Showing posts with label యలమంచిలి రాధాకృష్ణమూర్తి. Show all posts
Showing posts with label యలమంచిలి రాధాకృష్ణమూర్తి. Show all posts

Wednesday, January 11, 2012

సిపిఎం ఆవిర్భావ నేపధ్యం: వనం జ్వాలా నరసింహారావు


జనవరి 11, 12 న హైదరాబాద్‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో


సూర్య దినపత్రిక (12-01-2012)


వనం జ్వాలా నరసింహారావు

సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధ, గురువారాల్లో (జనవరి 3, 4 తేదీల్లో) జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పార్టీ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరగనున్న నేపధ్యంలో కీలకమైన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ కూడా వస్తున్నారు. పార్టీ జాతీయ మహాసభలో ప్రవేశపెట్టనున్న రాజకీయ తీర్మానం ముసాయిదా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పార్టీకి నూతన కార్యదర్శిని ఎన్నుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ఖమ్మం పట్టణంలో ప్రముఖ ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్ర-"తీపి గుర్తులు-చేదు అనుభవాలు" లో పేర్కొన్న పార్టీ ఉమ్మడి మహాసభలు, పార్టీలో చీలిక, సిపిఎం ఆవిర్భావం లాంటి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను గురించి, ఆ పుస్తకాన్ని గ్రంధస్థం చేసిన రచయితగా పాఠకులతో పంచుకునే ప్రయత్నం ఇది. 

ఏబై మూడు సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ మహాసభ, 1958 డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు. 7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు. అజయ్ ఘోష్ తన ప్రసంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు. నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.


ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, భారత దేశంలో కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు ఆకర్షించాయి. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్‌కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నాయకులలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పట్ల-జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం పట్ల అనుసరించాల్సిన విధానంలో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఫిబ్రవరి 1948లో కలకత్తాలో జరిగిన ద్వితీయ పార్టీ సమావేశం, రణదివేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. రణదివే "కలకత్తా సిద్ధాంతం" సాయుధ పోరాటాలను ప్రోత్సహించడంతో, వీర తెలంగాణా విప్లవ పోరాటానికి దోహద పడింది. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణా రైతాంగ సాయుధ ప్రతిఘటన, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో కమ్యూనిస్ట్ పార్టీకి చిక్కు సమస్య ఎదురైంది. ప్రతిఘటనను కొనసాగించడమా ? విడనాడి చట్ట సమ్మతమైన పోరాటాలను-ఆందోళనలను చేపట్టడమా? అన్న సందిగ్ధంలో కమ్యూనిస్ట్ నాయకత్వం పడింది. ఆ సమస్యపై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో పరస్పర విరుద్ధమైన తీవ్ర అబిప్రాయ భేదాలు తలెత్తడంతో, ఉపసంహరణ పూర్వ రంగంలో, స్వర్గీయ చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా పార్టీ నూతన పోలిట్ బ్యూరో ఏర్పాటయింది. దరిమిలా రూపొందించిన నూతన పార్టీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించే బలమైన వర్గానికి డాంగే ప్రభృతులు నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు అలా పడ్డాయి. ఆ నాడు పార్టీలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం దరిమిలా అజయకుమార్ ఘోష్‌ను, రాజేశ్వరరావు స్థానంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం, రైతాంగానికి భూమి హామీ వుంటుందని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆధారంగా, పోరాటాన్ని విరమించుకోవడం మంచిదనే నిర్ణయానికి, తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించిన నాయకత్వం వచ్చింది. తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం 1951 అక్టోబర్ 21 న బహిరంగంగా ప్రకటించారు.

అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‌సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించింది జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషిలు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలురైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‌గా నియమించింది.

సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా-భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగా లేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారి తీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్ యూనియన్-చైనాల రాజకీయ ప్రభావం వల్లో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై చీలిక అనివార్యమయింది. సిపిఐ-సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ. ఏప్రిల్ 11, 1964 న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా ముప్పై రెండు మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరపాలని తీర్మానించడం జరిగింది. అక్టోబర్-నవంబర్ 1964లో కలకత్తాలో ఏడవ  కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశాలు జరుపుకున్నాయి. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా వుండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తొలి ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్యను ఎన్నుకున్నారు సమావేశంలో. డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సుందరయ్య నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభిమానిగా, ఆచరణీయుడుగా వుండిపోయారు. ఆ నాడు (1964) ఖమ్మం జిల్లాలో గిరి ప్రసాద్ నాయకత్వంలో సిపిఐతో వెళ్లిన వారు చాలా కొద్దిమంది మాత్రమే!

నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో, సీపీఎం నుంచి కొంతమంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు. ఖమ్మం జిల్లాలో సహితం ఉత్సాహవంతులైన కొందరు యువకులు అటువైపు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో బత్తుల వెంకటేశ్వరరావు లాంటి వారు తొలినాళ్లలోనే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. రాష్ట్రస్థాయిలో నక్సల్ ఉద్యమంవైపు వెళ్లిన ప్రముఖులలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి, వజ్రవేలుశెట్టి, ముఖ్యులు. రాష్ట్రంలో ఎక్కువగానే నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ రోజుల్లో

Friday, November 11, 2011

తీపి గుర్తులు - చేదు అనుభవాలు (Part-1) : వనం జ్వాలా నరసింహారావు

తీపి గుర్తులు - చేదు అనుభవాలు (Part-1)

