విప్లవాల పేరిట అభివృద్ధికి ఆటంకాలు
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (04-04-2018)
ఒడిశా, తెలంగాణ సరిహద్దు ఛత్తీస్ఘడ్
రాష్ట్రాలలో ఇటీవల, అడపా-దడపా చోటు చేసుకుంటున్న పోలీసు, తీవ్రవాదుల
మధ్య కాల్పులు, ఫలితంగా
కొందరు పోలీసులు మరణించడం, అలాగే, పలువురు
మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం దేనికి సంకేతమో మేధావులు, ప్రజాస్వామ్యవాదులు
ఆలోచించాలి. దీనివల్ల ఫలితం ఏమైనా వుందా? మావోయిస్టులతో పాటు
విధినిర్వహణలో వున్న అమాయక పోలీసులు ప్రాణాలు కోల్పోవడం ఎంతవరకు సమంజసం? ఈ నేపధ్యంలో
ఒక్కసారి మావోయిస్టులా ఆవిర్భావ-పరిణామక్రమం నెమరేసుకుంటే మంచిదేమో!
పశ్చిమబెంగాల్ లో మొదటి కాంగ్రెస్
వ్యతిరేక ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర
మాసాలకే, “ప్రజా విముక్తి యుద్ధం”
అనే పేరిట ఒక నినాదాన్ని పశ్చిమబెంగాల్, డార్జిలింగ్ జిల్లా నగ్జల్బరీ ప్రాంతంలోని గిరిజన రైతాంగంలో పనిచేసే
కిసాన్ కార్యకర్తల (“కమ్యూనిస్టు విప్లవకారులు”) గ్రూపొకటి లేవదీసింది. వారు మావో-సే-టుంగ్ ఆలోచనా ధోరణిని అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ, భారత
కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీపైన, కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన ప్రభుత్వంలో పనిచేయాలన్న దాని రాజకీయ
విధానంపైన తిరుగుబాటు చేశారు. పార్టీ
విప్లవానికి ద్రోహం చేసిందని వారు ఖండించారు.
గ్రామీణ విముక్తి ప్రాంతాలను ఏర్పరచి, “ప్రజా విముక్తి సైన్యాన్ని”
నిర్మించేందుకు తాము రైతాంగ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించినట్లు వారు
ప్రకటించారు. రైతాంగ విముక్తి యుద్ధాన్ని ప్రారంభించి,
దాన్ని నడపడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని వారు స్పష్టంగా చెప్పారు. సాయుధ గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాలనే తమ
ఎత్తుగడలను సమర్ధించుకొనే “రాజకీయ
థీసిస్” ప్రతిపాదించారు. భారతదేశం అమెరికా వలస
దేశంగా మారిపోయిందని, ప్రభుత్వం అమెరికా తొత్తని, పరిస్థితులు
సాయుధ విప్లవానికి పరిపక్వమై వున్నాయని, భూస్వాముల పైన- ప్రజా
పీడకులపైన సాయుధ దాడులు చేస్తే జనసామాన్యం ఉత్తేజం పొందుతుందని, "మావో ఆలోచనా
విధానం" అనుసరించాలని చెప్పింది నాయకత్వం. విప్లవంలోకి అనేకమంది సమరశీల విద్యార్ధులను,
యువకులను, నయా బూర్జువా మేధావులను ఆకర్షించగలిగారు.
