Sunday, October 23, 2016

జటాయువుకు అగ్నిసంస్కారం చేసిన రామచంద్రుడు.....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 16 వ భాగం - అరణ్య కాండ:వనం జ్వాలా నరసింహా రావు

జటాయువుకు అగ్నిసంస్కారం చేసిన రామచంద్రుడు
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
16 వ భాగం - అరణ్య కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (24-10-2016)

సీతను రాక్షసులు చంపేసి వుంటారని విలపించాడు రాముడు. లక్ష్మణుడు రాముడిని సమాధాన పరుస్తాడు. అయినాగాని రాముడు ఉన్మత్తుడిలా సీతకొరకు రోదించాడు. తన తల్లి కౌసల్య కోడలేదిరా అంటే ఏమని సమాధానం చెప్పాలని లక్ష్మణుడిని అడుగుతాడు. లక్ష్మణుడిని అయోధ్యకు పోయి భరతుడిని తన ఆజ్ఞలాగా శాశ్వతంగా రాజ్యాన్ని పాలించమని చెప్పమంటాడు. గోదావరీ తీరమంతా అన్న ఆజ్ఞ ప్రకారం మళ్లీ వెతుకుతాడు సీతకొరకు లక్ష్మణుడు. రాముడుని అర్థం చేసుకున్న అడవిమృగాలు, భూమిని-ఆకాశాన్ని-దక్షిణ దిక్కును చూపించి అటువైపుగా సీత పోబడిందని సూచించాయి. ఆ సమయంలో రాముడికి సీతాదేవి భూషణాదులు కనిపించాయి. జటాయువు రావణుడితో యుద్ధం చేస్తూ వాడికి జరిపిన నష్టం తాలూకు పదార్థాలన్నీ కూడా కనిపించాయి అక్కడక్కడ. రాక్షసులే సీతను అపహరించి వుండాలని భావించారు రామలక్ష్మణులు. రాక్షసులు తన సీతకు అపకారం చేస్తుంటే చూసిన దేవతలు ఆమెను ఆదుకోలేదని లక్ష్మణుడితో అంటూ, వాళ్లపై కోపించి జగత్సంహారం చేయడానికి సిద్ధమౌతాడు రాముడు. లక్ష్మణుడు శ్రీరాముడిని శాంతపరిచాడు. ఇద్దరం చేయాల్సిన పనంతా చేసి, అప్పటికీ దేవతల సహాయం లభించకపోతే, అప్పుడు రాముడు చెప్పినట్లే చేద్దామంటాడు. లక్ష్మణుడు రాముడితో చెప్పినదాన్ని, ఇక్కడ "మానిని" వృత్తంలో రాశారు కవి ఇలా:

మానిని: సామముచేతను శీలముచేతను సాధుమతీ ! వినయాదులచే
        భూమితనూభవ చేపడ కున్నను భూవరనందన ! యాపయి సు
        త్రామకఠోరసుసాధనసన్నిభ రాజతపుంఖశరౌఘములన్
        సమదివచ్చిన చొప్పున లోకము నీఱుగఁ  జేయుము యుక్తమగున్ - 66
ఛందస్సు:      మానినికి ఏడు "భ" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం:     మంచిమాటలతో, మంచినడవడితో, వినయం మొదలైన వాటితో, సీతాదేవి లభించకపోతే, సాధుమనస్సుగల రాజనందనా, ఆ తర్వాత వజ్రాలవంటి కఠోరమైన-బంగారు పింజల బాణాలతో నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి. అది తగిన కార్యమవుతుంది.

రామచంద్రుడిని పరిపరివిధాలుగా శాంతించే ప్రయత్నం చేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి మాటలకు శాంతించిన రాముడు తిరిగి సీతను వెతికే ప్రయత్నంలో వుంటాడు. సీతను అపహరించినవాడిపై అమితమైన కోపంతో, ధనస్సులో బాణం సంధించి, చేతిలో ధరించి అడవిలోని జనస్థానంలో తమ్ముడితో కలిసి వెతకసాగాడు. అలా వెతుకుతున్న వారికి జటాయువు కనిపిస్తుంది. జటాయువు సీతాపహరణ వృత్తాంతాన్నంతా రామలక్ష్మణులకు వివరించాడు. జటాయువు దుస్థ్సితికి రాముడు దుఃఖించాడు. పాపాత్ముడైన రావణుడు సీతను ఎలా పట్టుకొని పోయాడని రాముడు జటాయువును ప్రశ్నించడాన్ని ఒక వినూత్నమైన "చంపకమాల" వృత్తంలో రాసారీవిధంగా వాసు దాసుగారు:

చంపకమాలఆమెయుఁ గొంచు నేగ దురితాత్ముఁ డు తన్ను ధరిత్రికన్య దా
                నే మనుచుండె ? నప్పలుకు లేర్పడఁ జెప్పుమ, దైత్యుఁ డెట్టివాఁ
                డేమెయివాఁ డు ? వానిపురమెయ్యది ? శౌర్యమ దెంతమట్టు ? తం
                డ్రీ ! మన మారఁ గాఁ బలుకవే సతి నెట్లు హరించి యేగెనో ?
ఛందస్సు:      రెండూ ప్లుతాక్షరాలే అయినప్పుడు సర్వ మైత్రి వుంటే చాలునంటారు కవి. వ్యంజనమైత్రితో పనిలేదని, దీనికి ప్లుత్లయుగ విశ్రామయతి అని పేరని కూడా అంటారు. పద్యంలో నాలుగో పాదంలో రెండూ ప్లుతాక్షరాలే.  
తాత్పర్యం:     ఆ విధంగా పాపాత్ముడు రాక్షసుడు తనను తీసుకొని పోతున్నప్పుడు, సీత ఏమంటున్నది ? ఆ మాటలు స్పష్టంగా చెప్పు. ఆ రాక్షసుడెట్టివాడు ? ఏ దేహం గలవాడు ? వాడుండే పురమేది ? వాడెంత మాత్రపు శూరుడు ? తండ్రీ, సీతను ఏ విధంగా పట్టుకొని పోయెనో సర్వం చెప్పు.


జటాయువు అన్నీ సవివరంగా రాముడికి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రావణుడి పూర్తి పేరు చెప్పే లోపల, కుబేరుడి సోదరుడన్న మాటవరకు మాత్రమే అనగలిగాడు. మిగతాది చెప్పుతుండగానే ప్రాణం విడిచాడు. జటాయువు మృతికి రాముడెంతగానో శోకించాడు. తండ్రికి చేసిన విధంగానే జటాయువుకు అగ్నిసంస్కారాదులు చేస్తాడు. అక్కడనుండి సీతాన్వేషణకు బయలుదేరి నైరుతి మూలనున్న క్రౌంచారణ్యం చేరుకుంటారు. తర్వాత మతంగవనం ప్రవేశించారు. సమీపంలోనే కబంధుడనే రాక్షసుడి చేతులకు చిక్కుతారు. రామలక్ష్మణులు వాడి చెరొకచేతిని నరికేస్తారు. లక్ష్మణుడు కబంధుడికి తమ వృత్తాంత్తాన్నంతా చెప్పాడు. కబంధుడు కూడా తన శాపాన్ని గురించి చెప్పి, సీత అపహరణ విషయం తనకు తెలుసనీ, అయితే శాపగ్రస్తమైన వికార స్వరూపంతో ఏదీ స్ఫురించడంలేదనీ, తన దేహాన్ని కాల్చితే నిజస్వరూపం పొంది సీతను దాచినవాడి రహస్యం చెపుతాననీ అంటాడు. వాడు కోరినవిధంగానే అగ్నిలో వేసిన కాసేపటికి, మంటల్లోనుండి ఆకాశానికి ఎగిరి, సీతను కనుగొనే విషయం పరోక్షంగా తెలియచేశాడు. రామలక్ష్మణులిద్దరూ సమర్థులే అయినప్పటికీ, ప్రస్తుతం కష్టదశలో వున్నారనీ, సుగ్రీవుడితో మైత్రిచేసుకొని కార్యాన్ని సాధించమనీ అంటాడు. సుగ్రీవుడుండే ప్రదేశం ఋశ్యమూక పర్వతమనీ, పంప ఒడ్డున సంచరిస్తుంటాడని కూడా చెపుతాడు. రాముడిని ఎడబాసి దుఃఖిస్తున్న సీతను రావణుడుంచిన ప్రదేశాన్ని కనుగొనగల సమర్థుడు అతడేనంటాడు. సుగ్రీవుడుండే చోటుకు చేరే విధంకూడా చెప్పాడు. ఇక్కడ కబంధుడు రాముడికి పంపాసరస్సుని గురించి వర్ణించడానికి వాసు దాసుగారు "మానిని" వృత్తంలో పద్యంగా రాశారిలా:

మానిని: సారసరాజమరాళరథాంగక చారురసంబు, లశై నలవ
        న్నీరములున్, సికతాతలరాజిత నిర్మలగాఢసమావను లౌ
        తీరములున్, నవసారసకై రవ దివ్యసుగంధిఘమంఘమవాః
        పూరములున్, విలసిల్లఁ గఁ బంప యపూర్వముదావహమై యొసఁ గున్ - 67
ఛందస్సు:      మానినికి ఏడు "" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం:     బెగ్గురుల-రాజహంసల-చక్రవాకముల మనోహర ధ్వనులతోను, పాచితీగలు లేని జలాలతోను, ఇసుకనేలతో ప్రకాశించే నిర్మలమైన గడ్డిగల చదరపు నేలల తీరాలతోను, కొత్తగా వికసించిన కమలాలతోను, కలువలతోను, మేలైన మంచివాసనలతో గుమగుమలాడు జలప్రవాహాలతోను నిండిన పంప ఇంతవరకూ అనుభవించని సంతోషాన్ని కలిగించేదవుతుంది.

పంపను వర్ణించి చెప్పిన కబంధుడు శబరికి దర్శనం ఇమ్మని అంటాడు. సదా తపస్సు చేస్తుండే శబరి రాముడి రాకకై వేచివున్నదని కూడా అంటాడు. కబంధుడు చెప్పినట్లే రామలక్ష్మణులు శబరిని కలుస్తారు. వారిద్దరికీ శబరి, మతంగాశ్రమంలోని వింతలను చూపిస్తుంది. చక్కటి ఆతిధ్యమిస్తుంది. అక్కడనుండి బయలుదేరి రామలక్ష్మణులు పంపాతీరం చేరుకుంటారు. చేరుకుంటూ, సుగ్రీవుడిని గురించిన ఆలోచన చేస్తారు. పంపాతీరానికి చేరుకుంటున్న రామలక్ష్మణులను గురించి "మానిని" వృత్తంలో రాశారిలా వాసు దాసుగారు:

మానిని:
ఈ విధి దుఃఖకరంబులఁ గానల నెల్లను దాఁ టి క్రమంబుగ వి
        ఘ్నావళిఁ బాయఁ గ జేయుచు దవ్వు ప్రయాణము చేసి మనోజ్ఞక నా
        నావిధిపక్షిసమాకులఁ బంపను నవ్యజలాశయసత్తమ నా
        భూవరనందనయుగ్మము గాంచి యపూర్వముదంబున నుల్లసిలెన్ -68
ఛందస్సు:      మానినికి ఏడు "" గణాలు, ఒక గురువు. పదమూడో అక్షరం యతి.
తాత్పర్యం:     ఈ ప్రకారం దుఃఖాలను కలిగించే అడవులన్నింటినీ వరుసగా దాటి, మధ్య-మద్య కలిగిన విఘ్నాలనన్నింటినీ తొలగించుకుంటూ, దూర ప్రయాణం చేసి, మనోహరమై-అనేక విధాలైన పక్షులతో నిండిన అందమైన కొలకగు పంపను చేరి, ఇన్ని రోజులుగా లేని సంతోషాన్ని రాజకుమారులిద్దరూ పొంది, ముఖ వికాసాన్ని కలిగినవారయ్యారు.

అరణ్య కాండాంత పద్యాల్లో ఒకదానిని "మందాక్రాంత" లో రాశారు వాసు దాసుగారు. మిగిలిన రెండు కాండలలో లాగానే, ఈ పద్యంలోని అర్థంలో, ఒకవైపు రామచంద్రమూర్తిని స్థుతిస్తూనే, అరణ్య కాండలో మొత్తం పద్యాలెన్ని వున్నాయో వివరించారు కవి. ఆ పద్యమిలా సాగింది:

మందాక్రాంత:           ధీరా ! యూర్ధ్వేశ శుచినముచి ద్వేషిదిక్సాంఖ్యపద్యో
                        దారారణ్య ప్రథితచరితో ద్దామ వాత్సల్యసీమా
                        క్రూరారాతిక్రథనకలిత క్రూరకోపా యపాపా
                        వారాశీడ్జాకమలమధుపా భక్తహృత్పద్మసద్మా-69


తాత్పర్యం:     ఊర్ధ్వ అంటే పది దిక్కుల్లో తొమ్మిదోదని, ఈశాన్యం దిక్కు ఎనిమోదదని, శుచి (ఆగ్నేయం) రెండోదని, సముచిద్వేషిదిన్ అంటే ఇంద్రిడి దిశ మొదటిదని-అన్నీ కలిపి చదివితే 9821 వస్తుందని-ఇది తలకిందుగా చదివితే 1289 వస్తుందని దీనర్థం. వాసు దాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం అరణ్యకాండలో 1289 పద్యాలున్నాయి. 

No comments:

Post a Comment