వనం జ్వాలా నరసింహారావు

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చెసే అవకాశం కలిగింది నాకు. 36 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో మొదటిది "డాక్టర్‍గారి నామాట" ఇది. వనం జ్వాలా నరసింహారావు

నా మాట

వయస్సు 84 నడుస్తోంది. ప్రస్తుతం పూర్తి వానప్రస్థం. బతుకుదెరువు కోసం చాలా ఏళ్లు వైద్య వృత్తి చేశాను. ఆసక్తి కొద్దీ చాలా కాలం రాజకీయ కార్య కర్తగా పని చేశాను. సాదా సీదా మధ్య తరగతి జీవితంలో, అందరి లాగానే ఎత్తు పల్లాలు, పువ్వులూ-రాళ్లూ-రెంటి రుచీ చూశాను. మెచ్చుకున్న వారు కొందరైతే, నొచ్చుకున్న వారు మరికొందరు. నా గొప్ప, అదృష్టం ఇటు విస్తృత కుటుంబంలోనూ, బయట సమాజంలోనూ చాలా మంది అభిమానులు వుండడం.

వారిలో కొద్దిమంది అడుగుతూ వచ్చిన ప్రశ్న: ఖాళీగానే వున్నారు గదా...జ్ఞాపకాలూ, అనుభవాలూ ఎందుకు రాసి వుంచకూడదు? అని. నా అనుభవాలు రాసి వుంచదగ్గంత ప్రత్యేకమైనవా? అన్న శంక ఒక వైపు వుండేది. ఎవరికి కావాలి ఇవన్నీ? చదివే ఓపిక ఎందరికి? చదివి ఏం నేర్చుకుంటారు? సమయం వృధా చేసుకోవడం తప్ప అనే నిర్వేదం-నిర్లిప్తత మరోవైపు వుండేది. అసలు కుదురుగా కూర్చుని రాసే శక్తీ-ఆసక్తీ లేక మరికొంత అనుకుంటూనే ఆ ఆలోచన పక్కన పెట్టేశాను.

ఒక శుభోదయాన మిత్రుడు జ్వాలా నరసింహారావు, మామూలుగానే-ముందుగా ఫోన్ చేసే వచ్చారు. ఆయన చిరకాల స్నేహితుడు. ప్రదర్శించని పాండిత్యం ఆయనది. జర్నలిజంలో పట్టా లేకపోయినా, విశేష అనుభవం, వృత్తిగత నైపుణ్యం వున్న వ్యక్తి. మార్క్సిజంపై విశ్వాసం, కమ్యూనిస్ట్ పార్టీలపై కించిత్తు అసంతృప్తి, కొందరు నాయకులపై వ్యక్తిగత గౌరవం-ఇదీ నాకు తెలిసిన "జ్వాలా". ఈ సారి తన వెంట ఒక "వాయిస్ రికార్డర్", "లాప్ టాప్ కంప్యూటర్" వగైరా ఎక్విప్‌మెంటుతో సహా వచ్చారు. "మీ జ్ఞాపకాలు చిన్నప్పటి నుండి ఈ నాటి వరకూ చెబుతూ పొండి. నేను రికార్డు చేసుకుంటాను" అంటూ పక్కనే కూర్చుని మొహమాట పెట్టేశారు.

అలా మొదలైందిది.

తీపి గుర్తులు - చేదు అనుభవాలు

ఒక వరస, పద్దతీ లేకుండా, గుర్తున్నంతవరకు చెప్పుకుంటూ పోయాను. ధార (ఫ్లో) ఆగిపోతుంటే, ఆయన ప్రశ్నలతో కదిలిస్తూ రావడం జరిగేది. కొన్ని ప్రశ్నలు గతాన్ని ఇంకా తవ్వేవి. ఇబ్బంది పెట్టేవి కొన్ని. మూసివుంచిన తలుపులు తెరిపించేవి కొన్ని. పాత్రికేయుడు కదా! అలా మూడు-నాలుగు రోజులు సాగింది.

రెండు మాసాల తరువాత, నీట్‍గా కంప్యూటర్‍పై టైప్ చేసిన ప్రతి-స్పైరల్ బైండ్‍తో వచ్చారు. చూసి ఇవ్వమన్నారు. నేను చెప్పినది ఒద్దికగా Chronological Order లో వుంచి, అధ్యాయాలుగా విభజించి, ఎడిట్ చేసిన పద్ధతి ముచ్చటగా వుంది. విషయాన్ని ఎక్కడా వక్రీకరించలేదు. వదిలి పెట్టలేదు.

కాని.... ...... ఆయన తన వ్యాఖ్యలూ-వ్యాఖ్యానాలూ జోడించారు. అందులో పొగడ్తల మోతాదు కాస్త ఎక్కువగానే వుంది. శతాబ్దాల నాటి ప్రఖ్యాత సాహితీవేత్త Johnson జీవిత చరిత్ర రాసిన Boswell గుర్తు వచ్చాడు. బహుశా ఇది, జీవిత చరిత్రకారుల తరతరాల సంప్రదాయ మేమో అనిపించింది! రెండోది.... కమ్యూనిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు కొన్ని తీసుకుని Precept కూ Practice కూ వున్న తేడాను సున్నితంగా విశ్లేషించారు. అవి వారి అభిప్రాయాలు. ఏమైనా, ఆ లోతుల్లోకి వెళ్లి, చర్చించి, తిరగరాయించే ఓపిక నాకు లేదనిపించింది.

