Showing posts with label రాజశేఖర రెడ్డి. Show all posts
Showing posts with label రాజశేఖర రెడ్డి. Show all posts

Friday, March 23, 2012

ఉప సమరం నేర్పిన గుణపాఠాలు: వనం జ్వాలా నరసింహారావు



సూర్య దినపత్రిక (25-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

కోస్తాంధ్రలో ఒక్క సీటుకు, ఉత్తర-దక్షిణ తెలంగాణాలో ఆరు సీట్లకు ముగిసిన ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పు అమోఘం. అందరికీ అంతో-ఇంతో గుణపాఠం చెప్పకనే చెప్పారు. ఒక పక్క తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావును, మరోపక్క వైఎస్సార్ సీపీ నేత జగన్మోహన్‌ రెడ్డిని హీరోలుగా అంగీకరించుతూనే, తస్మాత్ జాగ్రత్త అంటూ ఇతోధికంగా చురకలు కూడా వేశారు ఓటర్లు. ఇక ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అదే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, తాజా కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి, వారి-వారి జిల్లాలలో ప్రచార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్-తెలుగుదేశం నేతలకు తగు సంకేతాలిచ్చారు. పార్టీల పరంగా తెరాసకు, తెలుగుదేశానికి, కాంగ్రెస్‌కు, భారతీయ జనతా పార్టీకి కొన్ని సంకేతాలిచ్చారు. ఐదు చోట్ల పోటీ చేసిన టీఆర్ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల గెలిచి, తెలంగాణా సెంటిమెంటును ఎంత బలంగా నిరూపించిందో, అంతే మోతాదులో బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క మహబూబ్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకుని నిరూపించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటునీ కైవసం చేసుకుని, సమీప భవిష్యత్‍లో జరుగనున్న పద్దెనిమిది శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగు దేశానికీ ధీటుగా నిలవబోతోంది. పాలక, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం ఏడు చోట్లా పోటీ చేసి, ప్రతి చోటా ఓటమి చవిచూశాయి. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు చోట్ల రెండో స్ధానంతోను, మూడు చోట్ల మూడో స్ధానంతోను సర్దుకోవాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఒక చోట నాలుగో స్ధానంలో, రెండు చోట్ల రెండో స్ధానంలో, నాలుగు చోట్ల మూడో స్ధానంలో ఉంది. రెండు చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది.  ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌ ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు గతంలో తెలుగుదేశం అధీనం లో ఉండేది. ఇప్పుడది జగన్‌ పార్టీ పరమైంది.

ఇంతకూ, గెలుపెవరిది? ఓటమి ఎవరికి? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినంతవరకు, కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ఆ పార్టీల ప్రతిష్ట కూడా పూర్తిగా దిగజారి పోయిందనాలి. 2009 లో కాంగ్రెస్ గెల్చుకున్న రెండు స్థానాలను, ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మరో సభ్యుడి స్థానాన్నీ, మొత్తం మూడు స్థానాలనూ కోల్పోయింది. పడ్డ ఓట్లు కూడా అంతంత మాత్రమే! తెలుగుదేశం దీ అదే పరిస్థితి. 2009 లో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలలో దారుణంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ ప్రతిష్టా మంట కలిసింది. భవిష్యత్‍లో తెలంగాణ ప్రాంతంలో జరగబోయే ఏ ఎన్నికైనా తెలంగాణ వాదంతోనే బలంగా ముడిపడి వుంటుందన్నతరహా తీర్పిచ్చారు ఓటర్లు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీలకు చెందిన ఇతర నాయకులు, వాస్తవానికి, తమ వంతుగా తెలంగాణ వాదాన్ని మొన్నటి ఉపఎన్నికలలో వినిపించే ప్రయత్నం చేశారు కూడా. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బాబు, తెలంగాణ సెంటిమెంటు గణనీయంగా వుందని, ఐనా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయబట్టే, ఆ మాత్రం ఓట్లన్నా రాలాయి. ఆ రెండు పార్టీల భవిష్యత్ తెలంగాణకు సంబంధించినంతవరకు ఇక ప్రశ్నార్థకమే! సమైక్య్తవాదానికి కట్టుబడి పోటీ చేసిన ఏకైక పార్టీ సీపీఎం సోదిలోకి లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించడానికి నడుం బిగించిన భారతీయ జనతా పార్టీని, మహబూబ్‌నగర్‌లో, తెరాస కంటే ఎక్కువగా నమ్మారు ఓటర్లు. భవిష్యత్‍లో తెలంగాణ సాధన ప్రక్రియలో, కేవలం రాజకీయ ఐకాసలో కల్సి వుండడమే కాకుండా, ఎన్నికలలో కూడా, తెరాస-బీజేపీ అవగాహన కుదుర్చుకోవాలన్న సంకేతాన్ని కూడా ఓటర్లు మహబూబ్‌నగర్ స్థానం ఫలితం ద్వారా ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పుట్టగతులు లేకుండా పోతుంటే, సీమలో-ఆంధ్రలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నదనాలి. కోవూరు ఫలితమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏనాడైతే దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదో, ఆ నాడే, కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని కోల్పోవడానికి తానే స్వయంగా బాటలు వేసుకుందనాలి. రాజశేఖర రెడ్డి వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య కానీ, ఆయన వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, జగన్ దూకుడుకు కళ్లెం వేయ లేకపోయారు. 154 మంది కాంగ్రెస్ శాసనసభ సభ్యుల మద్దతుతో-సంతకాలతో ప్రారంభమైన ఆయన అసమ్మతి ప్రస్థానం, "గోపీ" ల పుణ్యమా అంటూ,  17 కు పడిపోయినా, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ మాత్రం వీసమెత్తైనా పడిపోలేదు. ఓదార్పు పేరుతో ఆయన చేపట్టిన వేలాది కిలోమీటర్ల రాష్ట్రవ్యాప్త ప్రజా యాత్ర, ఆబాలగోపాలాన్ని జగన్ చెంతకు చేర్చింది. ఏం జరిగినా-ఎంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి వున్నా, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడంతో, విసిగివేసారిన జగన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తన తల్లి విజయమ్మతో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. తరువాత జరిగిన ఉపఎన్నికలలో కడప-పులివెందులల నుంచి అఖండ విజయం సాధించి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు ఆనాడే సవాలు విసిరారు జగన్. ఆ ఎన్నికలలో పోటీ చేసి ఘోర ఓటమి పాలై-డిపాజిట్ కూడా కోల్పోయిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పట్లో రాజీనామా చేయాలని తోచలేదు పాపం! దరిమిలా జగన్ అక్రమాస్తుల వ్యవహారం, సీబీఐ దర్యాప్తు ప్రక్రియ, శాసనసభలో అవిశ్వాస తీర్మానం అంశం లాంటివి జగన్ వెంట నడిచే నిఖార్సైన ఎమ్మెల్యేల-ఎంపీల సంఖ్యను తేల్చింది. ఎంపీ రాజమోహన రెడ్డి రాజీనామాతో సహా, పదిహేడు మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోవడంతో జగన్ వర్గం మరింత బలపడ సాగింది. ఆ నేపధ్యంలో వచ్చిందే కోవూరు శాసనసభ ఉప ఎన్నిక. కడప-పులివెందుల ఫలితం ప్రభావం కోవూరు మీద స్పష్టంగా పడింది. భారీ మెజారిటీతో కాకపోయినా మంచి మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పెను సవాలు విసిరారు. తెలంగాణలో సెంటిమెంటుకు, (సీమ) ఆంధ్రలో సెంటిమెంటుకు కొంత తేడా వున్నప్పటికీ, అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఓటమి పాలు కావడానికి ఆ రెండు సెంటిమెంట్లే కారణమయ్యాయి. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఆయన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోదగ్గ వ్యక్తిగా, భావి ఆంధ్ర ప్రదేశ్ యువతరం నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు తీర్పిచ్చారు. ఇక ఆయనదే హవా!

అధికార పక్షానికి చెందినంతవరకు, ఉప ఎన్నికలలో ఓటమికి బాధ్యత ఎవరిది అన్న అంశంపై, సమ్మతి-అసమ్మతి రాగాలు ఆరున్నొక్క శ్రుతిని దాటాయి. అసమ్మతి రాగాల మాట అటుంచితే, సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డితో అన్నట్లుగా చెప్పుకుంటున్న మాటలు కొంచెం ముఖ్యమంత్రిని ఇబ్బందిలో పడేసి విగా వున్నాయనాలి. "ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రిది కాకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది?" అని ఆజాద్ వ్యాఖ్యానించారట. అసమ్మతి గళం విప్పినవారిలో అగ్రగణ్యుడు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. కడప లోక్ సభ స్థానానికి ఓడినప్పుడు కూడా అంతగా బాధపడని డీఎల్, ఈ ఉపఎన్నికలలో ఓటమికి చాలా కలత చెందారు పాపం! మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలన్న డిమాండుతో సరిపుచ్చుకోకుండా. ఆయన తన రాజీ-నామా పత్రాన్ని అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద, బొత్స మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, తనదైన "క్రికెట్ స్టయిల్ లో" ఈ ఆటలో ఓడామని వ్యాఖ్యానించి సరిపుచ్చుకున్నారు. బొత్స కూడా రాజీనామా చేసే వరకు వ్యవహారం పోయిందంటారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా కిరణ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇక కే కేశవరావు, ఎంపీ వివేక్‌లు సరే సరి. ఇంత జరిగినా తప్పెవరిది అంటే అంతా గప్ చిప్!

