపాలెం గ్రామంలో వున్నాయి. పదకొండు రోజులపాటు జరిగే రామలింగేశ్వరస్వామి కల్యాణం కార్తీక శుద్ధపూర్ణిమ నాడు మొదలవుతుంది. ముత్యాలమ్మ, మారెమ్మ జాతరలు కూడా జరుగుతాయి గ్రామంలో. ముత్తగూడెంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి ఆరాధన కార్తీక శుద్ధపూర్ణిమ, చైత్ర శుద్ధ నవమి నాడు జరుగుతుంది. ముత్యాలమ్మ కొలుపు శ్రావణ మాసంలో జరుగుతుంది. గొల్లపాడు గ్రామంలో కేవలం ముత్యాలమ్మ దేవతను ఆరాధిస్తారు గ్రామస్థులు. మూడు రోజులపాటు శ్రావణ మాసంలో ముత్యాలమ్మ జాతర నిర్వహిస్తారు. అదే నెలలో ఒక శుక్రవారం నాడు గ్రామస్థులు వనభోజనాలకు వెళ్తారు. తీర్థాల గ్రామంలో సంగమేశ్వరస్వామి దేవాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం వున్నాయి. మాఘబహుల త్రయోదశి నుండి ఫాల్గుణ శుద్ధ విదియ వరకు ఐదురోజులపాటు సంగమేశ్వరస్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా ఒక జాతర కూడా వుంటుంది. మంచుకొండ గ్రామంలో ఒక చిన్న ముత్యాలమ్మ గుడి, హనుమంతుడి గుడి, ఒక చర్చ్ వున్నాయి. ముత్యాలమ్మ జాతర శ్రావణమాసంలో జరుగుతుంది. ఆ సందర్భంగా కళ్ళు తాగడం ప్రత్యేకత. శివారు గ్రామం బూడదంపాడులో కూడా ఇలాగే జరుగుతుంది.

         ఇర్లపూడి గ్రామంలో ముత్యాలమ్మ గుడి వుంది. శ్రావణ మాసంలో జాతర జరుగుతుంది. గుదిలేకపోయినా ఒక పటం పెట్టి శ్రీసీతారామ కల్యాణం చైత్ర శుద్ధ నవమినాది జరుపుకుంటారు గ్రామస్థులు. పప్పు, పానకం స్వామికి సమర్పించి భజన చేస్తారు. గుదిమళ్ళ గ్రామంలో శివాలయం, ఆంజనేయుడి గుడి వున్నాయి. గౌరవంగా భావించే జానపద స్త్రీదేవతైన తిరుపతమ్మ గుడి కూడా వుంది గ్రామంలో. తిరుపతమ్మ తిరునాళ్లు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునేవారు. ఆమెను ఆరాధిస్తే కోరినకోరికలు నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం. రాతి విగ్రహం వున్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒక గుట్టమీద వుంది ముదిగొండ గ్రామంలో. ఏడు రోజులపాటు జరుపుకునే స్వామి ఉత్సవాలు ఏటేటా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు మొదలై బహుళ విదియ వరకు కొనసాగుతాయి. సమీపంలోని ఎడవల్లి గ్రామంలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు రెండున్నాయి. ఒకటి గ్రామంలో, మరొకటి గ్రామానికి మైలు దూరంలోని ఒక గుట్టమీద వున్నాయి. స్వామి కల్యాణోత్సవం గుట్టమీద ఏటేటా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు మొదలై 11 రోజులపాటు జరుపుకుంటారు. ముత్యాలమ్మ, కాటమయ్య గుళ్లు కూడా వున్నాయి వూళ్ళో. గోకినేపల్లి గ్రామంలో శివాలయం, హనుమంతుడి గుడి వున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని ఒక్కరోజు ఉత్సవంలా జరుపుకుంటారు గ్రామస్థులు. ఒకప్పుడు గోవులపల్లెగా పిలిచే గ్రామమే గోకినేపల్లిగా మారిందంటారు.

         చారిత్రిక ప్రసిద్ధికన్న గుర్రాలగూడెం  (గువ్వలగూడెం) గ్రామం పౌరాణిక కాలం నుండీ వుండేదని అంటారు. ఈ గ్రామం దక్షిణ భాగాన యాదవుల రాజ్యం వుండేదట. హనుమంతుడివి, ఇతర గ్రామ దేవతలవి అనేక విగ్రహాలు ఇక్కడ తవ్వకాల్లో లభించినవి. రైతులు భూమిని తవ్వుతుంటే నాణేలు దొరికాయిక్కడ. పాండవులు అజ్ఞాతవాసం చేసిన విరాటనగర ప్రాంతం ఇదేనని కూడా అంటారు. ఈ గ్రామానికి అనతిదూరంలోనే, నేలకొండపల్లి సమీపంలో, ముజ్జిగూడెం దగ్గర విరాటరాజు దిబ్బ, కీచక గుండం వున్నాయి. (విరాటరాజు దిబ్బ ఇప్పుడు పెద్ద బౌద్ధ ఆరామం). గువ్వలగూడెంలో ఒక ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ గుడి వున్నాయి. హనుమంతుడి గుళ్లో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు దీపోత్సవం జరుపుకుంటారు. ఆంజనేయస్వామి గుడి వున్న మరో గ్రామం చెన్నవరంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. వర్తక-వాణిజ్యానికి గ్రామీణ కేంద్రమైన నేలకొండపల్లి గ్రామాన్ని ఒకప్పుడు “భూగిరి” అని పిలిచేవారు. భద్రాచల రామాలయం నిర్మించి, భక్త రామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్న జన్మించిన గ్రామం ఇది. మహాభారతకాలం నాటి ఆనవాళ్లు గ్రామం సమీపంలో అనేకం వున్నాయి. నేలకొండపల్లిలో శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, భీమేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాలు వున్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రాచీనమైనదని చెప్పుకుంటారు. శివరాత్రి, దసరా, కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు ఈ గ్రామంలో.

