Showing posts with label డాంగే. Show all posts
Showing posts with label డాంగే. Show all posts

Saturday, July 22, 2017

పౌర హక్కుల ఉద్యమ సారధి శ్రీ శ్రీ : వనం జ్వాలా నరసింహారావు

పౌర హక్కుల ఉద్యమ సారధి శ్రీ శ్రీ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (22-07-2017)

(పౌరహక్కుల ఉద్యమం ఆరంభమై 55 ఏళ్లు నిండిన సందర్భంగా)

శ్రీశ్రీ గా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ రచయితల సంఘం (విరసం) నేతగా, సినీకవిగానే చాలామందికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మానవహక్కుల ఉద్యమం ఆవిర్భవించిన తొలినాళ్ళలో ఆయన హక్కుల సేనానిగా సేవలందించారు. తెలంగాణ ప్రాంతాలలో జరిగిన మానవహక్కుల ఉద్యమ సభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ పాలకుల నియంతృత్వ ధోరణులపై నిరసన గళం వినిపించారు. సరిగ్గా 55 ఏళ్ల క్రితం తెలుగునేలపై మానవహక్కుల ఉద్యమం ఆవిర్భావం వెనుక ఘన చరిత్ర వుంది.

ఖమ్మం జిల్లా కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి దేశవ్యాప్తంగా పలువురిని రాత్రికిరాత్రే అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టిన వాళ్ళలో ఒకరు. ఆయనతో పాటు, జిల్లా మేదావిత్రయంగా అప్పట్లో పిలుబడ్డ వారైన బోడేపూడి వెంకటేశ్వరరావు, కేవీ సుబ్బారావు అనే ఇద్దరు లాయర్లు కూడా అరెస్టయ్యారు. వీరిని అరెస్ట్ చేయకముందు మరెందరినో అరెస్టు చేసినప్పుడు వారి మదిలో మెదిలిన ఆలోచనే దేశవ్యాప్త పౌర హక్కుల ఉద్యమానికి అంకురార్పణ.

మొదట్లో అరెస్టయ్యి నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పిడియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.


ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, ఇ.ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది.

సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

ఏ.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు, కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు, డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ,, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ రాదాక్రుష్ణమూర్తికి ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది. సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం. శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన పోరాహక్కుల ఉద్యమం అంతటితో ఆగిందనాలి.


Wednesday, October 24, 2012

వామపక్ష ఐక్యత-ఆవశ్యకత: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

"ఆ ఐక్యత కుందేటి కొమ్మే" శీర్షికతో చెరుకూరి సత్యనారాయణరావు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం చదివిన తరువాత వామపక్ష ఐక్యత ఆవశ్యకతను గురించి రాయాలనిపించింది. ఇటీవల నేను  ఖమ్మం జిల్లా మార్క్సిస్ట్ నాయకుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవితచరిత్రను "అనుభవాలే అధ్యాయాలు" పేరుతో ప్రచురించిన దాంట్లో ఈ విషయానికి సంబంధించి చర్చించడం జరిగింది. చెరుకూరు తన వ్యాసంలో కొంత నిరాశాజనకంగా కనిపించినప్పటికీ, ఐక్యతను కుందేటి కొమ్ముతో పోల్చడం గమనిస్తే, అది సాధించడం కొంత కష్టతరమైనప్పటికీ, సాధించ వీలుకలుగుతుందని, ఆ సుభాషితం చదివినవారికి అర్థమవుతుంది. ఎటొచ్చీ సాధించలేంది, ఆ వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తుల "మనస్సు రంజింపజేయడమే"! వామపక్ష ఐక్యత అంటే, ఐక్యంగా ముందుకు పోయి ప్రజా ఉద్యమాలను ఎలా నిర్మించాలన్నదే. పది-పదిహేను గ్రూపులుగా విడిపోయిన కమ్యూనిస్టులందరూ, ఒకే ఎర్ర జండాను పట్టుకుని ఉద్యమిస్తుంటే, ప్రజలు ఎవరిని నమ్మి వారివెంట నడవాలి? ఏం?...కాసేపు సిద్ధాంతాలను....అవి కూడా అసలంటూ వుంటే, పక్కన పెట్టి ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయకూడదా? ఈ దిశగా, అక్టోబర్ ఏడున విజయవాడలో, వామపక్ష పార్టీలను-ముఠాలను ఐక్యం కమ్మని, ఉమ్మడిగా ప్రజా సమస్యలపై పోరాటం సలపమని కోరుతూ, కొందరు కమ్యూనిస్ట్ పెద్దలు నిర్వహించిన సదస్సు కొంత మేరకు ఫలితం సాధించిందనే అనాలి. ఆ సదస్సు జరిగిన కొన్నాళ్లకు, ఓంకార్ వర్ధంతి సభ పేరుతో, సిపిఐ, సిపిఎం లతో సహా కొన్ని వామపక్షాలు ఒకే వేదిక పైకొచ్చి, వామపక్ష ఐక్యత గురించి మాట్లాడడం జరిగింది. 