ఒకరి మీద మరొకరి విమర్శనాస్త్రాలు తీవ్రతరమౌతున్నాయి. విభేదాలు పెరిగిపోతున్నాయి. హస్తంలో కీచులాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రకంపన లింకా ఆగలేదు. సరికదా ఊపందుకుంటున్నాయి. పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన-దాదాపు కామరాజ్ నాడార్ ప్రణాళిక లాంటిది అవసరమనేంతవరకూ వెళ్లింది వ్యవహారం. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు డిమాండుతో మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి బలహీనుడని, ఆయన పదవిలో కొనసాగాలా-వద్దా అనే విషయం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు సహితం ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. సీఎం పక్షాన మాట్లాడేవారే కరవయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక్కొక్కరు-ఒక్కొక్కవిధంగా మాట్లాడడం సరికొత్త అసమ్మతికి తెరలేపినట్లయింది. ఐనా, పూర్తిగా ముఖ్యమంత్రిదే ఓటమికి బాధ్యత అనడం ఎంతవరకు సబబు? ఆయనను ఆయన మానాన ఎన్నడన్నా వదిలేశారా ఇలా మాట్లాడుతున్న నాయకులు? ఉపఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి, ప్రచార బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడం దాకా, ఏ కాంగ్రెస్ నాయకుడు ఎంతవరకు తమ వంతు పాత్రను సక్రమంగా పోషించారో వారికి వారే బేరీజు వేసుకోవడం మంచిది. మరోవైపు ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలుగుతున్నవారు, అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న సీనియర్ నేతలపై యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో, చివరకు పరిస్థితి ఎటు నుంచి ఎటు వైపునకు దారి తీస్తుందోనన్న ఆందోళన అధిష్ఠానానికి పట్టుకుంది. రాష్ట్రంలో అసమ్మతి నిప్పులపై నీళ్లు చల్లేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగవలసిన అవసరం ఏర్పడింది.

ఏదేమైనా, ఆద్యతన భవిష్యత్‍లో సీమాంధ్రలో జరుగనున్న పదిహేడు శాసనసభ స్థానాల ఉపఎన్నికలు, తెలంగాణలోని ఒక స్థానానికి జరగనున్న ఎన్నిక రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కీలకమైన మలుపుకు దారితీయనున్నది. కోవూరు ఓటమితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్షానికి వలస పోయే అవకాశాలు రోజు-రోజుకూ పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు మొదలవుతాయి. ఒకవేళ అందరూ ఊహించినట్లుగానే, ఉపఎన్నికలు జరుగనున్న పద్దెనిమిది స్థానాలలో మెజారిటీ (లేదా అన్నింటిలో) స్థానాలలో కాంగ్రెస్-టీడీపిలు ఓటమి పాలైతే, ఇక ఆ పార్టీల పరిస్థితి, 2014 ఎన్నికలొచ్చే సరికి అగమ్యగోచరం అనక తప్పదు!

Sunday, January 1, 2012

బొత్స కల 2012 లో ఫలించేనా?: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?-4
సూర్య దినపత్రిక (01-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

కేంద్రంలో పరిస్థితి అలా వుంటే, ఇక రాష్ట్రంలో మరో విధంగా వుంది. కేంద్రంలో అధికారంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరిగింది 2011 లో. మొదటి దఫా రాజశేఖర రెడ్డి హయాంలో, "పునరంకిత సభలు" జరిగేవి. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనేలేదనాలి. ఇక ఆయన మరణంతోపునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తులేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!

కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరు నెలల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ నెలలో ప్రకటించారు. ఏనాడైతే వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత ముఖ్య మంత్రి వారసుడుగా గుర్తించడానికి, అధిష్టానం విముఖత వ్యక్త పరిచిందో, అప్పుడే, ఆయన నాయకత్వంలో చేరదల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య నిర్ధారణ అయింది. ఒకానొక సందర్భంలో శాసన సభలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీకి చేరే పరిస్థితి కలిగించింది. ఈ నేపధ్యంలో, జగన్ ఓదార్పు యాత్ర, దానికి కాంగ్రెస్-కాంగ్రేసేతర రాజకీయ పక్షాల వ్యతిరేకత, ప్రజల అఖండ అభిమానం, జగన్ పై కాంగ్రెస్ అధిష్టానం మరింత చిన్న చూపు, చివరకు ఆయన పార్టీకి-లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి సోనియా గాంధీపై ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వంపై అవిశ్వాసం దిశగా మరి కొంత అడుగులు పడ్డాయి. ఇంతలో చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. పోయిందనుకున్న బలం తిరిగొచ్చిందనుకున్నారు కాంగ్రెస్ వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, కడప ఎన్నికలలో గెలుపు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంపై "అవిశ్వాసం" వేగవంతం చేయడానికి బలం చేకూరింది. జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి ఎప్పుడైతో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమై నారని కాంగ్రెస్ అధిష్టానం భావించిందో, ఆ మరు నిమిషంలోనే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా, కిరణ్ సర్కారును రక్షించేందుకు చిరంజీవిని అక్కున చేర్చుకుంది. ప్రజారాజ్యం పార్టీ అనే "కుంపటి" ని వీలైనంత తొందరలో నెత్తి మీద నుంచి దించుకోవాలన్న ఆలోచనలో వున్న చిరంజీవికి కాంగ్రెస్ ఆలోచన కలిసొచ్చింది. కొంతలో కొంత జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకో గలిగామన్న భరోసా కలిగింది కిరణ్ సర్కారుకు. ఇంతలో, తొంభై మందికి పైగా శాసన సభ్యుల సంఖ్యా బలం కలిగిన తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిందేనని డిమాండు చేశారు జగన్. ఇంత జరిగినా అవిశ్వాసం అప్పటికి తుస్సుమనక తప్పలేదు.

బాబా రాందేవ్ అన్నంత పనీ చేశాడు. ఆమరణ నిరాహార దీక్షకు దిగనే దిగాడు. విరమించుకోవడం కూడా ఒక ప్రహసనంలా జరిగిపోయింది. మద్దతిచ్చిన వారున్నారొక వైపు. మండి పడ్డ వారూ తక్కువేం కాదు. సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించింది ప్రభుత్వం వ్యూహాత్మకంగా. అవినీతికి, నల్లధనానికీ వ్యతిరేకంగా జూన్ నాలుగు నుంచి నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెడతానన్న రాందేవ్ బాబా, తన లక్ష కిలోమీటర్ల "భారత స్వాభిమాన యాత్ర" ను ఉజ్జయినిలో ముగించుకుని, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి అక్కడి విమానాశ్రయం చేరుకోవడానికి ముందే, ఆయన అనుగ్రహం కోసమా అన్న చందాన, ఆయనతో చర్చించే నెపంతో, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌ కుమార్ బన్సాల్, పర్యాటక శాఖ మంత్రి సుబోధ్‌ కాంత్ సహాయ్ క్యాబినెట్ సెక్రటరీ కే ఎం చంద్రశేఖర్ వంటి అతిరథ-మహారథులు అక్కడకు వెళ్లడం కంటె విడ్డూరం ఇంకో టి లేదే మో! అంత కంటే మరీ హాస్యాస్పదం, ఆయనతో చర్చలు జరిపిన అనంతరం కపిల్ సిబాల్ ఆయనగారికి ఇచ్చిన "టెస్టిమోనియల్". "రాందేవ్ దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. అవి చాలా ముఖ్యమైన జాతీయ అంశాలు. వాటి పరిధి చాలా విస్తృతం. వాటికి మేం ప్రాథమికంగా స్పందించాం" అన్నది దాని సారాంశం. తనను తాను సాక్షాత్తు దైవాంశ సంభూతుడుగా, ఒక దేవ దూతగా భావిస్తున్న బాబా రాందేవ్ మరో టెస్టిమోనియల్ ను మీడియాకు చూపించారు. నిరాహార దీక్ష విరమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని, ఐనా, దేశాన్ని రక్షించడం కోసం నిరశన ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చానని, విదేశాల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తీసుకు రాగలననే పూర్తి ఆత్మ విశ్వాసం తనకున్న దని దాని సారాంశం. అంతా అందరనుకున్నట్లుగానే "మధ్యంతరం" అయింది. బాబా రామ్‌ దేవ్ జూన్ నాలుగో తేదే శనివారం తెల్లవారు జామున చేపట్టిన ఆమరణ దీక్ష ఒక రోజన్నా గడవక ముందే భగ్నమైంది. ఆయనను అరెస్టు చేశారా? కిడ్నాప్ చేశారా? చేయించింది ప్రభుత్వమా? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? అన్నవి ప్రశ్నార్థకంగా వుండి పోయాయి. వ్రతం చెడింది...ఫలితం దక్కలేదు. సర్కారు అనుకున్న ది సాధించింది...రాందేవ్ బాబా కూడా అన్న పని చేశాడు. అవినీతి మాత్రం తనను ఎవరూ, ఏమీ చేయలేరని అపహాస్యం చేస్తూ, మందహాసం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, భారత వైద్య మండలి సంయుక్తంగా ఏర్పాటు చేసిన (జులై నెలలో) రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రధానోపన్యాసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య ఏడాదికి 74 వేలకు పైగా వున్నాయని పేర్కొనడం జరిగింది. గిరిజనులలో-షెడ్యూల్డ్ కులాల వారిలో ఇతరుల కంటే శిశు మరణాల సంఖ్య చాలా అధికమని, వీటిని తగ్గించాలంటే వైద్య విద్య కళాశాలలు ముఖ్య భూమిక పోషించాలని రమేష్ సూచించారు. మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న డాక్టర్లు, కమ్యూనిటీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం కుదుర్చుకుని పనిచేస్తే, శిశు మరణాల సంఖ్య తగ్గే అవకాశం వుందని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ విధిగా గర్భిణీ స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం దిశగా "మాతా-శిశు ఆరోగ్య కార్డులు" ప్రవేశ పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా వుంటే, యావత్ రాష్ట్రానికి, ఒకే ఒక్క "చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి" గా వున్న, హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో, సగటున ప్రతి రోజు, పది-పదిహేను శిశు మరణాలు సంభవిస్తున్నట్లు కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ సందర్భంగా ప్రకటించి, సంచలనం కలిగించారు. గ్రామీణ స్థాయి నుంచి, రాజధాని స్థాయి వరకూ, నిరంతరం మాతా శిశు సంరక్షణకు, ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జరిగే దారుణం ఇలానే వుంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, చాలాకాలం నిర్వహించబడిన నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల వల్ల, గ్రామీణ ప్రాంతాలలో, సుమారు పదమూడు లక్షల మందికి పైగా గర్బ్జిణీ స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవం అనంతరం సరైన సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకుని, సరైన చికిత్స పొందారు. దాని మూలంగా కొంతలో కొంతైనా శిశు మరణాలు సంభవించకుండా నిరోధించే వీలైంది. ఇలాంటివే, ప్రభుత్వం చేపట్టి కొనసాగించితే బాగుంటుందేమో! తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన నిలోఫర్ దవాఖానలో సామూహిక హత్యాకాండను పోలిన శిశుమరణాలకు బాధ్యులెవరని పరిశోధన చేసి, సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టి, వాటిని అరికట్ట లేకపోయినా కనీసం తగ్గించే ప్రయత్నం చేసినట్లయితే బాగుండేదేమో!  

