చిన్న
జిల్లాల ఏర్పాటులో సుదీర్ఘ శాస్త్రీయ ప్రక్రియ
వనం
జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ
దినపత్రిక (11-10-2016)
తుది
నోటిఫికేషన్ విడుదల నేపధ్యంలో నేటి నుంచి కొత్త జిల్లాల ఆవిర్భావం కావడంతో, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఒక మహోన్నత పాలనా సంస్కరణలకు శ్రీకారం
చుట్టడం జరిగింది. కొందరు విమర్శిస్తున్నట్లు ఇదంతా ఏదో ఆషామాషీగానో, లేదా రాజకీయ కారణాలతోనో, ఆశాస్త్రీయంగానో, అప్రజాస్వామికంగానో, ప్రజాభీష్టానికి విరుద్ధంగానో
జరిగింది కాదు. ఒక సుదీర్ఘ ప్రక్రియ ద్వారా, బహు
విధాల సలహా-సంప్రదింపుల ద్వారా,
చారిత్రిక-భౌగోళిక అనుభవాల
ఆధారంగా, దేశంలోని ఇతర జిల్లాలు అనుసరించిన
విధానాలను నిశితంగా పరిశీలించి అధ్యయనం చేసిన తరువాత, ఒక కూలంకషమైన చర్చ జరిపి, ఏకాభిప్రాయ సాధనానంతరమే, అత్యంత జాకరూకతతో తీసుకున్న నిర్ణయం.
ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను ఒకటి వెంట మరొకటి తుచ తప్పకుండా అమలు
పరిచిన-పరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర రావు,
అందులో భాగంగానే కొత్త
జిల్లాల-చిన్న జిల్లాల ఏర్పాటు చేసి, మరో
ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరో
నూతనాధ్యాయానికి తెర లేచింది.
రాష్ట్రంగా
ఏర్పాటైన అచిరకాలంలోనే, తెలంగాణ ప్రగతి పధంలోకి దూసుకుపోతున్న నేపధ్యంలో, జిల్లాల విభజన జరిగి చిన్నవిగా ఏర్పాటు చేస్తే ప్రజలకు క్షేత్రస్తాయిలో
సుపరిపాలనకు మార్గం సుగమమవుతుందనీ, తద్వారా బంగారు
తెలంగాణ సాధన వేగవంతం అవుతుందనీ భావించిన ముఖ్యమంత్రి దాదాపు ఏడాది క్రితమే ఆ దిశగా ఆలోచన మొదలు పెట్టారు. నూతన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు
చారిత్రక ఘట్టంగా నిలిచిందని, జిల్లాలు మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలవనున్నదని అప్పుడే
అన్నారాయన. నూతన
జిల్లాల ఏర్పాటు ప్రకటనకు కూడా అప్పుడే రంగం సిద్ధమైంది. ఆలోచన కార్యరూపం దాల్చే దిశగా కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాల్సిందిగా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అలా యావత్తు
ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజా ప్రయోజనాలే
ధ్యేయంగా జిల్లాల పెంపును శాస్త్రీయ
పద్దతిలో చేపట్టాలని కూడా అప్పుడే అధికారులకు సిఎం సూచించారు.
తొలుత,
ఏనాడో, సెప్టెంబర్ నెల 2015 లోనే
ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, రెవెన్యూ, పంచాయితీరాజ్, మునిసిపల్ శాఖ, సీసీఎల్‍ఏ లు సభ్యులుగా
కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ తరువాత ఉపముఖ్యమంత్రి మెహమూద్ అలీ అధ్యక్షతన, మరో ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల
రాజేందర్, తుమ్మల
నాగేశ్వర్ రావు, జూపెల్లి
కృష్ణారావులు సభ్యులుగా,
ప్రధాన
కార్యదర్శి రాజీవ్ శర్మ కన్వీనర్ గా ఒక కాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లాల
పునర్వవస్తీకరణపై కసరత్తు చేయమని ప్రభుత్వం కోరింది. ప్రధాన కార్యదర్శి
అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సుదీర్ఘమైన కసరత్తు చేసింది. అలానే
కాబినెట్ సబ్ కమిటీ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున అభిప్రాయ
సేకరణ చేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందర
జిల్లాల
పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల
ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష
సమావేశం కూడా జరిగింది. అన్ని పార్టీల నాయకులందులో
పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం
తీసుకుంటామని అన్న ముఖ్యమంత్రి అలానే చేసారు. వాస్తవానికి ఆ
సమావేశంలో, తెలంగాణలో పరిపాలన సౌలభ్యం
కోసం, ప్రజలకు సౌకర్యంగా ఉండడం
కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయపక్షాలు
స్వాగతించాయి. ప్రభుత్వ ప్రతిపాదనలను
దాదాపు పాల్గొన్న అందరు నాయకులు ఆమోదించారు. డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేయగా, వాటిని పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ
ఇచ్చారు. ఆ సూచనలన్నీ పరిగణలోకి
తీసుకున్నారు కూడా. చివరకు జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిపాలన
విభాగాల కూర్పును
పర్యవేక్షించేందుకు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాజీవ్ శర్మ
నేతృత్వంలో టాస్క్
ఫోర్సు కమిటీని సహితం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజ్యసభ
సభ్యుడు కేశవరావు అధ్యక్షతన హైపవర్ కమిటీని కూడా నియమించింది. పునర్వ్యవస్తీకరణ
చేపట్టిన ఇతర రాష్ట్రాల అనుభవాల అధ్యయనానికి ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను
పంపింది ప్రభుత్వం. ఇదంతా ప్రజాస్వామ్య
పద్ధతిలో జరిగిందే.