నేను చేసిన ఒకే ఒక సూచన .... నా కథనంలోని రాజకీయ పరిణామాల అంశాలకు సంబంధించి Documentary Evidenceను అనుబంధంలో చేర్చితే, విశ్వసనీయత చేకూరుతుందని. నా ఫైల్ లో వున్న వాటిని అందించాను. పేజీలు పెరిగిపోవచ్చన్న భయంతో కొన్ని వదిలేశారు. దానికి తుది రూపం తీసుకు వస్తానని వెళ్లారు. ఆ తుది రూపమే ఈ పుస్తకం.

అలా ముగిసింది కథ.... ... చదివే అలవాటు, ఓపిక వున్న వారు చదవండి.

కొండంత అభిమానంతో, నిష్కామంగా, ఇంత విలువైన-బరువైన కృషి చేసిన మిత్రుడు "జ్వాలా" కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపకుండా ఈ వంట పూర్తి కాదు.

జ్ఞాపకాలు రాయమని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి, మిత్రుడు తెలకపల్లి రవి. ఆ నాడు నా వల్ల కాదనేశాను. ఇప్పుడు మరో విధంగా సాకారమైంది. Thank You Comrade Ravi.

తరువాత స్నేహపూర్వకంగా ఒత్తిడి చేస్తూ, గుర్తుచేస్తూ వచ్చిన వారూ-ఇతరత్రా సహాయ పడిన వారూ వున్నారు. వారందరికీ ధన్యవాదాలు.

వై.ఆర్.కె

Friday, June 10, 2011

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం: వనం జ్వాలా నరసింహారావు

జనరిక్‌ ఔషధాలతో అందుబాటులో ఆరోగ్యం

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (10-06-2011)

అటకెక్కనున్న రాజీవ్‌ ఆరోగ్య శ్రీ?, నాలుగోవంతు వ్యయంతోనే జనరిక్‌ మందులు, ప్రభుత్వ రంగానికి అవకాశాలు, అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్‌, ఆసుపత్రులలో ఉచిత ఔషధాలకు అవకాశం….

ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణలంటే, ఇల్లు పీకి పందిరి వేయడమనే ఆలోచన తప్ప మరోటి కాదనే రీతిలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కడప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికే అన్నట్లు, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, అశేష జనాదరణ పొందిన రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను అటకెక్కించే దిశగా చర్యలు చేపట్టారు. కాకపోతే తద్వారా రాబోయే అపవాదునుంచి బయట పడేందుకు, మరో ఆచరణ సాధ్యం కాని ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి ముఖ్య మంత్రి ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మందు చీటీలు ఇవ్వడం కాకుండా, అన్ని రకాల మందులను ఉచితంగా అక్కడికక్కడే అందచేయడం దాని లక్ష్యం. ఇక ముందు, రోగులు మందులను బయట మార్కెట్ కు వెళ్ళి కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇలా ఉచితంగా ఇవ్వాల్సిన మందులను, ఆసుపత్రులే కంపెనీల ద్వారా కొనుగోలు చేసి, రోగులకు ఇవ్వనున్నదన్న మాట. దీని కొరకు మందుల కొనుగోలు బడ్జెట్ ను రు. 400 కోట్లకు పెంచారు. ఇంతవరకు బాగానే వుంది కాని, నాలుగు వందల కోట్ల రూపాయలను వ్యయం చేసి, "బ్రాండెడ్" మందులను కొనుగోలు చేసే బదులు, దానిలో నాలుగో వంతు వ్యయం చేస్తే, "జనరిక్" మందులను కొనగలమని, తద్వారా, ప్రభుత్వానికి ఖర్చు తగ్గించవచ్చని ఆలోచన చేసి వుండాల్సింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా "జనరిక్" మందుల అమ్మకం చేసే పథకం అమలు చేయగలిగితే, ఆసుపత్రులలో మందులు నిల్వ వున్నా లేకపోయినా, సరసమైన ధరలకు అవి లభ్యమయ్యే సదుపాయం కలిగించినట్లవుతుంది. బీద-సాద, ఆర్థికంగా వెసులుబాటు లేనివారికి ఇదెంతో ప్రయోజనకారి అవుతుంది.

భారతదేశంలోని అలోపతి ఔషధ ఉత్పత్తుల పరిశ్రమ, ప్రపంచంలోని ఐదు పెద్ద పరిశ్రమలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఆ పరిశ్రమలో వున్న సంస్థలన్నీ వారు ఉత్పత్తిచేసే మందులకు, ఆకర్షణీయమైన పేర్లను పెట్టి, మార్కెటింగ్ విధానాలను చేపట్టి, అమ్మకాల ద్వారా లాభాలు చేసుకుంటారు. ఒకే రకమైన రసాయన మిశ్రమానికి సంబంధించి, అనేక పేర్లతో మందులు మార్కెట్లో వుండడం, ఒకే రకమైన శరీర రుగ్మతకు, ఒక్కో డాక్టర్, ఒక్కో మందు పేరును సూచించడం, రోగులు కూడా మందును "బ్రాండెడ్" పేరుతోనే (ఉదాహరణకు క్రోసిన్, కాంబీ ఫ్లాం) గా గుర్తుంచుకోవడం ఆనవాయితీ. అలాగే ధరల నిర్ణయం కూడా ఉత్పత్తిదారుల ఇష్టా ఇష్టాల మీదే ఆధారపడి వుండేది. భారత దేశంలో అనుసరిస్తున్న ఆ విధానం, అలా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ప్రపంచ ఔషధ ఉత్పత్తుల పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించింది. విదేశీ బహుళజాతి సంస్థలు భారత దేశంలో ఉత్పత్తులు చేసి లాభాలను ఆర్జించడం మొదలెట్టారు. 1979 లో ప్రభుత్వం ఔషధ విధానం రూపొందించింది. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఓ) గా పిలువబడే ఆ విధాన నిర్ణయం దరిమిలా, వివిధ రకాల మందుల ధరలను ఒక పద్ధతి ప్రకారం నియంత్రించింది ప్రభుత్వం. ఆ విధానానికి అడపాదడపా మార్పులు-చేర్పులు కూడా చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడో విషయం తెలుసుకోవాలి. అలోపతి ఔషధ విషయకమైన మందుల పరిధిలోని కీలక అంశాలపై అధ్యయనం చేసి, విచారణ జరిపి, దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించడానికి, 1974 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ సభ్యుడు జైసుఖ్ లాల్ హాతి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. హాతీ కమిటీలోని అరవై మంది నిపుణులు, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి రూపొందించిన సమగ్రమైన నివేదిక వాస్తవానికి వెలుగు చూడలేదనే అనాలి.