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ముఖ్యమంత్రి కావాలన్న ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కొరకు చేయాల్సినంతా చేయసాగారు. "రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధించారు. బహిరంగంగా మాత్రం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు. ఆయన కల 2012 నన్నా ఫలించేనా?
          
ఇలా మననం చేసుకుంటూ పోతుంటే...ఎన్నో...ఎన్నెన్నో..ఇంకా...ఇంకా చెప్పుకోవచ్చు.        

Thursday, December 29, 2011

భయపెట్టిన కేంద్ర పాలన: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! - 2
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలోని స్థితిగతులపై దృష్టి సారిస్తే ఆసక్తికరమైన సంఘటనలు 2011లో చోటుచేసుకున్న విషయం అవగతం చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, ఒకానొక తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లో నెల కొన్న పరిస్థితి మరే రాష్ట్రంలోను, నెలకొని లేదనే అనాలి. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్ రాజకీయాలలో, "శూన్యం" ఏర్పడి, రోశయ్య హయాంలో బలపడి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ప్రమేయం లేకుండానే మర్రి ఊడల్లాగా పెకిలించనలవికాని లోతుకు కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి "అధిష్టానం" అనేది వున్నదనే సంగతిని రాజశేఖర రెడ్డి తీసేయగా, రోశయ్య తన పాలనలో చేసిన పని మరిచిపోయిన అధిష్టానాన్ని గుర్తుచేయడమే! ఇక, ఆ తర్వాత, అధిష్టానమే ఇక్కడ పాలన చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదన, జగన్మోహనరెడ్డి సవాలు, ప్రభుత్వోద్యోగుల నిరసనలు, తెలుగు దేశం అవినీతి ఆరోపణలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి ఇటు ముఖ్యమంత్రికి-అటు అధిష్టానానికి తల బొప్పి కట్టించడం, అధికారుల్లో అలసత్వం, పధకాల అమలులో నిర్లిప్తత....ఇలా...రకరకాల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం లేని పరిస్థితులు రాబోతున్నాయా అన్న అనుమానం కూడా కలిగింది ఒక దశలో. రాష్ట్రంలో అప్పట్లో ఎవరి ఆలోచనలు వారివే...ఎవరి ఆరోపణలు వారివే. కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య మాచ్ ఫిక్సింగ్ అని తెరాస అంటే, టిడిపి-తెరాస మధ్యనే మాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ వాదించింది. జగన్మోహన రెడ్డికి కేసీఆర్ కు మధ్య మాచ్ ఫిక్సింగ్ కుదిరిందని తెలుగుదేశం ఆరోపించింది. వీటితో సంబంధం లేకుండా, బహిరంగంగానే ఫిక్సయిపోయాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో. చివరకు నెత్తిమీద కుంపటి దించుకుని తన పార్టీని, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హస్తాలలో పెట్టాడు.