నక్సల్‍బరీ ఉద్యమ నేపధ్యంలో, 1967లో,
సీపీఎం నుంచి చాలా మంది బయటకు పోయి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది పైన నక్సల్ ఉద్యమ ప్రభావం పడింది ఆ
రోజుల్లో. పలువురు విద్యార్థి నాయకులు, గ్రామ-పట్టణ
నాయకులు, ఆ ఉద్యమంలోకి వెళ్లకుండా వుండలేకపోయారు. నక్సలైట్ మాతృ సంస్థ
కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆదిలోనే చెప్పినట్లు, నక్సలైట్
ధోరణి అతివాద దుందుడుకు విధానంగా మారలేదా? నక్సలైట్
ఉద్యమం అరాచకమైనదని, వ్యక్తిగత హింసావాదమని అనడంలో తప్పేమైనా వుందా? ఏమో! నక్సలైట్ల
కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన ప్రతి ఒక్కరికి రైతాంగ గెరిల్లా యుద్ధమని, వ్యవసాయ విప్లవమని, ప్రజా యుద్ధమని
మాట్లాడిన మాటలు ఆచరణలో పూర్తిగా కాకపోయినా కొంతైనా బూటకమని బహుశా తోచక మానదు. పలువురు సంచరించే ప్రదేశాలలో బాంబులను వేయడం, మందుపాతరలను
పట్టడం,
కనీసం
అడపాదడపానన్నా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవడం, ఇతర రాజకీయ
పార్టీలకు చెందిన విద్యార్ధి, యువజన, కిసాన్, ట్రేడ్
యూనియన్ కార్యకర్తలను హత్య చేయడం, పోలీస్ వారిని, సివిలియన్
ఆఫీసర్లను చంపడం, ఏదో కారణాన ఎవరినైనా చంపడానికి సిద్ధపడటం, కారణాలు ఏమైనా, చాలా సార్లు
జరగడం వాస్తవమే కదా! ఎంతమంది కార్మికులను, కర్షకులను వారు
ఉత్తేజపరచగలిగారు?
నక్సలైట్ల తత్వాన్ని, రాజకీయాలను, వారి ఆచరణను గుడ్డిగా
సమర్థించేవారు,
తీవ్రంగా
వ్యతిరేకించేవారు వున్నారు. కాకపోతే, వారు అవలంబిస్తున్న
హింసా మార్గానికి మద్దతు ఇచ్చేవారు అతికొద్ది మంది మాత్రమే! అయితే, ఈ ఉగ్రవాద, అతివాద, తీవ్రవాద ఆలోచనా
విధానం కేవలం భారతదేశానికే పరిమితమైన వ్యవహారం కాదు. సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ
తీవ్రవాదం విభిన్న ధోరణులలో తలెత్తడం తెలిసిన విషయమే. అతివాద ధోరణికి ప్రజల నిరాశ, నిస్పృహలే
కారణమైనప్పటికీ,
ఈ
ధోరణికి మధ్యతరగతికి చెందిన కొన్ని వర్గాల ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ, ఆ ధోరణి
పొరపాటు కావచ్చనీ, అశాస్త్రీయం కూడా కావచ్చనీ, విస్మరించరాదు. విప్లవ కార్మికోద్యమానికి కూడా అంతో-ఇంతో
హానికరం కూడా కావచ్చు. తీవ్రవాదుల్లో (నక్సలైట్లలో, మావోయిస్టులలో)
అనేకమంది విప్లవం పేరిట సాగించే సాహస చర్యలకు మధ్యతరగతి ప్రజల్లోని కొన్ని వర్గాల
హర్షామోదాలుండవచ్చు. అంతమాత్రాన వారు చేస్తున్న ప్రతి పనీ (హింస) సరైందని అనడం
తగదు. వ్యక్తులుగా-దళాలుగా ఏర్పడి, హింసాత్మక
సంఘటనలకు పాల్పడడం వలన జనసామాన్యాన్ని పీడన, దోపిడీ, సాంఘిక
వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురు తిరిగేందుకు ఉత్తేజ పరచడానికి బదులు, సామాన్య ప్రజల, ప్రజాతంత్ర
ప్రజల ఏవగింపులకూ, తీవ్రమైన నిరసన భావానికి గురౌతున్నాఏమో
అనిపిస్తోంది.
ఈ
నేపధ్యంలో,
భారత దేశంలో పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా లేవని, గొరిల్లా
పోరాటానికి భారత దేశంలో అవకాశాలు లేవని, చైనాను
భారత దేశంతో పోల్చడం సరైందికాదని అరవైఏడు ఏళ్ల క్రితం, ఫిబ్రవరి
1951 లో సోవియట్ యూనియన్‌ను సందర్శించిన భారత
కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులకు స్టాలిన్ స్పష్టం చేసిన విషయం గమనించదగ్గది. భారత
(నెహ్రూ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా
గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని కూడా స్పష్టం చేశాడు స్టాలిన్.
మహోన్నత చరిత్రకు గుర్తుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్న భారత
కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి, పార్టీ ఆవిర్భావం-ఎదుగుదల
గురించి, చీలికల గురించి, అభిప్రాయ
భేదాల గురించి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
భారత-సోవియట్
ప్రతినిధి వర్గాల మధ్య జరిగిన చర్చల వివరాలు యధాతధంగా, రష్యన్
భాషలో వున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇంగ్లీషులో అనువదించి, గుంటూరు
జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు, మార్క్సిస్ట్ పార్టీ వీరాభిమాని (డాక్టర్
సీహెచ్ కె వి ప్రసాద్) బహిర్గతం చేశారు కొన్నాళ్ళ కింద.