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ప్రజా వైద్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, సీపీఎం పక్షాన రాజ్యసభ సభ్యుడుగా వున్న రోజుల్లో, పదిమందితో కూడిన పార్లమెంటరీ హెల్త్ కన్సల్టేటివ్ కమిటీలో ఆరేళ్ల పాటు సభ్యుడుగా చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ సభ్యుడుగా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాలలో ఐదుగురు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులతో సంప్రదింపులు చేసే అవకాశం కలిగింది.

ఎమర్జెన్సీ అమల్లో వున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను తొక్కి పట్టింది ప్రభుత్వం. బడా పారిశ్రామిక వేత్తలకు లాభాలను ఆర్జించి పెట్టే పద్దతికి స్వస్తి చెప్పే రీతిలో నివేదిక వుందని వారంతా పసి గట్టారు. భారతీయ పద్దతులను అనుసరించి మందులను ఉత్పత్తి చేసే ఇతర పారిశ్రామిక వేత్తలకు సిఫార్సుల వల్ల మేలే జరుగుతుంది. హాతీ కమిటీ నివేదిక అమలవుతే, ఔషధాల ఉత్పత్తిలో నాణ్యత మెరుగయ్యే అవకాశాలతో పాటు, ధరల నియంత్రణకు మార్గం సుగమం అవుతుంది. ప్రయివేట్ రంగం వెనక్కు తగ్గి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ అవకాశాలొచ్చే వీలు కూడా కలిగేది. భారతదేశ ప్రజల అవసరాలకు తగ్గట్లు ఔషధ ఉత్పత్తులు జరిగుండేవి. పటిష్టమైన ఔషధ నాణ్యతా పద్దతులను పాటించాలని, "బ్రాండ్ నేమ్" మిషతో రోగులను లూటీ చేసే విధానానికి స్వస్తి పలకాలని నివేదికలో సిఫార్సు చేసింది కమిటీ. ఎమర్జెన్సీ ఎత్తి వేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తల పక్షమే వహించి, నివేదికను కనుమరుగు చేసింది. నివేదిక ప్రతులను కొందరు స్వప్రయోజన పరులు తగుల బెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. బహుశా ఆ నివేదిక ప్రతులు, ఒకటి-రెండే మైనా మిగిలి వుంటే, ఏదైనా మెడికల్ గ్రంథాలయంలో వుండొచ్చు.

హాతీ కమిటీ నివేదికలోని ఒక ప్రాముఖ్యతాంశం, ఆసుపత్రులలో వుంచాల్సిన "అత్యవసర ఔషధాల జాబితా" లో ఏమేమి వుండాలనేది. అదే విధంగా కెమికల్ ఫార్ములాతో కాకుండా, జనరిక్-బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మందుల విడుదలకు సంబంధించిన అంశం. మార్కెట్లో ఇరవై ఐదు వేల రకాల మందులుండేవి. ఒక్క "బీ-కాంప్లెక్స్" ఫార్ములా మందు, వంద పేర్లతో లభ్యమవుతుంది. అలానే యాస్ప్రిన్, పారాసిటమాల్, యాంటీ బయాటిక్, ఇతర మందులు. ఏ విధమైన ఉపయోగం లేని మందులనేకం మార్కెట్లో వుంటాయి. టానికులు, మల్టీ విటమిన్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. అవాంఛనీయ పోటీలో మందుల మార్కెట్ ముందుంటుంది. అలాంటి లోపాలను అధిగమించే పలు చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. ప్రాధమిక ఆరోగ్య రంగానికి సుమారు వందకు పైగా, ఆ పైన మరి కొన్ని అదనంగా, మొత్తం మీద వందల సంఖ్యలో మందులు సరిపోగా, మార్కెట్లో వేల సంఖ్యలో ఎందుకుండాలని కూడా నివేదిక ప్రశ్నించింది.