నాలుగు లక్షల మంది తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆట విడుపు స్థలాలయ్యాయి. ఉద్యోగులు రావడం, సంతకాలు చేయడం, పెన్ డౌన్ సమ్మె చేయడంతో ప్రభుత్వం దాదాపు స్తంభించి పోయిందనాలి. ఆ తర్వాత రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె, మరో రోజున "పల్లె పల్లె పట్టాల" పైకి ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వానికి ఏం చేయాల్నో పాలుపోలేదు. జగన్మోహన రెడ్డి వారం రోజుల నిరాహార దీక్ష సహితం వార్తలలో ప్రముఖంగా చోటు చేసుకుంది. రాజశేఖర రెడ్డి హయాంలో వాగ్దానం చేసిన ఫీజు రీఇంబర్స్ మెంటు విషయంలో, చేసిన దీక్ష అది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను, నిజాం కళాశాల ప్రాంగణంలోను చెలరేగిన హింసా కాండ కూడా దారుణమైన సంఘటనలే అనాలి. అదే రోజుల్లో లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడంతో, వారికి కాంగ్రెస్ సభ్యుల, ఎన్డీయే సభ్యుల మద్దతు లభించడంతో, సభ పలు మార్లు వాయిదా పడింది. ఎమెల్యేలు శాసన సభలో లేకుండా, మంత్రులు రాజీనామా బాట పడుతుంటే, (కాంగ్రెస్ పార్టీకి చెందిన)ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుంటే, ఏమీ చేయలేని స్థితిలో వున్న (రాష్ట్ర) ప్రభుత్వాన్ని రద్దు చేసి, అసెంబ్లీని సుషుప్తావస్థలో వుంచి రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందేమో అన్న అని అనుమానాలు కలిగాయప్పట్లో. చివరకు అంతా సర్దుమణిగింది.
పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చే జారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. ఆ చర్యతో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒకింత అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. ఇక అంతే సంగతులు...తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. 2011 మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. అంతవరకూ వేచి చూడాల్సిందేనని, ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ. అలనాటి ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. అదలా వుండగా మిలియన్ మార్చ్ వ్యవహారాన్ని తెర పైకి తెచ్చింది రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. 
అదే రోజుల్లో మార్చ్ 11, 2011 న జపాన్ తీరప్రాంతంలో సంభవించిన సునామీ-భూకంపం దరిమిలా చెలరేగిన అణు సంక్షోభం క్షణ-క్షణ భీకరమైపోయింది. పరిస్థితి విషమించింది. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ స్థాయి తీవ్రమై, హెలికాప్టర్ సహాయంతో రి యాక్టర్ పై నీళ్లు చల్లేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఇంధన కడ్డీలను చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా బోరిక్ యాసిడ్ చల్లే అవకాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఫుకుషిమా విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే కలుషిత గాలి, రష్యా మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాకు చేరవచ్చనీ అన్నారప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో, అంతవరకూ ఎన్నడూ, కనీ-వినీ ఎరుగని రీతిలో, దేశంలో వున్న మిలిటరీ సిబ్బందిలో సగానికి పైగా, సుమారు లక్ష మందిని సహాయ-పునరావాస కార్యక్రమాలకు పురమాయించింది జపాన్ ప్రభుత్వం. అమెరికా దేశానికి చెందిన న్యూ క్లియర్ ఆధారిత విమానాలు మోసుకెళ్లే నౌక "రొనాల్డ్ రీగన్" తన వంతు సహాయం చేయడానికి అక్కడకు చేరుకుంది కూడా. రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితులు తీవ్రమయ్యాయేకాని తగ్గే సూచనలు అంతగా కానరాలేదు.
గెలుపు-ఓటములు దైవాధీనం కాదని, మానవాధీనం అని ఘంటా పధంగా చెప్పడానికి 2011 మార్చ్ నెలలో జరిగిన మూడు రకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉపాధ్యాయ-పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాని, ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు కాని, స్థానిక సంస్థల కోటావి కాని...ఆ మాట కొస్తే భవిష్యత్ లో జరగబోయే మరి కొన్ని ఈ మోస్తారు ఎన్నికలు తీరుతెన్నులు కాని, కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కించిత్తైనా గమనించిన దాఖలాలు లేవు. ఆ పార్టీ-ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఉపాధ్యాయ-పట్టభద్రుల-ఎమ్మెల్యే-స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల గెలుపు-ఓటములు. ఎన్నికల నిబంధనలతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, తమ గెలుపు-ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం దురదృష్టకరం.
 ఉపాధ్యాయ-పట్ట భద్రుల కోటాలో బరిలోకి దిగినవారిలో, ఎవరో ఒకరిద్దరి విషయం మినహాయించి, పోటీకి దిగిన ప్రతివారూ, ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, రంగంలోకి దిగడం జరగలేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ నేపధ్యంలోనే జరిగింది. వీరి విషయంలో కూడా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా నైనా క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది వ్యవహారం. కాంగ్రెస్ సమ్మతి-అసమ్మతి వర్గ అభ్యర్థులు, జగన్ వర్గం అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులు, వీరి మద్దతు అంతో-ఇంతో కూడగట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగి, ప్రత్యర్థుల ఓటమికి కృషి చేశారు. తమ గెలుపు లక్ష్యం కన్నా, ఇతరుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలివి. సరే అంచనాలు కొందరి విషయంలో అనుకూలంగాను, మరి కొందరి విషయంలో తారు-మారుగాను జరగడంతో, ఓడిన వారి పక్షాన నిలిచిన రాజకీయ పార్టీ నాయకుల కన్ను ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై పడింది.
ఎమ్మెల్యేల కోటాలో పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు మాత్రమే వీలుండగా, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ చాణక్యులు, వారి-వారి అనుకూల కూటముల అవగాహన (రాహిత్యం) ప్రకారం, కలిమిడిగా-విడి విడిగా, పన్నెండు మంది అభ్యర్థులను రంగంలో దింపారు. సాధారణంగా బలాబలాలు స్పష్టంగా వున్నప్పుడు ఏకగ్రీవంగా జరిగే నిర్ణయం, ఈ సారి, ఎన్నికల ద్వారా తీసుకోవాల్సిన అవసరం పడింది. "సీక్రెట్ బాలెట్" కాస్తా "ఓపెన్ సీక్రెట్ బాలెట్" గా మారి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళికి విరుద్ధంగా జరిగింది. ఆసాంతం పర్యవేక్షించాల్సిన ఎన్నికల సంఘం నోట మాట లేదు. ఎవరినీ తప్పు పట్టలేని స్థితికి చేరుకుంది. గెలిచిన వారు, ఓడిన వారు ఒకే తప్పు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష పార్టీల వారు, తమ చేతిలో వున్న "క్రాస్ ఓటింగు" ఆయుధాన్ని యధేఛ్చగా వాడుకున్నారు. తాము ఓడి పార్టీని ఓటమి పాలు చేసిన వారు కొందరైతే, పార్టీని ఓడించి తామూ ఓటమి పాలైన వారు మరి కొందరయ్యారు.
ఏప్రిల్ 2011 చివరలో దేశ-విదేశాలలోని లక్షలాది మంది తమ ఆరాధ్యదైవంగా భావించే భగవాన్ సత్య సాయిబాబా ఆరోగ్యం విషమించి పరమపదించారు. ఆస్తికులు-నాస్తికులు, అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, అధికారులు-అనధికారులు, ఆంధ్రులు-ఆంధ్రేతరులు, దేశ-విదేశాల్లోని సామాన్యులు-అసామాన్యులు, బాబా అపర భక్తులు-ఏ మాత్రం గిట్టని వారు, వారు-వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, ఆయనో మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, మానవ రూపంలో మనందరి మధ్యనే-మన కోసం కద లాడుతున్న "పురుషోత్తముడు" అనే విషయం బోధ పడుతుంది. పొలిమేరలే తప్ప ఎల్లలు లేని ఒక కుగ్రామంలో జన్మించి, ఎల్లలెరుగని అపురూప ప్రదేశంగా దాన్ని మలిచి, ప్రపంచ వ్యాప్తంగా దేశ-దేశాల పౌరులకు ఆధ్యాత్మిక తృప్తిని, మానసిక స్థయిర్యాన్ని కలుగజేసే "ప్రశాంత నిలయం" గా ఆ పల్లె రూపు-రేఖలనే మార్చి, తన చిన్న కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా చేసుకున్న భగవాన్ సత్య సాయిబాబా తన భక్తులను వీడి శివైక్యం పొందారుసత్య సాయిబాబా మానవ రూపంలో మన మధ్య నున్న దైవం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ దైవాన్ని మన మధ్యనే ఆ భగవంతుడు వుంచి నంత కాలం అందరికీ అంతా మంచే జరిగింది. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎలా జరగాలనుకున్నాడో అలానే జరిగింది. ఇదే భగవత్ అవతార రహస్యం!
(మరిన్ని మిగిలాయింకా)

Thursday, September 8, 2011

అంతం కాదిది ఆరంభమే(నా) !: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (09-09-2011)

ఆలోచింపచేస్తున్న సీబీఐ అరెస్టులు, కొందరికి వందల వేల రెట్ల ఆదాయం ఎలా సాధ్యం?, శిక్షల దాకా వ్యవహారం కొనసాగుతుందా?, ప్రజల్లో కొనసాగుతూనే ఉన్న అపోహలు, విచారణలకు రాజకీయ కారణాలేనా!, నివారణ కంటె నిరోధం ముఖ్యం....ఎడిటర్

స్వతంత్ర భారత దేశంలో, విభజించి-పాలించు అనే ఆంగ్లేయుల పరిపాలనా వారసత్వాన్ని, పోకడలో అవినీతి మయమైన కొన్ని ప్రపంచ దేశాల విధానాన్ని, అక్షరాలా పాటిస్తూ వస్తున్న ఈ దేశ రాజకీయ నాయకుల ఆటలకు మధ్య-మధ్య అంతరాయం కలిగించి, ఆట కట్టించడానికి కారణమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను - ఆ వ్యవస్థల పుణ్యమా అని నెల కొన్న సంస్థలను - అందులో (అందరూ కాకపోయినా) నిబద్ధతతో పని చేస్తున్న అధికారులను మనసార అభినందించాలి. వాస్తవానికి ఆ వ్యవస్థలు-సంస్థలు-వ్యక్తులు నిరంతరాయంగా కనుక తమ బాధ్యతలను పరిపూర్ణమైన నిష్ఠతో నిర్వర్తిస్తున్నట్లయితే (అధికారంలో వున్న రాజకీయనాయకులు అడ్డుపడకుండా వుంటే!) అవినీతిపరుల అరెస్టులతో మాత్రమే ఆగకుండా-వారి గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టే పరిస్థితులను కలిగించ గలిగే వారు. ఒక వైపు పౌర సమాజం నాయకుడు అన్నా హజారే-ఆయన బృందం గత కొన్ని నెలలుగా అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తరతమ భేదం లేకుండా, కాంగ్రెస్-కాంగ్రేసేతర-బీజేపి-బీజేపేతర అవినీతి సామ్రాట్టులను అంచలంచలుగా అదుపులోకి తీసుకుని విచారించడం, సామాజిక-రాజకీయ-ఆర్థిక విశ్లేషకులను ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా, స్వతంత్రం వచ్చి అరవై నాలుగు సంవత్సరాలు నిండిన సందర్భంలో తలఎత్తుతున్న ఈ పరిణామాలను సగటు భారతీయ పౌరుడు స్వాగతిస్తుంటే, ఈ దేశ పరిణామాలను ఆసక్తితో యావత్ ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. భారత దేశ ప్రజాస్వామ్యం ఇంత గట్టిగా పని చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు వారంతా.

ఆ సంస్థకు ఎవరిష్టమొచ్చిన పేర్లు వారు పెట్టారు. కొందరేమో "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అన్నారు. అలా అన్నవారు సహితం జగన్మోహన్ రెడ్డిపై అ సంస్థ విచారణను మనసార స్వాగతించారు. మరికొందరేమో అదే సంస్థను "కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్" అని సాక్షాత్తు చట్టసభలోనే నామకరణం చేశారు. అలా చేసి వారం రోజులు తిరక్కుండానే, ఎవరిని "బచావ్" చేయడానికి జరిగిందో కాని, ఆమె అనుంగు అనుచరుడు గాలి జనార్థన్ రెడ్డి కటకటాల పాలయ్యాడు. మధ్యలో పేర్లు పెట్టడానికి తామూ తీసి పోమన్న తరహాలో కొందరు మహా నాయకులు, తమ పార్టీని దూషించిన ప్రత్యర్థి పార్టీకి "భారతీయ జగన్ పార్టీ" అని, "బచావో జగన్ పాలసీ" అని మారు పేర్లు తగిలించారు. ఇవేవీ తమకు పట్టదన్న ధోరణిలో, గుట్టుచప్పుడు కాకుండా, తమపని తాము చేసుకుపోతున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు - ప్రస్తుతం వారికి ఆంధ్ర-కర్నాటకలలో నాయకత్వం వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆ అధికారి మన తెలుగువాడు కావడం, ఆరోపణలొచ్చిన వ్యక్తి ఎంత మహా-మహానుభావుడైనా, ఏ స్థాయిలో అండ-దండలున్నా, కాంగ్రెస్ వారైనా-ప్రతిపక్ష నాయకులైనా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుకుని పోవడం, ఆబాల గోపాలం అభినందించాల్సిన-ఆనందించాల్సిన విషయం.