అందులోని విషయాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ(లు)
అనుసరిస్తూ వస్తున్న-భవిష్యత్ లో అనుసరించాల్సిన పంథాకు
సంబంధించినవి కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అతివాద,
మితవాద వర్గాలుగా, తర్వాత నక్సలైట్లుగా,
మావోయిస్టులుగా, మధ్యలో
మితవాద వర్గం వారు డాంగే యులుగా, మొహిత్
సేన్ పక్షం వారిగా, చీలిపోవడానికి కారణాలు కూడా
అంతర్లీనంగా ఆ డాక్యుమెంట్లలో వున్నాయి.
డాక్యుమెంటులో అనేక విధానపరమైన ప్రశ్నలు కూడా వున్నాయి.
భారత దేశంలోని రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం ఎలా?
ఆ స్థితిగతులు విప్లవం వైపు పయనించే దిశగా వున్నాయా?
అలా రాబోయే విప్లవాన్ని విశ్లేషించడం ఎలా? సాయుధ
పోరాటాలు దేశమంతా సాధ్యమేనా? సాయుధ
పోరాట దిశగా ప్రజలను సిద్ధపర్చడానికి బూర్జువా తరహా ప్రజాస్వామిక విప్లవాలను,
సామ్యవాద తరహా విప్లవాలను కలుపుకొని పోవాలా? విప్లవంలో
కార్మిక వర్గ పాత్ర ఎలా వుంటుంది? పార్టీ
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి "మరణ
దండన" విధించడం తగునా? లాంటి
ప్రశ్నలను సోవియట్ పార్టీకి సంధించింది భారత కమ్యూనిస్ట్ పార్టీకి. భారత దేశంలోని
పరిస్థితులు సోషలిస్ట్ విప్లవానికి
అనుకూలంగా లేవని స్పష్టం చేశాడు స్టాలిన్.
స్టాలిన్ దృష్టిలో విప్లవమంటే, వ్యావసాయిక
ప్రాధాన్యమయిందని, జమీందారీ వ్యవస్థను తొలగించి,
రైతులకు భూమిని పంపిణీ చేయడం ఆ విప్లవం లక్షణమని,
ఇది విప్లవంలో ప్రాధమిక దశని అంటాడు స్టాలిన్.
దాన్నే ఆయన "పీపుల్స్
డెమోక్రాటిక్ రెవెల్యూషన్" అని
వర్ణిస్తూ, అదే చైనాలో జరిగిందని చెప్పాడు. రెండో
దశ, పారిశ్రామిక విప్లవం. భారత దేశం
ఇంకా ఆ దశలకు చేరుకోలేదని ఆయన అభిప్రాయం. సామ్రాజ్యవాదమంటే
ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, “జాతీయ బూర్జువాలకు”
అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య
కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ
సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి
వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్.
జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్
ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని
కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. భూస్వాములకు,
జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ
కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు
భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం చేయాలని చెప్పాడు.
కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు.
అలా కార్మిక-కర్షక
వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం"
చేయవద్దని హెచ్చరించాడు. పోరాట
ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు
నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. వ్యక్తిగత
హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.