ఎప్పుడైతే ఆ నివేదికను-నివేదికలోని ముఖ్యమైన అంశాలను బుట్ట దాఖలా చేశారో, "ఢిల్లీ సైన్స్ ఫోరం", "మెడికో ఫ్రెండ్స్ సర్కిల్", ఫిజీషియన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్", సౌత్ ఇంటర్నెట్" లాంటి సంస్థలు, నివేదిక అమలుకు ఆందోళన చేయసాగాయి. ఆ సంస్థలన్నీ, నివేదిక సిఫార్సులు సమాజానికి అత్యంత లాభదాయకమైన వని విశ్వసించాయి. సీపీఎం వైద్య విభాగం, నెల్లూరుకు చెందిన డాక్టర్ జె. శేషా రెడ్డి, రాధాకృష్ణమూర్తి ప్రభృతులు ఆందోళనలో అగ్ర భాగాన నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీపీఎం శాఖను సంప్రదించి వాళ్లనూ ఆందోళనలో దింపారు. నెల్లూరులో ఒక సమావేశాన్ని నిర్వహించి, పలువురు వైద్యులను ఆహ్వానించారు. వచ్చినవారిలో, పశ్చిమ బెంగాల్ నుంచి-కేరళ నుంచి ఇద్దరు డాక్టర్లు, ఒక అడ్వకేట్-డాక్టర్ బాంబే నుంచి వున్నారు. బాంబేకు చెందిన "శ్రీమతి డాక్టర్ అశోక్ ధవే అడ్వకేట్" ఎంబిబిఎస్ చేసి, ఎల్ ఎల్ డి పట్టా పుచ్చుకున్న అరుదైన వ్యక్తి.

రెండు రోజుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, పలు రాష్ట్రాలలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి మరికొందరు వీరితో కలిశారు. కర్నూలుకు చెందిన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, నెల్లూరుకు చెందిన డాక్టర్ విజయకుమార్, విజయవాడకు చెందిన డాక్టర్ ఎం రామారావు, గుంటూరుకు చెందిన అధ్యాపకుడు లక్ష్మారెడ్డి లాంటివారిని కలుపుకుని, మరో మారు 1986 లో సమావేశమైన డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రభృతులు, బుట్ట దాఖలు చేసిన హాతీ కమిటీ నివేదికను వెలుగులోకి తెచ్చే ఉద్యమ్నాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి, పలు ప్రదేశాలలో తిరిగి, డాక్టర్లను ఉద్యమంలోకి దింపేందుకు ప్రోత్సహించి, వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఆ సంవత్సరాంతానికి కలకత్తాలో అఖిల భారత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆందోళనను తీసుకెళ్లారు.

కలకత్తాలో జరిగిన రెండు రోజుల సమావేశానికి ఎంపిక చేసిన సుమారు వంద మంది డాక్టర్లు హాజరయ్యారు. సీపీఎం నాయకుడు స్వర్గీయ ఇఎంఎస్ నంబూద్రిపాద్, పశ్చిమ బెంగాల్ శాఖ కార్యదర్శి చౌదరి కూడా వున్నారు. సమావేశంలో పార్టీ సహాయం-సలహా అడిగారు డాక్టర్లు. హాతీ కమిటీ నివేదికలోని "ఔషధ విధానం" తో పాటు, వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లకు సంబంధించిన పలు అంశాలపై కూడా ఆందోళన చేపట్టమని పార్టీ సూచించింది. అయితే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కలుపుకుని పోతే మంచిదని, నంబూద్రిపాద్ అభిప్రాయ పడ్డారు. వీలైనంత మందిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేసి, వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసే చర్యలు కూడా చేపట్టి తే మంచిదని సూచించారాయన. సీపీఎం అనుబంధ సంస్థగా వుండే కన్నా, విస్తృత సంస్థగా, అందరినీ కలుపుకొని పోతే మంచిదన్న నిర్ణయం తీసుకున్నారు. అలా డాక్టర్ల విశాల వేదిక మొదలైంది. డాక్టర్ రాధాకృష్ణమూర్తి తన వంతుగా ఖమ్మం జిల్లాలో బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. జిల్లాలో జరిగిన ప్రతి ఐఎంఏ సమావేశంలో వైద్య-ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళనకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి చర్చకు పెట్టేవారు. అయితే, ఐఎంఏ సభ్యుల్లో అతి కొద్దిమంది మాత్రమే ప్రజాస్వామ్య భావాలున్న వారని, స్వలాభం చూసుకునేవారు ఎక్కువ మందని, నైతిక విలువలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా పలువురు వ్యతిరేకంగా మాట్లాడేవారని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి.

హాతీ కమిటీ ముఖ్యాంశాలు సజీవంగా వున్నప్పటికీ, బుట్ట దాఖలా మాత్రం అయ్యాయి. నివేదికలోని అంశాలు కనీసం కొంతవరకైనా వెలుగు చూసినట్లైతే బాగుండేదేమో. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఉచితంగా ఆసుపత్రులలో మందుల పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని, హాతీ కమిటీ సూచనలకు అనుగుణంగా చేసే ప్రయత్నం చేస్తే, అటు ప్రభుత్వానికీ లాభం-ఇటు ప్రజలకూ మేలు. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి వైద్య పట్టా పుచ్చుకున్న వ్యక్తులై నందువల్ల ఈ విషయాలపై దృష్టి సారిస్తే మంచిదే మో! ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్న పథకం పది కాలాల పాటు అమలు కావాలంటే, ప్రభుత్వ నిధులు అనవసరంగా దుర్వినియోగం కాకుండా వుండాలంటే, జైసుఖ్ లాల్ హాతి కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయాలి.

