హిందూ సాంప్రదాయ వివాహం
ఒక మరపురాని ఘట్టం-1
ఒక మరపురాని ఘట్టం-1
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దినపత్రిక (16-10-2016)
ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.
పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.
"పెళ్ళి
చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయి బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూడాలి. ఆ తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. వరకట్న నిషేధం అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవాలి.
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం) తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.
సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.
సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి
పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.
సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.
వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". పెళ్ళి
ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు.
.... నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు......
ReplyDeleteవనం వారూ, వివాహవేదికపైననే మొదటిసారిగా పెండ్లికుమారుడూ పెండ్లికుమార్తె పీటలపైన ప్రక్కప్రక్కగా కూర్చొనేది. తత్పూర్వం అలా కూర్చోవటం సంప్రదాయంకాదు. ఈమధ్యకాలంలో నిశ్చితార్థకార్యక్రమంలో అలా కూర్చోబెడుతున్నారు కాని అది అనాచారం. ఉంగరాలు మార్చుకోవటం అనేది అరువు తెచుచుకున్న వ్యవహారమే కాని సంప్రదాయం కాదు. అసలు నిశ్చయతాంబూలాలు అనేది వివాహసంబంధితవైదికకార్యక్రమమే కాదు.