అవినీతి సామ్రాట్టులను అదుపులో తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని (వున్నదున్నట్లు చెప్పాలంటే... న్యాయ స్థానాలను-సిబిఐని) అభినందించాల్నా? లేక ఇంతకాలం వారి అవినీతితో ప్రజాధనం కొల్లగొడుతుంటే, ప్రేక్షక పాత్ర వహించినందుకు-సీబీఐ తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా పరోక్షంగానన్నా అడ్డుకున్నందుకు అదే ప్రభుత్వాన్ని అభిశసించాల్నా? ఆలశ్యంగానైనా, మరింత దుర్మార్గం జరగనివ్వకుండా ఆపుదల చేసినందుకు, ప్రస్తుతానికి మెచ్చుకోవడమే మంచిదే మో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో-సరిహద్దు కర్నాటక రాష్ట్రంలో, ఇంచుమించు ఏక కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు లింకు వుండే అవకాశాలు చాలానే వున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమైతే-కనీసం వాస్తవానికి చేరువలో వుంటే (వుండే అవకాశాలే ఎక్కువ అనక తప్పదు), దశాబ్దం కింద వారి సొంతం అనుకున్న ఆస్తిపాస్తులకు, నేటి వారి ఆస్తులకు, నక్కకు-నాగ లోకానికి వున్న తేడా వుంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కాని-ఒక వ్యాపార సంస్థ కాని ఆస్తులు సమకూర్చుకోరాదన్న నిబంధన కాని, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెంపొందించుకోరాదన్న చట్టం కాని లేదన్నది ఒపుక్కోవాల్సిందే. వచ్చిన చిక్కల్లా, ఆ ఆదాయ వనరులు ఎలా సమకూరాయన్న విషయంలో అవలంబించిన మార్గాలే. రూపాయి ఆదాయం-పది రూపాయల ఆస్తులు-పాతిక రూపాయల ఖర్చులున్న వారికి, ఏడాది-రెండేళ్లు-మూడేళ్లు తిరక్కుండానే, వందల-వేల రెట్ల ఆదాయం పెరగడం-దానికి రెట్టింపు ఆస్తులు సమకూరడం, ఖర్చులే మో తగ్గడం ఎలా సంభవమనే దే అంతుచిక్కని ప్రశ్న. అదే జరిగింది-జరుగుతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోను, వారికి అత్యంత సన్నిహితుడు-అవునన్నా, కాదన్నా వ్యాపార భాగస్వామి గాలి జనార్థన్ రెడ్డి వ్యవహారంలో.

బహిర్గతమైన ఆదాయ-వ్యయ వనరుల లెక్కల ప్రకారం, వీరిరురివురి ఆర్థిక పరిస్థితి దశాబ్దం క్రితం ఎంతనేది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు, ఐన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆదాయమెంత? ఆదాయపు పన్నెంత కట్టారు? పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఎన్ని ఆస్తులు అఫిడవిట్ లో చూపించారు? అన్న సంగతి బహిరంగ రహస్యమే కదా? అలానే సుష్మా స్వరాజ్ కర్నాటక నుంచి లోక్ సభకు పోటీ చేసిన రోజుల్లో-అంతకు కొన్నాళ్ల, కొన్నేళ్ళ క్రితం గాలి జనార్థన రెడ్డి ఆస్తులెన్నో మీడియాలో వస్తున్నాయి కదా. వారిరువురూ న్యాయసమ్మతంగా-ధర్మ సమ్మతంగా వ్యాపారాలు చేసి తమ ఆస్తులను పెంచుకున్నారా? లేక రాజకీయాధికారాన్ని (తమది-తమ ఆప్తులది) ఆసరాగా చేసుకుని ఆస్తులను కూడగట్టుకునారా? మైక్రో సాఫ్ట్ బిల్ గేట్స్, గూగుల్-ఒరాకిల్-ఫేస్ బుక్ సంస్థల అధినేతలు కూడా అతి తక్కువ సమయంలోనే ఆస్తులు సమకూర్చుకున్నప్పటికీ వారిపై అవినీతి ఆరోపణలెందుకు రావడం లేదు? బహుశా వారేమో ఫక్తు వ్యాపార సరళిలో మిలియనీర్లు-బిలియనీర్లు అయ్యుండాలి...వీరేమో... అందినంత దండుకో! అన్న చందాన కోటీశ్వరులై వుండాలి. ఐనా, ఇప్పుడిప్పుడే అలా మాట్లాడక పోవడం మంచిదే మో! ఎలాగూ, విచారణ జరుగుతోంది కదా! ఎటొచ్చీ..చిక్కల్లా, విచారణ చేసినంత కాలం చేసి, ఆ తర్వాత, సరైన సాక్ష్యాధారాలు లేవని వదులు తే ఏం కావాలన్నదే సామాన్యుడి మదిలో మెదిలే అంతులేని వింత ప్రశ్న. అరెస్టులు ఆరంభం కావాలే కాని అంతం కారాదు.

న్యాయస్థానాల ఆదేశాల మేరకే, సిబిఐ దర్యాప్తు ప్రారంభమై, త్వరితగతిన సాగుతున్నప్పటికీ, ప్రజల్లో అపోహలు ఇంకా కొనసాగుతూనే వుండడానికి కారణం...ఇన్నాళ్లూ-ఇన్నాళ్లూ, ఇంత అవినీతి జరుగుతున్నా, చేస్తున్న వారినెవరినీ నిలుపుదల చేయలేకపోవడం వెనుకనున్నబలీయమైన కారణాలేంటి? అని. ఏ అధికారులను-అనధికారులనైతే సిబిఐ ప్రస్తుతం విచారణ చేస్తున్నదో, వారితో సహా, చేయని ఇతర అధికారులకు-అనధికారులకు ఈ విచారణ ఒక కనువిప్పు కావాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచన జరగాలి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కాని, సోదాలు కాని, రాజకీయ కారణాల వల్ల కానేకాదు అన్న నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. కేవలం విచారణతో ఆగకుండా శిక్షల దాకా వ్యవహారం (తప్పు జరిగిందని తేలితే-తేల్చగలిగితే) కొనసాగాలి. అదెంతవరకు వీలుంటుందోకాని, గత రెండు-మూడు రోజులుగా ఉన్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే, అవినీతికి పాల్పడినట్లు భావించి విచారణకు గురవుతున్న వారు తమను వేధించడానికి రాజకీయ కారణాలే తప్ప మరేమీకాదన్న అభిప్రాయం బలంగా కలిగించడానికి దేశ రాజధానిలో కాలికి బలపం కట్టుకుని ఎక్కని గడప-దిగని గడప లేకుండా బిజీ-బిజీగా గడుపుతున్నారట.

చివరకు ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తా యో కాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఏ కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చాడో, ఆ పార్టీ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్" పంచన చేరడానికి తన సంసిద్ధతను బహిరంగంగానే-అదీ పేరుపొందిన జాతీయ టెలివిజన్ ఛానల్ ద్వారా తెలియచేయడము విశేషం. తన సచ్ఛీలతను తెలియచేయడానికి, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు విషయంలో సహితం మౌనంగా వుండి పోయారు. మరో వైపు, తనను లోక్ సభలో వెనకేసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మ స్వరాజ్ కు కూడా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా గాలి జనార్దనరెడ్డి ఆమెకు సన్నిహితుడంటారు. తాను జగన్మోహన్ రెడ్డికి లోక్ సభలో మద్దతిచ్చినా తన సన్నిహితుడి విషయంలో ఆయన ఏమీ తెలియనట్లు మాట్లాడడం వెనుక గూడార్థం ఏమై వుంటుందో?