Saturday, January 2, 2010

భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి "ఖమ్మం ఆదివారం సంఘం"

"సండే సిండికేట్ ఆఫ్ ఖమ్మం"
(మాజీ రాజ్య సభ సభ్యుడు, సిపిఎం నాయకుడు, పౌర హక్కుల ఉద్యమానికి ఏనాడో రాష్ట్ర-దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రముఖ వైద్యుడు డా. యలమంచిలి రాధాకృష్ణమూర్తితో చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా)


ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్‌లాల్‌ నెహ్రూ చైనా పర్యటించి పంచశీల సూత్రం పఠిస్తూనే, సోవియట్‌ యూనియన్‌తో మైత్రీ సంబంధాలు పెంపొందించుకుంటూ వచ్చారు. చైనా-సోవియట్‌ దేశాలతో భారత దేశం కొనసాగిస్తున్న సత్సంబంధాలతో నిమిత్తం లేకుండానే (ఉమ్మడి) భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ విధానాలను కొన్నింటిని ఘాటుగా వ్యతిరేకించేది. సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా- భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎమ్ గా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని సామ్యవాద-సామ్రాజ్యవాద దేశాల మధ్య సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

1961 ముందు నుంచే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో అంతర్గతంగా తలెత్తిన సైద్ధాంతిక అభి ప్రాయ భేదాలు, పరస్పర వ్యతిరేక భావ ప్రకటనలు, పార్టీలో చీలికకు దారితీసేంతవరకూ వెళ్లాయి. భారత చైనా దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలిక రావడంతో సోవియట్‌ యూనియన్‌-చైనాల రాజకీయ ప్రభావం వల్లనో, ఉమ్మడి పార్టీలోని కొందరి మధ్య తలెత్తిన వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్లనో పార్టీ చీలిందన్న ప్రచారం అప్పటి నుంచీ ఇప్పటి దాకా జరుగుతూనే ఉంది. అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా పార్టీలో 50వ దశకం నుండే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల-పార్టీ పట్ల, దాని వర్గ స్వభావం పట్ల అనుసరించాల్సిన వ్యూహం గురించిన చర్చ చాలా కాలం కొనసాగి, పరాకాష్ఠగా సైద్ధాంతిక విభేదాల ప్రాతిపదికపై 1964లో సిపిఐ- సిపిఎంలుగా చీలి పోయింది పార్టీ.


సోవియట్‌ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు, 1964 అక్టోబర్‌-నవంబర్‌లలో కలకత్తాలో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)ను ఏర్పాటు చేయగా, రెండో వర్గం వారు మరో నెల రోజులకు బొంబాయిలో సమావేశమై, తామే అసలైన కమ్యూనిస్టులమని ప్రకటించుకున్నారు. యుద్ధం నేపథ్యంలో చైనా వాదులుగా ముద్రపడిన భవిష్యత్‌ కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకులను దేశవ్యాప్తంగా పి.డి. చట్టం కింద ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అలా అరెస్ట్ అయినవారిలో, పోలిట్‌బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా తీవ్రంగా పడింది. తెలంగాణ సాయుధపోరాటం కాలం నుండే ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుండడంతో ఆ జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద.


ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన కూడా పడింది. చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను తు.చ. తప్పకుండా ఈనాటి దాకా అమలు జరుపుతుండే పేరుపొందిన స్థానిక డాక్టర్‌. యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్‌ వై.ఆర్‌.కె.) ఇంట్లో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలపై చర్చించుకునే వారు. 1961వ సంవత్సరంలో ప్రారంభమై క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్‌ నాయకులైన చిర్రావూరిలక్ష్మి నరసయ్య (ఎన్నో మార్లు ఖమ్మం మునిసిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు), మంచికంటి రాం కిషన్‌రావు (1983లో ఖమ్మం ఎమ్మెల్యే) లతో సహా 25-30 మంది ప్రముఖులతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పంథాకు అనుకూలురే కాకుండా, పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎం లోనే వుండిపోయారు. స్థానిక కాలేజీ విద్యార్ధి నాయకులు కూడా వస్తుండడంతో ఆ వేదిక కింద మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగేది.


ఈ నేపధ్యంలో పార్టీ చీలిపోవడం, సిపిఎం నాయకులందరూ నిర్బంధానికి గురికావడం జరిగాయి. ఇంట్లో తను స్థాపించిన మార్క్సిస్ట్ ఫోరం కింద నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న వారంతా సిపిఎం పక్షాన చేరడంతో అది తనకో నైతిక విజయంగా భావించారు డా. రాధాకృష్ణమూర్తి. పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల సంపూర్ణ విశ్వాసమున్న డా. వై.ఆర్‌.కె. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి అనుకూలురైన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులందరూ అరెస్ట్ కావడంతో వారంతా విడుదలయ్యే వరకూ పార్టీని ఏకతాటిపై నడిపిస్తూనే, ఏ విధంగా బలోపేతం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. వారి విడుదలకెలా ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచనలో భాగంగా స్థానిక అడ్వొకేట్లయిన బోడేపూడి రాధ, కె.పి.సుబ్బారావుల మద్దతు పొందారు. ఆ ముగ్గురి (మేధావుల) కలయికే భవిష్యత్‌ "భారత పౌర హక్కుల ఉద్యమానికి" నాంది అవుతుందని బహుశ ఆనాడు వారూ ఊహించి ఉండరు. ఆశ్చర్యకరమైన విషయం అప్పటికి, ఈ ముగ్గురు కూడా పార్టీ సానుభూతి పరులే కానీ సభ్యులు కాకపోవడం.


