Monday, October 17, 2016

‘‘భారతీయ ఔన్నత్యం-ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు" : వనం జ్వాలా నరసింహా రావు

‘‘భారతీయ ఔన్నత్యం-ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు"
వనం జ్వాలా నరసింహా రావు
మనతెలంగాణ దినపత్రిక (18-10-2016)

        ఇటీవలి నా అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ నగరంలో మూడు వారాలున్నాను. ఆ సమయంలో సాహితీవేత్త, శాస్త్రవేత్త, మన తెలుగువాడైన డాక్టర్ మురళి అహోబిల వఝ్ఝుల గారిని కలవటం తటస్థించింది. ఆయన సంపాదకత్వంలోసలీల్ గేవాలీ  సేకరించిన ‘‘గ్రేట్ మైండ్స్ ఆఫ్ ఇండియా’’ అనే ఆంగ్ల పుస్తకాన్ని, దాని తెలుగు అనువాదమైన "భారతీయ ఔన్నత్యం-ప్రపంచ ప్రముఖుల ప్రణామాలు" ను నాకిచ్చారాయన. ఆంగ్లమూలానికి తెలుగు సేత ఖందవల్లి సత్యదేవప్రసాద్. ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సలీల్ గేవాలీ మేఘాలయా రాష్ట్రానికి చెందిన వారు. ఫ్రీలాన్సర్ గా 1980 లో రచనారంగంలోకి ప్రవేశించిన సలీల్ వ్యాసాలు అనేక స్థానిక, జాతీయ దిన పత్రికల్లో ముద్రితమై పాఠకుల ప్రశంసలను చూరగొనటం జరిగింది. పరిశోధనాత్మకమైన ఈ పుస్తకం సలీల్ గేవాలీకి పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు సంతరించి పెట్టింది. తెలుగు, కన్నడ, మళయాలం, మరాఠి, హింది, గుజరాతీ, తమిళ్, నేపాలీ భాషల్లోకి ఈ పుస్తకం అనువదించబడింది. తెలుగు పుస్తకానికి ముందుమాటలు పుల్లెల శ్రీరామచంద్రుడు, డాక్టర్ కె. అరవిందరావు, సామవేదం షన్ముఖ శర్మ రాశారు. 

          తనకు భారతదేశం మీద అపారమైన ప్రేమ భారతీయ ఔన్నత్యం పుస్తక తయారీకి తొలి అడుగని రచయిత అంటారు. అనేక మంది రచయితల మేధో సంపత్తికి, ఆలోచనాధోరణికి, నిర్ధుష్ఠమైన వారి అభిప్రాయలకు ‘‘గ్రేట్ మైండ్స్ ఆఫ్ ఇండియా’’ దర్పణంలాంటిది. వారి ఆలోచనలు, ఆరాటం, ఆతృత మన సమాజం దానికున్న విలువ వంటి కోణాల్లో అద్భుతాలను ఆవిష్కరించింది. భారతదేశ వైదిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సంపద గురించి ప్రపంచ ప్రసిద్ధులైన మేధావుల అభిప్రాయాలను ఈ పుస్తకంలో క్రోడీకరించారు రచయిత-సంపాదకుడు. రచయితల భారత జాతీయ దృక్పథాన్ని ఆవిష్కరించటంతో పాటు, దేశ భక్తిని, పురాణాలలోని నిగూఢమైన మేధో మదనాన్ని విస్తృతంగా వివరించటం జరిగింది. వేదాలకు, ఉపనిషత్తులకు, భగవత్గీతలోని సారాంశానికి సలీల్ గేవాలీ పెద్దపీట వేయటం విశేషం. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పశ్చిమ దేశీయ పండితులైన హెన్రీ డెవిడ్ థోరో, రాల్ఫ్ ఎమర్సన్, కార్ల్ సగాన్, అలాన్ వాట్స్, అల్డస్ హక్స్ లే, లాంటి  వారి అమూల్యమైన వాక్కులిందులో కనిపిస్తాయి. అలాగే మేధావులైన వాల్టయిర్, టి.ఎస్.ఇలియట్, ఫ్రెడరిక్ హెగెల్, జూలియస్ రాబర్ట్, ఓప్పెన్ హైమర్, ఎమర్సన్, థోరో, ఎర్విన్ స్కోడిన్గర్, మార్క్ ట్వైన్ లాంటి ఉద్దండులు మన భారతీయ పురాణ సాహిత్యం నుండి ఎంతో కొంత ఆకళింపు చేసుకున్నారనడానికి వారి మాటలే ఆధారం. ఈ అద్భుతమైన సత్యం భారతదేశంలో చాలా మందికి తెలియక పోవచ్చు.

