Friday, October 10, 2014

ఐదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాలతో అనుబంధం:వనం జ్వాలా నరసింహారావు

ఐదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ 
న్యూ సైన్స్ కళాశాలతో అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంత మందిని చేర్చుకోవాలంటే, అధిక సంఖ్యలో క్లాస్ రూమ్‌లు కావాలి. అందుకే, ఎప్పుడూ, ఏదో ఒక భవన విస్తరణ నిర్మాణం జరుగుతుండేది. ఒక విద్యార్థి...పేరు గుర్తుకు రావడం లేదిప్పుడు...(బహుశా మునీర్ కావచ్చు) తన దగ్గర ఎప్పుడూ, ఒక "టిక్-టిక్" ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. బహుశా...ఆ రోజుల్లోనే అనుకుంటా "దేవాంతకుడు" అనే సినిమా వచ్చి వుండాలి. అందులో హీరో దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. "సీటింగ్ అరేంజ్ మెంట్" అని రాసి వుంటే, అందులోంచి "ఎస్" అక్షరం తొలగించి, దాన్ని "ఈటింగ్" అని చేసేవాడు. అతడి అల్లరి అంతా-ఇంతా కాదు.

మరి కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి. ఖమ్మంలో నాతో పాటు పియుసి చదువుకున్న బాల మౌళి (ఇప్పుడో పెద్ద ఛార్టెడ్ అకౌంటెంట్) ఇక్కడ కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాం ప్రసాద్ (ఆయన భార్య గీత..ఆ తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది. రాం ప్రసాద్ ఇటీవలే మరణించాడు) మరొక క్లాస్ మేట్. అతడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వుండేవాడు. అలానే...రంగ రామానుజం, కుల్ కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల విద్యార్థి), జ్యోతి ప్రసాద్, ఎర్రం రాజు, మల్లికార్జున్, బాబ్జి, సుబ్బా రావు (సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), వి.ఎస్.పి. శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టి. ఆర్. శ్రీనివాసన్ (ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు), ప్రేంచంద్ (అమెరికాలో స్థిరపడ్డాడు)...తదితరులు కూడా నాకు క్లాస్ మేట్సే. నిజాం కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే అతడిని, ప్రిన్సిపాల్ సుదర్శన్ నచ్చ చెప్పి ఫైనల్ ఇయర్ లో మా కాలేజీలో, మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్ డిగ్రీలో కూడ అతడికే రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్ కాలేజీకి దక్కింది. ఆయన పక్క నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే రాయలేదు! ఇంటర్ నెట్‌లో చూస్తే, శ్రీ రాం అమెరికాలో పని చేస్తున్నట్లు అర్థమైంది. ఓ ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చి కూతురు పెళ్లి చేసి వెళ్లాడు. ఇంటర్‌నెట్ పుణ్యమా అని మా స్నేహం కొనసాగడంతో, నన్ను కూడా పెళ్లికి ఆహ్వానించడం, నేను హాజరవడం జరిగింది.

లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి ఇద్దరుండేవారు. ఒకరి పేరు "మంజు శ్రీ"...మరొకరి పేరు "అరిపిరాల విశ్వం". మంజుశ్రీ అసలు పేరు డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు. మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు పద్య రూపంలో అన్న మాటలు "అవనీ నాధు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించి తిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే" ఇంకా గుర్తున్నాయి. పద్య భాగం పుస్తకం పేరు గుర్తుకు రావడం లేదు కాని ఒక పాఠం..."గంగావతరణం" ఇంకా గుర్తుంది. అందులోని ఒక పద్యం...."ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి యస్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్".....కొంచెం..కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.

ఇంగ్లీష్ లెక్చరర్లుగా "షమీం" మేడం, "వి. వి. చారి" గారుండేవారు. మరో ఇద్దరి పేర్లు...వై. ఆర్. అయ్యంగార్, కుమారి శ్యామల. పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్. డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. . జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. . ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. ఫార్ స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన-1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను "మాడరన్ లైబ్రరీ" ఎంపిక చేసింది. 1923-2005 మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని "టైం మాగజైన్" ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్ ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్. ఇంగ్లీష్ పోయెట్రీలో కొన్ని పాఠాలు గుర్తున్నాయి. జార్జ్ హెర్బర్ట్ రాసిన "Virtue" (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాల గర్భంలో కలిసి పోయినా మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన ("Only a sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the whole world turn to coal. Then chiefly lives"). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన "జాన్ మిల్టన్" రాసిన "పారడైజ్ లాస్ట్". ఆయనే రాసిన మరో పోయెం "ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్". ఇంకో పోయెం కూడా గుర్తుంది. అది "విలియం వర్డ్ స్‌ వర్త్" రాసిన "సాలిటరీ రీపర్" (...."Alone she cuts and binds the grain, And sings a melancholy strain..."). జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం సార్లు చెప్పేవారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.


ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". రేఖా గణితం పుస్తకం "మాణిక్య వాచికం పిళ్లే" రాసిన దాన్ని ఉపయోగించే వాళ్లం. బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. నాకు మొదటి నుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టంగా వుండేది. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ పాసయ్యేవాడిని మంచి మార్కులతో. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు) రాయడానికే భయం వేసేది. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. డిమాన్ స్ట్రేటర్‌గా పి. వి. వి. ఎస్. మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు. వాటిల్లో "వెలాసిటీ ఆఫ్ సౌండ్", "వర్నియర్ కాలి పర్స్", "స్క్రూ గేజ్"", ఫిజికల్ బాలెన్స్" లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. అదే విధంగా రసాయన శాస్త్రం ప్రయోగాలను "రఘురాం" గారు చేయించేవారు. "వాల్యూ మెట్రిక్ అనాలసిస్", "పిప్పెట్, బ్యూరెట్ట్" ఉపయోగించడం తో పాటు "కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు" తయారు చేయించడం చేసే వాళ్లం. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్ రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్ తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు. తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసేటప్పుడు, అతడు కూడా నాతోపాటు చదివాడు.

కాలేజీ చదువుతో పాటు క్రికెట్ ఆటకు క్రమం తప్పకుండా పోవడం కూడా అలవాటు చేసుకున్నాను. బర్కత్ పూరా సమీపంలోని ఆంధ్ర యువతీ మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. "జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్" ఆ రోజుల్లో హైదరాబాద్ "బి-లీగ్" మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో "అబ్దుల్ హాయ్", "సాయినాథ్", "ప్లహ్లాద్" వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. నేను హైదరాబాద్‌లో ఆడడంతో, శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు నాకు అదో రకమైన గౌరవం లభించేది. ఖమ్మం మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెల్లే జట్టులో నేనుండే వాడిని. ఖమ్మంలో వనం రంగారావు, నర్సింగరావు, శేషగిరి, మూర్తి, దిలీప్, శంకర్, దివాకర్, ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణ...లాంటి వారితో కలిసి ఆడాను.

నేను హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడే (చనిపోయిన) వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు) ఉస్మానియా బి-హాస్టల్ లో వుంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుతో ఎం. ఏ చదువుతుండేవాడు. ఆయనను కలవడానికి తరచుగా యూనివర్సిటీ కాంపస్‌కు వెల్లే వాళ్లం. అక్కడ ఆయన ద్వారా పరిచయమైన ఆయన స్నేహితులలో ప్రొఫెసర్ హరగోపాల్ ఒకరు. సోషాలజీ డిపార్టుమెంటులో పని చేస్తున్న ప్రొఫెసర్ రాఘవేంద్ర రావు కూడా అలానే పరిచయమయ్యారు. రంగారావు మరో క్లాస్ మేట్ వాసిరెడ్డి శివలింగ ప్రసాద్ (ఇందిరా గాంధి సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రొ-ఛాన్సలర్ గా పదవీ విరమణ చేశారు) కూడా అప్పుడే పరిచయం. రంగారావు కంటే ఒక ఏడాది జూనియర్ ఐన డాక్టర్ శ్రీధర్ రెడ్డి (ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిప్పుడు-తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు) కూడా అప్పుడే పరిచయం అయ్యాడు. శ్రీధర్ రెడ్డి విద్యార్థి నాయకుడు కూడా. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి, యూనివర్సిటీకి విద్యార్థి సంఘ అధ్యక్షుడుగా కూడా ఆ రోజుల్లో ఎన్నికయ్యాడు. నాకంటే ఒక సంవత్సరం సీనియర్. వీరే కాకుండా రంగారావు కంటే ఒక ఏడాది సీనియర్ ఐన బొమ్మకంటి శంకర్ రావు (పాత తరం ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి కుమారుడు) కూడా కామన్ స్నేహితుల ద్వారా పరిచయం అయ్యారు. శంకర్ రావు ఐ. పి.ఎస్. అధికారిగా సీనియర్ పొజీషన్ లో రిటైర్ అయ్యారు. బొమ్మకంటి గారి తోడల్లుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కె. ఎల్. నరసింహా రావు గారు బావ మరిది నేదునూరి దుర్గా ప్రసాద్ (వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పని చేసేవారు) కూడా అలానే వూటుకూరు వరప్రసాద్ ద్వారా ఆ రోజుల్లో పరిచయం అయ్యారు. మేం (నేను, రూమ్మేట్ రమణ, వనం రంగారావు) బాగా స్నేహం చేసిన వారిలో సిటీ కాలేజీలో పని చేస్తున్న సోమేశ్వర రావు గారు కూడా వున్నారు. ఆయన ఖమ్మం కాలేజీలో కెమిస్ట్రీ డిమాన్ స్ట్రేటర్ గా పని చేసి బదిలీపైన హైదరాబాద్ సిటీ కాలేజీకి వచ్చారు. అక్కడ పని చేస్తూ ఆ తరువాత కాలంలో ఎం. (పొలిటికల్ సైన్స్) పట్టా పుచ్చుకున్నారు. సిటీ కాలేజీలోనే కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేసే పరిమళ గారితో సోమేశ్వర రావు గారి పరిచయం ప్రేమ వరకూ-పెళ్లి చేసుకునే వరకూ పోయింది. ఐతే, పెద్దల నుంచి అంతగా సానుకూలత రాకపోవడంతో, మేమే పెళ్లి పెద్దలమై, యాదగిరిగుట్టలో వారి పెళ్లి జరిపించాం. పరిమళా సోమేశ్వర్ గారు ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. వారందరితో నా దూరపు స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది.

ఇక్కడ వనం రంగారావు గురించి కొంత చెప్పుకోవాలి. మా పక్క గ్రామం కమలాపురం ఆయనది. నాకు వరసకు బాబాయి అవుతాడు. వయసులో రెండు-మూడేళ్లు పెద్ద. నేను ఖమ్మంలో పియుసిలో చేరిన సంవత్సరం రంగారావు బి. . రెండో సంవత్సరం చదువుతుండేవాడు. బి.. ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు ఎస్. ఆర్. అండ్. బి. జి. ఎన్. ఆర్ కాలేజీ మాగజైన్‍కు ఎడిటర్‌గా కూడా ఎంపికయ్యాడు. నేను హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చేరినప్పుడు, ఆయన ఎం. ఏ లో చేరాడు. రెండేళ్ల తరువాత ఎం. ఏ ఫస్ట్ క్లాస్‍లో పాసై, సివిల్స్ పరీక్షలకు తయారవుండేవాడు. నా రూమ్మేట్ రమణకు చాలా దగ్గర బంధువు. శెలవుల్లో (1967) ఒకసారి రమణ వూరు కల్మలచెర్వుకు వెళ్లాడు. అక్కడ ఒకనాడు పొలంలో నడుస్తున్నప్పుడు చిన్న దుంప గుచ్చుకుంది. కొద్ది రోజులకు అది చిన్న పుండుగా మారింది. దానికి వైద్యం చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్తే పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన చోట పెద్ద పుండై, రణంగా మారి, హఠాత్తుగా "టెటనస్" వ్యాధికి దారితీసింది. ఖమ్మం యలమంచిలి రాధా కృష్ణమూర్తి ఆసుపత్రిలో చేర్పించడం, చనిపోవడం ఒకే రోజు జరిగిపోయాయి. అప్పటికే రంగారావుకు వివాహం ఐంది కాని కాపురం మొదలెట్టలేదు. మా సమీప గ్రామం బాణాపురం వాస్తవ్యుడు, ఖమ్మంలో మా ఇంటి పక్కనే వుండే గండ్లూరి నారాయణ రావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉజ్వలమైన భవిష్యత్ వున్న ఒక వ్యక్తి అలా అకాల మరణం చెందాడు.   

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు నేటి కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (ఒక నాటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు)  మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న  డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ  జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!     

నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. నేను లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు ఊహించినట్లే ఫెయిలయ్యాను. కాకపోతే రాసిన ఒక్క లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. ఆ తరువాత సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. మళ్లీ హైదరాబాద్‌లో చిక్కడపల్లిలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని రమణ, నేను మరో స్నేహితుడు వుండేవాళ్లం. ఐతే, నేను ఎక్కువగా మా వూళ్లోనే వుంటూ, మధ్య-మధ్య వచ్చి పోతుండేవాడిని. గ్రామ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేవాడిని. చిక్కడపల్లిలో వుండే రోజుల్లోనే, సమీపంలో, ఒక మేడపైన, వూటుకూరు అనంత రామారావు, సూర్య ప్రకాశరావు వుంటుండేవారు. వాళ్లిద్దరూ ఉద్యోగాలు చేస్తుండేవారు. వారితో పాటు రావులపాటి సీతారాం రావు కూడా వుండేవారు. మేమంతా తరచుగా కలుస్తుండేవాళ్లం. అనంత రామారావు పేరుకు ఇంజనీరైనా, జనరల్ విషయాలను-వర్తమాన రాజకీయాలను, చాలా చక్కగా విడమర్చి మాట్లాడుతుండేవాడు. ప్రస్తుతం అనంత రామారావు అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డారు. మధ్య మధ్య హైదరాబాద్ వచ్చి స్నేహితులతో బంధువులతో కాలక్షేపం చేసి పోతుంటారు. సీతారాం రావు సీనియర్ పోలీసు (. పి.ఎస్) అధికారిగా పదవీ విరమణ చేశారు. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పని చేస్తున్నప్పుడు, సీతారాం రావు అక్కడ తన చివరి పోస్టింగ్ చేశారు. అదనపు డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ అక్కడే చేశారు.

మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్ 1968 లో లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు-నివాసం ప్రధమ ఘట్టం పూర్తయింది. End


No comments:

Post a Comment