ముగ్గురూ వారి వారి వృత్తుల్లో నిరంతరం బిజీగా ఉండే వారు కావడంతో పార్టీ పరమైన పనికి ఎక్కువగా రాత్రి వేళలు కేటాయించేవారు. ఆపాటికే ఆదరణ పొందిన "మార్క్సిస్ట్ ఫోరం" వేదిక కార్యకలాపాలు ముమ్మరం చేసారు. అప్పట్లో వారికదో పెను సవాల్‌. ఒకవైపు సిపిఐ నాయకత్వమంతా (ఆ పక్షాన ఖమ్మం జిల్లాలో చేరింది అతి కొద్ది మందే అయినప్పటికీ కూడా) ఏకతాటిపై పని చేస్తూ, సిపిఎం కార్యకర్తలను తమ వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సిపిఐ పక్షాన జిల్లా అగ్రనాయకుల్లో ఒకరైన ఎన్‌. గిరి ప్రసాద్‌ ఉండడంతో అది మరో సవాలుగా మారింది. నిజానికి చీలికొచ్చేంత వరకూ గిరి ప్రసాద్‌ సిపిఎం పంథాకు అను కూలంగా ఉండేవారని అనుకునేవారు. మొత్తం మీద రెండో స్థాయి నాయకత్వం, మేధావి త్రయం మార్గదర్శకంలో చేసిన కృషి ఫలితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని పటిష్ట పరచగలిగారు.


ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని ‘ఆదివారం సంఘం’ గా- "సండే సిండికేట్" గా ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ జిల్లాలో పలువురున్నారు.


నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావి త్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.


ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులు నచ్చ చెప్పారు మేధావి త్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.


ప్రభుత్వ ఆదేశాలను- ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!


భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పిడి యాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.


ఈ నేపథ్యంలో విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, ఇ.ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌ సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లో ఉన్న సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.


ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావి త్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం పార్టీ వారితో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వర రావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం పార్టీకి చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.


ఏ.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్. ప్రసాద రావులను, సభ్యులుగా కర్నాటి. రామ్మోహన రావు-డాక్టర్. వై. రాధా కృష్ణమూర్తి లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాల రావులున్నారు. నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంత రావు సహాయం చేసారు.


ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు. మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావి త్రయం"-డాక్టర్. వై. ఆర్. కె, బోడేపూడి రాధ, కే. వి. సుబ్బారావు లను, వారితో పాటు అడ్వొకేట్ కర్నాటి రామ్మోహన రావును, రాష్ట్ర వ్యాప్తంగా వున్న దిగువ స్థాయి నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం. వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు-బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు-సభ జరిగింది. ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాల రావులు ఆ సదస్సుకు హాజరయ్యారు శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.



సరిగ్గా అదే రోజుల్లో, ఆ పాటికే అరెస్ట్ జైలు జీవితం గడుపుతూ అనారోగ్యానికి గురైన ప్రముఖ సీ.పి.ఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెరోల్ పై విడుదల చేసి, చికిత్స కొరకు సోవియట్ యూనియన్ పంపించి, కుదుట పడింతర్వాత ముషీరాబాద్ జైలుకు తీసుకొచ్చారు. ఖమ్మంలో అరెస్టయిన నలుగురినీ ( వై.ఆర్.కె, బోడేపూడి రాధ, కే.వి.సుబ్బారావు, కర్నాటి రామ్మోహన రావు) కూడా ముషీరాబాద్ జైలుకే పంపారు. ఆ విధంగా వీరికి ఆపాటికే జైలులో వున్న సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి లాంటి ప్రముఖులందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మాస్కో నుండి తిరిగి వస్తూ ఢిల్లీలో ఇందిరా గాంధిని, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిని కలుసుకుని అరెస్టులపై తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు సుందరయ్య. డాక్టర్. రాధాకృష్ణమూర్తి అరెస్ట్ విషయాన్ని ప్రశ్నించిన సుందరయ్యతో "మీకంటే అతడే ప్రమాదకరమైన వ్యక్తి" అని జవాబిచ్చాడట బ్రహ్మానంద రెడ్డి. ఆ విషయాన్ని స్వయంగా వై.ఆర్.కె కు తెలియచేసిన సుందరయ్య, పౌరహక్కుల ఉద్యమ ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసినందుకు ఆయన్ను-మేధావి త్రయాన్ని అభినందించారు.


ఇక అప్పటినుంచి ఉద్యమాన్ని జైలునుంచే కొనసాగించాలని నిర్ణయించారు నాయకులందరు. న్యాయ పోరాటం చేయాలనుకొని, "హెబియస్ కార్పస్ పిటీషన్" వేయాలని భావించారు. జైల్‌లోనే కర్నాటి న్యాయశాస్త్రంలో పరీక్షలకు తయారయి, జైల్లో వుంటూనే రాసి, డిగ్రీ తెచ్చుకొని, భవిష్యత్ లో విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. కే. వి. సుబ్బారావు హైకోర్టును, వై ఆర్. కె, బోడేపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ న్యాయవాది కన్నభీరన్ వీరికి సహాయపడేందుకు ముందుకొచ్చాడు. కే.వి. సుబ్బారావు పిటీషన్ ను హైకోర్ట్ కొట్టివేసింది. వై ఆర్. కె, బోడేపూడిల పిటీషన్ విచారణకు వచ్చినప్పుడు వారిని ఎలా ఢిల్లీకి తీసుకుపోవాలని చర్చించిన ప్రభుత్వం చివరకు తీసుకున్న నిర్ణయం వారిద్దరినీ ఆశ్చర్య పరిచింది. భద్రతా కారణాల వల్ల, ఒక సీనియర్ పోలీసు అధికారి వెంటరాగా, విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి, విచారణ ముగిసేంతవరకూ వారిద్దరినీ తీహారి జైల్లో వుంచారు. అదే వారికి మొదటి విమాన ప్రయాణం. వీరు అక్కడకు చేరేటప్పటికే, అదే తీహారి జైలుకు, హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణ కొరకు ప్రముఖ నాయకులైన సుందరయ్య, బసవ పున్నయ్య, ఏ. కె. గోపాలన్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బీ. టి. రణదివే, హరే కృష్ణకోనార్, నాగభూషణం పట్నాయక్ లాంటి వారందరినీ తరలించింది ప్రభుత్వం. వారందరూ ఒక ప్రణాళిక ప్రకారం అనధికారికంగా పోలిట్ బ్యూరో సమావేశం జరుపుకునేందుకు జైలుకు చేరారు.