     ఇక సంపాదకుడు మురళి అహోబిల, హ్యూస్టన్ నగరంలోని జాన్సన్ అంతరిక్ష కేంద్రంలోని నేషనల్ రిసర్చ్ కౌన్సిల్ లో మాజీ శాస్త్రవేత్తగా నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) లో పని చేశారు. అలాగే ఆయన అక్కడే వున్న లూనార్ అండ్ ప్లానిటరీ ఇన్సిటిట్యూట్  (ఎల్ పి ఐ) లోనూ శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన మురళి అహోబిల మధ్యప్రదేశ్ లోని  సాగర్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందటంతో పాటుగా టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టిఎఫ్ఐఆర్) లో, భారత  అను  పరిశోదన సంస్థ (బార్క్) లో పరిశోధనలు చేశారు. మురళి, జియో కెమిస్ట్రీ, కాస్మో కెమిస్ట్రి విభాగాల్లోనూ ప్రత్యేకత సాధించారు. ఆరిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రోమన్ స్కిమిట్ మురళి సమర్పించిన పరిశోధనాత్మక థీసీస్ కు ముగ్దుడై, 1975లో, వారి పరశోధన శాలలో సౌర పరిశోధన విభాగంలో చేరమని కోరారు. అక్కడ చేరిన ఆయన లూనార్ సాంపిల్స్ అధ్యయనం చేయడం, అపోలో (యుఎస్ఎ), లూనార్ (రష్యా) మిషన్స్ లో చంద్రుని పుట్టు పూర్వోత్తరాలు అర్థం చేసుకునేందుకు జరగే శోధనల్లో పాల్గొనడం జరిగింది.

అంతరించి పోతున్న డైనాసర్లకు సంబంధించి డా. మురళి చేసిన అధ్యయన పరిశోధన ఆయనకు 1984 లోయుఎస్ జాతీయ పరిశోధనా సంస్థలో (ఎన్ ఆర్ సి)లో సీనియర్ అసోసియేట్ గా (అమేరికన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) పనిచేసే అవకాశం కలిగించింది. దరిమిలా అదే కారణాన నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ లోనూ, లూనార్, ప్లానిటరీ సంస్థలోనూ పరిశోధనలు జరపే అవకాశం కలిగింది. ఫలితంగా ఆస్టిరాయిడ్ చర్య వల్ల 65 మిలియన్ల ఏళ్ల క్రితం మన గ్రహం నుండి డైనాసర్లు అంతర్థానం కావడానికి గల కారణాలను ఆయన వెలుగులోకి తెచ్చారు. లామర్ విశ్వవిద్యాలయంలోని లూనార్ బేస్ పరిశోధనా విభాగంలో పనిచేస్తున్న సమయంలోనే డా. మురళి మానవ జాతి భవిష్యత్ అవసరాలకు ఉపయోగ పడే హీలియం-3 అవశేషాలను లూనార్ సాయిల్ లో ఉన్నట్లు నాసా కు తెలయజేశారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ (ఎస్ఎస్ టి ఇ పి) లో భాగంగా ఆయన మొబైల్ ప్లానిటరీ రోవర్ యూనిట్ తయారీ ద్వారా దృశ్య శ్రవణ సమాచార అనుసంధానాన్ని చేదించారు. తద్వారా ప్లానిటరీ రోవర్ యూనిట్ (పి ఆర్ యు) ను కనుగొనటంలో సఫలీకృతులయ్యారు. అనేక మంది శాస్త్రవేత్తలతో అనుభందగా పనిచేయగలిగే అవకాశాన్ని పొందటంతో పాటూ ఎందరో విద్యార్థులకు దిశా నిర్దేశకులుగా నిలబడడానికి డా. మురళి కారణభూతులు కాగలిగారు. దాదాపు వందకు పైగా అంతరర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిచెందిన పలు పుస్తకాలు, సైన్స్ జర్నల్స్ లో వ్యాసాలు రాయడానికి ఆయన పరిశోధనలు ఉపయోగపడ్డాయి. ఇలాగే బార్క్, నాసా విభాగాలకి ఎన్నో నివేదికలు సమర్పించడంలోనూ సఫలీకృతులయ్యారు. అనేక అవార్డులను పొందటంతో పాటుగా పరిశోధనలకు సంబంధించి ప్రత్యేక గుర్తింపులనూ పొందటం జరిగింది. వీరి పరిశోధనల ఫలితంగా అమెరికాలోని ఎందరో విద్యార్థులు సామాన్య శాస్త్రం, గణిత విభాగాల్లో కొత్త పుంతలు తొక్కడానికి దోహద పడింది. టెక్సాస్ కు చెందిన స్పేస్ షటిల్ ఐదు మిలియన్ల దూరం ప్రయాణించడానికి మూడు ప్రత్యేక గుర్తింపులను డా. మురళి సాధించారు. లామర్ విశ్వవిద్యాలయం చేసిన ఈ ప్రయోగం ఆ విశ్వవిద్యాలయం డైరెక్టర్ జిమ్ జార్డన్ 1995లో చేపట్టారు. డా. మురళికి అదే విశ్వవిద్యాలయం నుండి 1993లో ఎడ్యుకేషన్ ఎన్ రిచ్ మెంట్ అవార్డ్ అందజేయబడింది. లూనార్ ల్యాండింగ్ ఎడ్యుకేషన్ కమిటీ 1994లో ఆయన్ని ఆ సంస్థ పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా సత్కరించింది.

ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఎందరో ప్రముఖుల, మేధావుల ఆణిముత్యాల లాంటి మాటలను ‘‘గ్రేట్ మైండ్స్ ఆన్ ఇండియా’’ పుస్తకంలో క్రోడీకరించారు రచయిత-సంపాదకుడు. పుస్తకం ఆమూలాగ్రంగా చదివితే, శాస్త్ర విజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నెన్నో నూతన విషయాలను ఆవిష్కరిచుతున్న నేపధ్యంలో, వీటికి సంబంధించిన అనేకాంశాలు భారత ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడినవే అనేది అవగతమౌతుంది. ఉదాహరణకు, క్వాంటం ఫిజిక్స్ అధ్యయనంలో భారతీయ వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు తనకు తోడ్పడ్డాయని శాస్త్రవేత్తలైన ఎర్విన్ ష్రోడింగర్, జూలియస్ ఓపెన్ హీమర్, డేలిబాం, హైసన్ బర్గ్ లు అన్న విషయం రచయిత పేర్కొంటారు.

అలానే అమెరికాలో పుట్టి ఇంగ్లాడులో జీవించిన ప్రఖ్యాత ఆంగ్ల కవి, వేస్ట్ ల్యాండ్ రచయిత, 20వ శతాబ్దపు తత్వ శాస్త్రవేత్త, విమర్శకుడు, సాహిత్యంలో 1948లో నోబుల్ పురస్కార గ్రహిత, టీ ఎస్ ఇలియట్ తన పద్యకావ్యం చివరలో "ఓం శాంతిః శాంతిః శాంతిః" అని పేర్కొన్న విషయం చాలా ఆసక్తికరమైనదిగా అనాలి. అదే పద్య కావ్యంలోని "వాట్ ద థండర్ సెడ్" అనే కవితకు ఆధారం "బృహదారణ్య ఉపనిషత్" అట! అదే విధంగా ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడిగా విశ్వవ్యాప్తంగా తెలిసిన ఓపెన్ హీమర్ ఉపనిషత్తులను, భగవద్గీతను ఎంతో ఆదరంగా అధ్యయనం చేసేవారట.