వామపక్ష విలీనం, ఐక్యత గురించి ఇటీవలి కాలంలో, తీవ్రంగానే చర్చ నడుస్తోందిఈ చర్చ కొత్తగా ప్రారంభం అయిందేమీ కాదుఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినంతవరకు, ఒకప్పుడు ఉచ్ఛస్థితిలో ఉండి ఇప్పుడు  పూర్తిగా వామపక్షాలు బలహీనపడి ఉన్న నేపధ్యంలో, ఏదో ఒక పార్టీ ఆసరా లేకుండా ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో, ఈ చర్చ మరోసారి విజయవాడ సదస్సు రూపంలో, ముందుకు రావడం హర్షణీయందీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందివామపక్ష ఉద్యమం ఈనాడు అనేక గ్రూపులుగా, పార్టీలుగా విడివడి ఉన్న మాట వాస్తవం.ఇందులో కొన్ని క్రమేపీ బలహీనపడుతున్న మాట-ఒక విధంగా కనుమరుగవుతున్న మాట కూడా నిజమేఈ నేపధ్యంలో వామపక్ష పార్టీల ఐక్యతకు ఉన్న అవకాశాలను పరిశీలిద్దాం



          వామపక్షాల బలం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయిఅంతర్జాతీయ, జాతీయ పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేశాయిప్రధానంగా సోవియట్ యూనియన్ విచ్చిన్నం కావడం అదే కాలంలో కమ్యూనిస్టు రాజ్యాలుగా ఉన్న తూర్పు యూరప్ దేశాల్లో వచ్చిన ప్రతికూల పరిణామాలు మరో అంశంరాష్ట్రంలో తెలుగుదేశంతో కొంతకాలం, కాంగ్రెస్ పార్టీతో కొంతకాలం వామపక్షాలు స్నేహం చేశాయిఒక అధికారపార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మధ్య ఉండాల్సిన విభజన రేఖ ఆ కాలంలో చెరిగిపోయిందిముఖ్యకారణాల్లో ఇది కూడా ఒకటి. జాతీయంగా చూసినప్పుడు అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ ఉద్యమాలు ఊపందుకున్నాయిఫలితంగా సున్నితమైన స్థానిక అంశాలు, అభిమతాల వల్ల ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయిఅస్సాం గణపరిషత్, ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ, బీహార్ రాష్ట్రీయ జనతాదళ్, సమతా పార్టీ, ఒరిస్సాలో బిజూ జనతాదళ్, మన రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం, తమిళనాడులో డిఎంకె, అన్నా డిఎంకె లాంటి అనేక పార్టీలు ఉనికిలోకి వచ్చాయిజాతీయ అంశాలకంటే స్థానిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారుమతాన్ని, కులాన్ని ఆధారం చేసుకుని సంకుచిత భావాలతో వచ్చిన పార్టీలు, ఒకప్పుడు సోషలిస్టులమని చెప్పుకుని ఆ తర్వాతికాలంలో అధికారమే పరమావధిగా ఏర్పడిన పార్టీల గురించి కూడా ప్రస్తావన ఇక్కడ అవసరం. ఉత్తరప్రదేశ్ లో బహుజనసమాజ్ పార్టీ కుల ప్రాతిపదికన ఏర్పాటైనదే. ఒకప్పుడు కార్మిక నేతలమని, సోషలిస్టులమని చెప్పుకున్న జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ లాంటివాళ్లు తర్వాతికాలంలో అవకాశవాదానికి పాల్పడి సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. సమతా పార్టీ ఇలాగే ఏర్పాటైంది. వామపక్షాల బలం తగ్గడానికి ఉన్న ముఖ్య కారణాల్లో ఆర్ధికవ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా ఒకటి.  