తమ పిటీషన్ విచారణకొరకు వై. ఆర్. కె, కే. వి. సుబ్బారావులు రెండో పర్యాయం కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. తమ కేసును వారే స్వయంగా వాదించుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయం నిర్బంధాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తడంతో, ఏప్రియల్ 29, 1965 న, పీ. డి చట్టం కింద అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ విషయాన్ని కోర్టుకు తెలియచేసింది. ఆ సాయంత్రమే సుందరయ్యగారిని తీహారి జైలునుంచే విడుదల చేసింది ప్రభుత్వం. ఆయనతో కలిసి హైదరాబాద్ తిరిగొచ్చిన వారిద్దరినీ ముషీరాబాద్ జైలునుంచి మర్నాడు విడుదల చేసారు. ఖమ్మం తిరిగొచ్చిన వారందరికీ, "నభూతో న భవిష్యతి" అన్న చందాన రైలు స్టేషన్ లో స్వాగతం లభించింది.



ఈ నేపధ్యంలో, చాలాకాలం తర్వాత 1982 సంవత్సరంలో, ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రాతిపదికగా-రాజకీయ, పౌర హక్కుల వేదికగా-పౌర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా, విస్తృత పరిధి పౌరహక్కుల ఉద్యమ సంస్థను నెలకొల్పాలని సుందరయ్య భావించారు. అది కేవలం సీ. పి. ఎం నాయకత్వంలో నడిచేదిగా వుండరాదని, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నడపాలని అనుకున్న ఆయన, ఆ బాధ్యతను డాక్టర్. రాధాకృష్ణమూర్తికి అప్పచెప్పారు. ఎన్టీఆర్ సారధ్యంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరుగనున్న రోజులవి. వై.ఆర్.కె సంప్రదించి ఉద్యమానికి ఒప్పించిన వారిలో సీ. పి. ఐ. కి చెందిన గిరి ప్రసాద్-సురవరం సుధాకర రెడ్డి, బీ. జె. పి కి చెందిన రామారావు, జనతా పార్టీకి చెందిన బాబుల్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు నాదెండ్ల భాస్కర రావులతో సహా గౌతు లచ్చన్న లాంటి ప్రముఖులెందరో వున్నారు.



నవంబర్ 1982 లో విజయవాడలో నిర్వహించిన సదస్సుకు జస్టిస్. జీవన రెడ్డి, రఘునాధ రెడ్డి కూడా హాజరయ్యారు. రఘునాధరెడ్డిని అధ్యక్షుడుగా సుందరయ్య ప్రతిపాదించినప్పుడు, ఆయనకు ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరా గాంధి హయాంలో వున్న అనుబంధం వల్ల, కొంత వ్యతిరేకత వచ్చింది. గతం తవ్వుకోవద్దని భావించి, సుందరయ్య ప్రతిపాదనకు అందరు అంగీకరించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వై. ఆర్. కె, కార్యదర్శులుగా ఎ. పి. విఠల్, సురవరం సుధాకరరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులతో ఏ. పీ. సీ. ఎల్. ఏ పేరుతో పౌర హక్కుల ఉద్యమ సంస్థ ఆవిర్భవించింది మరో మారు. 1989 వరకూ దాని కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా సాగేవి. వార్తా బులెటిన్ కూడా వెలువడేది. దరిమిలా వై. ఆర్. కె పూర్తి స్థాయి సీ. పి. ఎం సభ్యుడయ్యారు. ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ అనంతరం రఘునాధరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చారు. పౌర హక్కుల ఉద్యమ పూర్తి బాధ్యతను నిర్వహించేవారు లేకపోవడంతో కార్యకలాపాలు ఆగిపోయినా ఏదో ఒక రూపంలో ఉద్యమం కొనసాగుతూనే వుంది.



అలనాడు "ఖమ్మం ఆదివారం సంఘం" వేసిన పునాదులపై లేచిన పౌర హక్కుల ఉద్యమం వివిధ రకాలుగా వూపందుకుంటున్నదనాలి. ప్రభుత్వాలు కూడా హక్కుల పరిరక్షణ తమ బాధ్యతగా పరిగణిస్తున్నారిటీవల కాలంలో. జాతీయ మానవ హక్కుల కమీషన్, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమీషన్లు అందులో భాగమే. ఒక విధంగా వాటి పనితీరు చాలా తృప్తికరంగా వుందనాలి. ప్రభుత్వాలు కూడా వాటి ఆదేశాలను అమలు పరుస్తున్నారు. అయినా జరగాల్సిందెంతో వుంది.