తన ఆలోచనలకనుగుణంగా
ఒకటికి పది సార్లు కలెక్టర్లతో, వివిధ శాఖాధిపతులతో, శాఖల సచివాలయ
కార్యదర్శులతో, వరుస సమావేశాలు నిర్వహించారు సీఎం. ఆ సమావేశాలలో
జిల్లా కార్యనిర్వాహక అధికారులుగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్లు తెలంగాణ
అభివృద్దిలో మరింత కీలక భూమికను పోషించే సమయం ఆసన్నమైందని సిఎం ఆకాంక్షించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటు నామ మాత్రంగా చేస్తే సరిపోదని భావించిన సీఎం, కలెక్టర్ కార్యాలయంతో సహా అది కేంద్రంగా
వివిధ శాఖల కార్యాలయాలెలా వుండాలి, ఎంత స్థలంలో
నిర్మించాలి, వాహనాల పార్కింగ్ ఎలా వుండాలి, మారుతున్న అవసరాల నేపధ్యంలో హెలిపాడు ఎక్కడ ఏర్పాటు చేయాలి, కార్యాలయాల పరిసర ప్రాంగణాలెలా వుండాలి, ఆప్టికర్
ఫైబర్-వాటర్ హార్వెస్టింగ్ లాంటి పలు అంశాలను కూడా కూలంకశంగా చర్చించేవారు. శాంతి
భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యమైన విషయమని, జిల్లాల
పునర్వవ్యవస్థీకరణలో భాగంగా నేరాలను పూర్తి స్థాయిలో అదపు చేసే చర్యలను
తీసుకోవాలని, దానిలో భాగంగానే కొత్తగా ఏర్పడే మండల కేంద్రాలలో
పోలీస్ స్టేషన్ల ఏర్పాటు-అవసరమైన సిబ్బంది నియామకం లాంటి
అంశాలను కూడా విపులంగా చర్చించడం జరిగింది.
జూన్ నెల మొదటివారంలో
జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లాల విభజన-నూతన జిల్లాల ఏర్పాటు
గురించి పలు కీలకమైన నిర్ణయాలతో పాటు ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించింది
ప్రభుత్వం. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల
విభజనే కాదని మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని ముఖ్యమంత్రి ఈ
సమావేశంలో సూచించారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల సగటు విస్తీర్ణం, జనాభా, మండలాల సంఖ్య; మండలాల సగటు విస్తీర్ణం, జనాభా, గ్రామాల సంఖ్య లాంటి అంశాలపై చర్చ జరిగింది.
దేనికైనా ‘‘దేరీస్ నో తంబ్ రూల్ ఓన్లీ లిబరల్’’ అన్న సీఎం, ప్రజాభిప్రాయమే ముఖ్యమైందని స్పష్టం చేసారు. అలాగే, ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క నియోజక వర్గం ఒకటికి మించి జిల్లాలో
విస్తరించి ఉందా? ఉంటే ఎట్లా ఉన్నది? అక్కడి భౌగోళిక
పరిస్థితులు ఏమిటి? అన్నీ సమీక్షించాలన్నారు. బలవంతంగా తమను ఇతర మండలంలో కలిపారన్న భావన ప్రజలకు రాకూడదనీ, ప్రతి విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలనీ, ఏదీ రాజకీయ కోణంలో చూడకూదదనీ, పెద్ద మండలాలను
రెండుగా చేసే అంశాలను పరిశీలించాలనీ సమావేశంలో అభిప్రాయం వెల్లడైంది.
నూతన జిల్లాల
ఏర్పాటు ప్రక్రియలో భాగంగా నిర్ధిష్ట గడువులోగా అన్ని జిల్లాల కలెక్టర్లు తమ
జిల్లాకు సంబంధించినంతవరకు ప్రాధమిక నివేదికలు తయారు చేయాలనీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో చర్చించి అభిప్రాయ సేకరణ చేయాలనీ, కలెక్టర్లతో వరుస సమీక్షా సమావేశాలు జరపాలనీ, అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించాలనీ, దరిమిలా డ్రాఫ్ట్
నోటిఫికేషన్ జారీ చేయాలనీ, నియమిత గడువు (నెలరోజులు) లోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లా కలెక్టర్లు క్రోడికరించి నివేదికలు
రూపొందించాలనీ, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన సంపూర్ణ ప్రక్రియను
పూర్తి చేసుకుని అక్టోబర్ 11, (విజయదశమి) నాటికి నూతన
జిల్లాల ఆవిర్భావం జరగాలనీ సమావేశంలో నిర్ణయం జరిగింది. తుచ తప్పకుండా ఈ మొత్తం
ప్రక్రియ జరిగిన తరువాతే జిల్లాల ఆవిర్భావం జరిందనేది నిర్వివాదాంశం.