సాక్షాత్తు కమ్యూనిస్ట్ అగ్రనేత స్టాలిన్ స్థాయి నాయకుడే అలా
అభిప్రాయపడ్డాడే. అలాంటప్పుడు, ఇంకెంత
కాలం, ఇలా మావోయిస్టులు తమ విప్లవ పంథాను విడనాడకుండా ఇతరుల ప్రాణాలను
తీస్తూ, తమ ప్రాణాలను కోల్పోతారు? దీనికి
అంతం లేదా? పరిపూర్ణ నిబద్ధతతో పాటు, మనసా వాచా
కర్మణా, మావోయిస్టు సిద్ధాంతాలను అనుసరించి అసువులు కోల్పోయిన వారే కాకుండా,
ఆ మార్గమే సరైందని గుడ్డిగా నమ్మి ప్రాణాలను కోల్పోయిన అమాయక “కామ్రేడ్సు”
కూడా చాలామంది వున్నారు. ప్రపంచంలో సిద్ధాంత ధోరణులు మారుతున్నాయి. సమసమాజం
ఏర్పడడానికి విప్లవ మార్గమొక్కటే ఏకైక మార్గమనే రోజులు పోతున్నాయి. ప్రధమ
కమ్యూనిస్టు దేశమే మరో దిశగా పయనిస్తోంది. గత పాతిక సంవత్సరాల చైనా ఆర్ధిక చరిత్ర
పురోగతి గమనిస్తే, కాపిటలిస్ట్ దేశంగా ముద్రపడిన
అమెరికా కంటే ఎక్కువ కాపిటలిస్ట్ దేశంగా తయారైంది. ఇక భారతదేశం విషయానికొస్తే,
కరుడుకట్టిన కమ్యూనిస్ట్ రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్,
త్రిపురలు కమ్యూనిజానికి తిలోదకాలిచ్చాయి. ఈ నేపధ్యంలో, విప్లవమార్గం
మినహా మరో దారిలో సమానత్వం సాధించలేమనుకోవడం మూర్ఖత్వం కాదా?
ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
నాలుగైదు దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ నక్సల్‍బరీలో ఆరంభమైన
వామపక్ష తీవ్రవాద ఉద్యమం, అలనాటి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు పాకింది. అలనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ఇప్పటి
తెలంగాణాకు ఎంతో తేడా వుంది. అప్పట్లో సైద్ధాంతికంగా ఉద్యమంపట్ల ఆకర్షితులైన వారు
కొందరైతే, తరువాత కాలంలో మరికొందరు మరెన్నో కారణాలవల్ల ఉద్యమంలో చేరారని
ఆరోపణలున్నాయి. వీరిలో ఉద్యమంలో ఇమడలేనివారు జనజీవన స్రవంతిలో కలిశారు. వారిలో
కొందరు ప్రభుత్వంద్వారా లబ్ది పొందారు. మరికొందరు ప్రాణాలను కోల్పోయారు. కారణాలేవైనా
ఉద్యమం అప్పుడు-ఇప్పుడూ ఒకరకంగా ప్రస్థానం సాగించడంలేదనేది వాస్తవం. ప్రజా
ఉద్యమాలు, విప్లవాలు, తిరుగుబాటులు,
ప్రపంచ చరిత్రలో వలస వాద-సామ్రాజ్యవాద-నిరంకుశ ప్రభుత్వాలను
కూల్చివేసిన-మార్చివేసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఐతే, వాటి
స్థానంలో అధికారంలో కొచ్చిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలా?
నిరంకుశ ప్రభుత్వాలా? అని
ప్రశ్నించుకుంటే, సమాధానం ఇదమిద్ధంగా ఇదేనని రాదు.
ప్రజాస్వామ్యంలో కూడా "పీపుల్స్ డెమొక్రసీ" అని, "పార్లమెంటరీ
డెమొక్రసీ" అని, "ప్రెసిడెన్షియల్
డెమొక్రసీ" అని వివిధ రకాలున్నాయి. ఇంకా అనేక పేర్లతో పిలిచే ప్రజాస్వామ్యాలూ
వున్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్యం అంటే "ప్రశ్నించే హక్కు" గల పరిపాలన
అనడంలో తప్పులేదు. ఐతే ఆ ప్రశ్నించే హక్కును సద్వినియోగం చేసుకోవాలా?
దుర్వినియోగం చేసుకోవాలా? అని
ఆలోచించాలి.
విప్లవాల పేరిట, ఉద్యమాల
పేరిట, తిరుగుబాటు నెపంతో, అభివృద్ధికి
ఆటంకం కలిగించవచ్చా? అస్థిరత కలిగించవచ్చా?
హింసలకు, ప్రతి హింసలకు వారో-వీరో పాల్పడితే
నష్టపోయేది సామాన్య ప్రజలే!
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ-అభివృద్ధి పథకాలను నిశితంగా
గమనిస్తే, వాటి ఫలితాలను సరిగ్గా అంచనావేయగలిగితే, విప్లవమార్గం
కంటే ప్రజాస్వామ్య మార్గంలో సమసమాజం స్థాపించడం ఎన్నోరెట్లు సులభం అనే విషయం
అవగతమౌతుంది.
No comments:
Post a Comment