భారత దేశంలో అపారమైన కోటానుకోట్ల రూపాయల విలువ చేసే సంపద వ్యవసాయ పంటల రూపేణా నెలల తరబడి ఎటువంటి బధ్రత లేకుండా బహిరంగంగానే అందరి కళ్ల ముందర పడేసి వుంటుంది. ఐనా, అందులో కొంచెం కూడా దొంగల పాలవదు-ఎప్పుడో ఒకప్పుడు తప్ప. గాలి లాంటి ఘనులే కనుక అనాదిగా మన వ్యవస్థలో వుండి వున్నట్లయితే, పరిస్థితి వేరే విధంగా వుండేదేమో! ఇక ఇప్పడు అలా కాదు. భూగర్భంలో అనాదిగా నిక్షిప్తమై వున్న అపార సంపదను కూడా కొల్లగొట్టే మహానుభావులు పుట్టుకొచ్చారు. అలాంటివారికి ఆ నిక్షిప్తమైన సంపదను వెలికి తీసేందుకు లైసెన్సులను ఇచ్చిన "ప్రభుత్వ అధికారులను" ప్రధమ ముద్దాయిలుగా పేర్కొనాలి. వారిని అలా చేయమని వారిని ప్రోత్సహించిన అనధికారులను (మంత్రి వర్గ సభ్యులను) రెండవ ముద్దాయిలుగా పేర్కొనాలి. అప్పుడే ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా వుండే ఆస్కారముంటుంది. ఏ విధంగానైతే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో స్థలం, విల్లాలు కొనుక్కున్న వారిని విచారణ చేయడానికి నిర్ణయం జరిగిందో, అదే విధంగా, పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా గాలి గనుల విషయంలో కాని, జగన్మోహన్ కంపెనీలలో పెట్టుబడుల వ్యవహారంలో కాని విచారణ జరగాలి.

వ్యాధి నివారణ కంటే, నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి జరిగిన తర్వాత చర్యలకంటే, ముందస్తుగానే నిరోధించగల వ్యవస్థలుండాలి. కావాల్సింది "పోస్ట్ ఆడిట్" కాదు.."ప్రీ ఆడిట్". లక్ష్మీ నారాయణ లాంటి అధికారులు లక్షలలో-వేలల్లో కాకపోయినా, వందల సంఖ్యలో నన్నా మన దేశంలో వుండే వుంటారు. భారీ కుంభకోణం జరిగేందుకు ఆస్కారముండే వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే ముందర, ఇలాంటి అధికారులతో, లైసెన్సు కోరిన వారి పూర్వా-పరాలు, రాజకీయ సంబంధాల గురించి సమగ్ర దర్యాప్తు చేయించాలి. అంతటితో ఆగకుండా, ఆ లైసెన్సుకు సంబంధించిన వారి వ్యాపారం సాగేంతవరకూ, ఏడాదికో-ఆర్నెల్లకో వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో, లేదో, విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా-బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. అప్పటికీ దొరకకుండా తప్పించుకుంటే, ఇక ఎలాగూ పోస్ట్ ఆడిట్ వుండనే వుంటుంది. కనీసం కొంతకాలమైనా, అవినీతి కొంతలో కొంతన్నా అరికట్టడానికి ఈ చర్యలు అమల్లోకి రావాలి. లోక్ సభలో చర్చకు రానున్న లోక్ పాల్ బిల్లులో ఈ అంశాలకూ ప్రాధాన్యతుండాలి. లేకపోతే, గాలి లాంటి వారు తమకున్న పలుకుబడితో అప్రతిహతంగా అవినీతి మార్గాలలో పయనిస్తూనే వుంటారు.

Friday, June 10, 2011

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం: వనం జ్వాలా నరసింహారావు

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (10-06-2011)

అటకెక్కనున్న రాజీవ్‌ ఆరోగ్య శ్రీ?, నాలుగోవంతు వ్యయంతోనే జనరిక్‌ మందులు, ప్రభుత్వ రంగానికి అవకాశాలు, అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్‌, ఆసుపత్రులలో ఉచిత ఔషధాలకు అవకాశం….

ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణలంటే, ఇల్లు పీకి పందిరి వేయడమనే ఆలోచన తప్ప మరోటి కాదనే రీతిలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కడప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికే అన్నట్లు, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, అశేష జనాదరణ పొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను అటకెక్కించే దిశగా చర్యలు చేపట్టారు. కాకపోతే తద్వారా రాబోయే అపవాదునుంచి బయట పడేందుకు, మరో ఆచరణ సాధ్యం కాని ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి ముఖ్య మంత్రి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మందు చీటీలు ఇవ్వడం కాకుండా, అన్ని రకాల మందులను ఉచితంగా అక్కడికక్కడే అందచేయడం దాని లక్ష్యం. ఇక ముందు, రోగులు మందులను బయట మార్కెట్ కు వెళ్ళి కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇలా ఉచితంగా ఇవ్వాల్సిన మందులను, ఆసుపత్రులే కంపెనీల ద్వారా కొనుగోలు చేసి, రోగులకు ఇవ్వనున్నదన్న మాట. దీని కొరకు మందుల కొనుగోలు బడ్జెట్ ను రు. 400 కోట్లకు పెంచారు. ఇంతవరకు బాగానే వుంది కాని, నాలుగు వందల కోట్ల రూపాయలను వ్యయం చేసి, "బ్రాండెడ్" మందులను కొనుగోలు చేసే బదులు, దానిలో నాలుగో వంతు వ్యయం చేస్తే, "జనరిక్" మందులను కొనగలమని, తద్వారా, ప్రభుత్వానికి ఖర్చు తగ్గించవచ్చని ఆలోచన చేసి వుండాల్సింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా "జనరిక్" మందుల అమ్మకం చేసే పథకం అమలు చేయగలిగితే, ఆసుపత్రులలో మందులు నిల్వ వున్నా లేకపోయినా, సరసమైన ధరలకు అవి లభ్యమయ్యే సదుపాయం కలిగించినట్లవుతుంది. బీద-సాద, ఆర్థికంగా వెసులుబాటు లేనివారికి ఇదెంతో ప్రయోజనకారి అవుతుంది.

భారతదేశంలోని అలోపతి ఔషధ ఉత్పత్తుల పరిశ్రమ, ప్రపంచంలోని ఐదు పెద్ద పరిశ్రమలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ పరిశ్రమలో వున్న సంస్థలన్నీ వారు ఉత్పత్తిచేసే మందులకు, ఆకర్షణీయమైన పేర్లను పెట్టి, మార్కెటింగ్ విధానాలను చేపట్టి, అమ్మకాల ద్వారా లాభాలు చేసుకుంటారు. ఒకే రకమైన రసాయన మిశ్రమానికి సంబంధించి, అనేక పేర్లతో మందులు మార్కెట్లో వుండడం, ఒకే రకమైన శరీర రుగ్మతకు, ఒక్కో డాక్టర్, ఒక్కో మందు పేరును సూచించడం, రోగులు కూడా మందును "బ్రాండెడ్" పేరుతోనే (ఉదాహరణకు క్రోసిన్, కాంబీ ఫ్లాం) గా గుర్తుంచుకోవడం ఆనవాయితీ. అలాగే ధరల నిర్ణయం కూడా ఉత్పత్తిదారుల ఇష్టా ఇష్టాల మీదే ఆధారపడి వుండేది. భారత దేశంలో అనుసరిస్తున్న ఆ విధానం, అలా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ప్రపంచ ఔషధ ఉత్పత్తుల పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించింది. విదేశీ బహుళజాతి సంస్థలు భారత దేశంలో ఉత్పత్తులు చేసి లాభాలను ఆర్జించడం మొదలెట్టారు. 1979 లో ప్రభుత్వం ఔషధ విధానం రూపొందించింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఓ) గా పిలువబడే ఆ విధాన నిర్ణయం దరిమిలా, వివిధ రకాల మందుల ధరలను ఒక పద్ధతి ప్రకారం నియంత్రించింది ప్రభుత్వం. ఆ విధానానికి అడపాదడపా మార్పులు-చేర్పులు కూడా చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. అలోపతి ఔషధ విషయకమైన మందుల పరిధిలోని కీలక అంశాలపై అధ్యయనం చేసి, విచారణ జరిపి, దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించడానికి, 1974 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సభ్యుడు జైసుఖ్ లాల్ హాతి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. హాతీ కమిటీలోని అరవై మంది నిపుణులు, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి రూపొందించిన సమగ్రమైన నివేదిక వాస్తవానికి వెలుగు చూడలేదనే అనాలి.

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, సీపీఎం పక్షాన రాజ్యసభ సభ్యుడుగా వున్న రోజుల్లో, పదిమందితో కూడిన పార్లమెంటరీ హెల్త్ కన్సల్టేటివ్ కమిటీలో ఆరేళ్ల పాటు సభ్యుడుగా చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ సభ్యుడుగా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాలలో ఐదుగురు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులతో సంప్రదింపులు చేసే అవకాశం కలిగింది.

ఎమర్జెన్సీ అమల్లో వున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను తొక్కి పట్టింది ప్రభుత్వం. బడా పారిశ్రామిక వేత్తలకు లాభాలను ఆర్జించి పెట్టే పద్దతికి స్వస్తి చెప్పే రీతిలో నివేదిక వుందని వారంతా పసి గట్టారు. భారతీయ పద్దతులను అనుసరించి మందులను ఉత్పత్తి చేసే ఇతర పారిశ్రామిక వేత్తలకు సిఫార్సుల వల్ల మేలే జరుగుతుంది. హాతీ కమిటీ నివేదిక అమలవుతే, ఔషధాల ఉత్పత్తిలో నాణ్యత మెరుగయ్యే అవకాశాలతో పాటు, ధరల నియంత్రణకు మార్గం సుగమం అవుతుంది. ప్రయివేట్ రంగం వెనక్కు తగ్గి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలొచ్చే వీలు కూడా కలిగేది. భారతదేశ ప్రజల అవసరాలకు తగ్గట్లు ఔషధ ఉత్పత్తులు జరిగుండేవి. పటిష్టమైన ఔషధ నాణ్యతా పద్దతులను పాటించాలని, "బ్రాండ్ నేమ్" మిషతో రోగులను లూటీ చేసే విధానానికి స్వస్తి పలకాలని నివేదికలో సిఫార్సు చేసింది కమిటీ. ఎమర్జెన్సీ ఎత్తి వేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తల పక్షమే వహించి, నివేదికను కనుమరుగు చేసింది. నివేదిక ప్రతులను కొందరు స్వప్రయోజన పరులు తగుల బెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. బహుశా ఆ నివేదిక ప్రతులు, ఒకటి-రెండే మైనా మిగిలి వుంటే, ఏదైనా మెడికల్ గ్రంథాలయంలో వుండొచ్చు.