జిల్లాల పునర్
వ్యవస్థీకరణ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూర్పుపై కూడా కూలంకషమైన చర్చ ఒకటికి
పదిసార్లు జరిగింది. పనిభారాన్ని బట్టి పరిపాలనా విభాగాలు ఉండాలని, దీనికి అనుగుణంగా అధికారుల సర్దుబాటు, కొత్త ఉద్యోగుల
నియామకం జరగాలని సీఎం ఆ సమావేశాలలో సూచించారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామిజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ శాఖల
విభాగాలను ఏర్పాటు చేయాలని సిఎం పలుమార్లు చెప్పారు. ఈ సమావేశాలలో సందర్భాన్ని
బట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, సీనియర్ ఐఎఎస్ అధికారులు, సీనియర్ ఐపిఎస్
అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు హాజరయ్యేవారు. దసరా నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవిన్యూ
డివిజన్లు, కొత్త మండలాలు కూడా సమాంతరంగా ప్రారంభం కావాలని
సిఎం అనేవారు. ఒకానొక సందర్భంలో సీఎం మాట్లాడుతూ "ఓ కుటంబం ఇల్లు మారినప్పుడు
ఉండేలాంటి సమస్యలే, కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా
తలెత్తుతాయి" అని అన్నారు.
డ్రాఫ్ట్
నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత వచ్చిన విజ్ఞప్తులను, సూచనలను, అభిప్రాయాలను అధికారుల స్థాయిలోనే కాకుండా సీఎం స్వయంగా వరుస సమావేశాల్లో
విశ్లేషణ చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ప్రజాభిప్రాయం, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని
అప్పటికప్పుడే మండలాల, రెవెన్యూ డివిజన్ల, జిల్లాల ఏర్పాటుపై
తన నిర్ణయం తెలియచేసేవారు. ఎప్పటికప్పుడు ఆయన ఒకటే మాట అనేవారు: "అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం, ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావడం కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ"
అని.
ప్రజల
అభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజాప్రతినిధులతో, అక్టోబర్
మొదటి వారంలో, రెండు రోజులు జిల్లాల వారీగా సుదీర్ఘ
సమావేశాలు నిర్వహించిన సీఎం తుదిదాకా తనదైన శైలిలో ఈ దిశగా కసరత్తు అడుగడుగునా
శాస్త్రీయంగా కొనసాగించారు. ప్రతీ
జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు
చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని, అందుకే ప్రతీ జిల్లాలో సగటున 3లక్షల
కుటుంబాలుండేలా జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తున్నామని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పర్యవేక్షణ లోపం వల్ల అవి అనుకున్న మేర ఫలితాలివ్వడం లేదని, సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంత వరకు అశాంతి, అలజడి ఉంటుందని, వీటిని రూపుమాపడంలో చిన్న పరిపాలనా విభాగాలు మంచి
ఫలితాలు అందిస్తాయని, ప్రజల సౌకర్యార్ధమే ఈ ప్రక్రియ చేపట్టినందున
జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య
పెరిగినా ఫరవాలేదని సిఎం ఆ సమావేశాలలో స్పష్టం చేశారు. అందుకే ప్రజల కోరిక మేరకు
వారెన్నుకున్న ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు ఆధారంగా చేసుకుని, జిల్లాల తుది జాబితా రూపొందించారు. బహుశా ఇంత శాస్త్రీయంగా జిల్లాల
పునర్విభజన జరగడం దేశంలోనే ఇదే మొదటి సారి అనవచ్చేమో! మరెందుకీ విమర్శలు? చివరగా ఒకే ఒక్క మాట...చిన్న పాలనా విభాగాలే సత్ఫలితాలిస్తాయన్న
ప్రపంచవ్యాప్త అనుభవమే మనకి స్ఫూర్తిదాయకం. End
kcr ఏం చేసినా శాస్త్రీయం ముద్ర వేయాలి కదా మీబోటి ప్రభుత్వ మేతావులు.
ReplyDeleteఅజ్ఞాత గారూ, ఈ బ్లాగరు ఒక తెలంగాణా వీరాభిమాని అని తెలుస్తోందిగా. పైగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈయనొక ఉన్నతోద్యోగి. అందువల్ల ఈయన టపాలు ఇలాగే ఉంటాయి. వీరి బంధువు, సీనియర్ జర్నలిస్టు అయిన భండారు శ్రీనివాస రావు గారి టపాలు ఇంకా నిష్పక్షపాతం గా ఉంటాయి.
ReplyDeleteఈ బ్లాగరుకి విమర్శ కూడా అంతగా నచ్చదనుకుంటాను. అందుకే ఈయన బ్లాగులో వ్యాఖ్యలు ఎక్కువగా కనబడవు.