         పమ్మి గ్రామంలో చేన్నకేశవస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాలతోపాటు నాసర్ మస్తాన్, అచ్చయ్య మఠాలున్నాయి. నాసర్, అచ్చయ్యలు ఇస్లాం, హిందూ మతాన్ని బోధించిన స్థానిక సన్న్యాసులు. అందుకే వారి గౌరవ సూచకంగా మఠాలున్నాయి. చేన్నకేశవస్వామి కల్యాణం మూడురోజులపాటు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నుండి మొదలవుతుంది. జాతర కూడా ఆ సందర్భంగా జరుగుతుంది. కార్తీక బహుళ పంచమి నుండి నాలుగు రోజులపాటు నాసర మస్తాన్, అచ్చయ్యల ఉత్సవాలు జరుగుతాయి. ఊరేగింపు కూడా తీస్తారు. అపర భద్రాచలంగా పిలవబడే ముత్తారం గ్రామంలో, వామాంక సీత రూపంలో రామ, లక్ష్మణ, సీత స్వయంభు విగ్రహాలున్నాయి. శ్రీరామనవమి ఐదురోజులపాటు చైత్ర శుద్ధ నవమి నుండి ఘనంగా జరుపుకుంటారు. భద్రాచలంలో మధ్యాహ్నం జరుగుతే ఇక్కడ రాత్రి జరుగుతుంది కల్యాణం. ఇప్పటికీ భద్రాచలం నుండి, అక్కడ కల్యాణం అయిన తరువాత, అక్కడి తలంబ్రాలు ఇక్కడికి తేవడం ఆనవాయితీగా వస్తున్నది.

         లచ్చగూడెంలో రాతి విగ్రహంతో నరసింహస్వామి దేవాలయం, హనుమంతుడి గుడి వున్నాయి. వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు, కార్తీక శుద్ధ పూర్ణిమనాడు నరసింహస్వామి ఉత్సవాలు స్థానిక హంగులతో జరుగుతాయి. మరో గ్రామం పాతర్లపాడులో శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, ఒక చర్చ్ వున్నాయి. ఆంజనేయస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ఐదురోజులపాటు పుష్య బహుళ ఏకాదశి నుండి జరుపుకుని, భజనలు చేస్తారు. శివకల్యాణం చైత్ర శుద్ధ పూర్ణిమనాడు జరుపుకుంటారు. చింతకాని గ్రామంలో శంఖచక్రాలు ధరించిన విష్ణు విగ్రహం, ఇరుపక్కలా శ్రీదేవి, భూదేవి విగ్రహాలున్న చెన్నకేశవస్వామి ఆలయం వుంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుండి బహుళ పంచమి వరకు ఆరు రోజులపాటు స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ. ఇక నాగులవంచ గ్రామం విషయానికొస్తే, అక్కడ రామ, సీత, లక్ష్మణ రాతివిగ్రహాలున్న కోదండరామస్వామి దేవాలయం వుంది. మూడురోజులపాటు, చైత్ర శుద్ధ నవమి నుండి ఏకాదశి వరకు, శ్రీసీతారామ కల్యాణం ఘనంగా జరుపుకుంటారిక్కడ. ఆ సందర్భంగా జాతర కూడా జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో సుమారు ఎనిమిది గజాల వ్యాసంతో ఒక పెద్ద 150 సంవత్సరాలనాటి (అప్పటికి) వేగు చెట్టు వుంది.

         తిమ్మినేనిపాలెం గ్రామంలో మల్లేశ్వరస్వామి (శివ), హనుమంతుడు, ముత్యాలమ్మ, అంకమ్మ గుడులున్నాయి.  గ్రామానికి రెండు మైళ్ల దూరంలో గుట్టమీద పానకాల (గజగిరి) నరసింహస్వామి దేవాలయం కూడా వుంది. మల్లేశ్వరస్వామి గుడి గురించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో వుంది. 400 సంవత్సరాల క్రితం ఒక గ్రామస్తుడు సమీపంలోని మునేరు నదిలో కొట్టుకొచ్చిన ఇటుకలను తన ఇంటి ముంది పేర్చగా అదే శివాలయంగా కాలక్రేమేణా రూపుదిద్దుకుంది. పానకాల నరసింహస్వామి స్వయంభు-వెలిసిన విగ్రహం. ఇక్కడి పానకాల స్వామి నోట్లో భక్తులు ఎంత పానకం పోసినా, సగం మింగి మిగతా సగం బయటకు తీస్తాడు. మల్లేశ్వరస్వామి ఉత్సవాలు (శివరాత్రి) మూడురోజులపాటు మాఘ బహుళ త్రయోదశి నుండి అమావాస్య దాకా జరుగుతాయిక్కడ. సమీపంలోని మునేరులో భక్తులు స్నానాలు చేసి దేవుడిని పూజిస్తారు. అలాగే గజగిరి (పానకాల) నరసింహస్వామి కల్యాణం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుండి ఐదురోజులపాటు జరుగుతుంది. వల్లాపురం కొండపల్లె గ్రామంలో శివకళ్యాణం మాఘ బహుళ చతుర్దశి నాడు జరుగుతుంది. కమలాపురం గ్రామంలో రామలింగేశ్వరస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలున్నాయి. మహాలక్ష్మమ్మ గుడి కూడా వుంది. ఐదురోజులపాటు అంకమ్మ తిరునాళ్లు జరుపుకోవడం నాదిగా వస్తున్న ఆచారం ఇక్కడ. ఆ సందర్భంగా జాతర కూడా జరుగుతుంది.    