హాతీ కమిటీ నివేదికలోని ఒక ప్రాముఖ్యతాంశం, ఆసుపత్రులలో వుంచాల్సిన "అత్యవసర ఔషధాల జాబితా" లో ఏమేమి వుండాలనేది. అదే విధంగా కెమికల్ ఫార్ములాతో కాకుండా, జనరిక్-బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మందుల విడుదలకు సంబంధించిన అంశం. మార్కెట్లో ఇరవై ఐదు వేల రకాల మందులుండేవి. ఒక్క "బీ-కాంప్లెక్స్" ఫార్ములా మందు, వంద పేర్లతో లభ్యమవుతుంది. అలానే యాస్ప్రిన్, పారాసిటమాల్, యాంటీ బయాటిక్, ఇతర మందులు. ఏ విధమైన ఉపయోగం లేని మందులనేకం మార్కెట్లో వుంటాయి. టానికులు, మల్టీ విటమిన్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్ ముందుంటుంది. అలాంటి లోపాలను అధిగమించే పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ప్రాధమిక ఆరోగ్య రంగానికి సుమారు వందకు పైగా, ఆ పైన మరి కొన్ని అదనంగా, మొత్తం మీద వందల సంఖ్యలో మందులు సరిపోగా, మార్కెట్లో వేల సంఖ్యలో ఎందుకుండాలని కూడా నివేదిక ప్రశ్నించింది.

ఎప్పుడైతే ఆ నివేదికను-నివేదికలోని ముఖ్యమైన అంశాలను బుట్ట దాఖలా చేశారో, "ఢిల్లీ సైన్స్ ఫోరం", "మెడికో ఫ్రెండ్స్ సర్కిల్", ఫిజీషియన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్", సౌత్ ఇంటర్నెట్" లాంటి సంస్థలు, నివేదిక అమలుకు ఆందోళన చేయసాగాయి. ఆ సంస్థలన్నీ, నివేదిక సిఫార్సులు సమాజానికి అత్యంత లాభదాయకమైన వని విశ్వసించాయి. సీపీఎం వైద్య విభాగం, నెల్లూరుకు చెందిన డాక్టర్ జె. శేషా రెడ్డి, రాధాకృష్ణమూర్తి ప్రభృతులు ఆందోళనలో అగ్ర భాగాన నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీపీఎం శాఖను సంప్రదించి వాళ్లనూ ఆందోళనలో దింపారు. నెల్లూరులో ఒక సమావేశాన్ని నిర్వహించి, పలువురు వైద్యులను ఆహ్వానించారు. వచ్చినవారిలో, పశ్చిమ బెంగాల్ నుంచి-కేరళ నుంచి ఇద్దరు డాక్టర్లు, ఒక అడ్వకేట్-డాక్టర్ బాంబే నుంచి వున్నారు. బాంబేకు చెందిన "శ్రీమతి డాక్టర్ అశోక్ ధవే అడ్వకేట్" ఎంబిబిఎస్ చేసి, ఎల్ ఎల్ డి పట్టా పుచ్చుకున్న అరుదైన వ్యక్తి.

రెండు రోజుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, పలు రాష్ట్రాలలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మరికొందరు వీరితో కలిశారు. కర్నూలుకు చెందిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, నెల్లూరుకు చెందిన డాక్టర్ విజయకుమార్, విజయవాడకు చెందిన డాక్టర్ ఎం రామారావు, గుంటూరుకు చెందిన అధ్యాపకుడు లక్ష్మారెడ్డి లాంటివారిని కలుపుకుని, మరో మారు 1986 లో సమావేశమైన డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రభృతులు, బుట్ట దాఖలు చేసిన హాతీ కమిటీ నివేదికను వెలుగులోకి తెచ్చే ఉద్యమ్నాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి, పలు ప్రదేశాలలో తిరిగి, డాక్టర్లను ఉద్యమంలోకి దింపేందుకు ప్రోత్సహించి, వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఆ సంవత్సరాంతానికి కలకత్తాలో అఖిల భారత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆందోళనను తీసుకెళ్లారు.

కలకత్తాలో జరిగిన రెండు రోజుల సమావేశానికి ఎంపిక చేసిన సుమారు వంద మంది డాక్టర్లు హాజరయ్యారు. సీపీఎం నాయకుడు స్వర్గీయ ఇఎంఎస్ నంబూద్రిపాద్, పశ్చిమ బెంగాల్ శాఖ కార్యదర్శి చౌదరి కూడా వున్నారు. సమావేశంలో పార్టీ సహాయం-సలహా అడిగారు డాక్టర్లు. హాతీ కమిటీ నివేదికలోని "ఔషధ విధానం" తో పాటు, వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఆందోళన చేపట్టమని పార్టీ సూచించింది. అయితే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కలుపుకుని పోతే మంచిదని, నంబూద్రిపాద్ అభిప్రాయ పడ్డారు. వీలైనంత మందిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేసి, వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యలు కూడా చేపట్టి తే మంచిదని సూచించారాయన. సీపీఎం అనుబంధ సంస్థగా వుండే కన్నా, విస్తృత సంస్థగా, అందరినీ కలుపుకొని పోతే మంచిదన్న నిర్ణయం తీసుకున్నారు. అలా డాక్టర్ల విశాల వేదిక మొదలైంది. డాక్టర్ రాధాకృష్ణమూర్తి తన వంతుగా ఖమ్మం జిల్లాలో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జిల్లాలో జరిగిన ప్రతి ఐఎంఏ సమావేశంలో వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి చర్చకు పెట్టేవారు. అయితే, ఐఎంఏ సభ్యుల్లో అతి కొద్దిమంది మాత్రమే ప్రజాస్వామ్య భావాలున్న వారని, స్వలాభం చూసుకునేవారు ఎక్కువ మందని, నైతిక విలువలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలువురు వ్యతిరేకంగా మాట్లాడేవారని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి.

హాతీ కమిటీ ముఖ్యాంశాలు సజీవంగా వున్నప్పటికీ, బుట్ట దాఖలా మాత్రం అయ్యాయి. నివేదికలోని అంశాలు కనీసం కొంతవరకైనా వెలుగు చూసినట్లైతే బాగుండేదేమో. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఉచితంగా ఆసుపత్రులలో మందుల పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని, హాతీ కమిటీ సూచనలకు అనుగుణంగా చేసే ప్రయత్నం చేస్తే, అటు ప్రభుత్వానికీ లాభం-ఇటు ప్రజలకూ మేలు. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి వైద్య పట్టా పుచ్చుకున్న వ్యక్తులై నందువల్ల ఈ విషయాలపై దృష్టి సారిస్తే మంచిదే మో! ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్న పథకం పది కాలాల పాటు అమలు కావాలంటే, ప్రభుత్వ నిధులు అనవసరంగా దుర్వినియోగం కాకుండా వుండాలంటే, జైసుఖ్ లాల్ హాతి కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాలి.

Thursday, May 26, 2011

అయోమయం-అస్తవ్యస్తం-గందరగోళం:వనం జ్వాలా నరసింహారావు

అక్కడ పునరంకితం... ఇక్కడ దినదిన గండం

(సూర్య దిన పత్రిక:27-05-2011)

వనం జ్వాలా నరసింహారావు

కేంద్రంలో తొలి మలి విడతలు కలిపి ఏడేళ్లు; రాష్ట్రంలో సీఎంలు మారినా కాంగ్రెస్‌ దే పెత్తనం; అక్కడా, ఇక్కడా అధినేత్రే కీలకం; సమస్యల పరిష్కారంలో వైఫల్యమా, సాఫల్యమా?; అవినీతి విషయంలో ప్రజల ఆందోళన; ఇక్కడ పోగ్రెస్‌ రిపోర్టులూ లేవు, పునరంకితాలూ లేవు!; అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం!

అక్కడ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" (యుపిఎ) తొలి-మలి విడతలు కలిపి అధికారంలో కొచ్చి ఏడేళ్లు, ఒక్క మలివిడత అధికారంలో కొచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక ఇక్కడ, ఆంధ్ర ప్రదేశ్ లో, పదేళ్ల విరామం అనంతరం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, తొలి విడత పూర్తి కాలం-మలివిడత నాలుగు నెలలు ఆయనే ముఖ్య మంత్రిగా, ఆయన మరణానంతరం రోశయ్య కొన్నాళ్లు-ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ముఖ్య మంత్రిగా, అధికారంలో కొచ్చి కూడా ఏడేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ, రాజశేఖర రెడ్డి వున్న రోజుల్లో కొద్ది మోతాదులో, రోశయ్య గారి హయాంలో తగు మోతాదులో, ప్రస్తుతం పూర్తి మోతాదులో, ఎవరు ముఖ్యమంత్రైనా అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరుగుతున్నదిప్పుడు.