          కమ్యూనిస్టు ఉద్యమాల్లో వస్తున్న చీలికలు కూడా రాష్ట్రంలో వామపక్ష బలం తగ్గడానికి మరో ముఖ్య కారణమని అనడంలో సందేహం లేదు.  1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయిందిఅనంతరం 1968లో నక్సలైట్ల చీలిక సంభవించింది. 1964లో దాని తర్వాత కొద్ది కాలానికే సిపిఐలో ఒక చీలిక, సిపిఎంలో ఒక చీలిక సంభవించాయిఒకటి మితవాద చీలిక, మరొకటి అతివాద చీలికసిపిఐ నుండి డాంగే, మోహిత్ సేన్ వంటి నాయకులు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకున్నారువీరు పూర్తిగా కాంగ్రెస్ తో మమేకం కావాలన్న ఆలోచనతో విడిపోయారు. సిపియం నుండి 1968లో నక్సలైట్ల పేరుతో ఒక గ్రూపు విడిపోయింది. కేవలం తక్షణ సాయుధ పోరాటం ద్వారా దేశ విముక్తి సాధించాలన్న సిద్ధాంతంతో వారు విడిపోయారుతప్పో ఒప్పో ఈ చీలికలు ఒక సిద్ధాంత ప్రాతిపదికపై జరిగినవేఆ తర్వాత కాలంలో జరిగిన చీలికలకు చెప్పుకోదగిన సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నట్లు కనిపించదు. ఇన్ని పార్టీలు, గ్రూపులు ఉన్నా రాజకీయ స్రవంతిలో జాతీయ స్థాయి ప్రధాన వామపక్ష, రాజకీయ పార్టీలుగా, సిపిఐ, సిపిఎం ఈనాటికి మిగిలి ఉన్న మాట వాస్తవం. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటానికి ఈ ఉద్యమంలో వచ్చిన చీలికలు కూడా కారణమే. 


ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమం బలహీనపడిన మాట వాస్తవంఈ నేపధ్యంలో రాష్ట్రంలో అనేకమంది ఆలోచనాపరుల్లో వామపక్ష ఐక్యతావశ్యకతవైపు దృష్టి మళ్లుతోందిఈ కోరిక, ఆలోచన వామపక్ష అభిమానులు, వామపక్ష మేధావులలో ఉందివామపక్ష పార్టీలలోనే చాలామందిలో ఇలాంటి కోరిక లేకపోలేదుసాధారణ ప్రజానీకంలో కూడా అధికార పార్టీల పాలనా విధానంతో విసుగెత్తి మరొక ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూడటం ప్రారంభం అయ్యిందిఅది వామపక్ష ప్రత్యామ్నాయమైతే బాగుంటుందన్న అభిప్రాయమూ వెల్లడవుతోంది. కుల, మత, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం పెరుగుతోందివిశాల దృక్పథంనుండి, సమస్యలకు కారణమైన ప్రాధమిక అంశాల నుండి ప్రజలను పక్క దోవ పట్టించేందుకు కుల, మత, ప్రాంతీయ అంశాలతో ఏర్పాటైన పార్టీలు, గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి. పరిపాలనలో కూడా నిరంకుశ ధోరణులు ప్రబలుతున్నాయితమను కాదనేవారు లేరన్న అహంకారంతో కేంద్రంలోనూ అనేక రాష్ట్రాలలోనూ పరిపాలన సాగుతోంది.  