పంచవటి సమీపంలో మాయా మృగమైన మారీచుడు, కావాలన్న సీత .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-49 : వనం జ్వాలా నరసింహారావు


పంచవటి సమీపంలో మాయా మృగమైన మారీచుడు, కావాలన్న సీత  
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-49
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (24-02-2019)
         ఇదంతా చెప్పిన మారీచుడు రావణాసురుడిని చూసి, ఇంకా తాను ఆయన మాట వినడం ఆలశ్యం చేస్తే, వెంటనే చంపుతాడేమో అన్న భయంతో, “రావణా! లే. పోదాం పద. విల్లు, బాణాలు, కత్తి ధరించిన రాముడిని చూడగానే దిగులుతో నిలుచున్నవాడిని నిలుచున్నట్లే చస్తాను. నన్ను చంపడానికి ఆయన దర్శనమే చాలు. ఇది వాస్తవమైతే, యుద్ధరంగంలో రామచంద్రుడిని ఎదుర్కొని ఉపిరితో తిరిగి వచ్చేవాళ్ళు వుంటారా? ఇద్దరికీ యమడండం దగ్గరికి వస్తున్నది. అందువల్లే మనిద్దరికీ స్నేహం సరిగ్గా కుదిరింది. చెడిపోయేకాలం దగ్గర పడ్డ నిన్ను నేనేమి చేయగలను? చావడానికి సిద్ధంగా వున్నా నిన్ను ఎవడేం చేయగలదు? రావణా! నువ్వు చెప్పినట్లే నేనే ముందు పోతున్నాను. నీకు మేలు జరుగుగాక!” అని అంటాడు.

         మారీచుడి మాటలకు ఆయన్ను సంతోషంతో కౌగలించుకుని, “సై రా మారీచా! పౌరుషంతో కూడిన మాటలు ఇలా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నిజమైన మారీచుడివి. రత్నాలతో పొదిగిన  నా రథం ఎక్కు. త్వరగా పోదాం. నేను నీతోనే వస్తాను. అక్కడికి పోయి జానకిని మోసగించి, నీ ఇష్ట ప్రకారం పో. నేను ఒంటరిగా వున్న సీతను బలాత్కారంగా ఎత్తుకుని లంకకు పోతాను” అని అంటూ రావణాసురుడు ఆ ఆశ్రమ ప్రదేశం దాటి పోయాడు.

         అలా రథంలో కొండ కోనలను దాటి, దండకలోని రామచంద్రుడి ఆశ్రమం సమీపానికి చేరుకున్నారు. రథం దిగి రావణుడు మారీచుడి చేయి పట్టుకుని, అరటి చెట్లున్న రామచంద్రుడి ఆశ్రమం చూపిస్తాడు.

         వచ్చిన పని కానిమ్మని రావణుడు మారీచుడికి చెప్పాడు. ఇంద్రనీలమణుల కాంతిగల కొనకొమ్ములు, తెలుపు నలుపు గల అందమైన ముఖం, ఎర్రతామర-కల్వరంగుగల ముఖం, ఇంద్రనీలాల లాంటి చెవులు, కొంచెం ఎత్తైన మెడ, నీలాల పలుకుల్లాంటి పెదవి, మొల్లలు-చంద్రుడు-వజ్రం లాంటి తెల్లటి కడుపు, తామరల్లోని ఆకుల లాంటి వీపు, ఇప్ప పూవు లాంటి పక్కలు, వైడూర్యాల లాంటి గిట్టలు, సన్నటి పిక్కలు, ఇంద్రధనస్సు లాగా పలు రంగుల తోకతో, నిమిషంలో మారీచుడు శ్రేష్టమైన జింకలాగా ఆ అరణ్యంలో తిరుగుతూ, రాముడి తపోవనం సమీపించాడు. జానకీదేవిని మోసగించడానికి ఆ రాక్షసుడు జింక వేషంలో అక్కడే ఎక్కడ తిరిగితే తనను సీత చూడగలడో అక్కడే తిరుగుతూ, దూరంగా పరుగెత్తుతూ, వెనుకా-ముందుకూ కదలుతూ సమయం కోసం వేచి చూడసాగాడు. ఈ ప్రకారం అడవిలో తిరుగుతున్న ఆ మృగాన్ని చూసి ఇతర మృగాలు నిజమైన మ్రుగమని భ్రమించి దగ్గరకు వచ్చి వాసన చూసి బెదిరి పోసాగాయి. ఇలా అది తిరుగున్న సమయంలోనే జానకీదేవి కంట అది పడింది.


         పూలు కోయడానికి బయటకు వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. ఆ వింత జింకను ప్రేమతో చూసింది సీత. మనోహరమైన దంతాలతో, పెదవులతో, ఆశ్చర్యంగా నవ్వుతున్న కళ్ళతో చూసింది ఆ జింకను సీత. సీతాదేవి తనను చూసి సంతోషిస్తుంటే, జింక కూడా వింత-వింతగా వేడుకలు చేయసాగింది. అడవిని ప్రకాశించే విధంగా తిరుగుతున్న ఆ వింత జింకను చూసి, భర్త రామచంద్రుడిని, ఆయుధధరుడైన  లక్ష్మనుడిని రమ్మని పిలిచింది. దగ్గరకు వచ్చి దాన్ని చూసిన లక్ష్మణుడికి సందేహం కలిగింది. మారీచుడనే రాక్షసుడికి ఇలాంటి ఆకారంలో తిరుగుతూ మునులను, వేటకై వచ్చే రాజులను వధించే అలవాటుందని, యోగశక్తిగల ఆ రాక్షసుడే తన అద్భుత యోగ శక్తితో జింకలాగా తిరుగుతున్నాడని, ఇది నిజమైన జింక కాదని అంటాడు.

         బంగారువన్నె, నవరత్నాల కాంతులు, చుక్కలు, అవయవాలు కల ఇలాంటి జింకను ఇన్నాళ్లు అడవుల్లో తిరిగినా మనం చూడలేదనీ, శాస్త్రాలు-లోకులు చెప్పగా కూడా వినలేదనీ, కాబట్టి ఇది మోసపు వేషమే అనీ లక్ష్మణుడు ఒకవైపి చెప్తుండగానే, ఆయన మాటలకు అడ్డుతగిలి, చిరునవ్వుతో భారత దగ్గరికి పోయి, సీత ఇలా అంటుంది. “ప్రాణేశ్వరా! ఈ జింక మీదా ఆశ కలిగింది. వల్లభా! మహాబాహూ! దీనిని సులభోపాయంగా పట్టుకో. నేను అడిగానని ప్రయాసపడవద్దు. నాకెందుకంటే, ఆడుకోవడానికి ఇది కావాలి. ఈ అడవిలో మనమెన్నో మృగాలను చూశాం కాని దీని దేహకాంతి దేనికైనా వుందా? ఇంత వింతైన కాంతిగల మృగాన్ని మనం ఇంతవరకు చూడలేడుకదా? లోకంలో ఎన్ని జింకలు లేవు? వింత మృగాలు లేవు? వాటన్నిటినీ మనం చూడలేదా? ఈ అందమైన వన్నె, పొందిక దేనిలోనైనా వుందా? దీన్ని చూడు. నాలుగు పక్కలా తన దేహకాంతులు దట్టంగా చల్లుకుంటూ చంద్రుడిలా వుంది. నామీద దయ వుంచి దాన్ని పట్టితే”.

         “ఆహా! ఏమి దీని అందం? ఔరా! దీని కాంతి సంపద బలేగా వుందే! దీని స్వరమాధుర్యం, ప్రశస్తం, నిర్దుష్టం, అయిన ఈ జింక ప్రాణేశ్వరా! నా మనస్సును బాగా ఆకర్షించింది. ఈ మృగం ప్రాణంతో దొరికితే అంతకంటే కావాల్సింది ఏమిటి? మన వనవాస కాలం పూర్తైన తరువాత నగరానికి పోయినప్పుడు, మన అంతఃపురంలో ఇది ఒక భూషణమై అలరారదా? రాజ చూడామణీ! నేను చెప్పేది నిజ కాదో నువ్వే ఆలోచించు. దీన్ని చూసి సంతోషించేది నేనొక్క దాన్నే కాదు. భరతుడికి, నీ ఇతర తమ్ములకు, నాకు, మా అత్తలకు, స్పష్టంగా ఈ జింక ఆశ్చర్యం కలిగిస్తుంది. పురుష శ్రేష్టా! ఈ సంగతి కూడా ఆలోచించు. ఒకవేళ ఇది ప్రాణాలతో దొరక్కపోయినా, దీని చర్మమైనా నాకు ఆనందం కలిగిస్తుంది. లేపచ్చికతో చేయబడిన దర్భాసనం మీద దీన్ని పరచుకుని నీతో కూర్చోవాలని అనుకుంటున్నాను.”

         “ప్రాణేశ్వరా! నాకది లేదు...ఇది లేదు....అది కావాలి...ఇది కావాలి, అని భర్తను ఇబ్బంది పెట్టడం స్త్రీకి సమంజసం కాదు. ఇది తగదని నా అభిప్రాయం. ఆ కారణాన నేనేదీ మిమ్మల్ని అడగలేదింత వరకూ. అలాంటప్పుడు, ఇది కావాలని మిమ్మల్నెందుకు కోరుతున్నానంటారా? దీని దేహకాంతి నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆడదాన్ని కాబట్టి నిబ్బరించుకోలేక పోతున్నాను. దీన్ని తేవడం మీకు సులభాసాధ్యమని తెలుసు. అదీ కాకుండా, నగరానికి పోయిన తరువాత, చెల్లెళ్ళు, స్నేహితురాళ్లు, అడవి నుండి ఏం విమ్తవస్తువు తెచ్చావంటే, దీన్ని చూపిస్తాను. క్షమించు”.

         సీతాదేవి మాటలకు పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు, ఆ జింక ఆశ్చర్యకరమైన కొమ్ములను, బంగారువన్నె వెంట్రుకలను, రత్నకాంతుల కొమ్ములను, సూర్యకాంతితో నక్షత్రాల్లాంటి చుక్కలను చూసి సంతోషించాడు.

