Tuesday, April 10, 2018

ప్రజానీకాన్ని సంఘటిత పరిచే కూటమి : వనం జ్వాలా నరసింహారావు


ప్రజానీకాన్ని సంఘటిత పరిచే కూటమి
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (11-04-2018)

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ద్రవ్య వినియోగ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు ఆవశ్యకత అంశాన్ని, తదనుగుణంగా తన ఆకాంక్షను, కొంతమేరకు కార్యాచరణను సహితం ప్రస్తావించారు. కాంగ్రెస్-బీజేపీలకు జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయమనే తన ఆలోచన, ఏదో కొన్ని చిన్నా-చితకా రాజకీయ పార్టీలను కలిపి ఐక్య సంఘటనగా ఏర్పరిచి, తాత్కాలిక రాజకీయ పబ్బం గడుపుకోవడం కాదనీ, దేశంలోని అన్ని ప్రాంతాల-అన్ని వర్గాల ప్రజలను సమైక్యం చేసి, సంఘటిత పరిచి, తద్వారా దేశాభివృద్ధికి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపకల్పన చేయడమే తన లక్ష్యమనీ అన్నారు. సీఎం చెప్పినదాంట్లో రాజకీయ విశ్లేషకులకు స్పష్టమైన సందేశం వుందనేది గమనించాల్సిన విషయం. సమాధానంలో భాగంగా, గడచిన ఏడు దశాబ్దాల కాలంలో భారతీయ జనతాపార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపి వాటిని నిశితంగా విమర్శించారు ముఖ్యమంత్రి.

ఆ రెండు రాజకీయ పార్టీల వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పి, వాటిని అధిగమించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక చేపట్టకపోతే దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం వుందని సీఎం హెచ్చరించారు. దీనికోరకు జాతీయ స్థాయి రాజకీయాలలో గుణాత్మక మార్పు అనివార్యం అని స్పష్టం చేశారు. ఈ దిశగా ముఖ్యమంత్రి ఆశిస్తున్న ఆ ఉమ్మడి కార్యక్రమాల చర్చేనీయాంశాలు ఏమిటి? భారతదేశ పరపతినీ, భారత ఆర్థిక వ్యవస్థ పరపతినీ, గణనీయంగా పెంచే విషయంలో గుణాత్మక మార్పు ఎజెండా ఆవశ్యకతను కూడా సీఎం తన మాటల్లో తరచూప్రస్తావిస్తుంటారు.

          గుణాత్మక మార్పు ఆలోచన తన మదిలో మెదిలిన క్షణం నుండి, ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాలకు చెందిన పెద్దలను, నిపుణులను, రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న వరిష్ఠులను, మేధావులను సంప్రదిస్తూ, వారితో సమాలోచనలు నిర్వహిస్తూ, తన ఆలోచనలను వారితో పంచుకుంటున్నారు. వారిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన మమతా బెనర్జీ, జార్ఖండ్ కు చెందిన హేమంత్ సోరెన్, చలనచిత్ర కళాకారుడు ప్రకాష్ రాజ్, ప్రముఖ పాత్రికేయులు-కాలమిస్ట్ శేఖర్ గుప్తా తదితరులు ఉన్నారు. వారితో తన ఆలోచనలు, ఆచరణ మార్గాలు శోధించటం జరిగింది. జాతీయ ఎజెండా రూపొందించి “జాతీయ పార్టీని” లేదా “ప్రజా కూటమిని” ఏర్పాటు కావించే దిశగా ఆలోచనలు, తత్వాలు శోధించటం జరుగుతోంది. ప్రజాకూటమిలో అన్ని పార్టీలు ఒక సహవ్యవస్థగా సమ్మిళితం కాబోవటం జరుగనుంది. ఇందులో చేరబోయే ప్రాంతీయ పార్టీలు, ఇతర పార్టీలు, ఒకవైపు తమ ఉనికిని పదిలంగా కాపాడుకుంటూనే, మరో వైపు కేసీఆర్ ఆలోచనాదోరణికి అనుగుణంగా ప్రజాకూటమిలోని ఇతర పార్టీలతో సహజీవనం చేస్తాయి. ఈ రకంగా రూపుదిద్దుకోనున్న జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయం కేవలం ఒక కూటమిగానే మిగలకుండా యావత్ భారత ప్రజలను సమీకరించటంలో, సంఘటిత పరచడంలో, ఏకత్రాటి పై నడిపించటంలో కీలక పాత్ర పోషించనుంది.

          ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్న గుణాత్మక మార్పు” అంటే, ప్రతి అంశంలో ఖచ్చితమైన మార్పు చోటుచేసుకోవడమే. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం కూడా తప్పకుండా వుంది. నిరంతరం మారుతున్న ప్రజల అవసరాలకనుగుణంగా, కాలానుగుణంగా, మొట్టమొదటిగా రావాల్సింది భారత రాజ్యాంగంలో గణనీయమైన మార్పులు. పెద్ద ఎత్తున రాజ్యాంగంలో మార్పులు, సవరణలు తీసుకురాని పక్షంలో ఆశించిన స్థాయిలో గుణాత్మక మార్పును సాధించటం అసాధ్యం అన్నది కూడా అర్థం చేసుకోవాలి.

అలాగే రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా ఆవశ్యకత ఇంకెంత మాత్రం లేదు. కేవలం రాష్ట్రాల జాబితా, కేంద్ర లేదా ఫెడరల్ జాబితా వుంటే సరిపోతుంది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రహదారులు, గ్రామీణ నీటిపారుదల, త్రాగునీరు, వివిధ వర్గాల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, పారిశుధ్యం, విద్య, వైద్యం సంబంధిత రాష్ట్రాలకే పూర్తిగా బదిలీ చేయడం  జరగాలి. విదేశీ వ్యవహారాలు, విదేశీ విధానం, రక్షణ శాఖ, అంతర్గత భద్రత, రైల్వే, సమాచార వ్యవస్థ, జాతీయ రహదారులు, ప్రధాన ఓడరేవులు, తంతి, తపాలా, సైనిక వ్యవస్థ, అణుశక్తి, కరెన్సీ వంటివి కేంద్ర ఆధీనంలో ఉండటంలో ఎటువంటి ఇబ్బంది లేదన్న ఆలోచననూ ముఖ్యమంత్రి వ్యక్తపరిచారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక  వ్యవస్థ మధ్య పరస్పర సహకారాన్ని కూడా ప్రజలకు తెలియ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది.

మార్పు కోరుకుంటున్న ప్రస్తుత నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థలో పరపతి పెంపొందించే దిశగా ఆలోచనలు, కార్యాచరణ సాగాల్సి ఉంది. అది రోడ్ల అభివృద్ధి కావచ్చు, ఓడరేవుల అభివృద్ధి కావచ్చు. మౌళిక వసతులు పెంపొందించుకోవటం కావచ్చు. ఉత్పాదకరంగంలో పటిష్ట కార్మిక వ్యవస్థ కావచ్చు మరేదైనా కావచ్చు. మెరుగైన, సమర్థవంతమైన ఆధునిక వ్యవస్థను రూపొందించుకోవలసి ఉంటుంది. ఇదే కోవలో రైతులకు లబ్ది చేకూర్చే క్రమంలో, వారికి కనీస మద్దతు ధర సమకూర్చే దిశగా, ఆలోచన చేయవలసిన ప్రాథమిక అవసరం కూడా ఎంతయినా ఉంది. దేశం ప్రశాంతంగా, సుస్థిరంగా, సుభిక్షంగా ఉండాలంటే రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. వారిని ఒడ్డుకు చేర్చాల్సిన అసరమూ ఉంది. వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం తెలంగాణ అందించే సహకారం కొన్ని వేలకోట్లు రూపాయల ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ దేశవ్యాప్తంగా అటువంటి సహాయం ప్రస్తుత తరుణంలో ఎంతయినా అవసరం. దానిని తక్షణం దేశ వ్యాప్తంగా తీసుకువచ్చి అమలుపరచటం అనివార్యం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయంతో అనుసంధానం చేయటం కూడా తక్షణ కర్తవ్యం. ధాన్యానికి ఇతర పంటలకు మద్దతు ధర కల్పించటం భారతదేశానికి భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం.


ఇవన్నీ కేవలం ఆర్థిక పరపతితో, దేశ పరపతితో సరిపెట్టుకోకుండా ఇందుకు అవసరమైన సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయాల్సి ఉంది.  పెరుగుదలకు పరిపుష్ఠికి అవసరమైన యంత్రాంగం దేశాభివృద్ధికి తోడ్పడాలి. అభివృద్ధికి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసుకుని, వాటిని సమర్ధవంతంగా అమలు చేయాలి. ఉదాహరణకు పట్టణ విధానం ఏమిటి?  గ్రామీణ భారతానికి ఎలాంటి విధానం వుండాలి? ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, పద్ధతులు ఏమిటి? వాటిని ఏమ్తమేరకు అధ్యయనం చేయాలి? అధ్యయనం చేసిన తరువాత వాటికన్నా ఉత్తమ మార్గంలో మన దేశంలో ఎలా అమలు చేయాలి? అన్న అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. భారతదేశ పరపతి పెంపొందించడానికి, భారతదేశ ఆర్థికాభివృద్ధికి పరపతి పెంపొందడానికి, భారత దేశ సామర్థ్యాన్ని సులభమైన భాషలో పదిమందికి తెలియచేయగల వ్యక్తుల గురించి అన్వేషించాల్సి ఉంటుంది. ఆ దిశగా అర్థమయ్యే రీతిలో ప్రజలను చైతన్యపరచగలిగే విధంగా వారు మాట్లాడగలిగి ఉండాలి.

          పెద్ద మొత్తంలో నల్లధనం నిక్షేపాలు ఆర్ధిక వ్యవస్థను బలహీన పరుస్తున్న నేపధ్యంలో, దానిని వెలికితీసి ప్రజాభ్యుదయానికి, దేశాభివృద్ధికి, మౌళిక వసతుల కల్పనకు పెట్టుబడులుగా ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇందుకు అవసరమైన మోతాదులో ప్రభుత్వ పరంగా రాయితీలు, వెసులుబాటులు కల్పించి, అభివృద్ధిదాయిక-స్ఫూర్తిదాయిక పన్నుల విధానం అమలులోకి తీసుకురావాలి. ప్రభుత్వ రంగం పరిపుష్టం చెందాలి. భారీ స్థాయిలో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తగు అనుకూల పరిస్థితులను కల్పించాలి. తద్వారా జిడిపి వృద్ధికి, ఆర్థిక పరపతి మెరుగుపడేందుకు ఆస్కారం ఉంటుంది.

పార్లమెంటరీ చట్టసభల ఆధిపత్యం సందిగ్ధతకు తావు లేనిదిగా వుండి తీరాలి. దీనికి విరుద్ధంగా తలెత్తే ఏ విధమైన అవరోధాలనైనా అన్ని కోణాల నుండి పకడ్బందీగా ఎదుర్కొనే విధానం అమల్లోకి రావాలి. ఈ క్రమంలో అవసరమైతే చట్టపరమైన మార్పులను తీసుకురావలసి వుంటుంది. ఎప్పటికైనా దేశాన్ని తీర్చిదిద్దేది, బాగుచేసేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులే. వారి చర్యలు, ప్రతిచర్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సాధ్యమైనంతవరకు తుది నిర్ణయం అయితీరాలి. కాకపొతే ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు ఎంతవరకు సమంజసమైనవి అన్నది చర్చనీయాంసం కావచ్చు.

రాష్ట్రాలకు మరింత సాధికారత వుండాలి. సీఎం చెప్పినట్లు, దేశంలో అందుబాటులో వున్న 70,000 టీఏమ్సీల సహజ జలాలు ఏ రకమైన వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల మధ్య సమానంగా పంచడం జరగాలి. వాతి వినియోగం పూర్తి స్థాయిలో వుండాలి. జలవనరుల అంశం కేంద్ర పరిధిలోనే వుండి వివిధ రాష్ట్రాలకు పారదర్శకంగా, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా  పంపకం కావాలి.

భారత ఆర్థిక సంఘం పనితీరులో విప్లవాత్మకంగా, మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు అలా జరగలేదు. దానిని శాశ్వత పద్ధతి కింద ఏర్పాటు చేయాలి. అది దేశపరపతిని రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని పెంపొందించేదిగా పనిచేయాలి. ఈ రకమైన శాశ్వత ఆర్థిక వ్యవస్థ భారత ప్రభుత్వానికి ఆయా సమయాలలో తగు రీతిన దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అటు దేశంలో, ఇటు ఆయా రాష్ట్రాలలో ఆర్థిక పరపతి పెంపొందించే క్రమంలో ఈ వ్యవస్థ పనితీరు సాగాలి. నీతి ఆయోగ్, ఆర్ధిక సంఘం సమన్వయంతో పనిచేయాలి. నీతి ఆయోగ్ జాతీయ ప్రాజెక్టులపై, రాష్ట్రస్థాయి ప్రాజెక్టులైన నీటిపారుదల ప్రాజెక్టులు వంటి వాటిపై తమ దృష్టిని కేంద్రీకృతం చేయాల్సి ఉంటుంది. ఇవి, ఇలాంటి మరికొన్ని అంశాలను జాతీయ స్థాయి భారత ప్రజాకూటమి కార్యాచరణ ప్రణాళికగా రూపొందించుకుని ముందుకు సాగితే కేసీఆర్ చెప్తున్న గుణాత్మక మార్పు సుసాధ్యమవుతుందనడంలో సందేహం లేదు.

No comments:

Post a Comment