రచయిత సలీల్ గేవాలీ, సంపాదకుడు డాక్టర్ మురళి తమ పుస్తకంలో పేర్కొన్న మరికొందరి పేర్లు: ప్రఖ్యాత జర్మన్ తత్వ వేత్త, రచయిత అయిన ఫ్రెడరిక్ హెగెన్; పరిశోధకులుగా, ఇంగ్లాండ్ రొమాంటిక్ మూవ్ మెంట్ నాయకులుగా, బ్రిటన్ లో పోయెట్ లారియట్ గా ఏడేళ్ల పాటు గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఆంగ్ల కవి విలియం వార్డ్స్ వర్త్; అమేరికా దేశ ప్రఖ్యాత రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్; 19వ శతాబ్దపు ట్రాన్సెంటెండలిస్ట్ మూవ్ మెంట్ పోరాట యోధుడు ప్రఖ్యాతి గాంచిన ప్రొలిఫిక్ అమెరికన్ హ్యూమరిస్ట్, సెటైరిస్ట్ (వ్యంగకారి), రచయిత అయిన మార్క్ ట్వెయిన్; 1922 భౌతిక శాస్త్ర నోబుల్ పురస్కార గ్రహిత, ఆటోమిక్ స్ట్రక్చర్ ఎక్స్ పోనెంట్ నీల్స్ భోహర్; ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త, రచయిత ఫిలాలజిస్ట్, ఆ కాలంలో ప్రప్రధమ సంస్కృత పండితుడైన మాక్స్ ముల్లర్; ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత, జర్నలిస్ట్, సాంఘీక శాస్త్రవేత్త, తత్వవేత్త హెచ్.జి.వెల్స్; పేరెన్నికగన్న ఆంగ్ల నవలా రచయిత ఆల్డక్స్ హక్స్ లే; జర్మన్ నోబుల్ పురస్కార గ్రహిత ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తదితరులు ఉన్నారు.

ఈ ప్రముఖులు అన్న కొన్ని మాటాలు: "భారతీయ దార్శనికులు ప్రవచించిన ఆధ్యాత్మిక మర్మాలు ఐరోపా దేశంలోని గొప్పగొప్ప వేదాంతులను కూడా బడిపిల్లల్లాగా కనబడేట్లు చేస్తాయి"-టిఎస్ ఇలియట్; "ఖగోళ, భౌతిక, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకు గంగాతీరం నుంచే లభించాయనేది నిశ్చయం"-ఎ ఎం వాల్టైర్; "భారతదేశం మతాలకు నిలయం. మానవ జాతికి తొలి ఊయల. భాషలకు పుట్టిల్లు. ఇతిహాసాలకు అమ్మమ్మ. సంప్రదాయాలకు అమ్మలగన్న అమ్మ. సర్వమానవులు కనీసం ఒక్కసారైనా దర్శించాలని ఉబలాటపడే నేల భారతదేశం"-మార్క్ ట్వైన్; "వేదాలు నన్ను విడవకుండా వెంటాడుతాయి. వాటిలో నేను శాశ్వత సమాధానం, అంతులేని బలం, ఎడతెగని శాంతి కనుగొన్నాను"-రాల్ఫ్ వాల్డొ ఎమర్సన్; "భారత్ ఒక స్వప్న భూమి. భారతీయులు స్వాప్నికులు. వాళ్లు మానవ పరమార్థమైన ఆనందం గురించి కలలు కంటారు. ఈ లక్షణం భారతీయులను ప్రపంచంలో ఇతర దేశస్తులను మించిన చారిత్రక సృజనాత్మకత కలవారుగా చేసింది"-హెగెల్.....ఇలా ఎందరి ఆణిముత్యాలో ఇందులో వున్నాయి.


ఆంగ్లంలో ఈ పుస్తకానికి ముందుమాట రాసిన మేఘాలయా విద్యాశాఖా మంత్రి మానస్ చౌదరి ‘‘వేదాలు మానవ మనుగడకు జాతి, మత, తత్వ, సాహిత్య మనుగడకు అద్దం పట్టిన ప్రామాణికాలు" అని అంటారుభారత తత్వ వేత్తలను, హిందూయిజాన్ని, బ్రాహ్మణిజాన్ని, మన దేశ ఆలోచనా విధానాన్ని, వేదాలను, ఉపనిషత్తులను అపహాస్యం చేసే వారందరికీ ఈ పుస్తకం ఒక కనువిప్పు కలిగిస్తుంది. ముందు మాటలో పుల్లెల శ్రీరామచంద్రుడు రాసినట్లు, "హిందూ మత శ్రద్దాళువులెవరూ హిందూ మతానికీ, భారతీయ సంస్కృతికీ విరుద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారమనే పెనుతుఫానులో కొట్టుకుని పోకుండా నిలదొక్కుకుని, దాని ప్రభావాన్ని తగువిధంగా ఎదుర్కొనడానికి మహాపురుషుల ఈ సనాతన ధర్మ ప్రశంసాసూక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క అస్త్రంగా ఉపయోగపడుతుంది".End

2 comments:

  1. Mentioning various luminaries, and their contributions this article is very well written in Telugu.

    ReplyDelete
  2. Mentioning various luminaries, and their contributions this article is very well written in Telugu.

    ReplyDelete