ఒకనాటి వామపక్షాలు చేసిన త్యాగాలు, పార్టీ వారి నిబద్ధత, సాధారణ జీవితం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, అంకితభావం, ప్రజల మనస్సులో ఇంకా చెరిగిపోలేదువాటి ఘన కీర్తి ఇంకా గుర్తుందిఇతర పార్టీలతో పోల్చినప్పుడు వామపక్షాల సమరశీలతను శంకించేవారు లేరనే చెప్పాలి. పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి నానాటికి పెరుగుతోందిసమస్యలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అసంతృప్తి కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతోందిపాలకపార్టీల వల్ల నిరసన ధోరణి పెరుగుతోందిఇవన్నీ వామపక్ష ఐక్యతకు దోహదం చేసే అంశాలే. వామపక్ష పార్టీలకు వేరే ఏ పార్టీకీ లేని గొప్ప మేధో పెట్టుబడి ఉందివామపక్షాల సిద్ధాంత బలాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేస్తున్నారు అనేకమంది వామపక్ష మేధావులుప్రజా ఉద్యమాలకు వీరు పెద్ద పెట్టుబడి వంటివారువామపక్ష ఐక్యతను కోరుకునేవారికి ఇది శుభపరిణామంవామపక్ష పార్టీలకు మంచి అవకాశం. కాకపోతే, ఈ తరం వామపక్ష నాయకులు, తాము ప్రజలకూ-ఉద్యమాలకూ మధ్య వారధులం అనే విషయం మర్చిపోతున్నారు.


          రాష్ట్రంలో ప్రధాన రాజకీయపక్షాలుగా సిపిఎం, సిపిఐ ఉన్నాయిఅదే సందర్భంలో ఎర్రజెండా కింద వేర్వేరు పేర్లతో మరికొన్ని చిన్న పార్టీలు ఉన్న సంగతి మర్చిపోలేంస్థూలంగా మార్క్సిజాన్ని ఆమోదిస్తున్నట్లు చెప్పుకునే పార్టీలుగా ఇవి ఉన్నాయిఐతే, మార్క్సిజం అంటే, ప్రధానంగా ఉద్యమాల నిర్వహణ అనే విషయం ఆ పార్టీలకు జ్ఞప్తికి రావడం లేదు. వామపక్ష ఐక్యత అన్నప్పుడు వాటన్నిటి మధ్య ఐక్యత సాధ్యమా అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. ఉదాహరణకు పీపుల్స్ వార్, జనశక్తి లాంటి పార్టీలు, ఇందులో నుండి మళ్లీ చీలిన కొన్ని గ్రూపులుగా ఉన్నాయిఈ పార్టీలూ, గ్రూపులూ పూర్తిగా సాయుధ పోరాటం పేరుతో వ్యక్తిగత హింసావాదానికి అంకితమై పనిచేస్తున్నాయివారికి ప్రజలపైనా, ప్రజాతంత్ర పోరాటాలపైనా, ప్రజా ఉద్యమాలపైనా విశ్వాసం లేదువారితో ఐక్యత సాధ్యమని భావించలేము. ఐనా ప్రయత్నించడంలో తప్పులేదు. మరొక రెండు పార్టీలు ఒకవైపు సాయుధ దళాలను కలిగి ఉంటూనే మరోవైపు ప్రజా ఉద్యమాలు సాగిస్తున్నాయిమరికొన్ని చిన్న చిన్న గ్రూపులు వారి వారి ప్రజా సంఘాలద్వారా ప్రజల్లో పనిచేస్తున్నాయిఇటువంటి అనేక పార్టీలు లేక గ్రూపులతో గత కొంతకాలంగా ఏదో ఒక మాదిరి ఐక్య వేదిక పనిచేస్తూనే వుందికానీ కొన్ని గ్రూపులు లేక పార్టీలు మిగిలిన గ్రూపులు లేదా పార్టీలను కమ్యూనిస్టు పార్టీలుగా గుర్తించడానికి నిరాకరించే విచిత్రమైన పరిస్థితి కూడా నెలకొని ఉందికొన్ని పార్టీలు మరి కొన్నింటిని వామపక్ష పార్టీలుగా గుర్తించ నిరాకరించే పరిస్థితి కూడా ఉందిఇలాంటి రాద్ధాంతాల మధ్య అర్ధవంతమైన ఐక్యతఎంత కష్టమో ఊహించవచ్చుఅయినా కొన్ని సమస్యలు ముందుకు వచ్చినప్పుడు ఏ ఏ సమస్యలమీద ఉమ్మడి అవగాహన సాధ్యమైతే ఆ సమస్యపైనే ఐక్య ఉద్యమాలు ఆందోళనలు నడిపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది


          వామపక్ష ఐక్యత ప్రాముఖ్యతను ప్రధాన వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలు గుర్తించినట్లే కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో సాధ్యమైనంత వరకూ ఉమ్మడి అవగాహన కుదిరిన మేరకు అన్ని వామపక్ష పార్టీలను, గ్రూపులను కలుపుకుని వెళ్లేందుకు నిజాయితీగా, హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని ఎన్నికల వరకే ఒక్కో సారి ఈ ఐక్యత పరిమితమైనట్లు కనిపిస్తుంది.


వామపక్ష పార్టీల ఐక్యత కేవలం ఎన్నికల కోసమే కాదుఐక్యతా నినాదం పరమార్థం ఎన్నికల అవగాహన కారాదు. ప్రజా ఉద్యమాలు ప్రచార ఆందోళన కార్యక్రమాలు మిలిటెంట్ పోరాటాలు ఉమ్మడిగా నిర్వహించే ప్రయత్నాలు నిరంతరం జరగాలిప్రజా సమస్యలపై నిరంతరం ఐక్య కార్యాచరణకు ప్రయత్నాలు జరగాలిఐక్య కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తూనే స్వతంత్ర కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలికార్యకర్తల్లో నిర్లిప్తతను తొలగించాల్సిన అవసరం ఉందివారిలో సైద్ధాంతిక అవగాహన పెంచేందుకు కృషి జరగాలిపనిచేసే చోట ఆందోళనలు, ప్రచారోద్యమం నివాసిత ప్రాంతాల్లోనూ జరగాలిఅసంఘటిత రంగం కార్మికులను సమీకరించడం ఒక ముఖ్య కర్తవ్యం, అదే సందర్భంలో మహిళలపై కూడా కేంద్రీకరించి పనిచేయాలిప్రతి అడుగూ, ప్రతి చర్యా చిత్తశుద్ధితో ఉండాలిపట్టుదలతో కొనసాగాలిప్రత్యేకించి సిపిఎం, సిపిఐ నాయకత్వం మధ్య రాష్ట్రస్థాయిలో తరచుగా సమావేశాలు జరగాలిఈ చర్చలు పూర్తి సుహృద్భావ పూర్వక వాతావరణంలో జరగాలిఅభిప్రాయాలు, వాదనలు స్వేచ్ఛగా వినిపించుకోవాలిఉద్యమాల నిర్వహణపై అభిప్రాయాలను సమన్వయంతో మార్చుకోగలగాలిఇవన్నీ జరిగితే దాని ఫలితాలు, ప్రభావం పార్టీ శ్రేణులపై పడి భవిష్యత్ లో సానుకూల పరిణామాలకు స్పూర్తి కలిగిస్తాయిఈ మహోన్నతమైన కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు విజయవాడలో సదస్సు నిర్వహించిన పెద్దలు నడుం బిగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది?