ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
15 వ భాగం - అరణ్య కాండ
వనం
జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (17-10-2016)
తనను బలాత్కారం చేయగల శక్తి రావణుడుకి
లేదని, బలాత్కారాన్ని నిషేదించే శాపం రావణుడుకి వున్నదని తెలియని సీత వాడిని
పరుషోక్తులాడుతుంది. వాడికి నాశనమైపోయే కాలం దాపురించిందని, వాడి
రాక్షస సమూహం, కట్టుకొన్న స్త్రీలు ఏక కాలంలో నాశనమైపోతారని
అంటుంది. కోపంతో మండిపడ్డ రావణుడు సీతను అశోకవనానికి తీసుకొనిపొమ్మని, కాపలాగా వున్న రాక్షస స్త్రీలు ఆమెను మచ్చికచేసుకొని తనకు స్వాధీనపరచమని
ఆజ్ఝాపించాడు. ఇక్కడ లంకలో సీతాదేవి పరిస్థితి ఇలావుంటే, అడవిలో
రాముడు మాయా మృగాన్ని చంపి వెనక్కు వస్తుండగా, అపశకునమైన
నక్క కూత వినిపిస్తుంది. మారీచుడి కంఠధ్వని విన్న లక్ష్మణుడు తనను వెతికేందుకు
వచ్చి వుంటాడనీ, ఒంటరిగా వున్న సీతకు ఏం కీడు జరిగిందోనని
భయపడ్డాడు. ఇంతలో ఆశ్రమం సమీపానికి వచ్చిన రాముడికి ఒంటరిగా వున్న తమ్ముడు
కనిపించాడు. కలత చెందినట్లు కనిపిస్తున్న లక్ష్మణుడితో, రాక్షస
మాయ గురించి, తాను జింకను చంపడం గురించి చెప్పాడు రాముడు.
తనకు ఎదురైన అపశకునం గురించి రాముడు లక్ష్మణుడికి చెప్పిన సందర్భంలో
"తరలము" వృత్తంలో ఒక పద్యం రాశారు. సీత కనిపించనందుకు పరిపరివిధాల
దుఃఖించాడు. సీత అసలు ప్రాణంతో వుందా-లేదా అని సందేహిస్తాడు. అలా సీతాదేవిని
తలచుకుంటున్నప్పుడు "మంజుభాషిణి" లో మరో పద్యాన్ని రాశారీవిధంగా కవి:
తరలము: అదరె వామవిలోచనంబు, ప్ర
హర్ష మేమియు లేదు నా
మదిని, నాశ్రమభూమి
నిక్కము మానినీమణి లేదురా
సుదతినిన్ హరియించురో తమ సూడు దీఱఁ గ రక్కసుల్
ముది త దా మరణించెనో వని లోనఁ
ద్రోవయె తప్పెనో - 63
ఛందస్సు: తరలమునకు న-భ-ర-స-జ-జ గణాలు. పన్నెండో
అక్షరం యతి.
తాత్పర్యం: లక్ష్మణా ! ఎడమ కన్ను అదురుతున్నది. ఏ మాత్రం
సంతోషం మనస్సులో లేదు. నాయనా, ఆశ్రమంలో సీత లేదురా. తమ పగ తీర్చుకొనేందుకై
రాక్షసులు సీతను పట్టుకొనే పోయారో, లేక, వారి బాధ పడలేక తానే చనిపోయిందో, లేక, మనల్ని వెతుక్కుంటూ దారి తెలియక వేరే దారిలో పోయిండే దా.
మంజుభాషిణి: అని
మంజుభాషిణిని నాత్మ నెంచుచున్
జనియెం బిపాస క్షుధ జాలి గొల్ప మో
మును వాడఁ గాఁ దొలఁ గ ముర్వు, స్వాశ్రమం
బున కింతిలేమి నటఁ బొక్కి యేడిచెన్ - 64
ఛందస్సు: మంజు భాషిణీ వృత్తానికి స-జ-స-జ-గ గణాలుంటాయి. 9వ అక్షరం యతి.
సీత "మంజు భాషిణి" అయినందున, ఇంతకు ముందువలె, ఇక్కడ
కూడా "మంజుభాషిణి" వృత్తంలో
పద్యం రాయడం సమంజసం అంటారు వాసు దాసుగారు.
తాత్పర్యం: అని సీతాదేవిని తలచుకుంటూ, ఆకలి
దప్పిక భాదించగా, అందం తొలగగా, తన
ఆశ్రమంలో సీత లేనందుకు వెక్కి-వెక్కి ఏడిచాడు.
సీత కానరానందున పరితపించిన రాముడు, సీతను
ఎందుకు విడిచివచ్చావని లక్ష్మణుడుని ప్రశ్నించాడు. వచ్చిన వాడు సీతను కూడా
తీసుకొని రావల్సిందని అంటాడు. తానలా రావడానికి కారణం సీతేనంటాడు. వివరంగా
జరిగిందంతా చెప్పినప్పటికీ, అలా విడిచిరావడం లక్ష్మణుడు
చేసిన తప్పిదమని కూడా అంటాడు. లక్ష్మణుడి స్థితి శోచనీయమవుతుంది. మరో పక్క రాముడి
దుఃఖం కొనసాగుతూనే వుంటుంది. ఆమెను వెతుక్కుంటూ ప్రతి చెట్టు చాటునా చూస్తాడు.
కనిపించిన పశుపక్ష్యాదులను ఆమె గురించి అడుగుతాడు ఆవేశంతో. అలా ఆయన వెతకడాన్ని,
ఆమెతో భ్రమపడి సంభాషించడాన్ని, "కవిరాజవిరాజితము"
వృత్తంలో పద్యంగా రాశారు కవి ఇలా:
కవిరాజవిరాజితము:
నిలు నిలు
మేగకు మోకలికీ ! యెద ! నిర్దయమే మరుపూ ములికీ !
యలుఁ గఁ గ నేటికి ప్రాణసఖీ ! పరి యాచకమా
యిది చంద్రముఖీ ?
కులుకుచుఁ గుల్కుచుఁ బర్విడెదే కనుఁ
గొంటిని లే జిగిచీర యదే
పలుకవు కోపమ నీలకచా ! ననుఁ బాలన సేయుము !
కుంభకుచా ! -65
ఛందస్సు: కవిరాజవిరాజితమునకు
ఒక్క "న” గణం, ఆరు "జ" గణాలు, ఒక్క "వ" గణం వుంటాయి. పద్నాలుగవ ఇంట యతి.
తాత్పర్యం: కాంతా ! పోవద్దు. పోవద్దు. నిలు-నిలు.
మన్మధపుష్పబాణమా ! నీ హృదయ మింతదయలేనిదా ? ప్రాణసఖీ ! ఎందుకు నాపై
అలిగావు ? ఇది పరిహాస సమయమా ! కులుకుతు-కులుకుతు
పరిగెత్తుతున్నావు ? అదిగో నేను చూసానులే ! నీ చీరె నాకు
కనిపించింది. నల్లని వెంట్రుకలున్నదానా ! ఇలా నిన్ను చూసి నేను పిలిచినా పలుకవేమి
? కోపమా ? నన్ను రక్షించు.
సీతను రాక్షసులు చంపేసి వుంటారని విలపించాడు రాముడు. లక్ష్మణుడు రాముడిని
సమాధాన పరుస్తాడు. అయినాగాని రాముడు ఉన్మత్తుడిలా సీతకొరకు రోదించాడు. తన తల్లి
కౌసల్య కోడలేదిరా అంటే ఏమని సమాధానం చెప్పాలని లక్ష్మణుడిని అడుగుతాడు.
లక్ష్మణుడిని అయోధ్యకు పోయి భరతుడిని తన ఆజ్ఞలాగా శాశ్వతంగా రాజ్యాన్ని పాలించమని
చెప్పమంటాడు. గోదావరీ తీరమంతా అన్న ఆజ్ఞ ప్రకారం మళ్లీ వెతుకుతాడు సీతకొరకు
లక్ష్మణుడు. రాముడుని అర్థం చేసుకున్న అడవిమృగాలు, భూమిని-ఆకాశాన్ని-దక్షిణ
దిక్కును చూపించి అటువైపుగా సీత పోబడిందని సూచించాయి. ఆ సమయంలో రాముడికి సీతాదేవి
భూషణాదులు కనిపించాయి. జటాయువు రావణుడితో యుద్ధం చేస్తూ వాడికి జరిపిన నష్టం
తాలూకు పదార్థాలన్నీ కూడా కనిపించాయి అక్కడక్కడ. రాక్షసులే సీతను అపహరించి
వుండాలని భావించారు రామలక్ష్మణులు.
No comments:
Post a Comment