వాల్మీకి, మార్క్స్- మానవత : వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకి, మార్క్స్- మానవత
 వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (24-02-2019)
సాహిత్యానికీ, మానవ విలువలకూ; ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ; గతితార్కిక భౌతిక వాదానికీ, కర్మ సిద్ధాంతానికీ ఏదో ఒకరకమైన, అనిర్వచనీయమైన, విడదీయరాని అనుబంధం వుంది. హిందూత్వం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం". కర్మ సిద్ధాంతం ప్రకారంఈ సకల చరాచర ప్రపంచమంతటికీభూతకాలంలో జరిగిన దానికీ, వర్తమానంలో జరుగుతున్న దానికీ, భవిష్యత్ లో జరగబోయే దానికీకర్త, కర్మ, క్రియ ఒక్కరేఏ పనినిఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలోజరిగినదాని పర్యవసానం ఏమిటో, లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ధారించే అధికారం ఆ ఒక్కరికే వుంది

సృష్టించేది బ్రహ్మనీసంహరించేది రుద్రుడనీకాపాడుతుండేది విష్ణుమూర్తనీ అంటారుఅది పూర్తిగా నిజంకాదేమోఅనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మంఒక్కరేఆ ఒక్కరేసృష్టికొక అధికారినీ (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారినీ (రుద్రుడునియమించాడుబ్రహ్మరుద్రులు నిమిత్తమాత్రులేఅంటేఎవరో ఒక "జగన్నాటక సూత్రధారిస్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఒక అద్భుతమైన నాటకంలోసకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ తమకు అప్పచెప్పిన పాత్ర పోషించాయిఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తేదాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-ఆగమన్నప్పుడు ఆగిజీవితం చాలించాలిఆ తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదలాలి.

నిశితంగా పరిశీలిస్తేకార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయిఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ, భూస్వామ్య, ధన స్వామ్య వ్యవస్థ” కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందనిదరిమిలా విజయం సాధిస్తుందనీ, ముందున్న వ్యవస్థ కూలిపోతుందనిశ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనికుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడుహిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలంవిశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలంవ్యతిరేకించిజరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌థీసిస్‌సింథసిస్అని పిలిచాడుఒకరకమైన "కర్తకర్మక్రియఅనవచ్చేమోఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్.

వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలోఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడుపాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడుకార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో, వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడుఆరంభం, అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానేనిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడుఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా

కార్ల్ మార్క్స్ లాంటి మహా మహానుభావులు, ఆలోచనాపరులుఅవనిలో అరుదుగా అవతరిస్తుంటారుపెట్టుబడిదారీ ధన స్వామ్య, భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్నివక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకుపరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడిఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయిఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుందిప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనేఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడితద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందనిఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడుహేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగాఅన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండేప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత వాదం సిద్ధాంతంలో పేర్కొంటాడుమార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీఎప్పటికీమన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.

ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూమానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసిందిమనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలిఆలోచనా సరళిజీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకుసహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయిమానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు,ఎవరెవరితో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయివీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనేసామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుందిఅందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్ఒక మజిలీ-లేదా దశ నుండిదానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించిసంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుందిసమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసిప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసిశ్రామిక రాజ్యస్థాపన ద్వారా వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తుంది.

మార్క్స్ ప్రవచనాలకుతదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యాచైనా విప్లవానికిశ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమేవాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడువాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది-అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదారామాయణంలోని పాత్రలను-చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకిశ్రీరామచంద్రమూర్తిని దైవంగామహావిష్ణువు అంశగాజరగబోయే దాన్ని వివరంగా, రామాయణ గాధగా లోకానికి తెలియచెప్పాడుశ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించిదుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసిధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథశ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా-భక్తుడిగా-కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురైశ్రీరాముడికి శత్రువుగా-రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాసాడు వాల్మీకి.


మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినారష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రుడిలాంటివారే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తిచైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులుమార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గంలాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమి పాలయ్యాడుకూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడుఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడుఆచార్య లక్షణాలున్న హనుమంతుడిని ఏంగెల్స్ తో పోల్చవచ్చు.మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటేమావోలెనిన్చౌ-ఎన్-లైస్టాలిన్ శ్రీరామచంద్రుడు కోవకు చెందినవారుమార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్ రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చుమార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక"రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడువాల్మీకైనామార్క్సైనా వారి-వారి సాహిత్యాలలో దేశ కాల పరిస్థితులకనుకూలమైన మానవ విలువల పరిరక్షణకే ప్రాధాన్యమిచ్చారు.

మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తిత్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడాడనేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతేమనలాంటి వారు అంధకారంలో పడిదురాచార పరులమైపోయిమానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో.

శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుందిమార్పు జరగాలంటేఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడంవిరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడంఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరని చెప్పుకున్నాంస్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా తాటకను చంపాడు. వాల్మీకి రామాయణంలోని "వశిష్ట విశ్వామిత్ర యుద్ధం"బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు"ఆత్మ విద్యకుఅనాత్మవిద్యకు" మధ్య జరిగిన యుద్ధంసంపూర్ణంగా అనాత్మవిద్య అన్నీ నేర్చుకున్నప్పటికీవాడు,ఆత్మవంతుడిని గెలవలేడని స్పష్టమవుతుందివిద్యావంతుడి దౌష్ట్యంఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుందివశిష్టుడుఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. వర్గపోరాటంలో కూడా,కార్మికవర్గ నియంతృత్వానికి పూర్వ రంగంలోతమ హక్కులకొరకు శ్రామికులు పోరాడుతారని మార్క్స్ అంటాడు. "సంకెళ్లు తప్ప కార్మికులు కోల్పోయేదేమీలేదు" అంటాడు మార్క్స్. దానర్థం: ఎదుటివారిని దెబ్బతీసేందుకన్నాతమను తాము రక్షించుకోవడమే ప్రధానమని. ఇదీ మానవ విలువలనే సూచిస్తుంది.

మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. విజ్ఞాన సముపార్జనకవసరమైన సూక్ష్మాతిసూక్ష్మ విషయాలకు సంబంధించిన ప్రతి అంశంసంస్కృతీ, సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీదనే ఆధారపడి వుండే రీతిలోనే మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులుసాహిత్యాభిలాషులుశాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురుశతాబ్దాల పూర్వమేమానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుందిమానవతావాదాన్ని రకరకాల పేర్లతో, ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనాశ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనేమానవ విలువలకు అర్థముంటుందిఅలా కానప్పుడుఏదో ఒక రూపంలోమానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుందిఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదుఏదేమైనామానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమేఅందులో సందేహం లేదు.

మతంభాషసాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికితన మూర్తిని భగవంతుడిలో, ఆయన మూర్తిని తనలో చూసుకుంటూతద్వారా క్రమశిక్షణతో మెలుగుతూతోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

Friday, February 22, 2019

వాగ్దానాల అమలు దిశగా బడ్జెట్ : వనం జ్వాలా నరసింహారావు


వాగ్దానాల అమలు దిశగా బడ్జెట్
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (23-02-2019)
2019-20 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టి, ప్రసంగ పాఠాన్ని సుమారు గంట సేపు చదివారు. బడ్జెట్ అంటే ఇదీ, ఇలా వుండాలనిఒక “రోల్ మోడల్” బడ్జెట్ తయారుచేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటేప్రజల ఆశయాలను,ఆకాంక్షలను, కోరికలను ప్రతిబింబించే అసలు-సిసలైన బడ్జెట్ ఈ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కేసీఆర్ రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబడిన మొదటి బడ్జెట్ కూడా ఇది. ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాలన్నీ అమలుచేసే ప్రక్రియ తుచ తప్పకుండా తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిబింబించేలా సాగింది ఆయన బడ్జెట్ ప్రసంగం. దీనికి తోడు గత ఐదేళ్లలో ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలు ఇక ముందు కూడా కొనసాగే తీరుతెన్నులను సవివరంగా ప్రస్తావించారు సీఎం.

టీఆరెస్ ప్రభుత్వం మొట్టమొదట ఐదేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కేసీఆర్, ఆయన సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం “ఒకటి వెంట మరొకటి” అనేలా పెనుసవాళ్లను ఎదుర్కొని, ఒక్కొక్కదాన్నే అధిగమించుకుంటూ అభివృద్ధిపథాన దూసుకుపోతుంది. జూన్ 2, 2014 న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, ఆ తరహాలో తెలంగాణ మున్నెన్నడూ లేదన్న భావనతోనూ, దీన్ని పూర్తిగా ఒక కొత్త రాష్ట్రంగా చూడాలన్న ఉద్దేశంతోనూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఒక చారిత్రకమైన ఆరంభం జరగాలన్న పట్టుదలతో, నిబద్ధతతో అభివృద్ధికి బీజాలు వేయడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ, చేపట్టి అమలు పరుస్తున్న అనేకానేక పథకాలు ఈ లక్ష్య సాధన దిశగానే వున్నాయి. అదే పరంపర 2019-20 బడ్జెట్ లోనూ కొనసాగింది.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరానికి, అంటే, 2014-2015 కు, బడ్జెట్ రూపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి రకమైన ఆధారాలు మొదట్లో లభించలేదు. అదో పెద్ద సవాల్ ప్రభుత్వానికి. రాష్ట్ర ఆదాయ వనరుల విషయంలో కానీ, వ్యయానికి సంబంధించి కానీ, ఏ మాత్రం అంచనా ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల కల్పనకు దర్పణం పట్టే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు వుండాలి కానీ, కేవలం ఆదాయ-వ్యయ లెక్కల పట్టికగా ఉండరాదని ప్రభుత్వ ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు స్పష్టం చేసారు. అన్ని రంగాలలో ధర్మమైన, సమధర్మ-న్యాయ సమ్మతమైన  అభివృద్ధిని చేకూర్చి, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేయడం నాటి ప్రభుత్వం ముందున్న సవాల్. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, వికేంద్రీకరణ నమూనా అభివృద్ధికి పీటవేసి, “మన వూరు-మన ప్రణాళిక” కార్యక్రమం ద్వారా, గ్రామీణ స్థాయిలో అట్టడుగు వర్గాల ప్రజల అవసరాలెలా వుంటాయో అనే విషయంలో సూచనలు-సలహాలు రాబట్టింది.

బడ్జెట్ తయారీకొరకు, ఒక్కో రంగంలో ప్రాదాన్యతాంశాలను గుర్తించడానికి, వనరుల సమీకరణకు అవలంభించాల్సిన విధానాల రూపకల్పనకూ, 2014-2015 బడ్జెట్ రూపకల్పనలో సూచనలు-సలహాలు ఇచ్చేందుకు 14 టాస్క్ బృందాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వీటన్నింటి నేపద్యంలో, టాస్క్ బృందాల సిఫార్సుల మేరకు, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ను నవంబర్ 5, 2015 న రాష్ట్ర శాసనసభకు సమర్పించడం జరిగింది. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ విధంగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సరిగ్గా లేకుండానే, గతంకంటే పూర్తి భిన్నంగా, అందుబాటులో వున్న అంశాల ఆధారంగా, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. 2014-15 బడ్జెట్ వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు మాత్రమే. అంటే, ఆ ఏడాది 12 నెలల ఆదాయ-వ్యవ వివరాల అంచనాలు పూర్తిస్థాయిలో లేని నేపధ్యంలో ఆ తరువాతి సంవత్సరం అంటే 2015-16 బడ్జెట్ తయారుచేయాల్సి వచ్చింది.


2015-20 మధ్యన ఐదేళ్ళ కాలానికి 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచినప్పటికీ, ఆ లాభం తెలంగాణాకు చేకూరలేదు. దీనికి కారణం జాతీయ సగటు తలసరి ఆదాయంకంటే తెలంగాణా తలసరి సగటు ఆదాయం ఎక్కువగా వుండడమే! తలసరి ఆదాయానికి సంబంధించి జిల్లాలకు-జిల్లాలకు మధ్యనున్న భారీ వ్యత్యాసాలు కూడా రాష్ట్ర తలసరి సగటు ఆదాయంలో భాగమే. కేంద్ర పన్నుల్లోనుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గినప్పటికీ (2014-15 లో వాటాగా ఇచ్చిన 2.893శాతం నుంచి 2015-20 మధ్య ఐదేళ్ళ కాలంలో 2.437 శాతానికి తగ్గుదల) రాష్ట్రం విత్త సంబంధమైన ప్రమాణాలను పటిష్టంగా నిలబెట్టుకోగలటమే కాకుండా, అదనంగా జీఎస్డీపీ మీద 0.5% ఎఫ్ఆర్బీఎం పొందగలిగి, అప్పుతెచ్చుకోగల సామర్థ్యం సంపాదించుకోగలిగింది.

2016-17 బడ్జెట్ రూపొందించుకునే సమయానికల్లారాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ఆదాయ-వ్యయాలపై, ప్రభుత్వానికి ఒక సమగ్రమైన-సంపూర్ణమైన అవగాహన వచ్చింది. 31 మార్చ్ 2015 నుండి 31 మార్చ్ 2016 వరకు, ప్రణాళిక, ప్రణాలికేతర పథకాల కింద ఆదాయ-వ్యయ లెక్కలు ఖచ్చితంగా తెలవడంతో, తెలంగాణ బడ్జెట్ రూపకల్పనకు అసలు-సిసలైన ప్రాతిపదిక దొరికి,బడ్జెట్ తయారీకి మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రూపొందించిన మొదటి బడ్జెట్-అడహాక్ లెక్కల మీద, గతంలో సమర్పించిన బడ్జెట్ల మీద ఆధారపడిందైతే, అంతో-కొంతో కుస్తీపట్టి ఆ తరువాతి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ తయారు చేయడం జరిగింది. క్రమేపీ, పూర్తీ అవగాహన కలగడమే కాకుండా,ఒక్కో పథకం, ఒక్కో శాఖకు సంబంధించి లోతుగా అధ్యయనం చేయడం, పూర్తి అవగాహనకు రావడం జరిగింది. 2016-17 సంవత్సరం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ మూడో బడ్జెట్ అయినప్పటికీ, వాస్తవంగా ఆలోచిస్తే, ఒక సమగ్ర-సంపూర్ణ అవగాహనతో, పూర్తి స్థాయి సమీక్ష ఆధారంగా, అన్ని రకాల ఆదాయ-వ్యయాల వాస్తవ అంచనాల ప్రాతిపదికగా, వనరులకు సంబంధించి అసలు-సిసలైన లెక్కల ఆధారంగా, తయారుచేసిన మొదటి బడ్జెట్ అనాలి.

రాష్ట్ర ఆవిర్భావం తరువాత అనేకానేక అభివృద్ధి-సంక్షేమ పథకాల కోసం విరివిగా నిధులను వ్యయం చేస్తున్నప్పటికీ, ఆర్థికంగా ఆరోగ్యకరమైన, పటిష్టమైన పరిస్థితిలో కొనసాగగలగడం ఎంతో తృప్తినిచ్చే అంశం అనాలి. ఇలా వుండడానికి ప్రధాన కారణం,పన్నులేవీ అదనంగా విధించకుండానే రెవెన్యూ వసూళ్లను మెరుగుపరుచుకోగలగడమే. 2015-16 సంవత్సరంతొ పోల్చి చూస్తే, 2016-17 లోరాష్ట్ర స్వయం పన్నుల రెవెన్యూలో 21.1% వృద్ధి రేటు సాధించగలిగింది. ఇది దేశంలోని మిగాతా అన్ని రాష్ట్రాలకంటే అధికం.

ఈ నేపధ్యంలో, ఈ క్రమంలో, 2017-2018 లో రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఎ విధంగా చూసినా ఒక రకమైన ప్రేరణ కలిగించేదిగా, సందేశాత్మకంగా వుందని చెప్పాలి. ప్రభుత్వ ఆశయానికి, ఆలోచనకు, ఉద్దేశ్యానికి అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాలకు, కులవృత్తుల వారికి, అన్ని మతాల వారినకి, వివిధ రంగాలలో నిమగ్నమై వున్న వారికి, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే అన్ని ప్రభుత్వ శాఖల వారికి,అల్పాదాయ-మధ్య తరగతి వారికి, సమాజంలో వారూ-వీరూ అనే తేడా లేకుండా అందరికీ చేరువయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.

ఇక 2018-19 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతకు ముందు 45 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా ప్రమాణీకరణం చేయవచ్చుఏ విధంగా స్థిరపర్చవచ్చుఏ విధంగా పటిష్టం చేసుకోవచ్చు అనే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాష్ట్ర స్థూల ఆర్ధిక పరిస్తి ఎలా మెరుగునపడిందో తెలియచేస్తుందీ బడ్జెట్. జీఎస్టీ అమలుపెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపధ్యంలో కూడా రాష్ట్ర సాధించిన ఆర్ధికాభివృద్ధి స్పష్టం చేయడం జరిగింది. అదనంగా2017-2018 ఆర్ధిక సంవత్సరంలో రూపకల్పన చేసిన పథకాలను వర్తమానంలో-భవిష్యత్ లో ఎలా అమలు చేస్తున్నారు-చేయబోతున్నారు అనే విషయాలు కూడా ఆ బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. 

ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గత ఐదేళ్ళలో ఏం జరిగిందీ, రాబోయే ఐదేళ్ళలో ఏం జరగబోతుందీ స్పష్టమవుతుంది. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇది ఆరవ బడ్జెట్. ఆర్ధిక నిపుణుల సలహాలతో, సహకారంతో ప్రయాణం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రానికి భగవంతుడు, ప్రకృతి దీవెనలు, ప్రజల సహకారం లభించింది. అందుకే అనుకున్న పంథాలో కార్యక్రమాలు అమలుజరిపి, అద్భుత విజయాలను సాధించగలిగింది ప్రభుత్వం. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పతకాలను ఇంత తక్కువ కాలంలో అమలు చేయగలిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది బడ్జెట్ లో ప్రస్ఫుటమైంది.

ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల ద్వారా సంపద ఎలా వృద్ధి చెందుతుందో వివరంగా చెప్పడం జరిగింది. దేశం ఆశ్చర్యపడే విధంగా నీటిపారుదల ప్రాజెక్టులు ఎలా పూర్తవుతున్నాయో, విద్యుత్ రంగంలో ఎలా పురోగతి సాధించడం జరిగిందో ఈ బడ్జెట్ లో వుంది. పారిశ్రామీకరణ జరిగిన విధానం, ఐటీ రంగ అభివృద్ధి కూడా చెప్పడం జరిగింది. అవినీతి రహితమైన పాలన పునాదులపైన అద్భుతమైన అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరే పథకాల వివరణ, అల్పాదాయ వర్గాల వారికి చేకూరే లాభం, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, పథకాలద్వారా లభించే లబ్ది తెలియచేయడం జరిగింది. ఉదాహరణకు కేసీఆర్ కిట్స్ ద్వారా ఎలా మాతా-శిశు మరణాలు తగ్గాయి, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఎలా బాల్య వివాహాలు ఆగిపోయాయి వివరించడం జరిగింది. సంక్షేమంలో సంస్కరణల మూలాన్నే ప్రజలు అద్భుతమైన ఘన విజయాన్ని మరో మారు టీఆరెస్ పార్టీకి కట్టబెట్టిన సంగతి తెలియచేయడం జరిగింది. గత పునాదులమీద, అనుభవాలమీద రాబోయే ఐదేళ్లలో నిర్దుష్టమైన పంథాలో పనిచేస్తామన్నారు సీఎం.

రైతు సంక్షేమానికి చెందిన దీర్ఘకాల, స్వల్పకాల పథకాల వివరణ వుంది. ప్రభుత్వం మానవీయ కోణంతో రైతుసంక్షేమానికి కృషి చేస్తుందని, కోటి 25 లక్షల ఎకరాల భూమికి సాగి నీరు అందిస్తామని చెప్పారు సీఎం. రైతు సంక్షేమం ప్రధాన ధ్యేయంగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా తన ప్రభుత్వానికి పెద్ద పేరు వచ్చిందన్నారు ముఖ్యమంత్రి. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అన్న సీఎం, పెంచిన రైతు బందు మొత్తాని ప్రస్తావించారు. సమైక్య రాష్ట్రంలోని 23 జిల్లాలకంటే గడచినా ఐదేళ్లలో తెలంగాణాలో వ్యవసాయానికి వ్యయం చేసింది ఎక్కువని అన్నారు కేసీఆర్. లక్షరూపాయల వరకు మళ్లీ రుణమాఫీ విషయం కూడా ప్రస్తావించారు.

నూతన పంచాయితీరాజ్ చట్టం గురించిన ప్రస్తావన వివరంగా వుంది. మాగూడెం, మా తండా, మారాజ్యం....విషయం చెప్పి ఎలా ఇటు మైదాన ప్రాంతంలోను, అటు షెడ్యూల్డ్ ప్రాంతంలోను అనేకమంది గిరిజనులు సర్పంచులు కాగలిగారో వివరించారు. గ్రామ పంచాయితీలకు 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు డివొల్యూషన్ కింద సంక్రమించే ఆదాయ వనరులకు అదనంగా, రాష్ట్ర ఆర్ధిక సంఘం సూచన మేరకు అంతే మొత్తాన్ని రాష్ట్రం సమకూర్చాలని నిర్ణయించినట్లు చెప్పిన సీఎం, ఆ మొత్తానికి మన్రేగా నిధులు, పన్నుల నిధులు కలిపి మొత్తం రాబోయే ఐదేళ్ళలో గ్రామాలను ప్రగతిశీల గ్రామాలుగా, మహాత్మాగాంధీ కలలు కన్నా గ్రామాలుగా మలుస్తామన్నారు.

తెలంగాణకు హరితహారం గురించి, అడవుల సంరక్షణ విషయంలో కఠినంగా వుండడం గురించీ, రాజీలేని విధంగా అటవీ దుర్మార్గుల ఆటకట్టించే విషయం గురించీ, ఆసరా పించన్ల పెంపు గురించీ, రుణమాఫీ గురించీ, నిరిద్యోగ భృతి గురించీ, రెండు పడక గదుల ఇళ్ళ గురించీ, భూ రికార్డుల ప్రక్షాళన గురించీ, ధరణి వెబ్ సైట్ గురించీ, పంట కాలనీల గురించీ, రైతులకు గిట్టుబాటు ధరల గురించీ, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ గురించీ తదిర అభివృద్ధి-సంక్షేమ పథకాల గురించీ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన వుంది. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.