కేంద్ర ప్రభుత్వ సాఫల్యాలపై ప్రధాని మన్మోహన్ ఏటేటా విడుదల చేసే "ప్రోగ్రెస్ రిపోర్టు" ఈ ఏడాది కూడా విడుదలైంది. తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పాలనలోని విజయాలను గత ఏడాది విడుదల చేసిన రిపోర్టులో ఆయన ప్రస్తావించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడంలో తమ సర్కారు విజయం సాధించిందని అప్పట్లో ప్రధాని తెలిపారు. గడిచిన సంవత్సరం 8.5 శాతం వార్షిక వృద్ధిరేటు సాధిస్తామన్న ధీమాను ఆయన అప్పట్లో వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ముందంజలో ఉన్నామన్నారు. నక్సల్స్ సమస్య తమ ముందున్న ప్రధాన అడ్డంకిగా ఆయన తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయన గత ఏడాది చెప్పిన వాటిలో చేసినవి కొన్ని, చేయలేనివి మరి కొన్ని వున్నాయి. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందే దిశగా, రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోను, కేంద్ర మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల సఫలతలను-విఫలతలను విశ్లేషించి చూపుతూ, యుపిఎ-2, మరో మారు ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు విడుదల చేసింది. అవినీతి, ద్రవ్యోల్బణం, సంకీర్ణ కష్టాలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల ప్రభుత్వాన్ని బాధిస్తున్న అంశాల్లో ముఖ్యమైనవిగా నివేదికలో పొందుపరచడం గమనిస్తే, వాటిని ఎదుర్కోవడంలో నాయకత్వం కొంత మేరకు విఫలమైన ట్లుగా భావించాల్సి వస్తుంది. ప్రధాని మన్మోహనే అయినప్పటికీ, ఆయన విడుదల చేసే రిపోర్టును మొదట యుపిఎ రధ సారధి, కాంగ్రెస్ అధినాయకి సోనియా గాంధీకి చూపి మరీ బహిర్గతం చేశారు ప్రధాని. ప్రభుత్వ విజయాలను గురించి విపులంగా పేర్కొన్నారు కూడా.

రిపోర్టులో ఏముందనేదాని కంటే, తాము చేసిందే దో చెప్పే ప్రయత్నమై తే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రం విషయానికొస్తే, రాజశేఖర రెడ్డి హయాంలో, ఏటేటా, ఆయన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజున, "పునరంకిత సభలు" జరిగేవి. ఆ సందర్భంలో, తమ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చేసినా వాగ్దానాల అమలులో, ఎలా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ పోయింది సవివరంగా-సభా ముఖంగా, అఖిల భారత స్థాయి-రాష్ట్ర స్థాయి అతిరధ-మహారధ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రజలకు తెలియ చేసేవారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంటివి ఎలా అమలవుతున్నాయో సగర్వంగా, బహిరంగసభ జరిపి చెప్పేవారు. ఆ పథకాల అమలులో జరుగుతున్నాయని భావించిన లోటుపాటులను కూడా ప్రజలు మరిచిపోయేలా, ఆయన వివరించేవారు. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనట్లే. రెండేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో, మే నెల 20, 2009 న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైందన్న సంగతే ఎవరికీ గుర్తున్న దాఖలాలు లేవు. పునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తున్నట్లు లేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!

అసలు అక్కడా-ఇక్కడా (అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను) ఏం జరుగుతోందని నిశితంగా పరిశీలిస్తే, ఏదన్నా కనీసం జరుగుతోందా? అన్న అనుమానం వేస్తోంది. మన్మోహన్ సింగ్ నీతికి-నిజాయితీకి మారు పెరే కావచ్చు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడో-బాధ్యుడో కావచ్చు. సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడే కావచ్చు. మంత్రి మండలి సభ్యులందరి మన్ననలను పొందుతుండవచ్చు. దేశ-విదేశాల్లో తనకూ-భారత దేశానికీ పేరు-ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నాడన్న గుర్తింపు పొందివుండవచ్చు. ఇవేవీ, సామాన్యులకు పట్టదు. అందునా మధ్య తరగతి ప్రజానీకానికి అసలే అవసరం లేదు. వాళ్ల దృష్టంతా, అతి తక్కువ సమస్యలతో, ఎలా జీవన యానం సాగించాలన్న అంశంపైనే. ఆ అంశానికి సరాసరి సంబంధమున్న, ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలోని అధికార-అనధికార వ్యక్తుల్లో పేరుకుని-కూరుకుపోయిన అవినీతి అనే బ్రహ్మ పదార్థం గురించి మన్మోహన్ ఏం చేశాడన్నది వారి ముందున్న ప్రశ్న. రాజా టెలికాం స్కాం, సురేష్ కల్మాడి కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో పాల్పడిన అంతులేని అవినీతి లాంటి అంశాలు సామాన్యుడి మదిని అహర్నిశలు తొలి చేస్తుంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, నిత్యావసర వస్తువుల దరలు ధనవంతుడికి కూడా అందుబాటులోకి లేనంత ఘోరంగా పెరిగి పోతుంటే, తమ దగ్గర పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్న పైకం బాహాటంగా అవినీతి చక్రవర్తులు స్వాహా చేస్తుంటే, నిశ్శబ్దంగా-నిబ్బరంగా గమనించడం తప్ప చేయగలిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో కలగడాన్ని, మన్మోహన్ రిపోర్టులో ఏ విధంగా వివరించబడిందో అర్థం కావడం లేదు. అహర్నిశలు భాగస్వామ్య పక్షాలను ఎలా మంచి చేసుకోవాలన్న తపన, మంచి చేసుకోక పోతే ప్రభుత్వం మనుగడ వుండదేమోనన్న ఆందోళనతో కాలం గడుపుతున్నదేమో కేంద్ర ప్రభుత్వం అన్న భావన పలువురి లో కలగడంలో తప్పులేదే మో!

ఇక మన రాష్ట్రం విషయానికొస్తే అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం! రాజశేఖర రెడ్డి అకాల మరణం రాష్ట్ర రాజకీయాలలో-అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అంతుచిక్కని శూన్యాన్ని తెచ్చి పెట్టింది. ఆయన బ్రతికున్నంత కాలం ఆయనతో ఎట్లా వేగాలో-ఆయన్నెట్లా అదుపుచేయాలా అని ఆలోచించిన కాంగ్రెస్ అఖిల భారత స్థాయి అధినాయకత్వం, ఆయన మరణానంతరం, ఆయనకు ధీటైన వారసులెవరో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది. ఆయన ప్రారంభించిన పథకాలకు నిధులెలా సమకూర్చాలో అని మధన పడిన అలనాటి ఆర్థిక మంత్రి రోశయ్య, ముఖ్య మంత్రయ్యాక, ఆ పథకాలను ఎలా ఊడగొట్టాలో అన్న ఆలోచనలో పడిపోయారు. ఆయన తర్వాత ముఖ్య మంత్రిగా అధిష్టానం ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల మద్దతు కూడగట్టడంలోనే సమయమంతా గడిచిపోతుంది. మరో వైపు అధికార యత్రాంగం ఎవరికివారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఏ పథకం అమలు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో, ఏ పథకం అమలు చేస్తే ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చో, అన్న విషయం మంత్రులకు తెలియదు. తెలియ చేయాల్సిన అధికారులకు ఆ సంగతే పట్టదు. పట్టించుకున్న ఒకరిద్దరు అధికారులకు సముచితమైన గుర్తింపు వుండదు. అందుకే ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టులు లేవు. పునరంకితం ప్రస్తావనే లేదు.

ఇవన్నీ ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప మరేదీ కానందున, అన్ని పార్టీల వారికి చెందిన వారిలో వీలున్నంత మందిని, తమ వైపు ఆకర్షించుకునే కార్యక్రమంలో వారు నిమగ్నమై వున్నారు. సోనియా గాంధీని ఎదుర్కుని కడపలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయ భేరీకి కాచుక్కూచున్నారు. తమ పార్టీలో వున్న వారు తెలంగాణ పేరు మీదో-మరే కారణానో పార్టీ వదిలి పోకుండా జాగ్రత్త పడుతూ, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఆధిక్యాన్ని పెంచుకునే పనిలో టీడీపి వుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోను కోల్ఫొకుండా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకుండా వేయాల్సి నన్ని ఎత్తులు వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిజీగా వుంది. ఇక బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతరులు ఇవేవీ తమకు పట్టనట్లు, వారి సహజ ధోరణిలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నంలో వారున్నారు.

ప్రజలకు మాత్రం అంతా అయోమయం-అంతా అస్తవ్యస్తం-అంతా గందరగోళం గా కనపడుతున్నవి!